Pages

Saturday, June 15, 2013

పులి-కప్ప

ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. "ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది.

ఇక ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో, "ఒరే కుర్రవాడా! సంస్కారం ఉందా, నీకేమయినా? దున్నపోతులా ఉన్నావు! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!" అని అరిచింది.
ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. "అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా" అంటూ గాండ్రించింది.
కప్ప గర్వంగా తల పైకెత్తి "నువ్వు నన్ను తినలేవు. నేను కప్పల రాజును. నీకంటే తెలివైన వాడిని!" అంటూ బెకబెకలాడింది.

"నిరూపించు చూద్దాం!" అంది పులి.

"అయితే, దుమకడంలో, తినటంలో, కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా" అన్నది కప్ప.
`సరే'నంది పులి.

ఇక దూకే పందెం మొదలయింది. పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది. అవతలి గట్టును దాటి మూడు మీటర్లు దూకిందది. కానీ ఆశ్చర్యం! కప్ప పులి కంటే ఒక మీటరు ఎక్కువ దూరం దూకగలిగింది! అయితే అది పులి తోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియలేదు.
ఇక కప్ప విజయ గర్వంతో "నేను ఈ రోజు ఉదయాన్నే రెండు పులులను తిన్నాను. మరి నువ్వేమి తిన్నావు?" అని అడిగింది.

ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు.


పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది.

పులి కొంచెం సేపు ఆలోచించి, ఇక అక్కడి నుండి పారిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకుంది. వెంటనే ఏటి అవతలికి దూకి, ఆపకుండా అడవిలోకి పరుగుతీసింది. చాలా సేపు పరుగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురయింది.


రొప్పుతూ, భయపడుతూ ఉన్న పులిని చూసి, నక్క "సంగతేంటి పులిమామా?" అని అడిగింది.
జరిగినదంతా నక్కకు వివరించింది పులి.

"ఒక్క పూటకు రెండు పులులను తినే కప్ప ఎక్కడా ఉండద"ని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క. కావాలంటే తనవెంట కప్ప దగ్గరకు రమ్మని, అప్పుడు ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని పిలిచింది కూడా.

నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకుగాను, ఇద్దరి తోకల్నీ కలిపి కట్టేసుకునే షరతుమీద కప్ప దగ్గరికి ఇంకోసారి వెళ్లేందుకు అంగీకరించింది పులి.

ఇక రెండూ తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకొని, ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవిగా వాటికి ఎదురుగా నిలబడి " ఓ! తెలివైన నక్కా! నువ్వే నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను. కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను" అన్నది గట్టిగా.


ఆ మాటలు విన్న పులి వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించేసుకున్నది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరుగెత్తడం మొదలెట్టింది. నక్క ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరుగెత్తాక గానీ అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్లంతా హూనమయిపోయి, శరీరమంతా రక్తమోడుతూ ఉండింది. చాలా ఎముకలు విరిగిపోయాయి పాపం.

 అప్పుడుగానీ తోక ముడిని విప్పలేదు పులి! విప్పి, అయాసపడుతూ, అది నక్కతో "ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు" అని చెప్తూ, అయినా కోపం ఆగక దాని చెంప ఛెళ్ళుమనిపించింది! 

కనువిప్పు

ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.

వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.

అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.

బాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. 'ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.

కొండయ్యకు కోపం వచింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.

కట్టెలు కొట్టువాడు - బంగారు గొడ్డలి

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.

అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

వాడు ఇంటికి వెళ్ళి ఊరంతట ఈ సంగతి చెప్పెను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్భుద్ది పుట్టెను. మరుసటి దినము తాను ఒక ఇనుపగొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలని గొడ్డలిని నీటిలో పడవేసెను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలు పెట్టెను. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయెనని చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పెను. దేవతకు కోపం వచ్చి, వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా, తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలికూడా దక్కలేదు.

నీతి: నిజము మేలు చేయును. అబద్దము ఆపద తెచ్చును. 

ఎప్పుడో చదువుకున్న చందమామ కథ


 అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది.

ఒకరోజు దూరపు బంధువు ఒకతను ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి మన సౌరభూడి ఇంటిలో దిగాడు. సౌరభూడి కవిత్వం గురించి విని మద్యాహ్నం తనుకూడా తీరిక చేసుకొని విన్నాడు. విని బాగుంది అని చెప్పి, ఊరకుండకుండా ఇలా అప్పుడప్పుడూ కవిత్వం చెప్పకపోతే ఏదన్నా పుస్తకం వ్రాయరాదు అని ఓ ఉచిత సలహా ఇస్తాడు.

దానికి సమాధానంగా సౌరభుడు తను ఎంతోకాలం నుండి వ్రాస్తూ పూర్తికావచ్చిన 'దేవపరిణయం' అనే పుస్తకాన్ని ఇంటికి వెళ్ళాక చూపిస్తాడు. దాన్ని చదివిన పెద్దాయన చాలా సంతోషించి రాజాశ్రయం పొందితే కవిత్వం ఇంకా రాణిస్తుందని చెప్పి ఒకసారి తనతో పాటు రమ్మని తన ప్రక్కింటిలోనే రాజకవి ఉంటాడని పిల్చినాడు.

ఇంటిలోని వారు, పొరుగువారు కూడా వచ్చినాయనకే వంతపాడేసరికి సౌరభుడు అతనితో పాటు బయలుదేరి రాజధాని చేరతాడు.

పక్కింటాయనే కాకుండా రాజకవి మన సౌరభుడి చుట్టానికి మంచి మిత్రుడు కూడా! అతన్ని కలుసుకొని తన పుస్తకం చూపిస్తాడు. మొత్తం ఓపిగ్గా చదివిన రాజకవి కొన్ని మార్పులూ, చేర్పులూ సూచిస్తాడు. అవి అన్నీ చేసి రాజుగారికి వినిపించి మంచి బహుమతి మెచ్చుకోళ్ళు పొందుతాడు.

తరువాత అందరూ అక్కడనే ఉండి మంచి మంచి కవిత్వం వ్రాయమని అడుగుతారు, కానీ వినకుండా ఇంటికి వెళ్ళి తన పుస్తకాన్నీ, బహుమతులను ముందేసుకొని బావురుమంటాడు. తను వ్రాయాలనుకున్నది ఒకటి చివరికి మార్పులూ, చేర్పులు తరువాత ఆత్మలేని శరీరంలా తయారవుతుంది. ముగింపు కూడా తను అనుకున్నది ఒకటి అక్కడ వ్రాసినది మరొకటి.

ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవచనాలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. "వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.

రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.

మా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి "పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.

ఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత "కథ అంతా పుక్కిటి పురాణం" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు.

ఊరికోసం బావి

వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము.

ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది.

ఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.

ఇది నిజం

ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. అప్పుడే ఆ సంసారం రచ్చకెక్కకుండా ఉంటుంది. 'స్నేహితం' కూడా ఇలానే ఉండాలి తెలుసా" అని సలహా ఇచ్చాడట.

విన్న ఆ ఇద్దరూ పక్కున ఓ నవ్వు నవ్వారటా. పైపెచ్చు ఆ వ్యక్తి వంక పిచ్చివాడివన్నట్లు చూస్తూ, "చూడూ ఒక్క మనిషి తన వంద తరాల బాగుకై పరితపిస్తున్నప్పుడు, ఇద్దరం మనుషులం కలిస్తే గొడవకాక ఏమవుతుంది. ఒక్కడి ఆలోచనైతే అది పాపమైనా, పుణ్యమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఇది తప్పు అనిచెప్పే దిక్కులేక చేసుకుపోతూనే ఉంటాడు కానీ, మంచీ చెడు అని రెండు పదాలు ఉన్నట్లు మేమిద్దరం ఉన్నాము. కాబట్టే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి చేసే విషయంలోనే మేము కీచులాడుకుంటామే కానీ, మరొకటికాదు" అన్నారట.

విన్న ఆపెద్ద మనిషి "మీరు చెప్పేది నాకు అర్ధం కావటంలేదు. కొంచం విపులంగా చెప్పండి" అని అడగగా, "ఇందులో అర్ధమైయ్యేలా చెప్పేదేముంది బాబుగారూ నంగిలా నిమ్మనంగా ఉండి గోతులు త్రవ్వే వారి వలన సమాజానికి హానికానీ కల్మషం లేకుండా గలగలా సెలయేరులా గోలచేసే మావల్ల ఎవరికీ హాని ఉండదు ఏమంటారు" అని అడిగారట. ఆ విషయం నిజమేననిపించిన ఆ ఆసామి తనదారిన తాను వెళ్ళిపోయాడు. 

ఏడు కూజాల కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.

ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.

రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.

రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకాక్ ఊజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు.

ఐకమత్యమే బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. "ఐకమత్యమేబలం" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి 

ఆత్మవిశ్వాసము

కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.

సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం" అని వెండి నాణెము తీసి చూపించి "నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.

నేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు.

ఆటో డ్రైవర్ నిజాయితీ

ఏలూరు పట్టణములో నరేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సంపాదన చాలక అవస్థలు పడుతుండేవారు.తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే. అయినా నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున ఇద్దరు దంపతులు అతని ఆటోలో అశోక్‌నగర్‌కి స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంటిలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ వూడదీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు వున్నాయి. వెంటనే తల్లిదండ్రులకి చెప్పింది.

నరేష్ వెంటనే భోజనము ముగించుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి బ్యాగ్ విషయము చెప్పి, వారి ఇంటి గుర్తులు చెప్పాడు. పోలీస్ వారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళి విషయము చెప్పగా, వారు బ్యాగ్ తమదేనని ప్రయాణ బడలికలో గమనించలేదని చెప్పి, ఆటో డ్రైవర్ నిజాయితీకి సంతసించి పదివేల రూపాయలు ఇచ్చి, తమ పిల్లల్ని రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకొని వెళితే నెలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేసి తన సంపాదన పెంచుకున్నాడు. అంతేగాక ఆ వీధిలోని పిల్లల్ని తీసుకెళ్ళి తన సంపాదన పెంచుకొని తన తల్లి ఆరోగ్యము బాగు చేయించుకొని సుఖముగా ఉన్నాడు.

నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అని గ్రహించి నిజాయితీగా ఉండటం అలవరచుకోవాలి. 

అసూయ

ఒక ఆసుపత్రి గదిలో ఇద్దరు రోగులు వుండేవారు. ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండేది. రెండవ రోగి మంచం కిటికీకి దూరంగా వుండేది. కిటికీ దగ్గర వున్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యం ఎంత అందంగా వుంది. ఎంత పెద్ద మైదానం. ఎంత పచ్చని పచ్చిక. ఎంత చక్కని తోట. ఆ చక్కని తోటలో ఎన్నెన్ని రంగుల సువాసనల పూవులు. ఈ చల్లని సాయంకాలంలో ఎంత చల్లని గాలి వీస్తోంది. ఈ గాలిలో ఆ పచ్చిక అటూ ఇటూ కదులుతూ మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఆ తోట మధ్య ఎంత పెద్ద చెరువు!ఎ న్ని బాతులు, ఎన్ని కలువ పూలు అని మంచం మీది రోగికి వర్ణించి చెబుతుండేవాడు. ఇది వింటున్న మంచం మీది రోగికి "నేనూ హాయిగా కిటికీ దగ్గర వుంటే బాగుండేది. బయట దృశ్యాలన్నింటినీ చూసేవాడ్ని" అని అనుకున్నాడు. ఆ రాత్రి కిటికీ దగ్గర రోగికి దగ్గుతో చాలా సీరియస్ అయింది. ప్రక్క మంచం మీద రోగి బటన్ నొక్క గలిగే స్థితిలో వున్నా నొక్క లేదు దుష్టబుద్దితో.

కిటికీ దగ్గర రోగి రాత్రి మరణించాడు. మరునాడు ఉదయం పక్క మంచం మీద ఉన్న రోగి కోరికపై అతన్ని అతి కష్టం మీద కిటికీ దగ్గర మంచం మీద పడుకోపెట్టారు. అతను అతి కష్టం మీద లేచి కూర్చుని బైటకు చూస్తే, బైట ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప ఏమీలేవు. "ఇన్ని రోజులూ నా తోటి రోగి నన్ను సంతోషపెట్టడానికే ఇన్ని దృశ్యాలూ కల్పించి చెప్పేవాడు. అతను నా మిత్రుడు" అని రెండవ రోగి బాధపడ్డాడు.

నీతి: పక్కన వాళ్ళకు ఉంది అని మనకు లేదని ఎప్పుడూ అసూయ పడకూడదు.

అసలుకి ఎసరు

ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయినాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.

ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయి.

ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి.

అభిమాని

అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.

పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.

అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.

ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.

సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.

మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.

"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.

ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.

అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ను షాపు యజమానికి ఇచ్చాడు. ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని బాబూ! నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్‌కు చూపించుకో అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి ఏంటిరా! కాలికి ఏమి అయింది? ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.

చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది. అని మరలా అబద్దం చెప్పాడు వాసు. నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు. చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు. ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది. అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు. ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది అందుకే పెద్దలు అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో. ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు. బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది. 

అపాయానికి ఉపాయము

అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.

ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.

అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం. అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.

కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.

"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.

"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా "నేనే ఈ అడవికి రాజుని" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. "మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి". అంది.

కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు.

అనుభవించని ఐశ్వర్యం

కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.

కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ...

ఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. "ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో..."

కనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ...

అతి పండితుడు

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.

'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.

ఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి "మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.

పండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు.

నీతి : కుటిలత్వానికి తానేకాక తనవారు కూడా బలవుతారు. 

సందేహం

అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”

గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”


సందేహం తీరిన కుర్రవాదు సంతోషంగా వెళ్ళాడు.

చాణక్యుని గ్యానోదయం

చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాల కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు.

ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్యారాడు. దారి లో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “యేమైంది బాబు!” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా వుంది, చేయి కాలిందమ్మ” అన్నాడు.

“అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే వున్నావు,” అంది అవ్వ. “యెవరైన అన్నం మధ్యలో చేయి పెడతార? పక్కలనుంచి చిన్నగా తింటూ రవాలికాని?”

ఇదంతా అరుగుమీంచి వింటున్న చాణక్యుడికి గ్యానొదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.

ఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది.

పొగరుగల గొర్రెపోతు

ఒకానొకప్పుడు ఒక అడివిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా వుండేది. తన కొమ్ములతో యెవ్వరినైన ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గొర్రెపోతులా తయ్యారయ్యింది. వచ్చే పొయే ప్రతి చిన్న జీవినీ తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దెగ్గిరకు వెళ్ళి ఆ నక్క “ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు – నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను” అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. “ఆ విరొధి యెవరు?” అని నక్కను అడిగింది. “అదుగో ఆ కొండను చూడు – యెంత యెత్తుగా కనిపిస్తొందో! దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది” అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపొయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపొయాయి. గొర్రెపోతు బుధ్ధి తెచ్చుకుని అందరితో వినయంగ మెలగడం నేర్చుకుంది.

ఇందిలో నీతి యేమిటంటే, యెదుటి వారి బలం తెలీయకుండ మనం విర్రవేగిపోకూడదు.

శ్రీ కృష్ణదేవరాయుల కల

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.

ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.

“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.

శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.

“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”

రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.

“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.

రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

ధనవంతురాలి గిన్ని

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది. ఒక రోజు ఆవిడ దెగ్గిర పొరుగింటామె వచ్చి ఒక గిన్న అడిగి తీసుకుంది. తిరిగిచ్చేడప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ధనవంతురాలు చాలా ఆష్చర్యపోయింది. రెండు గిన్నెలిచ్చావేంటి? అనడిగితే గిన్నె పిల్లని పెట్టింది అందుకనే ఇస్తున్నను అని బదులు చెప్పింది.

కొన్ని రోజులు గడిచాయి. పొరుగింటామె మళ్ళీ ఒక రోజు గిన్నె కోసమొచ్చింది. ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది. ఈ సారి తిరిగిచ్చేడప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆత్రుతతో ఎదురుచూసింది. కాని పొరుగింటామె అసలు గిన్నెను తిరిగివ్వలేదు. చాలా రోజులు చూసాక ఆ ధనవంతురాలే వెళ్ళి గిన్నె గురించడిగింది. పొరుగింటామె యేడుపుమొహము పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఖసమాచారము చెప్పింది. గిన్నె చనిపోవడమేమిటని ధనవంతురాలు మహా ఆష్చర్యంగా అడిగింది. దానికి పొరుగింటామె గిన్ని పిల్లలిని పెట్టగా లెనిది చనిపోతె ఆష్చర్యమెందుకు? అనడిగింది.


ఇది విన్న ధనవంతురాలు యేమి మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది.

పులి చేతిలో గాజు

అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమయిపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒక రోజు నదీతీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది.

ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టుకింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నొరూరింది. దెగ్గిరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసినవెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తనదెగ్గిరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది. “నీ దెగ్గిరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను” అన్నాడు మనిషి.

“నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు – నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నయిపోయాను” అంది పులి. ఈ మాటవిని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దెగ్గిరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది.


నిజంగా దురాశ దు:ఖానికి చేటు.

చాకలోడి గాడిద

అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలోడుండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలిమేటలను మోసేదీ. కుక్క చాకలోడింటికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది.

ఒక రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వేపు ఆశ్చర్యంగా చూసి, “నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?” అనడిగింది.

“మన యెజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడ పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?” అని కుక్క ఎదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.

“ఇది మనం మొరబెట్టుకునే సమయంకాదు. మన యజమానికి సహాయం చేయాలి” అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది.

దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడకొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు.


ఎవరి పని వాళ్ళే చేయాలని అప్పుడు గాడిదకు అర్ధమయ్యింది.

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది.

ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి.

మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి.


రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.

బ్రాహ్మడి మేక

అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.
మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు.
బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.

కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.

“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ.

ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…

ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.

ఇద్దరన్నదమ్ములు

ఛత్రపూర్ రాజ్యాన్ని జ్ఞాన్ చంద్ అనే రాజు పరి పాలించేవాడు. పేరుకు జ్ఞాన్చందే తప్ప, ఆయన గుణగణాలలో గాని, స్వభావంలో గాని మచ్చుకు కూడా జ్ఞానం కనిపించేది కాదు. ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ కనబరిచేవాడు కాదు. వ్యవ సాయూభివృద్ధికి బావులు, చెరువులు తవ్వించడం, బాటలు వేయడం మొదలైన వాటిని పూర్తిగా ఉపే క్షించాడు. దాంతో ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక తరచూ కరువు కాటకాలతో కటకటలాడ సాగారు.
అయినా రాజు జ్ఞాన్ చంద్ ఇలాంటి పరిస్థితులలోనూ ప్రజల మీద మోయ లేని పన్నులు విధించేవాడు. వాటిని చెల్లించలేక ప్రజలు చెప్పలేని బాధలు అనుభవిస్తూ, ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించ సాగారు. ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మర్రిచెట్టు కింద గుమిగూడి చర్చిస్తూన్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒకాయన, ఇలాగే చూస్తూ కూర్చుంటే మన గతి ఏమవుతుంది? మనలో మనం మథన పడ్డంవల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం.
ఇక ఏమాత్రం సహించడానికి వీలుకాదు! అన్నాడు. ఆ మాటలన్న వ్యక్తి పేరు కుంజీలాల్. ఆయన ఇప్పటి రాజు జ్ఞాన్ చంద్ తండ్రి మహారాజు అతుల్య చంద్ సైన్యంలో సైనికుడిగా అనేక యుద్ధాలలో పాల్గొన్నవాడు. ఆ మాజీ సైనికుడు ఇప్పుడు తమ సమస్యల కేదైనా పరిష్కారం చూపగలడా అని గ్రామ ప్రజలు ఆతృతగా ఎదురుచూడసాగారు. మొదట పన్నులు చెల్లించడం మానేద్దాం. పన్ను వసూలుకు వచ్చే అధికారి వట్టిచేతులతో తిరిగి వెళ్ళనీ.
ఆ తరవాత రాజు ఏం చేస్తాడో చూద్దాం, అన్నాడు కుంజీలాల్ సాలోచనగా. అవును. అలాగే చేద్దాం. ఒకవేళ అధికారి తిరిగి వెళ్ళనంటే నాలుగు తగిలించి మరీ పంపుదాం, అన్నారు, అన్నాళ్ళు ఎంతో ఓర్పుతో కష్టాలను భరిం చిన గ్రామస్థులు ధైర్యాన్ని కూడదీసుకుంటూ. పన్నులు వసూలు చేసే అధికారి అదృష్టమో ఏమోగాని అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. పన్నులు చెల్లించడానికి నిరాకరించిన గ్రామానికి పన్నులు వసూలు చేసే అధికారిని కాకుండా, గ్రామస్థుల మీదికి సైనికులను పంపడానికి నిర్ణ యించాడు రాజు.

గ్రామం పొలిమేరలో రాజధాని నుంచి సైని కులు కొందరు వచ్చి విడిది చేసి రాజు రాక కోసం ఎదురుచూస్తున్నారని కొందరు గ్రామస్థులు కుంజీ లాల్‌కు చెప్పారు. ఆ వార్త విని కుంజీలాల్‌ ఏమాత్రం భయపడలేదు. తమ్ముడు కీర్తిలాల్‌ను వెంటబెట్టు కుని వెళితే, రాజు సేనలను సులభంగా ఎదుర్కొని పారదోలవచ్చు అనుకుని అతని వద్దకు వెళ్ళాడు. అయితే, పిరికివాడైన కీర్తిలాల్‌ అన్న వచ్చిన ఉద్దేశం గ్రహించి, క్షమించు అన్నయ్యూ.
ఆరోగ్యం బాగా లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు, అన్నాడు బాధ నటిస్తూ. ఆ మాట విని కుంజీలాల్‌ ఆశ్చర్యం చెందలేదు. ఆశాభంగానికి గురికాలేదు. గ్రామంలోని యువకు లందరినీ కూడగట్టుకుని రాజు సైనికులను ఎదు ర్కొన్నాడు. అదృష్ట వశాత్తు, గ్రామయువకులు సైనికులకన్నా అధిక సంఖ్యలో ఉండడంతో, వాళ్ళు సైనికులను ధైర్యంగా ఎదుర్కొని సులభంగా ఓడించారు.
విజయం సాధించి వచ్చిన గ్రామ యువ కులకు కీర్తిలాల్‌ గ్రామస్థులతో కలిసి ఘన స్వాగతం పలికాడు. అన్నను తెగమెచ్చుకున్నాడు. ��అన్నయ్యూ, నువ్వు పిలిచినప్పుడు నిజంగానే నేను నీతో రావాలనుకున్నాను. అయినా వైద్యుడి సలహాను జవదాటలేక పోయూను. అయినా, సైనికుల నుంచి కొల్లగొట్టిన దాంట్లో నాకూ కొంత ఇవ్వు. ఎంతయినా, నీ తమ్ముణ్ణి కదా? అన్నాడు. కుంజీలాల్‌కు తమ్ముడితో గొడవ పడడం ఇష్టంలేదు.
అందువల్ల సైనికుల నుంచి కొల్లగొట్టిన దానిలో కొంత ఇచ్చి అతన్ని సంతోషంగా సాగనంపాడు. రాజు జ్ఞాన్‌చంద్‌ తనను విజయోత్సా హంతో అట్టేకాలం ఉండనివ్వడనీ, తనను శిక్షించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడనీ కుంజీలాల్‌ గ్రహించాడు. తనను గురించి భయపడ లేదు గాని, తన భార్యను తలుచుకుని విచార గ్రస్తుడయ్యూడు. ఆయన భార్య గంగాదేవి నిండు చూలాలు. ఆయన ఒకనాడు, గంగా, రాజు నన్ను శిక్షించాలన్న కక్షతో నీకు హాని కలిగించవచ్చు.
అందువల్ల నిన్ను దూరంలో ఉన్న సురక్షితమైన ఒక కొండ గుహలో వదిలిపెడతాను. అక్కడ నీకు ఎలాంటి హానీ జరగదు. ఇక్కడి ప్రమాదకర పరిస్థితులు కుదుట పడ్డాక నేనే వచ్చి నిన్ను తీసుకు వస్తాను,�� అన్నాడు. భర్తను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి గంగా దేవి మొదట ఒప్పుకోలేదు. ప్రభూ, తమరు వెళ్ళి రాజుగారికి క్షమాపణలు చెప్పుకుంటే సరి పోతుంది కదా.
ఆయన తప్పక క్షమించగలడు, అని ప్రాథేయపడింది. అది జరగని పని గంగా. మన రాజు అలాంటి రకం కాదు. నిరుపేదలైన గ్రామప్రజలను అతడు వేధించడం చూస్తున్నావు కదా! రాజు తన వైఖరిని మార్చుకునే వరకు నేను పోరాడక తప్పదు, అన్నాడు కుంజీలాల్‌ దృఢనిశ్చయంతో.