Pages

Saturday, September 15, 2012

జ్ఞాపకశక్తి


ఉదయం ఏదో పనిమీద కామేశం ఇంటికి వచ్చాడు రామేశం. ఆ సమయంలో తీర్థయాత్రకు వెళుతూ ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. రామేశం రెండు రాగి కాసులాయనకు ఇచ్చి, ``ఒకటి నాది. రెండవది మా కామేశంది,'' అన్నాడు. సాధువు దీవించి, ``మీ స్నేహం ముచ్చటయినది. నువు్వ మిత్రుడి నుంచి రాగి కాసు వెనక్కు తీసుకోకు.
 
ప్రతి అమావాస్యనాడూ నీ మిత్రుడికో రాగి కాసు ఇస్తూ ఉండు. అది ఆయనకెంతో లాభం కలిగిస్తుంది. అలాగే నీ మిత్రుడు ప్రతి పున్నమిరోజూ నీకొక రాగికాసునిస్తే, అది నీకు లాభం కలిగిస్తుంది. అయితే రాగి కాసు విషయం ఎవరికి వారు గుర్తుంచుకోవలసిందే తప్ప, ఒకరికొకరు గుర్తుచేసుకోకూడదు,'' అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఊరికి పుల్లయ్య అనేవాడు వచ్చి, ఊళ్ళో పదేళ్ళ క్రితం చేసి వెళ్ళిన అప్పులన్నీ తీర్చాడు. వాడు కామేశం నూరు వరహాల బాకీని వడ్డీతో సహా తీర్చేసినట్టు తెలిసి సాధువు దీవెన ఫలించిందనుకున్నాడు రామేశం.
 
సాధువు చెప్పిన ప్రకారం పున్నమినాడు కామేశం రామేశానికి రాగికాసు ఇవ్వలేదు. కానీ మళ్ళీ అమావాస్య రాగానే రామేశం కామేశాన్ని కలుసుకుని ఒక రాగి కాసునిస్తే, ``అరే! నీకింకా ఆరోజు సాధువు చెప్పిన విషయం గుర్తుందా?'' అన్నాడాయన ఆశ్చర్యంగా. ``నీకు లాభం కూడా కలిగాక, ఆ విషయం నేనెలా మరిచిపోగలను,'' అన్నాడు రామేశం. కామేశం నవ్వి, ``పుల్లయ్య ఇంకా చాలా మంది అప్పులు తీర్చాడు. వాళ్ళందరికీ నువు్వ రాగికాసు లివ్వలేదుకదా!'' అన్నాడు.

``పూజ చేసిన వాడి కోసం వానకురిస్తే, చెయ్యని వాడి చేనుతడవక పోతుందా? నీవల్లే వాళ్ళందరికీ లాభించిందేమో,'' అన్నాడు రామేశం. కామేశం చిన్నబుచ్చుకుని, ``ఈ మాత్రం నాకూ తట్టిందనుకో. కానీ అదేమిటో పున్నమి వచ్చే సరికి నాకీ విషయమే గుర్తురావడంలేదు. నీ జ్ఞాపకశక్తి నాకూ ఉంటే ఎంత బావుణ్ణు,'' అని నిట్టూర్చాడు. ఆరాత్రే కాపలాభటులకు చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఒక దొంగ దొరికాడు. దోచిన డబ్బు, నగలను చెట్టు తొరల్రో దాస్తున్నాడు.
 
వాటిలో కామేశం పోగొట్టుకున్న నగ కూడా ఉన్నది! తనతోపాటు ఊళ్ళో చాలామంది నగలు దొరికినా-దీనికి కారణం తనకు రామేశం ఇచ్చిన రాగికాసు కావచ్చునన్న అనుమానం కామేశానికి కలిగింది. అయినా, ఆ తరవాత వచ్చిన పున్నమికి కూడా ఆయన రామేశానికి రాగికాసునివ్వలేదు. అయితే, ఆ తరవాత వచ్చిన అమావాస్యకు కూడా రామేశం రాగి కాసునిచ్చాడు. కామేశం తడబడి, ``నువ్విచ్చే రాగి కాసువల్ల నాకు లాభం కలుగుతోంది. గుర్తుంచుకుని నేను నీకు రాగికాసునివ్వకపోవడం వల్లనే నాకు కలిగిన లాభం నీకు కలగకుండా పోతున్నది.
 
నీ జ్ఞాపకశక్తి నాకు లేకపోవడం చిన్నతనంగా అనిపిస్తున్నది,'' అన్నాడు రామేశంతో. రామేశం నవ్వి, ``అప్పిచ్చి నష్టపోయావు. నగపోగొట్టుకున్నావు. నా కలాంటి నష్టాలేమీ లేకపోవడం అదృష్టమే కదా! నేనిచ్చిన రాగికాసువల్ల నీకా నష్టాలు పూడుకున్నాయి. నాకేమో నా అదృష్టం గురించి తెలిసింది. కాబట్టి అనవసరంగా చిన్నబుచ్చుకోకు,'' అని వెళ్ళిపోయాడు. ఆ తరవాత కూడా రామేశం వరుసగా ప్రతి అమావాస్యకూ కామేశానికి రాగి కాసు ఇస్తూనే ఉన్నాడు.
 
కామేశానికి లాభం కలుగుతూనే ఉన్నది. అయినా ఒక్క పున్నమికీ కామేశం రామేశానికి రాగి కాసునివ్వలేదు. అలా ఆరు నెలలు గడిచాక రామేశం ఏదో పని మీద ఊరెళ్ళడం వల్ల కామేశానికి ఒక అమావాస్యకు రాగి కాసు ఇవ్వలేక పోయాడు. ఆ మర్నాడు కామేశం పెరట్లో గొయ్యి తవ్విస్తూంటే ఒక చెక్కపెట్టె నిండా రాళూ్ళరప్పలూ బయటపడ్డాయి.

రామేశం తనకు రాగి కాసు ఇచ్చివుంటే ఆరాళు్ళ వజ్రాలుగా మారివుండేవని అనిపించి, ఈసారి పున్నమికి రామేశానికి రాగి కాసొకటి ఇవ్వాలనుకున్నాడు కామేశం. ఈలోగా రామేశం పెరట్లో నుయ్యి తవ్వించడానికి పున్నమి నాడు ముహూర్తం పెట్టాడు. అది కామేశానికి తెలిసి, ఆరోజు తను గనక రాగి కాసు ఇస్తే, సాధువు వరం ఫలించి రామేశానికి నిధి దొరికినాదొరకవచ్చునని అనుమానించి కాసు ఇచ్చే ఆలోచనను పక్కనబెట్టాడు.
 
అందుకని పున్నమి ఘడియలు వెళ్ళి, పాడ్యమి ఘడియలు వచ్చేదాక ఆగి అప్పుడు రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశం ఆయన్ను చూసి, ``రా, కామేశం! నువ్వే ఇంకా రాలేదేమని చూస్తున్నాను,'' అన్నాడు. ``నాకు జ్ఞాపకశక్తి తక్కువ కావడం వల్ల నేను సాధువు చెప్పిన నియమం పాటించలేకపోయాను. ఇప్పుడు నేను నీకు కాసునివ్వాలనే వచ్చాను,'' అన్నాడు కామేశం గొప్పగా. ``అందుకేనేమో పది అడుగుల్లోనే జల ఊరుతోంది కామేశం,'' అన్నాడు రామేశం. వాళ్ళేమి మాట్లాడుతున్నదీ అర్థం గాక, అక్కడివారు ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు.
 
అప్పుడు రామేశం సాధువు ఇచ్చిన వరం గురించీ, ఆ తరవాత జరిగిన విశేషాలూ వివరించి, ``పోయిన అమావాస్యకు ఊళ్ళో లేనుగనక ఇవ్వలేదు. అయితే, వచ్చే అమావాస్యకే కాదు. ఇంకెప్పుడూ రాగి కాసివ్వకూడదని నిర్ణయించుకున్నాను,'' అన్నాడు. ``మంచి వాడనీ, పరోపకారి అనీ ఈయనకు పేరు. ఇప్పుడు చూశారు కదా అసలు రంగు,'' అన్నాడు కామేశం హేళనగా. అప్పుడు రామేశం కూడా నవు్వతూ, ``అలా అంటావేమిటి కామేశం? నేను రాగికాసులిచ్చినంత కాలం మూలబడ్డ నీ జ్ఞాపకశక్తి, ఇవ్వడం మానగానే పని చేస్తోంది. మనిషికి అనుకోని లాభాలకంటే, జ్ఞాపకశక్తి ముఖ్యం కదా.
 
అంటే, రాగికాసు ఇవ్వడంకంటే, ఇవ్వక పోవడం వల్లనే నీకు ఎక్కువ ప్రయోజనం. నీకు రాగికాసు ఇవ్వడం మానేసి నా పరోపకారబుద్ధిని మరోసారి రుజువు చేసుకున్నాను,'' అన్నాడు. ఇది వింటూనే అక్కడ ఉన్న వారందరూ ఫక్కున నవ్వారు. కామేశం, రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

పట్టుబడిన పగడాల దొంగలు!


తెల్లవారక ముందే నిద్రలేచిన అలీ, స్నానం చేసి, టిఫిన్‌ పూర్తిచేసి పుస్తకాల సంచీతో పాఠశాలకు సిద్ధమయ్యూడు. అండమాన్‌ దీవిలో అతడి పాఠశాల ఇంటికి రెండు కి.మీ. దూరంలో ఉన్నది. అయితే, గత పదేళ్ళుగా రోజూ అంత దూరం సులభంగానే వెళ్ళి వస్తున్నాడు అలీ. గ్రామం దాటి సముద్ర తీరం గుండా నడిచివెళితే అతడు చదువుతూన్న పాఠశాల వస్తుంది. అతడు పాఠశాల నుంచి తిరిగి వచ్చేప్పుడు అప్పుడప్పుడూ సముద్ర జలాల అంచుకు వెళ్ళేవాడు. ఒడ్డును సుతారంగా తాకే అలలను ఆసక్తిగా చూసేవాడు.
 
నీళ్ళ అంచున తిరుగాడుతూండే పీతలను వాటి బొరియల్లోకి తరిమేవాడు. గట్టుకు కొట్టుకు వచ్చిన స్టార్‌ఫిష్‌ను వింతగా చూసేవాడు. గవ్వలను ఏరుకునేవాడు. అయినా, కొన్ని వారాల క్రితం కొందరు పర్యావరణ పరిరక్షణాసంస్థ సభ్యులు వచ్చి అలీ తరగతిలోని విద్యార్థులను సముద్ర తీరానికి తీసుకువెళ్ళి సముద్రంలోని జీవరాశులను గురించి వివరించేంతవరకు, వాటిని గురించి అలీకి అంతగా తెలియదు. వాళ్ళు అలీకీ, అతడి మిత్రులకూ సముద్రంలో నివసించే అసంఖ్యాకమైన ప్రాణులను గురించి వివరించారు. వాటిలో చాలావాటిని చూపారు.
 
‘సోర్కెల్‌‌స' సాయంతో, పగడాల గుట్టలనూ, అవి జీవించే విధానాన్నీ చూపారు. పగడాలు సజీవ ప్రాణులని తెలుసుకుని విద్యార్థులు విస్తుపోయూరు. ప్రాణంలేని పెద్ద పెద్ద బండల్లా కనిపించేవి-తాబేటి చిప్పల్లా లోపలి ప్రాణుల్ని కాపాడే అస్థిపంజరాల్లాంటివని తెలుసుకుని అమితాశ్చర్యం చెందారు. రకరకాల పగడాలను, వాటి చుట్టూ నివసించే పేరట్‌ ఫిషస్‌, సముద్రపు అనిమోన్లు, స్టార్‌ఫిష్‌, కొమ్మచేపలు మొదలైన వాటిని చూసి ఆనందాశ్చర్యాలు పొందారు.

అన్నిటికన్నా రంగురంగుల అలంకరణలతో ‘పిక్చర్‌ బుక్‌‌స'లో చూసినట్టున్న బుల్లి ప్రాణులు ‘క్రిస్మస్‌ట్రీస్‌' అలీని ఎంతగానో ఆకర్షించాయి. అవి పగడాలకు ఆనుకుని కనిపించాయి. వాటిని ముట్టుకోబోతే, ప్రమాదాన్ని గ్రహించినట్టు అవి వెంటనే లోపలికి కుంచించుకు పోయూయి! సముద్రంలో నిక్షిప్తమై ఉన్న సహజ సంపదలను గురించి పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులు చెప్పగా విన్న అలీ చాలా గొప్పగా పొంగిపోయూడు.
 
మన దేశంలో ముఖ్యంగా లక్షద్వీప్‌, కఛ్‌ జలసంధి, మన్నార్‌ జలసంధి, అండమాన్‌ నికోబార్‌ దీవులలో పగడాల గుట్టలు ఉన్నాయి. అయితే తరచూ వచ్చే పర్యాటకులు తమ ఇళ్ళల్లో అలంకారవస్తువులుగా ఉపయో గించడానికి వాటిని లాగేసుకోవడం వల్ల; సముద్ర జలాలలోకలిసే, మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయినిక ద్రవ్యాలు, చమురు కాలుష్యాల కారణంగా రోజురోజుకూ ఇవి దెబ్బ తింటున్నాయి. ‘‘మన దీవులు ఉండాలంటే అవి ఉండి తీరాలి.
 
సముద్రం తాకిడి నుంచి అవే మన దీవులను కాపాడుతున్నాయి,'' అని హెచ్చరించాడు ఆరోజు వచ్చిన సంస్థ సభ్యుడు ఒకరు. ఇవన్నీ ఆలోచిస్తూ అలీ సముద్రతీరంలో పాఠశాల కేసి నడుస్తున్నాడు. దూరంలో ఒక తెల్లటి కారు కనిపించింది. ఆ దీవిలో పెద్దగా వాహనాలు లేవు. అలాంటి కారును అతడు అంతకు ముందెన్నడూ చూడలేదు. అలీ మరికొంత ముందుకు వెళితే, ముగ్గురు వ్యక్తులు కారులోకి ఏదో వేగవేగంగా ఎక్కిస్తూండడం కంటబడింది. మరింత దగ్గరికి వెళ్ళాడు అలీ.
 
వాళ్ళు కారులోకి పెడుతున్నది రకరకాల పగడాలని గ్రహించి, ‘‘ఎవరు మీరు? ఏమిటి మీరు చేస్తున్నది?'' అని అడిగాడు ఆతృతగా. ఆ ముగ్గురిలో ఒకడు వెనుదిరిగి, పిడికిలి బిగించి, అలీని డొక్కలో గుద్ది కింద పడదోసి, ‘‘ఏమైతేనీకేం? నీ పని నువ్వు చూడు,'' అంటూ కార్లోకి ఎక్కి మరిద్దరితో కలిసి వేగంగా వెళ్ళిపోయూడు. అలీ లేచి నిలబడి ఒళ్ళుదులుపుకున్నాడు. వెళుతూన్న కారును మరొకసారి పరిశీలనగా చూశాడు. తననింత వరకు ఎవరూ ఇలా కింద పడగొట్టింది లేదు. ఆ అవమానంకన్నా ఎవరో పగడాలను దొంగిలించుకు పోవడం అతడికి మరింత బాధ కలిగించింది. ‘‘వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళను గురించి ఫిర్యాదు చేయూలి. ఫిర్యాదు చేయూలి!'' అనుకుంటూ వెనుదిరిగి తన గ్రామం కేసి శరవేగంతో పరిగెత్తసాగాడు.

ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి, ‘‘అయ్యూ, సకిలు కొంచెం ఇస్తారా. ఇప్పుడే వస్తాను,'' అని అడిగి దుకాణందారు సరేనని తలూపగానే, సైకిలు మీద ఎక్కి వేగంగా పక్క గ్రామం కేసి తన శక్తికొద్దీ వేగంగా సైకిలు తొక్కసాగాడు. ‘‘మన దీవులు ఉండాలంటే పగడాలు ఉండి తీరాలి!'' అన్న మాటలు అతడి మనసులో మాటి మాటికీ ప్రతిధ్వనించసాగాయి. అవి కొన్ని రోజుల క్రితం పర్యావరణ సంరక్షణా సంస్థ సభ్యుడు చెప్పిన మాటలు.
 
అలా నాలుగు కి.మీ. దూరం వెళ్ళి పక్క గ్రామం చేరుకుని అక్కడున్న టెలిఫోన్‌ బూత్‌కు వెళ్ళాడు. ఫోన్‌ ద్వారా పర్యావరణ సంరక్షణా సంస్థ సభ్యుడికి తను చూసిన పగడాల దొంగతనం గురించీ, కారు ఆనవాళ్ళ గురించీ చెప్పాడు. (అదృష్టవశాత్తు వాళ్ళ ఫోన్‌ నంబరు అతడి స్కూల్‌ బ్యాగ్‌లో కనిపించింది.) తను చేయగలిగింది చేసి, గ్రామానికి తిరిగి వచ్చి, దుకాణందారుకు సైకిలును అప్పగించాడు. ఆ తరవాత యథా ప్రకారం పాఠశాలకు వెళ్ళిపోయూడు. మరునాడు పాఠశాల జరుగుతూండగా, అలీ తరగతికి ఒకరొకరుగా పలువురు ప్రముఖులు రాసాగారు.
 
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొందరు పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులతోపాటు స్థానిక ప్రభుత్వాధికారినీ, ఇద్దరు పత్రికా విలేకరులనూ వెంటబెట్టుకుని వచ్చాడు. అలీ టెలిఫోన్‌ కాల్‌ను అందుకున్న సభ్యుడు-అంతకు ముందు రోజు జరిగిన విషయూలన్నిటినీ తరగతిలోని విద్యార్థులకు పూసగుచ్చినట్టు వివరించి, ‘‘మన అలీ ఇచ్చిన ఫిర్యాదు, తెలియజేసిన కారు ఆనవాళ్ళను బట్టి, నిముషాల్లో అన్ని చెక్‌పోస్‌‌టలకూ హెచ్చరికలు పంపాము. కారుతో సహా ఆ పగడాల దొంగలు ముగ్గురూ పట్టుబడ్డారు. వాళ్ళు ఆ పగడాలను కొల్‌కతాకు పంపి మంచి ధరకు అమ్ముకోవడానికి తీసుకువెళుతున్నారు.
 
మన అలీ కారణంగా ఆ దొంగతనం అరికట్టబడింది. ఎంతో సమయస్ఫూర్తితో, ధైర్యంగా వ్యవహరించిన అలీని అభినందిస్తున్నాను,'' అన్నాడు. పిల్లల కరతాళ ధ్వనులతో, తరగతి మారుమోగింది. పత్రికా విలేకరులు వచ్చి తమ సహాధ్యాయిని ఇంటర్వ్యూ చేసి, ఫోటోలు తీస్తుంటే, పిల్లలు మరెంతగానో ఆనందించి మరొకసారి చప్పట్లు కొట్టారు. ‘‘ఇది నాకు చాలా సంతోషకరమైన రోజు. అయితే పగడాలకు మరింత గొప్ప రోజు,'' అనుకున్నాడు అలీ.

మహీపతి సలహా


జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బుగడించాలని ఆశ. వివిధ వ్యాపారాలను గురించి అనుభవజ్ఞులను అడిగాడు. వారిలో చాలామంది-జయపురంలో సరైన పూటకూళ్ళ ఇల్లు లేక, వచ్చే వారికి మంచి తిండి దొరకడంలేదనీ, అందువల్ల మంచి పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించమనీ సూచించారు.
 
జయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకుని కేదారయ్య పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. ఇద్దరు ముగ్గురు వంటగాళ్ళను మార్చాడు. కాని వ్యాపారం పుంజుకోలేదు. ఏం చేయడమా అని ఆలోచిస్తున్న సమయంలో మైలవరం నుంచి సునందుడనే వంటవాడు పనివెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటవాడుగా చేరినప్పటి నుంచి వంటకాల రుచి అద్భుతంగా ఉండడంతో, భోజనానికి వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది.
 
రుచి, శుచి రెండూ ఉండడంతో వ్యాపారం పూటపూటకూ అభి వృద్ధి చెందసాగింది. కేదారయ్య పూటకూళ్ళ ఇల్లు కొన్నాళ్ళకే జయపురంలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇలా వుండగా ఒకనాడు ఏదో ముఖ్య అవసరం ఏర్పడి, సునందుడు కేదారయ్యను వందవరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు వంద వరహాలు ఇస్తే, మరలా వెయ్యి వరహాలు అప్పు అడగగలడని భావించిన కేదారయ్య లేదనేశాడు. ఆ రోజునుంచే వంటకాల రుచి లోపించసాగింది. భోజనానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గసాగింది.

రోజూ భోజనం చేయడానికి వచ్చే ుహీపతి అనే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి, ‘‘ఈ మధ్య వంటలు మునుపటిలా అంత బావుండడం లేదు ఎందుకని?'' అని అడిగాడు కేదారయ్యను. ‘‘అదే నాకూ అంతుబట్టడం లేదు పంతులుగారూ.
 
వంట సరుకులూ అదే చోట కొంటున్నాం. ఎప్పుడూ వంటచేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు,'' అన్నాడు కేదారయ్య విచారంగా. మహీపతి కొంతసేపు ఆలోచించి, ‘‘సునందుడు నిన్నేదైనా సాయం కోరాడా?'' అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, ‘‘అవును, పంతులుగారూ. సునందుడు వంద వరహాలు అప్పు అడిగాడు. నేను ఇవ్వలేదు,'' అన్నాడు.
 
‘‘ఎందుకు ఇవ్వలేదు?'' అని అడిగాడు మహీపతి. ‘‘ఒకసారి ఇస్తే అదే అలవాటవుతుందని భావించాను,'' అన్నాడు కేదారయ్య. ‘‘అలా ఎందుకు అనుకోవాలి? అన్నిటికీ ఒకే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది గనక, ఆయూ వ్యాపారాలకు తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో! దాని మీది బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనబరచలేక పోవచ్చు.
 
నీ దగ్గర పనిచేస్తూ వేరొక చోటికి వెళ్ళి సాయం అర్థించలేడు కదా? ఇంతకూ అతడు అడిగింది అప్పుగానే కదా? వెంటనే వంద వరహాలు ఇచ్చి చూడు. ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పని చేసే వాళ్ళను మంచిగా చూస్తేనే, వాళ్ళ దగ్గరి నుంచి ఆశించిన పనిని రాబట్టగలం,'' అని సలహా ఇచ్చాడు మహీపతి. కేదారయ్య ఆ రోజే సునందుడికి వంద వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందం, పనుల్లో ఉత్సాహం కనిపించాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చినవాళ్ళు మెచ్చుకోసాగారు. వ్యాపారం మునుపటి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది.

వెంటాడిన సంగీతం


అది వెన్నెల రాత్రి. గుడారంలో కూర్చున్న వర్తకుడు తటాకానికి ఆవల ఉన్న గంభీరమైన కొండలను చూసి, తటాకం చుట్టూవున్న పూలచెట్ల నుంచి వీచే సుగంధ పరిమళాలను ఆస్వాదించి, ఎంతగానో ఆనందించాడు. అయితే, అన్ని అందాలకూ మించి ఆ ప్రశాంత వాతావరణంలో అప్పుడప్పుడు వినిపించిన కొన్ని పక్షుల పాటలు అతణ్ణి ముగ్థుణ్ణి చేశాయి. దాన్ని వింటూ అలాగే నిద్రపోయూడు. రాత్రంతా, ఎన్నడూ కనని అందమైన కలలు కన్నాడు. తెల్లవారకముందే నిద్రలేచి ఆ కలలకు కారణం పక్షుల పాటే కారణమని గ్రహించాడు. అతడు ఆ వింత పక్షుల పాట వినిపించిన గుబురు చెట్ల కేసి వెళ్ళి చూశాడు. ఒకటి రెండు పక్షులు ఇంకా అప్పుడప్పుడు పాడుతున్నాయి. ఒక పక్షి అప్పుడే గూటి నుంచి వెలుపలికి తొంగి చూస్తున్నది.
 
సూర్యోదయం కాగానే పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోయూయి. వర్తకుడి వెంట పక్షులుపట్టే వేటగాడొకడు ఉన్నాడు. వర్తకుడి కోరిక ప్రకారం వాడు చెట్టెక్కి పక్షి గూట్లో జిగురు వుంచి కంటికి కనిపించకుండా వలపన్ని వచ్చాడు. సూర్యాస్తమయం అవుతూండగా పక్షులన్నీ గూళ్ళకు తిరిగి వచ్చాయి. వేటగాడు వలపన్నిన గూటిలోకి కూడా, ఏమాత్రం అనుమానం లేకుండా పక్షి లోపలికి జొరబడింది.

వేటగాడు చరచరా చెట్టెక్కి వెళ్ళి పక్షిని పట్టి తెచ్చి యజమానికి అప్పగించాడు. పక్షి రెక్కలు కొట్టుకుంటూ తన వ్యతిరేకతను తెలియ జేసింది. అయితే, వర్తకుడు దాన్నేమీ పట్టించుకోకుండా ప్రేమగా ఇలా అన్నాడు : ‘‘నువ్వేమీ భయపడకు. నిన్నేమీ చేయను. నీకు నవరత్నాలు పొదిగిన బంగారు పంజరం చేయిస్తాను. ఏ పక్షులకూ అందుబాటులో లేని సుమధుర ఫలాలను నీకు ఆహారంగా పెడతాను.
 
నా సేవకులు రాత్రింబవళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నువ్వు చేయవలసిందల్లా ప్రముఖులు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు, రోజుకు ఒకటి రెండు సార్లు పాడడం మాత్రమే. దాని ద్వారా నీకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి.'' ‘‘అయితే, బందీగా ఉన్నప్పుడు నేను పాడలేనుకదా! నన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టు. మీ వెంట ఎగురుతూ వచ్చి మీ ఇంటిని చూసుకుంటాను.
 
అప్పుడప్పుడూ వచ్చి నీకోసం తప్పకపాడుతాను. నా మాట నమ్ము,'' అన్నది పక్షి. పక్షి రంగురంగులతో చాలా అందంగా కనిపించింది. వర్తకుడు పక్షి విన్నపాన్ని పెడచెవిని పెట్టి ఏ కొరతా లేకుండా జాగ్రత్తగా చూసుకుంటానని మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు. పక్షి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండి పోయింది. లోయను వదిలి వర్తకుడి వాహనాలు అతడి ఇంటి కేసి బయలుదేరాయి. ఇల్లు చేరాక పక్షి వర్తకుడి కోసం అప్పుడప్పుడు పాడుతున్నప్పటికీ మొదట వున్న శ్రావ్యత లోపించింది. మధురంగా ఉన్నప్పటికీ అంతర్లీనంగా తీరని ఆవేదన ధ్వనించసాగింది.
 
వ్యాపారి వద్ద ఉన్న పాటలు పాడే పక్షి గురించి ఊరంతా తెలిసిపోయింది. ఎందరెందరో ప్రముఖులువచ్చి దానిని చూడసాగారు. దానిని పట్టుకువచ్చిన వ్యాపారి అదృష్టాన్ని కొనియూడారు. పక్షికోసం రకరకాల కానుకలూ, చిన్న చిన్న ఆభరణాలూ ఇచ్చేవారు. అయినా స్వేచ్ఛకోల్పోయిన పక్షి ఎలాంటి కానుకలకైనా ఎలా ఆనందించగలదు? వారికేసి నిర్లిప్తంగా చూస్తూ ఊరుకునేది. ఇలా రెండేళ్ళు గడిచిపోయూయి.
 
వర్తకుడు మళ్ళీ వ్యాపారం కోసం బయలుదేరుతూ, పంజరం దగ్గరికి వెళ్ళి, ‘‘నేను వ్యాపారానికి దూర ప్రాంతానికి వెళుతున్నాను. నేను ఇంటి వద్ద లేనప్పుడు నీకు ఎలాంటి కొరతా రాకుండా చూసుకోమని, ఇంట్లోనివారికీ పనిమషులకూ చెప్పాను. నీకు ఏ లోటూ రాదు. ఇంకో విషయం. నేను తిరిగి వచ్చేప్పుడు నీ స్వస్థలమైన లోయగుండా రావలసి ఉంటుంది.

నీ బంధుమిత్రులయిన తటాకం దగ్గరి పక్షులకేమైనా చెప్పమంటావా?'' అన్నాడు పక్షితో. ‘‘చాలా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ చక్కగా చూసుకుంటున్నారనీ, నిజానికి చాలా పేరు ప్రఖ్యాతులు పొందాననీ, అయితే, స్వేచ్ఛ మాత్రం లేదనీ, ఏం చేయడానికీ తోచడం లేదనీ చెప్పు,'' అన్నది పక్షి. ‘‘తప్పకుండా చెబుతాను,'' అని చెప్పి వర్తకుడు అక్కడి నుంచి బయలుదేరాడు.
 
మూడు నెలల తరవాత వర్తకుడు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చీ రాగానే, ‘‘నేను చెప్పిన సంగతి నా మిత్రులకు చెప్పావా? అందుకు వాళ్ళు ఏమి సమాధానం పంపారు,'' అని పక్షి వర్తకుణ్ణి ఆతృతగా అడిగింది. ‘‘నువ్వు చెప్పిన మాటలను పక్షులతో బిగ్గరగా చెప్పాను. ఒకసారి కాదు. రెండు సార్లు చెప్పాను. ఒక్కటీ బదులు పలకలేదు. నా మాటలు వినగానే కిలకిలమని శబ్దం చేయడం కూడా మానేశాయి.
 
నిశ్శబ్దంగా ఉండిపోయూయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పక్షి కొమ్మపై నుంచి కిందనున్న పొదలోకి దభీమని పడిపోయింది. బహుశా అది చచ్చిపోయిందనుకుంటాను,'' అన్నాడు వర్తకుడు ఎంతో విచారంగా. పక్షి మౌనంగా ఊరుకున్నది. ఆ వార్త వినడంతో పక్షి దిగ్భ్రాంతి చెందివుంటుందని వర్తకుడు భావించాడు. పక్షికి ఓదార్పుగా నాలుగు మాటలు చెబుదామని అనుకుంటూండగా, పంజరంలోని అడ్డు ఊచ మీద కూర్చున్న పక్షి హఠాత్తుగా కింద పడిపోయింది. ‘‘అయ్యో దేవుడా! ఆ లోయలోని పక్షి చనిపోయిన సంగతి చెప్పకుండా ఉంటే బావుండేది.
 
పాపం ఆ వార్త విని తట్టుకోలేక ఇదీ చచ్చిపోయినట్టున్నది!'' అంటూ వర్తకుడు భోరున విలవించసాగాడు. పంజరం తలుపు తీసి పక్షిని వెలుపలికి తీశాడు. మౌనంగా ఇంటి పెరట్లో ఉన్న తోటకేసి నడిచాడు. తక్కినవారూ అతణ్ణి అనుసరించివెళ్ళారు. పక్షిని ఎక్కడ పాతి పెట్టాలన్న విషయం చర్చించి ఒక నిర్ణయూనికి వచ్చారు.
 
అయితే, పక్షిని వర్తకుడు పచ్చ గడ్డి మీద ఉంచగానే, అది రివ్వునలేచి క్షణంలో దాపులనున్న చెట్టు కొమ్మ మీదికి ఎగిరి వెళ్ళి కూర్చుని, ‘‘నా మిత్రుల సందేశం వినిపించినందుకు చాలా కృతజ్ఞతలు!'' అన్నది. ‘‘ఆ పక్షులు ఎలాంటి సందేశమూ పంపలేదే!'' అన్నాడు వర్తకుడు విస్మయంతో ఒక్కటీ అంతుబట్టక. ‘‘అవి నిజంగానే సందేశం పంపాయి. నేను చెప్పి పంపిన మాటలు నీ నోటి గుండా వినగానే ఒక పక్షి చచ్చిపోయినట్టు కింద పడిపోయిందని చెప్పావు కదా.

స్వేచ్ఛ సాధించాలంటే నన్నూ అదేవిధంగా చేయమన్న సందేశం అందులో ఇమిడి ఉంది. నాకు ఆ సలహా ఎంత గొప్పగా పనిచేసిందో నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా?'' అన్నది పక్షి. వర్తకుడు ఆశ్చర్యంగా దానికేసి చూశాడు. పక్షి మళ్ళీ, ‘‘నువ్వు నా కోరిక మన్నించి మొదటే గనక నన్ను వదిలిపెట్టి ఉన్నట్టయితే, అప్పుడప్పుడు వచ్చి, నువ్వూ, నీ బంధుమిత్రులూ సంతోషపడే విధంగా పాడి ఉండేదాన్ని-ఎందుకంటే, స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే పాడగల పాట అది! అయితే నన్ను వదిలిపెట్టకూడదన్న లోభం నీలో పెరిగిపోయింది.
 
ఇప్పుడు నేను నీ కోసం తుదిసారిగా ఒక పాట పాడుతాను-అదే నీకు శిక్ష!'' అన్నది. ‘‘చాలా సంతోషం! అయినా అది నాకు శిక్ష ఎలా అవుతుంది?'' అని అడిగాడు వర్తకుడు అయోమయంగా. పక్షి సమాధానం చెప్పకుండా, పాడడం మొదలు పెట్టింది. అందరూ ఆ పాట విని తన్మయత్వం చెందారు. హఠాత్తుగా పాటను ఆపి పక్షి ఎటో వెళ్ళిపోయింది, సుదూర మేఘాలను దాటుకుంటూ. కొన్ని రోజులు గడిచాయి.
 
పక్షి పాడిన పాట వర్తకుడి మనసులో తరచూ వినిపించ సాగింది. అది మళ్ళీ మళ్ళీ అతడి మనసులో ప్రతిధ్వనించడం వల్ల దాదాపు అతనికి పిచ్చెక్కినట్టయింది. ఇక భరించ లేక ఒకనాడు తిన్నగా అడవికి వెళ్ళి లోయను చేరాడు. పక్షులన్నీ ఆగ్రహంతో గుంవుగూడి కీచుకీచుమంటూ అతడి తల మీద వృత్తాకారంలో ఎగరడంతో, అతడు వెంటనే వెనుదిరిగాడు. అయితే, మనసులో వెంటాడే సంగీతం మాత్రం జీవితంలో ఆఖరి క్షణం వరకు అతణ్ణి వేధించసాగింది.

స్వాతంత్య్రం కోసం వీరోచిత త్యాగం!


వింధ్య పర్వతాలకు ఆవల దక్కను పీఠభూమిలో బ్రహ్మాండమైన ప్రాకారాలతో ఎత్తయిన కుడ్యాలతో వందలాది కోటలు, రాతి నిర్మాణాలు-కడలి తరంగాలు, వర్షాల బీభత్సం, మండుటెండల తాకిడి మొదలైనవాటికి తట్టుకుని ఈనాటికీ మౌనంగా కాపలాభటుల్లా నిలబడి ఉన్నాయి. ఈ ప్రాంతం శత్రువులకు అభేద్యం. దురాక్రమణ దారులకు చొరరానిది. ఇక్కడి ప్రజలు అపూర్వ ధైర్య సాహసాలకు, మాతృభూమి పరిరక్షణకు పేరుగాంచినవారు.
 
అయినప్పటికీ 14వ శతాబ్ద ప్రాంతంలో కొందరు విదేశీయులు ఈ ప్రాంతంలో జొరబడ్డారు. మొగలులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి తమ అధీనంలోకి తెచ్చుకోవడంలో కృతకృత్యులయ్యూరు. ఇక్కడి జున్నార్‌ సమీపంలోని శివనేర్‌ కోటలో షాజీ భోన్‌స్లే, జిజాబాయి దంపతులకు 1627లో ఒక మగశిశువు జన్మించాడు. తమ ఇష్టదైవం ‘శివభవాని' పేరు మీదుగా బిడ్డకు శివాజీ అని నామకరణం చేశారు. బిడ్డ పుట్టాక తండ్రి భోన్‌స్లే, బిజాపూర్‌ సుల్తాన్‌ వద్ద జాగీరుదారుగా చేరి అక్కడికి వెళ్ళాడు. భక్తిసంపన్నురాలూ, వివేకవతీ అయిన తల్లి జిజాబాయి పెంపకంలో శివాజీ పెరగసాగాడు.
 
ఆమె పురాణేతిహాసాలలోని వీరసాహస గాథలను బిడ్డకు చెబుతూ, లేతహృదయంలో ఉన్నత భావాలను పాదుకొల్పింది. దాదాజీ కొండదేవ్‌ అనే కుటుంబ మిత్రుడు శివాజీ విద్యాభ్యాసానికి ఎంతగానో సాయపడ్డాడు. శివాజీ చిన్నప్పటి నుంచే సాహసకృత్యాలకు పేరొందిన స్థానికులైన మావళీలతో కలిసి మెలిసి మైత్రితో మసలసాగాడు.

 వారి నుంచి గురప్రుస్వారీ, కత్తిసాము, మల్లయుద్ధం, మొదలైన వాటిని నేర్చుకున్నాడు. క్రమంగా అద్భుతసాహసాలతో ఆ యువకులను ఆకట్టుకుని, వారిని తన అనుచరులుగా మలుచుకున్నాడు. యువకుడైన శివాజీ హృదయంలో మెల్లమెల్లగా స్వాతంత్య్రకాంక్ష మొగ్గ తొడగసాగింది. దేశానికి పరాయి పాలననుంచి విముక్తి కలిగించి సొంత రాజ్యం స్థాపించాలని సంకల్పించాడు.
 
ఒకనాడు తన ముఖ్య అనుచరులతో కలిసి శివాజీ రాయ్‌రేశ్వర్‌ సమీపంలోని ఒక గుహలో వున్న శివాలయూనికి వెళ్ళాడు. తమ బొటన వేలును కోసుకుని, శివలింగం మీద రక్తాన్ని బొట్టులు బొట్టులుగా అర్పిస్తూ-మాతృభూమికి మొగలుల దుష్టపాలన నుంచి విముక్తి కలిగించగలమని ఆ యువకులు ప్రతినబూనారు! స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా వున్న మావళీ వీరులను శివాజీ కూడ గట్టుకున్నాడు. 1646లో తోర్నా కోటను ముట్ట డించి వశపరచుకున్నాడు. ఆ తరవాత పురందర్‌, రాజ్‌గఢ్‌, సింహగఢ్‌, రాయ్‌గఢ్‌ అంటూ ఒక్కొక్క కోటగా వశపరచుకుంటూ, అనువైన ప్రాంతాలలో సైనిక బలాలను సమీకరించుకుంటూ విస్తరించసాగాడు. శివాజీ ప్రతాప్‌ ఘడ్‌లో చిన్న మందిరం నిర్మించి ‘భవానీదేవి' విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
 
అంతవరకు నిశ్చింతగా విలాసాలలో మునిగి తేలుతూన్న మొగలు పాలకులు దక్కను పరిస్థితులకు ఉలిక్కిపడి ప్రమాదాన్ని గుర్తించారు. శివాజీని ఎలాగైనా నియంత్రించాలని ఆలోచించారు. ఆయన తండ్రి షాజీని ఖైదీగా పట్టుకుని, కొడుకు దురాగతాలను కట్టడి చేయమని ఆదేశించారు. అయితే శివాజీ ఎంతో చాకచక్యంతో, ఢిల్లీ నుంచి షాజహాన్‌ జోక్యం చేసుకునేలా చేసి, తండ్రిని విడిపించుకున్నాడు.
 
తండ్రి ప్రమాదం నుంచి బయట పడ్డాక, శివాజీ మళ్ళీ దాడులను ప్రారంభించాడు. రాజా జావళీ పాలిస్తూన్న ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా వశపరచుకున్నాడు. ఆ తరవాత అహ్మదాబాదును వశపరచుకుని, బిజాపూర్‌ సరిహద్దులకు సైన్యాన్ని పంపాడు. యువకుడైన శివాజీ పుణే పరిసర ప్రాంతాలకు ఎదురులేని నాయకుడయ్యూడు. ఆయన అపూర్వ ధైర్యానికీ, సాహస కృత్యాలకూ దేశం అబ్బుర పడింది.
 
అదే సమయంలో శత్రువులైన మొగలు పాలకులు ఆయన్ను తుదముట్టిం చడానికి సరైన సమయం కోసం ఎదురుచూడసాగారు. సహ్యాద్రి కొండ మీది ప్రతాప్‌ఘడ్‌ కోట మీదికి ఒకనాడు కింది నుంచి పన్నెండు వేల మంది సైనికులు-తుపాకులు, ఫిరంగులతో రావడం కనిపించింది. దక్కను ప్రాంతాన్ని బాగా ఎరిగిన అఫ్‌జల్‌ఖాన్‌ శివాజీని పట్టుకోవాలన్న పట్టుదలతో సేనలకు నాయకత్వం వహించి వస్తున్నాడు.

మైదానంలో కన్నా కొండపైనుంచి శత్రుసేన లను ఎదుక్కోవడం సులభమే అయినప్పటికీ, ఆ దృశ్యం శివాజీ అనుచరులకు ఓ క్షణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆ తరవాత తేరుకుని శత్రువులను ఎదుర్కోవడానికి వ్యూహాలురచించ సాగారు. అయితే, అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా-శివాజీని కలుసుకుని మంతనాలు జరపాలని సేనాధిపతి అఫ్‌జల్‌ఖాన్‌ దూత ద్వారా సందేశం పంపాడు! ఇద్దరు అనుచరులతో మాత్రం వచ్చేలా అయితే కలుసుకోవడానికి అభ్యంతరం లేదని శివాజీ తెలియజేశాడు.
 
సమావేశ స్థలమూ, సమయమూ నిర్ణయించబడింది. పల్లకీలో వచ్చిన అఫ్‌జల్‌ఖాన్‌ సమావేశం కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కొంతసేపటికి శివాజీ అక్కడికి రాగానే ఆరడుగుల అఫ్‌జల్‌ఖాన్‌ లేచి నిలబడి నవ్వుతూ, ఐదడుగుల శివాజీని ఆప్యాయంగా చేతులు సాచి ఆహ్వానిస్తున్నట్టు నటించి, దగ్గరికి రాగానే ఎడమ చేత్తో ఆయన గొంతు పట్టి నులుముతూ, కుడిచేత్తో తన మొలలోని బాకు తీసి ఆయన డొక్కలో పొడిచాడు.
 
శివాజీ బాధను భరిస్తూ, ఎడమ చేత్తో అఫ్‌జల్‌ఖాన్‌ కడుపును చీల్చి పేగులు బయటికి వచ్చేలా కింద పడగొట్టాడు! మంతనాలకు వస్తానన్న అఫ్‌జల్‌ఖాన్‌ కుట్రను ముందుగానే ఊహించి, శివాజీ తన శరీరానికి పలుచటి కవచమూ, ఎడమ చేతికి పదువైన ఇనుప పులిగోళ్ళూ ధరించి మరీ వెళ్ళాడు! కుట్రతో హతమార్చాలని వెళ్ళిన సేనాధిపతి హతుడవడంతో మొగల్‌ సేనలు హడలి పోయూయి. శివాజీ సైనికులు వారిని చీల్చి చెండాడి తరుమగొట్టారు. ఆ తరవాత శివాజీ కొల్హాపూర్‌ ప్రాంతంలోని పన్హాలా కోటను పట్టుకున్నాడు. ఆ ప్రాంతంలోని చిన్న చిన్న కోటలను వశపరచుకుంటూ, మొగలుల బలమైన స్థావరమైన బిజాపూర్‌ను ముట్టడించాడు.
 
అయితే, సిద్దిజాహర్‌ నాయకత్వంలోని మొగలు సేనలు తమసేనలకన్నా ఎన్నోరెట్లు అధికంగా ఉండడంతో, అక్కడి నుంచి తిరుగుముఖం పట్టవలసివచ్చింది. సిద్దిజాహర్‌ అమితోత్సాహంతో యూభైవేల సైన్యంతో పన్హాలా కోటను ముట్టడించాడు.
 
అక్కడి నుంచి తప్పించుకోవాలి; లేకుంటే ఓటమి తప్పదు అన్న స్థితి ఎదురయింది. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టూ, అంతకు ముందు సంధి చర్చలు జరపడానికి తనను కొండ కిందికి రావడానికి అనుమతించాలనీ శివాజీ కోరాడు. సిద్దిజాహర్‌ అందుకు సంతోషంగా సమ్మతించాడు. 1660లో అది చీకటి కమ్ముకున్న ఒక తుపాను రాత్రి.


భయంకరమైన ఉరుములు, మెరుపుల మధ్య రెండు పల్లకీలు పన్హాలా కోట …ుంచి వెలుపలికి వచ్చాయి. వాటి వెంట ఐదు వందల మంది సైనికులు నడిచారు. శివాజీకి అత్యంత విశ్వాస పాత్రుడూ, అసమాన వీరుడూ అయిన బాజీప్రభుదేశ్‌పాండే సేనలకు నాయకత్వం వహించాడు. పల్లకీలు సమతల ప్రదేశాన్ని సమీపిస్తూండగా మొగలు సేనలకు అనుమానం కలిగి వాటిని అడ్డుకోబోయూరు.
 
ఒక పల్లకీ ప్రధాన మార్గం గుండా నడూస్తూండగా, రెండవ పల్లకీ విశాల్‌గఢ్‌ కేసి పక్క దారిలో కదల సాగింది. ప్రధాన మార్గంలో వస్తూన్న పల్లకిని ఆపి, అందులో శివాజీ ఉండడం చూసి పట్టరాని ఆనందంతో ఆయన్ను తమ సేనాధిపతి వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన్ను చూడగానే, ‘‘ఆహా! ఇంత కాలానికి మంతనాలకు వచ్చావన్న మాట!'' అంటూ హేళనగా నవ్వాడు సేనాధిపతి. అయితే, వాళ్ళు పట్టుకున్నది అసలు శివాజీ కాదనీ, ఆయన పోలికలతో, అదే వేషధారణలో వున్న శివకాశిద్‌ అనే మరాఠీ వీరుడనీ గ్రహించి పట్టరాని ఆవేశానికి లోనయ్యూడు.
 
తప్పించుకు పోతున్న అసలు శివాజీని పట్టుకోవడానికి మొగలు సేనలు గుర్రాలపై బయలుదేరాయి. ముందు వెళుతూన్న శివాజీని పట్టుకోవాలంటే మొగలు సేనలు ఒక ఇరుకైన కొండ కనుమ గుండా వెళ్ళాలి. వారిని అటు వెళ్ళకుండా అడ్డుకోవడానికి బాజీప్రభుదేశ్‌పాండే, కొందరు వీరులతో కలిసి కనుమ మార్గానికి అడ్డుగా నిలబడ్డాడు. శత్రుసేనలు హాహాకారాలు చేస్తూ వచ్చాయి. మరాఠీ వీరులు కత్తులు దూసి వారిని ముందుకు వెళ్ళనీయ కుండా, తమ శక్తికి మించి పోరాడారు.
 
చూస్తూండగానే ఆ ప్రాంతం మొగలు సేనల శవాలతో నిండిపోయింది. అంతలో మొగలు సేనల వద్ద మందుగుండు సామాను అయిపోవడంతో, వాళ్ళూ కత్తులతోనే పోరాడవలసి వచ్చింది. ఆ సమయూనికి తమవైపున పదిహేను మంది సైనికులు మాత్రం మిగిలి ఉన్నట్టు బాజీప్రభు గమనించాడు. శత్రుసేనలు వారిని చుట్టుముట్టాయి. ఆ స్థితిలోనూ బాజీప్రభు అసమాన ధైర్యంతో పోరాడాడు. ఆఖరికి ఆయన కూడా తీవ్రంగా గాయపడి నెత్తురోడుతూన్న శరీరంతో పోరాడసాగాడు. పన్నెండు గంటలు గడిచిపోయూయి! నిర్మలమైన ఆకాశంలో మూడుసార్లు ఫిరంగులు పేల్చిన శబ్దం ప్రతిధ్వనించింది.
 
శివాజీ సురక్షితమైన విశాల్‌గఢ్‌ కోటకు చేరుకున్నాడనడానికి అది సంకేతం. ఆ క్షణం కోసమే ప్రాణాలు నిలుపుకుంటున్న బాజీప్రభు ఆనందంతో నేలకు ఒరిగాడు. తమ రాజు కోసం, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుల జ్ఞాపకార్థం ఆ కనుమకు ‘పావన్‌ ఖిండ్‌' (పవిత్ర కనుమ) అని పేరు పెట్టారు! 

రాజుగారికోతి


నక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామ గ్రామాన తిరుగుతూ కోతుల నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగకోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని, చివరలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆటచివర నాలుగు డబ్బులు లభించడంవల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది.
 
ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును మెప్పించి ఆయన చేత సన్మానం పొంది, మాన్యం సంపాదించాలన్నది వాడి ఆశ. వానాకాలం సమీపించే సరికి, నటేశం కోతులాట ముగించుకుని, సామానంతా గాడిద మీద వేసుకుని, కోతులను భుజాల మీదికి ఎక్కించుకుని, మజిలీలు చేస్తూ నక్కవానిపాలెం సమీపించాడు.
 
వాడు ఊళ్ళోకి వచ్చేలోగా చీకటిపడి, అప్పటికే వాన ప్రారంభమయింది. వాడు గాడిద మీదున్న సామానంతా దాపుల కనిపించిన ఆంజనేయ స్వామివారి గుడి అరుగు మీదికి చేర్చి, గాడిదను వానలోనే వదిలేసి, కోతులతో సహా, భార్యతో కలిసి అరుగు మీదికి చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి, ‘‘ఎక్కడెక్కడో తిరిగి వచ్చి, గుడి అరుగులు మైలచేయకండి, వెళ్ళండి,'' అని కసిరాడు.
 
అంతలో ఆడకోతి పూజారి ఎదుటికివచ్చి, రెండు కాళ్ళపై నిలబడి చేతులు జోడించింది. పూజారి దాన్ని కాస్సేపు పరిశీనలగా చూసి నటేశంతో, ‘‘ఒరేయ్‌, దీని వాలకం చూస్తూంటే ప్రసవ వేదన పడుతున్నట్టున్నది.

ఆంజనేయ స్వామి ప్రతిమను పూజిస్తూ, దీని మూగ అభ్యర్థనను మన్నించకపోతే, మనిషిగా నా జన్మకు అర్థంలేదు. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళకండి. దీనికిక్కడ పిల్ల పుట్టడం స్వామి వారి లీలగా భావిస్తాను,'' అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్టుగానే ఆడకోతి నిమిషాల్లో మగ కోతిపిల్లను కన్నది.
 
వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రంచేస్తూంటే, మగకోతి పూజారి ఎదుటికి వెళ్ళి రెండు కాళ్ళ మీద నిలబడి నమస్కరించి పక్కకు తప్పుకున్నది. దానిని గమనించిన నటేశం భార్య పూజారితో, ‘‘అయ్యవారూ! ఈ మగకోతి తనకు పుట్టిన కొడును భవిష్యత్తు తెలుసుకోవాలని దణ్ణం పెడుతున్నట్టుంది,'' అన్నది నవ్వుతూ. పూజారి ఏ కళనున్నాడో ఏ మోమరి. ‘‘దీన్ని కోతిచేష్ట అని కొట్టిపారేయకూడదు.
 
కోతులు ఆంజనేయస్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప, జంతువులకు వేయలేదు. అయినా, ఆంజనేయస్వామికి నమస్కరించి, దీని జనన సమయూన్ని బట్టి లెక్క కడతానుండు,'' అంటూ వేళ్ళతో లెక్క కట్టి, ‘‘ఇప్పుడు పుట్టిన కోతిపిల్ల జనన సమయూన్ని బట్టి చూస్తే మామూలు కోతి పిల్లలాగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యూచించిందంటే వారు మహారాజు అంశ కలిగినవారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాలు ఉన్నత స్థితికి రాగలవని నాకనిపిస్తున్నది,'' అన్నాడు.
 
నటేశం బుల్లికోతిని చేతిలోకి తీసుకుంటూ, ‘‘చెప్పినట్టు ఇది నాలుగు విద్యలు నేర్చుకుని, జమీందారుగారి నాకర్షిస్తే నాకు కోతి మాన్యం దొరికి, ఇదే ఊళ్ళో స్థిరపడాలని ఉన్నది. మీ దీవన, హనుమంతులవారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను,'' అని పూజారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయూడు. రోజులు గడిచే కొలది ఆటలు నేర్చుకుని ఒకయేడాది తిరిగే సరికి బుల్లికోతి జనాన్ని ఆకర్షించడం మొదలు పెట్టింది.
 
అయితే, అదేం చిత్రమోగాని, అది తల్లికోతి, తండ్రి కోతిలాగ చిప్ప పుచ్చుకుని ఎవరినీ చిల్లర డబ్బులు అడిగేది కాదు. ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే, కాలు మీద కాలువేసుకుని పడుకోవడం నటేశం దానికి నేర్పాడు. నటేశం నవ్వుతూ, ‘‘బాబూ! దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశ కలవారిని తప్ప యూచించదు,'' అనేవాడు.

ఆట చూడ్డానికి వచ్చిన జనం ఉత్సాహం కొద్దీ దానికి డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లికోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఆ సంగతి ఆనోటా ఈనోటా పడి సిరిపురం జమీందారు చెవిన పడింది. కోతులాడించే వాడు తన కోతిని రాజుగారికోతిగా ప్రచారం చేసుకోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.
 
దివానును పిలిచి, ‘‘ఆ కోతులాడించే వాణ్ణి శిక్షించు. లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెబుతాడు,'' అని ఆదేశించాడు. దివాను భటులను పిలిపించి, రాజుగారి కోతి వెనక ఉన్న కథంతా తెలుసుకుని జమీందారుతో, ‘‘ప్రభూ! పొట్టకూటి కోసం మాటలమ్ముకునే వారిని మనం శిక్షించ కూడదు. ఆ కోతిపిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది. ప్రజలు దాన్ని అభి మానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళడం మంచిదికాదు. కావాలంటే అది మహారాజు అంశ కలవారిని మాత్రమే యూచిస్తుందన్న విషయూన్ని మాత్రం పరీక్షించవచ్చు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం.
 
ఎవరికీ అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపొండి. అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల కివ్వండి. ఆ మొత్తాన్ని పుచ్చుకుంటే దానికి మహారాజు అంశగలవారిని గుర్తించే శక్తి ఉన్నట్టు; అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షింప బడగలరని గట్టిగా హెచ్చరిద్దాం,'' అన్నాడు. జమీందారు అందుకు అంగీకరించాడు.

జమీందారు సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యూడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కాని, కోతులాటను చూడ్డానికి జమీందారు రాకపోవడం తెలిసి నటేశం ఆశాభంగానికి లోనయ్యూడు. అయితే, తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులు పెద్ద మొత్తాలను బుల్లి కోతికిచ్చారు.
 
అయితే, కాలు మీద కాలు వేసుకుని పడుకుని పుచ్చుకోకుండా అలాగే చూస్తూన్న దాని దర్జాకు ముచ్చటపడి, ‘‘ఇది నిజంగా రాజుగారికోతే!'' అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం నుంచి గుబురు గడ్డం మీసాలుగల సామాన్యుడి వేషంలో వున్న జమీందారు ముందుకు వచ్చి అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల మీదికి విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చెంగున లేచి, ఆ చిల్లరను తీసి కళ్ళకద్దుకుని, మారువేషంలో వున్న జమీందారు వద్దకు వెళ్ళి రెండు కాళ్ళపై నిలబడి చేతులెత్తి మొక్కసాగింది.
 
ఆయన జమీందారని తెలియగానే ప్రజలు జేజేలు పలికారు. జమీందారు, ‘‘ఏనుగులూ, గుర్రాలూ మా మనసెరిగి ప్రవర్తిస్తాయన్నది మాకనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉన్నదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారికోతే! మూగజంతువులను ప్రేమిస్తూ, వాటి శక్తులను మనం ఉపయోగించుకోవాలన్నదే ఈ కోతిపిల్ల మనకిచ్చే సందేశం.
 
మూగప్రాణుల రక్షణకు నేనొక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజులా స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యం ఇస్తున్నాను,'' అన్నాడు. కోతులను పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించి, నటేశం నక్కవాని పాలెంలో జమీందారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులూ, పక్షులూ చేరడంతో రాజుగారికోతి తన తల్లికోతి, తండ్రికోతితో స్వేచ్ఛగా, హాయిగా జీవించసాగింది.

మీసాలయ్య-గుండయ్య


కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి, ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి, కొడుకులు. కొడుకును కమల రెండు మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్ళిలో చూసింది. అతను పెళ్ళికొడుకు స్నేహితుడు; పెళ్ళి జరిగినంతసేపూ చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, ‘‘వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట! తండ్రిని తీసుకుని వచ్చాడు.
 
కాని తండ్రి కనీసం పదివేలు కట్నం కావాలంటున్నాడు. మనం తూగలేం. వాళ్ళకు ఇంత ఫలహారం పెట్టి పంపించేద్దాం!'' అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా ఫలహారం తయూరుచేసి, వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్ళాడటానికి ఆమెకు ఇష్టంగానే ఉన్నది. కాని పదివేలు కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? రామయ్య వారితో తాను పదివేలు కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి, ఆ తండ్రీ కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు. కాని ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక, ‘‘వచ్చిన సంబంధం వదులుకోవడం అవివేకం అవుతుంది! ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్ళి చేస్తాను,'' అని కమలతో అన్నాడు.
 
‘‘మరి కట్నం మాటో?'' అన్నది కమల. ‘‘అదేదో నేను చూసుకుంటాలే! ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతున్నది!'' అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పనీ చేశాడు.

నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడమూ పదిహేను రోజుల్లో ముహూర్తం నిర్ణయించడమూ కూడా అయిపోయింది! కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నదీ కమలకు అంతుబట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్ళి అనగా పెళ్ళివారు తరలి వచ్చారు. కరణంగారి ఇల్లు పెళ్ళివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్ళి కూతురుగా ముస్తాబు చేస్తూండగా, ‘‘మా వాడి ఎన్నిక చూడాలి! పెళ్ళికూతురు ఏది?'' అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు.
 
అతనికి పొడవైన మీసాలూ, గిరజాల జుట్టూ ఉన్నది. ‘‘నా పేరు మీసాలయ్య. పెళ్ళికొడుక్కు తండ్రిలాటి వాణ్ణి!'' అన్నాడు మీసాలయ్య. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఆశీర్వాదం పొందింది. పెళ్ళివారి తాలూకు పెద్ద అని తెలియగానే, మీసాలయ్యకు ఫలహారం ఏర్పాటు చేసి, రామయ్య చాలా మర్యాదచేశాడు. మీసాలయ్య ఫలహారం ముగించి, తిన్నగా విడిదికి వెళ్ళి, ‘‘మా అమ్మాయి ఎన్నిక చూడాలి! పెళ్ళికొడుకు ఏడి? నా పేరు మీసాలయ్య. పెళ్ళికూతురు నాకు కూతురులాటిది!'' అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి రాజయ్యతో.
 
రాజయ్య మీసాలయ్యకు తన కొడుకు రవిని చూపించి, ‘‘మీ పెద్ద మామగారు!'' అంటూ రవికి పరిచయం చేశాడు. మీసాలయ్య రోజల్లా పెళ్ళివారింటికీ, విడిదికీ మధ్య తిరుగుతూ తగని హడావుడి చేశాడు. అతను ఎవరితరఫు మనిషి అయినదీ నిర్థారణ చేసుకున్నవారు లేరు. ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య, ‘‘బావగారూ, ఒకసారి మీరు ఇలా వస్తారా? మీతో కట్నం విషయం మాట్లాడాలి,'' అన్నాడు.
 
కట్నం అనగానే రాజయ్య ఠక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉన్నది. రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుపోయూడు. ‘‘మా తమ్ముడు కట్నం డబ్బు...!'' అని మాట పూర్తి చేయకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గుతెర వచ్చింది. అతను దగ్గుతూనే మంచినీళ్ళు కావాలని రాజయ్యకు సైగచేశాడు. రాజయ్య ఇవతలికి వచ్చి, చెంబుతో నీళ్ళు సేకరించి, మళ్ళీ గబగబా గదిలోకి వెళ్ళాడు.

మీసాలయ్య మంచినీళ్ళు తాగి, కొంచెం తేరుకుని, ‘‘కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగ మన్నాడు,'' అన్నాడు. ‘‘పట్టుకు రమ్మనండి,'' అన్నాడు రాజయ్య ఆత్రంగా. మీసాలయ్య అక్కడి నుంచి పెళ్ళివారింటికి వెళ్ళి, నలుగురి మధ్య ఉన్న రామయ్యను, ‘‘బావగారూ, ఇలా వస్తారా? ముఖ్యమైన విషయం!'' అని పక్కకు పిలిచాడు. రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు.
 
మరి కాస్సేపటికి రామయ్య, ‘‘మంచి నీళ్ళు! మంచి నీళ్ళు!'' అంటూ ఇవతలికి వచ్చి, ‘‘మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు,'' అని, మంచి నీళ్ళతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. మరి కాస్సేపటికి మీసాలయ్య అందరూ చూస్తుండగా గదిలోనుంచి వచ్చి, బయటికి వెళ్ళిపోయూడు. కొంత సేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రికేక పెట్టడం వినిపించి, అందరూ వెళ్ళారు.
 
రామయ్య పెట్టె ముందు కూర్చుని, పెట్టెలో ఉన్న గుడ్డలూ అవీ కంగారుగా ఇవతలికి లాగుతున్నాడు. ‘‘కట్నం డబ్బు కనబడదు! పదివేలు! వియ్యంకుడు ఇప్పుడే పంపమన్నాడట! మీసాలయ్య చెప్పి వెళ్ళాడు. మీసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవరూ రాలేదు. దగ్గు వంకన నన్ను బయటికి పంపి, డబ్బు కాజేశాడు! దొంగ! పట్టుకోండి! పట్టుకోండి!'' అంటూ రామయ్య కేకలు పెట్టాడు.
 
ఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు: ‘‘ఆ మీసాలయ్య ఎక్కడ? నా సొమ్ము అయిదువేలు కాజేశాడు! దగ్గు నటించి, నన్ను అవతలకు పంపించి, కొంపతీశాడు!'' ‘‘మీసాలయ్య నా పదివేలూ కాజేశాడు!'' అని రామయ్య అరిచాడు. ‘‘మీసాలయ్య నా అయిదువేలూ కాజేశాడు,'' అని రాజయ్య అరిచాడు. అప్పుడుగాని మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషీ కాడు! రవి తన తండ్రిని పక్కకు పిలిచి, ‘‘కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు! ఎంత రభస జరిగిందో చూడు.

నీకున్న డబ్బుయూవ గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి, అయిదువేలూ కాజేశాడు. ఇంకా నయం అడుగున ఉన్న పాతికవేలూ, నగలూ వాడి కంటపడలేదు. ఇప్పటికే మనం నవ్వులపాలు అయిపోయూం. కట్నం మాట ఎత్తకు!'' అన్నాడు. ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో, నలుగురూ రవిని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టేశారు.
 
పెళ్ళి అయిన మర్నాడు పెళ్ళివారు జట్కా బళ్ళమీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ‘‘ఆ మీసాలయ్య ఎంతపని చేశాడూ! మా నాన్న డబ్బేగాక, మామగారి డబ్బు కూడా పోవడం బాధగా ఉన్నది,'' అన్నది. రవి నవ్వి, ‘‘ఏ డబ్బూ పోలేదు. అదంతా నేనూ, మీ నాన్నా ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి, కట్నం లేనిదే పెళ్ళి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు, మా నాన్న బండివాడితో బేరమాడుతూండగా, మీ నాన్నను పక్కకు పిలిచి, ఈ ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతట ఒప్పుకోలేదనుకో! మీసాలయ్య నాకు తెలిసిన వాడే! అతను తన కూతురి పెళ్ళికోసం అప్పు అడిగితే మా నాన్న ఇవ్వలేదు.
 
నేను ముందే పెట్టెలో నుంచి అయిదువేలు తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను. మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగడానికే దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు. మీ నాన్న దగ్గిర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది? తన అయిదువేలూ పోవడంతో మా నాన్న, కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు,'' అన్నాడు. ‘‘మీరు ఎంత మంచివారు! కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కాని, పాపం, మీసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే!'' అన్నది కమల.
 
‘‘మీసాలయ్య వెర్రివాడు కాడు. అతని అసలు పేరు గుండయ్య. ఆ మీసాలూ, జులపాలూ పెట్టుడువి. ఎంత చెడ్డా నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు. తన కొడుక్కు ఉద్యోగం రాగానే అయిదువేలూ ఇచ్చేస్తాడు,'' అన్నాడు రవి.

స్నేహం!


చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, ‘‘కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోదలచలేదు,'' అన్నాడు ఆవేశంగా. ఆ మాట విన్న భూషయ్య, ‘‘ఇంతకూ ఏం జరిగింది? కావాలంటే ఇప్పుడే వెళదాం, రా.
 
నేనే అతనితో మాట్లాడుతాను,'' అన్నాడు సానుభూతిగా. ‘‘జరిగిన అవమానం చాలు. తిరగదోడి మళ్ళీ బాధ పడడం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను,'' అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయూడు భద్రయ్య. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో భూషయ్య ఊహించలేక పోయూడు. తన ఆప్తమిత్రుడికి ఇంత క్షోభ కలిగించిన కనకయ్యతో తనూ ఎలాంటి సంబంధాలూ పెట్టుకోకూడదనుకున్నాడు.
 
వారం రోజులు గడిచింది. ఆరోజు సాయంకాలం భూషయ్య కనకదుర్గ గుడికి వెళుతూండగా-భద్రయ్య, కనకయ్య గుడి నుంచి నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి నిర్ఘాంతపోయూడు. రాత్రి భోజనం ముగించి మౌనంగా పడుకోబోయిన భూషయ్యను భార్య, ‘‘ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు?'' అని అడిగింది.
 
భూషయ్య భద్రయ్య గురించి చెప్పాడు. అంతా విన్న అతని భార్య, ‘‘ఇందులో వింతేముంది! మనసెరిగిన స్నేహితుల మధ్య, అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య తలెత్తే కోపతాపాలు, పొరపొచ్చాలు పాలపొంగులాంటివే కదా. తొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచిదయింది,'' అన్నది నవ్వుతూ.         

తిరిగివచ్చిన బంతి


జాదవ్‌సింగ్‌ మహారాజుకు ఇద్దరు రాణులు. చిన్నరాణి అంటే రాజుకు అమిత ప్రేమ. కొన్నాళ్ళకు పెద్దరాణి గర్భవతి అయింది. దాంతో చిన్నరాణి చెప్పరాని అసూయకు లోనయింది. పెద్దరాణికి ఎలాగైనా సంతానం లేకుండా చేయూలని ఒక పరిచారికకు డబ్బు ఆశచూపి, కుట్రపన్నింది. ఆ పరిచారిక తల్లి కాబోయే పెద్దరాణి అభిమానాన్ని, నమ్మకాన్ని క్రమక్రమంగా ప్రయత్నించి సంపాదించింది.
 
నవమాసాలు నిండి, ప్రసవం సమీపిస్తున్న సమయంలో-తల్లి కళ్ళకు గంతలు కట్టుకోవడం ఆచారమనీ, అలా చేయడం సంతానానికి మేలు చేస్తుందనీ చెప్పి, ఆ పరిచారిక పెద్దరాణిని నమ్మేలా చేసింది. కొన్ని రోజులలో రాణి కవలలను ప్రసవించింది. వాటిలో ఒకటి ఆడ; మరొకటి మగ శిశువులు. వెంటనే పరిచారిక ఆ శిశువులను దొంగిలించి మరోచోటికి చేర్చింది. తల్లి పొత్తిళ్ళలో ఒక కొయ్యబొమ్మనూ, గడ్డి బొమ్మనూ పెట్టి రాణి వాటినే ప్రసవించినట్టు చెప్పి నమ్మించింది. రాణి దుఃఖానికి అవధుల్లేకుండా పోయూయి.
 
అయినా పెద్దరాణిపట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని రాజు దానిని అంతగా పట్టించుకోలేదు. చిన్నరాణి పట్టరాని ఆనందంతో పరిచారికకు ముత్యాలహారాన్ని బహూకరించింది.
 
శిశువుల్ని ప్రాణాలతో ఉంచవద్దని చెప్పి, మరిన్ని కానుకలు ఇచ్చింది. అయితే, అమాయకంగా కనిపించిన ఆ పసికందులను చంపడానికి పరిచారికకు చేతులు రాలేదు. పిల్లల్ని ఒక బుట్టలో పెట్టి పట్టువస్త్రాన్ని కప్పి, దాపుల ప్రవహించే నదిలో వదిలిపెట్టింది. అరణ్య ప్రాంతంలో ఆ నదిలో స్నానం చేస్తూన్న ఒక మునికి నీళ్ళపై బుట్ట తేలుతూ రావడం కనిపించింది.
 
ఆయన బుట్టను అందుకుని పైనున్న పట్టు వస్త్రాన్ని తొలగించి చూశాడు. అందమైన శిశువులను చూసి అమితానందం చెందాడు.

ఆయన ఆ పిల్లలను తన కుటీరానికి తీసుకువెళ్ళి భార్యకు చూపాడు. పిల్లలు లేని ఆమె ఒక్కసారిగా ఇద్దరు పిల్లల్ని చూడగానే హద్దులు లేని ఆనందం పొందింది. ఆమె ఆ అందమైన శిశువులను తన వెచ్చని చేతుల్లోకి సుతారంగా తీసుకుంటూ, ‘‘వీరు మనకు దేవుడు ప్రసాదించిన అద్భుతమైన కానుకలు!'' అన్నది. ఆ మునిదంపతులు పిల్లలను తన సొంత సంతానంగా భావించి అల్లారు ముద్దుగా పెంచసాగారు.
 
ఎవరైనా వచ్చి వీరు మా పిల్లలు అంటే ఏం చేయడం అనే అనుమానం మునికి అప్పుడప్పుడు వచ్చేది. అప్పుడు భార్య, ‘‘ఎందుకలా భయపడతారు? వీరు నదిలో కొట్టుకువచ్చారు. అంటే కన్నవాళ్ళు వద్దని వదిలిపెట్టిన వారే కదా! అలాంటి వారు మళ్ళీ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు? వీళ్ళు ఎప్పటికీ మన పిల్లలే,'' అంటూ భర్తకు ధైర్యం చెప్పేది.
 
పిల్లలకు మధు, శైలజ అని నామకరణం చేసి; వచ్చీ రాని మాటలతో వాళ్ళు తమను ‘అమ్మా!' ‘నాన్నా!' అని ముద్దు ముద్దుగా పిలుస్తూంటే ఎంతగానో సంతోషించేవారు మునిదంపతులు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయూయి. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పసాగారు. ఒకనాటి రాత్రి మామూలుగానే పడుకున్న ముని తెల్లవారినా పడక నుంచి లేవలేక పోయూడు. ఆయన భార్యాపిల్లలను దగ్గరికి పిలిచి, ‘‘నాకు ఇహలోక యూత్ర చాలించే తుది ఘడియలు సమీపించాయి.
 
అంతిమ శ్వాస విడిచేలోగా నేను మీకేం ఇవ్వగలను?'' అన్నాడు గంభీరంగా. మధు, శైలజ ముని పడకను సమీపించి ఆయన చేతులను తమ చేతుల్లోకి తీసుకుని, ‘‘నాన్నా, మీరు మమ్మల్నెంతో ప్రేమాదరాలతో, ఆప్యాయంగా చూసుకున్నారు. అంతకన్నా మాకు కావలసినదేమున్నది?'' అన్నారు సజల నయనాలతో. ముని మౌనంగా తల పంకించి భార్యను తన కొయ్య పెట్టెలో భద్ర పరచిన రజాయ్‌ (బొంత)నీ, బంతినీ తీసుకురమ్మని చెప్పాడు.
 
ఆమె తెచ్చాక వాటిని మధుచేతికిచ్చి, ‘‘వాటికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. ఆ బొంతను మీరు ఒకసారి ఊపినట్టయితే వెండి నాణాలు రాలుతాయి. రెండవసారి ఆడిస్తే బంగారు నాణాలు రాలుతాయి. మీరు ఈ బంతిని విసిరినట్టయితే, మీ శత్రువు ఎక్కడవున్నా వారికి తగిలి గాయపరచి, మీ వద్దకు తిరిగివస్తుంది. వాటిని తెలివిగా ఉపయోగించుకోండి.

అయితే, ఒక విషయం ఎన్నటికీ మరిచిపోకూడదు,'' అని ఆగాడు. ‘‘ఏమిటి నాన్నా?'' అని అడిగారు అన్నాచెల్లెళ్ళు ఒక్కసారిగా. ముని లేచి తన పడక మీద కూర్చుంటూ, ‘‘మన కుటీరానికి ఉత్తరంగా ప్రవహిస్తూన్న నది మీకు తెలుసుకదా. అది పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తోంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తే, ఎన్నటికీ పడమటి దిక్కు కేసి మాత్రం వెళ్ళకండి,'' అన్నాడు. పిల్లలు, ‘‘అలాగే నాన్నా!'' అని చెబుతూండగా ముని మందహాసంతో కన్నుమూశాడు.
 
భర్తపోయినప్పటి నుంచే తీవ్ర అస్వస్థతకులోనైన మునిపత్ని ఒకనాడు పిల్లల్ని చేరబిలిచి, వాళ్ళు పసిబిడ్డలుగా తన భర్తకు నదిలో తేలుతూ వస్తూ దొరికిన విషయం చెప్పి, అందుకే అక్కడ ప్రమాదం శంకించి వాళ్ళను పడమర దిశగా వెళ్ళవద్దని ఆయన హెచ్చరించాడని గుర్తుచేసింది. ఆ తరవాత గాఢంగా ఊపిరి పీలుస్తూ, ‘‘మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను,'' అన్నది. ‘‘మమ్మల్ని ఎంతో ఆప్యాయంతో పెంచారు.
 
మీ అనురాగమే మాకు చాలు. అంతకు మించి ఏదీ వద్దు,'' అన్నారు పిల్లలు. అయినా మునిపత్ని ఒక పాత్రను శైలజ చేతికిచ్చి, ‘‘నువ్వు కోరిన ఆహారం ఈ పాత్ర ఇస్తుంది తల్లీ. నీ జీవితంలో ఆకలి బాధ అంటూ ఎన్నటికీ ఉండదు,'' అని ఆశీర్వదించింది. ఆ తరవాత ఆమె ఒక జత కొయ్యపాదుకలను తీసి మధుకు ఇచ్చి, ‘‘నాన్నా, నువ్వు వీటిని తొడుక్కుని, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే, మరుక్షణమే అక్కడికి చేరుకోగలవు.
 
అలా వెళ్ళేప్పుడు నువ్వు నీ సోదరిని కూడా ఎలాంటి బరువు లేకుండా తీసుకువెళ్ళవచ్చు,'' అని చెప్పింది. కొన్ని క్షణాల్లోనే ఆమె అంతిమశ్వాస విడిచింది. మధు తండ్రికి చేసినట్టే తల్లికి కూడా అంత్యక్రియలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. ఆ తరవాత కొన్ని రోజులు ఆలోచిస్తూ గడిపిన మధు ఒకనాడు చెల్లెల్ని పిలిచి, ‘‘మనం ఈ మునివాటికలో ఎన్నాళ్ళని ఉంటాం? ధైర్యం చేసి పశ్చిమ దిశగా వెళితే, మన అసలు తల్లితండ్రులు కనిపించినా కనిపించవచ్చుకదా!'' అన్నాడు.
 
‘‘నిజమే మనం ఇక్కడే ఉండి సాధించేదేమీ లేదు కదా? ధైర్యంతో పశ్చిమ దిశగా వెళదాం,'' అన్నది శైలజ.

మధు బొంతను అటూ ఇటూ రెండుసార్లు ఊపాడు. అందులో నుంచి వెండి, బంగారు నాణాలు రాలాయి. ఆ నాణాలనూ, బంతినీ మునిపత్ని ఇచ్చిన పాత్రలో వేసి భద్రపరుచుకున్నారు. మధు కొయ్యపాదుకలను తొడుక్కున్నాడు. అవి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడు చెల్లెల్ని పట్టుకుని, పశ్చిమ దిశగా వెళ్ళాలి అనగానే, చెప్పులు అన్నాచెల్లెళ్ళతో పైకి లేచి ఆకాశంలో అటుకేసి ఎగరసాగాయి.
 
వాళ్ళొక నగరాన్ని చేరగానే మధు కిందికి దిగాలనుకుని పాదుకలను ఒకటిగా చేర్చి బొటనవేళ్ళతో మెల్లగా నొక్కాడు. వాళ్ళిద్దరూ భూమి మీద ఒక విశాలమైన ఇంటి ముందు దిగారు. ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపించడంతో, ప్రస్తుతానికి దాన్నే తమ నివాసంగా చేసుకోవాలనుకున్నారు. మరునాడు శైలజ పాత్ర నుంచి కావలసిన ఆహారం తెప్పించింది. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. మధు బంతి తీసుకుని ఆడుకోసాగాడు.
 
ఉన్నట్టుండి అతడు, ‘‘నన్నూ, మా చెల్లెనూ మా అమ్మ నుంచి వేరు చేసిన వారు ఈ ప్రాంతంలో ఉంటే ఈ బంతి వారికి పోయి తగలాలి,'' అంటూ బంతిని విసిరాడు. బంతి వెళ్ళి కొంత సేపటికి అతని వద్దకు తిరిగి వచ్చింది. అది ఎవరికి పోయి తగిలి ఉంటుందా అని మధు ఆలోచించసాగాడు. మరునాడు కూడా అలాగే చేశాడు. అప్పుడు కూడా అది వెళ్ళి కొంతసేపయ్యూక అతని చేతిలోకి తిరిగి వచ్చింది.
 
చిన్నరాణి పరిచారికలతో రాజోద్యానంలో తిరుగుతూండగా హఠాత్తుగా బంతి వచ్చి ఆమె నుదుటికి ఠఫీమని తగిలి తిరిగి వెళ్ళడం చూసి, ఆమెతో సహా పరిచారికలు దిగ్భ్రాంతి చెందారు. దరిదాపుల్లో మనుషుల జాడ కనిపించలేదు. బంతి తగిలిన చోటు ఉబ్బెత్తుగా వాచిపోయి నొప్పి పెట్టసాగింది. పరిచారికలు వెళ్ళి రాజుకు విషయం చెప్పారు. అక్కడికి హుటాహుటిగా వచ్చి భార్యను పరామర్శించిన రాజు ఆమెను కొన్ని రోజుల పాటు ఉద్యానవనంలోకి వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు.
 
మరునాడు నుదుటిపై బొప్పికట్టిన నొప్పి కొద్దిగా తగ్గింది. ఆమె భవన మంటపంలో కూర్చుని ఉండగా బంతివచ్చి మళ్ళీ ఠఫీమని తగిలి వెళ్ళిపోవడం చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఇప్పుడు నుదుటి రెండోవైపున దెబ్బతగిలింది. నొప్పి మరీ ఎక్కువయింది. విషయం తెలియగానే రాజు మళ్ళీ హడావుడిగా వచ్చాడు.

భార్య పడుతున్న బాధను ూసి భరించలేక ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయించాడు. సేనాధిపతిని పిలిచి, జరిగిన విషయం చెప్పి, చుట్టుపక్కల బంతి ఆట ఆడుతూన్న వారందరినీ పట్టి దోషిని శిక్షించమని ఆజ్ఞాపించాడు.సైనికులు ఆ పరిసరాలలో బంతి ఆట ఆడుతూన్న వారికోసం వెదకసాగారు. భవన పరిసరాలలో బంతి అన్నది కనిపించలేదు. నగరం పొలిమేరలో ఒక ఇంటి ముందు మధు బంతి ఆట ఆడుతూ కనిపించాడు.
 
భటులు అతన్ని సమీపించి, ‘‘నిన్న నువ్వు బంతిని రాజోద్యానం కేసి విసిరావా?'' అని అడిగాడు. ‘‘నాకు రాజోద్యానం ఎక్కడున్నదో కూడా తెలియదు. నేను అందులోకి బంతిని ఎలా విసరగలను?'' అన్నాడు మధు. ‘‘సరే, ఇక్కడి నుంచి మరెక్కడికీ వెళ్ళ వద్దు. రాజభవనం కేసిగాని, రాజభవనం దరిదాపులకు గాని వెళ్ళవద్దు,'' అని హెచ్చరించి వెళ్ళారు భటులు.
 
వాళ్ళ మాటలు విని ఆలోచనలోపడ్డ మధు ఇంట్లోకి వెళ్ళి, ‘‘ఈ బంతి రాజభవనంలోని ఎవరికో తగులుతున్నది. అది ఎవరై ఉంటారో తెలియడం లేదు,'' అన్నాడు చెల్లెలితో. ‘‘కొన్ని రోజులు ఇక్కడే వేచి ఉండి ఏం జరుగుతుందో చూద్దాం,'' అన్నది శైలజ. మరునాడు, గుర్రం డెక్కల చప్పుడు వినిపించడంతో అన్నాచెల్లెళ్ళు ఇంటి నుంచి వెలుపలికి వచ్చి చూశారు. వాళ్ళను చూడగానే గుర్రం మీది భటుడు, ‘‘ప్రభూ! ఈ పసివాడే నిన్న బంతి ఆట ఆడుతూ కనిపించాడు.
 
మరెక్కడా బంతి ఆట ఆడేవాళ్ళు కనిపించలేదు,'' అన్నాడు. రాజు గుర్రం పైనుంచి కిందికి దిగి పిల్లల కేసి నడిచాడు. వాళ్ళను చూడగానే నివ్వెరపోయూడు. ఆ పసివాడిలో తన పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. అమ్మాయిలో తన పెద్దరాణి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజుకు కొంతసేపు నోట మాట రాలేదు. ఆ తరవాత తేరుకుని, ‘‘మీరిద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారా?'' అని అడిగాడు. ‘‘అవును, ప్రభూ! అరణ్య ప్రాంతంలోని మా తల్లితండ్రులు మరణించడంతో మేము ఇక్కడికి వచ్చేశాము,'' అన్నాడు మధు.

‘‘మేము శిశువులుగా ఉన్నప్పుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ వచ్చి ముని దంపతులకు దొరికామట. వాళ్ళే మమ్మల్ని పెంచారు. వాళ్ళు ఇప్పుడు మరణించారు. మా అసలు తల్లితండ్రులు ఎవరో మాకు తెలియదు,'' అన్నది శైలజ. రాజు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యూడు. ‘‘వారెవరో నాకు తెలుసు. నా భవనానికి వచ్చారంటే చూపెడతాను. నేను వెళ్ళి రథం పంపిస్తాను.
 
 భటులు నీవెంట ఉండగలరు,'' అని చెప్పి రాజు గుర్రంఎక్కి వెళ్ళిపోయూడు. రథం వచ్చేలోగా అన్నాచెల్లెళ్ళు బయలుదేరడానికి సిద్ధమయ్యూరు. ‘‘పాత్రనూ, నాణాలనూ వదల వద్దు సుమా. ఎప్పుడు ఏమవుతుందో మనకేం తెలుసు,'' అన్నాడు మధు చెల్లెలితో తను బొంతనూ, ఎగిరే పాదుకలనూ తీసి భద్రపరుచుకుంటూ. అన్నాచెల్లెళ్ళు రథమెక్కారు. రథం కదిలింది. వారి వెనక భటులు గుర్రాలపై బయలుదేరారు.
 
రాజభవనం ముంగిట మధు, శైలజ రథంలో నుంచి దిగగానే రాజు ఎదురు వెళ్ళి వాళ్ళను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ‘‘అదిగో మీ తల్లి,'' అంటూ పెద్దరాణిని చూపాడు. పెద్దరాణి సజల నయనాలతో పిల్లలను కౌగిలించుకున్నది. ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. తల్లి వెనకే నిలబడివున్న స్ర్తీ నుదుటి మీద రెండు బొడిపెలు ఉన్న విషయం అన్నాచెల్లెళ్ళు గమనించి ఒకరినొకరు చూసుకున్నారు. తమ ‘శత్రువు' ఎవరో గ్రహించారు.
 
అయినా, ఆ రహస్యాన్ని తమలోనే దాచుకోవాలని ఇద్దరూ చూపులతోనే నిర్ణయించుకున్నారు. రాజదంపతులు కూడా తమ మనసుల్లోని అనుమానాలను బయట పెట్టకూడదనే భావించారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై హెచ్చరికతో ఉంటే చాలనుకున్నారు. కవలలను కొత్తగా కనుగొనబడ్డ యువరాజు, యువరాణులుగా చూసుకున్నారు.

పాప్తం


భానుచంద్రుడి గురుకులంలో విజయదశమినాడు నూతన విద్యార్థులను చేర్చు కోవడంతో పాటు, ఎక్కడెక్కడి నుంచో పూర్వ విద్యార్థులు వచ్చి, విద్యాజ్యోతిని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళడం సంప్రదాయం. ఒకనాడు అలా వచ్చిన వారిలో కొందరు ఎంతో ఉత్సాహంగానూ, మరికొందరు నిరుత్సాహంగానూ ఉండడం గమనించిన గురువు, ‘‘జీవితం అన్నది ఒక విజయూనికీ, మరో విజయూనికీ మధ్య ప్రయూణం. అవకాశాలు సోపానాల్లాంటివి.
 
అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని సద్వినియోగ పరచుకోవడం అందరివల్లా సాధ్యంకాదు. అలా వినియోగించుకోక పోవడానికి వారి వారి మనోభావాలే కారణం. దీనినే మన పెద్దలు ప్రారబ్ధం, ప్రాప్తం అన్నారు. అవసరాలకు అనుగుణంగా మన మనోభావాలను మార్చుకోగలిగితే మాత్రం అభ్యుదయం, ఆనందం కరతలామలకాలే. ఏ రంగంలో వున్నా, ఏ వృత్తిని చేపట్టినా విజయం తప్పక సిద్ధిస్తుంది.
 
ఈ విషయం తేటతెల్లం కావడానికి ఒక చిన్న కథ చెబుతాను, వినండి, అంటూ ఇలా చెప్పసాగాడు: కృష్ణపట్నానికి చెందిన భక్తులు కొందరికి హంసలదీవికి ఆవలనున్న పగడాలదీవి లోని పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలాకాలం కోరికగా ఉండేది. ఒకనాడు వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలు సిద్ధంచేసుకుని పడవలో బయలుదేరారు.ఆ రోజంతా ప్రయూణం సాఫీగానే సాగింది. సూర్యుడు అస్తమిస్తూండగా, హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై గాలివాన ఆరంభమయింది.

అర్ధరాత్రి దాటే సరికి అది తుఫా ుగా మారడంతో భక్తుల హాహాకారాల మధ్య పడవ తల్లకిందులయింది. ఆ పడవలోని ముగ్గురు మాత్రం తెల్లవారుతూండగా సముద్ర మధ్యంలోవున్న ఒకానొక దీవి ఒడ్డున ప్రాణాలతో బయటపడ్డారు. పూజారి నారాయణ, చిల్లర వ్యాపారి భూషయ్య, బిచ్చగాడు రమణయ్య అనే ఆ ముగ్గురికి బతికి ఉన్నందుకు ఆనందం కలిగిందిగాని, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఏం చెయ్యూలో, ఎలా ఉండాలో తెలియలేదు.
 
దీవిలో కొబ్బరి, ఖర్జూర చెట్లు, ఎరట్రి రామాఫలాలు పుష్కలంగా దొరకడంతో కొద్ది రోజుల పాటు ఆకలి బాధ తీర్చుకోవచ్చునని అనుకున్నారు. ‘‘తిండి సంగతి సరే. ఉండేందుకు గూడు, కట్టేందుకు గుడ్డ లేకపోతే ఎలా? జగన్మాత దర్శనానికి వచ్చిన మన గతి ఇలా అయిపోయిందే. మన ఆచూకీ కూడా మనవాళ్ళకు తెలిసే అవకాశం లేదు కదా! మానవ మాత్రులం. మనం ఏం చేయగలం? ఆ జగదంబ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది,'' అన్నాడు నారాయణ నిట్టూరుస్తూ.
 
‘‘ఇన్ని కొబ్బరికాయలు, ఖర్జూర కాయలు వృథాగా పండి ఎండి పోతున్నవి. వీటితో వ్యాపారం చేస్తే లక్షలు ఆర్జించవచ్చు. కానీ కొనే నాధుడేడీ? సముద్రం మీద నావలు కనిపిస్తాయేమో మీరూ గమనిస్తూండండి,'' అన్నాడు భూషయ్య ఆశగా. ‘‘కావలసినంత తిండి దొరుకుతోంది. తోటివాళ్ళతో గొడవలు పడకుండా కడుపునిండా తిని, ఒళ్ళు అలవకుండా విశ్రాంతి తీసుకోక ఎందుకీ ఆలోచనలు?'' అన్నాడు రమణయ్య తేలిగ్గా. రోజులు గడుస్తున్న కొద్దీ భూషయ్యకూ, నారాయణకూ ఇంటిబెంగ పట్టుకున్నది.
 
ఒకనాడు తీరం వెంబడి తిరుగుతున్న నారాయణకు సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన ఒక శిలలో దేవతారూపం కనిపించింది. దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి, దీవి మధ్యలో వున్న గుట్ట మీద ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టాడు. తనకు వచ్చిన స్తోత్రాలూ, శ్లోకాలూ వల్లిస్తూ ఒంటరిగా ఉన్నానన్న భావనను దూరం చేసుకోసాగాడు. భూషయ్య ధ్యాసంతా వ్యాపారం మీదే ఉన్నప్పటికీ, విగ్రహానికి రోజుకోసారి భక్తితో దణ్ణం పెట్టుకునేవాడు.

‘‘ఇదే విగ్రహం మన ఊరిగుళ్ళో ఉంటే, వచ్చే పోయే భక్తులు వేసే నాణాలతో నా బతుకు వెళ్ళిపోయేది. ఇక్కడ దేవతకే దిక్కులేదు. నాకెవరు బిచ్చం వేస్తారు?'' అనుకునే వాడు రమణయ్య విరక్తిగా. అయితే, నిజంగానే దివ్యత్వం గల ఆ విగ్రహానికి వీరి ముగ్గురిపైనా జాలికలిగింది. ఒకనాటి రాత్రి దేవత నారాయణ కలలో కనిపించి, ‘‘నువ్వు పూజించే దేవతను నేనే. త్వరలో మీ ముగ్గురికీ ఈ ఒంటరి జీవితం ముగిసి పోయేలా చేస్తాను.
 
నాకు ఇదే చోట పూజలు ఆగకుండా గుడి కట్టిస్తావా?'' అని అడిగింది. ‘‘ఎంత మాట తల్లీ! నా జన్మాంతం నీకు సేవచేస్తాను. నా కుటుంబంతో నన్ను కలుపు,'' అన్నాడు నారాయణ భక్తిగా. ‘‘అయితే రేపు తెల్లవారుతూనే జాలర్లు కొందరు ఈ దీవికి వస్తారు. వాళ్ళ ద్వారా మీ సమాచారాన్ని మీ కుటుంబాలకు పంపండి. వారం తరవాత మళ్ళీ మీకు దర్శనమిస్తాను,'' అంటూ అంతర్థాన మయింది దేవత.
 
నారాయణ మాటలను భూషయ్య, రమణయ్య నమ్మలేదు. కానీ, మరునాడు మిట్ట మధ్యాహ్న సమయంలో దూరాన ఉన్న జాలరి గూడానికి చెందిన జాలర్లు కొందరు దారితప్పి పడవలతో సహా ఈ దీవికి రావడంతో, నారాయణ కల నిజమయిందని నమ్మక తప్పలేదు. జాలర్లు వీరి ముగ్గురినీ అక్కడ చూసి ఆశ్చర్యపోయూరు. గుట్ట మీది దేవతకు మొక్కుకుని, తిరిగి తమ గూడానికి చేరి, కృష్ణపట్నానికి వాళ్ళ ముగ్గురి గురించి సమాచారం అందించారు.

నారాయణ, భూషయ్య భార్యాపిల్లలు, బంధువులు, రమణయ్య తోటిబిచ్చగాళ్ళు బిలబిలా దీవికి చేరారు. పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు మొదలయ్యూయి. అన్నట్టుగానే ఏడో రోజున అమ్మవారు ముగ్గురికీ కలలో కనిపించి, ‘‘మీ భక్తికి సంతోషం. మనిషికొక వరం ఇస్తాను. కోరుకోండి,'' అన్నది. ‘‘ఎప్పుడూ నీ సేవచేసుకుంటూ జీవించేట్టు వరమివ్వు, తల్లీ,'' అన్నాడు నారాయణ.
 
‘‘నిన్ను నమ్ముకున్న వాణ్ణి, నాకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగి గొప్ప ధనవంతుణ్ణయి, భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కృష్ణపట్నంలో నీకు వేరొక దేవాలయం కట్టేలా ఆశీర్వదించు,'' అన్నాడు భూషయ్య. ‘‘తల్లీ! నాకో వెండి భిక్షాపాత్ర ప్రసాదించమ్మా! నీ పేరు చెప్పుకుని బిచ్చమెత్తుకుంటాను,'' అన్నాడు రమణయ్య. ‘‘తథాస్తు!'' అని దీవించింది దేవత. భక్తులు వచ్చిన రోజున, తనకు దక్షిణ ఇచ్చిన రోజున మాత్రమే కడుపునిండా తింటూ, లేని రోజున పస్తులుంటూ, సదాసర్వవేళలా అంబను ధ్యానిస్తూ తృప్తిగా జీవించాడు నారాయణ. దీవిలోని కొబ్బరి, ఖర్జూర కాయలతో ఎగుమతి వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే లక్షలకు లక్షలు గడించాడు భూషయ్య.
 
‘‘వెండి బొచ్చెతో బిచ్చం ఎత్తుకునే వాడివి, నీది ఒళ్ళు బద్ధకం తప్ప పేదరికం, నిస్సహాయత కాదు,'' అంటూ అక్కడికి వచ్చేవారెవ్వరూ దమ్మిడీ వేయక పోవడంతో మరో చోటు వెతుక్కున్నాడు రమణయ్య.
 
ఈ కథ విన్న శిష్యులు గలగలా నవ్వారు. అప్పుడు గురువు, ‘‘చూశారా, ముగ్గురూ వైభవాన్ని అడిగివుంటే దేవత తప్పక ఇచ్చి ఉండేది. కాని ఎవరి ప్రాప్తాలను బట్టి వారి బుద్ధులు పనిచేశాయి. వాటిని బట్టి జీవితాలు మారాయి. కాబట్టి జీవితాలు మారాలంటే మొదట మన బుద్ధులు మారాలి. అప్పుడే ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలం,'' అన్నాడు.

ఫలదానంతో ప్రాణరక్షణ!


ఢిల్లీ దర్బారులో కొలువుతీరిన ఔరంగజేబు, సింహాసనం నుంచి లేచి అసహనంగా, పట్టరాని ఆవేశంతో అటూ ఇటూ తిరగసాగాడు. బాజీ ప్రభు, మరికొందరి అనుచరుల సాయంతో, శివాజీ పన్హాలా నుంచి తప్పించుకున్నాడు. ఆ తరవాత ఆయన మళ్ళీ మొగలులపై దాడులు ప్రారంభించాడు. దక్షిణాదిలో గోవా వరకు వశపరచుకుని, తీరంలోని శత్రు స్థావరాలను చిన్నాభిన్నం చేస్తూ అహమ్మదాబాదుకేసి సేనలను నడిపిస్తున్నాడు.
 
ఔరంగజేబు అసహనానికి, అశాంతికి, పట్టరాని ఆవేశానికి అదే కారణం. శివాజీ దుందుడుకు చర్యలను అరికట్టి, అతన్ని ఎలాగైనా అణచివేయూలి అని ఔరంగజేబు పదేపదే పలవరించసాగాడు. మొగల్‌ చక్రవర్తికి ఆ సమయంలో శివాజీ బాల్యంలో జరిగిన ఒక సంఘటన గుర్తురావడంతో మరింత అసహనానికి లోనయ్యూడు. పన్నెండేళ్ళ వయసులో శివాజీ తండ్రి షాజీ వెంట బిజాపూర్‌ సుల్తాను వద్దకు వెళ్ళాడు.
 
సభలో ప్రవేశించగానే షాజీ వంగి మూడు సార్లు నేలనుతాకి సుల్తానుకు నమస్కరించాడు. ఆ తరవాత శివాజీని కూడా అలాగే సుల్తానుకు నమస్కరించమన్నాడు. అయితే, శివాజీ నాలు గడుగులు వెనక్కు వేసి తలెత్తి చూశాడు. పరాయి పాలకుడికి తలవంచనన్న ధీమా అతడి చూపుల్లో కనిపించింది. సుల్తాను సభలో అంతకు ముందెవరూ అలా ప్రవర్తించింది లేదు. సుల్తానుతో సహా సభికులందరూ అమితాశ్చర్యంతో చూస్తూండగా బాల శివాజీ సభనుంచి వెలుపలికి నడిచాడు.
 
కొడుకు ప్రవర్తనకు షాజీ లోలోపల ఎంతగానో మురిసిపోయూడు. వ్యాధిగ్రస్తుడైన తండ్రిని గృహ నిర్బంధంలో ఉంచి ఔరంగజేబు 1658లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సాధుస్వభావుడూ, పండితుడూ అయిన సోదరుడు దారాసుఖోతో సహా ముగ్గురు అన్నదమ్ములను హతమార్చాడు. ఎదురు తిరగగలరన్న అనుమానంతో కన్న బిడ్డలనే కారాగారంలో బంధించిన పరమ క్రూరుడు ఔరంగజేబు.

కొండలతో నిండిన దక్కను ప్రాంతంలో శివాజీ అనుసరించే గెరిల్లా యుద్ధ విధానం ఔరంగజేబును కలవరపెట్టింది. మరాఠా నాయకుణ్ణి అణచడానికి 1660లో విశ్వాస పాత్రుడైన తన మేనమామ షయిస్తఖాన్‌ను సేనలతో పంపాడు. అయితే, షయిస్తఖాన్‌కు అది అంత సులభంగా తోచలేదు. తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోలేక వందలాది మంది సైనికులు చనిపోయూరు. ఎలాగో పూనాను ఆక్రమించి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు షయిస్తఖాన్‌. మరో మూడేళ్ళలో తనవశంలో ఉన్న అనేక ప్రాంతాలను శివాజీ కోల్పోవలసి వచ్చింది.
 
అయినా ఎదురు దాడికి సరైన సమయం కోసం ఎదురుచూడ సాగాడు. పూనా నగర వీధిలో ఒకనాటి రాత్రి వెళుతూన్న పెళ్ళి ఊరేగింపులో శివాజీ తన అనుచరులతో కలిసి వెళ్ళాడు. పెళ్ళి ఊరేగింపు షయిస్తఖాన్‌ బసచేసివున్న భవనం గుండా వెళుతూండగా, శివాజీ రహస్యంగా భవనంలో ప్రవేశించాడు. సాహసవీరులైన అనుచరులతో వీరశివాజీ హఠాత్తుగా తన శయనమందిరంలో ప్రత్యక్షం కావడంతో షయిస్తఖాన్‌ ఇది కలా, నిజమా అని దిగ్భ్రాంతి చెందాడు. భయంతో ఏం చేయడానికీ తోచక గడగడ వణికిపోయూడు.
 
ఉన్నట్టుండి కిటికీగుండా వెలుపలికి దూకి ప్రాణాలతో పారిపోయూడుగాని, శివాజీ కత్తి వేటుకు బొటన వేలును కోల్పోయూడు. ఆ మెరుపు దాడిలో షయిస్తఖాన్‌ కొడుకు, మరి కొందరు సైనికులు మరణించారు. మొగలు సేనలు మేలుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగా శివాజీ అక్కడి నుంచి సురక్షితమైన తన స్థావరానికి చేరుకున్నాడు.
 
ఇరవై వేలమంది సైనికులతో అభేద్యమైన రక్షణా వలయంలో ఉన్న మొగలు సేనాధిపతి మీదికి వ్యూహాత్మకంగా దాడి చేసిన శివాజీ అద్భుతమైన శక్తియుక్తులను దేశప్రజలు ఆశ్చర్యానందాలతో కథలు కథలుగా చెప్పుకోసాగారు. బొటన వేలిని పోగొట్టుకుని ఢిల్లీకి తిరిగివచ్చిన షయిస్తఖాన్‌ను చూసి ఔరంగజేబు ఆగ్రహం చెందాడు. మరింత అసహనానికి లోనయ్యూడు. 1664లో శివాజీ సిరిసంపదలకు పేరుగాంచిన సూరత్‌లోని కొన్ని మొగల్‌ స్థావరాలను దోచుకున్నాడు.

దాంతో అమితాగ్రహం చెందిన ఔరంగజేబు సాహస యోధుడూ, రాజనీతికోవిదుడూ అయిన రాజపుత్ర వీరుడు రాజా జైసింగ్‌ను సేనలతో దక్కను నాయకుడు శివా జీని అణచడానికి పంపాడు. అసంఖ్యాకమైన సేనలతో బయలుదేరిన రాజా జైసింగ్‌ పురందర్‌ను ముట్టడించి దానితో పాటు క్రమక్రమంగా మరో ఇరవై కోటలను వశపరచుకున్నాడు.
 
అమితమైన సైనికబలంతో, వ్యూహాత్మకంగా దూసుకువస్తూన్న జైసింగ్‌ను నిలువరించడం అసాధ్యం అని గ్రహించిన శివాజీ అతడితో సంధి ఒడంబడికకు సంసిద్ధుడయ్యూడు. రాజా జైసింగ్‌ అభ్యర్థనమేరకు సంధి చర్చలు జరపడానికి ఔరంగజేబు సభకు వెళ్ళడానికి శివాజీ సమ్మతించాడు. ఔరంగజేబు శివాజీని దక్కను వైస్రాయిగా చేయగలడన్న ఊహాగానాలు కూడా వచ్చాయి.
 
అయినా, పరమక్రూరుడైన ఔరంగజేబు సభకు వెళ్ళడం రాక్షసుడి కోరల్లోకి జొరబడడమేనని శివాజీ మిత్రులు భావించి వారించారు. అయినా, శివాజీకి ఎలాంటి ఆపదారాకుండా చూసుకోవడం తన బాధ్యత అని రాజా జైసింగ్‌ వారికి హామీ ఇచ్చాడు. శివాజీ తన చిన్న కొడుకు శంభూజీతో కలిసి మొగలుల సభకు వెళ్ళాడు. ఆరోజు ఔరంగజేబు జన్మదినం గనక, ఆగ్రా కోటలోని దర్బారు చాలా చక్కగా అలంకరించబడి ఉన్నది.
 
‘‘రాజా, శివాజీకి స్వాగతం!'' అంటూ హేళనగా పలకరించిన ఔరంగజేబు తన భటులకు సైగ చేశాడు. భటులు ఆయన్ను సాధారణ పౌరులు కూర్చునే చోటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఆ తరవాత ఆయన్నెవరూ పట్టించుకోలేదు. దానిని తీవ్రమైన అవమానంగా భావించిన శివాజీ, ఆగ్రహంతో లేచి ఇచ్చిన మాట నిలుపుకోలేదని నిందిస్తూ, కొడుకుతో సహా సభనుంచి వెలుపలికి నడవసాగాడు. ఆయన్ను దోషిగా ప్రకటించి, ఖైదు చేయమని ఆజ్ఞాపించాడు ఔరంగజేబు. తండ్రీ కొడుకులు ఒక ఇంట్లో బందీలయ్యూరు.
 
అలాగే మూడు నెలలు గడిచిపోయూయి. శివాజీ తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు ఒక రోజు తెలియజేయబడింది. ఇంటి నుంచి రోజూ, గంపల నిండుగా ఫలపుష్పాలూ, ఫలహారాలూ పేదలకు, సాధుసన్యాసులకు పంపడానికి అనుమతించాలనీ, వారి ప్రార్థనలతో తన ఆరోగ్యం బాగుపడగలదనీ శివాజీ కోరాడు. ఔరంగజేబు ఆయన కోరికను మన్నించాడు. రోజూ ఇద్దరు మనుషులు కావడి బద్దకు రెండు వైపులా రెండు బుట్టలను తగిలించుకుని అందులో పువ్వులు, పళ్ళు, ఫలహారాలు వెలుపలికి తీసుకువెళ్ళేవారు.

మొదట ఒకటి రెండు రోజులు భటులు బుట్టలో ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి బయటికి పంపేవారు. కాని రోజులు గడిచేకొద్దీ అంత జాగ్రత్తగా చూడడం మానేశారు. ఒకనాడు మధ్యాహ్నం శివాజీ ఆరోగ్యం ఆందో ళనకరంగా ఉన్నదనీ, ఎవరూ లోపలికి రాకూడదనీ తెలియజేయబడింది. సాయంకాలం మొగలు సైనికులు కిటికీగుండా తొంగిచూశారు.
 
శివాజీ ఒళ్ళంతా దుప్పటితో కప్పబడి పడుకుని ఉన్నాడు. కుడి చేయి మాత్రం బయటకు కనిపిస్తున్నది. సైనికులు తృప్తిగా వెనుదిరిగారు. పొద్దుగూకుతూండగా పనిమనిషి వెంట ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్దమనిషి, ‘‘ఇప్పుడే ఆయనకు నిద్ర పట్టింది. శబ్దం చేయకండి,'' అని చెప్పి వెళ్ళిపోయూడు. అంతకు ముందే, రోజూ బుట్టలతో ఫలాలను మోసుకువెళ్ళే మనుషులు రెండు కావళ్ళతో ఇంటి నుంచి వెలుపలికివెళ్ళారు. వాటిలో ఒక బుట్టలో శివాజీ, మరొక బుట్టలో శంభూజీ ఉన్నారు.
 
పళ్ళను తీసుకువెళ్ళడం ప్రతిరోజూ మామూలుగా జరుగుతున్నదే గనక, కాపలాభటులకు ఎలాంటి అనుమానమూ రాలేదు. ఆ తరవాత ఇంటి నుంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో అనుమానం కలిగి కాపలా భటులు లోపలికి వెళ్ళి చూశారు. ఒక్కరూ లేరు. తాము చూసినప్పుడు శివాజీలాగా పడకపై పడుకున్నది శివాజీ కాదనీ, ఆయన పోలికలున్న మారాఠీ యోధుడు హీరాజీ ఫర్సంద్‌ అనీ ఆ తరవాత తెలియవచ్చింది.
 
నగర పొలిమేరలు దాటాక శివాజీ, ఆయన కుమారుడూ తమ అనుచరులు సిద్ధంగా ఉంచిన గుర్రాలపై స్వస్థలం కేసి బయలుదేరారు. మార్గ మధ్యంలో శత్రువుల కంటబడకుండా తప్పించుకోవడానికి సాధువుల వేషంతో తమ నివాసాన్ని చేరుకున్నారు. శివాజీ తప్పించుకోవడానికి నిజానికి మొగలు సేనాధిపతి రాజాజైసింగ్‌ సాయపడ్డాడని చెబుతారు.
 
ఆ విధంగా శివాజీ భద్రతకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడన్న మాట! అదే సమయంలో, కాపలాభటుల నాయకుడు ఔరంగజేబు వద్దకు వెళ్ళి ఏం చెప్పాలో తెలియక భయంతో వణుకుతూ, ‘‘గదిలోనే ఉన్నాడు. ఎలా మాయమై పోయూడో ఏమో! ఆయనకేవో అద్భుత శక్తులు ఉన్నాయి,'' అని చెప్పసాగాడు. ఆ మాటలు వింటూంటే ఔరంగజేబుకు వెయ్యి తేళ్ళు ఒక్కసారిగా కుట్టినట్టయి మౌనంగా ఉండిపోయూడు. 

వైద్యుడి ఎంపిక


వృద్ధురాలైన రాజమాత నాగమాంబకు ఉన్నట్టుండి విపరీతమైన మొకాళ్ళనొప్పులు ఆరంభమయ్యూయి. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నయంచేయలేకపోయూరు. లేచి నిలబడడానికీ, నడవడానికీ తల్లి పడే యూతన చూసి మహారాజు వీరసింహుడు వేదనకు లోనయ్యూడు. రాజుగారి విచారాన్ని గమనించిన ప్రధాన మంత్రి, ‘‘మహారాజా, రాజమాత అస్వస్థతకు ప్రకృతివైద్యం చేయిస్తే ఫలితం కనిపించవచ్చు,'' అన్నాడు.
 
ఆ మాట వినగానే రాజుకు తల్లి ఆరోగ్యం గురించి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. వెనువెంటనే దేశమంతటా చాటింపు వేయించి దేశం నలుమూలల నుంచి ప్రకృతి వైద్యులను రప్పించారు. వారి అర్హతలను, అనుభవాలను పరిశీలించి ప్రధానమంత్రి నలుగురు వైద్యులను రాజమాత వైద్యానికి నియమించాడు. వాళ్ళ నలుగురూ కలిసి రాజమాతకు ఏమాత్రం కష్టం కలగకుండా, వైద్యం ప్రారం భించారు. ఆమె తీసుకునే ఆహారంలో మార్పులు చేశారు.
 
అడవిలోని కొన్నిరకాల ఆకులను తెచ్చి, ఆముదంలో దోరగా వేయించి మోకాళ్ళకు కట్టు కట్టేవారు. ఆవిరి, తైలధార పద్ధతులలో కొన్ని రోజులు క్రమం తప్పకుండా చికిత్స చేశారు. దాంతో మూడు వారాలకల్లా రాజమాతకు నొప్పి తగ్గిపోయింది. ఊతకర్ర సాయం కూడా లేకుండా మునుపటికన్నా ఎంతో ఉత్సాహంగా, హాయిగా లేచి నడవసాగింది. తల్లిని చూస్తూంటే మహారాజుకు సంతోషం కలిగింది.

తల్లికి వైద్యం చేసిన నలుగురిలో ఒకరిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియ మించాలనుకున్నాడు రాజు. అయితే, నలుగురూ ఒకే వయసు, అనుభవం కలిగిన వారే. ఎవరిని నియమించడమా అన్న సందిగ్ధంలో పడ్డ రాజు ఆ విషయంగా మంత్రిని సంప్రదించాడు. ‘‘ఇందులో పెద్దగా ఆలోచించవలసిన దేమీ లేదు. నలుగురూ వైద్యంలో నిపుణులే గనక, ఆ నలుగురిలో తమకు నచ్చిన వ్యక్తికి ఆ పదవి ఇవ్వండి ప్రభూ,'' అని సలహా ఇచ్చాడు మంత్రి.
 
రాజు ఆ నలుగురిలో సంగమేశ్వరశాస్ర్తిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియమించి, తక్కిన ముగ్గురికి విలువైన కానుకలిచ్చి పంపాడు. ఆ రోజు సాయంకాలం మంత్రితో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూండగా రాజు ప్రకృతి వైద్యుడి నియూమకం గురించి ప్రస్తావించాడు. అప్పుడు మంత్రి, ‘‘మహారాజా! ఆ నలుగురిలోకీ సంగమేశ్వరశాస్ర్తి అద్భుతమైన వైద్యుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు,'' అన్నాడు.
 
‘‘ఏ ఆధారంతో అంతరూఢిగా చెప్పగలుగుతున్నావు?'' అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ‘‘ప్రభువుల మన్నన, గుర్తింపు పొందాడంటే అతడు తప్పక ఉత్తమ వైద్యుడేకదా!'' అన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ. మంత్రి లౌక్యానికి మనసులో నవ్వుకున్న రాజు, ‘‘చికిత్సా విధానంలో ఆ నలుగురూ ఆరితేరినవారే. అయితే, సంగమేశ్వరశాస్ర్తి మాత్రం చికిత్స ప్రారంభించిన తొలి రోజు నుంచే వ్యాధి తప్పక నయమవుతుందని తల్లిగారి మనసులో విశ్వాసం కలిగిస్తూ వచ్చాడు.
 
ఆ సంగతి తల్లిగారే నాతో చెప్పారు. వైద్యుడన్న వాడు స్పష్టమైన రోగ నిర్ధారణ చేసి, సరైన మందులు వాడాలి; చక్కని చికిత్సా విధానంతోపాటు, రోగి మనసులో నమ్మకం కలిగించేవాడుగా ఉండాలి. చికిత్స పొందుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించగలవాడుగా ఉండడం చాలా ముఖ్యం. ఆ లక్షణం సంగమేశ్వరశాస్ర్తిలో ఉండడం వల్లే అతన్ని ఎంపిక చేశాను,'' అన్నాడు.

చిలుక జోస్యం!


మదన్‌పూర్‌ మహారాజుకు ఇద్దరు కుమారులు. జిత్తు, వీర్‌ అనే ఆ ఇద్దరు చాలా అందమైన వాళ్ళేగాక తెలివైనవాళ్ళని కూడా పేరు తెచ్చుకున్నారు. హఠాత్తుగా రాణికి జబ్బు చేసింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినప్పటికీ ఆమె జబ్బును నయం చేయలేకపోయూరు. ఒకనాడు ఆమె భర్తను దగ్గరికి పిలిచి, ‘‘మన పిల్లల క్షేమం ముఖ్యం.
 
వారికోసం దయచేసి మళ్ళీ వివాహం చేసుకోకండి,'' అన్నది. రాజు ఆమె చేతులు పట్టుకుని, ‘‘నీ కోరిక ప్రకారమే జరుగుతుంది,'' అన్నాడు. రాణి ఆ మాట విని ప్రశాంతంగా కన్నుమూసింది. మహారాణి ప్రజాక్షేమం పట్ల శ్రద్ధగల కరుణా మయి గనక, ఆమె మరణానికి మహారాజు మాత్రమే కాకుండా రాజ్య ప్రజలందరూ విషాదం చెందారు.
 
కొన్నాళ్ళు గడిచింది. మహారాణి లేకుండా మహారాజు మాత్రమే సింహాసనంపై ఆసీనుడు కావడం ప్రజలకు బాధ కలిగించింది. రాజు ద్వితీయ వివాహం చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమని భావించ సాగారు. ఒకనాడు ప్రధానమంత్రి రాజుతో, ‘‘తమరు ద్వితీయ వివాహం చేసుకోవాలి. రాజ్యానికి మహారాణి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు,'' అన్నాడు. ఆ మాట విని రాజు ఆలోచనలో పడ్డాడు.
 
మొదటి రాణికి ఇచ్చిన మాట; పిల్లల భవిష్యత్తు తలుచుకుని కొంతసేపు ఒక నిర్ణయూనికి రాలేకపోయూడు. కొంతసేపు ఏమీ మాట్లాడ లేక పోయూడు. ఆ తరవాత తలపంకిస్తూ, ‘‘సరే, ప్రజాభీష్టం నెరవేర్చడం రాజుగా నా బాధ్యత. మళ్ళీ వివాహ మాడతాను,'' అన్నాడు. రాజును వివాహమాడిన కొత్త రాణి, తన అదృష్టానికి ఎంతగానో పొంగిపోయింది. రాజును చాలా ప్రేమతో చూసుకుంటూ ఆయన కనుసన్నలలో మెలగసాగింది.

అయితే, రోజులు గడిచే కొద్దీ, రాజు తన కుమారుల పట్ల చూపు తూన్న ఆప్యాయతను చూసి సహించలేక పోయింది. దానికి తోడు రాజుకు తరవాత ఆ ఇద్దరిలో ఒకరే సింహాసనాన్ని అధిష్ఠించగలరుగనక, తనకు కలగబోయే సంతానానికి రాజ్యార్హత ఉండదని ఆలోచించడంతో ఆమెకు రాజ కుమారుల పట్ల ఎనలేని ద్వేషభావం పుట్టుకువచ్చింది. తన భవిష్యత్తు బావుండాలంటే ఆ ఇద్దరి అడ్డు ఉండకూడదని భావించి ఒక నిర్ణయూనికి వచ్చింది. ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు.
 
రాణి, ఇద్దరు రాజకుమారులు మాత్రమే భవనంలో ఉన్నారు. రాణి తీవ్రంగా ఆలోచించింది. వంటవాడు లేని సమయం చూసి, వంటగదిలోకి వెళ్ళి, మండుతూన్న కొరివిని తీసి నుదుటి మీద, చేతుల మీద గాయపరచుకున్నది. రాజు తిరిగి రాగానే, ‘‘చూశారా, మీ ముద్దుల కుమారులు చేసిన అఘాయిత్యం! నా ప్రాణానికే ముప్పు వచ్చి పడింది. వాళ్ళు సమీపంలో ఉంటే నా ప్రాణానికి రక్షణ ఉండదు. ఇక్కడి నుంచి వాళ్ళయినా వెళ్ళాలి. లేకుంటే నేనైనా వెళ్ళిపోవాలి!'' అంటూ జుట్టు విరబోసుకుని నానా రాద్ధాంతం చేసింది.
 
రాజు ఆమె మాటలు నమ్మాడు. సవతి తల్లి పట్ల అయిష్టం కారణంగా పసిపిల్లలు ఆ పని చేసి వుండవచ్చని ఆయన భావించాడు. అయితే, ఆ విషయం గురించి వారిని ఏమీ అడగలేదు. అలాంటి అఘాయిత్యం మరెప్పుడూ చేయకుండా పిల్లలకు సరైన గుణపాఠం నేర్పాలని నిర్ణయించాడు. అప్పటికప్పుడే కొడుకులిద్దరనీ రథంలో ఎక్కించుకుని అడవిని సమీపించిన రాజు, వాళ్ళను అక్కడ దించి, ‘‘మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. నేను ఆవలివైపుకు వెళ్ళివస్తాను,'' అన్నాడు.
 
ఒక రాత్రంతా పిల్లలను అక్కడ ఉంచి, తెల్లవారాక వచ్చి తీసుకువెళితే, వాళ్ళకూ బుద్ధి వస్తుంది; అంతలో రాణి కోపం కూడా చల్లారి, శాంతిస్తుందని రాజు ఆశించాడు. అడవిలో కూర్చున్న జిత్తు, వీర్‌ ఎంతసేపటికీ తండ్రి తిరిగి రాకపోయేసరికి, అక్కడి నుంచి లేచి చుట్టుపక్కల వెతికారు. ఆయన జాడ కనిపించలేదు. సూర్యుడు అస్తమించి చీకటి కమ్ముకోసాగింది. అన్నదమ్ములు రాత్రిని అడవిలోనే గడపాలనుకున్నారు. ఒక చెట్టుకింద ఒకరు నిదురబోతున్నప్పుడు, మరొకరు మేలుకుని కాపలా ఉండాలని నిర్ణయించారు. చుట్టు పక్కల ఉన్న చితుకులను ఏరి చలిమంట వేశారు.

చెట్టుకొమ్మ మీది చిలుకాగోరింకలు రాజకుమారుల చర్యలను ఎంతో ఆసక్తిగా గమనించ సాగాయి. ‘‘పాపం పసిపిల్లలు. ఏమీ తినలేదు. ఆకలితో ఉన్నట్టున్నారు,'' అన్నది చిలుక. ‘‘మనం వెళ్ళి వెతికినా ఈ అపరాత్రి వేళ వాళ్ళకు ఎలాంటి ఆహారం తీసుకురాగలం? నేనొకటి చెప్పనా?'' అని బదులు పలికింది గోరింక. ‘‘నీ మనసులో ఏమున్నదో చెప్పుమరి. కేవలం సానుభూతి చూపడం వల్ల ప్రయోజనం ఉండదు కదా!'' అన్నది చిలుక.
 
‘‘ఆ పిల్లల ఆకలి తీర్చాలంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తున్నది. మండుతున్న చలిమంటల్లోకి మనం దూకేద్దాం. మనల్ని కాల్చుకుని తిని వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు. ఏమంటావు?'' అన్నది గోరింక. ‘‘బావుంది. ఇతరుల ఆకలి తీర్చడానికి మించిన ఉపకారం ఏముంటుంది? పైగా వాళ్ళు మన అతిథుల్లాంటివారు.
 
మరో విషయం. నా మాంసం తిన్నవాడు భవిష్యత్తులో రాజూ, నీ మాంసం తిన్నవాడు మంత్రీ కాగలడు,'' అన్నది చిలుక. భవిష్యత్తును చూడగల శక్తి వున్న ఆ పక్షులు కూడబలుక్కుని, మొదట చిలుక, దాన్ని అనుసరించి గోరింక చలిమంటల్లోకి దూకేశాయి. ఆ సమయంలో జిత్తు నిదురపోతున్నాడు. మేలుకుని వున్న వీర్‌ పక్షులు చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయి అన్నను తట్టి లేపి, ‘‘అన్నయ్యూ, మనం ఆకలితో బాధపడనవసరం లేదు. రెండు పక్షులు మంటల్లోకి దూకేశాయి. వాటిని కాల్చి తిందాం,'' అన్నాడు. ‘‘అలాగే తమ్ముడూ. నువ్వు పెద్ద దాన్ని తిను.
 
నేను చిన్నదాన్ని తింటాను,'' అన్నాడు జిత్తు. ‘‘నువ్వు పెద్దవాడివి గనక, పెద్దదాన్నీ, నేను చిన్నవాణ్ణి గనక, చిన్నపక్షినీ తిందాం,'' అన్నాడు వీర్‌. ఆ సూచనకు జిత్తు అంగీకరించడంతో, అదే విధంగా వాళ్ళు పక్షులను కాల్చుకు తిని ఆకలి తీర్చుకుని పడుకుని హాయిగా నిద్రపోయూరు. తెల్లవారాక కూడా చాలా సేపటివరకు తండ్రి రాకపోయేసరికి, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చున్నారు. హఠాత్తుగా ఒక అందమైన జింక అటుకేసి పరిగెత్తడం చూసిన జిత్తు, ‘‘తమ్ముడూ రా. ఆ జింకను పట్టుకుందాం,''అంటూ జింక వెంట పరిగెత్తాడు.

అలా చాలా దూరం పరిగెత్తాక, జింక దూరంలో ఉన్న పొదల చాటుకు వెళ్ళి, కనుమరుగై పోయింది. అక్కడ ఆగిన జిత్తు తమ్ముడి కోసం వెనుదిరిగి చూశాడు. వీర్‌ కనిపించలేదు. అక్కడే ఒక చెట్టుకింద బండ మీద కూర్చున్నాడు. ఎంతసేపటికీ తమ్ముడు రాకపోయేసరికి, లేచి ముందుకు నడిచాడు. అడవి ఆవలి ప్రాంతాన్ని చేరుకున్నాడు. అది వేరొక రాజ్యం అక్కడి ప్రజలందరూ విచారగ్రస్తులై ఉండడం చూసి ఆశ్చర్యపోయూడు.
 
కారణం అడిగితే రాజు మరణించాడనీ, ఆయన అంతిమ యూత్రను చూడడానికి ప్రజలు అక్కడ చేరారనీ చెప్పారు. జిత్తు కూడా బాటకు ఒకవైపున జనం మధ్యకు వెళ్ళి నిలబడ్డాడు. కొంతసేపటికి ఊరేగింపు అటుగా రాసాగింది. అలంకరించబడిన పల్లకిలో రాజుగారి భౌతిక కాయూన్ని మోసుకువస్తున్నారు. ఊరేగింపుకు ముందు రాజగురువు నడుస్తున్నాడు. ఆయన దృష్టి జనం మధ్య నిలబడివున్న జిత్తు మీద పడింది.
 
భటుణ్ణి పంపి అతణ్ణి దగ్గరికి పిలిచి, ‘‘ మా రాజుగారు మరణించారు. ఆయనకు సంతానం లేదు. నీలో రాచఠీవి ఉట్టిపడుతున్నది. నువ్వు తప్పక రాజవంశానికి చెందిన వాడివై ఉండాలి. మా రాజుగారి అంత్యక్రియలు నీ చేతుల మీదుగా నిర్వహించు. యుక్త వయస్కుడివయ్యూక రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించవచ్చు,'' అన్నాడు. రాజగురువు మాటలు జిత్తుకు పూర్తిగా అర్థంకాక పోయినప్పటికీ, తాను ఆ రాజ్యానికి మునుముందు రాజునయ్యే అవకాశం ఉందన్న విషయం మాత్రం అర్థమయింది.
 
తననూ తన తమ్ముణ్ణీ అడవిపాలు చేసివెళ్ళిన తన తండ్రిని తలుచుకున్నాడు. వెంటనే మరణించిన రాజుకు అంత్యక్రియలు నిర్వహించడానికి, ఊరేగింపుతో పాటు రాజగురువు వెంట నడిచాడు. రాజగురువు పర్యవేక్షణలో జిత్తు చేతుల మీదుగా రాజుగారి అంత్యక్రియలు జరిగిపోయూయి. జిత్తును రాజభవనానికి తీసుకువెళ్ళారు. మరునాడు రాజగురువు సభను సమావేశ పరచి, ‘‘మన మహారాజుకు వారసుడు లభించాడు,'' అని ప్రకటించాడు. ఆ తరవాత మహారాణి కేసి చూశాడు. ‘‘ఈ రాజకుమారుడు, మహారాజుగారికి తగిన వారసుడని భావిస్తున్నాను.

రాజగురువు అభిప్రాయూన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను,'' అన్నది మహారాణి. రాజకుమారుడు జిత్తు, జితేంద్రుడు అనే పేరుతో ఆ రాజ్యానికి యౌవరాజుగా అభిషిక్తుడయ్యూడు. అదే సమయంలో జింకను పట్టడానికి పరిగెత్తిన అన్న వెంట చాలా దూరం పరిగెత్తిన వీర్‌ అలిసిపోయి ఒక బండమీద కూర్చున్నాడు.
 
ఆ తరవాత పరిగెత్తలేక, అన్నను కలుసుకోగలనో, లేదో అని విచారపడసాగాడు. అప్పుడు ఆదారిలోవచ్చిన ఒక వృద్ధుడు, ‘‘నువ్వెవరు? ఇక్కెడెందుకు ఒంటరిగా కూర్చున్నావు?'' అని అడిగాడు. ‘‘మా అన్ననూ, నన్నూ మా తండ్రి రాత్రి అడవిలో వదిలివెళ్ళాడు. రాత్రంతా అడవిలో గడిపాము. తెల్లవారాక ఒక జింక కనిపించడంతో దాన్ని పట్టుకోవడానికి మా అన్న వెళ్ళాడు. నేను అతని వెంట కొంత దూరం పరిగెత్తి ఆ తరవాత పరిగెత్తలేక ఆగిపోయూను.
 
మా అన్నను చూడగలనో లేదో తెలియడం లేదు,'' అన్నాడు వీర్‌ విచారంగా. ‘‘మీ అన్నను గురించి విచారించకు. పొద్దు పోయి చీకటి పడుతున్నది. రేపు వెతుకుదాం. ఇప్పుడు నా వెంటరా, వెళదాం,'' అన్నాడు ఆ వృద్ధుడు. వీర్‌ వృద్ధుడి వెంట బయలుదేరాడు. మార్గమధ్యంలో తాను ఎవరైనదీ వీర్‌‌త ఆయనకు చెప్పాడు. కొంత సేపటికి వాళ్ళొక పెద్ద భవనాన్ని సమీపించారు. అది ఆ వృద్ధుడి ఇల్లే. ‘‘మీ అన్న కనిపించేంతవరకు నువ్వు ఇక్కడే ఉండవచ్చు.
 
నీకు ఎలాంటి కొరతా లేకుండా నేను చూసుకుంటాను,'' అన్నాడు వృద్ధుడు. వీర్‌ అందుకు సమ్మతించడంతో, ఆ ప్రాంతానికి జమీందారయిన ఆ వృద్ధుడు అతనికి ఆహార పానీయూలూ సకల సదుపాయూలూ సమకూర్చడమే కాకుండా విద్యాబోధనకు కూడా ఏర్పాటు చేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయూయి.
 
ఒకనాడు పొరుగురాజ్యంలో యుక్తవయస్కుడైన యువరాజుకు పట్టాభిషేకం జరుగనున్నదని వృద్ధ జమీందారుకు తెలిసింది. సంతానం లేని ఆ రాజు మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించిన పొరుగుదేశపు రాకుమారుణ్ణి రాజగురువు సింహాసనానికి వారసుడిగా ఎంపిక చేశాడన్న సంగతి కూడా జమీందారుకు తెలియవచ్చింది.

దాంతో ఆ యువరాజు జితేంద్రుడు, వీర్‌ అన్న జిత్తు అయివుండవచ్చునన్న అనుమానం ఆయనకు కలిగింది. జమీందారు తన అనుమానాన్ని బయట పెట్టకుండా వీర్‌ను వెంటబెట్టుకుని యువరాజు పట్టాభిషేక మహోత్సవం చూడడానికి బయలుదేరాడు. పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఆ తరవాత రాజును దర్శించడానికి వెళ్ళిన జమీందారు, ‘‘అడవిలో జింకను పట్టడానికి వెళ్ళిన అన్న వెంట పరిగెత్తలేక వెనకబడి ఆగిపోయిన తమ్ముడు తమకు గుర్తున్నాడా ప్రభూ!'' అని అడిగాడు.
 
వృద్ధ జమీందారు పక్కనే నిలబడ్డ యువకుణ్ణి ఒక క్షణం పరిశీలనగా చూసిన రాజు జితేంద్రుడు, తటాలున సింహాసనం నుంచి లేచి, ‘‘తమ్ముడూ, వీర్‌!'' అంటూ వచ్చి అతణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ‘‘తప్పిపోయిన నా తమ్ముడు మళ్ళీ నావద్దకు రావడం నాకెంతో సంతోషం కలిగిస్తున్నది. పట్టాభిషేకానికన్నా మహదానందం కలిగించిన రోజు ఇది!'' అంటూ సభికుల కేసి తిరిగి, ‘‘వీర్‌, నా సహోదరుడు.
 
దురదృష్టవశాత్తు చిన్నప్పుడు విడిపోయిన మేము ఇప్పుడు అదృష్టవశాత్తు చాలా సంవత్సరాల తరవాత కలుసుకుంటున్నాం. వీర్‌ను వీరేంద్రుడనే పేరుతో నా ప్రధాన మంత్రిగా నియమిస్తున్నాను!'' అన్నాడు. ఆ విధంగా సంవత్సరాల క్రితం చిలుకచెప్పిన మాట నిజమయింది.

స్వయంసమృద్ధి సాధిద్దాం!


మంజులాసిద్ది అందమైన చీర కట్టుకుని, తలనిండా మల్లెలు, చామంతులు, గులాబీలు లాంటి రంగురంగుల పువ్వులను పెట్టుకుని రంగోలీ పోటీకి బయలుదేరింది. తమ పెరటితోట నుంచి కూతురు కోసుకుని వచ్చిన పువ్వుల బుట్టలను దగ్గరికి లాక్కుని పువ్వుల రంగోలీని అలంకరించడానికి ప్రారంభించింది.
 
వాళ్ళ గ్రామంలో మొట్టమొదటి సారిగా జరుగుతూన్న రంగోలీ పోటీ అది. కర్నాటక రాష్ట్రం పడమటి కనుమల మధ్య వున్న నాగిన్‌కొప్ప గ్రామంలో ఆరోజు విలక్షణమైన విత్తనాల పండుగ జరుపుకుంటున్నారు. ఆ పండుగలో చివరి అంశం రంగోలీ పోటీ. అంటే స్ర్తీల మధ్య జరిగే పూలముగ్గులపోటీ అన్న మాట. మంజులకు పువ్వులంటే మహా ఇష్టం. ఇన్నాళ్ళు ఎంతో శ్రద్ధగా పెంచిన పెరటి పూలతోటలోని పువ్వులు ఈరోజు ఇలా ఉపయోగపడుతున్నాయన్న మాట.
 
ఆమె దీక్షగా ముగ్గును రంగురంగుల పువ్వులతో అలంకరిస్తూంటే, ఆమె మనసులో బకుల్‌ పట్ల కృతజ్ఞతాభావం పెల్లుబకసాగింది. పట్నం నుంచి వచ్చిన బకుల్‌ అనే ఆ యువతే పల్లెపడతుల హృదయూలలో ఆసక్తి అనే విత్తనాలను వెదజల్లింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే బకుల్‌ ఆధ్వర్యంలోనే ఇప్పుడీ విత్తనాల పండుగ కూడా జరుగుతున్నది. ఇవన్నీ ఎలా జరిగాయన్నది మంజుల మనసులో కదలాడసాగింది... అదొక మధ్యాహ్న సమయం.

నాగిన్‌ కొప్పలోని స్ర్తీలు, పొద్దుననగా పొలాలకు వెళ్ళి మండుటెండలో వరికోత కోసి, అప్పుడే ఇళ్ళకు తిరిగి వస్తూ, సేదతీరడానికి ఒక చెట్టు కింద కూర్చున్నారు. వారిలో మంజుల కూడా ఉన్నది. పక్కనే పాత కాలపు పద్ధతిలో చెరకు గానుగాడుతున్నారు. గానుగకు కట్టిన ఎడ్లు ఓర్పుగా తిరుగుతున్నాయి. పనివాళ్ళు చెరకు గడలను అందిస్తున్నారు. చెరకురసం పెద్ద పెద్ద తొట్టెల్లోకి చేరుతున్నది.
 
నాగిన్‌కొప్ప రైతులు పాత రకాల చెరకును పండించేవారు. అవి మిల్లులో చక్కెర తయూరీకి మరీ మెత్తగా ఉండేది. అయితే, వాటితో అద్భుతమైన బెల్లం తయూరయ్యేది. కొన్నాళ్ళ క్రితం సమీపంలోని పట్నం నుంచి ఒకావిడ దాని కోసమే వెతుక్కుంటూ వచ్చి ఆ రకం విత్తనంచెరకును కొనుక్కుని వెళ్ళేది. ఆ రకం చెరుకు ఉత్తమమనీ, కొత్త రకం హైబ్రిడ్‌ చెరకుకు, ఎక్కువ ఎరువులూ, నీరూ కావలసి వస్తాయనీ ఆవిడ చెప్పేది.
 
పైగా, శుద్ధి చేయబడిన తెల్లచక్కెర కన్నా, బెల్లం ఉపయోగించడమే ఆరోగ్యకరం అనేదామె. చెట్టుకింద కూర్చున్న స్ర్తీలు తమ ఊళ్ళో పండే చెరకు గురించి మాట్లాడుకుంటూండగా, ఒక యువతి వాళ్ళ కేసి రావడం కనిపించింది. ఆమె పేరే బకుల్‌. పంటలు పండించడానికి స్థానికమైన పాత రకాల విత్తనాలనే వాడాలనీ, కొత్త హైబ్రిడ్‌ వద్దనీ ఆమె ఊరూరూ తిరిగి ప్రచారం చేస్తోంది. ఆమె నాగిన్‌ కొప్పకు రావడం ఇది రెండోసారి.
 
మొదట వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో పండే పంటలు, వాటి విత్తనాల సై్లడ్‌‌స చూపిస్తానని చెప్పి వెళ్ళింది. ఆమె చేతిలో ఒక సంచీ ఉండడం గమనించి, అందులో సై్లడ్‌‌స ఉంటాయని స్ర్తీలు గ్రహించారు. వాళ్ళు ఊహించినట్టే బకుల్‌ వారికి ఒక గోడ మీదికి బొమ్మలను ప్రొజెక్‌‌ట చేసి ఆ సై్లడ్‌‌స చూపించింది.
 
పడమటి కనుమల పరిసరాల్లోని ప్రజలు తమ ఇళ్ళ ఆవరణల్లోనే పండించే రకరకాల కూరగాయలు, పళ్ళు, పువ్వులు, మూలికలు, తీగలు మొదలైన వాటిని వివరించే సై్లడ్‌‌స అవి. తమ చుట్టుపక్కల గ్రామాల్లోనే అన్నిరకాలు ఉన్నాయూ అని మంజులతో పాటు స్ర్తీలందరూ అమితమైన ఆనందాశ్చర్యాలు చెందారు. ‘‘అయ్యో, ఈశ్వరా! గుబ్బి హాగల్‌ కాయిని మళ్ళీ చూడగలనని నేనెప్పుడూ అనుకోలేదు.
 
అది ఎప్పుడో నశించిపోయిందనుకున్నాను,'' అని ఆశ్చర్యపోయింది గంగమ్మ, పిచ్చుక తల పరిమాణంలో వున్న కాకరకాయబొమ్మను చూడగానే. ‘‘మీ ఊరికి కొద్ది దూరంలోనే అవి చాలా పండుతున్నాయి. కావాలంటే మీకు వాటి విత్తనాలు తెచ్చి ఇస్తాను,'' అన్నది బకుల్‌. ‘‘తప్పక తెచ్చివ్వు తల్లీ.

ఆ రకం కాకరకాయల వేపుడు చాలా రుచిగా ఉంటాయి,'' అన్నది గంగమ్మ ఎంతో ఆశగా. ఆ తరవాత బకుల్‌ వాళ్ళకు తెలిసిన కాకర రకాల గురించి అడిగింది. వాళ్ళు ఆలోచించి, ఆలోచించి ఎనిమిది రకాల కాకర గురించి చెప్పారు. ‘‘ఒక్క కాకరలోనే ఇన్ని రకాలున్నాయంటే-మిగతా వాటిలో ఎన్నేసి ఉంటాయో ఆలోచించి చూడండి. కావాలంటే మీ ఇంటి పెరట్లోనే వంద రకాలు పండించవచ్చు.
 
అవి మీ ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయి. మిగిలినవి అమ్ముకోవచ్చు. డబ్బులు వస్తాయి. విత్తనాలను సేకరించారంటే, విత్తనాలుకొనే అవసరం ఉండదు. కావాలంటే వాటిని అవసరమైన వారికి అమ్మి మరింత డబ్బు సంపాదించవచ్చు,'' అని వివరించింది బకుల్‌. ఆ తరవాత స్ర్తీలందరూ రకరకాల కూరగాయల గురించీ, పళ్ళూ, పూలచెట్ల గురించీ ఉత్సాహంగా చర్చించుకున్నారు.
 
వాళ్ళ ఉత్సాహాన్ని చూసి సంతోషించిన బకుల్‌, ‘‘మీరందరూ ఒక బృందంగా ఏర్పడి వీటిని గురించి బాగా చర్చించుకుని కార్యాచరణకు దిగితే బావుంటుంది కదా,'' అని అడిగింది. ‘‘అవును, అవును,'' అన్నారు అందరూ ముక్తకంఠంతో. హఠాత్తుగా ఏదో గొప్ప ఆలోచన మెరిసినట్టుగా, ‘‘మీరు విత్తనాల పండుగ జరపడానికి సాయపడవచ్చు కదా? చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరూ తమ వద్ద ఉన్న విత్తనాలను ఒక చోటికి తీసుకురావాలి. తమ వద్ద ఉన్నవాటిని ఇతరులకు ఇచ్చి, వారివద్ద ఉన్నవాటిని తాము పుచ్చుకోవచ్చు. దాని ద్వారా మా పెరటి తోటల్లో రకరకాల పూల మొక్కలు, పళ్ళ చెట్లు పెంచడానికి వీలవుతుంది.

‘‘ఈ పండుగ సందర్భంగా ఆటలు, పాటలు, రంగోలీ పోటీలు కూడా నిర్వహించవచ్చు,'' అన్నది మంజుల. ‘‘అద్భుతమైన ఆలోచన! అలాగే నిర్వహిద్దాం,'' అన్నది బకుల్‌ ఆనందంతో మెరిసే కళ్ళతో. అందరూ అందుకు సంతోషంగా అంగీకరించారు. వృద్ధురాలైన గంగమ్మ కూడా, ‘‘నా దగ్గరున్న విత్తనాలన్నిటినీ నేను తీసుకువస్తాను.
 
మీ దగ్గర ఉన్నవి మీరు తీసుకురండి. మీ పిల్లల్ని కూడా వెంట బెట్టుకుని రండి. ఈ విత్తనాల గొప్పతనం వాళ్ళకు తెలియూలి. గుప్పెడు విత్తనాలు కుటుంబాన్నీ, సమాజాన్నే కాపాడగలవని వాళ్ళు గ్రహించాలి,'' అన్నది పట్టరాని ఉత్సాహంతో. ...అలా ఆరంభమైన ఉత్సవంలో అందరూ ఆనందంగా పాలుపంచుకున్నారు. తాము చిన్నప్పుడెప్పుడో చూసిన విత్తనాలు, తాము మరిచి పోయిన విత్తనాలు మళ్ళీ కనిపించే సరికి కొందరు వృద్ధులు పరమానందం చెందారు.
 
తరగని ప్రకృతి సంపదనూ, వినోద కార్యక్రమాలనూ చూసి పిల్లలు అమితోత్సాహం పొందారు. ...ముగ్గును పూలతో అలంకరించడం పూర్తి చేసిన మంజుల లేచి నిలబడి ఒకసారి దాన్ని తనివి తీరా చూసుకున్నది. రంగోలీ పోటీలో పాల్కొన్న వారందరూ ముగ్గులు అలంకరించి పూర్తి చేశారు. గంగమ్మ, బకుల్‌ ఒక్కొక్క ముగ్గునూ పరిశీలనగా చూస్తూ వచ్చారు. ఉత్తమమైన రంగోలీని వారే ఎంపిక చేస్తారు. రంగోలీలను చూస్తూ వారు ఒకటి రెండుసార్లు అటూ ఇటూ తిరిగారు.
 
పరస్పరం చర్చించుకున్నారు. మంజుల ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూడసాగింది. ఆఖరికి ఫలితాలు వెల్లడించారు: ‘‘రంగోలీ పోటీలో ప్రథమ బహుమతిని అందుకుంటున్నది మంజులా సిద్దీ!'' అని ప్రకటించింది బకుల్‌. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
 
మంజుల వెళ్ళి బహుమతిని అందుకున్నది. తక్కినవారందరూ ఆమెను అభినందించారు. పిల్లలను వెంటబెట్టుకుని, బహుమతితో సంతోషంగా ఇల్లు చేరిన మంజుల, రంగురంగుల పూలనందించిన తన పెరటి తోటకు మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసింది. తనను ప్రేమించేవారిని ప్రకృతి తప్పక బహూకరిస్తుందని ఆమె అనుభవపూర్వకంగా గ్రహించింది. 

న్నాదాయ్‌ అనుపమ త్యాగం


రాణా సంగ్రామసింగ్‌ రాజస్థాన్‌లోని మేవార్‌ను పరిపాలించి దాదాపు ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయూయి. ధైర్యసాహసాలకూ, ధర్మ పాలనకూ పేరొందిన ఆయన పేరు వినగానే ప్రజలు ఆయన పట్ల గౌరవ మర్యాదలు కనబరచేవారు. బాబర్‌ భారతదేశంపై దండయూత్ర చేసి. 1526 ఏప్రిల్‌ 21వ తేదీ జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీని ఓడించాడు.
 
ఢిల్లీని, ఆగ్రాను వశపరచుకుని మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాక, బాబర్‌ దృష్టి రాజస్థాన్‌ మీదికి మళ్ళింది. మొగల్‌ సేనలను రాజపుత్ర సైనికులు దీటుగా ఎదుర్కొని అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు. అయినా, తన సైన్యంలోని ఒక దళనాయకుడి ద్రోహం కారణంగా రాణా సంగ్రామసింగ్‌ దాపులనున్న కొండలలోకి తప్పించుకుని పోవలసివచ్చింది.
 
మొగలులపై ఎలాగైనా పగసాధించాలన్న పట్టుదలతో ప్రయత్నించినప్పటికీ రాణా 1527లో మరణించాడు. ఆ తరవాత బాబర్‌, వాటిల్లిన సైనిక నష్టాలు చాలనుకుని రాజపుత్ర వీరులను వేధించకుండా వాళ్ళు ప్రశాంతంగా జీవించేలా ఢిల్లీకి తిరిగి వెళ్ళాడు. రాణా సంగ్రామసింగ్‌ జ్యేష్ఠకుమారుడు రత్నసింగ్‌ మేవార్‌ పాలకుడయ్యూడు. అయితే, పొరుగు ప్రాంత యువరాజుతో జరిగిన గొడవలో అతడు మరణించడంతో, అతడి తమ్ముడు విక్రమ్‌జిత్‌ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
 
అతడు దురహంకారీ, ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ లేనివాడూ, వినోద ప్రియుడూ కావడంతో సదా సర్వవేళలా మల్లయుద్ధాలు, ఆటల పోటీలు అంటూ వినోదకార్యక్రమాలతో కాలక్షేపం చేసేవాడు. దానికి తోడు సామంతులనూ, ప్రముఖులనూ గౌరవించేవాడు కాడు. పూచిక పుల్లతో సమానంగా చూసేవాడు.

దాంతో మేవార్‌లో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని అవకాశంగా తీసుకుని గుజరాత్‌ సుల్తాన్‌ బహదూర్‌షా మేవార్‌ రాజధాని చిత్తోర్‌ను ముట్టడించాడు. రాజపుత్ర యోధులు ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడారు.అయినప్పటికీ ఓటమి తప్పదన్న సంకటస్థితి ఏర్పడగానే-శత్రువుల బారినుంచి తప్పించుకోవడానికి చిత్తోర్‌ కోటలోని పధ్నాలుగువేల మంది స్ర్తీలు ‘జోహర్‌' అనే అగ్ని ముట్టించి అందులో ధైర్యంగా ప్రవేశించి ప్రాణత్యాగం చేశారు.
 
ఆ వీరోచిత కృత్యాన్ని చేయించింది రాణా సంగ్రామ సింగ్‌ వీరపత్నీ, చంటిబిడ్డగా వున్న యువరాజు ఉదయ్‌ సింగ్‌ తల్లీ అయిన రాణి కర్నావతి. తండ్రి మరణించాక జన్మించిన ఉదయ్‌సింగ్‌ను రహస్యంగా సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆ తరవాత మొగలులు విక్రమ్‌జిత్‌కు సింహాసనం అప్పగించినప్పటికీ, ప్రజలు అతడి దుష్టపాలనను భరించలేకపోయూరు. సింహాసనానికి వారసుడైన ఉదయ్‌సింగ్‌ పెద్దవాడయ్యేంతవరకు పాలనా బాధ్యతలు ఎవరు చూసుకోగలరు? రాణాసంగ్రామసింగ్‌ తమ్ముడు పృధ్వీరాజ్‌ కుమారుడైన బన్‌బీర్‌ను పాలనా బాధ్యతలు చేపట్టమని రాజపుత్ర ప్రముఖులు కోరారు.
 
అందుకు అతడు అంగీకరించాడు. పాలనా బాధ్యతలు చేపట్టిన బన్‌బీర్‌కు తనే రాజుగా స్థిరపడాలన్న దురాశపుట్టుకురావడంతో అందుకు అవరోధంగా ఉన్న రాణాసంగ్రామసింగ్‌ ఇద్దరు కుమారులను తొలగిం చాలనుకున్నాడు. ప్రజల ద్వేషానికిగురై, రాజ్యం వదిలి పారిపోనున్న సమయంలో, బన్‌బీర్‌ విక్రమజిత్‌ను హతమార్చాడు. ఇక మిగిలి ఉన్నది ఒక్క పసికందు ఉదయ్‌సింగ్‌ మాత్రమే. ఆ శిశువును హతమార్చడానికి క్రూరుడైన బన్‌బీర్‌ దుష్టపథకం వేశాడు. ప్రశాంతమైన రేయి. చిత్తోర్‌ కోట అంతఃపుర భవనం నుంచి తియ్యటి జోలపాట లీలగా వినిపిస్తోంది.

రాకుమారుడు నిదిరిస్తూన్న రత్నాలు పొదిగిన అందమైన ఉయ్యూలను ఊపుతూ జోలపాడుతూన్న పన్నాదాయ్‌ చేతిలో రాకుమారుడి ఈడువాడే అయిన ఆమె సొంత బిడ్డ కూడా ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో హడావుడిగా వచ్చిన ఒక సేవకుడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె ముఖం వెలవెలపోయింది. వెంటనే ఆమె చేతిలోని తన బిడ్డను ఉయ్యూలలో పడుకోబెట్టింది.
 
ఉయ్యూలలోని రాకుమారుడి ఆభరణాలను, దుస్తులను తీసి తన బిడ్డకు తొడిగింది. రాజభవనంలోని వంటవాణ్ణి పిలిచి పళ్ళబుట్టను తెమ్మని చెప్పి, రాకుమారుణ్ణి అందులో సుతారంగా పడుకోబెట్టి, బుట్టను ఆకులతో కప్పింది. బిడ్డను రహస్యంగా కోటనుంచి తీసుకువెళ్ళమని వంటవాణ్ణి వేడుకున్నది. కొంతసేపటికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రాజప్రతినిధి బన్‌బీర్‌ అక్కడికి వచ్చాడు. క్రూరమైన చూపులతో కత్తి దూసి పసికందు గుండెల్లో గుచ్చి చంపి, వచ్చిన వేగంతో తిరిగి వెళ్ళిపోయూడు.
 
యువరాజు మరణించాడని రాజకుటుంబీకులు భోరునవిలపిస్తూండగా, పన్నాదాయ్‌, కళ్ళెదుట చంపబడ్డ పుత్రశోకాన్ని దిగమింగుకుని రాజభవనం నుంచి వేగంగా వెలుపలికి నడిచింది. ఆమె నదీ తీరానికి చేరేసరికి అక్కడ విశ్వాసపాత్రుడైన వంటవాడు బుట్టతో సిద్ధంగా ఉన్నాడు. అదృష్టవశాత్తు బిడ్డ మేలుకోలేదు. వాళ్ళు వేగంగా డోలాకు వెళ్ళి యువరాజుకు ఆశ్రయం వేడుకున్నారు.
 
యువరాజు పట్ల సానుభూతి ఉన్నప్పటికీ దుర్మార్గుడైన బన్‌బీర్‌కు భయపడి ఆశ్రయం ఇవ్వలేనని తన నిస్సహాయతను తెలియజేశాడు అక్కడి పాలకుడు. పన్నా రైతుమహిళ వేషంతో బిడ్డనెత్తుకుని, వంటవాణ్ణి వెంటబెట్టుకుని డోంగర్‌పూర్‌కు బయలుదేరింది. ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ కొండ మీది భవనం చేరిన ఆమెకు ఆశాభంగమే ఎదురయింది. పరమకిరాతకుడైన బన్‌బీర్‌ ఆగ్రహానికి గురికాలేనని సామంత రాజు రావల్‌ అయిస్కుర్‌‌న నిర్దాక్షిణ్యంగా ఆమెను పంపేశాడు.
 
మేవార్‌ రేపటి రాజును ఎలాగైనా సురక్షితమైన చోటికి చేర్చాలన్న పట్టుదలతో నిద్రాహారాలు, శ్రమ, అలసట లెక్కచేయకుండా పన్నా కొండలూ కోనలూ దాటుకుంటూ ఆరావళీ పర్వతశ్రేణులలోని కొముల్మేర్‌ కేసి నడవసాగింది. హఠాత్తుగా వంటవాడు తీవ్రమైన జ్వరానికి లోనయ్యూడు. దయూహృదయులైన భిల్లులనే స్థానిక గిరిజనులు అతడికి తాము సాయపడగలమని చెప్పి, పన్నాకు దారిచూపి సాగనంపారు. తెలతెలవారుతూండగా చిన్న కొండమీది కొముల్‌మేర్‌ రాజభవనం బాదల్‌మహల్‌ కనిపించగానే పన్నాకు కొత్త ఆశలు చిగురించాయి.

రాజు అస్సాసాహ్‌ ఆమెను కరుణతో ఆదరించాడు. చిత్తోర్‌కు పట్టిన దుర్గతిని వివరించిన పన్నా, ‘‘ఈ చిన్నారి యువరాజును సురక్షితమైన తమ రక్షణలో ఉంచితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు,'' అన్నది సజల నయనాలతో. అస్సాసాహ్‌ ఏమిచెప్పడానికీ తోచక ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయన తల్లి, ‘‘దీనికెందుకు ఇంత ఆలోచన? ఈబిడ్డ రాణాసంగ్రామసింగ్‌ కుమారుడు. నీకు రాజు.
 
రాజుపట్ల విశ్వాసం ఉన్నవాడికి భయం అన్నది ఉండకూడదు. నీ ఎదుట నిలబడ్డ పన్నా ఒక సాధారణమైన దాది. ఆమె చేసిన నిరుపమాన త్యాగం; కనబరచిన అసమాన ధైర్యం; పడ్డ కష్టాలు చూశాక కూడా నీలో ఎందుకీ సందిగ్థత?'' అన్నది రాజుతో. అప్పుడాయన బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని, ‘‘ఈ చిన్నారి యువరాజు సంరక్షణా బాధ్యతనాది. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా,'' అని పన్నాకు మాట ఇచ్చాడు.
 
పన్నా ఆ మాటలకు పరమానందం చెంది, బిడ్డను తీసుకుని మరొక్కసారి ఆప్యాయంగా హృదయూనికి హత్తుకుని రాజుచేతికిచ్చింది. బిడ్డను ఆప్యాయంగా రెండుమూడుసార్లు చేత్తో నిమిరింది. కన్నీటితో రాజుకు కృతజ్ఞతా పూర్వకంగా చేతులెత్తి నమస్కరించి, రాణిగారికిచ్చిన మాటను నిలుపుకున్నామన్న తృప్తితో భవనం నుంచి వెలుపలికి నడిచింది. ఏడేళ్ళు గడిచిపోయూయి. తన ఈడువాడే అయిన అస్సాసాహ్‌ కుమారుడితో కలిసి ఉదయ్‌సింగ్‌ పెరగసాగాడు.
 
ఒకనాడు రాజభవనానికి అతిథిగా వచ్చిన అస్సాసాహ్‌ మిత్రుడైన ఒక రాజపుత్ర ప్రముఖుడు ఉదయ్‌సింగ్‌ను చూసి ఆశ్చర్యపడి, ‘‘ఎవరీ రాజకుమారుడు?'' అని అడిగాడు. అస్సాసాహ్‌కి అసలు సంగతి చెప్పక తప్పలేదు. రాజపుత్ర ప్రముఖుడు ఉదయ్‌సింగ్‌కు నమస్కరించాడు. అచిర కాలంలోనే ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది.
 
మేవార్‌ ప్రముఖులు, చుట్టుపక్కల నాయకులు న్యాయబద్ధమైన యువరాజుకు తమ మద్దతును తెలియజేశారు. పరమ దుష్టుడూ, దురహంకారీ అయిన బన్‌బీర్‌ పట్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత బయలుదేరింది. పసి యువరాజు నాయకత్వంలో పెద్ద సైన్యం చిత్తోర్‌ కోటను ముట్టడించింది. బన్‌బీర్‌ సైన్యాన్ని ఎదుర్కోలేక ఓటమి భయంతో పారిపోయూడు. ప్రజల ఆనందోత్సాహాల మధ్య రాణా ఉదయ్‌సింగ్‌ 1597లో మేవార్‌ సింహాసనాన్ని అధిరోహించాడు.

తాతయ్య-బామ్మ చెప్పిన కథ


అదొక అడవి. దానికి ఆవల విశాలమైన ఇసుక ప్రదేశం. ఎడారిలా ఎండిపోయిన నది ఇసుక మేటలు. ఎండ తీవ్రంగా కాస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఒక తల్లి, తండ్రి. తల్లి చేతిలో పుట్టి కొన్నాళ్ళే అయిన చంటిబిడ్డ. వాళ్ళా వేడి ఇసుక ప్రాంతాన్ని దాటాలని కష్టపడి నడుస్తున్నారు. హఠాత్తుగా ఎటు నుంచో వచ్చిన ఒక కొండడేగ వాళ్ళ మీదుగా ఎగరసాగింది. ఆకాశాన్ని నల్లటి మేఘాలు ఆవరించాయి. క్షణంలో డేగ కిందికి వాలి తల్లి చేతిలోని బిడ్డను తన్నుకు పోయింది.
 
తల్లి ఆకాశం కేసి చూస్తూ, ‘‘అయ్యో! నా బిడ్డ,'' అని విలపిస్తూ ఇసుకలో కుప్పకూలిపోయింది. దీనిని చూసి తండ్రి అరుస్తూ కొంత దూరం డేగవెంట పరిగెత్తి నేలపై తూలిపడ్డాడు. ఏడుస్తూన్న శిశువును పదునైన గోళ్ళతో పట్టుకుని డేగ ఆకాశానికి ఎగిరిపోయింది.

_____________

దాపులనున్న మరొక అడవి. అక్కడ వేటాడుతూన్న వేటగాళ్ళకు ఆకాశంలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. తలెత్తి చూసిన వేటగాళ్ళు, ఒక డేగ బిడ్డను తన్నుకుపోతూండడం చూసి ఆశ్చర్యపోయూరు. వేటగాళ్ళ నాయకుడు డేగ మెడకు గురి చూసి బాణం వదిలాడు. బాణం దెబ్బ తగలగానే డేగ చచ్చింది. దాని వేళ్ళ గోళ్ళ నుంచి కిందికి జారిన బిడ్డను వేటగాళ్ళ నాయకుడు రెండు చేతులతో పట్టుకున్నాడు. పిల్లలు లేని వేటగాళ్ళ నాయకుడు అందమైన మగ బిడ్డను చూసి పరమానందం చెందాడు. బిడ్డను ఇంటికి తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు. వేటగాడూ, భార్యా బిడ్డ అందాన్ని చూసి మురిసిపోయూరు. బిడ్డ ముఖంలో దివ్యతేజస్సు కనిపించింది. రక్షకుడని పేరుపెట్టి రాజకుమారుడిలా పెంచసాగారు. రక్షకుడు గొప్ప విలుకాడుగా పెరిగి యుక్తవయస్కుడయ్యూడు. అతణ్ణి చూసి మనసులో ఎంతో గర్వ పడిన వేటగాళ్ళ నాయకుడు, ‘‘నాయనా! నిన్ను కన్న వాళ్ళెవరో నాకు తెలియదు.

 నీ ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతున్నది. నా తరవాత నువ్వే మన తెగకు నాయకత్వం వహించాలి. మన జీవితం కేవలం వేటకు మాత్రమే పరిమితంకాదు. ఒక్కొక్కసారి దారి దోపిడీ చేయవలసి ఉంటుంది. దొంగతనాలకు వెళ్ళవలసి ఉంటుంది. అది తరతరాలుగా వస్తూన్న మన వృత్తి. విలువిద్యలో నువ్వు ఆరితేరావు. ఇకపై చోరకళను కూడా నేర్చుకోవాలి. అది మన సంప్రదాయ వృత్తి. అయితే, నువ్వు ఎలాంటి పరిస్థితులలోనూ అబద్ధం అన్నది చెప్పకూడదు. అబద్ధ మాడడం ఏ ధర్మానికీ ఆమోదయోగ్యం కాదు,'' అన్నాడు. 

 ‘‘దొంగతనం మన సంప్రదాయవృత్తి గనక, దాన్ని నేను తప్పక చేపడతాను,'' అంటూ తండ్రి మాటను అంగీకరించిన రక్షకుడు, ‘‘నేనెప్పుడూ అబద్ధం చెప్పను,'' అని కూడా తండ్రికి మాట ఇచ్చాడు. కొన్నాళ్ళకు రక్షకుడు భయంకరమైన బంది పోటుగా తయూరయ్యూడు. వాడి పేరు వినగానే ప్రజలు గడగడలాడసాగారు.

________________________

అర్ధరాత్రి సమయం. గాలి వాన. రక్షకుడు దొంగతనం చేయడానికి నగరానికి వెళుతూ, వాన ఉధృతం కావడంతో దాపులనున్న పాత ుండపంలోకి వెళ్ళాడు. మారువేషంలో నగరసంచారం చేస్తూన్న ఆ దేశాన్నేలే రాజు కూడా వాన కారణంగా అదే మండపంలోకి చేరాడు. మారువేషంలో ఉన్న రాజు దొంగను, ‘‘నువ్వెవరు బాబూ?'' అని అడిగాడు.
 
‘‘నేనెవరన్నది నువ్వు అడుగుతున్నావు. మరి, నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా?'' అని ఎదురు ప్రశ్న వేశాడు దొంగ. నగర పరిస్థితులను రహస్యంగా తెలుసుకోవడానికి రాజు మారువేషంలో వచ్చాడు. కాబట్టి తన గురించి నిజం చెప్పే స్థితిలో ఆయనలేడు. అందువల్ల, ‘‘నాది ఈ ఊరు కాదు. జీవనోపాధి వెతుక్కుంటూ నగరానికి వెళుతున్నాను,'' అని అబద్ధం చెప్పాడు. అబద్ధాలు చెప్పలేని రక్షకుడు, ‘‘నేనొక దొంగను.
 
నా పేరు రక్షకుడు. వానకు తల దాచుకోవడానికి నీలాగే ఈ మంటపంలోకి వచ్చాను,'' అన్నాడు. ఆ మాట వినగానే రాజుకు తను అబద్ధం చెప్పవలసి వచ్చింది కదా అన్న బాధ కలిగింది. రక్షకుడు పేరుమోసిన దొంగ అయినప్పటికీ సత్యమే మాట్లాడగల అతడి ఉన్నత గుణాన్ని లోలోపల మెచ్చుకున్నాడు. దొంగ కేదైనా సాయం చేయూలనుకున్నాడు. ‘‘నువ్వు దొంగవైనప్పటికీ సత్యసంధుడివి. నీకోసాయం చేస్తాను.
 
నిధి ఉండే చోటు నీకు చెబుతాను. నువ్వు అక్కడికి వెళితే నీకు విలువైన వస్తువులు దొరుకుతాయి. నీకు దొరికే వాటిలో సగం నాకు ఇవ్వాలి,'' అంటూ రాజు దొంగతో ఒక ఒప్పందానికి వచ్చాడు. ఆ తరవాత నిధి ఉండే చోటును వివరించాడు. కాపలా కట్టుదిట్టంగా ఉంటుందనీ, కాపలా భటులు కడు సమర్థులనీ హెచ్చరించాడు. ‘‘ఆ విచారం నీకు వద్దు. ఈ రక్షకుడు వాటన్నిటినీ చూసుకోగలడు.
 
నువ్వు ఇక్కడే ఉండు. నీ వాటా పుచ్చుకుందువుగాని,'' అంటూ దొంగ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయూడు. రాజు అక్కడే కాచుకుని కూర్చున్నాడు. 

________________

సూర్యోదయం కాబోతోంది. వెలుతురును చూడడానికి రాజుకు భయంగా ఉంది. మారు వేషంలో వున్న రాజు తెల్లవారే సరికి రాజభవనం చేరుకోవాలి. దొంగ ఎప్పుడు వస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తూండగా రక్షకుడు వచ్చాడు.

కాపలా భటులతో పోరాడ్డం వల్ల ఒళ్ళంతా గాయపడి నెత్తుటి మరకలు కనిపించాయి. ‘‘ఆ కాపలా భటులు కూడా చాలా ధైర్యవంతులు. వాళ్ళను మట్టుపెట్టడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. అందుకే ఆలస్యమయింది,'' అంటూ దొంగ రాజు ముందు మిలమిల మెరిసే రెండు విలువైన వజ్రాలను ఉంచాడు. ‘‘ఇలాంటి వజ్రాలు ఆ పెట్టెలో మూడు కనిపించాయి. నేను దొంగిలించిన దానిలో నీకు సగం వాటా ఇవ్వాలి కదా? అందువల్ల రెండు వజ్రాలు మాత్రం తీసుకుని మూడో వజ్రాన్ని పెట్టెలోనే వదిలి వచ్చాను. వజ్రాన్ని రెండుగా పగలగొడితే ఎందుకూ పనికి రాకుండా వృధా అయిపోతుంది. ఇరువురికీ ఉపయోగ పడదు కదా,'' అన్నాడు దొంగ. తెల్లవారే లోపల రాజభవనం చేరుకోవాలన్న ఆదుర్దాలో, రాజు ఆ రెండు వజ్రాల్లో ఒక దాన్ని తనవాటాగా తీసుకుని, రాజభవనానికి హడావుడిగా తిరిగి వెళ్ళాడు. దొంగ కూడా అడవికి వెళ్ళిపోయూడు.

_____________ 

రాజు నిండు సభలో కొలువుదీరాడు. మంత్రి లేచి సింహాసనంలో ఉన్న రాజును చూసి, ‘‘ప్రభూ! తమరెందుకు అత్యవసరంగా సభ ఏర్పాటు చేశారో తెలుసుకోవచ్చా?'' అని అడిగాడు. ‘‘ఖజానా నుంచి వజ్రాలు దొంగిలించబడినట్టు నాకు రాత్రి కలవచ్చింది,'' అన్నాడు. ఆ మాట విన్న మంత్రి నవ్వుతూ, ‘‘ఖజానా కాపలాకు సమర్థులైన సైనిక భటులను నియమించి ఉన్నాం కదా ప్రభూ. ప్రపంచంలో ఎవ్వరూ వారిని ఓడించి ఖజానాలోపల అడుగుపెట్టలేరు.
 
మీ కల కేవలం కల మాత్రమే. విచారించకండి ప్రభూ!'' అన్నాడు. ‘‘నాకు విచారంగానే ఉన్నది. ఆ వజ్రాలు దాచిన రహస్య ప్రదేశం నీకూ, నాకూ మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి వజ్రాలు ఇంకా అక్కడ భద్రంగా ఉన్నాయేమో చూసిరా,'' అని ఆజ్ఞాపించాడు రాజు. మంత్రి, ‘‘చిత్తం ప్రభూ!'' అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.

______________

ఖజానా భవనం కాపలాకాస్తున్న సైనికులు చచ్చి పడి ఉన్నారు.లోపలి గదిలోకి వెళ్ళిన మంత్రి వజ్రాలు భద్రపరచిన పెట్టెను తెరిచి చూశాడు. దొంగ ఒక వజ్రాన్నయినా వదిలి పెట్టాడుకదా అని సంతోషించిన మంత్రి, దాన్ని తీసి భద్రంగా దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు.
 
____________________________
‘‘అవును ప్రభూ! మీరు కన్న కల నిజమయింది! విలువైన వజ్రాలు దొంగిలించబడ్డాయి. కాపలాకాస్తున్న సైనికులు కూడా చంపబడ్డారు,'' అన్నాడు సభకు తిరిగివచ్చిన మంత్రి.
 
దొంగలను ఎలాగైనా బంధించి సభకు తీసుకురమ్మని భటులకు ఆజ్ఞను కూడా జారీ చేశాడు. మంత్రి మాటలు విన్న రాజు సింహాసనం నుంచి లేచి నిలబడి, ‘‘సభాసదులారా! ఆ వజ్రాలను దొంగిలించిన వారిలో నేను ఒకణ్ణి. కొల్లగొట్టబడిన దానిలో నా వాటా ఇది,'' అంటూ తన వద్ద ఉన్న వజ్రాన్ని తీసి సభ ముందు ఉంచాడు. ఆ తరవాత రాజు, ‘‘రెండవ వజ్రాన్ని దొంగిలించిన వాడు పేరుమోసిన గజదొంగ రక్షకుడు.
 
మూడవ వజ్రాన్ని దొంగిలించిన వాడు అందరి లోకీ పెద్ద దొంగ. వాణ్ణే మనం పట్టుకోవాలి,'' అని చెప్పగానే మంత్రి అవమానంతో తలదించుకున్నాడు... ఇక్కడితో కథ ఆగిపోయింది... ‘‘గౌరవనీయమైన దొంగ కథ ఆ తరవాత ఏమయింది? మూడో వజ్రం ఏమయింది?'' అంటూ పిల్లలు బామ్మను ప్రశ్నలతో ముంచెత్తారు.
 
‘‘అది చాలా చాలా పెద్ద కథర్రా... ఆ తరవాత చాలా రోజులకు ఆ గౌరవనీయమైన దొంగ తపస్విగా మారి వాల్మీకి మహర్షియై రామాయణం రచించాడు,'' అంటూ బామ్మ ఆ పెద్ద కథను ఒక్క వాక్యంలో పూర్తి చేసేసింది. తక్కిన కథను ఏ తాతయ్యనుంచో, బామ్మ నుంచో మీరు వినవచ్చు. 


పరుసవేది


భూషయ్య, రంగమ్మల ఒక్కగానొక్క కొడుకైన చంద్రం చాలా తెలివైనవాడేగాక, చురుకైనవాడు కూడా. తండ్రి భూషయ్య మంచి మనిషిగా పేరుతెచ్చుకున్న బట్టల వ్యాపారి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయూలు, భాగస్వాముల ద్రోహం కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లింది. ఆ విచారంతో మంచం పట్టిన భూషయ్య కోలుకోలేక రెండేళ్ళ క్రితం మరణించాడు.
 
మిగిలివున్న కొద్దిపాటి ఆస్తిని, ఆయన చేసిన అప్పులు తీర్చడానికి అమ్మవలసి వచ్చింది. దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటి నుంచి బతుకుతెరువుకోసం ధనికుల ఇళ్ళల్లో పాచిపనులు చేయవలసి వచ్చింది. కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయూలన్నదే ఆమె లక్ష్యం. అయితే, పదమూడవయేట అడుగుపెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల ఇళ్ళల్లో పనిచేయడం చిన్నతనంగానూ, తీరని అవమానంగానూ తోచింది.
 
ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగవులాడుతూ, ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. తనకు తండ్రిలేకపోవడం, గౌరవంగా బతకడానికి తగినంత డబ్బులేకపోవడం పెద్ద లోటుగా భావించి బాధపడేవాడు. అప్పటికప్పుడు ధనవంతుడై పోవడానికి మార్గమేదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చుననీ, దానిని పరుసవేది అంటారనీ ఆ విద్య బైరాగులకూ, యోగులకూ తెలుసుననీ ఎవరో అనుకుంటూండగా విన్నాడు.

ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకుని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసిమనసులో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ళవెంట తిరిగేవాడు. కానీ వాళ్ళెవరూ పరుసవేది తెలిసినవాళ్ళు కారు. కొంతమంది సాధువులు తాము అన్నీ త్యజించినవాళ్ళమనీ తమకు బంగారంతో పని ఏముందనీ ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని.
 
మరి కొంతమంది అటువంటి విద్యలు లేవనీ, అయినా చిన్న పిల్లలు వాటిని గురించి ఆలోచించకూడదనీ మందలించేవారు. ఎవరెన్ని చెప్పినా చంద్రంలో మార్పురాలేదు. రంగమ్మకు కొడుకు విషయం అంతుపట్టకుండా పోయింది. ఒకనాడు రాత్రి భోజనానికి కూర్చున్న చంద్రానికి కంచంలో అన్నం పెడుతూ, ‘‘ఈ రోజు బడికి రాలేదని పంతులుగారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళావేంటి?'' అని అడిగింది రంగమ్మ. చంద్రం సమాధానం చెప్పకపోయేసరికి, రంగమ్మ మళ్ళీ ఒకసారి అదే ప్రశ్న అడిగింది.
 
దాంతో కోపగించుకున్న చంద్రం చివాలున లేచి, చేయికడుక్కుని ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు. ఏం చెప్పడానికీ తోచక రంగమ్మ లోలోపల దిగులుతో కుమిలిపోసాగింది. చంద్రం కొంతసేపు అటూ ఇటూ తిరిగి, గ్రామదేవత ఆలయం అరుగు మీద పడుకుని, కొంతసేపటికి అలాగే నిద్రపోయూడు. అర్ధరాత్రి సమయంలో ఏవో మాటలు వినిపించడంతో చంద్రం మేలుకుని పక్కకు తిరిగి చూశాడు. ఒక బైరాగి పద్మాసనం వేసుకుని కూర్చుని, ఏవో మంత్రాలు పైకి వినిపించేలా ఉచ్ఛరిస్తున్నాడు.
 
చంద్రం లేచి మెల్లగా వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. కళ్ళు తెరిచిన బైరాగి, ‘‘నువ్వు చంద్రానివి కదూ,'' అంటూ పలకరించి, వాణ్ణి గురించిన అన్ని విషయూలూ చెప్పాడు. చంద్రానికి ఆశ్చర్యం వేసింది. వాడు అందరు సాధువులను అడిగినట్టే బైరాగిని కూడా, ‘‘మీకు పరుసవేది తెలుసా?'' అని అడిగాడు. బైరాగి తెలుసు అన్నట్టు తల ఊపాడు. చంద్రానికి పట్టరాని సంతోషం కలిగింది. తాను కూడా వెంటవస్తాననీ, తనకు పరుసవేదిని నేర్పమనీ బైరాగిని ప్రార్థించాడు. అందుకు బైరాగి, ‘‘నాయనా, చంద్రం! పరుసవేది అంటే రసశిల.

అది సోకితే ఏలోహ మైనా బంగారంగా మారుతుంది. అది రసవిద్యకు సంబంధించినది. చాలా రహస్యమైనది. దానిని నీకు నేర్పడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే...'' అంటూ ఆగాడు. ‘‘ఏమిటి స్వామీ?'' అని అడిగాడు చంద్రం. ‘‘ఆ రసవిద్యను సాధించడానికి ఎంతో జ్ఞానమూ, పట్టుదలా కావాలి. చాలా శ్రమించాలి,'' అన్నాడు బైరాగి. ‘‘అందుకు నేనేం చేయూలో సెలవివ్వండి,'' అన్నాడు చంద్రం.
 
‘‘జ్ఞానార్జనకు చదువు మీద శ్రద్ధ, పట్టుదల పెంచుకోవాలి. అందివచ్చిన ప్రతి మంచి అవకాశాన్నీ శ్రద్ధాసక్తులతో వినియోగించుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. అన్నిటికీ మించి అహర్నిశలు నీకోసమే శ్రమిస్తూన్న మీ తల్లికి సాయపడాలి. రసవిద్యను సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి ఉంటుంది గనక, దీక్షతో శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలి. క్రమశిక్షణ కావాలి.
 
నేను ఒక సంవత్సరం తరవాత వచ్చి, నువ్వు సమర్థుడవని అనిపించినప్పుడు నిన్ను వెంటబెట్టుకు వెళ్ళి పరుసవేది విద్యను నేర్పుతాను,'' అని చెప్పి వెళ్ళిపోయూడు బైరాగి. తెల్లవారేసరికి చంద్రం ఒక నిర్ణయూనికి వచ్చాడు. తల్లి వచ్చేసరికి బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యూడు. రంగమ్మ ఆనందానికి అవధులు లేవు. చంద్రానికి మొదట్లో కొంచెం కష్టమనిపించినా క్రమక్రమంగా చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాడి ధ్యాసంతా చదువు మీదే.

తల్లి, బడిపంతులు, సహవిద్యార్థులు అందరూ అతణ్ణి మెచ్చుకోసాగారు. చంద్రం మనసులో స్వశక్తితో అన్నీ సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం వేళ్ళూనింది. అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అనుకున్నట్టే సంవత్సరం తిరిగేసరికి ఒక రోజు పట్టపగలే చంద్రం ఇంటికి వచ్చిన బైరాగి, ‘‘పరుసవేది నేర్పుతాను, నాతో రా,'' అన్నాడు. ‘‘నాకిప్పుడు పరుసవేది మీద ఆసక్తిలేదు,'' అన్నాడు చంద్రం వినయంగా.
 
అయితే బైరాగి, ‘‘ఇంతకాలం నీకోసమే కాచుకున్నాను. ఇప్పుడు రానంటే ఎలా?'' అని గద్దించాడు. ‘‘క్షమించండి. నేను రాలేను,'' అన్నాడు చంద్రం దృఢమైన కంఠస్వరంతో. బైరాగి మందహాసం చేసి, ‘‘నాయనా చంద్రం! నీలో విద్యార్జన పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయి. ఆత్మవిశ్వాసం ఏర్పడింది. కనుకనే పరుసవేదిని వద్దంటున్నావు. నీలో ఇలాంటి మంచి మార్పు రావాలనే, నేను ఆశించాను. విద్యకన్నా మించిన ధనం లేదు. స్వయంకృషితో సాధించుకున్నదాని విలువ చాలా గొప్పది.
 
ప్రతి మనిషిలో మామూలు లోహాల్లా ఎన్నో శక్తులు ప్రకాశించకుండా ఉంటాయి. వాటిలో మంచివాటిని గుర్తించి, సానబెట్టి మెరిసే బంగారంలా చేసుకోవాలి. పట్టుదల ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. నాకు తెలిసిన పరుసవేది అదే. మీ నాన్నగారి బాల్యమిత్రుడిగా నేను నీలో కోరుకున్నది కూడా ఈ మంచి మార్పే. మీ నాన్న బాగా బతికినకాలంలో ఆయన సాయం పొందినవాళ్ళల్లో నేనూ ఒకణ్ణి.
 
గత రెండేళ్ళుగా నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాను. నిన్ను సరైన మార్గంలో పెట్టడం నా బాధ్యతగా భావించి బైరాగి వేషం వేశాను,'' అన్నాడు పెట్టుడుగడ్డాన్నీ, జడలజుట్టునూ తీసి పక్కనపెడుతూ. చంద్రం ఆనందాశ్చర్యాలతో ఆయనకేసి చూస్తూండగా, అతడి తల్లి లోపలికి వచ్చి, తన బిడ్డను మంచి మార్గంలో పెట్టిన తన భర్త స్నేహితుడు నారాయణకు కృతజ్ఞతతో నమస్కరించింది.