Pages

Thursday, June 25, 2015

సింహం-నక్క-ఎలుగుబంటి

సింహం-నక్క-ఎలుగుబంటి దీనిలాంటి కథే ఒకటి స్కాంద పురాణంలో ఉంది. ఇది చదివాక, మంచి-చెడు, ధర్మం-అధర్మం గురించిన ఆలోచనలు రేకెత్తించే అద్భుతమైన ఆ కథ ను కూడా చదివి చూడండి!
గండకీ నదీ తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క- ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి.
నక్క ముసలిది- సొంతగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి ఇప్పుడు లేదు. ఎలుగుబంటిది మంచి మనసు. తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకూ కొంచెం పెట్టేది అది.
ఒకనాడు నక్క , ఎలుగుబంటి కలసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూండగా ఆకలిగొన్న సింహం ఒకటి వీటికి ఎదురైంది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి, నక్కతో "మిత్రమా, నక్కా! నువ్వేమో ఇప్పుడు పెద్దగా ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నావు.
ఆ సింహమేమో ఆకలిగొని ఉన్నది; మన వైపే వస్తోంది- దానికి చిక్కామంటే అంతే. అందుకని నువ్వు నా వీపును కరచుకో; నేను ఈ మహావృక్షాన్ని ఎక్కుతాను" అన్నది.
ఆ సరికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే తటాలున దాని వీపును కరచుకున్నది. ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది!
చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి-నక్క కదలక మెదలక ఉండగా చెట్టుకింద సింహం వాటివైపే చూస్తూ కూర్చున్నది. ఎలుగు-నక్క చెట్టు దిగలేదు. సింహం ఎంతకీ పక్కకు కదలలేదు.
'ఇంక కుదరదు' అనుకున్న ఎలుగుబంటి, చెట్టుపైనే కొన్ని కొమ్మలు విరిచి, పడుకోవడానికి ఒక పక్కను ఏర్పాటుచేసింది. చీకటిపడ్డాక అది నక్కతో- "మిత్రమా! సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో‌ మనం‌ ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే, ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి" అన్నది. నక్క సరేనన్నది.
అప్పుడు ఎలుగుబంటి "వయసు పైబడ్డ దానివి- ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్ర లేపి, ఆపైన నేను నిద్రపోతాను- నువ్వు కాపలా కాద్దువు" అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది.
చెట్టుక్రిందనే వీటికోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో అన్నది- "ఓ మిత్రమా, ఎలుగు బంటీ! నువ్వు ఆ ముసలి నక్కకి కాపరివని నాకు తెలుసు. అయినా నా మాట విను- నువ్వు గానీ ఆ నక్కను కిందకి తోసేశావంటే, నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళి పోతాను. అట్లా నా ఆకలీ తీరుతుంది; నీకు ఆ ముసలినక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువూ తగ్గుతుంది" అని.
ఎలుగుబంటి టక్కున జవాబిచ్చింది- "చూడు, సింహరాజా! ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు.
నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను. అది నన్నే నమ్ముకుని బ్రతుకుతోంది. నామీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతోందో చూడు.
ఏ జీవికీ నిద్రాభంగం కలిగించకూడదు. అది మహా పాపం. నిద్రలోనే కదా, అన్ని ప్రాణులూ బడలికను పోగొట్టుకొని హాయినీ, సుఖాన్నీ పొందేది? నేను దీన్ని మోసం చేయటం అసంభవం. ఎన్ని రోజులైనా సరే, నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను" అని. అంతలోనే రాత్రి మూడవ జాము ప్రవేశించింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి, తాను పడుకున్నది.
కొంత సేపటికి, ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక, చెట్టు క్రింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది- "నక్కబావా! నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో గదా! ఈ ఎలుగుబంటి తను తినదు; నిన్ను తిననివ్వదు- నాకు తెలుసు.
నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను- నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందికి తోసెయ్యి- నేను దాన్ని చంపి తిని, మిగిలిన మాంసాన్ని నీకూ పెడతాను; నువ్వూ తినొచ్చు. మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడినుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయించేసుకున్నాను. నా నిశ్చయం ఎంత దృఢమైనదో నీకు తెలుసు- తెలివైనదానివి- ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ ఎలుగును తోసెయ్యి" అన్నది, నక్కను ప్రలోభ పెడుతూ.
నక్క కాసేపు ఆలోచించి- ఎలుగుబంటిని కిందికి తోసేసింది.
కిందపడ్డ ఎలుగు దగ్గరకొచ్చి నిలబడి, సింహం ఎగతాళిగా నవ్వుతూ- "ఎలుగుబంటీ, చూశావా?! ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందికి తోసెయ్యకపోతివే; అది చూడు, నిన్ను ఊరకనే కిందికి తోసేసింది- చూస్తివా, నక్క తెలివి?" అన్నది.
ఎలుగుబంటి విచారంగా నవ్వి, "సింహరాజా! ఆ ముసలినక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది. ఈరోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను- ఎందుకంటే నామీద నాకు విశ్వాసం ఉంది. నేను కౄరజంతువునే; కానీ ఏ ప్రాణికీ కావాలని హాని తలపెట్టను. నా మంచితనం వల్ల నాకు హాని వాటిల్లదు- అనేది నా విశ్వాసం.
నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని, నీ ఆకలి తీర్చుకుంటావు- నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే. కానీ నక్క-?! దానంతట అది క్రిందికి దిగలేదు; మరి చెట్టు మీద దానికి ఆహారమూ దొరకదు. చివరికది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది; లేదా చెట్టు మీది నుండి క్రిందపడి ఎముకలు విరిగి చస్తుంది. ఇది సత్యం.
ఇక ఈ 'నక్క తెలివైనది కాదు' అనేది స్పష్టం. దానికి ఉన్నది కేవలం మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప, తెలివి కాదు. నిజానికి నక్క తిక్కది- అందుకనే ముందుచూపు లేక, ఈ పనికి ఒడి గట్టింది" అన్నది ఎలుగుబంటి, ధైర్యంగా.
"నేను నిన్ను తినకుండా వదిలేస్తాను- మరి ఇప్పుడయినా చెట్టెక్కి నక్కను క్రిందికి తోసేస్తావా?" అంది సింహం.
"అలా చేయను. ఎందుకంటే, 'మోసం చేసినవాడు తనంతట తానే నష్టపోతాడు' అని దీని ద్వారా అందరికీ తెలియాలి" అన్నది ఎలుగు బంటు.
ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను తింటే అది నాకు మంచిది కాదు- నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే- నీ దారిన నువ్వు పో" అని బయలుదేరింది సింహం. ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళింది.
నక్క మాత్రం అటు చెట్టు దిగలేక, ఇటు ఆహారమూ లేక అలమటించి, చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు విడిచింది.

అంతా మన మంచికే

అనగనగ ఒక రాజు గారు. ఆయన దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటుండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకి వెళ్ళినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా అంతా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు.
.
కాని రాజు వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు. వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. ‘‘నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?’’ అనడిగాడు. అప్పుడు మంత్రి ‘‘నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతో పాటు నన్నూ పట్టుకునేవాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు. అందుకే ఏం జరిగినా "
అంతా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు..!