Pages

Sunday, December 8, 2013

సత్యమేవ జయతే

ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండ, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.
ఒక రోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్దమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపునిండ పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.
ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా! ఏమి మాయమాటలు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను” కోపంగా అన్నది పులి. “నీవు అలా అనుకోవడం సరి కాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.
ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని “సరే” అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా! బుద్దిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉండి, ఎట్టి పరిస్థితులలోను అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు మంచి బుద్దులు చెప్పి ఆవు అడవికి చేరుకొన్నది. ఆవుని చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవుని వదిలివేసింది పులి.

ఈ కథలోని నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

మితిమీరిన ఆశ

ఒక అడవిలొ ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కాని అది చిన్న జంతువు కదా! అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో, పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం చేస్తుండేది.
ఇలా ఉండగా ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవిపంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల పందికి గాయం అయింది తప్ప వేంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిమీదికి దూకి అతడిని చంపి మరికొంత సేపటికి పంది కూడా చచ్చిపోయింది.
ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురశ కదా! వేటగాడి పక్కనే పంది ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ” ఈ నాల్గింటి మాంసం తరువాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపేట్టుకుందాం ” అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగతంతో వంగి ఉన్న బానంబద్ద ఊపుగా నిటారుగా సాగి, నక్క గుండెకు గట్టిగా గుద్దుకున్నది. నక్క అక్కడికక్కడే మరణించినది.

ఈ కథలోని నీతి దురాశ దుఃఖం చేటు

చెడు అలోచనల ప్రభావం

ఒక మంత్రిగారు పనిమీద ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు. అతనికి దాహంగా ఉండి దగ్గర్లోనే ఉన్న పొలంలోకి వేళ్ళాడు. మంత్రిగారికి రైతు తన చెరకు తోట నుండీ తాజా చెరకురసాన్ని తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరకు తోటపై పడ్డాయి. ఏపుగా పేరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకోంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తియ్యగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వేలిబుచ్చాడు. ” మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది” అని రైతు సమధనం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్నడు మంత్రి.
ఈ కథలోని నీతి “చెదు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి”

గర్వం పనికిరాదు

ధనం ఉందని ఎదుటివాడిని కించపరచగూడదు. తనకైతాను గర్వపడకూడదు. నేనే ధనవంతుడినినని మీరనుకుంటే మీకంటే ఎక్కువ ధనవంతులయిన వారు, గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నరు. సాయంకాలం వేళ మిణుగురు పురుగులు బయటికొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతూన్నానని భావిస్తుంది. కాని నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మిణుగురు పురుగు గర్వం పటాపంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. కాని చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తనవల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయ వెలుగులో చంద్రుడు ఉన్నచోటు తెలియకుండా పొతుంది. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు.
ఈ కథలోని నీతి “తనే గొప్ప అని ఎన్నడూ విర్రవీగకూడదు”.

అద్దం లో మనిషి

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు.
వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.





ఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతని అందమే అతని అహంకారం. ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి ఆటను సిద్ధ పడ్డాడు.

ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లి ఉపాయమడిగాడు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. “రోజు ఈ అద్దం చూసుకో. నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు యెప్పుడు ఇలాగే ఉండిపోతావు” అన్నాడు. “కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది.” అని హెచ్చరించాడు.

అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.

ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాంకారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధ పడ్డా, అతను చేసే పనులు, నడవడిక మార్చుకోలేదు.

కొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తె భరించలేనంత అసహ్యంగా తయ్యరాయ్యింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది. అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.

ఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది.

తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది. ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ ఎజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.

ఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప.

ఒక రాజు, యేడుగురు కొడుకులు

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”
రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”
ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…
చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు.

వేరుశనగ దొంగ

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.

అలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.

రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.

చదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.

ళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.

లేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.

“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది.

స్నేహబలం

హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.

సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.





‘స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. ‘అవును నిజమే!’ అన్నాయి ఎలుక, కాకి. ‘ఇప్పుడు ఏం చేద్దాం!’ అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను’ అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.
తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో ‘వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా’ అంది. ‘భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!’ అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.

ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. ‘చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.

మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. ‘నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.

జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి ‘అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే’ అనుకుని బాధపడ్డాయి.

అప్పుడు హిరణ్యకుడు ‘స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. ‘హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. ‘వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను’ అని చెప్పింది.

ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని ‘ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.
వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి ‘కావ్! కావ్’మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.

‘ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.

ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.