Pages

Wednesday, August 15, 2012

వేళాకోళం

పూర్వం ఒకసారి ఇద్దరు మిత్రులు వ్యాపార నిమిత్తం కాలినడకన ఒక ఊరు నుండి మరొక ఊరుకు ప్రయాణం సాగిస్తున్నారు. ఒక గ్రామానికి చేరుకోగానే వారికి చాలా ఆకలి వేసింది. వెంటనే వారు సత్రం ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. శాంతమ్మ అనే వంటావిడ సమయం కాని సమయంలో వచ్చినందుకు వారిపై విసుక్కోకుండా వేడివేడి అన్నం వండి పెట్టింది. బాగా ఆకలితో ఉండటంతో స్నేహితులిద్దరు కడుపారా తృప్తిగా భుజించారు.

"నీ రుణం తీర్చుకోలేం. ఇంద ఈ డబ్బులు ఉంచు" అని ఇవ్వబోయారు. "అయ్యో డబ్బులు వద్దు నాయనా... ఆకలి వేసిన వారికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. అయినా ఇది ఉచిత సత్రం. ఒక దాత ఆధ్వర్యంలో ఈ సత్రం నడుస్తుంది." అని చెప్పింది అవ్వ.

తరువాత మాటల సందర్భంలో ఆమె తనకు నడుం నొప్పి ఉందని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదని ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అడిగింది.

ఆ స్నేహితులిద్దరిలో కాశీనాథ్‌ అనేవాడు అందరితో వేళాకోళాలు ఆడుతూ ఉంటాడు. మరొక స్నేహితుడు వారిస్తున్నా వినకుండా "అవ్వా నడుముకు తాడు కట్టుకుని నీ పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు కొమ్మకి వేలాడి పదిసార్లు అటూ ఇటూ ఊగు. అప్పుడు కూడా నీ నడుము నొప్పి తగ్గకుంటే మా ఊరురా" అని అతని పేరు ఊరు చిరునామా చెప్పాడు.

"పాపం ఎందుకలా అబద్ధం చెప్పావు? అమాయకురాలైన అవ్వను ఆటపట్టించడం సరికాదు" అంటూ కాశీనాథ్‌ను చివాట్లు పెట్టాడు స్నేహితుడు.

"ఏదో తమాషాకి అలా చెప్పాను లేరా... ఆమెకు ఆ మాత్రం తెలీదా? తనంతట తానుగా తాడు కట్టుకుని ఊగలేదు. ఎవరినైనా సహాయం అడిగితే వారు ఆమెతో పాటు మనల్ని కూడా చివాట్లేస్తారు" అని అన్నాడు కాశీనాథ్‌.

కొంతకాలం గడిచింది. ఈ సంఘటన గురించి స్నేహితులిద్దరూ మర్చిపోయారు. ఒక రోజు కొందరు వ్యక్తులు కాశీనాథ్‌ను వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చారు.

"నేనే కాశీనాథ్‌ని. ఏంటి విషయం?" అని అడిగాడు. "అయ్యా మేము శాంతమ్మ అనే ధనవంతురాలు పంపించగా వచ్చాం. మీరేదో చిట్కా చెప్పారట కదా! అది బాగా పనిచేసిందని చెప్పమంది. అంతేకాదు చింతచెట్టు కొమ్మ విరగడంతో అక్కడ ఆమె పూర్వికులు దాచిన బంగారు కాసులు బయటపడ్డాయని, ఎప్పుడైనా అటువైపు రావడం జరిగితే ఆమె తప్పకుండా కలుసుకోమని చెప్పింది" అని అన్నారు.

వారు చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన కాశీనాథ్‌ ముందువెనుకలు ఆలోచించకుండా వెంటనే ఆ ఊరు వెళ్ళాడు. వేళాకోళానికి చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన శాంతమ్మ కాశీనాథ్‌ చెప్పినట్లు చేసి నడుము విరగ్గొట్టుకోవడంతో సత్రం కాస్తా మూత పడింది. జరిగింది తెలుసుకున్న గ్రామ ప్రజలు తెలివిగా కాశీనాథ్‌ను తమ ఊరికి రప్పించి దేహశుద్ధి చేసి పంపించారు. చావుతప్పి కన్ను లొట్టపోయినంత పని అయి కాశీనాథ్‌ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని లెంపలేసుకున్నాడు.

వెర్రి వెంగళాయిలు

ఐదుగురు వెర్రివెంగళప్పలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పొరుగుదేశానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారు నది దాటవలసి వచ్చింది. నది దాటిన తర్వాత వారిలో ఒక వెర్రివెంగళప్ప - "ఆగండాగండి! ఇంతకీ మనమంతా సరిగానే నది దాటామా? లేదా ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోయామా?" అనే సందేహాన్ని లేవదీశాడు.

"అయితే అందర్నీ లెక్కించు. మొత్తం మనం ఐదుగురం ఉండాలి" సలహా ఇచ్చ్హాడో వెర్రివెంగళప్ప.

మొదటి వెంగళప్ప లెక్కించడం మొదలెట్టాడు. 'ఒకటి... రెండు... మూడు... నాలుగు...' తనను తప్ప మిగతా వారందరినీ లెక్కపెట్టాడు. "మనం ఇంతకు ముందు అయిదుగురం ఉన్నాం. కాని ఇప్పుడు నలుగురమే ఉన్నాం. అయ్యో మనలో ఒకడు నదిలో మునిగిపోయాడు" అన్నాడు కంగారుగా.

దానితో భయపడ్డ మిగతా వెంగళప్పలు, మొదటి వెంగళప్పలాగే లెక్కించారు. ఎన్నిసార్లు లెక్కించినా లెక్క నాలుగనే తేలుతోంది. తమలో ఒకడు మునిగిపోయాడని అంతా నిర్ధారించుకున్నారు. అంతా ఒకచోట కూర్చుని ఏడవడం మొదలెట్టారు. అటుగా వెళ్తున్న పండితుడు ఏడుస్తున్న వాళ్ళను చూసి "ఏమైంది బాబూ ఎందుకేడుస్తున్నారు?" అని ప్రశ్నించాడు.

"మేం ఐదుగురం ఉండేవాళ్ళం. మాలో ఒకడు నదిలో మునిగిపోయాడు" జరిగింది వివరించి చెప్పారు వెంగళప్పలు.

"కాని మీరు ఐదుగురూ ఇక్కడే ఉన్నారు కదా!" అన్నాడు పండితుడు.

"లేదు. ఒకడు మునిగిపోయాడు. మేము లెక్కపెట్టి చూశాం..." అంటూ మళ్ళీ ఏడవటం మొదలెట్టారు.

పండితుడు ఎన్ని రకాలుగా వివరించినా వెంగళప్పలకు అర్ధం కాలేదు. ఆయన విసిగిపోయి ఏదైనా కర్ర దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూశాడు. ఏమీ కనిపించకపోవడంతో తన కాలిజోడు విప్పాడు. "ఏదీ అందరూ వరుసగా నిలబడి ఒక్కొక్కరు నా ముందుకు రండి" అన్నాడు.

పండితుడు కాలిజోడుతో ఒక్కక్కరి తలపై కొడుతూ వాళ్ళ చేతనే అంకెలు చెప్పించాడు. చివరివాడు 'అయిదు' అని అనగానే వెంగళప్పలు ముఖాలు ఆనందంతో విప్పారాయి. వెంటనే ఆ పండితుడి కాళ్ళపై పడ్డారు. "అయ్యా మీ కాలిజోడు ఎంత మహత్తరమైనది. మునిగిపోయిన మా స్నేహితుడిని తిరిగి కాపాడింది. మీరు ఎంతో గొప్పవారు" అని అన్నారు. పండితుడు వెంగళప్పల తెలివి తక్కువ తనానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

వెండి నాణెం

పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. భీమయ్యకు బాగా ఆకలివేస్తోంది. అందుకని దగ్గర్లోని పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పేదరాశి పెద్దమ్మ ఇంటి ప్రక్కనే కల్లు దుకాణం ఉంది. ఆ దుకాణం యజమానురాలి పేరు సూరమ్మ. భీమయ్య అక్కడికెళ్ళేటప్పటికి సూరమ్మ చేపలు వేయిస్తోంది. భీమయ్య ఇదేమీ పట్టించుకోలేదు. పేదరాశి పెద్దమ్మ దగ్గరకెళ్ళాడు.

ఆమెకు కొంత డబ్బిచ్చి, కడుపునిండా భోజనం చేశాడు. బయటకొచ్చి తన దారిన తాను వెళ్ళసాగాడు. ఇంతలో సూరమ్మ గోలగోలగా అరుస్తూ అతని దగ్గరకెళ్ళింది. సూరమ్మ అరుపులకు చుట్టుపక్కలవాళ్ళు అక్కడ చేరారు. ఆమె ఎందుకు అలా అరుస్తుందో భీమయ్యకు అర్ధం కాలేదు. అదే అడిగాడు. "ఈ పెద్దమనిషి నా చేపల వాసన పీల్చి, డబ్బులివ్వకుండా చక్కా పోతున్నాడు అంది సురమ్మ. ఆ మాటలకు భీమయ్య తెల్లబోయాడు. "చేపల వాసన పీల్చినందుకు డబ్బులివ్వాలా! ఎంత?" అయోమయంగా అడిగాడు. "ఒక వెండి నాణెం" చెప్పింది సూరమ్మ.

"ఇది చాలా అన్యాయం. బజర్లో పీల్చిన వాసనకు కూడా డబ్బులివ్వాలా? నేనివ్వను" అన్నాడు భీమయ్య. అతనితో సూరమ్మ వాదనకు దిగింది. చివరకు వాళ్ళిద్దరూ పట్టణాధికారి దగ్గరకెళ్ళారు. జరిగిందంతా ఆయనతో చెప్పారు. "అవునయ్యా...నువ్వు చేపల వేపుడు వాసన పీల్చడం వలన ఆ కూర రుచి తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఆమెకు డబ్బులివ్వాల్సిందే" చెప్పాడు పట్టణాధికారి. భీమయ్యకు ఏమీ పాలుపోలేదు. అయోమయంగా అయన్నే చూస్తూ నిలబడ్డాడు. అతణ్ణి చూసి పట్టణాధికారి చిరునవ్వు నవ్వాడు.

"చూడు భీమయ్య...నేనిచ్చిన తీర్పు ప్రకారం నువ్వు వెండి నాణాన్ని ఎండకు ఎదురుగ్గా పెట్టు. సూరమ్మ వచ్చి ఆ నాణెం నీడను పట్టుకుంటుంది. చెల్లుకు చెల్లు" అన్నాడు పట్టణాధికారి. ఇది విన్న తరువాత సూరమ్మ ముఖం మాడిపోయింది. అత్యాశకు పోయినందుకు తనను తానే నిందించుకుంది. పట్టణాధికారిని, భీమయ్యను క్షమాపణ కోరింది. భీమయ్య సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు.       

విశ్వాసం

ఒకరోజు అక్బర్‌ చక్రవర్తికి ఒక సందేహం వచ్చింది. " ప్రపంచంలో అతి విశ్వాసపాత్రమైన జంతువు, అసలైన విశ్వాసఘాతుకమైన జంతువు ఏమిటి?" అనేదే ఆయన సందేహం. అదేమాట బీర్బల్‌కు చెప్పి తన సందేహం తీర్చుకోవాలనుకున్నాడు అక్బర్‌. "ప్రభూ! నేను రెండు రోజుల్లో మీ దగ్గర ఆ రెండు జంతువులను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పాడు బీర్బల్.

రెండు రోజుల తర్వాత, బీర్బల్‌ అక్బర్‌ చక్రవర్తికి దర్బార్‌లోకి ఒక కుక్కను, తన సొంత అల్లుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. బీర్బల్‌ అక్బర్‌కు వివరిస్తూ "ప్రభూ! మీరు కోరినట్లుగానే మీ ముందు ఆ రెండు జంతువులలో ప్రపంచంలో అత్యంత విశ్వాసమైన జంతువు కుక్క. అది మనం ఏది పడేసిన తిని బతికేస్తుంది. కుక్కను తన యజమాని ఎంతగా కొట్టినా అతని ఇంటిని మాత్రం విడిచివెళ్లదు. అది జీవితాంతం యజమానికి విశ్వాసపాత్రమైనదిగా బతుకుతుంది" అని చెప్పాడు.

ఆ తరువాత ఎవరి గురించి చెబుతాడా అని కుతూహలంగా ఎదురు చూస్తుండగా, బీర్బల్‌ "మహరాజా! దీనికి పూర్తి వ్యతిరేకంగా, అల్లుడు అత్యంత విశ్వాస ఘాతకుడు. చేయించుకున్న సహాయాన్ని తెలివిగా, తక్కువ సమయంలో మరిచిపోతాడు. తన మామ ప్రపంచంలోని సంపదనంతా చేతిలో పెట్టినా అతనికి సరిపోదు. మామకు సంబంధించిన సంపద అంతా తనదేననట్లు భావిస్తుంటాడు అల్లుడు" అన్నాడు.

బీర్బల్‌ వివరణ ఆలకించిన అక్బర్‌ చక్రవర్తి అతడి చాతుర్యానికి, లోకజ్ణానానికి, తెలివితేటలను మెచ్చుకుంటూ, "నిజమే బీర్బల్! నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం. మనమంతా ఎవరో ఒకరికి అల్లుళ్లమే కాని మన మామలు చేసిన సహాయం, త్యాగం, మరేదైనా కాని, దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఈ ఒక్క నిరూపణ చాలు ఒక అల్లుడే ప్రపంచంలో అతి పెద్ద విశ్వాసఘాతకుడు, కృతజ్ణత లేనివాడు అని చెప్పడానికి" అన్నాడు అక్బర్‌.

విలువైన నిజం

ఎప్పుడూ నిజాలు చెప్పే రాము, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని రంగా ఇద్దరూ కలిసి ఒకరోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా వారిద్దరూ వానరాల రాజ్యంలో అడుగుపెట్టారు. ఆ సంగతి తెలిసిన వానర రాజు, అతని సైనిక కోతులకు రాము, రంగాలను బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశం జారీచేశాడు. అంతే, క్షణాల్లో సైనికకోతులు వారిద్దరినీ బంధించి రాజు దగ్గరకు తీసుకెళ్ళాయి.

రాజు తన సభికులతో కొలువుదీరి ఉన్నాడు. సభలో సింహాసనం మీద కూర్చున్న కోతుల రాజు రాము, రంగలిద్దరినీ తన సభలోకి ఆహ్వానించాడు. "మానవుల్లారా! నేను ఈ రాజ్యానికి అధినేతను. నేను మీకు ఎటువంటి రాజులా కనిపిస్తున్నాను?" అని అడి్గాడు.

ఎప్పుడూ అబద్ధాలు తప్ప నిజాలు చెప్పని రంగా కోతుల రాజువైపు చూస్తూ. "ప్రభూ! మీరు అత్యంత వీరులైన, శక్తిసంపన్నులైన రాజులా కనిపిస్తున్నారు" అన్నాడు. "మరి నా పక్కన ఉన్న నా సైన్యం, పరివారం ఎలా ఉన్నారు?" అని అడిగారు కోతుల రాజు. "శక్తి సంపన్నమైన రాజుకు బలవంతులైన బుద్ధిమంతులైన అనుచరులు, సహచరుల వలె ఉన్నారు వీరంతా" అని బదులిచ్చాడు రంగా. తమని పొగిడిన రంగాను వానరులు ఒక సింహాసనం వేసి కూర్చొబెట్టడంతో అతను పొంగిపోయాడు.

ఆ తర్వాత ఎప్పుడూ నిజాలే చెప్పే రాము వైపు తిరిగి కొతుల రాజు. "ఇప్పుడు మీరు చెప్పండి. నేను నా పక్కనున్న వారంతా మీకు ఎలా కనబడుతున్నాం? ఏ మాత్రం సంకోచించకుండా చెప్పండి" అని పలికాడు. అబద్ధం చెప్పిన వాడిని సింహాసనం మీద కూర్చొబెట్టాడు ఈ కోతి గాడు. కాని నేను నా వ్యక్తిత్వాన్ని వదులుకో లేను. కాబట్టి నాకు తోచినట్టు నిజమే చెబుతాను అని మనసులో అనుకున్న రాము. "నీవు ఒక అద్భుతమైన వానరానివి. నీ పక్కనున్న వారంతా నీలాగే వీరులైన కోతులు" అంటూ చెప్పసాగాడు.

అంతే రాము నిజాయితీని, వ్యక్తిత్వాన్ని చప్పట్లతో అభినందించిన కోతుల రాజు అతనికి వజ్రాలు, రత్నాలు బహుమానంగా ఇచ్చాడు. అబద్ధం చెప్పిన రంగాకు వంద కొరడా దెబ్బల శిక్ష విధించాడు కోతుల రాజు. అబద్ధం చెప్పిన రంగా ఒళ్లంతా గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నాడు. వ్యక్తిత్వం చంపుకోలేక నిజం చెప్పిన రాము వజ్రాలు, రత్నాలతో ఇంటికి చేరుకున్నాడు.

విలువైన ఉంగరం

ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు. "అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడూ తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు.

వారిలో జ్యేష్టుడు ఇలా మొదలుపెట్టాడు, "నాన్నా! విను. ఒక రోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్ని అంతా నాకు అప్పగించి, తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా వుంచుకోమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి యిచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బునిమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర వుంచేసుకునేవాణ్ణే, కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబూ వడ్డీతోసహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు, ఆ వజ్రాల వుంగరానికి నేను తగినవాణ్ణే కదా!" అన్నాడు. వృద్ధుడు ఇలా అన్నాడు "కాని అబ్బాయీ, లోకంలో అంతరాత్మ వుండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు" అన్నాడు.

ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. "నా సముద్ర యానంలో వానా, వురుములతో సహా పెనుతుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను. నాన్నా, ఇప్పుడు చెప్పు, నేను యదార్థమైన మానవతా వాదినే కదా" అన్నాడు. దానికి ఆయన తండ్రి "మంచి పనే చాశావు నాయనా! నీ జీవితాన్నే నీవు లక్ష్యపెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కాని పిరికిపందకానివాడు, ఎవరైనాసరే సరిగ్గా అలాగే చేసేవాడు" అన్నాడు.

ఆఖరి కొడుకు తన అనుభవాన్ని యిలా చెప్పసాగాడు, "నాన్నా! నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి నా శత్రువులు నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఏటవాలుగా వుండే చోటుకు అతను దొర్లిపోయాడు. ఇంక కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అక్కడకు అతన్ని పోనివ్వలేదు. అతను నా శత్రువైనా అతన్ని లేపి ఆసన్న విపత్తునుండి అతన్ని రక్షించాను" అని ముగించాడు. అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ "అబ్బాయీ! నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు, శత్రృత్వాన్నీ, పగనూ మనస్సు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. నీవే నిజమైన మానవతాభిమానివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి" అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహూకరించాడు.       

విలువ లేని వజ్రం

ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంత రాజు వచ్చ్హాడు. తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి "ఇది ఒక వజ్రం, దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తళతళ మెరుస్తున్న వస్తువు కనబడింది. అంతే! దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు.

అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాని, వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్‌నానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కాని వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్కకట్టడం ఎవరి వల్లా కాలేదు. కాని అందరు కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు.

దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకు వచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ కచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరు ధైర్యం చేయకపోగా, నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని "ఓస్‌ అదెంత పని" అనుకుంటు ముందుకు నడిచి, "రాజా! ఇది వెలకట్టలేని రాయి", అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతివద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు. "రామలింగా! ఏంచేస్తున్నావ్‌" సున్నితంగaామందలించాడు రాజు. "ప్రభూ! నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను" చెప్పాడు రామలింగడు. "రాజా్! ఇది ఒక విలువలేని రాయి" తేల్చేశాడు రామలింగడు. "రామలింగా్! ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు" మరోసారి మందలించాడు రాజు. "సరే రాజా" అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగaాచేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు.

"రాజా! మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం" అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా, రామలింగడు "అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా! నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను" అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి, పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలిరామలింగడు.

విననిది, రానిది, లేనిది - వింతకథ

కాంభోజనగరంలో విమలుడనేవాడుండేవాడు. ధనవంతుడయిన అతను ఉదారుడే, అతిధిపూజలు చేసేవాడే. కాని అతని భార్య కుటిలమాత్రం పేరుకి తగ్గ స్త్రీ. ఆమె తన యింటికెవరయినా వచ్చి దాహం (మంచి నీళ్ళు) అడిగితే 'నేను విననిదీ, నీకు రానిదీ, భూమిలో లేనిదీ అగు ఒక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగిచ్చి నీ దాహం తీరుస్తాను' అనేది - మంచినీళ్ళివ్వకుండా. ఎవరెంత చిత్రమయిన కథచెప్పినా -'ఓస్ దింతేనా' అని పరిహాసం చేసి దాహమివ్వకుండానే పొమ్మనేది. శాంతుడనే వాడు ఉజ్జయినీ నగరం వాడే. కానీ అతను దేశాటనం చేస్తుండగా అక్కడికి రావడమూ, కుటీలను దాహమడగడమూ ఆమె కథ చెప్పమనగా అతనికి కథ చెప్పడం ఇష్టంలేక మరో యింట దాహం తీర్చుకొని ఉజ్జయినీ తిరిగి వచ్చాక కుటిల విషయం విక్రమార్కుడికి విన్నవించడమూ జరిగింది.

విక్రమార్కుడు శాంతడిని వెంటబెట్టుకొని కాంభోజ నగరం కుటిల, విమలుల యింటి విషయాలన్నీ బాగా తెలుసుకొని విమలుడింటిలో లేని మిట్టమధ్యాహ్నవేళ ఎండలో చెమట కారుతుండగా ఆ యింటి ముందు నిలుచుని కుటిలను దాహమడిగాడు. ఆమె ఎప్పటిలానే నేను విననిది, నీకు రానిది, భూమిలో లేని కథను చెప్పితివా చక్కని మజ్జిగయిస్తాను అంది. దానికి రాజు అమ్మా! నాకపరిమితమగు దాహం వేస్తుంది. అందుకు కారణముంది. నేనీ నగరానికి ప్రవేశిస్తూంటే తోటలో విమలుడను సజ్జనుడున్నాడని విని అక్కడికి వెళ్ళి దాహమడిగితే భార్యతో సరసములాడుటలో మునిగిన అతను నా మాట లక్ష్యము పెట్టలేదు. నేను మళ్ళీ మళ్ళీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను భార్యతో పడమట దిక్కుగా పోయాడు. పరుగెత్తిరావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది. దాహం తీరాక నువ్వడిగిన కథ చెబుతాను. అన్నాడు. ఆ మాటలు వింటూనే కుటిల తోక తొక్కిన తాచులా మండిపడుతూ తన భర్త పర స్త్రీతో సరసాలాడుతున్నాడనే కోపంతో అతనిని దండించాలని వెదకుతూ పడమర దిక్కుకు పరుగెత్తింది. కొంతసేపటికి విమలుడు పొలం నుంచి అలసిసొలసి యింటికి వచ్చి భార్య కనబడక వీధి అరుగుమీద కూర్చున్న విక్రమార్కుని 'ఈ యింటామె ఎటు పోయింది?' అని అడిగాడు. 'నేను దాహమడిగాను. కాని ఆమె నా మాటలు వినిపించుకోకుండా ప్రియుడితో సరసాలాడుతూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోయింది. మీరయినా నాకు దాహమీయరా?' అన్నాడు. తన భార్య వేరొకరితో పోయినదనే కోపంతో విమలుడామెను దండించాలని వెతుక్కుంటూ తూర్పు దిశగా వేగంగా వెళ్ళిపోయాడు. అంతలో పొరుగూరిలో ఉన్న కూతురికి జబ్బుచేసిందని చూసిరావడానికి వెళ్ళిన విమలుని తల్లి ఊరి చివరి నుంచి తిరిగివచ్చి యింట్లో ఎవరూలేకపోవడం గమనించి వీధి తిన్నెమీదున్న అతన్ని 'ఈ యింటిలో వాళ్ళెక్కడికెళ్ళారు?' అని అడిగింది.

'అమ్మా! ఈ యింటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వానిని పూడ్చి పెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగాపోయారు. అని చెప్పాడు మారువేషంలోని రాజు. ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశగా పరుగెత్తింది. ఒకరికి తెలియకుండా ఒకరు యింటినుంచి పోయిన విమలుడు కుటిలా ఒక చోట కలుసుకుని ఒకరినొకరు నిందించుకుంటూ, అసహ్యించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా విమలుని తల్లి కూడా వారిని చేరుకుంది. ఒక నీటి గుంట ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న కొడుకునీ, కోడలినీ చూసి తను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కూతురు చనిపోయినందుకు కాబోలు ఆవిడ ఏడవసాగిందనుకొని వారు కూడా ఆవిడని పట్టుకొని బిగ్గరగా ఏడవసాగారు. కాని, ఎవరు మాత్రం ఎంత కాలమని ఏడవగలరు? కొంతసేపట్లో వాళ్ళూ ఏడుపాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని యింటికి బయలుదేరారు. ఈ లోగా విక్రమార్కుడు వాళ్ళింట్లో ప్రవేశించి ఆ యింటి దూలములు, వాసములు, స్థంబములు మొదలగువాని లెక్క రాసుకున్నాడు.

విమలుడు, భార్య, అత్తగారు యింట్లోకి వెళ్ళబోతుంటే వారినడ్డుకొని విక్రమార్కుడు ఈ ఇల్లునాది. మీరెందుకు లోపలికి వెళ్తున్నారు? అని దెబ్బలాడసాగాడు. వాళ్ళు తెల్లపోయారు. 'ఈ ఇల్లు మాది, నీదంటావేం? నడు, వీధిలోకి నడు, పెద్దమనుషుల దగ్గర తేల్చుకుందా, అన్నారు. అతను 'సరే' అని పెద్దమనుషుల దగ్గరకు వచ్చి వీరెవరో నా యింటిలో చొరబడబోవుచున్నారు అని తగవు పెట్టాడు. విమలుడి కుటుంబం పెద్దమనుషులని ఆ యిల్లు మాదని మీరెరుగరా అని అడుగుతుంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ యింటి దూలములు, వాసాలూ ఎన్నో చెప్పమనండి. లేకపోతే నేను చెబుతాను అన్నాడు రాజు. ఇంక వాళ్ళేమీ చెయ్యలేక రాజువేపు ప్రాధేయపడుతూ చూసి మీరెవరో పెద్దమనిషిలాగే ఉన్నారు. ఇలాంటి అన్యాయానికెందుకు పూనుకుంటున్నారు? అన్నారు బతిమాలుతు. అప్పుడు విక్రమార్కుడు అయ్యా! నీ ఇల్లాలు విననిదీ, నాకు రానిదీ, భూమిలోలేనిదీ అయిన కథ చెప్పినవారికి దాహమిస్తానని చెప్పింది. అందుకే నేనీ కథ చెప్పితిని అనగా అతని యుక్తికందరూ మెచ్చుకున్నారు. కుటిలని అందరూ ఎగతాళీ చేశారు. దానితో కుటిల తన కుటిలమార్గాన్ని వదిలి బుద్ది తెచ్చుకొని జీవించడం మొదలుపెట్టింది. రాజు తనతో వచ్చిన శాంతుడికి అనేక విధములయిన కానుకలిచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు.       

వింతపరిష్కారం

శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు.

ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.

మొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! " నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.          

వింత కోరిక

ఒకప్పుడు ఒక తేనెటీగ ఎంతో కష్టపడి తన తుట్టెలలో దానికవసరమైన ఆహారాన్ని దాచిపెట్టుకునేది.

ఒకరోజు ఆ తేనెటీగ తన తుట్టెలోని తేనెను స్వర్గంలో ఉన్న బ్రహ్మ దేవుడికి సమర్పించాలని నిశ్చయించుకుంది. వెంటనే స్వర్గానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి తేనెను బహూకరించింది. బ్రహ్మ సంతోషంగా తేనెను అందుకున్నాడు. తేనెటీగ భక్తికి మెచ్చిన బ్రహ్మ ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు.

కొంతసేపు ఆలోచించిన తేనెటీగ తనకు ఒక విషపు కొండిని ప్రసాదించమని కోరింది. ఎవరైనా తన దగ్గరకొచ్చి తేనె దొంగిలించాలని చూస్తే వాళ్ల ప్రాణాలు తీసేంత విషపూరితంగా ఆ కొండి ఉండాలని కోరుకుంది.

బ్రహ్మదేవుడికి తేనెటీగ కోరుకున్న వరం నచ్చలేదు. కాని బ్రహ్మ ఏమీ అనలేక నువ్వు అడిగినట్లు విషపు కొండిని ఇస్తాను. నువ్వు ఆ కొండితో కుడితే మనిషి చచ్చిపోయేంత విషపూరితంగా ఉండదు కాని అతనిని కొంత గాయపరిచేట్లు ఉంటుందని చెప్పాడు. కాని ఇతరలను కుట్టడం నీకు కుడా అపాయమే, దానివల్ల నీ ప్రాణాలు పోతాయి, అని బ్రహ్మదేవుడు తేనెటీగకు వరమిచ్చాడు. తేనెటీగకు అది వరమో, శాపమో అర్ధంకాలేదు.

వల్లభుడు వనదేవత

వల్లభుడు అడవిలో కట్టెలు కొట్టి జీవించేవాడు. ఆరోజు అడవికి వెళూతుండగా 'రేపు అమ్మాయి పుట్టినరోజు , దానికి చిలక బొమ్మ కావాలట! ఎకువ కర్రలు కొట్టి, ఎక్కువ డబ్బు తీసుకురా!' అన్నది వాడి భార్య. వల్లభుడుకి అడవిలో ఒక్క ఎండుపుల్ల కూడా దొరకలేదు. వాడు ఒక పచ్చని చెట్టును నరకబోయాడు. అతని ముందు వనదేవత ప్రత్యక్షం అయ్యింది. 'ఈ అడవిలో వున్న ఒకే ఒక గంధం చెట్టు ఇది! దానిని నరకవద్దు!' అంటూ వల్లభుడిని వేడుకుంది ఆమె. వల్లభుడు తన కష్టం చెప్పుకున్నాడు. 'మీ అమ్మాయికి మాట్లాడే చిలకను ఇస్తాను!' అంటూ చప్పట్లు చరిచింది వనదేవత. ఒక పంచవెన్నెల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది! ఆ చిలుకను వల్లభుడికి ఇచ్చింది వనదేవత!

మాట్లాడే చిలుకను చూసి ముచ్చటపడింది. వల్లభుడి కూతురు. భార్యకి జరిగింది చెప్పాడు వల్లభుడు. 'వనదేవత పుణ్యాన నీకు శ్రమజీవితం తప్పింది! ఈ చిలుకతో నగర కూడలిలో కూర్చో! చిలుక మాటలు వినడానికి రుసుము వసూలు చేయి!' అన్నది వల్లభుడి భార్య. వల్లభుడు చిలకను పెట్టుకొని కూడలిలో కూర్చున్నాడు. జనం అతని చుట్టూ పోగుబడ్డారు! ఆవైపుకి తిక్కరాజు వచ్చాడు. అటువంటి చిలుకను తనకు బహుమతిగా ఇవ్వనందుకు వల్లభుడి మీద మండిపడ్డాడు. వల్లభుడికి ఆరుకొరడా దెబ్బలు శిక్షవేశాడు. చిలుకను తీసుకుపోయాడు. 'ఆ వెర్రిబాగుల వనదేవత అండ మనకు వుంది! ఈరోజు నా పుట్టిన రోజు అని చెప్పు! గంధం చట్టు నరుకుతున్నట్లుగా నటించు! నాకోసం చంద్రహారం అడుగు! అన్నది వల్లభుడి భార్య. ఆ విధంగానే వనదేవతకు చెప్పాడు వల్లభుడు. గంధం చెట్టు నరకనందుకు చంద్రహారం ఇచ్చింది వనదేవత!

హారాన్ని వేసుకొని ఊరంతా తిరిగింది వల్లభుడి భార్య! ఆరాత్రి ఇంట్లో దొంగలు పడి హారం ఎత్తుకెళ్ళారు. 'మన దరిద్రం తీరిపోవాలి! వనదేవతను అడిగి బస్తా బంగారు నాణాలు తీసుకురా! పట్నం వెళ్ళి వ్యాపారం చేద్దాం!' అన్నది వల్లభుడి భార్య. వనదేవత వల్లభుడికి బంగారు నాణాలు ఇచ్చింది. బస్తా భుజాన వేసుకొని వస్తున్నాడు వల్లభుడు దారిలో రక్షక భటులు వాడిని అడ్డగించారు! బస్తాలో బంగారం చూసి వాడిని తిక్కరాజు దగ్గరికి తీసుకుపోయారు. తిక్కరాజు వల్లభుడి మాటలు వినిపించుకోలేదు! 'ఈ గజదొంగని చెరసాలలో పెట్టండి! ధనాన్ని కోశాగారంలో జమ చేయండి!' అనాడు. చేయని నేరానికి పది నెలలు కారాగారం శిక్ష అనుభవించాడు వల్లభుడు.

అతను తిరిగి రాగానే భార్య గొడ్డలి చేతికి ఇచ్చింది. ' అమ్మాయి పుట్టిన రోజు దగ్గర పడుతుంది! వనదేవత నడిగి మంచి బహుమానం తీసుకురా!' అన్నది. వల్లభుడు. ఆ గొడ్డలిని బావిలో పడవేశాడు. గంధం చెట్టు చాయలకు వెళ్ళలేదు. అడవిలో కుంకుళ్ళు, జిగురు, చింతపండు ఏరాడు. అవి అమ్మి కూతురికోసం చిలక బొమ్మకొన్నాడు. బొమ్మ చిలక తెచ్చావేం? వనదేవత ఏం అన్నది? అనికోపంగా అడిగింది వల్లభుడి భార్య. ఆ మధ్య గాలివానకి గంధం చట్టు నేలకూలింది. వనదేవత కనిపించలేదు. అయినా మనం చెట్లు నరకనవసరం లేదు. మనం సుఖంగా బతకడానికి దారి లేకపోలేదు! ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా వుంది. అన్నాడు వల్లభుడు. అటవీ సంపదను పోగు చేసి బజారులో అమ్మిన వైనాన్ని భార్యకు వివరించాడు.       

వడ్లవాడు - సింహము

"ఒక గ్రామంలో ఒక వడ్లవాడు ఉండేవాడు. అతడు ప్రతిదినమూ అడవికి పోయి తనకు కావలసిన కట్టెలు తెచ్చుకొనేవాడు. ఇట్లు జరుగుచుండగా ఒకనాడు ఒక సింహము అతనికి ఎదురైనది. దానిని చూచి అతడు గడగడా వణికిపోతూ అక్కడే నిలబడిపోయెను. సింహము అతని చూచి జాలిపడి "నేను నిన్ను ఏమీచేయను, భయపడకు" అని చెప్పగా, అతడు సంతోషించి తన దగ్గరున్న అన్నమూ, కూరలు దానికి పెట్టెను. ఆ పదార్ధములు తిని సింహము తృప్తి పడెను.

పిమ్మట ఆ వడ్రంగి ప్రతిదినమూ రుచిగల పదార్ధములు తెచ్చి సింహమునకు పెట్టసాగెను, క్రమముగా సింహమునకు వడ్రంగికీ మంచిస్నేహము కలిగెను. అతడు తెచ్చిపెట్టుచున్న పదార్ధములు తిని ఆడుచూ పాడుచూ కాలము గడుపుచుండెను. ఆ సింహమునకు మంత్రులుగావున్న కాకి, నక్క ఒకనాడు దానిని చూచి "స్వామీ! మీరు ఈమధ్య వేటాడుటలేదు. మాతో పూర్వమువలే తిరుగుటలేదు. కారణమేమి అని అడుగగా, సింహము తనకు వడ్రంగితో స్నేహము కలిగినప్పటి నుంచి జరిగిన విషయములన్నింటినీ చెప్పెను. అది విని "ప్రభూ! తమ క్రొత్త స్నేహితుడగు వడ్లవానిని చూడవలెనని కుతూహలముగా ఉన్నది. అని కాకి నక్క పలికినవి. "సరే, నావెంట రండి" అని సింహము వారిని తీసుకోని బయలుదేరెను.

ఇట్లు వచ్చుచున సింహమును చూచి వడ్రంగి పరుగెత్తిపోయి ఒక చెట్టెక్కి కూర్చుండెను. సింహము ఆ చెట్టుకిందకి పోయి 'చెలికాడా! నిన్ను చూడవలెనన్న కుతూహలముతో నాస్నేహితులు రాగా నువ్వు చెట్టెక్కి కూర్చుంటి వేమి?" అని అడిగెను. అప్పుడు వడ్లవాడు 'మృగరాజా! నీవు మంచివాడవే కానీ నీ వెంట వచ్చిన సేవకులు మంచివారు కాదు. నీతో వచ్చిన నక్క యుక్తులు కలది. కాకి ఇష్టమైన ముక్కు, దొంగబుధ్ధి గలది. కనుక నీతో స్నేహము చేయుట మంచిది కాదని తలచి చెట్టేక్కితిని" అని చెప్పగా, సింహము సిగ్గుపడి వెళ్ళిపోయెను, పిమ్మట చెట్టుదిగి వడ్లవాడు తన యింటికి పోయెను.       

లంచగొండికి శిక్ష తప్పదు

హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. రెండు వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది. ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజూ ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకుని కోశాధికారి రెండు వరహాలు ఇస్తున్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర రెండు వరహాలు తీసుకున్నాడు. తిన్నగా యింటిదారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు.

'నన్ను రోజూ రాజుగారి దగ్గర చూస్తున్నారు కదా! నేను రాజుగారి మంగలిని. రోజూ రాజుగారికి మర్దన చేస్తాను' అన్నాడు ఆ మనిషి. అవును. మిమ్ములను అక్కడ చూశాను. ఇంతకూ నాతో ఏమిటి పని? అన్నాడు పుండరీకుడు. నేను రోజూ రాజుగారికి మర్దన చేస్తాను. ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు. అంటే ఆ సంతోషం నావల్లనే కదా వస్తోంది! నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది. నేను కోశాధికారికి చెబితే నీకు రావలసిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలీ అంటే నువ్వు ఒక పనిచేయాలి. నాకు రోజూ నీకు వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి. రోజూ అర వరహా కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. వాడి పేరు చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత "నేను నీకు లంచం ఇవ్వను" అని తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య, శర్మను వదలలేదు. రోజూ దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య. 'రాజుగారు మీమీద కోపంగా ఉన్నారు' అన్నాడు చెన్నయ్య శర్మతో.

ఎందుకూ? అన్నాడు శర్మ. 'మీరు ముక్కు నుండి వదిలేగాలి వాసన వస్తోందట. ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకుని రమ్మని చెప్పారు' అన్నాడు చెన్నయ్య. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు వొత్తుతూ 'కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్నచూపు చూస్తూ ఉంటారు' అన్నాడు చెన్నయ్య. 'ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు?' అన్నారు మహారాజు. తమరి నుండి రోజూ రెండు వరహాలు తీసుకు వెళ్ళే బ్రాహ్మణుడు. అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతున్నాడు. ఏమిటి సంగతి? అని అడిగాను నేను. రాజుగారి నోటినుండి చెడువాసన వస్తోంది. అది తట్టుకోవాలీ అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు మహారాజా! అన్నాడు చెన్నయ్య వినయంగా! మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకూ, మూతికీ ఎర్రని గుడ్డ కట్టుకుని రాజుగారిని కలిశాడు. రాజుగారు సంగతి ఏమిటి? అని శర్మను అడిగారు. 'నా ముక్కు నుండి చెడు వాసన వస్తోంది. దానివల్ల మీకు చిరాకు కలుగుతోంది. దానిని నివారించడానికే మహారాజా!' అన్నాడు శర్మ అమాయకంగా! రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ.

మరురోజు శర్మకు రెండు ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. 'ఈ రెండో ఉత్తరం చెన్నయ్యకి ఇవ్వండి. మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి' అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు. నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. "చెన్నయ్యా! నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధ పడుతున్నాను. ఈ రోజు నాకు డబ్బు అక్కరలేదు. ఈ ఉత్తరం తీసుకు వెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో" అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. "నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు. నీ నోటిని సూదీ దారంతో కుట్టమని మహారాజుగారి ఆజ్ఞ. నీ లంచగొండి తనానికి యిదే తగిన శిక్ష" అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు.       

రెండు నాలుకలవాడు

ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్లు తరుముతున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా, ప్రాణభయంతో, ఊపిరి బిగబట్టి పరుగుతీస్తోంది. తోడేళ్లు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి. నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి "అయ్యా! నేను ప్రాణ భయంతో పరిగెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్లు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు" అని అంది. బదులుగా అతను "సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకుని వస్తున్నావు. నువ్వు ఇక్కడ దాక్కున్నావని చెప్పనులే" అన్నాడు.

అంతలో తోడేళ్లు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి. " అయ్యా! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. ఆ నక్క గాని ఇటు వైపు వచ్చిందా? చెప్పండి. మీకు మేము రుణపడి ఉంటాం", అని అన్నాయి తోడేళ్లు ముక్తకంఠంతో. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక వైపు చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డువైపు చూపిస్తూ, " అటుగా వెళ్ళింది" అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్లు అతను చూపించిన రోడ్డువైపు పరిగెత్తాయి. "హమ్మయ్య" అని బయటకొచ్చిన నక్క తన దారిలో తాను వెళ్తుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, " నువ్వు మామూలు వాడివి అయితే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాలుకలవాడివి. నావైపు చూపిస్తూ మరోవైపు వెళ్లిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు" అంది నక్క.

రూపాయల పళ్ళెం

ఒకరోజు దర్బారులొ అతిముఖ్యమైన పనులు ఏమీ లేకపొవడంతో అక్బర్ చక్రవర్తి చాలా కులాసాగా ఉన్నాడు. ఎవరూ చడీచప్పుడూ చేయకుండా అక్బరు ఏదైన మాట్లాడితే జవాబు ఇవ్వాలనుకుని ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. అక్బరుకు ఆరోజు, సభ చాలా చప్పగా జీవం లేనట్లు అనిపించింది. అందుకే ఆయన కొంచెం సేపు ఆలోచించి, భటుల చేత ఒక తివాచీ, ఒక రూపాయల పళ్ళెం తెప్పించాడు. ఒక ప్రక్క రూపాయల పళ్ళెం ఉంచి దాని ముందు తివాచీ పరచమని ఆజ్ఞాపించాడు. తరువాత అందరినీ కలియజూస్తూ ఈ రూపాయల పళ్ళెం మీ కోసమే తెప్పించాను. ఐతే ఎవరు తెలివిగా, యుక్తిగా ఆలోచించగలరో వారికి ఈ పళ్ళెం బహుమానంగా దొరుకుతుంది. ఈ తివాచీని తొక్కకుండ, అటు ప్రక్కలకి వెల్లకుండా ఆ పళ్ళెంని తెచ్చుకొండి. మీరు వెళ్ళాల్సిన దారి తివాచీ పరచిన వైపే" అని చెప్పాడు.

'ఎటూ వెళ్ళకూడదట. తివాచీని తొక్కకుండా దాటాలిట. ఇది సాధ్యం అయ్యే పనేనా?' అన్న సందేహంతో ఎవరూ ముందుకు రాలేదు.

"ఏం బీర్బల్ నీకు కూడా ఈ పని సాధ్యం కాదా?" నవ్వుతూ ప్రశ్నించాడు అక్బరు.

"ఎందుకు కాదు ప్రభూ! ఇక్కడున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆగాను. వెంటనే ఆ పని చేస్తే ఎవరికో వచ్చే బహుమతి నేను కొట్టేసినట్టవుతుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి తెచ్చుకుంటాను" అని అన్నాడు వినయంగా బీర్బలు.

"ఆలస్యం ఎందుకు? వెళ్ళితీసుకో"అనుమతి ఇచ్చాడు అక్బర్. బీర్బల్ వెంటనే తీవాచీని చుట్టుకుంటూ వెళ్ళి, రుపాయలపళ్ళెం తీసుకున్నాడు.తిరిగి తివాచీని పరుచుకుంటూ వెనక్కివచ్చాడు.బీర్బల్ యుక్తిని అక్బరు చక్రవర్తే కాదు,ఆయనంటే ఆసూయపడే రాజోద్యోగులు కూడ మెచ్చుకున్నారు.

రామలింగడు -నలుగురు దొంగలు

శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు.

అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు.

అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు.

ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.

రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.        

రామలింగడి రాజభక్తి

శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కిందపడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.

ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.

రామలింగడు సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.

"ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.

రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.

రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.       

రామన్న తీర్పు

ఒకసారి మర్యాదరామన్న కొలువుకు ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో వచ్చారు. వారిద్దరిలో ఒకరు ఆ ఊరిలో పేరున్న ధనికుడు, మరొకరు రైతు.

"మా పూర్వికులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది. ఇతను వ్యాపార నిమిత్తం పొరుగుదేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్ళాడు. తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళితే ఇవ్వడం లేదు" అని రైతు ఫిర్యాదు చేశాడు.

'నీ సమాధానం ఏమిట'ని రెండో వ్యక్తి వైపు చూశాడు మర్యాదరామన్న. అప్పుడు ధనికుడు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి, కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి "రైతు చెప్పింది నిజమే. అతని దగ్గరున్న వజ్రం లాంటిది కొండానికి, పొరుగుదేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి తీసుకెళ్లింది వాస్తవమే, అయితే నేను ఇంటికి చేరుకున్న క్షణమే అతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను. రైతు దురాశతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒకదాన్ని పొందటానికి ఎత్తు వేస్తున్నాడు" అని చెప్పాడు.

ఆలోచనల్లో పడిపోయాడు రామన్న. ఇచ్చినప్పుడుగాని, పుచ్చుకున్నప్పుడుగాని చూసిన సాక్ష్యులు ఎవరూ లేరు. వ్యవహారమంతా కేవలం ఇద్దరి మద్యే గడిచింది.

"చూడండి! మీ లావాదేవీలో దేవుడే సాక్షి. మీకు ఇంకొక్క అవకాశం ఇస్తున్నాను. దేవుడు మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి" అని ఆదేశించాడు రామన్న.

ధనికుడు వెంటనే తన కర్రను మళ్ళీ రైతు చేతిలో పెట్టి, రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టుగా పైకెత్తి "ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను. రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను" అని ప్రమాణం చేశాడు. ధనికుడు ప్రవర్తన నిశితంగా గమనించిన రామన్నకు విషయం మొత్తం అర్ధమ్మయింది.

ధనికుడు రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు. "ఆగు! ఆ కర్రను తీసుకోవద్దు. అది రైతుకు పరిహారంగా ఇవ్వబడుతోంది" అని తీర్పు చెప్పాడు. అది విని రైతు, ధనికుడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

"ఇంటికి వెళ్ళి ఆ కర్రను జాగ్రత్తగా విరగ్గొట్టి చూడు" అని రైతుకు చెప్పి పంపించేశాడు. ఆ తీర్పుతో నిరాశచెందిన రైతు రామన్నను రెట్టించే ధైర్యం లేక ఇంటికి వెళ్ళి కర్రను పగలగొట్టి చూశాడు. అందులోంచి అతను ధనికుడికి ఇచ్చిన వజ్రం బయటపడింది.

అత్యాశకు పోయి రైతును మోసగించినందుకు ధనికుడికి తగినశాస్తి జరిగింది.       

రాజగురువు తెలివి

ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు.

పూర్వము ఒకప్పుడు ఒక మహర్షి వుండేవాడు. ఆయనవద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. విధ్యాభాసం పూర్తయ్యాక వారు గురువును సెలవు కోరారు. అప్పుడు గురువు ఇద్దరికీ పిడికెడు విభూతి ఇచ్చి వెళ్ళి సుఖంగా వుండమని దీవించాడు. అందులో ఒకడు విభూతిని ఎంతో భక్తితో స్వీకరించి తినివేశాడు. మరొకడు చిన్నచూపుతో దాన్ని పారవేశాడు. విభూతిని స్వీకరించినవాడికి సకల విధ్యలు అబ్బినాయి. అన్ని వేళలలో నిష్ణాతుడయ్యాడు. రెండవ వాడు మాత్రం మందబుద్దితో తిరిగి వచ్చి గురువును తూలనాడాడు. రాజగురువు పై కధ చెప్పి నా తీర్పువిన్నాక రెండవ శిష్యునివలే తనను నిదించకూడదని అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. సమస్యను రేపు పరిష్కరిస్తానని రాజగురువు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కధలో మొదటి శిష్యుడు చేసినట్లు చేయవలసిందిగా అర్జున్ కు రాజగురువు రహస్యంగా వర్తమానం పంపాడు. సురేంధ్రనగర్ అర్జున్ సింగ్ ఆధీనంలోకి రావాలన్నదే రాజగురువు ఆశ కూడ.

మరుసటి నాడు రాజ గురువు రెండు చీటీలను ఉండలుగా చుట్టి అర్జున్ సింగ్ ను సాబల్ సింగ్ ను ఇష్టానుసారం తీసుకోమని చెప్పాడు. అర్జున్ సింగ్ చీటీ తీసుకొని మ్రింగివేసాడు, సాబల్ సింగ్ చీటీ చూచుకొన్నాడు. అందులో "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసి వుంది. మాట ప్రకారం సాబల్ సింగ్ సురేంద్ర నగరను అర్జున్ సింగ్ కు వదిలి పెట్టాడు. అయితే రాజగురువు రెండు చీటీలనూ ఒకే విధంగా అంటే "సురేంద్ర నగర్ మీదికాదు" అని రాసినట్లు తెలియదు. ఎంతో తెలివిగా ఆయన సురేంద్రనగర్ ను బుధ్ధిమంతుడైన అర్జున్ సింగ్ కు వచ్చేలా చూశాడు. మంత్రి సుబుధ్ధితో ఈ విషయం వివరించాడు.

అప్పుడు సుబుద్ది కాసేపు ఆలోచించి రాజుతో రాజా! మనవూరిలో రామశర్మ అనే కంసాలి వున్నాడు. అతడు రధాన్ని బాగా నడపగలడు. కానీ కొంత బంగారాన్ని మాత్రం మూడొ కంటికి తెలియకుండాతీసుకొన్నాడు! అని పలుకగా రాజు ఆశ్చర్య పడి అతనిని పిలుచుకురమ్మని ఆఙ్ఞాపించాడు. కొంత సేపటికి రామశర్మరాగా రాజు అతనిని చూచి "ఓయీ! నీవు మాకొక బంగారు రధాన్ని చేయవలె. అందుకు ఎంత బంగారం కావాలని ప్రశ్నింపగా "రాజా! ఆ రధమునకు యాబదివేల వరహాలు విలువచేసే బంగారం కావాలి" అని బదులు చెప్పాడు. "ఓయీ! నీవు మూడోకంటికి తెలియకుండా బంగారాన్ని తీసుకుంటావంటకదా!" అని రాజు పలుకగా "ఓ రాజా! నేను అనుకొంటే మొత్తం తీసుకోగలనని" శర్మ బదులిచ్చాడు. "ఓ రామశర్మ! నీవు చెప్పినట్లే మొత్తం బంగారాన్ని తీసుకోగలిగితే నేను నా ఆస్థాన స్వర్ణ కారునిగా నియమిస్తాను.       

రంగమ్మ గంగమ్మ

ఒక ఊళ్ళో రంగమ్మ, గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ప్రక్కప్రక్కనే కాపురం వుంటున్నారు. రంగమ్మకు రెండు గేదెలు ఉన్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ వుంది. గంగమ్మకు ఎనిమిది గేదెలు వున్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తున్నది ఆమె. ఇలా వుండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర వీశెడు నెయ్యి అప్పుతీసుకున్నది. ఎన్నిరోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గయ్యాళి గంప. ఎప్పుడూ ఇరుగుపొరుగు వాళ్ళతో నిష్కారణంగా తగవులాడుతూ వుంటుంది. ఆమె నోటికి భయపడి అందరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. ఇలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని బుద్ది మంతురాలయిన రంగమ్మ లోలోపల మదనపడింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి 'గంగమ్మక్కా! నా దగ్గార వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నావు. నీవే బాకీ తీరుస్తావని వూరుకున్నాను కానీ, నెలలు గడిచిపోయినా నీవు ఆ ప్రస్తావనే చేయలేదు. మరచిపోయావేమోనని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు. నెయ్యి అప్పు తీరుస్తావా అక్కా!' అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ వెర్రెత్తినట్లు బర్రెగొంతుతో బిగ్గరగా అరుస్తూ పొట్లాటకు దిగింది.

ఆహా! చోద్యంగా వుందే! నేనేమిటి? నీ దగ్గర నెయ్యి అప్పుతీసుకోవడమేమిటి! ఎనిమిది గేదెల పాడి చేస్తున్న నేను ముష్టి రెండు గేదెలతో బతుకుతున్న నీ దగ్గర వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నానంటే ఎవడైనా నమ్మే విషయమేనా? ఇక నోరుమూసుకొని ఊరుకో! ఎవరైనా వింటే నవ్విపోతారు. అని రంగమ్మపై విరుచుకుపడింది. ఆమెతో పోట్లాడే శక్తిలేక రంగమ్మ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకొని తర్వాత మర్యాదరామన్న దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించి గంగమ్మ పై ఫిర్యాదు చేసింది.

మర్యాద రామన్న ఒకనాడు గంగమ్మను న్యాయసభకు పిలిపించాడు. సభలో అడుగుపెడుతూనే గంగమ్మ గణాచారిలా చేతులు తిప్పుకుంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అయ్యా! ఇదేనా మీధర్మం? నన్ను సభకుపిలిపించడం న్యాయమేనా? నాకు ఎనిమిది గేదెల పాడి వుంది. ఈ రంగమ్మ రెండు గేదెలు పెట్టుకొని బ్రతుకుతున్నది. అలాంటిది నేను ఆమె దగ్గరికిపోయి నెయ్యి అప్పు అడిగే అవసరం ఏముంటుంది? ఎవరినయినా చెప్పమనండి. ఇది నమ్మదగిన విషయమేనా? వినడానికే వింతగాలేదూ? నాపై గిట్టక ఆ రంగమ్మ లేనిపోని అబద్దాలు కల్పించి నా మీద ఫిర్యాదు చేసింది. మీరు ఆలోచించి రంగమ్మకు తగిన విధంగా బుద్ది చెప్పండి అని అన్నది రంగమ్మ. మర్యాద రామన్న ఆమె మాటల ధోరణి గమనించాడు. ఆమె మాటలలోని కపటం గ్రహించాడు. తీర్పు వాయిదా వేసి మరునాడు రంగమ్మను, గంగమ్మను ఇద్దర్నీ సభకు రావలసినదిగా ఆదేశించాడు. మరునాడు రామన్న తన న్యాయస్థానం ముందు భాగమంతా అడుసుపోయించి అంతా బురదగా వుండేటట్లు చేయించాడు. సభ ప్రారంభమయ్యే సమయానికి రంగమ్మ, గంగమ్మ వచ్చారు. వారిద్దరూ ఆ బురదలో నడూస్తూ న్యాయసభ దగ్గరకు రావలసి వుంది. అలాగే రంగమ్మ, గంగమ్మ మోకాలి లోతు బురదలో నడుచుకుంటు మర్యాదరామన్న సమక్షానికి వచ్చారు. వెంటనే రామన్న వాళ్ళిద్దరికి బురద కాళ్ళు కడుక్కోవడానికి రాజభటులచేత రెండు చెంబులతో నీళ్ళు తెప్పించాడు.

రంగమ్మ చెంబుడు నీళ్ళలోసగం నీళ్ళతోనే శుభ్రంగా బురద కడుక్కొని ఇంకా సగం నీళ్ళు మిగిల్చింది. కాని గంగమ్మ చెంబుడు నీళ్ళు ఖర్చుచేసినా కాళ్ళబురద పోలేదు. మరో చెంబు నీళ్ళు అందించారు భటులు, రామన్న ఆజ్ఞ ప్రకారం. అలా రెండు చెంబుల నీళ్ళు ఖర్చు చేసినా గంగమ్మకాళ్ళకు బురద పూర్తిగా పోలేదు. అది చూచి రామన్న గంగమ్మతో ఏవమ్మా! రెండు చెంబులునీళ్ళు ఇచ్చినా నీవు నీ కాళ్ళబురద వదిలించుకోలేకపోయావు. కాని రంగమ్మ సగం చెంబు నీళ్ళతోనే శుభ్రంగా బురద కడిగేసుకున్నది. దీన్ని బట్టి నీవు ఎంతటి దుబారా మనిషివో తేలిపోతుంది. నీకు వుండటానికి ఎనిమిది గేదెలు ఉన్నా, నెయ్యితీసి పొదుపుచెయ్యడం నీకు చేతకాదు. దుబారాగా ఖర్చుచేయటం నీకు అలవాటు. నీకు రంగమ్మ దగ్గర వీశెడు అప్పు తీసుకున్న మాట వాస్తవమే! రంగమ్మకు రెండు గేదెలున్నా పొదుపుగా వాడుకొనే మనిషి కాబట్టి నీవు వెంటనే వీశెడు నెయ్యి రంగమ్మకు ఇవ్వు, లేకపోతే నీకు మరణశిక్ష పడుతుంది అని అన్నాడు. గంగమ్మ మారూమాట చెప్పలేకపోయింది. చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని వీశెడు నెయ్యి తెచ్చి రంగమ్మకు ఇచ్చింది.        

యముడి వింత కోరిక

యమధర్మరాజుకు ఓసారి తన జీవితంపై విరక్తి పుట్టింది. ఆయుష్షు తీరిన జీవుల ప్రాణాలను హరించడం, వారికి నరక దండన విధించడం.... ఇదే పని కావడంతో ఆయనకు తన పనిమీద విసుగుపుట్టింది. మిగిలిన దేవుళ్లందరూ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తమను గురించి తపస్సు చేసిన భక్తులకు ప్రత్యక్షం కావడం, కోరిన వరాలనివ్వడం... నీరాజనాలందుకోవడం... ఇట్లా వారంతా హాయిగా, ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం ఇలా అందరి ప్రాణాలు తీయడమెందుకనిపించింది. దాంతో బ్రహ్మ వద్దకెళ్లి తన పరిస్ధితినంతా వివరించి, కొన్నాళ్లపాటు భూలోకానికెళ్లొస్తానని మొరపెట్టుకున్నాడు.

అందుకు బ్రహ్మ 'యమా! నిన్ను పంపడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని అక్కడికెళ్లి ఏం చేస్తావు' అండిగాడు. "లేదు ప్రభూ! నేనక్కడికి వెళ్లిన తర్వాత తేల్చుకుంటాను ఏం చేయాలన్నది - కనుక ముందు నన్ను భూలోకానికి పంపండి చాలు" అని ప్రాధెఅయపడ్డాడు యముడు. "సరే, అలాగే వెళ్లు. కాని నువ్వక్కడ ఉన్నన్నాళ్లూ సామాన్యమానవుడిలా గడపాల్సి ఉంటుంది" అన్నాడు. అందుకు ఒప్పుకుని సంతోషంతో భూలోకానికి వచ్చ్హాడు యముడు. భూమి మీది ప్రకృతి సౌందర్యాన్ని, అందమైన స్త్రీలను చూసి పులికించిపోయాడు. కొంతకాలంపాటు అక్కడే ఉండి ప్రజల జీవన విధానాన్ని గమనించాడు. తాను కూడా ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని, మానవ జీవితం గడపాలని ఉవ్విళ్లూరాడు. తాను బస చేసిన చోట సుగంధి అనే చక్కటి యువతిని చూసి మోహించాడు. ఓ అందమైన యువకుడి వేషం ధరించి ఆమె వద్దకెళ్లి, కాసేపు ఆ మాటా ఈమాటా మాట్లాడి, చివరికి అసలు విషయం చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది. అయితే ఇంటిపనంతా అతడేచేయాలని షరతు పెట్టింది. యముడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు గడిచాక యముడికి ఇంటి పనుల్లోని కష్టాలన్నీ అనుభవమయ్యాయి. ఏమైనా చేద్దామంటే తన శక్తులేమీ పనిచేయవు. చివరికెలాగో ఇరుగు పొరుగు సలహాతో అతి కష్టం మీద పొయ్యి రాజేసి అన్నం వండి, భార్యను పిలిచాడు. పళ్లెంలో సంకటి ముద్దలా ఉన్న ఆ అన్నాన్ని చూసి, సుగంధి మండిపడింది. ఈసారి సరిగ్గా వండకపోతే ఊరుకోనని కేకలేసి విసవిసా వెళ్లిపోయింది. చివరికెలాగో అన్నం వండతం నేర్చుకున్నాడు యముడు. అయితే తిండిగింజలు ఎలా సంపాదించాలా అన్నది సమస్యగా మారింది. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. తనకు వైద్యం తెలుసు కాబట్టి మృత్యువు సమీపించిన వారిని వదిలి, మిగిలిన రోగులకు మందులివ్వసాగాడూ. దాంతోపాటూ డబ్బూ రావడం ప్రాంభమయింది. అలా కొంతకాలం బాగానే ఉంది కాని, కొడుకు పుట్టడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి సంరక్షణ, ఇంటిపని, వైద్యం - అన్నీ చూసుకోవడం కష్టంగా మారింది. దీనికితోడు భార్య ప్రతిపనిలోనూ వంకలు పెట్టి సాధించేది. ఆ వేధింపులు భరించలేక పోయాడు యముడు. అంతకు ముందు తను చేసిన పనే బాగుందనిపించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా తన లోకానికి పయనం కట్టాడు.

మోసానికి శిక్ష

ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవుదినమైతే ఇంట్లో నుంచి కదలడు. ఏదో పుస్తకమో, పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయనకలవాటు. ఒకరోజు ఉదయంపూట మార్కెట్టుకు వచ్చాడు. మామూలుగా అతను మార్కెట్టుకు రాడు. ఆ పని భార్య నిర్మలే చేస్తుంది. అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నారు. నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం. నిమ్మకాయలు మీరు తెచ్చేపక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల. దానితో ఇక లాభం లేదనుకొని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్టుకు రావడం జరిగింది. ఆదివారం కావడంవల్ల ఆ రోజు మార్కెట్టు చాలా రద్దీగా ఉంది. రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు. ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు. కాయలు నవనవలాడుతూ తాజాగా కనిపించాయి. బాగా నచ్చాయి. కాయ ఒకటి చేతిలోకి తీసుకుని వంద కాయలు కావాలి. ధర ఎంత? అని అడిగాడు.

దుకాణాదారు కాస్త పరధ్యానంలో ఉన్నట్టున్నాడు. రాజయ్య ఒకటికి నాలుగు సార్లు అడిగేసరికి, వంద యాభైరూపాయలు అన్నాడు. రాజయ్య ముప్పైకి ఇమ్మన్నాడు. బండివాడు సరేనన్నాడు. రాజయ్య గబగబా వంద నిమ్మకాయలు ఏరుకొని సంచిలో వేసుకొన్నాడు. వందరూపాయలు నోటు అందించాడు. అందుకు తన దగ్గర చిల్లరలేదని త్వరగా చిల్లర తెస్తానని గబగబా జనంలోకి వెళ్ళాడు దుకాణందారుడు. రాజయ్య చాలాసేపు ఆ దుకాణం దగ్గర నిలబడ్డాడు. ఆ వెళ్ళినవాడు ఎంతకూ రాలేదుగాని వేరొకడు వచ్చాడు. తెచ్చిన చిల్లర గల్లాపెట్టెలో వేసుకొని మిగతాది రాజయ్యకు ఇవ్వబోయాడు. రాజయ్య అయోమయంగా చూస్తూ నేను ఇచ్చింది వంద. నాకు రావాల్సింది నిమ్మకాయలధర పోను డైబ్భై రూపాయలు అన్నాడు. దుకాణాదారు వెర్రిగా చూస్తూ నువ్వు ఉల్లిగడ్డలు తీసుకొని ఇరవై రూపాయల నోటు ఇచ్చావుకదా? అది తీసుకొని చిల్లర కొసం వెళ్ళి అష్టకష్టాలు పడి తీసుకొని ఇప్పుడే వచ్చాను. అంతేకదా! అన్నాడు. రాజయ్య ఉలిక్కిపడ్డాడు. తాను తీసుకున్నవి నిమ్మకాయలేనని సంచి గుమ్మరించాడు. తానిచ్చింది వంద గనుక నిమ్మకాయల ధర ముప్పై పోగా తనకు డెబ్బై రావాలని లబోదిబోమన్నాడు. ఆ గోలకు పదిమంది అక్కడ చేరారు. దుకాణం వాడికి పిచ్చెక్కిపోయింది. జరిగిన విషయం దుకాణం వాడికి పూర్తిగా అర్థమయింది. వాడు అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి అయ్యా! ఈయనకంటే ముందు నా దగ్గరకు ఒకడొచ్చి కిలో ఉల్లిగడ్డలు కొని ఇరవై నోటు ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేకపోవడంతో ఆ నోటు తీసుకొని చిల్లర కోసం వెళ్ళాను. వాడు బండి దగ్గరే నా కోసం నిలబడ్డాడు. ఈలోగా ఇతనొచ్చి వాడే దుకాణం వాడనుకొని నిమ్మకాయలు కొన్నాడు. చిల్లర లేదంటూ వాడికి వంద నోటు ఇచ్చాడు. చిల్లరలేదంటూ వాడు నాలాగే ఆ నోటుతో వెళ్ళాడు. కాని తిరిగి రాలేదు. వాడు నా దగ్గర కొన్న ఉల్లిగడ్డలు ఇవిగో! మోసం జరిగిపోయింది. దానికి వాడు బాధ్యుడయితే నేనెలా మూల్యం చెల్లించేది చెప్పండి. అంటూ తల బాదుకున్నాడు.

అది పగటి మోసంగా భావించి జనం వెళ్ళిపోయారు. చేసేది మాష్టారు ఉద్యోగం కనుక ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రాజయ్య. తన తెలివి తక్కువతనమే తనను మోసపోయేలా చేసింది. ఇందులో దుకాణాదారు తప్పులేదు. అని గ్రహించాడు రజయ్య. మరి కాసేపు తన డబ్బులు కోసం అరిస్తే ఆ నిమ్మకాయలు తనకు మిగిలేట్టు లేవని జడిసి రాజయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాజయ్య ఇంటిదారి పట్టాడుగాని అతని మనస్సు మనస్సులో లేదు. తనొక కొత్త తరహాలో మోసపోయాడని బాధపడుతూ నడుస్తున్నాడు. అల్లంత దూరంలో జనం గుమ్మిగూడి ఉండటం చూసి, అదేంటో చూద్దామని అక్కడికి నడిచాడు కుతూహలంగా. రాజయ్య జనాన్ని తోసుకొని లోనికి వెళ్ళాడు. ఆ మధ్యలో ఒకడు రక్తం మడుగులో పడివునాడు. వాడి ముఖం పరిశీలనగా చూచి, అతను ఉలిక్కిపడ్డాడు. ఇంతకు వాడు ఎవరో కాదు? ఇందాక తానే దుకాణాదారుగా ఫోజు కొట్టి వందకు చిల్లర తీసుకువస్తానని వెళ్ళినవాడే. ఎవరో పాపం కంగారుగా పరుగెత్తుతూ వచ్చి ఎదురుగా వస్తున్న లారీని గుద్దుకొని పడిచచ్చాడు. అన్నారెవరో ఆ గుంపులోనుంచి. విషయమంతా రాజయ్యకు అర్థమయింది. మోసం చేసి పారిపోతున్న అతను కంగారులో ప్రమాదానికి గురై చచ్చాడన్నమాట. అవును పరధనం పామువంటిది. అది ఎప్పటికైనా కాటువేయకమానదు. కానీ ఆ మోసానికి తగిన శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాధంటే ఏమిటో. ఈ మోసగాడికి దేవుడే మరణశిక్ష విధించాడు. ప్రతి చెడ్డపనికి శిక్ష ఉన్నట్లే నమ్మిన తోడి మనుష్యుల్ని మోసగించినందుకు కూడా ఆ శిక్ష పడింది మరి. తన డబ్బు పోయినందుకుకాదు అతను చచ్చినందుకు తోటి మానవునిగా రాజయ్య మరింత బాధపడుతూ ఇల్లు చేరాడు.

మోసపోయిన మోసగాడు

రామశింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య. రెండవ వాడి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచు సుస్తీగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు కొడుకులనూ పిలిచి తన ఆస్తిని వారిరువురూ చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు. "మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు" అని సోమయ్య వాళ్ళకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్నీ, తెలివితక్కువతనాన్నీ, చూసి అతణ్ని మోసగించడానికి రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో వున్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్ళను పంచవలసివచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు! "తమ్ముడూ! ఈ కోళ్ళను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది.

నువ్వు చిన్నవాడివి. ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని, ఆ కష్టమేదో నేనే పడతాను" అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. "తమ్ముడూ! కోళ్ళను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో!" అన్నాడు రాజయ్య. అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్ళను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకు వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమైంది. దానికి రోజూ అతను తిండి పెట్టవలసి వస్తోంది. వాడు విచారంగా ఉండేవాడు. ఒకరోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకొన్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు.

ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకు వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్ళను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పనిమీద. రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి, దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు.

అందుచేత ఆ అన్నాన్ని అది తినడం మాని, అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటూ ఇటూ జిమ్మేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క జిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి! అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి వుంటుందని అతను భావించాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యధాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. అతను అశ్చర్యపోయాడు కుక్క బతికుండడం చూసి. తర్వాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వేళ్ళాడు. కోళ్ళ గూళ్ళ ముందు కొన్ని లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి, దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ది మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. 

మోసగాళ్ళకు మోసగాడు

పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేపము చేస్తుంటారు. ఓ రోజు ఇద్దరూ సినిమాకని బయల్దేరారు. కొత్త సినిమా కారణముగా వాళ్ళు వెళ్ళేటప్పటికే బుకింగ్‌లో టికెట్స్ అయిపోయాయి. ఆ హాలులో దొంగటికెట్లు, అమ్ముతున్నారన్న పేరు బాగా వుంది.సార్! మీకు టికెట్స్ కావాలా, అన్న పిలుపుకు సూర్యం గమనించి కావాలి అన్నాడు. ఇరవైరూపాయల టికెట్ పాతిక రూపాయలే అన్నాడు ఆ వ్యక్తి. వద్దురా ఇంటికెళ్దాం, ఇక్కడి పరిస్థితి నీకు తెలియదు. అంతా మోసం అనగానే చూస్తుండు అని చెప్పి యాభై రూపాయలనోటు ఇచ్చి రెండు టికెట్స్ తీసుకున్నాడు.

ఇద్దరు హాలులోపలకి వెళ్ళి గేట్‌కీపర్ కు ఇవ్వగా ఆ టికెట్స్ గమనించి మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని చెప్పాడు. చేసేది లేక వెనుదిరిగారు. కాని సూర్యం మాత్రము ఆనందంగా ఉండడం చూసి చంద్రశేఖరం, ఏమిటి ఆనందముగా వున్నావంటే నేను ఇచ్చిన యాభైరూపాయలు కూడా దొంగనోటే అని చెప్పాడు. నిన్న బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళితే బ్యాంకువారు అసలు నోటుకీ దొంగనోటుకీ గల గుర్తులు అవీ చెప్పారు. అది ఎలాగో మా వద్దకి ఒకటి చేరింది. దాంతో ఇక్కడ ఇచ్చాను. ఆ దొంగనోటుని చించవలసినది. వీళ్ళ వ్యవహారము తెలిసే ఆ విధంగా చేశాను.

టికెట్ అమ్మిన వ్యక్తి ఆనందముగా పాన్ షాపులో ఇచ్చి సిగరెట్ పెట్టె ఇవ్వమన్నాడు. పాన్ షాపతను నోటును పరీక్షగా చూసి ఇది దొంగనోటు మీకెవరిచ్చారో అన్నాడు. నేనే మోసగాణ్ణి అనుకుంటే నన్నే మోసం చేశాడే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు విచారముగా.       

మోసం చేసిన మోసం

ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!

అందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది.

పాము మీద నుంచి గెంతుతూవున్న పిల్లలను చూసి కోడి భయపడింది. కదలకుండా వున్న ఆ పామును చూసి, అది చచ్చి పడి వుందని అనుకొని, తల్లికోడి పక్కగా పోయింది. ఇంతలో చీకటి పడుతూ వుండడం వల్ల, పిల్లలను వెంట బెట్టుకొని తల్లి కోడి వెళ్ళి పోయింది. అయితే వెనుక బడిన ఓ కోడి పిల్లను నోట కరచుకొని, పాము చరచరా పారిపోయింది!

తన ఎత్తు బాగా పని చేసిందని సంతోషించింది పాము. మరునాడు కూడా మరో కోడి పిల్లను తినవచ్చునని, అదే చోటున చచ్చినట్టుగా పడుకుంది కోడి పిల్లలు అటు వచ్చే సమయానికి!

పురుగులను ఏరుకొని తింటూ, కోడి, కోడిపిల్లలు మామూలుగా అటు వచ్చాయి. తల్లికోడి, అచట పడి వున్న పామును చూసింది. "నిన్నటి నుంచీ ఇలాగే పడి వుంది. చచ్చిపోయిందో ఏమో, చూద్దామని", పాము దగ్గరగా వచ్చి ముక్కుతో దానిని దొర్లించింది. పాము వెల్లికిలాపడినా కదల లేదు, మెదల లేదు. కోడి పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ పక్కగా వెళ్ళి పోయాయి. ఇంతలో రివ్వున ఓ గద్ద, బాణంలా దూసుకు వచ్చి ఆ పామును తన్నుకు పోయింది!

"పామును చంపిన వాడా! దానిని బోర్లా పడెయ్యకు, వెల్లకిలా పడేయ్" అని సామెత! మామూలుగా పడుకుని వున్న పామును సాధారణంగా, గద్ద తన్నుకు పోదు. వెల్లకిలా పడి వుంటేనే, చచ్చిందని తన్నుకుపోతుంది. కోడి పిల్లలను తినాలని దొంగ ఎత్తు వేసిన పాముకు, దాని దొంగ ఎత్తే దాని చావుకు కారణమైంది!       

మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.

తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?

తోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.

ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ్గురూ రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు.

'వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు. అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు "అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆవిధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమి కంపించవు" అన్నాడు.

తెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టీగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు.

రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైన ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేసారు.

చాటునుంచి దొంగలు ఇదంతా చూసారు. అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు.

బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు.

కానీ బావిలో అంతా చెత్త, చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు, రాళ్ళతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి, చిన్నచిన్న రాళ్ళు అన్నీ తొలగించేసారు. అప్పటికి కూడా వాళ్ళకు నగలు ఉన్న పెట్టె కంపించలేదు.

"ఇప్పుడేం చేధ్ధాం ?" మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒకదొంగ.

"అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేసారంటావా?" తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ

"ఒరేయ్! మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా!

"అవును" అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు.

"మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా!"

"నిజమే" అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు.

"అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగలపెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనందొరికిపోతాం.." అన్నాడు.

"సరే..ఇప్పుడేం చేద్దాం" అడిగాడు ఒక దొంగ.

"పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడి పోద్దాం. నీళ్ళు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది" అని సలహా ఇచ్చాడు ఒకదొంగ.

మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.

ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళు తోడటం మొదలు పెట్టారు. వాళ్ళలా నీళ్ళు తోడి పోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేసారు.

ఈవిధంగా దొంగలు చాలాసేపు నీళ్ళు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కంపించింది.

దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగలపెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ ఖంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈ లోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే! వాళ్ళు దొంగలను పట్టుకున్నారు.

చూసారా పిల్లలూ! తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో...!?

ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్ళు పెట్టించాలనుకున్నాడు కదా! ఆ పనేదో ఈ దొంగలచేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అంపించింది.

వెంటనే లోపలికి వెళ్ళి...కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు.

నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూసారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రంచేసారు.

బావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీసారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇదీ జరిగింది...

ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు.

రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసాడు. "నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకి నీళ్ళు పెట్టించావా?" అంటూ నవ్వాడు.

తెనాలి రామలింగడు "అవును మహారాజా!" అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేసాను." అని చెప్పాడు.       

మేకపోతు గాంభీర్యం

అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలీక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది.

కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకుముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కానీ తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలి పెట్టదు అని కృష్ణుడికి అర్ధం అయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు, ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది.

చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్ధం అయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగోఅలా తెల్లవారుఝాముదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండకతప్పదు అని సింహం అనుకుంది.

మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురుపోలేదు. "నేను సింహాన్ని . . . మృగరాజును. నేనే ఈ అడవికి రాజును." అంది భయం భయంగా."నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, వెయ్యి వరకు ఏనుగులను చంపాను. అది కూడా నా వాడి కొమ్ములతో ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేసాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపేవరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిఙ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే" అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది.

అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యేవరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత ఖంగారుపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని భయపడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు". అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు.

కృష్ణుడు ఆ తర్వాత మేకల మందతో కలిసి ఇంటి దారి పట్టాడు.        

మూర్ఖులకు హితవు...

ఒక అరణ్యంలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో ఆ అరణ్యంలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. కోతులకు విపరీతమైన దాహం వేసింది. అవి నీటికోసం వెతకటం మొదలుపెట్టాయి. అలా... అలా వెతుకుతూ అవి అరణ్యాన్ని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఏండమావులు మెరుస్తూ కనిపించాయి.

వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటు వైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. దాహంతో కోతుల నాలుక పిడచగట్టుకుపోసాగింది. ఎండవేడికి తలలు మాడిపోయి, కాళ్ళు బొబ్బలెక్కాయి. ఇక నడవడం చేతకాక కోతులు ఒక చెట్టు క్రింద కూలబడిపోయాయి.

"నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది." దీనంగా అంది ఒక కోతి.

"ఏం చేద్దాం... నీళ్ళు కనబడుతున్నాయి కాని చేతికి అందటం లేదు. ఇదేమి మాయో..." అంది మరొక కోతి.

ఆ చెట్టు పక్కన ఉన్న పొదలో నివసించే కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలన్న మంచి అభిప్రాయంతో వచ్చి వాటి ముందు నిలబడింది.

"మీ తెలివితేటలు మండిపోను.. ఎండమావులను చూసి నీళ్ళని భ్రమ పడ్డారు. ఎండమావుల్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా? ఇటు వైపు ఒక కోసు దూరంలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి" అని చెప్పింది.

కుందేలు మాటలు విని కోతులకు చాలా కోపం వచ్చింది.

"ఓహో... నువ్వే తెలివైన దానివా? మేము తెలివితక్కువ వాళ్ళమా?" అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది.

"అయ్యో నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి" భయంగా అరిచింది కుందేలు.

ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది.

ఆ తరువాత కోతులు కుందేలు చెప్పిన చెరువు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకున్నాయి.

మూఢ నమ్మకం

టర్కీ రాజు మంచి పాలకుడు, కాని కొంచెం మూఢనమ్మకాలెక్కువ.

రాజుగారికి రోజూ ఉదయం లేవగానే సూర్యుడిని చూడాలని, ఇతరులెవరినైనా చూస్తే ఆ రోజు దురదృష్టం వెంటాడుతుందని అతని మూఢనమ్మకం.

ఒకరోజు వేటకెళ్లడానికి ఉదయాన్నే నిద్ర లేచిన రాజుగారు తోటలో ఎవరినీ చూడకుండా నడుస్తూ వెళ్తున్నాడు. ముల్లా నస్రుద్దీన్‌ కూడా మంత్రి గారికి ఒక సమాచారం తెలపడానికి అటువైపే వచ్చాడు. రాజుని చూసిన నస్రు "రాజుగారూ శుభోదయం! బావున్నారా?" అని పలకరించాడు.

దానికి రాజుగారు మారు మాట్లాడకుండా నేలను చూస్తూ ముందుకు కదిలాడు. ఆశ్చర్యపోయిన నస్రు రాజుగారి మెహంలోకి చూస్తూ " ఏమయింది రాజా?! మీ మెడగానీ పట్టేసిందా?" అన్నాడు.

నస్రుని చూడడం దురదృష్టం అని భావించిన రాజు కోపంతో, "ఇంత ఉదయమే నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? నన్ను కలవాల్సిన అవసరం ఏంటి? నీకు తెలీదా నేను సూర్యుణ్ణి చూసిన తర్వాతే ఇతరులను చూస్తానని?" అని అరిచాడు.

కోపం పట్టలేని రాజు సైనికులను పిలిచి, "నస్రుని తీసుకెళ్ళి గదిలో బంధించండి. ఆహారం, నీరు ఇవ్వండి, కాని నేను వేటకు వెళ్ళి వచ్చేవరకు గదిలోనే ఉంచండి. ఇతన్ని చూడడం వలన నాకేదైనా దురదృష్టం కలిగిస్తే నేను వచ్చిన తర్వాత ఇతన్ని శిక్షిస్తాను" అన్నాడు.

సైనికులురాజు చెప్పినట్టే చేశారు. వేటకెళ్ళి తిరిగొచ్చిన తర్వాత రాజుగారు చాలా ఆనందంగా కనిపించారు. ఆ రోజు వేట ఆయనకు బాగా కలిసొచ్చింది. అతనికి తన మూఢనమ్మకం తప్పని తెలిసింది. నస్రుతో ఇలా అన్నాడు "రా మిత్రమా! నిన్ను చూడడం దురదృష్టం కలిగిస్తుందని భావించిన నాకు కళ్లు తెరుచుకున్నాయి. ఈ రోజు వేట ఓ అధ్బుతం. నన్ను క్షమించు."

బదులుగా నస్రు "నన్ను తప్పుగా అనుకోకండి రాజా! నేను ఉదయాన్నే మీ మెహం చూసినందుకు చూశారుగా ఈ శిక్ష. నాకు దురదృష్టం తెచ్చిందెవరో?"

అతని మాటలకు రాజు నవ్వుతా నస్రుని ఆలింగనం చేసుకుని వరహాల సంచిని కానుకగా ఇచ్చాడు.

మూడు చేపలు

మంచిని ఎవరు చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం.

అంబాపురం సమీపంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు నీటి గడ్డితోను నాచుతోను నిండి ఉండేది. ఆ చెరువులో ప్రభవ, విభవ, ఆశ్లేష అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రభవ మంచి తెలివి కలది ఏ విషయం ఇతరులతో చెప్పించికోకుండా ఇట్టే పసికట్టి సమయానికి తగ్గట్టుగా మసలుకునేది. విభవ కొంచెం మందబుద్ధి ఏవిషయం అయినా నిదానంగా ఆలోచించి నడుచుకునేది. ఆశ్లేష అహంకారి అన్నీ తనకే తెలుసునని మిగిలిన రెండు చేపలకంటే తానే తెలివైన దానిననీ విర్రవీగుతూండేది.

ఈ ముడు చేపల మధ్య గుణగణాలలో తేడాలు ఉన్నా ఒకే జాతికి చెందిన చేపలు కావటం వల్ల వాటి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకనాడు కొందరు జాలరులు వచ్చి చెరువును పరిశీలిస్తూ మట్లాడుకోవడం ప్రభవ విన్నది. వెంటనే తన మిత్రులైన విభవ, ఆశ్లేష దగ్గరకు వచ్చి 'మిత్రులారా! ఇప్పుడే ఇద్దరు జాలరులు మాట్లాడుకోవడం విన్నాను...' రెండు, మూడు రోజులలలో వచ్చి ఈ చెరువులో నీళ్ళు తోడి చేపలు పట్టుకుందాం అనుకుంటున్నారు. అందుకే మనం తొందరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో చెరువులోకి వెళ్ళిపోదాం ' అంటూ చెప్పింది. దాని మాటలకు ఆశ్లేష పగలబడి నవ్వి 'నువ్వు పిరికిపందవు' అంటూ ఎగతాళి చేసింది. విభవ మాత్రం 'ఇంకా రెండు మూడు రోజులు ఆగి కదా! అప్పుడు ఆలోచిద్దాం' అంది. ప్రభవ మాత్రం ఆ రాత్రికే వేరే చెరువుకు వలస వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత వద్దామనుకున్న జాలరులు మర్నాడు ఉదయమే ఆ చెరువులో చేపలు పట్టుకునేందుకు వచ్చారు. చెరువులో కొంతభాగం బురుదమట్టితో గోడగా కట్టి ఇందులో నీళ్ళను తోడి అవతలకు పోసి ఆ తరువాత మిగిలిన కొద్దినీళ్ళల్లోకి వలలు వేసారు. దానితో చెరువులోని చేపలన్నీ వలలోకి చిక్కాయి.

'అయ్యో! మిత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఈ జాలరులకు చిక్కామే' అంటూ విభవ, ఆశ్లేష భాధపడ్డాయి. ఆ సమయంలో విభవకు ఒక ఉపాయం తట్టింది. అది ఆశ్లేషకు చెబితే తనని ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని చెప్పకుండా ఆ ఉపాయంతో తాను మాత్రమే జాలరుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. జాలరులు వలలోంచి ఒక్కొక్క చేపను తీసి బ్రతికున్నదా లేదా అని పరీక్షించి బుట్టలో వేసుకుంటున్నారు. అది గమనించిన విభవ జాలరి తనని వలలోంచి బయటకు తీసి పరీక్షిస్తున్నప్పుడు ఊపిరిబిగపట్టి చనిపోయినట్లు నటించింది. అది నిజంగా చచ్చిపోయింది అనుకున్న జాలరి దానిని చెరువు గట్టు మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. జాలరి కనుమరుగు కాగానే విభవ మళ్ళీ చెరువులోని నీళ్ళలోకి గెంతి తన ప్రాణాలను కాపాడుకుంది. అహంకారంతోను, మూర్ఖత్వంతోను విర్రవీగిన ఆశ్లేష మాత్రం జాలరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది.

అందుకే పిల్లలు! మంచి మాటని ఎవరు చెప్పినా వినాలి. దాన్ని తప్పకుండా ఆచరించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దలకో... మనకంటే తెలివైన వారికో చెప్పి ఆ నిర్ణయం మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి.       

ముసలి నక్క

ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. దానికి పళ్లన్నీ ఊడిపోయాయి. అది ఆహారం కోసం వెదుకుతుండగా్, ఏనుగు మృతదేహం దాని కంటపడింది. ఆ చనిపోయిన ఏనుగు పక్కన కూర్చుని దానికి కాపలా కాస్తున్నట్లు నటించి ఏదైనా జంతువు వస్తే దానితో ఏనుగు చర్మాన్ని కొరికించి, ముక్కలు చేయించి మాంసం తినాలని అనుకుంది.

అప్పుడే అటుగా వస్తున్న సింహంతో "మృగరాజా! నేను ఈ ఏనుగుకు కాపలా ఉన్నాను. కావాలనుకుంటే ఈ ఏనుగు మాసాన్ని తినవచ్చు" అని చెప్పింది నక్క. "నేను చనిపోయిన జంతువులను తినను" అని తన దారిన తాను వెళ్లింది సింహం.

మరికొద్ది సేపటికి ఒక పులి అటుగా రావడంతో "పులిరాజా! ఈ ఏనుగును ఆరగిస్తారా?" అంది నక్క. "నేను ఏనుగుల మాంసాన్ని ఇష్టపడను" అనుకుంటూ వెళ్లిపోయింది పులి.

పులి వెళ్లీ వెళ్లగానే అటు వైపు వచ్చింది ఒక కోతి. కోతిని చూసిన నక్క ఈ సారి ఎలాగైనా తాననుకున్నది సాధించాలని, "ఇప్పుడే ఒక సింహం ఈ ఏనుగుని చూసి నన్నిక్కడ కాపలా పెట్టి వెళ్లింది. నీకు తినాలనిపిస్తే ఈ ఏనుగును తిను, నేను సింహం వస్తూ ఉంటే నీకు సైగ చేస్తాను" అని నక్క చెప్పింది కోతితో. కోతి ఏనుగు మృతదేహంపై ఎక్కి తన వాడియైన పళ్లతో ఏనుగు చర్మాన్ని ముక్కలుగా చించేసింది. అప్పుడే నక్క "మిత్రమా పారిపో సింహం వచ్చేసింది" అని అరవగానే కోతి ప్రాణభయంతో కనబడకుండా పారిపోయింది. ఇక తినడమే ఆలస్యమని ఏనుగు శరీరం మీదికెక్కిన నక్కకు "మిత్రమా! పారిపో" అంటూ ఒక అరుపు వినిపించింది. ఒక బలమైన నక్క అటుగా పరుగెత్తుకువచ్చి ఏనుగు మాంసాన్ని తినసాగింది. రెండు నక్కల మధ్య పోరు జరిగినా ముసలినక్క బలమైన నక్క దెబ్బలకు భరించలేక" నాకు కూడా ఏనుగు మాంసమంటే ఇష్టంలేదు" అని అక్కడి నుంచి పారిపోయింది.

ముఖ్యమైన పాఠం

ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోని బల్లపై కొన్ని వస్తువులను ఉంచి విద్యార్ధుల ముందు నిల్చున్నాడు. క్లాసు మొదలయ్యింది. ఏమీ మాట్లాడకుండా ఉపాధ్యాయుడు ఒక గాజుపాత్రను రాళ్ళతో నింపసాగాడు.

ఆ తరువాత కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను తీసుకుని వాటిని ఆ పాత్రలోకి నింపసాగాడు. ఆ గాజుపాత్రను ఊపగానే గులకరాళ్లు పెద్ద రాళ్ళ మధ్యన ఉన్న ఖాళీ స్ధలంలోనికి చేరిపోయాయి. మళ్ళీ ఉపాధ్యాయుడు "ఇప్పుడు ఈ పాత్ర నిడిందా?" అని అడగ్గానే "నిండింది" అనే సమాధానం చెప్పారు విద్యార్ధులు.

ఒక సంచిలో నుంచి కొంత ఇసుకను తీసి పాత్రలో నింపాడు ఉపాధ్యాయుడు. ఆ పాత్ర మిగిలివున్న ఖాళీ స్ధలాన్ని ఆ ఇసుక ఆక్రమించేసింది. మళ్ళీ "పాత్ర నిండిందా?" అని ప్రశ్నిచిన ఉపాధ్యాయుడికి "నిండింది" అనే సమాధానమే ఇచ్చారు విద్యార్ధులు.

"ఇప్పుడు చెప్పండి ఈ గాజుపాత్ర మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కదా! గమనించారా? పెద్ద రాళ్ళు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు - మన కుటుంబం, ఆరోగ్యం మొదలైనవి. ఈ రెండు అంశాలు ఉంటే మిగతా అంశాలు మన జీవితానికి అవసరం లేదు".

"చిన్న గులకరాళ్ళు మిగతా అంశాలు - మన ఉద్యోగం, వృత్తి, ఇల్లు మొదలైనవి. ఇసుక మిగతా చిన్న చిన్న అంశాలు. మనం ముందుగానే ఇసుకతో గాజుపాత్రను నిలిపినట్లయితే గులకరాళ్ళకు, పెద్ద రాళ్ళకు చోటు ఉండేది కాదు. మన జీవితము అంతే. చిన్న చిన్న సుఖాలు కోసం సమయం, శక్తి వృధా చేసుకుంటే ముఖ్యమైన అంశాలను కోల్పోతాం. మన సంతోషానికి కారణం కాగల అంశాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి. కుటుంబసభ్యులతో ఆడటం, ఇంటి దగ్గర గడపడం... ఇలాంటివి సమయం ఉన్నప్పుడు కోల్పోతే ఆ క్షణాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మన జీవిత గమనం అనేది నిర్దేశిత లక్ష్యాలతో, ముఖ్యమైన అంశాలు ప్రాతిపదికను సాగాలి" అని విద్యార్ధులకు వివరించాడు ఉపాధ్యాయుడు. ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామన్న తృప్తితో విద్యార్ధులు చప్పట్లతో తరగతి గదిని హోరెత్తించారు.          

ముఖానికే అందం

రత్తయ్యశెట్టి ఏదో పనిమీద నగరానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ, తన భార్యకొక అద్భుతమైన ముక్కుపుడక కొనుక్కు వచ్చాడు. దాని ఖరీదు లక్ష రూపాయలు! ఈ వార్త క్షణాలలో ఊరంతా పాకిపోయింది. ఎక్కడ విన్నా ముక్కుపుడుక ముచ్చటే!

చింతకాయల వీధిలో ఓ పదిమంది అమ్మలక్కలు పోగయ్యారు. అందరూ కూడా బలుక్కుని శెట్టి గారింటికి బయలుదేరారు.

దారిలో వారికి భైరాగి తాత కనిపించాడు. రచ్చబండ మీద కూర్చుని తత్వం పాడుకుంటున్నాడు. "జట్టుగా కదిలిపోతున్నారు, ఏమిటమ్మా విశేషం?" అని అడిగాడు. "ముక్కుపుడకను చూసొద్దామనీ..." రత్తయ్య గారింటికేనా?... వెళ్లిరండమ్మా!" అంటూ మళ్లీ తత్వం అందుకున్నాడు బైరాగి. మరో అరగంట తరువాత ఆ దారినే తిరిగివచ్చారు వాళ్లు. గలగలా మట్లాడుకుంటున్నారు వాళ్ళు. ముక్కుపుడకను పొగడటానికి వాళ్లకు మాటలు చాలటం లేదు.

భైరాగి పలకరింపుతో వాళ్లు ఆగిపోయారు. "అంతగా అశ్చర్యపడతన్నారేమిటి తల్లీ?" అనగానే, "ఆశ్చర్యం కాక మరేమిటి తాత! అలాంటి ముక్కుపుడక లోకంలో ఇంకెక్కడా ఉండదా!..." అని ఒకరూ, శెట్టిగారి భార్యదే కదా అదృష్టమంటే!" అని ఒకరూ, "దాన్ని తయారుచేసిన వాడి నైపుణ్యమే నైపుణ్యం!"అని ఒకరూ గోలగోలగా చెప్పసాగారు. "ఎంతసేపు ముక్కుపుడకను గురించి తప్ప, ముక్కును చేసిన వాణ్ని మరిచిపోయి, ముక్కుపుడకను చేసిన వాణ్ని మెచ్చుకుంటున్నారేమిటమ్మా?"

"ఆ మాటలకు ఎవరూ మారు పలకలేదు. మౌనంగా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అద్దాలలో చూసుకుని "అలాంటి ముక్కుపుడుక లేకపోతే మాత్రమేం? ఈ ముక్కే చాలు!" అని మురిసిపోయారు. "ఇంత చక్కగా ముక్కును ఎలా చేశాడో మరి, ఆ బ్రహ్మ!" అని ఆశ్చర్యపోయారు.

ముందుజాగ్రత్త

ఓ అడవిలోచాలా కుందేళ్లు ఉండేవి అవనీ పక్కనే ఉన్న మరోఅడవికి బయలుదేరాయి కొంత దూరం వేళ్ళేసరికి దారిలొ ఓ నీటి కాలువ ఎదురైంది వీటికి ఈత రాదు కదా! కాలవ చుట్టూ తిరిగి వేళితే గాని అవతలి ఒడ్డు చేరుకోలేవు. చేసేదిలేక కుందేళ్లన్నీ కాలవ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి.

ఈ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది దానికి ఆ కాలువలో ఈదుతున్న ఓ పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చినదానిలా.

'మీరు వెళ్ళండి, నేను తరువాత వస్తాను 'అంది' ఎలాంటి ఆకతయి పనులూ చేయకుండా బుద్ధిగా మాతో వచ్చేయ్' అను దీని సంగతి తెలిసిన ఓ ముసలి కుందేలు మందలించింది.

దాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి. మిగతా కుందేళ్లన్నీ వెళ్లిపోయాయి.

'ఓయ్ బాతు మామా... నిన్నే... నువ్వు చాలాఅందంగా ఉన్నావోయ్! నీటిలో భలేగా ఈదుతున్నవే!' కాలవ మధ్యలో ఉన్న బాతుకి వినిపించేలా అంది కుందేలు.

'నిజంగానా... అంత అందంగా ఉన్నానా' ఆ మాటలకు మురిసిపోయింది బాతు ఒడ్డుకు వచ్చేసింది.

'ఈ రోజు నుంచి మనం స్నేహితులం. నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు' అంది బాతు.

'అయితే్... నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డు కు వెళ్లాలి. చుట్టూ తిరిగి వెళదామంటే కాళ్లు నొప్పులాయె! మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకెళతావా?' అని అడిగింది కుందేలు.

'ఓ... అదెంత పని' కుందేలును వీపుపై వీపు పై ఎక్కించుకుంది బాతు.

'మావాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలి ఒడ్డుకి చేరుకుంటాను. నాతెలివితేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తా' అని లొలోపల అనుకుంది కుందేలు.

ఈదుతున్న బాతుకు నీటి మద్యలో ఓ పెద్ద కప్ప ఎదురైంది. అది చెంగున ఎగిరి బాతుపై దూకింది.

ముంగిస - పిల్లాడు

ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.

ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది.

మితిమీరిన విశ్వాసం

ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకముండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి భోధనలు చేయడానికి పల్లెటూళ్ల వైపు వెళ్లాడు.

అలా వెళ్లగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్లందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సుపట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడినని నిరూపించుకోదలిచాడు.

తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి. అని యువకుడు షరతు విధించాడు.

యువకుడు ఆ వ్యక్తిని "ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న" అంటూ ఊరించాడు. ఊరు ఊరంతా ఆ క్విజ్‌ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు,' ఇంగ్లండ్ రాజధాని ఏది?'

"నాకు తెలియదు. నేను నీకు మూడు నాణాలిస్తాను" అని అవతలి వ్యక్తి అన్నాడు.

'లండన్‌' అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు.

"వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు, ఏంటది? అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు.

"నాకు తెలీదు. నీకు మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడా వ్యక్తి.

'భూమి' అని చెప్పి మరో మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు.

యువకుడు "పగలు పైకెళ్లి, రాత్రి కిందకు దిగేది ఏంటి? అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలీదు.

నీకు మరో మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడు.

మొత్తం తొమ్మిది నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది.

ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదువేల నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు.

ఆ వ్యక్తి "ఉదయం రెండు కాళ్లతో, మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది"? అని అడిగాడు.ఆ ప్రశ్నవిన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న ఐదువేల నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు.

కుతూహలం పట్టలేక యువకుడు "ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతోనడిచేది ఏంటి?" అని అడిగాడు ఆ వ్యక్తిని.

"ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను" అన్నాడా వ్యక్తి.

అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది.

మార్పు

అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్‌చెయిన్, సఫారీ డ్రస్‌తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో బాబూ అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూసాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూసాడు నవీన్. బాబూ గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరో వైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబూ! అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్.

నవీన్ చూపులకు బయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబూ అన్నాడు. ఆ ఆగుతుందిలే అంటూ మరో వైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదోరకంగా ఫీలవుతున్నాడు. అదీగాక ఈ బస్‌స్టాండ్‌లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్ వచ్చి పాయింట్‌లో ఆగింది. బిల బిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకర్నొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతిరుమాళ్ళు, బ్రీఫ్‌కేసులు వేసి సీటులు రిజర్వ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్‌కేస్‌ను ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తరువాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు.

కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ! ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూసాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థంకాని నవీన్ ఒక్క ఉదుటున బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్‌కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్న మాట. అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేసాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులో కొచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్ళాడు.

ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్‌కు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకూ తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకోని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేసాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్‌కేస్‌లో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, రెండువేలరూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి ఋణం తీర్చుకోవాలి అని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాతా! నీకు చాలా నీరసంగా ఉంది కదూ! నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొందువుగానీ రా తాతా! అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు.       

మారిన మనసు

రామచంద్రయ్య ఆ వూరిలో పెద్ద వ్యాపారస్తుడు. అతనికి పువ్వులంటే చాలా ఇష్టం. అందువలనే ఇంటి చూట్టూ వున్న ఖాళీస్థలంలో రకరకాల పూల మొక్కలను నాటించాడు. ఆ మొక్కల పెంపకం కొరకు రాజయ్య అనే ఓ తోటమాలిని ఏర్పాటు చేసాడు. రాజయ్య సోమరిపోతు. ఆ మొక్కలకు నీరు పోయడానికే చాలా కష్టపడేవాడు.

వేసవికాలం వచ్చింది. దాంతో పాటు ఆ వూరికి నీళ్ళ కరువు వచ్చింది. రామచంద్రయ్య ఇంట్లో వారి ఉపయోగానికే నీరు దొరకడం చాలా కష్టమవసాగింది. అందువలన ఇంట్లోని నీరు మొక్కలకు పోయడానికి ఉండేదికాదు. తోటను గమనించడం రాజయ్య పని. అందువలన అతను మొక్కలకు నీరు కొరకు అక్కడికి మూడు ఫర్లాంగుల దూరంలో వున్న నూతి వద్దకు వెళ్ళిరావలసి వుండేది. అన్ని మొక్కలకు నీరు పోయాలంటే నాలుగు బిందెల నీళ్ళు కావాలి. ఒక్కసారే నాలుగు బిందెలు తీసుకురావడం కష్టం. రెండు బిందెల చొప్పున రెండు సార్లు వెళితేనేగాని, మొక్కలకు నీరు పోయడానికి వీలుపడదు. అంత దూరం నడిచి నీళ్ళు తీసుకురావడం తన శక్తికి మించిన పనవుతుందని అనుకున్నాడు రాజయ్య. రెండు రోజులు కష్టపడి తెచ్చాడు. ఆ పైన అతనికి కష్టమనిపించింది. పని తగ్గించుకోవాలని బుద్ది పుట్టిందతనికి. దాంతో రెండు బిందెల నీళ్ళు తెచ్చి, దాన్నే అన్ని మొక్కలకు కొంచెం, కొంచెం చొప్పున పోశాడు. చూడటానికి నీరు పోసినట్లు అందరికీ తెలుస్తుంది. తక్కువ నీళ్ళు పోశాడని ఎవరికీ తెలియదు. ఒకరోజు రామచంద్రయ్య తన తోటలో పువ్వుల మొక్కలు ఎలా పెరిగాయో చూద్దామని వచ్చాడు. చాలావరకు మొక్కలు వాడిపోయి వున్నాయి. వెంటనే రాజయ్యని పిలిచి, ఏరా! మొక్కలకు నీళ్ళు పోయడం లేదా! అన్నీ వాడిపోయివున్నాయే అని అడిగాడు. రాజయ్య చేతులు కట్టుకొని, అయ్యా! ప్రతిరోజు మూడు ఫర్లాంగుల దూరం వెళ్ళి, నీళ్ళు తీసుకొని వచ్చి మొక్కలకు పోస్తున్నానండీ అన్నాడు.

రామచంద్రయ్యకు అతని మాటలలో నమ్మకం కుదరలేదు. ఒకసారి మొక్కలను చూసి ఆలోచనలో పడి తాను అనుకున్నది సరి అని నిర్ణయానికి వచ్చి, బయటకి వెళ్ళిపోయాడు. వారం రోజులైంది. రాజయ్య, రామచంద్రయ్య ఇంట్లోనే అన్నం తిని అక్కడే వుంటున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం ఆకలి వేయగానే కంచం తీసుకొని అమ్మగారి వద్దకు వెళ్ళాడు. రామచంద్రయ్య భార్య, రాజయ్యకి ఎప్పుడూ పెట్టే అన్నం కన్న సగం తగ్గించి అతనికి పెట్టింది. అది గమనించి రాజయ్య అమ్మగారూ అన్నం బాగా తగ్గించారు. ఇంకా అన్నం పెట్టండి అని అడిగాడు. అందుకామె, రాజయ్యా! బియ్యం ధర పెరిగింది. అంచేత అయ్యగారు తగ్గించి వండమన్నారు. అందుకే తక్కువ వండాను అంది.

అది విన్న రాజయ్యకి వళ్ళు మండింది. ఏమీ మాట్లాడకుండా బయటకి వచ్చి అన్నం తిన్నాడు. అరగంట గడిచేసరికి అతనికి ఆకలి మొదలైంది. మొక్కలకు నీళ్ళు పోయాలి. నీరసంతో నీళ్ళు తీసుకురావాలంటే చాలా కష్టమనిపించింది. అయినా తాను పనిచేయక తప్పదు కదా! మనసులో బాధపడుతూ, బిందెతీసుకొని మెల్లగా నడిచివెళ్ళి, నీళ్ళు తీసుకువచ్చి ఎప్పటిలా కొంచెం కొంచెం నీరు చొప్పున మొక్కలకు పోసాడు. అతనికి ఆకలి ఎక్కువకాసాగింది. కానీ యజమానురాలిని అడగడానికి ఆత్మగౌరవం అడ్డువచ్చింది. సాయంత్రం రామచంద్రయ్య ఇంటికి వచ్చాడు. రాజయ్య ఆయన వద్దకు వెళ్ళి అయ్యా! మీరు చేసింది అన్యాయమండి. ధరలు ఎక్కువ అయ్యాయని నాకు తిండి తగ్గించడం న్యాయం కాదు. మీరు అన్నం తినడం తగ్గించారా! మిమ్మల్ని నమ్ముకొని మీ వద్ద కష్టపడి పనిచేసుకుంటున్న నాకు కడుపునిండా తిండి పెట్టకపోతే ఎలా! అన్నాడు.

వాడి మాటలకు రామచంద్రయ్య నవ్వుతూ రాజయ్యా! పనిమనిషిని ఇబ్బంది పెట్టకూడదని అంటున్నావు న్యాయమే. కానీ మనకి సువాసనలు యిచ్చే పూల మొక్కలకు కావలసినంత నీరు పోయకుండా నువ్వు అన్యాయం చేయడంలేదా! అమ్మగారు భోజనం పెట్టకపోతే నీ పొట్ట ఒక్కటే ఇబ్బంది పడుతుంది. కానీ నువ్వు అన్ని మొక్కలనూ ఇబ్బంది పెట్టావే! అన్నాడు. రాజయ్య కంగారుతో లేదండీ! నేను ప్రతిరోజూ సక్రమంగా అన్ని మొక్కలకు నీరు పోస్తున్నానండి అన్నాడు.

నువ్వు నీళ్ళు పోయలేదు అని నేను అనలేదు. మొక్కలకు చాలీచాలని నీళ్ళు పోస్తున్నావు. అవి మాట్లాడవు అని వాటికి అన్యాయం చేస్తున్నావు. నీకు అన్నం కాస్త తక్కువకాగానే నన్ను అడిగావు. మరి వాటి సంగతి ఆలోచించావా. వృక్ష, జంతువులయందు దయకలిగి వున్నవాడే సత్‌పురుషుడు. నువ్వు మొక్కలకి తక్కువ నీరు పోస్తున్నది నేను నీకు తెలియకుండా పొంచి వుండి కనిపెట్టాను. ఆకలి అంటే ఎలా వుంటుందో నీకు తెలియాలని అమ్మగారికి చెప్పి అలా చేయించాను అన్నాడు రామచంద్రయ్య. రాజయ్య సిగ్గుతో తలవంచుకొని నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలా మొక్కలకు అన్యాయం చేయను. వాటికి ఎప్పటిలా నీళ్ళు పోస్తాను. ఈ రోజు నుంచి నా సోమరితనం తగ్గించి, కష్టపడి పనిచేస్తాను అన్నాడు. ఆ నెల నుండి రాజయ్యకి ఇరవై రూపాయలు జీతం పెంచాడు రామచంద్రయ్య. జీతం పెరగటంతో రాజయ్యకి ఉత్సాహం పెరిగి ఎంత దూరమైనా నడిచి, ఎన్నిసార్లు అయినా వెళ్ళి నీళ్ళు తీసుకొని అన్ని మొక్కలకు కావలసినంత నీళ్ళు పోయసాగాడు. కొన్ని రోజులలో అన్ని మొక్కలు పెరిగి రంగురంగుల పువ్వులు విరబూశాయి. వాటిని చూసి రాజయ్యకి ఎంతో ఆనందం కలిగి తాను పడిన కష్టాలన్నీ మరిచాడు.       

మాతృభాష

కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.

"మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?" అని సవాలు విసిరాడు.

ఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.

"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరెట్టగల మేధావులే లేరా?" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.

మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.

"అమ్మో! కాపాడండి!" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.

మహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో "మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి." అని చెప్పాడు.

పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు.

మాట్లాడే గాడిద

కధ పేరు చూసి గాడిద మాట్లడటం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా! అవునర్రా! నిజంగా గాడిద నిజంగానే మాట్లడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమే గాక గాడిదతో పుస్తకం కూడ చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కధనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం.

సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు.

అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు.

అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు

"అవును మహారాజా" అన్నాడు బీర్బల్

"మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్.

మళ్ళీ 'అవునని' చెప్పాడు బీర్బల్

వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.

బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.

బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్.

రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.

రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు.

"ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?"

ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"

"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?"

"బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.."

"ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు.

ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.

ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు.

"బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్.

"చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్.

బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు.

"గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!"

"ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు."

ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు.

"బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది.

ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.

"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు.

బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు.

"అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు

"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్.

అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.

అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.

అక్బర్ అందుకు అంగీకరించాడు.

"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు.

ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.

చూసారా పిల్లలూ! బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలకైనా ఎంత సులభముగా పరిష్కారిస్తున్నాడో!