Pages

Friday, August 17, 2012

గురుశిష్యులు

ఒక రాజ్యంలో ఒక గొప్ప గురువు ఉండే వాడు.  అతని పేరు విద్యా నాధుడు.  అతని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు. విద్యా నాధుడు శిష్యులను ప్రేమతో చూస్తూ విద్య బుద్దులు నేర్పేవాడు. అప్పుడప్పుడు వారికి విద్యలోనే కాక  వేరే విషయాలలో  కుడా పరీక్షలు పెడుతుండే వాడు.  ఆయన వద్ద అనంతుడనే శిష్యుడు విద్య నేర్చుకునేవాడు.

ఒకసారి  అనంతుడు  గురువుగారు ఏది అడిగిన ఇస్తాను  అని తోటి  విద్యార్దులతో గొప్పలు చెప్పాడు.  ఆవిషయం గురువు గారికి తెలిసింది.  అవి నేరేడు పండ్లు కాసే రోజులు కావు.  కాని అనంతుని పరీక్షించ డానికి గురువు గారు అనంతుని నేరేడు పండ్లు తీసుక రమ్మని చెప్పాడు.  అందరు ఆశ్చర్యంతో అనంతుడు ఏమి చేస్తాడా అని చూడ సాగారు.  అనంతునికి గూడా ఏమి చెయ్యాలో తోచలేదు.  గురువు గారు ఏది అడిగిన ఇస్తానని తోటివారితోచెప్పాడు.  ఇప్పుడు గురువు గారుఅడిగిన పండ్లు దొరికేరోజులు కావు. ఎలానా అని అనుకుంటుండగా అతనికి ఒక ఉపాయం తోచింది.   గురువుగారి దగ్గరకు వెళ్లి “గురువుగారు నేను పండ్ల కోసం వెళుతున్నాను.  నేను వచ్చేదాకా మీరు ఇక్కడినుండి కదలవద్దు.”  అనిచెప్పి వెళ్ళాడు.

అతడు  కాసేపట్లోవచ్చి పండ్లుదొరకలేదని చెపుతాడని అప్పుడు గొప్పలు చెప్పవద్దని బుధ్ది చెప్పాలనుకున్నాడు గురువుగారు.  అనంతుని కిచ్చిన మాట ప్రకారం గురువు గారు కదలకకూర్చున్నాడు.  ఒకరోజు గడిచింది.  రెండు రోజులు మూడు రోజులు గడిచాయి.  అనంతుడు రాలేదు.  కాని ఒక మనిషి వచ్చాడు.  అతడు గురువు గారితో  “అయ్యా మీకాడ సదువుకొనేపిల్లడంట.  అడవిలో తిరుగుతొండు.  నేరేడు పండ్లుకావాలంట.  ఇప్పుడు దొరకవు సామి అంటే ఇంటలేదు.  మిమ్ము మాత్రం పండ్లు తెచ్చే దాకా ఈడనే కుసోమన్నాడు.”  అని చెప్పాడు.
గురువు గారికి మిగతా శిష్యులకు గుండెల్లో రాయి పడ్డట్లయింది.  అనంతుడు రానిదే గురువు గారు కదలటానికి లేదని తెలిసి శిష్యులందరు అనంతుని వెదకటానికి అడవికి వెళ్లారు. అనంతుడు కనిపించాడు కాని పండ్లు లేనిదే రానని చెప్పాడు.  అప్పుడందరూ కలసి నచ్చచెప్పి గురువు దగ్గరకు తీసుక వచ్చారు. అనంతుడు వచ్చాడు కాబట్టి గురువు గారు కదలగలిగారు. అనంతుడుకూడా గురువు గారి ఆశ్విర్వాదంతో చదువు కొనసాగించాడు.

ఒక దొంగ పిల్లి కథ

అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి అన్నీ తుంటరి పనులు చేస్తూ దొంగ వేషాలేస్తూ అందరి చేతా దొంగ పిల్లి అని తిట్టించుకుంటూ ఉండేది. ఈ దొంగ పిల్లి వంకర బుద్ధిని కనిపెట్టి ఎవరూ రెండ్రోజుల కంటే ఎక్కువ దాని గురించి పట్టించుకునేవారు కాదు. దాంతో ఆ దొంగ పిల్లికి తిండి కూడా సరిగ్గా దొరక్క చాలా ఇబ్బంది అయిపోయేది. అయినా సరే, తన పద్ధతి ఏ మాత్రం మార్చుకోకుండా అలాగే చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ, అందర్నీ విసిగిస్తూ, తిండిని దొంగతనం చేస్తూ, ఆ ఇల్లూ ఈ ఇల్లూ తిరుగుతూ బతికేస్తూ ఉండేది ఆ దొంగ పిల్లి.

ఒకసారి ఇలాగే ఒకరింట్లో తిట్లూ తన్నులూ తిన్నాక మళ్ళీ పొట్ట నింపుకోవడం కోసం మరో ఇల్లు వెతుక్కుంటూ ఒక కొత్త గడప దగ్గరికి వెళ్ళింది దొంగ పిల్లి.

ఆ ఇల్లు బుజ్జిగాడు వాళ్ళు ఉండే ఇల్లన్నమాట. బుజ్జిగాడికి ఓ ఏడాది వయసుంటుంది. గడపలో నుంచి లోపలికి తొంగి చూసిన దొంగ పిల్లికి లోపల ఇల్లంతా పాకేస్తూ బుడి బుడి అడుగులేస్తూ ఉన్న బుజ్జిగాడు కనిపించాడు. అక్కడ నుంచి దొంగ పిల్లి వంటింటి వైపు వెళ్ళింది. మరి తినడానికి ఏదన్నా దొరికేది అక్కడే కదా! అక్కడ వంట చేస్తున్న బుజ్జిగాడు వాళ్ళమ్మ పిల్లిని చూసీ చూడగానే చిరాకు పడిపోయి కర్రొకటి పుచ్చుకుని గట్టిగా అదిలించింది దూరంగా పొమ్మని.

దొంగ పిల్లికి అర్థమైపోయింది ఇంక ఈ ఇంట్లో తనకి తిండి దొరకడం కష్టమేనని. ఉసూరుమంటూ మళ్ళీ వీధి గుమ్మం వైపు వచ్చేసరికి లోపల నేల మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిగాడు కనిపించాడు. అంతలోనే బుజ్జిగాడు వాళ్ళమ్మ ఒక పళ్ళెంలో బిస్కెట్లు తీసుకొచ్చి బుజ్జిగాడి పక్కన పెట్టి తింటూ ఆడుకోమని చెప్పి వాడికో ముద్దిచ్చి మళ్ళీ వంటింట్లో పని చేసుకోడానికి వెళ్ళిపోయింది. ఇంతలోనే బోల్డన్ని దొంగ బుద్ధులున్న మన దొంగ పిల్లికి ఒక దొంగ ఆలోచన వచ్చింది. అస్సలు చప్పుడు చెయ్యకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి వాడి పక్కన పళ్ళెంలో ఉన్న బిస్కెట్లన్నీ నోట కరచుకుని గబా గబా ఇంట్లోంచి బయటికి పారిపోయింది.

ఇలాగే రోజూ వచ్చి బుజ్జిగాడి కోసం వాళ్ళమ్మ పెట్టిన బిస్కట్లన్నీ లాగేసుకుని తినేస్తూ ఉండేది దొంగ పిల్లి. అయినా సరే బుజ్జిగాడు అరవడం గానీ, ఏడవడం కానీ చేసేవాడు కాదు. ఆ పిల్లిని చూసినప్పుడల్లా నవ్వుతూ కేరింతలు కొట్టేవాడు.

 ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి బుజ్జిగాడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇంటికి తాళం పెట్టి రెండ్రోజుల పాటు ఊరెళ్ళారు.

ఆ రెండ్రోజులూ దొంగ పిల్లికి ఎంత ప్రయత్నించినా ఎక్కడా తిండి దొరకలేదు. దాంతో చాలా నీరసపడిపోయిన దొంగ పిల్లి  అన్ని చోట్లా తిరిగి తిరిగీ మళ్ళీ చివరికి బుజ్జిగాడి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దాంతో బుజ్జిగాడి దగ్గర తిండి దొరుకుతుందన్న ఆశతో ప్రాణం లేచి వచ్చినట్టయింది దొంగ పిల్లికి. అయితే అప్పుడే బుజ్జిగాడు వాళ్ళమ్మ బిస్కెట్లు తీస్కొచ్చి బుజ్జిగాడికిచ్చి అక్కడే పక్కనే కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఆవిడకి పిల్లులంటే అస్సలు ఇష్టం ఉండదు, చూస్తే కోప్పడుతుందని తెల్సిన దొంగ పిల్లి ఆవిడ ముందు బయట పడలేక, మరో పక్కేమో ఆకలికి తాళలేక గుమ్మం దగ్గర నక్కి అప్పుడప్పుడూ లోపలికి తొంగి చూస్తోంది.

కాసేపటికి ఇలా దాగుడు మూతలు ఆడుతున్న దొంగపిల్లి బుజ్జిగాడి కంట్లో పడింది. వాడు లేచి మెల్లగా బుడి బుడి అడుగులేసుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చి తన చేతిలో ఉన్న బిస్కెట్ ని పిల్లి ముందు పడేసాడు. వెంటనే పిల్లి బిస్కెట్ అందుకుని తినేసింది. అప్పుడు బుజ్జిగాడు కూడా అక్కడే కూర్చుండిపోయి కిలకిలా నవ్వుతూ పిల్లి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. అన్ని రోజుల నుంచీ తన బిస్కెట్లు అన్నీ ఎత్తుకుపోయినా సరే అందరిలాగా చీదరించుకోకపోగా అంత ప్రేమగా తన కోసం ఇప్పుడు బిస్కెట్ తెచ్చిచ్చిన బుజ్జిగాడిని చూసి పిల్లికి పశ్చాత్తాపం కలిగింది. ఇంతలో బుజ్జిగాడు వాళ్ళమ్మ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి పిల్లికి భయమేసి పారిపోబోయింది. కానీ, ఎప్పటి లాగా ఆవిడ విసుక్కోలేదు. ఇద్దర్నీ చూసి నవ్వేసి ఇంకో నాలుగు బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది.

వాళ్ళ ఆదరణ చూసి దొంగ పిల్లికి బుద్ధొచ్చింది.

ఎంతసేపూ నేను, నా తిండి, నా కోసం అని స్వార్ధంగా ఆలోచించుకుంటూ ఇలా అందరి చేతా తిట్లు తింటూ బతకడం ఎంత మూర్ఖత్వమో తెలిసొచ్చింది. ఏదైనా మన చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండటంలోనూ, మరొకరితో పంచుకోవడంలోనే ఎంతో సంతోషం, సంతృప్తి ఉన్నాయని అర్థమయ్యాక దొంగ పిల్లి కాస్తా మంచి పిల్లిలా మారిపోయింది. బుజ్జిగాడికి మంచి నేస్తం అయిపోయింది.. ఎంచక్కా వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండిపోయారు.

ఇంకంతే దొంగ పిల్లి కథయిపోయింది! :)

స్వోత్కర్ష

అనగనగా  ఒక ఊరిలో ‘చేతన్’ అనే అబ్బాయి ఉ౦డేవాడు. పిల్లల౦దరిలాగే ఆ అబ్బాయి కూడా ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ, అల్లరి చేస్తూ ఎప్పుడూ సంతోషంగానూ అందరితో సరదాగానూ ఉండేవాడు. రోజూ  ఉదయాన్నే లేచి చక్కగా తయారై స్కూల్ కి వెళ్లి, టీచర్స్ చెప్పినవన్నీ ఫాలో అయ్యేవాడు. . ఇంటి దగ్గర కూడా తన పనులు చెప్పించుకోకుండా చేసేసేవాడు.
అంతే కాదు ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు, చురుకైనవాడు కూడా.  అన్నీ ‘ఎ’ గ్రేడ్ లు తెచ్చుకుంటూ చక్కగా చదివేవాడు.  ’టెన్నిస్’ కూడా బాగా ఆడేవాడు. వాళ్ళ అమ్మ, నాన్న ఆ అబ్బాయిని చూసి చాలా గర్వపడుతూ వుంటారు. అలా ఆ అబ్బాయికి అన్నీ మంచి అలవాట్లే.

ఒకసారి చేతన టెన్నిస్ టోర్న్ మెంట్ కి వెళ్తే  ఫస్ట్ ప్లేస్ వచ్చి౦ది. ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వాళ్ళు౦దరూ ఆ అబ్బాయిని చాలా మెచ్చుకున్నారు. ఇక అబ్బాయి ఎక్కడికెళ్ళినా తన టెన్నిస్ ఆట గురించి, తన గ్రేడ్స్ గురించి తన మంచితనం గురించి  అందరికీ చెప్పుకోవడం  మొదలు పెట్టాడు.

ఫ్రెండ్స్ అందరూ చేతన్ తో ఆడుకోవడం తగ్గించేశారు. చేతన్ కి ఏమీ అర్ధమవలేదు. “ఎందుకు నాతో ఆడుకోవట్లేదు? లంచ్ టైములో  నేను వెళ్ళగానే ఎందుకు అందరూ ఏవో పనులున్నట్లు వెళ్ళిపోతున్నారు? ” అని ఆలోచించాడు. తను చేసిన తప్పేమీ కనిపించలేదు.  అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి…

“అమ్మా, ఈ మధ్య నా ఫ్రెండ్స్ ఎవరూ నాతో ఆడుకోవడానికి రావట్లేదు, స్కూల్లో కూడా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు” అని చెప్పి బాధ పడ్డాడు.

అపుడు వాళ్ళ అమ్మ “నాన్నా నువ్వు ఎవరినైనా ఏమైనా అన్నావా?” అంది.

“లేదమ్మా ఏమీ అనలేదు నా గురించి చెప్పానంతే”

“ఏమని చెప్పావ్?”

“నేను అన్నీ బాగా చేస్తాను, నాకు ‘ఎ’ గ్రేడ్ లు వస్తాయి, ట్రోఫీలు వస్తాయి” ఇలా మంచిగా చెప్పానంతే.

“చేతన్, అదే నువ్వు చేసిన పొరపాటు. అలా ఎప్పుడూ నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు.” అంది అమ్మ
“నేనన్నీ చేసినవేగా చెప్పాను . అందులో తప్పేముందీ?” అని అడిగాడు చేతన్.

నీ ఫ్రెండ్ నిఖిల్ చూడు యెంత బాగా బొమ్మలు వేస్తాడో, ‘ఆర్ట్ కంపిటిషన్లో’ ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. స్కూల్ న్యూస్ లెటర్ చదివితే గాని ఆ విషయం నాకు తెలియలేదు. అలాగే మోహిని ‘డిబేట్’ లో సెకండ్ ప్లేస్ తెచ్చుకుందిట. అలా ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో బాగా కృషి చేస్తారు. అప్పుడు పోటీల్లో గెలుస్తారు.  నువ్వు కొన్నిటిలో బాగా చేసావు నీ ఫ్రెండ్స్ ఇంకోన్నిటిలో బాగా చేస్తారు. అందరూ గొప్పవారే. చిన్నప్పుడు నువ్వు బార్నీ  చూసేవాడివి కదా ‘. బార్నీ  ’ఎవ్రీ బడీ ఈస్  స్పెషల్’ అని చెప్పలేదూ! అలా అందరూ గొప్పవారే.

” ఓ అందుకా ఎవరూ నాతో సరిగ్గా ఉండట్లేదు. ఇంకెప్పుడూ అలా చెయ్యను” అని వాళ్ళ అమ్మతో చెప్పాడు చేతన్.
చేతన్  ఫ్రెండ్స్  కూడా చేతన్లో వచ్చిన మార్పు గమనించి మళ్ళీ వాళ్ళ  గ్రూప్ లొ చేర్చుకున్నారు.

పాకం గారెలు

అనగనగా ఒక ఊరిలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ..అతనికి మంచితనం తో పాటు పేదరికం కూడా ఉంది.. విష్ణు శర్మ రోజు  పక్క ఊరికి  వెళుతూ  దారిలో రాజుగారి కోట వద్ద ఆగి రాజుగారిని ఆశీర్వదిస్తూ  మంత్రాలు చదివి వెళ్ళేవాడు..అది అతని దినచర్య లో ఒక భాగం అయిపొయింది..

ఒక రోజు రాజు గారికి నిదర పట్టక ఉద్యానవనం లో తిరుగుతుంటే విష్ణు శర్మ  తెల్లవారు జామున తనను ఆశీర్వదిస్తూ మంత్రాలు చదవడం వినబడ్డాయి..విషయం ఏమని ఆరా తీసి విష్ణు శర్మను కోటకు పిలిపించాడు రాజు..తనేం తప్పు చేసాడో తెలియక అయోమయంగా చూస్తున్న విష్ణు శర్మని  విషయం అడిగాడు రాజు.. …
దానికి విష్ణుశర్మ వినయంగా..

“మహా రాజా!ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటున్న  మీరు ఆయురారోగ్యాలతో ఉన్నప్పుడే కదా మేమందరం బాగుండేది..అందుకే అలా చేస్తున్నాను “అని చెప్పాడు ..రాజు చాలా సంతోషించి “ఎటువంటి  స్వార్ధం లేని నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది..నీకేం కావాలో ఒక కోరిక కోరుకో”   తీరుస్తాను అన్నాడు ..

విష్ణు శర్మ కు అప్పటికప్పుడు ఏమి కోరుకోవాలో తెలియలేదు..వద్దు వద్దన్నా రాజు కోరుకోమంటున్నాడు ..చివరకు ఆలోచించి తనకు ఎప్పటి నుండో తినాలని ఉన్న పాకం గారెలు గుర్తొచ్చి..మొహమాటంగా రాజుకు చెప్పాడు ..రాజు నవ్వుకొని సరే ఇంటికి చేరు నీకు కావలసినవి పంపుతాను అని మాటిచ్చాడు..

ఈ లోపల రాజు విష్ణు శర్మను కోటకు పిలిపించిన సంగతి అతని గయ్యాళి భార్యకు తెలిసింది …
శర్మ రాగానే  “ఏమి కోరుకున్నారండి”  అని ఆత్రంగా అడిగింది …పాకం గారెలు కోరిక వినగానే తలపట్టుకుని..
“హరి భగవంతుడా ,ఇలాంటి వాడిని భర్తగా చేసావేంటి అని నెత్తి నోరు మొత్తుకుంది..” రాజంతటివాడు ఏమికావలో అడిగితే ఎవరైనా పొలం అడుగుతారు .పాడి అడుగుతారు,ధనం అడుగుతారు ,పసిడి అడుగుతారు..నువ్వేమో పాకం గారెలు అడుగుతావా “అని భర్తను తిట్టిపోసింది …

ఈ లోపల రాజు పంపిన రెండు బస్తాల మినపప్పు ,పెద్ద పెద్ద బెల్లం అచ్చులు ,పెద్ద గుండిగల నూనె ,రుబ్బురోలు అన్ని గుమ్మం దగ్గర చూడగానే ఆమె కోపం తారాస్తాయి చేరింది ..
పాకం గారెలు కావాలా ఉండండి మీ పని చెప్తాను అని  మినప్పప్పు నానబోసి రుబ్బి,బెల్లం పాకం పట్టి, వేడి వేడి పాకం గారెలు అరచేతి మందాన  చేసి ఒక పెద్ద పళ్ళెం నిండుగా వేసి తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది …
“ఇదిగో ఇవన్ని తినండి ఇవయ్యాకా ఇంకొకన్ని గారెలు ఉన్నాయిలోపల ..తినకపోయారో నా సంగతి తెలుసుగా “
అని చెప్పి కర్రపట్టుకు కూర్చుంది  …

 శర్మ ఆనందంగా నాలుగు గారెలు గభ గభ తిన్నాడు ఆ తరువాత అతి కష్టం మీద ఇంకో అన్ని గారెలు తిన్నాడు ….,  ఇక కడుపు నిండి తినబుద్ది కావట్లేదు…
“ఊ చూస్తారేం తినండి” అని గదమాయించింది భార్య …ఇంకో రెండు తినేసరికి తిన్నది బయటకు వస్తుందేమో అనిపించింది శర్మకు … మెల్లగా వెక్కుతూ..”వెక్కిళ్ళు ..మంచి నీళ్ళు”   అన్నాడు భార్యకు సైగ చేస్తూ …
“సరే ఇక్కడే ఉండండి పట్టుకొస్తా లోపల ఇంకో పళ్ళెం నిండా గారెలు కూడా ఉన్నాయి  అవికూడా తెస్తాను ..ఒక్కటి కూడా మిగల్చకుండా తినాలి”  అని  వెళ్ళింది ఆమె.

అదే అదనుగా భయస్తుడైన శర్మ బయటకు పరుగులు పెట్టాడు …భార్య అది గమనించి వెనుక నుండి పిలవడం మొదలు పెట్టింది..అయినా ఆపకుండా పరుగు పెడుతూ పరుగు పెడుతూ చీకటి   పడేవేళ  ఒక చిట్టడివికి చేరుకున్నాడు శర్మ..ఆ చీకటిలో దారి తెలియక భయమేసి జంతువులూ తినేస్తాయేమో అన్న భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు.

అర్ధరాత్రి వేళ చెట్టు క్రింద కలకలం వినబడితే మెలుకువ వచ్చి చూసాడు విష్ణు శర్మ ..అక్కడ నలుగురు దొంగలు   తాము ఆ రాత్రి  రాజుగారి ఖజానా నుండి దోచుకున్న బంగారం ,వజ్రాలు ,రత్నాలు అన్ని పంచుకుంటున్నారు ..అయితే చీకటిలో శర్మకు అలికిడి తప్ప మనుషులు కనబడక పోయే సరికి..తన భార్య అనుకున్ని..
“అన్నీ తినేస్తాను ఒక్కటి కూడా వదలను “ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ….అవి పిశాచాల అరుపులుగా భావించి దొంగలు అవన్నీ వదిలి పారిపోయారు …

కాసేపటికి క్రిందకు దిగి విషయం గ్రహించిన విష్ణుశర్మ అవి ఎవరి వస్తువులైనా రాజుగారికి అప్పచెప్పడం భాద్యతగా భావించి వాటినన్నిటిని మూటగట్టి మోసుకుంటూ తెల్లవారే పాటికి కోటకు చేరుకున్నాడు …రాజు శర్మ నిజాయితీకి ఎంతగానో సంతోషించి అడక్కుండానే అతనికి ఇల్లుపోలం పాడి అన్ని కానుకగా ఇచ్చి పంపాడు..
కాబట్టి నిజాయితీగా ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది …

వూదుకుతినే పళ్ళు

ఒకవూళ్ళో ఒక ముసలమ్మ వుంది. తాను గొప్పమాటకారినని గర్వం. ఎవరేంచెప్పినా ఠక్కున సమాధానం ఇవ్వగలనన్న ధీమా.

ఒకరోజు ఆమె వూరి బయట తోటలోకి వెళ్ళింది. అక్కడ ఒక నేరేడు చెట్టుమీద ఒక కుర్రాడు కనపడ్డాడు. చెట్టునిండా నేరేడుపళ్ళు విరగ కాసాయి. మన ముసలమ్మకు నోరూరింది. తను చెట్టు ఎక్కలేదు కనుక కుర్రడిని కాసిని పళ్ళు కోసి ఇమ్మంది.

అందుకా కుర్రాడు “అవ్వా! నీకు వూదుకు తినేపళ్ళు కావాలా లేకపోతే మామూలు పళ్ళు కావాలా?” అని అడిగాడు.

“ఓరి కుర్ర కుంకా! నేరేడు పళ్ళు వేడిగా వుంటాయా ఏమన్నానా వూదుకుతింటానికి? వెధవకబుర్లు నాదగ్గర చెప్పకు” అంది వెటకారంగా.

“నిజం అవ్వా! వూదుకునే తినాలి” అన్నాడు ఆకుర్రాడు.

“ఏది అలా వూదుకుతినే పళ్ళు పడెయ్యి చూస్తా” అంది అవ్వ.

“సరే అవ్వా నువ్వు నా మాటలు నమ్మడంలేదు కనుక ఇదిగో నీకు కొన్ని పళ్ళు కిందకి పడెస్తా! కాని జాగ్రత్త వూదుకు మరీ తిను” అని చెట్టు కొమ్మ దులిపాడు.

కింద చాలా నేరేడుపళ్ళు పడ్డాయి. అవ్వ కొన్ని ఏరుకొని వాటికి మట్టి అంటుకోవడంతో ఒక్కొక్కటే మట్టిపోయేలా వూదుకొని తింది.

“ఏం అవ్వా! చూసావా వూదుకుతినే పళ్ళు ?” అన్నాడు కుర్రాడు.

పేను – నల్లి

అనగనగా ఒక రాజ్యంలో ఒక పేను వుండేది. అది రాజుగారి హంసతూలికా తల్పాన్ని అంటి పెట్టుకుని, రాజుగారి రక్తం తాగుతూ హాయిగా జీవిస్తోంది. అది రాజుగారి రక్తం తాగినా అయనకి ఏమాత్రం నెప్పి కలుగకుండా తాగటం వల్ల రాజుగారికి ఎప్పుడూ ఏ బాధకలుగలేదు.


ఇలా వుండగా  ఒక రోజు ఒక నల్లి వచ్చి ఆ పేనుని ఆశ్రయం ఇమ్మంది. ప్రతిరోజు  పంచభక్ష్యపరమాన్నాలతో  భోజనం చేసే రాజుగారి రక్తం చాలా బాగుంటుంది అని, దానిని ఒకసారి రుచి చూసి వెళ్ళిపోతానని నల్లి పేనుని బ్రతిమాలింది.  మొహమాటం కొద్దీ పేను సరేనని ఒప్పుకుంది.

ఐతే “రాజుగారికి నిద్రపట్టేవరకు ఆగి,  మెల్లగా నొప్పి పుట్టకుండా తాగమని” పేను చెప్పింది. సరే నని నల్లి అంది.
కానీ రాజు గారు వచ్చి మంచం మీద పడుకోగానే నల్లి ఆత్రంగా పుటుక్కున పొడిచి రక్తం తాగింది. ఆ బాధకు తట్టుకోలేకపోయాడు  రాజు.  వెంటనే  సేవకుడిని పిలిచి  అదేమిటో వెతకమన్నాడు.

సేవకుడు దీపం తెచ్చి పట్టెమంచం, పరుపు అంతా గాలించాడు. ఈలోగా నల్లి పరుగెత్తి పారిపోయి పట్టె సందులో నక్కింది. ఏమీ తెలియని పేను దుప్పటినంటిపెట్టుకుని సేవకుని కంట పడింది. అదే రాజుగారిని కుట్టిందని అనుకున్న సేవకుడు ఆ పేనును పట్టుకుని చంపేసాడు.

నీతి : గుణము, శీలము తెలియకుండా ఎవ్వరిని చేరదీయరాదు. అలా చేసిన, పేనుకి పట్టిన గతే పడుతుంది.

అత్తగారి పెత్తనం

రామవరం అనే గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడా ఉండేది.ఆమె చాల గయ్యాళిది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.వాడి పేరు రంగడు. వాడంటే ఆమెకు చాలఇష్టం . కాని అడిగినవన్నీ ఇస్తే చెడిపోతాడని ఇచ్చేది కాదు.ఆ అలవాటు అందరి మీదకూడా చూపడం వచ్చింది .

కొన్ని రోజులకు అందరికి ఆవిషయం తెలిసి తమకు కావలసిన వాటిని ఆమెకు వ్యతిరేకంలో చెప్పి చేయించు కొనేవారు.  ఆపై నవ్వుకునేవారు . ఆవిషయం భర్త చెప్పిన వినిపించుకునేది కాదు . అలా జరుగుతుండగా రంగడికి పెళ్లీడు వచ్చింది. అదే గ్రామంలో విజయ అనే చక్కని పిల్ల ఉండేది.ఆమె అంటే రంగడికి చాలా ఇష్టం.కాని ఆ విషయం తల్లికి తెలిస్తే విజయతో పెళ్లి జరగానీయదని, స్నేహితుల దగ్గర విజయతో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. ఆ విషయం కాంతమ్మకు తెలిసింది. విజయ తల్లి తండ్రులతో మాట్లాడి రంగడికి విజయకు పెళ్లిచేసింది.
కొత్తకోడలిపై కూడా తన పెత్తనం సాగించేది.రంగడు తన తల్లి మంచిదేనని,కాని ఆవిడకున్న అలవాటు సంగతి చెప్పి ఆమెను ఎప్పుడు బాధ పెట్టవద్దని చెప్పాడు. విజయ సరేనన్నది .కాంతమ్మ ఎదిచేబితే అదే చేసేది . అప్పటి నుండి విజయ తన ఇష్టా ఇష్టాలు అత్తకు తెలియనిచ్చేది కాదు. ఒకసారి విజయకు కాకర కాయ కూర తినాలనిపించింది. కాని అత్తకు తెలిస్తే తిననివ్వదని తెలిసి, అత్తా వినేటట్లుగా తనకు కాకర కాయ కూర అంటే అయిష్టమని ,పుట్టింట్లో కూడా కాకర కాయ కూర చేస్తే తినేదాన్నికాదని ,అమ్మ అరిస్తే కాకర కాయ కూర వేయించుకుని తండ్రికో ,చెల్లెళ్ళకో వేసేదాన్నని రంగడితో చెప్పింది .

కాంతమ్మ కాకర కాయ కూర చేసి కోడలితో తినమని చెప్పింది. విజయ తిననన్నది .  తినాల్సిందేనని కాంతమ్మ పట్టు పట్టింది .రంగడు వచ్చాక తింటానన్నదివిజయ. ఇప్పుడే తినాలని కాంతమ్మ పట్టు పట్టింది .
విజయ ఎడుస్తున్నట్లు నటిస్తూ కూర ఇష్టంగా తిన్నది. అలా తనకు కావలిన వాటిని సాధించుకునేది. కొద్ది సంవత్సరాల తర్వాత కాంతమ్మ జబ్బు చేసి చనిపోయంది  అప్పటినుండి విజయ తనకు కావలసినవన్నీ తను చేసుకునేది

మంథరము చెప్పిన నక్క కథ

కళ్యాణకతకం  అనే  పట్టణంలో  ైరవుడు  అనే  వేటగాడు  ఉండేవాడు.  అతనోరోజు  వేటకు  వెళ్ళి ాడవిలో  ఒక  లేడిని  చూసి  బాణంతో  కొట్టాడు.  ఆ  దెబ్బకు  చనిపోయిన  లేడిని  భుజాన  వేసుకుని  వెళ్ళసాగాడు.  దారిలో  అతడికి  ఒక  పంది  కనిపించింది. లేడిని  కిందపెట్టి  పందిని  కి  బాణంవేసాడు  అది  వేటగాడి  మీదకి  వచ్చి  అతడ్ని  ఢీకొట్టింది  వెటగాడు  చనిపయాడు,  పంది  బాణం  దెబ్బకు  చనిపోయింది  వాళ్ళ  కాళ్ళకిందపడి  అక్కడే  ఉన్న  ఒక  పాము  చనిపోయింది.

ధీర్ఘారావం  అనే  నక్క  ఆహారం  వెతుకుతూ  అక్కడికి  వచ్చి  అక్కడ  చచ్చి  పడి  ఉన్న  లేడి,  వేటగాడు,  పంది,  పాములను  చూసి  ఎంతో  ఆనందంతో   ’నాకు  మూడునెలలకు  సరిపడా ఆహారం  దొరికింది.’ అనుకుంది. అన్నీ  దాచుకుని   ఈరోజుకి  ఈ  వింటినారతో  పాముతో  నా  ఆకలి  తీర్చుకుంటాను.’  అనుకుంటూ  వెళ్ళి  వింటి  నారను  నటితో  కొరికింది.  దానితో  వింటి్బద్ద   విసురుగా  వచ్చి  దానికి  తాకి  అది  అక్కడిక్కడే  మరణిచింది.

“నక్క  అత్యాశ  వల్ల  ఏం  జరిగిందో  చూసావుగా  కాబట్టి  అత్యాశ  కూడదు. సరె  జరిగిందేదో  జరిగింది  గతాన్ని  తవ్వి  ప్రయోజనం  లేదు. ఇకపై  మన  ముగ్గరం  స్నెహితులుగా  ఉందాం.  అంది  మంథరము.
అప్పటినుండి  లఘుపతనకం  అనబడే  కాకీ,  హిరణ్యకుడనే  ఎలుక,  మంథరము అనబడే  తాబేలు  స్నేహితులుగా  ఉంటూ  సంతోషంతో   కాలం గడపసాగాయి.

వీణాకర్ణుడు చెప్పిన కథ

పూర్వం ఒక బ్రాహ్మణుడు  తన భార్యతో   “రేపు అ మావాస్య  బ్రాహ్మణులకు  భోజనం  పెట్టాలి.” అన్నాడు.
“ఇంట్లో  ఏమీలేవు  మీరేదైనా  తెస్తే  నేను  ఏదైనా  చేసిపెట్తగలను  లేపోతే  నేనేం  చేయగలను.” అంది  బ్రాహ్మడి  భార్య.

“ఉన్నంతలో  పొదుపుగా  కాలంగడపాలి.” అన్న  బ్రాహ్మణుడి  మాటలకు  “ఇంట్లో  నువ్వులున్నాయి  వాటిని  దంచి  నువ్వుపప్పుతో  రేపటి  కార్యక్రమం  ఎలాగోలా  చేద్దాం.”  అంది.

నువ్వులు  దంచి  పప్పు  ఆరబోసింది.  అంతలో  ఓ  కోడివచ్చి  తన  కాళ్ళతో  ఆ  పప్పుని  కెలికింది.”అదిచూసిన  బ్రాహ్మడు  ఇది  బ్రాహ్మణ బోజనానికి  పనికిరావు  అంటుపడ్డాయని    అన్నాడు.
దానికి  అతడి  భార్య  ఆ  నువ్వుపప్పు తీసుకుని  ఒకరింటికి  వెళ్ళి   ఈ  పప్పు  తీసుకుని  నువ్వులు  ఇవ్వమని  అడిగింది.

ఆ  ఇల్లాలు   కష్టపడకుండా  నువ్వుల  బదులుగా  నువ్వుపప్పు  వస్తుండడం   అలాగే  ఇస్తానని  చెప్పింది. అంతలోకి  ఆమె  భర్త  వచ్చి  విషయం  తెలుసుకుని  భార్యతో ” ఓసి  పిచ్చిదానా  ఎవరైనా  కష్టపడి  నువ్వులు  కడిగి  ఆరబోసి  దంచి  చేసిన  పప్పు  ఇచ్చి  ముడి  నువ్వులు  తీసుకుంటున్నారంటే  అందులో  ఏదో  మోసం  ఉండిఉంటుంది.  అది  నువ్వు  తీసుకోకు”  అన్నాడు.ఆ  కథ  చెప్పిన  వీణాకర్ణుడు “ఈ  ఎలక  ఇంత  ఎత్తుకి  ఎగిరి  ఆహారం  తింటూ  ఇక్కడే  ఉండటానికి  ఏదో  కారణం  ఉండే  ఉంటుంది.”  అన్నాడు.అది  తెలుసుకోవటానికి   ఓ  గునపంతో  నేను  ఉండే  కలుగుని  తవ్వి  అందులో  నేను  ఎంతో  కాలంగా  పోగుచేసుకున్న  ధనమంతా  తీసుకున్నాడు.  ధనం  అంతాపోయి  నేను  నిస్సహాయుడనై  అక్కడే  తిరుగుతూ   ఉంటే  ఒకనాడు  తన  చేతికర్రతో   నన్ను   కొట్టాడు.   కొద్దిలో    దెబ్బతప్పించుకుని   చావుతప్ప  కన్నలొట్టబోయి   అక్కడనుండి  వచ్చేసాను.  నాకు  మీలాంటి  మంచి  మిత్రులు  లభించారు.  జీవితంలో   కావలసినది  సజ్జనసాంగత్యమే.   అని   తన  కథని  చెప్పాడు  హిణ్యకుడు.

దానికి  మంథరుడు  “మిత్రమా  నీ  కష్టాలకు  నీ  ధనాశయే  కారణం.  అవసరాన్ని  మించి  అతిగా  సంపాధించాలనీ,  అంతా  దాచుకోవాలనే  లోభత్వం  మంచిదికాదు.నీకు  జరిగినట్టుగానే    చివరకది  దొంగలపాలో,  ఇతరులపాలో  అవుతుంది. మంచి  హృదయంతో  చేసే  దానం,  గర్వంలేని   జ్ఞానం,  క్షమతో  కూడిన  శౌర్యం,  త్యాగబుద్దితో  సంపాదంచే  డబ్బు  ఎవరికైనా  కీర్తిప్రతిష్టలను  సంపాదిచి  పెడతాయి.  లోభబుద్దితో   ధనమూ,  వస్తువులూ  పోగేసేవాళ్ళకి  చివరకి  దుఖం  మాత్రమే  మిగులుతుంది.  అలాంటి  గుణం  వల్ల  ఒక  నక్క త్న  ప్రాణాలు  పోగొట్తుకంది  అంటూ  ఆ  నక్క  ను  చెప్పసాగింది.

జరద్గవము కథ

“భాగీరథి  నదీ  తీరాన  ఒక  జువ్వి  చెట్టు  ఉండేది.  ఎన్నో  పక్శులు  ఆ  చెట్టుపై  గూళ్ళు  కట్టుకుని  ఉండేవి.  అక్కడే  జరద్గవము  అనే  ఒక  ముసలి   గద్ద  ఉంటుండేది.  పక్షులు  బయటకి  వెళ్ళినప్పుడు  వాటి  పిల్లలను   ఈ  గద్ద  జాగ్రత్తగా  చూసుకునేది,  పక్షులు  తమ  ఆహారంలో  కొంత  ఈ  గద్దకి   పెడుతుండేవి.

దీర్ఘకర్ణము  అనే  ఒక  పిల్లి  ఆ  పక్షిపిల్లలను  చూసింది,  ఎలాగైనా  వాటిని  తినాలనుకుంది. దానికై   ఆ  పక్షులకి  కాపలాగా  ఉన్న  జరద్గవాన్ని  మంచిచేసుకోవాలనుకుని  దాని  దగ్గరకి  వెళ్ళి  పలరించి  తన  గురించి  ఇలా  చెప్పుకుంది.

“నా  పేరు  దీర్ఘకర్ణుడు.  ఒకప్పుడు  మాంసాహారినే  తరువాత  దైవక్తి  తో  పూర్తి  శాకాహారిలామారాను.  ఈ నదివద్ద  నేను  చాంద్రాయణవ్రతం   చేస్తున్నాను.  మీవంటి  పెద్దల  సజ్జునుల   స్నేహం తో దర్మసూక్ష్మాలు  తెలుసుకోవాలని  నా కోరిక.”  అంది  పిల్లి.

పిల్లి  నమ్మకం  కలిగేలా   చెప్పటంతో   మొదట  నమ్మక  పోయినా  చివరకు  పిల్లిని  నమ్మింది  గద్ద. స్నేహానికి   ఒప్పుకుంది. దానితో  పిల్లి  అక్కడికి  వస్తూ  పోతూ  ఉండేది. కొంతకాలానికి  గద్దని  బాగా  నమ్మించి  దాని  తొర్రలోనే  ఉండసాగింది. గద్ద  చూడకుండా  మెల్లిగా  ఒక్కో  పక్షిపిల్లనూ  చంపి  తొర్రలోకి  తెచ్చుకుని  తినసాగింది.

రోజు  రోజుకి  తమ  పిల్లల  సంఖ్య  తగ్గడం  గమనించిన  పక్షులు  ఎంతో  దుఖించాయి.  అంతటా  వెతుకుతూ  చివరకు   గద్ద  తొర్రలో  ఎముకలు  ఈకలు   చూసాయి.  ఈ  గద్దే  తమ  పిల్లలను  చంపి తిన్నదని   పక్షులన్నీ  జరద్గవాన్ని  పొడిచి  చంపేసాయి.

కనుక కొత్తవారిని  వారిగురించి  పూర్తిగా  తెలియకుండా  నమ్మకూడదు.”  అంటూ  జింకతో  చెప్పింది  కాకి.
దానికి నక్క కోపంతో   “నువ్వుమాత్రం  మొదట్లో  జింకకి  కొత్తవాడివేకదా, ఐనా  మీరు  ఇప్పుడు  స్నేహంగా  ఉన్నారు.” అంటూ  వాదన  మొదలెట్టింది.

అదివింటున్న   జింక   ఎందుకీ  వాదనలన్నీ  “ముగ్గురం  కలిసి  ఉందాం  కొత్తవారు  మెల్లిగా  చనువువల్ల  స్నేహితులుగా  మారతారు.”  అంది.  నక్క  వాటితో  స్నేహం  నటిస్తూ  జింకను  తినటానికై  సమయం  కోసం  ఎదురుచూడసాగింది.

ఓ రోజు  నక్క  జింకతో  నీకు  మేతకై  ఇక్కడికి  దగ్గరలోనే  చక్కగా  కాచిన  పొలమొకటి  ఉంది   ఉంటూ  తీసుకుని  వెళ్ళ  ఓ  పొలాన్ని  చూపింది.  జింక  చాలా   సంతోషంతో  అప్పటినుండీ   ఆ పొలంలోనే  మేయటం  మొదలెట్టింది.జింక  పొలంలో  పైరు  నాశనం  చేస్తున్నదని  గ్రహించిన  ఆ  పొలం రైతు  ఓరోజు  జింకను  పట్టుకోవటానికి  ఒక  వలను  పైకి  కనిపించకుండా  ఏర్పాటు  చేశాడు. అది  తెలియని  జింక  ఆ  వలలో  చిక్కుకుంది.

అక్కడికి  వచ్చిన  నక్క  తన  ఉపాయం ఫలించినందుకు  మనసులో  ఎంతో  సంతోషపడింది.”నేను  వలలో  చిక్కుకున్నాను   వలను  కొరికి  నన్ను  రక్షించు.”  అంటూ  నక్కని  అడిగింది   జింక.
దానికి  నక్క  ఒప్పుకోకుండా  “నేను   నిష్ఠాపరుడ్ని  ఆ వలను  నా నోటితో  కొరకను,  మరేదన్నా  ఉపాయం  చెప్పు.”  అంది.

దానితో  నక్క  అసలు  స్వభావాన్ని   గ్రహించి  జింక  బాధపడ సాగింది. ఇంతలో  వీళ్ళను  వెతుకుతూ  అక్కడికి  వచ్చిన  కాకి  జింకను  చూసి  అలా  వలలో  చిక్కుకున్నావేమిటని  అడిగింది.

“నీ  మాటలు  విననందునే  ఇలా  జరిగింది.   చెడ్డకాలము   దాపురించిన  మంచి మాటలు  చెవినెక్కవు.  సజ్జన  సాంగత్యం  మంచిని  కలిగించినట్టే  దుర్జన  సాంగత్యము  కష్టాలను  కలిగిస్తుందని  నాకు  ఇప్పుడు  తెలిసంది.”    రైతు  నన్ను  చంపినతరువాత   నన్ను  తినాలని  నక్క  ఇక్కడే  ఎక్కడో  నక్కి  ఉంది.”  అంది  జింక
“జరిగిన  దానికి  విచారించి  లాభంలేదు,  .  నువ్వు  చచ్చినట్టుగా   శరీరం బిర్ర బిగించి  పడుకో,  సమయం  చూసి  అరుస్తాను  అప్పుడు  పారిపో.”  అంటూ  ఉపాయం  చెప్పింది  కాకి.

రైతు వచ్చేసరికి  జింక  చచ్చినట్టు  పడిఉంది.  కాకి  దాన్ని  ముక్కుతో   పొడుస్తున్నట్టు   నటించసాగింది.   జింక  చనిపోయిందనుకుని  రైతు  దాన్ని  వలనుండి  తీసి  పక్కన  ఉంచి    వలను  చుట్ట  చుట్టసాగాడు.  కాకి  వెంటనే  అరవసాగింది,   కాకి  అరుపులు  వినగానే  జింక  లేచి  వేగంగా  పరిగెత్తి  పారిపోయింది.  అది  చూసి  రైతు  తన  చేతిలోని  కర్రను  జింకపైకి  విసిరాడు. అది  గురితప్పి   పక్కనే  నక్కి  ఉన్న  నక్కకి  తగిలి  అది  చచ్చిపోయింది.

కనుక  కొత్తవారితో  స్నేహం  ప్రమాదకరం  అంటూ   చెప్పాడు  లఘుపతనకంతో  హిరణ్యకుడు.  కానీ  లఘుపతనకము  హిరణ్యకుడిని  వదలకుండా   “నీ స్నేహితుడైన  చిత్రగ్రీవడి  వంటివానే  నేను.  నీతో  స్నేహం  కోరివచ్చాను,  నువ్వు  ఒప్పుకొనపోతే  నీ  ముందే  అన్నపానియాలుమాని   ప్రాణాలు  వదులుతాను  కానీ  నీ  స్నేహం  లేకుండా  కదలను.”  అంది.

కాకి  పట్టుదలకు  సంతోషించిన  హిరణ్యకుడు  దానితో  స్నేహానికి  ఒప్పుకున్నాడు. ఇద్దరూ  స్నేహంగా  ఉండసాగారు.

ఒకనాడు  లఘుపతనకుడు  ” ఇక్కడ  నాకు  ఆహారం దొరకటం  కష్టంగా  ఉంది,  ఈ  చోటుని  విడిచి పోవాలని  అనుకంటున్నాను.”  అంది.

దానికి  హిరణ్యకుడు  ఒప్పుకోకుండా  “స్థానభ్రంశం  పొందినవారు  ఎవరూ   రాణించరు.  చోటుమార్చేఅ ఆలోచన  చేయకు.” అన్నాడు.

“బలవంతులు,  సత్పురుషులు  స్థానమార్పిడివల్ల  వృద్ధి  పొందుతారు,  బలహీనులు స్థానమార్పుకి  భయపడి  నాషనమౌతూ  ఉంటారు   నేను  అలా  కాకుండా  ఈ  చోటు  వదలి  మరొ  అడవికి  వెళతాను.” అంది  హిరణ్యకుడి  మాటలను  ఒప్పుకోకుండా.

“ఇంతకీ  ఎక్కడివెళ్ళాలనకుంటున్నావు?”  అంటూ  ప్రశ్నించాడు  హిరణ్యకుడు.
“దగ్గరలోనే  ఉన్న  అడవిలో  కర్పూరగౌరము  అనే  సరోవరంలో  మంథరుడు  అనే  తాబేళ్ళ  రాజు  ఉన్నాడు.  నాకతను  గొప్ప  స్నేహితుడు.  అతడే  నన్ను  ఈ సమయంలో   కాపాడగలవాడు  అక్కడికే   వెళదామనుకుంటున్నాను.” అని  చెప్పాడు.

“జీవనం  గడవని  చోట,  బంధుమిత్రులు  లేనిచోట  నివసించకూడదని  పెద్దలు  అంటారు.  నీవు  లేకుండా  నేను  ఒక్కడినే  ఇక్కడ  ఉండలేను  నేను  కూడా  నీతో  వస్తాను.”  అంది  ఎలుక.

కాకి  ఎలుకను  తన  వీపుపై  ఎక్కించుకుని  ఎగురుతూ   వెళ్ళి  చెరువుముందు  వాలింది.  దాన్ని  చూసి  తాబేలు   ఎంతో  సంతోషంచింది.

“నిన్ను  చూడడం  సంతోషంగా  ఉంది,  చాలా  కాలం  తరువాత  నిన్ను  చూాను.  ఇంతకీ   నీతోపాటు  వచ్చిందెవరు?”  అంది  తాబేలు.

దానికి  కాకి  మంథరుడుతో  “ఇతను  నా స్నేహితుడు,  పేరు  హిరణ్యకుడు,  ఇతనొక  మూషిక  రాజు.  నా  వలెనే  నువ్వూ  ఇతనితో  స్నేహంగా  ఉండాలి.”  అంది.

దానికి  అంగీకరించిన  మంథరము  ఇలా  అడిగింది” హిరణ్యకా  జనవాసాలు  ఉండుచోటే  ఎలుకు  ఉంటాయి,  అక్కడే  ఆహారం  లభిస్తుంది కదా,  మరు  నువ్వు  ఇలా  అడవులలో  ఉండటానికి  కారణం?”
దానకి ఎలుక  “అది  నిజమే  నేనుకూడా  పూర్వం  ఒక పట్టణంలోనే  ఉండేవాన్ని,  కొన్ని  కారణాలవల్ల   ఇలా  అడవిలో  ఉంటున్నాను.  నా కథ  చెపుతాను  వినండి.”  అంటూ  హిరణ్యకుడు  తన  కథ  చెప్పగాడు.

జింక, నక్క, కాకి కథ

మగధదేశంలో  మందారవనం  అనే  అడవిలో  ఒక  జింక  ఒక  కాకి  ఉండేవి.  అవి  ఎంతో  హాయిగా,  ఆనందంగా  ఆ అడవిలో  తిరుగుతూ  ఉండేవి. అవి రెండూ  ఎంతో స్నేహంగా ఉండేవి.

ఒకనాడు  ఆ  జింకని  ఒక  నక్క  చూసింది.  దాన్ని  చూడగానే  నక్కకు  నోరూరింది. దీన్ని  ఎలాగైనా  తినేయాలి  అనుకుంది.  వెంటనే   జింక  వద్దక  వెళ్ళి  కుశలప్రశ్నలడుగుతూ  పలకరించింది.

“నన్ను  కుశలమడుగుతున్నావు?  ఇంతకీ  ఎవరు నువ్వు?”  అంది  జింక.

దానికి  నక్క  “నేనొక  నక్కను,  నా పేరు  సుబుద్ధి.  నా  అనేవాళ్ళంటూ  ఎవరూలేరు  ఒంటరిగా  ఉన్నాను.  నిన్ను  చూడగానే  ఆత్మీయుడివలె  అనిపించింది.  నన్ను  నీ  స్నేహితుడిగా  స్వీకరించు.”  అంది.

జింకకి    జాలి కలిగి    నక్కను  స్నేహితుడుగా   స్వీకరించి  తతో  పాటుగా   తీసుకుని  వెళ్ళింది.

జింకతో  కలిసి  వచ్చిన  నక్కని  చూసిన  కాకి  అనుమానపడుతూ   ఎవరతడని  అడిగింది.  ఇతనొక  నక్క.  పేరు  సుబుద్ధి,  మనతో   స్నేహితుడిగా  ఉంటానంటే  తీసుకు  వచ్చాను.”  అంటూ  నక్క  గురించి  చెప్పింది  జింక.

“కొత్తవారిని ముందువెనకలు  చూడకుండా  నమ్మకూడదు,  పూర్వం  జరద్గవము  అనే   గద్ద   ఓ  పిల్లిని  నమ్మి  తన  ప్రాణాలనే  పోగొట్టుకుంది.    ఆ  కథ  నీకు  చెపుతాను.  అని    జరద్గవము  అనే   గద్ద కథ  చెప్పసాగింది  కాకి.

బాటసారి – బంగారు కంకణం

ఓ పులి ముసలిదైపోయి వేటాడే శక్తి లేక,  ఆకలితో  బాధ పడసాగింది.  శారీరక శక్తి లేక  బుద్దితో  ఆహారాన్ని సంపాదించాలని అనుకుంది.  ఉపాయంతో  ఓ బంగారు కాంకణాన్ని  చేత పట్టుకుని  చెరువు గట్టు పై కూర్చుంది.
ఆ దారిలో  వెళుతున్న ఓ బాటసారి  పులి చేతిలోని బంగారు కాంకణాన్ని చూసి  ఆగాడు.  పులి సంతోషంతో  “నా దగ్గరకి రా వచ్చి ఈ బంగారు కంకాన్ని తీసుకో” అంది.

అందుకు  బాటసారి “కౄర జంతువువైన నిన్ను నమ్మి దగ్గరికి వస్తే నువ్వు నన్ను చంపేస్తావేమో” అన్నాడు.
దానికి పులి   “నేనింత కాలం ఎన్నో జీవులు చంపి తిన్నందుకు పశ్చాతాప పడుతున్నాను, ఇప్పుడు ములిదాన్ని అయ్యాను. వంట్లో బలం లేదు. నా పాపాలను తొలగించుకోవటానికి  ఈ బంగారు కంకణాన్ని దానం చేద్దానుకుంటున్నాను.  ఆ చెరువులో స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణాన్ని తీసకో నాకు పుణ్యం లభిస్తుంది  సంశయించకు”  అంది.

బాటారికి పులి మలు నమ్మకం కలిగించాయి. స్నానానికని చెరువులో దిగి బురదలో కూరుకుపోయాడు. అది చూసి పులి  బయటకు లాగుతానని చెప్పి  చంపి తినేసింది.

“అత్యాశకు పోయి కౄర జంతవున నమ్మి ఈ గతి తెచ్చుకున్నాను, ఉచితంగా వస్తున్న దానికి   ఆశపడరాదు”  అనుకుంటూ  పులికి ఆహారమైనాడు బాటసారి.

ఆ కథ చెప్పి  చిత్రగ్రీవుడు “కనుక ఆ నూకలపై మనకు ఆశ వద్దు. వాటి వెనుక  ఏ ఆపద ఉందో తెలిదుకదా!”  అన్నాడు.

దానికి వాటిలోని  ఓ వృద్దపావురం  “ఎక్కడో  ఏదో జరిగిందని  కళ్లఎదుట ఉన్న  ఆహారాన్న  వదులుకోవటం ఎందుకు?  ఇలా ప్రతిదాన్ని  అనుమానిస్తే సుఖం లేదు.  వెళ్లి ఆ నూకలు తింద్దాం పదండి.”  అంది.

ముసలి పావురం మాటలు విన్న పావురాలు  ఆశతో ఆహారంకై వెళ్లి ఆ వలలో చిక్కుకుని పోయాయి.  అప్పుడు వాటికి చిత్రగ్రీవుడి మాటల్లో నిజమేమిటో తెలిసింది.

” బుద్ది ఉన్నవాడే వృద్దుడు  గాని నీలా వయసు  ఉన్న వాడ వృద్దుడా! నీ మాటలు నమ్మి చిక్కలో పడ్దాం”  అని ఆ ముసలి పావురాన్ని నిందించాయి.

దానికి  చిత్రగ్రీవుడు  “అతడిని అనటమెందుకు? మన బుద్ది ఏమయినట్టు.  ఇలాంటప్పుడే ఉపాయం ఆలోచించాలి, నేనొక ఉపాయం చెపుతాన,  మమందరం ఒక్కసారిగా  ఎగిరి  వలను మనతో తీసుకు వెళదాం. అందరూ ఒక్కసారిగా రెక్కలుకదల్చి పైకి ఎగరండి”   అన్నాడు.

అందరూ కలిస్తే ఎంతటి పనినైనా  సునాయాసంగా చేయవచ్చు,ఆన్న మాటలు నచ్చి  పావురాలన్నీ  వలతో పాటు ఆకాశ మార్గాన ఎగిరాయి.

వేటగాడు  ఆశ్చర్యపోతూ ఐకమత్యాన్ని మించిన బలమేమున్నది! అనుకున్నాడు.

“ఇప్పుడు మనమేం చేద్దాము, ఇలా ఎంతసేపని ఎగరగలము” అంటూ  మిగతా పావురాలు చిత్రగ్రీవుడిని అడిగాయి.
“ఇక్కడికి దగ్గరలోనే హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నాడు అతడు నాకు సన్నిహిత మిత్రుడు.  అతడు ఈ వలను కొరికి మనకు సహాయం చేయగలడు, ఈ లోకంలో ఎవరికైనా తల్లి తండ్రులు, స్నేహితులే నమ్మదగిన వారు.”  అన్నాడు చిత్రగ్రీవుడు.

అన్నీ కలిసి ఎగురుతూ  హిరణ్యకుడి  కలుగు దగ్గరకు వెళ్ళాయి.  హిరణ్యకుడు స్నేహితుడికి కలిగిన కష్టాన్ని చూసి విచారించి తన పళ్ళతో ఆ వల కొరికి వాళ్ళను బంధ విముక్తులను చేసాడు.

కనుక బుద్దిమంతుడైన వాడు  “మొదట మంచి స్నేహితులను సంపాదించుకోవాలి..”  అంటూ  మిత్ర లాభం  గురించి రాకుమారులకు చెప్పాడు విష్ణుశర్మ.

మిత్ర లాభం :

పూర్వం  గోదావరి  ఒడ్డున  పెద్ద బూరుగు చెట్టు ఒకటి ఉండేది.  ఆ చెట్టుపై లఘుపతనకము  అనే కాకి  నివసిస్తూ  ఉండేది.  అది ఓరోజు  ఉదయాన్నే  నిద్రలేచి  తన గూడు లోంచి బయటకు వచ్చి   ఓ వేటగాడిని చూసింది.  తెల్లవారగానే  మొదట వీడి మొహం కనిపించిందే  ఈ రోజు ఏంజరుగనుందో  అనుకుంటూ  వేటగాడినే  గమనించసాగింది  కాకి.   వాడు చెట్టు పక్కనే వల పరచి దానిపై  నూకలు జల్లి  ఓ పొదలో దాక్కుని ఉన్నాడు.
చిత్రగ్రీవుడు  అనే పావురం  మిగతా తోటి  పావురాలతో కలిసి అప్పుడే అటుగా ఎగురుకుంటూ  వచ్చి  కింద నేలపై ఉన్న నూకలు చూసి   “ఎవరూ లేని ఈ అడవిలోకి ఈ నూకలు ఎలా వచ్చాయి!  ఇదేదో మోసంలా వున్నది,  వీటికి ఆశపడి పోయామంటే   బంగారు కంకణానికి ఆశపడి  ప్రాణాలు పోగొట్తుకున్న  బాటసారలా  అవుతుంది.  కనుక ఎవరూ  కిందకు దిగకుండా   ముందుకే వెళ్ళండి”  అని అచెప్పాడు.

మిగతా పావురాలన్నీ   “ బంగారు కంకణమేమిటీ, ప్రాణాలు పోటంఏమిటి!”  ఆ  కథ చెప్పమని  చిత్రగ్రీవుడిన అడిగాయి.

గురునానక్

మహాకవి కాళిదాసు

వాల్మికి

వివేకానందుడు

యోగివేనమ

వెర్రి రామన్న - పంచతంత్ర కథలు

పాడే గాడిద - పంచతంత్ర కథలు

అత్యాశగల కుక్క - పంచతంత్ర కథలు

బంగారు బాతుగుడ్డు - పంచతంత్ర కథలు

బ్రాహ్మణుడు ముగ్గురు దొంగలు - పంచతంత్ర కథలు

దొంగ - పంచతంత్ర కథలు

కొంగ నక్క - పంచతంత్ర కథలు

తెలివైన ఎండ్రకాయ - పంచతంత్ర కథలు

తెనాలి రామకృష్ణ తెలివి

అబ్రకదబ్ర

కుస్తీ పోటి