Pages

Friday, September 14, 2012

ఒప్పించేవాడు


ఒకరోజు కొందరు గ్రామస్థులు రచ్చబండ వద్ద కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి బాలన్న అనే యువకుడికి తుమ్ములు మొదలైతే, ‘‘ఈ మధ్య నాకు జలుబుచేస్తే గుంటగలవరాకు మాత్రలు వేసుకుంటే వెంటనే మటుమాయమయింది. మా ఇంటికెళ్ళి మాత్రలడిగి తీసుకో,'' అన్నాడు కామేశం. బాలన్న సరేనని తుమ్ముకుంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయూడు.
 
‘‘బాలన్న ఓపట్టాన ఎవరి మాటా వినడు. వాణ్ణి భలే ఒప్పించావే!'' అంటూ ఓ పెద్దమనిషి కామేశాన్ని మెచ్చుకున్నాడు. దాంతో కామేశం రెచ్చిపోయి, ‘‘నాకీ బాలన్న ఓ లెక్కా? తాను పట్టినకుందేటికి మూడే కాళ్ళనే వాణ్ణి కూడా నేను నా మాటలతో ఒప్పించగలను,'' అంటూ దంబాలు పలికాడు.
 
అప్పుడు పక్కనే ఉన్న రామేశం కలగజేసుకుని, ‘‘ఎవరి సంగతో ఎందుకు? కంటికి కనిపిస్తే చాలు-నిజమని ఒప్పుకునే నాలాంటి వాణ్ణి కూడా నేనిష్టపడితేనే ఒప్పించగలవు. ఉదాహరణకు నావెనక ఉన్న రావిచెట్టును వేపచెట్టని ఇప్పటికిప్పుడు నా చేత ఒప్పించు చూద్దాం,'' అన్నాడు రామేశం.
 
రామేశం వెనకనున్నది నిజంగానే వేపచెట్టు కావడం వల్ల, ‘‘నీ వెనక నున్నది వేపచెట్టయితే, రావిచెట్టంటావేమిటి?'' అంటూ చిరాకు పడి అటు వెళ్ళి, దాని ఆకులుకోసి తెచ్చి చూపాడు కామేశం.
 
‘‘ఇవి వేపాకులే. కానీ ఆ ఆకులు నా వెనుక చెట్టువేనని ఎలా నమ్మడం?'' అన్నాడు రామేశం. అప్పుడు కామేశం అక్కడున్న ఊరి పెద్దలను సాక్ష్యం చెప్పమన్నాడు. రామేశం ఒప్పుకోక, ‘‘ఒప్పించాల్సింది నువ్వయితే, వాళ్ళ చేత చెప్పిస్తావేమిటి? ఐనా, చూసి తెలుసుకునేందుకు నా కళ్ళు నాకుండగా, ఇతరుల మాటలు వినాల్సిన అవసరం నాకేమిటి?'' అన్నాడు. ‘‘ఐతే వెనక్కి తిరిగి చూడు. నీ కళ్ళు బావుంటే అది వేపచెట్టని నీకే తెలుస్తుంది,'' అన్నాడు కామేశం ఉక్రోషంగా.
 
‘‘ఇప్పుడు నాకు వెనక్కు తిరగాలనిలేదు. కావాలంటే ఆ చెట్టును తెచ్చి నా ముందుంచు. లేదా నన్ను ఒప్పించలేక పోయూనని ఒప్పుకో,'' అన్నాడు రామేశం. అంతా నవ్వారు. రామేశం చేతిలో కామేశం భంగపడ్డాడు.

పెరటిమొక్క


వల్లభశ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు. నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ చేతినిండా పనీ, ఇనప్పెట్టె నిండా కాసులూ ఉంటూండేవి. అతనికి రామదేవుడు, వాసుదేవుడు కవల పిల్లలు. లేక లేక పుట్టిన వారవడంతో అతిగారాబం చేసింది తల్లి. దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది. తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ నిత్యకృత్యంగా మారింది.
 
వల్లభశ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించ సాగింది. ‘‘వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతా రహితంగా తయూరుకావడానికి నీ అతిగారాబమే కారణం. మనం వెళ్ళిపోయూక, వీళ్ళెలా బతుకుతారు?'' అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి భార్యతో.
 
‘‘నాలుగుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిమనది. అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలు. కష్టపడి పని చేసి సంపాదించవలసిన అవసరం ఏముంది?'' అని ఎదురు ప్రశ్నవేసింది ఆయన భార్య. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయూన్ని వదిలిపెట్టాడు.
 
రెండు రోజుల తరవాత శ్రేష్ఠి కొడుకులను చేరపిలిచి, ‘‘విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చిరావాలి. ఆ పని చాలా గోప్యంగా జరగాలి. అందుకే మీ ఇద్దరినీ పంపాలనుకుంటున్నాను. ఈ లేఖను తీసుకు వెళ్ళి ఆయన చేతికివ్వండి. విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం. అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగిరండి,'' అన్నాడు. అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి, అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు. లేఖ అందుకుని చదివిన వరదయ్య, మౌనంగా తలపంకించాడు.

ఆ తరవాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యమిచ్చి, నగరంలోని వింతలూ, విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు. వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది. వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ట, శ్వేత చూడ చక్కనివారు. మంచి గుణవంతులు. వాసుదేవ, రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది. వారం రోజుల తరవాత, వల్లభశ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు.
 
‘‘నాయనలారా, అనుకోని ప్రమాదం వచ్చిపడింది. నాలుగు రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. రాత్రికిరాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలయింది. ఊళ్ళో వాళ్ళు కుదువ పెట్టిన బంగారం కూడా పోవడంతో, ఇవ్వమని నిర్బంధిస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ అవమానం భరించలేని నేను, మీ అమ్మ ఊరొదిలి వెళుతున్నాం. రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం.''
 
ఉత్తరం చదివిన కొడుకులిద్దరికీ గుండె జారినంత పనయింది. భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది. సంగతివిన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ‘‘ఊరికే కూర్చుని తినేవాళ్ళని పోషించడానికి నేను మీనాన్నలాంటి కోటీశ్వరుణ్ణి కాను. ఇక మీ దారి మీరు చూసుకోండి,'' అన్నాడు అన్నదమ్ములతో.
 
ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచించుకుపోయూరు. అయినా, ఏపనీ చేతగాని తమకు భుక్తి గడవడం ఎలా? అందువల్ల అభిమానం చంపుకుని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములు. సరేనని వరదయ్య, రామదేవుడికి బట్టలకొట్టులో లెక్కలు రాసే పనినీ, వాసుదేవుడికి తనతోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకుని వచ్చే పనినీ అప్పగించాడు. మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు పనిచెయ్యలేక చాలా అవస్థపడ్డారు.
 
‘‘చూశావా, తమ్ముడూ, ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో! నిన్న లెక్కల్లో పదిరూపాయలు తక్కువయిందని నాకు తిండి కూడా పెట్టలేదు,'' బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో. ‘‘అవునన్నయ్యూ! గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్మంటాడే తప్ప, ఒక్క బండి కూడా కట్టించడు. రోజూ నాలుగు కోసులదూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు,'' అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు.

 ‘‘పోనీలే. నాన్నగారన్నట్టు కష్టపడ్డవాడికెప్పుడూ ఫలితం దక్కకుండా పోదు. మనకూ మంచి రోజులు వస్తాయి,'' అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు. రోజులు గడుస్తున్న కొద్దీ, అన్నదమ్ములిద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది. వ్యాపారంలోని మెలుకువలు అర్థంకాసాగాయి. వరదయ్య కూతుళ్ళు శ్రేష్ట రామదేవుణ్ణీ, శ్వేత వాసుదేవుణ్ణీ అభిమానంగా చూసుకోసాగారు. వరదయ్య నెలజీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు.
 
ఆరు నెలల తరవాత వల్లభశ్రేష్ఠి, భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు. తల్లిదండ్రుల్ని చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యం తమయ్యూరు. ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు. ‘‘మిత్రమా! పోయిన సొమ్ముదొరికింది. కష్టార్జితం ఎక్కడికీ పోదని అర్థమయింది. ఇక మా ఊరెళతాం. నీకు వేనవేల కృతజ్ఞతలు,'' అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా.
 
‘‘మీ కొడుకులతో పాటు కోడళ్ళను కూడా తీసుకువెళ్ళు, మిత్రమా! నా కూతుళ్ళకు ప్రయోజకులైన భర్తలు దొరికారు,'' అన్నాడు వరదయ్య నవ్వుతూ. శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు. పెళ్ళి జరిగిన మరునాడు, ‘‘నా బట్టల వ్యాపారం కన్నా, నీ బంగారం వ్యాపారం విలువైనది కదా? నా కన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి. నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చుకదా? దొంగతనం జరిగిందన్న నెపం మీద, నా దగ్గర పనివాళ్ళను చేశావెందుకు?'' అని అడిగాడు వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా.
 
‘‘పెరటిమొక్క వైద్యానికి పనికిరాదంటారుకదా! నా దగ్గరున్నంతవరకు నా బిడ్డలకు కష్టించే తత్వంరాదని అర్థమయింది. అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏపనికీ లొంగరని తెలిసింది. అందుకే ఈ యుక్తిని అమలు చేశాను,'' అన్నాడు వల్లభశ్రేష్ఠి. తండ్రికి తగ్గ తనయులుగా, అనతికాలంలోనే రామదేవ, వాసుదేవులిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు.

రాజుగారి పీడకల


దుర్భిక్షదేశపు రాజు దుర్ముఖుడు గాఢంగా నిద్రిస్తూండగా కలలో వికటాట్టహాసం వినిపించింది. ‘‘ఓరాజా, నీకు రోజూ సూర్యోదయూన్ని చూసే అలవాటు ఉంది కదా? ఈ రోజు శుక్రవారం. ఎల్లుండి ఆదివారం సూర్యోదయం సమయంలో నీకు మరణగండం ఉంది. ఆ గడువు దాటిందంటే నీకిక చావు లేదన్న మాటే!'' అంటూ కలలో ఒక కంఠస్వరం రాజును హెచ్చరించింది. రాజు ఉలిక్కి పడిలేచాడు. ఒళ్ళంతా చెమటలు పట్టగా, రాణిని మేల్కొలిపి తనకు వచ్చిన కలను గురించి చెప్పాడు.
 
‘‘కలలు కలలే. అవి నిజమవుతాయని భయపడకండి. హాయిగా నిద్రించండి,'' అంటూ రాణి మాలినీదేవి అనునయించింది. అయితే, మృత్యుభయం పట్టుకున్న రాజు, క్షణకాలం కూడా స్థిమితంగా ఉండలేక పోయూడు. అప్పటికప్పుడే సేనానిని పిలిపించాడు. మంత్రి వివేకవర్థనుణ్ణి పిలిపించి, తనకు వచ్చిన పీడకలను వివరించాడు. ప్రమాదం నుంచి బయట పడడానికి ఉపాయూలు ఆలోచించమని ఆజ్ఞాపించాడు.
 
మంత్రికి ఏమీ పాలుపోలేదు. రాజు కలలో వినిపించిన మాటలను నిజమని నమ్మితే చేయకలిగిందేముంది అనుకున్నాడు. అయితే, రాజాజ్ఞ గనక, ఏదో ఒకటి చేయక తప్పదు. రాజపురోహితుణ్ణీ, రాజ వైద్యుణ్ణీ రప్పించాడు. రాజు జాతక చక్రాన్ని పరిశీలించిన పురోహితుడు, గ్రహాలస్థితిగతులను లెక్కించి, రాజుకు ముంచుకు వచ్చే ముప్పేమీ లేదన్నాడు.
 
రాజు నాడిని పరీక్షించిన వైద్యుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పాడు. ఈలోగా సేనాని వచ్చి, ‘‘మహారాజా, అంతఃపురమంతటా వెతికాం. ఒక్కరూ కనిపించలేదు. నగర వీధుల్లో అనుమానంగా కనిపించిన కొందరిని బంధించి విచారించాం. వాళ్ళెవరూ ప్రమాదకారులుకారని తేలింది,'' అన్నాడు.

అయినా, రాజుకు మనసు కుదుటపడలేదు. ఆదివారం సూర్యోదయం దాటేవరకు తనకు ఎలాంటి ఆపదా రాకుండా చూడమని మంత్రిని పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. రాజు భయం పోగొట్టడానికి, మంత్రి పేరుమోసిన భూతవైద్యుణ్ణి పిలిపించాడు. భూతవైద్యుడు ముగ్గులు వేసి, వాటి మధ్య పిండి బొమ్మలు ఉంచి వింత వింత శబ్దాలు పుట్టిస్తూ ఏవేవో పూజలు చేశాడు. ఆ తరవాత, ��మహారాజా! ఇక ఏ దుష్టశక్తీ తమరిని కొనగోట కూడా తాకజాలదు. నిర్భయంగా ఉండండి,�� అన్నాడు.
 
అయినా రాజు కొండచిలువనోట చిక్కిన జింక పిల్లలా మరణభయం నుంచి బయటపడలేక పోయూడు. తెల్లవారి శనివారం వచ్చింది. రాజు అన్నపానీయూలు ముట్టుకోలేదు. రేపు సూర్యోదయం కాగానే తన ఆయువు తీరిపోతుందన్న ఆలోచన మనసులో సుడులు తిరుగుతూండగా మంత్రిని మళ్ళీ పిలిపించాడు. ��రేపు సూర్యుడు ఉదయించకుండా అడ్డుకున్న వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యమంతటా చాటింపు వేయించు,�� అని ఆజ్ఞాపించాడు.
 
ఆ మాట విన్న మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. ��సూర్యోదయూన్ని ఆపడం ఎవరి తరం? ప్రాణభయంతో రాజుకు మతి చెడింది,�� అనుకున్నాడు. అయినా రాజాజ్ఞ ప్రకారం చాటింపు వేయించాడు. సాయంత్రమయ్యే సరికి, జ్ఞానశేఖరుడనే యువకుడు రాజు వద్దకు వచ్చి, ��మహారాజా! మీ చాటింపు విన్నాను. సూర్యోదయూన్ని అడ్డుకుని తమరిని ప్రాణాపాయం నుంచి తప్పించగలను,�� అన్నాడు. రాజు ఆ యువకుణ్ణి ఆనందంతోనూ, విస్మయంతోనూ చూస్తూ, ��సూర్యోదయూన్ని ఎలా అడ్డుకోగలవు?�� అని అడిగాడు. ��అది మాకు వంశానుగతంగా సంక్రమించిన రహస్యవిద్య. అయితే, మీరు అందుకు ఓ పని చేయూలి,�� అన్నాడు యువకుడు. ��ఏమిటది?�� అని అడిగాడు రాజు ఆతృతగా.
 
��రేపు వేకువ జామునే లేచి, రాజభవనంలోని తమశయ్యూగృహం తూరుపు గది కిటికీ మాత్రం తెరిచి ఉంచి, ఉదయూద్రి కేసి చూస్తూ కూర్చోండి. సూర్యోదయం మీకు కనిపించదు. అదేవిధంగా నగర వీధులలో ఘంటానాదం వినిపించేంతవరకు నగర ప్రజలు ఒక్కరు కూడా ఇళ్ళ నుంచి వెలుపలికి రాకూడదని చాటింపు వేయించండి.


ఇక మీరు నిర్భయంగా ఉండవచ్చు, అని అభయమిచ్చి ఆ యువకుడు వెళ్ళిపోయూడు. రాజు మనసు కొంత తేలిక పడింది. మరుసటి రోజు వేకువ జామునే రాజు దుర్ముఖుడు తన శయ్యూగృహం తూరుపు గది కిటికీ దగ్గర కూర్చుని, ఊపిరి బిగ బట్టుకుని ఉదయూద్రివైపే చూస్తున్నాడు. తూరుపు కొండ మీది చిక్కటి అడవిలోనుంచి కారుమేఘాల్లాంటి దట్టమైన పొగలు లేచి ఆకాశాన్ని కమ్ముకున్నాయి.
 
గంట సేపుకుపైగా అలా పొగలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఈలోగా సూర్యుడు ఉదయించే సమయం దాటి పోయింది. తాను ప్రాణాలతోనే ఉన్నానని నిర్ధారించుకున్న రాజు గండంనుంచి బయట పడ్డానన్న సంతోషంతో శయ్యూగృహం నుంచి వెలుపలికి వచ్చాడు. మరి కొద్ది సేపటికి తూరుపు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు పొద్దెక్కి కనిపించింది. అయినా, రాజుకు ఏమీ కాలేదు. మరుక్షణమే నగర వీధులలో ఘంటానాదం వినిపించడంతో, ప్రజలు తమ తమ ఇళ్ళ నుంచి ఆనందోత్సాహాలతో వెలుపలికి వచ్చారు. అయితే, అర్ధరాజ్యం ఇమ్మంటూ జ్ఞానశేఖరుడు రాలేదు.
 
జ్ఞానశేఖరుడు రాడన్న నిజం మంత్రి వివేకవర్థనుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పీడకల వల్ల రాజును పట్టి పీడిస్తూన్న భయూన్ని పోగొట్టడానికి, ఆయనే, జ్ఞానశేఖరుణ్ణి రాజు వద్దకు పంపి సూర్యోదయూన్ని ఆపుచేయగలనని నమ్మింప జేశాడు. ఆ తరవాత నమ్మకస్థులైన అనుచరులతో వందల కొద్దీ బండ్లపై ఎండు గడ్డిని నగరం చివరనున్న, తూరుపు కొండ అడవిలోకి తోలించాడు. ఈ గడ్డిపై నీటిని చల్లించి సూర్యోదయ సమయూనికి కొంచెంముందు నిప్పు పెట్టించాడు. దానితో ఎగిసి పడ్డ పొగల్లో రాజుకు సూర్యోదయం కనిపించలేదు. ఆ విధంగా రాజు భయూన్ని పోగొట్టడంతో పాటు, పరమవివేకి అయిన మంత్రి వివేకవర్థనుడు ప్రజల మధ్య రాజు గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా కాపాడాడు.

తేనెచుక్క తెచ్చిన ప్రమాదం


పూర్వకాలంలో, ప్రతిష్ఠాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేనెకుండను పెట్టుకొని తిరుగుతున్నాడు. అతడు పరధ్యానంలో ఉండగా, పట్టు తప్పి ఆ కుండ నేల మీద పడింది. ఆ వెంటనే తేనెచుక్కను తాగడానికి ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని మింగడానికి ఒక సాలీడు దాపురించింది. సాలీణ్ణి కబళించడానికి బల్లి అక్కడ సిద్ధమైంది.
 
బల్లిని గుటుక్కున మ్రింగడానికి, పిల్లి రానేవచ్చింది. దాంతో రాజ సేవకుడి పెంపుడు కుక్క వచ్చి పిల్లిని భయపెట్టింది. ఆ దాపులనున్న వర్తకుడి పెంపుడు పిల్లే ఆ పిల్లి. ఒక వేళ తన పెంపుడు పిల్లిని కాపాడుకునేందుకు వర్తకుడు, తన పెంపుడు కుక్కను చంపితే, అతని తల నరకడం కోసం, రాజసేవకుడు కత్తినెత్తాడు. ఇంతలో సాలీడు, తేనెటీగను మింగేసింది. తరువాత బల్లి, సాలీడును తినేసింది. పిల్లి, బల్లిని గుటకాయ స్వాహా అంది.
 
కుక్క, పిల్లి గొంతు కొరికింది. వర్తకుడు కోపంతో ఊగిపోతూ కరన్రెత్తి కుక్కను చంపాడు. అది చూసి రాజసేవకుడు ఉగ్రుడైపోయి కత్తినెత్తి వర్తకుడిని యమపురికి పంపించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీతివంతుడైన వర్తకుణ్ణి చూసి, ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి మట్టుబెట్టారు. ప్రజల కింత పొగరా? అని రాజుకళ్ళెర్ర చేసి, ప్రజలపైకి సైన్యాన్ని పంపబోయూడు. అప్పుడు మంత్రి, ‘‘మహారాజా! ఇప్పటికే జరగకూడని ఎంతో రక్తపాతం జరిగిపోయింది.
 
తేనెచుక్కపై తేనెటీగ వాలడం, దాన్ని సాలీడు మింగడం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మింగడం-అంతా ప్రకృతి సహజం. అయితే, తన పిల్లిని చంపిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న కోపం కొద్దీ తమ సేవకుడు, వర్తకుణ్ణి వధించాడు. ప్రజలు వర్తకుడి మీది అభిమానం కొద్దీ, తమ సేవకుడి మీద పగ సాధించారు.
 
ఇప్పుడు తమరు అదే ఆవేశంలో, ప్రజలందరి మీదికీ సైన్యాన్ని పంపడం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించండి. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన ఆగ్రహావేశాలే, అన్ని అరిష్టాలకూ మూలం అన్న సంగతి, తమకు తెలియంది కాదు!'' అన్నాడు. రాజుకు, మంత్రి మాటల్లోని విజ్ఞత అర్థమైంది. దాంతో జరుగనున్న మరింత వినాశం ఆగిపోయింది.

శత్రువీరభయంకరుడు


భద్రగిరి, కొండకోన అనేవి ఇరుగుపొరుగు రాజ్యాలు. తరతరాలుగా వాటిని పాలించిన రాజుల మధ్య ఆరని శత్రుభావం అప్పుడప్పుడూ రక్తపాతానికి దారి తీస్తూండేది. రెండు రాజ్యాల రాజులూ ధైర్యవంతులేకాక, యుద్ధవ్యూహంలో ఆరితేరినవారు కావడంతో, సైనిక నష్టమే తప్ప ఎవరూ విజయూన్ని సాధించలేకపోయేవారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో, తండ్రి మరణంతో భద్రగిరి రాజ్యాధికారానికి వచ్చిన రణమల్లు, కొండకోనను ఎంత సైనిక నష్టానికైనా ఓర్చి జయించి తీరాలన్న పట్టుదలతో, ఆ రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు. వారం రోజుల్లో రెండు దేశాల సైన్యాలు, సరిహద్దుల్లో మోహరించాయి. ఇక యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో, భద్రగిరి సైన్యంలో చిన్న దళాధిపతిగావున్న శౌర్యశీలి అనేవాడు దళాన్ని వదిలి పారిపోసాగాడు. అది గమనించిన మరొక దళపతి అతణ్ణి తరిమిపట్టుకుని, రాజు రణమల్లు దగ్గరకు తీసుకుపోయి, జరిగింది వివరించాడు.
 
రణమల్లు, శౌర్యశీలికేసి తీవ్రంగా చూస్తూ, ‘‘ఒరే, నీ ఒడ్డూపొడుగూ, మెలితిరిగిన మీసం చూస్తూంటే, శత్రువీరభయంకరుడిలా వున్నావు. అటువంటి నువ్వు పోరు ప్రారంభంకానున్న సమయంలో పిరికిపందలా పారిపోవడం ఏమిటి?'' అని గద్దించి అడిగాడు. దానికి శౌర్యశీలి వినయంగా, ‘‘మహారాజా! నేను పిరికితనం కొద్దీ పారిపోవడం కాదు. కొండకోన సైనికుల ముఖాలు చూడడమంటే నాకు చెడ్డ అసహ్యం. అందుకని వెనుదిరిగి పోదలచాను,'' అన్నాడు.

వ్యాపారంలో లౌక్యం


ధర్మకటకం చిన్నరాజ్యం. దానికి రాజు ధర్మరాజు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా పాలిస్తాడని ఇరుగుపొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు. అయితే, ఆయన తన మంత్రులనూ, రాజోద్యోగులనూ అమితంగా విశ్వసించేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి.
 
రత్నకంబళులు, పట్టుచీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. ఒకరోజు ధర్మరాజు తన పట్టపురాణి ధనలక్ష్మితో రథం మీద నగరవిహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు. నగర వీధులలో వెళుతూండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలూ, రత్న కంబళులూ రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి, రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టుచీరలు, రత్న కంబళులు కావాలని రాజును కోరింది.
 
రాజుగారు తన మహామంత్రిని పిలిచి, రాణిగారి కోరిక వెల్లడించి, ‘‘వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు,'' అని ఆజ్ఞాపించాడు. ‘‘అదెంత పని ప్రభూ! ఘడియలో పూర్తిచేస్తాను,'' అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చిటికల్లో చేస్తానని చెప్పి, కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు. వాణిజ్యాధికారి, పన్నులు వసూలు చేసే అధికారికీ, ఆ అధికారి భటులకూ అప్పజెప్పారు.
 
భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు. ‘‘మహారాణిగారికి కావాలంటే అంగడినే తరలిస్తాను,'' అంటూ రత్నాచారి సంతోషంగా ఓ పాతిక పట్టుచీరలూ, పాతిక రత్నకంబళులూ భటులకు అందించాడు. వాటితో పాటు, భటుల భార్యలకు కూడా రెండేసి పట్టుచీరలు తీసుకెళ్ళమని ఇచ్చాడు.

‘‘మాకిచ్చారు బావుంది. మరి మా పైవాళ్ళ మాటేమిటి?'' అన్నారు భటులు. రత్నాచారి చేసేదిలేక వాణిజ్యాధికారికీ, పన్నులు వసూలు చేసే అధికారికీ కూడా పట్టు చీరలు, కంబళులు ఇచ్చిపంపాడు. ఆ రాత్రి రత్నాచారికి ఓపట్టాన నిద్రపట్టలేదు. రాణీగారికి పంపిన పట్టుచీరలు, కంబళులు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర లక్ష వరహాల పైమాటే. కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురు చూశాడు. ప్రయోజనం లేకపోయింది.
 
ఆ విషయంగా భటులను, అధికారులను అడగడం బావుండదని, రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టుచీరలు, రత్నకంబళుల ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినతి పత్రం పంపాడు. కోశాధికారి ఆ వినతిపత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురు చూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా, అవమానం కూడా కలిగింది.
 
వాణిజ్యాధికారి గూఢచారులు వచ్చి, రత్నాచారి అంగడిని శోధించారు. పన్నులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు. అంతేగాక, అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుగొన్నారు. అంతే! రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు. రత్నాచారి భార్యా పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికిలోనై ఏం చేయడానికీ దిక్కుతోచక విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే, కాశీయూత్రకు వెళ్ళిన, రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు.
 
జరిగిన దానిని తెలుసుకుని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకుని సంగతి చెప్పాడు. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్ళి, కోశాధికారిని చూసి తన కొడుకు తరఫున క్షమాపణలు తెలియజేశాడు. తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమనీ, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడనీ తగిన ఆధారాలతో నిరూపించి, అతన్ని బయటకు తీసుకు రాగలిగాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు నెలరోజులు పట్టింది. ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు.


‘‘మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను,'' అన్నాడు రత్నాచారి తండ్రితో. ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి, ‘‘నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండీ, ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి, గొడ్డలిదాకా తెచ్చుకున్నావు.
 
రాణిగారికిచ్చిన పట్టు చీరలు, రత్నకంబళ్ళ గురించి కోశాధికారికి వినతి పత్రం పంపకుండా ఉన్నట్టయితే, డబ్బుపోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు,'' అన్నాడు. ‘‘లక్ష వరహాల సరుకు! ఎలా వదులుకో మంటావు? మనకు ఎవరిస్తారు?'' అని అడిగాడు రత్నాచారి బాధగా. ‘‘లక్ష కాదు.కోటి వరహాలు సంపాదించి ఉండేవాడివి, కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే!'' అన్నాడు తండ్రి. ‘‘అంటే, రావలసిదాన్ని అడగడమే అపరాధం అంటావా?'' అని ఎదురుప్రశ్న వేశాడు రత్నాచారి. ‘‘అడగడం అపరాధం కాదు; అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు.
 
అందుకే, ఇంత వ్యాపారనష్టం, పరువునష్టం ఎదుర్కోవలసివచ్చింది'' అన్నాడు తండ్రి. ‘‘నువ్వేం చెబుతున్నావో నాకు అర్థంకావడం లేదు,'' అన్నాడు రత్నాచారి అయోమయంగా. ‘‘రాజుగారు మంచివాడయినంత మాత్రాన ఆయన పరివారమంతా మంచివారనుకోవడం తెలివిగలవాళ్ళ లక్షణం కాదు. అలా అని వారిని పగ చేసుకుంటే మనలాంటి వారికి వ్యాపారం క్షణం సాగదు.

అందుకే, వ్యాపార రహస్యాలు తెలుసుకుని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాను. ముక్కుసూటిగా పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది. ఇంత అనుభవించాక కూడా నీకు తెలివిరాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది,'' అన్నాడు తండ్రి బాధగా. ‘‘సరే, అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు? డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పు,'' అన్నాడు రత్నాచారి. ‘‘నువ్వు మొదటే పెద్ద పొరబాటు చేశావు.
 
రాణిగారు కోరిన చీరలు, కంబళ్ళతో పాటు భటులకు కూడా ఇచ్చావు. పై అధికారులకూ పంపావు. అంటే, వాళ్ళను మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆపని కూడా ఒక విధంగా లంచమే కదా? అదే నీకు బెడిసికొట్టింది. అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి పది మంది ఎదుట ఇచ్చి ఉంటే, నీకు రావలసిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది.
 
మన అంగడి ముందు ‘రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి' అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకీ బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవి కావు. అవునా?'' అన్నాడు తండ్రి. ‘‘అవును, మీరన్నది ముమ్మాటికీ నిజం,'' అన్నది అక్కడే ఉండి మామగారి మాటలను విన్న రత్నాచారి భార్య. తండ్రి లోకజ్ఞానికీ, వ్యాపార తెలివికీ రత్నాచారి అబ్బుర పడ్డాడు.
 
ఇది జరిగిన పదిహేను రోజుల తరవాత, రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసు కున్నాడు. అప్పుడు కోశాధికారి, ‘‘మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకు వెళ్ళాను. ఆయన విచారణ జరిపి, దోషులను శిక్షించి, రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు,'' అంటూ రెండు లక్షల వరహాలు అందజేశాడు. ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి, ఆయన భార్య, కొడుకు ఎంతగానో సంతోషించారు.

దుష్టులకు దూరం


జనార్దనం తండ్రి వ్యాపారరీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన పుట్టిపెరిగిన గ్రామం వదిలి కట్టుబట్టలతో ఆ పట్నం వచ్చాడు. మొదట ఒక దుకాణంలో పనివాడుగా చేరి వ్యాపారంలోని మెళకువలను ఆకళింపు చేసుకున్నాడు. జీతం రూపంలో వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి దాన్నే పెట్టుబడిగా పెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు. రేయింబవళ్ళు కష్టపడి పనిచేశాడు.
 
కాలం కలిసిరావడంతో కొన్నేళ్ళలోనే బాగా ధనం సంపాదించాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇవ్వడమే కాక, పోయేటప్పుడు, ‘‘నాయనా, జనార్దనం, నేను పోయూక నువ్వీ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది, నువ్వూ, నీ పిల్లలూ పదికాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంతవుంది,'' అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయూక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు.
 
స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించే వారు చాలామంది ఉన్నారు. అయితే, ఆ ఊరు ఆట్టే మంచిది కాదు. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల నీటి సౌకర్యం సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం! జనార్దనం ఆస్తి కొంత బంగారంగానూ, కొంత నగదుగానూ మార్చుకుని, మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడి కొక చక్కని ప్రదేశం నచ్చింది.
 
అది సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు! ఎటు చూసినా సరుగుడు తోటలు. ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని, అక్కడే స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో కొంతసేపు హాయిగా సముద్ర విహారానికి వెళ్ళేవాడు.

ఆ పల్లెటూళ్ళో ప్రజలందరి ముఖ్యవృత్తి చేపలు పట్టటం. వాళ్ళకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే, ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒక్కరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఒక రోజు ఎండవేళ జనార్దనం, ఇంటి ముందున్న సరుగుడుచెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా, ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది.
 
ఎవరో పిలిచినట్టయి, జనార్దనానికి మెలుకువ వచ్చింది. మంచం దగ్గిర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి రాగి రంగు గడ్డమూ, నున్నని గుండూ-వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగీ, నల్లని పంచే ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకిఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎరగ్రా ఉన్నాయి. వాడు, ‘‘కుర్రాడా, చెంబెడు మంచి నీళ్ళు పట్రా! దాహంగా వుంది. ఎండలు మాడ్చేస్తున్నాయి,'' అన్నాడు జనార్దనంతో.
 
జనార్దనం మంచినీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళబోయూడు. ‘‘ఆగు, కుర్రాడా! చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా! నా నోరు పిడచగట్టుకు పోయింది,'' అన్నాడా మనిషి. జనార్దనం, ‘‘అలాగే,'' అని వెళ్ళబోయూడు. ‘‘దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది,'' అని కేకపెట్టాడా గడ్డపుమనిషి.

జనార్దనం ఆ మనిషి అడిగినట్లు గానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయరసమూ వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆపాటికి, ఆ మనిషి, జనార్దనం వేసుకున్న మంచం మీద దర్జాగా కూర్చుని తాపీగా కూనిరాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుట మజ్జిగ తాగేసి, ‘‘గిన్నె నిక్షేపంలా ఉంది. ఎవరయినా కాజేయగలరు, లోపల దాచిరా!'' అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చే సరికి, ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు.
 
‘‘మంచి ఎండ వేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది. ఒక కునుకు తీసి లేస్తాను,'' అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేక పోయూడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని, సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, ‘‘అప్పుడే చీకటి పడిపోయింది. ఒంటరి జీవితమై పోయింది. ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు,'' అంటూ తిన్నగా పాకలో కెళ్ళి, గూట్లో దీపం వెలిగించాడు.
 
వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. ‘‘బాగా చీకటి పడిపోయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు,'' అని కోపాన్ని దిగిమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ‘‘ఎవడివయ్యూ, నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా? వెళ్ళు, వెళ్ళు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి తెల్సిందా?'' అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి, తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం, తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు.
 
ఆ మనిషి, ‘‘నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వే డబ్బు లిచ్చుకోవాలి,'' అనేసి నిద్రపోయూడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ కేకవేసి పిలిచి, ‘‘ఈ అన్యాయం చూడండి,'' అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, ‘‘వాడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు. నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ!'' అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, ‘‘మీరే చెప్పండి. ఈ ఇల్లు నాదా, వాడిదా? మీరంతా రోజూ వస్తూ పోతూ నన్ను చూడటంలేదూ? ఈ దొంగపీనుగకి బుద్ధి చెప్పండి,'' అన్నాడు కోపంగా.

ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపార చూసి, ‘‘ఎవడవిరా నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ గడ్డపాయనదే! మేం రోజూ ఇతన్నే చూస్తున్నాం. మేం ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపానపోలేదు. మర్యాదగా నీ దారిన నువ్వుపో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం!'' అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంత పోయూడు.
 
ఊరి వారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయూలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు రెండు సార్లు గట్టిగా తల విదిలించి, వెర్రి చూపులు చూస్తూ, ‘‘మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళూ ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే, నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాదికాదా?'' అని అమాయకంగా వాళ్ళను అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయూడని రూఢి పరుచుకుని, ‘‘నీది కాదు.
 
ఆ బంగారం అంతా మాది. అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు!'' అంటూ ఆత్రుతగా వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా వున్న ఎత్తయిన ఇసుక దిబ్బను చూపించి, ‘‘పెట్టెడు బంగారం ఆ ఇసుకదిబ్బలోనే ఉంది,'' అన్నాడు. అంతా ఎవరికి వారే కాలిసత్తువ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం.
 
గడ్డంమనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తి పోగానే, జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి, సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని, అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయూడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకుని, తమ సొంత ఊరు వెళ్ళిపోయి, తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదం అయిన జీవితం గడిపాడు.

పుణ్యం - పాపం


కాంచనదేశపు రాజు ధీరసింహుడి ఆస్థాన నర్తకి వసంతమాలిని. సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ, ఆమె చిన్నప్పటి నుంచీ నాట్యం పట్ల విశేష ఆసక్తి కనబరుస్తూ, యుక్త వయస్కురాలయ్యేసరికి సాటి లేని మేటి నర్తకిగా పేరు తెచ్చుకున్నది. ఆమె ప్రతిభను గుర్తించిన రాజు ఆమెను ఆస్థాన నర్తకిగా చేశాడు.
 
ఆమె నాట్య విన్యాసాలనూ, అపురూప భంగిమలనూ చూసి అందరూ ముగ్థులయ్యేవారు. వసంతమాలిని ప్రతిభాసంపన్నురాలైన నర్తకిగానే కాకుండా, మంచి గుణగణాలు, వినయవిధేయతలు, దయూస్వభావంగల అరుదైన కళాకారిణిగా కూడా ప్రజల మన్ననలు పొందింది. ఆ యేడు పట్టపురాని యూమినీదేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజధానిలో జరిగే ఉత్సవాలలో ఒక అంశంగా ప్రజాసమక్షంలో ఆస్థాన నర్తకి వసంతమాలినిని ఘనంగా సత్కరించాలని రాజు ధీరసింహుడు నిర్ణయించాడు.

అయితే, రాజాస్థానంలోని ఇతర కళాకారులకు, పండితులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. తమకు దక్కని అరుదైన గౌరవం రాజనర్తకికి లభించడం చూసి ఓర్వలేక పోయూరు. అసూయతో కుమిలి పోయూరు. సమయం దొరికినప్పుడు ఆమెను కించపరచాలని తహ తహ లాడసాగారు. మహారాణి జన్మదినోత్సవం నాటి సాయంకాలం గొప్ప సభ ఏర్పాటయింది. వేదిక మీద ఏర్పాటు చేసిన ఆసనంలో వసంతమాలిని ఎంతో వినయంగా ఒదిగి కూర్చున్నది.
 
రాజు ధీరసింహుడు ఆమెను విలువైన కానుకలతో సత్కరించి, ఆమె నాట్యకౌశలాన్ని మెచ్చుకుని, మన వసంతమాలిని అప్సరసలకు సాటిరాగల అపూర్వ నాట్యకళాకారిణి. ఆమె మన ఆస్థానంలో ఉండడం మన అదృష్టం. ఆమె అద్భుత నాట్యాన్ని తిలకించే అదృష్టం దేవతలకు లేదు, అన్నాడు. ఆ మాటలకు ప్రజలు కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియజేశారు.
 
అయితే, రాజుగారికి కొద్ది దూరంలో కూర్చున్న ఒక పండితుడు లేచి,మహాప్రభువులు, క్షమించాలి. తమరు అపూర్వ కళాపోషకులు. పొట్టపోసుకోవడం కోసం వచ్చిన వసంతమాలినిని ఆస్థాన నర్తకిని చేయడం అపురూప కళాపోషకులైన తమ ఔదార్యానికి నిలువుటద్దం. అంత మాత్రాన ఈమెను అప్సరసలతో పోల్చడం, ఆ దేవకాంతలను అవమానించడమే అవుతుంది కదా! అన్నాడు.
 
అతడు మాట ముగించేలోపలే మరొక నాట్య కళాకారుడు లేచి, నేను ఎందరో నర్తకీమణుల ప్రతిభను చూసినవాణ్ణి... వసంతమాలిని నాట్యంలో నయగారం కన్నా, నవ్వులపాలే ఎక్కువ. ఆమెను తమ హస్తాలతో సన్మానించడం మన రాజ్యం చేసుకున్న పాపం! అన్నాడు. ఆ మాటలకు సభలో గుసగుసలు ఆరంభమయ్యూయి. ఇదంతా గమనించిన ఆస్థాన విదూషకుడు గంగాధర శాస్ర్తి లేచి, మహాప్రభూ, దేవలోకం, మన రాజ్యం చేసుకున్న పాపపుణ్యాల సంగతేమోగాని, ఆస్థాన నర్తకి వసంతమాలిని మాత్రం పుణ్యం, పాపం రెండూ చేసుకున్నది, అన్నాడు.

విదూషకుడి మాటలు రాజు ధీరసింహుడిలో ఆసక్తిని రేపాయి. ��ఇక్కడున్న వారంతా, మహాపాపం, అవమానం అంటూంటే, తమరేమో మన నర్తకికి పాపపుణ్యాలు రెండూ అంటగడుతున్నారు. కాస్త వివరించి చెప్పండి,�� అన్నాడు. అందుకు విదూషకుడు, ��కళాపోషకులైన తమ రాజ్యంలో జన్మించడం వసంతమాలిని చేసుకున్న పుణ్యం. అందుకే ఆమె నేర్చిన కళకు సార్థకత సమకూరి, ఈ రోజు తమ చేత ప్రజాసమక్షంలో ఇలా సన్మానించబడుతోంది.
 
అయితే, పుణ్యంతో పాటు ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలియదు; ఆమెను వెన్నంటి వస్తోంది,�� అని ఆగాడు. ��ఆ విషయం కూడా విడమరచి చెబితే బావుంటుంది కదా?�� అని అడిగాడు రాజు ఎంతో కుతూహలంగా. ��తోటి కళాకారిణికి లభిస్తూన్న సన్మానాన్ని చూసి ఓర్వలేని వాళ్ళ ఎదుట నాట్యం చేయవలసి రావడం, ఆమె చేసుకున్న పాపం,�� అన్నాడు విదూషకుడు గంభీరంగా.
 
అంతకు ముందు ఆమెపై విమర్శలు గుప్పించినవారు సిగ్గుతో తలలు వంచుకున్నారు. అప్పుడు రాజు, ��వెన్నెలలు వెదజల్లని జాబిలి అందాన్ని ఎవరూ ఆస్వాదించలేరు. అలాగే సాటి మనిషిలోని మంచినీ, శక్తిసామర్థ్యాలనూ గుర్తించి గౌరవించలేని వారి పాండిత్యం నిష్ర్పయోజనం. అది అలాంటి వారి వ్యక్తిత్వానికి మాయని మచ్చ అవుతుంది.
 
అలాంటివారు నా ఆస్థానంలో ఉన్నందుకు విచారిస్తున్నాను,�� అన్నాడు. ఆ తరవాత, చమత్కారంతో అసూయూపరుల అసలు రూపాలను బయటపెట్టిన విదూషకుణ్ణి వసంతమాలిని చేతుల మీదుగా ఘనంగా సత్కరించాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో చప్పట్లు చరిచారు. 

గజరాజు


అరుణానదీ తీరంలో గురుకుల విద్యాలయూన్ని నడుపుతూన్న కృష్ణచైతన్యుడు, విద్య పూర్తి చేసి స్వస్థలాలకు వెళుతూన్న ఐదుగురు విద్యార్థులనుద్దేశించి, ‘‘మీరు గురుకులానికి వచ్చినప్పుడు మీకు ఓనమాలు కూడా రావు. ఈనాడు అమరకోశంతో సహా అనేక గ్రంథాలను అవలీలగా ఔపోశన పట్టారు.
 
ఇదెలా సాధ్యమయింది? నిరంతర అభ్యాసం. వికసించిన బుద్ధిబలం. మీరు ఇప్పుడు బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. జీవితం అంటే, పూలబాట కాదు; నిరంతర పోరాటం అన్నది మరిచి పోకండి. ఆత్మవిశ్వాసం, నిరంతర ప్రయత్నం మనిషికి చాలా అవసరం. అవి ఉన్నప్పుడే భవిష్యత్తు బంగారం కాగలదు. గజరాజుకు కొండంత బలం ఉన్నప్పటికీ, దాన్ని గ్రహించి ఉపయోగించకపోతే ఇసుమంత ప్రయోజనం కూడా ఒరగదు.
 
ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినండి,'' అంటూ ఇలా చెప్పసాగాడు: జంతువులతో, పక్షులతో గారడీ ఆటలు ప్రదర్శించి, పొట్టపోసుకునే వీరేశం ఒకనాడు అడవి ప్రాంతంలో తిరుగుతూండగా గుంతలో పడ్డ ఏనుగుపిల్ల ఒకటి కనిపించింది. దాన్ని పైకిలాగి, తనతోపాటు పట్టణానికి తీసుకువచ్చాడు. దాన్నొక చిన్న తాడుతో గుంజకు కట్టేసి, మేత వేయసాగాడు. ఏనుగు పిల్లకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు.
 
అడవి మీదికి మనసుపోయింది. దాంతో అది తనకు కట్టిన తాడును తెంచుకోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆ తాడును తెంచుకోవడానికి దానికి బలం చాలలేదు. అయినా, కొన్నాళ్ళు ప్రయత్నించింది. కాని ప్రయోజనం లేకపోయింది. పోరాడి, పోరాడి అలిసి పోయింది. ఆఖరికి ఆ తాడును తెంచుకుని వెళ్ళడం తనకు సాధ్యమయ్యే పని కాదని భావించి, అడవి పట్ల తల్లిదండ్రుల పట్ల ఆశను వదులుకుని వీరేశం చెప్పినట్టు నడుచుకోసాగింది. వీరేశం తన గారడీ ప్రదర్శ నలో ఆ ఏనుగు పిల్ల చేత రకరకాల విన్యాసాలు చేయించేవాడు.

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయూయి. ఏనుగు పిల్ల ఇప్పుడు యౌవనంలోకి వచ్చింది. చాలా చక్కగా బలంగా తయూరయింది. యజమాని చెప్పినట్టు నడుచుకోసాగింది. ఇలా ఉండగా వీరేశం ఒకనాడు అడవినుంచి ఒక ఎలుగుబంటును పట్టుకు వచ్చాడు. దాన్ని బలమైన తాడుతో గుంజకు కట్టివేశాడు. ఎలుగుబంటు తప్పించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. కాని తప్పించుకోలేక పోయింది.
 
వీరేశం దానికి కూడా కొన్ని గారడీ ఆటలు నేర్పడానికి ప్రయత్నించాడు. సరిగ్గా చెయ్యకపోతే కొరడాతో కొట్టేవాడు. సరిగ్గా చేస్తే తినడానికి ఏదైనా అందించేవాడు. రోజూ ఇదే తంతు కొనసాగింది. ఒకరోజు ఆ ఎలుగుబంటు వీరేశం చేతిలో చావుదెబ్బలు తిని, రాత్రంతా మూలుగుతూ పడుకున్నది. ఏనుగుకు దానిని చూడగానే జాలి కలగడంతో, ‘‘మిత్రమా, ఎందుకు దెబ్బలు తింటావు? యజమాని చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా! అలా వింటే నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది.
 
సుఖంగా రోజులు గడిచిపోతాయి!'' అన్నది. ‘‘గజరాజా, ఏమిటి నువ్వంటున్నది? వాడిచ్చే ఆహారం నాకు రుచించడం లేదు. అడవిలో స్వేచ్ఛగా సంచరించే నన్ను బంధించి తీసుకువచ్చాడు. వాడు నాలుగు డబ్బులు సంపాయించడం కోసం నన్ను నానా హింసలు పెడుతున్నాడు. నేను వాడినుంచి తప్పించుకుంటే తప్ప నాకు సుఖం లేదు,'' అన్నది ఎలుగుబంటు విచారంగా. ‘‘అది నీ తరం కాదు. నేనూ ఒకప్పుడు నీలాగే ప్రయత్నించాను. ఎంత ప్రయత్నిం చినా తాడును తెంచుకోలేక పోయూను,'' అన్నది ఏనుగు.

ఆ మాటకు ఎలుగుబంటు వికవికా నవ్వింది. ‘‘ఎందుకలా నవ్వుతావు? నా కథ నీకు పరిహాసంగా ఉందా?'' అని అడిగింది ఏనుగు కోపంగా. ‘‘గజరాజా, నీ బలం గురించి నీకు తెలియడం లేదు. ఈ నీచమానవుడితో చేరి నీచంగా ఆలోచిస్తున్నావు. నువ్వు తలుచుకుంటే, ఈ తాడు, గుంజ, గుడారం ఒకలెక్కా?'' అని అడిగింది ఎలుగుబంటు. ‘‘ఎంతో ప్రయత్నించి ఓడిపోయూనని చెప్పాను కదా?'' అన్నది ఏనుగు సిగ్గుతో.
 
‘‘నువ్వు ప్రయత్నించిందెప్పుడు? పసిపిల్లగా ఉన్నప్పుడు! అప్పుడు నీకు బలం చాలలేదు. ఇప్పుడు కొండల్ని పిండిచేయగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు,'' అని ప్రోత్సహించింది ఎలుగుబంటు. ఆ మాటలతో ఉప్పొంగిపోయిన ఏనుగు ఒక్కసారిగా తిరగబడి, తనను కట్టిన తాడును తెంచుకుంది. అంతటితో ఆగకుండా, ఎలుగుబంటును కట్టిన తాడును కూడా తెంచింది. రెండూ కలిసి అడవికేసి పరిగెత్త సాగాయి.
 
అడవిని సమీపిస్తూ, ‘‘మిత్రమా, నేనెంత అమాయకుణ్ణి. గడ్డి పోచను చూసి భయపడి పోయూను. నువ్వు చెప్పకపోతే నా బలం నాకు తెలిసేది కాదు,'' అన్నది ఏనుగు సిగ్గుతో. ‘‘నువ్వే కాదు. చాలామంది అంతే. తమబలం తమకు తెలియదు. సంకోచంతో అసలు ప్రయత్నమే చేయరు. ప్రయత్నం చేయని వారికి విజయం ఎలా సమకూరుతుంది?'' అన్నది ఎలుగుబంటు.
 
ఆ తరవాత ఏనుగూ, ఎలుగుబంటూ తమ వారిని కలుసుకుని స్వేచ్ఛగా బతికాయి. కృష్ణచైతన్యుడు ఈ కథ చెప్పి, ‘‘మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలను మరిచి పోకుండా, నిరంతర ప్రయత్నంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ, మీరూ హాయిగా జీవిస్తూ, పదిమందినీ జీవించేలా చేయూలి,'' అంటూ ఆశీర్వదించాడు. ఐదుగురు శిష్యులూ గురువుకు భక్తితో నమస్కరించి, కృతజ్ఞతతో అక్కడి నుంచి బయలుదేరారు.


నవకోటి నారాయుడు


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక మహాధనికుడుండేవాడు. ఆయన తొమ్మిదవ కోటి పూర్తిచేసి, పడగ ఎత్తే సమయూనికి ఒక కొడుకు పుట్టాడు. అందుచేత కొడుక్కు ఆప్యాయంగా, నవకోటి నారాయుడు అని పేరు పెట్టాడు. నారాయుడికి తండ్రి లేదనకుండా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అందుచేత కురవ్రాడు ఆడింది ఆట, పాడింది పాట అయింది.
 
అతడు దుష్టులతోను, దుండగీళ్ళతోను సహవాసం చేయసాగాడు. ఏమైతేనేం, యుక్తవయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కటి పిల్లను చూసి నారాయుడికి అతి వైభవంగా పెళ్ళి జరిపించాడు. మరి కొద్ది కాలానికే ఆయన కాలం చేశాడు. నారాయుడి అజాగ్రత్త, దురలవాట్ల కారణంగా తండ్రి చేర్చిన ధనమంతా హారతి కర్పూరంలా హరించుకు పోయింది. దానికి తోడు చిన్నప్పటి నుంచీ నారాయుడు హద్దూ పద్దూ లేకుండా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిసి మోపెడై, తండ్రి పోయేసరికి, కాల సర్పాలలాగ వచ్చి పట్టుకున్నాయి.
 
ఋణ దాతలందరూ ఒక్కసారిగా వచ్చి చుట్టుకున్నారు. ఈ స్థితిలో నారాయుడికి జీవితమంటే నిస్పృహ తోచింది. గత్యంతరం కానక, చివరకు చస్తే మేలనిపించింది. ఏమీ బదులు చెప్పలేక, నారాయుడు వారితో, ‘‘అయ్యూ! నేను గంగ ఒడ్డున ఫలానా మర్రిచెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వులు వదిలి వెళ్ళిన నిక్షేపమున్నది. మీ మీ పత్రాలన్నీ పట్టుకుని అక్కడకు రండి,'' అని చెప్పాడు.
 
అవుననుకొని అందరూ ఆ మర్రిచెట్టు వద్దకు వెళ్ళి సిద్ధంగా వున్నారు. నారాయుడు నిక్షేపం కోసం వెతుకులాడుతున్నట్టు నడిరాత్రి వరకు అటూ ఇటూ తచ్చాడి, వాళ్ళు ఆదమరుపుగా వుండటం చూసి, గభీమని గంగలోకి దుమికేశాడు. ‘జయ్‌ పరమేశ్వరా!'' అని అతడు జాలిగా కేక వేసేంతలో ప్రవాహవేగం అతణ్ణి ఎంత దూరమో లాక్కు పోయింది.

ఆ కాలమందు బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి, తక్కిన లేళ్ళ మందలకు దూరంగా, గంగా తీరాన, లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ లేడి అన్ని విధాలా ప్రత్యేకత కలది-బంగారు శరీరచ్ఛాయ, లక్కవంటి కాళ్ళడెక్కలు, వెండికొమ్ములు, రత్నపుపొడలలాగా జిగజిగ మెరిసే చక్కటి కన్నులు-ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నది లేడి.
 
ఈ లేడికి అర్ధరాత్రి సమయూన విపత్తులో వున్న ఒక మానవుడి ఆక్రందనం వినిపించింది. ��ఏమిటీ దీనాలాపం!�� అనుకొంటూ, బంగారు లేడి లేచి, ఎదురీదిపోయి నారాయుడి వద్దకు చేరుకొన్నది. అతన్ని ప్రవాహం నుంచి కాపాడి గట్టుకు చేర్చి, ��నీకు వచ్చిన భయంలేదు, నాయనా!�� అంటూ అది వాడికి ధైర్యం చెప్పి, వీపుపైన ఎక్కించుకొని బసకు తీసుకుపోయింది. అతడు తేరుకునే వరకూ ఆ లేడి అరణ్యంలో నుంచి ఫలాదులు తెచ్చి, నారాయుడికి ఆకలి దప్పులు తీర్చింది.
 
తరవాత ఒకరోజున, ��నాయనా! నిన్ను ఈ అరణ్యం దాటించి మీ రాజ్యానికి దోవ చూపిస్తా. క్షేమంగా వెళ్ళిపో. అయితే ఒకే ఒక్క కోరిక-రాజుగానీ మరే శ్రీమంతుడుగానీ నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ, ఫలానిచోట బంగారు లేడి ఉన్నది అనే సంగతిమట్టుకు వెల్లడించవద్దు. ఇదే నా కోరిక,�� అని చెప్పింది.

సరేనన్నాడు నారాయుడు. ఈ వాగ్దానం నమ్మి, బంగారు లేడి వాడిని తన వీపుపైన ఎక్కించుకొని కాశీరాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగ్గా నారాయుడు కాశీపట్టణం చేరుకున్న రోజునే ఒక చిత్రం జరిగింది. అంతకు క్రితం పట్టపురాణికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించి, ధర్మబోధ చేసిందట. రాణి తన భర్త వద్దకు వచ్చి, ��అసలు లోకంలో ఉండక పోయినట్టయితే ఇటువంటి లేడిరూపం నా కెందుకు కనబడుతుంది? దాన్ని వెంటనే నాకు పట్టి తెస్తేనే తప్ప, జీవాలు నిలవవు,�� అంటూ పట్టుపట్టింది.
 
తక్షణమే రాజు చేసిన ఏర్పాటు ఏమంటే: ఒక ఏనుగు మీద అంబారీ, అంబారీలో బంగారు బరిణె, బరిణె లోపల వెయ్యి మొహిరీలు - వీటితో అది ఊరేగుతుంది. బంగారు లేడిని గురించిన భోగట్టా తెలిపే వారికి బరిణెలోని మొహిరీలను బహుమతిగా ఇస్తారు. ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖింపించి, సేనాని ఊరూరాదండోరా వేయించాడు. సరిగా ఈ దండోరా వేసే సమయూనికి నారాయుడు కాశీనగరంలో అడుగు పెట్టాడు.
 
అతడు సేనాని వద్దకు వచ్చి, ��అయ్యూ, మీకు కావలసిన ఆ బంగారులేడిని గురించి నాకంతా తెలుసు. నన్ను ప్రభువు దగ్గరకు తీసుకుపొండి,�� అన్నాడు. తరవాత నారాయుడు రాజునూ, పరివారాన్నీ వెంటబెట్టుకుపోయి, అరణ్య మధ్యంలో బంగారు లేడి నివసించే ఏకాంత స్థలం చూపించి, తను అల్లంత దూరాన నిలబడ్డాడు. రాజుగారి పరివారం ఒక్కసారిగా గొల్లుమని కేకవేశారు. లేడి రూపంలో వున్న బోధి సత్వడు ఆ శబ్దం విన్నాడు.

��ఎవరో గొప్ప అతిథి వచ్చి వుండాలి. స్వాగతమిద్దాం,�� అనుకుంటూ అతడు లేచి, రాజు నిలబడ్డచోటికి పోబొయ్యూడు. లేడి యొక్క వేగానికి రాజు ఆశ్చర్యపోయూడు. విల్లమ్ములు తీసుకొని, లేడికి ఎక్కు పెట్టాడు. అప్పుడు లేడి మృదుమధురమైన కంఠస్వరంతో ఇలా అన్నది: ��రాజా! ఆగు, తొందరపడకు, నా ఉనికిని గురించి నీకు చెప్పినవారెవరు?�� రాజు చెవులకు ఈ మాటలు అమృత తుల్యంగా వినబడినై.
 
ఆయనకు తెలియ కుండానే విల్లమ్ములు కిందపడినై. నిదానమైన మధుర స్వరంతో బోధిస త్వుడు, ��రాజా! నా ఉనికిని నీకు తెలిపిన దెవరు?�� అని మళ్ళీ ప్రశ్నించాడు. రాజు నారాయుడిని వేలు ఎత్తి ఆనవాలు చూపించాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు : ��లోకంలో మానవుణ్ణి మించిన కృతఘు్నడు లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజం.
 
జంతుభాష తెలుసుకోవచ్చు, పక్షిభాష తెలుసుకోవచ్చు. కాని మనిషి మాట అర్థం చేసుకోవడం బ్రహ్మతరం కాదు,�� అంటూ తను నారాయుడిని రక్షించి పరిచర్యలు చేసి, అతని వద్ద నుంచి వాగ్దానం తీసుకుని సాగనంపిన వృత్తాంతమంతా రాజుకు వివరించాడు. రాజు ఉగ్రుడై, ��ఇదా సమాచారం! ఇటువంటి కృతఘు్నడు, మహాపాపి లోకానికి పీడ.
 
ఒక్క బాణంతో వీణ్ణి హతమారుస్తాను,�� అని బాణం తీశాడు. బోధిసత్వుడు ఆయనను వారించి, ��రాజా! చంపవద్దు. ప్రాణం తీస్తే ఏముంది? బ్రతికివుంటే ఏనాటికైనా వాడికే బుద్ధి వచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారం వాడికీయవలసిన బహుమతులు కూడా ఇచ్చివెయ్యి. ఇదే న్యాయం,�� అని హితబోధ చేశాడు. రాజు అలాగే చేశాడు. బోధిసత్వుడిలోని ఔదార్యమూ, క్షమా మొదలైన మహత్తర గుణాలన్నీ అప్పుడు బోధపడినై రాజుకు. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి, ఆయనను తన రాజ్యం నడిపించే సారథిగా ఎంచుకొన్నాడు.

నరకం చూపేవాడు


ఏదో విధంగా తన పొరుగునే వుంటున్న రామేశాన్ని మించిపోవాలనుకునే కామేశం, దూర గ్రామంలో చిత్రకళాభ్యాసం చేసివచ్చి, తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సంవత్సరం ఊళ్ళో దొంగతనాలెక్కువయ్యూయి. పట్టుబడిన దొంగలను సంకెళ్ళు వేసి ఊళ్ళో తిప్పినా, కారాగారంలో వేసి కఠిన శిక్షలు విధించినా, వాళ్ళల్లో సిగ్గు పుట్టడం లేదు, మార్పు రావడం లేదు. గ్రామాధికారి ఊరి పెద్దలను సంప్రదించాడు.
 
ఆయన వాళ్ళతో, ‘‘ఊళ్ళో సతీసావిత్రి హరికథాకాలక్షేపం ఏర్పాటు చేసి, ఖైదీలకు వినిపిద్దాం. ఆ కథలో, సావిత్రి, తన భర్త సత్యవంతుడి ప్రాణాలు తీసుకుని పోతున్న యముడి వెంట పడుతుంది కదా! అప్పుడు యముడు, ఆ మహాపతివ్రతను భయపెట్టి వెనక్కు పంపాలని, నరకలోకం ఎంత భయంకరంగావుంటుందో వర్ణిస్తాడు.
 
ఇహానికి భయపడని వాళ్ళుకూడా, పరానికి భయపడతారుకాబట్టి, నరకభయంతో దొంగలు దొంగతనాలు మానొచ్చు,'' అన్నాడు. కామేశం వెంటనే, ‘‘నరకలోకం బొమ్మను చూపిస్తే, వాళ్ళు మరింతగా హడలిపోతారు. కాబట్టి నరకలోకం బొమ్మను సహజంగా వేసినవారికి మంచి బహుమతిని ప్రకటిద్దాం,'' అన్నాడు. ‘‘ఐతే, ఉపాయం బాగుంది కానీ, బహుమతికి నేనొప్పుకోను,'' అన్నాడు రామేశం.
 
‘‘ఇలా అభ్యంతరం చెప్పడం సంస్కారం కాదు,'' అన్నాడు కామేశం నిష్ఠూరంగా. రామేశం నవ్వి, ‘‘బ్రతికున్న వాళ్ళకు నరకం చూపించే బొమ్మవేయడం చిత్రకళ అనీ, ఆ వేసిన వాళ్ళకు బహుమతి ఇవ్వడం, సంస్కారమనీ నాకు అనిపించదు. ఆపైన ఊరి పెద్దల ఇష్టం!'' అన్నాడు. అంతా నవ్వారు. కామేశం, రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

గౌరవం


జనకపురిలో శ్రీధాముడనే భాగ్యవంతుడికి కాముడు, పాత్రుడు అని ఇద్దరు కొడు కులు. వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుని పెద్దవాళ్ళయి బుద్ధిమంతులన్న పేరు తెచ్చుకున్నారు. తండ్రి వాళ్ళిద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్ళి చేశాడు కాని, ఆస్తివ్యవహారాలు మాత్రం ఇంకా తనే చూస్తున్నాడు. శ్రీధాముడి భార్య రమాదేవి ఒకనాడు భర్తతో ఈ విషయం ప్రస్తావించింది. ‘‘మనపిల్లలు బుద్ధిమంతులే కాని, ఆస్తి చేతికి వచ్చాక, వాళ్ళెలా మారుతారో తెలియదు.
 
ఇప్పటిలాగే వాళ్ళు మనల్ని గౌరవిస్తారని నమ్మకం కుదరడానికి కొన్నాళ్ళు పరీక్షిద్దాం,'' అని చెప్పి, ఆయన తన ఇంటిని మూడు వాటాలు చేశాడు. మధ్య వాటాలో తను ఉంటూ, అటూ ఇటూ కొడుకులచేత వేరుకాపురాలు పెట్టించాడు. పెత్తనం తనదే అయినా, పనులన్నీ కొడుకులకు అప్పగించి వాళ్ళ చేతలను గమనించసాగాడు. పెద్దవాడు కాముడు ఆస్తిని ఇంకా ఇంకా పెంచాలని ఆలోచిస్తూ, తనకు తోచిన ఉపాయూలను తండ్రికి చెప్పి, ఆయన ఆమోదించాకే అమలు చేసేవాడు.
 
చిన్నవాడు పాత్రుడు రోజూ నిద్రలేస్తూనే శ్రీధాముడి తండ్రి కుచేలుడి చిత్రపటానికి నమస్కరిస్తాడు. కుచేలుడి పేరు మీద అంతో ఇంతో దానధర్మాలు చేస్తూ, అందుకు తండ్రి అనుమతి కూడా అడగడు. ఎవరడిగినా కుచేలుడి మనమడినంటాడే తప్ప తన పేరు చెప్పడు. ఇలా ఒక ఏడాది గడిచాక, శ్రీధాముడు భార్యాసమేతంగా తీర్థయూత్రలకు బయలుదేరుతూ, తన ఆస్తిని రెండు భాగాలు చేసి చిన్న భాగం కాముడికీ, పెద్ద భాగం పాత్రుడికీ అప్పజెప్పాడు.
 
కాముడు చిన్నబుచ్చుకున్నాడు. భార్య అతన్ని హెచ్చరిస్తూ, ‘‘ఆస్తిని ఇద్దరు కొడుకులకూ సమానంగా పంచాలి. లేదా పెద్దవాడివైన నీకు పెద్ద భాగమివ్వాలి. నువ్వు ఊరుకోకుండా వెంటనే మీ నాన్నను అడుగు,'' అన్నది. కాముడు ఆమె మాట పాటించాడు.

కొడుకు గోడు విన్న శ్రీధాముడు నిర్లక్ష్యంగా నవ్వి, ‘‘ఈ ఆస్తి నా స్వార్జితం. పంపకం నా ఇష్టం. నాకు మీతాత, అనగా నా తండ్రి కుచేలుడంటే భక్తి, గౌరవం. ఆయన్ను గౌరవించే పాత్రుడికి పెద్ద భాగమిచ్చాను. ఐతే, ఈ పంపకం తాత్కాలికం. నా తీర్థయూత్రలయ్యేసరికి నీలో నేను మెచ్చేమార్పువస్తే, పెద్ద భాగం నీకే దక్కవచ్చునేమో,'' అనేసి యూత్రలకు వెళ్ళిపోయూడు.
 
పాత్రుడు కుచేలుణ్ణి గౌరవించడం వెనక ఇంత కథ ఉన్నదని తెలియని కాముడాశ్చర్యపడి, తమ్ముణ్ణి కలిసి, ‘‘తాత చనిపోయినప్పుడు నీకు మూడేళ్ళయితే నాకు ఆరేళ్ళు. నాకే తెలియని ఆయన గొప్పతనం నీకెలా తెలుసు? ఆయనపై నీకింత అభిమానం ఎందుకు?'' అని అడిగాడు. ‘‘మన తండ్రికి జన్మనివ్వడం ఆయన గొప్పతనం. మన తండ్రిని సంతోషపెట్టడం నా ధ్యేయం,'' అన్నాడు పాత్రుడు.
 
ఆ తరవాత కాముడు ఆ విషయం గురించి బాగా ఆలోచించి, పాత్రుడి వద్ద వున్న పటానికి మూడింతల పరిమాణంలో కుచేలుడి చిత్రపటాలను రెండింటిని తయూరు చేయించాడు. ఒక పటాన్ని తన ఇంట్లో అలంకరించాడు. రెండవ పటాన్ని ఊరి గుడి మంటపంలో అలంకరించడానికి నూరువరహాలు చందా ఇచ్చాడు.
 
ఇలా ఉండగా జనకపురికి పొరుగు గ్రామమైన సీతాపురంలోని చలమయ్య అనే రైతు, అప్పులపాలైపోయి, తీర్చేమార్గం తెలియక, ఆత్మహత్య చేసుకోబోయూడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పాత్రుడు అతణ్ణి అడ్డుకుని కాపాడాడు. తర్వాత విషయం అడిగి తెలుకుకుని, ‘‘నీకు నేను మా తాత కుచేలుడి పేరు చెప్పి పది వరహాలిస్తాను. ఆ పెట్టుబడితో పొలం సాగుచెయ్యి. మా తాత మహిమతో నీ కష్టాలన్నీ తీరిపోతే, నా డబ్బు నాకు తిరిగి ఇద్దువుగాని,'' అని ధైర్యం చెప్పాడు.
 
ఆ డబ్బు తీసుకుని సీతాపురం తిరిగి వెళ్ళిన చలమయ్యకు - మరునాడు పొలం దున్నుతుండగా లంకెబిందెలు నాగలి కర్రుకు అడ్డు తగిలాయి. వాటినతడు గ్రామాధికారికి చూపితే, ఆయన బిందెల మీది రాతలను చదివి, ‘‘ఇవి నీ పూర్వులు నీకోసం పాతిపెట్టినవి. ఈ ధనం నీదే!'' అన్నాడు.


చలమయ్య జాతకం మారిపోయింది. అతడు జనకపురి వెళ్ళి, పాత్రుడికి డబ్బు తిరిగి ఇచ్చి, కృతజ్ఞతలు చెప్పాడు. ‘‘ఇందులో నాదేంలేదు. అంతా మా తాత కుచేలుడి మహిమ,'' అన్నాడు పాత్రుడు. ‘‘నేనే కాదు. కుచేలుడి మహిమ అందరూ తెలుసుకోవడానికి, మా ఊరి గుడిలో ఆయన పటం ఆవిష్కరించి, వేడుక చేస్తాను. అది నీ ఆధ్వర్యంలోనే జరగాలని నా కోరిక. నువ్వు తప్పక రావాలి,'' అన్నాడు చలమయ్య. ఈలోగా తీర్థయూత్రలు ముగించుకుని శ్రీధాముడు రెండు రోజుల్లో తిరిగి రాగలనని కొడుకులకు కబురు పంపాడు.
 
ఆ కబురందిన సమయూనికే సీతాపురంలో వేడుకలకురమ్మని చలమయ్య నుంచి పిలుపు వచ్చింది. తండ్రి వచ్చేసరికి, తిరిగి వచ్చేస్తామని అన్నకు చెప్పి సీతాపురం వెళ్ళాడు పాత్రుడు. అయితే, శ్రీధాముడు వచ్చిన సమయూనికి పాత్రుడు జనకపురికి చేరుకోలేక పోయూడు. కాముడాయనకు ఘనస్వాగతం పలికాడు. తండ్రి పాత్రుడి గురించి అడిగితే, చలమయ్య విషయం చెప్పి, ‘‘నువ్వొస్తున్నట్టు తెలిసీ తమ్ముడు సీతాపురం వెళ్ళాడు,'' అంటూ నిష్టూరంగా మాట్లాడాడు.
 
ఆ తరవాత తండ్రి గౌరవార్థం విందు చేసి ఊరి పెద్దలను పిలిచాడు. అందరూ కాముడికి తండ్రిపై ఉన్న గౌరవాభిమానాలను కొనియూడారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక మనిషి, ‘‘అయ్యూ, కాముడుగారు ఎక్కడ ఉంటారు?'' అని అడిగాడు. కాముడు ముందుకు వచ్చి, ‘‘నేనే కాముణ్ణి. ఏం కావాలి?'' అని అడిగాడు. ‘‘సీతాపురం నుంచి కుచేలుడుగారి మనవడు పంపగా వచ్చాను. ఆయన రేపు సాయంకాలానికి ఇక్కడికి వస్తున్నట్టు చెప్పమన్నారు,'' అన్నాడు.
 
అది విన్న శ్రీధాముడు ఆ మనిషినడిగి సీతాపురం వేడుకల వివరాలు తెలుసుకుని, ‘‘ఆహా, పెద్దలంటే పాత్రుడికున్న గౌరవం, అపారం,'' అని మెచ్చుకున్నాడు. విందు ముగిసి అందరూ వెళ్ళిపోయూక, ‘‘నీ పట్ల తమ్ముడు చూపిన గౌరవానికీ, నేనిచ్చిన గౌరవానికీ తేడా కనబడుతూనే ఉంది. తాతగారి విషయూనికి వస్తే, తమ్ముడాయన పేరుతో ఇచ్చిన డబ్బు వెనక్కు తీసుకున్నాడు.
 
సీతాపురం గుడిలో చలమయ్య పెట్టిన తాతగారి చిత్రపటం చూడ్డానికి వెళ్ళాడు. నూరు వరహాలు ఖర్చుపెట్టి మన ఊరి గుడిలో తాతగారి చిత్రపటాన్ని పెట్టించిన నాకంటే వాడి గౌరవం గొప్పదనడం నీ పక్షపాత బుద్ధికాదా?'' అన్నాడు కాముడు ఉక్రోషంగా.

అందుకు శ్రీధాముడు నవ్వి, ‘‘ఏది చేసినా నీ పేరుతోనే చేస్తూ నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు. అన్నీ తాత పేరుతో చేస్తూ ఆయన పేరునిలబెడతూన్న పాత్రుడి గొప్పతనం గ్రహించలేని నీకు గౌరవం అంటే ఏమిటో చెప్పగలవాడు దండకారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతూన్న సుమేధుడొక్కడే. తమ్ముడు తిరిగి వచ్చాక వాణ్ణి వెంటబెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళు. నీకు సందేహ నివృత్తి అవుతుంది,'' అన్నాడు.
 
మరునాటి సాయంత్రానికి పాత్రుడు తిరిగి వచ్చాడు. రెండు రోజుల తరవాత, తండ్రి ఆనతి ప్రకారం అన్నదమ్ములిద్దరూ దండకారణ్యం వెళ్ళి సుమేధుణ్ణి కలుసుకున్నారు. కాముడి సందేహం విన్న సుమేధుడు, ‘‘నీ తమ్ముడు పెద్దలను నీకంటే మిన్నగా గౌరవిస్తాడని నీ తండ్రి అభిప్రాయం. మీరిద్దరూ కొన్ని రోజులు ఇక్కడే నా ప్రియశిష్యుడు సునాధుడితో ఉంటూ-అన్నీ అతడు చెప్పినట్టే చేయండి,'' అంటూ వారిని సునాధుడికి అప్పగించాడు.
 
మరునాడు సుమేధుడు వారిని సూర్యోదయూనికి ముందే నిద్రలేపి, చన్నీటి స్నానం చేయించాడు. ఆ తరవాత ముగ్గురూ వెళ్ళి, సుమేధుడు శిష్యులకు చెబుతూన్న పాఠాలు విన్నారు. పాఠాలు చెప్పడం అయ్యూక సుమేధుడు, ‘‘ఇప్పుడు మీరు అడవిలోకి వెళ్ళి నేలరాలిన ఫలాలు సేకరించండి. చెట్టు నుంచి పండును కోయవద్దు. జీవహింసకు పాల్పడవద్దు. సేకరించిన ఆహారాన్ని అందరూ సమంగా పంచుకుని తినండి,'' అన్నాడు.
 
కాముడు, పాత్రుడు సునాధుడితో కలిసి అడవిలోకి వెళ్ళారు. దారిలో సునాధుడు వారిని ఒక చెట్టెక్కి పళ్ళు కోయమన్నాడు. గురువు వద్దన్నాడని కాముడు కొయ్యనన్నాడు. పాత్రుడు మాత్రం చెట్టెక్కబోతే అక్కడున్న కోతి ఒకటి మీద పడబోయింది. సునాధుడు చెప్పగా అతడా కోతిని చిన్నరాయి తీసి గురిచూసి విసిరి తరిమేశాడు. కాముడు వారిస్తున్నా వినలేదు.
 
చెట్టెక్కి సునాధుడు చెప్పినన్ని పళ్ళు కోశాడు. ‘‘కష్టపడి కోసిన పళ్ళు. వీటిని ఇతరులతో పంచుకోవద్దు. మనమే తినేద్దాం,'' అన్నాడు సునాధుడు. పాత్రుడు సరేనన్నాడు. అయితే, గురువు మాటను అతిక్రమించడానికి ఇష్టపడని కాముడు, పరుగున సుమేధుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు.

సుమేధుడు పాత్రుణ్ణి పిలిపించి సంజాయిషీ అడిగాడు. ‘‘గురువర్యా, మీ ఆశ్రమంలో ఉండగా - అన్నీ సునాధుడు చెప్పినట్టే చేయమని నన్ను ఆదేశించారు కదా? నేను మీ ఆదేశాన్ని పాటించాను,'' అన్నాడు పాత్రుడు. అందుకు కాముడు, ‘‘మరి గురువు పాఠం చెబుతూ ఇచ్చిన ఆదేశాల మాటేమిటి?'' అంటూ తమ్ముణ్ణి నిలదీశాడు.
 
అప్పుడు సుమేధుడు చిన్నగా నవ్వి, ‘‘నా పాఠాలు నా శిష్యులకోసమే తప్ప, మీ కోసం కాదు. నువ్వు, పాత్రుడు ఇక్కడికి విద్యార్థులుగా రాలేదు. నేను మిమ్మల్ని అన్నీ సునాధుడు చెప్పినట్టే చేయమని ఆదేశించాను. సునాధుడు నా మాట పాటించక పోతే అతడు నన్ను అగౌరవపరచినట్టు. సునాధుడి మాట పాటించక పోతే మీరు నన్ను అగౌరవపరచినట్టు. ఇప్పుడు నువ్వే చెప్పు. పెద్దల్ని గౌరవించేది పాత్రుడా, నువ్వా?'' అన్నాడు.
 
కాముడు తెల్లబోయి, ‘‘అసలీ సమస్య అంతా సునాధుడు మిమ్మల్ని అగౌరవ పరచడంవల్ల కదా వచ్చింది?'' అన్నాడు. ‘‘ఇందులో సునాధుడి తప్పేమీ లేదు. మిమ్మల్ని పరీక్షించడం కోసం నేనే అతణ్ణి అలా చెయ్యమన్నాను. నా ప్రియశిష్యుడి ప్రవర్తనలోనూ, ఆ ఆదేశంలోనూ ఏదో ఆంతర్యం ఉన్నదని నీకు స్ఫురించ లేదంటే నీకు నా మీద గౌరవం లేదని అర్థం. కాదంటావా?'' అన్నాడు సుమేధుడు.
 
తన తండ్రి శ్రీధాముడు చేసిన ఆస్తిపంపకంలో ఏదో ఆంతర్యం ఉన్నదని గ్రహించక, అదేమని ఎదురుతిరగడం వల్ల - తనకు ఆయనపట్ల గౌరవం తక్కువేనని అప్పటికి అర్థమైంది కాముడికి. తరవాత సుమేధుడికి పాదాభివందనం చేసి, తమ్ముడితో కలిసి జనకపురి వెళ్ళి తండ్రిని తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీధాముడు, ‘‘తండ్రి నిర్ణయూన్ని తప్పు పట్టడం గౌరవం కాదని నువ్వు గ్రహించాలనే ఇదంతా చేశాను. కానీ, మీరిచ్చే గౌరవాన్ని బట్టి ఆస్తి పంపకం చేయడం నాకూ గౌరవం కాదు,'' అంటూ కొడుకులిద్దరికీ ఆస్తిని సమంగా పంచి ఇచ్చాడు.

అన్నింటికంటె నీచవృత్తి


పూర్వం వైశాలీనగరంలో రంగిశెట్టి అనే కిరాణావ్యాపారి ఉండేవాడు. వ్యాపారం మీద శెట్టికి సుఖంగా జరుగుబాటు కావటమేగాక, కొంత మిగులుతూండేది కూడా. అయినా శెట్టికి తన ‘‘బెల్లం, చింతపండు'' వ్యాపారం ఎదుగూ బొదుగూలేని వ్యాపారంగా కనబడింది. ఎన్నాళ్ళీ అర్ధణా, కాణీ వ్యాపారం చేస్తే నాలుగు డబ్బులు కూడబెట్టగలం అన్న అసంతృప్తి వెన్నాడసాగింది. ఎలాగైనా తను కూడా నగరంలోని చెప్పుకోతగ్గ ధనికుల్లో ఒకడు కావాలనీ అందుకు ఏదైనా మార్గం చూడాలనీ తీవ్రంగా ఆలోచించసాగాడు.
 
కోటీశ్వరుడు కావటానికి ఇంకేదన్నా వృత్తి చేపట్టాలనిపించింది. శెట్టి బుద్ధి ఇలా పెడతోవనపడుతూండగా, అతని పక్కవీధిలో ఉన్న ఒక లక్షాధికారి ఇంట దొంగలు పడి, లక్ష వరహాలు విలువచేసే వెండీ, బంగారమూ ఎత్తుకు పోయూరు. పొద్దస్తమానం కొట్లో కూర్చుని అవస్థ పడడంకన్నా అలాంటి దొంగతనం ఒక్కటిచేస్తే జీవితాంతం హాయిగా బతక వచ్చుననిపించింది శెట్టికి. తాను దొంగతనం చెయ్యూలంటే ముందుగా దొంగలను పరిచయం చేసుకోవాలి, ఆ వృత్తిలో సాధకబాధకాలు తెలుసుకోవాలి.
 
దొంగలు రాత్రిపూట సమావేశమయ్యే స్థలాల కోసం వెతికి, చివరకు శెట్టి, ఊరిబయట పాడుబడిన శివాలయం దగ్గిర అర్ధ రాత్రిపూట కొందరు దొంగలు చేరుతూంటారని తెలుసుకుని, అర్ధరాత్రికి ముందే అక్కడికి వెళ్ళి ఆలయం అరుగు మీద పడుకుని నిద్ర పోతున్నట్టు నటించుతూ, దొంగల సంభాషణ ఆలకించసాగాడు. శెట్టికి వాళ్ళ మాటలు వింటూంటే చెప్పరానంత ఆశ్చర్యం వేసింది.
 
దొంగలకు ఎంత ధైర్యసాహసాలు కావాలి, ఎంత దూరదృష్టి, సమయస్ఫూర్తి ఉండాలి! రోజూ రంగిశెట్టిని అరుగు మీద చూస్తున్న దొంగలకు, అతను ఎవరో దిక్కులేనివాడనీ, తమకు ఎప్పుడైనా అవసరంవస్తే ఉపయోగపడవచ్చుననీ అనిపించింది.

ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చెరొక కావడీ మోసుకొచ్చారు. వారిలో ఒకడు చిన్నవాడు, రెండోవాడు పెద్దవాడు. చిన్నవాడు దొంగనిద్ర నటిస్తున్న శెట్టిని లేపి, ‘‘మా మనిషి ఒకడు రాలేదు. మాతో వస్తావా? నీకు తగినంత ముట్ట జెప్పుతాంలే! మా పని నీకు కొత్త అని భయపడవలసినపనిలేదు. మేం చెప్పినట్టు చేస్తేచాలు. నిన్ను కాపాడే పూచీ మాది!'' అన్నాడు. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూన్న రంగిశెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు.
 
దొంగలు ముందు శెట్టి అవతారం మార్చేశారు: అతని చొక్కా విప్పేసి, తలకు తలగుడ్డ చుట్టి, మూఖానికి మసి పులిమి, చిన్నగడ్డం అంటించి, బట్ట ఎగకట్టించి, చేతికి కర్ర ఇచ్చి, నెత్తిన గోతపు సంచీ పెట్టి, చేతికి ఏడెనిమిది బెల్లపు గడ్డలు ఇచ్చి, ‘‘ఇక పద!'' అన్నారు. దొంగతనానికి పోవాలంటే ఇంత తతంగం ఉన్నదని శెట్టికి తెలియదు. తనని దొంగలు నిమిషాలలో ఒక రైతుగా మార్చేశారు. ఈ రూపంలో తనను చూసి తన భార్య కూడా గుర్తించలేదు.
 
ఇలా ఆలోచించుకుంటూ పోతున్న శెట్టి చీకట్లో చూడక, దారిలో పడుకుని ఉన్న ఒక వీధికుక్క తోక తొక్కాడు. అది గట్టిగా మొరగడం ప్రారంభించింది. శెట్టి ఒక్కసారిగా అదురుకుని, ‘‘అమ్మో!'' అంటూ గట్టిగా అరిచి చేతిలోని బెల్లపుగడ్డలు జారవిడిచాడు. కుక్క మొరగడం ఆపి, బెల్లపుగడ్డలను నాకనారంభించింది. పెద్దదొంగ శెట్టితో, ‘‘మనం వెళుతున్నది దొంగతనానికి, నాయనా! పెండ్లి భోజనానికి కాదు.
 
ఆ సంగతి గుర్తుంచుకుని కొంచెం జాగర్తగా ఉండాలి,'' అని శెట్టికి మరికొన్ని బెల్లపు ఉండలు ఇచ్చాడు. చిన్నదొంగ శెట్టితో, ‘‘కుక్క అరవటమూ, వెంటనే మానటమూ కొత్వాలు గమనిస్తాడు. అతను రాకమానడు. వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తాడు. మనని ఏమార్చి బుట్టలో వెయ్యటానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నోరెత్తకు. అన్ని ప్రశ్నలకూ నేనే సమాధానం చెబుతాను,'' అన్నాడు. చిన్నదొంగ ఊహించినట్టే కొత్వాలు గుర్రం మీద అటుగా వచ్చాడు. అతను కోపంగా, ‘‘ఎవర్రా మీరు? అర్ధరాత్రి ఇలా వీధులవెంట తిరగరాదని తెలీదా? ఈవేళప్పుడు ఏం పని మీద బయలుదేరారు? నిజం చెప్పండి,'' అని గద్దించాడు.

కొత్వాలు గొంతు వింటుంటేనే శెట్టికి గుండెల్లో అదురుపుట్టింది. ‘‘ఛీ, ఛీ! క్షణక్షణమూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఈ వృత్తి ఏం వృత్తి? ఇందులో ఎంతలాభం ఉంటే మటుకేం? ఇంతకుముందు ఈ కొత్వాలు కాదుగదా, ఇంతకన్న పెద్ద అధికారిని చూసి కూడా ఎన్నడూ భయపడలేదే,'' అనుకున్నాడు రంగిశెట్టి. చిన్నదొంగ కొత్వాలుతో, ‘‘మాది పక్క గ్రామం రామాపురం దొరా! బెల్లపు ఉండలు అమ్ముకుందామని కావళ్ళు వేసుకొచ్చాం.
 
ఈ చీకట్లో సత్రందారి తెలీక వీధులన్నీ తిరుగుతున్నాం. తమరు కాస్త సత్రందారి చూపించి పుణ్యంకట్టుకొండి,'' అన్నాడు ఎంతో అమాయకంగా. ‘‘సత్రందారి చెబుతాను. ముందు మీ పేర్లు చెప్పండి. ఈ బొరవ్రాడెవడు? కాయకష్టం చేసేవాడులాగా లేడే!'' అన్నాడు కొత్వాలు శెట్టిని చూసి. శెట్టికి గుండె దడపుట్టింది.
 
‘‘నా పేరు రాములండి, వీడు మా అన్న కిష్టయ్య. ఈయన మారుబేరగాడు మంగయ్య. కాయకష్టం చెయ్యకుండానే కూర్చున్న చోటు నుంచి కదలకుండా లాభాలు తిని బొర్ర పెంచాడు,'' అన్నాడు చిన్న దొంగ. కొత్వాలు నవ్వి, సత్రందారి చెప్పి, ‘‘ఓ ఘడియలో సత్రం కేసి వస్తాను. మీరు ముగ్గురూ ఉన్నారో, లేదో చూస్తాను.

జాగ్రత్త! వెళ్ళండి,'' అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ, ముగ్గురూ ముందుకు సాగారు దొంగతనానికి. ఇప్పటికి శెట్టికి దొంగవృత్తి మీద పూర్తిగా ఏవగింపుకలిగింది. అడుగడుగునా అబద్ధాలు! క్షణక్షణం భయం! ఇంకా దొంగతనం చెయ్యకమునుపే ఇలా ఉంటే, వృత్తి చేపట్టినాక మనశ్శాంతి పూర్తిగా పోవడం ఖాయం. ‘‘చచ్చినా ఈ వృత్తి లోకి దిగరాదు.
 
ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకు పోవాలి!'' అనుకున్నాడు రంగిశెట్టి. ముగ్గురూ ఒక పెద్ద ఇంటి ముందు ఆగారు. అదే వాళ్ళు కొల్లగొట్టదలచుకున్న ఇల్లు. ‘‘నేను తాళం పగలగొట్టుతాను. మనిద్దరమూ లోపల పనిముగించుకుని వచ్చే దాకా ఇతను బయట కాపలా ఉంటాడు,'' అని కూడబలుక్కుని దొంగలు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వెంటనే రంగిశెట్టి అక్కడినుంచి మెల్లగా కదిలి, తన ఇంటికి బయలుదేరాడు.
 
అతను కొంతదూరం వెళ్ళి గబగబా తమ వీధిమలుపు తిరుగుతూండగా రాజభటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికట్టి, కొరడాలతో బాదుతూ చెరసాల కేసి తీసుకుపోతూ కనిపించారు. దొంగ వెంట వాడి భార్యా, పిల్లలూ గోల గోలగా ఏడుస్తూ పోతున్నారు. తెల్లవారవచ్చే సమయంలో ఇది చూసిన గ్రామస్థులెవరూ, ‘‘అయ్యో, పాపం!'' అనలేదు. శెట్టికి ఆ దొంగ మీద కొండంత జాలి వేసింది.
 
‘‘ఇదేం వృత్తోగాని, పట్టుబడ్డ వాణ్ణి ఎంత శిక్షించినా లోకం ఇంకా శిక్షించాలనే అనుకుంటుంది. ఎంత నీచవృత్తి. నేను పట్టు బడినా నా గతీ ఇంతేగదా!'' అనుకున్నాడు అతడు. శెట్టి దొడ్డిదారిన లోపలికి వెళ్ళి, కొద్దిగా మిగిలి వున్న తన వేషం పూర్తిగా కడిగేసుకుని, ప్రశాంత మనస్సుతో తన ఇంటి అరుగు మీద పడుకున్నాడు. బాగా తెల్లవారినా నిద్రలేవని శెట్టిని అతని భార్య లేపి, కొత్వాలు ఇద్దరు దొంగలను తెల్లవారుఝామున పారిపోతుంటే, వెంటతరిమి కత్తులతో చంపిన వార్త చెప్పింది.

ఎవరి బాధలు వారివి!


చిలకలపూడి జమీందారుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల్లో సుకుమారుడు, మనోహరుడు అనే ఇద్దరు యువకులుండేవారు. వారిద్దరిమధ్యా పరిచయం ఏర్పడి క్రమంగా మంచి స్నేహితులయ్యూరు. రోజూ సాయంత్రం వేళ గోవిందయ్య అనే తినుబండారాల వ్యాపారి దివాణం దగ్గరకు వచ్చేవాడు. చాలా మంది ఉద్యోగులు అతడి దగ్గర, అరిసెలు, లడ్లు, గారెల్లాంటివి కొని తినేవారు. సుకుమారుడు మాత్రం ఎన్నడూ కొనేవాడు కాదు.
 
మనోహరుడికి మాత్రం రోజూ కొనుక్కుని తినడం అలవాటు. మనోహరుడు తరుచూ, ‘‘నువ్వెప్పుడూ కొనవేంటి?'' అని సుకుమారుణ్ణి అడుగుతూండేవాడు. దానికి సుకుమారుడు, ‘‘ఉదయం కడుపునిండా తిని వస్తాను. మధ్యాహ్నం ఎలాగూ భోజనానికి వెళ్ళానుగదా. ఇంకేం తినగలను!'' అనేవాడు. ‘‘అలాగా, అదృష్టవంతుడివి! నీ భార్య ఉదయూనే లేచి వండిపెడుతున్నది. నా భార్య బారెడు పొద్దెక్కితేగాని లేవదు.
 
ఈ విషయమై మా మధ్య గొడవలు జరుగుతూంటాయి,'' అని చెప్పాడు మనోహరుడు. దానికి, ‘‘ఎవరిబాధలు వారివి!'' అంటూండేవాడు సుకుమారుడు. సుకుమారుడు ఇలా అన్నప్పుడల్లా, మనోహరుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలుగుతుండేది. ఒకనాడు సుకుమారుడు, మనోహరుడితో, ‘‘రేపు నా పుట్టిన రోజు. ఉదయం రా. ఇద్దరం ఫలహారం చేసి దివాణానికి బయల్దేరదాం,'' అన్నాడు. మర్నాడు మనోహరుడు, సుకుమారుడింటికి వచ్చాడు.
 
సుకుమారుడి భార్య ఎంతో మర్యాదగా మనోహరుణ్ణి కూర్చోమని, ‘‘ఫలహారం తెస్తాను,'' అంటూ, గారెలు, బూరెలు తెచ్చి, భర్తకూ అతడికీ వడ్డించింది. ఒక గారెను నోట్లో పెట్టుకున్న మనోహరుడు భయభ్రాంతుడై పోయూడు. ఇటుకముక్కలా వుండి నవలబోతే పళ్ళు జివ్వుమన్నాయి.
 
సుకుమారుడు మాత్రం తాపీగా వాటిని నవిలి చేతులుకడుక్కున్నాడు. ఇద్దరూ దివాణానికి బయలుదేరారు. దారిలో సుకుమారుడు, మనోహరుణ్ణి, ‘‘ఎలావుంది ఫలహారం?'' అని అడిగాడు. ‘‘నువ్వు తరుచూ, ‘ఎవరి బాధలు వారివి!' అని ఎందుకంటావో ఇప్పుడు అర్థమైంది!'' అన్నాడు మనోహరుడు ఉస్సురుమంటూ.

ఎవరికెంత ప్రాప్తమో...


కైతేపల్లి అనే గ్రామంలో వున్న గంగయ్య, రంగయ్యలు ఇరుగుపొరుగులు. భార్యలు చేసిన అప్పడాలు, ఒడియూలు పట్నంలో అమ్ముకొని రావడం వాళ్ళ వృత్తి. చాలీ చాలని ఆదాయం కారణంగా, వాళ్ళ భార్యలు ఎప్పుడూ అసంతృప్తిగా వుండేవాళ్ళు. ఒక రోజున గంగయ్య భార్య గౌరమ్మ, నులకమంచం మీద గుమ్మడి వడియూలు పెడుతూ, రంగయ్య భార్య రాజమ్మతో, ‘‘చూడు, ఇప్పుడే బతకడానికి కటకటగా వుంది.
 
రేపు మనకు పిల్లా జెల్లా పుడితే, ఈ చాలీ చాలని ఆదాయంతో ఇల్లు గడవడం ఎలా?'' అన్నది ఉస్సురుమంటూ. ‘‘అవును మరి. నాకూ అదే దిగులుగా ఉంది. మన మగవాళ్ళకు వేరే ఏదైనా మంచి ఉద్యోగం వుంటే తప్ప, లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందుల్లో పడతాం,'' అన్నది రంగయ్య భార్య. తరచూ వాళ్ళిద్దరి మధ్యా ఇలాంటి సంభాషణ జరుగుతూండేది.
 
ఈ పరిస్థితుల్లో, రాచూరి జమీందారు, మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళుతూ, ఆ రాత్రి గ్రామ శివార్లలో విడిది చేస్తారన్న వార్త తెలిసింది. వేకువ జామునే ఆయన ప్రయూణం కొనసాగిస్తారనీ, రాత్రి భోజనానికి ముందు ఆయన దర్శనం దొరుకుతుందనీ, గ్రామంలో చెప్పుకోసారు. ‘‘మన మగవాళ్ళు జమీందారు దర్శనం చేసుకుని, ఏదైనా ఉద్యోగం సంపాయించగలిగితే, మన కష్టాలు తీరిపోతాయి!'' అనుకున్నారు గౌరమ్మ, రాజమ్మలు.
 
ఇద్దరూ తమ తమ భర్తలతో, ‘‘రాత్రి మీరు జమీందారుగార్ని కలుసుకుని, దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాయించండి,'' అంటూ గట్టిగా చెప్పేశారు. ‘‘అప్పడాలు అమ్మడానికి పట్నం వెళ్ళి సాయంత్రానికి తిరిగిరాలేక పోతే, జమీందారు గార్ని దర్శించలేను.

అందువల్ల, ఈ రోజు పట్నం వెళ్ళను,'' అన్నాడు గంగయ్య భార్యతో. ‘‘గంగయ్య పట్నం రాడట! నేను మాత్రం వెళతాను. చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను,''అంటూ, అప్పడాల సంచీ నెత్తిన పెట్టుకుని బయల్దేరాడు రంగయ్య. రంగయ్య పట్నంలో సాయంత్రానికల్లా సంచీలోవున్న అప్పడాలు అమ్మేసి తిరుగు దారి పట్టాడు. త్వరగా గ్రామం చేరాలని అతడు అడవిలోని ఒక అడ్డదారిన నడుస్తూండగా, పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది.
 
దానితో పాటు చీకటి కమ్ముతూండడంతో, దూరంగా నక్కలా, ఇతర అడవి జంతువులా అరుపులు మొదలయినై. రంగయ్య భయంతో నలు దిక్కులూ చూసి, దారి పక్కన పాడుపడిన ఒక అమ్మవారి గుడి కనబడడంతో, గబగబా అక్కడికి చేరి, బయటినుంచే భక్తితో రెండు చేతులూ జోడించాడు. ఇంతలో, ‘‘రంగయ్యూ, బావున్నావా?'' అంటూ గుడిలోంచి, ఒక శ్రావ్యమైన కంఠస్వరం వినిపించింది. రంగయ్య నిర్ఘాంతపోయి, ‘‘నువ్వెవరివి, తల్లీ! ఈ గుడిలోని అమ్మవారి దేవతవా?'' అని అడిగాడు.
 
‘‘ఈ గుడిలో కొంత కాలంగా అమ్మవారు లేరు. నేను శిథిలావస్థలో వున్న గుడులూ, ఆలయూలూ సందర్శిస్తూ తిరిగే దేవతను. నీ భక్తిభావం నాకు సంతోషం కలిగించింది. నీకో వరం ఇవ్వదలిచాను, కోరుకో!'' అన్నది అదృశ్య దేవత. ‘‘నా మీద దయ చూపినందుకు, వెయ్యి దణ్ణాలు, తల్లీ! విష సర్పాలూ, భయంకరమైన అడవి మృగాల అరుపుల మధ్య, ఈ చీకట్లో చిక్కుకు పోయూను.
 
నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు,'' అన్నాడు రంగయ్య. ‘‘వెళ్ళిరా! నీకెలాంటి ప్రమాదం కలగదు,'' అన్నది అదృశ్యదేవత నవ్వుతూ. ఆ విధంగా క్షేమంగా ఇల్లు చేరాడు రంగయ్య. అంతలో గంగయ్య అక్కడికి వచ్చి, ‘‘మనం జమీందారును కలవాలి కదా! ఇంత ఆలస్యంగా వచ్చావేం? వేగిరం బయల్దేరు,'' అన్నాడు. అప్పుడు రంగయ్య, అడవిలో జరిగిందంతా చెప్పి, ‘‘ఇంకా ఆలస్యమై ఉండేది.

ఆ అదృశ్యదేవత వరం పుణ్యాన క్షేమంగా ఇల్లు చేరాను,'' అన్నాడు. ‘‘అలాగా!'' అంటూ భర్త గంగయ్య పక్కనే వున్న గౌరమ్మ తలవూపింది. పావు గంట తర్వాత రంగయ్యూ, గంగయ్యూ జమీందారును చూసేందుకు కదలబోతున్నంతలో ఆమె, పెద్దగా అరిచి, పక్కనేవున్న నులక మంచం మీద వాలి, విలవిలలాడిపోతూ, భర్తతో, ‘‘నన్ను వెంటనే పట్నం వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళక పోతే, నీకు దక్కను,'' అన్నది.
 
గంగయ్య కంగారుపడి పరుగున వెళ్ళి బాడుగ బండిని తీసుకువచ్చాడు. ఆయనా, రంగయ్యూ కలిసి గౌరమ్మను బండిలో పడుకోబెట్టారు. ‘‘నేను కూడా నీకు సాయంగావస్తాను, గంగయ్యూ!'' అన్నాడు రంగయ్య. ‘‘వద్దన్నయ్యూ! నువ్వు జమీందారుగారిని కలవాలిగదా,'' అన్నది గౌరమ్మ ఆయూసపడుతూ. తర్వాత, బండి అడవిని సమీపించగానే, గౌరమ్మ లేచి కూర్చున్నది. ఆమె బండివాడికి బాడుగయిచ్చి పంపేసింది.
 
ఇదంతా వింతగా చూస్తున్న గంగయ్య, ఆమెను, ‘‘ఇక్కడ దిగడం దేనికి? నీగుండె నొప్పి ఎలావుంది?'' అని అడిగాడు. ‘‘గుండెనొప్పీ లేదు, వల్లకాడూ లేదు!ఆ వెర్రిబాగుల రంగయ్య, అదృశ్యదేవతను పనికి మాలినవరం కోరాడు. అతగాడికి అంతే ప్రాప్తం మరి! చూస్తూండు, నేను మన జాత కాలు మార్చేస్తాను,'' అన్నది గౌరమ్మ ఎంతో ధీమాగా. 


వాళ్ళు పడుతూలేస్తూ, అమ్మవారి గుడిని చేరేసరికి అర్ధరాత్రి అయింది. గౌరమ్మ గుడి ముందు నిలబడి చేతులు జోడించి, ‘‘తల్లీ! కనబడని దేవతమ్మా! నాకూ ఒక వరం ఇవ్వు,'' అంటూ పెద్దగా గొంతెత్తి వేడుకున్నది. ‘‘నోరు విడిచి అడిగావు కదా, నీకూ వరంఇస్తాను,''అన్నది అదృశ్యదేవత నవ్వుతూ. ‘‘తల్లీ! నేను మనసులో ఏం అనుకుంటే అది జరిగిపోయే వరం ఇవ్వు,'' అన్నది గౌరమ్మ. ‘‘వరం ఇచ్చాను, ఇక వెళ్ళు! నేనూ మరొక గుడిని సందర్శించేందుకు వెళుతున్నాను,'' అన్నది అదృశ్యదేవత.
 
గౌరమ్మ ఆనందంతో పొంగిపోతూ, ‘‘ఈ కటిక చీకటిలో బుద్ధివున్నవాళ్ళెవరూ ఇంటి దాకా నడిచి వెళ్ళరు. దేవత ఇచ్చిన వరం వుందికదా!'' అని భర్తతో అంటూ, కళ్ళు మూసుకుని మనసులో, ‘‘మేం కళ్ళు మూసి తెరిచేలోపల మా ఇంటి ముందువుండాలి!'' అనుకున్నది. ఆ మరుక్షణం భార్యాభర్తలిద్దరూ, వాళ్ళ ఇంటి ముందున్నారు. ఆసరికే రంగయ్య, జమీందారును చూసి తిరిగి వచ్చాడు. ఉల్లాసంగా వున్న గౌరమ్మతో, ‘‘నాకు జమీందారు దివాణం ఉద్యోగం దొరికింది.
 
ఇంతకూ, నీ గుండెనొప్పి ఎలావుంది, చెల్లెమ్మా?'' అన్నాడు. ‘‘నా గుండెనొప్పి మాటకేంగాని నీకు జమీందారు దగ్గర బండచాకిరీ చేయూలని రాసి పెట్టివున్నది. మాకా ఖర్మ పట్టలేదు. నేను అదృశ్యదేవత నుంచి అద్భుత వరం సంపాయించాను,'' అన్నది గౌరమ్మ ఎంతో గొప్పగా. ‘‘అవునా! మరి, ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది.
 
ఇంతకూ నువ్వు దేవత నుంచి సంపాయించిన వరం ఏమిటీ?'' అని అడిగింది, పక్కనే వున్న రంగయ్య భార్య రాజమ్మ. ‘‘నేను మనసులో ఏమనుకుంటే, అది జరిగే వరం! ఇంతకు ముందు అడవిలో వున్న మేం, రెప్పపాటు కాలంలో, మా ఇంటి ముందువుండాలని కోరుకున్నాను. అనుకున్నది అక్షరాలా జరిగింది,'' అన్నది గౌరమ్మ ఆనందంగా.

గంగయ్య, భార్య ఆనందానికి అడ్డు పడుతూ, ‘‘కళ్ళు మూసి తెరిచేలోపల ఇంటి ముందుండాలి అని పనికిమాలినవరం కోరి, దేవత ఇచ్చిన వరాన్ని వృథా చేశావేమో అన్న అనుమానం, నాక్కలుగుతున్నది. ఇకపై నీ మనసులో అనుకున్నవేవీ జరక్కపోవచ్చు!'' అన్నాడు దిగులుగా. భర్త చెప్పిన దాంట్లో ఏదో వాస్తవంవున్నదనుకున్న గౌరమ్మ, ‘నిజంగానే ఇక వరం పని చేయదేమో! అనుకున్నవి జరగవేమో!' అని మనసులో ఆందోళన పడుతూ, పైకి మాత్రం బింకంగా, ‘‘చూడు, నా వర మహిమ! మన పెంకుటిల్లు పెద్ద భవంతి అయిపోవాలి,'' అని మనసులో ఒకటికి రెండు సార్లు అనుకున్నది.
 
ఐతే, పెంకుటిల్లు, పెంకుటిల్లుగానే వుండి పోయింది. భవంతిగా మారలేదు! దాంతో అందరికీ గౌరమ్మ చేసిన పొరబాటు తెలిసిపోయింది. మరునాడు రంగయ్య సామానులు సర్దుకుంటూ మిత్రుడితో, ‘‘గంగయ్యూ, రేపే మా ప్రయూణం,'' అన్నాడు. ‘‘వెళ్ళిరండి రంగయ్యూ. నిన్న రాత్రి నీతో వచ్చి జమీందారును కలుసుకుని ఉంటే, ఇప్పుడు నేను కూడా నీతో పాటు బయలుదేరేవాణ్ణి.
 
అయినా, నేను ఇక్కడే అవస్థలు పడాలని ఉన్నది. ఎవరికెంత ప్రాప్తమో ఎవరూ చెప్పలేరు కదా!'' అన్నాడు గంగయ్య. ‘‘ఎందుకలా బాధపడతావు గంగయ్యూ. నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక, పట్నంలో నీకొక కిరాణా దుకాణం ఏర్పాటు చేస్తాను. వ్యాపారం చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళిద్దరూ ఇన్నాళ్ళిక్కడ అక్కాచెల్లెళ్ళలా ఉన్నారు కదా, మీరూ మాతో రండి,'' అన్నాడు రంగయ్య. ఆ మాట వింటూ అక్కడికి వచ్చిన గౌరమ్మ, ‘‘అత్యాశకు పోయి వచ్చిన అవకాశం జార విడుచుకున్నాను.
 
అదృష్టంలో మిమ్మల్ని మించి పోవాలనుకున్న నాకు, అదృశ్యదేవత మంచి గుణపాఠం నేర్పింది. నీ మేలు ఈ జన్మకు మరిచిపోము అన్నయ్యూ,'' అన్నది. రంగయ్య మిత్రుడి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. గంగయ్యూ, గౌరమ్మలు రంగయ్య కేసి కృతజ్ఞతగా చూశారు.

సేవారామ్‌ అదృష్టం!


సేవారామ్‌ అనే క్షురకుడు చాలా పేదవాడు. ఎంత కష్టపడినప్పటికీ పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏరోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు బియ్యం కొనడానికి కూడా డబ్బులు చాలేవి కావు. అలాంటి రోజుల్లో అతడి భార్య శివానీ, ‘‘పుట్టింట ఎంతో గారాబంగా, ఎలాంటి కొరతా లేకుండా పెరిగిన నేను, ఈ చేతగాని దద్దమ్మను కట్టుకోవడంవల్ల తిండికీ, బట్టకూ కూడా కరువై పోయింది కదా,'' అని వాపోయేది.
 
ఒకనాటి సాయంకాలం సేవారామ్‌ దమ్మిడీ సంపాదన కూడా లేకుండా వట్టి చేతులతో ఇంటికి తిరిగివచ్చాడు. భార్య నోట చీవాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువ జామునే లేచి, స్నానం చేసి కత్తి, కత్తెర, దువ్వెనలు, అద్దం, తలనూనెలు ఉన్న తన పెట్టెను తీసుకుని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. భార్యను కేక వేసి పిలిచి, ‘‘కావలసినంత డబ్బు సంపాయించిన తరవాతే తిరిగి వస్తాను,'' అని చెప్పి చకచకా వెళ్ళి పోయూడు.
 
గుమ్మంలోకి వచ్చిన అతడి భార్య శివానీ, భర్త కేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది గానీ, అతన్ని వెనక్కు పిలవలేదు. రోజూ క్షవరం, చేసుకునే ధనికులెవరూ ఆ గ్రామంలో లేరు. క్షవరం చేయించుకున్నా డబ్బులు తరవాత ఇస్తామని చెప్పే పేదలే ఆ గ్రామంలో ఎక్కువ. అందుకే సేవారామ్‌ నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు. సేవారామ్‌ పట్నం కేసి వేగంగా నడవసాగాడు.

బాగా అలిసిపోయినప్పుడు చెట్ల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ; అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అటువైపు వచ్చే బాటసారులెవరైనా క్షవరం చేయమని అడిగితే బావుణ్ణుకదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే, ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతూండగా బాగా అలిసిపోయి ఒక ఎత్తయిన చెట్టుకింద పడుకుని అలాగే నిద్రపోయూడు.
 
ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటున్నది. సేవారామ్ గురక విని, మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున కిందికి దూకింది. వాణ్ణి చంపడానికి ముందు హడలగొట్టాలని నిర్ణయించి, వాడి భుజాలు పట్టుకుని ఊపింది. సేవారామ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. దయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ, ‘‘నిన్ను నేను మింగేస్తాను. మానవా!'' అన్నది రెండు చేతులతో గొంతును పట్టుకోబోతూ.
 
బాగా అలిసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారామ్ తను ఎలా చచ్చినా ఫరవాలేదనుకున్నాడు. దయ్యం మింగినా మింగనీ అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో, ‘‘పాపం శివానీ నేను లేకపోతే ఎలా బతుకుతుంది? కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి,'' అనుకుని, ‘‘ఏమిటీ చిలిపి చేష్ట?'' అంటూ, ‘‘వెళ్ళిపో!'' అన్నట్టు చేయి ఊపాడు. అయితే దయ్యం అక్కడి నుంచి కదలలేదు.
 
‘‘నేను కిందటిసారి పట్టుకున్న దయ్యూన్ని చూడాలనుకుంటున్నావా?'' అంటూ సేవారామ్, తలకింద పెట్టుకున్న పెట్టెను తెరిచి, అందులోంచి చిన్న అద్దాన్ని వెలికి తీసి, ‘‘దీనిలోకి చూడు,'' అంటూ దాని ముందు ఉంచి, ‘‘ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి,'' అన్నాడు.

అద్దంలో తన మొహం చూసి, దయ్యం హడలి పోయి కీచుమంటూ అరిచింది. ��అయ్యూ, ఆ భయంకరమైన దయ్యంతో కలిపి, నన్ను కూడా పెట్టెలో బంధించకు!�� అంటూ సేవారామ్� చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమలాడసాగింది. ��అలా అయితే, నువ్వు తెల్లవారే సరికి నాకు మణులు, మాణిక్యాలు తెచ్చి ఇవ్వాలి! సరేనా?�� అని గద్దించాడు సేవారామ్� దృఢమైన కంఠ స్వరంతో.
 
మరు క్షణమే దయ్యం మాయమై పోయింది. సేవారామ్� అద్దాన్ని పెట్టెలో పెట్టి, కోడికూత వినిపించేంతవరకు కాచుక్కూర్చోవాలని నిర్ణయించాడు. అయితే, మరికొంత సేపటికల్లా దయ్యం తిరిగి రావడం చూసి అతడు ఆశ్చర్యపోయూడు. దయ్యం ఒక చిన్న మూటను తెచ్చి సేవారామ్� ముందు పడవేసింది. అందులో తళతళ మెరిసే మణులు, మాణిక్యాలు కనిపించాయి.
 
��సరే, ఇప్పటికి నిన్ను వదిలి పెడుతున్నాను. పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగివస్తాను,�� అంటూ సేవారామ్� అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని మణులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు. కొంత దూరం నడిచాక అతడికొక ఆలోచన కలిగింది. మణులను అమ్మకుండా తాకట్టు పెడితే, ఆ తరవాత విడిపించుకోవచ్చుకదా అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, తన వద్ద ఉన్న విలువైన మణులను కొన్నిటిని తాకట్టు పెట్టుకుని, కొంత మొత్తం ఇస్తే, ఒక నెల తరవాత వచ్చి, అసలూ, వడ్డీ చెల్లించి తన మణులు విడిపించుకోగలనని చెప్పాడు. వడ్డీ వ్యాపారి మణులను పరిశీలించి చూసి, నాణ్యమైనవే అని నిర్ధారించుకుని సేవారామ్�కు అడిగిన డబ్బు ఇచ్చి పంపాడు.
 
సేవారామ్� బాగా ఆకలిగా ఉండడంతో భోజనశాలకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి, ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద నడుం వాల్చాడు. చాలా సేపు ఆదమరచి నిద్రపోయూడు. పొద్దువాలుతూండగా లేచి, ఉత్సా హంగా దయ్యం ఉన్న చెట్టు కేసి నడిచి, చీకటి పడుతూండగా అక్కడికి చేరుకున్నాడు.

తన పెట్టెను తలకడగా పెట్టుకుని నిన్నలాగే పడుకున్నాడేగాని, ఏ క్షణంలోనైనా దయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకున్నాడు. అప్పటికే చెట్టు మీది దయ్యం, దాపుల మరొక చెట్టు మీద ఉన్న దయ్యం స్నేహితుడితో రాత్రి జరిగినదంతా చెప్పింది. రెండు దయ్యూలు కలిసి, సేవారామ్� కిచ్చిన మణులను తిరిగి రాబట్టుకోవాలనీ, తమలాంటి భయంకర దయ్యూలను దాచి పెట్టిన పెట్టెను దొంగిలించాలనీ పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో రెండు దయ్యూలూ చెట్టు దిగి వచ్చి, సేవారామ్� నిద్రపోతున్నాడా, లేడా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతడి తలకింది పెట్టెను ఎత్తుకెళ్ళడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి.
 
సేవారామ్� మేలుకునే ఉన్నప్పటికీ, నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ దయ్యూలు రెండూ కలిసి, అతడి తలకింది సంచీని మెల్లగా లాగాయి. కొంత లాగేంతవరకు, కదలకుండా ఉన్న సేవారామ్�, మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి, పెట్టె తెరిచి అందులోని కత్తెరనూ, అద్దాన్నీ వెలుపలికి తీశాడు. ఒక చేతిలో కత్తెరనూ, రెండవ చేతిలో అద్దాన్నీ పట్టుకున్నాడు. కత్తెరను రెండు దయ్యూల కేసీ గురిచేసి, వేళ్ళతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించ సాగాడు.
 
అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు. దయ్యూలు కత్తెరకు భయపడ్డాయో, అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదుగాని, రెండూ వేగంగా కదలడం చూడడంతో దయ్యూలు రెండూ హడలిపోయి, చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన సేవారామ్�, ��కదలకండి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి, బంగారు నాణాలు నాకు తెచ్చి ఇవ్వాలి. తెల్లవారే సరికి రాక పోయూరో, రెండో దయ్యం ఆ పెట్టెలోని భయూనక ప్రాణులతో కలిసిపోక తప్పదు!�� అని హెచ్చరించాడు.


ఇప్పుడు పరిగెత్తడం రెండవ దయ్యం వంతయింది. సేవారామ్� లోలోపల నవ్వుకున్నాడు. అయితే, చేతుల్లోని కత్తెరనూ, అద్దాన్నీ కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దయ్యం దీనంగా నిలబడుకుని, తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయం భయంగా ఎదురుచూడ సాగింది.
 
రెండవ దయ్యం తెల్లవారు జామున వచ్చి, తనతో తెచ్చిన బంగారు నాణాల సంచీని సేవారామ్�కు ఇచ్చింది. అతడు దానిని వెంటనే తన సంచీలో పెట్టుకుని, చేతిలోని కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ, ��ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది. నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్టయితే, ఆ సంచీలోని ప్రాణులను వదిలి పెడతాను,�� అన్నాడు.
 
ఆ తరవాత కత్తెరను, అద్దాన్ని సంచీలో పెట్టుకుని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య శివానీకి తన రెండు రోజుల అనుభవాలను వివరించాడు. అంతా విని, అమితాశ్చర్యం చెందిన అతడి భార్య, ��నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైనవాడివి!�� అని మెచ్చుకున్నది. ��నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను,�� అన్నాడు అప్పటికే పేదరికం నుంచి బయటపడిన సేవారామ్� ఎంతో సంతోషంగా.

గజ్జెల సవ్వడి


గంగవరం జమీందారు దివాణంలో పనిచేస్తూన్న జయంతుడు బుద్ధిమంతుడు. మంచి తెలివితేటలు కలవాడు. అందుకే దివాణంలో చేరిన కొద్ది కాలానికే అందరిలో మంచిపేరు సంపాదించాడు. జయంతుడి తల్లిదండ్రులు అతనికి పదిహేనేళ్ళు వచ్చేవరకు లలితాపురం అనే పల్లెటూళ్ళో ఉండేవారు. ఆ తరవాత గంగవరం వచ్చారు. అయినా, జయంతుడికి స్వగ్రామంలోని బాల్యస్నేహితులతో సంబంధాలు తెగిపోలేదు. అవకాశం కలిగినప్పుడు కలుస్తూండేవాళ్ళు.
 
 సంక్రాంతి పండగ సందర్భంగా కచేరీకి సెలవులు ఇవ్వడంతో, ఎప్పటి నుంచో పల్లెకు రమ్మని పిలుస్తూన్న బాల్యస్నేహితుల కోరిక మన్నించి, జయంతుడు లలితాపురం బయలుదేరాడు. అతన్ని చూసి అతని స్నేహితులు మహేంద్రుడు, శివదాసు, కులశేఖరుడు, మనోహరుడు ఎంతో ఆనందించారు. ఆ నలుగురి ఇళ్ళూ పక్కపక్కనే ఉన్నాయి. జయంతుడు అక్కడ నాలుగు రోజులు ఉంటాడు కాబట్టి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నేహితుడి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి ఒప్పందం కుదిరింది.
 
మొదటిరోజు జయంతుడు మహేంద్రుడి ఇంట్లో బసచేశాడు. భోజనాలు అయ్యూక మిత్రులు నలుగురూ కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. చిన్ననాటి ముచ్చట్లను సంతోషంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పటి తమ స్థితితుల గురించి చెప్పుకున్నారు. ఊరి ప్రజల బాగోగుల గురించి చర్చించుకున్నారు. ఆ తరవాత మిగిలిన ముగ్గురూ తమ ఇళ్ళకు వెళ్ళారు. రాత్రి పడుకోబోయే ముందు మహేంద్రుడు ఎంతో భక్తితో ఆంజనేయ దండకం చదవడం గమనించిన జయంతుడు, ‘‘దైవభక్తి పెరిగినట్టుంది. సంతోషం!''  అన్నాడు చిన్నగా నవ్వుతూ.


‘‘అదేం కాదు. భయం పెరిగింది,'' అన్నాడు మహేంద్రుడు విచారంగా. ‘‘ఎందుకు?'' అని అడిగాడు జయంతుడు. ‘‘అదొక పెద్ద కథ. ఇప్పుడది చెప్పి నీ నిద్ర చెడగొట్టడం నాకిష్టం లేదు. పడుకో,'' అన్నాడు మహేంద్రుడు. జయంతుడు ఆపై మరేం మాట్లాడకుండా నిద్రకు ఉపక్రమించాడు.
 
అర్ధరాత్రి సమయంలో జయంతుడికి మెలకువ వచ్చింది. అప్పుడతనికి లీలగా గజ్జెల సవ్వడి వినిపించింది. పక్కకు తిరిగిచూస్తే, మహేంద్రుడు నిండా దుప్పటి కప్పుకుని భయంతో వణుకుతూ కనిపించాడు. కొంతసేపయ్యూక గజ్జెల సవ్వడి వినరాలేదు. తెల్లవారిన తరవాత జయంతుడు, మహేంద్రుడితో తాను రాత్రి విన్న గజ్జెల సవ్వడి గురించి చెప్పాడు.
 
‘‘నీకూ వినిపించిందన్న మాట. ఏం చెప్పమంటావు? నెలరోజుల నుంచి ఈ కామినీ పిశాచం ఇటు తిరుగుతున్నది. ఇల్లు ఖాళీ చేద్దామంటే సొంత ఇల్లయి కూర్చుంది. ఆ పిశాచం బారిన పడకుండా ఉండడానికి భూతవైద్యులకూ, తాయెత్తులకూ చాలా ఖర్చు పెట్టాను,'' అని వాపోయూడు మహేంద్రుడు.
 
‘‘ఈ రోజుల్లో దయ్యూలు, పిశాచాలు ఏమిటి?'' అన్నాడు జయంతుడు. ‘‘అలా తీసి పారెయ్యకు. ఆ గజ్జెల సవ్వడి వినిపించడం మొదలైనప్పటి నుంచి మా ఇంట్లో అరిష్టాలు మొదలయ్యూయి,'' అన్నాడు మహేంద్రుడు. ‘‘మరి, ఈ విషయం మన స్నేహితులతో చర్చించలేకపోయూవా?'' అని అడిగాడు జయంతుడు.
 
‘‘పిరికివాడినని గేలిచేస్తారని భయపడి చెప్పలేదు,'' అన్నాడు మహేంద్రుడు. రెండో రోజు జయంతుడు శివదాసు ఇంట్లో బసచేశాడు. ఆ రాత్రి కూడా అతనికి గజ్జెల సవ్వడి వినిపించింది. క్రితం రాత్రి లీలగా వినిపించిన సవ్వడి, ఈ రాత్రి మరింత స్పష్టంగా వినిపించింది. మరుసటి రోజు జయంతుడు ఆ విషయం శివదాసు వద్ద ప్రస్తావించినప్పుడు, ‘‘పెద్దగా మాట్లాడకు. ఆ గజ్జెల సవ్వడి గురించి గుడి పూజారి దగ్గర చెప్పాను. ఆ గజ్జెల సవ్వడి మహాలక్ష్మిదనీ, ఆమె మా ఇంట్లోకి రావాలా, వద్దా అని తటపటాయిస్తున్నదనీ, పూజారి చెప్పాడు.

ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నాను,'' అన్నాడు శివదాసు. జయంతుడు మరేం మాట్లాడలేదు. ‘‘ఈ విషయం మన మిత్రులకు చెప్పకు. అసూయ పడగలరు,'' అన్నాడు శివదాసు ఏదో రహస్యం చెబుతున్నట్టు. మూడోరోజు రాత్రి జయంతుడు కులశేఖరుడి ఇంట గడిపాడు. ఆ రోజు రాత్రి గజ్జెల సవ్వడి మరింత దగ్గరగా వినిపించింది. కులశేఖరుడు మేలుకొని ఉండడం గమనించిన జయంతుడు, ‘‘ఏదో గజ్జెల సవ్వడి వినిపిస్తున్నది కదా?'' అన్నాడు.
 
‘‘అవును, కొద్ది రోజుల నుంచి నేనూ ఆ సవ్వడి వింటున్నాను. మా పెద్దలు చెప్పినదాన్ని బట్టి, మా పెరట్లో లంకెబిందెలున్నాయి. అవి బయట పడడానికి ఆరాట పడుతూ చేసే శబ్దమే అది. రహస్యంగా పెరడంతా తవ్విస్తున్నాను.అయినా నిధి మాత్రం దొరకడం లేదు. ఈ విషయం వేరెవ్వరివద్దా అనకు,'' అన్నాడు కులశేఖరుడు.
 
ఈ ముగ్గురు మిత్రులు చెప్పేకారణాలు కాకుండా గజ్జెలసవ్వడికి అసలు కారణం మరేదో ఉంటుందని జయంతుడు ఆలోచిస్తూ పడుకున్నాడు. నాలుగోరోజు మనోహరుడి ఇంట్లో గడిపినప్పుడు, ఆ రాత్రి జయంతుడికి గజ్జెలసవ్వడి మరింత దగ్గరలో వినిపించింది. ఆ సవ్వడి వినగానే, మనోహరుడు లేచి పక్కగదిలోకి వెళ్ళడం జయంతుడు గమనించాడు. కొంత సేపటికి ఆ సవ్వడి ఆగిపోయింది. మనోహరుడు వచ్చి మంచం మీద పడుకున్నాడు.

తెల్లవారాక, జయంతుడు తను విన్న గజ్జెల సవ్వడి గురించి మనోహరుడి దగ్గిర ప్రస్తావించి, అతడేమి చెబుతాడో అని ఆసక్తిగా చూడసాగాడు. మనోహరుడు తలవొంచుకుని, ‘‘నాకీ మధ్యనే వివాహమైన సంగతి నీకు తెలుసుకదా? నా భార్యకు నిద్రలో నడిచే వ్యాధి ఉంది. నేను నిద్రపోకుండా మెలకువగా ఉండి, ఆమెను కనిపెట్టుకుని కూర్చోవడం కష్టంగా అనిపించి, ఆమె కాళ్ళకు గజ్జెలు కట్టడం అలవాటు చేసుకున్నాను. ఆమె నిద్రలో నడిచినప్పుడు ఆ గజ్జెల సవ్వడికి నాకు మెలుకువ వస్తుంది. వెళ్ళి ఆమెను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెడతాను. ఒకసారి అలా పడుకోబెడితే, మరిక లేవదు,'' అని వివరించాడు.
 
‘‘మరి, నీ భార్య గజ్జెల సవ్వడి పగటి పూట వినిపించలేదే?'' అని అడిగాడు జయంతుడు అనుమానంగా. ‘‘ఆమెకు గజ్జెలు కట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు. అందుకే ఆమె నిద్రపోయూక కాళ్ళకు గజ్జెలు కట్టి, ఆమె నిద్రలేవక ముందే తీసేస్తాను. పెళ్ళయిన కొత్తకదా? నెమ్మదిగా చెప్పి గజ్జెలు అలవాటు చేయూలనుకుంటున్నాను,'' అన్నాడు మనోహరుడు.
 
‘‘బావుంది. అయినా, ఎన్నాళ్ళని ఇలా అవస్థపడతావు. నీ భార్యను ఒకసారి పట్నం తీసుకురా. మంచి వైద్యుణ్ణి చూసి నిద్రలో నడిచే వ్యాధికి తగిన వైద్యం చేయిద్దాం,'' అన్నాడు జయంతుడు. అసలు సంగతి తెలుసుకున్న జయంతుడు, మరునాడు మిగిలిన మిత్రులను కలుసుకున్నప్పుడు సంగతి వివరించి, ‘‘మీరు విన్నది కామీనీ పిశాచం, మహాలక్ష్మి, లంకెబిందెల తాలూకు సవ్వడికాదు. మనోహరుడి భార్య కాలి గజ్జెల సవ్వడి. ఇంకా మూఢనమ్మకాలతో డబ్బు వృథా చేసి, ఆరోగ్యానికీ, మనశ్శాంతికీ దూరం కాకండి,'' అని సలహా ఇచ్చాడు.
 
గజ్జెల సవ్వడి అసలు రహస్యం తెలుసుకున్న ముగ్గురు మిత్రులు మొదట తమ అవివేకానికి తలలు వంచుకున్నారు. ఆ తరవాత ఒకరినొకరు చూస్తూ బిగ్గరగా నవ్వుకున్నారు.

గుండ్రాయి కథ


విజయపురికి విద్యానందస్వామి విచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమవైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది. విద్యానందస్వామికి తన భవనంలో ఆతిథ్యమివ్వడమే కాకుండా, ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధనసహాయం చేసిన జమీందారు జగపతిరాయుడి కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది. అయితే, జగపతిరాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు.
 
దీనిని గమనించిన విద్యానందస్వామి, ఎంతో సంతోషించి, ‘‘మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది. అది ఉంటే ఓర్పు, సహనంలాంటి తక్కిన సుగుణాలు వాటంతట అవే అలవడుతాయి. మానవులకు సంప్రాప్తమయ్యే సిరిసంపదలు, భవనాలు, భార్యా పిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెబుతారు. అలా అని వాటినే నమ్ముకుని ఏ పనీ చేయకుండా కూర్చోవడం వివేకంకాదు. ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతర ప్రయత్నం కావాలి. అన్నిటికీ మించి భగవత్‌ కృప ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతవరకు ఓర్పూ, సహనం పాటించాలి. ఈ రెండింటికీ ఆధారమైనది వినయం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి. మిడిసిపాటు పనికిరాదు. ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెబుతాను, వినండి,'' అంటూ ఇలా చెప్పసాగాడు:
 
గోదావరి నదీ తీరానగల సుందరమైన ప్రాంతాల్లో మామిడి, పనస, కొబ్బరి, అరటివంటి రకరకాల ఫలవృక్షాలు వున్నాయి. ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాళ్ళు కూడా కొట్టుకువచ్చాయి.

అలా కొట్టుకువచ్చిన రాళ్ళలో ఒక గుండ్రటి రాయి, నది ప్రక్కనే వున్న కొబ్బరి చెట్ల మధ్యకు వచ్చి నిలిచి పోయింది. గుండ్రంగా, అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి, కొబ్బరి చెట్ల వేళ్ళకు తగులుకుని కదలలేకపోయింది. క్రమంగా వరద ప్రవాహం తగ్గింది. కొబ్బరిచెట్టు మీదవున్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయూయి.
 
ఒక పండు కొబ్బరికాయ రాయిని, ‘‘ఏయ్‌! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నిలచి పోయూవేం?'' అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది. రాయి ఉలకలేదు, పలకలేదు. అప్పుడు మరో చెట్టు మీద వున్న పండుకొబ్బరి హేళనగా, ‘‘దీని కథ నాకు తెలుసు! ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలవుతాయి. వాటిలో ఇదొకటి. ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ, దొర్లుకుంటూ దెబ్బలు తినీ తినీ ఇలా గుండ్రాయిగా మారింది. పాపం! మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగి పోయిందిగానీ, లేకపోతే ఇంకా ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి, ఈ పాటికి సముద్రంలోకి చేరివుండేది,'' అన్నది.
 
‘‘అయ్యో పాపం! అయినా, ఓ గుండ్రాయీ! సహనానికి కూడా ఒక హద్దంటూ వుండాలిగదా! మేము చూడు, ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తూన్నామో!'' అన్నది మరొక పండుకొబ్బరి.

గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు. కొంతకాలం గడిచింది. నదికి సమీపానగల గ్రామంలోని శివాలయంలో పూజారి, ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, పువ్వులు అగరువత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ తన మూడు కళ్ళూ తెరిచి దేవుడికేసి చూసింది. ఎత్తయిన పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి. వెంటనే దానికి, గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్ళకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకు వచ్చింది. ‘‘ఓహో! అదే ఇదా?'' అనుకుంటూండగానే, గుండ్రాయి, కొబ్బరికాయతో, ‘‘ఏం, మిత్రమా! ఆనాటి నీ ఉన్నత స్థితి, స్వాభిమానం ఇప్పుడేమయ్యూయి? ఓర్పుకు హద్దులు వుండాలనీ, నాకలాంటి హద్దులు తెలియక, స్వాభిమానం లేక అవమానాలు పడీ పడీ, పతనమై పోయూననీ, ఆనాడు జాలిపడ్డావు కదూ. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?'' అన్నది.
 
అంతలో పూజారి గంటలు మోగుతూండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో పెడీ పెడీ మని కొడుతూ, రెండు చెక్కలు చేసి, ఆ నీళ్ళతో శివలింగాన్ని అభిషేకించటానికి ప్రయత్నిస్తుండగా కొబ్బరికాయ, ‘‘మిత్రమా! నన్ను మన్నించు. ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో వుండగా, కన్నూమిన్నూకానక నిన్ను అధిక్షేపించాను. అందుకు ఇప్పుడీ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి, పవిత్రమైన గోదావరిలో వుంటూ, ఒరిపిడి పెట్టబడి, పూజార్హతను పొందావు. ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు,'' అన్నది.
 
ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది, ఆలయూనికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది. ఇంత వరకు చెప్పిన విద్యానందస్వామి, ‘‘నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికిలాగే మనుషులకు జీవితంలో ఆటు పోట్లు తప్పవు. అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని అందుకోగలడు,'' అని కథను పూర్తి చేశాడు.

పెంపుడు కొడుకు


సరిపురంలో ఉంటూన్న విశ్వనాధం తను చేసే ఉపాధ్యాయవృత్తిని దైవంగా భావించేవాడు. విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ, క్రమశిక్షణను నేర్పేవాడు. అందువల్ల విశ్వనాధం అంటే పిల్లలకూ, తల్లిదండ్రులకూ ఎంతో గౌరవాదరాలు ఉండేవి. విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు. భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ, ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాబంగా పెంచి పెద్దచేసింది.
 
చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి, పట్నం వెళ్ళి పైచదువులు చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. అక్కడొక అమ్మాయిని చూసి ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్ళి చేసుకున్నాడు. ఇది విశ్వనాధానికి తీరని ఆవేదన కలిగించింది. ‘‘మనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎంత పనిచేశాడు చూశావా మన చైతన్య? మనతో చెబితే వాడి కోర్కెను కాదంటామా?'' అంటూ భార్యతో వాపోయూడాయన.
 
‘‘చెప్పి ఉంటే బావుండేది. అయినా చెప్పలేదు. ఏం చేద్దాం. మన ప్రాప్తం అంత. వాడు బావుంటే చాలు. కాలం మారిపోయింది, పోనిద్దురూ,'' అని భర్తను ఓదార్చింది విశాలాక్షి. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాధం భార్యతో కలిసి తీర్థయూత్రకు బయలుదేరి వెళ్ళి, కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు. ఆయన ఒకనాడు దైవదర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చుని ఉండగా, ఒక పదేళ్ళ కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు.
 
‘‘ఏం నాయనా, చదువుకోవలసిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నా వేమిటి? నీ తల్లిదండ్రులు ఏం చేస్తూంటారు?'' అని అడిగాడు విశ్వనాధం. ‘‘ఆర్నెల్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మానాన్న చనిపోయూరు. నిరుపేదలం. నేనూ, మా అవిటి తాతయ్యూ బిచ్చమెత్తుకుంటేనే, ఆకలికింత తినగలిగేది,'' అన్నాడు కుర్రాడు దీనంగా. విశ్వనాధం కుర్రాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, ‘‘నీ పేరేంటి, బాబూ,'' అని అడిగాడు. ‘‘మల్లేశం,'' అన్నాడు కుర్రాడు. ‘‘నేను చదివిస్తే చదువుతావా?'' అని అడిగాడు విశ్వనాధం.

‘‘చదు ుకుంటాను. మరి, మా తాతయ్య సంగతేమిటి?'' అన్నాడు మల్లేశం. ‘‘అతడికి మూడు పూటలా తిండి పెట్టే బాధ్యత నాది. నువ్వు చదువుకుంటావా మల్లేశం?'' అన్నాడు విశ్వనాధం. మల్లేశం సంతోషంగా తల ఊపాడు. ఆ తరవాత విశ్వనాధం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది. మల్లేశం వాళ్ళతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు.
 
కాలం వేగంగా గడిచిపోయింది. మరో పదేళ్ళలో మల్లేశం బాగా చదివి చేతికి అంది వచ్చాడు. మల్లేశం తాత కన్నుమూశాడు. వృద్ధుడై పోయిన విశ్వనాధం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమశ్వాస విడిచాడు. విశాలాక్షి, మల్లేశంతో పాటు ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. విశ్వనాధం ఏకైక కుమారుడు చైతన్య, ఉద్యోగరీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండడంతో, తండ్రి మరణించినప్పుడు కూడా రాలేక పోయూడు. మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాధం అంత్యక్రియలు జరిగిపోయూయి.
 
చైతన్య రెండు వారాల తరవాత సిరిపురం వచ్చాడు. తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేర రాసివెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు. ఆ విషయంగా తల్లిని నిలదీయూలని ఆవేశంగా ఇంటిని సమీపించిన చైతన్యకు లోపలి నుంచి ఏవో మాటలు వినిపించడంతో వాకిట్లోనే ఆగి పోయూడు.
 
‘‘గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను. ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటి పాపలా కాపాడుకోవడం నా బాధ్యత. గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం, మీ కుమారుడికే అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి,'' అంటున్నాడు మల్లేశం. ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికివచ్చి మల్లేశం చేతులు పట్టుకుని, ‘‘నువ్వు సోదర సమానుడివి. కన్నంత మాత్రాన కొడుకు కాడు; పెంచుకున్న వాడు కూడా కన్న బిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు! తండ్రిగారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో.
 
పట్నం రావడానికి అమ్మ సుముఖత చూపడం లేదు గనక, ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి,'' అన్నాడు. విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్ళకుండా, మల్లేశం వద్దే ఉంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపింది. మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, కన్నబిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకూ పాత్రుడయ్యూడు.

పంజరం చిలుకలు


రామ్‌, శ్యామ్‌ స్నేహితులు. రామ్‌ ఒక రైతు; శ్యామ్‌ వ్యాపారి. ఒకసారి శ్యామ్‌కు వ్యాపారంలో అపార నష్టం ఏర్పడింది. వాటిల్లిన నష్టం భరించలేనంతగా బతుకును ఛిన్నాభిన్నం చేయడంతో, అతడు సాయూన్ని అర్థిస్తూ రామ్‌ దగ్గరికి వెళ్ళాడు. రామ్‌ ఏమాత్రం వెనుకాడకుండా తన పొలంలో కొంత భాగం శ్యామ్‌కు ఇచ్చాడు. శ్యామ్‌ పొలం దున్నుతూండగా, బంగారు ఆభరణాలుగల ఒక కంచు పాత్ర దొరికింది. అతడు ఆ పాత్రను తీసుకుపోయి, సంగతి చెప్పి రామ్‌కు ఇచ్చాడు. అయితే, దాన్ని పుచ్చుకోవడానికి రామ్‌ తిరస్కరించాడు. పొలం శ్యామ్‌కు ఇచ్చేయడంతో, అందులో దొరికినవి శ్యామ్‌కే చెందుతాయని చెప్పాడు. అందుకు శ్యామ్‌ ఒప్పుకోలేదు. ఇద్దరూ గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమకు న్యాయం చెప్పమన్నారు. గ్రామాధికారి మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశాడు.
 
ఆ రోజు రాత్రి రామ్‌ గ్రామాధికారిని కలుసుకుని, ‘‘నా స్నేహితుడు చాలా నిజాయితీపరుడు. ఎవరి సాయమూ తీసుకోడు. వ్యాపారంలో కోలుకోలేని నష్టం కలగడం వల్ల, నేనిచ్చిన పొలాన్ని అయిష్టంగానే పుచ్చుకున్నాడు. అయితే, ఆ పొలం అతనికి చాలదని నాకు అనిపించి, నా భార్య సుశీల, కూతురు సంగీత నగలను వారి సంపూర్ణ సమ్మతితో తీసుకుని, వాటిని శ్యామ్‌కిచ్చిన పొలంలో నేనే పాతి పెట్టాను. రేపు తమరు అతనికి అనుకూలంగా తీర్పుచెప్పాలి,'' అని వేడుకున్నాడు.
 
మరునాడు పొలం శ్యామ్‌ ఆధీనంలో ఉండడంవల్ల, అందులో దొరికిన నగలు శ్యామ్‌కే చెందుతాయని గ్రామాధికారి తీర్పు చెప్పాడు. శ్యామ్‌ అయిష్టంగానే తీర్పును అంగీకరించాడు. పొలంలో అరుదైన ఫలవృక్షాలు నాటితే లాభదాయకంగా ఉండగలదని నిర్ణయించాడు. శ్యామ్‌ కొడుకు ఆదిత్యను పిలిచి, నగలు ఇచ్చి, వాటిని అమ్మి ఆ సొమ్ముతో అరుదైన ఫలాల చెట్ల విత్తనాలను కొనుక్కురమ్మని చెప్పాడు. మరునాడు ఆదిత్య సమీపంలోవున్న పట్నం కేసి బయలుదేరాడు. దారిలో ఒకడు కొన్నిఅందమైన చిలుకలను ఒక పంజరంలో బంధించి అమ్మడానికి తీసుకు వెళ్ళడం చూశాడు.

అవి చాలా అరుదైన జాతి చిలుకలనీ, సంతలో వాటికి మంచి ధర పలకగలదనీ ఆ మనిషి చెప్పాడు. పంజరం లోపల అవస్థపడుతూన్న ఆ పక్షులకు చూస్తూంటే, ఆదిత్య మనసు విలవిలలాడింది. వాటికి స్వేచ్ఛ కలిగించాలనుకున్నాడు. తన దగ్గరవున్న నగలను ఇచ్చి, పక్షులను కొనాలనుకున్నాడు. అందుకు ఆ మనిషి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆదిత్య పంజరం తలుపు తెరిచి పక్షులను వదిలిపెట్టాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళడం చూసి అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
 
పక్షులకు స్వేచ్ఛ కలిగించినందుకు ఆనందించినప్పటికీ, తండ్రి చెప్పిపంపిన పని చేయలేక పోయూను కదా అని ఆదిత్య బాధ పడ్డాడు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. పట్నంలో ఏదైనా ఒక పని చూసుకుని, కొంత కాలం డబ్బు కూడబెట్టి, తండ్రి చెప్పిన విత్తనాలను తీసుకుని వెళ్ళాలని నిర్ణయించాడు. అతనికి ఒక ధనిక వర్తకుడి వద్ద మంచి ఉద్యోగం లభించింది. రెండేళ్ళపాటు కష్టపడి పనిచేసి అనుకున్న మొత్తాన్ని కూడ బెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు.
 
ఆ సమయంలో అతని తండ్రి తన స్నేహితుడు రామ్‌తో మాట్లాడుతున్నాడు. తన కొడుకును చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుని, ‘‘నీ ఉదాత్త చర్యతో మమ్మల్ని గర్వపడేలా చేశావు. నగలు పోయూయని బాధపడకు. మనం మొక్కలు కొనవలసిన అవసరం కూడా లేదు. నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల తరవాత అందమైన చిలుకలు గుంపుగా వచ్చి మన పొలంలో ఫలవృక్షాల విత్తనాలను తెచ్చి పడేశాయి. ఇప్పుడు మన పొలంలో ఫలవృక్షాలు పెరుగుతున్నాయి,'' అన్నాడు.
 
‘‘ఆహా! అద్భుతం. చిలుకలు నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేశాయన్న మాట,'' అన్నాడు ఆదిత్య. ‘‘మరో విషయం శ్యామ్‌, ఆదిత్య చేసిన ఉదాత్త చర్యను గురించి వినగానే, నా కూతురు అతని పట్ల అభిమానం పెంచుకున్నది. పెళ్ళాడాలనుకుంటున్నది. మీకూ, మీ అబ్బాయికీ అంగీకారమయితే మాకూ ఇష్టమే,'' అన్నాడు రామ్‌. ‘‘నీ కూతురును మా ఇంటి కోడలుగా చేసుకోవడం మాకూ సంతోషమే. ఏమంటావు ఆదిత్యా?'' అంటూ కొడుకుకేసి చూశాడు శ్యామ్‌ నవ్వుతూ. ఆదిత్య అంగీకార సూచకంగా తల ఊపాడు.

మీనాబొమ్మ


మీనా చిత్రపూర్‌లో ఉంటోంది. ఆమె చాలా తెలివిగల అమ్మాయి. తల్లితండ్రులు ఆమె పట్ల ఎంతో ప్రేమ కనబరచేవారు. ఆ రోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో చదువుకుంటూన్న అన్నయ్య, ఆమె పుట్టినరోజు కోసం వస్తున్నాడు. అన్నయ్యకు స్వాగతం పలకడానికి మీనా తల్లిదండ్రులతో కలిసి విమానాశ్రయూనికి వెళ్ళింది. అన్నయ్యను చూడగానే మీనా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంటికి వస్తూ అన్నయ్య తన కాలేజీ గురించీ, విశ్వవిద్యాలయం గురించీ ఎన్నో ఆసక్తికరమైన విషయూలు చెబుతూ వచ్చాడు.
 
అప్పటికే మీనా ఇంజినీరై, పైచదువుల కోసం అమెరికా వెళ్ళాలని నిర్ణయించింది. ఆమె ఆ రాత్రి తను చదవబోయే కాలేజీ గురించి కలలుకంటూ నిద్రపోయింది. మరునాడు ఆమె పుట్టిన రోజు. ఆమెకు ఎన్నో కానుకలు వచ్చాయి. అయితే, అన్నయ్య ఇచ్చిన అమెరికన్‌ డాల్‌ అన్నిటికన్నా చాలా అందంగా ఉంది. అందమైన ఆ బొమ్మకు బంగారు జుట్టు, పచ్చటి దుస్తులు ఉన్నాయి. పైకెత్తితే కళ్ళు తెరుస్తుంది. కిందికి దించితే కళ్ళు మూసుకుంటుంది. అది అన్నిటికన్నా చాలా భిన్నమైనది. ఎంతో బావున్నది. దాన్ని తన స్నేహితులకు చూపించాలని మీనా ఎంతో ఉత్సాహ పడింది.
 
అందువల్ల ఆమె బొమ్మను తన స్కూలు బ్యాగ్‌లో దాచుకుని వెళ్ళింది. తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాల మీద మనసును నిలుపలేక పోయింది. సంచీలో నిదుర పోతూన్న బొమ్మ మీదే ఉంది ఆమె ధ్యాసంతా. మీనా పరధ్యానంతో ఏదో పగటి కలలుకంటున్నదని హిస్టరీ టీచర్‌ గమనించి, హెచ్చరించింది. ఉలిక్కి పడిన మీనా తన బొమ్మను ఒకసారి తాకి చూసుకున్నది.
 
అప్పుడామె చేతికి ఏదో బటన్‌ తగలడం గమనించింది. అప్పుడే గంట మోగడంతో, మరాఠీ టీచర్‌ తరగతిలోకి వచ్చింది. ఆమె భూకంపాలకు సంబంధించిన చిత్రాలు తీసుకు వచ్చి పిల్లలకు భూకంపాల గురించి  బోధించసాగింది. అయితే, మీనా మనసంతా ఆ బొమ్మ మీదే ఉంది. 

సమయం దొరికినపుడల్లా దాన్ని రహస్యంగా చూసుకోసాగింది. మూడో పిరియడ్‌ ఆరంభమవుతూండగా, తరగతి గోడ మెల్లగా కంపించింది. దాన్ని మొదట ఎవరూ గమనించలేదు; ఆ తరవాత భవనమంతా ఉధృతంగా ఊగడంతో గోడ కూలి పోయింది. పిల్లలు వెలుపలికి వెళ్ళలేకపోయూరు.
 
మీనా హడలి పోయింది. ఆమె బొమ్మను శరీరానికి గట్టిగా అదిమి పట్టుకున్నది. దాంతో బొమ్మ గట్టిగా మాట్లాడసాగింది: ‘‘భూకంపం వస్తే, మొదట వెలుపలికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది సాధ్యం కాలేదంటే మేజా కిందగాని, బెంచీ, మంచం కిందగాని దాక్కుని మీరెండు చేతులను మెడపై ఉంచుకోవాలి.'' టీచర్‌ చెప్పిన మాటలు బొమ్మలో రికార్డయిందని మీనా వెంటనే గ్రహించింది. అందువల్ల మెషీన్‌లో రికార్డయిన దాన్ని, గట్టిగా నొక్కి పట్టినప్పుడు బొమ్మ మళ్ళీ మళ్ళీ చెప్పగలదని తెలుసుకున్నది. మీనా బటన్‌ను మళ్ళీ నొక్కింది. బొమ్మ బిగ్గరగా, ‘‘భూకంపం, భూకంపం,'' అని అరవసాగింది.
 
దాని మాటలు వెలుపలనున్న వారికి వినిపించడంతో, శిథిలాల మధ్య పిల్లలు చిక్కుకుని ఉన్నారని గ్రహించి, వెలుపలికి తీయడానికి పూనుకున్నారు. తగిన సమయంలో వారికి సహాయం అందింది. మీనా తరగతిలోని పిల్లలందరినీ ప్రాణాలతో కాపాడారు. తమ ప్రాణాలను కాపాడినందుకు తరగతిలోని పిల్లలందరూ మీనాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘మీరు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదు; నా బొమ్మకు,'' అన్నది మీనా. ఆమె అన్నయ్య, ‘‘నువ్వే గనక ‘భూకంపం, భూకంపం,' అని ఆ బొమ్మను అరిచేలా చేయకుండా ఉన్నట్టయితే, మిమ్మల్ని కనుగొనడం చాలా కష్టమై ఉండేది. మంచిపని చేశావు,'' అంటూ మీనాను అభినందించాడు. మీనా చాలా సంతోషించింది.
 
తను స్నేహితులందరినీ కాపాడడానికి ఉపకరించిన బొమ్మను ఇచ్చినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘బాగా చదివి మంచి ర్యాంకు తెచ్చుకున్నావంటే వచ్చే బర్‌‌తడేకు కంప్యూటర్‌ కానుకగా ఇస్తాను,'' అన్నాడు అన్నయ్య. ఆ మాట విని మీనా ఆనందంతో నాట్యం చేసింది.

విలువైన స్మారకం


విదిశా నగరాన్ని పాలించే శివవర్మ ప్రజారంజకుడుగా పేరు పొందాడు. వృద్ధుడైన ఆయనకు ఒక వింత కోరిక కలిగింది. వెంటనే ఆయన తన ఆస్థానంలోని నలుగురు మంత్రులను పిలిపించి, ‘‘ప్రజలు నన్ను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ప్రజలు మరిచి పోకుండా, ఎప్పటికీ నన్ను గురించి గొప్పగా చెప్పుకునేలా ఒక స్మారకాన్ని నిర్మించదలిచాను.అది ఎలాంటిదైతే బావుంటుందో చెప్పండి,'' అని అడిగాడు.
 
విష్ణుశర్మ అనే వృద్ధ మంత్రి, ‘‘మహాప్రభూ, విలువైన పాలరాతితో ఒక అద్భుత మందిరం నిర్మించవచ్చు,'' అన్నాడు. ‘‘ఆ పాలరాతి మందిరంలో విలువైన రత్నాలను పొదిగిస్తే, వాటిని చూసినప్పుడల్లా, తమ వైభవాన్ని ప్రజలు గొప్పగా చెప్పుకోగలరు,'' అన్నాడు మరొక మంత్రి అనంతశర్మ.
 
‘‘ఆ మందిరంలో తమ బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే, దాన్ని చూసే ప్రజలు తమరు జీవించి ఉన్నట్టే భావించగలరు,'' అన్నాడు శివశర్మ అనే మూడవ మంత్రి. ఆ ముగ్గురు మంత్రుల ఆలోచనలు విన్న తరవాత కూడా, తన అభిప్రాయూన్ని చెప్పకుండా మౌనంగా ఉన్న మణిశర్మ కేసి చూస్తూ, ‘‘మీ అభిప్రాయం ఏమిటి అమాత్యా!'' అని అడిగాడు మహారాజు.
 
‘‘ముగ్గురు మంత్రుల సూచనలూ, తమ వైభవాన్ని చాటి చెప్పేవిగానే ఉన్నాయి. అయినా, కాలం ఎల్లప్పుడూ ఒకే విధంగా సాగదన్న సంగతి తమకు తెలియనిది కాదుగదా. మునుముందు ఎలాంటి మార్పులువస్తాయో చెప్పలేం. పైగా ఇది కలికాలం. వచ్చే కాలంకంటే గడిచిన కాలమే సత్యకాలం అని కొందరంటే, కాదు భవిష్యత్తులోనే మానవాళికి మంచికాలం రాగలదని విశ్వసించే వారూ ఉన్నారు. ఇందులో ఏది నిజమైనప్పటికీ, ఏకాలంలో నైనాసరే, సామాన్య ప్రజల మేలు కోరి చేసేపనులే మన్ననల నందుకుం టాయి.

మంచి పనులు చేసేవారే ప్రజల హృదయూలలో చెరగని స్థానం సంపాయించగలరు. అందుకని, ముగ్గురు మంత్రులు చెప్పిన పాలరాతి స్మారక మందిరం చుట్టూ పదిమందికి ఉపయోగపడేలా రకరకాల పూల చెట్లతో, ఫల వృక్షాలతో పెద్ద తోటను నాటి పెంచుదాం. వాటి మధ్య అక్కడక్కడా బాటసారులైన ప్రజలు సేదతీరడానికి వీలుగా చిన్న చిన్న విశ్రాంతి గృహాలు నిర్మిద్దాం,'' అన్నాడు మణిశర్మ.
 
ఆ మాట విన్న మహారాజు, ‘‘చక్కగా చెప్పావు, మణిశర్మా! నీటి బుడగలాంటి జీవితం మరెంతకాలం ఉంటుందో చెప్పలేము కదా? ప్రజోపయోగకరమైన పనులను వెంటనే ప్రారంభించాలి. ఉత్తర దిశగా ప్రవహిస్తున్న భవతారిణి నదికీ, నగరానికీ మధ్య ఉన్న సువిశాల ప్రదేశంలో సుందరవనం కోసం మొక్కలు నాటేపనులు వెంటనే ప్రారంభించండి,'' అన్నాడు పరమానందంతో.
 
రాజుగారి అభీష్టానుసారం మంత్రి మణిశర్మ ఆధ్వర్యంలో మరునాడే మొక్కలు నాటే పనులు ప్రారంభమయ్యూయి. ఆ తరవాత యేడాది తిరిగే సరికి రాజు మరణించడంతో, మిగిలిన ముగ్గురు మంత్రులూ మహారాజుకు ఇచ్చిన మాట ప్రకారం, వనంమధ్య పాలరాతితో స్మారక మందిరం నిర్మించి, రాజుగారి బంగారు విగ్రహం ప్రతిష్ఠించారు.
 
సంవత్సరాలు దొర్లిపోయూయి. కాలప్రవాహంలో మంత్రులు కూడా కాలధర్మం చెందారు. క్రమేణా స్మారక మందిరం శిథిలావస్థకు చేరుకున్నది. రాజుగారి బంగారు విగ్రహం ఎప్పుడో దొంగిలించబడింది. మణులు మాణిక్యాలు పోయినచోటు తెలియలేదు.
 
మణిశర్మ నాటించిన సుందరవనం మాత్రం ఇంకా కళకళలాడుతూ ఉంది. ఆయన అక్కడక్కడ నిర్మించిన చిన్న చిన్న విశ్రాంతి గృహాలు బాటసారులకు నీడనిస్తూ ఉన్నాయి. తమ మీది బరువులుదించి, అలసట తీర్చుకోవడానికి పనికి వచ్చేలా బాటల పక్కన నాటించిన తెల్లబండలు, శ్రమజీవులకు ఇంకా సేద తీరుస్తూనే ఉన్నాయి. సుందరవనంలోని పువ్వులూ, పళ్ళూ వాడుకుంటూ చుట్టు పక్కల ప్రజలు రాజు శివవర్మ తోటను ఇంకా స్మరించుకుంటూనే ఉన్నారు!

వేణువు మహిమ!


నూతుంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన కార్యాలయంలోని గోడగడియూరం కేసి చూశాడు. ఒంటి గంట అయింది. మధ్యాహ్న భోజన విరామ సమయం. అయితే, ఇంకా గంట మోగలేదు. ప్యూను గంట కొట్టడానికి మరిచిపోయూడా ఏం? అని ఆయన ఆలోచించసాగాడు.
 
ఉన్నట్టుండి శ్రావ్యమైన వేణునాదం వినిపించింది. అదే సమయంలో గంట కూడా మోగింది. తరగతి గదుల నుంచి పిల్లలు బయటకు పరుగులు తీశారు. వారిలో కొందరు పాఠశాల ప్రాంగణంలో చెట్టు కింద నిలబడ్డ తొమ్మిదేళ్ళ కురవ్రాడి చుట్టూ మూగారు. వాడి పేరు రాధూ; వేణువులు అమ్మే కురవ్రాడు.
 
రోజూ భోజన సమయంలో వాడు పాఠశాలకు వస్తాడు. వాడు వేణువు ఊదడం వినగానే, గంట ఒకటయిందని గ్రహించి ప్యూను గంట మోగిస్తాడు. అతడు గడియూరం చూడ వలసిన పనిలేదు. సరిగ్గా ఒంటి గంటకు వస్తాడు రాధూ.
 
రాధూ వేణుగానం అంటే చాలా మంది పిల్లలకు చాలా ఇష్టం. కొందరు తాము తెచ్చుకున్న ఫలహారం కూడా రాధూతో పంచుకుని తినేవారు. అయితే, కొందరు ఉపాధ్యాయులకు ఇది నచ్చలేదు. ముఖ్యంగా నాలుగవ తరగతి ఉపాధ్యాయుడు పాత్రోకు మరీ చీదరగా అనిపించేది. మధ్యాహ్న విరామ సమయంలో గొడవ చేయడమే గాక, రాధూ పిల్లల్ని పాడుచేస్తాడేమో అని ఆయన అనుమానించాడు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయుడు అక్కడికి వెళ్ళి, పిల్లల్ని తరగతులకు వెళ్ళమని చెప్పి, ఆ పిల్లలు వెళ్ళిపోగానే, రాధూ కేసి తిరిగి, ‘‘వెళ్ళిపో. ఇకపై ఈ దరిదాపులకు రావద్దు,'' అని కోపంగా ఆజ్ఞాపించాడు.
 
ఆ తరవాత కొన్నాళ్ళు రాధూ పాఠశాలకేసి రాలేదు. ప్యూనుకు వాడు రాని వెలితి కనిపించింది. గంట మోగించడంలో మరింత జాగ్రత్త వహించాడు. రోజూ కొంతసేపు రాధూ వేణుగానం వినే అవకాశం దూరంకావడంతో చాలా మంది పిల్లలు విచారం చెందారు. ఒకనాడు ఏదో అద్భుతం జరిగినట్టు, మళ్ళీ వేణుగానం వినిపించింది. అదే సమయంలో మధ్యాహ్నం గంట మోగింది. చాలా మంది పిల్లలు ఉత్సాహంతో వేణువు ఊదుతూన్న రాధూ వద్దకు పరుగులు తీశారు. చాలా వేణువులు అమ్ముడయ్యూయి.

దాన్ని ఎలా ఊదాలో రాధూ పిల్లలకు నేర్పసాగాడు. వాడు మళ్ళీ రావడం పాత్రోకు నచ్చలేదు. ప్రధానోపాధ్యాయుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆయన్ను చూడగానే, పిల్లలు మెల్లగా జారుకున్నారు. అక్కడ మిగిలిన పిల్లల ఎదుట ప్రధానోపాధ్యాయుడు రాధూను చెంప దెబ్బ కొట్టాడు. రాధూ చెక్కిళ్ళపై కన్నీరు కారసాగింది.
 
తను మరీ కఠినంగా శిక్షించానా అన్న అనుమానం ప్రధానోపాధ్యాయుడికి కలిగింది. మనసులో నొచ్చుకున్నాడు. ఆ తరవాత తన జేబులోని పర్సు తీసి, అందులోంచి పది రూపాయల కొత్త నోటు తీసి రాధూకు ఇవ్వబోయూడు. అయితే, దాన్ని పుచ్చుకోవడానికి తిరస్కరించిన రాధూ, ‘‘అయ్యూ, నేను ఈ బడిలో మూడో తరగతి చదువుకుంటున్నప్పుడు నా తల్లితండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
 
నా చదువు కొనసాగించలేక పోయూను. నేను నా తల్లిదండ్రులకు ఒకడే సంతానం. నన్ను ఆదుకునే వారెవరూ లేకపోయూరు. ఆకలికి తట్టుకోలేక ఈ వేణువులమ్మే పని చేపట్టాను. అయినా, బడి అంటే నాకు మహా ఇష్టం. పిల్లలతో స్నేహం చేయడమంటే ఇంకా సంతోషం. అందుకే ఈ బడిని మరువలేక రోజూ ఇక్కడికి వస్తున్నాను. దీన్ని గొడవగా భావించి తమరు వద్దంటే మాత్రం ఇకపై రాను,'' అన్నాడు వినయంగా.
 
వాడి మాటలు విన్న ప్రధానోపాధ్యాయుడి నోటి నుంచి మాట రాలేదు. తనలాగే అవాక్కయి నిలబడిన పాత్రో కేసి మౌనంగా చూశాడు. ఆ తరవాత రాధూ కేసి తిరిగి, ‘‘నన్ను క్షమించు బాబూ. నిన్ను కోప్పడి ఉండకూడదు. నువ్వు అనాథవు కావు. నీ సంరక్షణాబాధ్యతలు మేమే చూసుకుంటాం. నువ్వు మళ్ళీ చదువును కొనసాగించాలి. రేపు ఉదయం రా. నాలగవ తరగతిలో చేర్చుకుంటాను,'' అన్నాడు. మరునాడు ప్రార్థనా సమావేశంలో, ప్రధానోపాధ్యాయుడు రాధూ జేబు నుంచి వెలుపలికి కనిపిస్తూన్న వేణువును చూశాడు. వాణ్ణి పిలిచి ప్రార్థనా గీతాన్ని వేణువులో వాయించమన్నాడు. నాటి నుంచి రోజూ అలాగే జరుగుతూ వచ్చింది.