Pages

Monday, August 20, 2012

పట్టిందల్లా బంగారం

ఒక వూళ్ళో ఓ వ్యాపారి ఉండేవాడు.అతడు పరమ పిసినారి, పైసా ఖర్చు చేసేవాడు కాదు.  ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా డబ్బు సంపాదించేవాడు. ఇంకా ఇంకా ధనం సంపాదించాలి అనుకునేవాడు.

ఓ రోజు అతడు పని పై  అడవిగుండా  పొరుగూరు  వెళుతూ మధ్యహాన్నం వేళ  ఓ పెద్ద చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నాడు. సాయంత్రం లేచి చూసేసరికి  పక్కనే అతడికి ఓ గుడి కనిపించింది. చుట్టూ చెట్లనిండా పూలూ పండ్లూ ఉన్నాయి. పోన్లే కొనుక్కునే పనిలేదు. అన్నీ కోసి  గుళ్ళో పూజచేసేద్దాం పోయేదేముంది   అనుకుని. పండ్లూ పూలు అన్నీ కోసి ఆ గుళ్ళో దేవతకు పూజ చేశాడు.  వెంటనే  ఆ దేవత ప్రత్యక్షమై  ఏదైనా వరం కోరుకోమని అడిగింది.  ఆ వ్యాపారి ఆనందంతో ఉప్పొంగి పోతూ“నాకు చాలా ధనం కావాలి.” అని అడిగాడు.  ఎంత కావాలో చెప్పమని మళ్ళీ అడిగింది దేవత. “నేను పట్టిందల్లా బంగారం కావాలి.” అన్నాడు అత్యాశతో. అలాగే అంటూ దేవత మాయమయి పోయింది.

వ్యాపారి ఆనందంతో వెనిక్కి తిరిగి ఇంటికి తిరిగి  వచ్చేశాడు. జాగ్రత్తగా లోనకు వెళ్ళి ఇంటిని తాకాడు. ఇంటి గోడలు బంగారపు గోడలుగా మారిపోయాయి.  ఇక అతడికి వెర్రి ఆనందం వేసింది.  ఇంట్లో వస్తువులన్నీ తాకుతూ వాటిని బంగారం చేస్తూ  రోజంతా గడిపాడు.

చివరికి బాగా అలసిపోయాడు.  ఆకలి వేయడం మొదలెట్టింది. భార్యను పిలిచి భోజనం పెట్టమని  చెప్పాడు.  పళ్ళెం ముందు కూర్చుని అన్నం లో చేయి పెట్టగానే అది బంగారంగా మారిపోయింది. నీళ్ళు తాగుదామని చెంబు పట్టుకుంటే  నీళ్ళూ చెంబూ కూడా బంగారమయిపోయాయి.  అంతలో ఆ వ్యాపారి కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి అతడి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే ఆ పిల్లవాడూ బంగారు విగ్రహంగా మారిపోయాడు.

వ్యాపారి భయంతో  ఏడుస్తూ నా అత్యాశ వల్లనే ఇదంతా జరిగింది అనుకుంటూ  అడవిలోని గుడికి  వెళ్ళి దేవతను ప్రార్థంచడం మొదలెట్టాడు.  “నా జీవితం నా బిడ్డా నాకు ముఖ్యం నీ వరం నాకు అక్కరలేదు వెనిక్కి తీసుకో”   అంటూ దేవతను అడిగాడు.

సరే అంది దేవత.  ఆ పై వ్యాపారి అత్యాశను పిసినారి తనాన్ని వదిలేసి  హాయిగా జీవించాడు.

No comments:

Post a Comment