Pages

Monday, August 20, 2012

అనగనగా ఒక పేను కథ

ఒక పేను చేటంత పెసరచేను వేసుకుంది.   ఆ చేను చక్కగా కాసింది.   ఓనాడు ఆ దారిన వెళుతున్న రాజుగారు  ఆ చేను చూసి  పంటంతా కోసుకుపోయాడు. పేనుకు  చాలా దుఖం  వేసింది.

నా పంట అంతా  దోచుకు పోయిన  రాజు ని ఎలాగైనా  చంపాలి అనుకుని, ఓ బండికట్టుకుని  బయల్దేరింది.   తనతోపాటుగా అది  కొన్ని రొట్టెలు  కూడా తెచ్చుకుంది.

అది అలా వెళుతూ ఉంటే  దానికి  దారిలో  ఓ తేలు కనిపించింది  “పేను బావా ఎక్కడికి బయల్దేరావు?”  అంటూ అడిగింది  తేలు.

దానికి పేను “నా పెసర చేనంతా నాశనం చేసి పంటంతా దోచుకెళ్ళాడు రాజు, ఆ రాజుని చంపేసేయడానికి  బయల్దేరాను  నువ్వూ నాతో వస్తావా?”  అని అడిగింది.
సరే నని  తేలు పేనుతో కలిసి  బయల్దేరింది. దానికి ఒక రొట్టె ఇచ్చింది పేను.
అవి రెండూ కలిసి ప్రయాణం సాగించాయి.

కొద్దిదూరం వెళ్ళాక వాటికి ఒక పాము  కనిపించింది  తేలూ, పేనూ కలిసి ఎక్కడి వెళుతున్నాయో  తెలుసుకుంది పాము.
“నువ్వూ మాతో రాగూడదూ  అందరం కలిసి ఆ రాజుకి తగిన శాస్తి చేద్దాం.” అని  అడిగాయి  అవి.  సరేనంది  పాము. పాముకి కూడా  తన  రొట్టేల్లోంచి  ఒకటి  తీసి  ఇచ్చింది  పేను.

అలా అవి మూడూ  వెళ్తుండగా  వాటికి కనిపించింది  ఒక గుండ్రాయి.   దానికి  రాజు చేసిన  పని  చెప్పి,  మాతో  వస్తావా  అని  అడిగారు  వీళ్ళు  ముగ్గురు.  సరే నని బయల్దేరింది  గుండ్రాయి.
పేను, తేలు, పాము,  గుండ్రాయి  నలుగురు రాజుగారి  ఊరు సమీపానికి వచ్చేసరికి  వాటికి  అక్కడ ఒక  పెద్దపులి  ఎదురైయ్యింది.

” ఏంటీ!  అందరూ  కలిసి  ఇలా  బయల్దేరారు? ఎక్కడికి? ఎందుకు?”  అంటూ ప్రశ్నలు  కురిపించింది  పెద్దపులి.

“రాజు నా చేను నాశనం చేసి నా పంటంతా దోచుకెళ్ళాడు  అతడికి  తగిన  బుద్ది చెప్పి, నా పంట వెనిక్కి తెచ్చుకుండామని ఇలా వచ్చాను  వీళ్ళంతా నాకు సాయం వచ్చారు.”  అని  చెప్పింది  పేను  పెద్ద పులితో.

” అయ్యో  అలాగా నేనూ మీతో వస్తాను.” అంది  పెద్దపులి.

సరేనని  దానికి బదులుగా  పులికి  ఒక రొట్టే ఇచ్చింది పేను.

అందరూ  కలిసి  రాజుగారి  ఇంటికి  చేరుకున్నారు.  పులి ఎవరి  కంటా పడకుండా  లోపలికి  వెళ్ళలేదు  కనుక  అది  వీధి లోనే  దాక్కుంది.

గుండ్రాయేమో  ఇంటిబయట  గుమ్మంపైన  నక్కి  దాక్కుంది.

పేను రాజుగారి  దువ్వెనలో  దాక్కుంది. తేలు తల గడలో  కనిపించకుండా  దాక్కుంది.  పాము  ఆ గదిలో  ఓ  మూలన  ఎవరికీ  కనిపించకుండా  నక్కింది.

అంతలోకి  రాజుగారు  వచ్చారు  అతడు తలదువ్వుకుంటూ  ఉంటే  పేను  తలలోకి  చేరి కసా పిసా  కుట్టేసి  తన కోపం తీర్చుకుంది. రాజు కి  చిరాకు ఎక్కువై  కాసేపు  పడుకుందామని  పడుకున్నాడు.
చీకటి  పడేదాక  ఆగిన తేలు  రాజుని  కుట్టేసింది,  ఆ  చీకట్లో  రాజు  కంగారుగా లేచికూర్చున్నాడు,

అంతలోకి  అక్కడే  ఉన్న  పాము  బుస్సు  బుస్సు  మంటూ  బుసకొట్టసాగింది.  దానితో  రాజుకి  భయం  వేసి  గబ గబా  ఇంటి  బయటకి  రావటానికి  తలుపు  తీయగానే  ఆ గుండ్రాయి  టప్పు  మని  ఆయన  తలపై  పడింది.

దానితో   హడలిపోయిన  రాజు   గబ గబా  వీధిలోకి  పరిగెత్తాడు  వీధిలో  చీకటి  చాటున  దాక్కున్న  పులి  అమాంతంగా  రాజుపై పడి  ఆయన్ని  తినేసింది.

పేను  తన పెసలు తాను తీసుకుని సంతోషంగా  ఇంటికి  తిరికి వచ్చింది.

No comments:

Post a Comment