Pages

Monday, August 20, 2012

గాడిదల పంపకం

ముగ్గురు వ్యక్తులు వాళ్ళదగ్గర ఉన్న డబ్బు తో  పదిహేడు  (17) గాడిదలు  కొన్నారు.  దానికై       మొదటివాడు  సగం,  రెండోవాడు  మూడోవంతు,  మూడోవాడు  తొమ్మిదో  వంతు  పెట్టుబడిగా  పెట్టారు.  వాటిని  వాళ్ళు ఆ  ప్రకారంగానే  పంచుకోవాలనుకున్నారు.  దానిప్రకారం  కొన్న గాడిదలలో  సగం  మొదటి వాడికి,  మూడో వంతు  రెండో  వాడికి,   తొమ్మిదవ వంతు  మూడవ వాడికీ  రావాలి.

అలా చూస్తే  మొదటి వ్యక్తి కి (ఎనమిదిన్నర)  8 1/2  గాడిదలు,  రెండవ అతనికి   5 2/3   (ఐదూరెండూ బై మూడు  గాడిదలు),  మూడో అతడికి   1 8/9 (ఎనిమిదీ బై తొమ్మిది  గాడిదలు)   రావాలి.   ఇలాంటి పంపకం  సాధ్యం కానిది. గాడిదలను ముక్కలుగా కోసి తీసుకోవడం  వాళ్ళకి  నచ్చలేదు.   పరిష్కారంకోసం  కాజీ  దగ్గరకు  వెళ్ళారు  వాళ్ళు.

కాజీ కి ఎంతగా  ఆలోచించినా పరిష్కారం తట్టలేదు.  ఆ సమస్య   కు  మౌల్వీ నసిరుద్దీన్ మాత్రమే  పరిష్కారం  చూపగలడు  అనుకుని  నసిరుద్దీన్ కి  కబురు చేసాడు.

నసిరుద్దీన్  తన  గాడిదను  ఎక్కి   అక్కడికి  వచ్చాడు.  వాళ్ళు చెప్పింది,   కలిగిన   సమస్య  అంతా విని.  ఆ  పదిహేడు  గాడిదలకు  తన  గాడిదను  కలిపి  పంపకం  మొదలెట్టాడు.   అతడి  గాడిదతో  కలిపి  అవి  పద్దెనిమిది  అయ్యాయి (18).  వాటిల్లో  సగం   తొమ్మిది  (9)  గాడిదలను  మొదటి వాడిని  తీసుకోమని  చెప్పాడు.

సాబ్ మీ  గాడిద  మాకు ఇవ్వడమేమిటి?  మా సమస్య కోసం మీరు గాడిదను  పోగొట్టుకోవటం  మాకు  ఇష్టం లేదు  అన్నారు  ఆముగ్గురూ.

నా గాడిదను  ఇచ్చేంత తెలివితక్కువ వాడిని  కాను.  మీరు ముందు మీ వాటాలు తీసుకొండి  అంటూ  ఇలా పంపకం  చేశాడు.

మొదటి వాడు సగం  డబ్బు  పెట్టేడు గనుక  ఉన్న మొత్తం  గాడిదలలో  సగం  వాడికి  రావాలి.  మొత్తం  18  గాడిదలలో  సగం  9  వాడికి.

రెండో వాడికి  మూడో వంతు వాటా రావాలి  అంటే    18 గాడిదలలో  మూడోవంతు  6  కనుక  వాడికి   6 గాడిదలు  ఇచ్చేశాడు.

ఇక చివరి వాడి పెట్టుబడి  తొమ్మిదో  వంతు.  మొత్తం  గాడిదలలో  తొమ్మిదో వంతు రావాలి.  18  లో తొమ్మిదో వంతు  2  కనుక  2  గాడిదలు  అతడికి  ఇచ్చేశాడు.

అలా  మొదటి వాడికి 9   రెండోవాడికి   6  మూడోవాడికి  2  మొత్తం   కలిపితే 17   గాడిదలు  లెక్క సరిగ్గా సరిపోయింది.  అందరూ తమకు రావలసిన  దానికంటే  ఎక్కువే  వచ్చిందని  ఆనంద పడ్డారు. గాడిదలను  ముక్కలు  చేసే పని లేనందుకు  హమ్మయ్య అనుకున్నారు.

అలా  అందరికీ  పంచగా  చివరికి  మిగిలిన  తన  గాడిదపై  ఎక్కి నసీరుద్దీన్  వెళ్ళాడు.

No comments:

Post a Comment