Pages

Monday, September 10, 2012

తండ్రికిచ్చిన మాట!


మేఘాలయలోని స్మిత్‌ అనే చిన్న పట్టణంలో ఒక వ్యాపారి చిన్న దుకాణం పెట్టుకుని జీవయాత్ర సాగించేవాడు. అతని కొడుకు బాయెన్‌ మంచి స్వభావం కలవాడు. తండ్రి పట్ల అమితమైన ప్రేమ కనబరచేవాడు. అయితే, తల్లి లేని బిడ్డ అని తండ్రి అతిగారాబం చూపడం వల్లనో ఏమో అతడు కాస్త అమాయకంగా కనిపించేవాడు. ఏ విషయంలోగాని త్వరలో ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు. వర్తకుడు వృద్ధాప్యంలో అడుగుపెట్టాడు.
 
తను ఇక ఎంతకాలమో బతకలేనని గ్రహించి, తన తదనంతరం కొడుకు ఎలా బతుకుతాడో ఏమోనని దిగులు పడసాగాడు. అతడు ఒకనాడు కొడుకును చేర బిలిచి, ``నాయనా, బాయెన్‌, నేను ఇక ఎన్నాళ్ళో బతకను. నా తరవాత నువ్వే మన దుకాణాన్ని నడపాలి. శ్రద్ధగా, కష్టపడితే తప్ప నీ కుటుంబానికి సరిపడా ఆదాయం రాదు. నేనిచ్చే మూడు సలహాలనూ పాటిస్తానని నాకు మాట ఇవ్వాలి,'' అన్నాడు. ``తప్పకుండా నాన్నా, ఏం చెయ్యాలో సెలవివ్వండి,'' అన్నాడు బాయెన్‌ వినయంగా. ``మొదటిది, నువు్వ ఇంటి నుంచి దుకాణానికి ఎండలో నడవ కూడదు.
 
రెండవది, నువు్వ రోజూ అన్నం మాత్రమే తినాలి. మూడవది నువు్వ పెళ్ళి చేసుకునేప్పుడు వారానికొక కొత్త భార్యను తెచ్చుకోవాలి,'' అన్నాడు తండ్రి. బాధ్యతాయుతమైన కొడుకుగా, బాయెన్‌ తండ్రికి ఆ మూడు సలహాలనూ పాటిస్తానని మాట ఇచ్చాడు. ``నేను నువు్వ చెప్పినట్టే తప్పకుండా నడుచుకుంటాను నాన్నా. అయినా, అవి నాకెలా ఉపయోగపడగలవన్నదే అర్థం కావడం లేదు,'' అన్నాడు తండ్రితో. ``ఆ సంగతి కాలమే నీకు చెబుతుంది. విచారపడవద్దు,'' అన్నాడు తండ్రి. ఆ తరవాత వర్తకుడు చాలా రోజులు బతకలేదు. ఒక నాటి సాయంకాలం దుకాణం నుంచి తిరిగి రాగానే కన్నుమూశాడు. బాయెన్‌ తండ్రికి అంత్యక్రియలు సక్రమంగా జరిపించాడు.

ఆ పమ్మట తండ్రికి చేసిన వాగ్దానాలు అతనికి గుర్తుకు వచ్చాయి. ఇంటికీ దుకాణానికీ మధ్య ఎండలో నడవకు, అన్నాడు నాన్న. ఇందులో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? దుకాణం ఇంటికి అట్టే దూరంలో లేదు. అందువల్ల ఈ మధ్య దూరానికి పందిరి వేయించాడు. పందిరి ఎండ పడకుండా నీడనిస్తోంది గనక, అతడు ఎండలో నడవవలసిన అవసరం లేకుండా పోయింది. పందిరి నిర్మించడానికి బోలెడు ఖర్చయింది.
 
వృథా ఖర్చు చేస్తున్నావని బాయెన్‌ మిత్రులు అతణ్ణి హేళన చేశారు. ``అయినా, నేను తండ్రికి మాట ఇచ్చాను కదా?'' అన్నాడు బాయెన్‌. ఆ తరవాత అతనికి రెండవ సలహా గుర్తుకు వచ్చి, అన్నం మాత్రం తినడం పెద్ద కష్టమైన పనేమీ కాదనుకున్నాడు. అయితే, రోజూ అన్నమే తినడంవల్ల కొన్నాళ్ళకు మొహం మొత్తడం ఆరంభమయింది. మిత్రులు కొన్ని సందర్భాల్లో బాయెన్‌ను తమ ఇళ్ళకు భోజనానికి పిలిచేవారు. అయితే బాయెన్‌ వెళ్ళేవాడు కాదు. ``ఒకవేళ వాళు్ళ అన్నం కాకుండా మరేదయినా వడ్డిస్తే! నేను నా తండ్రికిచ్చిన మాట తప్పినవాణ్ణి అవుతాను కదా?'' అనుకుని ఇంటిపట్టునే భోజనం చేసేవాడు.
 
అయినా ఆ సంగతి అతడు మిత్రులకు చెప్పేవాడు కాదు. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల తండ్రులు కొందరు బాయెన్‌నుకు తమ కూతురునిచ్చి పెళ్ళి చేస్తే బావుంటుందని ఆశించారు. కాని అలా వచ్చేవారితో బాయెన్‌, ``నేను మీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటాను. అయితే, ఆమె ఒక వారం మాత్రమే నా భార్యగా ఉండగలదు,'' అని నిబంధన విధించేవాడు. దాంతో వాళు్ళ పట్టరాని కోపంతో తిరిగి వెళ్ళేవారు. బాయెన్‌ వింత నిబంధన వినడంవల్ల ఎవరూ పెళ్ళిప్రతిపాదనతో అతడి దరిదాపులకు వచ్చేవారు కారు.
 
మరి కొందరు అతన్ని గురించి చెప్పుకుని పరిహాసంతో నవు్వకునేవారు. బాయెన్‌ వింత నిబంధన గురించి విన్న మార్యం అనే ఒక యువతి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తాను బాయెన్‌ను వివాహ మాడతానని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.

ఆ మాట విన్న తల్లిదండ్రులు హడలిపోయి, ``ఒక వారం తరవాత అతడు నిన్ను తరిమేస్తే ఏమవుతుందో ఆలోచించావా? మూర్ఖంగా మాట్లాడకు. నీకు వేరొక వరుణ్ణి చూస్తాం,'' అన్నారు. ``అతడు నన్ను పంపలేడు, మీరే చూస్తారు కదా. కాస్త ఓపిక పట్టి నేను చెప్పినట్టు చేయండి,'' అన్నది మార్యం అచంచలమైన విశ్వాసంతో. ఆ తరవాత ఆమె తల్లిదండ్రులు బాయెన్‌ వద్దకు వెళ్ళి తమ కూతురును వచ్చి చూడమని ఇంటికి ఆహ్వానించారు.
 
బాయెన్‌ మార్యంను చూసి ఆమె అందచందాలకూ, ఆహ్లాదకరమైన ప్రవర్తనకూ ముగ్థుడయ్యాడు. అతడు చాలా నిజాయితీ పరుడు గనక, తాను తండ్రి కిచ్చిన మాట గురించి వివరించి, ``వాటిని నేనెన్నటికీ జవదాటను,'' అన్నాడు. ``ఆ సంగతి నాకూ తెలుసు. విచారించకు,'' అన్నది మార్యం చిన్నగా నవు్వతూ. పెళ్ళి ఘనంగా జరిగింది. బాయెన్‌ స్నేహితులందరూ పెళ్ళికి వచ్చారు. మార్యం తల్లిదండ్రులు గొప్ప విందు ఏర్పాటు చేశారు.
 
ఆచారం ప్రకారం విందు పూర్తి అయిన వెంటనే బాయెన్‌ పెళ్ళికూతురును తమ ఇంటికి తీసుకు వెళ్ళాలి. అతని మిత్రులు వధూవరుల వెంట కొంత దూరం వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి సాగనంపారు. ``అతడు వారంలో ఆమెను వెంటబెట్టుకుని తిరిగి వస్తేనే చిక్కంతా,'' అని తమలో తాము మాట్లాడుకుంటూ తమ ఇళ్ళకు బయలుదేరారు. కొత్త దంపతులు అనురాగంతో అన్యోన్యంగా వారం రోజులు గడిపారు. మార్యం భర్త మీద అమిత ప్రేమను కనబరిచింది. ఏడవ రోజు సాయంకాలం దుకాణం నుంచి హడావుడిగా ఇంటికి వచ్చిన బాయెన్‌ అశాంతితో కనిపించాడు.
 
మార్యం ఆ విషయం గమనించింది. అయినా, ఏమీ ఎరగనట్టు ఇంటి పనులు చేసుకోసాగింది. ``రేపే నేను ఈమెను పంపెయ్యాలి. తండ్రికిచ్చిన మాటను ఎలా తప్పగలను?'' ఈ ఆలోచన బాయెన్‌కు రాత్రంతా నిద్రపట్టకుండా చేసింది. మరునాడు తెల్లవారగానే అతడు బయలుదేరుతూ, ``మార్యం, నువ్వింకా సిద్ధం కాలేదా?'' అని అడిగాడు. ``ఈ రోజు నేను ఎక్కడికీ వెళ్ళడం లేదే,'' అన్నది మార్యం అమాయకంగా. ``నిన్ను నేను ఈరోజు మీ ఇంటికి తిరిగి పంపించాలి. అది నేను నా తండ్రి కిచ్చిన మాట అన్న సంగతి నీకు తెలిసిందే కదా? నేను దాన్ని తప్పలేను,'' అన్నాడు బాయెన్‌.

``మీ నాన్న చాలా తెలివైన వర్తకుడు. నీ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలవాడు. అవునా? అలాంటి పెద్దమనిషి నిన్ను చూసి ఊరంతా నవు్వకునే విధంగా నిన్ను ప్రవర్తించమనే సలహాలు ఇచ్చి ఉంటాడంటావా?'' అన్నది మార్యం. ``ఏమిటి నువ్వంటున్నది? మా తండ్రిఇచ్చిన మూడు సలహాల గురించేనా?'' అని అడిగాడు బాయెన్‌ అమాయకంగా. ``అవును. ఆయన ఇచ్చిన మొదటి సలహా నువు్వ దుకాణానికి ఎండలో నడవకూడదు అన్నది.
 
అంటే, సూర్యోదయం ముందే వెళ్ళి దుకాణం తెరిచి, శ్రద్ధగా వ్యాపారం చూసుకుని సూర్యుడు అస్తమించాక ఇంటికి రమ్మని చెప్పడం ఆయన ఉద్దేశం. నువ్వేం చేశావు? ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఇంటి నుంచి దుకాణం నరకు పందిరి వేయించావు. ఎంత తెలివిమాలిన పని చూశావా?'' అన్నది మార్యం. ``ఇక రెండో సలహా, అన్నం మాత్రమే తినమనడం. అవునా? అవసరమైనంత వరకు మాత్రమే తిని, ఆడంబరాలకు పోయి ఆరోగ్యం పాడుచేసుకోకుండా ఉండాలన్నది మీ తండ్రి అభిప్రాయం.
 
అయితే, నువు్వ ఏం చేశావ్‌? స్నేహితులు భోజనానికి పిలిచినా వెళ్ళకుండా ఇంటి దగ్గరే కూర్చున్నావు. నీ ప్రవర్తన చూసి నీ తండ్రి ఆత్మ శాంతిస్తుందంటావా?'' అన్నది మార్యం. ఇక తండ్రి ఇచ్చిన మూడో సలహాను గురించి మార్యం ఏం వివరణ ఇస్తుందోనని ఆతృతగా ఎదురు చూడసాగాడు బాయెన్‌. ``నువు్వ నీ భార్యను ఎల్లప్పుడూ ప్రేమానురాగాలతో చూసుకోవాలన్నదే నీ తండ్రి మూడవ కోరిక.
 
ఈ వారం రోజులు కొత్తగా వచ్చిన నన్నెంత ఆప్యాయంగా చూసుకున్నావు? జీవితాంతం అలాగే చూసుకోవాలి. ఆలుమగలు మాయని మమకారంతో కలిసిమెలిసి చివరిదాకా జీవించాలన్నదే మా మామగారు ఇచ్చిన మూడవ సలహాలోని అంతరార్థం!'' అన్నది మార్యం గంభీరంగా. బాయెన్‌ పట్టరాని ఆనందంతో నవు్వతూ, భార్యకు మరింత దగ్గరగా వెళ్ళి, ``నువ్వింత వివేక వంతురాలివని నేను ఊహించ లేదు. ఇక, నేను నిన్ను మీ ఇంటికి తిప్పి పంపే ప్రసక్తే లేదు. నా ప్రియమైన ఇల్లాలుగా నువు్వ జీవితాంతం నాతోనే ఉండాలి,'' అన్నాడు.

No comments:

Post a Comment