Pages

Monday, September 10, 2012

గురువు సలహా


కనకపురంలోని భాస్కరుడు, శ్రీధరుడు బాల్యమిత్రులు. ఇద్దరూ నిత్యానందుడి గురకులంలోనే విద్యనభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక భాస్కరుడు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. శ్రీధరుడు తండ్రి నడుపుతూన్న బట్టల వ్యాపారాన్ని చేపట్టి సమర్థతో నడుపుతున్నాడు. పెళ్ళిళు్ళ చేసుకుని పిల్లలు కలిగాక కూడా, ఇద్దరూ తరచూ కలుసుకుంటూ మంచీ చెడూ మాట్లాడుకునేవారు.
 
భాస్కరుడిది చాలా ముక్కుసూటి మనస్తత్వం. సమయపాలన అతనికి ప్రాణంతో సమానం. క్రమ శిక్షణ పాటించని విద్యార్థులను గోడకుర్చీ వేయమనీ, బడిచుట్టూ పరుగులు తీయమనీ కఠినంగా శిక్షించేవాడు. తను సత్ప్రవర్తనతో నడుచుకోవడమే కాకుండా ఇంటా బయటా అందరూ తనలాగే నడుచుకోవాలని ఆశించేవాడు.
 
అలా నడుచుకోని వాళ్ళనుమొహం మీదే విమర్శించేవాడు. అందువల్ల అతనికి రోజు రోజుకూ మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ కాసాగారు. శ్రీధరుడు చాలా సున్నిత స్వభావుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనేవాడు కాడు. ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్టు గుంభనగా కనిపించేవాడు. అలాంటి వాడికి ఉన్నట్టుండి జబ్బు చేసిందని తెలిసి, భాస్కరుడు చూడడానికి వెళ్ళాడు.
 
మిత్రుణ్ణి తీసుకుని, తాము చదువుకున్న గురుకులాశ్రమానికి ఆనుకునివున్న నిత్యానందుడి వైద్యనిలయానికి వెళ్ళాడు. గురువు నిత్యానందుడు గురుకుల పాఠశాలతో పాటు ప్రకృతి వైద్య నిలయం కూడా నెలకొల్పి నడుపుతున్నాడు. శ్రీధరుడికి స్వయంగా నాడీ పరీక్ష చేసి చూసిన నిత్యానందుడు, ``నీకు పెద్ద జబ్బేమీ లేదు. కావలసిందల్లా ప్రశాంతమైన మనస్సు మాత్రమే,'' అన్నాడు.

``మిన్ను విరిగి మీద పడ్డా చలించని మనస్తత్వం కదా శ్రీధరుడిది! అతనికి శాంతికి ఏమి కొరత?'' అన్నాడు భాస్కరుడు ఆశ్చర్యంగా. ఆ మాటకు నిత్యానందుడు చిన్నగా నవ్వి, ``ఎదుటి వారికి అలా కనిపిస్తాడేమో గాని, లోలోపల ప్రతి చిన్న విషయానికీ బాధ పడుతూ ఉంటాడనుకుంటాను,'' అని, ``అవునా?'' అంటూ శ్రీధరుడికేసి చూశాడు.
 
శ్రీధరుడు మౌనంగా ఊరుకున్నాడు. ``నేనిచ్చే లేహ్యాన్ని రాత్రిపూట పడుకునే ముందు ఆవుపాలు అనుపానంతో ఒక మండలం పాటు సేవించు. పొద్దస్తమానం బట్టల దుకాణంలో కూర్చోకుండా వేరే ఏదైనా ఒక వ్యాపకం అలవాటు చేసుకో. వీలైతే, నీ పర్యవేక్షణలో ఒక ఉద్యానవనంనాటి, ఉదయం, సాయంకాలం కొంతసేపు అక్కడి చల్లగాలిలో తిరిగిరా.
 
నీకు సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది,'' అంటూ నిత్యానందుడు లేహ్యం ఇచ్చాడు. సరేనని శ్రీధరుడు మిత్రుడితో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు. మండలం రోజులు పూర్తయ్యాక శ్రీధరుడు గురువు వద్దకు వెళ్ళాడు. నాడీపరీక్ష చేస్తూ నిత్యానందుడు, ``ఇప్పుడు ఆరోగ్యం మెరుగు పడింది కదా?'' అని అడిగాడు. ``చాలా వరకు ఫరవాలేదు,'' అన్నాడు శ్రీధరుడు. ``ఈ లేహ్యాన్నే మరో మండలం పాటు వాడాలి. అది సరే, ఉద్యానవనం పని ఎంతవరకు వచ్చింది?'' అని అడిగాడు గురువు. ``ఫల వృక్షాలతో, పూల మొక్కలతో ఉన్న పెరటి తోటనే ఉద్యానవనంగా తీర్చిదిద్దాను గురువర్యా,'' అన్నాడు శ్రీధరుడు.

``చాలా సంతోషం. రోజూ చల్లగాలిలో పచార్లు చేస్తున్నావు కదా?'' అని అడిగాడు గురువు. ``క్రమం తప్పకుండా చేస్తున్నాను. వీలైనప్పుడు తమరు ఒకసారి విచ్చేసి, నా ఉద్యానవనాన్ని తిలకిస్తే బావుంటుంది,'' అన్నాడు శ్రీధరుడు వినయంగా. ``తప్పకుండా వస్తాను.
 
ఈ రోజు అమావాస్య కదా? రాబోయే పౌర్ణమికి వచ్చి, నీ ఉద్యానవనాన్ని చూస్తాను,'' అన్నాడు గురువు చిన్నగా నవు్వతూ. గురువు వద్ద సెలవు తీసుకుని బయలుదేరిన శ్రీధరుడు, ఆయన ఉద్యానవనం చూడడానికి వస్తూన్న సంగతి భాస్కరుడికి చెప్పాడు. పౌర్ణమినాటి ఉదయమే నిత్యానందుడు ఉద్యానవనం చూడడానికి వచ్చాడు.
 
మిత్రులిద్దరూ గురువుకు స్వాగతం పలికి, సాదరంగా ఆయన్ను తీసుకు వెళ్ళి ఉద్యానవనాన్ని చూపారు. పచ్చటి చెట్లతో, రంగురంగుల పూలతో అందంగా ఉన్న ఉద్యానవనాన్ని ఆనందంతో తిరిగి చూసిన నిత్యానందుడు, ``ఉద్యానవనం బావుంది. అయినా, పసిడిగాలి వీచడం లేదెందుకని?'' అని అడిగాడు శిష్యులను.
 
ఆ ప్రశ్న అర్థం కాక మిత్రులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ``చెట్ల నుంచి రాలిన పండుటాకులను ఒక్కటి కూడా లేకుండా ఏరి పారేశారెందుకని? ఎండుటాకుల మీదుగా వీచే పసిడి గాలి తోటకు మరింత శోభను సమకూర్చడం మీరెప్పుడూ చూడలేదా?'' అని అడిగాడు గురువు ఆశ్చర్యంగా.

మిత్రులిద్దరూ ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు గురువు మళ్ళీ, ``పచ్చటి చెట్లతో పాటు, రంగు రంగుల పువు్వలు, పండుటాకులు కూడా కలిగినదే ఉద్యానవనం. అవునా?'' అని అడిగాడు. మిత్రులిద్దరూ, ``అవును,'' అన్నట్టు తలలు ఊపారు. ``ప్రపంచం కూడా అంతే. మంచీ, చెడూ రెండూ ఉంటాయి.
 
విభిన్న మనస్తత్వాలు కలిగిన వారుంటారు. పుట్టిపెరిగిన పరిసరాలు, పెంపకం, చదువు సంధ్యలు మొదలైన వాటిని అనుసరించి వారి వారి ప్రవర్తన ఉంటుంది. నా శిష్యులైన మీరు మంచి వాళు్ళగా బాధ్యతనెరిగి నడుచుకోవడం నాకెంతో గర్వంగా ఉంది,'' అంటూ గురువు భాస్కరుడి కేసి తిరిగి, ``నువు్వ ఆదర్శ భావాలు కలవాడివే. అయితే, ప్రతి ఒక్కరూ నిన్ను పోలి ఉండాలనుకోవడం, అలా లేనివారితో విరోధం పెంచుకోవడం వివేకం కాదు,'' అన్నాడు.
 
ఆ తరవాత ఆయన శ్రీధరుడి కేసి చూస్తూ, ``చాలా సౌము్యడని పదిమందిలో పేరు తెచ్చుకుంటున్నావు. చాలా సంతోషం. అయితే, నచ్చని వారి పట్ల కలిగే అసంతృప్తినీ, ఆవేదననూ లోలోపల అణుచుకుంటూ అశాంతితో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం భావ్యం కాదు కదా!'' అన్నాడు.
 
 ఆ తరవాత శిష్యులిద్దరినీ ఆప్యాయంగా వెన్ను చరిచి, ``మీరు మంచివారుగా ఉంటూ, చుట్టూ ఉన్న వారిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించండి. అంతేగాని, అహర్నిశలూ ఎదుటివారిని గురించి ఆలోచిస్తూ, అనవసరంగా ఆవేశ పడుతూ పండంటి జీవితాలను వృథా చేసుకోకండి.
 
నా శిష్యులైన మీ ఇద్దరి మనస్తత్వాలలోనే ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించి చూడండి,'' అని సలహా ఇచ్చి వెళ్ళాడు. ఆ క్షణం నుంచి మిత్రులిద్దరూ గురువు సలహాను పాటించసాగారు. అతి త్వరలోనే శ్రీధరుడు ఆరోగ్యం పుంజుకున్నాడు. భాస్కరుడు అందరిచేతా మంచి స్నేహితుడనిపించుకున్నాడు.

No comments:

Post a Comment