Pages

Monday, August 13, 2012

నిజమైన స్నేహితుడు

అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేరులు రాముడు, రంగడు. ఆ ఊరిలో వారు అందరూ రాముడు, రంగడి స్నేహము చూసి స్నేహం అంటే ఇలా ఉండాలి. స్నేహితులు అంటే రాముడు, రంగడిలా ఉండాలి అని అనుకునే వారు. ఊరిలో వారు అనుకున్నట్టుగానే వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. అంతేకాదు ఏపని చేసినా కలిసే చేసే వారు.

స్నేహితులిద్దరూ ఒకసారి వ్యాపారం నిమిత్తం పట్టణానికి బయలు దేరారు. అప్పటి రోజులలో నేడు మనకు ఉన్నన్ని ప్రయాణ సాధనాలు లేవు. అంతేకాదు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లాలన్నా లేక పట్టణానికి వెళ్లాలన్నా మధ్యలో వచ్చే అడవిని దాటి వెళ్లాల్సి వస్తూ ఉండేది. పట్టణానికి బయలుదేరిన వారు అడవి దాటుతుండగా దారిలో వారికి ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది.

ఎలుగుబంటిని చూసి స్నేహితులు ఇద్దరూ భయపడ్డారు. దానినుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలో వారికి అర్థంకాలేదు. ఎలుగు బంటి నుంచి తమను తాము రక్షించుకోవడానికి పరుగు లంఘించుకున్నారు. వీరు పరిగెత్తుతుంటే ఎలుగుబంటి వీరిని వెంబడించసాగింది. అలా పరిగెత్తి వారు ఒక చెట్టు వద్దకు చేరారు. వారిలో రంగడికి చెట్లు ఎక్కడం వచ్చు. కానీ రాముడికి చెట్టు ఎక్కడం రాదు. అక్కడికీ చెట్టు ఎక్కేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ చెట్లు ఎక్కిన అనుభవం లేకపోవడం వల్లనూ, చెట్లు ఎక్కడం రాకపోవడం వల్లనూ రాముడు క్రిందపడిపోయాడు.

ఈ విషయం రంగడికి తెలిసినా స్నేహితుడిని అలాగే వదిలేసి తను మాత్రం తన ప్రాణం కాపాడుకునేందుకు గబగబా చెట్టు ఎక్కేసాడు. స్నేహితుడిని అతని కర్మకే వదిలేసాడు తప్ప చెట్టేక్కేందుకు రాముడికి ఎలాంటి సహాయం చేయకుండా చెట్టు మీద నుంచి ఏం జరుగుతుందా అని కుతూహలంతో చూస్తూ కూర్చున్నాడు. రాముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరూ కలిసి ఎదిరిస్తే ఎలుగుబంటి తోకముడిచి పారిపోయేది. కానీ రంగడు కేవలం తన ప్రాణం కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నించాడు తప్ప స్నేహితుడి గురించి అలోచించలేదు.

ఇద్దరిలో ఒకరు చెట్టు ఎక్కేసరికి ఎలుగుబంటి దృష్టి రాముడు మీద పడింది. వెంటనే అది రాముడి వైపుకు రాసాగింది. రాముడికి ఏం చేయాలో తోచలేదు. ఒక ప్రక్కన ఎలుగుబంటి తన వైపు వచ్చేస్తోంది. మరో ప్రక్క తను ప్రాణస్నేహితుడు అని అనుకున్నవాడు చెట్టు మీద నుంచి చూస్తూ ఉండిపోయాడు తప్పితే తనకు ఎలాంటి సహాయం చేయడం లేదు.

అంతే ఎలుగుబంటి రాముడి దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక హఠాత్తుగా నేల మీద పడిపోయాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చేసరికి చచ్చినవాడిలా ఊపిరి బిగపెట్టాడు.

ఎలుగుబంటి రాముడి దగ్గరకు వచ్చింది. రాముడ ిచుట్టూ తిరుగుతూ అతనిని వాసన చూసింది. రాముడు చనిపోయాడని తలచి తన దారిన తను వెళ్లిపోయింది. ఎలుగుబంటి పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక అప్పుడు నేలమీద శవంలా పడుకున్న రాముడు లేచాడు ఈలోగా చెట్టు ఎక్కిన రంగడు కూడా చెట్టు దిగి వచ్చాడు.

"రాముడూ! ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పింది కదా! ఏం చెప్పింది?" ఎంతో ఆత్రుతగా అడిగాడు రంగడు.

"అవును చెవిలో చెప్పింది" అన్నాడు రాముడు.

"ఏం చెప్పింది?" మరింత ఆత్రుతగా అడిగాడు రంగడు.

"ఆపదలో ఉన్న మిత్రునికి సహాయ పడని వానితోను. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు అతనిని అతని కర్మకు వదిలి తన మేలు చూసుకునే వానితోను స్నేహం చేయవద్దని అతను నిజమైన స్నేహితుడు కాడని చెప్పింది" అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు రాముడు.       

No comments:

Post a Comment