Pages

Saturday, September 15, 2012

పరుసవేది


భూషయ్య, రంగమ్మల ఒక్కగానొక్క కొడుకైన చంద్రం చాలా తెలివైనవాడేగాక, చురుకైనవాడు కూడా. తండ్రి భూషయ్య మంచి మనిషిగా పేరుతెచ్చుకున్న బట్టల వ్యాపారి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయూలు, భాగస్వాముల ద్రోహం కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లింది. ఆ విచారంతో మంచం పట్టిన భూషయ్య కోలుకోలేక రెండేళ్ళ క్రితం మరణించాడు.
 
మిగిలివున్న కొద్దిపాటి ఆస్తిని, ఆయన చేసిన అప్పులు తీర్చడానికి అమ్మవలసి వచ్చింది. దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటి నుంచి బతుకుతెరువుకోసం ధనికుల ఇళ్ళల్లో పాచిపనులు చేయవలసి వచ్చింది. కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయూలన్నదే ఆమె లక్ష్యం. అయితే, పదమూడవయేట అడుగుపెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల ఇళ్ళల్లో పనిచేయడం చిన్నతనంగానూ, తీరని అవమానంగానూ తోచింది.
 
ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగవులాడుతూ, ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. తనకు తండ్రిలేకపోవడం, గౌరవంగా బతకడానికి తగినంత డబ్బులేకపోవడం పెద్ద లోటుగా భావించి బాధపడేవాడు. అప్పటికప్పుడు ధనవంతుడై పోవడానికి మార్గమేదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చుననీ, దానిని పరుసవేది అంటారనీ ఆ విద్య బైరాగులకూ, యోగులకూ తెలుసుననీ ఎవరో అనుకుంటూండగా విన్నాడు.

ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకుని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసిమనసులో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ళవెంట తిరిగేవాడు. కానీ వాళ్ళెవరూ పరుసవేది తెలిసినవాళ్ళు కారు. కొంతమంది సాధువులు తాము అన్నీ త్యజించినవాళ్ళమనీ తమకు బంగారంతో పని ఏముందనీ ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని.
 
మరి కొంతమంది అటువంటి విద్యలు లేవనీ, అయినా చిన్న పిల్లలు వాటిని గురించి ఆలోచించకూడదనీ మందలించేవారు. ఎవరెన్ని చెప్పినా చంద్రంలో మార్పురాలేదు. రంగమ్మకు కొడుకు విషయం అంతుపట్టకుండా పోయింది. ఒకనాడు రాత్రి భోజనానికి కూర్చున్న చంద్రానికి కంచంలో అన్నం పెడుతూ, ‘‘ఈ రోజు బడికి రాలేదని పంతులుగారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళావేంటి?'' అని అడిగింది రంగమ్మ. చంద్రం సమాధానం చెప్పకపోయేసరికి, రంగమ్మ మళ్ళీ ఒకసారి అదే ప్రశ్న అడిగింది.
 
దాంతో కోపగించుకున్న చంద్రం చివాలున లేచి, చేయికడుక్కుని ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు. ఏం చెప్పడానికీ తోచక రంగమ్మ లోలోపల దిగులుతో కుమిలిపోసాగింది. చంద్రం కొంతసేపు అటూ ఇటూ తిరిగి, గ్రామదేవత ఆలయం అరుగు మీద పడుకుని, కొంతసేపటికి అలాగే నిద్రపోయూడు. అర్ధరాత్రి సమయంలో ఏవో మాటలు వినిపించడంతో చంద్రం మేలుకుని పక్కకు తిరిగి చూశాడు. ఒక బైరాగి పద్మాసనం వేసుకుని కూర్చుని, ఏవో మంత్రాలు పైకి వినిపించేలా ఉచ్ఛరిస్తున్నాడు.
 
చంద్రం లేచి మెల్లగా వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. కళ్ళు తెరిచిన బైరాగి, ‘‘నువ్వు చంద్రానివి కదూ,'' అంటూ పలకరించి, వాణ్ణి గురించిన అన్ని విషయూలూ చెప్పాడు. చంద్రానికి ఆశ్చర్యం వేసింది. వాడు అందరు సాధువులను అడిగినట్టే బైరాగిని కూడా, ‘‘మీకు పరుసవేది తెలుసా?'' అని అడిగాడు. బైరాగి తెలుసు అన్నట్టు తల ఊపాడు. చంద్రానికి పట్టరాని సంతోషం కలిగింది. తాను కూడా వెంటవస్తాననీ, తనకు పరుసవేదిని నేర్పమనీ బైరాగిని ప్రార్థించాడు. అందుకు బైరాగి, ‘‘నాయనా, చంద్రం! పరుసవేది అంటే రసశిల.

అది సోకితే ఏలోహ మైనా బంగారంగా మారుతుంది. అది రసవిద్యకు సంబంధించినది. చాలా రహస్యమైనది. దానిని నీకు నేర్పడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే...'' అంటూ ఆగాడు. ‘‘ఏమిటి స్వామీ?'' అని అడిగాడు చంద్రం. ‘‘ఆ రసవిద్యను సాధించడానికి ఎంతో జ్ఞానమూ, పట్టుదలా కావాలి. చాలా శ్రమించాలి,'' అన్నాడు బైరాగి. ‘‘అందుకు నేనేం చేయూలో సెలవివ్వండి,'' అన్నాడు చంద్రం.
 
‘‘జ్ఞానార్జనకు చదువు మీద శ్రద్ధ, పట్టుదల పెంచుకోవాలి. అందివచ్చిన ప్రతి మంచి అవకాశాన్నీ శ్రద్ధాసక్తులతో వినియోగించుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. అన్నిటికీ మించి అహర్నిశలు నీకోసమే శ్రమిస్తూన్న మీ తల్లికి సాయపడాలి. రసవిద్యను సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి ఉంటుంది గనక, దీక్షతో శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలి. క్రమశిక్షణ కావాలి.
 
నేను ఒక సంవత్సరం తరవాత వచ్చి, నువ్వు సమర్థుడవని అనిపించినప్పుడు నిన్ను వెంటబెట్టుకు వెళ్ళి పరుసవేది విద్యను నేర్పుతాను,'' అని చెప్పి వెళ్ళిపోయూడు బైరాగి. తెల్లవారేసరికి చంద్రం ఒక నిర్ణయూనికి వచ్చాడు. తల్లి వచ్చేసరికి బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యూడు. రంగమ్మ ఆనందానికి అవధులు లేవు. చంద్రానికి మొదట్లో కొంచెం కష్టమనిపించినా క్రమక్రమంగా చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాడి ధ్యాసంతా చదువు మీదే.

తల్లి, బడిపంతులు, సహవిద్యార్థులు అందరూ అతణ్ణి మెచ్చుకోసాగారు. చంద్రం మనసులో స్వశక్తితో అన్నీ సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం వేళ్ళూనింది. అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అనుకున్నట్టే సంవత్సరం తిరిగేసరికి ఒక రోజు పట్టపగలే చంద్రం ఇంటికి వచ్చిన బైరాగి, ‘‘పరుసవేది నేర్పుతాను, నాతో రా,'' అన్నాడు. ‘‘నాకిప్పుడు పరుసవేది మీద ఆసక్తిలేదు,'' అన్నాడు చంద్రం వినయంగా.
 
అయితే బైరాగి, ‘‘ఇంతకాలం నీకోసమే కాచుకున్నాను. ఇప్పుడు రానంటే ఎలా?'' అని గద్దించాడు. ‘‘క్షమించండి. నేను రాలేను,'' అన్నాడు చంద్రం దృఢమైన కంఠస్వరంతో. బైరాగి మందహాసం చేసి, ‘‘నాయనా చంద్రం! నీలో విద్యార్జన పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయి. ఆత్మవిశ్వాసం ఏర్పడింది. కనుకనే పరుసవేదిని వద్దంటున్నావు. నీలో ఇలాంటి మంచి మార్పు రావాలనే, నేను ఆశించాను. విద్యకన్నా మించిన ధనం లేదు. స్వయంకృషితో సాధించుకున్నదాని విలువ చాలా గొప్పది.
 
ప్రతి మనిషిలో మామూలు లోహాల్లా ఎన్నో శక్తులు ప్రకాశించకుండా ఉంటాయి. వాటిలో మంచివాటిని గుర్తించి, సానబెట్టి మెరిసే బంగారంలా చేసుకోవాలి. పట్టుదల ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. నాకు తెలిసిన పరుసవేది అదే. మీ నాన్నగారి బాల్యమిత్రుడిగా నేను నీలో కోరుకున్నది కూడా ఈ మంచి మార్పే. మీ నాన్న బాగా బతికినకాలంలో ఆయన సాయం పొందినవాళ్ళల్లో నేనూ ఒకణ్ణి.
 
గత రెండేళ్ళుగా నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాను. నిన్ను సరైన మార్గంలో పెట్టడం నా బాధ్యతగా భావించి బైరాగి వేషం వేశాను,'' అన్నాడు పెట్టుడుగడ్డాన్నీ, జడలజుట్టునూ తీసి పక్కనపెడుతూ. చంద్రం ఆనందాశ్చర్యాలతో ఆయనకేసి చూస్తూండగా, అతడి తల్లి లోపలికి వచ్చి, తన బిడ్డను మంచి మార్గంలో పెట్టిన తన భర్త స్నేహితుడు నారాయణకు కృతజ్ఞతతో నమస్కరించింది.

No comments:

Post a Comment