Pages

Saturday, September 15, 2012

పట్టుబడిన పగడాల దొంగలు!


తెల్లవారక ముందే నిద్రలేచిన అలీ, స్నానం చేసి, టిఫిన్‌ పూర్తిచేసి పుస్తకాల సంచీతో పాఠశాలకు సిద్ధమయ్యూడు. అండమాన్‌ దీవిలో అతడి పాఠశాల ఇంటికి రెండు కి.మీ. దూరంలో ఉన్నది. అయితే, గత పదేళ్ళుగా రోజూ అంత దూరం సులభంగానే వెళ్ళి వస్తున్నాడు అలీ. గ్రామం దాటి సముద్ర తీరం గుండా నడిచివెళితే అతడు చదువుతూన్న పాఠశాల వస్తుంది. అతడు పాఠశాల నుంచి తిరిగి వచ్చేప్పుడు అప్పుడప్పుడూ సముద్ర జలాల అంచుకు వెళ్ళేవాడు. ఒడ్డును సుతారంగా తాకే అలలను ఆసక్తిగా చూసేవాడు.
 
నీళ్ళ అంచున తిరుగాడుతూండే పీతలను వాటి బొరియల్లోకి తరిమేవాడు. గట్టుకు కొట్టుకు వచ్చిన స్టార్‌ఫిష్‌ను వింతగా చూసేవాడు. గవ్వలను ఏరుకునేవాడు. అయినా, కొన్ని వారాల క్రితం కొందరు పర్యావరణ పరిరక్షణాసంస్థ సభ్యులు వచ్చి అలీ తరగతిలోని విద్యార్థులను సముద్ర తీరానికి తీసుకువెళ్ళి సముద్రంలోని జీవరాశులను గురించి వివరించేంతవరకు, వాటిని గురించి అలీకి అంతగా తెలియదు. వాళ్ళు అలీకీ, అతడి మిత్రులకూ సముద్రంలో నివసించే అసంఖ్యాకమైన ప్రాణులను గురించి వివరించారు. వాటిలో చాలావాటిని చూపారు.
 
‘సోర్కెల్‌‌స' సాయంతో, పగడాల గుట్టలనూ, అవి జీవించే విధానాన్నీ చూపారు. పగడాలు సజీవ ప్రాణులని తెలుసుకుని విద్యార్థులు విస్తుపోయూరు. ప్రాణంలేని పెద్ద పెద్ద బండల్లా కనిపించేవి-తాబేటి చిప్పల్లా లోపలి ప్రాణుల్ని కాపాడే అస్థిపంజరాల్లాంటివని తెలుసుకుని అమితాశ్చర్యం చెందారు. రకరకాల పగడాలను, వాటి చుట్టూ నివసించే పేరట్‌ ఫిషస్‌, సముద్రపు అనిమోన్లు, స్టార్‌ఫిష్‌, కొమ్మచేపలు మొదలైన వాటిని చూసి ఆనందాశ్చర్యాలు పొందారు.

అన్నిటికన్నా రంగురంగుల అలంకరణలతో ‘పిక్చర్‌ బుక్‌‌స'లో చూసినట్టున్న బుల్లి ప్రాణులు ‘క్రిస్మస్‌ట్రీస్‌' అలీని ఎంతగానో ఆకర్షించాయి. అవి పగడాలకు ఆనుకుని కనిపించాయి. వాటిని ముట్టుకోబోతే, ప్రమాదాన్ని గ్రహించినట్టు అవి వెంటనే లోపలికి కుంచించుకు పోయూయి! సముద్రంలో నిక్షిప్తమై ఉన్న సహజ సంపదలను గురించి పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులు చెప్పగా విన్న అలీ చాలా గొప్పగా పొంగిపోయూడు.
 
మన దేశంలో ముఖ్యంగా లక్షద్వీప్‌, కఛ్‌ జలసంధి, మన్నార్‌ జలసంధి, అండమాన్‌ నికోబార్‌ దీవులలో పగడాల గుట్టలు ఉన్నాయి. అయితే తరచూ వచ్చే పర్యాటకులు తమ ఇళ్ళల్లో అలంకారవస్తువులుగా ఉపయో గించడానికి వాటిని లాగేసుకోవడం వల్ల; సముద్ర జలాలలోకలిసే, మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయినిక ద్రవ్యాలు, చమురు కాలుష్యాల కారణంగా రోజురోజుకూ ఇవి దెబ్బ తింటున్నాయి. ‘‘మన దీవులు ఉండాలంటే అవి ఉండి తీరాలి.
 
సముద్రం తాకిడి నుంచి అవే మన దీవులను కాపాడుతున్నాయి,'' అని హెచ్చరించాడు ఆరోజు వచ్చిన సంస్థ సభ్యుడు ఒకరు. ఇవన్నీ ఆలోచిస్తూ అలీ సముద్రతీరంలో పాఠశాల కేసి నడుస్తున్నాడు. దూరంలో ఒక తెల్లటి కారు కనిపించింది. ఆ దీవిలో పెద్దగా వాహనాలు లేవు. అలాంటి కారును అతడు అంతకు ముందెన్నడూ చూడలేదు. అలీ మరికొంత ముందుకు వెళితే, ముగ్గురు వ్యక్తులు కారులోకి ఏదో వేగవేగంగా ఎక్కిస్తూండడం కంటబడింది. మరింత దగ్గరికి వెళ్ళాడు అలీ.
 
వాళ్ళు కారులోకి పెడుతున్నది రకరకాల పగడాలని గ్రహించి, ‘‘ఎవరు మీరు? ఏమిటి మీరు చేస్తున్నది?'' అని అడిగాడు ఆతృతగా. ఆ ముగ్గురిలో ఒకడు వెనుదిరిగి, పిడికిలి బిగించి, అలీని డొక్కలో గుద్ది కింద పడదోసి, ‘‘ఏమైతేనీకేం? నీ పని నువ్వు చూడు,'' అంటూ కార్లోకి ఎక్కి మరిద్దరితో కలిసి వేగంగా వెళ్ళిపోయూడు. అలీ లేచి నిలబడి ఒళ్ళుదులుపుకున్నాడు. వెళుతూన్న కారును మరొకసారి పరిశీలనగా చూశాడు. తననింత వరకు ఎవరూ ఇలా కింద పడగొట్టింది లేదు. ఆ అవమానంకన్నా ఎవరో పగడాలను దొంగిలించుకు పోవడం అతడికి మరింత బాధ కలిగించింది. ‘‘వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళను గురించి ఫిర్యాదు చేయూలి. ఫిర్యాదు చేయూలి!'' అనుకుంటూ వెనుదిరిగి తన గ్రామం కేసి శరవేగంతో పరిగెత్తసాగాడు.

ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి, ‘‘అయ్యూ, సకిలు కొంచెం ఇస్తారా. ఇప్పుడే వస్తాను,'' అని అడిగి దుకాణందారు సరేనని తలూపగానే, సైకిలు మీద ఎక్కి వేగంగా పక్క గ్రామం కేసి తన శక్తికొద్దీ వేగంగా సైకిలు తొక్కసాగాడు. ‘‘మన దీవులు ఉండాలంటే పగడాలు ఉండి తీరాలి!'' అన్న మాటలు అతడి మనసులో మాటి మాటికీ ప్రతిధ్వనించసాగాయి. అవి కొన్ని రోజుల క్రితం పర్యావరణ సంరక్షణా సంస్థ సభ్యుడు చెప్పిన మాటలు.
 
అలా నాలుగు కి.మీ. దూరం వెళ్ళి పక్క గ్రామం చేరుకుని అక్కడున్న టెలిఫోన్‌ బూత్‌కు వెళ్ళాడు. ఫోన్‌ ద్వారా పర్యావరణ సంరక్షణా సంస్థ సభ్యుడికి తను చూసిన పగడాల దొంగతనం గురించీ, కారు ఆనవాళ్ళ గురించీ చెప్పాడు. (అదృష్టవశాత్తు వాళ్ళ ఫోన్‌ నంబరు అతడి స్కూల్‌ బ్యాగ్‌లో కనిపించింది.) తను చేయగలిగింది చేసి, గ్రామానికి తిరిగి వచ్చి, దుకాణందారుకు సైకిలును అప్పగించాడు. ఆ తరవాత యథా ప్రకారం పాఠశాలకు వెళ్ళిపోయూడు. మరునాడు పాఠశాల జరుగుతూండగా, అలీ తరగతికి ఒకరొకరుగా పలువురు ప్రముఖులు రాసాగారు.
 
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొందరు పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులతోపాటు స్థానిక ప్రభుత్వాధికారినీ, ఇద్దరు పత్రికా విలేకరులనూ వెంటబెట్టుకుని వచ్చాడు. అలీ టెలిఫోన్‌ కాల్‌ను అందుకున్న సభ్యుడు-అంతకు ముందు రోజు జరిగిన విషయూలన్నిటినీ తరగతిలోని విద్యార్థులకు పూసగుచ్చినట్టు వివరించి, ‘‘మన అలీ ఇచ్చిన ఫిర్యాదు, తెలియజేసిన కారు ఆనవాళ్ళను బట్టి, నిముషాల్లో అన్ని చెక్‌పోస్‌‌టలకూ హెచ్చరికలు పంపాము. కారుతో సహా ఆ పగడాల దొంగలు ముగ్గురూ పట్టుబడ్డారు. వాళ్ళు ఆ పగడాలను కొల్‌కతాకు పంపి మంచి ధరకు అమ్ముకోవడానికి తీసుకువెళుతున్నారు.
 
మన అలీ కారణంగా ఆ దొంగతనం అరికట్టబడింది. ఎంతో సమయస్ఫూర్తితో, ధైర్యంగా వ్యవహరించిన అలీని అభినందిస్తున్నాను,'' అన్నాడు. పిల్లల కరతాళ ధ్వనులతో, తరగతి మారుమోగింది. పత్రికా విలేకరులు వచ్చి తమ సహాధ్యాయిని ఇంటర్వ్యూ చేసి, ఫోటోలు తీస్తుంటే, పిల్లలు మరెంతగానో ఆనందించి మరొకసారి చప్పట్లు కొట్టారు. ‘‘ఇది నాకు చాలా సంతోషకరమైన రోజు. అయితే పగడాలకు మరింత గొప్ప రోజు,'' అనుకున్నాడు అలీ.

No comments:

Post a Comment