Pages

Saturday, September 15, 2012

దయ్యూలు చేసిన పెళ్ళి


కృష్ణవేణి సవతితల్లి పెంపకంలో, చిన్న తనం నుంచీ అష్టకష్టాలు పడింది. ఆమెకు ఇరవై ఏళ్ళ వయసువస్తుండగా, తండ్రి ఏదో విషజ్వరంతో కాలం చేశాడు. కృష్ణవేణికి పెళ్ళి చేయడం సవతితల్లి సుబ్బరత్తమ్మకు ఏమాత్రం ఇష్టంలేదు. కృష్ణవేణి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే, ఇంటెడు పనీ ఎవరు చేసేట్టు? అలా అని పెద్దపిల్లకు పెళ్ళి చేయకుండా, తన కూతుళ్ళిద్దరి పెళ్ళిళ్ళూ చేస్తే, ఊళ్ళోవాళ్ళు నానా మాటలూ అంటారు!
 
అందుకే సుబ్బరత్తమ్మ, ఊళ్ళో అడిగిన వాళ్ళకీ, అడగనివాళ్ళకీ, ‘‘మా కృష్ణవేణి జాతకరీత్యా పెళ్ళయిన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరీ అంటాడట! ఇక, దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు,'' అంటూ లేని కళ్ళనీళ్ళు పమిట చెంగుతో అద్దుకునేది. ఇలా వుండగా, ఒక రోజు పొరుగూరు నుంచి, ఒక డెబై్భఏళ్ళ ముసలాయన కృష్ణవేణిని చేసుకోవడానికి వచ్చాడు.
 
ఆయన ఖళ్ళుఖళ్ళుమని దగ్గుతూ, ‘‘నాకు జాతకాల పట్టింపు లేదు. పిల్ల నాకు నచ్చింది,'' అన్నాడు. ఆయన వెంట వచ్చిన గుమాస్తా, సుబ్బరత్తమ్మను పక్కకు తీసుకు వెళ్ళి, ‘‘ఈ పెళ్ళి జరిపిస్తే అయ్యగారు మీకు రెండు లక్షలు ఇస్తాడు. పెళ్ళి ఖర్చుకూడా ఆయనే భరిస్తాడు,'' అన్నాడు. ‘‘ఇకనేం, పదిరోజుల్లో ముహూర్తం పెట్టుకుందాం!'' అని ఆనందంగా వాళ్ళను సాగనంపింది సుబ్బరత్తమ్మ.
 
‘‘జన్మంతా నేను పెళ్ళి మాట తలపెట్టకుండా, నీతోనే వుండిపోతాను. నాకీ పెళ్ళి చేయకు,'' అంటూ సుబ్బరత్తమ్మకు చేతులు జోడించింది కృష్ణవేణి. ‘‘ఇంకా నయం! నా కూతుళ్ళ పెళ్ళి ఘనంగా జరగాలంటే నువ్వు పెళ్ళి చేసుకోక తప్పదు. వెధవవేషాలు వేస్తే వీపు చిట్లకొడతాను,'' అన్నది రత్తమ్మ కఠినంగా.

ఆ ముసలాడితో పెళ్ళికన్న చావడం మేలని పించింది కృష్ణవేణికి. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో వుండగా, కృష్ణవేణి ఇల్లొదిలి దాపులనే వున్న అడవిదారి పట్టింది. శ్రావణమాసం కావడంతో, అంతకు ముందే కురిసిన భారీ వర్షాలవల్ల, దారి అంతా బురద బురదగా వున్నది. దారికి అటూ ఇటూ పెరిగిన ముళ్ళపొదల్లోంచి కీచురాళ్ళు చెవులు దిబ్బెళ్ళు పడేలా రొద చేస్తున్నాయి.
 
కృష్ణవేణి ఇవేమీ పట్టించుకోకుండా చాలాసేపు నడిచి, కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం పెడగావున్న, ఒక పాడు పడిన బావిగట్టు మీద కూర్చున్నది. ఆ మరుక్షణం, ‘‘ఓహోహో! ఎవరీ చూడ చక్కని చిన్నది? ఎంత దుస్సాహసం! ఇంత రాత్రి వేళ వచ్చి, మా సొంత బావిగట్టు మీద కూర్చోడమే,'' అంటూ, ఒక ఆడా, ఒక మగ దయ్యం పక్కనున్న చెట్టు కొమ్మపై నుంచి, కృష్ణవేణి ముందుకు దూకినై.
 
ఆమె వాటికేసి నిర్భయంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఇది చూసి దయ్యూలు ఆశ్చర్యపోతూ, ‘‘నీకు మా అతిభయంకరమైన రూపం చూస్తే గుండెలో దడ పుట్టడంలేదా?'' అని ప్రశ్నించినై. ‘‘చావడానికి ఇల్లొదిలిన వాళ్ళకు భయం, గుండెదడా ఏమిటి?'' అంటూ కృష్ణవేణి మరొకసారి నవ్వింది. దయ్యూలు ముఖముఖాలు చూసుకుని, ‘‘చావడానికి వచ్చావా? ఇంతకూ నీ కొచ్చిన కష్టం ఏమిటి?'' అని అడిగాయి.
 
కృష్ణవేణి వాటికి సవతితల్లి పెట్టే బాధల గురించి చెప్పి, ‘‘ఆ రోగిష్ఠిముసలాడి చేత తాళి కట్టించుకోవడం, నాకిష్టంలేదు,'' అన్నది కళ్ళనీళ్ళతో. ‘‘అయ్యో, ఇంత చక్కని ఆడబడుచుకు ఎన్నెన్ని కష్టాలు!'' అన్నది ఆడదయ్యం. ‘‘అవును, ఈ ఆడకూతురికి మనం తప్పక సాయంచేయూలి,'' అన్నది మగదయ్యం.
 
తర్వాత దయ్యూలు రెండూ కూడ బలుక్కుని, కృష్ణవేణితో, ‘‘విచారపడకు. నీ పెళ్ళి మహభేషైన కుర్రాడితో జరిపిస్తాం. ఆ బాధ్యత మాది. ఐతే, మేం ఎవళ్ళతో ఏం మాట్లాడినా, నువ్వడ్డు చెప్పకూడదు, సరా?'' అని అడిగాయి. సరే నన్నట్టు తలవూపింది, కృష్ణవేణి. ఆ వెంటనే దయ్యూలు మనుష్యరూపాలు ధరించి, అప్పటికప్పుడు సృష్టించిన ఒక గూడుబండిలో నాలుగు మూటలు సర్ది, ‘‘అమ్మాయీ కృష్ణవేణీ, బండిలో కూర్చో తల్లీ! మేం నీ తల్లిదండ్రులం, ఆ మాట మరవకు,'' అన్నాయి.

బండి బయల్దేరి, వరదనీటితో ఉధృతంగా వున్న ఒక వాగు దగ్గర ఆగింది. మరొక బండి కూడా అక్కడ ఉన్నది. యువకుడొకడు దాని పక్కన పచార్లు చేస్తున్నాడు. అంతలో బండిలోంచి ముగ్గురు మనుషులు దిగారు. వాళ్ళా యువకుడితో మాట్లాడుతున్న తీరుచూసి, అతడి తండ్రీ, తల్లీ, చెల్లెలూ అని గ్రహించింది కృష్ణవేణి.
 
దయ్యూలు వాళ్ళతో మాట కలపబోయేంతలో యువకుడి తండ్రి, ‘‘మీ ప్రయూణం ఎక్కడికి? మాది తాళ్ళపాలెం. పోలవరంలో మా అబ్బాయి శౌరికి మంచి సంబంధం వున్నదని తెలిసి బయల్దేరాం. లక్షల కట్నం ఇస్తామంటూ చాలా సంబంధాలు వచ్చాయి. మా శౌరికి ఏ అమ్మాయీ నచ్చిందికాదు,'' అన్నాడు. ‘‘అలాగా!'' అంటూ దయ్యూలు ఆశ్చర్యపోయూయి. తర్వాత ఆడదయ్యం, ‘‘మా అమ్మాయి కృష్ణవేణిదీ, మీ అబ్బాయి కొచ్చిన సమస్యలాంటిదే.
 
ఆమె అందచందాలు చూసి ఆస్తిపరులైన కొందరు యువకులు దమ్మిడీ కట్నం తీసుకోకుండా పెళ్ళాడతామంటూ వచ్చారు. కాని, ఆమెకుఎవళ్ళూ నచ్చారుకాదు. వాగు అవతల బలుసుల పాలెంలో పరగణాకే అందగాడైన యువకుడొకడున్నాడని తెలిసి బయల్దేరాం. దారికి అడ్డంగా ఆ వరదల వాగొకటి!'' అంటూ విసుక్కున్నది.
 
‘‘కట్నం లేకుండా ఆడపిల్లను ఇంటి కోడలిగా తెచ్చుకునేంత అమాయకులింకా లోకంలో వున్నారన్న మాట!'' అంటూ శౌరి తల్లి ఆశ్చర్యపోయింది. ఈ సంభాషణ అంతా విన్న శౌరి, తల్లిదండ్రుల వద్దకు వచ్చి చిన్న గొంతుతో ఏదో అన్నాడు. వెంటనే అతడి తండ్రి, దయ్యూలతో, ‘‘మీ అమ్మాయి అందచందాలేమిటో చూస్తాం, కాస్త బండి దిగమనండి,'' అన్నాడు. తల్లీ కృష్ణవేణీ అంటూ దయ్యూలు పిలవగానే, కృష్ణవేణి బండిదిగింది.
 
ఆమెను చూస్తూనే శౌరి అబ్బురపాటుతో తలాడించాడు. వెన్నెల వెలుగులో పుష్ఠిగా, అందంగా, ఆరోగ్యంగా వున్న శౌరిని చూసి, కృష్ణవేణి సిగ్గుతో, తల పక్కకు తిప్పుకున్నది. ఇది చూసిన దయ్యూలు రెండూ పట్టరాని ఉత్సా హంతో, ‘‘ఆహా, ఇంత కాలానికి, మా అమ్మాయి కృష్ణవేణి మెచ్చిన వరుడు దొరికాడు,'' అన్నాయి.

‘‘అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్ళి జరిగిపోతుందా! మా అబ్బాయి శౌరిబాబు సంగతేమిటి? వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ. మాకు అడిగిన కట్నం ఇవ్వాలి,'' అన్నది శౌరితల్లి. శౌరి, కృష్ణవేణికేసి రెండడుగులు వేసి, ‘‘నాకు ఈ అమ్మాయి నచ్చింది,'' అన్నాడు తల్లిదండ్రులతో. ఆ మరుక్షణం శౌరి తల్లి, ‘‘సరి సరి, కట్నం, అత్తగారి లాంఛనాల మాటేమిటి?'' అన్నది కోపంగా. ‘‘మరి ఆడబడుచు లాంఛనం సంగతో!'' అన్నది శౌరి చెల్లెలు కీచుగొంతుతో.
 
‘‘తెల్లవారితే భాద్రపదమాసం. మరో రెండు నెలల వరకూ ముహూర్తాలు లేవని మన ఊరి శాస్త్రులుగారు చెప్పారు గదా!'' అన్నాడు శౌరి తల్లిదండ్రులతో. ‘‘అయితే, ఆలస్యందేనికి? ముఖ్యమైన వాళ్ళం ఉన్నాం కదా? ఇప్పుడే ఆ తంతు జరిపిస్తే సరి,'' అన్నాయి దయ్యూలు హడావుడి పడిపోతూ. ‘‘కట్నం డబ్బు కళ్ళబడితేనే పెళ్ళి, '' అన్నది శౌరి తల్లి నిష్కర్షగా. దయ్యూలు మరుక్షణం బండిలోని నాలుగు మూటలందించి, వాటిలోని బంగారు కాసులు శౌరి తల్లికి చూపిస్తూ, ‘‘మీరడిగిన కట్నకానుకలే కాకుండా, ఊళ్ళోవారి విందు ఏర్పాటుకు కూడా సరిపడే సొమ్ము ఉంది,'' అన్నాయి.
 
ఆత్రంగా ఆ మూటలు తమ బండిలో సర్దేసుకుంది శౌరి తల్లి. శౌరి, కృష్ణవేణి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ తతంగం ముగిసే సరికి ఏరు తీసింది. తెల్లవారవస్తున్నది. ఏటి కవతల కొండ మీద కనిపిస్తున్న ఆలయం కేసి చూస్తూ, ‘‘ముందుగా ఆ కోవెలలో దైవదర్శనం చేసుకుని మీ ఊరు వెళదాం,'' అన్నది శౌరితో కృష్ణవేణి. ‘‘భార్యా భర్తలు వెళ్ళి దర్శనం చేసుకురండి.
 
ఊళ్ళో విందు ఏర్పాట్లు చేయూలిగదా. మేమంతా తిరుగు ప్రయూణమవుతాం,'' అన్నాడు శౌరి తండ్రి. ‘‘సరే, మేము మరో బాడుగ బండిలో తిరిగి వస్తాం. మీరంతా బయలుదేరండి,'' అన్నాడు శౌరి. ఏటిలో ఇంకా మోకాలి లోతు నీళ్ళున్నాయి. కృష్ణవేణి చేయిపట్టుకుని జాగ్రత్తగా ఏరు దాటిస్తున్నాడు శౌరి. కృష్ణవేణికి భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి.

తన పెళ్ళి చేసింది దయ్యూలని తెలిస్తే శౌరి ఏమంటాడో! ఏది ఏమైనా అసలు సంగతికి ఇంకా దాచినట్టయితే ప్రమాదకరమని భావించి, ‘‘క్షమించండి. నా పెళ్ళి చేసింది నా తల్లితండ్రులు కాదు; దయ్యూలు,'' అంటూ తన గురించి దాచకుండా అంతా చెప్పేసింది కృష్ణవేణి. అంతలో వెనక నుంచి పెద్దకోలాహలం వినిపించి, ఇద్దరూ వెనుదిరిగి చూశారు.
 
‘‘అంతా మోసం, దగా! బంగారు కాసులంటూ ఇచ్చిన మూటల్లో ఉన్నది బూడిద, బొమికలు!'' అంటూ పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కిందకు కుమ్మరిస్తున్నది శౌరితల్లి. అది వింటూనే పిశాచాలు రెండూ శౌరి తల్లితో, ‘‘అమ్మా, మా కోడళ్ళు కట్నం తేలేదని వారిని రాచి రంపాన పెట్టాం. అందుకే చచ్చి ఇలా దయ్యూలై తిరుగుతున్నాం.
 
మీరూ అలాంటి పాపానికి ఒడిగట్టి కాలం చెల్లాక మాలాగా దయ్యూలుగా తిరుగుతారో, లేక కోడలితో ప్రశాంతంగా గడుపుతారో మీరే నిర్ణయించుకోండి. అయితే, కోడలి కేదైనా హాని తలపెట్టాలని చూశారో, మరిచిపోలేని గుణపాఠం నేర్పగలమన్న సంగతి మాత్రం గుర్తుంచుకోండి,'' అంటూ చప్పున దయ్యూల రూపాల్లో గాలిలోకి లేచినై. శౌరి తల్లిదండ్రులూ, చెల్లెలూ భయంతో ఒక్కక్షణం వణికిపోయి, అవమాన భారంతో తలవంచుకున్నారు.
 
‘‘రూపాల్లో మాత్రమే వారు దయ్యూలు. అయితే, పరోపకార బుద్ధి వారికి ఉంది. మీరేమో కట్నం కావాలన్న పిశాచబుద్ధులతో అల్లాడుతున్నారు, మీకన్నా ఆ దయ్యూలు ఎంతో నయం,'' అంటూ శౌరి భార్యతో అక్కడికి వచ్చాడు. ‘‘శౌరీ, మాకు బుద్ధి వచ్చింది. ఇక ఈ జన్మకు కట్నం ఊసెత్తం. మమ్మల్ని క్షమించు. మహాలక్ష్మిలాంటి కోడలు వచ్చింది. మాకింకేం కావాలి?'' అన్నారు తల్లిదండ్రులు. వారిలో వచ్చిన మార్పుకు శౌరి ఎంతో సంతోషిస్తూ, కృష్ణవేణి చేతులను ఆప్యాయంగా పట్టుకున్నాడు. 

No comments:

Post a Comment