Pages

Friday, September 7, 2012

పిసినారి కోరిన వరం!


వారణాసిలో లాలూసేఠ్‌ అనే ఒక వడ్డీవ్యాపారి ఉండేవాడు. ధనవంతుడేగాని అతడు పరమ పిసినారి. అతడి భార్య మంగూబాయి ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళదామంటే సేఠ్‌ మండిపడి, ‘‘పరమశివుణ్ణే అవమానిస్తావా? నీకెంత ధైర్యం. ఎక్కడెక్కడి నుంచో రోజూ వేలాది మంది భక్తులు కాశీవిశ్వనాధుణ్ణి దర్శించడానికి ఇక్కడికి వస్తూంటే, పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యం ఫలితంగా ఇక్కడే పుట్టి నివాసముంటూన్న మనకు వేరొక తీర్థయాత్ర ఎందుకే వెర్రిమొహమా? నోరు మూసుక్కూర్చో,'' అనేవాడు.
 
భర్త స్వభావం తెలిసిన భార్య మరి నోరెత్తలేక పోయేది.
 
ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారు జామున గంగానదిలో పుణ్యస్నానం చేయడానికి భక్తులు తండోపతండాలుగా వెళుతున్నారు. దానిని చూసిన లాలూసేఠ్‌ భార్య, ‘‘మనమూ వెళ్ళి గంగాస్నానం చేసివద్దాం రండి. పుణ్యప్రదమైన రోజు కదా?'' అన్నది ఎంతో కుతూహలంతో.
 
‘‘అవును, పుణ్యప్రదమైన రోజే. తీర్థఘట్టానికి వెళితేచాలు. ‘మీకోసం ప్రార్థిస్తాను. మంత్రాలు చదువుతాను. కాసులివ్వండి, పాపాలు తొలగించుకోండి,' అంటూ పూజారులు చుట్టుముడతారు. ఇదంతా నీకు తెలియనిది కాదుకదా?'' అన్నాడు సేఠ్‌ విసుగ్గా.
 
అయినా భార్య పట్టుబట్టడంతో సేఠ్‌కు బయలుదేరక తప్పలేదు. నదీ తీరంలో ఎవరూ లేని చోటికే వెళ్ళి స్నానం చే…యాలని భార్య వద్ద మాటతీసుకుని మరీ బ…యలుదేరాడు.
 
ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు అదృశ్యంగా గంగాతీరంలో సంచరించ సాగారు. ప్రజల భక్తిశ్రద్ధలను కళ్ళారా చూసిన పార్వతీదేవి పరమానందం చెందింది. ‘‘ఈ భక్తుల కోరికను తీర్చి భగవత్‌ సాక్షాత్కారం కలిగించవచ్చు కదా?'' అని భర్తను ప్రశ్నించింది.

పరమశివుడు మందహాసం చేసి, ‘‘ఈ భక్తులలో ఎవరికీ భగవత్‌ సాక్షాత్కారం పొందాలన్న కోరిక లేదు. ఏవేవో, ప్రాపంచిక ఈప్సితాలతో ఆచారం ప్రకారం పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు, అంతే,'' అన్నాడు.
 
అప్పుడే పార్వతీమాత దృష్టి లాలూ సేఠ్‌ దంపతుల మీద పడింది. ‘‘అదిగో చూడు! ఆ భక్తుడు ప్రశాంతంగా ధ్యానం చేయడానికి తన భార్యను ఏకాంత ప్రదేశానికి వెంటబెట్టుకు వెళుతున్నాడు. అతడు కూడా అందరిలాంటి వాడేనంటావా?'' అన్నది ఆశ్చర్యంగా.
 
వెంటనే ఒక పేద పూజారి రూపంలో పరమశివుడు సేఠ్‌ను సమీపించాడు. అతన్ని చూడగానే గతుక్కుమన్న సేఠ్‌, ‘‘నువ్వెందుకు నాదగ్గరికి వచ్చావు? నాకు నీ సాయం ఏమీ వద్దు. నాకోసం నువ్వు ఎలాంటి మంత్రాలూ చదవనవసరం లేదు. వెంటనే ఇక్కణ్ణించి వెళ్ళిపో. అనవసరంగా నాకు కోపం తెప్పించకు,'' అన్నాడు.
 
‘‘నాయనా, ఇవి చాలా శుభఘడియలు. పూజారి మంత్రాలు చదివితేనే నీకు పుణ్యం సిద్ధిస్తుంది. మంత్రాలు చదవడానికి నీ నుంచి నేను పెద్దగా ఆశించలేదు. ఆనవాయితీ కోసం ఎంతో కొంత ఇచ్చుకుంటేచాలు. నీకు పుణ్యం సిద్ధించడమే నాకు ప్రధానం,'' అన్నాడు పూజారి రూపంలోవున్న శివుడు ప్రశాంతంగా.
 
భార్యకూడా ప్రాథేయపడడంతో, సేఠ్‌, ‘‘సరే, ఒకే ఒక దమ్మిడీ ఇస్తాను. అంతకన్నా ఎక్కువ ఆశించవద్దు,'' అన్నాడు.
 
‘‘అలాగే,'' అన్నాడు పూజారి. లాలూసేఠ్‌ సతీసమేతంగా వెళ్ళి స్నానం చేశాడు. పూజారి మంత్రాలు వల్లిస్తూ దంపతులను దీవించి, దక్షణ కోసం చేయి చాపాడు.
 
‘‘దమ్మిడీ ఇస్తానన్నానుగాని, అది ఇప్పుడే ఇస్తానన్నానా? నేను డబ్బేదీ తీసుకురాలేదు,'' అన్నాడు సేఠ్‌.
 
‘‘మంచిది నాయనా! నేను నీ ఇంటికి వచ్చే పుచ్చుకుంటాను,'' అంటూ వాళ్ళవెంట బయలుదేరాడు. పార్వతి కూడా అదృశ్యంగా వాళ్ళను అనుసరించింది.
 
ఇంటిలోపలికి వెళ్ళిన సేఠ్‌ బట్టలు మార్చుకుని బయటకు వచ్చి, ‘‘ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, తరవాత రా,'' అన్నాడు.
 
‘‘అలాగే!'' అంటూ శివుడు అక్కడినుంచి వెళ్ళిపోయి, మరురోజు వచ్చాడు.
 
సేఠ్‌ ఆయన్ను చూడగానే, ‘‘అరరే, కాస్త ముందు రాలేక పోయావా? ఉన్నది ఇప్పుడే వేరొకరికి ఇచ్చేశాను. రేపు రా,'' అన్నాడు.
 
అలా రోజులు గడుస్తున్నాయే తప్ప సేఠ్‌ దమ్మిడీ ఇచ్చిన పాపాన పోలేదు. తిరిగీ తిరిగీ విసుగొచ్చి అతడే మానేస్తాడని అతడి ఆశ.

అయినా పూజారి వదలలేదు. అపారమైన సహనంతో రోజూ రాసాగాడు. పూజారి అప్పు ఎగ్గొట్టడానికి సేఠ్‌ రకరకాలుగా ఆలోచించసాగాడు. ఒక రోజు పూజారి తన ఇంటికేసి రావడం దూరంనుంచే చూసిన సేఠ్‌, తను ఇప్పుడే చనిపోయినట్టు పూజారితో చెప్పమని భార్యను పురమాయించి, గబగబా లోపలికి వెళ్ళిపోయాడు.
 
మంగూబాయి అమిత ఆవేదన చెందింది. అయినా, పూజారి రాగానే భర్త చెప్పమన్నట్లే చెప్పింది.
 
‘‘ఎంత దారుణం జరిగిపోయింది, తల్లీ,'' అని సానుభూతి కనబరచిన పూజారి, ‘‘నీ చనిపోయిన భర్తకు తన అంత్యక్రియలకు ఖర్చు చేయడం కూడా నచ్చదని నీకు బాగా తెలుసుకదా? దమ్మిడీ ఖర్చులేకుండా నేనాపని పూర్తి చేసి పెడతాను. అతని ఆత్మశాంతిస్తుంది,'' అన్నాడు.
 
ఆ తరవాత పూజారి ఇంటిలోపలికి వెళ్ళి బిరబ్రిగుసుకుపడి పోయివున్న సేఠ్‌ను, భుజాలపై కెత్తుకుని నదీతీరం కేసి నడవసాగాడు. ఏంచేయడానికీ తోచక మంగూబాయి ఆయనవెంట మౌనంగా నడవసాగింది.
 
పూజారి తనను నదిలో పడవేసేలోగా ఏదైనా కొత్త ఎత్తుగడ వే…యాలనుకున్న సేఠ్‌, ఆయన భుజంపై నుంచి కిందికి దూకి, ‘‘మహాత్మా! తమరు పవిత్ర స్వరూపులు! లేకుంటే చచ్చిన నాకు తమ దివ్య స్పర్శతో ప్రాణాలు తిరిగి వచ్చేవేనా? కృతజ్ఞతలు,'' అన్నాడు.
 
ఆ మాటతో దయాసింధువైన పరమశివుడు అతడి ముందు ప్రత్యక్షమై, ‘‘నాయనా! నేనే పూజారి రూపంలో వచ్చాను. నీ ఆస్తులను రక్షంచుకోవడంలో నీకున్న శ్రద్ధాసక్తులు అనుపమానం.
 
అలాంటి శ్రద్ధాసక్తులను ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అందుకోవడానికి వినియోగిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడు ఏదైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను,'' అన్నాడు. లాలూసేఠ్‌ చేతులు జోడించి, ‘‘నీకు నామీద అంతటి కరుణే గనక వుంటే, నేను నీకు బాకీపడ్డ ఆ ఒక్క దమ్మిడీ చెల్లించనవసరంలేదని చెప్పు. అదే చాలు!'' అన్నాడు.
 
‘‘తథాస్తు!'' అంటూ ఆశీర్వదించిన పరమశివుడు మందహాసం చేస్తూ అదృశ్యంగా వున్న పార్వతి కేసి చూశాడు. ఆమె విచార వదనంతో కనిపించింది.
 
‘‘మానవులకు తమకు నిజంగా కావలసిన అసలైన జ్ఞానం ఏదో తెలుసుకునే చైతన్యం ఉదయించేంత వరకు మనం వేచి ఉండక తప్పదు. అవసరం లేదనుకున్న వాటిని వాళ్ళకు మనం అందజేయలేము కదా?'' అన్నాడు పరమశివుడు గంభీరంగా. 

No comments:

Post a Comment