Pages

Friday, September 7, 2012

సమయజ్ఞత


కాశ్మీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్న కాలం అది. ఒక నాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండితగోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఘూర్జరదేశం నుంచి వచ్చిన ఒక పండితుడు, తాను సంస్కృతంలో రచించిన ఒక శ్లోకాన్ని వినిపించాడు. అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం.
 
‘‘ఎప్పుడు, ఏ పని చేయాలో తెలుసుకుని చేస్తే, ఆ పనులు నెరవేరుతాయి. అలాకాక, అదును తప్పి చేసినపనులు వ్యర్థమవుతాయి,'' అని ఆ పండితుడు రచించిన శ్లోకభావం. రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు. పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సభనుద్దేశించి ఒక ప్రశ్నవేశాడు: ‘‘ఏపని అయినా ఫలానా సమయూనికి చేయూలి అని తెలుసుకోవడం ఎలా?''
 
 సభలో వున్న జ్యోతిష పండితుడు లేచి, గ్రహగతులను బట్టి తెలుస్తుంది అన్నాడు. మరొక పండితుడు లేచి, అనుభవంగల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు. సభలోని తక్కిన పండితులు కూడా, ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు.
 
పండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానమూ, విక్రసేనుడికి సంతృప్తికరంగా లేదు. ఆయన పండితులతో, ‘‘దీని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దాం,'' అని , సభను ఆ రోజుకు ముగించాడు.
 
కొంతకాలం గడిచింది. విక్రమసేనుడు ఒకనాడు మంత్రితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం పోగా, అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది. దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు. రాజు, ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు.
 
‘‘మహానుభావా! తపస్సంపన్నులైన తమరు, నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి,'' అన్నాడు రాజు సాధువుతో.

సాధువు తల ఎత్తి, రాజుకేసి ఒక్కక్షణం చూసి, ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు.
 
అప్పుడు రాజు వినయంగా, ‘‘మరేమీ లేదు. సమయ మెరిగి పని చెయ్యాలంటారు గదా! ఆ సమయాన్ని తెలుసుకోవడం ఎలాగు? అదీ నా సందేహం,'' అన్నాడు.
 
సాధువు, రాజుకేసి మరొకసారి చూసి, మరొక నవ్వు నవ్వాడు. సాధువు ఏదో దీక్షలో వున్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు. ఆ మర్నాడు పెద్దవాన కురిసింది. విక్రమసేనుడు, ఆశ్రమానికి వెళదామనుకుని వెళ్ళ లేకపోయాడు.
 
ఆ మరుసటి రోజు వాతావరణం చల్లగా, ప్రశాంతంగా వుంది. ఈసారి రాజు ఒక్కడే బయలుదేరి, అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సాధువు తాను తవ్విన నేలను చదును చేసి, మొక్కలు నాటుతున్నాడు.
 
విక్రమసేనుడు, ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ‘‘స్వామీ! ఈసారయినా తమరు నా ప్రశ్నకు సమాధానం చెప్పకోరుతున్నాను. లోగడ వచ్చినప్పుడు తమరిని, ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఎలా తెలుస్తుంది? అని అడిగాను,'' అన్నాడు.
 
సాధువు తన పని తను చేసుకుంటూ, రాజు మొహంలోకి చూసి, ‘‘మహారాజా! మీ ప్రశ్నకు సమాధానం మొన్ననే ఇచ్చాను. ఐతే, మీరు గ్రహించలేదు,'' అన్నాడు.
 
‘‘అలాగా, స్వామీ! కాస్త వివరంగా చెప్పండి,'' అన్నాడు విక్రమసేనుడు. ‘‘ఇదీ, ఆ వివరం!'' అంటూ సాధువు తన పనిలో మునిగిపోయూడు.
 
సాధువు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది: సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా, చేయూలనుకున్న పనిని మొదలుపెడితే, సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం తోడయినట్లుగా, చేసేపనికి కాలం కలిసి వస్తుంది, అన్న యథార్థం! సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుదిరిగాడు విక్రమసేనుడు.

No comments:

Post a Comment