Pages

Friday, September 7, 2012

చిట్కావైద్యం


హేలాపురిలోవుండే గోప…య్య, రెండు పాడిగేదెలూ, రెండుపాడి ఆవులతో పాలవ్యాపారం చేస్తున్నాడు. ఒకసారి అతడి చుక్కల ఆవు జబ్బు పడింది. దానితో అతడి పాలవ్యాపారం కొద్దిగా దెబ్బతిన్నది. ఈ పరిస్థితుల్లో గోప…య్య, సుగంధపురిలో తనలాగే పాలవ్యాపారం చేస్తున్న గరటయ్యను కలుసుకుని, తన చుక్కలావు సంగతి చెప్పాడు.
 
అంతావిన్న గరట…య్య తలాడిస్తూ, ‘‘ఇంతకూ ఒక్క మాటలో తేలిందేమంటే-నీ ఆవు సరిగా గడ్డి తినడంలేదు, కుడితి తాగడంలేదు, ఉలవలు ముట్టడంలేదు, అవునా?'' అన్నాడు.
 
‘‘అంతే మరి!'' అంటూ కాస్త విసుగుపడ్డాడు గోప…య్య.
 
గరటయ్య ఆప్యాయంగా గోప…య్య భుజం మీద చెయ్యివేసి, ‘‘చూశావా, గోప…య్య! పాలవ్యాపారంలో ఇలాంటి కష్టాలు తప్పవు. నెల రోజులక్రితం నా కర్రి ఆవు కూడా, నీ ఆవులాంటి వ్యాధిలక్షణాలతోనే బాధపడింది. నాకు అంతో ఇంతో తెలిసిన చిట్కావైద్యం చేశాను. తొట్టెడు కుడితిలో కంచుచెంబు నిండుగా వేపాకు రసం, మరి రెండు చెంబులు కరక్కాయ, కాకరకాయ రసం కలిపి తాగించాను, అంతే! ఏమయిందనుకున్నావు మరి....'' అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో, ‘‘ఆహా, చిట్కావైద్యం! మళ్ళీ వచ్చి కనబడతాను, గరటయ్యా!'' అంటూ అక్కణ్ణించి పరుగున తన ఊరికేసి బయల్దేరాడు గోపయ్య.
 
రెండు రోజుల తర్వాత గోప…య్య విచారంగా గరటయ్య దగ్గరకు తిరిగివచ్చి, ‘‘గరట…య్యా! నీ కర్రావుకు నువ్వు చేసిన చిట్కావైద్యమే, నువ్వు చెప్పినట్లే నా చుక్కల ఆవుకు నేను చేశాను. కానీ, మర్నాటికి చచ్చిపోయింది,'' అన్నాడు.
 
‘‘ఆ వైద్యంతో అప్పుడు, నా కర్రావు కూడా చచ్చిపోయింది! అందుకే, ఈ చిట్కావైద్యంకాక, మంచి పశువైద్యుడికి ఆవును చూపమని చెబుదామనుకున్నాను. ఐతే, నువ్వు నా మాట సాంతం వినక మధ్యంతరంగా వెళ్ళిపోతివి!'' అన్నాడు గరట…య్య.

No comments:

Post a Comment