Pages

Friday, September 7, 2012

దయార్ద్ర హృదయుడు


ప్లవంగరాజ్యాన్నేలే జయద్రథుడు, ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి, ఆ రాజ్యంలోని తూర్పు ప్రాంతంలో వానలు లేక కరువు వచ్చింది. అక్కడి పౌరులు పడుతున్న బాధల గురించి కొందరు ప్రతినిధులు వచ్చి రాజుకు చెప్పారు. జయద్రథుడు ధనరూపేణా, వస్తురూపేణా సాయాన్ని అందజేశాడు. అయినా, ఆయనకు కరువు గురించిన వార్తలు పౌరులు పంపుతూనేవున్నారు.

‘‘కరువో, వరదలో, మహమ్మారి రోగాలో, అప్పుడప్పుడూ ఏదోప్రాంతాన్ని ఆవహించడం ప్రకృతి సహజం.పౌరులు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. రాజు ఎంతకని సా…యపడగలడు?'' అని జ…యద్రథుడు విసుక్కున్నాడు.
అయితే, మహామంత్రి ఆ…యనతో, ‘‘ప్రభూ! సమస్య ఎక్కడున్నదో పరిష్కారమూ అక్కడేవుంటుంది.
 
తమరు స్వ…యంగా వెళ్ళి అక్కడి పరిస్థితులు విచారించడం బాగుంటుంది,'' అని హితవు చెప్పాడు. జ…యద్రథుడు అలాగే చే…యాలనుకున్నాడు. కానీ రాజులా వెళితే, ఆ…యనను పలుకుబడి వున్నవారందరూ చుట్టుముడతారు. సామాన్యులకాయన దర్శనభాగ్యమే లభించకపోవచ్చు! అందుకని ఆయన మారువేషంలో పరదేశిలా కరువు ప్రాంతానికి వెళ్ళి తిరిగాడు.

అక్కడ కరువు ఘోరంగానేవుంది. ఎంతో మందికి ఒక్కపూట తిండిదొరకడం కూడా కష్టమవుతున్నది.
 
తన పాలనలో అప్పుడప్పుడు ఏదో ఒక ప్రాంతంలో, ఇలాంటివి జరుగుతూనే వుండడం వల్ల, ఇదేమీ ఆయనకు కొత్తగా అనిపించలేదు.

ఆయన తనకు తటస్థ పడినవారితో, ‘‘నేను పరదేశిని, ఇలాంటి కష్టాలు మా దేశంలోనూ వచ్చాయి. మా పౌరులు బెంబేలెత్తి పోకుండా సమష్టిగా కృషి చేసి, కష్టాలు గట్టెక్కేలా చేసుకున్నారు. మీరలా చేస్తున్నట్టులేదు!'' అంటూ ఎద్దేవా చేశాడు.

దానికి అక్కడి పౌరులు నొచ్చుకుని, ‘‘నువ్వు పరదేశివి. అందుకే మా కడగండ్లు నీకు కన్నీరు తెప్పించడం లేదు,'' అన్నారు.
 
‘‘నేనే కాదు, ఈ ప్రాంతానికి దూరంగా వుంటున్నాడు కాబట్టి, సాక్షాత్తూ మీ మహారాజే వచ్చినా, నేను చెప్పిన మాటలే చెబుతాడు,'' అన్నాడు మారువేషంలో వున్న జయద్రథుడు.
 
అక్కడి పౌరుల్లో ఒకడీ మాటలకు చిరాకు పడి, ‘‘మా రాజు ధోరణిచూస్తూంటే, నీ మాటలు నిజమేననిపిస్తున్నాయి. కష్టాలు భరించేవారికి తెలుస్తాయి. దయార్ద్రహృదయం వున్న గుణనిధివంటి వారికి అర్థమవుతాయి! నీవంటివారికి కాదు,'' అన్నాడు. అప్పుడు జయద్రథుడికి, గుణనిధి గురించి తెలిసింది. ఈ గుణనిధి దక్షణ ప్రాంతానికి చెందినవాడు. ఎవరికి కష్టాలు కలిగినా, ఆయన వెతుక్కుంటూ వారి వద్దకు వెళతాడు. వారి కష్టాలు చూసి చలించి పోయిన ఆయనలోంచి కవిత్వం పెల్లుబుకుతుంది. ఆ కవిత్వం వింటూంటే శిలావిగ్రహాలు కూడా కన్నీరు పెడతాయి అంటారు! ప్రస్తుతం గుణనిధి ఇక్కడి తూర్పు ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు.
 
రెండు రోజుల తర్వాత జయద్రథుడు, గుణనిధిని కలుసుకున్నాడు. ప్రజల కష్టాలను వర్ణిస్తున్న గుణనిధి కవిత్వం వింటూంటే, ఆయనకు గుండె చెరువై పోయింది. అప్పుడు ప్రజల కష్టాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక ఊహ మెదిలింది. గుణనిధి వంటివాణ్ణి, ఏ ప్రాంతానికైనా రాజప్రతినిధిని చేస్తే, అందువల్ల రాజ్యానికి ఎంతో ఉపకారం జరుగుతుంది!
 
నగరానికి తిరిగి వచ్చాక, జయద్రథుడు తన ఆలోచనను మహామంత్రికి చెప్పాడు. మహామంత్రి కాసేపాలోచించి, ‘‘ప్రభూ! గుణనిధి గొప్పకవి మాత్రమే. కవిని ఏలికను చేయాలనుకుంటే, అందుకు అనుగుణమైన లక్షణాలు ఆయనలోవున్నట్టు తెలియాలి. తగువిధంగా పరీక్షంచకుండా, ఆ…యన్ను ఏ ప్రాంతానికీ రాజప్రతినిధిగా నియమించవద్దని, మనవి!'' అన్నాడు.
 
‘‘నావరకూ అయితే గుణనిధిని పరీక్షించడం అయిపోయింది. నీ తృప్తికోసం ఆయన్ను మరొకసారి పరీక్షంచడానికి, నాకే అభ్యంతరంలేదు. ఆ పరీక్ష ఏదో నీవే ఏర్పాటు చేయి,'' అన్నాడు జయద్రథుడు.

మహామంత్రి సరేనన్నాడు. గుణనిధికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన రాజధానికి వచ్చాడు. మహారాజు ఏర్పాటు చేసిన విడిదిలో, అతడికి సకల మార్యాదలూ జరిగాయి. ఒక రోజాగి, రాజూ, మహామంత్రీ ఆయనను చూడబోయారు.
 
గుణనిధి వారికి వినయంగా నమస్కరించి, తనను పిలిపించిన కారణం తెలుసుకోగోరాడు. ‘‘తమరు ద…యార్ద్ర హృదయులనివిన్నాను.
 
తమరికారణంగా, ఒక ఉత్తమ ఇల్లాలూ, ఆమె భర్తా సమస్య పరిష్కరించబడుతుందని ఆశపడి, తమరిని పిలిపించాను,'' అంటూ మహామంత్రి, ఆ దంపతుల కథ చెప్పాడు:
 
సుమతి, చంద్రుడు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా వుంటున్నారు. ఈ మధ్య సుమతి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చంద్రుడి తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోయివున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడి దురదృష్టంకొద్దీ ఒక ముని, అతడి మీద ఆగ్రహించి, మూడుకాళ్ళ ముదుసలివి కమ్మని శపించాడు. చంద్రుడు కాళ్ళావేళ్ళా పడిబ్రతిమాలితే, ముని శాంతించి, ‘‘వారం రోజుల్లోగా ద…యార్ద్ర హృదయుడైన పురుషుడి బొటన వ్రేలినుంచి ఒక చిన్న రక్తపుబొట్టు తీసి తలపైవుంచుకుంటే, నా శాపం నిన్ను బాధించదు. ఆ పురుషుడు నీకు ఏవిధంగానూ బంధువై వుండకూడదన్నది నియమం!'' అని విమోచనం చెప్పాడు.
 
ఈ కథ వింటూనే గుణనిధి చలించిపోయాడు. తాను వెంటనే సుమతినీ, చంద్రుడినీ కలుసుకోవాలన్నాడు. జయద్రథుడు, మహామంత్రి అతణ్ణి వెంటబెట్టుకుని, ఒక చిన్న పెంకుటింటికి వెళ్ళారు.

గుణనిధి, చంద్రుణ్ణి పలకరించి, ఆ కుటుంబ పరిస్థితి గురించి హృదయం ద్రవించి పోయేలా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వింటూంటే, చంద్రుడి కుటుంబగాథ అంతా కల్పితమని తెలిసినప్పటికీ మహారాజు, మహామంత్రిక్కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
 
గుణనిధి, ఆ భార్యాభర్తలతో, ‘‘ఈ ప్రపంచంలో సుఖపడేవారు సామాన్యులు. కష్టపడేవారు గొప్పవారు. ఎందుకంటే, భగవంతుడు వారిని తన పరీక్షకు అర్హులుగా ఎన్నుకున్నాడన్న మాట! ఎవరికీ కష్టాలు కలకాల ముండవు. శాపం ఇచ్చిన ముని విమోచన మార్గం చూపినట్లే, భగవంతుడు కూడా మీకోసం గడువు సమయంలోగా, ఒక దయార్ద్రహృదయుణ్ణి తప్పక పంపుతాడు!'' అని అర్థంవచ్చేలా మళ్ళీకవిత్వం చెప్పాడు.
 
ఇది విని రాజు జయద్రథుడు మహామంత్రికేసి ఆశ్చర్యంగా చూశాడు. ముగ్గురూ అక్కడినుంచి బయలుదేరారు.
 
రాజభవనం చేరాక మంత్రి, ‘‘మహారాజా, గుణనిధి కవి. అతడిలోని కవిహృదయం అతడిచేత గొప్ప కవిత్వం పలికిస్తుంది తప్ప పరోపకారం చేయించదు. అందువల్ల అతడు కవిగా మాత్రమే రాణించగలడు. అతడి కవిత్వం వల్ల ప్రజల కష్టాలు తెలుస్తాయే తప్ప; తీరవు. ప్రజలను కష్టాల్లో ఆదుకునేవాడే, రాజప్రతినిధిగా ఉండాలి. కళ్ళెదుట ఇన్ని కష్టాలు చూశాక కూడా, అతడు నెత్తురు బొట్టు చిందించడానికి దయార్ద్రహృదయుణ్ణి దేవుడే పంపగలడని చెప్పాడే తప్ప, తనే ఆపనిని చేయడానికి సంసిద్ధత చూపలేదు. ఆచరణలో ప్రజలకు మేలు చేయగలిగినవాడే ఏలికగా ఉండ తగ్గవాడు. కేవలం దయార్ద్రహృదయం కలవారు రాజ ప్రతినిధులుగా ఉండతగరన్న విషయం ప్రభువులకు తెలియనిది కాదు,'' అన్నాడు.
 
జయద్రథుడు అంగీకార సూచకంగా తలపంకిస్తూ, నేర్పుగా తన పొరబాటును సవరించి చెప్పిన మహామంత్రిని అభినందించి, గుణనిధికి కవిగా తగిన సత్కారం చేసి పంపేశాడు.

No comments:

Post a Comment