రంగనాథుడికి పన్నెండేళ్ళ వయసువచ్చినా, వాడికి గురుకులంలో ఏమాత్రం
చదువు అబ్బడంలేదు. ఆమధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా వాడు
తప్పికూర్చున్నాడు. దానితో వాడికి బాధలు మొదల…య్యాయి.
తండ్రి, వాడిని ఎందుకూ పనికిరాని వెధవా అని తిట్టాడు. ఇదివరకు తను
ఏదికోరితే అదివండిపెట్టే తల్లి, ఇప్పుడు వేళకు అన్నంకూడా సరిగా
పెట్టడంలేదు. ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది. కానీ, తిరిగి
పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు, విసుగుకలుగుతున్నది.
ఒక రోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. క్రితంరోజు
మిత్రులతో కలిసి ఆడుతూంటే రాయితగిలి, వాడి కుడికాలుబొటన వేలికి
చిన్నగాయమైంది. దాని మీద ఈగ ఒకటి వాలి బాధ కలిగిస్తున్నది. దాన్ని ఎంత
తోలినా పోయినట్లేపోయి, తిరిగివస్తున్నది. దానితో వాడుపట్టరానికోపంతో, ‘‘ఛీ,
ముదనష్టపుదానా!'' అంటూ అరిచాడు.
ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు, రంగనాథుడి అరుపువిని,
వాణ్ణి అడిగి సంగతి తెలుసుకుని, ‘‘చూడు, రంగా! అల్పజీవి అయిన ఒక చిన్న
ఈగకే తనకు కావలసినదానిపై అంతపట్టుదలవుంటే, అన్ని జీవులకంటే తెలివైన,
శక్తికలిగిన మనిషికెంత పట్టుదల వుండాలో చెప్పు?'' అన్నాడు.
ఆ మాటలువింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు. అంతే! ఆరోజు నుంచీ
మనసులగ్నం చేసి, పట్టుదలతో చదివాడు. నెలరోజుల తర్వాత పరీక్షకువెళ్ళి
ప్రశ్నలన్నింటికీ తగు జవాబులు రాసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
No comments:
Post a Comment