Pages

Friday, September 7, 2012

వింత అధికారి!


చాలా కాలం క్రితం శ్రీనగర్‌లో నిత్యానందుడనే ఒక ధనవంతుడు ఉండేవాడు. కావలసినంత డబ్బూ, పొలాలూ తండ్రి నుంచి అతనికి వారసత్వంగా సంక్రమించాయి. పొలాలను రైతులకు కౌలుకిచ్చి ఆ ఆదా…యంతో, ఏ చీకూ చింతా లేకుండా భార్యాపిల్లలతో హాయిగా జీవించసాగాడు.
 
నిత్యానందుడి ఇంటిపక్కన సోమనాధుడనేవాడు ఉండేవాడు. అతనికంటూ ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ శక్తిసామర్థ్యాలేవీ లేవు. అయినా చుట్టుపక్కల ప్రజలు అతనిపట్లా, అతని కుటుంబంపట్లా ఎంతో గౌరవాదరాలు కనబరచేవారు. అతడు రాజాస్థానంలో ఆదాయ వ్య…యాలు పర్యవేక్షించే అధికారిగా పనిచే…యడమే దీనికంతకూ కారణం. ఇది నిత్యానందుడికి చాలా ఆశ్చర్యం కలిగించినా, అంతగా పట్టించుకునేవాడు కాదు. అయితే, అనుకోకుండా జరిగిన ఒక సాధారణ సంఘటన దానిని పట్టించుకునేలా చేసింది!
 
నిత్యానందుడికీ, సోమనాధుడికీ ఐదారేళ్ళ వ…యసుగల మగ పిల్లలు ఉన్నారు. ఇరుగు పొరుగు ఇళ్ళల్లో ఉన్న ఆ ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా ఒకనాడు ఏదో గొడవ పడ్డారు. అది కాస్తా పెద్దదై ఒకరినొకరు కొట్టుకోసాగారు. దానిని చూసిన నిత్యానందుడి భార్య రాధ, సోమనాధుడి భార్య మాధవి పిల్లలను సముదాయించి, మందలించడానికి బదులు, ఒకరిపై ఒకరు కాలుదువ్వి క…య్యానికి దిగారు. బాగా రెచ్చిపోయి పరస్పరం గట్టిగా దూషించుకున్నారు.
 
‘‘రాధా, నన్ను అన్ని మాటలంటావా? నీ పొగరు అణచకపోతే నాపేరు మాధవి కాదు. నీ మగడులాగా మా ఆయన మూడు పూట్లా తిని సోమరిగా తిరిగే దద్దమ్మ కాదు. రాజాస్థానంలో పెద్ద అధికారి. ఆయనతో చెప్పి ఏం చేస్తానో, చూడు,'' అని కేకలు పెడుతూ, కొడుకును బరబరా లాక్కుని ఇంట్లోకి వెళ్ళి దభీమని తలుపు మూసింది సోమనాధుడి భార్య.
 
పొరుగింటి ఆలుమగలు తమకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తున్నారని రాధ, నిత్యానందుడు కొన్ని రోజుల్లోనే గ్రహించారు. భార్య మాటవిని సోమనాధుడు, తన అధికార బలంతో నిత్యానందుణ్ణి రకరకాలుగా వేధించ సాగాడు. మొదట పన్నులు కట్టలేదని తాఖీదు పంపాడు. ఎప్పుడో చెల్లించానని నిరూపించడానికి నిత్యానందుడు అధికారుల చుట్టూ అనేక సార్లు ప్రదక్షణలు చేయవలసి వచ్చింది. నిత్యానందుడికీ, రాధకూఇది చాలా అవమానకరంగా తోచింది. రాధయితే మరీ బాధపడిపోయింది.


‘‘సోమనాధుడిలాగా నువ్వు గౌరవప్రదమైన ఏదైనా ఉద్యోగం లేకుండా తిరగడం వల్లే అతడి భార్య నిన్ను పనికిరాని దద్దమ్మ, అని తిట్టగలిగింది. నీకూ ఏదైనా ఉద్యోగం ఉంటే, ఆ మాట అనగలదా? నువ్వు కూడా అధికారం గల ఏదైనా ఉద్యోగం చూసుకుంటే తప్ప, ఆ ఆలుమగల తలపొగరు అణచలేము,'' అన్నది రాధ భర్తతో కళ్ళనీళ్ళ పర్యంతమైపోతూ.
 
నిత్యానందుడు తీవ్రంగా ఆలోచించాడు. భార్య మాటలు అక్షరాలానిజం. తనకూ ఏదైనా ఒక అధికార పదవి ఉంటే తననెవరూ వేధించలేరు కదా? అందరూ గౌరవించగలరు కూడా అని భావించి ఉద్యోగాన్వేషణకు దిగాడు.
 
ఆ రోజుల్లో స్థానిక ఉద్యోగులను రాజప్రతినిధులే నియమించేవారు. నిత్యానందుడు తన ప్రాంతానికి ఉన్న రాజప్రతినిధిని దర్శించి, తనకేదైనా అధికారంగల ఉద్యోగం ఇప్పించమని వేడుకున్నాడు. రాజప్రతినిధి ఉద్యోగాలు ఖాళీ లేవన్నాడు.
 
నిత్యానందుడు పట్టుదలతో, ‘‘అయ్యా, నేను ఉద్యోగం కావాలన్నది డబ్బు సంపాదనకు కాదు. గౌరవ ప్రతిష్ఠలు పొందడానికి. అందువల్ల జీతం లేని ఉద్యోగం అయినా ఫరవాలేదు. గౌరవ ప్రదమైన ఎలాంటి ఉద్యోగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.దయచేసి లేదనకండి,'' అని దీనంగా వేడుకున్నాడు.
 
అతడి వింత కోరిక విని రాజప్రతినిధి మనసులో నవ్వుకున్నాడు. అతన్ని ఆటపట్టించాలనుకున్నాడు. అయినా, ఎందులోనూ ఎలాంటి అనుభవమూ లేని అతనికి ఎలాంటి ఉద్యోగం అప్పగించగలం అని కొంతసేపు ఆలోచించిన రాజప్రతినిధి, ‘‘వెంటనే కావాలంటే ఒకే ఒక ఉద్యోగం ఉంది. నీకు ఇష్టమైతే, ఈ రోజు నుంచే ఆ ఉద్యోగంలో చేరవచ్చు,'' అన్నాడు.
 
‘‘ఏమిటా ఉద్యోగం?'' అని అడిగాడు నిత్యానందుడు ఆతృతగా. ‘‘నగరం గుండా ప్రవహించే నదిలోని చిరు అలలను లెక్కించే ఉద్యోగం!'' అన్నాడు రాజప్రతినిధి.
 
‘‘అలాగే, ఈరోజే ఉద్యోగ బాధ్యతలు చేపడతాను,'' అన్నాడు నిత్యానందుడు ఏదో ఒక ఉద్యోగం కావాలన్న తపనతో.
 
రాజప్రతినిధి ఉద్యోగంలో నియమిస్తున్నట్టు పత్రం రాసి రాజముద్రికవేసి అతనికి ఇచ్చాడు. నిత్యానందుడు అప్పటికప్పుడే పద్దు పుస్తకంతో నదివద్దకు వెళ్ళి ఒక పడవలో చాలా దర్జాగా కూర్చున్నాడు. ఆ రోజుల్లో నదీ జలమార్గమే ప్రధాన రవాణా మార్గం గనక, అతడు బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలోని ఒక వంతెన పక్కన తన పడవను ఆపి, నదిలో లేచే చిరుఅలలను దీక్షగా లెక్కించసాగాడు.
 
ఈ సంగతి కొన్ని రోజులలో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అందరూ కొత్తగా ఏర్పరచబడిన అలల అధికారిని గురించే మాట్లాడుకోసాగారు.

ఈ విచిత్రమైన అధికారిని ఎందుకు నియమించారు? దీనివల్ల ఒరిగే ఉపయోగం ఏమిటా అని పలువురు ఆశ్చర్య పడసాగారు. అయినా, నిత్యానందుడు ఆశించినట్లే చుట్టుపక్కల వాళ్ళు అతని పట్ల అంతకు ముందు లేని గౌరవ మర్యాదలను కనబరచసాగారు. రాజాజ్ఞను నెరవేరుస్తున్నాడు కదా మరి! సమాజంలో గౌరవం పెరగడంతో అతనిభార్య రాధ కూడా ఎంతో మురిసిపోయింది. తమ కోరిక తీరినందుకు తృప్తి చెందింది.
 
తనకు వచ్చిన గుర్తింపు గమనించిన నిత్యానందుడు తన అధికార పరిథిని విస్తరించడానికి ఉపక్రమించాడు. రోజూ అలలను లెక్కించి పద్దు పుస్తకంలో రాసే నిత్యానందుడు, అటుకేసి వచ్చే పడవలను దూరంలోనే ఆపమని ఆజ్ఞాపించేవాడు. తను వేసే లెక్కలకు అంతరాయం కలుగుతుందని అదిలించేవాడు. అలలను లెక్కగట్టే నెపంతో పడవలను గంటలకొద్దీ కదలకుండా ఆపసాగాడు.
 
పడవలు నడిపేవాళ్ళకు ఇది మహా ఇబ్బందిగా తయారయింది. తమ పడవలు సాఫీగా నడవాలంటే కొత్త అలల అధికారిని మంచి చేసుకోవాలనుకున్నారు. ఆ కారణంగా జీతం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ నిత్యానందుడికి క్రమంగా రాబడి పెరగసాగింది. ఆఖరికి అతడు తొలినుంచి ఎదురు చూస్తున్న సువర్ణ అవకాశం రానే వచ్చింది.
 
అలలను లెక్కించడంలో నిమగ్నుడై వున్నప్పుడు దూరంగా ఒక ‘షికారా'లో సోమనాధుడు కుటుంబంతో రావడం చూసి అతడు ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయాడు. బంధువుల పెళ్ళికి వెళుతూండడం వల్ల సోమనాధుడూ, భార్యాపిల్లలూ చక్కటి దుస్తులు ధరించి ఉన్నారు. షికారా తనకు కొద్ది దూరంలో ఉండగానే ‘‘ఆగూ!'' అని కేకపెట్టాడు నిత్యానందుడు. షికారాను ఆపి, సోమనాధుడు కారణం అడిగాడు. ‘‘నేను నదిలో లేచే చిరు అలలను లెక్కగడుతున్నాను.
 
నువ్వు ఇప్పుడు ఇలావచ్చావంటే నాపనికి అంతరాయం కలుగుతుంది. అక్కడే ఆగు!'' అంటూ నిత్యానందుడు అలలను మళ్ళీ మళ్ళీ లెక్కించడంలోనూ, పుస్తకం రాయడంలోనూ నిమగ్నుడై పోయాడు. సమయం గడిచిపోతోంది. అయినా నిత్యానందుడి రాజోద్యోగధర్మం పూర్తికాలేదు. ఇంకా లెక్కిస్తూనే ఉన్నాడు. పెళ్ళి ముహూర్తం సమీపిస్తోంది.
 
తొందరగా వెళ్ళాలి. సోమనాధుడికి కోపం వచ్చింది. అయినా, అధికారి అయిన నిత్యానందుడి ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళలేకపోయాడు! ఆఖరికి సోమనాధుడు, ‘‘అయ్యా, అలల అధికారిగారూ, పెళ్ళి ముహూర్తం దాటి పోతోంది. ద…యతలచి మమ్మల్ని కాస్త వెళ్ళ నివ్వండి!'' అన్నాడు విన…యంగా. నిత్యానందుడు గంభీరంగా తలపంకించి సోమనాధుణ్ణి వెళ్ళమని సైగచేసి, తృప్తిగా నవ్వుకున్నాడు.
 
ఆ తరవాత కొన్నాళ్ళకు, సోమనాధుడూ అతని భార్యా నిత్యానందుడి కుటుంబం పట్ల ఉన్న శత్రుభావాన్నీ, కోపాన్నీ వదులుకున్నారు. క్రమంగా రెండు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు చోటుచేసుకున్నాయి.

No comments:

Post a Comment