Pages

Tuesday, September 11, 2012

దయ్యం వదిలింది


వాణీ, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్ళకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్మా, వాణీ భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే, వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. ‘‘పట్నానికని బయలుదేరి, వర్షంలో చిక్కుపడ్డాం.
 
ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా?'' అని వాళ్లు అడిగారు. ‘‘లోపలికి రండి,'' అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి, భోజనం పెట్టి, పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళుతిన్నాక అన్నం కొద్దిగామిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు. ముద్దగా తడిసిపోయూయి. ‘‘ఇద్దరమూ చెరిసగమూ తిందాం,'' అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని, పడుకున్నారు.
 
తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్లు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని, వెక్కివెక్కి ఏడుస్తున్నది. వాణీ వర్మలు నిర్ఘాంతపోయి, ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. ‘‘నా కాపరం గంగపాలయింది! రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది.
 
రాత్రి నా భర్త మీ ఆలూమగల అన్యోన్యం చూసి, ‘నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా నాలుగు మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి?' అని, ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళి పోయూడు. మొండిమనిషి! మళ్లీ తిరిగి రాడు.

ఇక నా బతుకేంగాను? ఏం చేయను? ఎక్కడికని వెళ్ళను?'' అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్తకోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. ‘‘నాకు తెలుసు, ఆయన రాడు. నా కింకెవరూ లేరు. లోతయిన బావి చూసి దూకేస్తాను,'' అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది.
 
‘‘నువ్వు ఏమీ బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు,'' అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్లింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి, నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు రెండు, మూడు నెలల కొకసారి అలా వస్తూంటాడు.
 
కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికి చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యూక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలా సేపటిదాకా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపట్టుతూండగా ఏదో అలికిడి అయి, మెలుకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని, చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది!
 
వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తనా, కిటికీ చప్పుడూ అనుమానం కలిగించాయి. ఆమె వంట గదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి, చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు.
 
చంద్రమతి ఒక గిన్నెలో అన్నమూ, కూరా, పులుసూ, పెరుగూ అమర్చి, కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ‘‘ఇంకా ఎన్నాళ్లు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చెయ్యి,'' అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణంచేత ఆ మనిషి మురారికి కనిపించలేదు.

‘‘ఇప్పుడిప్పుడే వీళ్ళకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపికపట్టు,'' అన్నది చంద్రమతి. ‘‘అమ్మ దొంగముండా! పైకి అమాయకంగా కనిపిస్తూ, మావాళ్ళ మంచితనాన్ని ఆసరాచేసుకుని, మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను!'' అంటూ మురారి తనలో అనుకున్నాడు.
 
అతను వెంటనే వెళ్ళి పడుకుని, చంద్రమతి గురించి వాణీ, వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యూన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, ‘‘బాబోయ్‌, రాత్రి నేను కన్నుమూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జెలచప్పుడు! నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటివైపుకు ఈడ్చుకు పోయింది.
 
కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయట పడ్డాను. మరొకరైతే, హరీ అనేవాళ్ళు,'' అన్నాడు. వాణీ, వర్మా ఈ మాట విని హడలి పోయి, ‘‘అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం,'' అన్నారు. ‘‘మీరేమీ కంగారుపడకండి, ఎటువంటి దయ్యూన్ని అయినా నేను వదలగొట్టగలను,'' అని మురారి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని, అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు.
 
తరవాత అతను తలగడను మంచంమీద నిలువుగా అమర్చి, వాటిమీద దుప్పటి కప్పి, పెరటివైపు వెళ్ళి, వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలా సేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని, చంద్రమతి వచ్చి, గిన్నెలో అన్నీ సర్ది, మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి, ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి, మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి, ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు.
 
చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి, కిటికీని సమీపించి, బయట తన భర్త జాడ కనబడక, వంటగది తలుపు మూసి, తనగదిలోకి వెళ్ళి, కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మా, వాణీ ఉలిక్కిపడి లేచి, చంద్రమతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు.

చంద్రమతి భయంతో, ‘‘దయ్యం ఉన్న మాట నిజమే! నాకూ గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదికి వచ్చింది,'' అన్నది. ‘‘భయపడకండి. త్వరలోనే ఈ దయ్యం భరతం పట్టుతాను,'' అన్నాడు మురారి. రెండు రోజులపాటు అతను రాత్రిళ్ళు గజ్జెలచప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే, తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది.
 
మూడోరోజు రాత్రి మురారి బయటనే పొంచి వుండి, చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా, తాను అదే దారిన వెళ్ళబోతున్నవాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, ‘‘నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా? నేను చూస్తాను!'' అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ‘‘ఏం జరిగిందండి?'' అని అనుమానంగా అడిగాడు. ‘‘ఇంకా ఏం జరగాలండీ? ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు.
 
ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిణ్ణి చేసుకుంటాడట! ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే వున్నది!'' అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి, వీధితోవన లోపలికివచ్చి, తనమంచం మీద పడుకుని నిద్రపోయూడు. మురారి చెప్పినమాటమీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మూడు రోజులుగా అతనికి కిటికీ తెరవటంలేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, ‘‘నేను బుద్ధి గడ్డితిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను.
 
ఆమెను నాతో పంపెయ్యండి,'' అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణీ, వర్మలు బాధ పడుతూంటే, ‘‘దయ్యం వదిలిందని సంతోషించక బాధ పడుతున్నారా?'' అంటూ మురారి జరిగిన సంగతి వాళ్ళకు చెప్పి, వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయూడు.

No comments:

Post a Comment