Pages

Tuesday, September 11, 2012

ముగ్గురు రాకుమారులు


రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించే వారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ముగ్గురూ యుక్త వయస్కులయ్యూరు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి వుంది. అందువల్ల రాజు వారిని ఒకనాడు చేర బిలిచి, ‘‘మీరు ముగ్గురూ దేశాటన చేసి ప్రజల స్థితిగతులను, ప్రత్యక్షంగా చూసి తెలుసు కోవాలి.
 
రేపు తెల్లవారగానే ముగ్గురూ మూడు దిశలకేసి వెళ్ళి, సాయంకాలానికల్లా తిరిగివచ్చి మీరు చూసినదానిని గురించి నాకు చెప్పండి,'' అన్నాడు. మరునాడు తెల్లవారగానే, ముగ్గురు రాకు మారులూ బయలుదేరారు. పెద్ద కుమారుడు రాజకీర్తి తూరుపు దిక్కుకేసీ, రెండవ రాకు మారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసీ, మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసీ పయనమయ్యూరు. సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. ఒక కొలను గట్టున పచ్చిక మేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. దాపులనే వున్న పొడవైన చెట్టు కింద ఆశీసునుడైన ఒక యోగి ఆ గుర్రాల కేసి తదేకంగా చూస్తున్నాడు. రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి మందహాసం చేస్తూ, ‘‘నువ్వు ఎవరివి నాయనా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?'' అని అడిగాడు. రాజకీర్తి తాను ఎవరైనదీ చెప్పి, తాను వెళు తూన్న కార్యం గురించి వివరించి, ‘‘మహాత్మా! 

తమరు అనుమతించినట్టయితే, మీ గుర్రాలలో ఒకదాని మీద వెళ్ళి, మరిన్ని ప్రదేశాలనూ, మరింత ఎక్కువ మందినీ చూసి వస్తాను,'' అన్నాడు. ‘‘అలాగే, నీకు కావలసిన గుర్రాన్ని తీసుకు వెళ్ళు. అయితే, సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి. నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియజేయూలి,'' అన్నాడు యోగి. రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడు.
 
చాలా దూరం ప్రయూణం చేశాక ఆయనకు ఒక తోట కని పించింది. తోటమాలి కోసం చుట్టుపక్కల కలయచూశాడు. తోటమాలి కనిపించలేదు గాని, తోట చుట్టూ బలమైన కంచె వేసి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయూడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది. ఆయన చూస్తూండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగా మారి తోటలోని పళ్ళనూ, కాయగూరలనూ తెగనరకడం ప్రారంభించాయి.
 
యువరాజు రాజకీర్తి తన కళ్ళను తనే నమ్మలేక అమితాశ్చ ర్యంతో వెనుదిరిగాడు. అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయూడు. అప్పుడు యోగి, ‘‘దాచు కోలేని ఆశ్చర్యంతో సతమతమవుతున్నట్టు న్నావు. ఏమిటి విశేషం?'' అని అడిగాడు. రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు. అంతా విన్న యోగి, ‘‘ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. ‘‘అంతా విచిత్రంగా వుంది. ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా,'' అన్నాడు రాజకీర్తి.
 
‘‘ఇలాంటి సామాన్యమైన విషయూలను కూడా అర్థం చేసుకోలేనివాడివి, రేపు రాజ్య పాలన ఎలా చేయగలవు? రాజ్యం, మూర్ఖుడైన రాజును భరించలేదు. నిన్నిప్పుడే రాతిస్తం భంగా మార్చేస్తున్నాను,'' అని యోగి రాజకీర్తిని శపించాడు. రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ములూ, తండ్రీ ఆందోళన చెందారు.
 
మరు నాడు తెల్లవారగానే, రెండవ కుమారుడు రాజ మూర్తి, అన్నను వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణ యించారు. తెల్లవారగానే రాజమూర్తి, తన అన్న వెళ్ళిన మార్గంలో వెళ్ళి అడవిని చేరుకున్నాడు.

కొలను గట్టున మేస్తూన్న గుర్రాలను చూశాడు. యోగికి నమస్కరించి, ‘‘ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఒక గుర్రాన్ని ఇస్తారా?'' అని అడిగాడు. ‘‘నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్తమయంలోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి, నీ అనుభవాలను చెప్పాలి,'' అన్నాడు యోగి మందహాసం చేస్తూ. గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజ మూర్తి పక్కనే శిలగా మారివున్న తన అన్న ముఖం కేసి కూడా చూడలేదు.
 
ఇరువైపులా అన్న కేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు. కాని, వీపు మీద కట్టెల మోపు మోస్తూ వంగి పోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు. రాజమూర్తికి అత నిపై జాలి కలిగింది. అతడు గుర్రాన్ని ఆపి, ‘‘తాతయ్యూ, కట్టెల మోపు నేను మోసుకు రానా?'' అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి చూడలేదు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పుల్లలు ఏరడంలో నిమగ్నుడై కనిపించాడు.
 
రాజమూర్తికి చాలా వింతగా తోచింది. సూర్యుడు పడమటి దిశకు చేరడంతో ఆయన వెనుదిరిగి వచ్చి, గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్క రించాడు. ‘‘దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదు రయ్యూ ఏమిటి?'' అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ. రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు. ‘‘నువ్వు అందిస్తానన్న సాయూన్ని ఆ ముసలి వాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా?'' అని అడిగాడు యోగి.
 
‘‘తెలియదు మహాత్మా. అతడొక మాట కూడా మాట్లాడలేదు,'' అన్నాడు రాజమూర్తి. ‘‘ఇలాంటి స్వల్ప విషయూలు కూడా తెలి యని నువ్వు, మునుముందు రాజువైతే కష్ట తరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు? నువ్వు మూర్ఖుడివి. రాకు మారుడిగా వుండ తగవు. నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను,'' అన్నాడు యోగి.
 
రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గురయ్యూడు. మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతు క్కుంటూ వెళతానన్నాడు. తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని, కొలను దగ్గర మేస్తున్న గుర్రాలనూ, యోగినీ చూశాడు.

పక్కనే వున్న రెండు రాతి స్తంభా లనూ, వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖ పోలికలనూ చూసి ఆశ్చర్య పోయూడు. యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు. ‘‘అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు,'' అంటూ మందహాసం చేసిన యోగి, ‘‘నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలానికి తిరిగివచ్చారు.
 
వాళ్ళు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేక పోయూరు. నేనే వారిని శిలా స్తంభాలుగా మార్చేశాను,'' అన్నాడు. ‘‘వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెల వివ్వండి, మహాత్మా,'' అన్నాడు రాజస్నేహి. ‘‘ఆ గుర్రాలలో ఒకదానిని అధిరోహించి ముందుకు వెళ్ళు. ఏదైనా వింత దృశ్యం కని పిస్తే వచ్చి నాతోచెప్పు. దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చా వంటే మీ ముగ్గురన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు,'' అన్నాడు యోగి.
 
రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచిం చాడు. తన అన్నలను కాపాడుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో, యోగికి నమస్కరించి, ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు. అతడు ఎంతదూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం గానీ, వింత వ్యక్తి గానీ తారసపడలేదు. చాలా దూరం వెళ్ళడం వల్ల అతడికి దాహం వేసింది.
 
గుర్రా నికి కూడా కాస్సేపు విశ్రాంతినిద్దాం అన్న ఉద్దే శంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు. గుర్రాన్ని పచ్చిక మేయడానికి వదిలి తను దాహం తీర్చుకోవడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు అందు కోబోయూడు. నీళ్ళు చేతులకు అందకుండా కుంచించుకు పోవడం గమనించి ఉలిక్కి పడ్డాడు. నీళ్ళలో దిగి మరికొంత ముందుకు వెళదామని రెండడుగులు వేశాడు.
 
నీళ్ళు రెండ డుగులు వెనక్కువెళ్ళాయి. అతడు లోపలికి వెళ్ళే కొద్దీ నీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళసాగాయి. అతడు కొలను మధ్యకు చేరుకునే సరికి చుట్టూ ఇసుక తప్ప, బొట్టు నీళ్ళు కంటబడలేదు! అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు. తనకు ఎదురైన అను భవాన్ని చెప్పాడు. అంతావిన్న యోగి, ‘‘ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. రాజస్నేహి ఎంత ఆలోచించినా సరైన సమా ధానం స్ఫురించలేదు.

యోగికి ఆమోదయోగ్య మైన సమాధానం చెప్పలేకపోయూడు. ‘‘రాకు మారా, నువ్వు కూడా మీ అన్నలకన్నా తెలివైన వాడివేం కాదు. నీకూ, నీ అన్నల గతి తప్పదు,'' అన్నాడు యోగి. మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తం భంగా మారిపోయూడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతకూ రాకపోయేసరికి రాజభవనం లోని రాజు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యూడు.
 
తనే చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవిలలాడి పోయూడు. వాళ్ళ కేమయిందో ఎవరికీ తెలి యదు. రాకుమారులను వెతకడానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు. అయినా రాజు వినలేదు. తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకు న్నాడు. మరునాడు వేకువజామున తన కుమా రులు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి, అడవిని చేరి, మేస్తూన్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు.
 
ఆయనకున్న యోగ శక్తుల ద్వారా, యోగి తన కుమారుల ఆచూకీని తెలియ జేయగలడని రాజు ఆశిం చాడు. రాజు యోగిని సమీపించి నమస్కరించి, ‘‘మహాత్మా, నా ముగ్గురు కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటా రనుకుంటాను....'' అంటూ ఇంకా ఏదో చెప్ప బోయేంతలో యోగి అడ్డుపడి, ‘‘అవును మహారాజా, వచ్చారు. వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను. చాలా సులభ మైనవి. కాని సమాధానం చెప్పలేకపోయూరు.
 
అలాంటి మూఢులకు మునుముందు రాజ్య పాలన చేసే అర్హత లేదు. అందుకే వారిని శిలా స్తంభాలుగా మార్చివేశాను. అదిగో చూడు!'' అన్నాడు. రాజు మూడు రాతిస్తంభాలనూ, వాటి పైభా గంలో తన కుమారుల ముఖజాడలూ చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపు మౌనం వహించి, ఆ తరవాత, ‘‘ఆ ప్రశ్నలేవో చెప్పండి.
 
నా బిడ్డల తరఫున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్ని స్తాను,'' అన్నాడు. ‘‘నీ జ్యేష్ఠ కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు. కంచెగా వున్న పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగామారి, తోటలోని పళ్ళను, కాయలను తెగనరకడం ప్రారంభిం చాయి.

దీని అంతరార్థం ఏమిటి?'' అని అడిగాడు యోగి. ‘‘తోటలోని చెట్టు చేమలను కాపాడడానికే కంచె ఏర్పాటు చేయబడింది. తన యజమాని ఆస్తిని నాశపరిచే సేవకుడిలాంటిది ఆ కంచె,'' అన్నాడు రాజు. యోగి మందహాసం చేసి, రెండవ రాకుమా రుడు చూసిన దృశ్యం గురించి చెప్పి, ‘‘రాజా! ఆ ముసలివాడు మోస్తూన్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండు కట్టెలు ఏరు తూనే ఉన్నాడు.
 
దీని భావం ఏమిటో చెప్పగ లవా?'' అని అడిగాడు. ‘‘ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు. పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాశాపరుల దురవస్థకు చిహ్నం ఆ దృశ్యం!'' అన్నాడు రాజు. ‘‘బాగా చెప్పావు,'' అని మరొక్కసారి మంద హాసం చేసిన యోగి, ‘‘నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవడానికి వెళితే కొలనులోని నీళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయూయి. మరి దీని వివరణ ఏమిటి రాజా?'' అని అడిగాడు.
 
‘‘సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి, పనికిమాలిన వాటికోసం వృధా చేసే వారికి చివరికి ఏదీ మిగలదు!'' అన్నాడు రాజు. మరుక్షణమే రాకుమారులు ముగ్గురూ నవ్వుతూ కనిపించారు. రాతిస్తంభాల జాడలేదు. ‘‘నా కుమారులకు మళ్ళీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళతాను.
 

తమరు కరుణతో రాజధానికి విచ్చేసి, నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తు న్నాను,'' అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ. రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు. ‘‘మీరు ముగ్గురూ మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి, నేను త్వరలో వస్తాను,'' అని రాకుమారులను ఆశీర్వ దించాడు. రాజూ, రాకుమారులూ సంతోషంగా రాజ ధానికి బయలుదేరారు. మరి కొన్నాళ్ళకు రాజ ధానికి వచ్చిన యోగికి, భక్తి ప్రపత్తులతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. యోగి రాకుమా రులను వివేక వంతులుగా, ఆదర్శపాలకులుగా తీర్చిదిద్దాడు. 

No comments:

Post a Comment