Pages

Tuesday, September 11, 2012

తరగని నిధి


సూరప్ప పేదరైతు. పగలంతా భార్యతో కలిసి పొలంలో పనిచేసేవాడు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి అయినప్పటికీ, ఆ దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వీరప్పను ఏలోటూ లేకుండా అల్లారు ముద్దుగా పెంచారు. తమ బిడ్డయినా నాలుగు అక్షరాలు నేర్చుకుని సుఖపడాలని ఆశించారు. అయితే, వీరప్పకు ఒళ్ళొంచి పనిచేయూలంటే మహాబద్ధకం. చదువంటే పరమ చిరాకు.
 
వ్యాపారం చెయ్యడం కష్టం. కత్తి సాము వంటి యుద్ధవిద్యలు నేర్వాలంటే అందుకు సాధన చేయూలని భయం. అయినా ఇవన్నీ ఏమీ చెయ్యకుండానే వైభవంగా జీవించాలని మనసు. అందువల్ల ఎలాంటి శ్రమా పడకుండా సులభంగా సుఖసంతోషాలతో జీవించడం ఎలాగా అని ఎల్లప్పుడూ ఊహల్లో తేలుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఊరికి ఆనుకునివున్న అడవికి ఆవలగల కొండ గుహలో ఉంటూన్న సుపథుడనే యోగి గురించి వీరప్పకు తెలియవచ్చింది.
 
మహిమలు గల ఆ యోగి, దాపులనున్న సెలయేటిలో స్నానం ముగించి వస్తూండగా మొదట నమస్కరించిన వారి కోరికలు ఏవైనా సరే తీరుస్తాడని తెలియడంతో వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరాడు. సూర్యోదయం వేళ యోగి స్నానం ముగించి గుహకు తిరిగివస్తూండగా వీరప్ప ఆయన పాదాలకు నమస్కరించి, ‘‘సులభమార్గంలో వైభవంగా జీవించడానికి తమ ఆశీస్సులు కావాలి,'' అన్నాడు.

‘‘కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదు. అయినా, ఈ సమయంలో ప్రార్థన మన్నించడం నా నియమం గనక, ఈ తావీదును ఇస్తున్నాను. దీని సాయంతో పైకిరావడానికి ప్రయత్నించు, అయితే, ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందన్న విషయం గుర్తుంచుకో. మనోరథ సిద్ధి ప్రాప్తిరస్తు!'' అని దీవించి ఒక తావీదును ఇచ్చి వెళ్ళాడు సుపథుడు.
 
మహిమగల తావీదు సులభంగా దొరకడం అదృష్టమనుకుంటూ వీరప్ప అక్కణ్ణించి బయలుదేరి ఒక నగరం చేరుకున్నాడు. పగలంతా నగర వీధిలో అటూ ఇటూ తిరుగుతూంటే ఒక చోట విధనుడు, వివేకుడు అనే ఇద్దరు మిత్రుల సంభాషణ అతణ్ణి ఆకర్షించింది. ‘‘వ్యాపారంలో ఒక్క రోజులో లక్షవరహాలు లాభం వచ్చిందని విన్నాను. అసలే ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది.
 
డబ్బంతా ఎక్కడ దాస్తున్నావు? జాగ్రత్త సుమా,'' అన్నాడు వివేకుడు. ‘‘నా ఇంటికి గట్టి కాపలా ఉందిలే కానీ, మొదట నీ సంగతి చూసుకో. మిత్రమా! ఈ మధ్య నీకు సన్మానాల మీద సన్మానాలు కదా! వచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నావు? అసలే నీ ఇంటికి కాపలా కూడా లేదు,'' అన్నాడు విధనుడు. వివేకుడు నవ్వి, ‘‘వచ్చిన సొమ్మంతా ఎప్పటికప్పుడు తరగని నిధిగా మార్చేస్తున్నాను.
 
దొంగలు దోస్తే కుబేరుడి కోశాగారం వట్టి పోతుందా? నా ఇల్లూ అంతే. దానికి కాపలా అక్కర లేదు,'' అన్నాడు. వారి మాటలు విని వీరప్ప మనసు ఆనందంతో ఉప్పొంగింది. అదృష్టం కొద్దీ వివేకుడింట తరగని నిధి ఉన్నట్టు తెలిసింది.

దాన్ని దోచుకుంటే తన జీవితమంతా వైభవంగా బతకవచ్చు. వివేకుణ్ణి అనుసరించి వెళ్ళి ఆ ఇల్లెక్కడో చూసుకున్నాడు. అది పెద్ద మేడ కావడంతో అక్కడ పెద్ద నిధే ఉండవచ్చని మురిసిపోయూడు. రాత్రికాగానే ఆ ఇంటి ముందుకు వచ్చి చేతికి తావీదు కట్టుకుని సుపథుడి పేరు ముమ్మారు స్మరించి, ధైర్యంగా ఇంటిలోకి ప్రవేశించాడు. లోపల ఎక్కడ చూసినా అందమైన చిత్రపటాలు, మనోహరమైన రాతిశిల్పాలు కనిపించాయి.
 
లెక్కలేనన్ని తాళ పత్ర గ్రంథాలు ఉన్నాయి. తను ఊహించినట్టు వజ్రవైడూర్యాలు, వెండి, బంగారు వస్తువులు, ఆభరణాలు కనిపించలేదు. వెదికి వెదికి విసిగిపోయిన వీరప్ప నీరసంగా ఇంటి బయటకొచ్చాడు. వివేకుడి తరగని నిధి రహస్యం గురించి సుపథుడినే అడగాలని నిర్ణయించుకుని తిరిగి అడవికి వెళ్ళాడు. జరిగింది విన్న సుపథుడు నవ్వి, ‘‘పండితులకు తరగని నిధి అంటే డబ్బు కాదు, జ్ఞానం.
 
ఆ జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటుంది. వివేకుడు తను సంపాదించిన సొమ్మును పుస్తకాల సేకరణకే వినియోగిస్తాడు. అందుకే దొంగలు దోచుకుంటారనే భయం ఉండదు,'' అన్నాడు. ‘‘మరి నేనిప్పుడేం చేయూలి? తమరిచ్చిన తావీదు వృథాయేనా?'' అన్నాడు వీరప్ప దీనంగా. ‘‘నువ్వు ఎన్నుకున్నది వివేకుడి ఇల్లు కాబట్టి, తిరిగి ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన్ను ఆశ్రయించి జ్ఞానం సముపార్జించు.
 
తావీదు మహిమ వల్ల నీకు గ్రహణ శక్తి పెరిగి త్వరగా జ్ఞానవంతుడివవుతావు. ఆ జ్ఞానమే నీకు తరగని నిధి అయి, నీ జీవితాన్ని వైభవంగా మార్చగలదు,'' అన్నాడు సుపథుడు మందహాసంతో. ఆయన చెప్పినట్టే వీరప్ప వివేకుడి నాశ్రయించి, జ్ఞాన సముపార్జన చేసి, క్రమ క్రమంగా పండితుడిగా గుర్తింపు పొంది, గౌరవ ప్రతిష్ఠలతో కలకాలం సుఖసంతోషాలతో జీవించాడు.

No comments:

Post a Comment