Pages

Tuesday, September 11, 2012

ఎవరి మెడకు ఉరి?


ఒకానొకప్పుడు సత్యానందుడనే గురువు నడుపుతూన్న గురుకులంలో దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించేవారు. వారిలో రాకుమారులు, పండితుల బిడ్డలు, వ్యాపారుల పిల్లలు అంటూ రకరకాలుగా ఉండేవారు. సత్యానందుడు అందరినీ సమానంగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పేవాడు.
 
ఎవరి పట్లా ప్రత్యేక శ్రద్ధ, పక్షపాతం అంటూ చూపేవాడు కాడు. మామూలుగా విద్యార్థులు ఐదేళ్ళపాటు అక్కడ విద్యాభ్యాసం చేసి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళేవారు. విద్య పూర్తయ్యే సమయంలో గురువు తన శిష్యులలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి దేశాటన చేసి తిరిగి వచ్చిన తరవాత కొత్త విద్యార్థులతో నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేవాడు.
 
అలా ఒక సంవత్సరం చివర గురువు ప్రతాపుడనే పదిహేనేళ్ళ శిష్యుణ్ణి తన వెంట రమ్మని పిలిచాడు. గురువుగారి వెంట వెళితే కొత్త కొత్త ప్రదేశాలను చూడవచ్చు; అక్కడి స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో ప్రతాపుడు అందుకు సంతోషంగా సమ్మతించాడు. మరో రెండు మూడు నెలలు గురువు వెంట ఉండి, ఎంతో జ్ఞాన సముపార్జన చేయవచ్చని ప్రతాపుడు ఆశించాడు.
 
ఒకనాటి వేకువజామున గురుశిష్యులిద్దరూ దేశాటనకు బయలుదేరారు. గురువు వెనక శిష్యుడు నడవాలి. నడిచి వెళ్ళేప్పుడు మాట్లాడకూడదు. ఏ చెట్టు కిందో, సత్రంలోనో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాత్రమే శిష్యుడు తను చూసినవాటిని వివరించి, అనుమానాలు ఉంటే గురువును అడగవచ్చు. గురువు తగిన వివరణతో అనుమాన నివృత్తి చేస్తాడు. ఇదీ ప్రయూణంలో అనుసరించవలసిన నియమం.

ఆలయూలను సందర్శించినప్పుడు స్థానికులు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి, ఒకటి రెండు రోజులు గడిపి ప్రయూణాన్ని కొనసాగించేవారు. రాజధానీ నగరాలగుండా వెళ్ళేప్పుడు రాజులను సందర్శించి, గురువు వారితో రాజ్యంలోని పరిస్థితుల గురించి చర్చించే వాడు. సామాన్య ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేవారు.
 
ఆ విధంగా వెళుతూన్న గురుశిష్యులు బోధ్‌పురి అనే రాజ్యంలో ప్రవేశించారు. రాజధానీ నగరం చేరి రాజభవనాన్ని చేరేలోగా వారికి ఆ రాజ్యాన్ని ఏలుతూన్న రాజు పరమ మూర్ఖుడనీ, విచిత్రమైన ప్రవర్తన కలవాడనీ తెలియవచ్చింది. ఆయన తనలాంటి మూర్ఖులకే మంత్రి పదవులిచ్చి ఘనంగా సత్కరించేవాడు. గొప్పగా జీతబత్తాలిచ్చేవాడు. రాజాస్థానంలోని మేధావంతులకు చాలీచాలని జీతాలిచ్చి వారినీ, వారి కుటుంబాలనూ వేధించేవాడు. అందువల్ల వారు అవినీతికి పాల్పడేవారు.
 
అయినా వారిని రాజు కనిపెట్టలేకపోయేవాడు. దీనికి తోడు తనకు తోచిన వింత వింత ఆలోచనలను వెంటనే అమలు పరచేవాడు. ధాన్యాలకు, కాయగూరలకు, బట్టలకు, చెప్పులకు అన్నిటికీ ఒకే ధర నిర్ణయించేవాడు. ఇదేమిటని అడిగిన వారినీ, అనారోగ్యం కారణంగా పనిపాటులకు వెళ్ళలేని వారినీ కఠినంగా శిక్షించేవాడు.
 
ఇలాంటి విడ్డూరాలను వింటూ గురువు వెంట నడుస్తూన్న ప్రతాపుడికి అనుమానం తలెత్తి, ‘‘అలాంటి మూర్ఖశిఖామణి అయిన రాజును చూస్తే మనకూ ఏదైనా ప్రమాదం ఏర్పడవచ్చు. ఆయన్ను చూడకుండా మనం దారి మళ్ళించండం క్షేమం అనుకుంటాను, గురువర్యా!'' అన్నాడు. ‘‘మనం విన్నవన్నీ నిజమే అని మనకు ఎలా తెలుసు? స్వయంగా వెళ్ళి చూసి నిజానిజాలు తెలుసుకుందాం,'' అన్నాడు గురువు. ఇద్దరూ రాజభవన ద్వారం వద్దకు చేరి రాజును దర్శించాలని చెప్పారు.
 
సభలో న్యాయవిచారణ జరుగుతున్నదని చెప్పి, కాపలా భటులు వారిని లోపలికి అనుమతించారు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. నిండుసభలో ఇద్దరు స్ర్తీలు రాజు ఎదుట నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక స్ర్తీ, ‘‘ప్రభూ, మా భర్తలు ఇద్దరూ తోడుదొంగలు. ఒక ధనికవర్తకుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళారు. అతడు ఇంటి వద్ద లేనప్పుడు అతడి ఇంటికి కన్నం వేస్తూండగా గోడ విరిగి పడింది,'' అంటూ భోరున ఏడ్వసాగింది.

‘‘ఆ గోడ విరిగి పడ్డం వల్ల వాళ్ళిద్దరూ చనిపోయూరు. ఆ ఇంటిని సరిగ్గా నిర్మించివుంటే, మా భర్తలు చనిపోయేవారు కారు. ఇంటి గోడను దృఢంగా నిర్మించని ఆ వర్తకుణ్ణి శిక్షించాలి. మా భర్తల ప్రాణాలు తీసినందుకు మాకు తగిన నష్టపరిహారం చెల్లించాలి,'' అంటూ ఫిర్యాదును పూర్తి చేసింది రెండవ స్ర్తీ. ఆ తరవాత ఇద్దరు స్ర్తీలూ కొంగుతో కన్నీళ్ళు తుడుచుకోసాగారు.
 
‘‘ఆ వర్తకుణ్ణి తీసుకురండి!'' అని ఆజ్ఞాపించాడు రాజు. భటులు వర్తకుణ్ణి రాజు ఎదుట హాజరుపరిచారు. ‘‘ప్రభూ! గోడ కూలడంలో నా అపరాధమేమీలేదు. పోయిన సంవత్సరం దానిని కట్టిన తాపీ పనివాడు దృఢంగా కట్టలేదు. అందుకే అది అలా కూలి పోయింది. అందువల్ల అది తాపీ పనివాడి తప్పు,'' అన్నాడు వర్తకుడు. ‘‘తాపీ పనివాణ్ణి ఈడ్చుకు రండి,'' అని రాజు భటులను ఆజ్ఞాపించాడు.
 
వాడు వచ్చి రాజుపాదాలపై బడి, ‘‘ప్రభూ ఇందులో నా తప్పేమీ లేదు. నీళ్ళు మోసుకొచ్చే వాడు ఆ రోజు నేను చూస్తూండగానే ఎక్కువ నీళ్ళు పోసి కలిపాడు. అధిక తేమ వల్లనే గోడ బలహీనపడిపోయింది. గోడ కూలిపడడానికి తప్పు వాడిదే,'' అన్నాడు. ‘‘దుర్మార్గుడైన ఆ నీళ్ళు మోసేవాణ్ణి పట్టుకురండి,'' అని ఆగ్రహంతో అరిచిన రాజుకు తీరా వాడు వచ్చాక వాణ్ణి విచారించడానికి కూడా ఓపిక లేక, ‘‘వీణ్ణి లాక్కు పోయి ఉరితీయండి!'' అని ఆజ్ఞాపించాడు.
 
‘‘ఏమిటీ దురన్యాయం!'' అని సభలోని వారందరూ దిగ్భ్రాంతితో వాపోయూరుగాని వాళ్ళ అదృష్టం కొద్దీ అది రాజుకు వినిపించలేదు. అవన్నీ చూస్తూంటే ప్రతాపుడికి వెగటుపుట్టి అక్కడ నిలబడలేక, ‘‘మనం వెళ్ళిపోదాం గురువర్యా! తరవాతి క్షణంలో రాజు ఏం చేస్తాడో తెలియదు,'' అన్నాడు. ‘‘కాదు, నాయనా. నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను,'' అంటూ గురువు రాజుకేసి ఒక అడుగు ముందుకు వేసి, ‘‘రాజా! ఒక్క క్షణం ఆలోచించి చూడు! నీళ్ళు మోసేవాడికి తమరు విధించిన శిక్ష అన్యాయం కాదా?'' అన్నాడు.

‘‘న్యాయూన్యాయూల గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు? నీ పొగరుబోతుతనాన్ని నేను ఉపేక్షించ లేను,'' అన్న రాజు భటుల కేసి తిరిగి, ‘‘ ఆ నీళ్ళు మోసే వాడికి బదులు, ఈ పొగరుబోతును తీసుకెళ్ళి ఉరి తీయండి!'' అని ఆజ్ఞాపించాడు. ఇద్దరు భటులు వచ్చి గురువును చెరొక వైపు పట్టుకుని లాక్కుపోసాగారు.
 
శిష్యుడు ఆయన వెంట నడుస్తూ అదే పనిగా ఆయన చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. దానిని గమనించిన రాజు, ‘‘ఈ సమయంలో నీ శిష్యుడు నీకు చెప్పిన రహస్యం ఏమిటో చెప్పు,'' అని అడిగాడు. ‘‘అతనికి దివ్యదర్శనం కలిగిందట ప్రభూ!'' అన్నాడు గురువు. ‘‘ఏమిటా దివ్య దర్శనం!'' అని అడిగాడు రాజు. ‘‘ఈ శుభ ఘడియలో మరణదండన పొందే వ్యక్తిని తీసుకువెళ్ళడానికి స్వర్గాధిపతి దివ్యరథంలో వస్తున్నాడట! వెంటనే నన్ను ఉరితీయండి.
 
సంతోషంగా స్వర్గానికి వెళతాను,'' అన్నాడు గురువు. ఆ మాటతో ఆగ్రహం చెందిన రాజు, ‘‘నీ కోసం స్వర్గాధిపతి ఎందుకు రావాలి? నేను ఈ రాజ్యానికి రాజును. నువ్వు కేవలం ఒక గురువు! అందువల్ల నీ తరఫున, నీ స్థానంలో నేనే మరణదండన పొంది తిన్నగా వెళ్ళి స్వర్గంలో స్థానం సంపాదిస్తాను,'' అంటూ రాజు ఒక్క గెంతున ఎగిరి ఉరితీసేవాడి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అయితే, ఆ ఉరితీసేవాడు రాజు అంతటి మూర్ఖుడు కాడు.
 
‘‘ప్రభూ! ఈ ఉరిత్రాడు చాలా చిన్నది. తమ మెడకు చాలదు,'' అన్నాడువణుకుతూన్న చేతులతో. రాజు ఆశాభంగంతో వెనకడుగు వేసి తన సింహాసనం కేసి వెనుదిరిగాడు. అంతలో గురువు శిష్యుడితో, ‘‘ఈ కరుడుకట్టిన మూర్ఖుణ్ణి మార్చడానికి ప్రయత్నిస్తే మనమే చిక్కుల పాలవుతాం. ఇలాంటి వారికి దూరంగా ఉండడమే ఉత్తమం. కొందరు ఈ భూమిపై మూర్ఖులుగా పుడతారు.
 
మరి కొందరు పరిస్థితులవల్ల మూర్ఖులవుతారు. దుర్మార్గుల కారణంగా ఇంకా కొందరు మూర్ఖులవుతారు. మనకు ఇలాంటి వారితో పనిలేదు. ప్రపంచంలో కొందరయినా వివేకవంతులు ఉన్నారా అని చూడడమే మనపని, రా వెళదాం,'' అంటూ అక్కడి నుంచి వేగంగా వెలుపలికి వచ్చాడు. ఆ తరవాత ఏమై ఉంటుందో మిగిలిన కథ మీరే ఊహించుకోండి.

No comments:

Post a Comment