Pages

Tuesday, September 11, 2012

కథకు పట్టం


కాకడదేశాన్నేలే కృష్ణభూపతి పట్టపురాణి జ్యోత్స్నాదేవి. రాజదంపతులిరువురూ రాజోచిత విద్యల్లో దాదాపు సమఉజ్జీలుగా ఉండేవారు. భానుదేశాధీశుడి ఏకైక కుమార్తె అయిన జ్యోత్స్నాదేవి అందచందాల్లో, గుణగణాల్లో, మేధస్సులో సాటిలేని మేటి అని విన్న కృష్ణభూపతి, ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు. పట్టపురాణిగా కాకడదేశానికి వచ్చినది మొదలు జ్యోత్స్నాదేవి, పరిపాలనా విషయూల్లో కూడా భర్తకు చక్కని సలహాలు ఇస్తూ ఉండేది.
 
భార్య ప్రోత్సాహంతో రాజు, తరచూ మారువేషంలో వెళ్ళి ప్రజల మంచిచెడ్డలూ, కష్ట సుఖాలూ ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కోసారి రాణికూడా మారువేషం వేసుకుని ఆయన వెంట వెళ్ళేది. ఒకసారి కృష్ణభూపతి, నడివయసు పెద్దమనిషిలా వేషం వేసుకుని నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన నగరంలోని ఒక సత్రాన్ని సమీపిస్తూండగా, దాని అరుగుమీద మధ్య వయస్కులైన భార్యాభర్తలిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు.
 
కృష్ణభూపతి గుర్రం దిగి, వారికి కాస్త ఎడంగా అదే అరుగుమీద కూర్చున్నాడు. ‘‘నగరానికి వచ్చి నాలుగురోజులు దాటింది. వెంట తెచ్చుకున్న రూకలు తరిగిపోతున్నవిగాని, రాజదర్శనం మాత్రం కాలేదు. అయినా నేను చెబుతూనే ఉన్నాను. కథలు చెప్పడం ఏదో పెద్ద పాండిత్యమన్నట్టు ఇలా బయలుదేరవద్దని,'' అంటున్నది భార్య నిష్ఠూరంగా. ఆ మాటలకు భర్త కోపం తెచ్చుకోకుండా, నవ్వుతూనే, ‘‘నేనూ నీకు చెబుతూనే ఉన్నాను. కథల విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా, మహారాజు కృష్ణభూపతికి తప్పక తెలుస్తుందని.

చెప్పవలసిన విషయూన్ని చెప్పవలసిన రీతిలో కథగా మలిచి చెబితే, అది అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తుంది. అందుకు పంచతంత్ర కథలే తార్కాణం! నేనా రీతిలో కథ చెప్పగలనన్న విశ్వాసం నాకు ఉన్నది. నీరసపడిపోకుండా రాజదర్శనం కోసం ప్రయత్నించగల పట్టుదలా అధికంగానే ఉన్నది. ఈ రెండూ ఉంటే సాధించలేనిది లేదు.
 
కావాలంటే అందుకు ఉదాహరణగా నాలాగే రాజదర్శనం కోసం వచ్చిన ఒక క్షురకుడి కథ చెబుతాను, విను,'' అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. కథకుడి మాటలు రాజు కృష్ణభూపతిలో కుతూహలాన్ని పెంచాయి. ఆయన కథకుడి ఇల్లాలికంటే ఆసక్తిగా చెవులు రిక్కించి కథ వినసాగాడు: ఒకప్పుడు గౌడదేశంలోని ఒకానొక పల్లెలో సుందరుడు అనే క్షురక యువకుడు ఉండేవాడు.
 
అతడు తక్కిన క్షురకుల్లా ఏదో మొక్కుబడిగా పనిచేసేవాడు కాదు. తన ఎదుట కూర్చున్న వ్యక్తి ముఖంతీరును బట్టి, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నంత శ్రద్ధగా అతడి తలకట్టును తీర్చిదిద్దేవాడు. వాడిచేత క్షురకర్మ చేయించుకున్నవారి ముఖాల్లో కొత్త అందాలు కనిపించేవి. ఇలా వాడు అందరినీ సుందరంగా తీర్చిదిద్దడం వల్ల, వాళ్ళందరూ వాణ్ణి ‘సుందరుడు' అని పిలవసాగారు.
 
అందరూ తనను మెచ్చుకుంటూవుంటే, సుందరుడిలో చిన్న కోరిక మొలకెత్తి క్రమేణా ప్రగాఢవాంఛగా మారింది. రాజధానికి వెళ్ళి, రాజుగారి తలకట్టును తీర్చిదిద్దాలనీ, ఆయన నుంచి ప్రశంసలు పొందాలనీ కలలు కనసాగాడు. తన పనిలో ఆత్మవిశ్వాసం మెండుగాగల సుందరుడు తన కలను వాస్తవం చేసుకోవాలని నిర్ణయించుకుని, ఒకనాడు సకుటుంబంగా రాజధానికి బయలుదేరాడు.
 
వెళ్ళాడన్న మాటేగాని, రాజధానిలో సుందరుడి కోరిక అంత సులువుగా తీరేట్టు కనిపించలేదు. ‘‘నేను రాజుగారికి క్షురకర్మ అందంగా చేస్తాను. నన్నొక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళనివ్వండి,'' అంటూ సుందరుడు చెప్పిన మాటలు విని, వాణ్ణి భటులు పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు. కొందరు నెమ్మదిగా పొమ్మని చెబితే, మరి కొందరు మెడబట్టి గెంటేశారు.

ఎన్ని సార్లు ప్రయత్నించినా, ఇలాంటి అనుభవమే ఎదురుకావడంతో వాడు నిరుత్సాహ పడుతూన్న సమయంలో ఒక భటుడు, ‘‘అయినా, మహారాజుగారి క్షురకర్మ చేయడానికి గురన్న ఉండగా నీ అవసరం ఏమిటి?'' అని అడిగాడు. ‘‘గురన్నా? అతడి ఇల్లు ఎక్కడ?'' అని అడిగాడు సుందరుడు. ‘‘జామతోట పక్కన పడమటి వీధిలో ఉంది.
 
అతడు క్షురకర్మలో చాలా నిపు ణుడు,'' అన్నాడు భటుడు. సుందరుడు రాజుగారి వాడుక క్షురకుడైన గురన్న వివరాలు సేకరించాడు. అరవైయేళ్ళ గురన్నకు పిల్లా పాపా లేరు. చాలా మంచివాడు. సుందరుడు భార్యకు విషయం చెప్పి, ఆమె ఎలా సహకరించాలో వివరించి, ఉత్సాహంతో సకుటుంబంగా గురన్న ఇంటికి వెళ్ళాడు.
 
గురన్న ఆరుబయట జామచెట్టుకింది తిన్నె మీద కూర్చుని ఉన్నాడు. అతడి భార్య పక్కనే వున్న అరుగు మీద కూర్చుని రాత్రివంటకు కూరగాయలు తరుక్కుంటున్నది. సుందరుడు, ‘‘ఏం బాబాయ్‌, ఎలా ఉన్నావు?'' అని పలకరిస్తూ గురన్న పక్కన కూర్చున్నాడు. వాడి భార్య, గురన్న పెళ్ళాన్ని సమీపిస్తూ, ‘‘అయ్యో! కూరలు కూడా నువ్వే తరుక్కోవాలా, అత్తా! ఏదీ, కత్తిపీట ఇలా తే!'' అంటూ చనువుగా ఆమె దగ్గరినుంచి, కత్తిపీట లాక్కుని చకచకా కూరగాయలు తరగసాగింది.
 
అనుకోని అతిథుల్లా వచ్చిన ఈ కొడుకు-కోడలు ఎవరా అని గురన్న దంపతులు ఆశ్చర్యపోతూండగానే, సుందరుడి నాలుగేళ్ళ కొడుకు, అక్కడున్న జామ చెట్టుకు వేలాడుతున్న కాయలను చూసి, తనకు జామకాయ కావాలని యేడ్వసాగాడు.

‘‘ష్‌, వస్తూనే అలా గొడవ చేయొద్దు. ఆ చెట్టు మనది కాదు,'' అంటూ సుందరుడు కొడుకును మందలించబోయూడు. కాని పసివాడు వినకుండా, ‘‘మరెవరిది? ఈ తాతదా?'' అంటూ అనుమతి కోసమన్నట్టు నవ్వుతూ గురన్నవైపు చూశాడు. పిల్లాపాపా లేని గురన్న దంపతులకు సుందరుడు, పెళ్ళాం కలిపిన వరసలకంటే, పసివాడి ‘తాత' పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది.
 
మరి కాసేపటికల్లా సుందరుడి మంచితనం గురన్ననీ, వాడి భార్య మాట తీరు, పనితనం అతడి భార్యనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరవాత సుందరుడి పని సానుకూల పడటం అంతకష్టం కాలేదు. గురన్న వారసుడిగా కొలువులో ప్రవేశించిన సుందరుడు, వారం తిరక్కుండా రాజును కూడా తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. సుందరుడూ, వాడి భార్యా గురన్న దంపతులను కడదాకా కన్నబిడ్డల్లాగే చూసుకుని పదిమంది చేతా భేష్‌ అనిపించుకున్నారు.
 
కథ పూర్తి చేసిన కథకుడు, ‘‘చూశావా, చదువూ సంధ్యాలేని క్షురకుడే అయినప్పటికీ, ఆత్మవిశ్వాసం, పట్టుదలా ఉన్నకారణంగా సుందరుడు పిన్న వయసులోనే వృద్ధిలోకి వచ్చాడు. నాకూ ఆ రెండూ ఉన్నాయని ముందే చెప్పాను కదా! అందువల్ల సుందరు డికిలాగే నాకూ దైవకృప తోడయితే, రాజదర్శనం లభిస్తుంది,'' అంటూ కృష్ణభూపతి వైపు తిరిగి, ఆయన్ను భార్యకు చూపుతూ, ‘‘ఎక్కడి దాకానో ఎందుకు? ఇదిగో ఈయన కూడా నీతో పాటు నా కథ వినే ఉంటారు.
 
దేవుడి దయ ఉంటే, ఈయనే మహారాజుగారికి నా గురించి చెప్పవచ్చు,'' అన్నాడు. అప్పటిదాకా ఆసక్తిగా కథ విన్న రాజు కృష్ణభూపతి, కథకుడి ఆఖరి మాటలు వింటూనే, అతడికి తను రాజేమోనన్న అనుమానం కలిగిందని గ్రహించాడు. వెంటనే, తలపాగా తీసి పక్కన పెడుతూ, ‘‘అంతేనా... దేవుడి దయ ఉంటే నేనే కృష్ణభూపతినై మీ కథలకు పట్టం కట్టినా కట్టవచ్చు!'' అంటూ మందహాసం చేశాడు.
 

No comments:

Post a Comment