Pages

Tuesday, September 11, 2012

నా బెలూరే... కొకారే బెలూరే...


చెట్టు కింద చెవులు దిమ్మిరెత్తేలా శబ్దం. రోజూ సాయంకాలం తిరిగివచ్చాక, మేమందరం ఒక్కసారిగా మాట్లాడ్డానికి ప్రయత్నించడం వల్ల చెలరేగే శబ్దం కన్నా ఇది దారుణంగా ఉంటోంది! ఈ రుతువులో ఇది మామూలే గనక, ఇలాంటి శబ్దాలకు నేను ఇప్పుడు అలవాటు పడిపోయూను. పైన చెట్ల మీద ఒకరిని ఒకరు ఆకర్షించడానికి అరుపులు.
 
కింద గ్రామంలో పెళ్ళి బాజాభజంత్రీలు. ఈ రోజు శబ్దం మరీ భయంకరంగా ఉంది. ఎందుకో తెలుసా? మా చెట్టుకిందే పెళ్ళి జరుగుతోంది! మా పిల్లలు ఆ శబ్దాలను తట్టుకోలేకపోతున్నాయి. అవి ఈ ప్రపంచంలోకి వచ్చిన తొలిరోజున ఎలాంటి స్వాగతమో చూడండి మరి! నా మాటలను బట్టి నేనొక పక్షినని మీరిదివరకే గ్రహించి ఉంటారు. మీరు మమ్మల్ని మచ్చల ముక్కు గూడకొంగలని పిలుస్తారని నా స్నేహితురాలూ, చాలా మంచి అమ్మాయీ అయిన మాలూ చెప్పగా విన్నాను.
 
వందలాది గూడకొంగలూ, రంగుల కొంగలూ కలిసి ఒకే చోట ఉంటున్నాం. ఈ అద్భుతమైన గ్రామం అంటే మాకు ఎంతో ఇష్టం. దీనిని మేము మా గ్రామం కొకారే బెలూరేగానే పిలుస్తాం. ఇది మైసూరుకు సమీపంలో ఉంది. ఒక సంవత్సరంలో ఆరు నెలలు మేము ఇక్కడే గడుపుతాం. పిల్లల్ని పొదుగుతాం. కొంత కాలం వాటిని పెంచుతాం. ఆ తరవాత మిగిలిన ఆరు నెలలు మా వేసవి నివాసాలకు ఎగిరి వెళ్ళిపోతాం. మా వేసవి నివాసాల నుంచి ఇక్కడికి ఎగిరి వచ్చే మార్గం ప్రమాదాలునిండినది.
 
అయితే, ఇక్కడికి చేరుకుంటే చాలు. మాకు ఎలాంటి విచారమూ ఉండదు. ఎందుకంటే కొకారే బెలూరే చాలా సురక్షిత ప్రాంతం. పక్షుల శరణాలయంలో ఉన్నంత క్షేమంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఇక్కడ పెద్దపెద్ద చింత చెట్లూ, వేప చెట్లూ చాలా ఉన్నాయి. వాటి మీద గూళ్ళు నిర్మించుకోవడం అంటే మాకెంతో ఇష్టం.
 
మేము వందలాది మంది ఈ చెట్ల కొమ్మల మీద ఉంటున్నాం. మేము రాగానే ఈ గ్రామస్థులు చాలా సంబరపడుతూ ఉంటారు. మేము రావడం అదృష్టంగా భావిస్తారు. వాళ్ళు మాకెలాంటి హానీ చేయరు. మేము నివాసముండే చెట్లను నరకరు.

ఒక్కొక్కసారి చింత చెట్ల నుంచి చింత పళ్ళను రాల్చుకోవడానికి కూడా వెనకాడుతారు. పాపం పేదవాళ్ళయిన ఆ గ్రామస్థులకు ఇది చాలా నష్టమే. అయినా మా పిల్లలకు హాని చేయకూడదన్న గొప్ప మనసుతో అలా చేస్తారు. వాళ్ళు మా మంచి స్నేహితులు. మేముండే చెట్ల కింద పడే మా పెంటను పోగుచేసి వాళ్ళు పొలాలకు గువానో (ఎరువు)గా ఉపయోగిస్తారు.
 
నేనిక్కడ సురక్షితంగా ఉన్నట్టు చెప్పాను కదూ. అవును చాలావరకు సురక్షితంగానే ఉన్నాను. అదిగో నా ఎదురుగా కొమ్మ మీద బైఠాయించిన కాకిని చూశారూ! అది నా పిల్లలను తన్నుకుపోవడానికి పొద్దుట్నించి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. నేను ఒక క్షణం అటువెళితే చాలు. అది హాయిగా నా పిల్లల్ని భోంచేస్తుంది.
 
మా పొరుగుగూట్లో ఉన్న పక్షులకు నిన్న ఏం జరిగిందో తెలుసా? వాటి పిల్లలు మా పిల్లల కన్నా పెద్దవి. అన్ని పెరిగే పిల్లలకులాగే వాటికీ ఆకలి ఎక్కువ. ఆకలిగా ఉన్న కుటుంబానికంతటికీ ఒక్క పక్షి ఎలా ఆహారం సంపాదించుకు రాగలదు? నిన్న పిల్లల్ని వదిలి రెండు పెద్ద పక్షులూ చేపల వేటకు వెళ్ళాయి. ఒక్క క్షణంలో ఒక కాకి కిందికి ఉరికి ఒక పిల్లను తన్నుకు పోయింది.
 
అది అలా తన్నుకు పోయినప్పుడు గూడు బాగా కదిలి పోవడంతో మిగిలిన పిల్లలు కూడా కిందపడిపోయూయి. కింద తిరుగుతూన్న కుక్కలు వాటిని తినేశాయి. కొన్ని నిమిషాల్లో నా పొరుగు కుటుంబం సర్వనాశనమై పోయింది! కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఇలాంటి దుర్ఘటనే, మాలూ అనే మంచి స్నేహితురాలిని నా చెంతకు చేర్చింది.
 
ఆ అమ్మాయి ఈ రోజు పెళ్ళికూతురయిందని మీకు చెప్పానా? ఆమెకే చెట్టుకింద పెళ్ళి జరుగుతోంది! నాకు చాలా సంతోషంగా ఉంది.అది సరే, మొదట కొన్నేళ్ళ క్రితం కాకి నా మీద దాడి చేసినప్పుడు ఏం జరిగిందో చెప్పి పూర్తి చేస్తాను. నేనప్పుడు చాలా చిన్న పిల్లను. ఎగరడం కూడా చేతకాదు.
 
నేల మీద పడిపోయూను. పెద్దపెద్ద కుక్కలు నోళ్ళు తెరుచుకుని ఆత్రంగా నా కేసి పరిగెత్తుకు రావడం చూసి హడలిపోయూను. నాగుండె కొట్టుకోవడం ఆగినంత పనయింది. అంతలో ఎవరో వచ్చి నన్ను పైకి ఎత్తుకున్నారు. ఆహా! చుక్కల ముక్కు గూడకొంగపిల్ల అన్న మాటలు విని నీళ్ళునిండిన కళ్ళతో ఆ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయే మాలూ.

కుక్కల నుంచి నన్ను కాపాడింది. నా తల్లిదండ్రులు చేపలవేటకు వెళ్ళడంవల్ల నేను మాత్రమే మిగిలాను. మాలూ నన్ను మానూ అనే ఒక అందమైన యువకుడి వద్దకు తీసుకువెళ్ళింది. మనుషులకు, పక్షులకు మధ్య వున్న విలక్షణమైన సంబంధం గురించి అధ్యయనం చేయడానికి కొన్నాళ్ళ క్రితం ఆ యువకుడు అక్కడికి వచ్చాడట.
 
నా గాయూలకు కట్లు కట్టి ఆహారం తినిపించడానికి అతడు మాలూకు సాయపడ్డాడు. కళ్ళు తెరవడానికి కూడా నాలో శక్తిలేదు. ఆ యువకుడే కొకారే బెలూరే చాలా ప్రత్యేకమైన గ్రామమని చెప్పాడు. అయితే ఇలాంటి గ్రామం మన దేశంలో ఇదొక్కటే కాదనీ; పక్షులకు ఆదరంతో ఆశ్రయమిచ్చే గ్రామాలు అక్కడక్కడ చాలా ఉన్నాయని కూడా చెప్పాడు.
 
మాలూ నాకేసి ఒకసారి పరిశీలనగా చూసి, ‘‘ఇలాంటి పక్షిపిల్లలకు నేనేం సాయం చేయగలను?'' అని అడిగింది. కొంతసేపు మౌనం వహించిన మానూ, ‘‘వీటికో అనాధశరణాలయమూ, వైద్యనిలయమూ ప్రారంభించవచ్చు,'' అన్నాడు. ఆ మాట అందరికీ నచ్చడంతో వాటిని నెలకొల్పడానికి ఆసక్తితో ప్రయత్నించసాగారు. దాని ఫలితంగా గ్రామంలో ఒక అనాధ శరణాలయం, ఆస్పత్రి ఏర్పడ్డాయి.
 
వాటిని యువకులే నిర్వహించడం మరో విశేషం. ఇవాళ మాలూ పెళ్ళి చేసుకుని మరో ఊరికి వెళ్ళిపోతున్నది. అయితే... అనాధశరణాలయం ఇలాగే కొనసాగగలదని అనుకుంటాను. ఆమె స్నేహితులూ, మానూ దానిని నిర్వహించడానికి పూనుకోగలరు! పెళ్ళికూతురుగా మాలూ ఎలా ఉన్నదో వెళ్ళి చూడాలి. నిన్న ఆమె నన్ను చూడడానికి వచ్చింది.
 
ఆమె కళ్ళనిండా నీళ్ళు. ఆమె చాలా దూరంలో ఉన్న... ఆగ్రాకు వెళుతున్నదట. ఎప్పుడు మళ్ళీ వస్తుందో తెలియదని చెప్పింది. నేనూ ఆమెకు ఎన్నో విషయూలు చెప్పాలనుకున్నాను. అయినా నా మాటలు ఆమెకు అర్థం కావు కదా! నేను ఆకాశంలో ఎగిరి వెళుతూంటే నేల మీది నుంచి ఆమె నన్ను చూడవచ్చని చెబుతామనుకున్నాను.
 
ఆహా! ఆగండి ఒక్క నిమిషం... ఆమె ఆగ్రా అనే కదా అన్నది? మేము ఇక్కడి నుంచి వెళ్ళేది కూడా అక్కడికే కదా?... అక్కడికి సమీపంలోనే కదా అందమైన చిత్తడి నేల గల భరత్‌పూర్‌ ఉంటోంది! మా పిల్లలు పెరిగాక మేము ఇక్కడి నుంచి భరత్‌పూర్‌కు వెళతాం. నేను మాలూను మళ్ళీ త్వరలో అతి త్వరలో చూడగలనని ఆమెకు చెప్పాలి... తప్పక చెప్పాలి... ఇప్పుడే చెప్పాలి!

No comments:

Post a Comment