Pages

Tuesday, September 11, 2012

దుస్సాహసం తెచ్చిన దుర్మరణం!


పరుగెత్తడంలోనూ, వేటాడడంలోనూ సాటిలేని యువకుడు యూక్టియూన్‌. అరణ్యం మధ్య అతడు పరుగులు తీస్తూంటే ఒక చోట అదృశ్యమై మరోచోట ప్రత్యక్షమయ్యే మాంత్రికుడా అన్నట్టు చూపరులకు సంభ్రమాశ్చర్యాలు కలిగేవి. ఇక వేటాడ డంలో అతనికి సాటి రాగలవారు ఆ రాజ్యం లోనే లేరు. తను వేటాడమే కాదు; తన వెంట వేటకు తీసుకువెళ్ళే వేటకుక్కలకు కూడా చక్కని శిక్షణ ఇచ్చేవాడు.
 
అతడు ఉసిగొలిపితే చాలు, జింకలు, కుందేళ్ళు వంటి జంతువులు తప్పించుకోడానికి ఎంతవేగంగా పరిగెత్తినా వెంటాడి వెళ్ళి వాటిని చంపి యజమాని ముందు తెచ్చి పడేసేవి అతని వేటకుక్కలు. అరణ్యాల అధిదేవత డయూనా. ఆమె ఒకనాడు అరణ్యంలో విహరిస్తూ, వాయువేగంతో పరుగెత్తుతూన్న యూక్టియూన్‌ను చూసి ముచ్చటపడింది. ఆమెకూ అరణ్యాల వెంట పగిగెత్తాలన్న కుతూహలం కలిగింది. అయితే, ఆమెకు తోడుగా పరిగెత్తడానికి తగిన చెలికత్తెలెవరూ లేరు.
 
అందువల్ల ఆమె యూక్టియూన్‌ను తనతో పరిగెత్తడానికి ఆహ్వానించింది. యువకుడు పొంగిపోయూడు. సాక్షాత్తు వన దేవతతో స్నేహం కలవడమంటే మాటలా? మహాభాగ్యంగా భావించాడు. రోజూ ఇద్దరూ కలిసి కొంతసేపు పరుగులు తీసేవారు. ఇద్దరికీ చాలా సంతోషం కలిగేది. వాళ్ళిద్దరి వెనకగా యూక్టియూన్‌ వేట కుక్కలు కూడా పరుగులు తీసేవి.
 
ఆరంభదశలో యూక్టియూన్‌ వనదేవతతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. మర్యాద కనబరచేవాడు. అయితే, రోజులు గడిచే కొద్దీ అతనిలో ఒక విధమైన గర్వం, డయూనా చూపిన చనువు కారణంగా ఆమెపట్ల కొద్ది కొద్దిగా అలసత్వం ప్రబల సాగాయి.

ఒక్కొక్కసారి యూక్టియూన్‌ ఆమెతో, ‘‘నేను అనుకుంటే నీకన్నా వేగంగా పరిగెత్తగలను. కాని నిన్ను వెనకగా వదిలి ముందుకు వెళ్ళడం బావుండదుకదా!'' అనే వాడు. ఆ మాట విని డయూనా చిన్నగా నవ్వుకునేదే తప్ప సమాధానం చెప్పేది కాదు. ఆమె కావాలనుకుంటే మెరుపు వేగంతో పరిగెత్తగలదు. ఆ సంగతి ఆమెకూ తెలుసు. అయినా ఒక అల్ప మానవుడి మీద తన అతీతశక్తుల్ని ప్రదర్శించడం ఆమెకు ఆమోదయోగ్యం కాదు.
 
అయితే, అతడు తనను గానీ, తన ఆభరణాలను గానీ స్పృశించ కూడదని హెచ్చరించేది. యూక్టియూన్‌ తలపంకించి ఊరుకునేవాడు. రోజులు గడవసాగాయి. ఒకానొక వేసవి మధ్యాహ్న సమయంలో, డయూనా అరణ్య మధ్యంలోని ఒక సుందర తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళింది. తటాకం చుట్టూ పరచుకున్న ప్రశాంత ప్రకృతి సౌందర్యం. వివిధ వర్ణాలతో పరిమళాలు వెదజల్లుతూన్న వేనవేలపుష్పాలు. చల్లటి తటాక జలాలు.
 
వీటన్నిటినీ చూస్తూ స్నానం చేస్తూన్న వనదేవత ఆనందంతో మెల్లగా గీతాలాపన అందుకున్నది. వేళకాని వేళలో తన వేటకుక్కలతో అరణ్యంలోకి వచ్చిన యూక్టియూన్‌ వనదేవత పాట విని, వెళ్ళకూడని తటాకం సమీపించి చేయకూడని పనిచేయడానికి పూనుకున్నాడు. తటాకం ఒడ్డున పెద్ద బండ మీద ఉన్న దేవత ఆభరణాలను ముట్టుకున్నాడు. జలకాలాడుతూన్న వనదేవత కేసి పళ్ళికిలిస్తూ చూశాడు. యూక్టియూన్‌ను చూసి ఆశ్చర్యం చెందిన డయూనా, అతని అకృత్యాలకు అమితాగ్రహం చెందింది.
 
తన శక్తితో అతన్నొక జింకగా మార్చివేసింది. అంతే! మరుక్షణమే వేట కుక్కలు వాడి మీదికి ఉరికాయి. జింక రూపంలోని యూక్టియూన్‌ ప్రాణభయంతో పరుగులంకించుకు న్నాడు. అయినా వేట కుక్కలు జింక వెంటబడి తరుముకున్నాయి. క్షణాలలో వేటకుక్కలు జింకను పట్టుకుని చీల్చి చెండాడాయి. ఒక మానవుడికీ, దేవతకూ మధ్య సంతోషంగా ఆరంభమయిన పరిచయం ఆ మనిషి దుస్సాహసం, దుందుడుకు స్వభావం కారణంగా విషాదంగా ముగిసింది!

No comments:

Post a Comment