Pages

Tuesday, September 11, 2012

రాజుగారి పోటీలు


ఒకప్పుడు కాంభోజరాజ్యాన్ని కుమారవర్మ పాలించాడు.తాను అన్ని విద్యలలోనూ సాటిలేని మేటి అనీ, ప్రజారంజకంగా రాజ్యంచేయడంలో తనకు తానే సాటి అనీ ఆయనకు గట్టి నమ్మకం. ఒకసారి అయన భార్య కర్పూరవల్లి తన భర్తతో ఛలోక్తిగా వారసత్వంతో రాజుకావడం విశేషం కాదనీ, స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించుకోవడమే గొప్ప అనీ అన్నది.
 
రాణి ఈ మాటలు పరిహాసానికి అన్నప్పటికీ, కుమారవర్మ మీద అవి బాగాపనిచేశాయి. తన గొప్ప తనం రాణీకి రుజువుచెయ్యూలని ఆయన అనేకరంగాలలో పోటీలు ఏర్పాటుచేశాడు. ఆ పోటీలలో పాల్గొనడానికి దేశం అన్ని ప్రాంతాల నుంచీ ఉత్సాహవంతులైన యువకులూ, శక్తిమంతులూ వచ్చారు. ఆయూ రంగాలలో ప్రవీణులైనవారు నిర్ణేతలుగా పనిచేశారు.
 
పోటీలు జయప్రదంగా ముగిశాయి. బహుమతి ప్రదానం జరగవలసి ఉన్నది. కుమారవర్మ, కత్తియుద్ధంలో ఉత్తముడుగా నిర్ణయించబడిన రామరాజు అనే అతన్ని చూపి, ‘‘మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గయుద్ధ నిపుణుడు లేడని తేలిందిగదా?'' అన్నాడు. సభలో అందరూ అవునన్నారు.
 
‘‘ఆ సంగతి నేను తేల్చాలి,'' అంటూ రాజు కత్తి చేతబట్టి రామరాజుతో యుద్ధానికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయూరు. రామరాజుకూ, కుమార వర్మకూ చాలాసేపు తీవ్ర పోరాటం జరిగింది. చివరకు రామరాజు కుమారవర్మ చేతి కత్తిని ఎగరగొట్టేశాడు. కుమారవర్మ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.ఇంతలో నిర్ణేతలు ముందుకు వచ్చి, రామరాజు నియమాలను ఉల్లంఘించాడ న్నారు. వాళ్ళు రామరాజుకు రహస్యంగా ఏదో చెప్పారు. రామరాజు కుమారవర్మ వద్దకు వచ్చి, చేతులు జోడించి, ‘‘ప్రభూ, మీ చాకచక్యానికి తట్టుకోలేక నియమాలు కొన్నిటిని తప్పాను. తమతో మరొకసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి,'' అన్నాడు. 
 
ఈసారి కుమారవర్మ రామరాజు చేతి కత్తిని అతి శీఘ్రంగా ఎగరగొట్టేశాడు. బహుమతి రాజుకు లభించింది. ఇదేవిధంగా సాహిత్యగోష్ఠిలో అందరినీ ఓడించిన విద్యానాధుణ్ణి రాజు సవాలు చేశాడు. ఇద్దరూ చర్చ జరుపుతూండగా మధ్యలో నిర్ణేతలు విద్యానాధుడిలో వ్యాకరణ దోషాలు కలిగాయని, బహుమతి రాజుకే నిర్ణయించారు. ఒకటేమిటి? అన్ని రంగాలలోనూ రాజు బహుమతులను ఇలాగే సంపాదించుకున్నాడు.
 
ఇలా ఒక సంవత్సరం కాదు, అయిదు సంవత్సరాలపాటు కుమారవర్మ తాను ఏర్పాటు చేసిన పోటీలన్నిటిలోనూ తానే బహుమతులు పొందాడు. ఆయన ఈ సంగతి గర్వంగా తన భార్యకు చెబితే, ఆమె నవ్వి ఊరుకున్నది. ఇలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణ వార్త తెలిసింది. మంత్రి భైరవుడు రాజ్యాన్ని కాజేసేటందుకు కుట్ర చేస్తున్నాడు. ఆయన పథకం దాదాపు పూర్తి అయింది.
 
ఈ వార్త తెలియగానే కుమారవర్మ, తన భార్యతో సహా రహస్యమార్గాన తప్పించుకుని, మారువేషాలతో నగరం విడిచి పారిపోయూడు. ఇక రాజు మామూలు మనిషే గనక, మంత్రి నిశ్చింతగా రాజ్యాభిషేకం చేసుకున్నాడు. కుమారవర్మా, కర్పూరవల్లీ ఒక మారు మూలగ్రామం చేరి, మారు పేర్లు పెట్టుకుని, పేదవాళ్ళ దుస్తులు ధరించి, కాయకష్టం చేసుకుని బతకసాగారు. ప్రజలమధ్య బతకటం ప్రారంభించినాక కుమారవర్మకు ప్రజల అవసరాలూ, కష్ట సుఖాలూ బాగా తెలిసి వచ్చాయి.
 
ఎందుకంటే, అవి ఇప్పుడు తనవికూడానూ. తన పరిపాలన తాను అనుకున్నట్టు ప్రజారంజకంగా ఉండి ఉండలేదనీ, తన పాలనలో ప్రజలకు అన్యాయం చాలా జరిగిందనీ ఆయనకు ఇప్పుడు తెలిసివచ్చింది. ఆ సంవత్సరం కూడా రాజధానిలో ఎప్పటిలాగే పోటీలు జరుగుతాయని తెలిసి ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది.

అయితే, ఆ పోటీలను గురించి యువకులలో ఎలాటి ఉత్సాహమూ లేక పోవటం చూసి ఆశ్చర్య పడి, చాలామందిని కారణం అడిగితే, ‘‘ఎందుకొచ్చిన పోటీలు? బహుమతులు రాజుగారికే గద!'' అన్నారు పెదవి విరుస్తూ. తన ప్రతిభను ప్రజలు గుర్తుంచుకున్నారనుకుని కుమారవర్మ సంతోషించాడు. కాని ఇప్పుడు రాజు భైరవుడు మంత్రాలోచనలో తప్ప ఇంకెందులోనూ సామర్థ్యం గలవాడు కాడు.
 
ఆ కారణం చేత కుమారవర్మ పోటీలలో పాల్గొని, బహుమానాలు పొందుదామని రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. పోటీకి వచ్చిన వారి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే కుమారవర్మకు ఆశ్చర్యం కలిగింది. దేశం బొత్తిగా చచ్చుపడిపోయినట్టున్నది. కుమారవర్మ చాలా రంగాలలో నెగ్గాడు. అన్ని రంగాలలోనూ గెలిచిన వారిని చిట్టచివరకు, రాజైన భైరవుడు సవాలు చేశాడు. అతనికీ, కుమారవర్మకూ కత్తి యుద్ధం జరిగింది.
 
కుమారవర్మ కొద్ది క్షణాలలోనే భైరవుణ్ణి నిరాయుధుడిగా చేశాడు. వెంటనే నిర్ణేతలు కలగ జేసుకుని, కుమారవర్మ నియమోల్లంఘన చేశాడనీ, లేకపోతే విజయం భైరవుడిది అయి ఉండేదనీ అన్నారు. వాళ్ళు కుమారవర్మను అవతలికి తీసుకుపోయి, ‘‘వెర్రివాడా, నువ్వు పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితో కాదు, ఒక గొప్ప పదవితో! నువ్వు ఓడిపోవలసినది భైరవుడికి కాదు, సింహాసనానికి! రాజును క్షమాపణ కోరి, మరొక పోరాటానికి అవకాశం వేడుకుని, ఈసారి ఓడిపో! లేకుంటే ప్రమాదంలో పడగలవు,'' అన్నారు.
 
గత్యంతరం లేక కుమారవర్మ వాళ్ళు చెప్పినట్టే చేసి, రెండోసారి భైరవుణ్ణి గెలవనిచ్చాడు. తాను రాజుగా ఉంటూ బహుమానాలందుకోవటంలో ఉండిన రహస్యం కుమారవర్మకు అర్థమయింది. అతను గ్రామానికి తిరిగి రాగానే కొంతమంది అతనితో, ‘‘ఏమయింది? అన్ని రంగాల్లోనూ భైరవమహారాజే గెలిచాడా? ఈ భాగ్యానికి శ్రమపడి రాజధానికి ఎందుకు వెళ్ళావు? నీకు బహుమతే కావాలంటే నువ్వు రాజువు కావాలి,'' అన్నారు.
 
భైరవుడి పరిపాలనలో ప్రజాపీడన అంతకంతకూ హెచ్చిపోతున్నది. అది గ్రహించి కుమారవర్మ ఉత్సాహ ధైర్యాలు గల యువకులను తనతో చేర్చుకుని, రహస్య సైన్యాన్ని తయూరు చేసుకున్నాడు. ఆ సైన్యానికి నాయకుణ్ణి ఎన్నుకోవటానికి యువకుల మధ్య పోటీలు జరిగాయి.

అమిత ఉత్సాహంతో జరిగిన యుద్ధ విద్యల పోటీలన్నిటిలోనూ కుమారవర్మ నెగ్గి, సేనా నాయకుడుగా ఎన్నుకో బడ్డాడు. తిరిగి రాజ్యాన్ని సంపాదించటానికి కుమారవర్మ తీవ్రంగా ఆలోచించి ఒక పథకం ఆలోచించాడు. మరుసటి ఏడు జరిగిన పోటీలకు కుమారవర్మ తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి, యుద్ధవిద్యలకు సంబంధించిన పోటీలన్నిటా నెగ్గాడు.
 
తరవాత భైరవుడు అతన్ని కత్తి యుద్ధంలో సవాలు చేశాడు. కుమారవర్మ అతి సులువుగా భైరవుడి చేతి కత్తిని ఎగరగొట్టి, తన కత్తిని భైరవుడి గుండెలకు ఆనించి, అక్కడ చేరిన ప్రజలతో, ‘‘ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు, కాని విశ్వాసపాత్రులు హెచ్చరించటం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను ఒకప్పుడు మీ రాజును, కుమారవర్మను. ఈ భైరవుడు ప్రజారంజకంగా మిమ్మల్ని పరిపాలించి ఉంటే నేను కలుగజేసుకుని ఉండను.
 
ప్రజల క్షేమం కోసమే నేను ముందుకు వచ్చాను. నన్ను తిరిగి రాజుగా మీరు ఆమోదిస్తారా? లేక సింహాసనం కోసం యుద్ధం చెయ్యూలా?'' అంటూ తన మారువేషం తొలగించాడు. సభికులు జయజయధ్వానాలు చేశారు. రక్తపాతం అవసరం లేకుండానే రాజ్యం తిరిగి కుమారవర్మ వశమయింది. తిరిగి రాణి అయిన కర్పూరవల్లి తన భర్తతో, ‘‘మీరే కుమారవర్మ అని మన సైన్యానికి తెలియనిచ్చి ఉంటే మీరు ఎప్పుడో రాజు అయ్యేవారుగదా?'' అన్నది.
 
‘‘ఈసారి రాజ్యాన్ని వారసత్వంగా కాక, స్వశక్తితో సంపాదించదలిచాను. ఇప్పుడు నా శక్తిలో నాకు నమ్మకం కలిగింది గనక, నేను నిర్వహించే పోటీలలో నేను పాల్గొనే అవసరం లేదు,'' అన్నాడు కుమారవర్మ. తరవాత ఆయన ప్రజాజీవితం నుంచి నేర్చుకున్న అనుభవంతో ప్రజారంజకంగా పాలించాడు. ఆయన పాల్గొనటం మానటంచేత ఆయన యేటా నిర్వహించే పోటీలు నిజమైన శక్తి సామర్థ్యాలు గలవాళ్ళను ఎంతగానో ఆకర్షించాయి.

No comments:

Post a Comment