Pages

Saturday, September 8, 2012

అన్నీవున్నవిస్తరి!


పారుపల్లి అగ్రహారంలో నివసించే విద్యానాధుడికి, తన మీద తనకు అపారమైన నమ్మకం. అన్ని విద్యలూ తనకు తేలికగా అబ్బుతాయనీ, అందరిలాగా కష్టపడి ఏళ్ళతరబడి నేర్వవలసిన అవసరం తనకు లేదనీ అతడికి అనిపిస్తూండేది.
 
మొదటగా కొన్నాళ్ళు వేదం నేర్చుకున్నాడు. ఆ పిమ్మట సంగీతం. ఆ తర్వాత వైద్యం, ఆపైన జ్యోతిష్యం. వీటిలో ఏవీ సరిగా పూర్తికాకపోవడంతో, అగ్రహారంలో అందరూ అతడి విద్య గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. విద్యానాధుడు మాత్రం, తన పాండిత్యానికి ఇతరులు ఈర్ష్య పడుతున్నారనీ, తనవంటివాడికి తగిన స్థలం ఈ అగ్రహారం కాదనీ భావిస్తూ, నిరంతరం తనలో తాను బాధపడుతూండేవాడు.
 
ఎందులోనూ ఉత్తీర్ణత సాధించ లేని విద్యానాధుడి భవితవ్యం ఏమిటా అని, తల్లిదండ్రులకు బెంగగా ఉండేది. ఇలావుండగా, ఒకరోజు వాళ్ళ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన, విద్యానాధుడి వేలువిడిచిన మేనత్త, ఒక పెళ్ళి సంబంధం తీసుకువచ్చింది. ఆవిడకు విద్యానాధుడి తల్లి, తన కొడుకు ప్రవర్తన గురించి చెప్పి బాధపడింది. కానీ, ఆ మేనత్త మాత్రం, ‘‘పెళ్ళి చేస్తే స్థిరత్వం దానంతట అదేవస్తుంది. అందం, తెలివితేటలూ అన్నీవున్న అమ్మాయి ప్రి…యంవద. ఆమే, మన విద్యానాధుడికి తగిన భార్య!'' అంటూ నచ్చజెప్పింది.
 
ఎలాగో విద్యానాధుడిని ఒప్పించి, తల్లిదండ్రులు ప్రియంవదతో పెళ్ళి జరిపించారు. కాపురానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే, భర్త గురించి పూర్తిగా అర్థంచేసుకున్నది, ప్రియంవద. అతడు స్వతహాగా తెలివిగలవాడే. కానీ, మితిమీరిన ఆత్మవిశ్వాసం అతణ్ణి స్థిరత్వం అనేది లేకుండా చేస్తున్నది!
 
ఒకరోజున నీళ్ళకోసం ప్రియంవద చెరువుకు వెళ్తూ, భర్తను తోడురమ్మన్నది. విద్యానాధుడు కాస్త అయిష్టంగానే బయల్దేరాడు. దారిలో ఒక ముళ్ళపొదల పక్కన పదిహేనేళ్ళ కురవ్రాడు నురగలు కక్కుతూ గిలిగిలా కొట్టు కుంటూడడం చూసి, ప్రియంవద ఆతృతతో, ‘‘అ…య్యో, పాముకాటుకు గురైనట్టున్నాడు,'' అంటూ వాడి దగ్గరకు వెళ్ళింది.ఈలోపల విద్యానాధుడు, అక్కడవున్న చిన్నచిన్న చెట్ల ఆకులు గిల్లి, వాటి పసరు పిండి కురవ్రాడి నోటిలో కొంత, పాము కాటువేసిన కాలిమీద కొంత పోసే సరికి, పావుగంటలో వాడు మెల్లగా లేచి కూర్చోగలిగాడు. ఇది చూసి ప్రియంవదకు భర్త వైద్యంపట్ల గురికుదిరింది.
 
ఇది జరిగిన వారం రోజుల తర్వాత, పక్క ఊరిలో ఎవరో సంగీత విద్వాంసుడి పాట కచేరీ వుందని తెలిసి, విద్యానాధుడి తల్లిదండ్రులు ప్ర…యాణమయ్యారు. ప్రియంవద తనకూ పాటకచేరీకి వెళ్ళాలనివున్నదని, విద్యానాధుడితో అన్నది. మొదట కాదన్నా కాస్త బ్రతిమిలాడాక సరేనన్నాడు విద్యానాధుడు. ఐతే, అక్కడ సంగీత కార్యక్రమం ముగింకుండానే ప్రియంవదతో, ‘‘ఈయన సంగీతం అంతా అపశృతులే. తాళ, లయలు కూడా తప్పుతున్నవి!'' అంటూ లేచాడు.
 
తప్పనిసరై ప్రియంవద కూడా లేచి భర్తవెంట బయలుదేరింది. దారిలో ఆమె, భర్తను కాలక్షేపంగా వుంటుంది ఏమైనా పాడమని అడిగింది. శ్రావ్యంగావున్న కంఠస్వరంతో మోహనరాగంలో ఒక కృతిని పాడాడు, విద్యానాధుడు. అతడి గానమాధుర్యానికి ప్రియంవద చాలా ఆనందించింది. ‘‘ఈ విద్యలో మరింత ప్రావీణ్యత, మీరెందుకు సాధించ కూడదు? చక్కని సంగీతజ్ఞులవుతారు,'' అన్నది.
 
‘‘మంచి సంగీతజ్ఞులు కావాలంటే అర్హతలేమిటో నువ్వేచెప్పు!'' అంటూ ఎదురు ప్రశ్నవేశాడు విద్యానాధుడు. ‘‘ఏముందీ! సంగీతశాస్ర్తాన్ని అవపోసన పట్టినవారి దగ్గర శిష్యరికం చేయడమే,'' అన్నది ప్రియంవద.
 
‘‘నన్ను మించినవాడు దొరికినప్పుడుగదా!'' అంటూ ముందుకు నడవసాగాడు విద్యానాధుడు.
 
ఈ జవాబుతో ప్రియంవదకు భర్తలోవున్న అహంకారం బాగా తెలిసిపోయింది.
 
ఆమర్నాడే ప్రియంవద తల్లిగారి ఊరునుంచి, ఒక పాలేరువచ్చాడు. కూతురుకు ఇచ్చి రమ్మని అంపకాలు పంపారు ఆమె తల్లిదండ్రులు. ఆమె నుంచి క్షేమ సమాచారాలు తెలిపే ఉత్తరం కూడా తెమ్మని పురమాయించారు.

వచ్చిన పాలేరుకు భోజనం పెట్టి, మర్నాడు ఉదయాన్నే బ…యల్దేరమని చెప్పింది ప్రియంవద. ఆ రాత్రి పనులన్నీ ముగించుకుని ఉత్తరం రాసి, ఆ తర్వాత నిద్రపోయింది. భార్యకువున్న భాషాజ్ఞాన మెంతో తెలుసుకోవాలన్న కుతూహలంతో విద్యానాధుడు బుడ్డిదీపం వెలుగులో దాన్నిచదివాడు.
 
ప్రియంవద, ఇక్కడ అందరం క్షేమం అంటూ రాసిన తర్వాత .... మావారు అన్నీ వున్న విస్తరి! తనలో మృష్టాన్న భోజనంవున్నా, ఆ చవులూరించే రుచి గురించి విస్తరికి తెలియదుగదా! దానిని తిన్నవారికే తెలుస్తుంది. మావారూ అంతే. ఆయనలో మంచి వైద్యుడున్నాడు, సంగీతవిద్వాంసుడున్నాడు, వీళ్ళు చాలరన్నట్టు, జ్యోతిష్య శాస్ర్తవేత్త కూడా దాగివున్నాడు. ఒకరిని ఒకరు ఎదగ నీయకుండా అడ్డుపడుతున్నారు. అందువల్లనే, మీ అల్లుడి విద్య ఎందుకూ కొరగాకుండా పోతున్నది. ఏనాటికైనా నేనొకమంచి విద్వాంసుడి ఇల్లాలినని గర్వించే రోజురావాలని ఆశీస్సులందించండి...
 
ఉత్తరాన్ని అతిశ్రద్ధగా చదివిన విద్యానాధుడికి, తనలోవున్న లోపమేమిటో అర్థమైంది. ఏనాడూ తనను పల్లెత్తు మాట అనినొప్పించని భార్య మనసులోవున్న బాధను గ్రహించాడు. తనకు వచ్చిన విద్యలలో బాగా నచ్చినదీ, పరులకు ఉపయోగపడేదీ వైద్యం. ఆ రంగంలో నైపుణ్యం సాధించినట్టయితే పుణ్యం, పురుషార్థం కూడా దక్కుతాయి అనిపించిందతడికి.
 
విద్యానాధుడికి ఆరాత్రి నిద్ర పట్టలేదు. అతడు మర్నాడు తెల్లవారగానే నిద్రలేచి భార్యతో, ‘‘ప్రియంవదా! నాకు నీ బాధ అర్థమైంది. నువ్వు నాకళ్ళు తెరిపించావు. ఆరోజు చావు బతుకుల్లోవున్న కురవ్రాడి ప్రాణం నిలబెట్టింది, నా వైద్యవిద్య. అందువల్ల, ఆ విద్యను నాగురువు దగ్గర ఒక సంవత్సరంపాటు శ్రద్ధగా అభ్యసించి వస్తాను. అంతవరకూ నా ఎడబాటును నువ్వు భరించక తప్పదు!'' అన్నాడు. విద్యానాధుడిలో వచ్చిన మంచి మార్పుకు, ప్రియంవదతో పాటు అతడి తల్లిదండ్రి కూడా చాలా సంతోషించారు.
 
విద్యానాధుడు తనకు వైద్యవిద్య నేర్పిన గురువును మరొకసారి ఆశ్రయించి, ఏడాది తర్వాత నిష్ణాతుడైన భిషగ్వరుడుగా ఇంటికి తిరిగివచ్చాడు.

No comments:

Post a Comment