Pages

Saturday, September 8, 2012

కోడలియుక్తి


కిర్లంపూడి అనే జమీగ్రామంలో నివసించే సూరమ్మకు, సదానందం ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పుడే తండ్రి పోవడంతో, సూరమ్మ కొడుకును అల్లారుముద్దుగా పెంచింది. అతడికి పాతికేళ్ళు వస్తున్నా, ఏ ఒక్క పనీ చేతకాదు; అలా అని చదువూ అబ్బలేదు.
 
సూరమ్మ పరమకోపిష్ఠి. ఇరుగూ పొరుగూ కుటుంబాలతో ఏమాత్రం కలుపుగోలుగా వుండేది కాదు. తనకు నచ్చని అతి చిన్న విషయాల్లో కూడా, వాళ్ళ మీద కస్సుబుస్సు మంటూ విరుచుకుపడేది. వీటికితోడు పొదుపు పేరుతో పరమ పిసినారిగా ప్రవర్తించేది.
 
ఈ కారణాలవల్ల, సూరమ్మ అంతో ఇంతో ఆస్తిపరురాలైనా, సదానందానికి తమ పిల్ల నిచ్చి ఆమెతో వియ్యమందడానికి ఎవరూ ముందుకు రాలేదు. సూరమ్మ, కిర్లంపూడికి చాలా దూరంగా వున్న మరో గ్రామంలోని పేదింటి పిల్ల భవానితో కొడుక్కు పెళ్ళిచేసింది.
 
కాపురానికి వచ్చిన కొత్తల్లోనే భవానికి, అత్తగారి కోపిష్ఠితనం, దుందుడుకు స్వభావం అర్థమై పోయింది. సూరమ్మ చిన్నమెత్తు పని చేయకుండా, భవాని చేత ఇంటి చాకిరీ అంతా చేయించేది. మధ్య మధ్య ఇంటి పనులు సరిగా చేయడంలేదని విసుక్కునేది.
 
తల్లి, తన భార్యను పనిమనిషికన్నా హీనంగా చూస్తున్నదని తెలిసీ, భయంకొద్దీ సదానందం నోరెత్తేవాడు కాదు. కోడల్ని రాచిరంపాన పెట్టక పోతే, ఆ పిల్ల ఎక్కడ కొడుకును కొంగుకు ముడేసుకుంటుందో అని సూరమ్మకు భయం.
 
ఇలా రోజులు గడుస్తూండగా చలికాలం వచ్చి, సూరమ్మ పెరట్లోని చిక్కుడు తీగ విరగ కాసింది. కాయనిండా గింజ పట్టి నిగనిగలాడే చిక్కుడుకాయలు కళ్ళకింపుగా కాశాయి.భవానికి చిక్కుడుకాయ కూరంటే చెప్పలేనంత ఇష్టం. కానీ, సూరమ్మ తనకూ, కొడుక్కూ సరిపోయేంత కూర మాత్రమే చేసేది. కోడలుకు ఒక్క పిసరు కూడా మిగిల్చేదికాదు.

ఇంతలో సూరమ్మ చెల్లెలి కొడుకు పెళ్ళి కుదరడంతో, పక్క ఊరుకు వెళ్ళవలసిన పని పడింది సూరమ్మకు. ఆమె కోడలిని పిలిచి, ‘‘ఇదుగో! దొడ్లో తీగకున్న చిక్కుడుకాయలన్నీ కోసి సంచీలో నింపు. నేను తిరిగి వచ్చాక వాటిని సంతకు పంపుతాను. ఒక్క కాయ తగ్గినా నాకు తెలిసిపోతుంది, జాగ్రత్త!'' అని హెచ్చరించి, కొడుకును వెంటబెట్టుకుని పెళ్ళికి బయల్దేరింది.
 
అత్తగారూ, భర్తా అటు వెళ్ళగానే చిక్కుడు కాయలన్నీ కోసింది భవాని. వాళ్ళు ఇంట లేని మూడు రోజులూ ముప్పూటలా చిక్కుడు కాయల కూర చేసుకుని సుష్టుగా భోంచేసింది. నాలుగో రోజు రాత్రి పెళ్ళినుంచి తిరిగొచ్చిన సూరమ్మ, సంచీలో నాలుగైదు గుప్పెళ్ళ చిక్కుడు కాయలే వుండడం చూసి కోపంతో భగ్గుమంటూ, కొడుకును పిలిచి, ‘‘నీ పెళ్ళాం ఇంటి దొంగ! ఈనాడు చిక్కుడు కాయలు; ఆ తర్వాత వీలు చూసుకుని ఇంట్లోవున్న విలువైన వస్తువులే దొంగిలించగలదు. దీన్ని ఇంట్లో వుంచుకోవడమంటే పామును పాలు పోసి పెంచడమే. ఇప్పుడిప్పుడే, ఈ అర్ధ రాత్రివేళ తీసుకుపోయి ఊరి పొలిమేరలో అమ్మవారి గుడి దగ్గరున్న తాళ్ళతోపులో విడిచిరా. ఈ గడ్డు చలికి బతికుంటే, తెల్లవారాక ఏం చేయాలో ఆలోచిద్దాం,'' అన్నది.
 
సదానందం ఏదో అడ్డు చెప్పబోయి, తల్లి రౌద్రాకారం చూసి నోరు మెదపకుండా భవానిని వెంటబెట్టుకు పోయి, చీకటి గుయ్యారంగావున్న తాళ్ళతోపులో వదిలి, ఎక్కడలేని దిగులుతో ఇంటికి తిరిగి వచ్చాడు.
 
ఒక పావుగంట కాలం గడిచీ గడవక ముందే భవానికి తాళ్ళతోపు చీకటి భయం కన్న, రివ్వుమంటూ వీచే చలిగాలి బాధ ఎక్కువైంది. ఆ దాపుల్లో, అంతగా పూజాపునస్కారాలు లేక శిథిలావస్థకు చేరుకుంటున్న అమ్మవారి గుడి వుందని, భవానికి తెలుసు. చలి బాధ తప్పించుకునేందుకు ఆమె ఆ గుడిలోకి వెళ్ళింది. అంతలో ఎవరో మను షులు వస్తున్న కాళ్ళచప్పుడు విని, చప్పున అమ్మవారి విగ్రహం వెనక దాక్కున్నది.
 
చిన్నగా మాట్లాడుకుంటూ, నలుగురు దొంగలు అక్కడికి వచ్చి, తాము దొంగిలించి తెచ్చిన బంగారు నగలు పంచుకోవడానికి గర్భగుడి ముందు కూర్చుని వాదులాడుకో సాగారు.
 
‘‘ఇది నా వాటా!'' అంటూ నగల్లో సగం తీసుకున్నాడొక దొంగ.

‘‘అదెలాకుదురుతుంది? మూడో వంతు నాకు రావాలి,'' అన్నాడు మరొకడు. ‘‘వీల్లేదు. నేనసలు ఒప్పుకోను. నలుగురికీ సమానవాటాలు!'' అన్నాడు ఇంకొకడు కీచు గొంతుతో.
 
ఇదంతా వింటున్న భవానికి హఠాత్తుగా పూనకం వచ్చినట్టయి, ‘‘హు! మరి నా వాటా మాటేమిటి? జాగ్రత్త, గొంతులు కొరికి నెత్తురు తాగ్గలను!'' అన్నది కసురుతున్నట్టు. అంతే! మరుక్షణం దొంగలు, ‘‘అమ్మ వారికి కోపం వచ్చింది!'' అంటూ నగలు వదిలి, అక్కణ్ణించి పారిపోయూరు.
 
భవానికి తను అనుకోకుండా చేసిన దుస్సాహసం, దొంగలు బెంబేలెత్తి పారిపోవడం- అంతా కలలా తోచింది. ఇదీ ఒక మేలుకే, అనుకుంటూ ఆమె, దొంగలు వదిలిపోయిన నగలన్నీ ధరించి, అత్తగారికి ఏం చెప్పాలో ముందే ఆలోచించుకుని తెలతెలవారు తూండగా ఇంటికి తిరిగివచ్చింది.
 
ఇంటి ముందు కళ్ళాపి చల్లుతున్న సూరమ్మ, భవానిని చూస్తూనే మూర్ఛపోయి నంత పనిచేసి, ‘‘ఎవరే నువ్వు, భవానివా? ఈ నగలేమిటి? అచ్చు నాచిన్నతనంలో చూసిన గుడిలోని కామాక్షమ్మలావున్నావు!'' అన్నది.
 
అత్త అలా ఆశ్చర్యపోవడం చూసి భవాని చిన్నగా నవ్వి, ‘‘అత్తయ్యా, ఈ నగలన్నీ గుడిలోని కామాక్షమ్మవారు కరుణించి ఇచ్చినవే! చలీ, చీకటి భయంతో నేను అమ్మవారి విగ్రహం వెనక సొమ్మసిల్లి పడుకున్నాను. కొంతసేపటికి గుడి అంతా వెలుగుతో నిండి పోయింది. ఇద్దరు పండుముత్తైదువులు లీలగా కనిపించి, ‘మేం అమ్మవారి సేవికలం. ఈ నగలు నీవే; అమ్మవారి ప్రసాదం,' అంటూ నగలు నాముందు పెట్టి కనుమరుగయ్యారు. నేను ఆశ్చర్యంగా నగల కేసి చూస్తూండగా, అమ్మవారు ఏదో రహస్యం చెబుతున్నట్టు చిన్న గొంతుతో, ‘భవానీ! ఈ లోకంలో అన్ని అనర్థాలకూ మూలం పేదరికం. నువ్వు పేద ఇంట పుట్టినందువల్ల ఇన్ని కష్టాలు. గ్రామదేవతగా, ఎవరెటువంటి వాళ్ళన్నది నాకు బాగా తెలుసు. నీ అత్త కోపతాపాలు మాని, సాధుస్వభావం అలవరుచుకుంటే, నిన్ను కరుణించినట్టే, ఆమెనూ ఏదో విధంగా కరుణించగలను,' అని అన్నది,'' అని యుక్తిగా చెప్పింది.
 
భవాని ఇలా చెప్పగానే సూరమ్మకు, తనూ అమ్మవారి గుడికి పోయి నగలో, బంగారమో తెచ్చుకోవచ్చన్న ఆశ కలిగింది.

ఆ రాత్రి చీకటి పడ్డాక ఆమె, అమ్మవారి గుడికి పోయి, అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తూ, ‘‘అమ్మా, తల్లీ! ఈ రోజుతో నా కోపిష్ఠి గుణాన్ని వదిలేశాను. అంతగా కలదాన్నికాను. నన్నూ, నా కోడలిని కరుణించినట్టే కరుణించు!'' అన్నది.
 
సూరమ్మ మాట పూర్తి చేసే లోపల బయట అలికిడయింది. ఎవరో వస్తున్నారని పసిగట్టి ఆమె అమ్మవారి విగ్రహం వెనక్కు పోయి దాక్కున్నది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాత్రి వచ్చిన దొంగలే. తాము నిన్నటి రాత్రి విన్నది అమ్మవారి కంఠస్వరమా కాదా అన్న అనుమానం తేల్చుకోవడానికి వచ్చారు.
 
దొంగల్లో ఒకడు, అమ్మవారి విగ్రహానికి నమస్కరిస్తూ, ‘‘అమ్మా, మేం వృత్తి దొంగలం కాదు. బతుకుతెరువు మరేం కనబడక చిల్లర దొంగతనాలు చేసి బతుకీడుస్తున్న వాళ్ళం. నిన్నటి లాగే ఇవ్వాళ దొంగిలించిన ఈ నగలు పంచుకోవడానికి, నీ పంచచేరాం. మమ్మల్ని దొంగతనాలు మానమని ఆజ్ఞాపించదలిస్తే, ఆ మాటకాస్త గట్టిగా చెప్పు, తల్లీ!'' అన్నాడు.
 
ఆ వెంటనే సూరమ్మ పెద్ద గొంతుతో, ‘‘ఒరే, ఆ నగలు అక్కడ పెట్టి తిరిగి చూడకుండా పారిపొండి. అలా చేయకపోతే, మీ అందర్నీ నిలువునా విరుచుకు తింటాను!'' అన్నది.
 
మారిన కంఠస్వరం పసిగట్టిన ఓ దొంగ, ధైర్యం చేసి అమ్మవారి విగ్రహం వెనక్కు వెళ్ళాడు. అక్కడ సూరమ్మ కనిపించేసరికి కోపం పట్టలేక, చేతులు రెండూ పట్టుకుని బయటికి లాక్కువచ్చాడు. భయకంపితురాలైన సూరమ్మ, తన కోడలు తెచ్చిన నగల సంగతి దొంగలకు చెప్పేసింది.
 
పోయిన నగలు రాబట్టుకునేందుకు దొంగలు, సూరమ్మను వెంట బెట్టుకుని వాళ్ళింటికి వచ్చారు. తన అత్త ఏం చేయబోతున్నదో ముందే ఊహించిన భవాని, తాను పిలిపించిన జమీందారు నౌకర్లకు వాళ్ళనూ, నగలనూ అప్పగించింది.
 
భవాని తెలివితేటలనూ, సమయస్ఫూర్తినీ, నిజాయితీనీ మెచ్చుకున్న జమీందారు ఆమెను కానుకలతో బహూకరించడమే కాక, ఆమె భర్తకు దివాణంలో ఉద్యోగం ఇచ్చాడు. ఆనాటి నుంచీ సూరమ్మ కోడల్ని పల్లెత్తుమాట అనకుండా, కన్నకూతురులా చూడసాగింది.

No comments:

Post a Comment