Pages

Saturday, September 8, 2012

రామాచారివాక్శుద్ధి


గదానగరంలో మాధవాచారి అనే రామభక్తుడున్నాడు. ఆయన భార్య జానకి అనుకూలవతి. వారి కుమారుడు రామాచారి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మాధవాచారి రామకథలు చెబుతాడు. రోజూ చాలా మంది ఆయనింటికి ఆ కథలు వినడానికొచ్చేవారు. అలా వచ్చినవారు సంతోషించి తృణమో పణమో ఇస్తే పుచ్చుకునే వాడు. ఆ డబ్బే ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ నగరపాలకుడు గీర్వాణుడికి, మాధవాచారి రామకథలు వినాలని కోరిక పుట్టింది.
 
ఆయన మాధవాచారిని పిలిచి, ‘‘నీ కథలు వినాలనివుంది. ప్రతి రోజూ సాయంత్రం నా కొలువుకొచ్చి నాకూ, సభికులకూ నీ కథలు వినిపించు. కోరినంత డబ్బిస్తాను,'' అన్నాడు. అందుకు మాధవాచారి, ‘‘అయ్యూ! నీవు డబ్బిచ్చి రామకథలు వినాలనుకుంటున్నావు. అందువల్ల నేను నీ కొలువుకొచ్చి కథలు చెబితే, డబ్బు కోసమే నేనాపని చేసినట్లవుతుంది. రాముడిపై భక్తితో రామకథలు వినాలని, నా ఇంటికొచ్చిన వారికి మాత్రమే నేనా కథలు చెబుతాను.
 
నువ్వూ నా ఇంటికొచ్చి కథలు వినొచ్చు. నీ నుంచి ప్రతిఫలం కూడా కోరను,'' అన్నాడు వినయంగా. గీర్వాణుడికి కోపమొచ్చింది. కానీ ఏమీ అనలేక అప్పటికి వూరుకున్నాడు. ఈలోగా మాధవాచారి కుమారుడు రామాచారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చి, కొలువులో ఉద్యోగానికని గీర్వాణుణ్ణి కలిశాడు. సంతోషించిన గీర్వాణుడు, ‘‘నీ తండ్రి రామకథలు మాత్రమే చెబుతాడు.
 
నువ్వు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలు, ప్రబంధకావ్యాలూ, నాటకాల్లోని కథలను ప్రతిరోజూ నాకొలువులో వినిపించు. జనం నీ తండ్రి కథలు వినడం మానేసి, నీ కథలకోసం నా కొలువుకు వస్తే, నీకు కోరినంత డబ్బిస్తాను,'' అన్నాడు. రామాచారి కాసేపాలోచించి, ‘‘రసవత్తరంగా కథలు చెప్పడం నాకెంతో ఇష్టం.


ఐతే మీరు నన్ను నా తండ్రితో పోటీ పడమంటున్నారు. అది భావ్యంకాదనిపిస్తున్నది,'' అన్నాడు. ‘‘నేను నిన్ను నీ తండ్రితో పోటీ పడమన్నది పాండిత్యంలో. నీ సంపాదనతో నువ్వు సుఖపడి, నీతల్లిదండ్రులనూ సుఖపెట్టొచ్చు. ఇందులో భావ్యంకానిదేమున్నది?'' అన్నాడు గీర్వాణుడు. రామాచారికీ మాటలు నచ్చాయి. అతడు ఇంటికి వెళ్ళి విషయం చెబితే, మాధవాచారి, ‘‘నీకు న్యాయమని తోచింది చెయ్యి.
 
డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమివ్వకు,'' అన్నాడు. రామాచారి, గీర్వాణుడి కొలువులో చేరాడు. దాంతో నగరపాలకుడి కొలువులో రామాచారి చెప్పే కథలు వినడానికి జనం విరగబడివచ్చారు. గీర్వాణుడు, రామాచారికి పెద్దగా డబ్బిచ్చి సత్కరించాడు. ఏడాది తిరక్కుండా రామాచారి, ఆ ఊళ్ళోనే పెద్ద ఇల్లు కొన్నాడు. లక్ష్మి అనే అందమైన అమ్మాయిని పెళ్ళిచేసుకుని సుఖంగా రోజులు గడపసాగాడు. క్రమంగా మాధవాచారి చెప్పేకథలు వినడానికి వచ్చే జనం తగ్గిపోసాగారు.
 
ఆయనకు దిగులు పట్టుకున్నది. ఈ స్థితిలో ఒకనాటి రాత్రి ఆయనకు కలలో శ్రీరాముడు కనిపించి, ‘‘చక్రపురంలోని నా ఆలయం ఆలనాపాలనా లేకుండా పడివున్నది. అక్కడికొచ్చి నన్ను సేవించుకో,'' అన్నాడు. మెలకువరాగానే మాధవాచారి చక్రపురం గురించి నలుగురినీ విచారిస్తే, అది గదానగరానికి చాలా దూరంలో కొండల మధ్య వున్నట్టు తెలిసింది. అక్కడి నేల పంటలకూ, తోటలకూ అనువైనదే కానీ వానలు పడకపోతే గ్రామంలో తాగడానికి కూడా నీటిచుక్క దొరకదు. అందుకని, ఆ గ్రామవాసులు క్రమంగా ఇతర ప్రాంతాలకు వలస పోయూరు.
 
ఇప్పుడా గ్రామంలో కొందరు ఆటవికులు వుంటున్నారు. రామాలయంలో దేవతా విగ్రహాలకు పూజాపునస్కారాలు లేక ఆలయం పాడుపడింది. మాధవాచారి చక్రపురం వెళ్ళడానికి నిశ్చయించుకుని, భార్యతో సహా అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న ఆటవికుల నాయకుడు భిల్లన్న ఆయనొచ్చిన పని తెలుసుకుని, ‘‘మీరిద్దరూ ఆపాడుబడ్డ గుడికెళ్ళి పూజలు చేస్తే, వారం రోజుల పాటు మీ తిండీతిప్పలూ మేం చూసుకుంటాం. ఆలోగా ఏదైనా మహిమ జరిగితే, మీరిక్కడేవుండవచ్చు. లేకుంటే మిమ్మల్నీ గ్రామంలో వుండనివ్వం,'' అన్నాడు.

మాధవాచారి, జానకి నేరుగా రామాలయూనికెళ్ళారు. ఆలయంలో దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. రాత్రికి వారక్కడే పడుకుంటే, మాధవాచారికి కలలో శ్రీరాముడు కనిపించి, ‘‘నీ భక్తిశ్రద్ధలకు మెచ్చాను. నీకేంకావాలో కోరుకో, ఇస్తాను,'' అన్నాడు. మాధవాచారి, రాముడికి నమస్కరించి, ‘‘నువ్వు వారం రోజుల్లో గ్రామస్థులకేదైనా మహిమచూపాలి,'' అని కోరాడు. ‘‘సరే! నిద్రలేవగానే నీ పక్కన ఓ మంచి గంధపుచెక్క కనబడుతుంది.
 
ముందు దాన్ని కుడిచేత్తో పట్టుకో; ఎప్పుడేం చేయూలో తెలుస్తుంది. తర్వాత ఎడం చేత్తో పట్టుకో; నువ్వే మాటంటే అది జరుగుతుంది. నీకూ, నీ వారసులకూ మాత్రమే, ఆ గంధపు చెక్క శక్తి ఉపయోగపడుతుంది,'' అని శ్రీరాముడు మాయమయ్యూడు. మెలకువ వచ్చాక చూస్తే మాధవాచారి పక్కన ఓ గంధపుచెక్క వున్నది. భార్యకాయన తన కల గురించి చెప్పాడు. ఇద్దరూ సమీపంలో వున్న కొలనులో స్నానాలు చేశారు.
 
మాధవాచారి గంధపు చెక్కను కుడి చేత్తో పట్టుకుని, ‘‘ఈ ఆలయం సరికొత్త పాల రాతిమందిరంగా మారాలి,'' అన్నాడు. పాడుపడ్డ ఆ ఆలయం పాలరాతిమందిరంగా మారిపోయింది. జరిగిన అద్భుతం చూసి గ్రామస్థులంతా మాధవాచారి కాళ్ళ మీద పడిపోయూరు. ఈలోగా గదానగరంలోనూ కొన్ని మార్పులొచ్చాయి. రామాచారి కథలు చెప్పి డబ్బు బాగా సంపాదిస్తున్నాడని తెలిసి నటులూ, నాట్యకత్తెలూ, వీధిభాగోతంవాళ్ళూ అక్కడికొచ్చారు.
 
దాంతో నగరవాసులకు రామాచారి కథల మీద ఆసక్తి తగ్గింది. ఆదాయం బాగా తగ్గిపోవడంతో, అతడా విషయం గీర్వాణుడికి చెప్పుకున్నాడు. దానికి గీర్వాణుడు, ‘‘మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. ఇక్కడుండి ఏంచేస్తావ్‌? చక్రపురం వెళ్ళి దగ్గరుండి ఆయన్ను చూసుకో,'' అన్నాడు మందలిస్తున్నట్టు. గీర్వాణుడికి తన పట్ల సదభిప్రాయం లేదని గ్రహించిన రామాచారి, ఆ మర్నాడే భార్యతోపాటు చక్రపురం వెళ్ళాడు.
 
కొడుకునూ, కోడలినీ చూసి మాధవాచారి, జానకి అపరిమితానందం చెందారు. మాధవాచారి, కొడుకును పక్కకు పిలిచి గంధపు చెక్కమహిమ గురించి చెప్పి, ‘‘నిన్నా శ్రీరాముడే ఇక్కడికి రప్పించాడు.


నీ మనసును రామ భక్తితో నింపుకో. అర్హతరాగానే నేను నీకు గుడి బాధ్యత అప్పగిస్తాను,'' అన్నాడు. గంధపుచెక్క మహిమ విని ఆశ్చర్యపడిన రామాచారి, ఆ విషయం తన భార్య లక్ష్మికి చెప్పాడు. అది విన్న లక్ష్మికి వెంటనే తన భర్తను రామాలయం పూజారిని చేయూలని దుర్బుద్ధి పుట్టింది. ఆమెకో మందు తెలుసు. అది పుచ్చుకున్న వ్యక్తి నెల్లాళ్ళపాటు మంచం పట్టి తిరిగి మామూలు మనిషవుతాడు.
 
లక్ష్మి రహస్యంగా మామగారి కామందు పెట్టింది. వెంటనే ఆయన మంచం పట్టాడు. వైద్యులు, మాధవాచారిని పరీక్షించి, ‘‘ఈ జబ్బేం ప్రమాదం కాదు. దీనికి మందులూ లేవు. ఎటొచ్చీ నువ్వు నీళ్ళలో తడిసినా, చుట్టూ గాలిలో తేమ ఎక్కువైనా ప్రాణప్రమాదం,'' అని చెప్పివెళ్ళారు. తండ్రి జబ్బు పడడంతో రామాచారి గుడి పూజారి అయ్యూడు. అదే సమయమని లక్ష్మి అతడితో, ‘‘నీ వాక్శుద్ధిని ప్రజల ముందు నిరూపించుకుని, వాళ్ళ మెప్పు పొందు,'' అన్నది.
 
సరేనని రామాచారి తొలి రోజున ఆలయూనికి వచ్చిన వారితో, ‘‘నాకు వాక్శుద్ధివుంది! మీలో ఎవరికేంకావాలో కోరుకోండి,'' అన్నాడు. కొందరు వ్యాపారంలో లాభాలు రావాలనీ, మరికొందరు నిధులు లభించాలనీ రకరకాలుగా కోరుకున్నారు. అవన్నీ నెరవేరాయి. కానీ, రామాచారి భార్య లక్ష్మి హఠాత్తుగా, తీవ్రమైన పక్షవాతానికి గురయింది.
 
కారణం తెలుసుకోవాలని గంధపు చెక్కను పట్టుకున్న రామాచారి ఒళ్ళంతా మంటలు పుట్టినట్టయి తీవ్రమైన ఆందోళనకు గురయ్యూడు. ఇలా ఉండగా ఒకనాడు గ్రామస్థులందరూ కలిసికట్టుగా రామాచారి వద్దకు వచ్చి, ‘‘మాకందరికీ ఎంతో మేలు చేసిన నీ తండ్రి అనారోగ్యంతో బాధపడడం చూడలేము. నీ తండ్రి జబ్బు నయమయ్యే వరకు మన ఊళ్ళో వాన పడకూడదు. ఇదే మా అందరి కోరిక,'' అన్నారు. వారి ఉమ్మడి కోరిక ప్రభావంతో, ఆ ఊళ్ళో వానలు కరువై నిప్పులు చెరిగే ఎండలు కాశాయి.
 
చెరువులన్నీ ఎండి పోయూయి. ఆ బాధలు భరించలేక ప్రజలు మళ్ళీ రామాచారి వద్దకు వెళ్ళి, కాపాడమని మొరపెట్టుకున్నారు. రామాచారి వారినందరినీ వెంటబెట్టుకుని, తండ్రి వద్దకు వెళ్ళి, తాను తెలియక చేసిన అపరాధాన్ని క్షమించమని గంధపు చెక్కను ఆయన చేతిలో పెట్టాడు.

దాని సాయంతో మాధవాచారి జరిగిన సంగతి తెలుసుకుని, ‘‘నాయనా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తంలేదు. నీ మనసులో శ్రీరాముని నింపుకుని స్వార్థచింతన లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు,'' అంటూ గంధపు చెక్కను మళ్ళీ కొడుకు చేతిలో పెట్టాడు. రామాచారి గంధపు చెక్కను పట్టుకున్నా మునుపటిలా ఒంట్లో ఎలాంటి మంటలూ లేవు. చల్లగా ఉంది.
 
అప్పుడాయన, ప్రజలతో, ‘‘ మాతండ్రి అనారోగ్యం కుదుటపడాలనే మీ అందరి ప్రార్థన కారణంగానే, మన ఊళ్ళో వర్షం కురవడం లేదు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడడానికి మరో నెల రోజులు పట్టవచ్చు. అంతవరకు ఆయన్ను గ్రామానికి దూరంగా ఉంచుదాం. అప్పుడు ఇక్కడ వర్షాలు కురుస్తాయి,'' అన్నాడు. ప్రజలు అందుకు ఒప్పుకున్నారు. రామాచారి స్వయంగా బండి ఏర్పాటు చేసుకుని తల్లితో సహా తండ్రిని రామాపురంలో వదిలి వచ్చాడు.
 
ఆయన తిరిగి వచ్చిన వెంటనే చక్రపురంలో భోరున వర్షం కురిసింది. గ్రామస్థులు రామాచారిని మెచ్చుకుని, ‘‘నీ వాక్శుద్ధి అపూర్వం. ఇకమీదట నువ్వే రామాలయూనికి పూజారివి,'' అన్నారు. నెలరోజుల తరవాత ఒకనాడు రామాచారి భార్య లక్ష్మి అనారోగ్యం చేత్తో తీసేసినట్టు మటుమాయమయింది. రామాచారి భార్యను వెంటబెట్టుకుని రామాపురం వెళ్ళాడు. మాధవాచారి అప్పటికే సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. రామాచారి, భార్యతో సహా తండ్రి పాదాలకు నమస్కరించి, ‘‘నాన్నా, నేను పితృద్రోహిని. దైవ పూజలకు తగను.
 
మీరే చక్రపురం వచ్చి పూజారి బాధ్యతలను స్వీకరించండి,'' అన్నాడు. మాధవాచారి ఆప్యాయంగా కొడుకును లేవనెత్తి, ‘‘నాయనా, నీకు వాక్శుద్ధి ఉంది. స్వార్థం పడగ విప్పనంతవరకు అది ఉంటుంది. స్వార్థచింతన పోవాలంటే స్వానుభవంకావాలి. శ్రీరాముడి కరుణతో అదే నీకు ప్రాప్తించింది. శ్రీరాముడి సంకల్పం మేరకే అంతా జరిగిందన్న విశ్వాసంతో, మునుముందు జాగ్రత్తగా నడుచుకో. పూజారిగా ఉండడానికి నువ్వు అన్ని విధాలా అర్హుడివి,'' అని దీవించాడు.

No comments:

Post a Comment