Pages

Saturday, September 8, 2012

పట్టుబడని గూఢచారి


అది 1917వ సంవత్సరం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూన్న రోజులు. బ్రిటిష్‌ సీక్రెట్ సర్వీసెస్‌ అధికారి సందిగ్ధంలో పడ్డాడు. బ్రిటిష్‌ సేనల ఆక్రమిత ప్రాంతంలో శత్రుగూఢచారులు కోకొల్లలుగా ఉన్నారని తూర్పు తీరసైనిక బృందాలతోవున్న ఆయనకు తెలియవచ్చింది. అలాంటి బెడదతో నెట్టుకురావాలంటే సైనికులకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలా, ఎలాంటి మెళకువలు నేర్పాలా అని ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆయన పేరు మానరింగ్‌.
 
ఫ్రిట్‌జ్ అనే జర్మన్‌ సీక్రెట్ సర్వీస్‌ గూఢచారి, మారువేషాల్లో బ్రిటిష్‌ సేనలవెంట తిరుగుతూ కీలక సమాచారాలను సేకరిస్తున్నట్టు కూడా ఆయనకు తెలియవచ్చింది. అయితే, ఫ్రిట్‌జ్ తిరుగుతున్నాడనడానికి తగిన ఆధారాలేవీ లభించలేదు. అందువల్ల అది కేవలం వదంతి మాత్రమేనా? అన్న అనుమానం కూడా ఆయనకు లేకపోలేదు.
 
అయినా, మానరింగ్‌ ఈ సంగతిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. ఈ విషయంగా సైనిక బృందాలను హెచ్చరించాలనుకున్నారు. జర్మన్‌ గూఢచారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేశారు.
 
ఒక రోజు మానరింగ్‌ యుద్ధ ఖైదీలున్న సైనిక శిబిరానికి వెళ్ళాడు. ఆయన ఎవరన్నదీ అక్కడివారందరూ గుర్తించడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. టర్కిష్‌ సేనలను వదలి వచ్చిన ఒక గ్రీకు ఖైదీ తనను చూడాలంటున్నాడని ఆయనకు తెలియగానే అతని దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ను చూడగానే ఆ ఖైదీ అన్న మాటలు మానరింగ్‌కు మరింత విస్మయం కలిగించాయి.

‘‘అయ్యా, తమరు వెతుకుతూన్న మనిషి నాకు తెలుసు. కొన్నాళ్ళ క్రితం నేను అతనితో కలిసి పనిచేశాను కూడా. అతని పేరు ఫ్రిట్‌జ్!''
 
‘‘ఏమిటీ? పరిహసిస్తున్నావా?'' అని అడిగాడు మానరింగ్‌ ఆశ్చర్యంతో.
 
‘‘ఏమాత్రం కాదు. తమరు నా విడుదలకు ఏర్పాటు చేశారంటే, అతన్ని పట్టుకోవడానికి నా చేతనైన సాయం చేస్తాను,'' అన్నాడు వాడు ఏమాత్రం తొణక్కుండా.
 
కొంతసేపు తీవ్రంగా ఆలోచించిన మానరింగ్‌, అతని కోరికను అంగీకరించాడు. అయితే, ఆ సంగతి బయట పెట్టకుండా, ఆ ఖైదీని గ్రీకు రాయబార కార్యాలయానికి వెంటబెట్టుకుని వెళ్ళి, అతడు గ్రీకుదేశస్థుడే అన్న సంగతి రూఢిచేసుకున్నాడు.
 
ఇప్పుడు గ్రీకు దేశస్థుడు కొన్ని నిబంధనలు పెట్టాడు. తను ఫ్రిట్‌జ్‌తో గొడవపడి ఎందుకు విడిపోవలసి వచ్చిందో వివరించాడు. అయినా, తనకు ఇప్పుడు సైన్యానికి సంబంధించిన కొంత రహస్య సమాచారం అందచేస్తేనే, ఆ మిషతో ఫ్రిట్‌జ్‌‌ను కలుసుకోవడం సులభమవుతుందని చెప్పాడు. అప్పుడే ఫ్రిట్‌జ్‌కు తన పట్ల నమ్మకం కుదరుతుందనీ, ఆపైన అతన్ని మంచిగా టర్కిష్‌ లైన్స్ నుంచి వెలుపలికి వచ్చి ఒక నిర్ణీత ప్రదేశానికి రమ్మనడానికి సాధ్యమవుతుందనీ, అప్పుడు సులభంగా పట్టుకోవచ్చనీ చెప్పాడు. మానరింగ్‌ సరేనని, తమకు హానికలిగించని కొంత సమాచారాన్ని అతనికి అందజేశాడు. ఆ తరవాత అక్కడి నుంచి అతన్ని వదిలి పెట్టారు.
 
చెప్పిన మాట ప్రకారం గ్రీకుదేశస్థుడు చెప్పిన సమయానికి తిరిగివచ్చాడు. ఫలానారోజు బ్రిటిష్‌ ఆక్రమిత ప్రాంతమైన ఫలానా చోటికి ఫ్రిట్‌జ్ వస్తాడని చెప్పాడు. బ్రిటిష్‌ సేనల ఆక్రమణలోవున్న ఎండిపోయిన నదీ తీరంలోని ఒక మారుమూల ప్రదేశానికి అతడు వస్తాడనీ, గూఢచారిని పట్టుకోవడానికి అదే అన్ని విధాలా సరైన ప్రదేశమనీ చెప్పాడు.
 
అతడు చెప్పిన స్థలానికి, చెప్పిన సమయానికి, ‘‘ఆహా! ఫ్రిట్‌జ్ పడ్డాడు నా వలలో!'' అనుకుంటూ మానరింగ్‌ అమిత విశ్వాసంతో చేరుకున్నాడు. అప్పటికే గ్రీకు దేశస్థుడు అక్కడ గుర్రం పక్కన నిలబడివుండడం చూసి, ఆయన మరింత సంతోషించాడు. అంటే, మనిషి మాట నిలుపుకున్నాడన్న మాట! ఫ్రిట్‌జ్, ఒక అనుచరుడితో కలిసి బ్రిటిష్‌ ఆక్రమిత ప్రాంతంలో ఉన్నాడనీ త్వరలోనే వాళ్ళిటు రాగలరనీ అతడు చెప్పాడు. అక్కడ కాచుకుని ఉన్నప్పుడు వాళ్ళు మాటల్లో పడ్డారు. ఆ మాటల సందర్భంలో గ్రీకుదేశస్థుడు తనకూ, ఫ్రిట్‌జ్‌కూవున్న సన్నిహిత సంబంధానికి రుజువుగా కొన్ని లిఖితపూర్వక సాక్ష్యాలను చూపాడు.
 
‘‘మీ దగ్గర ఆయుధం ఉన్నదా?'' అని అడిగాడు ఉన్నట్టుండి గ్రీకుదేశస్థుడు. ‘‘ఊ, ఉంది,'' అన్నాడు అధికారి.

‘‘అయితే, ఫ్రిట్‌జ్‌ని చూడగానే కాల్చి చంపేయండి,'' అని సలహా ఇచ్చాడు గ్రీకుదేశస్థుడు. పొద్దు పోయి, మసక చీకటి కమ్ముకుంటూన్న సమయంలో, దూరంగా ఎవరో గుర్రం మీద వాళ్ళకేసి రావడం కనిపించింది.
 
‘‘అది బ్రిటిష్‌ యూనిఫారంలో ఉన్న ఫ్రిట్‌జ్ మిత్రుడు. వాడి వెంబడే ఫ్రిట్‌జ్ రాగలడు!'' అన్నాడు మెల్లగా గ్రీకుదేశస్థుడు.
 
ఫ్రిట్‌జ్ మిత్రుడు గ్రీకు దేశస్థుడి దగ్గరికి వచ్చి, ఏవో కాగితాలను అందించాడు. ఆ తరవాత జర్మన్‌ భాషలో, బ్రిటిష్‌ సేనల కంట బడడంతో ఫ్రిట్‌జ, టర్కిష్‌ లైన్స్‌కు తిరిగి వెళ్ళవలసి వచ్చిందని చెప్పాడు. ఆ మాట విని గ్రీకుదేశస్థుడు దిగ్భ్రాంతినీ, నిరాశనూ వ్యక్తం చేశాడు. ఆ తరవాత బ్రిటిష్‌ అధికారి కేసి తిరిగి, ‘‘క్షమించండి, కొన్ని రోజుల్లోనే ఫ్రిట్‌జ్‌ని తెచ్చి మీ కప్పగించే బాధ్యత నాది,'' అన్నాడు.
 
బ్రిటిష్‌ అధికారి ఒక సంగతి గ్రహించి ఆశ్చర్యపోయాడు. వచ్చిన వ్యక్తీ, గ్రీకుదేశస్థుడూ జర్మన్‌ భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళెందుకు గ్రీకు భాషలో మాట్లాడలేదు అన్న అనుమానం ఆయనకు కలిగింది. అయినా ఫ్రిట్‌జ్‌ని పట్టుకోవాలంటే గ్రీకు దేశస్థుడి సలహా పాటించడం తప్ప ఆయనకు మరోమార్గం కనిపించలేదు. తప్పించుకు తిరుగుతున్న ఫ్రిట్‌జని ఎలాగైనా పట్టుకోవాలి!
 
‘‘ఈ పరిస్థితిలో ఫ్రిట్‌జ్ మిత్రుణ్ణి శత్రు శిబిరానికి తిరిగి వెళ్ళడానికి నేను అనుమతించలేను. ముగ్గురికి తెలిసిన రహస్యం, రహస్యం కాదన్న సంగతి నీకు తెలియనిది కాదు! వెంటనే వాణ్ణి ఖైదు చేస్తాను,'' అన్నాడు మానరింగ్‌ దృఢంగా.
 
గ్రీకుదేశస్థుడు విషయం గ్రహించి సరేనన్నాడు. వచ్చినవాడు కొంచెం దూరంలో గుర్రం పక్కగా నిలబడి దాన్ని చరుస్తున్నాడు. ‘‘లోయకు ఆవలి వైపు చూడు. ఎవరైనా ఉన్నారేమో. వాణ్ణి ఇప్పుడే పట్టుకుందాం,'' అన్నాడు గ్రీకుదేశస్థుడు మానరింగ్‌తో.
 
మానరింగ్‌ తన జేబులోని ఆటోమేటిక్‌ పిస్టల్‌ ట్రిగ్గర్‌ మీద చేయివేశాడు. ఆ తరవాత గుర్రాన్ని తీసుకుని కొంచెందూరం వెళ్ళి, గుర్రం మీదికి ఎక్కి కూర్చున్నాడు. ఆ క్షణమే రెండుసార్లు భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ…యన పక్కగా తుపాకీ గుళ్ళు దూసుకుపోయాయి. ఆయన వెంటనే వెనుదిరిగి చూశాడు. ఫ్రిట్‌జ్ మిత్రుడూ, గ్రీకుదేశస్థుడూ ఇద్దరూ తనను చంపడానికి కాల్పులు జరుపుతున్నారు. మానరింగ్‌ దిగ్భ్రాంతి చెందాడు. ఆయన గుర్రం బెదిరిపోయి అటూ ఇటూ ఎగరసాగింది.

మానరింగ్‌ దానిని అదుపు చేస్తూ, ఆ ఇద్దరి మీదికీ కాల్పులు జరిపాడు. ఫ్రిట్‌జ్ మిత్రుడు తీవ్రంగా గాయపడి కిందపడ్డాడు. గ్రీకుదేశస్థుడు గుర్రాన్ని ఎక్కి తప్పించుకుని పారిపోయాడు. అతన్ని అనుసరించి మిత్రుడు ఎక్కివచ్చిన గుర్రం పరిగెత్తింది.
 
మానరింగ్‌ గుర్రం దిగి ప్రాణాలకు కొట్టిమిట్టాడుతూన్న మనిషి దగ్గరికి వెళ్ళాడు. తీవ్రమైన గాయాలతో ప్రాణాలు విడుస్తూన్న ఆ వ్యక్తి ఒక మహిళ అని తెలియడంతో ఒక్క క్షణం తనకళ్ళనే నమ్మలేక పోయాడు. జర్మన్‌ …యువతి బ్రిటిష్‌ …యూనిఫారంలో వచ్చిందన్నమాట! కొన్ని క్షణాలలోనే ఆమె ప్రాణాలు విడిచింది.
 
బ్రిటిష్‌ అధికారి ఇల్లు చేరేసరికి చీకటిదట్టంగా కమ్ముకున్నది. ఆయన ఎంతగానో నిరుత్సాహపడ్డాడు. తెలియకుండా అయినా సరే ఒక స్ర్తీని చంపేశామే అని సిగ్గుపడ్డాడు. గ్రీకుదేశస్థుడు తనను బాగా మోసంచేశాడు. వాడూ, ఆ స్ర్తీ కలిసి తనను హత్యచేయడానికి ప్ర…యత్నించారు. అయినా, ఆ స్త్రీకి బదులు గ్రీకుదేశస్థుడు తన చేతిలో చచ్చివుంటే ఎంతో బావుండేది అని ఆయన అనుకోసాగాడు.
 
ఆ గ్రీకు దేశస్థుడు ఎవరు? ఆ స్ర్తీ ఎవరు? తప్పించుకు తిరుగుతూన్న ఫ్రిట్‌జ్ మాటేమిటి? ఇవన్నీ వీడని రహస్యాలుగానే కొన్నాళ్ళు కొనసాగాయి!
 
కొన్ని నెలల్లో …యుద్ధం ముగిసింది. మానరింగ్‌కు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చదవగానే దిగ్భ్రాంతితో, ఆ…యన కొంతసేపు కళ్ళుమూసుకున్నాడు. ఏమాత్రం నమ్మలేక ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు. అంతా ఊహా ప్రపంచంలో జరుగుతున్నట్టనిపించింది! ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకు తిరిగిన ఫ్రిట్‌జ్ అబద్ధం కాదు. నిజమైన వ్యక్తి. ప్రపంచయుద్ధ సమయంలో అత్యంత సామర్థ్యంతో, చాక చక్యంతో, తెలివితేటలతో నడుచుకున్న జర్మన్‌ సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్లలో ప్రథముడు!
 
ఆ గ్రీకుదేశస్థుడే ఫ్రిట్‌జ్! చనిపోయిన స్ర్తీ అతని భార్య!
 
కొన్ని సంవత్సరాల తరవాత, ఒకరోజు బ్రిటిష్‌ ఆక్రమిత ప్రాంతంలోని ఒక హోటల్లో - ఫ్రిట్‌జ్, మానరింగ్‌ ఒకరికొకరు అనుకోకుండా తారసపడ్డారు. పరస్పరం గుర్తించుకున్నారు. బహుశా ఒకరిని చూసి మరొకరు లోలోపల చిన్నగా నవ్వుకుని ఉంటారు. అయితే, ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు!

No comments:

Post a Comment