Pages

Thursday, September 6, 2012

శనివారం వింత


ఒకానొక గ్రామంలోని ఒక పేద రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు. రైతు వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కొడు కులు తండ్రి పట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబరచేవారు. అందరూ కలిసి పొలం పనులు చేసుకునేవారు. కొడుకులు …యుక్తవయస్కులయ్యాక తండ్రి వారికి పెళ్ళిళ్ళు చేశాడు. ముగ్గురు కోడళ్ళు వచ్చారు. వారిలోవారు కలిసి మాట్లాడుకుని వారం రోజులు ఒక్కొక్క కోడలు ఇంటిపట్టునే వుండి ఇంటి పనులు, వంట పనులు చే…యాలని ఏర్పాటు చేసుకున్నారు.అది ఒక శనివారం. ఆ రోజు వంటపని చిన్నకోడలి వంతు.

వంట చెయ్యడానికి పొయ్యి ముట్టిస్తూండగా వీధిలో నుంచి, ‘‘అమ్మా,’’ అన్న పిలుపు వినిపించింది. ఆమె వాకిట్లోకి వచ్చి చూస్తే చిరిగిన బట్టలతో ఒక బిచ్చగాడు కనిపించాడు. ‘‘ఒళ్ళంతా దురదగావుంది. నూనె కొంచెం ఇస్తావా తల్లీ. ఒంటికి రాసుకుని స్నానం చేస్తాను,’’ అన్నాడు బిచ్చగాడు ఆమెను చూడగానే.ఆమె ఇంటిలోపలికి వెళ్ళి సీసాలో నూనె తెచ్చి, బిచ్చగాడి అరచేతిలోకి పోసింది. వాడు దాన్ని ఒంటికి రాసుకున్నాడు. ‘‘పక్కనే చెరువు వుంది. వెళ్ళి స్నానం చేసిరా, ఇంత తిని వెళుదువు,’’ అన్నది చిన్నకోడలు.

బిచ్చగాడు స్నానం చేసి తిరిగివస్తూ, దారిలో పెద్ద పెద్ద ఆకులను కోసుకుని పళ్ళెంలా చేసుకుని మరీ వచ్చాడు. చిన్న కోడలు వాడికి ఆ ఆకులో భోజనం పెట్టింది. ‘‘ఇంత మంచి భోజనం తిని చాలా రోజులయింది, తల్లీ,’’ అంటూ వాడు భోజనం పూర్తిచేసి, ఆకును తీసి మడిచి ఇంటి చూరులో దోపి వెళ్ళాడు. కోడలు దాన్ని చూసింది కాని, ఆ సంగతి అంతటితో మరిచిపోయింది.పొలం పనులకు వెళ్ళిన ఇంటిల్లిపాదీ తిరిగివచ్చి, కూర్చుని భోజనం చేస్తూ, వంటలు అద్భుతంగా ఉండడంతో చిన్న కోడలిని ఎంతో మెచ్చుకున్నారు.


అయినా, ఇంటికి వచ్చిన బిచ్చగాణ్ణి గురించి చెప్పే అవకాశం ఆమెకు రాలేదు. ఒక వారం గడిచి మరుసటి శనివారం వచ్చింది. ఆ రోజు వంట చేయడం రెండవ కోడలివంతు. ఆమె వంట పనులు ప్రారంభిస్తూండగా బిచ్చగాడి కంఠ స్వరం వినిపించింది. ఆమె వెలుపలికి రాగానే బిచ్చగాడు, ‘‘ఒళ్ళంతా కురుపు లుగా ఉన్నాయి. నూనె రాసుకుని స్నానం చేయాలి. కొద్దిగా నూనె ఇవ్వు తల్లీ పుణ్య ముంటుంది,’’ అన్నాడు. ఒళ్ళంతా పుళ్ళతో ఉన్న వాణ్ణి చూడగానే ఆమెకు కంపరం కలిగి, ‘‘నీలాంటి ముష్టివెధ వలకు ఇవ్వడానికి మాయింట నూనె లేదు, ఏమీ లేదు. వెళ్ళు వెళ్ళు,’’ అని తిట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది.

‘‘నూనె లేకపోతే పోయింది. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. ఒక రొట్టె ముక్క వుంటే పెట్టు తల్లీ. తిని ఆకలి తీర్చుకుంటాను,’’ అన్నాడు బిచ్చగాడు. ‘‘నువ్వు ఇంకా ఇక్కడే తగలడ్డావా?’’ అంటూ ఆమె లోపలి నుంచే, అక్కడున్న మురికి నీళ్ళ బొక్కెన తీసి కిటికీగుండా వాడి మీదికి పోసింది. ‘‘ఒక ముష్టివాడికి నువ్వు చేసే సాయం ఇదన్నమాట! ఈ రోజంతా నీకు నా గతే,’’ అంటూ వెళ్ళిపోయాడు బిచ్చగాడు.

కోడలు అదేం పట్టించుకోకుండా వంట పనిలో నిమగ్నమైపోయింది. సాయంకాలానికి పొలం నుంచి అందరూ తిరిగివచ్చారు. ఎప్ప టిలాగే భోజనాలకు కూర్చున్నారు. అయితే, వంట పాత్రలన్నీ ఖాళీగా ఉండడం చూసి రెండవ కోడలు నిర్ఘాంత పోయింది. వాటిలో స్వయంగా వంటలు పెట్టి మూత పెట్టింది తను. అయినా ఎవరో తినివెళ్ళినట్టు పాత్రలన్నీ శుభ్రంగా తుడిచినట్టు ఉన్నాయి! కోడలిపట్ల ప్రేమానురాగాలుగల మామ గారు ఆమెను పల్లెత్తుమాట అనలేదు. మిగిలిన ఇద్దరు కోడళ్ళనూ వంట పనిలో ఆమెకు సాయపడమని చెప్పాడు. అయితే, పిండి డబ్బా ఖాళీగా వుంది. గుప్పెడు పిండి కూడా లేదు. కూరగాయల బుట్ట కూడా ఖాళీగానే వుంది. నూనె పాత్రలో బొట్టు నూనె లేదు.
అయినా, మామగారు కోడలిని తప్పు పట్టలేదు. రెండవ కొడుకును వెంటబెట్టు కుని అంగడికి వెళ్ళి కావలసిన వెచ్చాలు, కూరగాయలు కొని తెచ్చాడు. ముగ్గురు కోడళ్ళూ కలిసి వంట చేశారు. అందరూ తిని పడు కున్నారు. మరోవారం గడిచింది. మూడో శనివారం వచ్చింది. ఇప్పుడు వంట చేయడం పెద్ద కోడలి వంతు. ఆమె పొయ్యి రగిలిస్తూండగా, ‘‘అమ్మా, కొద్దిగా నూనె ఇవ్వు తల్లీ,’’ అని బిచ్చగాడి కంఠస్వరం విని వెలుపలికి రాగానే, మళ్ళీ బిచ్చగాడు అదేమాట వల్లించి, ‘‘ఒళ్ళంతా దురదలుగా ఉన్నాయి తల్లీ!

నూనె రాసుకుని స్నానం చేయాలి. కరుణ చూడు తల్లీ,’’ అన్నాడు. వంటపనికి అంతరాయం కలిగిందని ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. దాంతో పాటు, గతశనివారం తన తోడికోడలు ఏమరు పాటుతో ఉన్నప్పుడు ఈ ముష్టివెధవే వచ్చి ఉన్నదంతా తిని, దోచుకొని వెళ్ళాడేమో అన్న అనుమానం కూడా కలగడంతో, ‘‘దొంగవెధవా! పిండీ, కూరగాయలు, నూనె మళ్ళీ దొంగిలించడానికి వచ్చావా? వెళ్ళు ఇక్కణ్ణించి,’’ అని గద్దించింది. ‘‘అభాండం వేయకు తల్లీ. నేను దొంగను కాను. ఇంత నూనె పోసి, రొట్టె ముక్క పెట్టు తల్లీ. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు,’’ అన్నాడు బిచ్చగాడు.

‘‘ఒరే, నీ ప్రార్థనలు, దీవెనలు నాకు వద్దు,’’ అంటూ ఒక కర్ర పుచ్చుకుని, ‘‘మర్యాదగా ఇక్కణ్ణించి వెళతావా? గెంట మంటావా?’’ అన్నది ఆగ్రహంతో. ‘‘అంటే, నా ప్రార్థన మన్నించవన్న మాట! ఇక ఈ రోజు నువ్వు చేసిన వంట మీవాళ్ళు తిన్నట్లే!’’ అంటూ బిచ్చగాడు వెళ్ళిపో…యాడు. వాణ్ణొక పిచ్చివాడికింద జమకట్టిన పెద్ద కోడలు, వాడి మాటలేవీ పట్టించుకోకుండా చకచకా పనులు ప్రారంభించి వంట పూర్తి చేసి, తన వాళ్ళ రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నది. అందరూ వచ్చి భోజనాలకు కూర్చున్నాక, వంటలతో ఉన్న పాత్రలను తెచ్చి వాళ్ళ ముందుంచి, ఒక్కొక్క పాత్ర మూత తీసింది. రొట్టెల చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి.

పప్పులో చీమలు, ఈగలు. వాటిని చూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె భోరున ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి మామగారికి అర్థమయింది. తెలియకుండానే మనం దేవతలకేదో అపచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యా. లేకుంటే గత శనివారం, ఈ రోజు ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం లేదు. మనం దేవతలను సంతోష పరచి దీనికేదైనా పరిష్కారం చూడాలి!’’ అన్నాడు సాలోచనగా. ఆ తరవాత ఆయన పెద్ద కొడుకును వెంటబెట్టుకుని వెళ్ళి కావలసిన వంట సామగ్రిని తెచ్చి, ముగ్గురు కోడళ్ళను వంట చేయమని చెప్పాడు.


వారం గడిచింది, నాలుగో శనివారం రానే వచ్చింది. ఆ రోజు వంట చేయడం మళ్ళీ చిన్న కోడలు వంతయింది. ఆమె వంట చేయడానికి ఉపక్రమిస్తూండగా పరిచిత కంఠ స్వరం మళ్ళీ వినిపించింది. వెలుపలికి వచ్చి చూస్తే అదే బిచ్చగాడు. అలాగే నూనె అడిగాడు. ‘‘కొన్నాళ్ళ క్రితం వచ్చి అడిగావు కదా. ఇంకా నీకా పుళ్ళు, దురదలు పోలేదా?’’ అంటూ చిన్న కోడలు ఇంటి లోపలికి వెళ్ళి నూనె తెచ్చి వాడి చేతిలో పోసింది. వాడు నూనెను ఒంటికి రాసుకుంటూండగా, ‘‘వెళ్ళి స్నానం చేసిరా, ఇంత తిని వెళుదువు,’’ అన్నదామె.
కొంత సేపటికి వాడు ఆకుల పళ్ళెంతో తిరిగి వచ్చాడు.

ఆమె పెట్టిన రొట్టెలు సంతోషంగా తిని, ‘‘మీ భార్యాభర్తలు పిల్లాపాపలతో చిర కాలం, సుఖసంతోషాలతో వర్థిల్లండి,’’ అంటూ లేచి, తిన్న ఆకును చూరుకు దోపి వెళ్ళిపోయాడు. ఆరోజు సాయంకాలం ఆమె చేసిన వంటను అందరూ సంతోషంగా తిన్నారు. ‘‘అంతా చాలా విచిత్రంగా వుంది. ఒక శనివారం వంటలు కనిపించకుండా పోయాయి. మరొక శని వారం వంటలనిండా పురుగులు, చీమలు, క్రిమి కీటకాలు. మరి ఇవాళ భోజనమేమో ఎంతో రుచిగా వుంది!

అంటే మనపట్ల దేవతలకున్న కోపం పోయిందన్న మాట. శాంతించి నట్టుంది!’’ అన్నాడు మామగారు. అప్పుడే భోజనం చేయడానికి కూర్చున్న చిన్న కోడలు, ఈ రెండు శనివారాలలో వచ్చిన బిచ్చగాణ్ణి గురించి వివరించి, వాడు తమ ఇంటి చూరులో దాచి వెళ్ళిన విస్తరాకులను మామగారికి చూపించింది. మామగారు లేచివెళ్ళి ఒక విస్తరాకును తీసి చూశాడు. అందులో మణులూ, మాణిక్యాలూ, రత్నాలూ ఉన్నాయి. రెండవ విస్తరిని తీశాడు. అందులో బంగారు నాణాలు ఉన్నాయి. ఆ కుటుంబం ఆనందాశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి.

అప్పుడు గత రెండు శనివారాలలో బిచ్చగాడు వచ్చి నూనె అడిగినప్పుడు తామెలా తరిమికొట్టిందీ, పెద్ద కోడలూ, రెండవ కోడలూ మామగారికి వివరించారు. ‘‘బహుశా శనిభగవానుడే బిచ్చగాడిలా మన ఇంటికి వచ్చాడనుకుంటాను! ఇప్పు డాయన ప్రీతి చెందాడు,’’ అన్నాడు రైతు ఆనందంగా.కొన్నాళ్ళకు ఈ సంఘటన గురించి ఇరుగు పొరుగుకు తెలిసింది. గ్రామ ప్రజలు శని వారాలలో శనీశ్వరుణ్ణి పూజించేప్పుడు ప్రధా నంగా నువ్వుల నూనె పెట్టడం ప్రారంభిం చారు. ఆ సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఇప్పుడూ కొనసాగుతోంది.


No comments:

Post a Comment