Pages

Thursday, September 6, 2012

శాంతోపాయం


నరేంద్రుడు యువకుడు, అందగాడు. అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని, అతడి కోరిక. అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు. అయితే, అలా డబ్బు సంపాదించినవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పూ పొందే సాహసకార్యం ఏదైనా చేయాలనుకున్నాడు, నరేంద్రుడు. కానీ ఏ సాహసకార్యాన్నెన్నుకుందామన్నా, అంతకంటే గొప్ప సాహసకార్యాలు అప్పటికే ఎందరో చేశారు.

కాబట్టి అదీ లాభం లేదనిపించింది, నరేంద్రుడికి. నరేంద్రుడి మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచనాధోరణి తెలిశాక, ఒకనాడామె నరేంద్రుడితో, "బావా, గొప్పతనం దానంతటది రావాలికానీ, ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్ళిచేసుకో! నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తా,"  అన్నది. "అలాగా!"  అంటూ నరేంద్రుడు నవ్వి, "శాంతా, నాకు నువ్వంటే ఇష్టం. ఎలాగూ నిన్నే పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను.

అయితే, నువ్వు నన్ను గొప్పవాణ్ణి చెయ్యగలనన్నావుగా. అదేదో పెళ్ళికిముందే చేసి చూపించు. మనపెళ్ళి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను, " అన్నాడు." అలాగా! నేను నీకొక గొప్ప ఉపాయం చెబుతాను. అది చెప్పేముందు, నువ్వు నన్ను తప్ప ఇంకెవర్నీ పెళ్ళిచేసుకోనని మాటివ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా?"  అన్నది శాంత.

నరేంద్రుడు ఒక్కక్షణం కూడా ఆలోచించ కుండా, "ఇదుగో, ఇప్పుడే మాట ఇస్తున్నాను. కావాలంటే నీ మీద ఒట్టు!"  అన్నాడు. "ఓట్లేం అక్కర్లేదకానీ _నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనీ,  ప్రాణంమీదకి వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్ళిచేసుకోననీ, మన ఊరంతా ప్రచారమయ్యేలా చూడు, చాలు," అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి, "నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబందనలు పెడుతున్నావు. వీటికి నేనొప్పుకోను. ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు, లేకుంటే లేదు,"  అన్నాడు.


ఆ జవాబుకు శాంతనొచ్చుకుని,"అయ్యో, అలా అంటే ఎలాబావా! నా ఉపాయమంతా, నువ్వు ఊళ్ళోచేసే ప్రచారంలోనే వుంది. నా మాట విని,ఒక నెలరోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు.పై నెలలో రాజకుమారిమన ఊరిపక్క అడవికి వనవిహారానికి వస్తూన్నది.

ఆ సమయంలో దగ్గర్లోవుండి సాహసకార్యం ఏదైనాచేసి, ఆమెను మెప్పించు.ఆమె నీకేం కావాలని అడుగుతుంది...."అంటూ ఆగింది శాంత.

నరేంద్రుడికిదంతా,చాలా కుతూహలంగా ఉంది. మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంతపెట్టాడు. శాంత చెప్పిన ప్రకారం,రాజకుమారి, నరేంద్రుణ్ణి పెళ్ళిచేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి.శాంతిమీది ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని,నరేంద్రుడికి చెప్పలేనంత పేరువస్తుంది. దేశమంతటా నరేంద్రుడి పేరు మోగిపోతుంది! ఇలా చెప్పి శాంత,"ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్పకార్యం వేరేలేదు. అందువల్ల,నా ఉపాయాన్ని పాటించు,"అన్నది.

"అది సరేకాని,రాజకుమారి నన్ను పెళ్ళి చేసుకోమని అడగడానికి,తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా?"అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. "అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి, అన్నింటికీ ఒప్పుకుంటుంది.నీ ప్రేమను పరీక్షించడానికే తను ఈ నాటక మాడానని ఆమె అంటే_ఆమెకూ చిన్నతన ముండదు.నేను చెప్పినట్టు చెయ్యి. నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది,"అన్నది శాంత. "ఇంత చిన్న విషయానికి నాకు పేరొస్తుందని నమ్మకం లేదు. కానీ, నీ ఉపాయం మహ గొప్పగావుంది. తప్పకుండా పాటిస్తాను," అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటినుంచే,నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమనీ,ఆమెనుతప్ప మరొక ఆడపిల్లని కన్నెత్తికూడా చూడదనీ,ఆ ఊళ్ళో తెలిసిపోయింది.ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది.

ఒక రోజున శాంత,నరేంద్రుణ్ణి కలుసుకుని,"బావా! రాజకుమారి మన సమీపానవున్న అడవికి తరలివస్తున్నది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని  అమలుచెయ్యి. ఎందుకైనా మంచిది, ఒక కత్తిని దగ్గరవుంచుకో, "అని చెప్పింది. శాంత చిన్నాన్న రాజుకొలువులో పనిచేస్తున్నాడు.ఆయన ద్వారా రాజుకుటుంబానికి చెందిన రహస్య సమాచారం, శాంత కుటుంబానికి తెలుస్తూంటుంది.


ఈ సంగతి నరేంద్రుడెరుగు.అందువల్ల, మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు. నరేంద్రుడు కొంతదూరం వెళ్ళేసరికి, "రక్షించండి! రక్షించండి!"అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది.అతడు పరుగున అటుగా వెళ్ళాడు. ఒక బుర్రమీసాలవాడు కత్తి చూపి, ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు.

నరేంద్రుడు వెంటనే కత్తిదూసి బుర్రమీసాల వాడి మీదికి వెళ్ళాడు.వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. "మహావీరా! సమయానికి వచ్చి నన్ను రక్షించావు.నేనీదేశపు రాకుమారిని. పేరు శశిరేఖ!" అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకిని,తాను అడవిలోకి రావడం ఎందుకు జరిగిందో చెప్పింది.

శశిరేఖకు ఆమెకంటే పదిహేను సంవత్సరాలు పెద్దవాడైన మేనమామ వున్నాడు. అతడు దుష్టుడు. రాకుమారిని పెళ్ళిచేసుకుని,తన దేశానికి రాజుకావాలని కలలు కంటున్నాడు.

అనారోగ్యంతో మంచం పట్టివున్న రాజు, వేరే సంబంధాలు చూసే వ్యవధిలేక, నమ్మకస్థుడైన ఒకమంత్రి సాయంతో,ఈ వనవిహా రంఏర్పాటుచేశాడు.అదృష్టం బాగుంటే శశిరేఖకు తగినవరుడు తటస్థపడతాడు;లేకుంటే శశిరేఖ, మేనమామనే పెళ్ళిచేసుకోవాలి!

"మహావీరా!ఆ బుర్రమీసాల వేషధారి, మా సైన్యంలో గొప్ప ఖడ్గనిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటివాడి మీద కత్తిదూశావు. అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది.అతడు పారిపోవడం,కత్తియుద్దంలో నీవు అతణ్ణి మించినవాడి వనడానికి నిదర్శనం. నీవు అందగాడివి,సాహసివి,వీరుడివి.నీవు నాకు నచ్చావు.నేనూ నీకు నచ్చితే,రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్ళాడి, ఈ దేశానికి రాజువై నన్నూ,నీ దేశాన్నీ కాపాడుకో,"అన్నదాయువతి.

నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమగురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలనుకున్న తనకోరిక, తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తున్నదని పొంగిపోతూ,"రకుమారీ! నాకు మీ మాటలు శిలాశాసనం!అన్నాడు. తర్వాత నరేంద్రుడు,రాజకుమారి అందాన్ని పదేపదే గుర్తుచేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు.

మర్నాడు నరేంద్రుడి ఇంటిముందు రథమొకటి వచ్చి ఆగింది.అందులోంచి బుర్రమీసాలవాడు,శశిరేఖ దిగి సరాసరి నరేంధ్రుడి ఇంటిలోపలికి వెళ్ళారు. నరేంద్రుడి తండ్రి తమచూసి ఆశ్చర్యపోతూంటే, బుర్ర మీసాలవాడు,"మేము మీ కుమారు డితో పెళ్ళి మాటలకు వచ్చాం!"అన్నాడు. "అయ్యా;తమరెవరో మేము తెలుసు కోవచ్చా?" అన్నాడు నరేంద్రుడి తండ్రి. "మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నాన్నను. రాజు గారి కొలువలో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావడం నాకిదే మొదటిసారి.ఈ అమ్మాయి పేరు శశిరేఖ.

నా కూతురు శాంత కోరిందని మీవాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్షగురించి మీ వాడికి తెలుసు.కానీ పరీక్షలో చిన్నమార్పు జరిగేసరికి,మీవాడు దెబ్బతిన్నాడు. అయినా,శాంత మీవాడినే చేసుకుంటా నంటూంటే ,పెళ్ళిమాటలకు వచ్చాం.శాంత తల్లి తండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు,"అన్నాడు బుర్ర మీసాలవాయన.

తండ్రి పక్కనే నిలబడి వున్న నరేంద్రుడు, అంతావిని తలదించుకున్నాడు.ఆరోజే అతడికీ, శాంతకూ పెళ్ళి నిశ్చయమైంది.నరేంద్రుడు, శాంతను ఒంటరిగా కలుసుకుని, "శాంతా! నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలననుకున్నాను, కాలేకపోయాను.నన్ను పెళ్ళి చేసుకుని,నువ్వను కున్నది సాధిస్తున్నావు.కానీ నిన్ను పెళ్ళి చేసు కుని నేను అనుకున్నది సాధించలేనని తెలిసి పోయింది.నాకెంతో బాధగావుంది!"అన్నాడు.

దానికి శాంత చిన్నగా నవ్వి,"బావా! గొప్ప తనం డబ్బు, ప్రేమ, శక్తి,పదవిలాంటి వాటిల్లో వుందని చాలామంది అనుకుంటారు.కానీ గొప్పతనం త్యాగంలో వుంది.త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే, నీ నాటకమాడాను. ఇక ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు!  హాయిగా మన బ్రతుకు మనం బ్రతుకుదాం,"అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి, గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు.


No comments:

Post a Comment