Pages

Thursday, September 6, 2012

సిద్ధార్థుడి గణితం


హేలాపురిలో గౌతముడు సామాన్య కుటుంబీకుడు. అతడికి ఇద్దరు పిల్లలు. కొడుకు సిద్ధార్థుడు ఆరేళ్ళవాడు. కూతురు పావనికి మూడేళ్ళు. సిద్ధార్థుడికి చాలా తెలివైనవాడని, చదువులో ఎంతో చురుగ్గా వుంటాడని పేరు.

ఒకనాడు సుగంధపురి నుండి, సిద్ధార్థుడి మేనమామ మాణిక్యం బావనూ, అక్కనూ, పిల్లలనూ చూసి పోదామని వచ్చాడు. ఆ…యన తమ ఊరి నుంచి జీడిమిఠాయి ఉండల్ని తెచ్చాడు. వాటిలో పది ఉండల్ని సంచీలోంచి తీసి సిద్ధార్థుడి కిచ్చి, తన మేనల్లుడి తెలివి తేటల్ని పరీక్షంచాలన్న ఉద్దేశంతో, ‘‘ఒరేయ్, సిద్ధార్థా! ఈ పది జీడి మిఠాయిల్లో సగం మీ చెల్లెలి కిచ్చావనుకో! నీ దగ్గర ఇంకా ఎన్ని మిఠాయి ఉండలుంటాయి!’’ అని అడిగాడు.

‘‘ఏడుంటాయి, మామయ్యా!’’ అన్నాడు సిద్ధార్థుడు తడుముకోకుండా. తన మేనల్లుడు ఇంత చిన్న గణితం తప్పు చెబుతున్నాడేమని మాణిక్యం ఆశ్చర్యపోయి, ‘‘సిద్ధార్థా, నే చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకున్నట్టులేదు. నీ దగ్గరున్న పది మిఠాయిల్లో సగం-అంటే అయిదు మిఠాయిలు నీ చెల్లెకిస్తే, ఇంకా నీ దగ్గర ఎన్ని మిఠాయిలుంటాయి?’’ అని వివరించి అడిగాడు మాణిక్యం. ‘‘ఏడు మిఠాయిలుంటాయి, మామయ్యా!’’ అన్నాడు సిద్ధార్థుడు చిరునవ్వుతో.

‘‘ఛీ, వెధవా! నువ్వెంతో తెలివైనవాడివనుకున్నాను, నీకసలు లెక్కలేరావు,’’ అన్నాడు మాణిక్యం చిరాగ్గా. ‘‘లెక్కలు నాకు వచ్చు, మామయ్యా! మా చెల్లెలికేరావు,’’ అన్నాడు సిద్ధార్థుడు అదే చిరునవ్వుతో. మాణిక్యం తెల్లబోయినా, మేనల్లుడి తెలివితేటల విష…యంలో తను విన్నది నిజమేనని గ్రహించాడు.

No comments:

Post a Comment