Pages

Saturday, July 28, 2012

ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

ఒకరోజు అక్బర్‌ పాదుషా తన మంత్రి బీర్బల్‌‌తో కలిసి వేటకు బయలుదేరాడు. అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దారి ప్రక్కన ఒక పేదవాడు పడుకుని కనిపించాడు. ఆ మనిషి శరీరం మీద ఒక చిరిగిన అంగీ తప్ప మరే వస్త్రం లేదు.

అక్బర్‌ ఆ మనిషిని పరీక్షగా చూసి.. "బీర్బల్..‌! ఈ వ్యక్తి మరణించినట్లున్నాడు కదూ..?" అని ప్రశ్నించాడు. బీర్బల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, "లేదు ప్రభూ..! ఈ వ్యక్తి మరణించలేదు. ఆదమరచి నిద్రపోతున్నాడ"ని చెప్పాడు.

బీర్బల్‌ మాటలపై నమ్మకం కలగకపోవటంతో అక్బర్‌... "క్రింద పరుపులేదు. కప్పుకోవడానికి కంబళిలేదు క్రింద రాళ్ళు, రప్పలు, పైన చలి యింత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా...? ఇతడు నిశ్చయంగా మరణించాడు" అని అన్నాడు. "లేదు ప్రభూ...! ఇతను మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి నిద్ర మీకూ, నాకు కూడా పట్టద"ని చెప్పాడు బీర్బల్‌.

కష్టపడకపోతే ఇంతే మరి...!!

వెంటనే అక్బర్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ మనిషి గాఢనిద్రలో ఉన్నట్లుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే... "బీర్బల్...‌! నువ్వన్నట్లుగానే ఈ వ్యక్తి గాఢనిద్రలో ఉన్నాడు. కానీ యితనికి ఈ రాళ్ళ మీద యింత చలిలో ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కావడం లేద"ని అన్నాడు.

"జహాపనా...! ధనికుడై ఉండడానికి, నిద్ర పట్టడానికి ఏమీసంబంధంలేదు. నిద్ర ష్టపడితేనే వస్తుంది. ఈ పేదవాడు కష్టపడి పనిచేసి అలసిపోయాడు. అందువల్లనే ఇతనికి గాఢనిద్ర పట్టింది. ఇటువంటి సుఖనిద్ర కష్టపడితేనే లభిస్తుంద" ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అయినప్పటికీ... బీర్బల్‌ మాటలపై అక్బర్‌కు నమ్మకం కలుగలేదు. "అది కాదు బీర్బల్‌..! ఈ వ్యక్తికి ధనవంతుల ఆహార పానీయాలూ, నిద్రపోవడానికి హంసతూలికా తల్పాలు వుంటే... ఇతడు ఇంతకంటే గాఢంగా నిద్రపోగలడు కదా..!" అని అన్నాడు అక్బర్. "హుజూర్...‌! మీరు అన్న మాటలు నిజంకావు. కావాలంటే ఇతనిని కొంతకాలం ధనవంతునిగా చేసి చూడండి" అని చెప్పాడు బీర్బల్‌ .

దీంతో.. తాను చెప్పిన మాటలే నిజమని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు అక్బర్‌ చక్రవర్తి. ఆ వ్యక్తిని నిద్ర నుండి లేపి తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తి నివసించడానికి సకల సౌకర్యాలతో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు. రుచికరమైన ఆహార పానీయాలు, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన హంసతూలికాతల్పం వగైరా అన్ని ఏర్పాట్లు చేయిం చాడు.



కష్టపడి కాయకష్టం చేసుకునే ఆ వ్యక్తికి ఆ రాజ భవనంలో తినడం విశ్రాంతి తీసుకోవడం తప్ప, వేరే పనేమీ లేకుండా పక్షంరోజులు గడిచిపోయాయి. ఒకనాడు అక్బర్‌ ఆ వ్యక్తిని గురించి బీర్బల్‌ని అడిగాడు. "ప్రభూ..! ఆ నకిలీ ధనికుడికి మూడు దినాలుగా జ్వరం" అని చెప్పాడు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డ అక్బర్... "అంటే అతనికి విశ్రాంతి లేదన్నమాట, ఎవరి నిర్లక్ష్యంవల్ల ఇలా జరిగింద..?"ని ప్రశ్నించాడు.

"జహాపనా...! నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఈయన బండిలో కూర్చుని షికారు వెళ్ళాడు. దారిలో చలిగాలి తగిలింది. దాంతో అతనికి జలుబు చేసి జ్వరం వచ్చింది" అని చేప్పాడు బీర్బల్‌ . "చలి నుండి రక్షించుకోడానికి ఆ సమయంలో అతని దగ్గర కంబళి లేదా..?" అని ప్రశ్నించాడు అక్బర్‌. "లేకేం ప్రభూ...! ఆ మనిషి మీద తమకు అపార దయ ఉంది ఇంక వస్త్రాలకు లోటేమిటి..? అతని తల నుండి కాళ్ళ వరకూ ఉన్ని వస్త్రం కప్పి ఉంది. అయినా అతనికి జలుబు చేసింద"ని చెప్పాడు బీర్బల్‌.

"అతనికి నిద్ర బాగా పడుతున్నది కదూ..?" అడిగాడు అక్బర్‌. "ఏపూటా సరైన నిద్రలేదు. హంసతూలికాతల్పం మీద విశ్రమించిన పిదప నౌకర్లు కాళ్ళుపడితే కాసేపు నిద్ర పోగలుగుతున్నాడని" చెప్పాడు బీర్బల్‌. "ఏం..? ఎందుకని..? అక్కడ రోడ్డు ప్రక్కన చిరిగిన బట్టలతో పడుకున్నప్పుడు చలివేయలేదు. ఇక్కడ ఉన్ని వస్త్రం కప్పుకున్నా చలి వల్ల జలుబు చేసింది. అక్కడ అతను రాళ్ళ మీద హాయిగా నిద్రపోగలిగాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద పడుకున్నా నిద్రపట్టడం లేదు. ఎంత ఆశ్చర్యం?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అక్బర్.

"దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమీలేదు ప్రభూ..! అతడు పాపం ధనికుడై కష్టాలపాలయ్యాడంతే.." అన్నాడు బీర్బల్‌. "రాళ్ళురప్పలపై హాయిగా నిద్రించిన వ్యక్తి హంసతూలికాతల్పం మీద నిద్రించలేకపోతున్నాడు. ఇది ధనికుడైనందు వలన అతడికి కలిగిన శిక్ష. ఇంతకు ముందు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు. అందువలన అతని శరీరం ఆరోగ్యంగా ఉండేది. దాంతో మంచి నిద్రపట్టేది. ఇప్పుడు మీరు ఇతనికి విశ్రాంతినిచ్చి సుకుమారంగా తయారు చేశారు. మామూలు చలి, వేడి కూడా ఇతను ఇప్పుడు భరించలేకపోతున్నాడ"ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అక్బర్‌కు ఇప్పుడు కూడా బీర్బల్‌ మాటలపై నమ్మకం కలుగలేదు. ఆ రాత్రి ఆయన బీర్బల్‌ని వెంట బెట్టుకుని ఆ నకిలీ ధనవంతుడున్న భవంతికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి మంచం మీద నిద్రపట్టక అవస్థపడుతున్నాడు. "ఆ వ్యక్తికి ఎందుకని నిద్రపట్టడం లేద"ని బీర్బల్‌ని అడిగాడు అక్బర్.

"జహాపనా..! అతని పక్కమీద ఏదో ఉండి గుచ్చుకుంటోంది. అందుకే అతనికి నిద్ర పట్టలేదు" అన్నాడు బీర్బల్. బీర్బల్‌ లోపలికి వెళ్లి అతని తల్పాన్ని పరీక్షించాడు. దుప్పటి కింద ఒక ప్రత్తి గింజ కనిపించింది. దాన్ని అక్బర్‌కి చూపించి "చూడండి ప్రభూ..! దీని కారణంగా ఈ కొత్త ధనికుడికి నిద్రపట్టడం లేద"ని అన్నాడు.

"ఇంతకు ముందు ఇతనికి రాళ్ళు కూడా గుచ్చు కోలేదు. ఇప్పుడు ఈ చిన్న విత్తనం ఇతనికి కష్టం కలిగింది. మీరు ఇతని చేత్తో పక్కకూడా దులపనివ్వడం లేదు. ఇది ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష. కష్టపడి పనిచెయ్యకపోవడమే దీనికి కారణం" అని అక్బర్‌తో అన్నాడు బీర్బల్. అప్పటికి బీర్బల్‌ మాటలతో ఏకీభవించిన అక్బర్.. మరునాడు ఆ వ్యక్తిని రాజ భవనం నుంచి పంపిస్తూ.. ముందులాగే కష్టపడి, శ్రమించి సుఖంగా జీవించమని చెప్పి రాజభవనం నుంచి పంపించేశాడు అక్బర్..!

పిల్లల్ని కొడితే చదువు వచ్చేస్తుందా...?!


అల్లరి పిల్లాడైన సన్నీని మార్కులు సరిగా రాలేదని కర్రతో కొడుతున్నాడు తండ్రి సూర్యారావ్. "నేను బాగానే చదివాను నాన్నా..! అయినా మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో తెలియదు. నన్ను కొట్టకండి నాన్నా...!" అంటూ ప్రాధేయపడుతున్నాడు సన్నీ. "బాగా చదివితే మార్కులెందుకు రావురా వెధవా...!" అంటూ మరింత కోపంతో కొట్టసాగాడు సూర్యారావ్.


"అబ్బా.. వద్దు నాన్నా.. కొట్టొద్దు.. ఇకనుంచి బాగా చదువుతాను" అంటూ ఏడుస్తూ అన్నాడు సన్నీ. కొడుకును కొడుతుంటే చూడలేని సన్నీ తల్లి సునీత చిన్న కొడుకును ఒళ్లో దాచుకుని గడపకు ఆనుకుని ఏడుస్తూ ఉంది. సన్నీ ఏడుపులు విని చుట్టుప్రక్కల వాళ్ళంతా సూర్యారావ్ ఇంటిముందు గుమికూడారు.


పక్కింటి పాపారావు ఇక ఉండబట్టలేక.. పరుగున వచ్చి సూర్యారావ్ చేతిలో కర్ర లాక్కుని.. "ఎందుకండీ చిన్ని పిల్లాడిని అలా కొడుతున్నారు" అంటూ ప్రశ్నించాడు. "మీకు తెలియదు లేండీ.. వీడు బాగా చెడిపోయాడు. తిరుగుళ్లు నేర్చి చదువు అటకెక్కించాడు. వీడికి మరి నాలుగు తగలాల్సిందే" అంటూ మళ్లీ కర్ర తీసుకున్నాడు సూర్యారావ్.
మంచిమాటలతో.. సరైన దారిలో..!!


"సర్లేండి. పిల్లాడిని కొడితే మాత్రం చదువొస్తుందా..? నిదానంగా వాడికి అర్థమయ్యేలా చెబితే సరిపోతుంది కదా..!!" అంటూ పాపారావు సూర్యారావ్‌ను శాంతింపజేశాడు. బాగా దెబ్బలు తిన్న సన్నీ.. తన తండ్రికి తానంటే ఇష్టంలేదు కాబట్టే ఇలా కొడుతున్నాడని అర్థం చేసుకున్నాడు. అంతే ఓ ఉత్తరం రాసి, అర్ధరాత్రిపూట తండ్రి దిండుకింద పెట్టేసి ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు బయల్దేరాడు.


చీకట్లో మెల్లిగా అడుగులు వేసుకుంటూ రైల్వేస్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు సన్నీ. ఇంతలో "ఎక్కడికి వెళ్తున్నావ్ సన్నీ..?" అనే పిలుపుతో పాటు, అతడి చేతిని గట్టిగా పట్టుకున్నారెవరో. క్షణకాలంపాటు వణికిపోయిన సన్నీ.. తండ్రికి దొరికిపోయానని, ఇక తనపని గోవిందా..! అని బిక్కమొహం వేసుకుని తిరిగి చూశాడు.


అయితే అక్కడ తన తండ్రికి బదులుగా పక్కింటి పాపారావు అంకుల్ ఉండటంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నాడు సన్నీ. అంతే ఒక్కసారిగా భోరున ఏడుస్తూ, తన తండ్రికి తానంటే ఇష్టం లేదనీ, తనను సరిగా చూసుకోవటం లేదని వాపోయాడు. అంతా విన్న పాపారావు.. లేదు సన్నీ నువ్వు పొరపాటు పడుతున్నావు. పిల్లల్ని ఏ తల్లిదండ్రులు ద్వేషించరు. నువ్వు బాగుండాలనే మీ నాన్న అలా చేశాడు అని సర్ది చెప్పాడు.


"బాధ్యతగా చదువుకోవాల్సిన వయసులో అల్లరిచిల్లరిగా తిరిగే నీ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనని భయపడే మీ నాన్న నిన్ను కొట్టాడేగానీ... నీమీద ప్రేమలేక కాదు" అని పాపారావు సన్నీని ఓదార్చాడు. కావాలంటే నువ్వంటే మీ అమ్మానాన్నకు ఎంత ప్రేముందో తెలుసుకుందుగానీ, నేను చెప్పినట్లు చేసి చూడు అన్నాడు.

అదలా ఉంటే.. ఉదయాన్నే కొడుకు రాసిన ఉత్తరాన్ని చూసిన సన్నీ తల్లిదండ్రులు ఏడుస్తూ కుప్పగూలిపోయారు. అలా ఏడుస్తూ పాపారావు ఇంటికి వెళ్లిన వారు "చూశారా వాడు అంత అన్యాయం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో ఏమో" అంటూ ఏడ్వసాగారు. సాయంత్రందాకా అన్నిచోట్లా వెతికిన వారు, రోజంతా తిండీ నిద్ర లేకుండా గడిపారు.

అలా రాత్రయిన తరువాత పాపారావు తన ఇంట్లో దాచిన సన్నీని పిలిచి, తల్లిదండ్రుల వద్దకు వెళ్లమని చెప్పాడు. ఏడుస్తూ "అమ్మా, నాన్నా నేను ఎక్కడికి వెళ్లలేదు" అంటూ వారిని అల్లుకుపోయాడు సన్నీ. బిడ్డ దొరికాడన్న ఆనందంలో ముద్దుల వర్షం కురిపించసాగారు సన్నీ తల్లిదండ్రులు.

కాసేపటికి ఏడుపుమాని... "నేను బాగా చదువుకుంటాను నాన్నా. ఈసారి తక్కువ మార్కులు రాకుండా మరింత కష్టపడతాను. తప్పయింది క్షమించండి నాన్నా..!" అని అన్నాడు సన్నీ. అంతకుముందురోజు రాత్రి జరిగిన సంఘటనను సన్నీ తల్లిదండ్రులకు వివరించిన పాపారావు.. "మీ బిడ్డకు మీరేంటో తెలిసి రావాలని అలా నాటకం ఆడాననీ, తప్పయితే క్షమించమని" అడిగాడు.

పాపారావు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పిన సన్నీ తండ్రి సూర్యారావ్... "ఇకపై నేను కూడా నిన్ను కొట్టనురా బాబూ.. నువ్వు చక్కగా చదివి నన్ను కూడా బాధపెట్టకుండా ఉంటే చాల"ని అన్నాడు. పిల్లల్ని కొడితే చదువురాదనీ, మంచిమాటలతో పిల్లలను సరైన దారిలో నడిపించాలని బాగా అర్థం చేయించిన పాపారావుకు మనసులోనే అభినందించిన సూర్యారావ్, సన్నీని ప్రేమగా, ఆప్యాయంగా తల నిమురుతూ ఉండిపోయాడు.

మంత్రిగారి గుప్పిట్లో ఏముంది..?

మాళవరాజుకు పురుషోత్తముడనే కొడుకు ఉండేవాడు. పురుషోత్తముడు ఏమాత్రం చురుకుదనం లేకుండా అమాయకంగా, నెమ్మదిగా ఉండేవాడు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతాడో ఏమోనని రాజుగారికి దిగులు పట్టుకుంది. దాంతో దేశంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి, తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు.

పండితులు రాజుగారి ఆజ్ఞను శిరసావహించి పురుషోత్తముడిని తమతోపాటు తీసుకెళ్లారు. ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన ఆ పండితులు రాజకుమారుడికి తగిన విద్యాబుద్ధులు నేర్పించి తిరిగీ తండ్రివద్దకు తీసుకొచ్చారు. "మహారాజా..! మీ సుపుత్రుడికి తమకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పించామనీ, కావాలంటే తమరోసారి పరీక్షించి చూడండని" అన్నాడు పండితులు.

దీంతో రాజుగారు తన కుమారుడికి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజకుమారుడు. అదంతా స్వయంగా చూసిన రాజుగారు సంతోషించి పండితులను బాగా సత్కరించి పంపించారు. అయితే వృద్ధుడయిన ఒక మంత్రి రాజుగారి వద్దకు వచ్చి.. "మహారాజా..! యువరాజుగారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని" సూచించాడు.

అవును నిజమే కదా..! అని మనసులోనే అనుకున్న రాజుగారు.. "సరే.. ఆ విద్య తెలిసిన ఓ పండితుడి గురించి మీరే చెప్పండని" మంత్రిని అడిగాడు. "మహారాజా..! ఈ భవిష్యత్ జ్ఞానం అనేది పండితుల నుంచి నేర్చుకునేది కాదు గానీ, లోకజ్ఞానం తెల్సిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం" అని చెప్పాడు మంత్రి.
గుప్పిట్లో ఏముంది రాకుమారా..?!

తనకు మాధవుడు అనే ఓ సామాన్య వ్యక్తి తెలుసనీ.. అతడయితే మన రాజకుమారుడికి తగిన వివేకాన్ని, విచక్షణను నేర్పగల సమర్థత కలిగినవాడని చెప్పాడు మంత్రి. వెంటనే రాజుగారు మాధవుడిని పిలిపించి తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించమని చెప్పగా.. మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు.

మూడు నెలల తరువాత రాజకుమారుడిని తండ్రి వద్దకు తీసుకొచ్చిన మాధవుడు.. తనకు తెలిసిన జ్ఞానాన్నంతా మీ సుపుత్రుడికి నేర్పానని చెప్పాడు. దాంతో మంచి వివేకి అయిన తన వృద్ధ మంత్రిని పిలిపించి మీరే రాకుమారుడిని పరీక్షించండని అన్నాడు. వృద్ధమంత్రి లోపలి గదిలోకి వెళ్లి గుప్పిట్లో ఏదో పట్టుకొచ్చి నా గుప్పెట్లో ఏముందో చెప్పండి యువరాజా అని అడిగాడు.

పురుషోత్తముడు ఏ మాత్రం తడుముకోకుండా "ఉంగరం" అని చెప్పాడు. దాంతో రాజుగారితోపాటు, సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధ మంత్రి కూడా ఆశ్చర్యానికి గురై నోట మాట రాకపోగా.. "సమాధానం ఎలా చెప్పగలిగారు యువరాజా..?" అని ప్రశ్నించాడు.

"ఏమీలేదు మంత్రివర్యా...! మిమ్మల్ని మా తండ్రిగారు పిల్చినప్పుడు మీ వేలికి ఉంగరం ఉంది. మీరు గదిలోకి వెళ్లి వచ్చిన తరువాత ఉంగరం మీ వేలికి లేదుకదా..!" అన్నాడు. దీనికి సంతోషించిన మంత్రి.. "మహారాజా..! పరిశీలన ఉంటే, భవిష్యత్తును పసిగట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజా వారికి ఇప్పుడు సంపూర్ణంగా ఉంద"ని అన్నాడు.

తన కుమారుడు విద్యతోపాటు వివేకం పొందినందుకు ఎంతగానో సంతోషించిన మహారాజావారు.. వృద్ధ మంత్రితోపాటు, తన కుమారుడికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పించిన మాధవుడికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి, సత్కరించారు. ఇక ఆరోజు నుంచి భవిష్యత్తుపై బెంగలేకుండా మహారాజు సంతోషంగా గడపసాగాడు.

చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు.

తెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు.

నక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు.
ఆవగింజల్ని లెక్కపెట్టారట..!

అప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజు సరేనని అన్నాడు. ఇక ఆరోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆ మరుసటిరోజు సభకు వచ్చాడు.

మహారాజా..! మీరు చెప్పినట్లుగానే చుక్కలన్నింటినీ లెక్కపెట్టాను. అయితే నోటితో లెక్కపెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాసేందుకు వీలు కాలేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ, ఒక్కో ఆవగింజను ఈ సంచిలో వేశాను. మొత్తం పదిహేను రోజులూ ఇలాగే చేశాను. కాబట్టి, ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో, ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాపభ్రూ అంటూ... మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు.

ఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి... నవ్వుతూ చాలా ఉన్నాయే అని అన్నాడు. మహారాజా.. మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవగింజలన్నింటినీ లెక్కపెట్టించండి. తరువాత నక్షత్రాలను లెక్క పెట్టించండి. అందరి అనుమానం తీరిపోతుందని తెలివిగా బదులిచ్చాడు బీర్బల్.

బీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి.. సంతోషంగా తాను ఇస్తానను వెయ్యి బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు. సభలోనివారంతా కూడా బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని హాయిగా నవ్వుకోసాగారు.