Pages

Sunday, September 16, 2012

ప్రాణభయం

అరణ్యంలో కుందేలొకటి, ఆహారంకోసం తిరుగుతూ, ఒక చోట కాళ్ళు జారి చిన్న నీటిగుంటలో పడిపోయింది. ఆ గుంటలోని నీరు అది మునిగిపోయేంతలోతుగా లేదు. కుందేలు నీటి గుంటనుంచి బయట పడేందుకు నానాప్రయత్నాలు చేసింది కానీ, అక్కడినుంచి పైకిరాలేకపోయింది.      
   
"ఇక నా చావు, ఈ నీటి గుంటలోనే!" అనుకుంటూ, కుందేలు విచారపడుతున్న సమయంలో, అటుగా వచ్చిన రెండు కుందేళ్ళూ, ఒక కోతీ దానిని బయటికి లాగేందుకు ప్రయత్నించినై. కానీ, అది వాళ్ళెంత సాయం చేసేందుకు శ్రమించినా గుంటనుంచి పైకి రాలేక, "మీ ప్రయత్నం అంతా వృధా! ఇక మీ దారిన మీరు పొండి," అన్నది విసుక్కుంటూ.

కుందేళ్ళూ, కోతి దాని దుస్థితికి విచారపడుతూ అక్కణ్ణించి వెళ్ళిపోయినై. ఆ తర్వాత కొద్దిసేపటికి నక్క ఒకటి అరుస్తూ, కుందేలున్న నీటిగుంటకి ప్రాంతానికి రాసాగింది. నక్క అరుపు వింటూనే కుందేలు ప్రాణభయంతో కంపించిపోతూ, ఒక్క ఎగురున నీటిగుంట నుంచి బయటికి దూకి పారిపోసాగింది. కుందేలు అలా కొంతదూరం పోయాక, అంతకు ముందు దానికి సాయం చేయవచ్చిన కుందేళ్ళూ, ఎదురుపడి ఎక్కడిలేని ఆశ్చర్యంతో, "మేమంత సాయపడినా గుంటనుంచి బయటికి రాలేనిదానివి, నీకై నీవు ఎలా బయటికి రాగలిగావు," అని అడిగినై.

అందుకు కుందేలు, "నక్కబావ పాడుతూ నేను ఉన్నచోటికి రావడం గమనించాను. అంతే! ఆ ఉత్సాహంతో ఒక్క ఎగురున గుంటనుంచి బయటపడ్డాను," అన్నది. ఆ మాట విని కుందేళ్ళూ, కోతీనవ్వుకున్నాయి!

వెంకన్న సన్యాసం!


జోగిపురంలో వెంకన్న అనే బీదవాడొకడు ఉండేవాడు. వాడికి భార్య ఇద్దరు పిల్లలు, ముసలితల్లి వుండడంతో, ఎంతకష్టపడినా గోర్రెతోక బెత్తెడే అన్నట్టు సంపాదన తిండికి కూడా సరిపోయేదికాదు. ఆవిధంగా వాడు, నానా కష్టాలకూ లోనవుతూ, ఇక లాభంలేదని సన్యాసం పుచ్చుకోదలచి, అడవిలోవున్న ఒక సన్యాసుల మఠంకేసి బయలుదేరాడు.

వెంకన్న విచారంగా తలవంచుకుని అడవి మార్గాన పోతూండగా, మార్గమధ్యలో ఒక డబ్బు సంచీ వాడి కంటబడింది. వాడు సంచీ తీసుకుని ఎక్కడలేని ఉత్సాహంతో, "నేను సన్యాసం పుచ్చుకోవడం, ఈ చుట్టుపక్కల ఉండే వనదేవతకు ఇష్టం లేనట్టున్నది. అందుకే, ఆ మహాతల్లి కరుణించి మార్గ మధ్యంలో డబ్బు సంచీ పెట్టింది! ఇంటికి తిరిగిపోయి, ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను," అనుకుంటూ పట్టరాని సంతోషంతో వెనుదిరిగాడు. ఆ మరు క్షణం, "ఒరే, ఆగు!" అంటూ పెద్దకేక వినబడింది.

వెంకన్న ఆగి బెదురుగా తలతిప్పి చూశాడు. కండలు తిరిగిన ఇద్దరు దొంగలు, చేతిలో తళతళమెరిసే చురకత్తులతో వాడికంట బడ్డారు. వాళ్ళు దాపులనున్న ఊళ్ళో దొంగతనంచేసి, ఆ డబ్బుతో తమ స్థావరానికి పోతూ, దొంగిలించిన డబ్బులో ఒక సంచీ చేజారి దారిలో పడిపోయిందని గ్రహించారు. వాళ్ళు డబ్బు సంచీ వెతుకుతూ వస్తూండగా, చేతిలో డబ్బూ సంచీతో వెంకన్న కనిపించాడు.

దొంగలిద్దరూ, వెంకన్నను సమీపించి, "నోరు మెదపకుండా, ఆ డబ్బు సంచీ ఇటివ్వు. మేము ఎంతో సాహసించి నేర్పుగా సంపాయించిన డబ్బును, ఉట్టినే దొంగిలించుకు పోదామనుకున్నావా?" అంటూ గద్దించారు.
వెంకన్న వణికిపోతూ, డబ్బు సంచీని దొంగలకిచ్చి, "అయ్యలారా! ఇది మీ సొమ్మని నేనెరగను. ఎంతకష్టపడీ కుటుంబాన్ని పోషించలేక సన్యాసం పుచ్చుకుందామని బయలుదేరాను దారిలో కంటబడిన ఈ డబ్బుసంచీని, నా కష్టాలు తీర్చడానికి ఏ వనదేవతో కరుణించి ప్రసాదించిందని పొరబడ్డాను," అన్నాడు.  ఆ జవాబుకు దొంగలు పెద్దగా నవ్వి, "నీ బీదతనం పోగొట్టేందుకు వనదేవత సాయపడుతుందని లేనిపోని ఆశలు పెట్టుకొకు. అదుగో, ఆ రాళ్ళగుట్ట మలుపు తిరిగావంటే సన్యాసుల మఠం కనబడుతుంది. వాళ్ళీసరికే పొట్టచేతబట్టుకుని, ఊళ్ళవెంట భిక్షాటనకు బయలుదేరి వుంటారు. పోయి, వాళ్ళగుంపులోచేరు," అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
దొంగలమాట వినగానే వెంకన్నకు, సన్యాసులంటే ఏవగింపు కలిగింది. తనకు వ్యవసాయప్పనులు తెలుసు, కాయగూరలు, పండించడం తెలుసు. అలాంటి తను, సంసారం మోయడం భారంగా వున్నదని ముసలి తల్లినీ, కట్టుకున్న భార్యనూ, కన్న పిల్లలనూ వదిలి సన్యాసుల వెంట జోలెకట్టుకుని తన ఒక్కడి తిండికోసం ఊళ్ళు తిరగడమా? చీ!" అనుకుంటూ గబగబా నడిచి ఇల్లు చేరాడు.

వెంకన్న తల్లి, కొడుకు ఏదో విచారంగా వుండడం గమనించి, " ఏరా, వెంకూ! ఏం జటిగిందేమిటి, అలా వున్నావు?" అని అడిగింది. వెంకన్న దాచకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె, వాణ్ణి ఓదారుస్తూ, "ఆఖరు క్షణంలో ఏ దేవుడో నీకు మంచి బుద్ధి పుట్టించాడు. ఆ సన్యాసులు ఎలా బతుకుతున్నార నుకున్నావు? మనబోటి గృహస్థులు జాలి కొద్దో, ధర్మబుధ్దితోనో వేసే పిడికెడు మెతుకులతో. అయినా, పుచ్చుకునేవారికన్నా ఇచ్చే వారికే పదిమందిలో చాలా గౌరవం కదా!" అన్నది.

" ఆ సంగతి నాకు మాత్రం తెలియదా ఏం," అన్నాడు వెంకన్న కాస్త విసుగ్గా. వెంకన్నతల్లి, ఒక క్షణం ఆగి, "తెలిసుండే సన్యాసుల్లో కలవబోవడం, బుద్ధిగల పనేనా? కష్టమో సుఖమో మరి నాలుగైదేళ్ళు ఓపికపట్టు. నీ కొడుకులిద్దరూ ఈడువాళ్ళవుతారు. వాళ్ళూ నీకు సాయంగా పనిపాటుల్లో కలిసొస్తారు. ఆ తరువాత సంసారం సుఖంగా సాగిపోతుంది," అన్నది.

మంచీ మర్యాదా!


ఒకానొక అగ్రహారంలో, పురుషోత్తశర్మ అనే పండితుడుండేవాడు. ఆయన శాస్త్ర, పురాణాలను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకున్న వ్యక్తిగా అందరూ చెప్పుకునేవారు. ఒకనాడు, దూర గ్రామంలో వుంటున్న రఘుపతి అనే పండితుడొకాయన పురుషోత్తమశర్మను చూడవచ్చాడు. మధ్యాహ్న భోజనాంతరం ఇద్దరూ వీధి అరుగుమీద కూర్చుని తీరిగ్గా ఎవేవో శాస్త్ర చర్చలు చేయసాగారు. ఆ సమయం వీధిన వెళుతున్న కట్టెలు కొట్టేవాడొకడు, పురుషోత్తమశర్మను చూస్తూనే తలమీద వున్న కట్టెలమోపును కిందకి దించి, రెండు చేతులూ ఎత్తి, "దణ్ణాలు శర్మగారూ!" అన్నాడు వినయంగా.
ఆ వెంటనే పురుషోత్తమశర్మ చేతులెత్తి వాడికి నమస్కరిస్తూ, "బావున్నావా, ఎల్లయ్యా!" అంటూ పరామర్శించాడు. ఇది చూసిన రఘుపతి, పురుషోత్తమ శర్మను, "ఇదేమిటి, శర్మగారూ! ఆ కట్టెలు కొట్టుకు బతికేవాడికి, మీరు నమస్కరించడం?" అని అడిగాడు. దానికి పురుషోత్తమశర్మ చిరునవ్వు నవ్వి, "ఎల్లయ్య మంచీ మర్యాదా ఎరిగినవాడు. చేసే వృత్తులు ఏవైనా మనుషులందరూ ఒక్కటేకదా? మనశాస్త్రపురాణాలు బోధించేవీ అవే. మనల్ని గౌరవించినవాళ్ళను, మనం గౌరవించడంలోనే మన మంచీ మర్యాదా ఉన్నా యి," అన్నాడు.

మాయావీణ

పూర్వం ఒక ఊళ్ళో, ఒకసంగీత విద్వాంసుడు వుండేవాడు. అయనకు ముగ్గురు కొడుకులు. తండ్రికొడుకులు కలిసి కచేరీలు చేసి, తమ కుటుంబాన్ని పోషించుకునేవారు. కొంతకాలానికి ఆ విద్వాంసుడికి ఏదో వ్యాధి సోకిచేతివేళ్ళు వంకర్లుపోయాయి. నోటమాట కూడా పడిపోయింది. ఆ ఊరి వైద్యుడు వచ్చి పరీక్షించి, " ఇది సామాన్యమైన వ్యాధికాదు. దీన్ని అపరధన్వంతరిగా పేరు తెచ్చుకున్న రాజవైద్యుడు తప్ప, నాలాంటి వాళ్ళు నయం చేయలేరు. రాజవైద్యుడితో చికిత్స అంటే, ముందు మూర్ఖుడైన మన రాజును మెప్పించ గలగాలి. రాయినైనా మెప్పించగలంగాని, ఈ దేశపురాజును మెప్పించలేమని అందరూ అంటూంటారు గదా! అందుకని, ఈ చికిత్స జరిగి మీ నాన్న బాగుపడతాడనే నమ్మకం నాకు లేదు. అయినా ప్రయత్నించిచూడండి. భగవత్ కృప, మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది!" అన్నాడు. ఆ మాట విని విద్వాంసుడి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు, "రాజు ఎంతమూర్ఖుడైనా నా వీణావాదంతోమెప్పించి, రాజవైద్యుణ్ణి తీసుకువచ్చి, నాన్నగారి జబ్బు నయంచేయిస్తాను!" అని వీణ తీసుకుని రాజధానికి బయలుదేరాడు. వాడు రాజును కలిసి, "ప్రభూ, వీణ వాయించడంలో నాకున్న ప్రతిభతో మిమ్మల్నిరంజింపజేస్తాను. ప్రతిగా రాజవైద్యుడిచేత, మా నాన్నగారికి చికిత్స చేయించండి, "అన్నాడు. రాజు నవ్వి, "వీణవాయించడం ఈదేశంలో నీకేకాదు, మాకాపలాభటుడికి కూడాతెలుసు. అంతగా నీ కోరిక తీరాలంటే ఒక పని చెయ్యి. వీణావాదంలో న్నుమించిన వాడులేడని ప్రజలు అంటూంటారు కాబట్టి, నాతో పందెం కయి. నన్ను గెలిస్తే నీ కోరిక తీరుతుంది. నేను గెలిస్తే మాత్రం, నీకు లభించేది పాతికకొరడాదెబ్బల శిక్షే! ఈ పోటీకి ప్రజలేన్యాయనిర్ణేతలు కూడా,"  అన్నడు.


ఈ షరతుకు పెద్దవాడు అంగీకరించిన మీదట, ఆ మర్నాడే రాజుతో వాడికి వీణావాదంలో ప్రజల సమక్షాన పోటీ జరిగింది. ఈ పోటీలో పెద్దవాడు, రాజును మించిన నైపుణ్యాన్ని ప్రదర్శించినప్ప టికీ, ప్రజలు రాజుకు భయపడి, ఆయనకే జేజేలు పలికారు. ఫలితంగా, పెద్దవాణ్ణి పోటీలో ఓడినట్టు ప్రకటించి కొరడాతో కోట్టి పంపించారు. ఒళ్ళంతా దెబ్బలతో ఇల్లు చేరిన పెద్దవాణ్ణి చూడగానే చిన్నవాళ్ళిద్దరూ హతాశులయ్యారు. జరిగింది తెలుసుకుని రెండోవాడు ఈ రోజుల్లో వీణ వాయించడం సర్వసాధారణమైపోయింది. కాబట్టే రాజు నిన్నోడించగలిగాడు. అదే మృదంగం అయితే, రాజు కాదుగదా. రారాజు కూడా నన్ను ఢీకొనలేడు. అందుకే, ఈ మృదంగంతో రాజును మెప్పించి, రాజవైద్యుణ్ణి తీసుకువస్తాను," అని, మృదంగం తీసుకుని బయలుదేరాడు.

వాడు రాజదర్శనం చేసుకుని,"ఈ మృదంగ వాయిద్యంలో నన్ను తలదన్నేవాడేలేడు. కావాలంటే పరీక్షించి, మా తండ్రికి రాజవైద్యుడిచేత వైద్యం చేయించండి," అన్నాడు. రాజు వాడి కేసి పరీక్షగా చూసి, "చూడబోతే నువ్వు మొన్న వీణావాయిద్యంలో నా చేతుల్లో ఓడిపోయి కొరడా దెబ్బలు తిన్నవాడికి తమ్ముడిలా వున్నావు. నేను సంగీత సమ్రాట్టును! ఇది జగమెరిగిన సత్యం. నాతో పోటీ పెట్టుకుంటే, మీ అన్నకు జరిగిన శాస్తే నీకూ జరుగుతుంది. అందుకు సిద్ధపడితే రేపే పోటీలో పాల్గొను!" అన్నాడు రెండోవాడు, రాజుతో పోటీకి దిగాడు. ఆ పోటీలో రాజు మృదంగవాయిద్యం శ్రోతలకు ఏవగింపు కలిగించింది. రెండోవాడు మాత్రం మృదంగవాయిద్యంలో గోప్ప ప్రతిభ కనబరిచాడు. అయితే, రాజుకు భయపడి ప్రజలు మళ్ళి రాజుపక్షానే నిలిచారు. ఫలితంగా రెండోవాడికి కొరడా దెబ్బల శిక్ష పడింది. రెండోవాడు కూడా బిక్క మొహం వేసుకుని కొరడా డెబ్బలతో తిరిగి వచ్చేసరికి, మూడోవాడు మండిపడి, "ప్రజల ముందు ఒక విద్వంసుడి కొడుకులను చవటల్ని చేసి దండించినందుకు, ఈ రాజునే అసలైన చవటను చేసి తగిన శాస్తి చెయ్యకపోతే, నేను సంగీత విద్వాంసుడి కొడుకునే కాదు," అని వీణ, మృదంగం, సన్నాయి తీసుకుని, అప్పటికప్పుడే రాజధానీ నగరానికి బయల్దేరాడు.

రాజధాని చేరుకున్న మూడోవాడు, ఒక కూడలి ప్రదేశంలో కూర్చుని, తనకెదురుగా మృదంగం, సన్నాయి పెట్టుకుని, అదేపనిగా దివారాత్రాలు వీణవయించసాగాడు. మూడుదినాలు గడిచే సరికి, వీణాతంత్రులు మీటుతున్న మూడోవాడి చేతివేళ్ళనుంచి రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. ఈ విషయం ఈనోటా ఆనోటా పడి రాజు చెవినపడింది. అయన మంత్రులతో కలిసి హూటాహుటిన బయలుదేరి, మూడోవాడిని చూడబోయాడు.
రాజును చూడగానే, మూడోవాడు లేచి నమస్కరించాడు. ఎవరు నువ్వు? ఏమిటీ పిచ్చి పని?" అని అడిగాడు రాజు. అందుకు మూడోవాడు, "ఫభూ! నాది కొండకోనల్లో వుండే భైరవకోన అనే గ్రామం. మా గ్రామానికి రోజూ ఎక్కడినుంచో, నా ఈడువాడే అయిన ఒక కుర్రవాడు వచ్చి, నాతో ఆడుకువాడు. ఒకరోజు ఆకుర్రవాడు తాటిముంజలు తినాలని కోరితే, నేను కత్తి తీసుకుని బయలుదేరాను. గ్రామం చివరికి వచ్చాక, ఆ కుర్రవాడు వేసవి కావడం వల్ల తాపంగావుందని, కనిపించిన పెద్ద నీటివాగులో స్నానానికిదిగాడు.

చూస్తూండగానే వాగులో మునకవేసిన, ఆ కుర్రవాడు ఎంతకీ పైకి రాలేదు. నాకు భయం వేసి కత్తిని నడుముకు కట్టుని, వాగులో దూకి అడుగుకు వెళ్ళాను. అక్కడ వింతసర్పం ఆ కుర్రవాణ్ణిమింగు కనిపించింది. దాని పోట్ట తెల్లగా వుండి, పైన చర్మం పులి చర్మంలా చారాలు చారులుగా వున్నది. ఆ దృశ్యం చూసి నేను క్షణంకూడా ఆలస్యం చేయకుండా, కత్తితో దాన్ని నిలువునా చీరేసి, నా మిత్రుణ్ణి రక్షించాను. వాడు కృతజ్ఞతగా, తనతోబాటు తన ఇంట్టికి రమ్మని బలవంత పెట్టి - కొండలూ, అడవులూ దాటించి, ఒక కొండకోనలోకి తీసుకువెళ్ళడు. ఆ కోనలో వున్న ఒక కొండగుహలో, నడుం వరకూ విర బోసుకున్న తెల్లని చింపిరిజుట్టుతో ఒకమంత్రగతై ఏవో లేపనాలు చేస్తూ కనిపంచింది. దాని కళ్ళు దీపాల్లా మెరుస్తున్నాయి.

మొహం కుదుమ్లు కట్టి వికృతంగా వున్నది. నా మిత్రుడు ఆ మంత్రగతైను సమీపించాడు. మంత్రగతై వాణ్ణి చూడగానే అమాంతం కౌగలించుకుని, ముద్దులాడుతూ, 'నా బంగారు కొండ, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా వచేది? నీకిష్టమని కొండబల్లుల కూర వండి పెట్టాను,' అన్నది. కుర్రవాడు, నన్ను ఆ మంత్రగతైకు చూపిస్తూ, 'అమ్మా, వీడు నా మిత్రుడు ప్రాణాలకు తెగించి నన్నుకాపాడాడు. వీడి పుణ్యన ఈ రోజు ప్రాణాపాయంనుంచి బయటపడ్డాను!' అని జరిగిందంతా చెప్పాడు.

"అంతా విన్న మంత్రగతై ఆవేశంతో ఊగిపోతూ, ఏదో లేపనం తీసుకుని గోడకు పులిమి వికృతస్వరంతో బిగ్గరగా ఏవో మంత్రాలు చదివింది. మరుక్షణమే లేపనం పూసిన గోడ అద్దంలా మారిపోయి అందులో మత్రగతై కొడుకు మునిగిన వాగు,వాగు అడుగున ముక్కలుగా పడివున్న పాము కళేబరము కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే మంత్రగతై మళ్ళీ ఏవో మంత్రలు చదివింది. చూస్తూండగానే ఆ కళేబరం మాయమై, ఆ స్థలంలో చచ్చిపడి వున్న ఒకమంత్రగతై శవం కనిపిచింది. ఆశవాన్ని చూస్తూనే మంత్రగతై వికవికా నవ్వుతూ, కాసేపు క్షుద్రనాట్యం చేసింది.
అతర్వాత అది నా భుజం తట్టి" భళిరా, కుర్రాడా, నువ్వు చంపింది పామును కాదు; అది నా చిరకాల శత్రువైన ఒక మంత్రగతై. దాన్ని ఎన్ని విధాల ప్రయత్నించినా నేను చంపలేక పోయాను. ఇన్నాళ్ళుకు నువ్వు దాన్ని హతమార్చి నన్ను, నా బిడ్డనూ రక్షించావు. నీకు బహుమతిగా ఒక మాయావీణనూ, దానితో పాటు ఒక మృదంగం, సన్నాయి ఇస్తాను. నువ్వామాయావీణను బాగావాయించగలిగితే, దాని మహిమవల్ల ఇద్దరు అదృశ్య యువకులు వచ్చి, మృదంగాన్నీ, సన్నాయినీవాయించి ఆశ్చర్యపరుస్తారు,' అన్నది.

 "ఆ మంత్రగత్తె ఇచ్చిన మాయావీణను తీసుకు వచ్చి మూడు రోజుల నుంచి వేళ్ళు తెగేలా మీటినప్పటికీ, ఆ అదృశ్యయువకులు వచ్చి, ఈ మృదంగం,సన్నాయిలను వాయించలేదు. ఆ మంత్రగత్తె నన్ను మోసపుచ్చిందో, ఏమో!" అని ముగించాడు.అంతా విని రాజు ఫకాలున నవ్వి, "పిచ్చి వాడా! మంత్రగతై నిన్ను మోసగించలేదు.
వీణను బాగా వాయించగలిగితేనే, దాని మహిమ తెలుస్తుందని, అది ముందే నీకు చెప్పింది. నీకు వీణ మీటడం చేతగాక దాన్ని నిందిస్తున్నావు. ఇప్పుడు వీణ నేను మీటి చూపిస్తాను. ఆ అదృశ్యయువకులు వచ్చి మృదంగం, సన్నాయి ఎలా వాయిస్తారో చూడు!" అని గుర్రం దిగి, వీణ ముందు కూర్చుని, వీణ వయించ సాగాడు. రాజు వీణను మీటిమీటి తంత్రులను తెంపేశాడేగాని, ఆ అదృశ్య యువకులు వచ్చి మృదంగం, సన్నాయిలను వాయించలేదు.

చివరకు రాజు విసిగిపోయి, "సంగీత సమ్రాట్టునయిన నాకే దీని మహత్తు పని చేయలేదంటే, ఇది సామాన్యమైన వీణకాదు. సంగీతంలో నన్ను మించినవాడైతేనే దీన్ని వాయించగలడు. త్వరలో జరగబోయే దసరాఉత్సవాల్లోపోటీలు నిర్వహించి, ఎవడైతే ఈ వీణద్వారా అదృశ్యయువకుల్ని రప్పించగలడో, వాణ్ణి అగ్రహారంతోపాటు ధన కనకవస్తువాహనాలిచ్చి సత్కరించగలను," అనిచెప్పి, ఆ వాయిద్యాలను తీసుకుని వెళ్ళి పోయాడు. ఆ మరుసటి రోజే రాజు, ఈ విషయాన్ని ప్రజలకు తెలియభరుస్తూ నగరంలో చాటింపు కూడా వేయించాడు.

ఇది జరిగిన కొద్ది దినాలకే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. ఆవేడుకల్లో చివరి రోజు రాజు, మాయావీణ పోటీలు ఎందరో ఆ పోటీలో పాల్గొని ఎంత ప్రయత్నించినా, అదృశ్యయువకులు వచ్చి మృదంగం సన్నాయిలను వాయించనేలేదు. చివరకు విద్వాంసుడి మూడో కొడుకు వచ్చి, రాజుకు నమస్కరించి, "ప్రభూ, మీరు పోటీలు ప్రకటించిన నాటినుంచి నేటివరకూ, ఒక మహావిద్వాంసుడి దగ్గర వీణావాదంలోశిక్షణ పొందాను. మీరనుమతిస్తే, నేను కూడా ప్రయత్నిస్తాను,"అన్నాడు. రాజు వెటకారంగా నవ్వి," ప్రయత్నించిచూడు!" అన్నాడు.
మూడోవాడు వీణ ముందు కూర్చుని ఇష్టదైవాన్ని ప్రార్థించి, వీణ మీటడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు గడిచేసరికి జనం మధ్యనుంచి విద్వాంసుడి పెద్దకోడుకు, రెండో కొడుకు మారు వేషాల్లో రంగు రంగుల విచిత్రమైన వస్త్రధారణతో నడుచుకుంటూ వచ్చి మృదంగం, సన్నాయిల ముందు కూర్చుని, ఆ వాయిద్యాలను అద్బుతంగా వాయించ సాగారు. చూస్తూన్న ప్రజలు పరవశత్వంతో కరతాళ. ధ్వనులు చేశారు.

సంగీతంలో ఆరి తేరిన ఆ ముగ్గురన్నదమ్ములు కలిసి, ఆ పోటీని సంగీత కచేరిలా రక్తికట్టించారు. రాజు,ప్రజలు తన్మయత్వం నుంచి తేరుకునే సరికి, అదృశ్యయువకులు వేదికమీద లేరు. వీణమీటడం ఆపి, మూడోవాడు ఒక్కడే వీణ ముందు కూర్చునివున్నాడు.రాజు ప్రకటించినట్టుగా నే మూడోవాడిని ఘనంగా సత్కరించి, అగ్రహారం, ధన కనక వస్తు వాహనాలతోపాటు, అతడి తండ్రికివైద్యం చేసేందుకు రాజవైద్యుణ్ణి అతడి వెంటపంపాడు.

సన్మానయోగం

సుకావ్యుడు జనకారణ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.తన పాండిత్యంతో రాజును మెప్పించాలని రాజధానికి వస్తే రాజదర్శనం దుర్లభమయింది. జీవనోపాధికి దారితోచని సమయంలో, అతడికి జగన్నాధుడనే పండితుడు తన ఇంట అశ్రయమివ్వడమేగాక,తన కూతురునిచ్చి పెళ్ళి చేశాడు.

సుకావ్యుడక్కడే స్ధిరపడి,విద్యార్ధులకు పాఠాలు బోధిస్తూ,రోజులు వెళ్ళబుచ్చసాగాడు.అయితే, ఎప్పటికైనా రాజాశ్రయం పొందాలన్న అతడి కోరిక మాత్రం అలాగే ఉండిపొయింది.అలా కొన్నేళ్ళు గడిచాయి.

ఈ వ్యవధిలొ సుకావ్యుడు ప్రజాయణం అనే కావ్యం రచించాడు.జగన్నఆధుడాకావ్యాన్ని చదివి,"నీ కావ్యం అద్భుతంగా ఉన్నది.ఇది నీకెంతో పేరు తెచ్చిపెడుతుంది.కానీ, అందుకు ప్రచారం కావాలి.ప్రచారానికి రాజాశ్రయం కావాలి," అన్నాడు.

సుకావ్యుడు రాజాస్ధాన కవిని కలిస్తే ఆయన కావ్యం చదివి,"రాజు ప్రజలకు దేవుడు.నువ్వు నీ కావ్యంలో ప్రజలను రాజుకు దేవుళ్ళను చేశావు.ఇది పాపం.పాపానికి రాజాశ్రయం లభించదు.ఇప్పుడే కాదు; ఇంకెప్పుడూ నువ్వీ దరిదాపులకు రావద్దు," అని హెచరించి పంపేశాడు.

జరిగింది విన్న జగన్నాధుడు, "ఆస్థాన కవి నీ కావ్యం గొప్పగా ఉన్నదని గ్రహించి అసూయతో నీకు రాజ దర్శనం కలక్కుండా చేశాడు. నువ్విక రాజాశ్రయం లేకుండానే పేరు తెచ్చుకోవాలి," అన్నాడు.

ఇది జరిగిన వారం రోజులకు నాగపురం నుంచి రవీంద్రుడనే దూరపు బంధువు రాజధానికి వచ్చి,జగన్నాధుడి ఇంట బస చేశాడు.మాటల సందర్భంలో సుకావ్యుడి విషయం తెలిసి,"మా ఊళ్ళోని కీర్తికాముకుడు బాగా డబ్బు సంపాదించాడు.ఇప్పుడు పేరు ప్రతిష్ఠల కోసం తాపత్రయ పడుతున్నాడు మీ

అల్లుడు ఆయన్ను కలిస్తే ప్రయోజనముండవచ్చు," అని జగన్నాధుడికి చెప్పాడు.

సుకావ్యుడు నాగపురం వెళ్ళీ కీర్తికాముకుణ్ణి కలుసుకుని విషయమంతా దాచకుండా చెప్పాడు.

కీర్తికాముకుడికి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉన్నప్పటికి, డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు.పైగా ప్రజలే రాజుకు దేవుళ్ళని చేప్పే కావ్యాన్ని సన్మానిస్తే రాజుకు తన మీద కోపం రావచ్చని భయపడ్డాడు. అతడు సుకావ్యుడితో,"నాకు కవిత్వం గురించి అంతగా తెలియదు. యోగపురంలోని ప్రముఖ వ్యాపారి జనవంధ్యుడు సాహితీ ప్రియుడు. నువ్వతన్ని కలిస్తే ప్రయోజనం ఉండవచ్చు." అన్నాడు.

కీర్తికాముకుడు అలా చెప్పడంలో మర్మముంది.జనవంద్యుడు వైభవంగా జీవిస్తూనే, పరోపకారీ,సాహితీ ప్రియుడూ అని పేరు గాంచాడు."డబ్బుండగానే సరిపోదు.జనవంద్యుడిలాంటి అభిరుచి ఉండాలి," అని చుట్టుపక్కల చెప్పుకునేవారు.

కీర్తికాముకుడికి పరోపకార గుణమూ లేదు;సాహిత్యం పట్ల అభిరుచీ లేదు. తను చేయలేనివి చేస్తూన్న జనవంద్యుడంటే అసూయతో అతడికి చెడ్డపేరు తేవాలనునుకున్నాడు.ఇప్పుడు జనవంద్యుడు సుకావ్యుణ్ణి సన్మానిస్తే-రాజు గారికి కోపం.సన్మానినించకుంటే, జనవంధ్యుడి సాహితీ ప్రియత్వం అబధ్దమని తనే ప్రచారం అచేయాలని కీర్తికాముకుడి దురాలోచన.

అయితే, సాహితీ ప్రియుడైన జనవంద్యుడు సుకావ్యుడి ప్రజాయణం చదివి ముగ్ధుడై, అతడికి ఘనంగ సన్మానం చేసి, పదివేల వరహాలు కానుకగా ఇచ్చాడు.మహకవిగా సుకావ్యుడికీ, గొప్ప సాహితీ పోషకుడిగా జనవంద్యుడికీ పేరొస్తే-అది తెలిసి మహారాజు వాళ్ళిధ్దర్నీ పిలిపించి రాజసన్మానం చేశాడు.

ఇది ఊహించని కీర్తికాముకుడు మానసికంగా దెబ్బతిన్నాడు.

ఇలా ఉండగా,పాతికేళ్ళ ప్రాయంలో ఊరు వదిలి వెళ్ళిన సంచారుడు, విదేశాలలో బాగా డబ్బు గడించి వృద్ధాప్యాన్ని తన వాళ్ళ మధ్య గడపాలని నాగపురానికి తిరిగి వచ్చాడు.అప్పటికి కీర్తికాముకుడు తప్ప,సంచారుడి బంధువులెవరూ అక్కడ లేరు.సంచారుడి వద్ద బాగా డబ్బున్నదని తెలియడంతో, ఆయన్ను కీర్తికాముకుడు తన ఇంటికి పిలిచి విందు


భోజనం పెట్టాడు. అందుకు సంతోషించిన సంచారుడు," ఇప్పుడు నా వద్ద కావలసినంత డబ్బున్నది. దానికి తగ్గ పేరు ప్రఖ్యాతులు లేవు. ఏం చేస్తే బావుంటుందంటావు?". అని అడిగాడు.

"డబ్బు ఖర్చు పెట్టాలేగాని, అదెంతపని? నిన్న గాక మొన్న జనవంద్యుడనే వ్యాపారి, సుకావ్యుడనే కవిని సన్మానించి, సాహితీ పోషకుడని ప్రజల మన్ననలు పొందడమే గాక, రాజుగారి నుంచి కూడా సన్మానం పొందాడు. నువ్వు కూడా సుకావ్యుడి కావ్యాన్ని అంకితం పుచ్చుకుని సన్మానించావంటే నీ పేరు నలు దిశలా మారుమోగి పోతుంది," అన్నాడు కీర్తికాముకుడు.

సంచారుడు అందుకు సమ్మతించడంతో, కీర్తికాముకుడు సుకావ్యుణ్ణి పిలిపించి, "నేను నీకు జనవంద్యుణ్ణి గురించి చెప్పడం వల్లే కదా నీకింత పేరు వచ్చింది. ఇప్పుడు మరొక కావ్యం రచించి మా బంధువు సంచారుడికి అంకితమిచ్చి, ఆయన సన్మానం స్వీకరించు," అన్నాడు.

సుకావ్యుడు అందుకు అంగీకరించి,"మనుషులకు మాత్రమే కాకుండా, సకల జీవరశులకూ ప్రకృతి ఎన్ని రూపాల్లో సహకరించి సాయపడుతున్నదో వివరిస్తూ,'ప్రకృతి పురాణం' అనే కావ్యం నేనిప్పుడు రచిస్తున్నాను. అది మరో పక్షం మరో రోజుల్లో పూర్తి కాగలదు," అని చెప్పి వెళ్ళాడు.

కొంతసేపయ్యాక కీర్తికాముకుడు,"సుకావ్యుణ్ణి సన్మానించడంతో పాటు, సుందర ప్రదేశంలో గొప్ప భవనం నిర్మించి, దానికి మీ వంశం పేరు పెడితే, మీ కీర్తి శాశ్వతంగా నిలబడగలదనుకుంటాను," అన్నాడు సంచారుడితో.

"ఆలోచన బావుంది. మరి ఎక్కడ నిర్మిద్దామంటావు?" అని అడిగాడు సంచారుడు."మన నదీ తీరంలో చాలా అందమైన స్ధలం నాకు సొంతంగా ఉంది. దాన్ని మీకు అమ్ముతాను. అక్కడ నిర్మించవచ్చు," అన్నాడు కీర్తికాముకుడు.

సంచారుడు అందుకు అంగీకరించి,ఆ స్ధలాన్ని వెంటనే కొని, చదును చేయడానికి అక్కడున్న చెట్లను నరికించడం మొదలు పెట్టాడు.
పక్షం రోజులు గడిచాక పిలుపురావడంతో, సుకావ్యుడు నాగపురం వెళ్ళి అక్కడి దృశ్యం చూసి దిగ్ర్భాంతి చెందాడు.

సంచారుడు తను నిర్మించ తలపెట్టిన భవనం గురించి చెప్పి,"నీ ప్రకృతి పురాణం పూర్తయిందా? సన్మాన కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చెయమంటావు?" అని అడిగాడు ఉత్సాహంగా.

"కావ్యం పూర్తి కావచ్చింది.అయినా దాన్ని తమకు అంకితమివ్వలేను," అన్నాడు సుకావ్యుడు.

"ఎందుకు? నీకు సన్మానం,నీ కావ్యానికి ప్రచారం అవసరంలేదా?" అని అడిగాడు పక్కనే ఉన్న కీర్తికాముకుడు కాస్త ముందుకు వచ్చి ఆశ్చర్యంతో.

"ప్రజా హృదయాలలో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందింప జేయడానికి నేను 'ప్రకృతి పురాణం' రచిస్తున్నానని తెలియగానే, జనవంద్యుడు యోగపురం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అందులోని పద్యాలను చదువుతూండగా విని తన్మయత్వం చెందాడు.దాని నుంచి పొందిన స్ఫూర్తితో ఇక పై సాహితీ పోషణతో పాటు, ప్రకృతి పరిరక్షణకు కూడ పాటుపడగలనని మాట ఇచ్చాడు. అలాంటి వారికి అంకితమిస్తేనే నా కావ్యానికి సార్ధకత సిధ్దిస్తుందని భావిస్తున్నాను. అందుకే నా కావ్యాన్ని జనవంద్యుడికే అంకితమివ్వాలని నిర్ణయించాను," అన్నాడు సుకావ్యుడు.

ఆ మాటల్లో నిజం ఉందని గ్రహించిన సంచరుడు, "చక్కని నిర్ణయం తీసుకున్నావు.సాహిత్య పోషణతో పాటు, అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. అదే కవికి నిజమైన సన్మానం. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే నాలాంటి వాళ్ళకు నీవంటి గొప్ప కవులను సన్మానించే యోగం లభించదు.నిజమైన సాహితీ ప్రియులకే అది సాధ్యం.ఇక్కడ మరికొన్ని ఫలవృక్షాలను నాటించి పెంచుతాను.దానికి 'ప్రకృతి పురాణవనం' అని పేరు పెట్టి ప్రకృతి పరిరక్షణకు నా చేతనైన కృషి చేస్తాను. నువ్వు జనవంద్యుడికి నీ కావ్యాన్ని అంకితమిచ్చే రోజును చెప్పావంటే, కీర్తికాముకుణ్ణి వెంటబెట్టుకుని నేనూ సన్మాన సభకు వస్తాను," అన్నాడు.
సుకావ్యుడు సంతోషంగా అక్కడి నుంచి రాజధానీ నగరానికి బయలుదేరాడు. 

ప్రశాంత జీవనం

పూర్వం ఒక గ్రామంలో గోవిందయ్య అనే ధనవంతుడుండేవాడు. ఆయన రకరకాల వ్యాపారాలు చేసి, ధనం ఆర్జించాడు. ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. అయితే, ఆయనకు అరవై ఏళ్ళు వచ్చేసరికి తన వాళ్ళంటూ ఎవరూ లేకుండాపోయారు. ఆయన విరక్తిపుట్టి, తనకున్నదంతా గ్రామం బాగుకు ధారపోసి, ప్రశాంతంగా తన మిగిలిన జీవితం వెళ్ళబుచ్చటానికి వనాలకు వెళ్ళిపోయాడు.

సుదూరంలోని అరణ్య మధ్యంలో నీటివనరులకు దగ్గిరలో ఒక అందమైన కుటీరం నిర్మించుకుని, కాయలూ, పళ్ళూ, కందమూలాలూ తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా జీవించసాగాడు.

ఇంతలో ఒకనాడు ఒక వింత సంఘటన జరిగింది. గోవిందయ్య పొదలలో ఏవోకాయలు కోసుకుంటూండగా భయంకరమైన ఒక పెద్ద పులి ఆయన వెనకగా, దాదాపు ఆయనను రాచుకుంటూ వెళ్ళిపోయింది. అంతకు ముందే దాని గాండ్రింపు విని భయపడిపోయి చెట్టెక్కిన కట్టెలుకొట్టేవాడు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూశాడు. కాని గోవిందయ్యకు మాత్రం తన వెనకగా పులి వెళ్ళిన సంగతి అసలు తెలియదు.

కట్టెలు కొట్టేవాడు గోవిందయ్య మామూలు మనిషి కాదని నిశ్చయించుకుని, గబగబా చెట్టు దిగివచ్చి, గోవిందయ్య కాళ్ళ మీదపడి, "పెద్దకుటుంబం గలవాణ్ణి. సంసారం ఈదలేక చస్తున్నాను. ఈ సంసారసాగరాన్ని తరించే మార్గం చెప్పండి, స్వామీ!" అన్నాడు దీనంగా.

గోవిందయ్య వాణ్ణి లేవనెత్తి, "నీ కష్టం నువ్వు చెయ్యి. కుటుంబ పోషణకు కష్టపడక తప్పదు కదా. తరించటం మాట నీకెందుకు?" అన్నాడు.

ఆ కట్టెలు కొట్టేవాడు సమీపంలో ఉన్న తన గ్రామానికి వెళ్ళి, గోవిందయ్య గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు. అది మొదలు జనం అరణ్యంలో కుటీరం నిర్మించుకుని ఉన్న గోవిందయ్య దర్శనం చేసుకుని పాపాలు పోగొట్టుకోవటానికి రాసాగారు. రాను రాను అది తీర్థప్రజ అయింది.

ప్రశాంతంగా జీవింతామనుకున్న గోవిందయ్యకు ప్రజల కష్టాలూ, సమస్యలూ, ఈతిబాధలూ వినక తప్పలేదు. వారు ఏకరువు పెట్టే సమస్యలకు తనకు తోచిన పరిష్కారమార్గాలు సూచించేవాడు. జనం అతన్ని గోవింద స్వామిని చేసి, దేవుడు లాగా పూజించసాగారు. క్రమ క్రమంగా అతని పేరు ఇంకా, ఇంకా దూర గ్రామాలకు పాకింది.

ఒకసారి బహు దూర గ్రామం నుంచి సుందరయ్యా, కాంతమ్మా అనే బీద రైతు దంపతులు కష్టాలు భరించలేక ఏదైనా పరిష్కారం లభించగలదన్న ఆశతో గోవిందస్వామి దర్శనం చేసుకోవాలని బయలుదేరారు.

వారు కొంతదూరం వెళ్ళేసరికి, యాత్రికుల వేషంలో పోతున్న కొందరు దొంగలు వారికి తగిలారు. సుందరయ్య అవతారమూ, బవిరి గడ్డమూ చూసి దొంగలకు ఒక ఆలోచన వచ్చింది. ఆకలితో అలమటిస్తున్న సుందరయ్యకూ, కాంతమ్మకూ వాళ్ళు తమ వద్ద ఉన్న తిండి పెట్టి, వాళ్ళకు తమ సంచీలలో నుంచి కాషాయవస్త్రాలు తీసి కట్ట బెట్టారు. తరవాత తాము కూడా కాషాయవస్త్రాలు ధరించారు.

తరవాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం నిర్మించి, సుందరయ్యను అందులో గోవిందస్వామి ప్రియ శిష్యుడిగా ప్రతిష్ఠించారు. అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు. తాము అతని శిష్యులలాగా నటిస్తూ, కొత్త స్వామి గురించి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు.

సుందరయ్య ఆశ్రమానికి గోవిందయ్య ఆశ్రమం చాలా దూరం. అందుచేత గోవిందస్వామి దర్శనం చేసుకునేటందుకు పోలేని వారు, ఈ చిన్న గోవిందస్వామిని చూడవచ్చారు. దొంగలు సుందరయ్యకు కొన్ని చిట్కాలు, ఇంద్రజాల విద్యలు నేర్పారు. అతను ఉత్త చేతులు రుద్దుకుని బూడిద తెప్పించేవాడు. నోట్లో నుంచి శివలింగాలు తీసేవాడు. ఈ గమ్మత్తులు చూసి భక్తులు పరవశించిపోయి, చిన్న గోవిందస్వామికి భక్తితో కానుకలు అర్పిస్తే, వాటిని దొంగలు తీసుకునేవారు. వాళ్ళకు ఈరకం వృత్తి, దారిదోపిడీలకన్నా ఎంతో గిట్టుబాటుగానూ, చాలా గౌరవప్రదంగానూ ఉన్నది.రానురాను అసలు గోవిందస్వామి కన్న చిన్న గోవిందస్వామే గొప్ప గొప్ప మహిమలు గలవాడని వాడుకపడింది. అరణ్యమధ్యంలో మరీ దూరాన ఎక్కడో ఉన్న గోవిందయ్యకు భక్తులు తగ్గి, సమీపంలో ఉన్న సుందరయ్యకు హెచ్చారు.

తన పేరు ఉపయోగించుకుని ఎవరో జనాన్ని మోసగిస్తున్నారని గోవిందయ్యకు అనుమానం కలిగింది. అది ఆయనకు తీరని ఆవేదన కలిగించింది. తాను "స్వామి" అయిన మాట నిజమేగాని, ఎవరినీ ఎన్నడూ ఏ విధంగానూ మోసం చెయ్యలేదు. ఈ కొత్తస్వామి ఎవరు?

అది తెలుసుకుందామని ఒకనాడు గోవిందయ్య సుందరయ్య ఆశ్రమానికి బయలుదేరాడు. అతను ఎవరైనదీ తెలియని దొంగలు అతన్ని ఇతర భక్తులను ఆదరించినట్టే ఆదరించారు.

సుందరయ్య తన మహత్తులు ప్రదర్శించగానే చూడవచ్చిన భక్తులు వెళ్ళిపోయారు. దొంగల అనుమతి మీద గోవిందయ్య సుందరయ్యతో ఒంటరిగా కొంతసేపు మాట్లాడాడు. సుందరయ్య స్వామి హోదాలోనే అతని ప్రశ్నలకు జవాబు చెప్పాడు.

"తమ గురువుగారైన గోవిందస్వామి గారిని గురించి తెలుసుకోవాలని ఉన్నది. మీకు తెలిసినది చెప్పండి," అన్నాడు గోవిందయ్య.

"నాయనా, వారిని గురించి నేను ఏమి చెప్పగలను? వారు గొప్ప తపస్సంపన్నులు!

దైవసాక్షాత్కారం పొందిన అపూర్వ జ్ఞానులు!" అన్నాడు సుందరయ్య పరవశంగా కళ్ళుమూసుకుని.

"వారి పూర్వనామం ఏమై వుంటుందో తమకు తెలుసా?" అని గోవిందయ్య మళ్ళీ అడిగాడు.

"పిచ్చివాడా! వారికి పూర్వనామం ఏమిటి? వారు పుట్టుతూండగానే అశరీరవాణి 'గోవిందస్వామి!' అని పలికింది," అన్నాడు సుందరయ్య.

"ఆ స్వామి వారిని తమరు ఎంతకాలం క్రితం చూశారు?" అని గోవిందయ్య అడిగాడు.

"నే నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వారి దివ్యవిగ్రహం దర్శనమిస్తుంది!" అన్నాడు సుందరయ్య.

"అలా అయితే నన్ను గుర్తుపట్టావా!" అన్నాడు గోవిందయ్య.

"నువ్వు ఎవరు, నాయనా?" అని సుందరయ్య అడిగాడు.

"ఇప్పుడు మీరు కీర్తిస్తున్న గోవిందస్వామిని, స్వామీ!" అన్నాడు గోవిందయ్య. అది విని సుందరయ్య నిర్ఘాంత పోయాడు నోటమాట రాలేదు.

"ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు?" అని గోవిందయ్య అడిగాడు.

దొంగలు తనను అడ్డం పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నదీ సుందరయ్య వివరంగా చెప్పాడు. దొంగల నుంచి తప్పించుకుని పారిపోవటానికి తనకు, అభ్యంతరం లేదని కూడా అతను గోవిందయ్యకు స్పష్టం చేశాడు.

ఆ రాత్రి దొంగలు మత్తు నిద్రలో ఉన్న సమయంలో గోవిందయ్య సుందరయ్యనూ, అతని భార్యనూ తీసుకుని బయలుదేరాడు. వాళ్ళు చాలా దూరం ప్రయాణంచేసి, ఒక పట్టణం చేరుకుని, మామూలు పనులు చేసుకుంటూ బతకసాగారు.

నట్టడవిలో దొరకని మనశ్శాంతి గోవిందయ్యకు జనసమ్మర్దంగల పట్టణంలో దొరికింది. ఎందుకంటే అక్కడ అతన్ని ఎరిగినవారూ, అతని సంగతి పట్టించుకునేవారూ లేరు.

ద్రాక్షపళ్ళు తీయన!

అమరావతి సమీపంలో ఒక బౌద్ధ సన్యాసి జీవితమంతా ప్రజలకు మంచి బోధించి అవసానదశకు చేరుకున్నాడు. గురువుకు చివరి ఘడియలు సమీపించాయి అని గ్రహించిన శిష్యులు, చివరి సందేశంగా ఏం చెబుతాడో అని ఆయన పాదాల వద్ద కూర్చుని ఆసక్తితో ఎదురు చూడసాగారు. చుట్టు పక్కల నిశ్శబ్ద వాతావరణం అలముకున్నది.

"జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సర్వం మార్పుకు లోబడినదే. మార్పు ఒక్కటే మార్పు లేనిది. కాలం నిరంతరాయంగా ప్రవహించే జీవనదిలాంటిది. వెళ్ళిన నీటిచుక్క తిరిగిరాదు. గతం వదిలిన బాణంలాంటిది. భవిష్యత్తు అమ్ములపొదిలోని బాణం లాంటిది. వర్తమానం ఒక్కటే మనం వదలగలిగిన బాణం లక్ష్యం కేసి ఆ బాణాన్ని గురి చూసి వదలగలిగిన వారే ఆనంద ఫలాలను అందుకోగలరు," అంటూ తరచూ గురువు బోధించే విషయాలు శిష్యుల మనసుల్లో కదలాడ సాగాయి.

అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు, గురువు దర్శనానికి వచ్చాడు. ద్రాక్షపళ్ళు గల పళ్ళాన్ని గురువు ముందుంచాడు. గురువు కళ్ళు తెరిచి, రెండు ద్రాక్షపళ్ళను నోట్లోవేసుకుని చప్పరిస్తూ రాజునూ, శిష్యులనూ పరిశీలనగా చూశాడు. గురువు ఏదో మహత్తర సందేశాన్ని ఇవ్వగలడని శిష్యులు ఆత్రుతతో ఎదురు చూడసాగారు. "ద్రాక్షపళ్ళు తియ్యగా ఉన్నాయి!" అంటూ గురువు మందహాసంతో చివరిశ్వాస విడిచాడు.

మొదట ఆశాభంగానికిలోనైన శిష్యులు, ఆ తరవాత గురువు జీవితాంతం బోధించిన జీవిత సత్యాన్నే, చివరి క్షణాలలో ప్రత్యక్షంగా చూపాడని గ్రహించి సంతోషించారు.

ద్రాక్షపళ్ళు తీయన!

అమరావతి సమీపంలో ఒక బౌద్ధ సన్యాసి జీవితమంతా ప్రజలకు మంచి బోధించి అవసానదశకు చేరుకున్నాడు. గురువుకు చివరి ఘడియలు సమీపించాయి అని గ్రహించిన శిష్యులు, చివరి సందేశంగా ఏం చెబుతాడో అని ఆయన పాదాల వద్ద కూర్చుని ఆసక్తితో ఎదురు చూడసాగారు. చుట్టు పక్కల నిశ్శబ్ద వాతావరణం అలముకున్నది.

"జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సర్వం మార్పుకు లోబడినదే. మార్పు ఒక్కటే మార్పు లేనిది. కాలం నిరంతరాయంగా ప్రవహించే జీవనదిలాంటిది. వెళ్ళిన నీటిచుక్క తిరిగిరాదు. గతం వదిలిన బాణంలాంటిది. భవిష్యత్తు అమ్ములపొదిలోని బాణం లాంటిది. వర్తమానం ఒక్కటే మనం వదలగలిగిన బాణం లక్ష్యం కేసి ఆ బాణాన్ని గురి చూసి వదలగలిగిన వారే ఆనంద ఫలాలను అందుకోగలరు," అంటూ తరచూ గురువు బోధించే విషయాలు శిష్యుల మనసుల్లో కదలాడ సాగాయి.

అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు, గురువు దర్శనానికి వచ్చాడు. ద్రాక్షపళ్ళు గల పళ్ళాన్ని గురువు ముందుంచాడు. గురువు కళ్ళు తెరిచి, రెండు ద్రాక్షపళ్ళను నోట్లోవేసుకుని చప్పరిస్తూ రాజునూ, శిష్యులనూ పరిశీలనగా చూశాడు. గురువు ఏదో మహత్తర సందేశాన్ని ఇవ్వగలడని శిష్యులు ఆత్రుతతో ఎదురు చూడసాగారు. "ద్రాక్షపళ్ళు తియ్యగా ఉన్నాయి!" అంటూ గురువు మందహాసంతో చివరిశ్వాస విడిచాడు.

మొదట ఆశాభంగానికిలోనైన శిష్యులు, ఆ తరవాత గురువు జీవితాంతం బోధించిన జీవిత సత్యాన్నే, చివరి క్షణాలలో ప్రత్యక్షంగా చూపాడని గ్రహించి సంతోషించారు.

బలమైనశత్రువు

రంగాపురంలో రాజమ్మ పరమగయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరివో తప్పులు వెతుకుతూండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో, ముద్దుగా పెంచింది. కాని ఆమె నోరు మంచిది కాకపోవటాన, వీరయ్యకు పిల్లనియ్యడానికి ఎవరూ ముందుకురాలేదు.

ఒకసారి వీరయ్య ఏదో పనిమీద దూరగ్రామానికి వెళ్ళి, ఆ ఊరి చెరువు దగ్గిర నీళ్ళుతీసుకు వెళుతూన్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనబడింది.

వీరయ్య ఆ అమ్మాయి పేరు ఇందిర అని తెలుసుకుని, ఆమెను పెళ్ళాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో నెమ్మదిగా చెప్పాడు.

"చూడు, నాయనా! నీకు ఒక సంగతి ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమగయ్యాళి. అందుకే దానికి ఒక పట్టాన సంబందం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు," అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో.

వీరయ్య వాళ్ళకు తన తల్లి గురించి చెప్పాడు. అలాటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి, వాళ్ళు అతనికి ఇందిర నిచ్చి సంతోషంగా పెళ్ళిచేశారు.

భార్యను వెంటబెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ మొదట తెల్లబోయినా, ఆ తరవాత ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెలపాటు ఆమె కొడుక్కూ, కోడలుకూ ఏ లోటూరానీకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తరవాత ఆమెకు, తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసివచ్చి, ఆమెకు కూడా పనులు చెప్పసాగింది.

ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలు మీదా, కోడలు అత్తమీదా వందలకొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా, ఇద్దరూ అతనిమీద విరుచుకుపడి పోయారు.

పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగుపట్టుకుని వేళ్ళాడేవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర.

వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరిమధ్యా నలగటం ఇష్టంలేక, అతను ఇద్దరి మాటలూ పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు.

ఒకసారి వీరయ్య కామందుగారి అబ్బాయిని పామువాతపడకుండా కాపాడాడు. కామందు ఆతన్ని మెచ్చుకుని, తనకున్న పాడిపశువుల్లో ఒకటి తోలుకుపొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు.

"గోమాత ఇంటికి రావడం శుభం!" అన్నది రాజమ్మ.

"గేదెను తోలుకొచ్చుకుందాం.చిక్కనిపాలిస్తుంది," అన్నది ఇందిర.

అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చూశాడు, కాని అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలోగల గేదెలన్నిటినీ తిట్టిపోస్తున్నది, ఇందిర ఆవులన్నిటినీ దుమ్మెత్తి పోస్తున్నది.

మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు, "నిన్న వచ్చి పశువును తోలుకు పోలేదేం?" అనిఅడిగాడు.

వీరయ్య తన చిక్కు చెప్పాడు.

"నా గేదెలన్నిటినీ సంతకు తోలేశాను. ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకు వెళ్ళు," అన్నాడు కామందు వీరయ్యతో.

తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు వీరయ్య సంతోషించి, ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి, "మనింటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు," అన్నది.

"గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా?" అన్నది ఇందిర.

అత్తకోడలిమీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. ఇద్దరి మధ్యా మళ్ళీ గొడవ ఆరంభమయింది.

వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య, "నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను," అన్నాడు.

"ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసితోలుకు రండి. రంగైనా చూసి తృప్తి పడవచ్చు," అన్నది ఇందిర.

"ఏమిటీ, శుభమా అని పాడిపశువును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా? తెల్ల రంగు శుభం! తెల్ల ఆవును తోలుకురా," అన్నది రాజమ్మ.

మళ్ళీ అత్తా కోడళ్ళ మధ్య గొడవ పెరిగింది. "నల్ల రంగును తిట్టిపోస్తున్నావు. నువ్వు నల్లగా లేవా?" అని ఇందిర అత్తను అడిగింది.

"నువ్వు తెలుపును ఏమని తిట్టి పోస్తున్నావు? నువ్వు తెల్లగా లేవా?" అని అత్త కోడల్ని అడిగింది.

"తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని! నారంగు పచ్చని పసిమి!" అన్నది ఇందిర.

వాళ్ళ గొడవ ఇంతలో తేలదని, వీరయ్య మౌనంగా అన్నం వడ్డించుకుని తినేసి, నిద్రపోయాడు.

రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు.

"నాకు అత్తాకోడళ్ళ బాధలేదు గాని, ఇద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళూ మొదట్లో ఇలాగే కొట్లాడుకునే వాళ్ళు. వాళ్ళ మధ్య చిక్కుకుని చాలా అవస్థ పడ్డాను. చివరకు మంచి ఉపాయం పన్ని, ఇద్దరికీ సఖ్యత కలిగించాను," అన్నాడు కామందు.

"ఆ ఉపాయ మేదో నాకూ చెప్పండి, బాబూ!" అన్నాడు వీరయ్య.

"ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్ళకు తమకన్న బలమైన శత్రువు దాపరించాలి!" అన్నాడు కామందు.

"వాణ్ణి ఎక్కడ వెతికేది, బాబూ?" అన్నాడు వీరయ్య.

"నువ్వే!" అన్నాడు కామందు చిన్నగా నవ్వుతూ.

తను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకుని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఆ ఆవును చూస్తూనే ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు.

"బతికినన్నాళ్ళు బతకవు, చిన్న వాళ్ళను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదూ?" అని వీరయ్య తల్లిని నానా మాటలూ అన్నాడు.

మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు ఝాడించిండి.

"నీపని ఏదో నువ్వు చూసుకో. మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవు నిస్తానన్నాడు. నాకు నచ్చిన ఆవు నేను తెచ్చుకున్నాను. దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే, దీన్ని బాదినట్టే నిన్నూ బాదుతాను జాగ్రత్త," అన్నాడు వీరయ్య పెళ్ళాంతో.

అతను అలా రెండు రోజులపాటు తల్లిని కొట్టినంత పనిచెయ్యటమూ, పెళ్ళాన్నీ అలాగే బెదిరించే సరికి, ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్ళకు వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపూ కుక్కిన పేలలా ఉండి, బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. కొన్నాళ్ళకు ఇద్దరి మధ్యా అన్యోన్యత ఏర్పడింది.

అక్కచెల్లెళ్ళ కథ

దుర్గాపూర్ లో ఒక బ్రాహ్మడు భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నివసిస్తూండే వాడు. పెద్ద కూతురి పేరు ఉమాబీ, చిన్న కూతురి పేరు జుమాబీ. బ్రాహ్మడు నిరుపేదవాడు కావడంతో వాళ్ళకు పూట గడవడం కూడా దుర్లభంగా ఉండేది. రోజుకు గుప్పెడు బియ్యం, పప్పు దొరికితే చాలనుకుని కాలం గడపసాగాడు.

ఒకరోజు అతడికి కొంతబియ్యం, రెండు కొబ్బరి చిప్పలు దొరికాయి. వాటితో పీధాలు చేస్తానని చెప్పి, అతడి భార్య బియ్యం పిండి రుబ్బి, పొయ్యి రగిలించి పెనం మీదపీధాలు కాల్చడం మొదలుపెట్టింది. పెనం వేడెక్కి, పిండి పోయడంతో సుయ్ మనే శబ్దం రావడంతో, బ్రహ్మడు ఒక నూలు దారం తీసుకుని వంటగది పక్కగా వెళ్ళి నిలబడి దారంలో ఒక ముడి వేశాడు. ఇలా శబ్దం వినిపించినప్పుడల్లా దారంలో ఒక్కొక్క ముడిగావేసిన బ్రాహ్మడు, పిండి అయిపోగానే భార్య పిండి పాత్రను కడగడం కనిపించడంతో అక్కడి నుంచి వెనక్కు వచ్చేశాడు.

ఆ తరవాత స్నానం చేసి భోజనానికి కూర్చుని "వడ్డించు," అని భార్యను ఆజ్ఞాపించాడు. భార్య ఒక్కొక్క పీధాగా వడ్డించసాగింది. ఒక్కొక్క పీధాను తినిముగించగానే బ్రాహ్మడు తను ముడులు వేసిన దారం నుంచి ఒక్కొక్క ముడిని విప్పుతూ వచ్చాడు. "అంతే, ఇక పీధాలు లేవు," అని భార్య చెప్పే వరకు అలా చేస్తూ వచ్చాడు. దారంలో ఇంకా రెండు ముడులు మిగిలి ఉన్నాయి. "ఇంకా రెండు పీధాలు ఉండాలి. ఏమయ్యాయి? నువ్వు తినేశావా?" అని భార్యను అడిగాడు.

"లేదు, లేదు. నేను తినలేదు. పిల్లలు ఆకలిగా ఉందంటే వాళ్ళకు పెట్టాను," అన్నది భార్య.

ఆమె ఆకలితో ఉండడం చూసి అతడు భాదపడ్డాడు. తల్లికి తిండి లేకుండా చేసిన పిల్లల్ని శిక్షించాలనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు.

మరునాడు తెల్లవారగానే పిల్లల్ని లేపి, "ఈ రోజు నేను మిమ్మల్ని మీ మామయ్య ఇంటికి తీసుకువెళతాను. బయలుదేరండి," అన్నాడు.

ఇద్దరు కూతుళ్ళూ తండ్రివెంట బయలుదేరారు. వాళ్ళు చాలా దూరం నడిచాక ఒక అడవి ఎదురయ్యింది. పిల్లలు బాగా అలిసిపోయారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక మర్రిచెట్టు నీడలో కూర్చున్నారు. మరి కొంతసేపటికి అలసటతో అలాగే నిద్రపోయారు. తండ్రి కూడా వాళ్ళకు సమీపంలో రాళ్ళాను తలకడగా పెట్టుకుని పడుకున్నాడు. కూతుళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారని తెలియగానే, బ్రాహ్మడు మెల్లగా లేచి, తను తలకడగా పెట్టుకున్న రాళ్ళ వద్ద కుంకుమ కలిపిన నీళ్ళు చల్లి అక్కడి నుంచి జారుకున్నాడు.

చీకటి పడుతూండగా అక్కచెల్లెళ్ళకు మెలకువ వచ్చింది. తండ్రి కనిపించలేదు. అతడు పడుకున్న చోట నెత్తురులాంటి ఎర్రటి మరకలు ఉండడం చూసి హడలిపోయారు. "ఏదో క్రూర మృగం మన నాన్నను చంపేసినట్టున్నది," అని విలపించింది జుమాబీ.

"ఇది నెత్తురు కాదు, జుమాబీ," అని చెల్లెల్ని ఓదార్చిన ఉమాబీ, "నాన్న మనల్ని ఇక్కడే వదిలి వెళ్ళి ఉంటాడేమో," అన్నది.

అప్పటికే రాత్రి కావడంతో, తెల్లవారేవరకు వాళ్ళు అక్కడే గడిపారు. తూరుపు దిక్కున వెలుగు రేఖలు కనిపించగానే అక్కడి నుంచి బయలు దేరారు. కొంత దూరం నడిచి, దూరంలో ఒక గ్రామం కనిపించగానే సంతోషిస్తూ, ఆ గ్రామాన్ని చేరుకున్నారు. వాకిళ్ళలో రంగు రంగుల ముగ్గులు వేసి, పుష్పాలంకరణలు చేయబడి ఉన్నాయి.

ఒక ఇంటి నుంచి ఒక అవ్వ వెలుపలికి రావడం చూసి, "ఎవరికైనా పెళ్ళి జరుగుతున్నదా?" అని అడిగింది ఉమాబీ. "లేదు పాపా, ఇవి పూజ రోజులు, కదా," అన్నది ఆ అవ్వ.

"దుర్గాపూజ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా?" అని అడిగింది ఉమాబీ.

"మరయితే దీపావళి అయి ఉండవచ్చు," అన్నది జుమాబీ.


"దీపావళి పండుగ కూడా వెళిపోయింది. మేమిప్పుడు సూర్యుడిపండుగ జరుపుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించమని సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తాం. అది సరే, మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ సంగతి చెప్పండి," అన్నది అవ్వ.

"మాది దుర్గాపూరు. మా తండ్రి మమ్మల్ని మా మామయ్య ఇంటికి తీకుసువెళతానని చెప్పి వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో బాగా అలిసిపోయి ఒకచెట్టుకింద విశ్రాంతి కోసం పడుకున్నాం. లేచి చూస్తే మా తండ్రి జాడ కనిపించలేదు. మేము దుర్గాపూరుకు వెళ్ళడం ఎలాగో తెలియడంలేదు," అని తమ స్థితిని వివరించింది ఉమాబీ.

"విచారించకండి. ప్రస్తుతానికి మీరు నా వద్దే ఉండవచ్చు. నేనూ ఒంటరిదాన్నే. మంచి రోజున వచ్చారు. మీకు మంచే జరుగుతుంది. మొదట వెళ్ళి ఆ కొలనులో స్నానం చేసిరండి. సూర్యుడికి పూజ చేయవచ్చు," అన్నది అవ్వ.

ఆ తరవాత ఆమె వాళ్ళకు దుస్తులు తెచ్చి ఇచ్చింది.వాళ్ళు కొలను వద్దకు వెళ్ళి, కొలనులో అడుగుపెట్టగానే కొలనులోని నీళ్ళు కనిపించకుండా పోయాయి. దిగ్భ్రాంతి చెందిన అక్కచెల్లెళ్ళు తిరిగివచ్చి, అవ్వకు జరిగిన వింత సంగతి చెప్పారు. "అదేం ఫరవాలేదు. అది చాలా మహిమగల కొలను. సూర్యుణ్ణి తలుచుకుంటూ భక్తితో ఈ దర్భలను మొదట ఆ కొలనులో వేయండి. నీళ్ళు పొంగి వస్తాయి," అంటూ నాలుగు దర్భపోచలను వాళ్ళకు ఇచ్చింది అవ్వ.

వాళ్ళు అలాగే ఆ దర్భలను వేయగానే కొలను నుంచి నీళ్ళు గబగబా పైకి పొంగి రాసాగాయి.సూర్యుడికి అడ్డుగా ఉన్న మేఘాలు తొలగిపోవడంతో, సూర్యుడి వెలుతురు వాళ్ళ మీద బంగారు కాంతులు వెదజల్లాయి. సూర్యుడు తమను కరుణించాడని అక్కచెల్లెళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు. నిండిన కొలనులో స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి అవ్వ వద్దకు తిరిగి వెళ్ళారు. అవ్వ చెప్పినట్టు సూర్యపూజ చేశారు. ఆ తరవాత అవ్వ ఇచ్చిన పళ్ళూ, ఫలహారాలూ తిన్నారు.

అవ్వతో కలిసి ఉంటూ, ఆమెకు ఇంటి పనులలో సాయపడసాగారు. వాళ్ళ మంచితనం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా భోజనం పెట్టేవారు. గ్రామస్థులందరూ వాళ్ళను ఆదరించసాగారు. వాళ్ళు అక్కడే పెరిగి పెద్దవారయ్యారు.
ఇలా ఉండగా ఒకనాడు రాజకుమారుడూ, అతడి మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడూ ఆ మార్గం గుండా రావడం జరిగింది. వేటకు వెళ్ళి తిరిగివస్తూ, దాహం కావడంతో ఆ గ్రామం వద్ద ఆగారు. వాళ్ళకు ఈ అక్కచెల్లెళ్ళు కనిపించడంతో, గుర్రాలపై నుంచి దిగి, నీళ్ళడిగి దాహం తీర్చుకున్నారు.

అందమైన ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు తమ పట్ల ఎంతో గౌరవమర్యాదలు కనబరచినందుకు, రాజకుమారుడూ, మంత్రి కుమారుడూ ఎంతో సంతోషించారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా అని అడుగగా, తమ అవ్వ వంటచెరకు కోసం అడవికి వెళ్ళినట్టు చెప్పి, ఆమె వచ్చేంతవరకు వాళ్ళను ఉండమని అక్కచెల్లెళ్ళు కోరారు. ఉదయం బయలుదేరిన తాము త్వరగా రాజభవనానికి తిరిగి వెళ్ళాలని ఆ యువకులు చెప్పినప్పుడే వాళ్ళు ఎవరన్న విషయం అక్కచెల్లెళ్ళకు తెలియవచ్చింది.

కొన్ని రోజుల తరవాత, రాజభవనం నుంచి అవ్వ వద్దకు భటులను వెంటబెట్టుకుని ఇద్దరు మంత్రులు వచ్చారు. యువరాజూ, ప్రధాన మంత్రి కుమారుడూ అవ్వ ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కచెల్లెళ్ళను వివాహమాడడానికి ఆశపడుతున్నట్టు చెప్పారు. ఆమాట విన్న అవ్వ పరమానందం చెందింది. అక్కచెల్లెళ్ళు కూడా అమితానందానికి లోనయ్యారు. అయినా, అవ్వను వదిలి వెళ్ళవలిసి వస్తున్నందుకు లోలోపల చింతించారు.

ఉమాబీ యువరాజును వివాహమాడబోతున్నానన్న ఆనందంతో తనను రాజధానికి తీసుకువెళ్ళడానికి రథాన్ని తెమ్మన్నది. జుమాబీ పల్లకీలో బయలుదేరింది. సూర్యుణ్ణి పూజించడం వల్లే తమకీ అదృష్టం కలిగిందని భావించిన జుమాబీ రాజధానిలో కూడా సూర్య పూజను కొనసాగించడానికి పూజా పాత్రలను, సామాగ్రిని తనవెంట భక్తితో తీసుకువెళ్ళింది.

రాజకుమారుడితో వివాహం జరుగబోతున్నదన్న ఉత్సాహంలో సూర్యపూజను మరిచిన ఉమాబీ పయనం సాఫీగా జరగలేదు. ఆమె రాజధానికి చేరేసరికి బాగా ఆలస్యమయింది. రాజకుమారుడితో వివాహమయింది గాని, నిర్ణయించిన శుభముహూర్తంలో మాలలు మార్చుకోలేక పోయారు. మహారాణి దానిని రాజ్యానికి అపశకునంగా భావించింది.

జుమాబీకి ప్రధాన మంత్రి కుమారుడితో నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం, జుమాబీ కోరికమేరకు, ఆమె అన్నాళ్ళు గడిపిన గ్రామంలోని ప్రజలకు ఆమె భర్త తీపి ఫలహాలను పంపాడు. రాజభవనం నుంచి అలాంటి వేమీ రాకపోయేసరికి గ్రామస్థులతో పాటు అవ్వ కూడా విస్మయం చెందింది. అంతలోనే ఉమాబీ తమను మరిచిపోయిందేమిటా అనుకున్నారు.

ఒక సంవత్సరం గడిచినా ఉమాబీకి సంతానం కలగకపోయేసరికి, మహారాణికి కోపం వచ్చి, ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ ఆ గ్రామంలోనే వదిలి పెట్టిరమ్మని కొడుకును కోరింది. యువరాజు సమస్యను తన మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడితో చర్చించాడు. మంత్రికొడుకు ఆ సంగతిని తన భార్య జుమాబీకి చేప్పాడు. జుమాబీ కొంతసేపు ఆలోచించి, "ఉమాబీని మళ్ళీ ఆ గ్రామానికి పంపవద్దు. నేను గర్భవతిగా ఉన్నాను కదా. మా అక్కను ఇక్కడికి పిలిచుకువస్తే, ప్రసవ సమయంలో నాకు తోడుగా ఉంటుంది," అని భర్తకు సలహా ఇచ్చింది. ఆ విధంగా ఉమాబీ మళ్ళీ తన చెల్లె వద్దకు చేరింది.

అలా ఉన్నప్పుడు అక్కచెల్లెళ్ళు, తండ్రి తమను అడవిలో వదిలి వెళ్ళడం, తాము గ్రామం చేరి అవ్వ ఇంట పెరిగి పెద్ద వాళ్ళవడం మొదలైన విషయాలను తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరూ సూర్యుడికి భక్తితో పూజలు జరిపి ప్రార్థించారు. కొన్నాళ్ళకు జుమాబీ మగశిశువును ప్రసవించింది. ప్రధానమంత్రి గృహంలో వేడుకలు ఆరంభమయ్యాయి. ఆ వేడుకల్లో పాల్గొనడానికి తన మిత్రుడు ఆహ్వానించడంతో రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడ తన భార్యను చూడగానే యువరాజు మనసులో పశ్చాత్తాపం మొదలయింది. వెంటనే ఆమెను రాజభవనానికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాడు.

భార్యను వెంటబెట్టుకుని రాజభవనంలో ప్రవేశించిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు ఎంతో సంతోషించారు. ఇన్నాళ్ళు కోడలు తమ వద్ద లేకపోయినందుకు బాద పడ్డారు. ఆమెను రాజభవనం నుంచి వెళ్ళగొట్టినందుకు మహారాణి పశ్చాత్తాప పడింది. జుమాబీ ఇంట ఉన్నప్పుడు రోజూ సూర్యదేవుణ్ణి ప్రార్థించడం వల్లే, తనవారిలో మంచి మార్పు వచ్చి, తనకు మళ్ళీ మంచి రోజులు ఆరంభమయ్యాయని ఉమాబీ గ్రహించింది. రాజభవనంలోనూ సూర్యభగవానుణ్ణి పూజించడం ప్రారంభించింది. సంవత్సరం తిరిగే సరికి పండంటి మగబిడ్డను ప్రసవించింది.

న్యాయాధికారి చాతుర్యం

రామవరం గ్రామంలోని కూర్మయ్య ఒంటెద్దు బండి మీద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు.సాయంకాలానికి కూరగాయలు మిగిలితే,వాటిని కాస్త తక్కువ ధరకు అమ్మటం,లేదా తన ఎద్దుకు మేతగా వేయటం కూర్మయ్య అలవాటు.అందువల్ల అతడి వద్ద కూరగాయలు తాజాగా ఉంటాయని పేరు వచ్చింది.

ఒకనాడు తన ఆరోగ్యం బాగుండక పోవడంతో,కూర్మయ్య కూతురు పూర్ణమ్మను తోడు తీసుకుని బయలుదేరాడు.మధ్యాన్నం వరకు నాలుగు ఊళ్ళు తిరిగి వ్యాపారం చూసుకుని ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రీ కూతుళ్ళకు ఒక కాలువ పక్కన గల ముళ్ళపొదను తమ గ్రామానికి చెందిన పట్టయ్య ముల్లుకర్రతో పొడుస్తూ కనిపించాడు.దాన్ని చూసిన కూర్మయ్య,"ఏమిటి పట్టయ్యా,వెతుకుతున్నావు? కుందేలు గాని కనబడిందా?" అని అడిగాడు కుతూహలంగా.

"కుందేలు కాదు; మంచిరకం తాబేలొకటి కాలువలోంచి బయటకు వచ్చి,ఇప్పుడే ఈ పొదలో దూరింది," అంటూ వెతకసాగాడు పట్టయ్య.

తాబేలు అనగానే భక్తితో చెంపలు వేసుకున్న కూర్మయ్య,"పట్టయ్యా,దాన్ని ఏమీ చేయకు.కూర్మనాథస్వామి మా కులదైవం.నీకు కావాలంటే డబ్బిస్తాను.దాన్ని నాకు ఇవ్వు," అంటూ రొండిన దోపుకున్న ఆకుపచ్చరంగు డబ్బు సంచీని వెలుపలికి తీశాడు.డబ్బును చూడగానే ఎంతో సంతోషించిన పట్టయ్య,అంతలో వెలుపలికి వచ్చిన తాబేలును కూర్మయ్యకు అప్పగించి,డబ్బు పుచ్చుకుని తన దారిన వెళ్ళిపోయాడు.

అంతవరకు నాలుగు కాళ్ళనూ,తలనూ లోపలికి లాక్కున్న తాబేలు,పూర్ణమ్మ దాన్ని ఆప్యాయంగా చేత్తో నిమరడంతో,తలను బయటపెట్టి అటూ ఇటూ వింతగా చూడసాగింది.

"నీకు ఎలాంటి భయమూ వద్దు.నీ గాయాలకు మందు రాసి మెత్తని గుడ్డచుడతాను.కొన్ని రోజులు మా ఇంట్లో విశ్రాంతి తీసుకో," అంటూ కూర్మయ్య తాబేలును కూతురు దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని,బండిలోని ఖాళీ గంపలో ఉంచాడు.

తరవాత కొద్ది రోజులకే గాయాలు మానడంతో తాబేలు ఎంతో ఆరోగ్యంగా తయారయింది.కూర్మయ్య దానిని భక్తితో తీసుకువెళ్ళి రామవరానికి ఉత్తరంగా ప్రవహిస్తూన్న కృష్ణానది పాయలో వదిలి వచ్చాడు.

ఇది జరిగిన మూడో రోజు ఒక వింత సంఘటన జరిగింది.పట్టణంలోని జమీందారు దివాణం నుంచి ఒక న్యాయాధికారి కూర్మయ్య ఇంటికి వచ్చి అతడి పూర్వీకుల వివరాలు అడిగాడు.

"మా నాన్నకు ముగ్గురన్నదమ్ములు,ఒక అక్కగారు.వాళ్ళ నాన్నకు అంటే మా తాత గారికి అన్నదమ్ములు లేరుగాని ఒక చెల్లె ఉండేదట.వాళ్ళ తాత రాజుగారి ఆస్థానంలో మల్లయుద్ధ వీరుడుగా పేరు పొందాడట.ఆయన పేరు జెట్టి జగ్గయ్య అని చెప్పుకునేవారు;ఆయన రాజుగారి నుంచి ఘనంగా సన్మానాలు కూడా అందుకున్నాడట," అంటూ కూర్మయ్య తన తండ్రి తాతలు చిన్నప్పుడు చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ వివరించాడు.

"కూర్మయ్యా,నువ్వు చెప్పే సంగతులు వాస్తవాలేనని రుజువు చేయడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా?" అని అడిగాడు న్యాయాధికారి.

"ఉన్నాయి బాబూ," అంటూ కూర్మయ్య ఇంటిలోపలికి వెళ్ళి, పాత ఇనుప పెట్టెలో దాచిన తమ వంశవృక్షం వివరాలు గల తాళపత్రం తెచ్చి చూపించాడు.

న్యాయాధికారి తన చేతి సంచీలోంచి ఒక కాగితం తీసి,కూర్మయ్య ఇచ్చిన తాళపత్రంతో పోల్చి చూసి,"కూర్మయ్యా, నేను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తివి నువ్వే.నువ్వు చాలా అదృష్టవంతుడివి.నీకు నీ పూర్వీకుల నుంచి పెద్ద ఆస్తి సంక్రమించింది. నీ ఆస్తిని నీకు అప్పగించమని జమీందారు నన్ను పంపారు.వెంటనే పట్నం బయలుదేరు," అన్నాడు సంతోషంగా.

ఆ విధంగా కూర్మయ్య కుటుంబం ఒక్క నెల తిరిగేసరికి పట్నంలోని పెద్ద భవంతికి చేరి ధనవంతుల కుటుంబంగా పేరుపొందింది.కూర్మయ్యకు పట్టిన అదృష్టం గురించి రామవరంలో గొప్పగా చెప్పుకోసాగారు.

ఒక సంవత్సరం రోజులు గడిచిపోయాయి.ఒకనాటి ఉదయం కూర్మయ్య ఇంటి ముందు పదిమంది చేరి ఏదో గొడవ ప్రారంభించారు.ఇంతకూ,ఆ గొడవ చేస్తున్న వాళ్ళు కూర్మయ్య స్వగ్రామమైన రామవరానికి చెందిన పట్టయ్య; అతడి కొడుకు మల్లయ్య.

"మనిషంటే మాట మీద నిలబడాలి.ఈ రోజు నాలుగు డబ్బులు వచ్చినంత మాత్రాన ఇచ్చిన మాట తప్పుతావా? అయినా నీ నడమంత్రపు సిరి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు?నేనిచ్చిన తాబేలు ద్వారా పట్టిన అదృష్టంవల్లనే కదా? ఆ సంగతి ఇంతలోనే మరిచిపోయావా?" అని పట్టయ్య నానా రభస చేస్తున్నాడు.

"ఇంతకూ నన్ను ఏం చేయమన్నావు పట్టయ్యా?" అని అడిగాడు కూర్మయ్య నెమ్మదిగా.

"ఎమీ ఎరగనట్టు ఏమిటా నంగనాచి మాటలు?నీ కూతురు పూర్ణమ్మను నా కొడుకు మల్లయ్యకిచ్చి పెళ్ళి చేస్తానన్నావు కదా? ఇప్పుడు కాదంటావేమిటి? పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా," అన్నాడు పట్టయ్య.

"ఇదిగో పట్టయ్యా,మేము పట్నం వచ్చాక, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేయమని చాలా సార్లు వచ్చావు.అందుకు నేను ఒప్పుకోలేదని ఈ నాటకం ఆడుతున్నావా?" అన్నాడు కూర్మయ్య కోపంగా.

"నువ్వు అలా అంటావనే మన ఊరి వాళ్ళను వెంట బెట్టుకు వచ్చాను," అన్నాడు

పట్టయ్య వాళ్ళకేసి చేయి చూపుతూ.వాళ్ళందరూ,"అవును,పట్టయ్య కొడుక్కు నీ కూతురునిచ్చి పెళ్ళి చెయ్యాల్సిందే," అన్నారు ఒక్కసారిగా.

వాళ్ళ అబద్ధపు మాటలకు తండ్రీకూతుళ్ళు దిగ్భ్రాంతి చెంది,ఒకరినొకరు చూసుకోసాగారు.దాన్ని అవకాశంగా తీసుకుని,"ఏమిటి పూర్ణమ్మా,మీ నాన్నలాగా నువ్వూ మమ్మల్ని మరిచిపోయావా?" అన్నాడు పట్టయ్య వ్యంగ్యంగా.

పూర్ణమ్మ మౌనంగా తలవంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.అంతలో అక్కడ జరుగుతూన్న గొడవకు చుట్టు పక్కల వాళ్ళు గుమిగూడారు.కూర్మయ్యను మాట్లాడనీయకుండా పట్టయ్య చిందులు వేస్తూ ఏవేవో చెబుతున్నాడు.

కొంతసేపటికి న్యాయాధికారి అటుకేసి రావడంతో సద్దు మణిగింది.న్యాయాధికారి పట్టయ్య చెప్పినదంతా సావధానంగా విని తల పంకించి,"మీ అబ్బాయి మల్లయ్యకూ,కూర్మయ్య కూతురు పూర్ణమ్మకూ పెళ్ళి ఖాయమయిందనీ,ఇంతలో ఎదురు చూడని ఆస్తి కలిసి రావడంతో కూర్మయ్య ఇచ్చిన మాట తప్పాడంటావు.అదే నిజమయితే,కూర్మయ్య చేసింది తప్పే కదా!" అన్నాడు.

"ధర్మ ప్రభువులు న్యాయం చిటికలో గ్రహించారు.తమరే నాకు న్యాయం జరిగేలా చూడాలి," అన్నాడు పట్టయ్య.

అదే సమయంలో ప్రముఖ బట్టల వ్యాపారి రామలింగయ్య హడావుడిగా అక్కడికి వచ్చి, "ఏమిటీ, నేను విన్నది నిజమేనా? పూర్ణమ్మకు ద్వితీయ వివాహమా!" అని కూర్మయ్యను నిలదీశాడు.ఏం జరుగుతున్నదీ తెలియక కూర్మయ్యకు నోట మాట రాలేదు.

"ఏమిటి మీరనేది? కాస్త వివరంగా చెప్పండి రామలింగయ్యా," అని అడిగాడు న్యాయాధికారి.

"పూర్ణమ్మకూ, మా అబ్బాయికీ ఇదే ఊళ్ళో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది," అన్నాడు రామలింగయ్య.

"నిజంగానే పూర్ణమ్మకు ఆరు నెలల క్రితం మీ అబ్బాయితో వివాహం జరిగి ఉన్నట్టయితే,పట్టయ్య చేసే ఆరోపణలు చెల్లవు," అన్నాడు న్యాయాధికారి గంభీరంగా.

సరిగ్గా అప్పుడే ఒక వృద్ధుడు జనంలోంచి ముందుకు వచ్చి, పట్టయ్యను పరిశీలనగా చూస్తూ,"ఒరే పట్టయ్యా,నీ పాపిష్ఠిబుద్ధులు ఇంకా పోలేదా? ఎడా పెడా అప్పులు చేసి ఊరి నుంచి పారిపోయావు కదా? మళ్ళీ ఎప్పుడు వచ్చావు?" అన్నాడు.

పథకం బెడిసి కొట్టి,పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో పట్టయ్య అక్కడి నుంచి పారిపోవడానికి చూశాడు. కాని కొందరు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. మల్లయ్యతో సహా అతడి వెంట వచ్చిన గ్రామస్థులు దిక్కుకొకరు పారిపోయారు.

"ఇలాంటి దుష్టుణ్ణి కఠినంగా శిక్షించాలి.వదిలిపెడితే పలువురు అమాయకులు నష్టపోతారు," అన్నారు న్యాయాధికారితో అక్కడ చేరిన వాళ్ళు.పట్టయ్యకు మూడు నెలల కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి.

సమయానికి వచ్చి కాపాడిన న్యాయాధికారికి కూర్మయ్య కృతజ్ఞతలు తెలియజేశాడు.

"నీలాంటి నిజాయితీ పరులకు దుష్టుల వల్ల సమస్యలు ఎదురైనా అవి మంచు తెరల్లా తొలగిపోతాయి.అయినా సమయానికి నేనిక్కడికి రావడానికి కారణం నీ కుమార్తె పూర్ణమ్మ.వీధిలో గొడవ పడుతూంటే, ఆమె పెరటి దారిగుండా ధైర్యంగా వచ్చి, నన్ను చూసి సంగతి వివరించి సాయం అర్థించింది.పట్టయ్య అసూయతో నిన్ను వంచించడానికి పథకం వేశాడని గ్రహించాను.నా మనుషులతో నాటకం ఆడించి, దోషిని పట్టుకుని శిక్షించగలిగాను," అన్నాడు న్యాయాధికారి.

చిన్నగా నవ్వుతూన్న తన కుమార్తెను అభినందిస్తూన్నట్టు చూశాడు కూర్మయ్య.

నిక్కచ్చి మనిషి

విష్ణుపురంలో వున్న శకారుడనే భాగ్యవంతుడికి కొన్ని నియమాలున్నాయి.ఆ ప్రకారం,ఆయన ఏరోజైనా,అడిగినవారికి వీలైనంతలో ధనసాయం చేస్తాడు; ఒక్క శుక్రవారం తప్ప.ప్రాణం మీదికొచ్చినా, తన కోసం అప్పు చెయ్యడు.నియమాలను పాటించడంలో ఖచ్చితంగా వుంటాడని,తెలిసినవాళ్ళాయన్ను నికచ్చి మనిషి అంటారు.

ఆ ఊళ్ళోనే శకారుడి బాల్య స్నేహితుడు జోగిరాజు వుంటున్నాడు.ఒకప్పుడు బాగా బ్రతికిన ఆయనకు, కొంత కాలంగా అటు వ్యాపారంలోనూ,ఇటు వ్యవసాయంలోనూ ఏదీ కలిసిరాక వున్న ఇంటినీ,పొలాన్నీ తాకట్టు పెట్టాడు. పరిస్థితులిలాగే కొనసాగితే, ఓ ఏడాదిలో తన బ్రతుకు వీధిన పడుతుందని బెంగపెట్టుకున్నాడాయన.మిత్రుడు శకారుడి నడిగితే,అవసరానికి తననాదుకుంటాడని,ఆయనకు తెలుసు.ఐతే,అభిమానధనుడైన జోగిరాజు,తన సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలనుకున్నాడే తప్ప,ఎవర్నీ దేహీ అనే ఉద్దేశంలోలేడు.

అలాంటి సమయంలో ఆ ఊరుకు సుదర్శనుడనే త్రికాలవేది వచ్చి,ఆలయ ప్రాంగణంలో విడిది చేశాడు.ఊరివాళ్ళాయన్ను కలుసుకుని తమ ఇబ్బందులు చెప్పుకుంటే,సుదర్శనుడు దివ్యదృష్టితో భవిష్యత్తులోకి చూసి,వారికి తరుణోపాయం చెబుతున్నాడు.

జోగీరాజు కూడా ఆయనకు తన కష్టాలు చెప్పుకోగా, "నువ్వు దేవుణ్ణి నమ్ముతావు.కానీ ఇంతవరకూ దైవకార్యాలకు ఒక్క దమ్మిడీ కూడా ఖర్చు చేయలేదు.అదే నీ కష్టాలకు కారణం.నమ్మకమున్న చోట వితరణ కూడా వుండాలి.నువ్వు ఓ శుక్రవారం నాడు,నూరు వరహాలు విలువ చేసే దేవుడి కంచుబొమ్మను డబ్బిచ్చి కొని,పూజామందిరంలో ప్రతిష్ఠించి పూజించు. మర్నాడా విగ్రహాన్ని ఎవరికైనా లాభానికి అమ్మగలిగితే, నీకు దశ తిరిగిపోతుంది," అన్నాడు సుదర్శనుడు

ఇది జోగిరాజుకు పక్కనేవున్న శకారుడికి నచ్చలేదు.ఆయన సాధువుతో, "స్వామీ! పూజామందిరంలో వుండే కంచువిగ్రహాల ధర రెండు వరహాలకు మించదు.ఆ తర్వాత,అప్పటికే ఒకసారి అమ్ముడు పోయిన ఆ బొమ్మనింకా హెచ్చు ధరకు కొనే వాళ్ళుంటారా? కాబట్టి తమరు,నా మిత్రుడికి వేరేదైనా సులభ మార్గం ఉపదేశించమని కోరుతున్నాను," అన్నాడు.

సుదర్శనుడు నవ్వి, "నాయనా! దైవలీలలు విచిత్రాలు. ఈ విషయమై ఇన్ని సందేహాలు వెలిబుచ్చిన నీవే,నీ మిత్రుడికి అన్నింటా సాయపడతావేమో! ఎవరు చూడొచ్చారు?" అన్నాడు.

అందుకు శకారుడు, "నా మిత్రుడికి డబ్బు అప్పివ్వగలనేమో కానీ,చిన్న కంచు విగ్రహాన్ని నూరు వరహాలిచ్చికొనే అవివేకాన్ని మాత్రం ప్రోత్సహించను," అన్నాడు.

ఆ మాటలు విని జోగిరాజు హతాశుడై,తనకు అదృష్ట యోగం లేదనే అనుకున్నాడు.తర్వాత సుదర్శనుడు,ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు.

ఒకనాటి మిట్టమధ్యాహ్న సమయంలో ఎండఫెళ్ళునకాస్తూంటే,శకారుడు,ఆయన భార్య చారుమతి వేడి భరించలేక పెరట్లోకి వచ్చి,మామిడిచెట్టు నీడలో కూర్చున్నారు.అప్పుడెవరో కొత్తవాడు వస్తే,పనివాడు వెళ్ళి పెరటి తలుపు తీసి అతణ్ణి, యజమాని వద్దకు తీసుకువచ్చాడు. ఆ వచ్చినవాడు శకారుడికి నమస్కరించి,మంచి నీళ్ళు కావాలని సైగ చేశాడు.చారుమతి చప్పున లోపలకు వెళ్ళి, ఓ లోటాతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది.అతడు గటగటా నీళ్ళు తాగి, శకారుడితో, "నా పేరు మాల్యుడు.నా వృత్తి వ్యాపారం.ఒంటెద్దు బండిలో దేశమంతా తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో లభించే విలక్షణమైన వస్తువులుకొని,ఒక ప్రాంతానివి మరో చోట అమ్ముతూంటాను.ఈ ఉదయమే ఈ ఊరొచ్చాను.సగం పైగా సరుకు అమ్ముడైంది.ఆ సంతోషంలో ఎండ ముదిరిందని చూసుకోలేదు.చెప్పలేనంత ఆకలిగా వుంది.పూటకూళ్ళ ఇంటికి దారి చూపిస్తారా?" అన్నాడు.

శకారుడు నవ్వి,"ఆకలితో వచ్చిన వాళ్ళకు ఆతిథ్యమివ్వడం,మా సంప్రదాయం.నీకు పూటకూళ్ళ ఇల్లే కావాలనుకుంటే మాత్రం నేను దారి చూపను; వెళ్ళి ఇంకెవరినైనా అడుగు," అన్నాడు.

మాల్యుడాయన మంచి మనసు అర్థం చేసుకుని,అక్కడే భోంచేస్తానన్నాడు.చారుమతి క్షణాల మీద వంట పూర్తి చేసి,మాల్యుడికి విందుభోజనం వడ్డించింది.మాల్యుడు భోంచేస్తూండగా,పొరుగింటి పుల్లయ్య పిలిచాడని,అక్కడకు వెళ్ళాడు శకారుడు.

మాల్యుడు భోజనం ముగించి చారుమతికి,తన బండిలో వున్న వస్తువులు చూపాడు.వాటిలో వేణువునూదే కృష్ణుడి కంచు విగ్రహ మొకటి,చారుమతిని ఆకర్షించింది.దాని ధర నూటపదివరహాలని తెలుసుకుని,"ఇంత చిన్న కంచు బొమ్మల ధర రెండు వరహాలకు మించదు. ఈ బొమ్మకేమైనా ప్రత్యేకత ఉందా?" అన్నది ఆశ్చర్యంగా.

మాల్యుడు చిరునవ్వు నవ్వి,"ఇది అక్బరు చక్రవర్తి కాలం నాటి విగ్రహం.మహా భక్తురాలు మీరాబాయి దీనికి కొంత కాలం పూజలు చేసి, ఓ భక్తుడికి దానం చేసిందంటారు!ఓ గృహస్థు దీన్ని నాకు తొంభై వరహాలకు అమ్మాడు.పదివరహాలు లాభమేసుకుని,నూరు వరహాలకు అమ్మాలనుకుంటున్నాను," అన్నాడు.

ఈ సమాధానానికి తృప్తి పడ్డ చారుమతి,"ఈ బొమ్మ చూడ ముచ్చటగా ఉంది.చేతిలో డబ్బుండాలి కానీ,మీరాబాయి పూజలందుకున్నందుకు, దీన్ని ఎంతయినా ఇచ్చికొనొచ్చు," అంటూ అతడి మాటలను సమర్థించింది.

మాల్యుడు వెంటనే,"అమ్మా!నేను చెప్పిన ధర ఇతరుల కోసం. నీకైతే ఈ బొమ్మను అమ్మలేను కానుకగా ఇస్తాను," అన్నాడు.

చారుమతి ఏదో అనబోయేంతలో శకారుడు,పుల్లయ్యతో కలిసి అక్కడికి వచ్చాడు.సంగతి విని,సాధువు సుదర్శనుడు చెప్పినట్లే,నూరు వరహాల చిన్న కంచు బొమ్మ,నిజంగానే తన ఇంటికి అమ్మకానికి వచ్చినందుకు ఆశ్చర్యపడుతూ,మాల్యుడికి,జోగిరాజు కథ చెప్పాడాయన.

బొమ్మను నూరు వరహాలకు అమ్మడానికి మాల్యుడు ఒప్పుకున్నాడు.శకారుడు వెంటనే జోగిరాజుకు కబురు పెట్టి రప్పించి,"ఈ రోజు శుక్రవారం.సాధువు చెప్పిన బొమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది.మారాలోచన లేకుండా వెంటనే కొనుక్కో,"అన్నాడు.

జోగిరాజు దిగాలు పడి,"ప్రస్తుతం నా దగ్గర ఒక్క వరహా కూడా లేదు.నా కోసం నువ్వింత శ్రమ తీసుకున్నావు.కానీ,దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవారు లేరనిగదా సామెత!" అన్నాడు.

"అలాగే,అదృష్టవంతుణ్ణి చెరిపేవారూలేరని సామెత వుందిగా!నీకు పుట్టని అప్పు,నాకు పుడుతుంది! ఏం పుల్లయ్యా?" అంటూ శకారుడు పక్కనే వున్న పుల్లయ్య వంక చూశాడు.

ఎప్పుడూ అడగని శకారుడు అప్పడిగేసరికి కాదన లేక, "రేపు నాకు అవసరం అయిన ఖర్చులున్నాయి.రేపటికి తిరిగి ఇచ్చేమాటైతే అలాగే ఇస్తాను," అన్నాడు పుల్లయ్య.శకారుడు సరేనన్నాడు.

ఆ విధంగా జోగిరాజు,మాల్యుడి దగ్గర నూరు వరహాలిచ్చి కంచుబొమ్మ కొని,సాధువు చెప్పినట్లే దాన్ని పూజామందిరంలో ప్రతిష్ఠించి పూజ చేశాడు.మర్నాడు శకారుడు జోగిరాజుకు నూట పది వరహాలిచ్చి కంచు బొమ్మను తీసుకుని,అతన్ని పుల్లయ్య బాకీ వంద వరహాలు తీర్చమని చెప్పి,బొమ్మను చారుమతికిచ్చాడు.

ఆమె నిష్ఠూరంగా,"చూశారా!నిక్కచ్చి మనిషనుకున్న మీకు,మాటనిలకడలేదని తెలిసి పోయింది.ప్రాణం మీది కొచ్చినా అప్పుచేయననే మీరు, నిన్న పుల్లయ్యను అప్పడిగారు!" అన్నది.

శకారుడు నవ్వి, "నా అవసరానికి అప్పు చేయకూడదన్నదే, నా నియమం.నేను పుల్లయ్య దగ్గర చేసిన అప్పు జోగిరాజు కోసమే తప్ప, నా కోసం కాదు. ఈ వ్యవహారంలో నేను నా నియమాలన్నీ ఖచ్చితంగా పాటించానే తప్ప,నియమభంగం చెయ్యలేదు.కాదంటావా?" అని అడిగాడు.

చారుమతి చిరునవ్వు నవ్వి, "కాదని ఎలా అంటాను? స్వంతానికి అప్పు అడగరాదన్న నియమం కంటే కూడా,ఇతరుల కోసం అప్పడగవచ్చునన్న నియమం ఇంకా గొప్పది.సాధువు సుదర్శనుడు చెప్పాడని కాక,జోగిరాజుకు లభించిన డబ్బు,మీ వంటి ఉత్తముడి డబ్బుకావడం వల్ల,అది అక్షయమై,అతడి దశను మార్చగలదని నమ్ముతున్నాను,"అన్నది.

ఆమె అన్నట్లే అనతి కాలంలో,జోగిరాజుకు దశ తిరిగి,ఆ ఊరి గొప్ప భాగ్యవంతుల్లో ఒకడయ్యాడు.

నిజమైన స్నేహం

అచ్యుతాపురం గ్రామంలోని నారయణ,రాంబాబు మంచి స్నేహితులు.నారాయణ తండ్రి భూషయ్య గొప్ప ఆస్తిపరుడు.కాని పరమ పిసినారి.నారాయణ సాటి మనుషులకు సాయపడే మనస్తత్వం కలవాడు.ముఖ్యంగా బాల్యంలో కొన్నాళ్ళు కలిసి చదువుకున్న రాంబాబు అంటే అతనికి ప్రాణం.తల్లిదండ్రులు లేని రాంబాబుకు ఇల్లు తప్ప మరేదీ లేదు.రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.

పట్నంలో పైచదువులు చదువుకుంటూన్న నారాయణ వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చాడు.ఆ రోజు సాయంకాలం రాంబాబును చూడడానికి వెళ్ళాడు.రాంబాబు దుప్పటి కప్పుకుని పడుకుని మూలుగుతున్నాడు.నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరం.గ్రామంలోని వైద్యుడి దగ్గరికి వెళితే ఏవో మందులిచ్చాడు గాని,జ్వరం తగ్గలేదు.వైద్యం కోసం పక్కనే ఉన్న కృష్ణపట్నానికి వెళ్ళడానికి డబ్బుల్లేవు.

సంగతి తెలుసుకున్న నారాయణ ఇంటికి తిరిగివచ్చి,తండ్రికి విషయం చెప్పి, రాంబాబు వైద్యం కోసం డబ్బడిగాడు.ఆ మాట వినగానే భూషయ్య మండి పడి, "ఏమిటీ,నీ స్నేహితుడి వైద్యానికి డబ్బు కావాలా? ఇలా అందరికీ సాయం చేస్తూ పోతే,నాలుగు రోజుల్లో నేనూ వాళ్ళలా వీధిన పడవలసిందే,"అంటూ కొడుకును గట్టిగా మందలించాడు.

స్నేహితుడికి ఎలాగైనా వైద్యం చేయించాలన్న దృఢనిర్ణయంతో, నారాయణ వడ్డీ వ్యాపారి రంగనాథం వద్దకు వెళ్ళి,ఐదు వందల రూపాయలు అప్పు పుచ్చుకుని మిత్రుణ్ణి బాడుగ బండిలో కృష్ణపట్నానికి తీసుకు వెళ్ళాడు.వారం రోజుల్లో జ్వరం తగ్గి,రాంబాబు ఆరోగ్యం కుదుటపడింది.

 పదో రోజు ఉదయం వడ్డీ వ్యాపారి నారాయణను వెతు క్కుంటూ వచ్చి, "నారాయణ ఉన్నాడా?" అని అతని తండ్రి భూషయ్యను అడిగాడు.

"ఇంట్లో లేడు.అయినా,వాడితో నీకేంపని?" అని అడిగాడు భూషయ్య.

"వారంలో తిప్పి ఇస్తానని చెప్పి,మిత్రుడి వైద్యం కోసం ఐదు వందలు అప్పు చేశాడు.పది రోజులయింది.ఇంకా ఇవ్వలేదు," అన్నాడు వడ్డీ వ్యాపారి.

"అలాగా!" అంటూ ఆగ్రహంతో ఇంట్లో పలికివెళ్ళిన భూషయ్య,తన పరువు కాపాడుకోవడానికి ఐదు వందల రూపాయలు తెచ్చి వడ్డీవ్యాపారికిచ్చాడు.అతడు వెళ్ళిపోయాడు.

కొంతసేపటికి నారాయణ ఇంటికి రావడంతో,"ఏమిటి నీ నిర్వాకం! వడ్డీవ్యాపారి వద్ద అప్పు చేసి నా పరువు తీస్తావా?" అని నిలదీశాడు.

"నా మిత్రుడు ప్రాణాల మీదికి వస్తే,మరో మార్గం లేక అప్పు చేయవలసి వచ్చింది.ఇందులో పరువు ప్రసక్తి ఏముంది నాన్నా? డబ్బు, డబ్బు అంటూ నువ్వు సరైన సమయంలో వైద్యం చేయించకపోవడం వల్లే కదా అమ్మ కన్నుమూసింది.అయినా ఇంకా నీకు తెలిసి రావడం లేదు.అవసరాలకు పనికిరాని డబ్బు ఎందుకు? వెళ్ళేప్పుడు మూట గట్టుకు వెళతామా?" అన్నాడు నారాయణ బాధగా.

అంతలో అక్కడికి వచ్చిన రాంబాబు,"క్షమించండి, భూషయ్యగారూ.నా కారణంగా మీ మధ్య గొడవలు వద్దు.ఇదిగో వడ్డీవ్యాపారికి మీరిచ్చిన ఐదు వందల రూపాయలు. వడ్డీ వ్యాపారి దారిలో ఎదురుపడి సంగతి చెప్పాడు.మా ఇంటి పత్రాలు ఆయన వద్ద తాకట్టు పెట్టి ఈ ఐదు వందలు తెచ్చాను.మరో యేడాది కష్టపడితే పత్రాలు విడిపించుకోగలను," అన్నాడు.

ఆ తరవాత నారాయణకేసి తిరిగి, "సమయానికి వచ్చి ఆదుకుని నిజమైన స్నేహితుడనని నిరూపించావు.నీ రుణం తీర్చలేనిది.నీ మేలు ఈ జన్మకు మరిచిపోను," అన్నాడు రాంబాబు అతడి చేతులు పట్టుకుంటూ.

ఇద్దరి మిత్రుల స్నేహబంధాన్ని చూసిన భూషయ్యలో కూడా మార్పు వచ్చింది.ఆ రోజు నుంచి పిసినారితనం వదులుకుని అవసరాల్లో ఉన్న వారికి సాయపడడం అలవరుచుకున్నాడు.

ప్రయోజకుడు

చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శివుణ్ణి, అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది.బడిలో పిల్లలను కొట్టాడని పంతులు వాణ్ణి బడికి రానివ్వలేదు.దాంతో శివుడి చదువు సాగకపోగా వాడిలో మొరటుతనం పెరగసాగింది.

శివుడి అవ్వ రోజూ ఉదయం,సాయంకాలం మంగాపురం రామాలయం ఆవరణను శుభ్రం చేసేది.చింకి గోతాంను భుజాన వేసుకుని వీధుల్లో పడివున్న చెత్తను ఏరి,ఊరికి దూరంగా పోసేది.గ్రామస్థులు అవ్వ ఉండడానికి ఊరిచివర గుడిసె వేసి ఇచ్చారు.అవ్వ అందులో మనవడితో ఉంటూ,తీరిక సమయంలో చిరిగిన బట్టలనూ,తలకడలనూ కుట్టుకుంటూ జీవనం సాగించేది.శివుణ్ణి కష్టపడనిచ్చేది కాదు.దాంతో వాడు సోమరిపోతుగా తయారయ్యాడు.అందరూ వాణ్ణి,'పనికిరానివాడివి!' అని తిట్టేవారు.శివుడు అలాంటివారి మీద కోపంతో తిరగబడేవాడు.అలాంటి సమయాల్లో అవ్వ వాణ్ణి బుజ్జగించేది.

అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది.తనకు ఆఖరు ఘడియలు సమీపిస్తున్నాయని అవ్వ మనవణ్ణి దగ్గరికి పిలిచి,"నాయనా,శివయ్యా,అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధ పడి, వాళ్ళ మీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏదీ ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది.ఇవాళపనికిమాలినవాడివనిపించుకుంటూన్న నువ్వే,రేపు పదిమంది చేత ప్రయోజకుడివి అనిపించుకోవచ్చు.ఆ శ్రీరాముడే నీకు రక్ష," అంటూ కన్నుమూసింది.

అవ్వ పోయాక ఊరిజనం శివుణ్ణి మరింత చులకనగా చూడసాగారు.శివుడికి ఆ ఊళ్ళో మరిక ఉండాలనిపించలేదు.వేరెక్కడికైనా వెళ్ళి,తన సత్తా నిరూపించుకుని అవ్వ చెప్పినట్టు ప్రయోజకుడిగా ఆ ఊరికే తిరిగి రావా లని నిర్ణయించాడు.గుడిసెలో ఒక మూలగా అవ్వ ఉపయోగించిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూదీ కనిపించాయి.వాటిని చూడగానే శివుడికి,"ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు," అన్న అవ్వ మాటలు గుర్తుకు వచ్చాయి.గోతాన్ని తీసి భుజాన వేసుకుని,సూదిని తీసి దుస్తుల్లో భద్రం చేసుకుని శివుడు అక్కడి నుంచి బయలుదేరాడు.

వాడు కొంతదూరం ప్రయాణం చేశాక,ఒక చిట్టడవి ఎదురయ్యింది.కొంత సేపటికి శివుడితో ఒక పెళ్ళి బృందం వచ్చి కలిసింది.మరి కొంత దూరం వెళ్ళాక ఎదురుపడ్డ ఒక బాటసారి,"శుభకార్యానికి బయలుదేరినట్టున్నారు.నగానట్రా బాగా ఉంది.త్వరగా అడవిదాటండి.ఈ ప్రాంతంలో బందిపోట్ల బెడద ఎక్కువ," అని పెళ్ళివారితో చెప్పివెళ్ళాడు.

ఆ మాట వినగానే పెళ్ళివారికి గుండెదడ ఆరంభమయింది.వేగంగా నడవసాగారు.కొంతసేపటికి వాళ్ళకు గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది.వచ్చే వాళ్ళు దొంగలముఠా అని గ్రహించి హడలిపోయారు. అంతలో చింకి గోతాం భుజాన వేసుకుని నడుస్తూన్న శివుణ్ణి చూడగానే వాళ్ళలోని ఒక పెద్దాయన,"ఆడవాళ్ళందరూ ఒంటి మీద కొద్ది పాటి నగలే ఉంచుకుని,మిగతా వాటిని ఈ చింకి గోతాంలో పడేయండి," అన్నాడు.క్షణాలలో వాళ్ళా పని చేశారు.తరవాత ఆ పెద్దాయన సంచీని శివుడి చేతికిచ్చి,"దీన్ని నీ భుజాన వేసుకుని ముందు నడిచిపో," అన్నాడు.శివుడు అలాగే నడవసాగాడు.అంతలో గుర్రాల మీద వచ్చిన దొంగలు, పెళ్ళివారి ఒంటి మీదున్న నగలను దోచుకున్నారు.దొంగల నాయకుడి దృష్టి, శివుడి చింకి గోతాం మీద పడడంతో,"ఏముంది ఆ గోతాంలో?" అని గద్దించి అడిగాడు.

"చూస్తే తెలియడంలేదూ.మోయలేనన్ని కాసుల పేర్లూ, అరవంకీలు,ఒడ్డాణాలు. ఉంటే ఏం చేస్తావు? దోచుకుంటావా?" అని ఆవేశంగా గెంతుతూ మొరటుగా సమాధానమిచ్చాడు శివుడు. ఆ మాటవిన్న దొంగల ముఠానాయకుడు,"వీడెవడో మతిచెడిన వెధవలా ఉన్నాడు.వీడి జోలికి వెళ్ళకండి," అంటూ గుర్రాన్ని అదిలించాడు.మిగిలిన దొంగలు వాణ్ణి అనుసరించివెళ్ళారు.

ఆ తరవాత శివుడి గోతాంలోని నగలను వెనక్కు తీసుకున్న పెళ్ళిబృందం వాళ్ళు,"భలే ధైర్యవంతుడివి.సమయానికి ఆదుకున్నావు," అంటూ శివుణ్ణి మెచ్చుకుని పది బంగారు కాసులు కానుకగా ఇచ్చారు.బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో శివుడు వేగంగా నడవసాగాడు.అడవిదాటి కొంత దూరం పోయేసరికి, వాడికి ఒక మామిడితోపు కనిపించింది.అక్కడున్న కొందరు ఆందోళనతో గుసగుసలాడుకోవడం గమనించిన శివుడు కారణం అడిగాడు.

"మహారాజును దర్శించుకుని తిరిగి వస్తూన్న మా మణికంఠపురం జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు.కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు విడిచినప్పుడు ముల్లు గుచ్చుకుంది.ఎలా తీయాలో పాలుపోవడం లేదు," అన్నారు వాళ్ళు దిగులుగా.

"ఓస్, ఇంతేనా? మా అవ్వ నా కాలికి గుచ్చుకున్న ముళ్ళు ఎన్ని తీయలేదు? తప్పుకోండి," అంటూ దుస్తుల్లో దాచిన సూదిని తీసుకుని ముందుకు వెళ్ళిన శివుడు,జమీందారు కాలినుంచి ముల్లును సూదితో చటుక్కున తీసేశాడు.వాడి దుందుడుకుతనానికి మొదట చీదరించుకున్నప్పటికీ, క్షణంలో ముల్లు తీసేయడం వల్ల జమీందారు వాణ్ణి మెచ్చుకున్నాడు.

ఆలోగా అక్కడికి చేరుకున్న పెళ్ళిబృందం వాళ్ళు, అడవి మార్గంలో శివుడు తమకు చేసిన సహాయం గురించి జమీందారుకు చెప్పారు.

ఆ మాట విని మరింతగా సంతోషించిన జమీందారు శివుడి వివరాలు అడిగి తెలుసుకుని,"అంటే,నీది మంగాపురమా? అది మా జమీలోని గ్రామమే.కొంతకాలంగా శిస్తులు సరిగ్గా వసూలు కావడం లేదు.శిస్తులు వసూలు చేసే అధికారికి నీలాంటివాడి సాయం కావాలి.నిన్ను అతడికి సహాయకుడిగా నియమిస్తున్నాను.ఆ ఉద్యోగంలో చేరుతావా?" అని అడిగాడు.

శివుడు సంతోషంతో సరేనన్నాడు.కొన్నేళ్ళ తరవాత శిస్తులు వసూలు చేసే అధికారిగా మంగాపురం వెళ్ళినప్పుడు గ్రామాధికారితో సహా గ్రామస్థులందరూ గౌరవంతో తనను "శివయ్యగారూ," అని పిలవడం చూసి శివుడు ఆశ్చర్యపోయాడు."ఈరోజు పనికిమాలినవాడివని నిన్ను హేళన చేసినవారే రేపు ప్రయోజకుడివని మెచ్చుకోగలరు," అన్న అవ్వ దీవెనలు నిజమైనందుకు శివుడు లోలోపల ఎంతగానో సంతోషించాడు.

నేనెవరిని?

భధ్రయ్య నెమ్మదస్తుడు; అంతకు మించి భయస్తుడు! చిన్నతనంలోనే తల్లి తండ్రులు పోయిన భద్రయ్యను అతని తాత పెంచి పెద్ద చేశాడు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి, వాటిని దగ్గరలో ఉన్న పట్నంలో అమ్ముతూ, గుట్టుగా సంసారం నెట్టుకువస్తున్నాడు.భద్రయ్యకు చంద్రకాంతతో పెళ్ళయిన ఏడాదిలోగా అతడి తాత చనిపోయాడు.

భద్రయ్య కట్నంతీసుకోలేదు గాని, చంద్రకాంత తల్లిదండ్రులు స్త్రీ ధనంగా ఆమెకు యాభైవేల రూపాయలు ఇచ్చారు. ఒక రోజు రాత్రి భర్తకు విస్తరిలో అన్నం వడ్డిస్తూ, "ఎన్నాళ్ళిలా ఎదుగూ బొదుగూ లేని బతుకు గడుపుతాం. నా దగ్గర యాభైవేల రూపాయలు ఉన్నాయి కదా? మనకున్న ఆ ఎకరం పొలం కూడ అమ్మేసి పట్నం వెళ్ళి, అక్కడ ఏదైనా చిన్న పచారీకొట్టు పెట్టుకుందాం," అన్నది చంద్రకాంత.

"పట్నంలో ఇంటి అద్దెలు విపరీతం కదా?" అన్నాడు భద్రయ్య.

"రేపు సొరకాయలు అమ్మేశాక, ఊరికి పెడగా,చౌకలో అద్దె ఇల్లు దొరుకుతుందేమో చూడు. ఈ కార్తీక మాసంలోనే వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజులు ఉన్నాయట," అన్నది చంద్రకాంత.

మర్నాడు అదేవిధంగా పట్నం సంతలో వ్యాపారం ముగించుకుని, భద్రయ్య ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు.తాను అనుకున్నంత తక్కువ అద్దెలో ఎక్కడా ఇల్లు కనిపించలేదు.సాయంకాలానికి పట్నం చివరలో ఒక పాతకాలపు ఇల్లు కనిపించింది.భద్రయ్య ఆ ఇంటిని సమీపించి, నాలుగుసార్లు తలుపు తట్టిన మీదట,ఒక ముసలాయన,"ఏం కావాలి?" అంటూ తలుపు తెరిచాడు.

"మీ ఇంట్లో అద్దెకు వాటా ఏమయినా ఉందా?" అని అడిగాడు భద్రయ్య.

ముసలాయన భద్రయ్యను ఎగాదిగా చూసి,"నేను ఈ ఇల్లు అమ్మేసి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెల క్రితమే దీనిని యాభైవేలకు కొన్నాను. అదే ధరకు నీకు ఇచ్చేస్తాను.కొంటావా?" అని అడిగాడు.

భద్రయ్య ఇల్లంతా తిరిగి చూశాడు. అంత పెద్ద ఇల్లు తమ పల్లెటూళ్ళో కూడ యాభైవేలకు రాదు. అయితే,ఉన్న సొమ్మును ఇంటికే పెట్టేస్తే వ్యాపారం ఎలాగా? అని అలోచించసాగాడు.

భద్రయ్య ఆలోచనలో పడటం చూసి,"పోనీ,నలభైవేలకే ఇస్తాను. వారంలోరా," అన్నాడు ముసలాయన.

మర్నాడు చంద్రకాంతను పట్నం తీసుకువెళ్ళాడు భద్రయ్య. విశాలంగా ఉన్న ఆ ఇంటినీ, పెరటి తోటనూ,ఏపుగా పెరిగి ఉన్న కొబ్బరి, మామిడిచెట్లనూ చూసి మురిసిపోయింది చంద్రకాంత.పొలం అమ్మిన డబ్బుతో భార్యాభర్తలు ఇల్లు కొనేశారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. ఉన్న సామానులను ఆ ఇంట్లో అందంగా సర్దింది చంద్రకాంత.రెండు కిటికీలున్న పెద్ద గదిలో పందిరిమంచం వేసింది.

ఆ రాత్రి భోజనం చేశాక,"ఇది మనసొంత ఇల్లు. వారం రోజులుగా అలిసిపోయాను. ఈ పూట హాయిగా నిద్రపోతాను," అన్నది చంద్రకాంత పెద్దగా ఆవులిస్తూ.

కిటికీలలోంచి చల్లటి గాలి వీస్తూండడంతో, పడుకోగానే నిద్ర ముంచుకు వచ్చంది భార్యాభర్తలకు. అర్ధరాత్రి కావస్తూండగా ఏదో భీకరశబ్దం వినవచ్చి,ఉలిక్కిపడిలేచారు. మంచం అదురుతోంది. గదిలో సామాను కంపిస్తోంది. అంతలో వికృతమైన నవ్వుతో పాటు,"నేనెవరిని?" అనే ప్రశ్న వినిపించింది.భయంతో గడగడలాడుతూన్న ఆ ఇద్దరికీ నోరు పెగలలేదు.

"చెప్పండి,నేనెవరిని?" అని రెట్టించింది ఆ భీకరస్వరం.

ముందుగా చంద్రకాంతే దైర్యం కూడ దీసుకుని,"మాకు తెలియదు," అన్నది మెల్లగా.

మరుక్షణమే ఇద్దరి వీపుల మీదా రెండు కొరడా దెబ్బలు పడ్డాయి. వీపు మీద వాతలు తేలి భగ్గుమనడంతో కెవ్వుమన్నారు.వాళ్ళ అరుపులు విని పెద్దగా నవ్వుతూ,"రేపు ఇదే వేళకు వచ్చి ఇదే ప్రశ్న వేస్తాను. సమాధానంతో సిద్ధంగా ఉండండి," అని హెచ్చరించిందా వికృతస్వరం.

ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్రలేదు. అక్కడ దయ్యం ఉండడం వల్లే, ఆ ముసలాయన చవగ్గా దానిని తమకు అంటగట్టాడని గ్రహించి, ఏం చెయ్యాలో తెలియక సతమత మయ్యారు.

మర్నాడు అర్ధరాత్రి అదే భీకరస్వరం "నేనెవరిని?" అని ప్రశ్నించింది.

"పిశాచానివి! దయ చేసి మమ్మల్ని భాధించకు," అని వేడుకున్నారు భార్యాభర్తలు.

అయినా కొరడా దెబ్బలు తగిలాయి.

మూడో రాత్రి "నేనెవరిని?" అన్న ప్రశ్నకు,"మా పాలిటి దేవుడివి. మమ్మల్ని కరుణించు," అన్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తప్పలేదు.

అది మొదలు ప్రతి రాత్రి, ఆ అదృశ్య స్వరం "నేనెవరిని?" అని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం చెప్పినా, ఎంతగా పొగిడినా వాళ్ళకు కొరడా దెబ్బలు తినక తప్పడం లేదు. ఈ భాధతో భద్రయ్య ఇంకా వ్యాపారం ఆరంభించనేలేదు.

ఇలా ఉండగా వాళ్ళ కొత్త ఇల్లు చూడడానికి చంద్రకాంత పిన్నమ్మ కొడుకు ఒక సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చుట్టి చూసి, "లక్షకు పైగా ఖరీదు చేసే ఇల్లు, నలభైవేలకు ఎలా వచ్చిందబ్బా?"అన్నాడు ఆశ్చర్యపోతూ.

భద్రయ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు.

తమ్ముణ్ణి తొందరగా పంపించేయాలని చంద్రకాంత చీకటి పడగానే అతనికి భోజనం పెట్టేసింది. అయినా అతడు వెళ్ళేలా కనిపించలేదు. ఆ కబురూ ఈ కబురూ చెబుతూ, గదిలో పడుకోవడానికి ఒక పక్కగా చాప వాల్చుకున్నాడు.

"నువ్వు ఊరికి బయల్దేరలేదా? ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా?"అని ఆదుర్దాగా అడిగింది చంద్రకాంత.

"అలా కంగారు పడతావేంటి? తెల్లవారాక పట్నంలో కొద్దిగా పని ఉంది నాకు," అన్నాడతడు.

"రాత్రికి ఇక్కడే ఉంటే, నీకూ కొరడా దెబ్బలు తప్పవు," అంటూ నోరు జారింది చంద్రకాంత. "కొరడా దెబ్బలేమిటి?" అని తెల్లబోయాడు అతడు.

భద్రయ్య కల్పించుకుని, "ఇంట్లో దోమలు ఎక్కువ.అవి కుడితే,కొరడాతో కొట్టినంత బాధగా ఉంటుందట మీ అక్కకు," అంటూ సర్ది చెప్పబోయాడు.

"అది కాదు," అంటూ చంద్రకాంత, తమ్ముడికి ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న తతంగమంతా చెప్పేసి," ముప్ఫై వేలు వచ్చినా ఈ ఇల్లు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నాడు మీ బావ," అన్నది.

"ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తోంది. ఇంటి బేరం సంగతి రేపు అలోచిద్దాం," అంటూ అతడు చాప మీదే గుర్రుపెట్టి నిద్రపోయాడు.

అర్ధరాత్రి కాగానే,గది అంతా కంపించి రోజూలాగే,"నేనెవర్ని?" అనే భీకరస్వరం వినిపించింది.

అంతవరకూ నిద్రపట్టక, మంచం మీద అటూ ఇటూ దొర్లుతూన్న భద్రయ్య, అదిరి పడిలేచి,"ఆంజనేయులూ....దయ్యం... దయ్యం..కాపాడు," అంటూ భయంతో బావమరిదిని పిలవసాగాడు.

బావమరిది ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.

"నేనెవరిని?"అని మళ్ళీ గద్దించింది భీకరస్వరం.

"నువ్వెవరివా? అసలు నేనెవరో నీకు తెలుసా? ఆంజనేయుల్ని! రోజూ నిద్రాభంగం కలిగించి మావాళ్ళను బాధిస్తూన్న నీ పని పట్టడానికే వచ్చాను. నిన్ను వదిలి పెట్టను. నాకు ఇప్పుడు నిద్ర ముంచుకువస్తోంది. నువ్వెవరో రేపు చెబుతాను," అన్నాడు ఆంజనేయులు.

"ఎప్పుడు చెబుతావు? ఎక్కడ చెబుతావు?" అని అడిగింది కంఠస్వరం.

"ఆ సంగతి ఇప్పుడే అడిగితే ఎలా? రేపు ఏ చింత చెట్టుకో నిన్ను బంధించి, మేకు దిగవేసేప్పుడో,... సీసాలో బంధించి, భూస్థాపితం చేసేప్పుడో.... నువ్వెవరివో చెబుతాను," అన్నాడు ఆంజనేయులు మరింత పెద్దగా నవ్వుతూ.

మరుక్షణమే కీచుమనే అరుపు, ఆ వెంటనే,"బాబ్బాబు, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు అన్నంతపనీ చేయకు," అనే మాటలతో పాటు దభీమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడడంతో మూట ముడి విడిపోయి బంగారు కాసులు మంచమంతా చిందరవందరగా పడిపోయాయి. అన్ని కాసుల్ని ఒక్కసారిగా చూడడంతో భద్రయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది. ఆంజనేయులు అతడి భుజం పట్టుకుని కుదపడంతో, "నేనెవరిని?" అన్నాడు అయోమయంగా చూస్తూ.

"నువ్వు భద్రయ్యవి. పైగా మగాడివి; ఈ ఇంటి యజమానివి! మనిషికి ఇంత పిరికితనం, మొహమాటం పనికిరాదు.భయపడేవాళ్ళనే ఎదుటివాళ్ళు మరింత భయపెడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకోని ఆ దయ్యం, నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. ఇన్నాళ్ళ మీ కష్టాలకు పరిహారం చెల్లించి మరీ వెళ్ళింది.దెబ్బకు దయ్యం జడుస్తుంది అంటారు కదా! ఇకపైనైనా ధైర్యంగా వ్యాపారం చేసుకో బావా," అన్నాడు ఆంజనేయులు నవ్వుతూ.

"నా కన్నా చిన్నవాడివైనా పెద్ద జీవితసత్యం చెప్పి, నా కళ్ళు తెరిపించావు," అని,ఆ తరవాత కొంత ఆలోచించి,"దయ్యం బాధ తొలగడమే కాకుండా, నీ మూలంగా అనుకోకుండా ధనమూ సమకూరింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రారంభించబోయే వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను.ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా," అంటూ భద్రయ్య బావమరిదిని మనసార మెచ్చుకున్నాడు.

అందుకు సమ్మతిఇస్తున్నట్టు ఆంజనేయులు చిన్నగా నవ్వాడు. 

దొరికిన దొంగ

రుద్రపూరు రాజైన జయపాలుడి భార్య రూపమతి వద్ద అపురూపమైన గులాబీ రంగు ముత్యాలహారం ఉండేది.అది అంటే ఆమెకు అమితమైన అభిమానం.

జయపాలుడు అదృష్టవంతుడు.అతని భార్య రూపమతి అందగత్తె.వారి కొడుకు శక్తిపాలుడు పదేళ్ళవాడు-వాడుకూడా అందగాడే.అతని ప్రజలు రాజంటే అభిమానం గలవారు.రాజ్యం సుభిక్షం.

ఒకనాడు జయపాలుడు సపరివారంగా వేటకు వెళ్ళాడు.మధ్యాన్నం దాకా వేట చక్కగా సాగింది.కాని మిట్ట మధ్యాన్నం అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో అతిదారుణమైన తుపాను వచ్చిపడింది.వేటకని తెచ్చిన ఏనుగులూ, గుర్రాలూ వశం తప్పాయి.రాజు ఎక్కిన రథం ఒక చెట్టుకు తగలటం వల్ల దాని చక్రం ఒకటి చిన్నాభిన్నమయింది.వెంటనే జయపాలుడు ఒక గుర్రం ఎక్కాడు.అది అదుపు తప్పి, చిత్తం వచ్చినట్టు, దారీ తెన్నూ లేకుండా పరిగెత్తసాగింది. తక్కువ ఎత్తులో ఉన్న ఒక చెట్టుకొమ్మ రాజు నుదురుకు బలంగా తగిలి రక్తం కార సాగింది. అతను కిందపడిపోయి, కాలినడకన ఒక వాగు వద్దకు వచ్చాడు. ధారాపాతంగా కురిసే వానకు వాగు పొంగసాగింది. రాజుకు ఈత వచ్చును గాని,రక్తం పోవటం వల్ల బలం తరిగిపోయి, అతను ఆ వాగు వెంబడి కొట్టుకుపోతూ, స్పృహ కోల్పోయాడు.

అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతని తల కొద్దిగా నొచ్చుతున్నది.అతనొక రాళ్ళతో కట్టిన ఇంట ఉన్నాడు. ఒక చక్కని ఆడపిల్ల సాధారణ దుస్తులు ధరించి, అతని కాళ్ళు ఒత్తుతున్నది.

అతను కళ్ళు తెరవటంచూసి ఆమె తృప్తితో నవ్వి, "తిరిగి ప్రపంచంలో పడ్డావన్న మాట!నాలుగు రోజులుగా నిన్ను గురించి చాలా ఆదుర్దా పడ్డాం. మా రేవులో నువ్వు కనిపించినప్పుడు కొసప్రాణంతో ఉన్నావు. నువ్వు ఇప్పుడున్నది సోన్ పూర్ అరణ్యానికి రాజైన ఫకీరా రాజభవనంలో. నేను రాజ వైద్యుడి కూతురును. నా పేరు మంజరి. నువ్వు పూర్తిగా కోలుకొనటానికి కనీసం ఒక నెల పట్టుతుంది.మా తండ్రి ఇచ్చే మూలికలతో నీ ఆరోగ్యం చక్కబడుతుంది.నీకు కావలసినది చూడటానికి నేను అహర్నిశలు నీ వద్దనే ఉంటాను. నువ్వు ఎవరో మాకు తెలియలేదు. నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలిసినట్టయితే నీ దగ్గిర వాళ్ళకు తెలిపి ఉండే వాళ్ళం," అన్నది.

మంజరి తండ్రీ, ఫకీరా వచ్చారు.

"నీ వాలకాన్ని బట్టి మంచి వంశానికి చెందినవాడివని గ్రహించాం. నువ్వు ఎవరో చెబితే నిన్ను మీ ఇంటికి చేర్చుతాం," అన్నాడు ఫకీరా.

తన అసలు వివరాలియ్యటం అపాయకరమని శంకించి జయపాలుడు, "మా తండ్రి విక్రమపూరుకు చెందిన ఒక వర్తకుడు.నేను పనిమీదపోతూ, దారిలో ఉపద్రవానికి గురి అయ్యాను," అన్నాడు.

వాళ్ళు అతని మాటలు నమ్మారు. మంజరి రోజు రోజుకూ అతనికి మరింత సన్నిహితురాలవుతున్నది.ఆమె చేసే సేవలకు అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియలేదు.తాను ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలంటే తనకు సహాయపడగలది మంజరి ఒకతే. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినట్టు అనేక నిదర్శనాలు కనపడినాయి.అయితే, తాను తప్పించుకు పోయినాక మంజరి అపాయానికి గురి అవుతుంది.మంజరికి అభ్యంతరంలేని పక్షంలో అతను ఆమెను తన వెంట రుద్రపురానికి తీసుకుపోవాలి.తాము వివాహం ఆడటానికి రూపమతి,పరిస్థితులను పాటించి, అభ్యంతరం చెప్పదు.

జయపాలుడు స్వస్తుడయ్యాక మంజరితో, "నాకు వేరే జీవితం ఉన్నది.ఇక్కడి మీ జీవితంలో ఇమడటం నాకు సాధ్యం కాదు.నేను వెళ్ళిపోవాలి.అందుకు నీ సహాయం కావాలి. నేను వెళ్ళిపోయాక, నింద నీ పై మోపుతారు.నీకు ఎలాంటి శిక్షపడుతుందో నాకు తెలియదు," అన్నాడు.

"నన్ను చిత్రవధ చేస్తారు. అయితే ఆ శిక్షను నేను చాలా సంతోషంగా అనుభవిస్తాను. నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు నీ వాళ్ళతో సుఖంగా ఉండటమే నాకు కావలిసింది," అన్నది మంజరి.

"నేను పశువును కాను. నేనూ నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వుకూడా నా వెంట మా దేశానికి రా. నా పెద్ద భార్య అముమతితో, మా ఆచారం ప్రకారం, నేను నిన్ను పెళ్ళాడుతాను నీకు అభ్యంతరమా, మంజరీ?" అని జయపాలుడు అడిగాడు.

అందుకు మంజరి సంతోషంగా ఒప్పుకున్నది.

ఒక చీకటి రాత్రి ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు రుద్రపురం చేరినమీదట జయపాలుడు, "నీతో ఇంతకాలమూ చెప్పనందుకు క్షమించు,మంజరీ, నే నీ రుద్రపురానికి రాజును," అన్నాడు.

"తెలియకనేనేదైనా అపచారం చేసి ఉంటే క్షమించండి," అన్నది మంజరి.

రూపమతి అయిష్టంగానే అనుమతించిన మీదట జయపాలుడికీ, మంజరికీ వివాహం జరిగింది.

మంజరి నాగరిక పద్ధతులు ఎరిగినది. రాజభవనంలో ఆమె అందరినీ ఆదరంతో చూసింది. రాజుకొడుకు శక్తిపాలుడు ఆమెకు చాలా మాలిమి అయ్యాడు. ఆమె అతన్ని సొంత కొడుకులాగే చూసుకున్నది.తన స్థాయికన్న రాజభవనంలో మంజరి స్థాయి పెరిగిపోవటం చూసి రూపమతి అసూయతో దహించుకుపోసాగింది. ఒక రోజు ఆమె నిద్ర లేస్తూనే తన ముత్యాలహారం ఎవరో తీశారని ఆందోళన లేవదీసింది. ఆ నేరం ఎలాగైనా మంజరి మీదికి తోయాలని ఆమె ఉద్దేశం.

రాణిగారి హారం పోయిందనగానే కాపలా వాళ్ళు కంగారుపడ్డారు. కాని మంజరి, "నేను దొంగను పట్టేస్తాను. నేను అడవి నుంచి వచ్చినదాన్ని కదా! మాకు అనేక మంత్రశక్తులున్నాయి. దొంగను పట్టుకునే ముందు నా మంత్రశక్తులు ప్రదర్శిస్తాను. అందరూ రాజభవనం చావడిలోకి రావాలి," అన్నది.

ఆరోజు మధ్యాన్నం తన భర్తతో ఆమె పథకం ఒకటి చెప్పింది.అపరాహ్ణం చావడి జనంతో నిండిపోయింది. కళ్ళకు గంతలు కట్టుకుని మంజరి అక్కడికి వచ్చింది. రాజు ముందు పెద్ద బల్ల మీద అనేక వస్తువులు చిన్నవీ, పెద్దవీ పాతిక దాకా ఉంచబడ్డాయి. మంజరి కోరిన ప్రకారం రాజకుటుంబానికి చెందిన వారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క వస్తువును తాకారు. ఒక వస్తువును ఎవరైనా తాకినప్పుడు రాజు, "మంజరీ, తాకిన వస్తువు ఏది? కోడిగుడ్డా, గొడుగా, లోటా?" అని అడిగాడు.

"లోటా," ఆనది మంజరి, అది నిజమే. మరొకసారి, "మంజరీ, తాకిన వస్తువు ఏది? విసనకర్రా, సంచీయా, లోటా, కోడిగుడ్డా, సిరాబుడ్డియా, కొవ్వొత్తా, ఈకా...?" అని అడిగాడు.

"కొవ్వొత్తి!" అన్నది మంజరి, అదీ నిజమే.

ఈ విధంగా మంజరి ప్రతిసారీ నిజం చెప్పింది. అందరూ ఆమె శక్తిచూసి ఆశ్చర్య పడ్డారు.

"రేపు సాయంకాలం లోపల పోయిన హారం దొరక్కపోతే దొంగను పట్టేస్తాను. ఇంత కన్న బలమైన శక్తులు నాకున్నాయి," అన్నది మంజరి.

ఆ సాయంకాలం రూపమతి మంజరి వద్దకు రహస్యంగా వెళ్ళి, "మన భర్త మీద ప్రమాణం చేసి రహస్యం దాస్తానంటే నీకో మాట చెప్పలి," అన్నది. "అలాగే ప్రమాణం చేస్తాను.చెప్పు," అన్నది మంజరి.

"నన్ను క్షమించు, సోదరీ. నేనే దొంగను.అసూయకొద్దీ నీ మీద దొంగతనం మోపాలని చూశాను.నా తప్పు తెలిసివచ్చింది. నీలాటి దొడ్డబుద్ధిగల మనిషి మీద అసూయపడటం అవివేకం," అన్నది రూపమతి. ఇద్దరూ కౌగిలించుకుని ఆనందబాష్పాలు రాల్చారు.

మంజరి చేసిన ఇంద్రజాలానికి ఆధారం ఏమిటి? ఎవరన్నా ఒక వస్తువు తాకినప్పుడు రాజు వస్తువులను పేర్కొంటూ అసలు వస్తువు పేరు చెప్పే ముందు ఒక నల్లని వస్తువును చెప్పేటట్టు ముందుగా ఏర్పాటు జరిగింది.ఆ ప్రకారం రాజు లోటాకు ముందు గొడుగు పేరూ, కొవ్వొత్తికి ముందు సిరాబుడ్డి పేరూ చెప్పాడు.

తన ముత్యాలహారం దొరికినట్టు రూపమతి ప్రకటించింది. 

ఆలోచన

ఇరుగుపొరుగు ఇళ్ళవాళ్ళయిన కేశవుడు, రాఘవుడు పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలి, ఏ పట్నానికోవెళ్ళి బతుకుతెరువు వెతుక్కోవాలనుకున్నారు. బయలుదేరే ముందు వాళ్ళకొక చిత్రమైన ఆలోచన వచ్చింది. "నువ్వు గంగపట్నానికి వెళ్ళు. నేను కృష్ణపట్నానికి వెళతాను. సరిగ్గా ఐదేళ్ళ తరవాత, ఇదేరోజున ఇక్కడే కలుసుకుందాం. ఈ ఐదేళ్ళలో మన జీవితాల్లో ఎలాంటి మార్పువస్తుందో చుద్దాం, ఏమంటావు?" అన్నాడు కేశవుడు.

రాఘవుడు అందుకు సరేనని గంగపట్నానికి బయలుదేరాడు.

ఐదేళ్ళు గడిచాక మిత్రులిద్దరూ అనుకున్న రోజున గ్రామదేవత ఆలయం వద్ద కలుసుకున్నారు. "ఎక్కడికి వెళ్ళినా మన నీడ మన వెంటే వస్తుందన్నట్టు, ఊరు వదిలి వెళ్ళినా నాకు రెక్కాడితేగాని, డొక్కాడని పరిస్థితే. ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నాను. మరి నీ సంగతేమిటి?" అని అడిగాడు కేశవుడు.

"చెప్పడం దేనికి? రేపు నాతోరా, చూద్దువుగాని," అన్నాడు రాఘవుడు.

మూడో రోజు సాయంకాలానికి మిత్రులిద్దరూ గంగపట్నం చేరుకున్నారు. పట్నం చివర పదెకరాలపొలం; ఐదారు కొబ్బరి చెట్ల మధ్య చిన్న భవంతిలాంటి ఇంటికి తీసుకువెళ్ళాడు రాఘవుడు దాన్ని చూడగానే, "ఈ ఇల్లు నీదేనా?" అంటూ ఆశ్చర్యపోయాడు కేశవుడు.

"కాదు. నా దూరపు బంధువుది. ఆయన విదేశానికి వెళుతూ ఈ పొలం, ఇల్లు నాకిచ్చి వెళ్ళాడు," అన్నాడు రాఘవుడు.

ఆ తరవాత ఆశ్చర్యంగా చూస్తూన్న కేశవుణ్ణి, "మనకూ ఇలాంటి బంధువుంటే బావుండేది కదా, అనుకుంటున్నావు. అవునా?" అని అడిగాడు రాఘవుడు. "కాదు. నేను ఆ బంధువై ఉంటే ఎంత బావుండేది అనుకుంటున్నాను," అన్నాడు కేశవుడు! 

తెలివైన దొంగ

ఒకనాటి చీకటివేళ ముగ్గురు దొంగలు, తాము నగరంలో దోచిన డబ్బూ, నగలతో అరణ్యం చేరి, అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాన్ని దాచి, నిర్భయంగా మండపంలో కూర్చుని కబుర్లు చెప్పుకో సాగారు.

మాటల మధ్యలో, వాళ్ళల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, "ఒరే, నే చెప్పేది జాగ్రత్తగా వినండి! ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలాకాక, మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే, వాడు ఇకముందు ప్రమాదకరమైన దొంగవృత్తి మాని, ఏ వ్యాపరమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు?" అన్నాడు.

ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు.

అయితే, దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయింది.

పెద్ద దొంగ కొంచెంసేపు ఆలోచించి, "ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది.ఈ తెల్లవారుజాము లోపున, మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడయినట్టు కల వస్తుందో, వాళ్ళకు దాన్ని ఇచ్చి వేద్దాం. ఈ ఆలోచన బావున్నదంటారా?" అన్నాడు.

మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తరవాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కాని,ఎవరికీ నిద్ర రావడం లేదు.కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు. రెండోవాడు కూడా తతిమ్మా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకు న్నాడు.మూడో దొంగ ఒక పథకం వేసుకుని,మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి, ధనం మూటను తీసుకుపోయి, దాపులనున్న ఒక మర్రిచెట్టు తొర్రలో దాచి వచ్చి పడుకున్నాడు.

తెల్లవారిన తరవాత ముగ్గురు దొంగలూ మేలుకున్నారు.చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు:

"నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని,నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా వున్నది.కాని,విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా వున్నట్టు తెలిసింది.అందువల్ల,డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి,ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను.కాని, దురదృష్టవశాత్తు,ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలయింది.

నాకు దు:ఖం ఆగింది కాదు.అప్పటికప్పుడేపోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, 'నాయనా,నువ్వు పరాయిదేశం వాడిలా వున్నావు.నా దేశంలోని గజదొంగలను పట్టినవాడికి, నా కుమార్తెతో పాటు అర్థరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను.కాని,ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు,' అన్నాడు.

రాజకుమార్తె, అర్థరాజ్యం అన్న మాటలు వింటూనే,నాలో ఉత్సాహం పొంగి పొర్లింది.నేను రాజుతో,'మహారాజా,విచారించకండి! నేను,ఆ గజదొంగలందర్నీ పట్టి బంధించగలను,' అని చెప్పాను.

దొంగను పట్టేందుకు దొంగే కావాలని వుట్టినే అనలేదుగదా! నేను క్షణాల మీద దేశంలోని దొంగలందర్నీ పట్టుకుని,రాజుకు ఒప్పచెప్పాను.ఆయన అన్న మాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి, అర్థరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొమ్మువలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను."

రెండవ దొంగ మొదటివాడితో, "ఫర్వాలేదు,ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు!" అని తన కొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు:

"నేను డబ్బూ,నగలూ తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తూండగా,ఓడ పెద్ద తుఫానులో చిక్కుకుని బుడుంగున మునిగిపోయింది.నేను డబ్బూ,నగలూ వున్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ వున్న వజ్రాలూ,మణులూ చూసి నా కళ్ళు జిగేలు మన్నాయి.కాని,వింత ఏమిటంటే,నాగలోకవాసులు నా వెంటవున్న నగల పనితనం చూసి అబ్బుర పడిపోయారు.

నాగలోకపు యువరాణి నాగదేవి, తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి,నగల్ని తన కిమ్మని అడిగింది.

ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పని చేసింది.నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తెలకు బహుకరించాను.నాగదేవి తన చెలికత్తెలు తనకన్న అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గిరకు వచ్చి,దీనంగా,'నువ్వు ఏది కోరినా ఇస్తాను.ఆ మిగిలిన నగలన్నీ నా కిచ్చెయ్యి,'అన్నది.

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను ఆమెతో,'నాగదేవీ, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి, ఎన్నో శ్రమలకోర్చి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడి కొచ్చాను.ఈ నగలన్నీ నీవే!' అంటూ నగలన్నీ ఇచ్చేశాను.

అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహవైభవంగా నన్ను వివాహమాడింది.ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి, నాగలోకానికే రాజును కాగలిగాను."

మొదటి ఇద్దరి కలలూ విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు: "మీ ఇద్దరి కలలతో పోల్చితే అసలు నాది కలేకాదు. వినండి!నేను దాచిన ధనం,నగలూ తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి కావడమేకాక, మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను. అయితే,మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో, హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడయి కల చెదిరిపోయి, కళ్ళు తెరిచాను.

నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయిటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టిలేపుతూ, 'దొంగలు!దొంగలు!' అన్నాను.కాని, పెద్దన్న కళ్ళు తెరవకుండానే,'నా రాజ్యంలో దొంగలా? వాళ్ళను ఏనాడో,కాలరాచేశాను!' అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు.

అప్పుడు చిన్నన్న భుజం తడుతూ,సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, 'నాగదేవీ, నేను రాజునై వుండగా, ఈ నాగలోకంలో దొంగలా? అహ్హహ్హ!' అంటూ నవ్వసాగాడు.

ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు.

ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాభరా పడుతూ విగ్రహం వెనక్కుపోయి, ధనం మూట కోసం చూశారు; అది అక్కడ కనిపించలేదు.

వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గిరకు వచ్చి, "నిజం చెప్పు! దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడడం, అంతా పచ్చి అబద్ధం!" అన్నారు.

చిన్నవాడు ఏమీ తొణక్కుండా, "ఇందులో అబద్ధం ఏమీలేదు. మన దురదృష్టం ఏమంటే, ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు, మీరు తీరని రాచకార్యాల్లో తలమునకలై వుండడం!" అన్నాడు.

ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, "ఒరే, నిజానికి మేం ఎలాంటి కలలూ కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం. అంతే! ఇప్పుడైనా నిజం చెప్పు. ఆ ధనం ఎక్కడ దాచావు?" అని అడిగారు.

ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, "మీకు ఎలాంటి కలలూ రాలేదన్న మాట!బావుంది.అందువల్ల, మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది. కనక, ధనం అంతా నాకే చెందాలి," అంటూ పోయి మర్రిచెట్టు తొర్రలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు.

దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు.తాము పెద్దవాళ్ళయివుండీ చిన్నవాణ్ణి మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి, మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ, "ఒరే, తమ్ముడూ! ఈనాటినుంచీ నువ్వు దొంగతనాలు మాని, ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ, తగిన పిల్లను వివాహామాడి సుఖంగా బతుకు," అన్నారు. 

భయంలేనివాడు

రాజు విక్రమసేనుడికి తరచూ ఏవేవో సందేహాలు వస్తూండేవి. తన సందేహాలకు సమాధానాలను ప్రత్యక్షంగా నిరూపించమని మంత్రులను కోరేవాడు. ఒకనాడు రాజు మంత్రి సుబుద్ధిని,"ఈ లోకంలో భయంలేనివారు ఎవరైనా ఉంటారా?" అని అడిగాడు.

"రాత్రికి మనం నగర సంచారం చేస్తే, అలాంటి వాళ్ళు కనిపించవచ్చు, ప్రభూ," అన్నాడు మంత్రి.

ఆ రాత్రి రాజూ, మంత్రీ మారువేషాల్లో నగర సంచారానికి బయలుదేరారు. నగరం చివర ఒక పూరిగుడిసె ముందు ఒక యువకుడు నులకమంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. రాజూ,మంత్రీ ఆశ్చర్యంతో ఆ యువకుణ్ణి నిద్రలేపి, "ఇంటి తలుపు బార్లా తెరిచి ఇలా బయట పడుకుని నిద్రపోతున్నావే, నీకు భయం లేదా?" అని అడిగారు.

"భయమా? నాకా? ఎందుకూ? నా ఇంట్లో దొంగలు పడి దోచుకోవడానికి ఏముందని తలుపులు మూయడం? కట్టెలు కొట్టి అమ్మి దాంతో పొట్టపోసుకుంటున్నాను.ముందూ వెనకా ఎవరూ లేనివాణ్ణి. నేను చచ్చినా బాధపడేవాళ్ళు లేరు. నాకూ ప్రాణభయం లేదు. ఇక భయపడడం దేనికి? ఈ విషయం అడిగేందుకా బంగారంలాంటి నిద్ర చెడగొట్టారు?" అంటూ మళ్ళీ ముసుగుదన్ని పడుకున్నాడా యువకుడు.

"ఈ లోకంలో భయంలేని వాళ్ళెవరైనా ఉన్నారంటే, వాళ్ళు ప్రాణభయం లేని నిరుపేదలైన కష్టజీవులు మాత్రమే!" అంటూ రాజు ముందుకు నడిచాడు.

మంత్రి ఆయన్ను అనుసరించాడు.

మొర ఆలకించిన దేవుడు!

మాధవుడు చాలా పేదవాడు. అతడికి సరైన ఉద్యోగం లేదు.సంపాదన లేదు గనక, అతడు పెళ్ళి కూడా చేసుకోలేదు; తనకంటూ కుటుంబం ఏర్పరుచుకోలేదు. ఒంటరి బతుకు బతుకుతూ ఎవరు ఏపని చెప్పినా చేస్తూ, వాళ్ళిచ్చిన దాన్ని పుచ్చుకుని తృప్తిగా కాలం గడుపుతున్నాడు.

కట్టెలు చీల్చడం, నెళ్ళు తోడడం,బట్టలుతకడం, పశువుల్ని తోలుకుపోయి దాపులనున్న నదిలో స్నానం చేయించడం ఇలా క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. పనులన్నీ ముగించుకున్నక నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకుని ఇంటికి వెళ్ళేవాడు.

అలా ఒకనాడు అతడు గుడిలోని విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడి దేవుణ్ణి ప్రార్థించాడు. కళ్ళు తెరవగానే అతడికి దేవుడు తన కేసి దీనంగా చూస్తున్నట్టు అనిపించింది. దేవుడు అలిసి పోయాడా? గర్భ గృహం నిండా భక్తులు వెలిగించిన అగరు వత్తుల పొగ కమ్ముకుని వుంది. ఆ పొగ దేవుడికి కళ్ళకు మంట కలిగిస్తున్నదా ఏం? భక్తులు అలంకరించిన పెద్ద పెద్ద పూల మాలలను మోయలేక దేవుడు అవస్థపడుతున్నాడా? ఇలా ఆలొచించిన మాధవుడు, "స్వామీ, నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. నాతో మా ఇంటికి రా. నీకు మంచి భోజనం వండి పెడతాను," అన్నాడు చేతులెత్తి మొక్కుతూ, కన్నార్పకుండా చూస్తూన్న మాధవుడికి దేవుడు మందహాసం చేస్తున్నట్టనిపించింది. దేవుడి పెదవులు మెల్లగా కదల సాగాయి.

"మాధవా, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి, భోజనం వండి సిద్ధం చేసి నా దగ్గరికి రా," అన్నాడు దేవుడు. మాధవుడు ఇటూ అటూ చూశాడు. తనతో పాటు అక్కడ ఇంకా కొందరు భక్తులు ఉన్నారు.అయితే, దేవుడు తనతో మాత్రమే మాట్లాడినట్టు మాధవుడు గ్రహించాడు. దేవుడి విగ్రహం ఇంకా మందహాసం చేస్తూ ఉన్నట్టు మాధవుడికి కనిపించింది.

మాధవుడు గుడినుంచి వెలుపలికి వచ్చి, గబగబా ఇంటికేసి నడవసాగాడు. ఇల్లు చేరగానే వంట చేయడం ప్రారంభించాడు. బియ్యం, పప్పు, కూరగాయలతో రుచికరమైన వంట పూర్తి కాగానే, దానిని భద్రంగా దాచి, ఇంటి తలుపు మూసుకుని గుడికి బయలుదేరాడు. నాలగడుగులు వేశాడో లేదో, ఊత కర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఒక ముసలి వాడు ఎదురుపడి, "నాయనా, పొద్దుటి నుంచి ఆకలితో అలమటిస్తున్నాను. ఇంత తిండి ఉంటే పెట్టు. పుణ్యముంటుంది," అని దీనంగా అడిగాడు.

మాధవుడికి అతని మీద జాలి కలిగింది. "నాతో రా," అంటూ వెనుదిరిగి అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. ముసలివాడు కూర్చుని కొద్దిగా, అయితే ఎంతో ఆనందంగా తిన్నాడు. "చాలా సంతోషం నాయనా. నీ కరుణ ఎన్నటికీ మరువను. దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడగలడు," అంటూ ఊతకర్రను అందుకుని ముసలివాడు వెళ్ళిపోయాడు.

మాధవుడు ఇంటి తలుపు మూసుకుని మళ్ళీ గుడికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళేసరికి, దారి పక్కన ఒక ముసలిది ఆకలితో చాలా దీనంగా కనిపించింది. ఆమెకు ఇంత ఆహారం పెడితే సంతోషిస్తుంది కదా అని మాధవుడు భావించాడు. ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టాడు. భోజనం చేసి చేతులు కడుక్కున్నాక, ఆమె కళ్ళు ప్రశాంతంగా, తృప్తిగా కనిపించాయి. విచారం మటుమాయమయింది. "దేవుడు నిన్ను చల్లగా చూడగలడు నాయనా. ఈ రోజును నేనెన్నటికి మరిచిపోను," అంటూ ముసలిది వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళాక, మాధవుడు ఇంటి తలుపు మూసుకుని మళ్ళీ గుడికేసి బయలుదేరాడు. అతడు వేగంగా అడుగులు వేయబోతూండగా, ఎవరో వెనకనుంచి తన బట్టను పట్టుకోవడం గమనించాడు. వెనుదిరిగి చూసిన మాధవుడికి చిరిగిన దుస్తులతో, ఆకలి చూపులతో చేతిని కడుపుకేసి చూపుతూ ఒక పసివాడు కనిపించాడు. వాడు తనను అన్నం కోసం అడుగుతున్నట్టు మాధవుడు గ్రహించాడు. ఆ తరవాత క్షణం కూడా ఆలోచించకుండా పసివాడి చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టాడు. ఆ కుర్రవాడు అన్నం తింటూ, తానొక అనాధననీ, బిచ్చమెత్తుకుని బతుకుతున్నాననీ చెప్పాడు. మాధవుడు వాడిపై జాలిపడి, "రేపు సాయంకాలం వచ్చావంటే ఇంత తిండి పెడతాను," అంటూ మూడోసారి తలుపు మూసుకుని గుడికేసి వేగంగా బయలుదేరాడు.

మాధవుడు గుడిలోకి వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి, "నన్ను క్షమించు స్వామీ. ఇంటి నుంచి రావడానికి ఆలస్యమయింది," అన్నాడు.

"నువ్వు నాకు ఎప్పుడో భోజనం పెట్టావు కదా, మాధవా?" అన్నాడు దేవుడు.

"ఎప్పుడు స్వామీ? నేను ఇప్పుడే కదా వస్తున్నాను," అన్నాడు మాధవుడు విస్మయంతో.

"ఒక వృద్ధుడికి, వృద్ధురాలికీ, అనాధ బాలుడికీ అన్నం పెట్టావు కదా? అది నాకు పెట్టినట్టే. నాకు చాలా ఆనందంగా ఉన్నది," అన్నాడు దేవుడు.

"మరి, నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు కదా," అని మాధవుడు దేవుడికి గుర్తు చేశాడు.

"అలాగా!తప్పకుండా వస్తాను. ముందుగా నడువు. నీ వెంటే వస్తాను," అన్నాడు దేవుడు.

ఇంటిని సమీపించిన మాధవుడు తలుపు తెరిచి వెనక్కు తిరిగి చూశాడు. దేవుడు దివ్యాద్భుత ప్రకాశంతో నిలబడి వున్నాడు."కూర్చో స్వామీ. నువ్వు మా ఇంటికి రావడం ఎంతో సంతొషంగా ఉన్నది. ఇదిగో ఈ పండు తిను," అంటూ ఒక పండును ఇచ్చి, పక్కనున్న విసనకర్రను తీసుకుని దేవుడికి మెల్లగా వీచసాగాడు మాధవుడు. దేవుడు పండు ఆరగించి లేచి నిలబడ్డాడు. మాధవుడు సాష్టాంగ నమస్కారం చేసి, లేచే సరికి దేవుడు అదృశ్యమయ్యాడు.గుడి వరకు వెళ్ళి దిగబెట్టి వద్దామనుకున్న మాధవుడికి కొద్దిగా ఆశాభంగమయినప్పటికీ, దేవుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో పొంగిపోయాడు.

దేవుడు పేదవాడైన మాధవుడి ఇంటికి వచ్చిన విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ ఊరిలోని గొప్ప భూస్వామికి తెలిసింది. ఆలయ పునరుద్ధరణకూ, ఇతర కైంకర్యాలకూ భూస్వామి ఎంతో ధనం విరాళంగా ఇచ్చాడు. అయినా దేవుడెప్పుడూ అతడి ఇంటికి రాలేదు.అతడు వెంటనే ఆలయంలోకి వెళ్ళి చేతులు జోడించి, "ప్రభూ! తమరెప్పుడు మా ఇంటికి విజయం చేస్తారు?" అని అడిగాడు. అతని కంఠస్వరంలో వినయపూర్వక విన్నపం కన్నా, అధికారం ధ్వనించింది.

"నీ అభీష్టానుసారమే వస్తాను. మొదట వెళ్ళి భోజనం సిద్ధం చేసి నన్ను వచ్చి పిలువు," అన్న మాటలు విగ్రహం నుంచి వినిపించాయి. భూస్వామి చిన్నగా నవ్వి ఇంటికి తిరిగి వచ్చాడు.వంటవాళ్ళను పిలిచి షడ్రసోపేతమైన విందు భోజనం తయారు చేయమని ఆజ్ఞాపించాడు.వంట సిద్ధం కాగానే గుడికేసి బయలుదేరాడు.

దారిలో ఒక వృద్ధుడు ఎదురు పడి తన ఆకలి గురించి చెప్పాడు. "నీలాంటి దరిద్రుడికి తిండి పెట్టడానికి నాకిప్పుడు తీరిక లేదు.దున్నలా ఉన్నావు ఏదైనా పనీపాటూ చేసుకుని బతుకవచ్చుకదా?" అంటూ కోపంగా భూస్వామి ముందుకు నడిచాడు.

నాలుగడుగులు వేసేలోగా, "అయ్యా, పొద్దుటి నుంచి తిరుగుతున్నాను. గుప్పెడు మెతుకులు దొరకలేదు. ఆకలి దహించేస్తున్నది. అడుగు వేయలేక పోతున్నాను," అన్న వృద్ధురాలి దీనస్వరం వినిపించింది.

భూస్వామీ పట్టరాని కోపంతో, "ఈ ఊళ్ళో ఇంతమంది పనికిమాలిన బిచ్చగాళ్ళు ఉన్నారా? వెళ్ళు, వెళ్ళు. అవతల నాకు ముఖ్యమైనపని ఉంది," అంటూ కనీసం తిరిగైనా చూడకుండా హడావుడిగా ముందుకు అడుగువేశాడు.

ఇంకొకడు అడ్డుపడగలడని అతడు అనుకోలేదు. అంతలో మరొక బిచ్చగాడు ఎదురుపడి, కళ్ళు తిరిగి కిందపడిపోయేలావున్న తన ఆకలి బాధ గురించి దీనంగా ఏకరువు పెట్టాడు. భూస్వామి వాణ్ణి పక్కకు తోసేసి గబగబా ముందుకు నడిచాడు. అతడు రొప్పుతూ ఆలయంలోకి వెళ్ళి, విగ్రహం ముందు నిలబడి, "ప్రభూ! మీ కొసం సిద్ధం చేసి మిమ్మల్ని వెంటబెట్టుకు వెళ్లడానికి వచ్చాను," అన్నాడు.

"నేనే స్వయంగా ఎప్పుడో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే, నువ్వే నన్ను పట్టించుకోలేదు. మొదట నువ్వు కోపంతో నన్ను పట్టించుకోలేదు. మొదట నువ్వు కోపంతో నన్ను దరిద్రుడివి అన్నావు. ఆ తరవాత బిచ్చగత్తెవని తిట్టావు. మూడోసారి దారికి అడ్డమని పట్టి పక్కకు తోసి దిగ్బ్రాంతి కలిగించావు. వచ్చినప్పుడల్లా నాపట్ల కఠినంగా ప్రవర్తించావు.ఇప్పుడు నేను మాత్రం నీకోసం ఎందుకు సమయాన్ని వెచ్చించాలి?" అన్నాడు దేవుడు.

ధనికుడైన భూస్వమి విగ్రహం కేసి అలాగే చూస్తూ నిలబడ్డాడు. కఠినమైన నల్లరాతిలో చెక్కిన ఆకారాన్ని మాత్రమే అతడిప్పుడు చూడ గలిగాడు. 

రెక్కలదేవత!

కన్నయ్యకు పన్నెండేళ్ళ వయసులో విషజ్వరం వచ్చి హఠాత్తుగా తల్లి పోయింది. వాడికి తల్లి అంటే పంచప్రాణాలు. తండ్రి జంగయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా, ``నాన్నా, అమ్మ కావాలి,'' అంటూ తరచూ కళ్ళనీళు్ళ పెట్టుకునేవాడు. తల్లిపోయి యేడాది అయినా ఇంకా నిద్రలో తల్లిని కలవరించేవాడు. అది చూసి జంగయ్య బంధువులు, ``నీకు పెళ్ళాం అవసరం లేకపోయినా, కన్నయ్య ఆలనాపాలనా చూసుకోవడానికి తప్పక అమ్మకావాలి. మా మాట విని మళ్ళీ పెళ్ళి చేసుకో,'' అని జంగయ్యకు చెప్పసాగారు. దానికి తోడు వరసకరువులతో విసిగిపోయిన జంగయ్య, పల్లెలో ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి, ఆ డబ్బుతో దాపులనున్న పట్నంలో చిన్న కిరాణా దుకాణం తెరిచాడు. అయితే, పట్నంలో అద్దెలు ఎక్కువ గనక, కాపురం మాత్రం పల్లె నుంచి మార్చలేదు. జంగయ్య చీకటితో వంట చేసి పట్నం వెళ్ళి, రాత్రి పొద్దు పోయి తిరిగి వచ్చాక మళ్ళీ వంట చేసేవాడు. బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చే కన్నయ్య, తండ్రి వచ్చేంతవరకు ఎదురు చూపులు చూస్తూ ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండవలసి వచ్చేది. ఇవన్నీ చూసి జంగయ్య తనకు ఇష్టం లేకపోయినా దూరపు బంధువైన జగదీశ్వ రిని పెళ్ళి చేసుకున్నాడు. జగదీశ్వరి కాపు రానికి వచ్చిన రోజే, ``మా కన్నయ్య కోసమే నిన్ను చేసుకున్నాను. తల్లి లేని వాణ్ణి నీ కన్నబిడ్డలా జాగ్రత్తగా చూసుకోవాలి,'' అన్నాడు జంగయ్య. ``ఆమాత్రం నాకూ తెలుసు,'' అంటూ నవ్వింది జగదీశ్వరి.

అయితే, జగదీశ్వరి ఆ ఇంట అడుగుపెట్టి మూడు నెలలు ముగియక ముందే కన్నయ్య కష్టాలు ఆరంభమయ్యాయి. జంగయ్య పట్నంలో దుకాణం మూసేసరికి బాగా పొద్దుపోయి రాత్రయ్యేది. మళ్ళీ తెల్లవారగానే దుకాణం తెరవవలసిన పరిస్థితి ఏర్పడింది. జంగయ్య ఇంటికి వారానికి ఒక్క రోజు మాత్రమే వచ్చేవాడు. దాంతో అడిగేవాళు్ళ లేకుండా పోయిన జగదీశ్వరి కన్నయ్య చేత ఇంటెడు పనీ చేయించేది. స్వతహాగా నెమ్మదస్థుడైన జంగయ్య, కొడుకు ఏం చెప్పినా భార్యను పల్లెత్తు మాట అనేవాడు కాదు. అందువల్ల ఏడాది తిరగకుండా ఆ ఇంట్లో జగదీశ్వరి ఆడింది ఆట, పాడింది పాటగా తయారయ్యింది. ఒక రోజు ఉదయం బడికి బయలుదేరుతూన్న కన్నయ్య చేతిలోని పుస్తకాలు విసురుగా లాక్కుని, ``నువు్వ చదువుకుని ఊరిని ఉద్ధరించేది ఏమీలేదు. నీ తిండికే బోలెడు ఖర్చవుతోంది. నువు్వ ఈ రోజు నుంచి బడి మాని అడవికి వెళ్ళి, ఎండు పుల్లలు ఏరుకురా. వంటచెరకు ఖర్చయినా తప్పుతుంది,'' అన్నది జగదీశ్వరి. కన్నయ్యకు చదువంటే ప్రాణం. సవతి తల్లి బడిమానమనగానే వాడికి ఏడుపు వచ్చేసింది, ``నా చేత చదువు మానిపించవద్దు పిన్నీ. సాయంత్రం బడి నుంచి వచ్చాక కావలసి నన్ని పుల్లలు తెస్తాను,'' అన్నాడు ఏడుపు గొంతుతో. ``సాయంత్రం చేయడానికి వేరే పనులున్నాయి, నడు, నడు,'' అంటూ జగదీశ్వరి కన్నయ్యను అడవికి పంపింది. కన్నయ్య నదిగట్టునే నడిచి వెళ్ళి మధ్యాన్నానికి అడవి చేరాడు. వాడక్కడ ఎండు పుల్లలు ఏరి, మోపుగా కట్టి నెత్తిన పెట్టుకుని ఇల్లు చేరేసరికి చీకటిపడింది. ``ఈ నాలుగు పుల్లలు ఏరుకురావడానికి ఇంతసేపా?'' అంటూ విరుచుకు పడింది జగదీశ్వరి. ఆ రోజు మొదలు ఇంటి పనితో పాటు, అడవికి వెళ్ళి పుల్లలు తేవడం కన్నయ్యకు తప్పడం లేదు. శరీర కష్టం కన్నా, చదువు మానవలసి వచ్చినందుకు మనసులో బాధ పడసాగాడు.

ఒకనాడు అడవిలో ఎండుపుల్లలు ఏరుతూన్న కన్నయ్యకు, రేగుపొదల మధ్య బంగారు రంగుతో మెరుస్తూన్న ఈక ఒకటి కనిపిం చింది. ఆ ఈకను జంగయ్య అతి ప్రయత్నం మీద జాగ్రత్తగా బయటకు తీశాడు. అది బంగారు రంగుతో ధగధగా మెరిసిపోవడమే గాక, సువాసనలు కూడా వెదజల్లుతోంది. కన్నయ్య ఆశ్చర్యంతో ఆ ఈకను అటూ ఇటూ తిప్పి చూస్తూండగా, కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసినట్టయి, ఒక దేవతాస్త్రీ ప్రత్యక్షమయింది. ఆ దేవతకు అందమైన రెక్కలున్నాయి. అవి బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. ``చిన్న వయసులో కష్టపడుతూన్న నిన్ను చూస్తూంటే జాలి కలుగుతోంది,'' అన్నది రెక్కలదేవత. ``మా నాన్న సంపాదన తిండికే చాలక నేను ఇలా కష్టపడవలసి ఉంది. అయితే, నా బాధ మాత్రం చదువు మానేసినందుకే. నా మీద అంత జాలిగా ఉంటే, మరి ఇన్నాళూ్ళ నాకు కనిపించలేదేం?'' అని అడిగాడు ఆశ్చర్యంగా కన్నయ్య. ``ఈ అడవిలో నా ఈక ఎవరి దగ్గర ఉంటే వారికే కనిపిస్తాను. ఇతరులకు కనిపించను. నేను నీకు సాయపడాలనుకుంటున్నాను. నీ చేతిలోని ఈకతో నా రెక్కలను మూడుసార్లు తాకావంటే బంగారు నాణాలు రాలుతాయి. వాటితో మీదరిద్రం తీరిపోతుంది నీకీ కష్టాలు తప్పుతాయి. నువ్వెళ్ళి హాయిగా చదువుకో వచ్చు,'' అన్నది దేవత. ఆ మాటకు కన్నయ్య నవ్వి, ``కష్టపడకుండా సంపాదించిన డబ్బుతో తృప్తిగా బతకలేం అని బడిలో మా గురువుగారు చెబుతూండేవారు. నీ బంగారు నాణాలు నాకు వద్దు,'' అన్నాడు. కన్నయ్య మాటలకు ముచ్చటపడిన దేవత, ``అయితే, నువు్వ పుల్లలు ఏరేదాకా నీతో కబుర్లు చెబుతాను. నీకు కష్టం తెలియదు,'' అన్నది. దేవత చెప్పే మంచి మాటలు వింటూ, ఆమె రెక్కలు విసురుతూ ఉంటే వచ్చే సుగంధ భరితమైన చల్లటి గాలులతో సేదతీరుతూ, సునాయాసంగా కట్టెల మోపు సిద్ధంచేశాడు కన్నయ్య. ``నా వీపు మీద కూర్చో. నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను. ఆ ఈకను ఎవరి కంటా బడకుండా భద్రంగా దాచుకో.

 అది పోగొట్టుకుంటే నేను నీకు కనిపించను,'' అంటూ దేవత అందమైన పెద్ద పక్షిగా మారిపోయింది. ఆ తరవాత కన్నయ్యను వీపు మీద కూర్చోబెట్టుకుని, ఆకాశంలో ఎగురుతూ వచ్చి వాళ్ళ ఇంటి పెరట్లో దింపి వెళ్ళిపోయింది. రాత్రి వంటకు బియ్యం సిద్ధంచేస్తూన్న జగదీశ్వరి, ``ఈ రోజు చాలా పెందలాడే తిరిగి వచ్చావు. అయినా పెరటి దోవన వచ్చావేమిటి?'' అని అడిగింది అనుమానంగా. ``పెరటి దోవన అడవికి అడ్డుదారి ఉందిలే,'' అంటూ కాళు్ళ చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు కన్నయ్య. అది మొదలు కన్నయ్య దేవత ఈకను పగలు భద్రంగా తన దుస్తుల్లో దాచుకునేవాడు. రాత్రుల్లో తలకింది దిండులో రహస్యంగా దాచేవాడు. అడివికి వెళ్ళగానే ఈకను తీసి చేతిలో పట్టుకోగానే దేవత ప్రత్యక్షం అయ్యేది. దేవత కబుర్లు వింటూ కష్టం తెలియకుండా పుల్లలు ఏరుకునే వాడు. దేవత రోజూవాణ్ణి ఇంటి వద్ద దిగవిడిచి వెళ్ళేది. ఆరోజు కన్నయ్య పొరబాటున దిండు కింద దాచిన ఈకను తీసుకోవడం మరిచిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. పక్కలు సరిచేస్తూన్న జగదీశ్వరికి, కన్నయ్య దిండు కింద బంగారు రంగులో సుగంధాలు వెదజల్లుతూన్న ఈక కనిపించింది. ఆ ఈకను చూడగానే జగదీశ్వరి కళు్ళ చెదిరిపోయాయి. ఆ ఈకను అప్పటికప్పుడే ఊళ్ళో వున్న స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్ళింది. దాన్ని పరిశీలించి చూసిన స్వర్ణకారుడు, ``ఇదంతా మేలిమి బంగారం. దీనిని నాకు ఇస్తే వెయ్యి వరహాలు ఇస్తాను,'' అన్నాడు. ``దీనిని అమ్మాలనుకుంటే నీ దగ్గరికే వస్తానులే!'' అన్నది జగదీశ్వరి. ఆమె ఇంటికి వచ్చి తియ్యటి సున్నివుండలు తయారు చేసింది. సాయంత్రం కన్నయ్య రాగానే, ``ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నాడు నా తండ్రి, '' అంటూ చెంగుతో వాడి మొహంమీది చెమట తుడిచి, కొసరి కొసరి సున్నివుండలు తినిపించింది. జగదీశ్వరి కనబరుస్తున్న ఆప్యాయతకు కన్న తల్లి గుర్తుకు వచ్చి కళ్ళనీళు్ళ తిరిగాయి కన్నయ్యకు. ఇదే సమయమని జగదీశ్వరి బంగారు ఈకను చూపించి, ``ఈ ఈక నీ దిండు కిందికి ఎలా వచ్చింది? తల్లిలాంటి దాన్ని. నా దగ్గర దాపరికం దేనికి? దీనిని నీకు ఎవరు ఇచ్చారో చెప్పు,'' అని అడిగింది. కన్నయ్య రెక్కల దేవత గురించి అంతా జగదీశ్వరికి చెప్పి, ``అడవిలోకి వెళ్ళి, ఈ ఈకను చేతిలో పట్టుకుంటే దేవత ప్రత్యక్షమవుతుంది,'' అన్నాడు.

మరునాడు ఉదయం జగదీశ్వరి, ``కన్నయ్యా, నీకు చదువు అంటే ప్రాణం కదా. పాపిష్టిదాన్ని మధ్యలోనే చదువు ఆపించాను. ఈ రోజునుంచి నా కష్టాలేవో నేను పడతాను. నువు్వ బడికి వెళు్ళ,'' అన్నది. కన్నయ్య పుస్తకాలు తీసుకుని సంతోషంగా బడికి వెళ్ళాడు. వాడు అటు వెళ్ళగానే జగదీశ్వరి దేవత ఈకను కొంగు చాటున దాచుకుని ఒక గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరింది. అడవిలోపలికి వెళ్ళి, ఈకను ఎడమ చేత్తో పట్టుకుని, కుడిచేతిలోని గొడ్డలితో పక్కనున్న చెట్టును నరుకుతూన్నట్టు నటించసాగింది. అంతలో, ``ఆగు. అదేంపని? పచ్చని చెట్టును నరకడం మహాపాపం!'' అంటూ రెక్కల దేవత ప్రత్యక్షమయింది. ``ఏం చేయమంటావు తల్లీ. మా కన్నయ్య తెచ్చే నాలుగు పుల్లలతో మా దరిద్రం తీరేదేనా?'' అంటూ విచారంతో చేతులు తిప్పింది జగదీశ్వరి. ``కన్నయ్యను కష్టపెట్టకుండా చదువుకోనిస్తే నీకు సాయంచేస్తాను. చదువులేకపోతే మనిషికీ, ఈ అడవిలోని మానుకూ తేడా ఏమీ లేదు,'' అన్నది దేవత. ``తప్పక చదివిస్తాను తల్లీ. ఆ చేసే సాయమేదో తొందరగా చెయ్యి,'' అన్నది జగదీశ్వరి. ``నీ చేతిలోని నా ఈకతో నా రెక్కల మీద మూడుసార్లు తాకావంటే బంగారు నాణాలు రాలుతాయి,'' అన్నది దేవత. వెంటనే జగదీశ్వరి ఈకను దేవత రెక్కల మీద మూడుసార్లు తాకించింది. 

రెక్కల నుంచి కొన్ని బంగారు నాణాలు రాలాయి. వాటిని చూసి అబ్బుర పడిన జగదీశ్వరి మళ్ళీ ఈకతో దేవత రెక్కలను తాకించబోయింది. ``రోజుకు ఒక్కసారి మాత్రమే నాణాలు రాలుతాయి,'' అంటూ దేవత అదృశ్యమయింది. ఆ నాణాలతో ఇంటికి వచ్చిన జగదీశ్వరికి రాత్రంతా నిద్ర పట్టలేదు. అప్పటికప్పుడే అందరికన్నా ధనవంతురాలు కావాలని ఆత్రంతో ఆలోచించింది. మరునాడు తెల్లవారగానే గొడ్డలిని భుజానవేసుకుని అడవికి వెళ్ళి, ఈకను తీసి పట్టుకున్నది. ``మళ్ళీ వచ్చావెందుకు?'' అంటూ దేవత ప్రత్యక్షమయింది. ``నువు్వ నిన్న ఇచ్చిన నాణాలు పాతబాకీలు తీర్చడానికే సరిపోయాయి. ఇక కన్నయ్యను ఎలా చదివించను చెప్పు?'' అన్నది జగదీశ్వరి విచారంగా. ``దిగులు పడకు. ఈకను నారెక్కలకు తాకించు,'' అన్నది దేవత. జగదీశ్వరి అలా చేయడంతో రెక్కల నుంచి జలజలా బంగారు నాణాలు రాలాయి. వాటినంతా మూట కట్టుకున్న జగదీశ్వరి, ``ఈ ఎండలో నడవలేను. ఇంటి దగ్గర దింపు తల్లీ,'' అన్నది దేవతతో. పెద్ద పక్షి రూపమెత్తిన దేవత జగదీశ్వరిని తన వీపున కూర్చోబెట్టుకుని బంగారు రెక్కలల్లారుస్తూ ఆకాశ మార్గాన బయలుదేరింది. అవకాశం కోసం చూస్తూన్న జగదీశ్వరి, తన చేతిలోని గొడ్డలితో దేవత బంగారు రెక్కలను తెగ నరకాలని ప్రయత్నించి, అదుపు తప్పి, అంతపై నుంచి కింది అగాథంలోకి పడిపోయింది. ఆమె చెంగులోని ఈక గాలికి ఎటో ఎగిరిపోయింది. ఆ తరవాత ఆమె ఏమై పోయిందో ఎవరికీ తెలియలేదు! భార్య కోసం పది రోజులు వెతికిన జంగయ్య, ఆమె జాడ కనిపించక పోయేసరికి, ఇక పల్లెలో ఉండలేక వచ్చిన ధరకు ఇల్లు కూడా అమ్మేసి పట్నానికి మకాం మార్చేశాడు. పట్నంలోని పెద్ద బడిలో చదువుకునే కన్నయ్యకు తరచూ రెక్కల దేవత గుర్తుకు వచ్చేది. ఆ సంగతి చెబితే, ``అంతా నీ భ్రమ! పోనీలే. ఆ దేవత ఎన్నో మంచి మాటలు చెప్పిందన్నావు కదా. వాటిని ఆచరిస్తూ, బాగా చదువుకుని జీవితంలో పైకిరా,'' అనేవాడు జంగయ్య నవు్వతూ. 

రొట్టెల పండుగ


 
దేవీపురం గ్రామంలో శివదాసు అనే గృహస్థు ఉండేవాడు. అతడు నిత్యాన్నదానం చేస్తూండేవాడు. ఒక రాత్రి సమయాన ఒక వృద్ధురాలు వచ్చి శివదాసు ఇంటి తలుపు తట్టింది. శివదాసు భార్య లేచి తలుపు తీసి వృద్ధురాలిని, ``ఏమ్మా, ఏం కావాలి?'' అని అడిగింది. అప్పుడా వృద్ధురాలు, ``నేను వచ్చింది నీ కోసం కాదు, నీ భర్తను పిలువు,'' అన్నది. ఆ మాట విన్న శివదాసు బయటకువచ్చి, ఆ వృద్ధురాలిని చూసి నమస్కరించి, ``ఏం కావాలి తల్లీ?'' అని అడిగాడు. ``ఎవరైనా నీ ఇంటికి ఎందుకు వస్తారు? భోజనానికి వచ్చాను,'' అన్నది వృద్ధురాలు. ``సంతోషం. రామ్మా లోపలికి,'' అని పిలిచాడు శివదాసు. ``నేను భోజనం చేయాలంటే ముందుగా నువు్వ నాకొక మాట ఇవ్వాలి,'' అన్నది వృద్ధురాలు. ``ఏం చెయ్యాలో చెప్పు తల్లీ,'' అని అడిగాడు శివదాసు. ``నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మనసులో బాధ ఉండగా నేను భోజనం చేయలేను. నా కష్టాలన్నీ నువు్వ తీసుకోగలిగితే, నేను సంతోషంగా భోజనం చేస్తాను,'' అన్నది వృద్ధురాలు. వెంటనే శివదాసు, ``ఈ క్షణం నుంచి నీ కష్టాలన్నీ నేను తీసుకుంటున్నాను. వచ్చి భోజనం చెయ్యి తల్లీ,'' అన్నాడు శివదాసు. ఆ మాటకు వృద్ధురాలి ముఖం విప్పారింది. ``సంతోషం, నాయనా. ఎదుటి వారి కష్టాలు స్వీకరించగలవారు ఎందరుంటారు? తప్పక నీ ఆతిథ్యం స్వీకరిస్తాను. అయితే, ఇంట్లోకి మాత్రం రాను. ఇల్లు నాకు ఇరుకుగా ఉంటుంది. ఇక్కడే ఉంటాను. వెళ్ళి భోజనం తీసుకురా. మరో మాట. ఈ రోజు నాకెందుకో రొట్టెలు తినాలని ఉంది. ఉంటే జొన్నరొట్టెలు తీసుకురా నాయనా,'' అన్నది.

``అలాగే నమ్మా'' అంటూ లోపలికి వెళ్ళి, భార్య చేత త్వరత్వరగా రెండు జొన్నరొట్టెలు చేయించి, బయటకు వచ్చిన శివదాసు అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంత పోయాడు. వృద్ధురాలు కనిపించలేదు. ఆమె కూర్చున్న చోట అన్నపూర్ణేశ్వరీ దేవి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి నాగసర్పం పడగ పట్టి ఉంది. తన ఇంటికి వచ్చింది సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరీ దేవి అని గ్రహించి శివదాసు ఆనందంతో ఉప్పొంగి పోయాడు. క్షణాల్లో వార్త ఊరంతా తెలిసిపోయింది. జనం గుంపులు గుంపులుగా వచ్చి దేవిని దర్శించుకున్నారు. మూడు నెలలు తిరిగే సరికి అందమైన ఆలయం నిర్మించి అమ్మవారిని అందులో ప్రతిష్ఠించారు. క్రమక్రమంగా ఎక్కడెక్కడినుంచో వచ్చే భక్తులకు దేవీపురం ప్రజలు ఆతిథ్యం ఇచ్చేవారు. ``మీ కష్టాలు మేం స్వీకరిస్తున్నాం. మీకు అంతా శుభం జరుగుతుంది,'' అని చెప్పి రొట్టెలు పంచేవారు. అప్పటి నుంచి యేటా రొట్టెల పండుగ జరపడం దేవీపురం ప్రజలకు ఆనవాయితీ అయింది. ఆ రొట్టెలు తిన్న వారికి అంతవరకూ ఉన్న సమస్యలు తీరిపోయి మనశ్శాంతి లభించేది. అంతే కాకుండా దేవీపురం గ్రామస్థులు పంచే రొట్టెలు అద్భుతమైన రుచితో, రాజుగారి ఇంట కూడా అంత రుచికరమైన రొట్టెలు దొరకవని పేరు గడించాయి. ఆ సంగతి రాజుగారి వరకు వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడి ప్రధాన వంటవాణ్ణి పిలిచి సంగతి చెప్పి, ``దేవీపురం రొట్టెలకు అంత ప్రసిద్ధి ఎలా వచ్చింది? ఒకసారి ఆ ఊరు వెళ్ళి, రొట్టెలను వాళ్ళెలా తయారు చేస్తారో తెలుసుకో,'' అన్నాడు. ``రొట్టెల రుచి తయారు చేయడంలో లేదు ప్రభూ. వాటిని చేయించి ఇచ్చేవారి గొప్పగుణం, తినేవారు కోరుకునే మంచి కోరికలను బట్టి, ఉంటుంది,'' అన్నాడు వంటవాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ``నా చిన్నప్పుడు దానికి సంబంధించిన ఒక విచిత్ర సంఘటన జరిగింది, ప్రభూ,'' అన్నాడు వంటవాడు. ``ఏమిటది?'' అన్నాడు రాజు. ``దేవీపురానికి పొరుగునే ఉన్న మంగాపురం మా స్వగ్రామం,'' అంటూ వంటవాడు ఇలా చెప్ప సాగాడు: ఆ ఊళ్ళో సంగడనేవాడు దొంగతనాలు చేస్తూ రోజులు గడిపేవాడు.

అయితే, వాడి భార్య గౌరి, ``ఎంత కాలమని ఈ దొంగబతుకు బతగ్గలం? ఏ క్షణాన నీకేం జరుగుతుందోనని నేనెంత భయపడుతున్నానో నీకు తెలియదు. దొంగతనాలు మానేసి కష్టపడి పనిచెయ్�. కలో గంజో తాగి తృప్తిగా బతుకుదాం,'' అంటూ తరచూ పోరసాగింది. భార్యకు తనంటే ఎంత ప్రేమో తెలిసిన సంగడు కొన్నాళ్ళకు ఆమె మాటల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అప్పుడే వాడికి దేవీపురం వెళ్ళి రొట్టెలు తింటే అనుకున్నది జరుగుతుందని తెలియ వచ్చింది. అక్కడికి వెళ్ళి రొట్టెలు తిని, ఎవరికీ తెలియకుండా పెద్ద దొంగతనం ఒకటి చేసి, జీవితంలో స్థిరపడి ఆ తరవాత దొంగతనాల జోలికి పోకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటికప్పుడే సంగడు దేవీపురం బయలు దేరాడు. మార్గ మధ్యంలో ఎదురు వచ్చినవారు తాము తిన్న రొట్టెల రుచి గురించి చెప్పుకుంటూంటే, సంగడికి నోరూరింది. ``ఈ రోజు నా పంట పండింది. రుచికరమైన రొట్టెలు. బోలెడంత ధనం దొరుకుతుంది,'' అనుకున్నాడు. దేవీపురం చేరగానే రాందాసు అనే గృహస్థు ఎదురువచ్చి, ``అయ్యా, మా ఇంట ఆతిథ్యం స్వీకరించండి,'' అని చెప్పి సంగణ్ణి తన వెంట తీసుకుపోయి, ``మీ కష్టాలన్నిటినీ నేను స్వీకరిస్తున్నాను. మీకు శుభం జరుగుతుంది,'' అని చెప్పి రొట్టెలు ఇచ్చాడు. సంగడు రొట్టెను నోట్లో పెట్టుకుని కొరికి దిగ్భ్రాంతి చెందాడు. అది భరించ లేనంత చేదుగా ఉంది. అది తెలియని రాందాసు, ``రొట్టె రుచిగా ఉంది కదా? అంతా అన్నపూర్ణేశ్వరి మహిమ!'' అన్నాడు. సంగడు మింగలేక, కక్కలేక ఒక రొట్టె తిని, మిగిలినవి మూటగట్టుకుని బయలుదేరాడు. రొట్టె బాగుండకపోతే పోయింది, రాందాసు దీవించినట్టు శుభం జరిగితే చాలనుకుంటూ, సంగడు ఆ రాత్రి ఒక ధనికుడి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. అక్కడా వాడికి చేదు అనుభవమే ఎదురయ్యింది. పట్టు బడినవాణ్ణి ధనికుడి నౌకర్లు చితగ్గొట్టి వదిలారు. ముక్కుతూ మూలుగుతూ ఇల్లు చేరిన సంగణ్ణి చూసి, వాడి భార్య, ``వద్దంటే మానవుకదా?'' అని కళ్ళ నీళు్ళ పెట్టుకుని, ``ఇకపై అంతా మంచి జరగాలని దేవీపురం వెళ్ళి రొట్టెలు తెచ్చాను, తిను,'' అంటూ రెండు రొట్టెలు ఇవ్వబోయింది. 

``నేనే స్వయంగా దేవీపురం వెళ్ళి రొట్టె తిన్నాను. చెప్పలేనంత చేదుగా ఉంది,'' అన్నాడు సంగడు బాధగా. ``మా అందరికీ ఎంతో రుచిగా ఉన్న రొట్టెలు, నీకు మాత్రం ఎందుకు చేదుగా ఉన్నాయి? అంటే అమ్మవారు నీ దుర్బుద్ధిని గ్రహించిందన్న మాట! ఇప్పుడు చెబుతున్నాను. నువు్వ దొంగతనాలు మానకపోతే, ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను,'' అన్నది గౌరి కన్నీళు్ళ ఒత్తుకుంటూ. ``అంత పని చేయకు. దొంగతనాలు మానేస్తాను,'' అని భార్య దగ్గర ఒట్టు వేసిన సంగడిలో, అందరికీ రుచిగా ఉన్న రొట్టెలు తనకు మాత్రం ఎందుకు చేదుగా ఉన్నాయి? అన్న అనుమానం తలెత్తింది. ఆమాటే భార్యతో అన్నాడు. ``ఈ సంవత్సరమంతా బుద్ధిగా నడుచుకో. అప్పుడు తెలుస్తుంది అమ్మవారి రొట్టెల రుచి,'' అన్నది గౌరి. ఆ రోజు నుంచి కూలిపనులు చేసుకుంటూ రోజులు గడుపుతూన్న సంగడికి అప్పుడప్పుడు దొంగతనాల మీదికి మనసు మళ్ళేది. అయినా, అతి ప్రయత్నం మీద వాటి జోలికి పోకుండా నిలదొక్కుకున్నాడు. సంవత్సరం గడిచాక, భార్యతో కలిసి దేవీపురం రొట్టెల పండుగకు వెళ్ళి, రొట్టెలు అందుకున్నాడు. ఒక రొట్టె నోట్లో వేసుకోగానే అద్భుతమైన రుచిగాతోచింది. వాడికి తెలియకుండానే కళ్ళల్లో నీళు్ళ తిరిగాయి. అమ్మవారి గుడికి వెళ్ళి, ``క్షమించు తల్లీ, ఇక ఈ జన్మలో దొంగతనాల జోలికి వెళ్ళను,'' అని భక్తితో చేతులెత్తి మొక్కుతూ ప్రార్థించాడు. భర్తలో వచ్చిన మార్పుకు గౌరి సంతోషించింది. రెండేళు్ళ తిరిగే సరికి భార్యాభర్తలు కూలిపనులకు వెళ్ళే స్థితి నుంచి, సొంతపొలంలో పనిచేసుకునే స్థాయికి ఎదిగారు. సంగడి కథ విన్న రాజు ఒకసారి దేవీపురం వెళ్ళి అన్నపూర్ణేశ్వరీ దేవిని దర్శించుకుని రావాలనుకున్నాడు. రాజు పరివారంతో బయలుదేరి వెళ్ళి, ప్రజలు ఎలాంటి కొరతా లేకుండా శాంతి సుఖాలతో జీవించాలని దేవికి మొక్కుకున్నాడు. గుడి నుంచి వెలుపలికి రాగానే, ఒక పేద రైతు అందించిన రొట్టెలు తిని, వాటి రుచికి ముగ్ధుడయ్యాడు. ఎదుటివారి కష్టాలను స్వీకరించే కరుణాహృదయంగల దేవీపుర గ్రామ ప్రజలకు ఎలాంటి కొరతా రాకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నాడు.