Pages

Monday, August 20, 2012

బాదరాయణ సంబంధం

ఒక ఊరిలో రైతు దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. ఊళ్ళో అందరికీ సహాయంచేస్తూ మంచిపేరు పొందారు.

ఓరోజు వాళ్ళు భోజనం చేసే సమయంలో ఇంటిముందు ఎడ్లబండి ఒకటి  వచ్చింది. ఆ బండి యజమాని బండిని ఆపి ఎడ్లను వారింటి రేగుచెట్టుకి కట్టివేసి మేతవేసి, బావి వద్దకు వెళ్ళి అక్కడే ఉన్న బాల్చీతో నీటిని తెచ్చి ఎడకు పెట్టాడు.   కాళ్ళూ  చేతులు  శుభ్రపరచుకొని   సరాసరి  ఇంట్లోకివచ్చి  అక్కడేఉన్న తువ్వాలుతో  తుడుచుని  వెళ్ళి అరుగుపై   కూర్చున్నాడు.
రైతుకి అతడెవరైంది తెలియలేదు  అతని చొరవచూసి  చాలా దగ్గరి బందువులాగే ఉన్నాడు అనుకున్నాడు.  అడగటం మర్యాదకాదని మౌనంగా ఉండిపోయాడు.

రైతు భార్య ఆ వచ్చినాయన భర్త తరుపు చుట్టమని అనుకుంది,  కుశలం అడుగుదామనుకుంది గానీ వచ్చినాయన  ఎవరో  ఇప్పటిదాకా  తను చూడలేదు,  మీరెవరూ అని అడగటం మర్యాదకాదు అనుకుంది  తరువాత భర్త చెపుతాడులే అని ఊరుకుంది.

స్నానానికి నీళ్ళు పెడితే స్నానం చేసి వచ్చాడు అతను.ఒక్కమాటా మాట్లాకుండా   రైతుతో పాటుగా కూర్చుని  రైతు భార్య  పెట్టిన భోజనం సుష్టుగా తిన్నాడు.  తరువాత  కాసేపు అరుగుపై నడుంవాల్చాడు.

ఎండతగ్గి చల్లబడగానే  బండి కట్టుకున్నాడు,  బయల్దేర బోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక్కమాటా మాట్లాడలేదు,   వెళ్ళే ముందు కనీసం పలకరించటం తన బాధ్యత అనుకున్న రైతు  ఆ వ్యక్తి ని మాట్లాడిస్తూ

“అప్పుడే వెళ్ళిపోతున్నారు,   రెండు రోజులు ఉండి వెళ్ళండి.   ఇంతకీ మీరు నా భార్యకి ఏమవుతారు?”   అన్నాడు.
అప్పుడా బండి యజమాని    “నా బండి చక్రాలు రేగు కర్రతో చేసినవి మీ  ఇంట్లో రేగుచెట్టు ఉంది.  అలా మీకు మాకు రేగు సంబంధం వల్ల చుట్టరికం కలిసింది”  అంటూ  బండితోలుకుని వెళ్ళిపోయాడు.

ఇదీ బాదరాయణ సంబంధం వెనుక ఉన్న కథ.

పొన్నాపూల కథ

అనగనగా ఒకరాజుగారు ఆయకు ఏడుగురు కూతుళ్ళు ఉండేవారు.  వాళ్ళలో అందరికంటే చిన్నఅమ్మాయి  అద్భతమైన అందగత్తె,చాలా మంచిది, కానీ ఆమెచాలా అమాయకురాలు.

రాజుకి చిన్న కూతురిపై ఎంతో ఇష్టం, చాలా ముద్దుగా చూసేవాడు.  అది మిగతా కూతుళ్ళకి అస్సలు నచ్చేదికాదు.  వాళ్ళు  ఆ అమ్మాయిని ఎప్పుడూ  ఏడిపించేవాళ్ళు.

ఓరోజు వాళ్ళు  పొన్నాగ పూలు ఏరుకురావటానికి వెళ్ళారు.  ఆ చెట్టు చాలా పెద్దది చిన్నమ్మాయితో ఆమె అక్కలు అన్నారు

“చిన్నమ్మాయి  నిన్ను చెట్టు ఎక్కిస్తాము, నీ బుట్ట మేము నింపి పెడతాము  నువ్వు పూలు దులుపు”   అని.
అందరూ కలిసి చిన్న అమ్మాయిని చెట్టుఎక్కించేసారు. ఆమె పూలన్నీ దులిపింది.  ఆరుగురు అమ్మాయిలు తమ గంపలనిండా పూలన్నీ ఏరుకున్నారు.

చీకటిపడబోతూ ఉంది  అందరూ కలిసి కూడబలుక్కుని  చిన్నమ్మాయిని  చెట్టు దించకుండానే వదిలేసి  వెళ్ళిపోయారు.
చీకటి పడిపోయింది. చిన్నమ్మాయికి  చాలా భయం వేసింది, కాని ఆమెకి చెట్టు దిగడం చాతకాదయె. అలాగే ఏడుస్తూ చెట్టుపై ఉండిపోయింది.

ఇంతలో ఆపక్కగా ఓ పిల్లి వెడుతూ కనిపించింది. “పిల్లీ పిల్లీ నన్ను కాస్త కిందకు దింపవూ”  అంటూ అడిగింది చిన్నమ్మాయి.

“నేనే చాలా చిన్నదాన్ని నిన్నెలా దింపగలను”   అంటూ తనదారిన తాను వెళ్ళిపోయింది పిల్లి.
ఇంతలో అటుకేసి ఓ కోతి వచ్చింది. దాన్ని అడిగితే అదీ అలాగే సమాధానమిచ్చి  వెళ్ళిపోయింది.
అలాగే పిట్టా, చెవులపిల్లి, ముళ్ళపంది ఇలా ఎన్నో చిన్న చిన్న  జంతువులు వచ్చాయి ఆ దారి వెంట. కానీ ఏ ఒక్కటి చిన్నమ్మాయి  చెట్టుమీదనుండి కిందకు దించలేదు. పాపం ఆమె అలాగే ఏడుస్తూ చెట్టుపైనే ఉండిపోయింది.

అర్ధరాత్రి అయ్యాక ఓ పులి  అటు వైపుగా వచ్చింది.

“పులీ నువ్వు ఎంతో బలంగా పెద్దగా ఉన్నావు నన్ను కిందకు దింపి వెళ్ళవా”  అని అడిగింది చిన్నమ్మాయి.
దానికి పులి   “నేను పులిని తినేయటమేగానీ  నేను అలాంటి పనులు చేయను. ఇప్పుడు నిన్ను తినేయబోతున్నాను”    అంటూ మీదకు వచ్చింది.
చిన్నమ్మాయి బాగా ఆలోచించి. “సరే నన్ను తినేసేయ్ కానీ దయచేసి నాకోరిక ఒకటి తీర్చు”  అంది.
“సరే ఏమిటో చెప్పు”  అంది పులి.
“నన్ను పూర్తిగా తినకుండా నా చిటికన వేలు మాత్రం వదిలేయి”  అంది
పులి ఆ అమ్మాయిని భోంచేసి ఆమెకి మాటిన ప్రకారం ఆమె చిటికెన వేలు మాత్రం  వదిలేసి  తనదారిన వెళ్ళిపోయింది.

తెల్లవారగట్ల చీకటితోనే  ఆ దారిలో జగం వాడొకడు  వెళుతున్నాడు. ఆ చెట్టుకింద పడిఉన్న ఆమె చిటికెన వేలు అతడి కాలికి తగిలింది. అతడు  దాన్ని సొంటికొమ్ము అనుకుని తీసుకెళ్ళి ఓ కుండలో పెట్టేసిమర్చిపోయాడు.

కొద్దిరోజులు పోయాక  ఆ జంగంవాడికి ఓ రోజు బాగా తలనెప్పి వచ్చింది.  కుండలో దాచిన సొంటికొమ్ము  గుర్తొచ్చింది, దానితో తలకు పట్టీ వేసుకుంటే తలనెప్పి తగ్గిపోతుంది అందుకే వెళ్ళి కుండ మూత తీసి చూసాడు. విచిత్రంగా  దాంట్లోంచి  అమ్మాయి బయటకి వచ్చింది.  ఆమెని చూసిన జంగం వాడు పిల్లలులేని తనకు దేవుడే  ఈ పిల్లను పంపాడని మురిసిపోయి  పెంచుకోసాగాడు.

అలా కొద్దిరోజులు గడిచాక  ఓనాడు  ఆమె   “నాన్నా నేనూ భిక్షకి వెళతాను”  అని అడిగింది.
సరే  కాస్త పెద్దదైపోయిందిగా తప్పిపోకుండా తిరిగొస్తుంది లెమ్మని  ఆ జంగం వాడు ఆమెని భిక్షకి పంపించాడు.
ఆమె అందరి ఇండ్లూ తిరుగుతూ రాజుగారి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆమెకి గతం గుర్తొచ్చింది. వెంటనే ఇలా పాడింది.
ఒక రాజుకి ఏడుగురు పిల్లలం
పొన్నాపూలకు పోయాము
పొన్నాచెట్టు ఎక్కాను
అక్కలు వదిలిపోయారు
పులిరాజు బుక్కపెట్టే భిక్షాం  దేహీ

ఆ పాటవిని రాజు వచ్చి   “ఎవరునువ్వు  పొన్నా పూల  సంగతి చెపుతున్నావేమిటి”  అని అడిగాడు.

అప్పుడు ఆ అమ్మాయి అక్కలు మోసం చేసారని జరిగిన కథంతా చెప్పింది.  ఆమే చిన్నమ్మాయి అని రాజు ఎంతో సంతోషించాడు. మిగతా ఆరుమంది కూతుళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు.

కుందేలు ఉపాయం

ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఉంటుండేవి. ఆ అడవిలోని సింహం అంటే వాటికి చచ్చేంత  భయం. అది గనక ఏ జంతువునన్నా చూసిందో ఇక దానికి మూడినట్టే  ఆకలి వేసినా వేయకున్నా  కనిపించిన జంతువునల్లా  చంపి పడేసేది.  అందుకే  జంతువులన్నీ  ఆ సింహానికి  కనిపించకుండా  జాగ్రత్తగా  మెసలుతుండేవి.

ఆ అడవిలోనే ఓ కుందేలు ఉండేది. ఓ చోట పెద్దగుబురు పొదలో అది నివసించేది. శత్రువుల కంటపడకుండా ఉండేట్టు  దట్టంగా ఉండేవి ఆ పొదలు. వాటికి కావలసిన  మెత్తటి పచ్చగడ్డి,  క్యారెట్ లు  ఆపొదలోనే దొరికేవి ఇక అవి ఎక్కడికీ వెళ్ళకుండా ఆ పొదలోనే ఉండేవి హాయిగా.

ఓ సారి ఆకుందేలు అడవంతా తిరిగి చూడాలని అనుకుంది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా  ఆ పొద విడిచి బయల్దేరింది. ఎంచక్కా హాయిగా అడవి అందాలు చూస్తూ ఆ రోజంతా తిరిగింది.  సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అది ఇంకా అడవిలోని  అతి పెద్ద నదిని చూడనేలేదు. ఆ నదిని  గురించి అందరూ మాట్లాడుకొనే మాటలు గుర్తొచ్చాయి. ఆ నది ఎంతో పెద్దది, అందమైనది, తెల్లటి పాల నురుగు లాంటి నీరు  వేగంగా వెళుతూ ఉంటుందట, దాని తుంపర్లు ఒడ్డున పడుతూ అక్కడంతా అద్భుతంగా ఉంటుందట.

నది తీరంలోని అందమైన పూల, పండ్ల చెట్లు ఉంటాయట.  ఆ నది చూడకుండా ఇంటికి వెళ్ళటం దానికి అస్సలు నచ్చలేదు. ఎంత, ఇలావెళ్ళి అలా వచ్చేయవచ్చు అనుకుంది. నది దగ్గరకు వెళ్ళింది.  అక్కడ  నది ఒడ్డున పచ్చిక పై ఆడింది పాడింది. నదిలోని నీటి తుంపర్లు దానిపై పడుతూ ఉంటే దానికి భలే గమ్మత్తు గా అనిపించింది. అది ఆటల్లో పడి చీకటి పడిందనే సంగతే గమనించలేదు.

కాసేపటికి అది ఇంటికి వెళదామని బయల్దేరింది.  చూస్తే దాని ఎదురుగా సింహం.  అది నీటికొరకు నదికి వచ్చింది. కుందేలుకి దాన్ని చూడగానే భయం వేసింది, ఎందుకంటే ఆ చెడ్డ సింహం గురించి  అది ముందే వినిఉంది.  ఎలా తప్పించుకోవాలా అని గబ గబా ఆలోచించింది.  దానికో ఉపాయం తట్టింది.

అది వెంటనే సింహం వైపు పరిగెడుతూ  “ప్రమాదం! ప్రమాదం!”  అంటూ అరచింది.

సింహానికి చాలా కోపం వచ్చింది  “ఎవరికి ప్రమాదం? నన్నెవరూ ఏమీ చేయలేరు. నీ పిచ్చిమాటలు ఆపు.”  అంది.

“సింహం గారు నేను ఈ పొదలో ఉండి చూస్తూ ఉన్నాను. పదిమంది మనుషులు వచ్చారు, చూడబోతే వేటగాళ్ళలా ఉన్నారు.  చేతిలో తుపాకీలు ఉన్నాయి.”  అంది కుందేలు.

సింహానికి కాస్త  భయం వేసినా  జంకకుండా  “ఓహో! మరి వాళ్ళేరి? ఎందుకోసం వచ్చుంటారు?”  అంటూ అడిగింది.

“వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, చుట్టూ ఉన్న ఆపొదల్లో దాక్కుని ఉంటారు. ఈ రోజు ఎలాగైనా  సింహాన్ని చంపి పట్టుకుపోవాలని వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవులారా విన్నాను, మీరు తప్పించుకోవాలంటే  వెంటనే ఈ నది దాటి ఆ ఒడ్డుకు వెళ్ళి పోవలసిందే.ఆలస్యం చేస్తే మీకే ప్రమాదం” అంటూ తెలివిగా చెప్పింది.

సింహానికి భయం వేసింది కానీ కుందేలు ముందు బయట పడకుండా   “వాళ్ళు నన్నేం చేయలేరు. నేనంటే ఏమిటో నీకు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు త్వరగా వెళ్ళిపో లేకపోతే నీకే ప్రమాదం వాళ్ళు నిన్ను పట్టుకు పోతారు.”  అంది. కుందేలు చూస్తుండగా పారిపోవటం అంటే సింహానికి సిగ్గేసి అలా అందన్నమాట.

అప్పుడు కుందేలు ఇదే అదను అనుకుని  “ఆహా ఓహో సింహం గారు మీరు చాలా గొప్పవారు, నా కైతే భయం వేస్తుంది నేను పారిపోతున్నాను.”  అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.తననెవరూ చూడటం లెదని నిర్ణయించుకున్న సింహం వెంటనే  నదికి అడ్డం పడి ఈదుతూ పారిపోయింది.

అనగనగా ఒక పేను కథ

ఒక పేను చేటంత పెసరచేను వేసుకుంది.   ఆ చేను చక్కగా కాసింది.   ఓనాడు ఆ దారిన వెళుతున్న రాజుగారు  ఆ చేను చూసి  పంటంతా కోసుకుపోయాడు. పేనుకు  చాలా దుఖం  వేసింది.

నా పంట అంతా  దోచుకు పోయిన  రాజు ని ఎలాగైనా  చంపాలి అనుకుని, ఓ బండికట్టుకుని  బయల్దేరింది.   తనతోపాటుగా అది  కొన్ని రొట్టెలు  కూడా తెచ్చుకుంది.

అది అలా వెళుతూ ఉంటే  దానికి  దారిలో  ఓ తేలు కనిపించింది  “పేను బావా ఎక్కడికి బయల్దేరావు?”  అంటూ అడిగింది  తేలు.

దానికి పేను “నా పెసర చేనంతా నాశనం చేసి పంటంతా దోచుకెళ్ళాడు రాజు, ఆ రాజుని చంపేసేయడానికి  బయల్దేరాను  నువ్వూ నాతో వస్తావా?”  అని అడిగింది.
సరే నని  తేలు పేనుతో కలిసి  బయల్దేరింది. దానికి ఒక రొట్టె ఇచ్చింది పేను.
అవి రెండూ కలిసి ప్రయాణం సాగించాయి.

కొద్దిదూరం వెళ్ళాక వాటికి ఒక పాము  కనిపించింది  తేలూ, పేనూ కలిసి ఎక్కడి వెళుతున్నాయో  తెలుసుకుంది పాము.
“నువ్వూ మాతో రాగూడదూ  అందరం కలిసి ఆ రాజుకి తగిన శాస్తి చేద్దాం.” అని  అడిగాయి  అవి.  సరేనంది  పాము. పాముకి కూడా  తన  రొట్టేల్లోంచి  ఒకటి  తీసి  ఇచ్చింది  పేను.

అలా అవి మూడూ  వెళ్తుండగా  వాటికి కనిపించింది  ఒక గుండ్రాయి.   దానికి  రాజు చేసిన  పని  చెప్పి,  మాతో  వస్తావా  అని  అడిగారు  వీళ్ళు  ముగ్గురు.  సరే నని బయల్దేరింది  గుండ్రాయి.
పేను, తేలు, పాము,  గుండ్రాయి  నలుగురు రాజుగారి  ఊరు సమీపానికి వచ్చేసరికి  వాటికి  అక్కడ ఒక  పెద్దపులి  ఎదురైయ్యింది.

” ఏంటీ!  అందరూ  కలిసి  ఇలా  బయల్దేరారు? ఎక్కడికి? ఎందుకు?”  అంటూ ప్రశ్నలు  కురిపించింది  పెద్దపులి.

“రాజు నా చేను నాశనం చేసి నా పంటంతా దోచుకెళ్ళాడు  అతడికి  తగిన  బుద్ది చెప్పి, నా పంట వెనిక్కి తెచ్చుకుండామని ఇలా వచ్చాను  వీళ్ళంతా నాకు సాయం వచ్చారు.”  అని  చెప్పింది  పేను  పెద్ద పులితో.

” అయ్యో  అలాగా నేనూ మీతో వస్తాను.” అంది  పెద్దపులి.

సరేనని  దానికి బదులుగా  పులికి  ఒక రొట్టే ఇచ్చింది పేను.

అందరూ  కలిసి  రాజుగారి  ఇంటికి  చేరుకున్నారు.  పులి ఎవరి  కంటా పడకుండా  లోపలికి  వెళ్ళలేదు  కనుక  అది  వీధి లోనే  దాక్కుంది.

గుండ్రాయేమో  ఇంటిబయట  గుమ్మంపైన  నక్కి  దాక్కుంది.

పేను రాజుగారి  దువ్వెనలో  దాక్కుంది. తేలు తల గడలో  కనిపించకుండా  దాక్కుంది.  పాము  ఆ గదిలో  ఓ  మూలన  ఎవరికీ  కనిపించకుండా  నక్కింది.

అంతలోకి  రాజుగారు  వచ్చారు  అతడు తలదువ్వుకుంటూ  ఉంటే  పేను  తలలోకి  చేరి కసా పిసా  కుట్టేసి  తన కోపం తీర్చుకుంది. రాజు కి  చిరాకు ఎక్కువై  కాసేపు  పడుకుందామని  పడుకున్నాడు.
చీకటి  పడేదాక  ఆగిన తేలు  రాజుని  కుట్టేసింది,  ఆ  చీకట్లో  రాజు  కంగారుగా లేచికూర్చున్నాడు,

అంతలోకి  అక్కడే  ఉన్న  పాము  బుస్సు  బుస్సు  మంటూ  బుసకొట్టసాగింది.  దానితో  రాజుకి  భయం  వేసి  గబ గబా  ఇంటి  బయటకి  రావటానికి  తలుపు  తీయగానే  ఆ గుండ్రాయి  టప్పు  మని  ఆయన  తలపై  పడింది.

దానితో   హడలిపోయిన  రాజు   గబ గబా  వీధిలోకి  పరిగెత్తాడు  వీధిలో  చీకటి  చాటున  దాక్కున్న  పులి  అమాంతంగా  రాజుపై పడి  ఆయన్ని  తినేసింది.

పేను  తన పెసలు తాను తీసుకుని సంతోషంగా  ఇంటికి  తిరికి వచ్చింది.

ఏడు చేపలు – చెక్కిలిగిలి కథ

అనగా  అనగా  ఒక ఊళ్ళో ఒక రాజుగారు  ఉన్నారు.  ఆయనకి  ఏడుమంది  కొడుకులు  ఉన్నారు. ఓరోజు  వాళ్ళు  వేటకి  వెళ్ళి  ఏడు చేపలు  తెచ్చారు.  వాటిని  ఎండలో  పెట్టారు.  అందరి  చేపలూ  ఎండాయి  కానీ  చివరి  అబ్బాయి  చేప  ఎండలేదు. అప్పుడు  ఆ  చిన్న  అబ్బాయి  చేపని  ఇలా  అడిగాడు.
“చేపా  చేపా  ఎందుకు ఎండలేదు?”

“ఎండ  సరిగా  తగలకుండా  గడ్డిమోపు  అడ్డంగా  ఉంది.” అంది  చేప

“గడ్డి మోపు  గడ్డి మోపు  ఎందుకు  అడ్డంగా  ఉన్నావు?”  అని  గడ్డిమోపుని  అడిగాడు  అబ్బాయి.

“నన్ను  ఆవు  మేయలేదు  అందుకే అలా అడ్డంగా ఉన్నా.” అంది  గడ్డిమోపు.

“ఆవూ  ఆవూ  ఎందుకు  గడ్డి  మేయలేదు?”  అడిగాడు  అబ్బాయి.

“పిల్లవాడు  మేపలేదు.”  అంటూ  చెప్పింది  ఆవు.

“పిల్లవాడా.. పిల్లవాడా  ఎందుకు  ఆవుని  మేపలేదు.” అని  అడిగాడు  అబ్బాయి.

“అమ్మ  అన్నం  పెట్టలేదు,  అందుకే  నేను  ఆవుని మేపడానికి  వెళ్ళలేకపోయాను.”  అంటూ  బదులిచ్చాడు  గొల్లపిల్లవాడు.

“అమ్మా  అమ్మా  ఎందుకు  అన్నం  పెట్టలేదు?”  అమ్మనడిగాడు  అబ్బాయి.

“చిన్ని పాప  ఏడుస్తోంది.” అందుకే వండలేదంది  అమ్మ.
“చిన్ని పాప  చిన్ని పాప  ఎందుకేడుస్తున్నావు?”  అన్నాడు  అబ్బాయి.

“నన్ను చీమ కుట్టింది.”  అంది  చిన్ని పాప

“చీమా  చీమా  ఎందుకు  కుట్టావు?”   చీమని  ప్రశ్నించాడు  అబ్బాయి.

“మరి  నా  బంగారు  పుట్టలో  వేలు పెడితే.. కూట్టనా..కుట్టనా… కుట్టానా……. అంటూ  కుట్టేసింది  చీమ.

ఒక్క వెంట్రుక రాణి

అనగనగా  ఒకరాజుకి  ఇద్దరు  భార్యలున్నారు.  పెద్ద భార్యకి  రెండు  వెంట్రుకలు  ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాళి, ఎవరితోనూ సరిగ్గా  నడచుకోదు.  రాజుగారి  చిన్న భార్యకి ఒక్కటే  వెంట్రుక ఉంది. ఈవిడ చాలా  నెమ్మది  గుణం కలది  అందరితో  స్నేహంగా  దయగా  ఉండేది.

పెద్ద  భార్యకి  తనకి  రెండు వెంట్రుకలున్నాయని  అందుకని  ఒకటే  వెంట్రుక  ఉన్న చిన్న రాణీ కంటే  తనే  అందంగా ఉన్నానని   అనుకునేది.  ఓ రోజు రాజుతో  ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యంగా ఉంది  ఆమెని  ఇంట్లోంచి  వెళ్ళగొట్టేయమని  చెప్పింది. దానితో   రాజు  చిన్న  రాణీని  అడవికి  పంపించేసాడు.

చిన్న  రాణి  అడవిలో  అలా  వెళుతూ  ఉంటే  దారిలో ఆమెకి  ఆవులు కనిపించాయి

“మాకు కాస్త  కుడితి  కలిపి  పెట్టి వెళ్ళవా.”   అని  అడిగాయి.   ఆమె  సరేనని  ఎంతో  దయతో   వాటికి  కుడితి  కలిపి  పెట్టి  తన  దారిన  తను  వెళ్ళసాగింది.

అలా  కొంత దూరం  అలా వెళ్ళాక   ఆమెకి  ఓచోట   దారికి  రెండువైపులా  గులాబీ తోట   కనిపించింది.  ఆ  గులాబీ  మొక్కలు  చిన్న  రాణిని  చూడగానే

“ఇక్కడ ఉన్న  బావినుండి  నీళ్ళు  తోడి  మాకు  పోయావా.”  అని  అడిగాయి.   ఆమె  వాటికి  కావలసినన్ని  నీళ్ళు  తోడి  పోసింది.

ఇంకాస్త  ముందుకెళ్ళగానే    ఆ  దారిలో  ఎన్నో  చీమలు  వెళుతూ  ఉన్నాయి  అవి  ఆమెతో

“దయచేసి  మమ్మల్ని  తొక్కకుండా  వెళ్ళు.”  అని  అన్నాయి.
ఆమె  వాటిని  తొక్కకుండా  జాగ్రత్తగా  నడవసాగింది.

కొద్దిదూరం నడిచాక   ఆమెకి  ఒకచోట  పెదరాసి  పెద్దమ్మ  ఇల్లు  కనిపించింది.  అక్కడికి  వెళ్ళగానే  పెదరాసి  పెద్దమ్మ  చిన్నరాణీని  పిలిచి

“నా  ఇంటిని  అలికి,  అలంకరించి,  నాకు  కాస్త  వంట చేసి  పెడతావా?  నాకు  ఈరోజు  అస్సలు  ఓపిక లేకుండా పోయింది.”  అంది.

దానికి  చిన్న  రాణీ  ’అయ్యో పాపం  ముసలమ్మ  అన్ని  పనులు  చేసుకోలేదు  కదా’  అనుకుకుని  పెదరాసి  పెద్దమ్మ  ఇల్లు  అలికి  ముగ్గులేసి,  వంటచేసింది.

“ఎందుకిలా  అడవిలోకి  వచ్చావు ?”  అని  చిన్న రాణిని  అడిగింది  పెద్దమ్మ.
తనకు  ఒకటే  వెంట్రుక  ఉందని  పెద్ద  రాణీ  రాజుతో  చెప్పి  వెళ్ళగొట్టించేసింది  అంటూ  జరిగింది  చెప్పింది  ఆమె.

“నీకు  చాలా పొడవుగా వత్తుగా  జుట్టు రావాలంటే నేను  చెప్పినట్టు  చెయ్యి,   కనిపించే ఆ నది  వద్దకెళ్ళి  ఈ  కొబ్బరి కాయ  కొట్టి  నమస్కరించి  నదిలో  మూడు  సార్లు  మునిగి బయటకు వచ్చేసేయి.” అని  చెప్పింది
పెదరాసి పెద్దమ్మ

పెద్దమ్మ  చెప్పినట్టుగానే  మూడుసార్లు  నదిలో  మునిగి  లేచేసరికి  చిన్న  రాణికి  బారెడు జుట్టు  వచ్చేసింది.
ఆమె  సంతోషంతో  ఇంటికెళదామని  అనుకుంది  కానీ  ఇంటికి  ఎలా  వెళ్ళాలో  దారి  తెలియలేదు.  అప్పుడు  అక్కడే  ఉన్న  చీమలన్నీ  కలిసి  మీ  ఇంటికి  దారి  మేము  చూపిస్తాము  అంటూ  బారులుగా  ముందు  నడుస్తూ  దారి  చూప  సాగాయి.

అలా  వెళ్తుండగా   గులాబీతోటలోని  పూలన్నీ  “ఓ రాణీ  నువ్వు  నీళ్ళు  తోడిపోసినందునే  మా తోటంతా  ఇలా  పువ్వులతో  నిండిపోయింది,  ఇలా  వచ్చి  నీకు  కావలసినన్ని  పువ్వులు  తీసుకుని వెళ్ళు.”  అన్నాయి.
ఆమె  కావలసినన్ని  పూలు  తలలో  పెట్టుకుని  అందంగా  ముస్తాబై   వెళ్ళసాగింది.

అలా  కొద్ది దూరం వెళ్ళాక  మొదట  ఆమె  కుడితి  పెట్టిన  ఆవులు  ఆమెని  చూసాయి.
“చిన్న  రాణీ  నువ్వు  ఎంతో  మంచిదానివి  మేమూ  మీ ఇంటికి  వచ్చేస్తాం  రోజూ  పాలు ఇస్తాం, నువ్విలా  నడుస్తూ  ఎందుకువెళ్ళడం  అదిగో  ఒక  బండి  ఉంది  దానికి  మమ్మల్ని  కట్టి  బండిపై  హాయిగా  వెళ్ళు.”  అన్నాయి.

ఎంచక్కా బండిలో  కూర్చుని  చీమలు  దారిచూపిస్తుండగా  ఇంటికి  వచ్చేసింది  చిన్నరాణీ.  అప్పుడు  ఆమెని  చూసిన  రాజు  ఎంతో  సంతోషంతో ఇంట్లోకి  పిలిచి,  రెండే  వెంట్రుకలు ఉన్న  పెద్దరాణీ  ని  ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు.

పెద్దరాణీని రాజు  అడవికి  పంపేసాడు  అక్కడ  రాణీ కి కొన్ని  ఆవులు  కనిపించాయి    అవికూడా  కుడితి  కోసం  పెద్ద  రాణిని  అడిగాయి.  పెద్ద  రాణి  వాటిని  పట్టించుకోకుండా  తనదారిన  తాను  వెళ్ళసాగింది.

గులాబీ తోట లోంచి  వెళుతోంటే  అవి  చిన్న  రాణిని  అడిగినట్టే  పెద్ద రాణీని  కూడా  నీళ్ళు  తోడి  పోయమని  అడిగాయి.

పెద్దరాణి  “ఇక నాకేం  పనిలేదా  మీకు  నీళ్ళు  పోస్తూ ఉండాలా.” అంటూ  కోపంతో  తన  దారికి అడ్డంగా ఉన్న  కొమ్మలని  విరిచేస్తూ  వెళ్ళింది.

కొద్దిదూరం వెళ్ళాక  ఆమెకి  చీమలు  కనిపించాయి “దయచేసి  మమ్మల్ని  తొక్కకుండా  వెళ్ళు.” అన్నాయి.
పిచ్చి  చీమలు  మీవల్ల  ఏం ఉపయోగం  అంటూ  వాటిని  తొక్కేస్తూ  కాళ్ళతో  నలిపేస్తూ  నడిచింది  పెద్దరాణీ.

కాసేపటికి  ఆమె  పెదరాసి పెద్దమ్మ  ఇల్లు చేరుకుంది. “నా  ఇల్లు అలికి  అలంకరించి, నాకు  వంటచేసి  పెట్టు.”  అంది  పెద్దమ్మ.

“హు నేను  రాణీని  నేను  అలాంటి  పనులు  చేయను.”  అంటూ  విసుక్కుంది  పెద్దరాణి.

“సరే  ఈ  అడవిలోకి  ఎందుకొచ్చావు?”  అంటూ  అడిగింది  పెద్దమ్మ.

“ఎక్కువ వెంట్రుకలు  ఉన్నవాళ్ళే  అందమైన  వాళ్ళని  నేను  రాజుతో  చెప్పాను  అందువల్ల  ఇప్పుడు  చిన్నరాణికి   నాకంటే  ఎక్కువజుట్టు  వచ్చేసింది  అందుకే  నన్ను  వెళ్ళగొట్టేసాడు.”  అని  జరిగిందంతా  చెప్పింది  పెద్దరాణీ.

“కనిపించే  ఆ  నది  దగ్గరకు  వెళ్ళి ఈ  కొబ్బరికాయ  కొట్టి  నమస్కరించి,  నదిలో  మూడుసార్లు  మునగి  లేస్తే  నీకుకూడా  చిన్న  రాణి  జుట్టంత  జుట్టు  వస్తుంది.”  అంటూ  చెప్పి  కొబ్బరికాయ  ఇచ్చింది  పదరాసి  పెద్దమ్మ.

నది దగ్గరికెళ్ళి  కొబ్బరికాయ  కొట్టి  నదిలో  మూడు సార్లు  మునిగింది  పెద్దరాణీ.  ఆమెకీ  చిన్న  రాణి కున్నంత  జుట్టు  వచ్చేసింది.

’చిన్న  రాణి కున్నంతే  ఉంటే  ఇంక  నా  గొప్ప ఏముంది!  రాజుతో  చెప్పి  మళ్ళీ  ఆమెని  వెళ్ళగొట్టించేసేయాలంటే  ఆమెకంటే  పెద్దజుట్టు  నాకు  ఉండాలి  అనుకుంది  పెద్దరాణీ.
వెంటనే  ఇంకో మూడు  మునకలు  వేసింది.   అంతే  ఉన్న  జుట్టంతా  ఊడిపోయి  బోడిగుండై  పోయింది.

“అయ్యో  నాకున్న  రెండువెంట్రుకలూ  పోయాయే.”  అని  ఏడ్చుకుంటూ  వెళ్ళింది  పెద్దరాణీ.
అడవిలో   దారి తప్పిపోయింది  చీమలని  అడిగినా  అవిచెప్పలేదు  పైగా  ఆమెని  బాగా  కుట్టేసాయి.

గులాబీ  తోటలోకి  రాగానే  ఎండిపోయిన  గులాబీ  కొమ్మలన్నీ  ఆమెని  ముళ్ళతో  బాగా  కొట్టాయి.
అంతలోకి  అక్కడికి  వచ్చిన  ఆవులు  ఆమెని  తమ  కొమ్ములతో  పొడుస్తూ  అడవిలోకి  తరిమేసాయి.

చిలుక – కాకి

అనగనగా ఒక ఊరిలో ఒక రామ చిలుక ,కాకి ఉన్నాయంట.. అవి రెండూ స్నేహితులు..

అయితే చిలుకచురుకైనది …కాకి బద్దకస్తురాలు..ఒక రోజు రెండింటికి బాగా ఆకలి వేసింది..

అక్కడ దగ్గరలో ఉన్న జామ చెట్టు పై వాలి మంచి జామ కాయ కోసం వెతకడం మొదలు పెట్టాయి..

చిలక ఓర్పుగా అన్నీ వెదికి ఒక పండు జామకాయను తెచ్చుకుంది..కాకి బద్ధకం

తో ఒక పచ్చిజామను కోసుకుంది.. అయితే చిలుక తెచ్చిన పండిన జామను చూడగానే కాకి నోరు ఊరింది…

ఎలాగైనా అది దొంగిలించి తినేయాలనే ఆశ కలిగింది.. అందుకని చిలుకతో” బాగా అలసిపోయాం కదా స్నానం చేసి తిందామా” అంది.. పాపం అమాయకపు

చిలుక “మరి స్నానం చేస్తే ఎవరు మన జామకాయలకు కాపలా కాస్తారు” అని అడిగింది..

“ముందు నువ్వు చేసిరా నేను కాపలా కాస్తాను,తరువాత నేను స్నానం చేస్తాను నువ్వు

కాపాలా కాద్దువు” అని కాకి చిలకతో అంది..చిలుక అంగీకరించి కాకి కి తన జామకాయను

అప్పగించి వెళ్లి పోయింది..

ఆ వెంటనే కాకి చిలుక జామకాయను తీసుకుని పారిపోయింది.. కొద్ది సేపటి తరువాత వచ్చిన

చిలుకకు జరిగిన మోసం అర్ధం అయ్యి ఏడుపు మొదలుపెట్టింది … సరిగ్గా అటు పైన

పార్వతి పరమేశ్వరులు వ్యాహ్యాళికి వెళుతూ ఏడుస్తున్న చిలుకను చూసారు … వాళ్లకు

జాలి కలిగి చిలకమ్మ దగ్గరకు వచ్చి విషయం అడిగారు.

చిలుక ఏడుపు ఆపి కాకి చేసిన మోసం చెప్పింది వెక్కుతూ … అప్పుడు పార్వతి

పరమేశ్వరులు చిలకను ఓదార్చి మమ్ములను తల్చుకుని” ఒక చిన్ని గొయ్యి తవ్వి చూడు “అని

చెప్పి మాయం అయ్యారు..

చిలుక సరే అని దణ్ణం పెట్టుకుని చిన్న గొయ్యి తీసింది.. చిన్న జామకాయ

దొరికింది దానికి.. తింటే చాలా తీయగా ఉంది.. ఈసారి కొంచెం పెద్ద గొయ్యి తీసి

చూద్దాం అనుకుని కొంచెం పెద్ద గొయ్యి తీసింది..ఈసారి ఇంకొంచెం పెద్ద జామ కాయ

దొరికింది.. అది ఆనందం తో మళ్లీ దణ్ణం పెట్టుకుని ఇంకా పే..ద్ద గొయ్యి తీసింది

…దానికి చాలా పెద్ద జామ కాయ దొరికింది.. అది సంతోషం తో దాని పైకి ఎక్కి ఆడుకోవడం

మొదలు పెట్టింది..

అటుగా వెళుతున్న కాకి చిలుకను చూసింది …అంత పెద్ద జామ కాయ దానికి ఎలా

దొరికిందని ఆరా తీసింది.. మంచిదైన చిలుక కాకి చేసిన ద్రోహం

మర్చిపోయి జరిగిందంతా కాకికి చెప్పింది.. కాకి కి దుర్బుద్ధి పుట్టింది …

అది కూడా ఒక చోట కూర్చిని పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది.. విషయం అర్ధం

అయిన పార్వతి ,పరమేశ్వరులు నవ్వుకుని కాకి దగ్గరకు వెళ్లి ఎందుకేడుస్తున్నావ్ ?అని

అడిగారు..నా జామకాయ చిలుక దొంగిలించింది అని అబద్దాలు చెప్పింది కాకి..

అయితే చిన్న గొయ్యి తీసి చూడు అని కాకి కి చెప్పి మాయమయ్యారు వాళ్ళు..

కాకి ఆనందం గా చిన్న గొయ్యి తీసి చూసింది ..అందులో నుండి చిన్న తేలు వచ్చి

కుట్టింది దాన్ని.. అమ్మోయ్,బాబోయ్ అని గెంతుకుంటూ ఈ సారి పెద్ద గొయ్యి తీసింది

…ఈ సారి పెద్ద తేలు వచ్చింది అందులో నుండి.. కాకి కి తను చేసిన తప్పు

అర్ధం అయ్యిఎగురుకుంటూ చిలుక దగ్గరకు వచ్చి క్షమాపణ కోరింది..

అవి రెండు మళ్లీ మంచి స్నేహితులు అయిపోయాయి..

ఐసరబజ్జీ

అనగనగా ఓ వూళ్ళో   పుల్లయ్య,  పుల్లమ్మ అని  ఇద్దరు భార్యా భర్తలు  వుండేవారు. వాళ్ళకి  కొత్తగా పెళ్ళైంది.   పుల్లయ్యకు కోపం ఎక్కువ.   మొండివాడు కాస్త మూర్ఖత్వం కుడా ఉండేది.  పుల్లమ్మ నెమ్మది తనం మంచితనం వల్ల  భార్యతో పేచీలేవీ  లేకుండా  హాయిగానే ఉండేవాడు.

ఓ నాడు పుల్లయ్య  ను వాళ్ళ మేనమామ  తన పొలానికి  బావి కడుతున్నామని సాయం రమ్మని కబురు చేస్తే   ఆ  వూరు వెళ్ళాల్సి  వచ్చింది.  తిరిగి వచ్చేప్పుడు నీకోసం ఏదైనా తెస్తాను నీకేం కావాలో చెప్పు  అని అడిగాడు భార్యని.

నాకు వేరే ఏదీ వద్దు.  మీరు వెళ్ళే వూరినుండి   దగ్గరే  గనుక   మా అమ్మ గారి ఊరి దాకా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుని రావాలి అని  అడిగింది.  ఆ రోజుల్లో  ఇప్పటిలా ఫోను లు  ఉత్తరాలు లేవు.   పెళ్ళైన నాటినుండీ  ఊరి నుండి ఎవరూ రాలేదు.

అలాగే లెమ్మని పుల్లయ్య  బయల్దేరి వెళ్ళాడు.  మేనమామ వూళ్ళో  పని పూర్తయిన తరువాత  అక్కడికి కొంత దూరంలోవున్న  అత్తగారి ఊరు వెళ్ళాడు.

అల్లుడిని  చూసి  అత్తారింట్లో  అందరూ ఎంతో సంతోషించారు. అత్తగారు  పిండివంటలు  చేసి వడ్డించింది.  అన్నింటిలోకి  బెల్లం కుడుములు  బాగా నచ్చాయి  పుల్లయ్యకి.  ఎన్ని తిన్నా ఇంకా తినాలని పించిది.   మా ఇంట్లో  ఇవి ఎన్నడూ  వండుకోలేదు.  వీటి పేరేమిటి  అని అత్తని అడిగాడు.

నా కూతురు  కుడుములు బాగా వండుతుంది, వెళ్ళగానే  అడిగి చేయించు అని చెప్పింది అత్తగారు.

ఇప్పటిలా  బస్సులూ అవీ ఆ కాలంలో లేవుగా .  ఇంటికి  వెళ్ళడానికి రెండ్రోజులు  సమయం పడుతుంది. ఈ లోగా  ఆ కుడుములు అనే పేరు ఎక్కడ మర్చిపోతానో నని భయం పట్టుకుంది పుల్లయ్యకి.   దారివెంటా   కుడుములు కుడుములు  అనుకుంటూ  నడక మొదలెట్టాడు.   అలా వెళ్ళేదారిలో  ఓ కాలువ దాటాల్సివచ్చింది.  కుడుముల ఆనందంలో  ఒక్క సారిగా  ఐసరబజ్జీ  అంటూ  ఎగిరి కాలవ దూకాడు .   ఆవలకి దూకాక  కుడుములు పేరు మర్చిపోయాడు.  ఐసరబజ్జీ  అని మాత్రమే  గుర్తుంది అతడికి.  ఇంక అక్కడి  నుండి  ఐసర బజ్జీ  ఐసర బజ్జీ  అనుకుంటూ  రెండ్రోజుల పాటు నడిచి  తన ఊరు చేరుకున్నాడు.

పుల్లయ్య ను చూడగానే  భార్య  ఆనందంతో  ఎదురొచ్చింది.  మా అమ్మగారింటి సంగతులు ఏమిటీ అంటూ కుశలం అడగటం మొదలెట్టింది.   అవన్నీ  తీరిగ్గా  చెపుతాగానీ  నువ్వు  వెంటనే  ఐసరబజ్జీలు  చెయ్యి  నేను స్నానం  చేసొచ్చి  తింటాను  అన్నాడు.

అదెమిటీ  ఐసరబజ్జీ  చేయడం ఏమిటీ? నాకు చేతగాదు. అంది భార్య.  మీ అమ్మ నాకు చేసి పెట్టింది.  నీకు బాగా చెయ్యటం వచ్చనీ చెప్పింది.  వీటికోసం  నేను దారివెంటా  ఒక్కచోటా ఆగకుండా ఒక్కరితో మాట్లాడకుండా  సరాసరి  వచ్చాను.  వెంటనే  నాకు చేసిపెట్టమని  గదమాయించాడు పుల్లయ్య.

అవి ఎట్లా చేస్తారో కనీసం అదైనా చెప్పు. నేను ఎలాగో తంటాపడతా  అంది ఆమె.  అబ్బో ఇది బద్దకంతో ఇలా   వేషాలు వేస్తుంది. అనుకున్నాడు  దాంతో చాలా కోపం  వచ్చింది అతడికి.  ఇలా  సాకులు చెప్పి వండడం  తప్పించుకుంటే  తంతా వెంటనే   వండి పెట్టు  అంటూ  కేకలు వేసాడు.  ఐనా  తనకు వండడం  చేతకాదనే  చెప్పింది  పుల్లమ్మ.   అసలే మూర్ఖుడూ  కోపిష్టి  తన మాట  వినలేదని   భార్యను  తన్నడం మొదలెట్టాడు.  జుట్టు పట్టుకుని చెంపలు వాయించేసాడు.  ఇరుగు పొరుగు  వచ్చి  వద్దని  చెప్పినా  వినలేదు.  అంతలో  పుల్లయ్య  తల్లి పరిగెత్తుకు వచ్చి   ఒరే కోపిష్టి వాడా  పెళ్ళాన్ని  అంతలా   కొడతావేరా?  పాపం  దాని  చెంపలు కుడుముల్లా  ఉబ్బిపోయాయి… అంటూ  కొడుకును తిట్టడం  మొదలెట్టింది.

అప్పుడు వెంటనే  గుర్తొచ్చింది పుల్లయ్యకి  కుడుములు  అన్న పేరు.  అదే అదే కుడుములు  వండిపెట్టమంటే  ఇది  చాత కాదందే అమ్మా అంటూ  చెప్పాడు.  కుడుములంటే  వండిపెట్టనా. నువ్వు ఐసరబజ్జీలు వండిపెట్టమని కదూ నన్ను కొడుతున్నావ్. అంది పుల్లమ్మ.  ఇరుగు పొరుగు వాడి కోపిష్టి తనాన్ని చూసి వెక్కిరిస్తూ  ఐసరబజ్జీ పుల్లయ్యా అని పిలవడం మొదలెట్టారు.

పట్టిందల్లా బంగారం

ఒక వూళ్ళో ఓ వ్యాపారి ఉండేవాడు.అతడు పరమ పిసినారి, పైసా ఖర్చు చేసేవాడు కాదు.  ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా డబ్బు సంపాదించేవాడు. ఇంకా ఇంకా ధనం సంపాదించాలి అనుకునేవాడు.

ఓ రోజు అతడు పని పై  అడవిగుండా  పొరుగూరు  వెళుతూ మధ్యహాన్నం వేళ  ఓ పెద్ద చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నాడు. సాయంత్రం లేచి చూసేసరికి  పక్కనే అతడికి ఓ గుడి కనిపించింది. చుట్టూ చెట్లనిండా పూలూ పండ్లూ ఉన్నాయి. పోన్లే కొనుక్కునే పనిలేదు. అన్నీ కోసి  గుళ్ళో పూజచేసేద్దాం పోయేదేముంది   అనుకుని. పండ్లూ పూలు అన్నీ కోసి ఆ గుళ్ళో దేవతకు పూజ చేశాడు.  వెంటనే  ఆ దేవత ప్రత్యక్షమై  ఏదైనా వరం కోరుకోమని అడిగింది.  ఆ వ్యాపారి ఆనందంతో ఉప్పొంగి పోతూ“నాకు చాలా ధనం కావాలి.” అని అడిగాడు.  ఎంత కావాలో చెప్పమని మళ్ళీ అడిగింది దేవత. “నేను పట్టిందల్లా బంగారం కావాలి.” అన్నాడు అత్యాశతో. అలాగే అంటూ దేవత మాయమయి పోయింది.

వ్యాపారి ఆనందంతో వెనిక్కి తిరిగి ఇంటికి తిరిగి  వచ్చేశాడు. జాగ్రత్తగా లోనకు వెళ్ళి ఇంటిని తాకాడు. ఇంటి గోడలు బంగారపు గోడలుగా మారిపోయాయి.  ఇక అతడికి వెర్రి ఆనందం వేసింది.  ఇంట్లో వస్తువులన్నీ తాకుతూ వాటిని బంగారం చేస్తూ  రోజంతా గడిపాడు.

చివరికి బాగా అలసిపోయాడు.  ఆకలి వేయడం మొదలెట్టింది. భార్యను పిలిచి భోజనం పెట్టమని  చెప్పాడు.  పళ్ళెం ముందు కూర్చుని అన్నం లో చేయి పెట్టగానే అది బంగారంగా మారిపోయింది. నీళ్ళు తాగుదామని చెంబు పట్టుకుంటే  నీళ్ళూ చెంబూ కూడా బంగారమయిపోయాయి.  అంతలో ఆ వ్యాపారి కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి అతడి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే ఆ పిల్లవాడూ బంగారు విగ్రహంగా మారిపోయాడు.

వ్యాపారి భయంతో  ఏడుస్తూ నా అత్యాశ వల్లనే ఇదంతా జరిగింది అనుకుంటూ  అడవిలోని గుడికి  వెళ్ళి దేవతను ప్రార్థంచడం మొదలెట్టాడు.  “నా జీవితం నా బిడ్డా నాకు ముఖ్యం నీ వరం నాకు అక్కరలేదు వెనిక్కి తీసుకో”   అంటూ దేవతను అడిగాడు.

సరే అంది దేవత.  ఆ పై వ్యాపారి అత్యాశను పిసినారి తనాన్ని వదిలేసి  హాయిగా జీవించాడు.

గాడిదల పంపకం

ముగ్గురు వ్యక్తులు వాళ్ళదగ్గర ఉన్న డబ్బు తో  పదిహేడు  (17) గాడిదలు  కొన్నారు.  దానికై       మొదటివాడు  సగం,  రెండోవాడు  మూడోవంతు,  మూడోవాడు  తొమ్మిదో  వంతు  పెట్టుబడిగా  పెట్టారు.  వాటిని  వాళ్ళు ఆ  ప్రకారంగానే  పంచుకోవాలనుకున్నారు.  దానిప్రకారం  కొన్న గాడిదలలో  సగం  మొదటి వాడికి,  మూడో వంతు  రెండో  వాడికి,   తొమ్మిదవ వంతు  మూడవ వాడికీ  రావాలి.

అలా చూస్తే  మొదటి వ్యక్తి కి (ఎనమిదిన్నర)  8 1/2  గాడిదలు,  రెండవ అతనికి   5 2/3   (ఐదూరెండూ బై మూడు  గాడిదలు),  మూడో అతడికి   1 8/9 (ఎనిమిదీ బై తొమ్మిది  గాడిదలు)   రావాలి.   ఇలాంటి పంపకం  సాధ్యం కానిది. గాడిదలను ముక్కలుగా కోసి తీసుకోవడం  వాళ్ళకి  నచ్చలేదు.   పరిష్కారంకోసం  కాజీ  దగ్గరకు  వెళ్ళారు  వాళ్ళు.

కాజీ కి ఎంతగా  ఆలోచించినా పరిష్కారం తట్టలేదు.  ఆ సమస్య   కు  మౌల్వీ నసిరుద్దీన్ మాత్రమే  పరిష్కారం  చూపగలడు  అనుకుని  నసిరుద్దీన్ కి  కబురు చేసాడు.

నసిరుద్దీన్  తన  గాడిదను  ఎక్కి   అక్కడికి  వచ్చాడు.  వాళ్ళు చెప్పింది,   కలిగిన   సమస్య  అంతా విని.  ఆ  పదిహేడు  గాడిదలకు  తన  గాడిదను  కలిపి  పంపకం  మొదలెట్టాడు.   అతడి  గాడిదతో  కలిపి  అవి  పద్దెనిమిది  అయ్యాయి (18).  వాటిల్లో  సగం   తొమ్మిది  (9)  గాడిదలను  మొదటి వాడిని  తీసుకోమని  చెప్పాడు.

సాబ్ మీ  గాడిద  మాకు ఇవ్వడమేమిటి?  మా సమస్య కోసం మీరు గాడిదను  పోగొట్టుకోవటం  మాకు  ఇష్టం లేదు  అన్నారు  ఆముగ్గురూ.

నా గాడిదను  ఇచ్చేంత తెలివితక్కువ వాడిని  కాను.  మీరు ముందు మీ వాటాలు తీసుకొండి  అంటూ  ఇలా పంపకం  చేశాడు.

మొదటి వాడు సగం  డబ్బు  పెట్టేడు గనుక  ఉన్న మొత్తం  గాడిదలలో  సగం  వాడికి  రావాలి.  మొత్తం  18  గాడిదలలో  సగం  9  వాడికి.

రెండో వాడికి  మూడో వంతు వాటా రావాలి  అంటే    18 గాడిదలలో  మూడోవంతు  6  కనుక  వాడికి   6 గాడిదలు  ఇచ్చేశాడు.

ఇక చివరి వాడి పెట్టుబడి  తొమ్మిదో  వంతు.  మొత్తం  గాడిదలలో  తొమ్మిదో వంతు రావాలి.  18  లో తొమ్మిదో వంతు  2  కనుక  2  గాడిదలు  అతడికి  ఇచ్చేశాడు.

అలా  మొదటి వాడికి 9   రెండోవాడికి   6  మూడోవాడికి  2  మొత్తం   కలిపితే 17   గాడిదలు  లెక్క సరిగ్గా సరిపోయింది.  అందరూ తమకు రావలసిన  దానికంటే  ఎక్కువే  వచ్చిందని  ఆనంద పడ్డారు. గాడిదలను  ముక్కలు  చేసే పని లేనందుకు  హమ్మయ్య అనుకున్నారు.

అలా  అందరికీ  పంచగా  చివరికి  మిగిలిన  తన  గాడిదపై  ఎక్కి నసీరుద్దీన్  వెళ్ళాడు.

ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?

అనగనగా ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు గారు ఉండేవారు. ఆ రాజు గారికి అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన సందేహాలు వస్తూ ఉండేవి. అలా ఏదన్నా సందేహం వచ్చిందే తడవుగా ఆయన ఆస్థానంలోని మేధావులందరినీ అడిగేవారు. ఆయనకి సంతృప్తికరంగా అనిపించే సమాధానం ఎవరో ఒకరు చెప్తేనే గానీ ఆ సందేహం మీద నుంచి ఆయన ధ్యాస మళ్ళి మనసుకి శాంతి లభించేది కాదు.

ఒకసారి ఏదో పండుగ సందర్భంగా రాజు గారి వంటశాలలో రాచపరివారం మొత్తానికి విందు ఏర్పాటు చేసారు. విందు కోసమని అన్నం, ఆ కాలంలో దొరికే అన్నీ కూరలూ, పచ్చళ్ళూ, అదీ ఇదీ అని కాకుండా సమస్తం వండించారు. రాజు గారి ఆస్థానంలో ఉండే వంటవారు తీపి మిఠాయిల తయారీలో సిద్ధహస్తులని ప్రఖ్యాతి గడించిన వారవడం చేత బోల్డన్ని రకాల మిఠాయిలు కూడా తయారు చేసారు.

భోజనాల సమయానికి రాజుగారు సపరివార సమేతంగా వంటశాలకి విచ్చేసి విందు భోజనం ఆరగిస్తూ ఉన్నారు. అత్యంత రుచికరంగా ఉన్న మిఠాయిల రుచి చూసిన మంత్రులూ, రాజోద్యోగులూ అందరూ “ఆహా ఓహో.. ఇంతటి మధురమైన మిఠాయిలు వేరెక్కడా తినలేదు.. అద్భుతం!” అంటూ రాజు గారిని పొగడ్తల్లో ముంచెత్తసాగారు.

వాళ్ళ మాటలు వింటున్న రాజు గారికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే “అసలు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యని రుచి కలిగినది ఏది?” అని.

రాజు తలచుకుంటే సమాధానాలకేం కొదవ! అంచేత వెంటనే, తన సందేహాన్ని సమస్త రాచపరివారం ముందు పెట్టారు. “ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?” అని.

అక్కడున్న అందరూ అప్పటి దాకా ఆ మిఠాయిల తీపిదనంలో ఓలలాడుతున్నారేమో, ఒకరు లడ్డూలు అద్భుతం అంటే, మరొకరు అరిసెలు అన్నీటికన్నా ఉత్తమం అనీ, మరొకరేమో సున్నుండలు మధురాతి మధురం అనీ, వరుసబెట్టి ప్రతీ ఒక్కరూ ఏదో ఒక మిఠాయి పేరే చెప్పేస్తున్నారు. ఏ సమాధానం చెప్పినా రాజు గారికి మాత్రం సంతృప్తికరంగా అనిపించట్లేదు. ఉదాహరణకి ఎవరన్నా లడ్డూ అని చెప్తే రాజు గారు “ఏం.. అరిసెలు అంతకనా మధురం కాదా?” అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

చివరికి రాజు గారితో పాటుగా అందరికీ అయోమయంగా అనిపించింది.. అన్నీ మిఠాయిలు మధురంగానే ఉన్నాయి కానీ, అన్నీటిల్లోకీ అత్యంత మధురమైనది ఏంటబ్బా అనుకుంటూ అందరూ ఆలోచనలో పడ్డారు.

ఇంతలో రాజు గారి అమ్మాయిలు ఇద్దరూ వంటశాలకి వచ్చారు. తరచూ రాజు గారికొచ్చే చిత్రమైన సందేహాల గురించి వాళ్ళ అమ్మాయిలని కూడా అడగడం ఆయనకి అలవాటే! అంచేత వాళ్ళని ప్రేమగా దగ్గరికి పిలిచి అక్కడ జరుగుతున్న చర్చని వివరించి “ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?” అని ప్రశ్నించారు. ఇద్దరమ్మాయిలూ కొద్దిసేపు ఆలోచించి సమాధానం దొరికింది అన్నారు. రాజు గారు ముందు చిన్నమ్మాయిని చెప్పమన్నారు.

“ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యని రుచి కలిగిన పదార్ధం ఉప్పు” అని చెప్పింది చిన్నమ్మాయి.

ఆ సమాధానం వినగానే అందరూ మొహాలన్నీ వికారంగా పెట్టారు రాజుతో సహా!  “మేము అడుగుతోంది.. ప్రపంచంలోకెల్లా తియ్యనిది ఏంటని? అసలు ఉప్పు ప్రపంచంలోకెల్లా తియ్యనిది అని ఎవరైనా ఏ రకంగానైనా నిరూపించగలరా? అది అసాధ్యం కదా!” అంటూ అందరూ కలిసి వాదించి ఆ సమాధానం తప్పని సర్ది చెప్తారు చిన్నమ్మాయికి.
ఇంక పెద్దమ్మాయి వంతు వచ్చినప్పుడు “ప్రపంచంలో కెల్లా తియ్యనిది చక్కెర.. ఎందుకంటే మీరందరూ అత్యంత మధురం అని చెప్తున్న ఈ రకరకాల మిఠాయిలన్నీటినీ తయారు చేసేది చక్కరతోనే కదా!” అని చెప్తుంది.
వెంటనే రాజు గారితో సహా అందరూ పెద్దమ్మాయి చెప్పిన సమాధానానికి సంతోషించి అదే సరైన సమాధానమని తీర్మానించడమే కాకుండా పెద్దమ్మాయిని మెచ్చుకుంటారు. హమ్మయ్యా.. ఎలాగైతేనేం ఈసారికి రాజు గారి సందేహం త్వరగానే తీరిపోయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.

కొన్నాళ్ళు గడిచాక రాజు గారి చిన్నమ్మాయి రాజు గారి దగ్గరికొచ్చి ఒక కోరిక కోరుతుంది. త్వరలో రాజ్యంలో జరగబోయే ఉత్సవాల సందర్భంగా విందు భోజనాలు ఏర్పాటు చేసే బాధ్యత తనకి అప్పజెప్పమంటుంది. తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటానని అడుగుతుంది. సరేనని అంగీకరిస్తారు రాజు గారు.

ఆ విందు ఏర్పాట్ల కోసమని రాజు గారి చిన్నమ్మాయి దేశవిదేశాల నుంచీ పేరుగాంచిన నలభీముల్లాంటి పాక శాస్త్ర నిపుణులని ఎంతోమందిని పిలిపిస్తుంది. ఆ ఉత్సవాలు మొదలయేనాటి రోజు రాత్రికి వైభవోపేతంగా రాజపరివారం మొత్తానికి కనీ వినీ ఎరుగని రీతిలో విందుని ఏర్పాటు చేస్తుంది. వందలమంది పరివారం అంతా కూడా ఒకేసారి కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా అతి పెద్ద భోజనాల బల్లను సిద్ధం చేయిస్తుంది. ఎంతో శ్రమ తీసుకుని వండించిన రకరకాల భోజన పదార్థాలనీ, నవకాయ పిండివంటలన్నీటినీ కూడా ఆ  భోజనాల బల్ల పొడవునా అందంగా అమరుస్తుంది.

సరిగ్గా భోజనాల సమయానికి రాజు గారితో సహా అందరూ వచ్చి కూర్చుంటారు. భోజనాల బల్ల మీద ఒక్కొక్కరి ముందూ ఒక్కో రకమైన తిండి పదార్ధం అమర్చబడి ఉంటుంది. అందరూ భోజనం చేయడం మొదలెట్టి మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే “ఛీ.. ఇది రుచీ పచీ లేదు..” అంటూ ఒక్క పెట్టున అరుస్తారు చిరాగ్గా! అంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందో అర్థం కాని రాజు గారు చిన్నమ్మాయికేసి ప్రశ్నార్థకంగా చూస్తారు.

అప్పుడు రాజు గారి చిన్నమ్మాయి “ఇప్పుడు మీరందరి ముందూ ఉన్న ఈ వంటలన్నీ కూడా చేయి తిరిగిన పాకశాస్త్ర నిపుణుల చేత తయారు చేయించబడ్డాయి. ఆయా వంటలు ఎలా వండాలో, క్షుణ్ణంగా తెలిసినవారు ఒక్క పొల్లు తప్పు పోకుండా, అతి జాగ్రత్తగా వండారు. కానీ, నా ఆదేశం మేరకు అన్నీ వంటల్లోనూ కేవలం ఉప్పు మాత్రమే వెయ్యలేదు. కానీ, కేవలం ఉప్పు వెయ్యని కారణంగా ఇన్ని వందల రకాల పదార్థాలకి ఏ రుచీ లేకుండా పోయింది చూసారా? ఇప్పటికైనా అంగీకరిస్తారా.. ప్రపంచంలోకెల్లా తియ్యనైన పదార్థం ఉప్పు అని” వివరణ ఇస్తుంది.

అప్పుడు రాజు గారితో సహా అందరూ చిన్నమ్మాయి తెలివితేటలకి అబ్బురపడిపోయి “నిజమే! ఉప్పు లేకపోతే ఏ పదార్థానికీ రుచి అన్నదే రాదు.. ప్రపంచంలోకెల్లా తియ్యనిది ఉప్పే!” అని ఒప్పుకుంటూ చిన్నమ్మాయి వివేకాన్ని, సమయస్ఫూర్తినీ మెచ్చుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతారు.

తర్వాత చిన్నమ్మాయి అక్కడున్న ఉప్పు లేని చప్పిడి వంటకాలన్నీటినీ తీసివేయించి ఉప్పు వేసి రుచికరంగా వండిన పదార్థాలని అందరికీ వడ్డన చేయించి విందుని జయప్రదం చేస్తుంది.

మిరపకాయ్ పొట్టోడి కథ!

అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి చాలా కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాయించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ్ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట! ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడంట.

ఆ తరవాత ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్తాడన్నమాట! అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు.

సాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి ఉందని చూస్తాడు. అందులో తను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకునేసరికి పాపం మిరపకాయ్ పొట్టోడికి భలే బాధేస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.. ఇలా తను కష్టపడి పని చేసి సంపాదించుకున్న బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయంత ఇంట్లో, గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న, బీరకాయంత బీరువాలో తాటికాయంత తాళమేసి దాచిపెట్టుకుంటే ఎవడో దోసకాయంత దొంగోడొచ్చి ఎత్తుకెళ్లిపోయాడని.

వెంటనే, ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి గబగబా వెళ్లి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని తెచ్చి, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని లాక్కుని మిరపకాయ పొట్టోడికి ఇచ్చేస్తాడు. దోసకాయంత దొంగోడిని నాలుగు తన్నాక వాడిని జాంకాయంత జైల్లో పడేస్తారు.

అప్పుడు మిరపకాయ పొట్టోడు దోసకాయంత దొంగని పట్టుకుని బాదంకాయంత బంగారాన్ని తనకి తెచ్చిచ్చినందుకు పొట్లకాయంత పోలీసుని మెచ్చుకుని, ఆ తరవాత సొరకాయంత సైకిలేస్కుని, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తాటికాయంత తాళం వేస్కుని దాచుకుంటాడు.

ఇంకంతే ‘మిరపకాయ్ పొట్టోడు’ కథయిపోయింది. :-)

కొసమెరుపు: ఈ కథని ఒక్క పోలిక కూడా మిస్సవకుండా, తప్పు చెప్పకుండా మీరు చెప్పండి చూద్దాం. చిన్నప్పుడు నేనూ, మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పుకునేవాళ్ళమో యీ కథని. మధ్యలో ఏ ఒక్క పోలిక మర్చిపోయినా, తప్పు చెప్పినా ఓడిపోయినట్టే. మళ్ళీ మొదటినుంచీ చెప్పాల్సిందే! అలా అని మెల్లగా ఆలోచిస్తూ నెమ్మదిగా చెప్పకూడదు. గబగబా చెప్పెయ్యాలి. మీరూ ప్రయత్నిస్తారా మరి!?

నీటికి నిప్పుకు పెళ్ళంట

నిప్పూ-నీరు  ప్రేమించుకున్నాయి.  పెళ్ళి  చేసుకోవాలని  అనుకున్నాయి.   వాటి లక్షణాలే  వాటి పెళ్ళికి అడ్డం.  నిప్పు  తాకితే  నీరు  ఆవిరవుతుంది.   నీరు, నిప్పు మీద పడితే చల్లారిపోతుంది. పెళ్ళి చేసుకోవడం ఎట్లా?  బాగా ఆలోచించాయి.  వారి చుట్టాలను  సంప్రదించాయి.  నీరేమో వారి బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పకపోగా  “మనకు వాటికి జన్మజన్మల వైరం ఎట్లా కుదురుతుంది” అని కోప్పడ్డాయి.

నిప్పేమో   పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది.   అవి కూడా నిప్పును కోప్పడ్డాయి.   వీటి ప్రేమను అర్థం చేసుకోలేదు. అందరిలాగే పెళ్ళి చేసుకోవాలని పిల్లాజెల్లాతో హాయిగా  ఉండాలనుకున్నాయి.   కాని ఆశ తీరే దారే కనపడలేదు.   చివరకు మేధావి అయిన ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్న కార్మికుడిని అడిగాయి.

అతను ఆలోచించి, “సరేలే! మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తాను”  అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. రెండు వైపుల చుట్టాలను పిలిచాడు.  కాని పెళ్ళికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్ళి  వద్దని  ప్రమాదమని,  కార్మికుణ్ణి హెచ్చరించాయి.  నానా యాగి చేశాయి.  కార్మికుడు వారిని ఒప్పించాడు.

వారిద్దరి పెళ్ళి చేసి వారిని బాయిలర్ అనే క్రొత్త ఇంట్లో కాపురముంచాడు.  వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కాక  “ఆవిరి” అనే కొడుకును కన్నాయి. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు, పిడుగు, అగ్నిపర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి.

ఆవిరిగాణ్ణి చూసి అందరూ ఆనందించారు. వీడు రైళ్ళను నడుపుతున్నాడు. ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తున్నాడు.

పెళ్ళి చేసిన కార్మికుడికి కృతజ్ఞతలు.

పంకజం గారెలు

ఒక ఊళ్ళో పంకజం అనే అమాయకురాలు ఉండేది. ఒక రోజు పంకజం మొగుడికి గారెలు తినాలని కోర్కె కలిగి, గారెలు చేయమని భార్యను అడిగాడు. దానికి పంకజం “నాకు ఎలా వండాలో తెలియదు”  అంది. పంకజం భర్త  “మన పక్కింటి బామ్మ గారు ఉన్నారు కదా ఆవిడని కనుక్కొని చేయమని”  అనడంతో,  ఆమె పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళి గారెలు ఎలా చేయాలని అడిగింది.  దానికి బామ్మగారు “చాలా ఈజీ నేను చెపుతాను ఎలా వండాలో. ముందు మినపప్పు నానబెట్టుకోవాలి” అని అనీ అనగానే పంకజం నాకు తెలుసు నాకు తెలుసు  అంటూ వెళ్ళి,  కొద్దిసేపటికి  తిరిగివచ్చి  ఆ తరవాత ఏమి చేయాలి అంటుంది. ఏముంది శుభ్రంగా కడిగి పొట్టు తీసి రుబ్బుకోవాలి అని చెప్పగానే నాకు తెలుసు.. నాకు తెలుసు అని వెళ్ళిపోయింది.

పప్పు సరిగా నానకపోయినా అలాగే పప్పు పప్పు గా కడిగి రుబ్బేసి, మళ్ళీ బామ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత ఏమి చేయాలని అడిగింది.  ఆ తర్వాత నూనె కాగపెట్టి పిండి ని అందులో వేయటమే అని బామ్మ గారు చెపుతుండగానే   మళ్ళీ  మాములుగానే నాకు తెలుసు ..నాకు తెలుసు అని నూనె కాగకుండానే  వేసేసింది.
కాసేపటికి పంకజం భర్త వచ్చి గారెలు చేశావా అనగానే ఒక గ్లాసులో వేసుకొని తీసుకునివచ్చింది.

“అదేమిటి!  గారెలు ఇలా ఉన్నాయేమిటి?!”  అని ఆశ్చర్యంగా అడిగిన భర్తతో … “ఏమో బామ్మ గారు చెప్పారు , నేను చేశాను” అని బదులిచ్చింది పంకజం.

వెంటనే పంకజం భర్త బామ్మగారి దగ్గరికి వెళ్ళి “ఇదేమిటి ఇలా చెప్పారు! అంటే, దానికి బామ్మగారు “అసలు నీ భార్య పూర్తిగా వింటే కదా !

పూర్తిగా వినకుండా నాకు తెలుసు.. నాకు తెలుసు అని వెళ్ళిపోతుంటే నేనేమి చేసేది అంది!

అప్పుడు  అతడు భార్యతో ఇలా చెప్పాడు  “రేపు బామ్మగారు కూడా గారెలు చేస్తారు చూసి నేర్చుకో బామ్మగారు ఎలా చేస్తారో నువ్వు కూడా అలాగే చేయి మాట్లాడకుండా.. సరేనా?”
సరే సరే అంది  పంకజం.

ప్రక్క రోజు పంకజం పొద్దున్నే లేచి బామ్మగారు ఏమి చేస్తే అదే చేయాలనుకుంటుంది. ఆ రోజు బామ్మగారు తల మీద జుట్టు బాగా పెరగటం వలన క్షరకుడిని పిలిపించుకొని నున్నగా గుండు చేయించుకుంది.
ఇదంతా చూస్తున్న పంకజానికి  రాత్రి భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ‘బామ్మ గారు ఏమి చేస్తుంటే నువ్వు కూడా మాట్లాడకుండా అలాగే చేయి’ అన్నది.

ఇంకేముంది పంకజం కూడా నీటు గా గుండు కొట్టించుకుంది. ఆ తర్వాత చక్కగా తల స్నానం చేసి ఒక మడి బట్ట కట్టుకొని సేం బామ్మగారు ఎలా చేస్తారో అలాగే చేసింది.

ఆ సాయంత్రానికి భర్త వస్తూనే “గారెలు చేశావా”  అని పెద్దగా పిలవగానే,  చేశానని లోపలి నుండే  అంది పంకజం . పట్టుకురా అని అనగానే గారెలు తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళి తలవంచుకొని నిలబడింది.  వెంటనే భర్త నిలబడి అయ్యో బామ్మ గారు మీరు తెచ్చారేమిటి పంకజం ఏమయ్యిందని  లోపలకి చూస్తూ అడగగానే   ఆమె  వెంటనే తల ఎత్తి నేను బామ్మగారిని కాదండి మీ పంకజాన్నే అంది.  అంతే పంకజం భర్త ఒక్కసారి విస్తుపోయి “నీకేమి మాయ రోగం వచ్చింది ఇలా గుండు కొట్టించుకున్నావని కోపంగా అడిగాడు.

దానికి పంకజం “మీరే కదా బామ్మగారు ఏమి చేస్తే అలాగే చేయమన్నారు అంది” అలా  అమాయకంగా అడుగుతున్న భార్యని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తలపట్టుకుకూర్చొని అసలు గారెలు ఎందుకు చేయమన్నానా అని వాపోయాడు.

తెల్లని ఏనుగు

ఒక వూళ్ళో సోమయ్య అని ఒక యువకుడుండేవాడు. అతనికి ఒక చెరుకు తోట ఉండేది. ఒకసారి పంట బాగా పండింది. ఇక రేపో మాపో అమ్ముదామనుకుంటుండగా,
ఒకరోజు కొంత చెరకు మాయమైనట్లనిపించింది. మర్నాడు కూడా అలాగే జరిగింది. ఎవరు దొంగిలిస్తున్నారో తేల్చుకోవాలనుకున్నాడు

ఆ రాత్రి తోటలోనే కాపలాగా ఉన్నాడు. అర్థరాత్రి అయింది. హఠాత్తుగా వెన్నెలకాంతి లాంటి కాంతి పరచుకుంది
ఐరావతం లాంటి ఒక తెల్లని ఏనుగు ఆకాశం నుంచి దిగింది, కొన్ని చెరకుగడలు తిని మళ్ళీ ఆకాశంలోకి( రెక్కలు లేకపోయినా) వెళ్ళిపోయింది.

సోమయ్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మర్నాడు మళ్ళీ తోటలో మాటు వేసాడు
ఈ సారి ఏనుగు తోక పట్టుకుని దానితో పాటు తను కూడా పైకి వెళ్ళాడు.
అక్కడ ఏముందీ…
ఒక అద్భుతలోకం. స్వర్గమంటే ఇదేనా అనిపించేటటువంటి ఒక బంగారు లోకం. రకరకాల ఫలవృక్షాలు, అందమైన పక్షులు, తటాకాలు, సెలయేళ్ళూ- నందనవనంలాగా ఉంది. సోమయ్య మర్నాడు పగలంతా ఆ లోకంలో విహరించి ఎంతో ఆనందించాడు. మళ్ళీ రాత్రి ఏనుగుతో పాటు భూమ్మీదకి వచ్చేసాడు

తన అద్భుతమైన అనుభవాన్ని దాచుకోలేకపోయాడు. ఎవరికైనా చెప్పాలనిపించింది. తన మితృలకు చెప్పాడు. వాళ్ళు తమని కూడా తీసుకెళ్ళమని సోమయ్యని ఎంతో బతిమాలారు. అతనికి ఇక ఒప్పుకోక తప్పలేదు

మర్నాటిరాత్రి అందరినీ తన తోటకి రమ్మన్నాడు. పదిమంది దాకా వెళ్ళడానికి సిద్ధమయి వచ్చారు
ఏనుగు రానే వచ్చింది. ముందు సోమయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు …అలా అందరూ ఏనుగుతో పాటు ఆకాశంలోకి ఎగిరారు.
ప్రయాణం సాగుతుండగా వాళ్ళు మాట్లాడుకోసాగారు. అంతలో ఒకడికి ఒక సందేహం వచ్చింది. అక్కడ మామిడి చెట్లు ఉంటాయా అని . తన పైనున్న వాడిని అడిగాడు. అతను తన పైనున్న వాడిని … అలా ప్రశ్న సోమయ్య వరకూ వెళ్ళింది

సోమయ్య ఉంటాయని చెప్పాడు. జవాబు కిందనున్న అతనికి చేరింది.
కాసేపయాక కిందివాడికి మళ్ళీ సందేహం వచ్చింది – అక్కడ మామిడి పళ్ళు ఎంత వుంటాయని, ప్రశ్న సోమయ్యకి చేరింది
అక్కడ చాలా పెద్ద మామిడిపళ్ళు ఉనాయని చెప్పటానికి ‘ ఇంతా ‘ అని సోమయ్య తన రెండు చేతులూ చాపాడు.

వృత్తులు(Professions)

Advocate      న్యాయవాది
Astrologer     జ్యోతిష్కుడు
Architect       శిల్పి
Attender        సేవకుడు
Barber            మంగలి
Brick-Layer    తాపీవాడు
Buffoon           హాస్యగాడు
Betel-Seller    తమలపాకులు అమ్మేవాడు
Butcher           కసాయివాడు
Carpenter        వడ్రంగి
Coachman       బండితోలేవాడు
Baker               రొట్టెలు కాల్చేవాడు
Cook                 వంటవాడు
Boatman          పడవ నడిపేవాడు
Cotton-Cleaner-దూదేకుల వాడు
Clerk                   గుమాస్తా
Dentist                దంత వైధ్యుడు
Doctor                 వైధ్యుడు
Farmer                రైతు
Gold Smith         బంగారపు పనివాడు
Fisherman          చేపలు పట్టేవాడు
Mat Maker         చాపలు అల్లెవాడు
Druggist             మందులు అమ్మేవాడు
Draper                బట్టల దుకాణా దారుడు
Milk Man            పాలమ్మేవాడు
Potter                 కుమ్మరి      
Tailor                  దర్జీ
Painter               రంగులువేయువాడు
Publisher           ప్రచురణ కర్త  
Photographer    ఛాయా చిత్రకారుడు
Pleader               న్యాయవాది
Weaver                నేత చేయువాడు    
Washer Man       రజకుడు
Shepherd             గొర్రెల కాపరి
Glazier                 మెరుగు పెట్టేవాడు
Watchman           కాపలా దారుడు
Juggler                గారడీవాడు
Snake Charmer  పాములవాడు
Magician            ఇంద్ర జాలికుడు
Judge                  న్యాయమూర్తి
Mason                 తాపీపనివాడు
Surgeon               శస్త్రవైద్యుడు    
Teacher               ఉపాధ్యాయుడు
Maid Servant       స్త్రీ పనిమనిషి
Midwife                 మంత్రసాని
Nurse                    వైధ్య సహాయకరి
Sweeper               ఊడ్చువాడు
Politician              రాజకీయ నాయకుడు
Physician              వైధ్యుడు  
Priest                     మత భోదకుడు
Retailer                 చిల్లర వర్తకుడు
Sculptor                శిల్పి
Scavenger            పాకీ పనివాడు
Seeds man           విత్తనాలు అమ్మేవాడు