Pages

Wednesday, August 8, 2012

పేదరాశి పెద్దమ్మ కథ


ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందట. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి "పెద్దమ్మా పెద్దమ్మా నా పేరేమిటి?మర్చిపోయాను" అని అడిగిండట. అప్పుడు పెద్దమ్మ "నీ పేరు నాకేం తెలుసు. నా కొడుకు నడుగు " అందట. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, "పేదరాసి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసా? అన్నదట.

అప్పుడతను "నీ పేరు నాకేం తెలుసు? నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడట. అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి?"అనడిగిండట. అప్పుడు గొడ్డలి, "నీ పేరు నాకేం తెలుసు? నేను నరికే ఈ చెట్టునడుగు" అందట.

ఈగ చెటు దగ్గరకు వెళ్ళి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్దలి నరికే చెట్టా, నా పేరేమిటి?" అనడిగిండట. అప్పుడా చెట్టు "నీ పేరు నాకేం తెలుసు? చెట్టుకట్టేసిన గుర్రాన్నడుగు" అందట. అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా?" అనడిగిందట. అప్పుడా గుర్రం " నీ పేరు నాకేం తెలుసు? నా పొట్టలో ఉన్న పిల్లనడుగు" అందట.

అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా, గుర్రం పొట్తలోని పిల్లా నా పేరేమిటో తెలుసా?" అనిఅడిగిండట. అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల " ఇహీ...నీ పేరు నీకు తెలియదా? నీ పేరు ఈగ" అందట.
పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.

పీనాసి కనకయ్య

కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.

కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ...

ఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. "ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో..."

కనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ...

మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం

బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకు పోయేవారు. బీర్బల్‌ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు. వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు. ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకుని, అది గనక నెరవేరినట్టయితే బీర్బల్ పని అయిపోయినట్టేనని సంబరపడి పోయారు!

మరునాడు అలాంటి అసూయాపరుల నాయకుడు షైతాన్‌ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు. ముఖ్యమైన చర్చలు, కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు, కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికీ, ఆసక్తికరమైన విశేషాలు వినడానికీ సమాయత్తమయ్యాడు.

షైతాన్‌ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు. ‘‘చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘షహేన్‌షా! మనకందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు. ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.

‘‘గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతోంది షహేన్‌షా,’’ అన్నాడు బీర్బల్ సంతోషంగా.

‘‘నిజమే షహేనషా! చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనని నేను భావించడం లేదు. అంతే కాదు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్‌కు సాటి కాలేము,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.

ఆ తరవాత అతడు స్వరం తగ్గించి, ‘‘బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా వున్నాడు. మరి, ఆయన్ను కన్నతండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా?’’ అన్నాడు చక్రవర్తితో. ఆ మాటతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకువచ్చింది. ఇన్నాళ్ళు తనకీ యోచన రానందుకు ఆశ్చర్యపోయాడు.
‘‘ఇంత గొప్ప వివేకిని కన్న ఆ మహామేధావిని రాజసభకు పిలిపిస్తే మనమందరం చూసి ఆనందించగలం కదా, షహేన్‌షా,’’ అన్నాడు షైతాన్‌ఖాన్.

ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు బీర్బల్ వెంటనే గుర్తించాడు. షైతాన్‌ఖాన్ అంత మంచివాడు కాదు. తెలివైనవాడేగాని, ఆ తెలివిని మంచి పనులకు ఉపయోగించే స్వభావంకాదతనిది. కుట్రలు, కుయుక్తుల మీదే ధ్యాస.

షైతాన్‌ఖాన్ మాటల అంతరార్థం ఏమై ఉంటుందా అని బీర్బల్ ఆలోచించాడు. తన తండ్రి విద్యావంతుడు కాడనీ, నీతీ నిజాయితీతో ముక్కు సూటిగా ప్రవర్తించే వ్యక్తి అనీ అతడికి తెలుసు. పైగా రాజాస్థానంలోని వారి లౌక్యం, కపట ప్రవర్తన గురించి ఆయనకు అసలు తెలియదు. అలాంటి అమాయక వ్యక్తిని రాజసభకు పిలిచి ఆయనలోని లోపాలను బట్టబయలు చేసి తనను దెబ్బతీయాలనుకుంటున్నాడు కాబోలు. అతడి పాచిక తన వద్ద పారదని గ్రహించలేని మూర్ఖుడు. తను తవ్విన గోతిలో తనే చతికిల పడేట్టు చేయాలి అనుకున్నాడు.

చక్రవర్తి ‘‘బీర్బల్!’’ అని పిలవడంతో అతడి ఆలోచనలకు అంతరాయం కలిగి ఆయన కేసి చూశాడు.

‘‘మీ తండ్రిని మేము చూడాలి,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘చిత్తం, ప్రభూ,’’ అన్నాడు బీర్బల్ వినయంగా.

‘‘వెంటనే మా వాహనంలో బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళి ఎల్లుండికల్లా మీ తండ్రిని వెంటబెట్టుకుని రావాలి,’’ అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి.

‘‘చిత్తం ప్రభూ! తమ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరుతున్నాను,’’ అంటూ బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు.

మరునాడు తెల్లవారేసరికి వాహనం పల్లెటూరిలోని బీర్బల్ తండ్రి ఇంటి ముందు ఆగింది. బీర్బల్ వాహనం దిగి, ‘‘నాన్నా,’’ అంటూ వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు.
‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వచ్చావు నాయనా! బావున్నావా?’’ అంటూ బీర్బల్‌ను లేవనెత్తిన తండ్రి అతణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఆ తరవాత అవీ ఇవీ మాట్లాడుకున్నాక భోజనం ముగించారు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బీర్బల్ తను వచ్చిన సంగతి బయటపెట్టాడు.

‘‘నేనా? రాజుగారి సభకు రావడమా? అక్కడ పెద్దల మధ్య ఎలా నడుచుకోవడమో కూడా తెలియని పల్లెటూరి వాణ్ణి కదా?’’ అన్నాడు బీర్బల్ తండ్రి.
‘‘ఎలా నడుచుకోవాలో నేను చెబుతాను కదా? అదేం పెద్ద బ్రహ్మవిద్య కాదు. సభలో ప్రవేశించగానే వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాలి. ఆ తరవాత తలపైకెత్తుకుని వెళ్ళి మీకని నిర్దేశించిన ఆసనంలో కూర్చోవాలి. మీ పేరు, ఊరు ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్పాలి. ఇతర ప్రశ్నలేవైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ తలాడించండి చాలు,’’ అన్నాడు బీర్బల్.

‘‘మౌనం సర్వార్థ సాధకం కదా?’’ అన్నాడు బీర్బల్ తండ్రి నవ్వుతూ.

‘‘అవును, నాన్నా. మరో విన్నపం. అంతా అయ్యాక, ‘ఎందుకు నోరు తెరిచి సమాధానం చెప్పలేదు?’ అని ఎవరైనా గనక అడిగి నట్టయితే,’’ అంటూ తండ్రి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. ముసలి తండ్రి ఆ మాటకు నవ్వు ఆపుకోలేక పకపకా నవ్వాడు.

మరునాడు బీర్బల్ తండ్రిని వెంటబెట్టుకుని చక్రవర్తి సభలో అడుగు పెట్టాడు. బీర్బల్ నేలను నుదుటితో తాకి లేచి వెళ్ళి ఆసనంలో కూర్చున్నాడు. తండ్రి కూడా అదే విధంగా వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాడు.

‘‘పెద్దలకు స్వాగతం! రండి! కూర్చోండి,’’ అన్నాడు చక్రవర్తి మందహాసంతో.

బీర్బల్ తండ్రి, ‘‘షహేన్‌షా!’’ అంటూ మరొకసారి నమస్కరించి, వెళ్ళి కొడుకు పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నాడు.

‘‘మిమ్మల్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉన్నది. మీ కుమారుడు ఒక అనర్ఘ రత్నం. అతడు గొప్ప మేధావి. ఎలాంటి క్లిష్ట సమస్యకైనా చిటికెలో పరిష్కారం చెప్పగలడు. అతణ్ణి కన్నందుకు మీరు గర్వించాలి,’’ అన్నాడు చక్రవర్తి.
బీర్బల్ తండ్రి చిన్నగా నవ్వుతూ, వినయంగా తల పంకించాడు తప్ప పెదవి విప్పలేదు.

‘‘షహేన్‌షా! ఈ జ్ఞాన వృద్ధుణ్ణి చూడడానికి మాకూ ఎంతో సంతోషంగా ఉన్నది. ఆయన మాకందరికీ కూడా తండ్రిలాగా కనిపిస్తున్నాడు,’’ అంటూ షైతాన్‌ఖాన్, ఆయనతో మరింత సేపు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నట్టు చక్రవర్తి కేసి చూశాడు. చక్రవర్తి అనుమతిస్తున్నట్టు చేయి ఊపాడు.

షైతాన్‌ఖాన్ చుట్టపక్కల ఒకసారి పరిశీలనగా చూసి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బీర్బల్ తండ్రి వద్దకు వెళ్ళి, వంగి ఆయన పాదాలు తాకి నమస్కరించాడు.
‘‘దీర్ఘాయుష్మాన్ భవ!’’ అంటూ బీర్బల్ తండ్రి అతడి తలను తాకి ఆశీర్వదించాడు.

‘‘బాబాజీ! మీ కొడుకు ఈ రాజ్యంలో అందరికన్నా తెలివైనవాడు. మరి అతణ్ణి కన్న మీరు మరెంత మేధావంతులో కదా?’’ అన్నాడు షైతాన్‌ఖాన్.
బీర్బల్ తండ్రి మందహాసం చేస్తూ తలపైకెత్తి చూశాడు.

‘‘అతడు మీకు చాలా అమూల్యమైనవాడు కదా?’’ అని అడిగాడు షైతాన్‌ఖాన్. బీర్బల్ తండ్రి మెల్లగా తలపంకించాడు.

‘‘అతడు మీపట్ల భక్తి శ్రద్ధలతో మీ అవసరాలన్నీ సమకూరుస్తున్నాడా?’’ అని అడిగాడు షైతాన్‌ఖాన్. పెద్దాయన మళ్ళీ మందహాసంతో తల పంకించాడు.
‘‘మన చక్రవర్తి గురించి తమరేమనుకుంటున్నారు?’’ అని అడిగాడు షైతాన్‌ఖాన్ ఆయన్ను ఇరుకులో పెట్టాలని. పెద్దాయన నవ్వి మౌనంగా ఊరుకున్నాడు.

షైతాన్‌ఖాన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. పెద్దాయన చిరునవ్వు నవ్వాడుగాని ఒక్క మాట ఆయన నోటి నుంచి బయట పడలేదు.

అప్పుడు బీర్బల్ లేచి నిలబడి చక్రవర్తితో, ‘‘షహేన్‌షా! ప్రభువులంటే ఆయనకు మహాగౌరవం. సాటిలేని తమ ధర్మబుద్ధిని గురించి బాగా తెలుసు. వినయశీలి; విశ్వాసపాత్రుడైన పౌరుడు గనక తమ ఎదుట ఆ మాట అనడానికి ఆయనకు నోరు పెగలటం లేదు. మేటి మొగల్ చక్రవర్తిని గురించి న్యాయనిర్ణయం చేయవలసింది మనం కాదు. సాధారణ ప్రజలు. మా తండ్రికి దైవభీతి ఎక్కువ. మేమందరం అనునిత్యం తమలో దైవాన్ని సందర్శిస్తున్నాం. అటువంటి తమను గురించి ఆయన న్యాయనిర్ణయం చేయడానికి సాహసించ లేకపోతున్నాడు. అందువల్లే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వెలువడడం లేదు,’’ అన్నాడు.

చక్రవర్తి పరమ సంతోషంతో, ‘‘మీ స్వభావం మాకెంతో ఆనందం కలిగించింది,’’ అన్నాడు బీర్బల్ తండ్రితో.

బీర్బల్ తండ్రి లోకజ్ఞానం లేని నిరక్షరాస్యుడన్న సంగతి బట్టబయలు చేయాలనుకున్న తన ప్రయత్నం విఫలం కావడంతో, షైతాన్‌ఖాన్ ఆశాభంగానికి లోనయ్యాడు. తన సహచరుల కేసి చూశాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా బీర్బల్ తండ్రి, తలను రకరకాల భంగిమలతో అటూ ఇటూ మెల్లగా ఊపాడు తప్ప, నోరు తెరిచిన పాపాన పోలేదు.
విసుగు చెందిన షైతాన్‌ఖాన్ లేచి, ‘‘షహేన్‌షా!’’ అన్నాడు.

‘‘ఏమిటి షైతాన్‌ఖాన్? చెప్పు,’’ అని అడిగాడు చక్రవర్తి.

‘‘ఈ వృద్ధుడికి ఏమీ తెలియదని నా అనుమానం. మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకుంటున్నాడు,’’ అన్నాడు షైతాన్‌ఖాన్. సభలో గుసగుసలు బయలుదేరాయి.
‘‘ఆ వృద్ధుణ్ణి అలా కించపరచడం భావ్యమేనా?’’ అని అడిగాడు చక్రవర్తి.

అంతలో పెద్దాయన ఏదో చెప్పదలచినట్టు చెయ్యి పైకెత్తి, ‘‘ప్రభూ! మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను,’’ అన్నాడు గంభీరంగా.

‘‘మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరు. నిజంగా తమరు వివేకవంతుణ్ణి కన్న జ్ఞాన సంపన్నులు,’’ అంటూ చక్రవర్తి, తన చేతి బంగారు కడియాన్ని తీసి బీర్బల్ తండ్రి చేతికి తొడిగాడు.

పెద్దాయన వంగి నేలను తాకి నమస్కరించి లేచి నిలబడ్డాడు.

‘‘షహేన్‌షా! వృద్ధుడైన మా తండ్రి సుదూర ప్రయాణం కారణంగా బాగా అలిసిపోయారు. ఆయనకు విశ్రాంతి కావాలి. తమ అనుమతితో తీసుకువెళ్ళమంటారా?’’ అని అడిగాడు బీర్బల్.

‘‘అలాగే బీర్బల్. ఆయన గొప్పవివేకి మౌనం శక్తి ఎరిగిన జ్ఞాని. మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం మౌనం అని నిరూపించాడు కదా!’’ అంటూ బిగ్గరగా నవ్వుతూ సభికుల కేసి చూశాడు.

షైతాన్‌ఖాన్, అతడి అనుచరుల ముఖాలు సిగ్గుతో వెలవెలబోయాయి.

యమునానది-వంద మొహరీలు

శీతాకాలం మధ్యాహ్న సమయంలో అక్బర్ చక్రవర్తి యమునానదీ తీరానికి షికారుకు వెళ్ళాడు. ఆయన వెంట బీర్బల్‌తో సహా కొందరు సభికులు నడుస్తున్నారు. మందగమనంతో సాగుతూన్న నదీ జలాలను చూస్తూ, ‘‘శీతల వాయువులు మంచుకొండల నుంచి మోసుకొచ్చిన చల్లదనాన్ని నదీజలాల్ల్లో కలిపి వాటికి మరింత చల్లదనం సమకూరుస్తున్నాయి,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘ఇంత చల్లటి నీళ్ళల్లో అడుగుపెట్టడానికి కూడా ఎవరూ సాహసించలేరు,’’ అన్నాడు ఒక అధికారి.

‘‘తగిన ప్రోత్సాహకం అందజేయాలేగాని, పగటిపూటే కాదు; కావాలంటే రాత్రంతా రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపే మహానుభావులూ ఉంటారు,’’ అన్నాడు బీర్బల్.
‘‘అసాధ్యం! ఎవడైనా అలాంటి దుస్సాహసానికి పూనుకుంటే రక్తం గడ్డకట్టుకుపోయి చస్తాడు,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘ప్రయత్నించనంత వరకే  ఏదైనా అసాధ్యం షహేన్‌షా,’’ అన్నాడు బీర్బల్.

‘‘నువ్వంత రూఢిగా ఎలా చెప్పగలవు?’’ అని అడిగాడు చక్రవర్తి.

‘‘బహుమతి ప్రకటించి చూడండి. నేను చెప్పడం సరో కాదో తెలిసిపోతుంది,’’ అన్నాడు బీర్బల్ వినయంగా.

యమునానదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో రాత్రంతా గడిపిన వారికి వంద మొహరీలు బహుమతిగా ఇవ్వబడుతుందని మరునాడు ఉదయమే చాటింపు చేయబడింది.

ఆ చాటింపును మంగేష్ అనే ఒక రజకుడు విన్నాడు. అతడు డబ్బు అవసరంలో ఉన్నాడు. ‘‘వంద మొహరీలు! వాటితో నా అప్పులన్నీ తీరిపోతాయి. ఖర్చులన్నీ పోను కొంత మిగులుతుంది కూడా,’’ అన్నాడు భార్యతో.

‘‘ఆలోగా నువ్వు చలికి బిరబ్రిగుసుకుపోకుంటే సరి,’’ అని హెచ్చరించింది భార్య. ‘‘ఆ భయమేం లేదు. నా చిన్నప్పుడు శీతాకాలం రాత్రుల్లో యమునలో ఈదేవాణ్ణి,’’ అంటూ భార్య చేతిని ఆప్యాయంగా పట్టుకుని, ‘‘వంద మొహరీలంటే మాటలా? ఆలోచించి చూడు,’’ అన్నాడు మంగేష్ నవ్వుతూ.

మరునాడు మంగేష్ రాజభవనానికి వెళ్ళి, వచ్చిన పని చెప్పి చక్రవర్తి దర్శనం కావాలన్నాడు. అధికారి అతణ్ణి చక్రవర్తి వద్దకు తీసుకు వెళ్ళాడు. అతడు నేలను తాకి నమస్కరించి, ‘‘షహేన్‌షా, తమ చాటింపు విన్నాను. రొమ్ముల లోతు యమునానది నీళ్ళల్లో రాత్రంతా గడపడానికి నేను సిద్ధం,’’ అన్నాడు.

‘‘మంచిది,’’ అంటూ చక్రవర్తి అధికారికేసి తిరిగి, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమన్నాడు. నదీ తీరంలో కాపలా కాయడానికి ఇద్దరు భటులు వచ్చారు. తెల్లవార్లూ అతడు రొమ్ములలోతు నీళ్ళల్లో ఉన్నాడా అని కనిపెట్టి చూడడం వాళ్ళ బాధ్యత. ఆ మాట వినగానే భటులు, ‘‘రాత్రంతా యమునా తీరంలోనా,’’ అని గొణుక్కున్నారు. అయినా రాజాజ్ఞ! పాటించక తప్పదు కదా!

సాయంకాలం భటులు మంగేష్‌ను నదీ తీరానికి నడిపించారు. వాళ్ళు ఉన్నిబట్టలు ధరించి, నదీ తీరంలోని గుడారంలో కూర్చున్నారు. మంగేష్ మొలకు కట్టుకున్న బట్టను తప్ప తక్కిన దుస్తులన్నిటినీ  తీసేశాడు. పెనుగాలిలో ఆకులా వణికిపోసాగాడు. ప్రాణాలను పణంగా పెడుతున్నానా అని ఒక్క  క్షణం భయపడ్డాడు. అయినా ఇంతదూరం వచ్చాక ఇప్పుడు ఆలోచించి లాభం లేదు. ‘‘వంద మొహరీలు!’’ అనుకున్నాడు మనసులో. ‘‘ఒక్క రాత్రి చలి బాధను తట్టుకుని నిలబడితే వంద మొహరీలు నా చేతిలో,’’ అన్న ఆలోచనతో ధైర్యాన్ని కూడదీసుకుంటూ నీళ్ళలోకి దిగి నిలబడడానికి అనువైన, రొమ్ములలోతు నీళ్ళల్లో నిలబడ్డాడు.

చీకటికమ్ముకోవడంతో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవసాగాయి. నెలవంక కనిపించి కనుమరుగయింది. ఎముకలు కొరికే చలి. రాత్రి అయ్యే కొద్దీ చలి ఉధృతం పెరగసాగింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని క్షణమొక యుగంగా గడపసాగాడు. ఉన్నట్టుండి అతడి చూపులు దూరంగా కోట బురుజు నుంచి మిణుకు మిణుకుమనే దీపం వెలుగుమీద పడింది. ‘‘ఆహా! దూరంలోని ఆ దీపం కూడా కొంత వెచ్చగానే ఉన్నది!’’ అనుకున్నాడతడు మనసులో.

దీపమూ, వెచ్చదనమూ గురించిన ఆలోచనలు అతడి భయాలను పోగొట్టి ధైర్యాన్నివ్వసాగాయి. వాటి మీదే మనసును కేంద్రీకరించడంతో చలిని గురించి మరిచిపోయాడు. దూరంగా కోడి కూత వినిపించింది. తూరుపు దిక్కున వెలుగు రేఖలు కనిపించాయి. తన కష్టాలు గట్టెక్కనున్నాయని మంగేష్ పరమానందం చెందాడు.
 ‘‘వెలుపలికిరా మంగేష్! ఇంకాస్సేపటికి వంద మొహరీలు నీకు సొంతం!’’ అని కేక వేశారు గట్టుమీది భటులు.

గట్టుమీదికి వచ్చిన మంగేష్ ఒళ్ళు తుడుచుకుని పొడిబట్టలు కట్టుకుని, రాజభవనానికి భటులతో బయలుదేరాడు. వాళ్ళు భవనంలో అడుగు పెట్టేసరికి చక్రవర్తి బీర్బల్‌తో సహా ప్రముఖులతో కొలువుదీరి ఉన్నాడు.

‘‘షహేన్‌షా! రాత్రి తెల్లవార్లూ ఇతడు నదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపాడు,’’ అన్నారు భటులు.

చక్రవర్తికి ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. చలిని భరించడానికి ఆ మనిషి ఏదో కిటుకును ఉపయోగించి ఉండవచ్చని ఆయన అనుమానించాడు. ముందుకు వంగి, ‘‘చలిని ఎలా దూరంగా ఉంచగలిగావు? నిజం చెప్పు,’’ అని అడిగాడు.

‘‘షహేన్‌షా! కోట బురుజుమీది దీపం నాకు వెచ్చదనం సమకూర్చింది,’’ అని సమాధానమిచ్చాడు మంగేష్ అమాయకంగా.

‘‘దీపం నీకు వెచ్చదనం ఇచ్చింది! అంటే నీకు వెలుపలి నుంచి సాయం అందిందన్నమాట! అందువల్ల బహుమతికి నువ్వు అనర్హుడివి!’’ అన్నాడు చక్రవర్తి.
మంగేష్ ముఖం వెలవెలబోయింది. చక్రవర్తి తీర్పుకు బదులు చెప్పలేక అతడు బాధతో తలదించుకున్నాడు.

బీర్బల్ కూడా ఆశ్చర్యపోయాడు గాని, ఒక్కమాట మాట్లాడలేదు. ఆశాభంగానికి గురైన మంగేష్ వంగి నమస్కరించి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం మౌనంగా చూస్తూండిపోయాడు. బహుమతిని ఆశించి మంగేష్ ప్రాణాంతకమైన చలిని భరించాడు. కాని అతడి ఆశ ఫలించలేదు!

మంగేష్‌కు తీరని అన్యాయం జరిగిందని బీర్బల్ భావించాడు. అతడికి ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించాడు.
మరునాడు ఇంటివద్ద తనకు అత్యవసరమైన పనిపడిందనీ, అందువల్ల ఆ రోజు సభకు రాలేననీ చక్రవర్తికి కబురు పంపాడు బీర్బల్. ‘‘అత్యవసరమైన పనా! చక్రవర్తి సేవకు మించిన పని, అదేమిటి?’’ అని గొణిగాడు చక్రవర్తి.

బీర్బల్ అంటే అసూయగల కొందరు సభికులు సంతోషించారు. ఈసారి బీర్బల్ తప్పక చిక్కుల్లో పడగలడని ఆశించారు.

చక్రవర్తి భటులను పిలిచి, బీర్బల్‌ను వెంటబెట్టుకు రమ్మని ఆజ్ఞాపించాడు. భటులు బీర్బల్ ఇంటికి వెళ్ళి సంగతి చెప్పారు.

‘‘నేను కిచడి తయారు చేస్తున్నాననీ, ఆ పని పూర్తి కాగానే పరిగెత్తుకు రాగలననీ చక్రవర్తికి చెప్పండి,’’ అన్నాడు బీర్బల్.
భటులు ఆ సంగతి చక్రవర్తికి విన్నవించారు.

‘‘మూర్ఖుడా!’’ అని మండిపడ్డ చక్రవర్తి వెంటనే శాంతించి, ‘‘ఆ తుంటరి వెధవాయి దేనికైనా సమర్థుడు. ఏం చేస్తున్నాడో ఏమో స్వయంగా వెళ్ళి చూద్దాం,’’ అని అనుకున్నాడు.
వెంటనే ఆయన గుర్రం మీద బీర్బల్ ఇంటికి బయలుదేరాడు. బీర్బల్ ఇంటి వాకిట్లో కనిపించాడు. పొయ్యిలో ఎండు కట్టెలు పెట్టి మంట రగిలిస్తున్నాడు. వట్టి పొయ్యికి ఐదడుగుల దూరంలో ముక్కాలి పీట మీద మట్టి కుండ కనిపించింది.

చక్రవర్తిని చూడగానే బీర్బల్ చేతిలోని కట్టెను కింద పడేసి లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, నేలను తాకి నమస్కరించాడు. ‘‘ఏం చేస్తున్నావు బీర్బల్?’’ అని అడిగాడు చక్రవర్తి.
‘‘కిచడి వంట చేస్తున్నాను షహేన్‌షా. అదిగో ఆ ముక్కాలిపీట మీది కుండలోకి బియ్యం, పప్పు వేశాను,’’ అన్నాడు బీర్బల్.
‘‘కుండ కింద మంట కనిపించదే మరి?’’ అని అడిగాడు చక్రవర్తి కనుబొమలు ముడిచి. ‘‘అదిగో అక్కడ ఉంది కదా మంట,’’ అంటూ ఐదడుగుల దూరంలో మండుతున్న పొయ్యిని చూపాడు బీర్బల్.

‘‘కుండకు మంట వేడి తగలకుండా అందులోని బియ్యం, పప్పు ఎలా ఉడుకుతుందనుకున్నావు?’’ అని అడిగాడు చక్రవర్తి విసుగ్గా.
బీర్బల్ చిన్నగా నవ్వాడు.

‘‘నవ్వు సమాధానం కాజాలదు. పప్పు, బియ్యం ఉన్న కుండ మంటకు దూరంగా ఉంటే అవి ఎలా ఉడుకుతాయి?’’ అని అడిగాడు చక్రవర్తి మళ్ళీ కోపంగా.
‘‘షహేన్‌షా! మంట వేడి చాలా దూరానికి చేరగలదని తమరే నాకు బోధించారు,’’ అన్నాడు బీర్బల్.

‘‘నేను బోధించానా? ఎప్పుడు? ఎక్కడ?’’ అన్నాడు చక్రవర్తి అయోమయంగా.

‘‘తమరే బోధించారు షహేన్‌షా! యమునానది శీతల జలాల మధ్య నిలబడ్డ మంగేష్‌కి, కోట బురుజుపై వెలిగే మసక దీపం వెచ్చదనం అందించిందని నిండు సభలో తమరే సెలవిచ్చారు కదా?’’ అన్నాడు బీర్బల్ వినయంగా స్పష్టమైన కంఠస్వరంతో.

బీర్బల్ మాటల అంతరార్థం గ్రహించి విస్తుపోయిన చక్రవర్తి, ‘‘ఆహా!’’ అంటూ భటులకేసి తిరిగి, ‘‘వెంటనే వెళ్ళి మంగేష్‌ను వెంటబెట్టుకు రండి. ప్రకటించిన బహుమతిని అతడికి అందజేయాలి,’’ అని ఆజ్ఞాపించాడు.

‘‘షహేన్‌షా, న్యాయం జరిగింది గనక, ఇప్పుడు ముక్కాలి పీట మీది బియ్యం, పప్పుకుండ పొయ్యి మీదికి చేరుతుంది,’’ అన్నాడు బీర్బల్.
ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు.

బంగారు నాణాలు

ఆ రోజు ప్రజల కొరతలు వింటున్నాడని తెలియగానే ఒక ముసలావిడ గంపెడాశతో ఆయన్ను చూడడానికి బయలుదేరింది. కాపలా భటులు సంగతేమిటని అడిగారు. ‘‘నాయనా, నేను చక్రవర్తిని చూడాలి,’’ అన్నది ఆమె ఆయాసంతో రొప్పుతూ.

‘‘నెమ్మదిగా రా,’’ అంటూ భటులు ఆమె చేయిపట్టుకుని కొలువుతీరి వున్న చక్రవర్తి సమక్షానికి తీసుకువెళ్ళారు. ఆమె సభలో అడుగుపెట్టగానే, వంగి నేలను తాకి చక్రవర్తికి సలాం చేయడానికి ప్రయత్నించింది.

ఆమె వయసును గమనించిన చక్రవర్తి సింహాసనం నుంచి లేచి, ‘‘ఫరవాలేదు. వచ్చిన పనేమిటో చెప్పు,’’ అన్నాడు.

‘‘ఆలంపనా, నా పేరు సుందరీ బాయి. పేద ముసలిదాన్ని,’’ అన్నది ముసలావిడ

‘‘అవన్నీ చూస్తూనే తెలుస్తున్నవి. ఇక్కడ పేదలు, ధనికులు; చిన్నా, పెద్దా తేడాలుండవు. నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘తమరు కాదంటే నాకెవ్వరూ న్యాయం చెయ్యలేరు ఆలంపనా,’’ అన్నది ముసలావిడ గద్గద స్వరంతో.

‘‘నన్నేం చెయ్యమంటావో, నీ సమస్య కాస్త గట్టిగా చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.

‘‘ఆలంపనా, గత సంవత్సరం బదరీనాథ్ యాత్ర చేసిరావాలనుకున్నాను. ఆరోగ్యం బాగానే ఉందికానీ, వయసు పైబడడం వల్ల కాళ్ళుచేతులు బాగున్నప్పుడే వెళ్ళి వద్దామనుకున్నాను. ముందూ వెనకా ఎవరూ లేరు గనక, ఇన్నాళ్ళు కొద్ది కొద్దిగా కూడబెట్టినదంతా అమ్మి బంగారు మొహరీలుగా మార్చాను. వాటిని ఒక సంచీలో వేసి మూతి బిగువుగా కట్టి లక్కముద్ర వేశాను. బాగా ఆరిన తరవాత ఒకసారి ఆడించి చూశాను. దృఢంగా కనిపించింది,’’ అని ఆగింది ముసలావిడ.

‘‘ఇంతవరకు చాలా చక్కగా చేశావు. ఆసక్తికరంగా ఉంది. ఆ తరవాత ఏం జరిగిందో చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి. ‘‘నేను ఆ సంచీని మన నగరంలో అందరూ గౌరవించే గృహస్థు అయిన గుల్‌షా దగ్గరికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చేంతవరకు భద్రంగా దాచమని వేడుకున్నాను. అతడందుకు అంగీకరించగానే సంచీని తీసి చూపాను. అతడు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. నన్ను వెంటబెట్టుకుని అతడి ఇంటి పెరట్లో ఉన్న పాకలోకి తీసుకుపోయి గొయ్యి తవ్వి దాన్ని అందులో పూడ్చి పెట్టమన్నాడు. చుట్టు పక్కల ఒక్కరూ లేరు. నేను అతడు చెప్పినట్టే చేశాను. ‘నీకిక ఎలాంటి విచారమూ వద్దు. తిరిగి వచ్చి నువ్వే దానిని నిక్షేపంగా తీసుకోవచ్చు,’ అని చెప్పి పంపాడు.

‘‘కృతజ్ఞతలు తెలియజేసి వచ్చిన నేను తీర్థయాత్ర ముగించుకుని నెల తరవాత తిరిగి వచ్చాను. నాణాల సంచీకోసం గుల్‌షా వద్దకు వెళ్ళాను. నన్ను ఆయన నవ్వుతూ పాకలోకి తీసుకుపోయి, పాతిపెట్టిన చోట తవ్వి సంచీని తీసుకోమన్నాడు. అలాగే తవ్వి తీసుకున్నాను. పూడ్చిపెట్టిన సంచీ అక్కడే ఉన్నది. లక్కముద్ర కూడా చెక్కుచెదరకుండా అలాగే ఉండడంతో సంతోషంగా మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి తిరిగి వచ్చాను.

ఇంటికి చేరగానే లక్కముద్ర తొలగించి మూట విప్పి చూడగానే ప్రాణం పోయినట్టయింది. బంగారు నాణాలు కనిపించలేదు. వాటికి బదులు అదే పరిమాణంలో రాగి నాణాలున్నాయి,’’ అంటూ ముసలావిడ ఆ తరవాత మాట్లాడలేక భోరున ఏడ్వసాగింది. ‘‘ఏడవకు, ఊరుకో,’’ అని ఓదార్చిన చక్రవర్తి సభికుల కేసి తిరిగి, ‘‘ఈ సమస్యను ఎలా పరిష్కరించగలం?’’ అని అడిగాడు.

ముసలావిడ ఆత్రుతగా వాళ్ళకేసి చూడసాగింది. సభలోని ఒక్కరూ నోరు విప్పలేదు. ఆఖరికి బీర్బల్ లేచి నిలబడి, ‘‘ఈ మర్మాన్ని నేను ఛేదించగలననుకుంటాను షహేన్‌షా!’’ అన్నాడు.
‘‘ఆ నమ్మకం నాకూ ఉన్నది, బీర్బల్,’’ అన్నాడు చక్రవర్తి తలపంకిస్తూ.

‘‘షహేన్‌షా, ఆ నాణాల మూటను ఒకసారి పరిశీలించి చూడాలనుకుంటాను,’’ అన్నాడు బీర్బల్.

‘‘ఇదిగో సంచీ,’’ అంటూ ముసలావిడ సంచీని బీర్బల్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపింది.
బీర్బల్ ఆ సంచీని తీసుకుని తిప్పి తిప్పి కొంతసేపు పరిశీలనగా చూశాడు. ఇందులో ఏదో తిరకాసు ఉంది అనుకుంటూ పెదవులు బిగించి ఆ తరవాత ముసలావిడతో, ‘‘నువ్వు చెప్పేది నిజమయితే, నీ నాణాలు నీకు తప్పకుండా వస్తాయి,’’ అని ధైర్యం చెప్పాడు.

‘‘నేను అబద్ధం చెబితే నా నెత్తిన పిడుగు పడి చస్తాను,’’ అంటూ ముసలావిడ చేతులెత్తి ఆకాశం కేసి చూసింది.

‘‘తప్పకుండా నిజాన్ని బయట పెడతాం. ఎల్లుండి రావమ్మా,’’ అన్నాడు చక్రవర్తి.

ముసలావిడ వంగి నమస్కరించి అక్కడి నుంచి వెలుపలికి నడిచింది.

చక్రవర్తి ఆసనం నుంచి లేవగానే సభికులు లేచి నిలబడ్డారు. ఆయన వెలుపలికి నడుస్తూండగా వంగి నమస్కరించారు. ఆ తరవాత బీర్బల్ కూడా ముసలావిడ ఇచ్చిన సంచీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు.

తక్కిన సభికులు బీర్బల్ ఈ మర్మాన్ని ఎలా ఛేదిస్తాడో తెలియక మల్లగుల్లాలు పడసాగారు. ఛేదించలేకపోతే బీర్బల్, చక్రవర్తి ఆగ్రహానికి గురికావడం తథ్యమనీ, దాంతో ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుందనీ అసూయాపరులైన వాళ్ళు ఆశతో ఎదురు చూడసాగారు. సమస్యను పరిష్కరించడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఇల్లు చేరిన బీర్బల్‌ను భార్య చిరునవ్వుతో పలకరించింది. బీర్బల్ దాన్ని పట్టించుకోకుండా ముభావంగా తలాడించడంతో తాగడానికి నీళ్ళందించి వంట గదిలోకి వెళ్ళిపోయింది భార్య.

బీర్బల్ బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. భోజనం అయిందనిపించి, వరండాలో కాస్సేపు అటూ ఇటూ తిరిగాడు. మధ్యాహ్నం కునుకు కోసం వెళ్ళి నడుంవాల్చిన బీర్బల్ మెరుపులాంటి ఆలోచనతో చివుక్కున లేచి కూర్చున్నాడు. వెంటనే కత్తెర తీసుకుని పడక పైతొడుగును ఒక వైపు చకచకా కత్తిరించాడు. ‘‘ఏమిటండీ, బంగారం లాంటి బట్టను అలా కత్తిరించేశారు,’’ అంటూ వాపోతూన్న భార్య మాటలను పట్టించుకోకుండా పడక పైతొడుగును జాగ్రత్తగా విడిగా లాగుతూ నౌకరును పిలిచాడు. నౌకరు పరిగెత్తి రాగానే దానిని వాడి చేతికిచ్చి, ‘‘నగరంలో గట్టివాడైన దర్జీ చేతికిచ్చి దీన్ని చక్కగా కుట్టించుకుని రావాలి,’’ అన్నాడు.

‘‘మన్సూర్ అలీకి మించిన దర్జీ నగరంలో లేడు. అతడు నేను బాగా ఎరిగినవాడే,’’ అని చెప్పిన నౌకరు, ‘‘అవునూ, ఇది తమకెప్పుడు కావాలి?’’ అని అడిగాడు.

‘‘రేపు మధ్యాహ్నానికల్లా ఇస్తే చాలు,’’ అన్నాడు బీర్బల్.

చెప్పినట్టుగానే మరునాటి సాయంకాలానికల్లా కుట్టిన బట్టతో తిరిగివచ్చాడు నౌకరు. బీర్బల్ దానిని తీసుకుని నాలుగు మూలలా పరిశీలించి, చేత్తో తడివి చూశాడు. తను కత్తిరించిన చోటు తెలియకుండా చాలా చక్కగా కుట్టబడి ఉన్నది. ‘‘చాలా బాగా కుట్టాడు. మన్సూర్ అలీని చూడాలి. రా వెళదాం,’’ అంటూ నౌకరును వెంటబెట్టుకుని బయలుదేరాడు.

బీర్బల్‌ను చూడగానే, ‘‘హుజూర్!తమరు ఇంత దూరం రావాలా? ఒక్క మాట చెప్పి పంపి ఉంటే నేనే వచ్చేవాణ్ణి కదా?’’ అంటూ లేచి వంగి సలాం చేశాడు మన్సూర్ అలీ.

‘‘అద్భుతమైన నీ పనితనాన్ని మెచ్చుకోవాలనే స్వయంగా వచ్చాను,’’ అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ.
‘‘దీన్ని పుచ్చుకో,’’ అంటూ బీర్బల్ ఒక మొహరీ అతడిచేతిలో పెట్టాడు.

‘‘నాకు ఇవ్వవలసింది ఇందులో సగమే,’’ అంటూ మిగిలిన చిల్లర కోసం జేబులు వెదకసాగాడు మన్సూర్ అలీ.

అంతలో బీర్బల్ ముసలావిడ నుంచి తీసుకున్న సంచీని తీసి మన్సూర్ అలీకి చూపుతూ, ‘‘ఈ సంచీ చిరిగిందని ఎవరైనా వచ్చి కుట్టించుకుని వెళ్ళారా? కాస్త జాగ్రత్తగా చూసి చెప్పు,’’ అని అడిగాడు బీర్బల్.

మన్సూర్ అలీ కళ్ళు అతడు కుట్టిన చిరుగు సంచీని చూడగానే కనిపెట్టేశాయి. ‘‘హుజూర్, దాదాపు నెల క్రితం గుల్‌షా ఈ సంచీని తెచ్చి చిరుగును కుట్టించుకుని వెళ్ళాడు,’’ అని చెప్పాడు మెరిసే కళ్ళతో.

‘‘చాలా కృతజ్ఞతలు,’’ అంటూ బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు.

మరునాడు ఉదయం సభాసదులందరూ రాగానే చక్రవర్తి సభలో అడుగుపెట్టాడు. అందరూ లేచినిలబడి ఆయనకు వంగి సలాం చేసి, ఆయన ఆసనంలో కూర్చున్నాక తామూ కూర్చున్నారు. భటులు గుల్‌షాను, ముసలావిడను సభలో ప్రవేశపెట్టారు.

చక్రవర్తి బీర్బల్ కేసి తల తప్పి, ‘‘ఈ ముసలావిడ ఫిర్యాదులోని నిజానిజాలు నిగ్గు తేల్చావా?’’ అని అడిగాడు.

‘‘ఆమె చెప్పింది అక్షరాలా నిజం షహేన్‌షా! అందులో ఏమాత్రం అనుమానం లేదు,’’ అంటూ బీర్బల్ తను ఆ నిజాన్ని ఎలా కనుగొన్నదీ చక్రవర్తికి స్పష్టంగా వివరించాడు. గుల్‌షా దిగ్భ్రాంతి చెందాడు. అతడి ముఖం వెలవెల బోయింది. మోకాళ్ళ మీదికి వంగి, రెండు చేతులతో తలను పట్టుకున్నాడు. ఆ తరవాత తలతో నేలను తాకి చక్రవర్తికి సలాం చేశాడు.
‘‘ఇప్పుడైనా నిజం ఒప్పుకో,’’ అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి.

‘‘క్షమించండి ఆలంపనా! దురాశతో మోసానికి పాల్పడ్డాను,’’ అంటూ చక్రవర్తి పాదాలపై బడ్డాడు గుల్‌షా.

‘‘మోసగాణ్ణి క్షమించడమా! పదేళ్ళు కఠిన కారాగారశిక్ష విధిస్తున్నాను,’’ అన్నాడు చక్రవర్తి.

ఆ తరవాత ముసలావిడకు చెందవలసిన బంగారు మొహరీలు ఆమెకు అప్పగించబడ్డాయి.

‘‘తమ నోటి గుండా ఆ మాట వినడం నా కెంతో సంతోషంగా ఉంది, హుజూర్,’’ అన్నాడు మన్సూర్ అలీ.

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.

“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క. “ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. “తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.

రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.

కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

ఆగస్త్యమహాముని

పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండే వారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి అయ్యా అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మత్రం ఉపదేశించటానికి వీలు పడదని అతడు చెప్పాడు. తరవాత వాతాపి తమ్ముడైన వాతాపిని మేకకా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణునికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తరవాత ఇల్వలుడు "వాతాపి బయటకురా " అన్నాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు.

ఒక రోజు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచిగురుటాకులను ఆధారం చేసుకుని వ్రేలాడుతున్న తన పితరులను చూసాడు. అగస్త్యుడు వారితో "అయ్యా! మీరెవరు? ఇలా ఎందుకు వ్రేలాడుతున్నారు " అని అడిగాడు. బదులుగా వారు "నయనా!మేము నీపితరులము. నీవు వివాహం చేసుకొనకుండా సంతాన హీనుడవ్వావు. కనుక మేముఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కనుక నీవు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు " అన్నారు.

అగస్త్యుడు అలాగే అన్నాడు.ఆ సమయంలో విదర్భ రాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. అగస్త్యుడు తన తపోమహిమతో అతనికి ఒక కూతురిని అనుగ్రహించాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు " ఈ నిరుపేద బ్రాహ్మణుడా నాకుమార్తె భర్త. ఇతడిని చేసుకుని నా కూతురు నారచీరెలు ధరించవలసినదేనా? " అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని తండ్రిని కోరింది.

గత్యంరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునకిచ్చి వివాహం చేసాడు. ఆమె నారచీరెలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్య్డుడు కోరికతో భార్యను చేరాడు. లోపాముద్ర "నాధా! సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి " అన్నది. అగస్త్య్డుడు " నా వద్ధ ధనం, ఆభరణములు లేవు వాటి కొరకు తపశ్శక్తిని ధారపోయడం వ్యర్ధం " అనుకుని ధనం కొరకు అగస్త్య్డు శతర్వురుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శతర్వురుడు తనవద్ద ధనం లేదని చెప్పాడు. అగస్త్య్డుడు, శతర్వురుడు బృహదశ్వుని వద్దకు అనే రాజు వద్దకు వెళ్ళి ధనం అడిగాడు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనం లేదని చెప్పాడు.

ఆ తరువాత ఆ ముగ్గురూ ధనం కొరకు త్రసదస్యుడి వద్దకు వెళ్ళారు. అతను కూడా ధనం లేదని చెప్పి "మునీద్రా! ఇల్వలుడు ధనవంతుడు. అతడిని అడిగితే మీకోరిక తీరుతుంది " అన్నాడు.వెంటనే అందరూ ఇల్వలుడి దగ్గరకు వెళ్ళారు. అగస్త్య్డు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్య్ని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్ర్హించిన రాజఋషులు "మునీంద్రా! ఇల్వవుడు తన తమ్ముని మేకగా మార్చి వండి మ్రాహ్మణులచే త్నిపించి అతనిని బయటకు రమ్మంటాడు. అతడు పొట్ట్ను చీల్చుకుని ఆబ్రాహ్మణుని చంపి బయటకు వస్తాడు.కనుక మీరు భుజించరాదు " అన్నారు.

అగస్త్య్డుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తినేశాడు.అగస్త్య్డుడు పొట్టను తడుముకుని తేన్చాడు. అంతే వాతాపి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు "వాతాపీ బయటకు రా " అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణం అయ్యాడని తెలుసుకుని భయపడి అగస్త్యునితో "అయ్యా మీరు కోరిన ధనం ఇస్తాను " అన్నాడు. ఆ ధనంతో అగస్త్య్డు లోపా ముద్ర కోరికను తీర్చాడు.

అగస్త్య్డుడు లోపాముద్రతో "నీకు పది మందితో సమానమన నూరుగురు కొడుకులు కావాలా? లేక నూరుగురుతో సమానమైన ఒక్క కొడుకు కావాలా? లేక నూరుగురు కొడుకులతో సమానమైన వెయ్యి మంది కొడుకులు కావాలా లేక వెయ్యి మందికి సమానమైన ఒక్క కొడుకు కావాలా ? " అని అడిగాడు.
అందుకు లోపాముద్ర "నాకు వేయి మందితో సమానమైన బలవంతుడూ, బుద్ధిమంతుడూ అయిన ఒక్క కుమారుని ప్రసాదంచండి " అని కోరింది. లోపాముద్ర గర్భందాల్చి తేజోవంతుడూ, గుణవంతుడూ అయిన దృఢస్యుడు అనే కొడుకును కన్నది.ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగించాడు.

శిబి చక్రవర్తి

మహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!

ఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.

అయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... "ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?" అంటూ ప్రశ్నించాడు.అప్పుడు శిబి చక్రవర్తి "ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను..." అని చెప్పాడు.

దానికి డేగ మాట్లాడుతూ... "అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు" అని అంది.దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.

సరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.

ముసలి గ్రద్ద

భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో "జరద్గవము" అను ముసలి గద్ద నివసిస్తుండేది. పాపం ఆగద్దకు కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించడం కష్టమయ్యేది.

ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకు పెడుతుండేవి. ఆ ఆహారంతో గ్రద్ద జీవిస్తూ ఉండేది.ఓకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని చెట్టువద్దకు నిశబ్దముగా చేరింది. దనిని చూచిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. "ఎవరక్కడ?" అని గట్టిగా అరచింది.

గద్దను చూచి పిల్లి భయపడింది. దనికి తప్పించుకొనే అవకాశం లేదు. అందువలన అది వినయంగా గద్దతో "అయ్యా! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక పిల్లిని. మీ దర్శనము కొరకు వచ్చాను" అన్నది. గద్ద కోపంగా "ఓ మార్జాలమా! వెంటనే ఇచటి నుండి పారిపో లేదంటే చచ్చిపోతావు"అన్నది. పిల్లి గద్దతో "అయ్యా మీరు పెద్దలు. మీరు గొప్ప ధర్మాత్ములని తెలిసి వచ్చాను."

పిల్లి జాతిలో పుట్టినా నేను రోజు గంగలో స్నానం చేస్తాను, కేవలం శాకాహరం తింటూ జీవిస్తున్నాను. మాంసాహారం మానివేసిచాంద్రాయణ వ్రతంను ఆచరిస్తున్నాను. మీరు మంచివారని, మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలు తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన అతిథిని శత్రువయినను గౌరవించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాని మీరు నన్ను తరిమేస్తున్నారు" అన్నది.

గద్ద పిల్లి మాటలకు మెత్తబడింది. "చెట్టు పైన పక్షిపిల్లలున్నాయి. పిల్లులకు మాంసం అంటే ఇష్టం కదా. అందుకని నిన్ను వెళ్లమన్నాను." అంది. పిల్లి తన రెండు చెవులు మూసుకొని "కృష్ణ! కృష్న పూర్వజన్మలో ఏంతో పాపం చేసి ఈ జన్మలో పిల్లిగా పుట్టాను. అందువలనే ఇంత ఖటినమైన మాటలు వినవలసి వస్తుంది. అయ్యా! మీ మీద ఒట్టు.

నేను మాంసమును ముట్టను. అహింసయే పరమ ధర్మము అను సూత్రమును నమ్మినదానిని" అన్నది. గ్రద్ద పిల్లిని అనునయిస్తూ "కోపగించకు. కొత్తగా వచ్చిన వారి గుణ శీలములు తెలియవు కదా. అందువలన ఆ విధముగా పరుషంగా మాట్లాడినాను. ఇకనుంచి నీవు నా వద్దకు రావచ్చు..... పోవచ్చు. నీకు అడ్డులేదు " అన్నది. పిల్లి ఎంతోషంతోషించింది.

పిల్లి గద్దతో స్నేహం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి గద్దను పూర్తిగా నమ్మింది. గద్దతో పాటు తొఱ్ఱలో ఉండసాగింది. అర్థరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతును కొఱికి, వాటిని చంపేది. పక్షిని తొఱ్ఱలోకి తెచ్చుకొని దానిని తిన్నది. ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి.

పక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి వాటికోసం వెదకసాగాయి. ఆ సంగతి తెలిసి పిల్లి పారి పోయింది. పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ తోఱ్ఱ వద్దకు వచ్చాయి. తొఱ్ఱలో పక్షులు ఎముకలను చూసి , గద్దయే తమ పిల్లలను చంపి తింటున్నదని అనుకున్నాయి. అవి కోపంతో గద్దను తమ గోళ్ళతో రక్కి దానిని చంపాయి. "నీచులతో స్నేహం చేస్తే చివరకు తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని" అనుకుంటూ గద్ద చని పోయింది

నక్క బావ పాకశాస్త్ర ప్రావీణ్యం


నక్క బావ కొత్తగా భోజనశాల తెరిచింది. అడవిలోని జంతువులతోపాటు మృగరాజు సింహాన్ని కూడా ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించింది. అడవిలోని జంతువులు, పక్షులు వీలు చూసుకుని నక్క భోజనశాలకు వెళ్లి విందారగిస్తున్నాయి. 

పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంతో అతిథులకు ఎంతో రుచితో కొత్త కొత్త వంటకాలు వండి వడ్డిస్తుంది. అన్నీ లొట్టలేసుకుంటూ తిని, నక్కబావ చేతివంటను మెచ్చుకోకుండా ఉండలేకపోయాయి. ప్రతిఫలంగా అవి ఇచ్చే బహుమతులు పుచ్చుకునేది నక్క. నక్కబావ అద్భుతమైన చేతివంట గురించి రెండురోజుల్లోనే అడవంతా పాకింది. కొద్దిరోజుల్లోనే చుట్టుపక్కల అడవుల్లోకి పాకింది  దాంతో.. పక్కనున్న అడవుల్లోని జంతువులు కూడా నక్కబావ చేతివంట తినాలని ఆరాటపడేవి. ఇంత జరిగినా...అడవిరాజు సింహం మాత్రం నక్కబావ తెరిచిన భోజన శాలకు రావడం కుదరలేదు. పక్కనున్న అడవుల నుంచి కూడా వచ్చి రుచి చూసి పోతున్న విషయం దానికి తెలిసింది.

నక్క రాజుగార్ని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ వీలు చిక్కక పోవడంతో వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు వెళ్లాలని నిశ్చయించుకుంది సింహం.

దుప్పిని తినగా అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ నక్క తెరిచిన భోజనశాలకు వెళ్లే ఏర్పాట్లు చేయమని మంత్రి తోడేలును ఆదేశించింది. మృగరాజు తన పరివారంతో భోజనశాలకు వస్తున్నట్టు నక్కకు వార్త అందింది. ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా వంటలు చేసింది. రాజుగారికి ఎదురెళ్లి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి, ప్రేమతో దగ్గరుండి వడ్డించింది నక్క.

రాజుగారితో విచ్చేసిన తోడేలు, ఎలుగుబంటి, ఏనుగు లొట్టలేసుకుంటూ తినసాగాయి. కానీ సింహం మాత్రం లొట్టలేయలేదు. ఏదో తిన్నానని అనిపించింది. సింహం తృప్తిగా తినలేదని నక్క గ్రహించింది. లొట్టలేసుకుని తింటే విలువ తగ్గుతుందని సింహం భావించింది కాబోలనుకుంది.

నక్కకు ఖరీదైన కానుకలిచ్చి అక్కడినుండి తన పరివారంతో ముందుకు కదిలాడు మృగరాజు. ‘‘వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో..! నేనింత వరకు ఇంత కమ్మని వంట తిని ఎరుగను’’ అంది ఎలుగుబంటి. ‘‘నిజమే! అన్ని వంటలూ ఎంతో రుచిగా ఉన్నాయి’’ అన్నాయి ఏనుగు, తోడేలు. దాంతో.. సింహానికి చిరాకేసింది.

‘‘ఆపండి మీ తిండిగోల..!’’ అంటూ కసురుకుంది. తనకు అస్సలు ఆ వంటల్లో ప్రత్యేకతే కనపడలేదంది. పైగా రుచిగా కూడా లేవంది. అడవి అడవంతా నక్కబావ చేతివంట మెచ్చుకుంటుంటే... ఒక్క సింహానికే ఎందుకు నచ్చలేదో వారికి ఆ క్షణం అర్థం కాలేదు. సింహం తృప్తిగా తినలేకపోయిందని నక్క బాధ పడిన విషయం మంత్రి తోడేలుకు తెలిసింది. ఈ విషయమై లోతుగా ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. నక్కను బాధపడొద్దని, త్వరలోనే రాజుగారు మరోమారు విందుకు వస్తారని ఈ సారి తప్పనిసరిగా మెచ్చుకుంటారని తోడేలు కబురు పంపింది.

ఒకరోజు సాయంత్రం తోడేలు రాజుగారిని నక్క భోజనశాలకు వెళ్లేలా ఒప్పించింది. సింహం అనాసక్తిగానే తిరిగి తన పరివారంతో విందుకు వెళ్లింది. ఈసారి సింహం లొట్టలేసుకుని తిన్నది పైగా ‘‘ఇప్పుడు ఎంతో రుచిగా ఉన్నాయి కదా..!?’’ అంటూ తనతో వచ్చిన వాటిని ఉత్సాహపరిచింది.

‘‘రాజా! నక్క వంటలో ఏమాత్రం తేడాలేదు. అప్పుడు, ఇప్పుడు రుచిగానే వండింది. కానీ గతంలో మీరు ఆకలితో లేరు. అప్పుడే దుప్పిని వేటాడి, ఆరగించి ఇక్కడ విందుకు కూర్చున్నారు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అసలు రుచి తెలిసింది అంది తోడేలు. తన పొరపాటు గ్రహించి నక్కను తిరిగి అభినందించి, బహుమతులిచ్చి సంతోషంగా అక్కడి నుంచి తన పరివారంతో వెనక్కు వెళ్లాడు మృగరాజు. 

చీమ కళా నైపుణ్యం


ఒకసారి మృగరాజు సింహానికి తన తండ్రి శిల్పం అడవిలో ప్రతిష్టించాలన్న కోరిక కలిగింది. వెంటనే కాకితో అడవంతా చాటింపు వేయించింది. శిల్ప విద్యలో ప్రవేశమున్న ఏనుగు, ఎలుగుబంటి, నక్క మృగరాజు సింహాన్ని సంప్రదించాయి. ‘శిల్పులారా! గతంలో ఈ అడవిని పాలించిన మా తండ్రి మృగరాజు సింహం శిల్పాన్ని ఆయన చనిపోయిన రోజున ప్రతిష్టించాలన్న కోరిక మాకు కలిగింది. చాటింపు విని విచ్చేసిన మీకు స్వాగతం!’’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు మృగరాజు.

ఇంతలో ఓ చీమ ఆయాసపడుతూ ‘‘మృగరాజా! నేనూ మీరు వేయించిన చాటింపు వినే వచ్చాను. నాకూ అవకాశం ఇప్పించండి’’ అంది. మృగరాజు కళ్లు చిట్లించి ఆ చిన్ని చీమవైపు చూశాడు.‘‘ఏంటీ..నువ్వు కూడా శిల్పం చేద్దామనే వచ్చావా!’’ గంభీరంగా అంది సింహం. ‘‘మహారాజా! నేను మట్టితో ఎన్నో శిల్పాలు చేశాను. శిల్పవిద్యలో మా జాతికి ఎంతో పేరుంది. ఈరోజు పెద్ద పెద్దనిర్మాణాలు కట్టడాలు మేము నిర్మించిన పుట్టలు చూసి స్ఫూర్తిపొందే మానవజాతి నిర్మిస్తుంది. నాకూ ఒక అవకాశం ఇప్పించండి’’ అంది చీమ.

ఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఏనుగు, ఎలుగుబంటి, నక్క చీమను చూసి నవ్వుకున్నాయి. ‘మృగరాజా! మీరు తుమ్మితే ఎగిరిపోయే చీమ శిల్పం ఏం చేస్తుంది’ అంది ఏనుగు. సింహం ఆలోచనలో పడింది. ‘నాకు నీమీద నమ్మకం కలగడంలేదు. అయినా నీకు అవకాశం ఇస్తాను. మీలో ఎవరి పనితనం గొప్పగా ఉంటే వారికి విలువైన కానుకలతోపాటు ఆస్థాన శిల్పిగా పదవి అందచేస్తాను’ అంది సింహం. సింహం తనను నమ్మకున్నా అవకాశం ఇచ్చినందుకు సంతోషించింది చీమ., ఏనుగు, ఎలుగుబంటి, నక్క శిల్ప నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు, ముడి సరుకులు మృగరాజును అడిగి తెప్పించుకున్నాయి.

‘‘ఏం..చీమ మిత్రమా! నీకు పనిముట్లు ముడిసరుకులు అవసరం లేదా?!’’ అడిగింది సింహం .‘అది పనిముట్లు మోయగలదా?’ నవ్వింది ఎలుగుబంటి. ‘శిల్ప కళ అంటే ఆషామాషీ కాదు’ అంది నక్క. చీమ వాటివైపు వింతగా చూసింది. ‘‘ఏం మాట్లాడవు?! గర్జించాడు మృగరాజు. ‘‘మహారాజా! నాకు నాలుగు అడుగుల నేల ఇప్పించండి చాలు’ అంది చీమ. మృగరాజు చీమ కోరిక మీద నాలుగు అడుగుల స్థలం చూపించాడు. ఇక అవన్నీ తమ పనిలో నిమగ్నమయ్యాయి. సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది.

మరుసటిరోజుకు శిల్పాలు సిద్ధమయ్యాయి. సింహం స్వయంగా శిల్పులను చేరుకుని వాటి పనితనాన్ని పరీక్షించింది. ఏనుగు, ఎలుగుబంటి, నక్క శిల్పాలు ఒకదాన్ని మించి ఒకటి అందంగా కనిపించాయి. చివరగా చీమను చేరుకుంది సింహం. చీమ తను చెక్కిన శిల్పాన్ని మృగరాజుకు చూపించింది. అంతే... మృగరాజు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి తన ఎదురుగా నిలుచున్నంత మహా అద్భుతంగా ఉందా శిల్పం. పనిముట్లు లేకుండా కేవలం మట్టితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి మలిచిన శిల్పమది. సింహంతోపాటు ఏనుగు, ఎలుగుబంటి, నక్క ఆశ్చర్యపోయాయి. మృగరాజు చీమను దగ్గరకు తీసుకుని ‘మిత్రమా! నిన్నూ నీ ఆకారాన్ని చూసినమ్మకున్నా... నీ పనితనం చూసి నమ్ముతున్నాను. ఈ సృష్టిలో నీవే అద్భుత శిల్పివి’ అన్నాడు.

ఏనుగు, ఎలుగుబంటి, నక్క సిగ్గుపడ్డాయి. జన్మతోనే చీమలు శిల్పులని గ్రహించాయి. అందుకే అవి ఎంతో అందంగా నిర్మించుకున్న పుట్టలను పాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాయని తెలుసుకున్నాయి. చీమకు విలువైన కానుకలతోపాటు ఆస్థాన శిల్పి పదవి ఇచ్చి గౌరవించింది సింహం. ‘ఇతరులు మనల్నిచూసి నమ్మకున్నా.. మన పనితనం చూసి నమ్ముతారు. పనికి ఉన్న గొప్పతనం అది’ అనుకుంది చీమ.

కాకి బావ ఉపాయం


యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది. ఆ మర్రిచెట్టు క్రింద ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి. ఈ విధంగా చాలా సార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది.

కాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది. అది కాకిని సమీపించి " కాకి బావ కాకి బావ! ఎందుకు ఏడుస్తున్నావ్ నీకు వచ్చిన సమస్య ఏమిటి? " అని అడిగింది. కాకి నక్కతో " నక్క బావా నక్కబావా నా గర్భశొకాన్ని ఎవరితో చెప్పుకొనేది నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. అని కావ్ కావ్ మని అరుస్తుంటే విని ఆనందించాలను కున్నాను. కాని నాకు ఆ అదృష్టం లేదు" అని బాధపడింది.

నక్క కాకితో "మీ పక్షులు గుడ్లు పెట్టడం, వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా! "అన్నది.కాకి "నిజమే కాని నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది" అని బధతో అన్నది. నక్క "మరి ఆ పాముని చంపబోయావా?" అన్నది. ఆ పని నా వల్ల కాదుకదా" అన్నది కాకి. అప్పుడు నక్క " శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయముతో అతనిని తప్పించాలి " అని నక్క వెళ్ళిపోయినది కాకి చాలా సేపు ఆలోచించినది. దానికి చక్కటి ఉపాయం తట్టింది. యమునకు సమీపమున విలాసధామం అను పట్టణం ఉన్నది. ఆపట్టణంలో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తెలు ఆ కొలనుకి వచ్చి జలక్రీడలు ఆడతారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులో దిగారు. కాకి రాణి గారి ముత్యాలా హారాన్ని ముక్కున కరచుకొని ఎగిరింది. చెలికత్తెలు దానిని గమనించి భటులను హెచ్చరించారు.

రాజభటులు కాకి వెంటబడ్డారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్టవద్దకు వచ్చింది రాజభటులు కూడా దానిని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు. అపుడు కాకి ముత్యాలహారాన్ని పుట్టలో వేసి, చెట్టుపైకి ఎగిరింది. రాజభటులు హారంకోసం పుట్టను త్రవ్వారు. అపుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని ఈటెలతో పొడిచి చంపారు. భటులు ముత్యాలహారం తీసుకొని వెళ్ళిపోయారు. పాము పీడ వదలినందుకు కాకుల జంట సంతోషించాయి

మాట్లాడే గాడిద


ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు. అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు

"అవును మహారాజా" అన్నాడు బీర్బల్ "మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్. మళ్ళీ 'అవునని' చెప్పాడు. బీర్బల్  వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.

బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.

బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు. "ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?" ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"

"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?" "బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.." "ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు. ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.

ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు. "బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్. "చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు. "గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!" "ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు." ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు. "బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.

"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు. "అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు

"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్. అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.

అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.
అక్బర్ అందుకు అంగీకరించాడు. 

"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు. 

ఏడు చేపల కథ


అనగనగా ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యానికో రాజు. రాజుకు ఏడుగురు కొడుకులుండేవారట. ఒకసారి రాజుగారి ఏడుగురు కొడుకులూ, చేపల వేటకని బయలుదేరి వెళ్ళారట. ఏడుగురు కొడుకులూ కలసి ఏడుచేపలు పట్టారట. పట్టుకొచ్చిన ఏడుచేపలనూ ఒక బండ మీద ఆరబెట్టారట. 

అందులో పెద్దవాడి చేప మాత్రం ఎండలేదట. పెద్దకొడుకు చేపతో, చేపా! చేపా! ఎందుకెండలేదు? అని అడిగాడట. అందుకు బదులుగా ఆ ఎండబెట్టిన చేప, " గడ్డివాము అడ్డం వచ్చింది, అందుకనే ఎండలేదు" అని చెప్పిందట. రాకుమారుడు గడ్డివాము దగ్గరికెళ్ళి దానితో, "గడ్డివామూ! గడ్డివామూ! ఎందుకు అడ్డం వచ్చావు?" అని అడిగాడట. అప్పుడా గడ్డివాము "ఆవు నన్ను మేయలేదు" అని అన్నదట.  ఈసారి రాకుమారుడు ఆవు దగ్గరికెళ్ళి "ఆవూ! ఆవూ! నువ్వెందుకు గడ్డి మేయలేదు?" అని అడిగాడట. అప్పుడా ఆవు, "జీతగాడు నాకు మేత వేయలేదు" అని చెప్పిందట. 

"జీతగాడా! జీతగాడా! నువ్వెందుకు మేత వేయలేదు?" అని అడిగాడట. " అవ్వనాకు బువ్వ పెట్టలేదు" అని జీతగాడు చెప్పాడట. "అవ్వా! అవ్వా! జీతగానికి ఎందుకు బువ్వ పెట్టలేదు?" అని అడిగాడట రాకుమారుడు. " పాప ఏడుస్తోంది. అందుకనే నాకు వీలుకాలేదు" అని అవ్వ చెప్పిందట. "పాపా! పాపా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని పాపనడిగాడట రాకుమారుడు. "నన్ను చీమ కుట్టింది" అని పాప అన్నదట. 


రాకుమారుడు చీమను వెళ్ళి అడిగాడట, "చీమా! చీమా! ఎందుకు పాపను కుట్టావు?"అని. అప్పుడు చీమ అన్నదట, "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా! గిట్టనా!" అని.........!

అందని ద్రాక్ష పుల్లన


అనగనగా ఒక నక్క ఉండేదట, ఒక రోజు అది  రైతు యెక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది.

 మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ, దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగి,"ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది

 అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినపుడు, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నపుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

అమాయక బ్రాహ్మడు


అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.

మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.

“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు… ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.

పిసినారి నక్క


అనగనగా ఒక అడవిలో ఒక క్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి క్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా క్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది. 

ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి క్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.

‘‘క్క మామా! క్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. క్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.‘‘నువ్వు మేలుజాతి క్కలా ఉన్నావు. నీలాంటి క్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన క్క ‘సరే’ అని తలూపింది. 

వెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ క్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి క్క వెనుకకు, మరొక కాకి క్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా క్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన క్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ క్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది.

జిత్తులమారి నక్క


అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. అది ఓసారి సరదాగా షికారుకు బయల్దేరింది. అలా వెళ్తూ వెళ్తూ కాలు జారి, ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. అది కాస్త లోతుగా ఉండటంతో బయటికెలా రావాలో అర్థం కాలేదు. పైకి ఎగిరింది. గోడ ఎక్కాలని ప్రయత్నించింది. ఏం చేసినా పైకి రాలేకపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఓ మేక వచ్చింది.

మేక అసలే దాహంతో ఉంది. నీళ్లకోసం బావిలోకి తొంగి చూసింది. దానికి నక్క కనబడింది. అది అక్కడ ఏం చేస్తున్నదో తెలుసుకోకుండా -‘‘నక్క బావా, నక్క బావా! బావిలో బాగా నీళ్లున్నాయా’’ అని అడిగింది. బావిలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న నక్కకు మంచి ఉపాయం తట్టింది.

‘‘ఓ.. లేకేం! ఎంత తోడినా తరగనన్ని నీళ్లున్నాయి. వచ్చి తాగు’’ అంది. మంచి దాహంతో ఉన్న మేక, వెనకా ముందూ ఆలోచించకుండా బావిలో దూకేసింది. అప్పుడుగానీ దానికర్థం కాలేదు. ‘‘అయ్యో, ఇందులోంచి బయటికెలా వెళ్లడం’’ అంది దిగులుగా. అందుకు నక్క- ‘‘మనం బయటపడటానికి నేనో మంచి మార్గం చెప్తాను. నువ్వు నీ ముందర కాళ్లు ఎత్తి, గోడకు ఆన్చి నిలబడు. నేను నీ మీద ఎక్కి పైకి వెళ్లిపోతాను. తర్వాత నువ్వూ వచ్చేద్దువు గాని’’ అంది. 


నక్క మాటల్లోని మర్మం గ్రహించని మేక నక్క చెప్పినట్టే నిలబడింది. దాని మీద ఎక్కి ఎంచక్కా పైకి వచ్చేసింది నక్క. ‘‘మరి నేను...’’అంది మేక. ‘‘ఏమో... నాకేం తెలుసు’’ నిర్లక్ష్యంగా అంది నక్క.అప్పుడర్థమయ్యింది మేకకు నక్క చేసిన మోసం. ‘‘నన్నిలా మోసం చేయడం నీకు తగదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.  ‘‘ఇందులో నా తప్పేముంది! నేను చెప్పగానే బావిలోకి దూకేయడం నీదే తప్పు. నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుని నన్నంటావేం’’ అంటూ చక్కా పోయింది. మంచి చెడులు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది మేకకి.