Pages

Wednesday, September 19, 2012

విచిత్రమైన జాతకం


కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలుండేవి. వాటిలో దాంతిపురమనే నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు, చిన్న కళింగు అని ఇద్దరు కొడుకులు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు: తండ్రి తదనంతరం పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రం చిత్రమైన జాతకం. అతని జీవితమంతా సన్యాసి యోగమే.
కాని, మహారాజయోగం గల అదృష్టవంతుడు కుమారుడుగా పుడతాడు! కొద్ది కాలానికి రాజు కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసన మధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగుకు బాగా మనసుకు పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి వుండక స్వతంత్రుడుగా వ్యవహరింప సాగాడు.
ఉభయుల మధ్యా కలతలు ప్రారంభమయ్యూయి. కొన్నాళ్ళకు రాజు చిన్నవాణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు. అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి, కళింగరాజ్య మంత్రులలో ఒకడుగా ఉంటూ వచ్చాడు. పెద్ద కళింగుతరం నాటికి అతడు బాగా వృద్ధుడయ్యూడు. కుటుంబ క్షేమం కోరిన ఆ వృద్ధమంత్రి చిన్నకళింగు వద్దకు వచ్చి, రహస్యంగా రాజాజ్ఞను వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు.
‘‘తాతా! అన్నివిధాలా నాకు నీవే హితుడవు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసుకదా! అవి ఫలించడమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత నీపై వున్నది. ఇదిగో, నా పేరుగల ఉంగరం, నా శాలువా, నా ఖడ్గం, ఈ మూడూ ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తాడో, వాడే నా కొడుకని గుర్తుంచుకో.

నీ చేతనైన సహాయం కూడా చెయ్యి,'' అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రెండవ కంటికి తెలియకుండా అరణ్యాల్లోకి పారిపోయూడు. ఆ రోజుల్లో మగధరాజుకు లేకలేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన జ్యోతిష్కులు, ‘‘ఇది ఒక చిత్రమైన జాతకం. రాజకుమారి జీవితం ఒక సన్యాసినిగా గడుపుతుంది.
ఐతే, ఆమెకు మహారాజయోగంగల కుమారుడు పుడతాడు,'' అని చెప్పారు. ఈ సంగతి తెలియగానే సామంతరాజులందరూ రాజకుమారిని పెళ్ళాడాలని వచ్చి పోటీలు పడసాగారు. రాజుకు గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతుర్ని ఏ ఒకరికి ఇచ్చినా తక్కినవారు కక్షగట్టి పగ తీర్చుకోవడం సహజం. కనుక, ఈ అపాయం నుంచి తప్పించుకోడానికి నిశ్చయించాడు.
గత్యంతరం లేక భార్యనూ, కూతుర్నీ వెంటబెట్టుకుని మారువేషంతో అరణ్యాల్లోకి పలాయనమయ్యూడు. నదీతీరాన సదుపాయమైన స్థలంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకుని అందులో ముగ్గురూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువనే కళింగరాజపుత్రుని కుటీరం ఉన్నది. ఒక రోజున, కుమార్తెను కుటీరంలో వదలి, మగధ రాజదంపతులు కందమూల ఫలాదులకోసం వెళ్ళారు.
ఆ సమయంలో రాజపుత్రి రకరకాల పువ్వులు పోగుచేసి ఒక చక్కని దండ కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒకగున్న మామిడిచెట్టు వుంది. మగధ రాజపుత్రి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చుని తను కట్టిన పువ్వుల దండను అక్కడి నుండి నీటిలో పడవేసి, వేడుక చూస్తున్నది. ఆ పువ్వులదండ తేలి ఆడుతూ పోయి పోయి, స్నానం చేస్తున్న చిన్న కళింగు తలకు తాకింది. వెంటనే అతడు దానిని తీసి చూసి, ‘‘ఎంత చక్కటి పూలదండ!
ఎన్ని రకాల పువ్వులు! దీనిని ఇంత ఇంపుగా సొంపుగా కూర్చినామె అపురూపమైన అందకత్తె అయివుంటుంది. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పనియేమిటో?'' అని ఆలోచించాడు. దండ కట్టిన సుందరిని వెతకాలని అతని మనసు ఉరకలు వేయసాగింది. ఈ సంకల్పంతో కళింగు అరణ్యమార్గాన వెళుతూవుండగా, ఒక దిక్కు నుండి వీనులవిందు చేసే తీయని కంఠస్వరం వినవచ్చింది. అట్టె నిలబడి అటు ఇటు చూడగా, మామిడిచెట్టు కొమ్మల్లో కూర్చొని పాడుతున్న సుందరి అతడికి కనిపించింది.

 ఆ యువతిని చూసి, కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. చివరకు, ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం వెల్లడించాడు. అందుకామె, ‘‘మీరు ఋషిసంతతికి చెందిన వారు, మేము క్షత్రియులం!'' అన్నది. వెంటనే కళింగు, ‘‘నేనూ క్షత్రియుణ్ణే,'' అంటూ తన గుట్టుమట్టులన్నీ విప్పి చెప్పాడు.
అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులు కూడా దాపరికం లేకుండా చెప్పివేసింది. ఇద్దరూ కలిసి ఆమె తండ్రివద్దకు వెళ్ళగానే, సంగతి సందర్భాలు తెలుసుకుని, ‘‘ఇతడే అమ్మాయికి తగిన వరుడు,'' అని మగధరాజు నిశ్చయించాడు. చిన్న కళింగుకూ, మగధ రాజకుమారికీ వివాహం జరిగింది. కొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి, విజయకళింగు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
కొన్నాళ్ళు గడిచిన తరవాత ఒక రోజున, చిన్న కళింగు జాతకాలు తీసి, లెక్కవేసి గ్రహకూటాలు ఎలా వున్నదీ చూశాడు. అప్పటికి తన అన్న ఐన పెద్ద కళింగు ఆయువు మూడి వుంటుందని లెక్కలవల్ల తేలింది. అప్పుడు కళింగు కొడుకును చేర బిలిచి, ‘‘కుమారా! నీవు జీవితం గడప వలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతిపుర ప్రభువు. ఆ రాజ్యానికి వారసుడవు నీవే!
కనుక, వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు,'' అని చెప్పి, వృద్ధమంత్రిని గురించి చెప్పి, మూడు వస్తువులూ ఆనవాలిచ్చి దీవించి పంపాడు. తల్లిదండ్రుల వద్దా, తాతా అమ్మమ్మల వద్దా సెలవు తీసుకున్న విజయకళింగు దాంతిపురం చేరుకుని, వృద్ధమంత్రిని దర్శించి, తాను ఫలానా అని చెప్పాడు. అప్పటికి, చిన్న కళింగు అంచనా ప్రకారమే అతని అన్న కాలం చేశాడు; దాంతిపురం అరాచకస్థితిలో వున్నది.
ఒక మహాసభ ఏర్పాటు చేసి, వృద్ధమంత్రి చిన్నవాడైన విజయకళింగు పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించేసరికి, సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు పలికారు. వృద్ధమంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ, విజయకళింగు చక్కగా రాజ్యం పరిపాలించి, పెద్దల పేరు నిలబెట్టాడు.

గజరాజు


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, కాశీనగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో అయిదు వందలమంది వడ్రంగులుండేవారు. సామాన్య ప్రజలకు అవసరమైన వస్తుసామగ్రిని తయూరు చేయడంలో వాళ్ళు మంచి నేర్పరులు. వాటితోపాటు కలపతో పిల్లలు ఆడుకునే రకరకాల ఆటవస్తువులూ, అలంకార వస్తువులూ ఎంతో నాణ్యంగా తయూరు చేసేవారు. వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి, దాపులనున్న అరణ్యానికి వెళ్ళి, అక్కడ చెట్లు పడగొట్టి, కలప కోసి, పడవలలో తెచ్చుకుంటూ వుండేవారు.
ఆ కలప ఖర్చయిపోగానే తెచ్చుకోవడానికి మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ వుండేవారు. ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు వుంటూండేది. ఒకనాడు అది దాపులనున్న కొలనులో నీళ్ళుతాగి తిరిగి వస్తూండగా దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్ట నారంభించింది. అది ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయటం సాధ్యం కాలేదు. ఇలా అది కొన్ని రోజులు చెప్పరానంత బాధ అనుభవించింది. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడూ, కలప కోసే చప్పుడూ వినిపించింది. అది కుంటుతూ వారున్న చోటికి వెళ్ళింది.
ఏనుగును చూడగానే దానికేదో బాధ కలిగిందని గ్రహించి, వడ్రంగులు తాము చేసే పని కట్టిపెట్టారు. ఏనుగు వారి ముందు పడుకున్నది. దాని కాలు వాచి ఉండటం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకుని, వడ్రంగులు తమ ఉలులతో ఉపాయంగా పేడును బయటికి లాగి, అక్కడ లభించే ఆకుల పసరు పూసి గాయూనికి చికిత్సచేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగయింది. అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకు ఎంతో కృతజ్ఞతతో సాయపడ సాగింది.

అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది, దుంగలను దొర్లించేది, కోసిన పలకలను నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ యేటి కాయేడు వడ్రంగులకూ ఏనుగుకూ మధ్య స్నేహం పెరిగింది. అయిదు వందలమంది వడ్రంగులూ తమ ఆహారంలో తలాకాస్తా తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు.
కాలక్రమాన ఈ అడవి ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది, తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిదై పోయూక, అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పగించి, తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడీ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ, వారిచ్చే ఆహారాన్ని తింటూ, వారి పిల్లలను తన వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ, నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళ బుచ్చుతున్నది. వడ్రంగులు ఆ ఏనుగు పిల్లను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు.
అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి, దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి, ఆయన కలపకోసం వచ్చాడనుకుని, ‘‘మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప కావలిస్తే మేము తెచ్చి ఇవ్వకపోయూమా?'' అన్నారు చేతులు జోడిస్తూ.
‘‘నేను కలపకోసం రాలేదు. ఈ తెల్ల ఏనుగుకోసం వచ్చాను,'' అన్నాడు రాజు. ‘‘అయితే తీసుకు వెళ్ళండి!'' అన్నారు వడ్రంగులు వినయంగా. వారి సంభాషణ విన్న ఏనుగుపిల్లకు విచారం కలిగింది. తను రాజువెంట వెళితే, వడ్రంగుల పిల్లలను ఆడిస్తూ, సాయపడే వారెవరు? అందువల్ల అది ఎంతకీ అక్కడ నుంచి కదలలేదు.
రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, ‘‘మహారాజా, ఇది చాలా వివేకంగల జంతువు. దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది. వారికి పరిహారం ఇస్తేనేగాని అది కదలదు!'' అన్నాడు. రాజు ఏనుగు నాలుగు కాళ్ళదగ్గిరా, తొండం దగ్గిరా, తోకదగ్గిరా ఒక్కొక్క లక్ష వరహాలు చొప్పున పెట్టి, వడ్రంగులను తీసుకోమన్నాడు. అప్పటికీ ఏనుగు అక్కడి నుంచి కదలలేదు.

వడ్రంగుల భార్యలకూ, పిల్లలకూ బట్టలు పెట్టినాక అది కదిలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును చక్కగా అలంకరించి మేళ తాళాలతో నగరం లోకి తీసుకుపోయూరు. వీధులన్నీ ఊరేగించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో దానిని తిలకించారు. తరవాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. ఆహార విషయంలోనూ, ప్రత్యేక శ్రద్ధ కనబరచ సాగారు. అది పట్టపుటేనుగు అయింది. చక్కగా అలంకరింబడిన దాని మీద రాజుగారు తప్ప ఇంకెవరూ ఎక్కటానికి వీలులేదు.
ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది. సిరిసంపదలతో తులతూగసాగింది. రాజ్య ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లారు. దాని ప్రభావం వల్ల ఎంతటి బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయూరు. కొంత కాలానికి రాజు భార్య గర్భవతి అయింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయూడు. ఇదే మంచి సమయమనుకుని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు.
ఏం చెయ్యూలో మంత్రులకు పాలుబోలేదు. వారు చాలా సేపు తమలో తాము చర్చించుకుని, చివరకు కోసలరాజుకు ఈ విధంగా కబురు పంపారు: ‘‘మా రాణీగారు ఒక వారం లోపల ప్రసవిస్తుంది, ఆమె ఆడపిల్లను కన్నట్లయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం!''

కోసలరాజు ఈ కబురు అందుకుని, వారం రోజులు గడువిచ్చాడు. వారం గడవగానే మహారాణి బోధిసత్వుణ్ణి ప్రసవించింది. కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి. కాని యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది. అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, ‘‘అమ్మా, మన పట్టపు ఏనుగు యుద్ధరంగంలో ప్రవేశిస్తేనే గాని మనకు విజయం చేకూరదు. కాని మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగివున్నది,'' అని విన్నవించారు.
ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీదనుంచి లేచింది. తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది. ఆమె తన కుమారుణ్ణి ఏనుగుకాళ్ళ ముందు పెట్టి నమస్కారం చేసి, ‘‘గజరాజా, నీ యజమాని పోయినందుకు విచారించవద్దు, ఇదిగో నీ నూతన యజమాని! వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు ఇప్పుడే వెళ్ళి వారిని ఓడించు; లేదా నీ కాళ్ళకింద ఈ శిశువును తొక్కి చంపెయ్యి,'' అన్నది.
అంతవరకూ విచారంగా వున్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా తడివింది. అతణ్ణి తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తరవాత అతణ్ణి తల్లి చేతుల్లో పెట్టి యుద్ధరంగానికి కదిలిపోయింది. ఏనుగు భీకరంగా ఘీంకరిస్తూ వాయు వేగంతో తమపైకి వచ్చి పడుతూండటం చూసి, కోసల సైనికుల గుండెలు అవిసి పోయూయి. వారు చెల్లాచెదరుగా పారిపో సాగారు.
ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతణ్ణి తొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు అంటుకుని క్షమాపణ వేడుకున్నాడు. కాశీ మంత్రులు అతనికి ఎట్టి అపకారమూ చేయక, అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు ఏడేళ్ళవాడయ్యే దాకా ఏనుగు కాశీరాజ్యాన్ని కాపాడింది. తరవాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపుటేనుగు చేసుకుని, రాజ్యపాలన చేశాడు.

ఉచ్చనీచలు


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక సింహంగా జన్మించాడు. ఆ సింహం ఒక కొండ గుహలో తన భార్యతో కూడా నివసిస్తూండేది. ఒకనాడా సింహం అమితమైన ఆకలిగొనివున్నదై, కొండ మీది నుంచి కిందికి చూసింది. కొండ కింద ఒక కొలను పక్కగల విశాలమైన పచ్చిక మైదానంలో దానికి కొన్ని కుందేళ్ళూ, జింకలూ ఆడుకుంటూ, అటూ ఇటూ గెంతుతూ కనిపించాయి. వెంటనే సింహం ఒక రంకె పెట్టి, కొండ దిగి వాటివేపు వేగంగా ఉరికింది. అలా పోతూ అది కొలను పక్కన ఉండే ఊబిలో పొరబాటున పడిపోయింది. ఈలోగా సింహాన్ని చూసి కుందేళ్ళూ, జింకలూ భయపడి పారిపోయూయి.
ఊబి నుంచి బయటపడటానికి ప్రయత్నించిన కొద్దీ సింహం మరింత లోపలికి దిగబడసాగింది. అందుచేత అది కదలకుండా అలాగే వుండిపోయి, తనను రక్షించగల వారెవరైనా అటుగా వస్తారా అని ఎదురు చూడసాగింది. ఆకటితో అలమటించుతూ ఆ సింహం ఒక వారంరోజులున్న మీదట, పక్కనే వున్న కొలనులో నీరుతాగటానికి నక్క ఒకటి వచ్చి, సింహాన్ని చూసి బెదిరి దూరంగా ఆగి పోయింది.
సింహం నక్కను చూసి, ‘‘నక్క తమ్ముడూ! వారం రోజులుగా ఈ ఊబిలో చిక్కి, ఎంత ప్రయత్నించినా వెలుపలికిరాలేక చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. నన్నెలాగైనా ఈ ఊబి నుంచి పైకి లాగి కాపాడి పుణ్యం కట్టుకో!'' అని ప్రాధేయపడింది. ‘‘అసలే ఆకలితో ఉన్నావు, నన్ను చంపేస్తావేమో? నిన్నెలా నమ్మటం?'' అన్నది నక్క భయపడుతూ.
‘‘ప్రాణభిక్ష పెట్టిన ప్రాణిని చంపుతానా? నేనంతటి పాపాత్ముణ్ణి కాను. నన్ను, ఈ ఊబి నుంచి రక్షించావంటే, నీకు బతికి ఉన్న న్నాళ్ళూ కృతజ్ఞతగా వుంటాను. నా మాట నమ్ము!'' అన్నది సింహం.

నక్క సింహం మాటలు నమ్మి, ఎండు కట్టెలను తెచ్చి ఊబిలో పడవేసింది. వాటిమీద కాళ్ళు ఊన్చి సింహం ఊబిలో నుంచి బయటికి రాగలిగింది. తరవాత రెండూ కలిసి అరణ్యంలో వేటకు బయలుదేరాయి. సింహం ఒక జంతువును చంపింది. దాన్ని రెండూ సమంగా పంచుకు తిన్నాయి. ‘‘ఇకనుంచీ మనం సోదరులం! నువ్వొకచోటా నేనొకచోటా ఉండటం దేనికి? నీ కుటుంబాన్ని మా గుహకే తీసుకురా! అందరం కలిసికట్టుగా జీవింతాం!'' అన్నది సింహం.
నక్క అంగీకరించి, భార్యతోసహా సింహం గుహలో కాపరం పెట్టింది. సింహం వెంట తాను కూడా కాపరం చెయ్యటం గొప్పగా ఉంటుందని నక్క ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే గాని, తన జాతివారికి దూరమైపోవటంలోగల నష్ట కష్టాలు తెలియక కాదు. సింహం కూడా నక్క చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని, ప్రతి స్వల్ప విషయంలోనూ తన మిత్రుణ్ణి తనతో సమంగా చూసుకుంటూ, నక్క మనసుకు ఏ మాత్రమూ బాధ కలగకుండా ప్రవర్తిస్తూ రోజులు గడపసాగింది.
సింహం నక్కను ఎంత ప్రేమతో చూసినా సింహం భార్య నక్క భార్యను తక్కువగానే చూసేది. అయితే నక్క భార్య తన జాతి తక్కువను ఆమోదించినది కావటం చేత రెండు కుటుంబాల మధ్యా ఎట్టి పేచీలూ రాలేదు. అయితే కాలక్రమాన సింహానికీ, నక్కకూ కూడా పిల్లలు కలిగి, అవి సమంగా ఆడుకుంటుండటం చూసి సింహం భార్యకు మండిపోయింది. తాము తక్కువనీ, సింహం పిల్లలు ఎక్కువనీ తెలియని నక్కపిల్లలు, సింహం పిల్లలతో భేదం పాటించకుండా కిందా మీదా పడి ఆడుకుంటున్నాయి. ఉచ్చనీచల విషయం తెలియని సింహం పిల్లలు కూడా నక్కపిల్లలతో సమంగా ఆడుతున్నాయి. ఇది చూసి ఓర్చలేని సింహం భార్య తన పిల్లలతో చాటుగా, ‘‘మనం గొప్ప పుటక పుట్టిన వాళ్ళం.
మీరా నక్కపిల్లలతో అంత చనువుగా ఆడరాదు. వాటిని దూరంగా ఉంచండి!'' అని చెప్పింది. సింహం పిల్లలకు తల్లి బోధ కొంచెం కొంచెమే తలకెక్క సాగింది. అవి నక్క పిల్ల లను లోకువగా చూడటమూ, వాటితో ఆడే టప్పుడు అన్యాయం చెయ్యటమూ, ‘‘మేము గొప్పవాళ్ళం.


 మిమ్మల్ని మేము పోషిస్తున్నాము. మాకు మీరు ఎదురు చెప్పకూడదు. మీరు తక్కువవాళ్ళు కనక, తిట్టినా పడి ఉండాలి!'' అనటమూ సాగించాయి. ఆడనక్కకు కష్టం వేసి ఒకనాడు తన భర్తతో సింహం భార్య వైఖరి గురించి చెప్పింది. సింహంతో మర్నాడు వేటకు వెళ్ళేటప్పుడు నక్క, ‘‘మీది రాచజాతి. మేం సామాన్యులం.
అందుచేత మనం కలిసి ఉండటం అంత మంచిది కాదు. మేము వెళ్ళి మా వాళ్ళ మధ్య బతుకుతాం!'' అన్నది. ఆకస్మికంగా తమ మిత్రుడిలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపడి సింహం కారణ మడిగింది. నక్క జరిగినదంతా వివరంగా చెప్పింది. ఆ రాత్రి గుహకు తిరిగి రాగానే సింహం తన భార్యతో, ‘‘నువ్వు నక్క పిల్లల్ని చూసి అసహ్యపడ్డావుట కదా?'' అని అడిగింది. ‘‘అవును, ఆ తక్కువజాతి పిల్లలు మన పిల్లలతో సమానంగా ఆడుకోవటం నాకేమీ బాగాలేదు.
మీకా నక్క ఏమి మందు పెట్టి మంచి చేసుకుందో నాకు తెలీదు. నా పిల్లలు పాడుకావటం మాత్రం నేను ఒప్పను!'' అన్నది సింహం భార్య. ‘‘అదా సంగతి? నక్క నాకేం మందు పెట్టిందో చెబుతాను విను: నేను ఒకసారి వారం రోజులు ఇంటికి రాలేదు, జ్ఞాపకం ఉన్నదా? ఆ వారం రోజులూ నేను తిండి లేక మాడుతూ ఊబిలో చిక్కాను. నా ప్రాణాలు పోతున్న సమయంలో ఈ నక్క వచ్చి యుక్తిగా నన్ను ఊబి నుంచి బయటికి లాగింది.
ఆనాడు ఆ ఆపద సమయంలో నక్కే గనక నన్ను ఆదుకోకపోతే నేనూ వుండను, మన పిల్లలూ ఉండరు! ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళ దగ్గిర ఉచ్చనీచలు పాటించడం మహాపచారం. అటువంటి వాళ్ళను అవమానించటం రక్తసంబంధం గల బంధువులను అవమానించటం లాటిదే!'' అన్నది సింహం. సింహం భార్య సిగ్గుపడి నక్క భార్యకు క్షమాపణ చెప్పుకున్నది. తరవాత ఏడు తరాల దాకా సింహం సంతతీ, నక్క సంతతీ అదే గుహలో ఎంతో సఖ్యంగా కలిసి సుఖంగా జీవించాయి.

పాపిష్ఠిజన్మ


బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు సుతనుడనే పేరు గల పేద గృహస్థుగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు. కొంత కాలానికి సుతనుడి తండ్రి చనిపోయూడు. తల్లి మాత్రం మిగిలింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు రోజల్లా శ్రమపడినా తనకూ, తన తల్లికీ చాలినంత సంపాదించలేక సుతనుడు చాలా ఇబ్బందిపడుతూ ఉండేవాడు.
ఆ దేశపు రాజుగారికి వేటయందు చాలా ప్రీతి. ఆయన తరుచూ అడవికి వెళ్ళి అక్కడ అడవిజంతువులను వేటాడుతూ ఉండే వాడు. ఒకనాడు రాజుగారు ఒక లేడిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి, ఎలాగైతేనేం దాన్ని బాణంతో కొట్టాడు. లేడి బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది. సమీపంలో రాజుగారి భటులెవరూ లేరు. అందుచేత రాజే ఆ లేడిని భుజాన వేసుకుని తిరిగి రాసాగాడు.
మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్నది. వేట మూలంగానూ, లేడిని మోసుకు వస్తూవుండటం వల్లనూ రాజు చాలా అలసిపోయూడు. అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రి చెట్టు నీడ చల్లగా కనిపించింది. రాజు లేడిని నీడలో పడేసి, విశ్రాంతి తీసుకోవటానికి తాను కూడా అక్కడే కూర్చున్నాడు. మరుక్షణమే రాజు ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై, ‘‘నిన్ను తినేస్తాను!'' అంటూ మీదికి రాసాగింది. ‘‘ఎవరు నువ్వు? నన్ను తినటానికి నీకేమి అధికారం ఉన్నది?'' అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు.

‘‘ఈ చెట్టు నాది. దీని నీడలోకి ఎవరైతే వస్తారో, ఈ చెట్టుకింద ఉండే నేల మీద ఎవరైతే కాలు పెడతారో వారి నెల్లా తినటానికి నాకు హక్కున్నది. నేను బ్రహ్మరాక్షసిని,'' అన్నదా భూతం. రాజు దీర్ఘంగా ఆలోచించాడు. చివర కాయన బ్రహ్మరాక్షసితో, ‘‘నువ్వు ఈనాడు మాత్రమే తిండితింటావా? లేక రోజూ నీకు ఆహారం కావాలా?'' అని అడిగాడు. ‘‘నాకు రోజూ ఆహారం కావాలి,'' అన్నది బ్రహ్మరాక్షసి.
‘‘అయితే, ఈ పూట నన్ను తినటం వల్ల నీ ఆహార సమస్య తీరదు. ఈ పూటకు ఈ లేడిని తిని నన్ను వదిలేశావంటే, నీకు ఏ రోజూ కూడా ఆహారసమస్య లేకుండా చేస్తాను. నేను ఈ దేశానికి రాజును. అందుచేత నీకు రోజూ అన్నంతోపాటు, ఒక మనిషిని పంపగలను,'' అన్నాడు రాజు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది.
‘‘అలా అయితే నిన్ను విడిచిపెడతాను. కాని ఏ రోజు నాకు వేళకు ఆహారం రాకపోయినా, నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను!'' అన్నది బ్రహ్మరాక్షసి. రాజుగారు లేడిని బ్రహ్మరాక్షసికి ఇచ్చేసి, తన రాజధానికి తిరిగి వచ్చి, తన మంత్రితో జరిగినదంతా చెప్పాడు. ‘‘మహారాజా, మీరేమీ విచారించకండి. మన కారాగారంలో చాలామంది నేరస్థులున్నారు. వారిని రోజుకొకరు చొప్పున బ్రహ్మ రాక్షసికి ఆహారంగా పంపుతాను!'' అన్నాడు మంత్రి. 

అది మొదలు మంత్రిగారు రోజుకొక ఖైదీని అడవిలో ఉన్న మర్రిచెట్టు వద్దకు అన్నంతోసహా పంపటమూ, బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటమూ జరుగుతూ వచ్చింది. కొంత కాలానికి ఖైదీలందరూ అయిపోయూరు! ఏమి చెయ్యూలో మంత్రిగారికి పాలుపోలేదు. ఆయన రాజ్యమంతటా చాటింపు వేయించాడు:
‘‘ఎవరైతే అన్నం తీసుకుని అడవిలో ఉండే దయ్యూలమర్రి వద్దకు పోతారో వారికి రాజుగారు వెయ్యి వరహాలు బహుమానం ఇస్తారు!'' ఈ చాటింపు విని సుతనుడు, ‘‘ఏమి ఆశ్చర్యం! నేను ఎంత కష్టపడి పనిచేసినా రాగిడబ్బులు తప్ప కళ్ళబడవే, బ్రహ్మరాక్షసికి ఆహారమైతే ఇంత డబ్బిస్తారా?'' అని ఆశ్చర్య పోయూడు.
అతను తన తల్లితో, ‘‘అమ్మా, నేను వెయ్యి వరహాలు తీసుకుని దయ్యూల మర్రి వద్దకు అన్నం పట్టుకుపోతాను. ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగి పోతుంది!'' అని చెప్పాడు. ‘‘నా కిప్పుడేం తక్కువయిందిరా? నేను సుఖంగానే వున్నాను. నువ్వు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదులే!'' అన్నది సుతనుడి తల్లి కన్నీళ్ళతో. ‘‘నాకేదో ఆపద కలుగుతుందని భయపడకు. నాకే అపాయమూ రాదు! నేను క్షేమంగా తిరిగి వస్తే సరిగదా!'' అని సుతనుడు తల్లిని ఒప్పించి రాజువద్దకు వెళ్ళాడు.
‘‘మహారాజా, మీ పాదరక్షలూ, గొడుగూ, కత్తీ, ఒక బంగారు పాత్ర ఇప్పించినట్టయితే, నేను దయ్యూలమర్రి వద్దకు ఆహారం తీసుకు పోతాను,'' అని సుతనుడు రాజుగారితో అన్నాడు. ‘‘అడవికి అన్నం పట్టుకుపోవటానికి ఇవన్నీ ఎందుకు?'' అని రాజుగారు అడిగాడు. ‘‘బ్రహ్మరాక్షసిని ఓడించటానికి!'' అన్నాడు సుతనుడు. తరవాత సుతనుడు కత్తి ధరించి, పాదరక్షలు తొడుగుకుని, గొడుగు వేసుకుని, బంగారు పాత్రలో అన్నం తీసుకుని మధ్యాహ్నానికి దయ్యూల మర్రి దగ్గిరికి వెళ్ళాడు.

 అతను చెట్టునీడ లోపలికి రాకుండా, ఎడంగా గొడుగు నీడలో నిలబడ్డాడు. అతనికోసం ఎదురు చూస్తున్న బ్రహ్మరాక్షసి, ‘‘ఎండలోపడి చాలా దూరం వచ్చావు. నీడలోకి వచ్చి, విశ్రాంతి తీసుకో!'' అన్నది. ‘‘లేదు! నేను వెంటనే తిరిగి వెళ్ళాలి! ఇదుగో, నీకు ఆహారం తెచ్చాను. తీసుకో!'' అంటూ సుతనుడు బంగారు పాత్రను ఎండపడే చోట నేల మీద పెట్టి, తన వెంట తెచ్చిన కత్తితో పాత్రను చెట్టు నీడలోకి తోశాడు. సుతనుడి యుక్తి చూసి బ్రహ్మరాక్షసి, ‘‘నేను ఆహారాన్నీ, ఆహారం తెచ్చినవాణ్ణీ కూడా తింటాను!'' అని కోపంతో హుంకరించింది.
‘‘నువ్వు నన్ను మాత్రం తినలేవు. నేను నీ చెట్టు నీడలోకి రాలేదు. నన్ను తినటానికి నీకేమి అధికారం ఉన్నది?'' అని అడిగాడు సుతనుడు. ‘‘పచ్చిమోసం! నాకు నీతో ఏం పని? నేను వెళ్ళి ఆ రాజునే తినేస్తాను!'' అని బ్రహ్మరాక్షసి చిందులు తొక్కింది. ‘‘నువ్వు ఏ జన్మలోనో మహాపాపం చేసి ఇలాటి పాపిష్ఠిజన్మ ఎత్తావో తెలియదు.
భూతానివై ఈ మర్రిచెట్టును ఆశ్రయించావు! ఇంత నీచపు బ్రతుకు బ్రతుకుతూ ఉన్నప్పటికీ నీకింకా బుద్ధి రాలేదా? ఇకనైనా బుద్ధి కలిగి జీవించు!'' అని సుతనుడు బ్రహ్మరాక్షసిని మందలించాడు. బ్రహ్మరాక్షసి విచారంగా, ‘‘నన్నేం చెయ్యమంటావు? ఇంతకంటే బాగా బ్రతికే మార్గం నాకెలా దొరుకుతుంది?'' అని అడిగింది. ‘‘నా వెంట వచ్చి మా నగరద్వారం వద్ద నివసించు. అక్కడికి రోజూ నీకు శుచి అయిన ఆహారం పంపే ఏర్పాటు చేస్తాను.
మనుషులను పీక్కుతినే దురలవాటు మానుకో. రాక్షసి జన్మ నుంచి విముక్తి పొందుతావు,'' అన్నాడు సుతనుడు. బ్రహ్మరాక్షసి అందుకు సంతోషంగా అంగీకరించింది. సుతనుడు ప్రాణాలతో తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపోయూడు. సుతనుడు జరిగిన వృత్తాంతమంతా రాజుతో చెప్పాడు. రాజు పరమానందం చెంది, సుతనుణ్ణి తన సలహాదారుగా నియమించి, అతడి సలహాలు తీసుకుంటూ చక్కగా రాజ్యపాలన చేశాడు.

కుబేరుడి కొలను


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఆ…ునకు కుమారు డుగా జన్మించాడు. రాజు అతడికి మహాశాస నుడు అని పేరు పెట్టాడు. కొద్దికాలం తరవాత రాణి మరొక కొడుకును కన్నది. ఆ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టారు. కొడుకులిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్స రాలకు రాణి కాలగతి చెందింది. రాజు మరొక వివాహం చేసుకున్నాడు.
కొంత కాలా నికి రాణి ఒక కుమారుణ్ణి కన్నది. ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో, ‘‘ఈ శుభ సమ…ుంలో ఏదైనా వరంకోరు, ఇస్తాను,'' అన్నాడు. ‘‘ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుం టాను,'' అన్నది రాణి. ఈ చిన్నరాణి కొడుకు పేరు ఆదిత్యుడు. అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ …వనవంతుడ…్యూడు. రాణి ఒకనాడు రాజుతో, ‘‘ఆనాడు తమరిస్తా మన్న వరం ఇప్పుడు కోరుతున్నాను. ఆదిత్యుణ్ణి …ుువరాజుగా అభిషేకించండి,'' అన్నది.
ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడై పోయి, ‘‘నా మొదటి భార్య కుమారులిద్ద రుండగా, ఆదిత్యుడికి …ుువరాజు పదవి ఎలా ఇవ్వగలను? నీ కోర్కె న్యా…ుసమ్మతం కాదు,'' అన్నాడు. ఈ విధంగా రాజు తన కోర్కెను నిరాకరించినా, రాణి వూరుకోక, వీలయినప్పుడల్లా తన కొడుకును …ుువ రాజును చె…్యుమని పీడించసాగింది. పెద్ద కుమారులిద్దరికీ ఆమెవల్ల ఏదైనా హాని జరగ వచ్చన్న శంక కూడా రాజుకు కలిగింది.
రాజు ఒకనాడు పెద్దకొడుకులిద్దరినీ పిలిచి, సంగతి సందర్భాలన్నీ చెప్పి, ‘‘మీరు నగరం విడిచిపోయి, కొంతకాలం పాటు మరెక్కడైనా వుండండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది గనక, అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలనా భారం వహించవచ్చు,'' అని సలహా ఇచ్చాడు.

తండ్రి కోరికప్రకారం మహాశాసనుడూ, సోమదత్తుడూ నగరం వదిలి, దాని పొలి మేరలను చేరేంతలో, చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావడం కంట బడింది. పెద్ద వాళ్ళిద్దరూ ఎంతచెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు. ముగ్గురూ కలిసి కొన్నాళ్ళకు హిమాల…ు ప్రాంతంలోని అరణ్యాలను చేరుకున్నారు. ఒకనాడు ముగ్గురూ ప్ర…ూణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టుకింద కూర్చు న్నారు.
మహాశాసనుడు, చిన్నవాడైన ఆదిత్యు డితో, ‘‘తమ్ముడూ, ఆ కనబడే చెట్ల సమీపాన కొలను కనిపిస్తున్నది. అక్కడికి పోయి నీ దాహం తీర్చుకుని, మా కోసం తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా,'' అని చెప్పాడు. ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగ గానే, అక్కడ వుండే జలపిశాచి అతణ్ణి పట్టు కుని, నీటి దిగువనున్న తన ఇంటికి తీసుకు పోయింది. ఎంతకూ ఆదిత్యుడు రాకపోేుసరికి మహాశాసనుడు, సోమదత్తుణ్ణి పంపాడు. అతణ్ణీ జలపిశాచి పట్టుకున్నది.
కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ముల కేదో ప్రమాదం జరిగి వుంటుందనుకుని, కత్తి చేతబట్టి కొలను దగ్గిరకు వెళ్లాడు. అతడు కొలనులో దిగకుండా గట్టుమీదే నిలబడి, నీటికేసి పరీక్షగా చూస్తూండటం గమనించిన జలపిశాచి, అతడు తమ్ములలాగా తొందర పడి కొలనులో దిగడని గుర్తించింది. జలపిశాచి ఒక బో…ువాడి రూపంలో మహాశాసనుడి దగ్గిరకు వచ్చి, ‘‘అలా చూస్తూ నిలబడ్డావేం? దాహంగా వుంటే కొలనులో దిగి దాహం తీర్చుకోరాదా,'' అన్నది.
మహాశాసనుడు, ఆ సలహా వింటూనే, ఇందులో ఏదో మోసంవున్నదని గ్రహించి, ‘‘నీ వాలకం చూస్తూంటే, నా తమ్ములిద్దరినీ నువ్వు కనబడకుండా చేశావన్న అనుమానం కలుగుతున్నది. నిజం చెప్పు,'' అన్నాడు. ‘‘నువ్వు కొంచెం వివేకివిలా వున్నావు.
నిజం చెబుతాను. ఒక్క జ్ఞానసంపన్నులను మాత్రం వదిలి, కొలను దగ్గిరకు వచ్చే మిగతా వాళ్ళనందర్నీ పట్టి బంధిస్తాను. అలా చే…ు మని కుబేరుడి ఆజ్ఞ,'' అన్నది జలపిశాచి. ‘‘అంటే, నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్న మాట! నేను, నీకు జ్ఞానబోధ చె…్యుగలను. కాని చాలా మార్గా…ూసంలో వున్నాను,'' అన్నాడు మహా శాసనుడు.

వెంటనే జలపిశాచం అతణ్ణి నీటి అడు గున వున్న తన ఇంటికి తీసుకుపోయి, అతిథి మర్యాదలు చేసి, ఉచితాసనంమీద కూర్చో బెట్టి, తాను అతడి పాదాల దగ్గిర కూర్చున్నది. మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నదీ, స్వానుభవం ద్వారా తెలుసుకున్నదీ అయిన పరమజ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు. వెంటనే జలపిశాచం బో…ువాడి రూపం విడిచి, తన నిజరూపంతో, ‘‘మహాత్మా, నువ్వు మహాజ్ఞానివి.
నీ తమ్ములలో ఒకరిని నీకు ఇవ్వదలిచాను. ఇద్దరిలో ఎవరుకావాలో కోరుకో,'' అన్నది. ‘‘అయితే, ఆదిత్యుణ్ణి ఇవ్వు,'' అన్నాడు మహాశాసనుడు. ‘‘పెద్దవాణ్ణి వదిలి, చిన్నవాణ్ణి కోరడం ధర్మం అవుతుందా?'' అన్నది జలపిశాచి. ‘‘ఇందులో ధర్మం కానిదేం లేదు. నా తల్లికి నేను మిగిలివుండగా, నా పినతల్లికి తన కొడుకైన ఆదిత్యుడు ఉండాలి కదా? ఆదిత్యుడి కోసమే, ఆమె నా తండ్రిని రాజ్యం కోరింది.
మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బ…ులుదేరాం. సోదరప్రేమ చేత ఆదిత్యుడు మా వెంట వచ్చాడు. పెద్దవాళ్ళమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడెక్కడ? అని ప్రజలు అడిగితే, అతణ్ణి జలపిశాచి మింగి వేసిందని చెప్పడం, ఏరకం న్యా…ుం అవుతుంది?'' అని మహాశాసనుడు, జల పిశా చిని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు జలపిశాచి, మహాశాసనుడి కాళ్ళకు నమస్కరించి, ‘‘నీ అంత గొప్ప జ్ఞానసముద్రుణ్ణి నేనింతవరకూ చూడలేదు.
నీ తమ్ములిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను. ఈ అరణ్యంలో వున్నంత కాలం నాకు అతిథు లుగా వుండండి,'' అన్నది. మహాశాసనుడూ, తమ్ములూ జలపిశాచికి అతిథులుగా వుండిపో…ూరు. కొంత కాలా నికి వాళ్ళ తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయి నట్టు తెలిసి, మహాశాసనుడు తమ్ములతో, జలపిశాచితో కాశీరాజ్యానికి వెళ్ళాడు.
మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగానూ, ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను ని…ుమించాడు. తనకు మేలుచేసిన జలపిశాచికి విడిది ఏర్పాటు చేసి, దాని అవసరాలు గమనిస్తూం డేందుకు నౌకర్లను ని…ుమించాడు.

మహాసాధ్వి


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు నగరానికి సమీపాన వున్న ఒక గ్రామంలో, ఒక సంపన్న గృహస్థుడి కుమారుడుగా జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలూ నేర్చాడు. …ుుక్తవ…ుస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్ళి సంబంధం చూశారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాక సుగుణ వతి, వివేకవతి.
అటు భర్తకూ, ఇటు అత్త మామలకూ కూడా పరిచర్యలు చేస్తూ, తలలో నాలుకగా మసలుకునేది. బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఆ ఇద్దరిదీ ఒక్క మాట, ఒక్క మనస్సు అయి, చూడ ముచ్చటగా వుండేవారు. అందరూ వారిని గురించి గొప్పగా చెప్పుకునేవారు. కొంత కాలం గడిచిన తరవాత ఒకనాడు, సుజాత తన భర్తతో, ‘‘నాకు మా అమ్మనూ, నాన్ననూ చూసి రావాలని వున్నది.
వాళ్లు వృద్ధు లైపో…ూరు. మీరు తోడు వస్తే, ఇద్దరం కలిసి వెళ్లి చూసి వద్దాం,'' అన్నది. ఇందుకు బోధిసత్వుడు చాలా సంతో షించి, ‘‘అలాగే తప్పకుండా వెళదాం. నాకూ అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోర్కెవున్నది. ఇటీవల కొన్నాళ్ళుగా ఇంటిదగ్గిర తొందర పనుల కారణంగా వూరుకున్నాను. లేకపోతే నేనే ముందు బ…ులుదేరదామని చెప్పేవాణ్ణి,'' అన్నాడు.
మరుసటి రోజున ప్ర…ూణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అవసరమైన వస్తు వులన్నీ బండిలో సర్దుకుని బ…ులుదేరారు. సుజాత బండిలో కూర్చున్నది. బోధిసత్వుడు తొటె్టలో కూర్చుని బండి తోలుతున్నాడు. అలా కొంతసేపు ప్ర…ూణంచేసి వాళ్ళు, కాశీనగరం పొలిమేరలు చేరాక, ఒక చెట్టు కింద బండి విప్పి, అక్కడ వున్న కొలనులో కాళ్ళూ, చేతులూ కడుక్కుని, వెంట తెచ్చుకున్న ఆహారం భుజిం చారు. కొంచెంసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్న తరవాత మళ్ళీ సంతోషంగా బండి పూన్చి, నగరంలోకి బ…ులుదేరారు.

సరిగ్గా బోధిసత్వుడి బండి నగరం ప్రవే శించే సమ…ూన, కాశీరాజు ఏనుగు అంబారీ ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూడ వేడుక కలిగి, సుజాత భర్త అనుమతితో బండిదిగి, కాలినడకన ముందు నడవ సాగింది. బోధిసత్వుడు బండిలో వెనకగా వస్తున్నాడు. అంబారీ పైన వున్న కాశీరాజు, అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు.
ఆమెను పెళ్ళాడాలన్న బుద్ధి పుట్టింది రాజుకు. ఆమెను గురించి భోగట్టా చే…ుగా, ఆమె ఫలానావారి అమ్మాయి అనీ, బండిలో కూర్చున్న వ్యక్తే ఆమె భర్త అనీ తెలి…ు వచ్చింది. రాజు ఒక దురాలోచన చేశాడు. సుజాత భర్తను ఏదోవిధంగా తుదముట్టించి, తరవాత ఆమెను తన రాణిగా చేసుకుందామను కున్నాడు. ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు.
తనకు విశ్వాసపాత్రుడైన ఒక భటుణ్ణి పిలిచి, రాజు అతడికి తన కిరీటం ఇచ్చి, ‘‘ఈ కిరీటాన్ని ఎవరూ చూడకుండా, ఆ కనపడే బండిలో పడవేసిరా,'' అని చెప్పాడు. భటుడు, రాజు చెప్పిన విధంగానే మరో కంటికి తెలి…ుకుండా కిరీటాన్ని బండిలో వేసి, ఆ సంగతి రాజుకు చెప్పాడు. ఒక పావు గంట కాలం గడిచేలోపలే, జనంలో, ‘‘రాజు గారి కిరీటాన్ని ఎవరో అపహరించారు!''
అన్న గగ్గోలు ప్రారంభమైంది. రాజు, తన భటులకు కిరీటం దొంగి లించినవాణ్ణి వెంటనే వెతికి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక భటుడికి బోధిసత్వుడి బండిలో వున్న కిరీటం కనిపించింది. వాడు బోధిసత్వుణ్ణి దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు. రాజు ఉగ్రుడైపోయి, ‘‘వీడా, నా కిరీటాన్ని అపహరించినవాడు!
ఈ దుర్మార్గుణ్ణి తీసుకు పోయి శిరశ్ఛేదం చె…్యుండి,'' అని ఆజ్ఞా పించాడు. ఈ విధంగా తన వ్యూహం జ…ుప్రద మైందని రాజు సంతోషిస్తుండగా, భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొడుతూ, వీధు లన్నీ తిప్పి అవమానించారు. తరవాత, తల నరికేందుకు నగరం వెలుపలవున్న బలిపీఠం దగ్గిరకు తీసుకుపో…ూరు.

ఈ సంగతి తెలిసి సుజాత దుఃఖిస్తూ, భర్త వెనకగా బ…ులుదేరింది. ‘‘మీకు, ఈ కీడు తెచ్చిపెట్టినది, నేనే!'' అని విలపిస్తూ, ఆమె బలిపీఠం దగ్గిరకు చేరి, ఆవేదనతో, ‘‘అమా…ు కులను రక్షంచగల, దేవుడే లేడా? దుష్టుల దుండగాలు, ఇలా సాగవలసిందేనా?'' అని ఆక్రోశించ సాగింది. మహాసాధ్వి అయిన సుజాత ఇలా విలపించే సరికల్లా, స్వర్గ లోకంలో ఇంద్రుడి సింహాసనం వణకసాగింది.
‘‘కారణం ఏమిటి?'' అనుకుంటూ ఇంద్రుడు దివ్యదృష్టితో చూశాడు. జరగనున్న ఘోరం ఆ…ునకు తెలిసింది. ఇంద్రుడు ఒక విచిత్రపరిస్థితి కల్పిం చాడు. రాజు స్థానంలో బోధిసత్వుడూ; బోధి సత్వుడు వున్న చోట రాజూ వుండేటట్టు, తన మహిమవల్ల ఇద్దరి స్థానాలూ మార్చివేశాడు. ఏనుగు అంబారీలో వున్నవాడు రాజే అను కున్నారు, ప్రజలు.
కాని, అక్కడ వున్నది రాజ లాంఛనాలన్నీ ధరించి వున్న బోధిసత్వుడు. అలాగే తలారుల వశంలో బలిపీఠం మీద వున్న బోధిసత్వుడు, అతడి దుస్తులు ధరించి వున్న రాజు! ఈ రహస్యం ఎరగని తలారులు, తమ అధీనంలో వున్న మనిషిని, రాజాజ్ఞ ప్రకారం తల నరికారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు, అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంప బడినవాడు రాజు అని ప్రజలకందరికీ తెలిసిపోయింది.
వెంటనే గొప్ప కలకలం రేగింది. ఈ విచిత్ర సంఘట నకు కారకులెవరా అని వాళ్ళు ఆశ్చర్యపడ సాగారు. అప్పుడు ఇంద్రుడు బోధిసత్వుడికీ, ప్రజ లకూ కనిపించి, జరిగినదంతా చెప్పి, ‘‘ఈనాటి నుంచీ బోధిసత్వుడే మీ రాజు, సుజాత పట్టపురాణి!'' అని అంతర్థానమ…్యూడు. పాపం పండి, దుర్మార్గుడైన రాజు బలి పీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యం లోని ప్రజలందరూ సంతోషించారు.
ఇంద్రుడు చెప్పినదాని ప్రకారం బోధిసత్వుణ్ణి రాజు గానూ, సుజాతను రాణిగానూ సంతోషంగా అంగీకరించారు. ఆనాటి నుంచీ కాశీరాజ్యంలో ధర్మం నాలు గుపాదాల నడిచింది. నెలకు మూడు వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా వుంటూ వచ్చింది.

విలువ తెలియనివాడు


పూర్వం ఒకప్పుడు మగధరాజు విరూప సేనుడి కాలంలో, బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం తాల్చాడు. ఆ ఏనుగు తెల్లని శరీరచ్ఛా …ుతో ఐరావతాన్ని పోలి వున్నది. అందుచేత మగధరాజు ఆ ఏనుగును తన పట్టపుటేను గుగా చేసుకున్నాడు. ఒక పర్వదినం నాడు మగధరాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరపటానికి ఏర్పాట్లు చేశారు.
పట్టపుటేను గును చక్కగా అలంకరించారు. సైనికులు ముందూ, వెనకా నడుస్తూండగా రాజు ఆసీ నుడైవున్న ఏనుగు అంబారీ ఊరేగింపు బ…ులుదేరింది. దారి పొడుగునా జనం ఉత్సాహంతో, ‘‘ఆహా, ఏమి ఈ గజరాజు గమనం! దీని అందచందాలు చూస్తూంటే, ఏ సార్వభౌము డికో వాహనంగా వుండ తగిందిలా కనబడుతు న్నది!'' అంటూ ఏనుగును మెచ్చుకోసాగారు. ఈ పొగడ్తలకు రాజు కోపం తెచ్చుకుని, మనసులో, ‘‘జనం, రాజైన నాకు చూప వలసిన గౌరవం, ఈ ఏనుక్కు చూపుతున్నా రన్నమాట!
ఒక్కడూ అంబారీలో వున్న నాకేసి కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఏదోవిధంగా పరలోక…ూత్ర కట్టించాలి,'' అనుకున్నాడు. రాజు మరసటి రోజున మావటివాణ్ణి పిలి పించి, ‘‘ఒరే, పట్టపుటేనుగు మంచి శిక్షణ గలదేనా?'' అని అడిగాడు. ‘‘దానికి శిక్షణ ఇచ్చి, అంబారీ ఏనుగుగా త…ూరు చేసింది నేనే, ప్రభూ!'' అన్నాడు మావటివాడు.
‘‘ఏమో, నీ మాటల్లో నాకు నమ్మకం కల గడం లేదు. ఒట్టి పొగరుబోతు ఏనుగని, నా అనుమానం,'' అన్నాడు రాజు. ‘‘అలాంటిదేం లేదు, ప్రభూ!'' అన్నాడు మావటివాడు. ‘‘సరే, నువ్వు చెపుతున్నట్టు, అంత గొప్ప శిక్షణలో పెరిగిన ఏనుగైతే, నువ్వు దాన్ని ఆ కనబడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా?'' అని అడిగాడు రాజు.

‘‘ఎక్కించగలను, మహాప్రభూ!'' అని మావటివాడు, పట్టపుటేనుగును క్షణాల మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు. రాజు కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని, ఏనుగు వెనగ్గా కొండ ఎక్కాడు. శిఖరం ఒక చోట బల్లపరుపుగా కొంతదూరం పోయి, కోసుగా కొనతేరి వున్నది. రాజు ఏనుగును అక్కడ ఆపమని మావ టికి చెప్పాడు. ‘‘నువ్వు, దానికిచ్చిన శిక్షణ ఏపాటిదో చూస్తాను.
ఏనుగును మూడుకాళ్ళపైన నిల బెట్టగలవా?'' అన్నాడు రాజు. వెంటనే మావటివాడు ఏనుగు తలను అంకుశంతో తాకి సైగచేసి, ‘‘బాబా! ప్రభు వులవారి ఆజ్ఞ అయింది. మూడు కాళ్ళ మీద నిలబడు!'' అన్నాడు. ఏనుగు అలాగే చేసింది. రాజు, ‘‘ఆహా, బావుంది!'' అని, ‘‘ఈసారి ముందరి రెండు కాళ్ళ మీదా నిలబడగల దేమో చూడు,'' అన్నాడు. మావటివాడు సైగ చే…ుగానే ఏనుగు ముందు కాళ్ళ మీద నిలబడింది.
‘‘ఇదీ, బాగానే వున్నది. ఇప్పుడు వెనక కాళ్ళ మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించి చూడు,'' అన్నాడు రాజు, ఏనుగు కేసి కోపంగా చూస్తూ. వెంటనే ఏనుగు వెనకకాళ్ళ మీద నిబ డింది. ‘‘ఒంటికాలిమీద నిలుచోగలదా?'' అన్నాడు రాజు. ఏనుగు సునా…ూసంగా ఒంటికాలి మీద నిలబడింది.
ఇన్ని తిప్పలు పెట్టినా ఏనుగు పర్వతశిఖరం మీది నుంచి కిందికి పడక పోేుసరికి, రాజు మనసులో కుళ్ళిపోతూ, మావటితో, ‘‘ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణగల ఏనుగైనా చె…్యుగలదు. ఇంకొక్క పరీక్ష పెట్టదలిచాను,'' అన్నాడు. ‘‘అలాగే, ఆ పరీక్ష ఏమిటి, ప్రభూ?'' అని అడిగాడు మావటి. ‘‘ఏనుగు కాళ్ళ ఆధారంతో కొండ మీద నడిచినటే్ట, గాలిలో కూడా నడిచేలా చెయ్యి, ఇది, నా ఆజ్ఞ!'' అన్నాడు రాజు.
ఆసరికి రాజు దురుద్దేశం మావటివాడికి అర్థమైంది. కాని, అతడు ఏమాత్రం బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా అన్నాడు: ‘‘బాబా! నువ్వు, ఈ కొండ శిఖరం నుంచి కింద పడి మరణించాలని రాజు పథకం వేశాడు. అతడు నీ విలువ తెలి…ుని వాడు.


నీకు నిజంగా శక్తే వున్నట్టయితే, ఈ శిఖరం కొస నుంచి ముందుకుపోయి, గాలిలో నడువు,'' అన్నాడు. గొప్ప మహిమా, అద్భుతశక్తులూ గల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి, అలా గాలిలో తేలి…ూడుతూ వెళ్ళసాగింది. అప్పుడు మావటివాడు రాజుతో, ‘‘ఓ, రాజా! ఈ ఏనుగు సామన్యమైంది కాదు, మహత్తర మైన దైవాంశగలది. విలువ తెలి…ుని, నీ వంటి వాడికి పట్టపుటేనుగుగా వుండదగింది కాదు.
మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, అమూల్యమైన మరి దేనినైనా పోగొట్టు కుంటారు. మూర్ఖుడు తన అవివేకాన్ని, తనకుతానై పదిమంది ఎదటా చాటుకుం టాడు,'' అన్నాడు. ఏనుగు గాలిలో నడుస్తూపోయి, కాశీ రాజ్యం చేరి, అక్కడి రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలిచింది. ఇది చూసిన నగర పౌరులు కోలాహలంగా అక్కడికి చేరారు.
ఈ వార్త రాజుగారికి చేరింది. కాశీ రాజు ఉద్యానవనానికి వచ్చి, ఏనుగు కేసి చేతులు జోడించి, ‘‘గజరాజా! నీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది. కిందికి దిగిరా ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు. రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో వున్న బోధిసత్వుడు పైనుంచి, ఉద్యానంలోకి దిగాడు. రాజు ప్రశ్నించిన మీదట మావటివాడు జరిగినదంతా చెప్పాడు. అది విన్న కాశీ రాజుకూ, అక్కడ చేరిన ప్రజలకూ చాలా ఆనందం కలిగింది.
రాజు, ఏనుగును చక్కగా అలంకరింప చేసి, ఒక దివ్యసుందరమైన ప్రత్యేక శాలలో దానికి నివాసం ఏర్పరిచాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగం ఏనుగు రూపంలో వున్న బోధిసత్వుడి పోషణ కోసం, రెండవభాగం మావటికీ ఇచ్చి వేసి, మిగిలిన దాన్ని తన సొంతానికి వుంచుకు న్నాడు. బోధిసత్వుడు కాశీరాజ్యం చేరినది మొద లుగా కాశీరాజు ఐశ్వర్యమూ, సంపదా దిన దినాభివృద్ధి కాజొచ్చింది. ఆ…ున పేరు ప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించినై.

అపాత్రదానం

మగధరాజ్యం ఉచ్చస్థితిలో వున్న కాలంలో బోధిసత్వుడు ఒకప్పుడు ఆ రాజు వద్ద కోశాధి కారిగా వుండేవాడు. ఆ…ునకు ఎనభైకోట్ల వరహాల సొంత ఆస్తివుండేది. కాశీరాజ్యంలో శ్రీవత్స అనే మరొక ధన వంతుడుండేవాడు. ఆ…ునా ఎనభైకోట్ల వర హాలకు పైబడిన ఆస్తిపరుడు. కోటీశ్వరులైన బోధిసత్వుడూ, శ్రీవత్సా ప్రాణమిత్రులు.
కాలం కలిసిరాక, వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడంతో శ్రీవత్స పేదవాడై పో…ూడు. ఆ పరిస్థితుల్లో అతడికి తన మిత్రుడైన బోధి సత్వుడు గుర్తుకు వచ్చాడు. శ్రీవత్స తన భార్యతో కాలినడకన బ…ులు దేరి మగధ రాజ్యం చేరి, బోధిసత్వుణ్ణి చూడ బో…ూడు. బోధిసత్వుడు ఆ…ునకు ఎదురు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడి గాడు.
శ్రీవత్స పెద్దగా నిట్టూరుస్తూ, ‘‘బోధి సత్వా! నా దశ మారి పోయింది. బికారినై పో…ూను. ఇటువంటి స్థితిలో నాకు సహా…ు పడగలవాడివి నీవు ఒక్కడివే అని నమ్మి, ఇలా వచ్చాను,'' అన్నాడు. ‘‘శ్రీవత్సా, విచారించకు. కష్టసమ…ుంలో రావలసిన చోటుకే వచ్చావు,'' అని బోధి సత్వుడు తన దగ్గిర వున్న ధనంలో సగం- నలభైకోట్ల వరహాలు మిత్రుడికివ్వడమే కాక, దానితో పాటు తన పరివారంలోని సగం మందిని అతడి పరం చేశాడు.
కొంతకాలం గడిచింది. రాజ్యంలో చెలరేగిన అరాజకం, అల్లరుల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతోపాటు ధనాన్ని కూడా పోగొట్టుకుని, దారిద్య్రబాధకు గుర…్యూడు. ఆ…ునకు ఈ స్థితిలో తనకు సా…ుపడగల వాడు మిత్రు డైన శ్రీవత్స తప్ప మరెవరూ లేరన్న నమ్మకం కలిగింది. వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి, ఆమెతో సహా కాశీరాజ్యానికి బ…ులుదేరాడు. ఆ…ున నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసు కుంటూ వుండమని చెప్పి, ‘‘నువ్వేమీ ఆదుర్దా పడకు.

ప్రాణమిత్రుడైన శ్రీవత్సకు సంగతి చెప్పి, నీ కోసం బండినీ, పరిచారకులనూ పంపుతాను,'' అని నగరంలోకి వెళ్ళాడు. బోధిసత్వుడు, శ్రీవత్స వుండే భవన ద్వారం కాపలావాడితో తాను ఎవరైనదీ చెప్పి, ఆ సంగతి …ుజమానికి చెప్పమన్నాడు. కాపలావాడు లోపలికి పోయి తిరిగి వచ్చి, బోధిసత్వుణ్ణి తన …ుజమాని రమ్మనమని చెప్పినట్టు తెలి…ుపరిచాడు. శ్రీవత్స, బోధి సత్వుణ్ణి ఎగాదిగా చూసి, ‘‘ఏం పని మీద వచ్చావు?'' అని అడిగాడు.
‘‘మీ దర్శనం కోసం...'' అంటూ బోధి సత్వుడు తలదించుకున్నాడు. ‘‘బస ఎక్కడ చేశావు?'' అన్నాడు శ్రీవత్స. ‘‘ఇంకా బస కుదుర్చుకోలేదు. నా భార్యను పొలిమేర దగ్గిర వదిలి, ఇలా వచ్చాను,'' అన్నాడు బోధిసత్వుడు. ‘‘నా ఇంట బస దొరకదు! చారెడు గింజలు ఇస్తాం, పట్టుకుపోయి గంజి కాచుకు తాగు,'' అన్నాడు శ్రీవత్స కఠినంగా. ఆ మరుక్షణం ఒక సేవకుడు దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోశాడు. బోధిసత్వుడు తన భార్య వున్న చోటుకు వెళ్ళాడు.
‘‘మీప్రాణ స్నేహితుడు ఏమి చ్చాడు?'' అని భార్య అడిగింది. ‘‘మిత్రుడు శ్రీవత్స చారెడు గింజలతో మన పీడ వదుల్చుకున్నాడు,'' అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా. ‘‘అవెందుకు పుచ్చుకున్నారండీ? మనం అతడికిచ్చిన నలభైకోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా? ఇలాంటి కృతఘు్నడి ముఖం చూడటమే, పాపం!''
అన్నది భార్య కోపంగా. కళ్ళ నీళ్ళు పెట్టుకున్న భార్యను ఓదా ర్చుతూ బోధిసత్వుడు, ‘‘ఏది ఏమైనప్పటికీ, ఒకసారి మిత్రులైన వారిమధ్య విరోధభావం ఏర్పడకూడదు. అందుకోసమే, ఈ గింజలు పుచ్చుకున్నాను,'' అన్నాడు.

భార్యా, భర్తలు ఇలా మాట్లాడుకుంటూ వుండగానే సేవకుడొకడు ఆ దారినే వచ్చాడు. వాడు లోగడ బోధిసత్వుడు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలోనివాడు. వాడు తన పూర్వపు …ుజమానిని గుర్తించి, కాళ్ళ పైబడి, ‘‘అ…్యూ, ఇలా వచ్చారేం?'' అని అడిగాడు. బోధిసత్వుడు వాడికి జరిగినదంతా చెప్పాడు. సేవకుడు బోధిసత్వుణ్ణీ, ఆ…ున భార్యనూ తన ఇంటికి తీసుకుపోయి, భోజనం పెట్టి, ఉండేందుకు ఒక గది ఇచ్చాడు.
వాడు ఆ తరవాత ఈ సంగతి తనతోడి సేవకు లందరికీ చెప్పాడు. క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్ర ద్రోహం సంగతి కాశీరాజుకు తెలిసింది. ఆ…ున బోధిసత్వుణ్ణి పిలిపించి, ‘‘నీవు శ్రీవ త్సకు నలభైకోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా?'' అని అడిగాడు. బోధిసత్వుడు రాజుకు అంతా వివరిం చాడు. రాజు శ్రీవత్సకు కబురు చేసి, అతడికి బోధిసత్వుణ్ణి చూపుతూ, ‘‘ఈ…ున నుంచి నువ్వు లోగడ ధన సహా…ుం పొందిన మాట నిజమేనా?'' అని ప్రశ్నించాడు.
‘‘నిజమే, మహారాజా!'' అన్నాడు శ్రీవత్స బిక్కచచ్చిపోతూ. ‘‘అయితే, ఆ సహా…ూనికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు?'' అన్నాడు రాజు. శ్రీవత్స సిగ్గుతో, అవమానంతో తల వంచుకున్నాడు. రాజు, తన మంత్రులతో సంప్రతించి, శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడి పరం చేస్తున్నట్టు తీర్పు ఇచ్చాడు.
బోధిసత్వుడు రాజుతో, ‘‘మహారాజా, ఇతరుల సొత్తు నాకు పూచికపుల్ల కూడా వద్దు. నేను ఇచ్చినది నాకు తిరిగి ఇస్తే, అంతే చాలు!'' అన్నాడు. రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి నలభై కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి, బోధి సత్వుడితో, ‘‘అపాత్ర దానం కూడనిపని!'' అన్నాడు. ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్య వంతుడై, దానధర్మాలు చేస్తూ చాలాకాలం సుఖంగా జీవించాడు.

ప్రాణమిత్రుడు

పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మ ణుడికి కుమారుడుగా పుట్టాడు. అతడికి తల్లి దండ్రులు సత్యానందుడు అని పేరు పెట్టారు. మరికొంత కాలానికి బ్రాహ్మణుడికి మరొక కొడుకు కలిగాడు. ఇతడికి నిత్యా నందుడు అని పేరుపెట్టారు. ఈ అన్నదమ్ములిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవు తూండగా, తల్లిదండ్రులు హఠాత్తుగా కాల ధర్మం చెందారు.
దానితో జీవితం మీద విర క్తులై సత్యానందుడూ, నిత్యానందుడూ గంగా నదికి ఆవలి ఒడ్డున ఒకరూ, ఈవలి ఒడ్డున ఒకరూ కుటీరాలు నిర్మించుకుని సన్యాసి జీవితం గడపసాగారు. ఒక రోజున పాతాళలోకంలో వుండే సర్ప రాజు మణికాంతుడనేవాడు మనుష్యరూపం ధరించి, భూలోకానికి వచ్చి, గంగానది ఒడ్డునే నడిచిపోసాగాడు. అతడికి నిత్యానందుడి కుటీరం కంటబడింది.
మణికాంతుడు అంత చిన్నతనంలోనే సన్యాసి జీవితం గడుపు తున్న నిత్యానందుణ్ణి చూసి ఆశ్చర్యపడి, అతడికి తానెవరో చెప్పి, చాలా సేపు కబుర్లా డుతూ కాలంగడిపాడు. ఈ విధంగా నిత్యానందుడికీ, సర్పరాజు మణికాంతుడికీ స్నేహం కుదిరింది. ఆ నాటి నుంచీ మణికాంతుడు తరచుగా నిత్యా నందుడి కుటీరానికి వస్తూండేవాడు. వాళ్ళి ద్దరూ ఎన్నో ఆసక్తికరమైన లోక విషయూలను గురించి మాట్లాడుకునేవారు.
మణికాంతుడు అప్పుడప్పుడు తన యథారూపం ధరించి, నిత్యానందుడి తలపై పడగ విప్పి, చల్లని నీడపట్టి, తన లోకానికి వెళ్ళి పోతూండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక నిత్యానందు డికి ఒక శంక పట్టుకున్నది. సర్ప రాజు మణికాంతుడు తనకు మిత్రుడన్నదాంట్లో సందేహం లేదు. కాని, స్వతహాగా సర్పాలది దుష్టస్వభావం. ఏ కారణం చేతనైనా మణి కాంతుడికి తన మీద కోపం వస్తే, కాటు వేయగలడు! ఇలాంటి ఆలోచనలతో నిత్యా నందుడికి ఎక్కడలేని బెంగపట్టుకున్నది.

ఈ స్థితిలో ఒకనాడు అతడు నది దాటి అన్న సత్యానందుణ్ణి చూడబోయూడు. సత్యానం దుడు తమ్ముణ్ణి చూసి వ్యాకులపడుతూ, ‘‘తమ్ముడూ, ఇంతగా చిక్కిపోయూవేం? కారణం ఏమిటి?'' అని ప్రశ్నించాడు. ఇందుకు నిత్యానందుడు ఏమీ దాచ కుండా అన్నకు చెప్పివేశాడు. ‘‘తమ్ముడూ, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తూంటే, ఆ సర్పరాజును నువ్వు ప్రాణ మిత్రుడుగా భావిస్తున్నట్టున్నది.
అయినా, మరొకవైపున అతణ్ణించి హాని జరుగుతుం దేమో అని భయపడుతున్నావు. ఇంతకూ అతడు నీవద్దకు రావడం ఇష్టమా లేక అతడు మరి కనబడకుండా వుంటే, నీకు సుఖంగా వుంటుందా?'' అని సత్యానందుడు అడిగాడు. నిత్యానందుడు కొంచెం ఆలోచించి, ‘‘అతడు రాకుండా వుంటేనే మనశ్శాంతి కలిగేలా వున్నది. కాని, అతణ్ణి రావద్దని చెప్పడం మాత్రం నావల్ల కాదు,'' అన్నాడు.
ఆ జవాబుకు సత్యానందుడు నవ్వి, ‘‘సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరిస్తాడు?'' అని అడిగాడు. ‘‘అతడి శరీరం మీద ఆభరణా లకేం కొదవలేదు. కాని, అన్నిటికన్న గొప్పగా ధగధగ మెరిసే మణి ఒకటి అతడి కంఠం నుంచి వేళ్ళాడుతుంటుంది,'' అన్నాడు నిత్యానందుడు. ‘‘తమ్ముడూ, అలా అయితే ఒక పని చెయ్యి. ఈసారి ఆ సర్పరాజు నీ దగ్గిరకు వచ్చినప్పుడు, ఆ మణి ఇవ్వమని అడుగు,'' అని చెప్పాడు సత్యానందుడు.
రెండు, మూడు రోజుల తరవాత మణి కాంతుడు, నిత్యానందుడి కుటీరానికి వచ్చాడు. నిత్యానందుడు అతణ్ణి మణి ఇవ్వమని అడి గాడు. మణికాంతుడు కుటీరంలో కూర్చో కుండానే తన లోకానికి తిరిగిపోయూడు. మర్నాడు మణికాంతుడు రాగానే, నిత్యా నందుడు అతణ్ణి ద్వారం దగ్గిరే, ‘‘నిన్న నీ మెడలోని మణి ఇవ్వమని అడిగాను, ఇచ్చావు కాదు,'' అన్నాడు.
మణికాంతుడు కుటీ రంలో ప్రవేశించకుండా, ద్వారం దగ్గిర నుంచే వెనక్కు తిరిగి పోయూడు. మూడవరోజున మణికాంతుడు కుటీ రాన్ని సమీపిస్తూండగానే, నిత్యానందుడు అతడికి ఎదురుపోయి, ‘‘మణి ఇవ్వమని ఇంతవరకు రెండుసార్లు అడిగాను. ఇవ్వాళ యినా ఇస్తావా, లేదా?'' అని గద్దిస్తూ అడిగాడు.

సర్పరాజు మణికాంతుడు విచారంగా ముఖం పెట్టి, ‘‘నిత్యానందా, ఈ మణి సామాన్యమైనది కాదు. ఇది నేను ఏది కోరితే అదిచ్చే కామధేనువు, కల్పతరువు. ఇటు వంటి దాన్ని అడిగితే, ఎలా ఇవ్వగలను? అందువలన నేను ఇక ఏనాడూ నీ కుటీరం చాయలకు కూడా రాను,'' అంటూ వెనుదిరిగి, తన లోకానికి వెళ్ళిపోయూడు.
నిత్యానందుడు, మణికాంతుడు వస్తాడేమో అని ఒక వారం రోజులపాటు ఎదురుచూశాడు. అతడు రాలేదు. దానితో అతడికి ప్రాణ మిత్రుణ్ణి పోగొట్టుకున్నానే అన్న బెంగ పట్టు కుని, చిక్కి శల్యమై పోయూడు. ఈ స్థితిలో సత్యానందుడు, తమ్ముడు ఎలా వున్నాడో చూసి పోదామని అతడి కుటీ రానికి వచ్చాడు. తమ్ముడి దేహస్థితి చూసి సత్యానందుడు చాలా వ్యాకులం చెంది, ‘‘నీ ఆరోగ్యం మునుపటికన్నా చాలా పాడైపోయి నట్టున్నది.
నేను చెప్పినట్టు చేశావా? సర్పరాజు పీడయింకా విరగడ కాలేదా?'' అన్నాడు. ‘‘అన్నా, నువ్వు చెప్పినట్టే, ఆ సర్ప రాజును మణి ఇవ్వమని అడిగాను. ఆనాటి నుంచీ అతను ఇక్కడికి రావడం మానేశాడు. అతడు కుటీరానికి వచ్చి నాతో మాట్లాడుతూ, తన పడగవిప్పి నా తలపై ఆచ్ఛాదనగా పట్టడం నా కెంతో ఆనందకారణంగా వుండేది. ఇప్పుడు మనసు కలవరం చెందుతున్నది. ఇందు వల్లనే, నే నింతగా శుష్కించిపోయూను,'' అన్నాడు నిత్యానందుడు.
అప్పుడు అన్న అయిన బోధిసత్వుడు , ‘‘తమ్ముడూ, సర్ప రాజైన ఆ మణికాంతుడు నీ ప్రాణస్నేహితుడయినందుకు మురిసి పోయూవు. కాని, అంత ప్రాణస్నేహితుడూ నువ్వు మణి ఇవ్వమని అడిగేసరికి, నీ మొహం చూడడమే మానేశాడు. ఇదేనా ప్రాణ మిత్రుడైనవాడు ప్రవర్తించవలసిన తీరు? అతడు స్వార్థపరుడు, నిజమైన స్నేహితుడు కాదు.
అందువల్ల అతడు ఇక్కడికి రానం దుకు విచారించకు,'' అని హితబోధ చేశాడు. అన్న చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహిం చిన నిత్యానందుడు, ఆ తరవాత ఏనాడూ సర్పరాజును గురించి ఆలోచించనేలేదు. త్వర లోనే అతడికి విచారం పోయి, పూర్ణారోగ్య వంతుడయ్యూడు. 

కపటయోగి


పూర్వం కురురాజ్యంలోని పాంచాల నగరా నికి, రేణుకుడు రాజుగా వుండేవాడు. అదే కాలంలో హిమాలయ పర్వతాల్లో ఐదువందల మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి వుండేవాడు. ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గంతో దేశసంచారం చేస్తూ, పాంచాలనగరానికి వచ్చాడు. సాధువుల రాకకు రాజు చాలా సంతోషించి, మహారక్షితుడికి ఉచిత మర్యా దలు చేసి, ఉద్యానవనంలో సాధువులకు వసతి ఏర్పాటుచేశాడు.
వర్షరుతువు గడిచేవరకూ మహారక్షితుడు అక్కడే వుండి, రాజు వద్ద సెలవు పుచ్చుకుని, శిష్యులతో తిరిగి హిమాలయూలకు బయలు దేరాడు. మార్గంలో అందరూ ఒక చెట్టు నీడన కూర్చుని, రాజు తమకు చేసిన సత్కారం గురించి చెప్పుకోసాగారు. మాటల సందర్భంలో రాజుకు సంతాన ప్రాప్తి వున్నదా లేదా అన్న ప్రసక్తి వచ్చింది. శిష్యగణంలో వున్న జ్యోతిష ప్రవీణులు చర్చలు ప్రారంభించారు.
అంతా విన్న గురువు మహారక్షితుడు, ‘‘రాజు రేణుకుడికి దైవాంశ గల కుమారుడు జన్మిస్తాడు,'' అన్నాడు. మహారక్షితుడు వాక్శుద్ధికలవాడని శిష్యు లందరికీ తెలుసు. అందువల్ల వారు రాజుకు మేలు కలగబోతున్నదనుకున్నారు. వాళ్ళల్లో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. వాడు, తక్కిన వాళ్ళతో కొంచెం వెనకగా వస్తానని చెప్పి, అందరూ కనుచూపు మేరదాటిపోగానే, వెను దిరిగి పాంచాలనగరం చేరాడు.
వాడు, రాజ దర్శనం చేసుకుని, ‘‘రాజా! మేమంతా హిమాలయూలకుపోతూ ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, నీవు మా తలపునకు వచ్చావు. రాజుకు వంశం నిలబడుతుందా లేదా అన్న ప్రశ్న వచ్చింది. మేము దివ్యదృష్టి వల్ల, నీకు దైవాంశ సంభూ తుడైన కుమారుడు కలుగుతాడని తెలుసు కుని, ఆ మాట చెప్పిపోయేందుకు వచ్చాము.

ఇక పోయివస్తాం,'' అంటూ తిరిగి వెళ్ళ బోయూడు. ఈ వార్త విని ఆనందభరితుడైన రాజు, యోగిని ఆపి, ‘‘మహాత్మా, తమరు సామాన్యు లుకారు, దివ్యచక్షులు! ఇక్కడే వుండి పొండి,'' అని కోరాడు. దుష్టబుద్ధి అయిన యోగి అందుకు అంగీకరించాడు. అతడికి రాజు ఉద్యాన వనంలో అన్ని వసతులూ ఏర్పరచి, గురు వులా అతణ్ణి సేవించసాగాడు. ఇక ఈ కపట యోగి ఉద్యానవనంలో ఒక మూల కూరగా యలు కాయించి, వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి, ధనం గడించసాగాడు.
ఈ సమయంలో బోధిసత్వుడు, రేణుక మహారాజుకు కుమారుడుగా జన్మించాడు. జాతకర్మలు చేయించి అతడికి సుమనసుడు అని పేరుపెట్టారు. సుమనసుడు ఏడేళ్ళవాడైవుండగా రాజు రేణుకుడికి సామంతరాజులతో యుద్ధం వచ్చింది. తండ్రి ఇంట లేనప్పుడు సుమన సుడు ఒకనాడు ఉద్యానవనం చూడబో యూడు. అక్కడ ఒక మూల కాషాయవస్త్రాలు ధరించిన యోగి మొక్కలకు పాదులు తీస్తూ, కూలివాడికన్న ఎక్కువగా కాయకష్టం చేస్తూం డడం అతడి కంటబడింది.
సుమనసుడు కపటయోగిని గుర్తించి, అతడికి బుద్ధి చెప్పాలని, ‘‘ఒరే, తోటమాలీ!'' అంటూ కేకపెట్టాడు. దివ్యచక్షువుగా పేరుమోసిన కపటయోగి ఈ పిలుపు వింటూనే అదిరిపడ్డాడు. తన రహస్యం రాజకుమారుడు గ్రహించాడని తెలుసుకున్నాడు. అతణ్ణి ఎలా అయినా కడతేర్చాలని నిశ్చయించుకుని, ఒక వ్యూహం పన్నాడు. సరీగా, రాజు తిరిగి వచ్చే సమయూనికి కపటయోగి తన కమండలాన్నీ, పీఠాన్నీ ముక్కలు చేశాడు.
ఆశ్రమం చుట్టూ గడ్డీ గాదం విరజిమ్మాడు. తరవాత ఒళ్ళంతా నూనె పూసుకుని, ఆశ్రమంలో ఒక మూల మూలు గుతూ పడుకున్నాడు. రాజు తన గురువైన దివ్యచక్షుణ్ణి చూడ బోయూడు. అతడికి ఆశ్రమ పరిసరాలు అశుభ్రంగా కనిపించాయి. ‘‘మహాత్మా, ఏం జరిగింది?'' అని అడి గాడు రాజు చేతులు జోడించి. ‘‘ఇదంతా నీ కొడుకు చేసిన పని!'' అంటూ కపటయోగి, సుమనసుడు తనకు చేసిన అవమానం గురించి చెప్పాడు.

రాజు ఉగ్రుడైపోయి, తలారులను పిలిచి, ‘‘సుమనసుడి తల నరికి నా దగ్గిరకు తీసుకు రండి!'' అని ఆజ్ఞాపించాడు. తలారులు పోయి, తల్లి దగ్గిర కూర్చుని వున్న సుమనసుడికి సంగతి చెప్పారు. సుమనసుడు తండ్రి దగ్గిరకు వచ్చి, ‘‘నాన్నగారూ, మహాత్ముడు, పవిత్రుడు అని నువ్వు పూజించే ఆ కపటయోగి చేస్తున్న దేమిటో ద్వారపాలకుల్ని అడిగి చూడు, తెలు స్తుంది,'' అన్నాడు. రాజు అప్పటికప్పుడే ప్రాసాదపు నాలుగు ద్వారాలను కాపలా కాసేవాళ్ళను పిలిపిం చాడు.
వాళ్ళు, రాజుతో దాచకుండా యోగి కూరగాయలు పండించి అమ్మడం గురించి చెప్పారు. రాజు ఆశ్రమంలో వెదికించగా, కపట యోగి దాచిన ధనం బయటపడింది. రాజు తన తప్పిదానికి చాలా విచారించి, కొడుకుతో, ‘‘నాయనా, నా తొందరపాటు మన్నించు. ఇక, ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో,'' అన్నాడు. అందుకు సుమనసుడు ఒప్పుకోక, ‘‘మహిమగల మూలిక ఎంత పని చేస్తుందో, నోటి వెంట వెడలే మాట కూడా అంత పని చేస్తుంది.
నీ నోటి వెంట వెడలినవి దుష్ట వాక్కులు! నీ ఆజ్ఞప్రకారం, నా తల్లి దగ్గిర కూర్చునివున్న నన్ను తలారులు వధ్యశిల వద్దకు తీసుకు పోబోయూరు. నేనిప్పుడే, నీ రాజ్యం విడిచి పోతున్నాను,'' అన్నాడు. సుమనసుడి మనసు మార్చవలసిందిగా రాజు, రాణిని కోరాడు. కాని ధర్మచింతగల రాణి ఆ మాట పాటించక కొడుకును దీవిస్తూ, ‘‘నాయనా! నువ్వు ధర్మమూర్తివి. నీ అభీ ష్టానుసారం పవిత్ర జీవనం గడుపుతూ, తరించు,'' అన్నది.
సుమనసుడు హిమాలయప్రాంతం చేరి, అక్కడ విశ్వకర్మ నిర్మించి వుంచిన కుటీరంలో తపస్సు చేస్తూ కాలంగడిపాడు. రాజు రేణుకుడు కపటయోగికి మరణ దండన విధించాడు. ఆనాటి నుంచీ యోగు లకు రాజ్యంలో ఎవరూ ఆశ్రయం ఇవ్వవద్దని శాసనం చేశాడు. ఈ విధంగా, దుష్టబుద్ధి అయిన ఒక్క కపటయోగి కారణంగా, యోగులందరికీ తీరని అపకీర్తి కలిగి, కురురాజ్యంలో వారికి ప్రజాదరణ లేకుండా పోయింది.

మంత్రపటిమ

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, ఒకప్పుడు బోధిసత్వుడు, ఒక గ్రామంలో చర్మకారుడుగా జన్మించాడు. ఆయన తన వృత్తిధర్మం నిర్వహించుకుం టూనే, ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి, ఒక అపూర్వ మైన మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధి సత్వుడు అకాలంలో మామిడి పళ్ళు చెట్లకు కాయించేవాడు.
ఆయన రోజూ ఉదయూనే ఒక కొంకి కర్ర భూజాన వేసుకుని, అడవిలో వున్న ఒక మామిడిచెట్టు వద్దకు వెళ్ళేవాడు. అక్కడ చెట్టుకు ఏడడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు. తరవాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు. ఆ వెంటనే, మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూతపూసి, కాయలు కాసేవి. ఒకరోజున ఆయన మామిడి చెట్టుకు ఇలా కాయలు కాయిస్తూండగా, దర్భలకై అడివికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కురవ్రాడు చూశాడు.
అతనికి చదువు సంధ్య లేమీ అబ్బలేదు. కాని, ఏ దేవి కృపవల్లో క్షణాల మీద పండితుడైపోవాలనీ; వెండీ, బంగారాలతో తులతూగాలనీ కలలు కంటూండేవాడు. బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే, సునందుడు ఆయన కొంకికర్రా, మామిడిపళ్ళ మూటా అంది పుచ్చుకుని, తరవాత, ఆయనతో తాను ఫలానా అని చెప్పుకుని, ఆనాటి నుంచీ ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు.
ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు బోధిసత్వుడు భార్యతో, ‘‘ఈ కురవ్రాడు మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా? వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా వున్నది. వాడు చాలా దురాశాపరుడు. నేను దయతలచి మంత్రం నేర్పినా, వాడికి అది ఎంతోకాలం మేలు కలిగించదు,'' అన్నాడు.

సునందుడు ఇంట్లో అంటి పెట్టుకొని వుంటూ, తలలో నాలుకలా మసులు కోవడం చేత, బోధిసత్వుడి భార్యకు అతడంటే జాలి కలిగింది. ఆమె భర్తతో, ‘‘ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులూ చేస్తూ, కన్న కొడుకు కంటె ఎక్కువ అణుకువగా వుంటున్నాడు. మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది? ఒకవేళ అలా జరిగితే దోషం వాడిదే అవుతుంది! మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించక తప్పదు,'' అన్నది.
బోధిసత్వుడు కొంచెం ఆలోచించి, భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి, సునందు డికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు. ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి, ‘‘నాయనా, ఇది చాలా న్యాయమార్గాన ఉప యోగించుకున్నావంటే ధనమూ, కీర్తీ రెండూ లభిస్తాయి. కాని, ఒక సంగతి గుర్తుంచుకో! దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం, రహస్యం వెల్లడించకూడదు.
రహస్యం వెల్లడించావో, ఆ క్షణం నుంచీ మంత్రపటిమ అంతరించి పోతుంది,'' అని చెప్పి, మంత్రం ఉపదే శించాడు. సునందుడు మంత్రం నేర్చుకుని ఇల్లు చేరి, అకాలపు మామిడిపళ్లు సృష్టిస్తూ, వాటిని విక్రయించి ధనం సంపాయించ సాగాడు. సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి పళ్ళలో ఒకటి, కాశీరాజుకు చేరింది. ఆయన ఆశ్చర్యపడి, వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి, సునందుడని తెలియగానే, అతణ్ణి పిలిపించాడు. ‘‘ఋతువు కాని ఋతువులో, ఈ మామిడి పళ్ళు నువ్వెక్కడి నుంచి తెస్తున్నావు?
ఇవి దైవసృష్టా? మానవసృష్టా? అసలు విషయం ఏమిటో దాచకుండా నిజం చెప్పు,'' అని రాజు సునందుణ్ణి అడిగాడు. సునందుడు, రాజుతో మహానందంగా, ‘‘మహారాజా! నేను విక్రయించే ఈ మామిడి పళ్లు, నేను సృష్టిస్తున్నవి. నా కొక మహా మంత్రం తెలుసు!
దాని మహిమ వల్లనే, నేను అకాలంలో మామిడి చెట్లకు కాయలు కాయి స్తూంటాను,'' అన్నాడు. ఈ జవాబుకు రాజు మరింతగా ఆశ్చర్య పోతూ, ‘‘అలాగా! ఆ మంత్ర పటిమ ఎలాం టిదో స్వయంగా చూడాలని కోర్కెగా వున్నది. నా ఉద్యానవనంలోని చెట్లకు, నీ మంత్ర మహిమతో కాయలు కాయించగలవా?'' అన్నాడు.

సునందుడు సంతోషంగా ఇందుకు ఒప్పు కున్నాడు. మర్నాడు రాజూ, పరివారం వెంట రాగా ఉద్యానవనంలోకి వెళ్లాడు. అక్కడ ఒక చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి, కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు. వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కింద రాలినై. ఈ అద్భుతం చూసి రాజూ, ఆయన పరివారం అమిత ఆశ్చర్యం పోందారు. వాళ్ళు పళ్ళను ఏరి తెచ్చుకుని తిని చూశారు. అద్భుతమైన రుచి.
రాజు, సునం దుణ్ణి ఘనంగా సన్మానించి, ‘‘ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని, నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు?'' అని ప్రశ్నించాడు. సునందుడికి ఏమి చెప్పడానికీ పాలు పోలేదు. నిజం వెల్లడిస్తే, మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతడికి జ్ఞాపకం వున్నవి. ఐనా, కంఠతా వచ్చిన మంత్రానికి పటిమ పోవడం ఏమిటి? ఇవన్నీ గురువుగారి భేషజపు పలుకులు అనుకుని, రాజుకు తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నదీ చెప్పేశాడు.
రాజు హేళన చేస్తూ నవ్వి, ‘‘ఇంత పటిమగల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకు న్నది చర్మకార వృత్తిలో బతికేవాడి దగ్గరా? బ్రాహ్మడివై వుండీ, ఇహలోక సౌఖ్యాలుకోరి, స్వధర్మాన్ని మంటగలిపావు. ఇది చాలా నీచమైన పని,'' అన్నాడు. రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడ కుండా తల వంచుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు కాశీరాజుకు మామిడిపళ్ళు తినా లన్న కోర్కె కలిగింది.
ఆయన సునందుణ్ణి పిలిపించి, సంగతి చెప్పాడు. అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు. సునందుడు ఎప్పటిలా చెట్టుకు ఏడడు గుల దూరంలో నిలబడి మంత్రం పఠించ బోయూడు. కాని, ఎంతకూ అది స్ఫురణకు రాలేదు. తరవాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి, తను గురువాజ్ఞ తప్పడంవల్ల, మంత్రం పూర్తిగా మర్చిపోవడం జరిగిందని తెలుసుకున్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో, సునం దుడు తాను గురువాజ్ఞను ధిక్కరించడంవల్ల మంత్ర పటిమ పోగొట్టుకున్నానని చెప్పి, విచారంగా ఇంటికి వెళ్ళిపోయూడు.

దాసీపుత్రుడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు గొప్ప ధనికుడుగా పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడై, పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలానికి బోధిసత్వుడి కొక కుమారుడు కలిగాడు. అదే రోజున ఆ ఇంటి దాసీదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు. వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు. ధనికుడి కుమారుడూ, దాసీపుత్రుడైన కటాహకుడూ పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు.
ధనికుడి కుమారుడు చదవటానికి వెళ్ళే టప్పుడు, కటాహకుడు అతని పలకా, పుస్త కాలూ తీసుకుని వెంట వెళ్ళి వస్తూండేవాడు. ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువంతా, దాసీపుత్రుడూ నేర్చుకున్నాడు. చదువుకున్నవాడనీ, తెలివైనవాడనీ కటా హకుడికి పేరు వచ్చింది. అన్నీ వుండి కూడా తాను నౌకరుస్థాయిలోనే వుండటం కటాహకు డికి ఎక్కడలేని బాధా కలిగించింది.
తన విద్యకూ, తెలివితేటలకూ తగిన స్థానం సంపాదించాలని వాడికి బలమైన కోరిక పుట్టింది. ఇందుకు గాను ఒక ఉపాయం ఆలోచించాడు. కాశీకి కొన్ని కోసులదూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడొక లక్షాధికారి వున్నాడు. అతనికి తన యజమాని రాసి నట్టుగా, కటాహకుడొక జాబు రాశాడు: ‘‘నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను. మనమూ, మనమూ వియ్య మందటం ఉచితంగా వుంటుందని, నా విశ్వాసము.
కనుక తమరు మా వాడికి తమ కుమార్తె నిచ్చి వివాహము చేసి, తమ ఇంటనే వుంచుకొనేది. తీరిక చేసుకుని నేను వచ్చి, తమ దర్శనం చేసుకోగలను.'' ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి, ప్రత్యంత దేశానికి వెళ్ళి, లక్షాధికారి దర్శనం చేసుకుని, ఆయనకు ఉత్తరం అందించాడు.

లక్షాధికారి ఉత్తరం చూసి ఉబ్బి తబ్బి బ్బయిపోయి, కటాహకుడికి తన కుమార్తె నిచ్చి, ఒక శుభముహూర్తాన పెళ్ళి చేసేశాడు. కటాహకుడికిప్పుడు అంతులేని నౌకర్లు. దుస్తుల విషయంలో, భోజనం విషయంలో, ఇతర విలాసాల విషయంలో అతనికి రాజో పచారంగా జరిగిపోతున్నది. ఈలోపల బోధిసత్వుడికి, కటాహకుడే మైనాడా అని సందేహం వచ్చింది. ఆయన అతన్ని వెదకటానికి, నాలుగు వైపులకూ మను షులను పంపాడు.
వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి, కటాహకుడు ఒక లక్షాధికారి కూతురును పెళ్ళాడి, తన పేరు మార్చుకుని, తాను ఫలానా కాశీ ధనికుడి కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు. తాను స్వయంగా వెళ్ళి కటాహకుణ్ణి తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నా డన్న వార్త తెలియగానే, కటాహకుడు బెదిరి పోయూడు.
తన యజమాని వచ్చి, నిజం తెలుసు కొనకముందే, తాను ఆయనను మంచి చేసుకుని, జరిగినదంతా చెప్పి క్షమాపణ వేడుకుందామనుకున్నాడు. అయితే, తాను యజమాని దగ్గిర నౌక రులా ప్రవర్తించటం చూసి అందరూ అను మాన పడవచ్చు. అందుచేత కటాహకుడు తన సేవకులతో, ‘‘నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను. నాకు, నా తండ్రి మీద ఎంతో పూజ్యభావం. నేను, నా తండ్రి భోజనం చేస్తూంటే, పక్కన నిలబడి విసురుతాను.
ఆయనకు మంచినీరూ అవీ నేనే స్వయంగా అందిస్తాను,'' అంటూ తాను నౌకరు చేసే పనులన్నీ వర్ణించి చెప్పాడు. తరవాత కటాహకుడు తన మామగారి దగ్గిరకు వెళ్ళి, ‘‘మా నాన్న వస్తున్నాడు. నేనాయనకు ఎదురువెళ్ళి తీసుకువస్తాను,'' అని చెప్పాడు. లక్షాధికారి సరేనన్నాడు.
కటాహకుడు తన యజమానిని అంత దూరానే కలుసుకుని, ఆయన కాళ్ళ మీద పడి, తాను చేసినదంతా చెప్పి, తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు. బోధిసత్వుడు అభయం ఇచ్చాడు. తరవాత కటాహకుడు బోధిసత్వుడితో సహా, మామ గారి ఇంటికి వచ్చేశాడు. లక్షాధికారి బోధిసత్వుణ్ణి చూసి ఎంత గానో ఆనంద పడి, ‘‘తమరు కోరిన ప్రకారమే ూ అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్ళి చేశాను,'' అన్నాడు.

బోధిసత్వుడు తృప్తిపడినట్టు కనిపించి కటాహకుడితో, తన కుమారుడితో లాగే మాట్లాడాడు. తరవాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి, ‘‘అమ్మా, నా కుమారుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా?'' అని అడిగాడు. ‘‘ఆయనలో మరే లోపం లేదు గాని, భోజనం దగ్గిర ఆయనకు ఒకటీ రుచించదు. ఎన్ని విధాల మంచి వంటకాలు చేసినా, ఏదో ఒక తప్పు పడతాడు.
ఏం చేసి ఆయనను తృప్తిపరచాలో, ఎంత ఆలోచించినా తెలియ కుండా వున్నది,'' అన్నది కటాహకుడి భార్య. ‘‘అవును. వాడు తిండి దగ్గర లోగడ కూడా ఇలాగే నానాతిప్పలూ పెట్టేవాడు. అందుచేత ఈసారి వాడు భోజనానికి కూర్చుని ఇది బాగా లేదు, అది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం నీకు రాసి ఇస్తాను. దాన్ని బాగా కంఠస్థం చెయ్యి. అది చదివావంటే, వాడు తప్పులు పట్టటం మానేసి, పెట్టినదేదో తింటాడు,'' అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు.
బోధిసత్వుడు కొద్ది రోజులు అక్కడ వుండి, కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయూడు. ఆయన వెళ్ళగానే కటాహకుడు మరింతగా విజృం భించాడు. భోజనం ముందు కూర్చుని వడ్డిం చిన ప్రతి పదార్థాన్నీ, నిందించసాగాడు. ఒకరోజున కటాహకుడు ఇలా చీద రించుకుంటూ వుంటే, అతడి భార్య ఈ శ్లోకం చదివింది : ‘‘బహూంపి సో వికత్థేయ్య అంఞం జనపదం గతో, అన్వాగంత్వాన దూసేయ్య భుంజ భోగే కటాహక.''
(కటాహకుడు అనేక విధాల తిట్లు తిని, వేరొకచోటుకు పోయి, ఇతరులను దూషిస్తూ సకల భోగాలూ అనుభవిస్తాడు.) దీని అర్థం కటాహకుడి భార్యకు తెలి యదు. కాని కటాహకుడు మాత్రం, తన యజమాని తన పేరుతో సహా, తన రహస్య మంతా భార్యకు చెప్పేశాడని భయపడి పోయూడు. ఆ తరవాత అతడు ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తిపడుతూ, సుఖంగా కాలక్షేపం చేశాడు.

దుండగీడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు, దేవలోకంలోని దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడుగా వుండటం తటస్థించింది. బ్రహ్మదత్తుడు అప్పుడు మంచి యౌవనంలో ఉన్నాడు. రాజ్యాధికారం, తరగని సంపదలు, వీటితోపాటు మంచి వయసు తోడుకావడంతో అతనిలో క్రమంగా అహంకారం పెరిగిపోసాగింది. దాంతో ఎదుటివారిని ఏమాత్రం లెక్క చేసేవాడు కాడు. పూచిక పుల్లకన్నా హీనంగా చూసేవాడు.
మంచీ చెడూ చెప్పేవారు లేకపోవడంతో అతనిలో అన్ని అవలక్షణాలూ చోటు చేసుకున్నాయి. దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా కన్నూ మిన్నూ తెలియక ప్రవర్తించసాగాడు. అన్నిటికీ మించి వయసుమళ్ళిన జంతువులన్నా, మనుషులన్నా, పాతవస్తువులన్నా అతనికి ఎందుకో తగని ఏహ్యభావం కలిగింది. అవన్నీ ఒక విధమైన రోతగా కనబడేవి.
వయసు మీరిన జంతువులేవైనా సరే-గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, మరేవైనా కానీ కంటపడితే, వెంటనే వాటిని తరిమి తరిమి కొట్టేవాడు. పాతబడిన బళు్ళకాని, ఇంకేదైనా వస్తువుకాని కనిపిస్తే చాలు, ఆ క్షణమే వాటిని ముక్క చెక్కలుగా చేసి పార వేసేవాడు. వయసు గడచిన మనుషులు-అంటే వృద్ధులు ఎదుటపడితే, వాళ్ళ నెరసిన గడ్డాలు పట్టుకు లాగేవాడు. వాళ్ళను కింద పడుకోబెట్టించి పాత్రలు దొర్లించినట్టుగా దొర్లించేవాడు.

ఆ వృద్ధులు స్త్రీలయితే, నానా హింసలూ పెట్టేవాడు. బ్రహ్మదత్తుడు చేసే ఈ అర్థం లేని ఆటలకూ, దుండగాలకూ ఒక మితీ, మేరా లేక పోయింది. ఇంద్రుడి లక్ష్యమూ, చంద్రుడి లక్ష్యమూ లేకుండా సంచరించే ఆ రాజకుమారుణ్ణి ఎదిరించటానికి ఎవళ్ళకూ తరం కాలేదు. ఇలా రాజు చేసే దుర్నయాలకూ, పెట్టే యాతనలకూ ప్రజలు కటకటలాడి పోసాగారు.
చేసేది లేక తల వంచుకున్నారు. చాలా మంది గృహస్థులు వృద్ధులైన తమ తల్లిదండ్రులను రాజ్యం దాటించి ఇతర ప్రదేశాలకు చేర్చుకొన్నారు. ఈ విధంగా తల్లిదండ్రులను దూర దేశాలలో దిగబెట్టి, వారికి ఎడబాపులై వుండటం తప్ప మరి గత్యంతరం లేక పోయింది. ఇలా ప్రజలు తల్లిదండ్రులను విడిచి పెట్టి ఉండటం వల్ల వారు మహాపాపం చేసిన వారయ్యారు. ఇటువంటి పాపాత్ములతో రౌరవాది నరకాలన్నీ నిండిపోజొచ్చినై.
స్వర్గలోకమంతా ఖాళీగా ఉండిపోయింది. స్వర్గలోకంలో తగినంత పని కనబడక పోయేసరికి దేవేంద్రుడు విచారగ్రస్తుడయ్యాడు. దీనికి వెంటనే ఒకపరిష్కార మార్గం చూడాలని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవేంద్రుడు కడుపేద అయిన ఒక శతవృద్ధు రూపం దాల్చాడు. రెండు జాడీలలో మజ్జిగ నింపి, శిథిలావస్థలో వుండే ఒక బండిలో పెట్టాడు. ఆ బండికి రెండు ముసలి బక్క ఎద్దులను పూన్చి, బయలుదేరాడు. ఈ విధంగా దేవేంద్రుడు వెళుతూండగా-అతి వైభవంగా గొప్ప ఊరేగింపుతో గజారోహణం చేసి వస్తున్న బ్రహ్మదత్తుడు ఎదురయ్యాడు.
రాజుకోసం నగరమంతా ఆనాడు రంగురంగుల తోరణాలతో అలంకరించ బడింది! బండి మీద ముసలివాణ్ణి చూస్తూనే రాజు, ``పోరా, అవతలకి ముసలి పీనుగా! తప్పుకోరా! ఏమిటింత పొగరు?'' అంటూ కేకలు వేశాడు. పక్కనున్న ప్రజలకు ఇదంతా ఆశ్చర్యం కొలిపింది. `ఏమిటి, రాజు ఇలా కేకలు వేస్తాడెందుకో!' అని అనుకొన్నారు. చిత్రమేమిటంటే-మారు వేషంలో వున్న ఆ దేవేంద్రుడు ఒక్క రాజుకే కనిపిస్తున్నాడు. కాని ప్రజలలో ఒక్కళ్ళకూ గోచరించటం లేదు.

దేవేంద్రుడి మహిమ వల్లనే ప్రజల కళ్ళకు మాయ కమ్మింది! అలా కోపంతో కేకలు వేసే రాజు మీదికి వేగంగా వెళ్ళి, వృద్ధుడు తన బండిలోని ఒక మజ్జిగ జాడీ తీసి రాజు నెత్తి మీద పగలగొట్టాడు. అనూహ్యమైన ముసలివాడి చర్యకు రాజు దిగ్భ్రాంతి చెందాడు. భయంతో ఏనుగుపై నుంచి కిందికి దూకి పారిపో జూశాడు. అప్పుడు ముసలివాడు వదలకుండా రెండవ జాడీ కూడా తీసి రాజు తలకు వేసి కొట్టాడు.
ఆ మజ్జిగ ఒలికి రాజు వళ్ళంతా తడిసిపోయింది. రాజుకు ఏం చేయడానికీ తోచలేదు. ఆ సమయంలో ముసలివాడు ఎక్కి వచ్చిన బండి అదృశ్యమైపోయింది. మజ్జిగ జాడీలు కనపడకుండా పోయినై. అప్పుడు దేవేంద్రుడు స్వస్వరూపంతో రాజు ఎదుట సాక్షాత్కరించాడు. పాదాక్రాంతుడైన రాజును చూసి దేవేంద్రుడు, ``ఏమి రాజా! పొగరుబోతుతనము ఎవరికి? నీకా, నాకా? కన్నుకానని గర్వంతో ఎవరు మిట్టిపడుతూ వున్నారు? నువ్వా, నేనా? ఎల్లప్పుడూ ఈ యౌవనంలో ఇలాగే వుండి పోతావా నువు్వ? నీకు వృద్ధాప్యం రాదా? ముసలివారినీ, పాత వస్తువులనూ హేళన చేస్తావా? నీ దుశ్చేష్టల వల్ల రాజ్యంలో ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నావా? నువు్వ పెట్టే యాతనలవల్ల వాళ్ళందరూ కన్న తల్లిదండ్రులను దూర ప్రదేశాలకు పంపివేసి, వారి రక్షణ చూడలేని మహాపాపులవుతున్న సంగతి కొంచెమైనా గుర్తించావా? ఈ విధంగా నరకలోకాలు నిండిపోవటం, స్వర్గానికి ఒక్కళూ్ళ రాకపోవటం గమనించావా? ఈ క్షణం నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని, తప్పు దిద్దుకుని, సరిగా ప్రవర్తించు.
లేకుంటే, ఇదుగో ఈ పిడుగు వచ్చి, నీ తలనూ, మొండెమునూ వేరు చేస్తుంది. జాగ్రత్త!'' అని హెచ్చరించి, అదృశ్యమయ్యాడు. నాటి నుంచి బ్రహ్మదత్తుడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అతడు వృద్ధులను గౌరవించసాగాడు. అందువల్ల ఇంతకుముందు రాజ్యంలో కలిగిన అలజడి తగ్గింది. ప్రజలు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను దూర ప్రాంతాల నుంచి తిరిగి తెచ్చుకొని, సేవించి సుఖంగా ఉంటూ వచ్చారు. బోధిసత్వుడి ప్రభావం వల్ల ఇంతటి మంచి మార్పు కలిగింది.

మానవజన్మ

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధరాజ్యంలో ఒక పేదవాడుగా జన్మించి, మగధరాజు పరివారంలో ఒకడుగా ఉంటూ ఉండేవాడు. మగధదేశానికీ, అంగదేశానికీ మధ్యగా చంపానది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది అడుగున నాగరాజ్యం ఉండేది. చంపేయ్యుడు ఆ రాజ్యానికి రాజు. మగధరాజ్యానికీ, అంగరాజ్యానికీ మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతూండేవి.
అలా జరిగిన ఒక యుద్ధంలో మగధరాజు ఓడిపోయూడు. ఆయన తన గుర్రం మీద ఎక్కి పారిపోతూ చంపానది వద్దకు వచ్చి, తన శత్రువు చేతికి చిక్కి చావటంకంటె ఆత్మహత్య చేసుకోవటం మంచిదనే ఉద్దేశంతో, తన గుర్రంతో సహా నదిలోకి ఉరికాడు. మగధరాజుతో సహా గుర్రం నది అడుగున వున్న నాగరాజు కొలువు కూటంలో వాలింది. నాగరాజు తన సింహాసనం నుంచి లేచి వచ్చి మగధరాజుకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చి, ఆయన కథ యూవత్తూ తెలుసుకున్నాడు. ‘‘జరిగినదానికి మీరు విచారించకండి.
అంగరాజుతో జరిగే ఈ యుద్ధంలో మీకు విజయం లభించటానికి నేను తోడ్పడగలను,'' అని నాగరాజు తన అతిథికి మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే నాగరాజు మగధరాజుకు యుద్ధంలో సహాయపడ్డాడు. అంగరాజు మగధరాజు చేతిలో చనిపోయూడు. మగధరాజు రెండు దేశాలకూ రాజై వైభవంగా పరిపాలించసాగాడు. అది మొదలు మగధరాజుకూ, నాగరాజుకూ బద్ధమైత్రి ఏర్పడింది. మగధరాజు యేటా ఒక రోజున సపరివారంగా చంపానదీతీరానికి వెళ్ళేవాడు.

ఆ రోజున నాగరాజు నది నుంచి వైభవంతో వెలువడి మగధరాజు తెచ్చిన బహుమానాలు అందుకునేవాడు. మగధరాజు పరివారంలో ఒక భృత్యుడుగా ఉంటున్న బోధిసత్వుడు ఏటా నాగరాజు వైభవాన్ని కళ్ళారా చూస్తూ వచ్చాడు. ఆయన చనిపోయే క్షణాన ఈ నాగరాజు వైభవమే ఆయన మనసులో మెదిలింది. ఆ కారణంచేత ఆయన నాగరాజు చనిపోయిన ఏడవనాడు తానే నాగరాజుగా జన్మించాడు.
కాని కిందటి జన్మలో పుణ్యాత్ముడై ఉండిన కారణం చేత ఆయనకిప్పుడు తన పాము శరీరం చూసుకోగానే ఎంతో రోత పుట్టింది; నాగరాజు ఐశ్వర్యాన్ని కాంక్షించినందుకు ఆయనకు పశ్చాత్తాపం కూడా కలిగింది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ జన్మ చాలింతామనుకుంటున్న సమయంలో సుమన అనే నాగకన్య తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి, ఆయనకు ప్రణామం చేసింది.
సుమనను చూడగానే నాగరాజు ఆత్మహత్యా ప్రయత్నం మానేసి, ఆమెను తన భార్యను చేసుకుని నాగలోకాన్ని పరిపాలించసాగాడు. కాని కొంత కాలానికి ఆయనకు ఉపవాసాలూ, నిష్ఠలూ జరిపి, పుణ్యం సంపాదించుకోవాలనే కోరిక కలిగింది. ఇందుకుగాను ఆయన తన లోకాన్ని విడిచి మానవలోకంలోకి వెళ్ళ నిశ్చయించాడు.
ఉపవాస దినాలు వచ్చినప్పుడాయన తన భవనం వెలువడి, ఒక రహదారి పక్కన ఉండే చీమలపుట్ట మీద చుట్టచుట్టుకు పడుకుని, ‘‘నన్ను ఏ గరుడపక్షి అయినా తన్నుకు పోనీ! ఏ పాములవాడైనా పట్టుకుపోనీ!'' అనుకునేవాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. రహదారి వెంట వెళ్ళే మనుషులు పుట్ట మీద చుట్టుకుని ఉన్న పామును చూసి దేవతగా భావించి, పూలతో, పూజించసాగారు.
మరి కొందరు ఆ నాగరాజుండే పుట్టవద్ద ఒక ఆలయం కట్టారు. ప్రతిరోజూ అక్కడికి రకరకాల ప్రజలు వచ్చి పిల్లలు కావాలనీ, తమ శరీర వ్యాధులు నయం కావాలనీ, తమ కోరికలు తీరాలనీ మొక్కుకోసాగారు. నాగరాజు ఉపవాసదినాలన్నీ ఈ విధంగా పుట్ట మీద గడిపి ప్రతి మాసమూ కృష్ణపాడ్యమి నాడు ఇంటికి తిరిగిపోతూ ఉండేవాడు.

ఒకనాడు సుమన ఆయనకు, ‘‘స్వామీ, మీరు తరుచూ మానవలోకంలోకి వెళుతు న్నారు. ఆ లోకం అపాయకరమైనది, భయంకరమైనది. మీకేదైనా ప్రమాదం జరిగే పక్షాన నాకా సంగతి తెలిసేదెలా?'' అని అన్నది. నాగరాజు సుమనను ఒక కొలను వద్దకు తీసుకుపోయి, ‘‘ఈ నీరు చూడు! నాకేదైనా దెబ్బ తగిలితే ఈ నీరు మురికి అవుతుంది. నన్నేదైనా గరుడపక్షి తన్నుకు పోతే ఈ నీరు ఇగిరిపోతుంది.
అలా కాక, ఏ మంత్రగాడైనా నన్ను పట్టుకున్న పక్షంలో ఈ నీరు రక్తవర్ణంగా మారుతుంది,'' అని ఆమెతో చెప్పాడు. కాశీనగరవాసి అయిన ఒక బ్రాహ్మణ యువకుడు తక్షశిలకు వెళ్ళి అక్కడ వశీకరణవిద్య నేర్చుకుని, తన దేశానికి తిరిగిపోతూ నాగరాజు పడుకునే చోటికి రహదారి వెంబడి వచ్చాడు. పుట్టపైన చుట్టుకుని పడుకుని ఉన్న నాగరాజు అతని కంట పడ్డాడు. వెంటనే ఈ యువకుడు పామును మంత్రంతో బంధించి పట్టుకుని, ఒక బుట్టలో పెట్టి, ఒక గ్రామానికి తీసుకుపోయి, అక్కడ ఆ పామును ఆడించాడు.
ఇది చూడవచ్చిన గ్రామస్థులు పాములాటకు చాలా సంతోషించి బ్రాహ్మణ యువకుడికి డబ్బూ, ఇతర విలువైన బహుమానాలూ ఇచ్చారు. ‘‘ఈ కుగ్రామంలోనే ఇంత డబ్బు వస్తే ఇంక పట్టణాలలో పాము నాడిస్తే ఇంకా ఎంత వస్తుందో!'' అని బ్రాహ్మణ యువకుడికి ఆశ కలిగింది. అతను పామును వెంటతీసుకుని కాశీ నగరానికి బయలుదేరి, బండి మీద ప్రయూణం చేస్తూ, ఒక మాసానికల్లా కాశీ నగరాన్ని చేరుకున్నాడు. ఈ నెల రోజులపాటూ నాగరాజు ఉపవాసాలు చేశాడేగాని, ఆహారంగా బ్రాహ్మణ యువకుడిచ్చిన కప్పలను తాకనేలేదు.
‘‘నేను ఆహారం తిన్నంతకాలమూ నాకీ బుట్టలో మంత్రశక్తులున్న ఈ యువకుడి వల్ల ఖైదు తప్పదు!'' అని ఆయన తెలుసుకున్నాడు. బ్రాహ్మణ యువకుడు నాగరాజును కాశీనగర సమీపాన గల అనేక గ్రామాలలో ఆడించి అక్కడి ప్రజలనుంచి అంతులేని డబ్బు సంపాదించాడు. ఈ పాములాట వినోదం గురించి త్వరలోనే కాశీరాజుకు తెలియవచ్చింది. ఆయన బ్రాహ్మణయువకుణ్ణి పిలిపించి తన వినోదం కొరకు పాములాట ఏర్పాటు చేయించాడు.

ఈలోపల నాగలోకంలో సుమన, నెల రోజులుగా తన భర్త ఇంటికి రాకపోవటం గమనించి ఏదో జరిగివుంటుందని భయపడి, నిజం తెలుసుకునేటందుకు కొలను వద్దకు వెళ్ళింది. కొలనులో నీరు ఎరగ్రా, రక్తం రంగులో ఉన్నది. ఎవడో పాములవాడు తన భర్తను పట్టుకున్నట్టు సుమన తెలుసుకున్నది. ఆమె తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరి, దారిలో విచారిస్తూ, త్వరలోనే కాశీనగరం చేరుకున్నది.
ఆమె అక్కడికి చేరేసరికి, పాములాట జరుగుతున్నది. రాజుగారూ, అనేకమంది ప్రజలూ చేరి వినోదం చూస్తున్నారు. తన భార్యను చూడగానే నాగరాజు సిగ్గుపడి, ఆట మాని, చప్పున బుట్టలోకి వెళ్ళిపోయూడు. సుమన మానవస్ర్తీ రూపం ధరించి రాజును సమీపించి, చేతులు జోడించి, ‘‘మహారాజా, నాకు పతిభిక్ష పెట్టండి!'' అని వేడుకున్నది. ఇంతలోనే పాము కూడా బుట్టలో నుంచి బయటికి పాకివచ్చి, అందరూ చూస్తూండగానే, ఒక ఆకర్షణీయమైన యువకుడి ఆకారం ధరించింది.
కాశీరాజు ఆ నాగదంపతులను చూసి ఎంతో ముచ్చటపడి, వారిని వారం రోజుల పాటు తన అతిథులుగా ఉంచుకుని, అటు తరవాత వారి వెంట తాను కూడా సపరివారంగా ప్రయూణమై నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకంలోని ఐశ్వర్యమూ, అందమూ, వైభవమూ చూసి కాశీరాజుకు చెప్పతరంకాని ఆశ్చర్యం కలిగింది. ‘‘ఇంత వైభవంలో ఓలలాడుతూ మీరు పాము రూపంలో చీమల పుట్టపై చుట్టచుట్టుకుని పడుకోవటానికి కారణమేమిటి?'' అని కాశీరాజు నాగరాజును అడిగాడు.
‘‘రాజా, ఇక్కడ ఎంత వైభవం ఉన్నప్పటికీ, జన్మరాహిత్యం పొందే సౌకర్యం మీ మానవ లోకంలో మాత్రమే ఉన్నది!'' అని నాగరాజు ఆయనకు సమాధానం చెప్పాడు. కాశీరాజు ఈ మాట విని పరమానందం చెందాడు. ఆయన తన రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాగరాజు ఆయనకు అంతులేని బహుమానాలిచ్చి పంపాడు.

నీతివర్తనుడు


బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఆయన కుమారు డుగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు అతడికి శీలవుడు అని పేరు పెట్టాడు. కాలక్రమాన శీలవుడు రాజోచితమైన విద్యలూ, ధర్మశాస్త్రాలూ అభ్యసించి పెరిగి పెద్దవాడై, కాశీరాజ్యానికి రాజయ్యూడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా ఎంతో ప్రేమా దరాలతో పరిపాలించసాగాడు. ముఖ్యంగా నేరస్థుల పట్ల ఎంతో కనికరం కనబరచి వాళ్ళ బతుకులను బాగు చేయడానికి ప్రయత్నించ సాగాడు.
దారిద్య్రం వల్లా, అజ్ఞానం చేతా దొంగతనం మొదలైన నేరాలను చేసేవారిని ఆయన కఠినంగా దండించడానికి బదులు, తన సమక్షానికి రప్పించుకుని, అవసరమైతే వాళ్ళకు డబ్బు ఇచ్చి, హితబోధలు చేసి పంపే వాడు. ఇందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గడమే కాక, ప్రజలకు తమ రాజుపై అంతులేని భక్తి గౌరవాలు కలిగాయి. కాశీరాజ్యానికి సమీపంలో వున్న కోసల దేశపు మంత్రికి, కాశీరాజు మంచితనం ఆయన బలహీనతగా తోచింది.
కాశీరాజ్యాన్ని సులు వుగా గెలవవచ్చునని దుర్బుద్ధి పుట్టింది. ఆయన తన రాజుతో, ‘‘కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు. అతను బందిపోటు దొంగ లనూ, హంతకులనూ సయితం దండించ డానికి వెనకాడతాడు. అటువంటి పిరికివాణ్ణి, మనం సునాయూసంగా జయించవచ్చు,'' అని చెప్పాడు.
ఇది నిజమో కాదో తెలుకుకోడానికై, కోసలరాజు తన సైనికులను కొందరిని పిలిచి, ‘‘మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవే శించి, గ్రామాలను కొల్లగొట్టి రండి,'' అని ఆజ్ఞాపించాడు. కోసల సైనికులు, కాశీరాజ్య గ్రామాల మీదికి వచ్చి పడగానే, అక్కడి ప్రజలు కలిసి కట్టుగా వాళ్ళను ఎదిరించి పట్టుకుని, తమ రాజైన శీలవుడి దగ్గిరకు తీసుకుపోయూరు.

‘‘మీరు విదేశీయుల్లాగా వున్నారు. మా గ్రామాలను కొల్లగొట్ట రావడానికి కారణం ఏమిటి?'' అని రాజు శీలవుడు వాళ్ళను ప్రశ్నించాడు. ‘‘మహారాజా, మాకు తిండికి జరగక, ఇలా చేయవలసి వచ్చింది,'' అన్నారు కోసల సైనికులు. ‘‘మీకు తిండికే అంత ఇబ్బందిగా వుంటే, నన్నడగక పోయూరా?'' అని శీలవుడు తన ధనాగారం నుంచి డబ్బు తెప్పించి, వాళ్లకు ఇచ్చి పంపివేశాడు.
శీలవుడి ఈ ప్రవర్తన చూసి కాశీరాజుకు కొంత ధైర్యం కలిగింది. అయినా, మరొకసారి పరీక్షించి చూద్దామని అతడు, ఈసారి ఎక్కువ మంది సైనికులను, కాశీరాజ్యపు నగరాల మీదికి దోపిడీకి పంపాడు. వాళ్ళు సరిహద్దు గ్రామాలు దాటుతూండగా, కాశీరాజ్య ప్రజ లకు దొరికిపోయూరు. ఈసారి కూడా శీలవుడు బంధితులైన సైనికులను శిక్షించకుండా, కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు. దీనితో కోసల రాజుకు ఎక్కడలేని ధైర్యం కలిగింది. ఆయన తన సైన్యాలతో కాశీరాజ్యం పైన యుద్ధానికి బయలుదేరాడు.
ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులూ, సేనాపతులూ శీలవుడి దగ్గిరకు వచ్చి, ‘‘మహారాజా, కోసలరాజుకు మన శక్తి తెలియదులా వుంది. మహాదర్పంగా మనపైకి యుద్ధానికి వస్తున్నాడు. అతణ్ణి ఎదుర్కు నేందుకు, సైనిక సమీకరణకు అనుజ్ఞ ఇవ్వండి,'' అని కోరారు. శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తలపం కిస్తూ, ‘‘అనవసర రక్తపాతం వద్దు. వాళ్ళకు కాశీరాజ్యం కావాలని వుంటే, అలాగే తీసుకో నివ్వండి. వాళ్ళ కోసం కోట తలుపులు తెరిచి వుంచండి,'' అన్నాడు.
ఆయన ఒక దూత ద్వారా కోసల రాజుకు, ‘‘మీరు శత్రువులుగా రానవసరం లేదు. మిత్రులుగానే రావచ్చు,'' అని వర్తమానం పంపాడు. ఈ వర్తమానాన్ని కోసల రాజు, శీలవుడి దౌర్బల్యంగా భావించాడు. అమితోత్సాహంతో కాశీరాజ్యం మీదికి బయలుదేరాడు. సద్వర్తనా, రాచమర్యాదలూ ఎరగని కోసల రాజు తన బలగంతో, కాశీరాజు సభా మంది రంలో ప్రవేశిస్తూనే, శీలవుణ్ణీ, మంత్రులనూ పెడరెక్కలు విరిచి కట్టమని సైనికులను ఆజ్ఞాపించాడు.

‘‘అతిథులు ఇలా ప్రవర్తించడం ధర్మం కాదు,'' అన్నాడు శీలవుడు. ఆ మాటలకు కోసల రాజు వికటంగా నవ్వాడు. అతడు ఆజ్ఞాపించగానే సైనికులు శీలవుడూ, ఆయన మంత్రులూ ధరించే లాంఛనాలను తీసివేశారు. శీలవుడూ, ఆయన మంత్రులూ సాయం కాలంలోగా కాశీనగరం విడిచి, అరణ్య మార్గం పట్టి పోసాగారు. కొంత సేపటికి చీకటి పడింది. అందరూ అరణ్యంలోనే చెట్ల కింద పడుకున్నారు.
వారికా రాత్రి భోజనం కూడా లేదు. అర్ధరాత్రివేళ వారికి నిద్రాభంగమైంది. ఏమిటా అలజడి అని లేచి కూర్చుంటూ చూస్తూండగానే చాలామంది దొంగలు కాగ డాలు పట్టుకుని అక్కడికి వచ్చారు. వాళ్ళు, రాజు శీలవుడితో, ‘‘మహారాజా, మేము దొంగలం. తమ దయవల్ల ఇంతకాలంగా మేము దొంగతనాలు చెయ్యకుండా జరిగి పోయింది. కాని, నేటి నుంచి మా కష్టాలు ఆరంభమౌతున్నవి.
అందుచేత మేం ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి, ఈ సొత్తంతా దొంగి లించి తెచ్చాం. ఇదిగో, మీ దుస్తులూ, లాంఛ నాలూ, ఖడ్గాలూ! ఇది మీకోసం తెచ్చిన రాజ భోజనం. మీరు ముందుగా రాజోచితమైన దుస్తులు ధరించి, భోజనం చేసి, తరవాత మేం తెచ్చిన ఈ ధనమంతా ఏం చేయమంటారో సెలవియ్యండి,'' అన్నారు. శీలవుడూ, ఆయన మంత్రులూ భోజ నాలు చేసి తమ, తమ దుస్తులు ధరించారు. తరవాత శీలవుడు దొంగలతో, ‘‘కొత్తరాజు, మీ సమస్యను ఎట్లా పరిష్కరించేదీ తెలుసు కోవడం మంచిది.

అది తెలుసుకోకుండా ముందుగానే మీరిలా దొంగతనాలకు పాల్ప డడం మంచిది కాదు. ఈ ధనమంతా తీసుకు పోయి రాజుకు ఇచ్చి, ఆయన మీ బతుకు తెరువుకు ఏం చేయమంటాడో అడగండి,'' అన్నాడు. ‘‘ఆతిథ్యం ఇచ్చిన వారిని, పచ్చిదారి దొంగలా దోచిన వాడికి న్యాయబుద్ధి వుండదు. మాకా నమ్మకం ఇసుమంత కూడా లేదు. మహారాజా! మే మా నీచుడి దగ్గిరకు వెళ్లం. మీరే, మాకు ఎప్పటికీ మహారాజులు,'' అన్నారు దొంగలు.
‘‘ఆ కొత్తరాజు దగ్గిరకు మీరు వెళ్ళక పోతే, ఈ ధనం తీసుకుని నేనే ఆయన దగ్గిరకు వెళతాను,'' అన్నాడు శీలవుడు. ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి, మర్నాడు ఉదయూనికల్లా రాజసభ చేరుకున్నాడు. శీలవుణ్ణి చూడగానే కోసలరాజు నిర్ఘాంతపోయూడు. శీలవుడు జరిగినదంతా చెప్పి, ‘‘మహా రాజా, నాకన్నా ప్రజలను మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా, మీరు నన్ను వెళ్ళ గొట్టి, నా సింహాసనం ఆక్రమించుకున్నారు?
అమాయకులైన దొంగలు, ఈ సంగతి గుర్తిం చక, తమ పరిపాలనలో జరుగుబాటుం డదని భయపడి, రాత్రి తమ ఖజానా దోచారు. వారి సమస్యలను, నా కన్నా మీరు మరింత న్యాయసమ్మతంగా పరిష్కరిస్తారని అభయం ఇచ్చి, మీ సొత్తు, మీకు ఒప్పగించ వచ్చాను. ఇంతకన్న, ఈ రాజ్యంలో నాకు వేరే పని లేదు,'' అన్నాడు. ఈ మాటలతో కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది.
ఆయన సింహాసనం మీది నుంచి లేచి వచ్చి, శీలవుడి కాళ్లపై బడి, ‘‘మహాత్మా, దొంగలు సయితం ప్రేమించే మీ మహిమా, సద్వర్తనా గ్రహించలేక, నీచుడైన నా మంత్రి సలహా విని, తమ పట్ల తీరని ద్రోహం చేశాను. నన్ననుగ్రహించి, మీ రాజ్యం మీరు ఏలుకోండి, మీ మైత్రి చాలు; మీ రాజ్యం నాకక్కరలేదు,'' అన్నాడు. శీలవుడు తిరిగి కాశీ రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు. ఆయన కోసలరాజుకు అన్ని మర్యాదలూ చేసి, అతణ్ణి అతడి రాజ్యానికి పంపివేశాడు.

సూర్యునితో పందెం

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు, చిత్రకూట పర్వత ప్రాంతాన తొంభైవేల హంసలు నివసిస్తూ ఉండేవి. ఆ కాలమందే బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు. ఆ హంస అనేకమైన సుగుణాలతోపాటు అపరిమితమైన వేగం కలిగివుండటంచేత, తొంభైవేల హంసలకూ అది పెద్ద అయింది. ఇన్ని ఉత్తమ గుణాలూ, శక్తులూ వుండడం వల్ల ఆ హంసల పెద్దకు ‘రాజహంస' అని పేరు.
ఒకనాడు రాజహంస, తన గుంపుతో సహా, సరోవరంలో విహరించి నివాసానికి మర లుతూ, కాశీరాజ్యం గుండా రావడం తటస్థించింది. బ్రహ్మాండమైన ఆ పక్షుల గుంపును చూస్తే, కాశీరాజ్యమంతటా బంగారు చాందినీ పరిచినట్టుగా వుంది. కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు. ఆ పక్షులన్నిటిలోనూ, చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది.
ఆ రాజహంసలో మంచి ఠీవీ, తేజస్సూ మొదలైన రాజలక్షణాలు ఉండటం కాశీరాజు గమనించాడు. సేవకుల చేత దివ్యమైన పుష్పమాలికలూ, పూజాద్రవ్యాలూ తెప్పించి, వాటితో రాజహంసకు స్వాగత మిచ్చాడు. ఘనమైన ఆ స్వాగతాన్ని ఆప్యాయతతో అందుకొన్నది రాజహంస. తన పరివారంతో సహా కొన్నాళ్ళు అక్కడ వుండి, కాశీరాజు ఆతిథ్యం పొంది, నివాసానికి మరలిపోయింది. ఆ క్షణం నుంచీ కాశీరాజుకు రాజహంసపైన గల మమత మరింత అతిశయింప సాగింది. ఇప్పుడాయన మనస్సంతా రాజహంసపైనే ఉంటున్నది. అహర్నిశలు దానిని గురించే తలంపు.

ఏ క్షణమందు ఏ దిశ నుంచి ఆ రాజహంస వస్తుందో అని వెయ్యి కళ్ళతో కనిపెట్టి చూస్తూ వుండేవాడు. ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంత మందలి హంసలలో రెండు చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి, ‘‘రాజా! మా ఇద్దరికీ ఎంతో కాలంగా సూర్యునితో పందెం కడదామని సరదాగా వుంది,'' అంటూ, వాటి మనస్సులోని ఉద్దేశం వెల్లడించినై. ఈ మాటకు రాజహంస, ‘‘ఓసీ, కూనల్లారా! సూర్యుడితో ఏమిటి, మీరు పందెం కట్టడ మేమిటి? విడ్డూరం! సూర్యుని వేగం ఎంతటిదో మీకు తెలియదు.
కనుకనే అజ్ఞానంలో పడ్డారు. మీరు ఆయనతో పరుగెత్తలేరు సరికదా, పందెంలో మీకు ప్రమాదమూ, ప్రాణాపాయమూ కూడా కలగవచ్చు. అందుచేత ఇంతటితో మీరిద్దరూ మీ పిచ్చి ఊహలు కట్టిపెట్టండి,'' అని నెమ్మదిగా హితవు చెప్పింది. హంసపిల్లలకు ఈ హితవు నచ్చలేదు. మళ్ళీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరినై. ఈసారీ అలానే చెప్పింది రాజహంస. అంతటితోనైనా ఊరుకోకుండా మూడో సారి పోయి మళ్ళీ అడిగినై పిల్లలు.ఈమారూ రాజహంస అంగీకరించలేదు.
ఇది పని కాదని తలచి, తమ సత్తువ తెలియని హంసపిల్లలు రెండూ, యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయినై. ఈ శిఖరం సూర్యమండలాన్ని తాకుతున్నదా అనిపించేటంత ఎత్తయింది. కనుక ఆ పెద్ద పర్వత శిఖరం మీద చేరి, సూర్యునితో పందెం వేద్దామని హంసపిల్లలు అనుకున్నవి. యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా రెండు హంసలు తగ్గినై. జరిగిన సంగతి గ్రహించి, అది ఎంతగానో విచారించింది.
వాటిని ఎలా ఐనా రక్షించాలనుకున్నది. వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకుని, హంసపిల్లలకు తెలియని విధంగా ఒకచోట కూర్చున్నది. సూర్యోదయం కాగానే హంసపిల్లలు సూర్యునితోపాటు, ఎగరసాగినై. రాజహంస కూడా వాటిని అనుసరించింది. హంసపిల్లలు రెండింటిలో చిన్నది మధ్యాహ్నం వరకూ ఎగిరి, రెక్కలలో మంటపుట్టి, సోలి పడిపోయింది.

పడి పోయేట ప్పుడు దానికి రాజహంస కనబడగా, ‘‘రాజా! నావల్ల కాలేదు. ఓడిపోయూను...'' అన్నది నిస్పృహతో. అప్పుడు రాజహంస, ‘‘ఫరవాలేదు, నేనున్నానుగా!'' అంటూ దానిని రెక్కలపై కెక్కించుకుని వచ్చి తమ నివాసస్థానంలో తక్కిన గుంపుతో చేర్చింది. మరి కొంచెం సేపటికి రెండవ హంసపిల్లకు కూడా రెక్కలలో సూదులు పొడిచినట్టు బాధకలిగి, సోలిపోయింది. అదీ రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది.
దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి, రెక్కలపై ఎక్కించుకొని, తమ నివాస స్థానమైన చిత్రకూటం చేర్చింది. ఈ విధంగా తన పరివారంలోని రెండు పక్షులు ఓడిపోవటం సహించలేక, రాజహంస తనే పందెం వేయూలని బయల్దేరింది. చెప్పనలవికాని సహజ వేగం గల రాజహంస ఎగరడం ప్రారంభించిన కొద్ది సేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవడం, దాటిపోవడమూ కూడా జరిగింది! సూర్యుని సత్తువ ఎంతటిదో చూదామనుకొన్నది కాని, రాజహంసకు పందెం ఎందుకు? దీనివల్ల దానికి కలిసివచ్చే దేమిటి? కనుక, ఇష్టం వచ్చినట్టు కొంచెం సేపు చుట్టి చుట్టి, చివరకు అలసటచేత భూలోకానికి దిగివచ్చి, కాశీరాజ్యం చేరుకున్నది.
కన్నులు కాయలు కాచేటట్టు కనిపెట్టుకునివున్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయూడు. రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి, బంగారు పళ్ళెంతో పాయసం, బంగారు కలశంతో చల్లటి పానకం తెచ్చి దానిముందు పెట్టాడు. అది కొంచెం స్థిమితపడ్డ తరువాత రాజు కుశలప్రశ్నలు ప్రారంభించాడు. జరిగిందంతా వివరించింది రాజహంస. అది చెప్పినదంతా విన్న రాజు, ‘‘పక్షి రాజా! సూర్యునితోనే పందెం కట్టి, అతనిని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో చూడవేడుకగా వున్నది,'' అన్నాడు.
అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలిచి, ‘‘రాజా! నీ రాజ్యంలో, మెరుపు మెరిసేటంతకన్న వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు వుంటే, వారిలో నలుగురిని ఇక్కడికి రప్పించు,'' అన్నది. రాజు విలుకాండ్రను పిలిపించాడు.

ఉద్యానవనంలో ఒక నలుచదరపు స్తంభం ఉన్నది. విలుకాండ్రు నలుగురినీ ఆ స్తంభం నాలుగువైపులా నించో బెట్టింది రాజహంస. తరవాత తన మెడకు ఒక గంట కట్టుకుని, స్తంభం పైన కూర్చుని, ‘‘నేను సంజ్ఞ చేయగానే మీరు నలుగురూ బాణాలు వదలండి. నేను ఎగిరి వెళ్ళి, మీ ఒక్కొక్కరి బాణమే తెచ్చి మీ ముందు పెడతాను. ఐతే, నా మెడలో ఉండే గంట చప్పుడువల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు గాని, నన్ను కంటితో చూదామంటే ఎంతమాత్రం సాధ్యం కాదు,'' అని చెప్పింది.
ఆ ప్రకారమే, మెరుపు మెరిసేటంతలో విలుకాండ్రు వదిలిన నాలుగు బాణాలూ తెచ్చి రాజహంస, వాళ్ళ ముందు పెట్టింది. రాజూ, పరివారమూ ఆశ్చర్యభరితులయ్యూరు. ‘‘రాజా! చూశావా నా వేగం! ఇది, నేను అతి మెల్లగా ఎగిరినప్పటి కనీసపు వేగం అన్నమాట. దీన్నిబట్టి అసలు, వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు,'' అన్నది. ఆత్రంతో రాజు, ‘‘పక్షిరాజా! నీ వేగం ఎటువంటిదో మచ్చు చూడగలిగాము. మరి, ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉన్నదా?'' అని ప్రశ్నించాడు.
అందుకు రాజహంస, ‘‘లేకేమి! నేను నా శక్తి అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ, నా కంటె వెయ్యి రెట్లు వేగంతో పరుగుతీసే మహాశక్తి ఒకటి ఉన్నది. అదే కాలం అనే సర్పం! ఆ కాలసర్పం అనుక్షణమూ ఈ ప్రపంచ మందలి జీవులను వర్ణింప తరంకాని ప్రచండ వేగంతో నాశనం చేస్తున్నది...'' అని చెప్పేసరికి, రాజు భయంతో కంపించిపోయూడు. అప్పుడు రాజహంస రూపంలో వున్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు:
‘‘రాజా! కాలసర్పం ఒకటి ఉన్నదన్న మాట గుర్తుంచుకొన్నవాళ్ళకు భయపడ వలసినపనే లేదు. నీతిమంతుడివై, ధర్మాత్ముడివై, పరిపాలన సాగించేటంతవరకూ నీకు ఎవ్వరివల్లనూ ఎట్టి భయమూ లేదు. కనుక నీ విధులు నువ్వు సక్రమంగా నెరవేర్చుకో.'' బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలనచేసి, గొప్పకీర్తి గడించాడు.

అనాదరణీయుడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు, ఆయన వద్ద పండితా మాత్యుడుగా వుండేవాడు. ఒక సందర్భంలో కాశీ రాజైన బ్రహ్మదత్తు డికి తన కుమారుడిపై కోపం కలిగి, అతన్ని రాజ్యం నుంచి వెళ్ళ గొట్టాడు. రాజుకొడుకు, భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలాకాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు. నిలిచే నీడలేకా, తినడానికి తిండిలేకా భర్త కష్టాలనుభవిస్తూంటే, మహా సాధ్వి అయిన ఆయన భార్య కూడా కష్టా లన్నిటినీ అనుభవించింది.
ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయూడు. ఆ కారణంగా ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావడానికి అడ్డంకి తొలగిపోయింది. తండ్రి చనిపోయినట్టు తెలియగానే, రాజు కొడుకు పరమాందభరితు డయ్యూడు. ఎప్పుడు కాశీ చేరదామా, ఎప్పుడు సింహాసనం మీద కూచుందామా అన్న ఆదు ర్దాలో, కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమంగా నడవలేదనీ, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే, ఆమె కష్టసుఖాలు తను గమనించాలనీ, ఆ మూఢుడికి తోచలేదు.
అందుచేత రాజు కొడుకు ఆహార విశ్రాంతులు కూడా పాటించ కుండా రాత్రీ పగళ్ళు తాను నడిచి, భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. ఆకలితోనే నడిచి, నడిచి వారిద్దరు ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు వీరి దుస్థితి చూసి, ‘‘ఇంత భోజనం పెడతాం, మూట కట్టుకుపోయి తినండి,'' అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒక చోట ఉండమని చెప్పి, భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు.
అతడికి వాళ్ళు ఇద్దరికి సరిపడే ఆహారం ఆకులో కట్టి ఇచ్చారు. దాన్ని తీసుకుని రాజుకొడుకు భార్య వున్న చోటుకు తిరిగి వస్తూ, ఇలా ఆలోచించాడు: ఈ భోజనం, తనూ భార్యా కలిసి తింటే, మళ్ళీ రెండో పూటకే ఆకలి వేస్తుంది. తాను కాశీకి చేరడం ప్రధానం గాని, తన భార్య చేరడం ప్రధానం కాదు.

తాను త్వరత్వరగా ప్రయూణం సాగించడానికి, ఆమె అసలే ప్రతిబంధకంగా వున్నది. అందుచేత ఏదైనా ఉపాయం చేసి,ఈ ఆహారమంతా తానే తినె య్యూలి! ఇలా ఆలోచన చేసి, ఆ నీచుడు భార్య వున్న చోటుకు వెళుతూనే, ‘‘నువ్వు ముందు నడుస్తూ వుండు. నేను కాలకృత్యాలు ముగించుకుని కొంచెం వెనగ్గా వచ్చి కలుసు కుంటాను,'' అన్నాడు. అతడి భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందు పోసాగింది. ఆమె వెళ్ళగానే వాడు ఆహారమంతా తానే తిని, ఆకులన్నీ వదు లుగా పొట్లం చుట్టి, భార్యను చేరుకున్నాడు.
భార్య చేతిలో వున్న పొట్లం కేసి చూసేంతలో కోపం నటిస్తూ, ‘‘ఈ ఊరి వాళ్ళెంత మోస గాళ్ళో చూడు! ఉత్త ఆకులు పొట్లం కట్టి, ఆహారమంటూ ఇచ్చారు,'' అన్నాడు. అతడి భార్యకు నిజం తెలిసినా, భర్త మీది గౌరవం కొద్దీ ఏమీ అనకుండా వూరుకున్నది. మరి కొంత కాలం ప్రయూణం చేసి వారు, కాశీ చేరారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం జరిపించుకుని, కాశీ రాజైనాడు.
రాజయ్యూక అతడికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకుండా పోయింది. తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు, తన సుఖాలలో భాగ మివ్వాలని అతనికి తట్టనేలేదు. ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో, సరిగా భోజనం చేసిందో లేదో - రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్ట కాలం తీరిపోయినా, పూర్వంలాగే విచార సము ద్రంలో మునిగి వుండసాగింది. రాజు వద్ద పండితామాత్యుడుగా వుంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి, ఒకసారి ఆమెను చూడ బోయూడు.
రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. ‘‘అమ్మా, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతు లిచ్చారు. కాని, నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకూ ఏ విధమైన బహుమతీ ముట్టలేదు,'' అన్నాడు బోధిసత్వుడు. ‘‘బాబూ, నేను పేరుకు రాణినేగాని, వాస్త వానికి అంతఃపుర దాసీలకూ, నాకూ తేడా ఏమీ లేదు.
రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి, ఎలాటి రాణి అనిపించు కుంటుందో, పండితామాత్యులైన మీరే చెప్పండి?'' అంటూ రాణి, మార్గంలో గ్రామ స్థులిచ్చిన ఆహారం తన భర్త తన వంతు తనకు పెట్టకుండా ఏవిధంగా తినేసిందీ చెప్పింది.

 ‘‘ఇప్పుడైనా, నా భర్త నేను సుఖపడుతు న్నానో లేదో విచారించడు. నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచిబట్ట కడుతున్నానా అన్న ఆదుర్దా కూడా ఆయనకు లేదు,'' అని రాణి కంట నీరుపెట్టుకున్నది. ‘‘అమ్మా, చింతించకు. ఈ విషయం నీ నోట తెలుసుకునేందుకే, వచ్చాను. రేపు నిండు సభలో నిన్ను నేను ఇప్పుడడిగిన మాటలే అడుగుతాను.
నువ్వేమాత్రం జంకక ఇవే సమా ధానాలు చెప్పావంటే, నీకీ విచారం లేకుండా నే చూస్తాను,'' అన్నాడు పండితామాత్యుడు. మర్నాటి సభకు రాణీ కూడా వచ్చింది. ఆమెను చూసి బోధిసత్వుడు, ‘‘రాణీగారు రాజ్యానికి వచ్చాక భృత్యుల విషయం పట్టిం చుకోవడమే లేదు,'' అన్నాడు. రాణి పూర్వం పండితామాత్యుడికి చెప్పిన విషయూలన్నీ సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయటపెట్టేసరికి, రాజుకు సభికులలో తీరని తలవంపులయింది.
రాణి మాట్టాడడం పూర్తి కాగానే పండితా మాత్యుడు, ‘‘రాజుగారికి నీ పట్ల ఆదరం లేనప్పుడు, నువ్వాయనను అంటిపెట్టుకుని ఉండడం అనవసరం. చజే చజంతం, వణం న కయిరా; ఆపేత చిత్తేన న సంభజేయ్య; ద్విజో దుమం భీణ ఫలంతి ఞత్వా; అంఞం సమేక్ఖేయ్య, మహాహె లోకే. (విడిచినవాణ్ణి విడిచిపుచ్చు, అలాటి వాడి స్నేహం ఆశించకు; ఆపేక్ష లేనివాడి పట్ల ఆదరభావం చూపకు.
పక్షి ఫలాలు లేని చెట్టును విడిచి ఇతర చెట్లు చూసుకుం టుంది. లోకం సువిశాలమైనది.) అందుచేత నువ్వు, ఈ రాజభవనం విడిచి విశాల ప్రపంచంలోకి పోయి, ఆదరం లభించే చోట సుఖజీవనం గడపడం మంచిది,'' అన్నాడు. వెంటనే రాజు సింహాసనం నుంచి దిగి వచ్చి, ఆయన కాళ్ళపైబడి, ‘‘పండితామాత్యా, నా తప్పు క్షమించండి! ఇక ముందు నా భార్య పట్ల ధర్మంగా ప్రవర్తిస్తాను,'' అన్నాడు. ఆనాటి నుంచి రాజు రాణిని ఆదరంతో చూడసాగాడు.

పడబుద్ధి

బహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ‘వేదభం' అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయంలో, ఆకాశంవంక చూస్తూ ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్టయితే, సరాసరి ఆకాశం నుంచిబంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం-ఈ ఏడు వస్తువులూ వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఆ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు, ఆయనకు ప్రియశిష్యుడయ్యూడు.
ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో ఐదువందలమంది గజదొంగలున్నారు. వాళ్ళు గురు, శిష్యులిద్దరినీ అటకాయించారు. ఐతే, ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి వున్నది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్టయితే ఇంటికిపోయి శిక్షారుసుము తెచ్చి తోటివాడిని విడిపించుకోవటానికి అవకాశ మిచ్చి, అందులో ఒకడిని వదిలేస్తారు.
ఆ వచ్చిన బాటసారులు తండ్రీ, కొడుకులైతే తండ్రిని పోయి రమ్మని చెప్పి, రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశ మిస్తారు. అలానే, తల్లీ కూతురూ ఐతే తల్లినీ, సోదరులైతే అందులో ఒకణ్ణీ, గురు శిష్యులైతే శిష్యుణ్ణీ-ఇలా వదిలిపెట్టడం వాళ్ళకు మామూలు. ఇప్పుడా వింతదొంగలు బ్రాహ్మణ్ణి తమవద్ద అట్టేపెట్టుకుని, శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయి రమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. ‘‘గురువర్యా! భయపడకండి. ఒకటి రెండు రోజులలో తప్పక తిరిగి వచ్చేస్తాను.

ఐతే, నా మనవి మటుకు ఒక్కటి వినండి: ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాలవర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకూ, ఈ దొంగలకూ కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది,�� అని మరిమరి చెబుతూ, బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. పుచ్చ పువ్వులాటి వెన్నెల కిరణాలను వెదజల్లుతూ పున్నమిచంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు.
బ్రాహ్మడు పైకి చూసి, గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. ��దొంగల బారిని పడి, చేతకానివాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేననుభవించాలి? చేతిలో వున్న మంత్రాన్ని పఠించి, కనక వర్షం రప్పించి, దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి, విడుదలవుతాను. స్వేచ్ఛ పొంది సుఖంగా వుంటాను,�� అనుకున్నాడు. తరవాత బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరబిలిచాడు. ��మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి!�� అన్నాడు.
��అయ్యూ, ఇంకెందుకు? డబ్బు కోసం!�� అన్నారు వాళ్ళు. ��అంతేకదా! అలా ఐతే నేను చెప్పినట్టు చేయండి, మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పెయ్యండి. నాకు శుభ్రంగా స్నానం చేయించండి. నూతన వస్త్రాలు కట్టబెట్టండి. పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి. నా చుట్టూ పరిమళ ద్రవ్యాలూ, ధూప దీపాదులకు కావలసిన సామగ్రులూ అమర్చిపెట్టండి. అటుపైన ఏం జరుగుతుందో చూడండి!�� అని బ్రాహ్మడు చెప్పాడు. అక్షరాలా ఆ బ్రాహ్మడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు.
తరవాత ఆయన అదును చూసి, ఆకాశం వంక దృష్టి నిలిపి, వేదభ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువ గల లోహాలూ, మణులూ వర్షించినై! దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకొని వాళ్ళ దారిని వాళ్ళు పోయూరు. వాళ్ళ వెనకనే బ్రాహ్మడూ వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి, మొదటి గుంపును ఎదుర్కొన్నది.

ఎందుకయ్యూ, మీరు మమ్మల్ని పట్టుకుంటారు? అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు, డబ్బుకోసం! అన్నారు. అంతేకదా! డబ్బుకోసమే ఐతే, ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించండి. ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు, విలువ గల రత్నాలూ, మణులూ వర్షిస్తాయి. అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు, అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయూరు. ఇప్పుడు రెండవ దొంగలజట్టు బ్రాహ్మణ్ణి వదలక పట్టుకుంది.
మాకు కూడా ధనమియ్యవయ్యూ, బ్రాహ్మడా! అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు బ్రాహ్మడు, అయ్యలారా! ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రమహిమవల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ ఒక యేడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పని చేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియడం అదీ, చాలా గొడవ వున్నది. దానివల్ల ఇప్పటికి ప్రయోజనం కలగదు కనుక, ఒక్క ఏడాది అయ్యే సరికి, గ్రహాలు కూటమవుతై; అప్పుడు నా మంత్రం జపించి, మీకు కనకవర్షం కురిపిస్తాను, అన్నాడు.
బ్రాహ్మడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్ళను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేం అడిగితే ఏడాదివరకూ కనిపెట్టుకు ఉండమంటావా, అబద్ధాలకోరా! అంటూ పదునైన కత్తి పుచ్చుకుని బ్రాహ్మణ్ణి నిలువునా రెండు ముక్కలుగా చీల్చి వేశారు! అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఆ తరవాత గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి, అందరినీ చంపి, వాళ్ళదగ్గిర వుండే ధన ద్రవ్యాలను అపహరించారు.
అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో రెండు కక్షలు ఏర్పడినై. ధనంకోసం రెండు కక్షలవాళ్ళూ పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం ఒక వంద మంది నరుక్కుచావగా చివరకు ఇద్దరే ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ వుండగా, రెండవవాడు తినుబండారాలు తేవటానికని దాపున వున్న ఊళ్ళోకి వెళ్ళాడు.

ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, ��నా నేస్తం వస్తే, అయూచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే, ఎలా?�� అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావటానికి వెళ్ళిన ఆ దొంగ, ��వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుందిగా! కుబేరుడినయిపోవచ్చుకదా!�� అని అనుకొని, తనవంతు పదార్థాలు కేటాయించుకుని, తక్కిన భాగంలో విషం కలిపివేశాడు.
వాడు పదార్థాలు చేతపట్టుకొని తన బసచేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పీకతెగవేసి, కళేబరం దూరంగా విసిరి వేశాడు! తరవాత విషం కలిసిన తినుబండారాలు తిని, చివరకు వాడూ ప్రాణాలు విడిచాడు! ఈ విధంగా బ్రాహ్మడూ, బ్రాహ్మడితో పాటు దొంగలూ అంతా, కలిసి మొత్తంగా చచ్చి వూరుకున్నారు. ఒకటి రెండు రోజులలో బోధిసత్వుడు దొంగల కీయవలసిన రుసుము చేత పట్టుకు వచ్చాడు.
గురువుకోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే! ఎక్కడ చూసినా కళేబరాలే! అప్పుడిలా అనుకున్నాడు బోధిసత్వుడు, ��ఈ బ్రాహ్మడు నా మాట చెవిని పెట్టలేదు. తనకు తోచినంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి, రత్నాలవర్షం రప్పించే వుంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చివుంటారు,�� అని తలిచి, బాటవెంబడే చూసుకుంటూ పోసాగాడు.
కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. ��అయ్యో! గురువర్యా, నా మాట విన్నావు కాదుకద! ఎంతటి దుర్గతి పాలయ్యూవు!�� అంటూ అతను వాపోయూడు. చితుకులు పోగుచేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు సలిపాడు. అడవిపువ్వులు పట్టుకువచ్చి ఆ స్థలమందు వుంచి, భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు.
అక్కడినుంచి ఇంకా అలా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని కొందరి శవాలూ కంటపడినై. మరి కొంత దూరంలో రెండవ జట్టులో వుండే దొంగల కళేబరాలు పడివున్నయి. రెండు తప్ప, బోధిసత్వుడికి తను చూసివున్న అందరి కళేబరాలూ లెక్కకు సరీగా కనిపించినై.

ఐతే ఆ ఇద్దరూ ఎక్కడికి తప్పించు కుపోయూరా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి, ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించినై. తప్పిపోయూరనుకొన్న ఇద్దరు దొంగల లోనూ ఒకడి కళేబరం కనిపించింది. ఐతే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర వున్నది. ��ఓహో, ఇదా సంగతి!�� అని అనుకొన్నాడు బోధిసత్వుడు.
ఇంకా నాలుగడుగులు వేసే సరికి ఒక మూల ఆ మిగిలివున్న దొంగ కళేబరం వేలాడదీయబడి వున్నది. ఇంకిప్పుడు ఎవరూ చెప్పనక్కరలేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరివరకూ అవగాహనై పోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. ��నా మాట పాటించాడు కాదు గురువుగారు. అంతగా చెప్పి పోయినా, పెడచెవిని పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు.
ఇందుకు ఫలితం? తనూ నాశనమయ్యూడు, తనతో పాటు చాలా మంది జనమూ చావటానికి కారకుడయ్యూడు. వివేకవంతుల మాట వినక, తమకు తోచిందే మంచిదని అనుకొని పనులు చేసేవాళ్ళకు ఇటువంటి శాస్తిజరిగే తీరుతుంది. ��నా గురువుగారు తన మంత్ర మహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధనసంపద మానవకోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికీ, అంతులేని వినాశానికీ దారి తీసింది.
కనుక, బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువులవల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువులో లేదు, బుద్ధిలో వుంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో పోదు. మరి ఎంతమందినో నాశనం చేస్తేగాని ఆ అగ్ని చల్లారదు,�� ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు.
తన గురువుగారిని ఉదాహరణగా చూపి, అందరకూ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తరువాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి, అదంతాలోకోపకారం కోసం వినియోగించి, అవతారం చాలించాడు.

గురువుబాధ్యత

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడుగా జన్మించాడు. తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికిగాను, ఆయన వద్దకు పంపటం మంచిదని నిర్ణయించాడు. రాజు, తన కుమారుడికి ఒక జత ఆకు జోళ్ళూ, ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి, ‘‘నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి, అక్కడి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి, విద్య పూర్తికాగానే తిరిగిరా!
ఆయనకు గురు దక్షిణగా ఇవ్వటానికి వెయ్యి వెండి కాసులు వెంట తీసుకుపో,'' అన్నాడు. రాజకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి, వెయ్యి కాసులుగల మూట మోస్తూ, ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ, నానా అగచాట్లు పడి, తక్షశిల చేరాడు. అక్కడ అతడు శిల్పాచార్యుణ్ణి దర్శించి, తాను వచ్చిన పని చెప్పి, ఆయనకు వెయ్యి వెండికాసులూ గురుదక్షిణగా ఇచ్చి, ఆయన వద్ద విద్యా భ్యాసం ప్రారంభించాడు. అతడి శిల్పవిద్య బాగానే సాగింది.
అతడి తెలివి తేటలకు గురువు చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచింది. గురు శిష్యులు ప్రతి ఉదయమూ ఊరి వెలుపల వున్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూండేవారు. ఒకనాడు వారు స్నానంచేసే సమయంలో, ఒక ముస లమ్మ కొన్ని నువ్వులు తెచ్చి, నీటిలో కడిగి శుభ్రం చేసి, నది ఒడ్డున వస్ర్తం పరిచి, దాని మీద ఆరబోసింది. రాజకుమారుడు నువ్వులను చూసి, చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి, ముసలావిడ పరధ్యానంగా వున్నట్టు కనబడిన సమయంలో, గుప్పెడు నువ్వులు తీసి నోట పోసుకున్నాడు. అయితే, ముసలమ్మ ఇది గమనించింది, కాని ఏమీ అనలేదు. 

మర్నాడు కూడా అలాగే జరిగింది. మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్టు వూరుకున్నది. మూడోనాడు కూడా అలాగే జరిగింది. కుర్ర వాడి దొంగబుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది. ఆమె, శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, ‘‘చూడండి, మూడు రోజు లుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి తింటున్నాడు. నువ్వులు పోయూయని నాకు విచారం లేదు గాని, అతను దొంగబుద్ధులు అలవరుచుకోవటం అతనికీ మంచిది కాదు, మీ కీర్తికీ మంచిది కాదు.
ఇలా ఎన్నడూ చేయకుండా శిక్షించండి,'' అన్నది. ఇంటికి వెళ్ళగానే శిల్పాచార్యుడు, రాజ కుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి, అతడి వీపు మీద బెత్తంతో మూడు దెబ్బలు కొట్టి, ‘‘కూడని పని చేసినందుకు, నీకిది శిక్ష! ఇక ఎన్నడూ చెయ్యకు,'' అన్నాడు. రాకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే, అతను కాశీ రాజ్యం పొలిమేరల లోపల రాజకుమారుడు గాని, ఇక్కడ సామాన్య వ్యక్తి. దండించే అధికారం గురువుకున్నది.
‘‘నేను రాజునయ్యూక, ఈ దుర్మార్గుణ్ణి ఏదో మిష మీద కాశీ రాజ్యానికి పిలిపించి, తప్పక ప్రాణాలు తీస్తాను!'' అని రాజకుమారుడు అక్కసుకొద్దీ మనసులో గట్టిగా శపథం చేసు కున్నాడు. కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది. అతడు కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి, ఆయన ఆశీర్వాదం పొందాడు. తరువాత అతను గురువుతో, ‘‘ఆర్యా, నేను రాజునయ్యూక తమరు ఒకసారి తప్పక కాశీనగరానికి దయ చెయ్యూలి.
అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను,'' అన్నాడు. శిష్యుడి ఆహ్వానానికి గురువు చాలా సంతో షించి సరేనన్నాడు. కాశీరాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంత కాలా నికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యూడు. ఒకనాడతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు ఒక నౌకరును పిలిచి, ‘‘నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి, శిల్పా చార్యుణ్ణి కలుసుకుని, ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందజెయ్యి!'' అన్నాడు. శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే బయలుదేరలేదు.

 రాజు సంహాసనం ఎక్కిన మోజులో వుంటాడు. రాజ్యభారం ఎలాంటిదో తెలిసివచ్చాక చూద్దా మనుకున్నాడు. ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక, కాశీనగరానికి వెళ్ళి, రాజప్రాసా దంలో వున్న శిష్యుణ్ణి చూడబోయూడు. రాజు గారి గురువు వచ్చాడని సభాసదులు శిల్పా చార్యుడికి చాలా మర్యాద చూపించి, ఉన్న తాసనం ఇచ్చారు. గురువును చూసిన క్షణం నుంచీ రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగిపోతు న్నది. అతడు మాటల మధ్యలో గురువు కేసి తీక్షణంగా చూస్తూ, ‘‘ముష్టి నువ్వులు పిడి కెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి, చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా?'' అని అడిగాడు.
సభలో ఇంకెవరికీ అర్థంకాకుండా, శిల్పా చార్యుడికి చావుభయం కలిగించి, తరవాత వీలువెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు. అయితే, రాజు అనుకున్నట్టు శిల్పా చార్యుడు బెదరలేదు. పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం బయటపెట్టేశాడు: ‘‘ఓ రాజా! నువ్వు నా దగ్గిర శిష్యుడివిగా, నా బాధ్యత కింద వున్న సమయంలో నీ తాహతుకు తగనిపని చేశావు. శిష్యుడి దుష్ర్ప వర్తనను దండించి, సన్మార్గంలో పెట్టటం గురువు విధి.
నిన్నానాడు నేను దండించి వుండకపోతే, నువ్వీపాటికి కాశీరాజ్యానికి రాజుగా వుండటానికి మారుగా, దొంగవై వుందువు. బుద్ధిమంతులైనవారు, తప్పుచేసి నప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు, కృతజ్ఞత చూపుతారు!'' అన్నాడు శిల్పాచార్యుడు. అసలు విషయం సభవారందరికీ తెలిసి పోయింది. రాజుకు అవమానం అయింది. అతడు సింహాసనం దిగి గురువు కాళ్ళపై బడి, ‘‘మహానుభావా, మళ్ళీ తప్పుదారిన పడిన నా మనస్సును సరి అయిన దారిన పెట్టావు, కృతజ్ఞుణ్ణి!'' అన్నాడు.
రాజులో వచ్చిన మంచి మార్పుకు, సభా సదులతోపాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు. రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి, ఆస్థాన ఆచార్యు డుగా వుంటూ, రాజును సరి అయిన మార్గాన నడిపించాడు. 

కృతజ్నుడైన రాజు

కాశీరాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడుండేవాడు. అతడు చిన్నతనం నుంచీ బహుక్రూరస్వభావుడు. ఏ కారణమూ లేకుండానే దారేపోయే వాళ్ళను భటులచేత పట్టించి, నానా హింసలపాలుచేసి ఆనందించేవాడు. వృద్ధులపట్లా, పండితులపట్లా చిన్నమెత్తు గౌరవభావం లేకపోగా, అనవసరంగా వాళ్ళను అవమానిస్తూండేవాడు. ఈ కారణాల వల్ల, యువరాజన్న గౌరవభావం అతడి పైన ఎవరికీ వుండేది కాదు. అందరూ అతణ్ణి అసహ్యించుకునేవారు.

 అతడు ఇరవై ఏళ్ళ వయసువాడై వుండగా, కొందరు స్నేహితులతో కలిసి నదికి స్నానానికి వెళ్ళాడు. అతడికి ఈతరాదు. అందువల్ల గజ ఈతగాళ్ళయిన కొందరు నౌకర్లను వెంట తీసుకుపోయాడు. యువరాజూ, అతడి స్నేహితులూ నదిలో స్నానం చేస్తూండగా, హఠాత్తుగా ఆకాశాన్ని మేఘాలు కప్పి వేసినై. భయంకరమైన ఉరుములూ, మెరుపులతో జడివాన ప్రారంభమయింది. అది చూసి యువరాజు పట్టలేని ఆనందంతో చప్పట్లు చరిచి నౌకర్లతో, ``ఇలాంటి సమయంలో నది మధ్య స్నానం చేయడం చాలా బావుంటుంది. నన్ను అక్కడికి తీసుకుపొండి,'' అన్నాడు.

నౌకర్లు ఈ ఆజ్ఞ వింటూనే నదిలోకి దిగి, యువరాజును నది మధ్యకు తీసుకు పోయారు. అతడి స్నేహితులు మాత్రం జాగ్రత్తకొద్దీ గట్టు దగ్గిర అంతగా లోతులేని నీళ్ళలో వుండిపోయారు. ఉన్నకొందికీ వాన అధికం కాసాగింది. దానికితోడు కొద్దిగజాల దూరంలో ఏమున్నదీ కానరాకుండా, అంతటా చీకటి అలముకున్నది. నౌకర్లకు పరమ దుష్టుడైన యువరాజు మీద పగతీర్చుకునేందుకు, ఇది మంచి సమయంగా తోచింది. వాళు్ళ అతణ్ణి నది మధ్య అలాగే వదిలి, వేగంగా ఒడ్డుకు ఈదుకువచ్చేశారు.


``యువరాజేమయ్యాడు?'' అని అతడి స్నేహితులు నౌకర్లను అడిగారు. ``ఆయన, మా చేతుల పట్టు వదిలించుకుని, ఈదుతూ వెళ్ళాడు. బహుశా, వెంటనే రాజభవనానికి వెళ్ళాలన్న కోర్కె కలిగి వుంటుంది,'' అని జవాబు చెప్పారు నౌకర్లు. అందరూ తిరిగి వచ్చాక, రాజు తన కొడుకును గురించి నౌకర్లను అడిగాడు. వాళు్ళ, అతడి స్నేహితులకు ఇచ్చిన జవాబే ఇచ్చారు. వెంటనే రాజు సైనికులను పిలిచి, నదీ ప్రాంతాలన్నీ యువరాజు కోసం వెతకమన్నాడు. వాళు్ళ నడిరేయి వరకూ అంతా గాలించి, యువరాజు జాడలేదని రాజుకు చెప్పారు. అయితే, యువరాజు మరణించలేదు.
ప్రవాహ వేగానికి అతడు మునుగుతూ, తేలుతూ కొట్టుకుపోతూండగా, అదృష్ట వశాత్తూ అతడికి నీటివాలున పడి తేలుతూ వస్తున్న ఒక చెట్టు కొమ్మ దొరికింది. దాని ఆధారంతో అతడు ప్రాణరక్షణ చేసుకు న్నాడు. అయితే, ఆ కొమ్మ మీద అప్పటికే మూడు ప్రాణులున్నవి; అవి ఒక పామూ, ఎలుకా, చిలుకా. యువరాజు అంత తుఫాను హోరులోనూ మధ్య, మధ్య పెద్దగా గొంతెత్తి, ``రక్షించండి! రక్షించండి!'' అని కేకలు పెట్టసాగాడు. ఈ విధంగా, కొమ్మతోపాటు యువరాజు నదీ జలంలో కొట్టుకుపోతూండగా సూర్యాస్తమయకాలం అయింది. ఆ సమయంలో నది ఒక అరణ్యంగుండా ప్రవహిస్తున్నది. సాధువుగా జన్మించి, నది ఒడ్డున ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న బోధిసత్వుడు, యువరాజు కేకలు విన్నాడు.
ఆయన దృఢకాయుడు; ధైర్యశాలి. వెంటనే అంత తుఫాను మధ్య బోధిసత్వుడు నదిలో దిగి, ఈదుకుంటూ పోయి, కొమ్మను తీరానికి లాక్కువచ్చాడు. తరవాత యువరాజుతోపాటు వున్న మూడు ప్రాణుల్నీ తన కుటీరానికి తీసుకుపోయి, చలిమంట వేసి, భోజనం తయారుచేశాడు.
ఆయన ముందుగా అల్పజీవులైన పామూ, ఎలుకా, చిలుకలకు ఆహారం పెట్టి, యువరాజు భోజనం ముగించాక పక్క ఏర్పాటుచేశాడు. ఈ విధంగా వాళు్ళ రెండు రోజులు బోధిసత్వుడికి అతిథులుగా వున్నారు. ఈ లోపల తుఫాను తగ్గిపోయింది. యువరాజుతోపాటు, మూడు ప్రాణులూ తిరిగి స్వస్థత చెందాయి.

చిలుక అక్కడినుంచి తన నివాసానికి బయలుదేరుతూ బోధిసత్వుడితో, ``అయ్యా, తమరు నా ప్రాణదాతలు. నది పక్కన వున్న ఒక చెట్టుతొర్ర, నా నివాసస్థానం. తుఫాను తాకిడికి అది నదిలో పడిపోయింది. నేను ఎగరలేకపోయాను. నాకు హిమాలయాల్లో చాలా మంది మిత్రులున్నారు. మీకు ఏనాడైనా అవసరం కలిగితే, నదికి ఆవలనున్న పర్వతపాదం దగ్గిర నిలబడి, నన్ను పిలవండి. నా మిత్రులచేత మీకు అపూర్వమైన ధాన్యాలూ, ఫలాలూ తెప్పించి ఇవ్వగలను,'' అన్నది. ``నీ వాగ్దానం గుర్తుంచుకుంటాను!'' అన్నాడు బోధిసత్వుడు.
పాము, బోధిసత్వుడితో, ``నేను పూర్వ జన్మలో ఒక వర్తకుణ్ణి. కొన్ని కోట్ల బంగారు నాణేలను నది గట్టున ఒక చోట గుప్తపరిచాను. ఆ బంగారం మీది వ్యామోహం వల్ల, ఈ జన్మలో ఇలా పామునై పుట్టాను. నా జీవితం ఆ నిధిని కాపాడడంతో గడిచిపోతున్నది. ఆ బంగారాన్ని తమరు ఏదైనా నలుగురికీ ప్రయోజనకరంగా ఉపయోగించగలిగితే, దాన్ని తమపరం చేస్తాను,'' అన్నది. ఆ తరవాత ఎలుక కూడా తనను గురించి చెప్పుకున్నది. బోధిసత్వుడు ఆ మూడింటినీ భవిష్యత్తులో తిరిగీ కలుసుకుంటానన్నాడు. యువరాజు బోధిసత్వుడితో, ``ఏదో ఒకనాడు నా తండ్రి తరవాత నేను కాశీరాజ్యానికి రాజునవుతాను.
అప్పుడు మీరు నగరానికి రండి. తమను సకల మర్యాదలతో ఆహ్వానించగలను,'' అన్నాడు. కొన్ని సంవత్సరాల తరవాత బోధిసత్వుడు కాశీకి వెళ్ళాడు. అప్పటికి బ్రహ్మదత్తుడు చనిపోయి యువరాజు సింహాసనానికి వచ్చాడు. బోధిసత్వుడు నగరం చేరి, రాజవీధిన నడుస్తూండగా, ఏనుగు అంబారీలో షికారు పోతున్న అతడు, బోధిసత్వుణ్ణి చూస్తూనే, తన అంగరక్షకులతో, ``ఆ సాధువును వెంటనే పట్టుకుని స్తంభానికి కట్టి, కొరడాలతో గట్టిగా కొట్టండి. ఆపైన వధ్యస్థానానికి తీసుకుపోయి, తల నరకండి. వీడికి ఎంత పొగరంటే-అప్పట్లో యువరాజైన నన్ను కాదని, నా కంటె ఎక్కువగా ఒక పాముకూ, ఎలుకకూ, చిలుకకూ సేవలు చేశాడు,'' అన్నాడు. ఇలా రాజాజ్ఞ కాగానే అంగరక్షకులు బోధిసత్వుణ్ణి పట్టుకుని కొరడాలతో కొట్టసాగారు. 

అది చూసిన ప్రజలు బోధిసత్వుణ్ణి, ``అయ్యా, మరేనాడైనా, ఈ రాజుకు ఉపకారం చేశారా?'' అని అడిగారు. ``అవును, చేశాను!'' అని బోధిసత్వుడు జరిగినదంతా చెప్పాడు. కాశీరాజ్య ప్రజలు ఈ కొత్త రాజుపాలనలో నానా హింసలకూ, అవమానాలకూ గురవుతున్నారు. ఇంతకాలంగా రాజుపట్ల వాళ్ళకున్న మితిమీరిన ద్వేషం, బోధిసత్వుణ్ణి అతడి అంగరక్షకులు హింసించడం చూసేసరికి భగ్గుమన్నది.
వాళు్ళ చేతికందిన ఆయుధాలు తీసుకుని అంగరక్షకులపైబడి, వాళ్ళను తరిమివేసి, బోధిసత్వుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశారు. దుష్టుడైన రాజు ప్రజల ఆగ్రహం చూసి, అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. కాని, ప్రజలు అతణ్ణి తరిమి ఏనుగుపై నుంచి కిందికి పడదోసి చంపివేశారు. ప్రజల కోరికపై బోధిసత్వుడు, వాళ్ళకు రాజై ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాడు. ఆయన పామునూ, ఎలుకనూ, చిలుకనూ మరిచిపోలేదు. ఒకసారి అరణ్యానికి పోయి అక్కడ పామునూ, ఎలుకనూ కలుసుకున్నాడు.
అవి తమ నిధి నిక్షేపాలను స్వీకరించవలసిందిగా ఆయన్ను కోరినై. బోధిసత్వుడు ఆ కోర్కెను కాదనలేక ధనంతోపాటు వాటిని కూడా నగరానికి తీసుకు వచ్చాడు. చిలుకను కూడా కలుసుకుని, దాన్ని కూడా తన వెంట రావలసిందిగా ఆహ్వానించాడు. ఆయన ప్రజల క్షేమం కోసం నిధిని ఖర్చు పెట్టటమే గాక, పాము నివసించేందుకు రాజప్రాసాదం పైన ఒకచోట బంగారంతో చిన్న సొరంగం ఏర్పాటు చేశాడు.
దానితోపాటు ఎలుక వుండేందుకు మణిమాణిక్యాలు తాపడం చేసిన ఒక పెద్ద కలుగూ, చిలుకకు అందమైన ఒక బంగారు పంజరం తయారు చేయించాడు. ఈ విధంగా కృతఘు్నడూ, దుష్టుడూ అయిన రాజు పోయి, కాశీరాజ్య ప్రజలకు ధర్మస్వరూపుడైన బోధిసత్వుడు రాజుగా దొరకడంతో, వాళు్ళ ఎంతోకాలం, సుఖంగా జీవించారు.