Pages

Tuesday, July 24, 2012

తెనాలి రామలింగడు.. లెంపకాయ ఖరీదు..!!

ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా.. ఎవరో వెనకనుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కిందపడిపోయాడు. ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి, ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు.

తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు.. "నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా..? నన్నెందుకయ్యా కొట్టావు..?" అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారుపడుతూ.. "అయ్యా..! తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనుకనుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టానంతే..!" అని చెప్పాడు.

"సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా..?" అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి, జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా.. తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగయినా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

"పోనీలేవయ్యా రామలింగా..! ఏదో తెలియక పొరపాటు చేశాడు. ఏమనుకోవద్దంటున్నాడుగా.. ఊరుకో..!!" అన్నాడు మంత్రి. అయితే రామలింగడు ససేమిరా అన్నాడు. సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి. ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే, సందుచూసి పారిపోయాడు. ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్లు మండిపోయింది.

మంత్రిగారికి దగ్గరిగా వెళ్లిన రామలింగడు.. "అయితే మంత్రిగారూ..! నాకు తెలియక అడుగుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయల ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుందే..!!" అన్నాడు. "అంతేగా మరి..!" అన్నాడు మంత్రి. "ఓహో..! అలాగా...!!" అని నవ్వుతూ అన్నాడు రామలింగడు.

వెంటనే మంతిగారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగడు. మంత్రి "కుయ్యో.. మొర్రో.." అంటూ.. "ఎందుకయ్యా రామలింగా.. నన్ను కొట్టావు..!!" అని అడిగాడు. "మంత్రిగారూ..! నాకు అవతల బోలెడంత పని ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా..! నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి, మీరు దాన్ని ఉంచుకోండ"ని చెప్పి ఎంచక్కా అక్కడినుంచి వెళ్లిపోయాడు తెనాలి రామలింగడు.

చూశారా పిల్లలూ... జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి, నిందితుడు తనకు అయినవాడు కావటంతో విడిచిపెట్టాలని ప్రయత్నించటంతో, రామలింగ కవి ఎలాగ బుద్ధి చెప్పాడో..! న్యాయం చెప్పాల్సివస్తే... అయినవారయినా, కాని వారయినా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని.. మంత్రికి కనువిప్పు కలిగిస్తూ రామలింగడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమయ్యింది కదూ..!!

తప్పించుకు పోయెరా తాబేటి బుర్ర..!!

ఒక మడుగులో తాబేలు ఒకటి ఉండేది. నీటిలో తిరిగి తిరిగి విసుగు పుట్టినప్పుడు అది ఒడ్డుమీదకు వచ్చి షికార్లు కొట్టేది. ఇలా ఒకరోజు తాబేలు మడుగు ఒడ్డున షికార్లు చేస్తుంటే, జిత్తులమారి నక్క ఒకటి చూసింది. లొట్టలేసుకుంటూ వచ్చి తాబేలును పట్టుకుంది.

అంతే వెంటనే తాబేలు తన కాళ్ళను, తలను డొప్పలోపలికి ముడుచుకున్నది. నక్క తాబేలును అటూ, ఇటూ ఎటువైపు తిప్పినా దానికి మెత్తటి మాంసం దొరకలేదు. కోపంతో తాబేలును బండకేసి కొట్టసాగింది నక్క. నక్క చేస్తున్న పనికి తాబేలుకు వెన్నులో వణుకు తన్నుకురాగా భయంతో బిక్కచచ్చిపోయింది. ఎలాగైనా నక్క బారినుంచి తప్పించుకోవాలని ఒక పథకం వేసింది.

"నక్కబావా, నక్కబావా ఎందుకు అవస్థపడతావు...? నేను పుట్టింది నీకోసమే. నీ బాధ చూడలేకున్నాను. నన్ను నీటిలో వదులు, కొద్దిసేపటికి బాగా నాని మెత్తబడిపోతాను. అప్పుడు నువ్వు నన్ను శుభ్రంగా తినేయవచ్చు" అని చెప్పింది తాబేలు. తాబేలు చెప్పిన ఉపాయం నక్కకు కూడా నచ్చినా, లోలోపల ఏదో అనుమానం ఉన్నప్పటికీ.. సరేనని చెప్పింది.

తాబేలును నమ్మినట్లే నమ్మి, నీటిలో దాన్ని వదిలిపెట్టి... కాలితో గట్టిగా నొక్కి పట్టుకుంది. తాబేలు బారినుంచి తప్పించుకోవాలని తాను పథకం వేస్తే, ఈ జిత్తులమారి ఇంకో పథకం వేసిందే.. ఇప్పుడెలాగబ్బా...? అని మళ్లీ ఆలోచించసాగింది తాబేలు. మళ్లీ వెంటనే దానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.

"నక్కబావా... నక్కబావా...! నా ఒళ్లంతా బాగా నానింది కానీ, నువ్వు కాలుపెట్టిన చోట మాత్రం కాస్త గట్టిగానే ఉంది. నువ్వు కాసింత కాలు తీస్తే, అక్కడ కూడా బాగా నానుతుంది. నువ్వు హాయిగా తినవచ్చు" అని చెప్పింది తాబేలు. దానికి సరేనన్న నక్క తన కాలును కాస్త తీసిందో లేదో, వెంటనే తాబేలు మడుగులోకి జారుకుంది.

"హమ్మయ్య...! బ్రతుకుజీవుడా...!!" అనుకుంటూ తాబేలు నీటి అడుగుకు వెళ్లిపోయింది. ఇక ఆరోజు నుంచి తాబేలు బయట షికార్లు మాని బుద్ధిగా ఉండసాగింది. అయితే "నక్కజిత్తులన్నీ నా దగ్గరుండగా, తప్పించుకు పోయెరా తాబేటి బుర్ర" అని నక్క తన తెలివితక్కువ తనానికి విచారిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయింది.

చుట్టాల సురభయ్య.. రోకలి పూజ...!!

సురభయ్యకు చుట్టాలంటే భలే ఇష్టం. ఎప్పుడూ తన ఇల్లు చుట్టాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకునేవాడు. అతడు ప్రతిరోజూ నాలుగు వీధుల కూడలిలో నిలబడి చుట్టాలను వెతికిపట్టి మరీ ఇంటికి తీసుకెళ్లేవాడు. సురభయ్య భార్య సూర్యకాంతం చాలా పిసినారి. చుట్టాల పేరుతో ఇల్లు గుల్ల కావటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు.

అదీగాక ప్రతిరోజూ వచ్చే చుట్టాలకు వండి వార్చలేక సూర్యకాంతం సురభయ్యపై విరుచుకుపడేది. కానీ సురభయ్య మాత్రం ఆమె మాట వినేవాడు కాదు. "ఆ మాత్రం చుట్టాలకు పెట్టకపోతే మన బ్రతుకెందుకు..?" అంటూ ఆమెకే సర్దిచెప్పేవాడు. సురభయ్య పద్ధతి చూసి చూసి సూర్యకాంతానికి విసుగొచ్చేది. ఎలాగైనా సరే సురభయ్య చుట్టాల పిచ్చిని వదలగొట్టాలని పథకం వేసింది.

ఒకరోజు సురభయ్య ఇద్దరు చుట్టాలను ఇంటికి తీసుకుని వచ్చాడు. వారిని కూర్చోబెట్టి.. ఉప్పూ, పప్పూ, కూరగాయలు కొనుక్కొస్తానని బజారుకు వెళ్లాడు. ఇంతలో సూర్యకాంతం రోకటి బండకు పసుపు, కుంకుమతో పూజ చేయసాగింది. చుట్టాలిద్దిరికీ అది చాలా వింతగా తోచింది. "ఎందుకు రోకలికి పూజచేస్తున్నా"ని అడిగారు.

అందుకామె చేతులు తిప్పుతూ... "ఏమి చెప్పమంటారు నాయనా... ఈయనకి ఈ మధ్య చుట్టాల పిచ్చి బాగా ముదిరిపోయింది. చుట్టాలకు రోకలిపూజ చేయడం చాలా మంచిదని ఎవరో సన్యాసి చెప్పాడట. ఇక అప్పటినుంచి రోజూ చుట్టాలను పిలుచుకు రావటం, ఈ రోకలిబండతో తరిమి తరిమి కొట్టడం చేస్తున్నాడు. మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి, ఆయనేమో కల్లు తాగేందుకు వెళ్లాడు. వస్తూనే మీకు కూడా రోకలి పూజ ఖాయం" అని చెప్పింది.

ఈ మాటలతో చుట్టాలకు పై ప్రామాలు పైనే పోయాయి. ఒకటే పరుగు లంకించుకున్నారు. సురభయ్య సామాన్లన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చాడు. "చుట్టాలేరీ..?" అని భార్యను అడిగాడు. "వాళ్లకు రోకలిబండ కావాలంట నేనెక్కడ తెచ్చిచ్చేది..?" లేదని చెప్పగానే వాళ్లు వెళ్లిపోయారని చెప్పింది సూర్యకాంతం.

"అయ్యో..! ఇవ్వలేకపోయావా అంటూ" రోకలిబండతో పరుగుతీశాడు సురభయ్య. రోకలిబండతో వస్తున్న సురభయ్యను చూసిన చుట్టాలు.. అతను తమకు రోకలిపూజ చేసేందుకు వస్తున్నాడని భావించి, భయంతో మరింతగా పరుగుతీశారు. సురభయ్య వారితోపాటు పరిగెత్తలేక ఉస్సూరంటూ ఇంటికి చేరాడు.

ఈ విషయం అంతా ఊర్లోని జనాలకు, చుట్టుప్రక్కల గ్రామాలలోని జనాలకు తెలియడంతో... ఆ రోజునుంచి సురభయ్య ఇంటికి చుట్టాలు రావడం మానుకున్నారు. తాను వేసిన పథకం బాగా కలసిరావడంతో ఆనందంతో పండుగ చేసుకోసాగింది సూర్యకాంతమ్మ.

తెనాలి రామలింగడు.. సంచిలో ఏనుగు...!!

ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయలవారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు, ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు "మహారాజా...! మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైంద"ని చెప్పాడు.

అంతే ఫక్కున నవ్విన రాయలవారు... "రామలింగా...! ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావుగానీ, చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా.. చెప్పు..?" అన్నాడు. "లేదు మహారాజా..! చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు. అంతకంటే, కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి" అన్నాడు రామలింగడు.

అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోడం లేదని అన్నాడు రాయలవారు. నిజం "మహాప్రభూ...! చిన్నపిల్లలు అది కావాలి, ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా, తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటినీ వేగడం, వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండీ..!!" అని వివరించి చెప్పాడు రామలింగడు.

రాజునూ పరుగులెత్తించాడు..!

మహారాజు దీనికి కూడా ఏ మాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి.. "సరే మహారాజా..! కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగానూ, మీరు తండ్రిగానూ నటిద్దాము. పిల్ల చేష్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను" అన్నాడు. దీనికి సరేనన్నాడు రాయలవారు.

అంతే ఇక మారాం చేయటం మొదలెట్టాడు రామలింగడు. మిఠాయి కావాలని అడిగాడు. ఓస్ అంతేగదా.. అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారుకు పోదామని గోల చేశాడు రామలింగడు. సరేనని బజారుకు తీసుకెళ్ళగా... వీధిలో అటూ, ఇటూ పరుగులెత్తాడు, తన వెంటే రాజును పరుగులెత్తించాడు. రంగు రంగుల సంచీ చూపించి కొనివ్వమని రాజును అడిగాడు.

సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేదిలేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే...! ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాం చేశాడు.

"సంచిలో ఏనుగెలా పడుతుంది రామలింగా..? మరొకటి ఏదైనా అడుగు" అన్నాడు రాయలవారు. "వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి. నాకింకేమీ వద్దు" అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు. అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకుంటూ అక్కడినుంచి ఇంటికి బయలుదేరాడు.

తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య..!!

ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు. అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు. కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.

రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. "ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తా"నని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.

అలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా..! రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.

కొరడా దెబ్బలే కావాలి...!!

కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు. ఏంకావాలో కోరుకోమని అన్నాడు. దీంతో "మహారాజా...! నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు..!!" అన్నాడు రామలింగడు.

"ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు. దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా...?" అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు. "తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి. దయచేసి ఇప్పించండి" అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు "సరే కొట్టండి" అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు కొరడాలతో సిద్ధమయ్యాక.. "మహారాజా..! మన్నించండి. ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి. మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని" చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ.. పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు.

దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది. ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది. చూశారా పిల్లలూ...! ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...!!

కష్టే ఫలి... శ్రమయే సంపద...!!

అనగనగా ఒక ఊర్లో నర్సయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు. తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పొలం పండిస్తుంటే, కొడుకులు మాత్రం ఏమీ పట్టనట్లుగా బలాదూర్‌గా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్లకి ఎప్పుడూ తినడం, పడుకోవటం తప్ప మరో పని చేసేందుకు మనస్కరించేది కాదు.

తనకేమో వయసయిపోతోంది, కొడుకులు చూస్తే ఇలా సోమరిపోతుల్లా తయారయ్యారని ప్రతిరోజూ దిగులుపడుతున్న నర్సయ్య ఒకరోజు మంచంపట్టాడు. దీంతో కొడుకులను దగ్గరకు పిలిచి... తనకు ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, ఇక ఎన్నిరోజులు బ్రతుకుతానో కూడా తెలియదని వాపోయాడు.

కాసేపటికి తేరుకున్న ఆయన... "నా కథ అలా వదిలేయండి నాయనలారా..! నేను కూడబెట్టిన డబ్బు అంతటినీ ఒక పెట్టెలో పెట్టి మన పొలంలోనే దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టానో గుర్తు రావటం లేదు. ఒకవేళ నేను చనిపోయినట్లయితే, ఆ డబ్బును వెతికిపట్టుకుని మీరందరూ సమానంగా తీసుకోవడం మర్చిపోవద్దని ఆయాసంతో కళ్లు మూసుకున్నాడాయన.

ఆయనలా కళ్లు మూసుకున్నారో లేదో అంతే వెంటనే పొలంలో వాలిపోయారు ఐదుగురు పుత్నరత్నాలు. డబ్బు దాచిపెట్టిన చోటును మర్చిపోయినందుకు ఆయనను మనసులో తిట్టుకుంటూ, వారందరూ పొలం నాలుగుమూలలా వెతికారు. ఎక్కడా డబ్బు కనిపించే జాడలే లేవు.

అయినా పట్టువదలని విక్రమార్కులలాగా పొలాన్నంతటినీ తవ్విచూశారు. అయినా ఎక్కడా డబ్బు దాచిన పెట్టె కనిపించలేదు. దీంతో ఉస్సూరుమంటూ తండ్రి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు. అంతా విన్న తండ్రి నవ్వుతూ, ఖచ్చితంగా తాను ఆ భూమిలోనే డబ్బు పెట్టెను దాచాననీ, ఈరోజు కాకపోతే మరో రోజైనా దొరికి తీరుతుందని వారిని ఓదార్చాడు నర్సయ్య.

చేసేదేమీలేక తండ్రిని మనసులో శపిస్తూ... ఆ పొలాన్ని సాగు చేయటం ప్రారంభించారు నర్సయ్య కొడుకులు. నర్సయ్యకు క్రమంగా ఆరోగ్యం కూడా కుదుటపడసాగింది. ఈలోపు కొడుకులు పండించిన పొలం బాగా విరగబడి కాసింది. దాంతో వారికి లెక్కలేనంత డబ్బు చేతికి వచ్చింది. కొడుకులందరి సంతోషాన్ని చూసిన నర్సయ్య వారివద్దకు వచ్చి ఇదే మన సంపద "కష్టేఫలి, శ్రమయే సంపద" అని అన్నాడు.

తండ్రి పొలంలో డబ్బు పెట్టె దాచానని ఎందుకు అబద్ధం చెప్పాడో.. నర్సయ్య కుమారులకి అప్పుడు అర్థమయ్యింది. ఇంతకాలం వారు చేసినపనికి సిగ్గుపడ్డారు. తండ్రి డబ్బు దాచినట్లు చెప్పకపోయి ఉంటే, తాము ఆ భూమిని దున్నేవాళ్లము కాదనీ, ఇంత డబ్బును కళ్లజూసేవాళ్లము కాదని అనుకుని తండ్రికి క్షమాపణలు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి సోమరితనాన్ని వదిలి కష్టపడి పనిచేయడం ప్రారంభించారు.

బీర్బల్ కథలు : గుడ్డివారు ఎవరు..?

ఒకరోజు అక్బరు చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. "మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువమంది ఉన్నారా..? లేక మంచివారు ఎక్కువమంది ఉన్నారా..?" అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.

అప్పుడు బీర్బల్ లేచి... "మహారాజా..! మన పట్టణంలోనే కాదు, లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నార"ని అన్నాడు. అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండురోజులు గడువు ఇప్పించండని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తలూపాడు.

మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్లలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కుడుతూ కూర్చున్నాడాయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించుకున్నాడు.


ప్రతిఒక్కడూ వచ్చి "పండిట్ జీ... ఏమి చేస్తున్నారు మీరు..?" అని ప్రశ్నిస్తూ వెళ్లిపోతున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్‌ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే రాజుగారి పేరు కూడా లిస్టులో చేరిపోయింది.

మరుసటిరోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు. వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి.. "ఈ లిస్టు చూడండి మహారాజా... మన పట్టణంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుంద"ని అన్నాడు. వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకుని చదవడం ప్రారంభించాడు.

ఆ లిస్టులో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి. అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ ఖంగుతిన్నాడు. "అదేంటి బీర్బల్...! నా పేరును కూడా ఈ లిస్టులో రాశావెందుకు..?" అని ప్రశ్నించాడు మహారాజు.

అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ... "మహారాజా...! మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడిగారు కదండీ... కళ్ళుండి కూడా చూడలేనివారు గుడ్డివారే కదా...!!" అన్నాడు. దీంతో అక్బర్‌కు తాను చేసిన పొరపాటేంటో అర్థమై, దానికి చింతిస్తూ... బీర్బల్‌ తెలివితేటలను అభినందించాడు.

పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే..!!

అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు ఇంటికప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడి పాదు ఒకటి అల్లుకుంటూ, ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి.

ఇక ఆ ఇంటి కప్పుల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా... ఆ గుమ్మడికాయలతోపాటు కాపురం చేయసాగింది. తుంటరిదైన ఆ ఎలుక కనబడ్డ వాటినల్లా కొరికేస్తూ, చాలా సంతోషంగా జీవితం గడిపేయసాగింది. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుకగారు అక్కడికి ఎవరు వచ్చినా వారిని ఊరికే వదలిపెట్టదు.

రోజులలా గడుస్తుండగా.. ఇంటి చావడిలోకి మేత కోసం వచ్చిందొక మేకపిల్ల. ఇంతలో తుంటరిదైన మన ఎలుకగారు ఊరుకుంటారా..? వెంటనే ఒక గుమ్మడికాయని ఫుటుక్కున కొరికేసింది. దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ... డుబుక్కున గడ్డి మేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే... మే... అని అరుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఇదండి పిల్లలూ... పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే కథ. ఏదీ మీరూ ఒక్కసారి "పుటుక్కు జర జర డుబుక్కు మే" అనండి. భలే తమాషాగా ఉంది కదూ...?!

వికటకవి తెనాలి రామలింగడు

తెనాలి అనే పట్టణంలో ఓ దంపతులకు రామలింగడు అనే కుమారుడుండేవాడు. రామలింగడికి చదువు సంధ్యలకంటే, ఆటపాటలంటేనే ఎక్కువగా ఆసక్తి ఉండేది. "విద్యలేని వాడు వింత పశువు" అనే నానుడిని తలుచుకుని భయపడుతున్న రామలింగడి తల్లిదండ్రులు... తమ కుమారుడు పశువు కాకుండా, అక్షర జ్ఞానం నేర్చుకుని, దాంతో లోకజ్ఞానం సంపాదించాలని ఆరాటపడేవారు.

అయితే బాల్యమంతా ఆటపాటలతో కాలక్షేపం చేసిన తెనాలి రామలింగడు పెద్దవాడు అయిన తరువాత బ్రతికేందుకు విద్య అవసరమని తెలుసుకున్నాడు. అయితే మానవ శక్తితో సాధ్యకానివి దైవ శక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటుంటే చాలాసార్లు విన్న రామలింగడు.. చివరికి దైవశక్తిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు.

తన నిష్కల్మషమైన మనస్సుతో జగన్మాతను ఆరాధించసాగాడు. అలా రామలింగడు ప్రార్థనను చాన్నాళ్ళుగా గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగడికి ప్రత్యక్షమైంది. ఒక చేతిలో ధనలక్ష్మి, మరో చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి... వెండిగిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చింది జగన్మాత.

జగన్మాత దర్శనంతో పులకించిపోయిన రామలింగడు.. తనకు తెలియకుండానే చందోబద్ధమైన స్తుతి పద్యాలతో ఆమెను ప్రార్థించాడు. అక్షర జ్ఞానం లేని అతడి నోటివెంట అక్షరాలు ముత్యాలజల్లుల్లాగా పొంగిపొర్లాయి. జగన్మాత మహిమా ప్రభావంతోనే ఇదంతా జరిగిందని గ్రహించిన అతడు తన్మయత్వంతో మురిసిపోయాడు.

"చూడు నాయనా... నీ భక్తికి సంతోషించాను. నీకు కావలసిన వరం ఇస్తాను. ఏది కావాలో కోరుకో...?" అంటూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తూ రామలింగడిని అడిగింది జగన్మాత. "ఏమిస్తావు తల్లీ... అన్నీ నీకు తెలుసు కదా... నీ బిడ్డకు కావాల్సింది నువ్వే ఇవ్వు తల్లీ...!!" అంటూ నిర్ణయాన్ని ఆమెకే వదిలివేశాడు.

"చూడు నాయనా కుడిచేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యా లక్ష్మి, ఎడమచేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి. ఈ రెండింటిలో ఏది కావాలో దాన్ని తీసుకుని సేవిస్తే... అది కడదాకా నీ వెంటే ఉంటుంద"ని చెప్పింది జగన్మాత. కాసేపు తటపటాయించిన రామలింగడు "తల్లీ బ్రతికేందుకు ఈ రెండు లక్ష్మిలు అవసరమే కదా...! ఎటూ తేల్చుకోలేక పోతున్నాను. ఏదీ ఆ రెండూ గిన్నెలు ఒక్కసారి నా చేతిలో ఉంచు చిటికెలో తేల్చుకుంటాను'' అన్నాడు.

వెంటనే అమ్మవారు రామలింగడు కోరినట్లుగానే రెండు గిన్నెల్నీ అతని చేతిలో పెట్టింది. అల్లరివాడు, కొంటెవాడు అయిన రామలింగడు వెంటనే ఆ రెండు గిన్నెల్లోని పాయసాన్ని రెండింట్లోనూ కలిపేసి, ఒక గిన్నెలో కలగలసిన పాయసాన్ని చటుక్కున తాగేసి మరో గిన్నెను జగన్మాత చేతిలో పెట్టాడు.

రామలింగడు చేస్తున్న పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడివంక చూడసాగింది. తప్పును గ్రహించిన రామలింగడు వెంటనే అమ్మవారిని శరణువేడాడు. దాంతో అమ్మవారి మనసు కరిగి.. "తెలిసి చేశావో, తెలియక చేశావో గానీ... నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. పండితుడివైనా వికటత్వంతోనే అందరి మెప్పును పొందుతావు. ధనలక్ష్మి నీ వెంట ఉన్నా, అది నీకు అక్కరకు రాదు" అంటూ దీవించింది. ఇక ఆనాటి నుంచి తెనాలి రామలింగడు "వికటకవిగా" ప్రసిద్ధి చెందాడు.

కలసి ఉంటే కలదు సుఖము

ఒక అడవిలో నాలుగు ఆవులు కలసిమెలసి, ఒకేచోట మేతమేస్తూ స్నేహంగా జీవిస్తుండేవి. అవి ఎక్కడికి వెళ్లాలన్నా కలిసికట్టుగా వెళ్ళేవి. సంతోషాన్నయినా, కష్టాన్నయినా కలసే పంచుకుంటూ ఆనందంగా గడిపేవి.

ఒకరోజు అడవిలో మేతమేస్తున్న నాలుగు ఆవులను బాగా ఆకలిమీదున్న సింహం ఒకటి చూసింది. "ఆహా ఈరోజు నాకు భలే మంచి విందు భోజనం దొరికిందని" నవ్వుకుంటూ ఆవుల దగ్గరికి వచ్చింది సింహం. సింహం తమవైపు రావడం గమనించిన ఆవులు ఏ మాత్రం భయపడకుండా నిల్చున్నాయి.

"ఏంటీ తాను వస్తే ఎలాంటి జంతువయినా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిందే కదా...! మరేంటి ఈ ఆవులు అలాగే ధైర్యంగా నిలుచుని ఉన్నాయే...?" అనుకుంటూ వాటిని సమీపించింది సింహం. అయితే ఆవులు ఏ మాత్రం బెదరకుండా వాటి వాడి అయిన కొమ్ములతో సింహం పనిబట్టేందుకు అమాంతం దానిపై పడ్డాయి.

ఊహించని ఎదురుదాడి జరగడంతో ఒక్కసారిగా భయపడ్డ సింహం, ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం అనుకుని.. ఆవుల నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడి పారిపోయింది. అయితే, ఆరోజు నుంచి ఆ ఆవులపై పగబట్టిన సింహం వాటిని కడుపారా తినేందుకోసం ఎదురుచూడసాగింది.

అనుకున్నట్లుగా కొంతకాలం తరువాత ఆ నాలుగు ఆవుల మధ్య గొడవలు రావడంతో అవి విడిపోయి, వేరు వేరుగా జీవించసాగాయి. అంతేగాకుండా, మేతకు వెళ్లినప్పుడు కూడా వేరు వేరుగా మేయసాగినాయి. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్న సింహం తన పంట పడింది అనుకుంది.

ఎందుకంటే... నాలుగు ఆవులు కలసికట్టుగా దాడి చేస్తే తన ప్రాణాలు హరీమనడం ఖాయం. అయితే ఒక్కోదాన్ని పట్టుకుని భుజించటం చాలా తేలికైన పని కదా అని సంబరపడసాగింది. ఓ మంచి రోజుకోసం ఎదురుచూడసాగింది సింహం. అలా ఒకరోజున మొదటి ఆవు మేస్తుండగా పొదల్లో నక్కి ఉన్న సింహం ఒక్కసారిగా దానిపై పడి చంపి తినేసింది. అలాగే రెండు, మూడు, నాలుగు ఆవులను కూడా అలాగే చంపి తినేసి తన శపథం నెరవేర్చుకుంది.

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలూ... విడి విడిగా జీవించి ఆపదలను కొనితెచ్చుకోవడం కంటే, కలసిమెలసి జీవించటం మంచిది. అందరూ ఐకమత్యంగా ఉన్నట్లయితే, ఎంత పెద్ద సమస్యనయినా చక్కగా ఎదుర్కోవచ్చు. అందుకే మన పెద్దలు "కలసి ఉంటే కలదు సుఖం" అని అన్నారు..!!

పంచతంత్రం కథలు : పులితోలు - గాడిద

పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అయితే బట్టల మూటలు మోసే ఓపిక లేక ఏలాగోలా చేసి ఒక గాడిదను కొనుక్కున్నాడు. గాడిదను కొనగానే సరిపోతుందా..? దాన్ని మేపాలంటే ఈ చాకలివాడి తలప్రాణం తోకకు వచ్చింది.

గాడిదను మేపాలంటే డబ్బులు ఖర్చయిపోతాయన్న బెంగతో చాకలివాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అదేంటంటే... బాగా పాతదైపోయిన పులితోలును ఒకదాన్ని సంపాదించిన అతడు, దాన్ని గాడిదపై కప్పి, రాత్రుళ్లు గ్రామస్తుల చేలల్లో వదిలివెసేవాడు. ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన ఆహారాన్ని కడుపారా తిని చాకలి ఇంటికి వెళ్లిపోయేది.

పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కావలి ఉండే గ్రామస్తులు... "అయ్యబాబోయ్.. పులి వచ్చింది" అని భయపడి పారిపోయేవారు. భయం వల్ల గ్రామీణులెవరూ ఆ పులిని ఏంచేయగలం అంటూ ఊరకుండిపోయారు. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ఒక యువకుడికి మంచి ఆలోచన తట్టింది.

దాంతో అతడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికే తన పెంపుడు గాడిదలను వెంటబెట్టుకుని పంటపొలానికి కాపలాగా వెళ్ళాడు. ఆ రాత్రి కూడా విలాసుడి గాడిద.. యజమాని కప్పిన పులితోలు ముసుగులో చేలల్లో పడి, పైరుల్ని మేయసాగింది.

అక్కడే పొలానికి కాపలాగా ఉన్న ఆ యువకుడు దీన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో అతడివద్ద ఉన్న గాడిదలు పులిని చూసిన భయంతో కాబోలు ఓండ్రబెట్టినాయి. చాలా రోజులుగా మౌనంగా మేత మేయటం అలవాటయిన చాకలివాడి గాడిదకు తన జాతివారి అరుపులు వినబడటంతో సంతోషం పట్టలేక పోయింది.

వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా ఓండ్రపెట్టసాగింది. తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ఆ యువకుడు అది నోరుతెరచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తనవద్దనుండే దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడితెపూజ చేశాడు. ఆ రకంగా చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది.

ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... యదార్థం బయటపడే వరకు మాత్రమే ఎవరి ఆటలైనా కొనసాగుతాయి. కాబట్టి, నిజాన్ని ఎంతకాలమూ దాచలేము. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు. నిజం బయటపడ్డాక మోసకారుల ఆటలు సాగవు.

సత్ప్రవర్తన... పరిసరాల సంబంధం...!

ఒక అడవిలోని మర్రిచెట్టుపై రెండు చిలుక పిల్లలు నివసిస్తుండేవి. ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లలను పట్టుకుని, గోదావరీ తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండోదాన్ని ఒక వ్యాపారికి అమ్మివేశాడు. సాధువు కొనుక్కున్న చిలుక పిల్లకు "రామయ్య" అనీ, వ్యాపారి కొనుక్కున్న పిల్లకు "శీనయ్య" అనే పేర్లను పెట్టి, వాటిని పంజరాల్లో పెట్టి పెంచుకోసాగారు.

సాధువు వద్ద పెరుగుతున్న చిలుక మంచి మాటలను, గొప్ప సంస్కారాన్ని అలవర్చుకుంది. సాత్వికమైన ఆహారాన్ని తింటూ, అతిథులను గౌరవించే పద్ధతులను గమనించి, మంచి స్వభావాన్ని నేర్చుకుంది. క్రమంగా అది ఇంటికి వచ్చిన వారినందరినీ మంచి మాటలతో గౌరవిస్తూ సంతోషపరిచేది.

వ్యాపారి పెంచుకుంటున్న చిలుక... ఆ ఇంట్లోవారు మాట్లాడే చెడ్డమాటలను వినడం, హింసతో కూడిన పనులను చూడటం వల్ల రోజురోజుకీ చెడ్డ అలవాట్లకు లోనయ్యింది. వ్యాపారి ఇంటికి వచ్చే వారందరితోనూ అది పరుషంగా మాట్లాడుతూ.. ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది.

ఇలా కొంతకాలం గడిచాక ఈ రెండు చిలుకలూ అదృష్టవశాత్తూ పంజరంలోంచి తప్పించుకుని బయటపడ్డాయి. అలా బయటపడ్డ చిలుకల్లో రామయ్య మామిడిచెట్టుమీదకు, శీనయ్య మర్రిచెట్టు మీదకు వెళ్లి గూడు కట్టుకుని అక్కడే జీవించసాగాయి.

ఒకరోజు మర్రిచెట్టు ఉన్న దార్లో వెళుతున్న బ్రాహ్మణుడొకడు అలసిపోయి, ఆ చెట్టుకింద విశ్రాంతి తీసుకునేందుకు అక్కడ ఆగాడు. ఇంతలో శీనయ్య పేరుతో ఉండే చిలుక వెంటనే తన పక్కనే ఉంటున్నవారందరితో.. "ఎవరో మనిషి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. రండి వాడి శరీరాన్ని పొడిచి, పొడిచి హింసిద్దాం" అని పిలిచింది.

అదంతా విన్న బ్రాహ్మణుడు పారిపోయి, పక్కనే రామయ్య నివసిస్తున్న మామిడి చెట్టు కిందకు వెళ్ళి నిల్చున్నాడు. ఇంతలో బ్రాహ్మణుడిని గమనించిన చిలుక... "ఎవరో అతిథి ఎండవేడికి తాళలేక అలసిపోయి మన చెట్టుకింద విశ్రాంతి తీసుకునేందుకు వచ్చాడు. స్వాగతం పలికి, పండ్లను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, తరువాత ఆయనకు సేవ చేసి తరించండి" అని తోటి పక్షులకు చెప్పింది.

ఈ కథలోని నీతి ఏంటంటే... ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లల ప్రవర్తన వారు పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది. కాబట్టి, చిన్నతనంలో ఎవరైతే మంచివారి స్నేహం, సత్ప్రవర్తన, నీతి నియమాలను అలవాటు చేసుకుంటారో అలాంటి పిల్లలు పెద్దయ్యాక మంచి సంభాషణ, మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి నడవడిక, సద్గుణాలను కలిగి ఉంటారు. కాబట్టి, చిన్నప్పటి నుంచి పిల్లలను సక్రమమైన మార్గంలో పెంచడం ఉత్తమం

ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది...?

ఒక ఊర్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి పనులు చేసుకుంటూ ఉండే వీరిద్దరూ ఒకరోజు వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు. అడవిగుండా నడచివెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగుబంటి తారసపడింది.

అంతే దాన్ని చూసి బెంబేలెత్తిన రాము, సోములిద్దరూ భయంతో పరిగెడుతూ ఒక చెట్టువద్దకు చేరుకున్నారు. సోము ఆలస్యం చేయకుండా వెంటనే గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. రామూకి చెట్టెక్కడం రాకపోవడంతో సోమూని సాయం చేయమని వేడుకున్నాడు.

తాను దిగివచ్చేలోపు ఎలుగుబంటి వచ్చేస్తుందనీ, అప్పుడు ఇద్దరం దానికి బలవక తప్పదు కాబట్టి... నేను దిగిరాను నువ్వే ఏదో ఒకటి చేసేయమని రామూతో అన్నాడు సోము. అయ్యో సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే, ఈ రోజు ఆ ఎలుగుబంటికి బలవక తప్పదా..? అంటూ ఆలోచనలో పడ్డాడు రాము.


వెంటనే ఓ ఉపాయం తళుక్కున మెరిసింది. అంతే చచ్చిపోయినవాడిలా ఆ చెట్టుకింద కదలకుండా, మెదలకుండా పడిపోయాడు రాము. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. పైకి చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు.

ఏం చేయాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి ఎందుకైనా మంచిది కిందపడిన వాడు నిజంగా చనిపోయాడా లేదో? తెలుసుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని అనుకుంది. వెంటనే రామూ దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి, చనిపోయాడని నిర్ధారించుకుని చేసేదేమీలేక అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోవడం చూసిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చిన సోము... భలే ఉపాయం పన్నావు మిత్రమా..? ఎలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నామని అన్నాడు. అది సరేగానీ.. ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరకి వచ్చి ఏదో గుసగుసలాడుతూ చెప్పింది కదా...? ఏం చెప్పింది..? అని ఆరా తీశాడు సోము.

"ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని" చెప్పి వెళ్లిపోయిందని అన్నాడు రాము. అప్పటికిగానీ తాను చేసిన తప్పును గుర్తించలేని సోమూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా కానివారు అసలు స్నేహితులే కారు.

మర్రిమాను కౌగిట్లో తాటిచెట్టు ప్రాణాలు హరీ...!!

ఒకానొక రోజున కాకికి బాగా ఆకలిగా ఉండటంతో మర్రిపండునొక దానిని తీసుకొచ్చి, తాటిచెట్టుపై కూర్చుని తినసాగింది. కాకి మర్రిపండును తింటుండగా, పండులోని మర్రిగింజ రాలి తాటిమట్టల మధ్య పడిపోయింది. ఆ చిన్న మర్రిపండు విత్తనాన్ని చూసిన తాటిచెట్టు ఎగతాళిగా నవ్వింది.

"నా కాయలు ముంతడేసి, గింజలు చారడేసి ఉన్నాయి. ఇనుపగుండ్లలాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడలో నిలబడరు. మనుషుల పైనగానీ, జంతువులమీదగానీ నా కాయలు రాలిపడితే, వారి నడ్డి విరిగిపోతుంది. ఇంత చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుందని" గేలి చేసింది తాటిచెట్టు.

మర్రిగింజపైన తాటిచెట్టు రకరకాలుగా జాలిపడి నవ్వుకోసాగింది. అలా నవ్వి నవ్వి తాటిచెట్టు అలసిపోయింది. కాకికూడా ఆ చెట్టుమీద నుంచి ఎగిరి వెళ్లిపోయింది. మర్రి విత్తనం మాటను కూడా మెల్లిగా మర్చిపోయింది తాటిచెట్టు. అలాగే కొంతకాలం గడిచింది. తాటిమట్టల మధ్యన మర్రిగింజ మొలకెత్తి, చిన్న చెట్టుగా అవతరించింది.

అప్పుడు కూడా చిన్నదిగా ఉన్న మర్రిచెట్టును చూసి గేలి చేసింది తాటిచెట్టు. నువ్వెంత, నువ్వు నన్నేమీ చేయలేవనీ ఎగతాళి చేస్తూ నవ్వింది. తాటిచెట్టు మాటలన్నింటినీ ఓపికగా విన్న మర్రిచెట్టు క్రమంగా పెరగసాగింది. రోజురోజుకీ మరింత పెద్దదవసాగింది. కొంత కాలానికి మర్రిచెట్టు తాటి చెట్టును మించిపోయేలాగా పెరిగిపోయింది. తనకంటే బలవంతులెవరూ లేరని ఇంతకాలం విర్రవీగిన తాటిచెట్టు క్రమంగా మర్రిమాను కౌగిట్లో బందీయై ప్రాణాలు విడిచింది.

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ధనముందని, బలముందని అహంకారంతో మంచివారిని కించపరిచినా, వారికి చెడు చేయాలని ప్రయత్నించినా చివరకు తాటిచెట్టుకు పట్టిన గతే పడుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి, మీరెప్పుడూ తాటిచెట్టులాగా ప్రవర్తించరు కదూ పిల్లలూ....!!!

మహారాజుకు బుద్ధి చెప్పిన సాధువు

విష్ణుపురం మహారాజు ఒకరోజు గుర్రంపై స్వారీ చేస్తూ అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అలా వెళ్తుండగా, పక్కనే కొంతమంది సాధువులు యాగం చేస్తుండటాన్ని ఆయన గమనించాడు. అది చలికాలం అయినప్పటికీ సాధువులు భుజంపై ఉత్తరీయం కూడా ధరించకుండా ఉండటాన్ని కూడా రాజు చూశాడు.

అది చూసిన రాజు మనసు నొచ్చుకుంది. వెంటనే తన సేవకులను పిలిచి, ఆ సాధువులకు కావలసిన ఉన్ని గుడ్డలను తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. రాజు సేవకులు వెంటనే ఆ పనికి పూనుకున్నారు. మహారాజు గుర్రం దిగి సాధువుల వద్దకు చేరుకున్నాడు. రాజు రాకను సాధువులందరూ గమనించారు.


వెంటనే వారిలో ఒక సాధువు కల్పించుకుంటూ..."నేను మీకైమైనా సాయపడగలనా...?" అని అడిగాడు. సాధువు అలా అడగ్గానే రాజు ఆశ్చర్యచకితుడైనాడు. కానీ ఆయనకు వెంటనే చాలా కోపం కూడా వచ్చింది. అయితే కోపాన్ని తమాయించుకుని శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాడు.

"మీనుంచి నాకెలాంటి సహాయమూ అక్కర్లేదు. ఈ చల్లటి వాతావరణంలో ఒంటిపై గుడ్డలు లేకుండా ఉన్న మిమ్మల్ని చూశాను. వెంటనే నా సేవకులకు చెప్పి మీ కోసం కొన్ని ఉన్ని గుడ్డలను తెప్పించాను, అన్నట్టు నేను ఈ దేశం రాజును" అని తనను తాను పరిచయం చేసుకున్నాడు మహారాజు.

"అయితే చిన్న చిన్న దేశాలను జయించి, వాటిని కొల్లగొట్టే రాజువు నీవేనన్నమాట. దోపిడీదారుడు మాకు ఏమి ఇవ్వగలడ?"ని ఆ సాధువు రాజు ముఖంలోకి నిశితంగా చూస్తూ చెప్పాడు. అది విన్న రాజుకు మరింతగా ఆశ్చర్యం వేసింది. మహారాజునని చెప్పినా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న సాధువు ముఖంలోని తేజస్సు ఆయనకు కొట్టొచ్చినట్లు కనిపించగా ఆలోచనలో పడిపోయాడు.

ఈలోపు కల్పించుకున్న సాధువు "రాజా... నువ్వు ప్రజల హృదయాలను జయించినప్పుడే విజేతవు అవుతావు. మా వరకూ మాకు ఏదీ అక్కర్లేదు. మా దగ్గర ఉన్నంతలో మేము ఇతరులకు ఇవ్వగలం. మీకు ఏమైనా సాయం కావాలా చెప్పండ"ని రాజు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు సాధువు.

తాను ఎదురుచూడని సంఘటన జరగడంతో ఆశ్చర్యంతోపాటు ఆలోచనల్లో పడిపోయిన మహారాజు... సాధువు మాటల్లో దాగుండే సందేశాన్ని అర్థం చేసుకున్నాడు. అన్యాపదేశంగా రక్తపాతం వద్దంటూ సాధువు చేసిన సూచనతో బుద్ధి తెచ్చుకున్న రాజు, ఆ రోజునుంచీ యుద్ధ ప్రయత్నాలు చేసి రక్తపాతం కల్గించకూడదని గట్టిగా మనసులో అనుకున్నాడు. సాధువుకు నమస్కరించి వెంటనే అక్కడినుంచి తన కోటకు బయలుదేరి వెళ్లిపోయాడు.

జమీందారు... కోడెదూడ...!!

క్రిష్ణాపురంలో శంకరప్రసాద్ అనే జమీందారు ఉండేవాడు. ఆయన పశువుల చావిడిలో మంచి మేలురకం ఆవులు ఎన్నో ఉండేవి. ప్రతిరోజూ పశువుల కాపరులు వాటిని ఇంటికి తోలుకురాగానే, ఆ ఆవుల మందను చూసి చాలా సంతోషపడేవాడు. ఒకరోజు తాను ఎంతో ఇష్టంగా చూసుకునే ఆవుల మందలోని ఒక కోడెదూడ తప్పిపోయింది.

కోడెదూడ తప్పిపోయిన విషయాన్ని పశువుల కాపరులు జమీందారుకు చెప్పగానే... దాన్ని వెదికేందుకు తానే బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. తానే కోడెదూడని వెదకబోతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, ఆయన ఒక రైతు వేషంలో బయలుదేరాడు. కనిపించిన వారినల్లా తన కోడెదూడ కోసం ఆచూకీ తీశాడు.

ఎవరిని అడిగినా, "మాకు తెలియదు, మేము చూడలేదు" అని చెప్పసాగారు. చివరికి శివపురం గ్రామ పెద్ద శేషయ్య దగ్గర తన కోడెదూడ ఉందన్న విషయం తెలుసుకుని సంతోషంగా అక్కడికి వెళ్లాడు జమీందారు. తప్పిపోయిన కోడెదూడను వెతుక్కుంటూ వచ్చినట్లు శేషయ్యకు తెలిపాడు.

దీంతో మారు వేషంలో ఉన్న జమీందారుతో "మా ఊరి రైతు సుబ్బయ్య పంటపొలాల్లో ఈ కోడెదూడ విచ్చలవిడిగా మేసి నష్టపరిచింది. అది మీదే అయితే, తగిన నష్టపరిహారం చెల్లించి తోలుకు పోవచ్చు"నని చెప్పాడు శేషయ్య. పశువుల చావిడిలో కట్టేసి ఉన్న కోడెదూడను చూసిన జమీందారు, అది తనదే అని నిర్ధారించుకున్న తరువాత శేషయ్యకు నష్టపరిహారం చెల్లించి దానిని తోలుకెళ్లాడు.

జమీందారు వెళ్లిపోయిన తరువాత శేషయ్యకు తన ఇంటి ఆవరణలోనే ఒక చేతి ఉంగరం దొరికింది. దాన్ని పరీక్షించి చూడగా, దానిపై జమీందారు ముద్ర కనిపించింది. వెంటనే తేరుకున్న శేషయ్య జమీందారు దగ్గరకు వెళ్లి, జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు.

అప్పుడు జమీందారు మాట్లాడుతూ... "శేషయ్యా ఆ ఉంగరం నేనే కావాలని నీ ఇంట్లో జారవిడిచాను. రైతు వేషంలో వచ్చింది కూడా నేనే"నని చెప్పాడు. దీంతో వెంటనే అందుకున్న శేషయ్య "మరి తమరు విషయం చెప్పకుండా దాచారెందుకు, దీనికి నేను చాలా బాధపడుతున్నాన"ని అన్నాడు.

అప్పుడు జమీందారు నవ్వుతూ... "బాధపడాల్సిన అవసరం లేదు శేషయ్యా... నేను నిజం చెప్పినట్లయితే, నువ్వు నష్టపరిహారం తీసుకోకుండానే నా కోడెదూడను ఇచ్చేసేవాడివి. నా ధర్మం నెరవేర్చే అవకాశం నాకు ఆ రకంగా కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. నీ బుద్ధిని పరీక్షించాలనే నేను అలా చేశాను. నా పరీక్షలో నువ్వు ధర్మంగా ప్రవర్తించి నెగ్గావ"ని చెప్పాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న శేషయ్య జమీందారుకి నమస్కరించి, ఇంటిదారి పట్టాడు.

స్నేహం లాభాపేక్షను ఆశించదు...!

ఒకానొక రోజున ఓ లేడిపిల్లలకు అలా నది ఒడ్డుకు వెళ్లి షికారు చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా నదీ తీరానికి వెళ్లిన లేడిపిల్ల హాయిగా తిరగసాగింది. అలా పచార్లు చేస్తుండగా దానికి నీటిలో పెద్ద చేప ఒకటి కనిపించింది. నీళ్ళల్లో నుండి పైకి ఎగురుతూ, కిందికి పడుతూ ఉండే చేపను చూసిన లేడి పిల్లకు భలే ముచ్చటేసింది.

చేప ఫీట్లను చాలాసేపు అలాగే చూస్తుండిపోయిన లేడిపిల్లకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే... నీటిలో ఇలా విన్యాసాలు చేసే చేపతో, నేలపైన చెంగు చెంగున గంతులేయగలిగే తాను స్నేహం చేస్తే ఎలా ఉంటుందని మనసులో అనుకుంది లేడిపిల్ల.

అలా అనుకున్న లేడిపిల్ల చేపను పిలిచి తన మనసులోని మాటను బయటపెట్టింది. అమ్మో.. భూమిమీద తిరిగే ఈ జంతువుతో నాకేమైనా ప్రమాదం సంభవిస్తే అని ఆలోచించిన చేపపిల్ల, అయినా ఈ లేడిపిల్ల తననేమీ చేయదులే అని మనసులోనే అనుకోసాగింది చేప. కాసేపటి తరువాత లేడిపిల్ల అభ్యర్థనకు చేప తన అంగీకారాన్ని తెలిపింది.


ఇంకేముంది చేప, లేడిపిల్ల ఇద్దరూ మంచి స్నేహితులయిపోయారు. ప్రతిరోజూ అవి రెండూ కలుసుకుని నీటిలో విశేషాలను, భూమిపైన విశేషాలను కథలు కథలుగా చెప్పుకుని సంతోషపడుతుండేవి. చేప తనకు తెలిసిన ఫీట్లను రోజుకొకటి చేసి చూపిస్తుంటే లేడిపిల్లకు చెప్పలేనంత సంతోషం కలిగేది. అలాగే లేడిపిల్ల గంతులేస్తూ ఎగరటం చూసి చేపకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగేది.

ఇలా గడుస్తుండగా ఒకరోజు నది ఒడ్డున కూర్చొని నీటిలోని చేపతో కబుర్లు చెబుతున్న లేడిపిల్లపైకి తోడేలు ఒకటి దాడి చేసింది. అయితే వెంటనే తేరుకున్న లేడిపిల్ల తన శక్తికొద్దీ దాంతో పోరాడింది. అయితే నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అది అంతగా నిలదొక్కుకోలేక పోయింది. వెంటనే తనకు ఏదైనా సాయం చేయమని చేపని అడిగింది.

"అయ్యో...! మిత్రమా.. నేను నీటిలో ఏమైనా సరే చేయగలనుగానీ, నేలమీదకు వస్తే నేను ఏమీ చేయలేను సరికదా, కాసేపట్లోనే చచ్చిపోతానని" చెప్పింది చేప. అవును కదా అనుకున్న లేడిపిల్ల ఏలాగోలా తోడేలును నిలవరించింది. ఎంతసేపటికీ దారిలోకి రాని లేడిపిల్లను వదిలేసి తోడేలు ఎంచక్కా పారిపోయింది.

అప్పుడు "మిత్రమా... నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేక పోయాను. ఇక మన స్నేహానికి అర్థమేముంటుంది చెప్పు. అందుకే నేను నీకు మిత్రుడిగా ఉండేందుకు తగనని" చెప్పి బాధపడింది చేప. ఇది విన్న లేడిపిల్ల, "నువ్వు నేలపైన పోరాడగలిగితే నా దారిన నన్ను వదిలేసేదానివి కాదు కదా, ఒకవేళ నీటిలో ఏదయినా ఆపద జరిగితే, నేను కూడా నీకు సాయం చేయలేను కదా...!" అంటూ ఓదార్చింది.

ఇంకా... "నువ్వు నీటిలో అయితే ఎలాగోలా నన్ను కాపాడేదానివి, నేను కూడా నేలపైనే కదా ఏమైనా చేయగలను. కాబట్టి నువ్వేమీ బాధపడాల్సింది లేదు మిత్రమా" అని చేపతో అంది లేడిపిల్ల. ఎలాంటి లాభాపేక్షా లేకుండా చేసేదే స్నేహం కాబట్టి, నువ్వేమీ బాధపడవద్దు, మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందామని చెప్పి, చెంగు చెంగున ఎగురుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది అందాల లేడిపిల్ల.

మీరే ఊహించుకోవాలి ప్రభూ...!!

శ్రీ కృష్ణదేవరాయులు ఆస్థానంలో అష్ట దిగ్గజాలైన కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు. ఈయనను తెనాలి రామలింగ కవి అనికూడా పిలుస్తుంటారు. ఆయన మహా తెలివైనవారు, చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, హాస్యకవిగా గుర్తింపు పొందిన ఈయనకు వికటకవి అనే బిరుదు కూడా కలదు.

ఒకసారి రాయలవారికి ఏమీ తోచకుండా ఉండటంతో... కోట గోడలకు వర్ణచిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని అనుకుంటారు. ఆ పనికోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు. ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా, అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ రామలింగ కవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.

ఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసిన రామలింగ కవికి... "రెండో వైపు ఎక్కడున్నది, మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి?" లాంటి సందేహాలు కలిగాయి. అదే విషయాన్ని రాయలవారి వద్ద ప్రస్తావించగా.. "రామలింగా.. మీరు ఆ మాత్రం ఎరుగలేరా..? వాటిని మీరు ఊహించుకోవాలి కదా...?" అన్నారు రాయలవారు.

"ఆహా... అలాగా ప్రభూ... బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యిందిలెండి" అన్నాడు రామలింగకవి. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాయలవారి వద్దకు వచ్చిన ఆయన.. "మహారాజా... కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనం గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాన"ని అన్నాడు.


దీంతో సంతోషం పట్టలేని రాయలవారి ముఖం విప్పారింది. "అద్భుతం... రామలింగ కవి చిత్రాలు వేయటమా, వేయండి వేయండి. పాత మసిబారిన చిత్రాల్ని తీసివేసి, మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి" అన్నాడు రాయలవారు ఉత్సాహంగా...! వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసిన ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు.

ఆ చిత్రాలలో అక్కడొక కాలు, ఇక్కడొక కన్ను, ఇంకోచోట ఒక వేలు... ఇలా గీశాడు రామలింగ కవి. అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయలవారిని తోడుకుని వచ్చారు. విడివిడి శరీర భాగాలను చూసిన రాజుగారు నివ్వెరపోయి.. "ఏంటి రామలింగా... గోడలపైన ఏంచేశారు, చిత్రాలెక్కడ...?" అని ప్రశ్నించారు.

"ఈ చిత్రాలలో నేను వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి కదా, ప్రభూ...!!" అన్నాడు రామలింగ కవి. రామలింగడి సమాధానంతో ఖంగుతిన్న రాయలవారు మౌనంగా ఉండిపోయారు. ఈలోపు "తమరింకా నా చిత్రాల్లోని అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు ప్రభూ" అన్నాడు రామలింగడు.

రాయలవారికి తిరిగీ ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం.. అంటూ తొందరపెట్టారు. రాయలవారిని ఓ గోడ వద్దకు తీసుకువెళ్లి ఎలాఉందో చూడమన్నాడు రామలింగ కవి. చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చని రంగుగల గీతలు మాత్రం గోడలో అక్కడక్కడా ఉన్నాయి.

"ఇదేంటి రామలింగా...?" అని అడిగాడు రాయలవారు ఉస్సూరుమంటూ. "గడ్డిమేస్తున్న ఆవు ప్రభూ" బదులిచ్చాడు రామలింగడు. మరి గడ్డెక్కడ..? అన్నాడు మహారాజు. ఆవు తినేసింది కదండీ అన్నాడు రామలింగడు. మరి ఆవెక్కడ ఉంది..? తిరిగీ ప్రశ్నించాడు రాయలవారు. గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్లిపోయింది ప్రభూ అన్నాడు రామలింగడు. రామలింగకవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్లబెట్టేశారు.

తెనాలి రామలింగడు... నలుగురు దొంగలు..!!

శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండేవాడు. ఆయన చాలా తెలివిమంతుడు. తన తెలివితేటలతో ఎంతటివారినయినా సరే సులభంగా ఓడించగలిగేవాడు. ఆ రకంగా కృష్ణదేవరాయలను సంతోషపరచి అనేక బహుమతులను స్వీకరించేవాడు.

రాయలవారి సామ్రాజ్యంలోనే నలుగురు పేరు మోసిన దొంగలు కూడా ఉండేవారు. వారంతా కలిసి ఓ రోజున తెనాలి రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేశారు. అనుకున్నట్లుగానే రామలింగడి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు, పెరట్లోని అరటిచెట్ల పొదలో నక్కి కూర్చున్నారు.

భోజనం వేళ కావడంతో రామలింగడు చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు. అనుకోకుండా అరటిచెట్లవైపు చూసిన ఆయనకు, చీకట్లో చెట్ల గుబుర్లో దాక్కుని కూర్చున్న దొంగలు కనిపించారు. వారిని చూసి కూడా ఏమాత్రం కంగారుపడకుండా, రామలింగడు ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు.

అనుకున్నదే తడవుగా వెంటనే తన భార్యను పిలిచి... "ఈ ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు, నాణాలు ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని ఒక సంచిలో మూటకట్టి మన పెరట్లోని బావిలో పడేద్దాం.. ఏమంటావు..?" అంటూ మెల్లిగా కన్ను గీటుతూ అన్నాడు రామలింగడు.

భర్త ఉపాయాన్ని అర్థం చేసుకున్న రామలింగడి భార్య సరేనని ఒప్పుకుంది. తరువాత భార్య చెవిలో గుసగుసలాడిన రామలింగడు ఇంట్లోకి వెళ్ళి ఒక మూటను సిద్ధం చేసి భార్యతో సహా పెరట్లోకి వచ్చి, దాన్ని బావిలో పడవేస్తాడు. ఇదంతా అక్కడే దాగి ఉండి గమనిస్తున్న దొంగలు లోలోపల సంతోషపడసాగారు.

వెదకబోయిన తీగ కాలికే తగిలిందని సంతోషపడిన దొంగలు... అందరూ నిద్రపోయేదాకా ఉండి, తరువాత బావిలోకి దిగుదాం అని నిర్ణయించుకున్నారు. అంతలో చీకటి పడింది. అనుకున్నట్లుగా అందరూ నిద్రపోయాక అరటి చెట్ల చాటునుంచి బయటికి వచ్చారు దొంగలు. బావిలోకి తొంగి చూశారు. వెంటనే ఒకడు బావిలోకి దూకి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు, నీరు ఎక్కువగా ఉండటంవల్ల నగల మూట దొరకడంలేదని బయటికి వచ్చేశాడు.

ఇక లాభం లేదు, బావిలోని నీటిని తోడేస్తే నీళ్ళన్నీ తగ్గిపోతాయి.. అప్పుడు సులభంగా నగలమూటను వెతకవచ్చని సలహా చెబుతాడు ఒక దొంగ. అతడి మాటకు సరేనన్న మిగిలినవారు ఒకరితరువాత ఒకరుగా బావిలోని నీటిని తోడి పోయసాగారు. దొంగలు నీరు తోడిపోయటాన్ని చాటుగా గమనించిన రామలింగడు మెల్లిగా పెరట్లోకి వచ్చి, అరటి చెట్లకు బాగా పాదులు చేసి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు.

దొంగలు ఎంతసేపు నీటిని తోడి పోసినా, బావిలోని నీరు ఏ మాత్రం తగ్గటం లేదు. అరటి చెట్లకు మాత్రం నీరు బాగా పారింది. తెల్లవారుఝాము కోడికూసే వేళ వరకూ అలా ఆపకుండా దొంగలు నీటిని తోడి పోస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు నగల మూట దొంగలకు దొరికింది. అబ్బా... కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ, మూటను విప్పారు దొంగలు. అయితే ఆ మూటలో నగలకు బదులుగా నల్లరాళ్ళు ఉండటం చూసి వారు ఖంగు తిన్నారు.

రామలింగడు తమనెలా మోసం చేశాడో అర్థం చేసుకున్న దొంగలు సిగ్గుతో తలవంచుకుని అక్కడినుంచి ఉడాయించారు దొంగలు. వీరు ఇంతకాలం తమను మించినవారు లేరని మిడిసిపడుతూ, ఎంతోమంది ఇళ్లను సులభంగా దోచుకెళ్లేవారు. అలాంటిది రామలింగడి ఇంట్లో చిన్న వస్తువును కూడా దొంగిలించలేకపోయారు.

ఈలోపు జరిగిన తతంగమంతా కృష్ణదేవరాయలకు తెలిసింది. రామలింగడి తెలివితేటలకు మురిసిపోయిన మహారాజు లెక్కలేనన్ని బహుమతులతో గౌరవించాడు. కాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఉపాయంతో ఎంతటి అపాయాన్నయినా సరే జయించవచ్చును.

కోతిబావ... టక్కరి నక్క..!

అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒక రోజున నది ఒడ్డుపైనుండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి, స్పృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్లు తెలీనంత మైకంలో పడివున్న నక్కను చూడగానే కోతికి జాలివేసి దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది.

తనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తరువాత నక్కకు స్పృహ వచ్చింది. "ఏమయ్యింది... ఎందుకు అక్కడ పడుకున్నావు..?" అని ఆరా తీసింది.

అప్పుడు నక్క "నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తోంది. దాహంగా ఉండటంతో నది వద్దకు వచ్చి, నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే...!" అంటూ నిట్టూర్చింది.

కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి “ఎవరూ లేరని బాధ పడకు. మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్క నున్న ఇల్లు కూడా నాదే ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది. ఇప్పుడా ఇల్లు ఖాళీగా ఉంది, నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు. అద్దె ఏమీ ఇవ్వక్కర్లేదులే...!” అని చెప్పింది.

దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి, కోతి సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది. ఒక రోజున నక్క బయటకు వెళ్ళి వస్తూ, ఇంటి తాళంచెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని “అయ్యో, నా తాళంచెవి పోయిందే ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం..?” అని దిగులుపడ సాగింది.

అప్పుడే వచ్చిన కోతి “ఏం జరిగింది...? ఎందుకలా దిగులుగా ఉన్నావు..?” అని నక్కని అడిగింది. "కోతిబావా... ఇంటి తాళంచెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అదిలేకుండా తలుపు తీయటం అసాధ్యమైన పని. ఇప్పుడెలా..?” అంటూ ఏడవటం మొదలెట్టింది. దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళంచెవి ఒకటి తెచ్చి ఇచ్చి “మరేం ఫరవాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై ఇది వాడుకో...!” అని చెప్పింది.

అది నక్క ఇంటి తాళానికే మరొక తాళంచెవి. కానీ టక్కరి నక్కకు అది తెలియలేదు. ఆ తాళంచెవి కోతి ఇంటిదే అనుకుంది. ఇంకేముంది వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది. కోతి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో, దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్కా పారిపోవాలని అనుకుంది. సమయం కోసం వేచి చూడసాగింది.

ఒకరోజు కోతిబావ, టక్కరి నక్కలు ఇద్దరూ కలిసి అలా షికారుకి బయల్దేరారు. సగం దూరం వెళ్ళగానే గాడిద “అబ్బా..! కోతిబావా, నాకు పొట్టలో నొప్పిగా ఉంది, షికారుకి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నువ్వెళ్ళు...” అని చెప్పి తిరిగి వచ్చేసింది. నక్క సరాసరి కోతిబావ ఇంటికెళ్లి, తన దగ్గరుండే తాళంచెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళంచెవి కోతి ఇంటిది కాదు కాబట్టి, అది తాళంలో ఇరుక్కుపోయింది.

దీంతో కంగారుపడిన నక్క... తాళంచెవిని అటూ, ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే నక్కకు చాలా భయం వేసింది. కోతి వచ్చిందంటే, జరిగినదంతా తెలుసుకుని తనని అసహ్యించుకుంటుంది అనుకుంది. ఈలోగానే ఇక్కడినుంచి పారిపోవాలి, లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేనని అనుకుని, తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడినుంచి ఉడాయించింది.

చూశారా పిల్లలూ... జాలిపడి స్నేహం చేసిన కోతిబావను మోసం చేయాలనుకున్న టక్కరి నక్కకు ఎలా తగిన శాస్తి జరిగిందో...! ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే... అర్హత లేనివారికి, జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే, వాళ్ళకు తగిన శాస్త్రి జరుగుతుంది.

పున్నమి చంద్రుడు... మంగోల్ రాజు...!!


విజయేంద్ర మహారాజు ఆస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న కవి దివాకరుడు. ఒకసారి మంగోల్ రాజు ఆహ్వానం మేరకు దివాకరుడి నాయకత్వంలో కవుల బృందం ఆ రాజ్య పర్యటనకు బయలుదేరి వెళ్లింది. చిన్న వయస్సులోనే దివాకరుడు విజయేంద్రుడి ప్రశంసలు పొందటం, తమ విదేశీ పర్యటనకు నాయకుడిగా ఉండటంతో మిగతా కవులందరూ ఈర్ష్యాసూయలతో రగిలిపోయేవారు. 

మంగోల్‌ రాజు గొప్పవాడే కానీ అతడి ముందు అంతా మోకరిల్లాలనే తత్వం కలిగినవాడు. అతనిలోని మంచి లక్షణాల్ని చెబుతున్నపుడు చూపే శ్రద్ధ లోటుపాట్లను చెప్పినపుడు కనిపించదు. కొద్ది రోజుల పరిచయంతోనే దివాకరుడికి ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా అర్థమయ్యాయి.

ఒకసారి కవి సమ్మేళనంలో తననూ విజయేంద్రుణ్నీ పోల్చుతూ ఓ పద్యం చెప్పమని మంగోల్‌ రాజు దివాకరుణ్ని అడిగాడు. తన పద్యంలో మంగోల్‌ రాజును పున్నమి చంద్రుడితోనూ, విజయేంద్రుణ్ని నెలవంకతోనూ పోల్చి చెబుతాడు దివాకరుడు. ఆ పోలిక మంగోల్‌రాజుకు ఎంతో నచ్చి దివాకరుడికి విలువైన వస్తువులు బహూకరించాడు.

దీంతో కవుల బృందంలోని మిగిలిన వారికి దివాకరుడిపై ద్వేషం మరింతగా పెరగసాగింది. కొద్దిరోజులకు మంగోల్‌ పర్యటనను ముగించుకొని కవుల బృందం స్వదేశానికి చేరుకుంది.

మంగోల్‌ పర్యటన విశేషాలను ఒక్కొక్కటిగా విజయేంద్రుడికి చెబుతున్నాడు దివాకరుడు. ‘ఏదేమైనా మీ తర్వాతే మంగోల్‌ రాజు’ అన్నాడు. ఆ మాటలకు ‘మరి మన రాజావారిని నెల వంకతోనూ, మంగోల్‌ రాజును పున్నమి చంద్రుడుతోనూ పోల్చావు కదా...!’ అని అక్కసుగా అన్నారు మిగిలిన కవులందరూ.

"అవును, మంగోల్‌ రాజు పున్నమి చంద్రుడే.. మన మహారాజు నెలవంకలాంటివారే..! పున్నమి చంద్రుడి వెలుగు ఒక్కరోజే, నెలవంక మెలమెల్లగా పెరుగుతుంది. దినదినాభివృద్ధి దాని లక్షణం. విజయేంద్రుల వారి నైజమూ అలాంటిదే. అందుకే అలా చెప్పా, మీరు భావిస్తున్నట్టు మన రాజుగారిని తక్కువ చేసి చెప్పలేదు’ అన్నాడు దివాకరుడు.

ఆ మాటలతో విజయేంద్రుడి మనసు ఉప్పొంగిపోగా... విలువైన కానుకలిచ్చి దివాకరుణ్ని పొగడ్తల్లో ముంచెత్తడంతో పాటు మిగిలిన కవులందరినీ మందలించాడు. అసూయతో దివాకరుడిని రాజు ముందు దోషిగా నిలబెట్టాలనుకుని, తామే పరాభవం పాలైనందుకు సిగ్గుతో తలదించుకున్నారు కవులు. కాబట్టి పిల్లలూ... ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మంచివికావని అర్థమైంది కదూ...!!

కోపం అనర్థాలకు మూలదాయకం...!!

నరసాపురం అనే ఊర్లో సన్నీ అనే ఓ పదేళ్ల అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపం వస్తుండేది. ఎవరైనా ఏదైనా అంటే సన్నీకి కోపం పెరిగిపోయి, వారికి చేత్తోనే సమాధానం చెప్పేవాడు. అలా కోపిష్టిగా ఊర్లో అందరివద్దా ముద్ర వేయించుకున్న సన్నీకి, తనని అందరూ అసహ్యించుకోవడం చాలా బాధగా అనిపించేది.

దీంతో తనకున్న విపరీతమైన కోపమే, ఊర్లో వారందరికీ తనపై అసహ్యాన్ని పుట్టేలా చేస్తోందనీ... తన ప్రవర్తనను ఎలాగైనా సరే మార్చుకోవాలని అనుకున్నాడు సన్నీ. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి, తనకా దురలవాటు ఎలాగైనా సరే పోయేలా చేయమని వేడుకున్నాడు.

కొడుకులో మార్పు చూడాలనుకున్న సన్నీ తండ్రి... కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టమని సలహా ఇచ్చి, ఓ సంచినిండా మేకులను ఇచ్చాడు. దానికి సరేనన్న సన్నీ, మొదటిరోజు గోడకు 40 మేకులు కొట్టాడు. అలా నెమ్మది నెమ్మదిగా సన్నీ తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు.

అలాగే, కోపంతోపాటు సన్నీ గోడకు కొట్టే మేకులు సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది. గోడలు మేకులు కొట్టడంకన్నా తన కోపాన్ని తగ్గించుకోవటమే సులభమనిపించింది సన్నీకి. చిట్టచివరికి ఓ రోజంతా సన్నీకి కోపమే రాలేదు. ఆ విషయం తండ్రివద్దకు పరుగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా చెప్పాడు.

"చూడు బాబూ...! నీకు ఏ రోజైతే కోపం రాదో, ఆ రోజున గోడకు కొట్టిన మేకుల్లో ఒక్కోదాన్నీ తీసేయి" అని చెప్పాడు సన్నీ తండ్రి. తండ్రి చెప్పినట్లుగానే కోపం రాని రోజున గోడకున్న మేకులను ఒక్కోదాన్నీ తీసివేయటం మొదలుపెట్టాడు సన్నీ. చివరికి ఓరోజు గోడకు కొట్టిన మేకులన్నింటినీ తీసివేశానని తండ్రికి చూపించాడు.

దీంతో సన్నీ ఇచ్చిన మేకులను చేతుల్లోకి తీసుకున్న తండ్రి, గోడవద్దకు తీసుకెళ్లాడు. "చూడు నాన్నా... గోడకు పడిన రంధ్రాలు చూశావా..? అవి ఎప్పటికీ మూసుకుపోవు. అలాగే కోపంలో మనం అనే మాటలు జీవితాంతం దాకా చెరగని మచ్చల్లాగే ఉండిపోతాయి. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు. ఒక దెబ్బకన్నా ఒక మాట కలకాలం నిలిచి పోతుంద"ని వివరించి చెప్పాడు సన్నీ తండ్రి.

కాబట్టి పిల్లలూ...! కోపం అనేది మనిషికి విచక్షణా జ్ఞానం అనేది లేకుండా చేస్తుంది. కోపంలో మనం అనే మాటలు మన తల్లిదండ్రులను, దగ్గరివారిని ఎంతగానో బాధిస్తాయి. అలాంటి మాటలను వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలమంతా మనతో సరిగా ఉండలేరు. మనం వారివద్ద నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందలేము కాబట్టి, కోపం అనేది అనర్థాలకు మూలమని తెలుసుకుని, బుద్ధిగా మసలుకుంటారు కదూ...!!

పర్షియా మహారాజు... బీర్బల్...!!

బీర్బల్ తెలివితేటలు, చతురత గురించి ప్రపంచదేశాలన్నింటికి కూడా పాకిపోయింది. అనేక దేశాల సభలలో బీర్బల్ అంటే తెలియనివారే లేకపోయేవారు. అలా బీర్బల్ గురించి విన్న అక్బర్ చక్రవర్తి మిత్రుడైన పర్షియా మహారాజు.. తమ దేశానికి ఓసారి రావాల్సిందిగా బీర్బల్‌ను ఆహ్వానించాడు.

చక్రవర్తి ఆహ్వానం మేరకు పర్షియా రాజ్యానికి విచ్చేసిన బీర్బల్... అంతకుమునుపెన్నడూ పర్షియా చక్రవర్తిని చూడలేదు. దీంతో చక్రవర్తిని గుర్తుపెట్టడం ఎలాగబ్బా... అనుకుంటూనే, సభలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఆయనకు ఒకే రకమైన దుస్తులు ధరించిన ఏడుగురు వ్యక్తులు ఒకే రకమైన ఏడు సింహాసనాలపై కూర్చుని ఉండటం కనిపించింది. వారి కిరీటాలు కూడా ఒకేలా ఉండటం బీర్బల్ గమనించాడు.

ఈ ఏడుగురిలోనే పర్షియా చక్రవర్తి ఉన్నాడు. బీర్బల్ తెలివి తేటలను పరీక్షించేందుకు పర్షియా చక్రవర్తి ఇలాంటి ఏర్పాట్లను చేశాడు. దీన్ని గమనించిన బీర్బల్... సభలో ఎక్కడా ఆగకుండా నేరుగా పర్షియా చక్రవర్తి వద్దకు వెళ్ళి వందనం చేశాడు.

దీనికి ఆశ్చర్యపోయిన పర్షియా చక్రవర్తి... "బీర్బల్... నీ తెలివితేటల గురించి చాలా విన్నానుగానీ, ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అసలు నేను చక్రవర్తినని ఎలా తెలుసుకున్నావో, కాస్త చెప్పగలవా..?" అని అన్నాడు. దీనికి బీర్బల్ నవ్వుతూ... "చక్రవర్తీ... నేను మీ ముఖంలోని విశ్వాసంతో కూడిన హావభావాల ద్వారా మిమ్మల్ని గుర్తు పట్టాను. నేను దర్బారులోకి ప్రవేశించగానే, మీరు నన్ను చూశారు. కానీ మీలా తయారైన మిగతావారు మాత్రం మిమ్మల్నిచూశార"ని చెప్పాడు.

బీర్బల్ జవాబుకు సంతృప్తి చెందిన పర్షియా చక్రవర్తి ఆయన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు. కొద్దిసేపు మాటామంతీ అనంతరం బీర్బల్‌కు పర్షియా ప్యాలెస్‌ను చూపించాల్సిందిగా తన మంత్రులను ఆదేశించాడు చక్రవర్తి. పర్షియా ప్యాలెస్‌నంతా చూపించిన మంత్రి... చివరికి మూత్రశాలను కూడా చూపించాడు.

మూత్రశాలలో గోడకు వేలాడదీసిన అక్బర్ చిత్రపటాన్ని కూడా చూయించాడు. అలా చేసి బీర్బల్ సహనాన్ని పరీక్షించాలని చక్రవర్తి ముందే ప్లాన్ వేశాడు. అది గ్రహించిన బీర్బల్ నవ్వుతూ... "అక్బర్ లాంటి మహనీయ వ్యక్తి చిత్రపటాన్ని చూస్తేగానీ మీ రాజుగారికి ఇక్కడ చేసే పనులు సజావుగా సాగవేమో...?" అని చురక అంటించగా... మంత్రి మాత్రం మారుమాట్లాడకుండా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడు.

ప్యాలెస్ చూసిన అనంతరం మంత్రి, బీర్బల్ ఇద్దరూ చక్రవర్తి సభకు చేరుకున్నారు. మూత్రశాలలో జరిగిన సంఘటనను మంత్రి చక్రవర్తికి వివరించగా.. చక్రవర్తి కోపగించుకోకుండా, బీర్బల్ తెలివికి నిశ్చేష్టుడై.. "బీర్బల్... నేను నీలాంటి తెలివైనవాడే కాకుండా, సహనశీలియైన వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను" అని అన్నాడు. అంతేగాకుండా... విలువైన కానుకలను ఇచ్చి, తన ప్యాలెస్‌లో గౌరవ అతిథిలా మరికొన్ని రోజులు ఉండాల్సిందిగా బీర్బల్‌ను కోరాడు పర్షియా చక్రవర్తి.

మర్యాద రామన్న... సుబ్బయ్య గుర్రం..!!

ఒక ఊళ్లో సుబ్బయ్య, శంకరయ్య అనే వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో కాపురం ఉండేవారు. సుబ్బయ్య వ్యాపారి కాగా, శంకరయ్య ఊర్లో కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినవాడు. శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు.

ఒకరోజు సుబ్బయ్య ఏదో పనిమీద పక్క ఊరికి వెళ్తూ... "శంకరయ్యా...! నేను పక్కనే ఉండే శివపురానికి వెళ్తున్నాను. తిరిగీ వచ్చేందుకు వారం రోజులుదాకా పట్టవచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి వెళ్తాను" అని అన్నాడు. దీంతో మంచివాడైన శంకరయ్య, సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు.

సుబ్బయ్య ఊరెళ్లిన తరువాత రెండు రోజులపాటు బాగా ఆరోగ్యంగానే ఉన్న గుర్రం... మూడోరోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో, సుబ్బయ్యకు ఏమని చెప్పాలో తెలియని శంకరయ్య దేవుడా...! అంటూ తలపట్టుకుని బాధపడుతూ కూర్చున్నాడు. ఇక చేసేదేముంది.. సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుందని తననుతాను సముదాయించుకున్నాడు.

చెప్పినట్టుగానే వారం రోజుల తరువాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం చనిపోయిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆగ్రహంతో.. "చూడు శంకరయ్యా...! నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బుగానీ, మరే ఇతర గుర్రముగానీ వద్దు...! ఏమైనా చేయి, నాకు దాంతో సంబంధం లేదు" అని తెగేసి చెప్పాడు. దీంతో ఏమీ పాలుబోని శంకరయ్య మర్యాద రామన్న వద్దకెళ్లి జరిగినదంతా చెప్పి వాపోయాడు.

అంతా విన్న మర్యాద రామన్న... ఒక గొప్ప ఎత్తువేసి, వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. మర్యాద రామన్న సలహా మేరకు కాచుక్కూర్చున్న శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమేగాకుండా, గోడకు ఆనించి పెట్టిన పెద్ద పెద్ద కుండలను పొరపాటున బద్దలు కొట్టేశాడు.

దీంతో "అయ్య బాబోయ్..! నా కుండలు బద్ధలైపోయాయి సుబ్బయ్యా... ఇప్పుడెలా..?" అని గట్టిగా అరిచాడు శంకరయ్య. "దీని కోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్యా...? వాటి ఖరీదు నేను కట్టిస్తాన్లే, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను" అన్నాడు సుబ్బయ్య. "అయ్యో అలా చెబుతారేంటి..? నాకు నా కుండలే కావాలి, వేరేవి వద్దు" అని గట్టిగా పట్టుబట్టాడు శంకరయ్య.

సుబ్బయ్య, శంకరయ్యలు ఎంతసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో... చివరకు ఇద్దరూ కలసి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మాటలను ఓపికగా విన్న మర్యాద రామన్న... సుబ్బయ్యను మందలించి, గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకుని, అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దీంతో.. తప్పు తెలుసుకున్న సుబ్బయ్య ప్రశ్చాత్తాపంతో ఇంటిదారిపట్టాడు

చిలకమ్మ కూతురి కళ్యాణం

చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్లీడు వచ్చింది. పిల్ల కోరుకున్న వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురి స్వయంవరానికి ఏర్పాట్లు చేసి, దగ్గర్లోని పెళ్లికుమారులను ఆహ్వానించేందుకు వెళ్లింది.

దారిన వెళ్తున్న చిలకమ్మకు... గుడిసె పైకి ఎక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది. "అల్లుడూ.. అల్లుడూ...! రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను నువ్వు తప్పకుండా రావాలి" అని అంది.

దీంతో.. "నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా..?" అంటూ నసిగింది కోడిపుంజు. "నా కూతురికేం బాబూ... చక్కదనాల చుక్క కాదూ...!" అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది.

చక్కగా పురివిప్పి ఆడుతున్న నెమలిబాబు చిలకమ్మకు కనిపించగానే... "నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా...!" అని అంది. "నా అంత అందగాడికి నీ కూతురా...?" అంటూ చిర్రుబుర్రులాడాడు నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికేం తక్కువకాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ.

అలాగే చిలుక, పావురాయి, కొంగ బాబుల ఇళ్లకు వెళ్లి కూతురి స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ. అయితే, అందరూ కోడిపుంజు, నెమలిబాబులకుమల్లే తలోమాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్లందరికీ ఏదో ఒక విధంగా సర్దిచెప్పి, వాళ్లను సమాధానపర్చి.. కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది.

మరుసటిరోజు ఓ మామిడిపండ్ల తోటలో.. చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్పుటాపుగా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్న చిలకమ్మకు... ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింకబాబు కనిపించాడు.

చిలకమ్మను చూడగానే... "స్వయంవరానికి నన్ను పిలవకపోయినా, నేనే వచ్చాశానత్తా..!" అన్నాడు గోరింకబాబు. వస్తే "వచ్చావుగానీ... కాళ్ళకూ, వేళ్ళకూ అడ్డుపడకుండా ఓ మూలన వెళ్ళి కూర్చోపో..!" అంటూ చిర్రుబుర్రులాడింది చిలకమ్మ. సరే అత్తా అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింకబాబు.

చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి, వేదిక వద్దకు తీసుకువచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్ళికొడుకులవైపు నడిచింది. ముందుగా కోడిపుంజు ఆ తరువాత నెమలిరాజు, చిలుక, కొంగ, మైనా ఇలా ఒక్కొక్కరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.

అలా వెళ్లిన చిలకమ్మ కూతురు చివర్లో ఆగిపోయింది. అక్కడే ఉన్నాడు గోరింకబాబు. గోరింక కళ్లలోకి సిగ్గుమొగ్గై చూసింది చిలకమ్మ కూతురు. గోరింకబాబు కూడా మెల్లిగా కన్నుగీటాడు. అంతే అతని మెడలో మాల వేసేసి, నవ్వుతూ తల్లిదగ్గరకు చేరి, వెనుకన దాక్కుంది.

దీంతో మామిడితోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలివచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమానభారంతో వాడిపోయాయి. వద్దు వద్దంటే, ఒప్పించి మరీ తీసుకువచ్చి, ఇంతలా అవమానిస్తారా...?! అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు.

కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ... తాను చేసిన పొరపాటును గ్రహించి, వెంటనే తేరుకుని... "నాయమ్మే... నా తల్లే..! నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే..! ముందే నాకీ విషయం తెలిసి ఉంటే, ఆ పొగరుబోతుల దగ్గరకు వెళ్లి బ్రతిమాలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా...!" అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ.

మహర్షి శంఖం నేర్పిందేంటి...?

అనగనగా ఒకరోజు. మామిడిమల్లి ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు.

"వజ్రాల హారం వేసుకుని మరీ బయల్దేరారేంటండీ..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా ఏంటీ..?" ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి.

"నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ...? పది వేళ్ళకూ ఉంగరాలు పెట్టుకోలేదూ...? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది" అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి.

ఇంతలో మూడో వ్యాపారి కలుగ జేసుకుని.. "డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు, నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు... ఇదంతా సంపద వల్లనే కదా...!!" అంటూ చెప్పుకొచ్చాడు.

"మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే... అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి" మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైనవాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక.. మహర్షిని ఆటపట్టించసాగారు.

"నీ దగ్గర ఏముంది ముసలోడా...?" అన్నాడొక వ్యాపారి.

ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ... "నా దగ్గరేముంటుంది నాయనలారా...! అంటూ, జోలె లోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ... ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు" అన్నాడు.

"అయినా.. ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే...!" అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు. దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు.

పడవ అలా నది మధ్యలో సాగుతుండగా... ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి, బలమైన ఈదురుగాలులు వచ్చాయి. గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను "సాములూ.. అందరూ గట్టి అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు" అని చెప్పాడు.

దీంతో... వ్యాపారులంతా పెద్ద పెట్టున... రక్షించండి... రక్షించండి... అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి.. వ్యాపారులను, మహర్షిని కాపాడారు.

బ్రతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ... మహర్షి వద్దకు వచ్చి... "నిన్న ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా.. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం..." అంటూ, అన్యధా భావించకుండా, దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు.

అప్పుడు మహర్షి నవ్వుతూ... "నాయనలారా... డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు" అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంటంటే పిల్లలూ... ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం.

తెల్ల గులాబీ... పింకీ నేస్తాలట..!!

ఆరోజు స్కూలుకు సెలవు ఇవ్వటంతో... తోటలోకెళ్లి పువ్వులు కోసుకోవాలని అనుకున్న పింకీ, అమ్మా... తోటలోకెళ్లి పూలు కోసుకొస్తాను అని పరిగెత్తింది. జాగ్రత్తే తల్లీ... ఆ గులాబీ చెట్లకు ముల్లుంటాయి అని అంది పింకీ తల్లి అరుణ. అలాగేనమ్మా అంటూ తోటలోకి అడుగుపెట్టింది పింకీ.

పచ్చని మొక్కల మధ్య విరబూసేందుకు సిద్ధంగా ఉన్న తెల్లగులాబీ ఒకటి పిల్లగాలికి చిరునవ్వులు చిందిస్తూ... అటూ, ఇటూ రాజసంగా ఊగుతోంది. ఆ దృశ్యాన్ని తన బుల్లి కళ్లతో చూసిన పింకీకి భలే ముచ్చటేసింది. వెంటనే అక్కడి వెళ్ళి... భలే భలే గులాబీ, నువ్వు నాతో స్నేహం చేస్తావా... నిన్ను ముద్దుగా చూసుకుంటానే అంది పింకీ.

స్వచ్ఛమైన నవ్వులు పూయిస్తూ.. దీనంగా తనతో స్నేహం చేయమని అడుగుతున్న పింకీని చూసిన గులాబీ వెంటనే... సర్లే పాపా... నేను కూడా నీతో స్నేహం చేస్తాను, నిన్ను మురిపించి.. మైమరిపిస్తాను అంది. దీంతో ఇంటివెనుకనున్న ఆ గులాబీ చెట్టును మెల్లిగా తీసుకువచ్చి ఇంటిముందు పెట్టింది పింకీ.

ఇక అప్పటినుంచీ... ప్రతి రోజూ హాయిగా ఆడుతూ, పాడుతూ సంతోషంగా నీళ్ళు పోస్తూ గులాబీ మొక్కను పెంచుతోంది పింకీ. తెల్లగులాబీని చూస్తూ, అమ్మచేతి గోరుముద్దలు తింటూ హాయిగా గడపసాగింది ఆ పాప. మూడు రోజుల తరువాత ఆ గులాబీ పెద్దగా విచ్చుకుంది.

అది గమనించిన పింకీ... ఒకరోజు గులాబీని కోయబోయింది ఆత్రంగా..! పువ్వును తాకిందో లేదో అంతలోనే "అమ్మా" అంటూ తన చేతిని వెనక్కు తీసేసుకుంది బాధగా.. వేలిమొన చురుక్కుమంటోంది. చూస్తే రక్తం కారుతోంది. దాన్ని చూసిన ఆ అమ్మాయి గాబరాపడుతూ ఏడ్వసాగింది.

అది చూసిన గులాబీ, "అయ్యో నా నేస్తమా..! నన్ను జాగ్రత్తగా కోయాలి కదమ్మా...! నా రక్షణకోసం నేను కనపడని సిపాయిల్లాంటి ముళ్ళను కలిగి ఉన్నాను. అవి లేకపోతే దొంగలు నన్ను సులభంగా కోసుకెళ్లిపోతారు. అందుకని ఆత్మరక్షణ కోసం కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకొన్నాను" అని చెప్పింది గులాబి.

"ఏడుపు మర్చిపోయిన పింకీ.. అమ్మో..! నువ్వు ఇలాంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నావా, ఇంత చిన్న బుర్రలో ఎన్ని తెలివితేటలో నీకు... అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం" అంది పింకీ. నిన్ను చూస్తోంటే నాకెంత ముచ్చటేస్తోందో తెలుసా..? మన దేశ నాయకులు కూడా నీలా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఉంటే... తీవ్రవాదులు, విధ్వంసక శక్తులు అమాయక ప్రజలను చంపే పరిస్థితి ఉండేది కాదు బాధగా చెప్పింది పింకీ.

అయితే... "దేశాన్ని కాపాడేందుకు రాత్రింబవళ్లూ కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన వీర జవానులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి పాదాల వద్ద నిన్ను ఉంచి వారికి జోహార్లు చెబుదామని నిన్ను కోయబోతే ఇలాగైంది, సారీ గులాబీ నేస్తమా" అంది పింకీ.

అంతా ఓపికగా విన్న తెల్లగులాబీ... "పాపా.. పాపా...! అలాంటి చోటుకు వెళ్లడం కంటే నాకు అంతకంటే ఏం కావాలి..? త్వరగా నన్ను కోసుకుని అక్కడికి తీసుకెళ్లు పాపా... నేను కూడా ఆ వీర జవానులకు నివాళి చెబుతాను" అని వేడుకుంది గులాబీ. దీంతో పింకీ గులాబీ మొక్కను కోసుకుని వీరజవానులకు నివాళులర్పించేందుకు బయలుదేరింది.

తెనాలి రామలింగడు... తేలు కుట్టిన దొంగ..!

ఆ రోజుల్లో తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.

ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...

"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు" అని అన్నాడు. దీనికి ఆమె "ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను" అంది.

"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను" అన్నాడు రామలింగడు. "ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.

జరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.

ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... "మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు.

ధనం కంటే గుణమే గొప్ప

ఒక ఊర్లో రామనాథం అనే భూస్వామి ఉండేవాడు. అతను తరచుగా తనకున్న లెక్కలేనంత పొలాన్ని చూస్తూ పొంగిపోతూ ఉండేవాడు. పంటను అమ్మగా వచ్చిన డబ్బులో ఒక్క రూపాయిని కూడా దానధర్మాలకు కేటాయించేవాడు కాదు. కనీసం కూలిపని చేసేవారికయినా సరిగా కూలీ కూడా ఇచ్చేవాడు కాదు.

రామనాథం పొలానికి పక్కనే శివయ్య అనే వ్యక్తి పొలం కూడా ఉండేది. శివయ్య రామనాథం లాగా కాకుండా, తన పొలంలో పనిచేసే కూలీలకు తగినంత డబ్బు ఇవ్వటమేగాకుండా, తన లాభాలలో కొంత భాగాన్ని పేద ప్రజలకు పంచిపెట్టేవాడు. ఇంకా మిగిలినట్లయితే దానధర్మాలకు కేటాయించేవాడు.

ఒకరోజు రామనాథం, శివయ్యలిద్దరూ పొలంగట్టుపైన నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. "హమ్మయ్య ఈ ఏడు దేవుడు చల్లగా చూడబట్టి, పంటలు బాగా పండి అందరం సుఖంగా ఉంటున్నాం కదండీ..?" అన్నాడు శివయ్య రామనాథంతో. దానికి బదులుగా రామనాథం మాట్లాడుతూ... "ఎంత డబ్బు ఇస్తే ఏం సుఖం శివయ్యా.. ఉన్న డబ్బునంతా దానధర్మాలంటూ వృధా చేయడమే తప్పిస్తే, ఒక్క రూపాయన్నా దాచిపెడుతున్నావా..?" అని దెప్పిపొడిచాడు.

"నాకు సరిపోయేంత డబ్బును ఉంచుకుని మిగిలిన డబ్బును మాత్రమే నేను దాన ధర్మాలకు పంచుతున్నాను. దాంట్లో నాకు ఎలాంటి కష్టమూ లేదండీ.." అని చెప్పాడు శివయ్య. "అన్నట్టు.. చెప్పడం మరచిపోయాను.. ఈ రోజు రాత్రి మన ఊర్లో అందరికంటే సంపన్నుడైన ఓ వ్యక్తి చనిపోతాడని నిన్న రాత్రి నాకో కల వచ్చిందండి" అన్నాడు శివయ్య.

శివయ్య మాటలను కొట్టిపారేసిన రామనాథం... "ఆ.. కలలు నిజమవుతాయా. ఏంటి..?" అని పట్టించుకోలేదు. కాసేపటికి ఇద్దరూ ఎవరి దారినవాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు. శివయ్య చెప్పిన మాటలను కొట్టిపడేశాడేగానీ, రామనాథానికి మనసులో మాత్రం కాస్తంత దిగులుగానే ఉంది. ఊరిలో తానే ధనవంతుడన్న విషయం అతనికి పదే పదే గుర్తుకొచ్చేది.

ఇక లాభం లేదనుకుని వైద్యుణ్ణి పిలిపించాడు రామనాథం. ఆయన్ని పరిశీలించిన వైద్యుడు... "మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రాణానికి ఎలాంటి హానీ లేదని" చెప్పాడు. అయినా కూడా రామనాథం మనసు ప్రశాంతంగా లేదు. శివయ్య మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని దిగులు చెందాడు. భయం వేయడంతో వైద్యుడిని తనతోపాటే ఉండిపోమని చెప్పాడు. రాత్రంతా రామనాథం జాగారం చేయక తప్పలేదు.

తెల్లవారగానే ఒక పనివాడు పరుగెత్తుకుంటూ వచ్చి... "అయ్యా... శివయ్యగారు రాత్రి నిద్రలోనే చనిపోయారట..!" అని ఏడుస్తూ చెప్పాడు. ఏనాడూ కూడా డబ్బులకు ఆశపడని ఆ మహానుభావుడు ఎలాంటి కష్టం లేకుండా, చాలా సుఖంగా నిద్రలోనే చనిపోవడం ఆయన చేసుకున్న పుణ్యమేనని అన్నాడు రామనాథం పక్కనే ఉన్న వైద్యుడు.

"సంపన్నుడు అంటే... డబ్బులు ఎక్కువగా ఉండేవాడు కాదు.. గొప్ప గుణం కలిగినవాడే నిజమైన సంపన్నుడు" అని తల్లి చెప్పిన మాటలు లీలగా గుర్తుకు రాసాగాయి రామనాథానికి. అంతే... ఆరోజు నుంచి తన ప్రవర్తనను మార్చుకున్న అతడు తనకున్న సంపదనుంచి వచ్చిన డబ్బుతో నలుగురికీ సాయం చేయడం మొదలుపెట్టాడు.

యాపిల్ చెట్టూ.. సుబ్బూ మంచి ఫ్రెండ్స్ అట..!

ఒకరోజు స్కూలు నుంచి ఇంటికెళ్తుంటే.. దార్లో సుబ్బూకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది. అంతే పరుగెత్తుకుంటూ వెళ్లి రెండు యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తరువాత అక్కడే, ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు.

ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పట్నించీ మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆరోజు నుంచీ ప్రతిరోజూ సుబ్బూ ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లుతిని, ఆడుకుని, నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.

ఇక యాపిల్ చెట్టు కూడా రోజూ సుబ్బూ కోసం ఎదురుచూసేది. సుబ్బూ పెద్దవాడవుతున్నట్లుగానే, చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి. ఓ రోజు సుబ్బూ నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా.. ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటికోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బూ.

నా దగ్గర కూడా డబ్బు లేదు కానీ.. నా పండ్లను అన్నింటినీ అమ్మి, ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బూ సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు. చాలా కాలందాకా సుబ్బూ ఆ చెట్టుదగ్గరికి రానేలేదు. చెట్టు మాత్రం సుబ్బూకోసం ఎదురుచూస్తూనే ఉండేది.

ఓ రోజు పెద్దవాడయిన సుబ్బూ తిరిగీ చెట్టు దగ్గరకు వెళ్లాడు. చెట్టు సుబ్బూని చూసి ఆనందించి, నాతో కాసేపు ఆడుకోరాదూ? అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను.. నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బూ. నా దగ్గర ఇల్లు లేదుగానీ, నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు.

దానికి సంతోషించిన సుబ్బూ... కొమ్మలను నరికి తీసుకుని వెళ్లిపోయాడు. సుబ్బూ తన కొమ్మలను నరికినా ఆ చెట్టు ఏ మాత్రం బాధపడలేదు. అయితే, సుబ్బూ మళ్లీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్నయిపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బూ ముసలివాడయిపోయి, తిరిగీ చెట్టుదగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది.

అయితే.. తానిప్పుడు ముసలివాడినయ్యాననీ.. కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు. ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని, ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బూ. తన దగ్గర పడవలేదుగానీ... తన చెట్టు మొదలును నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. అలాగేననీ చెట్టు చెప్పినట్లుగా చేశాడు సుబ్బూ.

చాలా సంవత్సరాల తరువాత మళ్లీ సుబ్బూ యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు. అది చూసిన చెట్టు.. "బాబూ నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీలేదని" ఏడుస్తూ బదులిచ్చింది. ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు గానీ...ఈ ముసలి తనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టుమొదలు మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బూ. అది విన్న యాపిల్ చెట్టు.. సంతోషం నాయనా.. ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞురాలినంటూ కన్నీళ్లతో పకపకా నవ్వింది చెట్టు.

ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలూ... కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా.. మనకు సహాయం చేసిన వారితో, కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు.

విజ్ఞతతో ఆలోచించడమే ముద్దు..!

పూర్వం సిరిపురంలో ఒక బాటసారి తలపై తేనె పెట్టుకుని వెళ్తూ... ఏవో ఆలోచనల్లో పడి బరువు సంగతిని మర్చిపోయాడు. ఇంతలో అతడి తలపై పాత్ర పట్టుతప్పి కిందపడి, తేనె అంతా నేలపాలయ్యింది.

ఆ తేనెను తాగేందుకు తేనెటీగ ఒకటి వచ్చి వాలింది. తేనెటీగను మింగేందుకు సాలీడు సిద్ధమయ్యింది. సాలీడును తినేందుకు బల్లి సన్నద్ధమయ్యింది. బల్లి ప్రాణం తీసేందుకు ఒక పిల్లి కూడా అక్కడికి చేరుకుంది. ఆ వీధిలో ఉండే వర్తకుడి పెంపుడు పిల్లే అది.

అక్కడే ఉన్న రాజసేవకుడి పెంపుడు కుక్క వర్తకుడి పిల్లిపై దాడి చేసేందుకు ఎగురుతోంది. ఒకవేళ పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని సందేహించిన వర్తకుడు అక్కడికి చేరుకున్నాడు. అయితే, వర్తకుడు తన కుక్కను చంపుతాడేమోనని సందేహించిన రాజ సేవకుడు కూడా కత్తి తీసి సిద్ధంగా నిల్చున్నాడు.

ఇంతలో సాలీడు తేనెటీగను మింగేసింది. ఆ తరువాత బల్లి సాలీడును తినేసింది. బల్లిని చంపేసింది పిల్లి. పిల్లి గొంతు పట్టుకుని కరచింది కుక్క. దీంతో వర్తకుడు కోపంతో ఊగిపోతూ, కర్రపుచ్చుకుని కుక్కని చంపేశాడు. కుక్క చనిపోవడంతో ఆగ్రహం చెందిన రాజ సేవకుడు వర్తకుడి మెడపై కత్తితో ఒక దెబ్బ వేశాడు. అంతే వర్తకుడు రక్తపు మడుగులో గిలాగిలా తన్నుకున్నాడు. దీంతో చుట్టుప్రక్కల ప్రజానీకమంతా కోపంతో రాజసేవకుడిని మట్టుబెట్టారు.

ఇదంతా విన్న సిరిపురం రాజు... "ప్రజలకు ఇంత తెగింపా..? ఒక రాజ సేవకుడిని పట్టుకుని చంపేస్తారా..?" కోపంతో కళ్లెర్రజేసి, ప్రజలపైకి సైన్యాన్ని సిద్ధం చేయబోయాడు. ఇదంతా ప్రక్కనే ఉండి చూస్తోన్న మంత్రి ఇక ఈ విషయంలో కలుగజేసుకోకపోతే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో అని ఆలోచించి రాజు వద్దకు వెళ్లాడు.

"మహారాజా... ఇప్పటికే చాలా అనర్థం జరిగిపోయింది. నేలపాలైన తేనెపై తేనెటీగ వాలటం, దాన్ని సాలీడు మింగటం, సాలీడును బల్లి, బల్లిని పిల్లి మింగటం.. ఇవన్నీ ప్రకృతి సహజాలే. అయితే తన పిల్లిని చంపిదన్న కోపంతో వ్యాపారి కుక్కను చంపాడు. తన కుక్కను చంపాడన్న ఆవేశంతో, రాజ సేవకుడు వర్తకుడి ప్రాణం తీశాడు. వర్తకుడిమీది అభిమానంతో ప్రజలు సేవకుడిపై పగ తీర్చుకున్నారు" అని వివరించాడు మంత్రి.

"ఇవన్నీ చాలక ఇప్పుడు తమరు కూడా ఆవేశపడి ప్రజలపైకి సైన్యాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమో శాంతంగా ఆలోచించండి ప్రభూ.. ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మితిమీరిన ఆగ్రహావేశాలకు గురయినట్లయితే.. అదే అన్ని అరిష్టాలకూ మూలకారణం అవుతుందని తమరికి తెలియంది కాదు" అని సూచించాడు మంత్రి.

దీంతో మంత్రి మాటల్లోని విజ్ఞతను అర్థం చేసుకున్న మహారాజు.. కోపాన్ని చల్లార్చుకుని స్థిమితంగా ఆలోచించాడు. జరిగినదాంట్లో ఎవరి తప్పూ లేదని గ్రహించాడు. మంత్రి చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పిన రాజు, ప్రజలమీదికి పంపాలన్న ఆలోచనను విరమించుకున్నాడు.

ఆడపిల్ల అంటే అలుసెందుకు...?!

రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు. పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి, ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. సిద్ధయ్య తన కొడుకూ, కూతుర్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్ధయ్య.

పదవతరగతి పాసైన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్ధయ్య. పిల్లలిద్దరినీ బాగా చదివించాలని అనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి, కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు.

అంతేగాకుండా... "ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది... ఉద్యోగాలు చేయాలా, ఉర్లేళాలా.. అయినా ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్లి గుట్టుగా కాపురం చేసుకుంటుంది" అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్నఫళంగా కూతుర్ని చదువు మాన్పించేసి, ఇంట్లో ఉంచేశాడు.

అదలా ఉంటే... ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు, షికార్లు, స్నేహితులతో జల్సా చేయసాగాడు. చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు. బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారుల్లో నడవటం తెలిసిన సిద్ధయ్య బాగా బాధపడ్డాడు. చేసేదేమీలేక కొడుకును కూడా చదువు మాన్పించి, ఇంటిపట్టునే ఉంచుకుని కుండలు చేయడం నేర్పించాడు.

కుండలు చేయడమే గాకుండా, ఆ పనిలో మంచి శిక్షణను ఇచ్చాడు సిద్ధయ్య. అలాగే వాటిని మంచి ధరకు అమ్మటం కూడా ఎలాగో నేర్పించాడు. దీంతో... నాలుగురాళ్లు సంపాదించటంతో సిద్ధయ్య కొడుకుకు కష్టంలోని తియ్యదనం తెలిసివచ్చింది. ఇప్పుడు బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోసాగాడు.

అయితే.. కూతురి విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య, ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకుని కూతుర్ని మళ్లీ బడిలో చేర్పించాడు. తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకుని, త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు.

చదువును పక్కనపెట్టి చెడుతిరుగుళ్ల పాలైన కొడుకు.. ఇక పనికిరాడని బాధపడిన సిద్ధయ్య... కొన్నిరోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం, కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కాబట్టి... కొడుకులు ఉద్ధరిస్తారు, కూతుళ్లకు చదువెందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు, సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కొంటారని ఆశిస్తూ....!

రాజ కుమార్తెలు... దేవకన్య..!

ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు. ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు. ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే... తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయి అని.

మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయి అని ఒక అమ్మాయి అంటే... మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని అంది. అలాగే మరో అమ్మాయి కూడా... అలా వారిలో వారు వాదించుకోసాగారు. ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక బిక్షగత్తె వేషం ధరించి వారి వద్దకు వచ్చింది.

చింపిరి జుట్టు, మాసిన బట్టలతో.. అంద వికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాకుమార్తెలు అసహ్యించుకుంటూ... పక్కకు వెళ్లమని ఛీకొట్టారు. దానికి నొచ్చుకున్న ఆ బిక్షగత్తె అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఓ గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేదామె ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టింది.

పేదరాలైనప్పటికీ.. తనకు ఉన్నంతలో కడుపునిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య.. ఆమెకు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించింది. అంతే వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగానే జరిగిపోయింది. దీన్నంతా కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు రాకుమార్తెలు.

బిచ్చగత్తె రూపంలోని ఆ దేవకన్య.. తన అసలు రూపంలోకి మారిపోయి రాకుమార్తెల వద్దకు వచ్చింది. "తోటివారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు" అని చెప్పి మాయమైపోయింది. దీంతో బుద్ధితెచ్చుకున్న రాకుమార్తెలు, ఇకమీదట అలా ఉండకూడదని అనుకున్నారు.

కాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే... ఇతరులకు సహాయం చేయడంలో అందము, గొప్పతనము దాగి ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే మనస్సు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం చేసుకోవాలి.

తెలివితేటలుంటే.. ఏదైనా సాధ్యమే...!

రామాపురం అనే ఊళ్లో రామారావు అనే పెద్దమనిషి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు.

అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని.. వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.

కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు... ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.

దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు.

రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి.. చివరకు ఒక్క రూపాయిని ఖర్చుచేసి ఒక క్రొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దానిని వెలిగించగానే, ఇల్లంతా వెలుగు పరచుకుంటుంది.

దీన్ని చూసిన రామారావు.. తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది.. అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు. సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి, దగ్గరికి పిలిచి... తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు.

కాబట్టి పిల్లలూ... ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే... తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు.

మొక్కై వంగనిది.. మానై వంగునా...?!

ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గర్లో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. నడుస్తూ, నడుస్తూ.. ఒక చోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు.

గురువుగారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తుండటంతో... ఎందుకలా చూస్తున్నారు గురువుగారూ...? అని ప్రశ్నించాడు శిష్యుడు. గురువు వద్ద నుంచీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో.. తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు.

ఆ నాలుగు చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్ద ముక్క, మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది, నాల్గోది చాలా చాలా పెద్ద చెట్టు. అరే.. భలేగున్నాయి కదూ.. అని మనసులో అనుకుంటూ వాటివైపే చూస్తున్నాడు శిష్యుడు.

అప్పటిగానీ ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ.. దానిని లాగేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలికగా లాగి పారవేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువు చెప్పడంతో.. దాన్ని కూడా కష్టపడి లాగివేశాడు.

మూడో దాన్ని కూడా గురువు లాగమని చెప్పడంతో... తన శక్తినంతటినీ ఉపయోగించి, అతి కష్టంమీద లాగి పారవేశాడు. ఇప్పుడు చివరిదైన నాలుగో చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులూ వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు.

శిష్యుడు అగచాట్లును అంతసేపూ చూసిన గురువుగారు... చూడు నాయనా... మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే... వాటిని మార్చుకోవడం కష్టం, దానికి ఉదాహరణ ఈ నాలుగో చెట్టు. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెతకు ఇదే అర్థం నాయనా...!

చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. నువ్వు లాగి పారేసిన ఒకటి, రెండు, మూడు చెట్లలాగానే ఉంటాయి. అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే.. నాలుగో చెట్టులాగా దాన్ని మనము ఏమీ చేయలేము. కాబట్టి చెడు అలవాట్లకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి నాయనా..! అని చెప్పాడు గురువుగారు.

ఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే, ఆ చెట్లను ఉదాహరణగా చూయించి చెప్పాను అని అన్నాడు గురువుగారు. గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు.. ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు.

కాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే... చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగి పారవెయ్యాలి. లేకుంటే అది పెరిగి మహా వృక్షమై మన అంతానికి దారితీస్తుంది.

సంతృప్తిని మించిన సంపద లేదు

ఒక ఊర్లో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతడికి బంగారమన్నా, కూతురన్నా చాలా ఇష్టం. అతడికి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించి గొప్ప ధనవంతుడుగా పేరు పొందాలని ఆశగా ఉండేది.

ఒకరోజు రాత్రి సోమనాథం నిద్రపోతుండగా... కలలో ఒక దేవత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగింది. అసలే అత్యాశాపరుడైన సోమనాథం తాను ఏది తాకితే అది బంగారం అయిపోయేటట్లుగా వరం కోరాడు. అంతా విన్న దేవత తథాస్తు అని వరం ఇచ్చి మాయమైపోయింది.

మరుసటి రోజు ఉదయం నుండి సోమనాథం తన ఇంటి వెనుకనున్న తోటలోకి వెళ్లి, అక్కడున్న కొన్న వస్తువులను తాకి చూశాడు. వెంటనే అవి బంగారు వస్తువులుగా మారిపోయాయి. దీంతో సోమనాథం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలా ఇంట్లో వస్తువులన్నింటినీ తాకి బంగారు వస్తువులుగా చేసుకున్నాడు.

ఇంతలో సోమనాథానికి ఆకలి వేసింది. ఫలహారం తీసుకునేందుకు పళ్లాన్ని తాకగానే అంది పళ్లెం, పళ్లెంలోని ఫలహారాలన్నీ బంగారంగా మారిపోయాయి. ఏది తాకినా అది బంగారంగా మారిపోతుండటంతో ఆ ధనవంతుడు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక.. అవి కూడా బంగారంగా అయిపోవడంతో నీరసంతో కూలబడిపోయాడు.

ఇంతలో చదువుల కోసం పక్క ఊరికెళ్లిన కుమార్తె ఇంటికి రావడంతో.. సంతోషంగా కూతుర్ని కావలించుకున్నాడు సోమనాథం. అంతే వెంటనే ఆమె సైతం బంగారు విగ్రహంలాగా మారిపోయింది. అయ్యో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే.. ఇప్పుడు నేనేం చేయాలంటూ విలపించాడు సోమనాథం.

వెంటనే తనకు వరం ఇచ్చిన దేవతను వేడుకుంటూ... తాను చేసిన తప్పేంటో తెలిసింది, తనను మన్నించమని కోరాడు. వెంటనే ఆ దేవత ప్రత్యక్షం కావడంతో, సోమనాథం తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థించాడు. ఇప్పటికైనా అత్యాశ మానుకోమని చెప్పిన ఆ దేవత సోమనాథాన్ని మన్నించి ఓ చిన్న కూజా నిండా మంచినీటిని ఇచ్చింది.

ఆ నీళ్లను బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటిమీదా.. చల్లితే అవి మామూలు వస్తువుల్లాగా మారిపోతాయని చెప్పి ఆ దేవత మాయమై పోయింది. వెంటనే సోమనాథం ముందుగా తన కూతురుపైన ఆ నీళ్లను చల్లగా ఆమె మామూలుగా మారిపోయింది. వెంటనే బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటిమీదా ఆ నీటిని చల్లి మళ్లీ మామూలుగా మార్చుకున్నాడు సోమనాథం.

ఇకమీద అత్యాశతో ప్రవర్తించకూడదు.. ఉన్నదాంతోనే సంతృప్తిగా బ్రతకాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న సోమనాథం కూతురుతో సంతోషంగా తోటలో ఆడుకునేందుకు వెళ్లాడు. పిల్లలూ...! ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే... నిజమైన ఆనందం సంపదలో లేనేలేదని అర్థం.

మృగరాజు - చిట్టెలుక

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.

అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది.


కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.

ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.

చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... "ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు" అని చిట్టెలుకతో అంది.

అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి.

మేకపోతు గాంభీర్యం

ఒకరోజు ఒక మేకల కాపరి మేత కోసం తన మేకల మందను అడవికి తోలుకెళ్ళాడు. అక్కడ ఒక మేకపోతు తప్పించుకుపోయింది. ఈ విషయం అతడు పసిగట్టనే లేదు. ఈలోపు చీకటి పడింది. ఆ మేకపోతుకేమో దారి తెలియక అటూ ఇటూ తిరిగి ఒక కొండ గుహకు చేరింది. లోపలికి వెళ్లి పడుకుంది.

ఆ గుహ సింహం నివసించే గుహ కాబట్టి, కాసేపటికే సింహం అందులోకి వచ్చింది. తన గుహలో పడుకున్న మరొక జంతువును చూసిన సింహం.. అదేదో వింతజంతువు అనుకొని దూరంగా ఉంది. అదీగాకుండా, చీకట్లో మేకపోతు కళ్లు మిలమిల మెరుస్తుండటంతో దానికి భయం వేసింది కూడా. అలాంటి జంతువును ముందెప్పుడూ చూడలేదు కాబట్టి, భయంతో ఏం చేయాలో తోచని స్థితిలో సింహం గుహ ముందు అలాగే నిలబడి పోయింది.

సింహాన్ని చూసిన మేకపోతు కూడా చాలా భయపడింది. అయితే భయం సింహానికి కనిపించనీయకుండా జాగ్రత్తపడుతూ... ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, ఈ సింహం బారినుంచి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనలో పడిపోయింది.

తెలతెలవారుతుండగా.. మేకపోతు గాంభీర్యం నటిస్తూ, బయటకు వచ్చింది. సింహం జంకును కనిపెట్టిన మేకపోతు నీవెవరవు? అని గద్దించింది. నేను సింహాన్ని, మృగరాజును అని చెప్పిన సింహం.. మీరెవరు? అని భయంగా ప్రశ్నించింది. అయితే దానికి బదులేమీ చెప్పలేదు మేకపోతు.

కాసేపటి తరువాత... ఓహో..! నీవేనా సింహానివి... నువ్వు మృగరాజువా..? నేను ఇప్పటిదాకా వెయ్యి ఏనుగులను, నూటికి పైగా పులులను చంపి తిన్నాను. సింహాన్ని చంపేదాకా నా గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నా పంట పండింది. నిన్ను చంపి, నా గడ్డం పీడ వదిలించుకుంటాను అని చెప్పింది.

వెంటనే తలను మోరగించి, గంభీరంగా నిలబడ్డ మేకపోతు ముందు కాళ్ళు రెండింటినీ పైకెత్తి, ఒక్క దూకు దూకబోయింది. అంతే... అది చూసిన సింహం పరుగు లంకించుకుంది. అదే అవకాశం అనుకున్న మేకపోతు బ్రతుకు జీవుడా.. అనుకుంటూ పారిపోయింది. తనతోపాటు వచ్చిన మేకల మందను వెతుక్కుంటూ వెళ్లి, అందులో కలసిపోయి ఇంటికి చేరుకుంది.

చూశారా పిల్లలూ... సింహం చేతిలో చావు తప్పదని గ్రహించిన మేకపోతు... చేత కానప్పటికీ డాబూ, దర్పంతో గాంభీర్యాన్ని ప్రదర్శించి తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో..! ఇక, పెద్దవాళ్లు "మేకపోతు గాంభీర్యం" అనే సామెత చెబుతుంటారు కదా.. దాని అర్థమే మీరు ఇప్పుడు చదివిన కథ.

డామిట్.. కథ అడ్డం తిరిగింది..!

ఒకరోజు బీర్బల్ రాజదర్బారుకు వస్తున్నాడు. దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు. రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా, అనిపించటంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకువచ్చాడు బీర్బల్.

అక్బర్ చక్రవర్తి దర్బారుకు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశాడు. ఏంటయ్యా ఆ గంప..? అందులో ఏముంది అని ఆరా తీశాడు.

ప్రభూ.. ఇవి రేగుపండ్లు, చాలా బాగున్నాయి. ప్రభువులవారు తింటారని తెచ్చాను అన్నాడు. బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ, రాణిగారీతో చనువు ఉన్నవాడు కాబట్టి, వెంటనే రాణీగారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి.

ఒక పెద్ద పళ్లెంలో రేగుపండ్లు పోసి బల్లమీద ఉంచారు. రాణీగారూ, చక్రవర్తీ ఒకవైపు... వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చొన్నారు. ముగ్గురూ పండ్లు తినడం ప్రారంభించారు. కానీ రాజుగారు పండ్లు తినేసి, గింజలను మాత్రం రాణీగారివైపు వేస్తున్నాడు. రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశ్యం గాబోలు.

తినగా, తినగా... రాణీగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి. అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు. బీర్బల్ వద్ద మాత్రం కాసిన్ని గింజలు ఉన్నాయి.

ఇంతలో అక్బర్ చక్రవర్తి.. "చూశావా బీర్బల్... రాణీగారు ఎంత తిండిపోతో.. ఆమె ముందు చూడండి ఎన్ని గింజలున్నాయో..?" అని అన్నాడు. ఆ మాట విన్నవెంటనే రాణీగారు సిగ్గుతో తలవంచుకున్నారు.

అయితే బీర్బల్ ఊరికే ఉంటాడా... వెంటనే "మహారాజా.. రాణీగారికంటే తమరే ఎక్కువ తిండిపోతులాగా ఉన్నారు. రాణీగారు పండ్లు తిని గింజలు మాత్రమే వదలిపెట్టారు. తమరు పండ్లుతోపాటు గింజల్ని కూడా మింగేశార"ని అన్నాడు. పాపం.. రాజుగారు.. సిగ్గుపడక తప్పలేదు. రాణీగారిని ఇరికించాలనుకుంటే తానే ఇలా దొరికిపోయానని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి.

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనూ...?

అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికో రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులుండేవారు.

ఒకసారి రాజుగారి ఏడుగురు కొడుకులూ, చేపల వేటకని బయలుదేరి వెళ్ళారు. ఏడుగురు కొడుకులూ, కలసి ఏడుచేపలు పట్టుకుని రాజ భవనానికి తీసుకొచ్చారు. ఆ ఏడు చేపలను ఒక బండరాయిపైన ఆరబెట్టారు.

అందులో అన్ని చేపలూ ఎండినా, ఒక పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు. దానికి బాధపడిన ఆ రాజు పెద్ద కొడుకు... చేప దగ్గరికి వెళ్ళి, "చేపా.. చేపా...! ఎందుకు ఎండలేదు?" అని అడిగాడు.

దానికి ఆ చేప... "ఓ రాకుమారా...! నాకు అడ్డంగా గడ్డివాము ఉంది. దాని నీడ నామీద పడి నేను సరిగా ఎండలేకపోయాను." అని చెప్పింది. దీంతో... రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి... "గడ్డివామూ... గడ్డివామూ...! చేపను ఎండనీయకుండా నువ్వెందుకు అడ్డం వచ్చావని?" ప్రశ్నించాడు.

దీనికి ఆ గడ్డివాము.. "నన్నేం చేయమంటావు రాకుమారా..? ఆవు నన్ను మేయలేదు" అని చెప్పింది. అలాగా.. అంటూ ఆవుదగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. "ఆవూ... ఆవూ...! నువ్వెందుకు గడ్డి మేయలేదు..?" అని అడిగాడు.

"నేనేం చేయను రాకుమారా...! జీతగాడు నాకు మేత వేయలేదు" అని బదులిచ్చింది ఆ ఆవు. దీంతో జీతగాడి దగ్గరికెళ్ళిన రాకుమారుడు "జీతగాడా... జీతగాడా...! ఆవుకెందుకు మేత వేయలేదు..?" అని అడిగాడు.

"ఏం చెప్పను రాకుమారా...! అవ్వ నాకు బువ్వ పెట్టలేదు.. చాలా ఆకలిగా ఉంది" అని చెప్పాడు జీతగాడు. "అవ్వా... అవ్వా...! జీతగాడికెందుకు బువ్వ పెట్టలేదు..?" అని అడిగాడు రాకుమారుడు.

"పాప ఏడుస్తోంది.. అందుకనే నాకు బువ్వ పెట్టేందుకు వీలుకాలేదు నాయనా..!" అని చెప్పింది అవ్వ. ఓహో అదా సంగతి అనుకుంటూ పాప దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. "పాపా... పాపా... ఎందుకేడుస్తున్నావు..?" అని అడిగాడు.

"నన్ను చీమ కుట్టింది రాకుమారా..! అందుకే ఏడుస్తున్నాను" అని చెప్పింది పాప.. వెంటనే ఊరుకోని రాకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి... "చీమా...! చీమా...! పాపనెందుకు కుట్టావు...?"అని అడిగాడు. "ఆ.... నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా... గిట్టనా...!" అని బడాయిగా బదులిచ్చింది చీమ.

ఎప్పటికైనా సత్యానిదే గెలుపు

ఒకానొక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడి ఇంట్లో చాలా ఆవులు, గేదెలు ఉండేవి. వాటిలో గోమాత అనే ఆవు ఉండేది. అది చాలా సాధు జంతువు. ఎప్పుడు కూడా తోటి పశువులతో, గేదెలతో గొడవలు పడకుండా, అన్నింటితో కలసి చాలా ఐకమత్యంతో జీవించేది.

ఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేత మేస్తుండగా, పక్కనే దాక్కుని ఉన్న పెద్దపులి ఒకటి మీదపడి తినేందుకు సిద్ధమైంది. దాన్ని గమనించిన గోమాత ఏ మాత్రం భయపడకుండా... "పులిరాజా...! కాస్తంత ఆగు. ముందుగా నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి నాలుగు రోజులు కూడా కాలేదు. పాలుతాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలచి నన్ను విడిచిపెట్టినట్లయితే నా బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి వచ్చేస్తాను. ఆ తరువాత నువ్వు నన్ను తీరిగ్గా తిందువుగానీ" అని చెప్పింది.


గోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి... "ఆహా... ఏమి మాయమాటలు చెబుతున్నావు. ఇంటికి వెళ్ళి, బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వస్తావా..? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను" అని కోపంగా సమాధానం ఇచ్చింది.

"ఓ పులిరాజా..! నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదానిని కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా...! నీకు ఉపకారం చేసిన దాననవుతాను. అయితే ఒక్కసారి నా బిడ్డను చూసి, ఆకలి తీర్చి రావాలనేదే నా చివరి కోరిక" అని చెప్పింది గోమాత.

ఆవు చెప్పిందంతా ఓపికగా విన్న పెద్దపులి... సరే ఈ ఊర్లో ఉండే జంతువులలో ఎంతమాత్రం నీతి ఉందో కనుక్కుందామని.. సరేనని చెప్పింది. దీంతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళిన గోమాత తన బిడ్డను తనివితీరా చూసుకుని, కడుపునిండా పాలిచ్చింది. తన బిడ్డతో "నాయనా...! బుద్ధిమంతుడిగా, మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకుండా ఉండు. మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి" అంటూ బుద్ధులు చెప్పి, అడవికి చేరుకుంది గోమాత.

గోమాత చూసిన పెద్దపులికి చాలా ఆశ్చర్యం వేసింది. తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతగొప్ప గుణం కలిగినది. ఇంతగొప్ప సత్యవంతురాలిని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకున్న పులి, ఆవును మెచ్చుకుంటూ... తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పి ఇంటికి వెళ్లిపోమని చెప్పింది. పెద్దమనసుతో తన బిడ్డడి దగ్గరకు తనను పంపించేసిన పెద్దపులికి కృతజ్ఞతలు చెప్పి, అక్కడినుంచి బయటపడింది గోమాత.

ఒంటికన్ను కాకమ్మ

అనగనగా ఒక ఒంటికన్ను కాకమ్మ. ఒకరోజు పున్నమి రాత్రివేళ చెట్టుమీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది కాకమ్మ. అదేంటంటే... ఈ ప్రపంచంలో నా కంటే గొప్పవాళ్ళు ఎవరంటూ... ఆలోచించి, ఆలోచించి అలసిపోయింది కాకమ్మ. ఎంతకూ తేలక పోయేసరికి ఆకాశంలో కనిపించే చందమామను ఎవరు గొప్ప? అని అడిగింది.

ఎవరేంటి? ఈ ప్రపంచానికంతటికీ ఒక్కసారిగా వెన్నెల కురిపించే నేనే గొప్పవాడిని కదా అన్నాడు చందమామ. అది విన్న ఆకాశం.. ఓస్..! నువ్వెలా గొప్పవాడివవుతావు? నువ్వూ, చుక్కలు, అంతా నాలోనే ఉన్నారు కాబట్టి నేనే గొప్పదాన్ని అంది.

అది విన్న బురదగుంట పకపకా నవ్వింది. చందమామ, ఆకాశమూ రెండూ కలిసి ఎందుకు నవ్వుతున్నావని బురదగుంటను అడిగాయి. ఆకాశమూ, చుక్కలూ, కాకమ్మ, చందమామ అన్నీ నాలోనే కనబడతాయి కదా.. అందుకనే నేనే గొప్ప అంది బురదగుంట.

అప్పుడు కాకమ్మ ... మీ అందరినీ నేను నా కంటితో చూస్తాను కాబట్టి నా కన్నే అందరికంటే గొప్పది అని అంది. ఇది విన్న కంటిరెప్ప ఏమందంటే... కంటిని మూసి, ఇంత పెద్ద ఆకాశాన్ని, ఇతర వస్తువులను కూడా కనపడకుండా కూడా చేయగలను కాబట్టి నేనే గొప్పదాన్ని అంది.

ఆ కంటి రెప్ప కూడా నాలో కనబడుతుంది కదా.. అంటూ బదులిచ్చిన బురదగుంట, నేనే గొప్ప అంది. అలా అందరూ నేనంటే నేనే గొప్ప అంటూ వాదించుకుని, అలసిపోయి, చర్చను మరుసటి రోజుకు వాయిదా వేసేసి నిద్రపోయాయి. కానీ... "కంటిరెప్ప కూడా నాదే కదా...!" అనుకుంటూ ఆ రోజుకు తృప్తిగా నిద్రపోయింది ఒంటికన్ను కాకమ్మ.

తేనెటీగలు... ఎలుగుబంటి..!!

ఒక అడవిలో కొన్ని తేనెటీగలు, ఓ ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఇతర జంతువులన్నీ కలసి జీవించేవి. అయితే తేనెటీగలు ఎంతో కష్టపడి పోగుచేసిన తేనెనంతటినీ ఎలుగుబంటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది. అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడటం తప్ప, తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి.

ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా కుందేలు, ఏనుగు, ఇతర జంతువులన్నింటితో చెప్పుకుని విలపించాయి. ఎలాగయినాసరే ఆ ఎలుగు బాధను తప్పించమని అందరినీ వేడుకున్నాయి. అప్పుడే కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. అయితే దీనివల్ల తమకేంటి లాభం అని అడుగగా... మీ అందరికీ కావాల్సినంత తేనె ఇస్తామని తేనెటీగలు మాట ఇవ్వడంతో సరేనంది.

కుందేలు బాగా ఆలోచించి, తేనెటీగలకు "తేనె తుట్టెను సింహం గుహ వెనక దాచి పెట్టమ"ని సలహా ఇచ్చింది. అవి అలాగే చేశాయి. ఇంతలో ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టె కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే తేనెటీగలు మాత్రం కుందేలుకు, ఇతర జంతువులకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు.

అయినా కూడా ఆశచావని కుందేలు, ఇతర జంతువులన్నీ తేనెటీగలను నిలదీశాయి. అయితే అవి చేసిన మేలును మరచి, కాదు పొమ్మన్నాయి. దీంతో కోపంతో ఎలుగుబంటి దగ్గరకు వెళ్లిన అవి తేనెతుట్టె సంగతి చెప్పేశాయి. మళ్లీ ఎలుగుబంటి తేనెను తాగేయడం మొదలు పెట్టింది. తేనెటీగలకు బాధలు మళ్లీ మొదటికొచ్చాయి. దీంతో చేసేందేంలేక తేనెటీగలు కుందేలు, ఇతర జంతువులను కలసి తమని క్షమించమని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి.

పథకం ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి. కుందేలు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి "ఎలుగుబంటి మామా...! తేనెటీగలు ఒక డ్రమ్మునిండా తేనెను చేసి గుహలో దాచి పెట్టాయి, మనం ఈ రోజు రాత్రి చీకటి పడిన తరువాత వెళ్లి దాన్నంతా తాగేద్దాం" అని చెప్పింది.

అయితే ఎలుగు బంటి కుందేలుకంటే ముందు తానే వెళ్ళి తేనెను తాగెయ్యాలనుకుంది. చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరకు వెళ్లింది. చీకట్లో డ్రమ్ములోపల ఏముందో సరిగా కనబడలేదు. తారును చూసిన ఎలుగు నిజంగానే తేనె అనుకున్నది. దాన్ని అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములోకి దూరడం, ఇరుక్కుపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.

హాహా కారాలు చేస్తున్న ఎలుగుబంటిని తేనెటీగలు, కుందేలు, ఇతర జంతువులన్నీ వచ్చి చూశాయి. తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మొరపెట్టుకున్నది. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఏనుగు సహాయంతో ఎలుగును తారు డ్రమ్ము నుండి బయటికి తీసి కాపాడాయి. ఆ తరువాత అందరూ మిత్రులైనారు. తేనెటీగలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జంతువులన్నింటికీ తేనెతో మంచి విందును ఇచ్చాయి.

అందరిలోకి అదే తెలివైంది కదా..?!

ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ... తన సేవకుడైన జమాలుద్దీన్‌ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా... ఇంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశంకేసి చూస్తూ.. జమాలుద్దీన్...! వాన వస్తుందంటావా...? అని అడిగాడు.

`నేనెలా చెప్పగలను ప్రభూ... నేనేమైనా భవిష్యత్తు తెలిసినవాడినా..?!' అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తరువాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు...! ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి, వాన వస్తుందో, రాదో కనుక్కుని రా...! అని పంపించాడు అక్బర్.

పరుగు పరుగున గొర్రెలకాపరి వద్దకు వెళ్లిన జమాలుద్దీన్... "వాన వస్తుందో, రాదో నీవేమైనా చెప్పగలవటోయ్..!" అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచర గాడిద తోకను పైకెత్తి పట్టుకుని, తేరిపారజూసి "మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతోంది.." అని అన్నాడు.

అక్బరు వద్దకు చేరుకున్న జమాలుద్దీన్.. జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ... "చూశావా... మనకన్నా ఆ చదువురాని వాడే నయం.. గాడిద తోకను చూసే వర్షం రాదనే విషయాన్ని పసిగట్టాడు.." అన్నాడు.

తరువాత ఇద్దరూ కాసేపు అలా ముందుకు సాగిపోగానే... కుండపోతగా వర్షం మొదలైంది. అక్బర్, జమాలుద్దీన్‌లు ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకుపడుతూ... "ఇలా జరిగిందేం జమాలూ... ఇప్పుడే కదా వాన కురవదని చెప్పావు.." అన్నాడు.

అప్పుడు జమాలుద్దీన్ "ప్రభూ... వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచర గాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పు ఏముంది" అన్నాడు.

"సరే... ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా, లేక ఇలాగే రాత్రిదాకా కొనసాగుతుందా..?" మళ్లీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. "కాసేపాగండి ప్రభూ...! ఇప్పుడే వస్తాను" అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. "ఎక్కడికి వెళ్తున్నావ్.. జమాలూ..!" వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభూ...! "ఇందాకటి గాడిదనే అడిగేసి వస్తా..! ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే, అదే తెలివైనది కదా..!" అన్నాడు.

అప్పటిగానీ విషయం బోధపడని అక్బర్ చక్రవర్తి... "వాన రాకడ, పోకడ మనకు ఎలా తెలుస్తుంది. అంతా ప్రకృతి మాత చలవే కదా..!" అని అనుకున్నాడు. "ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా..!" అంటూ తన సేవకుడు సుతిమెత్తగా తెలియజెప్పిన విషయాన్ని మనసులో తలచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి.