Pages

Saturday, August 11, 2012

కోకిల స్వార్ధం

ఒక పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి ఎన్నో పచ్చటి, పొడవైన పైన్‌ చెట్లతో నిండి ఉండేది. వసంతకాలం రావడంతో అడవి మరింత పచ్చగా, దట్టంగా తయారయింది.

ఒక కోకిల ఎక్కడి నుంచో వచ్చి పైన్‌ చెట్టు పైన గూడు కట్టుకుంది. అది ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా తన అద్బుతమైన స్వరగానాలతో అడవినంతా హాయిగాఉంచేది.

ఆకురాలే కాలం రానే వచ్చింది. పైన్‌ చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. కోకిల ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒక రోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి, మంచి పుష్పాలు విరబూసి, ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.

అద్భుతంగా పాటలు పాడే కోకిల వెళ్ళిపోతుండటం చూసిన పైన్‌ చెట్టు, కోకిలతో "సోదరీ! ఎక్కడికెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కన్పించినంతమాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా" అని అంది.

బదులుగా కోకిల, "లేదు, లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను" అంది.

పైన్‌ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా కోకిల తన రెక్కలు విప్పి తుర్రున ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధకంటే, కోకిల వెళ్ళిపోయిందన్న బాధతోనే పైన్‌చెట్టు మరింత కుంగిపోయింది. అతి చిన్నదైన కోకిల, చాలా పెద్దదైన పైన్‌చెట్టుకు ఒక గుణపాఠం నేర్పింది.

కృతజ్ఞత

అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు రామయ్య వెళ్ళాడు. అక్కడికి సమీపములో వేటగాడు వలపన్ని బియ్యం నూకలు వెదజల్లి వుంచాడు. వాటికి ఆశపడి జంటపావురాళ్ళు వలలో చిక్కుకుని ప్రాణభీతితో ఉన్నాయి. వాటిని వల తప్పించి పైకి ఎగురవేశాడు రామయ్య.

కొంతకాలము గడిచింది. రామయ్య అడవికి వెళ్ళి వస్తూనే వున్నాడు. ఒక రోజు దారి తప్పి అడవిలో బాగా పైకి వెళ్ళిపోయాడు. దారి తెలియక అవస్థపడుతున్నాడు. చీకటి పడింది. క్రూరమృగములు తనని ఏం చేస్తాయోనని భయపడుతూ అక్కడికి సమీపంలో గల సత్రం వద్దకు చేరుకున్నాడు. ఇంతలో వర్షం ప్రారంభమయింది. ఏమిటో ఈ పాడు వర్షము, ఇంటికెలా వెళ్ళాలో తెలియటంలేదు. అని భాధపడుతున్నాడు. ఆ సమీపములో గల పావురముల జంట రామయ్యని గుర్తించాయి. దారితప్పిన అతన్ని గమ్యస్థానము చేర్చే ఉద్దేశ్యముతో తలగుడ్డ తన్నుకుని వెళ్ళాయి. రామయ్య తల గుడ్డకు వంగి పైకి చూసి ఆ పావురముల వెంట బయలుదేరి గమ్యస్థానము చేరుకున్నాడు. ఎంత చిన్న జీవులైన తనని గమ్యస్థానము చేర్చినందుకు భగవన్నామస్మరణ చేస్తూ ఇల్లు చేరాడు. ఆ పావురముల జంట కృతజ్ఞతకు మురిసిపోయాడు. తర్వాత వాటిని తన వద్దనే వుంచుకుని పెంచుకోసాగాడు.        

కూతురి సలహా

విజయేంద్రవర్మ ఆదర్శవంతుడైన రాజు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు పేదలందరికీ దానధర్మాలు చేసేవాడు. తన రాజ్యంలో భూమిలేని రైతులకు కొంత భుమినిచ్చి సాగుచేసుకోమనేవాడు. తద్వారా రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని రాజు భావించేవాడు.

అలా భూమిని పొందిన చంద్రన్న అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టనిపించింది. అక్కడ తవ్వి చుడగా ఒక బంగారు రోలు, రోకలి దొరికాయి. ఆ రైతు నిజాయితీ గలవాడు. అందుకే ఆ రోలు, రోకలి భూమి యజమాని అయిన రాజుకే చెందాలనుకున్నాడు. అయితే రోలును రాజుకి బహుకరించి, రోకలిని తన కష్టానికి ప్రతిఫలంగా తనవద్దే ఉంచుకోవాలని అనుకున్నాడు. ఆ రైతుకు ఒక కుతురు ఉంది. ఆమె చాలా తెలివైనది. ఆమె తండ్రితో "మీరు రోలు మాత్రమే ఇస్తే రాజు రోకలి ఏదని అడుగుతారు. కాబట్టి రోలు, రోకలి రెండూ ఆయనకు బహుకరించండి" అని చెప్పింది.

కూతురి సలహాను పెడచెవిన పెట్టి చంద్రన్న రోలు మాత్రం తీసుకెళ్ళి రాజుకు బహుకరించాడు. రోలును చుసిన రాజా విజయేంద్రవర్మ రోకలి ఏదని చంద్రన్నను ప్రశ్నించాడు. చంద్రన్న దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో రాజు అతడిని చెరసాలలో బంధించమని సైనికులను ఆదేశించాడు. సైనికులు అతడిని చెరసాలకు తీసుకువెళ్తుండగా, "నా కూతురి సలహా విని ఉంటే నాకీ దుస్ధితి పట్టేది కాదు కదా!" అని అతను ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు. రాజు చంద్రన్నను వివరాలనడగగా కూతురి గురించి చెప్పాడు. చంద్రన్న కూతురిని తీసుకురమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు రాజు. ఆమె రాజసభలోకి ప్రవేశించి జరిగినదంతా వివరించింది. ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడైన రాజు ఆమెను తన మంత్రిగా నియమించుకున్నాడు.       

కుక్క బుద్ధి-చీమ సుద్దు

అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన ఉంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక నల్లకుక్క! ఆ నల్ల కుక్క, చుట్టు ప్రక్కల ఇళ్ళ వారు, తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ ఉంటుంది. ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కి పడి చూస్తూ!కోపంగా గుర్రుపెడుతుంది ఆ కుక్క. ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే దాని మీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. ఆ స్థలంలో పడిన పుల్లిస్తరాకులన్నీ దాని సొత్తు; వాటిని ఎవ్వరూ ముట్టుకొనడానికి వీలు లేదు. అయినా చీమలు, ఈగలు ఆ ఆకుల మీద ముసురుతూనే ఉంటాయి! ఆ నల్ల కుక్క వాటిని తోలేస్తూనే ఉంటుంది.

ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ పుల్లిస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి. వాటిని చూడగానే నల్లకుక్కకు పండగ ఆనందం కలిగింది. కాని, అంతలోనే పుల్లిస్తరాకులతో పడిన పిండివంటల ముక్కల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది. ఆ కుక్క రావడమే తడవుగా నల్లకుక్క దాని మీద ఉరికింది పెద్దగా అరుస్తూ! కొత్త కుక్క కోరలు చూపుతూ నల్ల కుక్క మీద తిరగబడింది.

అరుపులు కరుపులతో పెద్ద కోట్లాట జరిగింది. ఆ దెబ్బలాటతో పుల్లిస్తరాకులన్నీ చిందరవందర అయిపోయాయి;అన్నీ మట్టి కొట్టుకొని పోయాయి. చివరకు కొత్త కుక్కను వీధి చివరిదాక తరిమేసి, నల్ల కుక్క తిరిగి వచ్చింది. ఒగుర్చుకుంటూ చూస్తే మట్టి, తుక్కు, చెత్తతో నిండిన పుల్లిస్తరాకులలో దానికి అన్నం మెతుకులే కనపడ లేదు. అటూ ఇటూ వెతికి దిగులు పడుతూ కూర్చుంది...!

ఆ ఆకుల మీద తిరుగుతూ వున్న ఓ కండ చీమ, నల్లకుక్కను చూసి జాలిగా అంది; "ఎవరో తిని పారవేసిన పుల్లిస్తరాకులు నీ సొంతం అనుకొంటావు. ఎవరినీ చేరనీయవు. ఏ కుక్క అయినా వస్తే, మీద పడి అరిచి, కరిచి తరిమి వేస్తావు. చూడు, నీ దెబ్బలాట వల్ల, తిందామనుకున్నదంతా ఎలా మట్టి కొట్టుకు పోయిందో!" నాకే తప్ప ఎవరికీ వుండకూడదు అనే నీ దుర్బుద్ధి నీకు కూడా లేకుండా చేసింది... చూడు... మా చీమలను! ఎక్కడైనా రవ్వంత తినుబండారం కనపడితే, మా చీమలనన్నిటినీ పిలుచుకు వస్తాము. అందరమూ కలిసి తింటాము; హాయిగా వుంటాము... మా చీమలను చూసి బుద్ధి తెచ్చుకుంటే, నువ్వూ, నీ జాతివాళ్ళు బాగు పడతారు అంటూ చక్కా పోయింది కండ చీమ!"

ఆకలితో, అలసటతో అవస్థ పడుతున్న నల్లకుక్కకు చీమ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. అలాగే పడుకుంది, మట్టి ఆకులను చూస్తూ, కన్నీళ్ళు కారుస్తూ మూలుగుతూ.       

కుక్క - గాడిద

ఒక చాకలివాడి దగ్గర గాడిద, కుక్క ఉండేవి. కుక్క పగలూ, రాత్రీ చాకలివాడి ఇల్లు కాపలా కాసేది. గాడిద బండెడు బట్టల మూటలు వీపు మీద మోసుకుని చెరువుకు తీసుకెళ్ళేది. కొంత కాలం గడిచాక... 'ఇంతవరకు ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్నిరోజులు ఈ కుక్క తిండి కోసం అనవరంగా చాలా ఖర్చు చేశాను" అని భార్యతో అన్నాడు.

ఈ మాటలు విన్నది కుక్క. 'రాత్రంతా మేలుకుని ఎంత సేవ చేశాను? నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం విస్మరించాడు'. అనుకుని ఎంతో బాధపడింది.

ఆ రోజు నుండి చాకలివాడి భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి తిరిగి... ఏమైనా దొరికితే ఇంత తిని, ఓపిక ఉంటే చాకలివాడి ఇంటికి వచ్చేది. లేదంటే ఊళ్ళో ఎక్కడో ఒక చోట ముడుచుకుని పడుకునేది. కొన్ని రోజులు గడచాక... ఒక అర్ధ రాత్రి దొంగ ఒకడు చాకలివాడి ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది కాని మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కుర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసిగట్టింది.

"ఒక దొంగ మన యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా?" రహస్యంగా అంది గాడిద.

"అవును, తెలుసు"

"మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు?"

"నా ఇష్టం" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.

"నీ ఇష్టప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత" అని చెప్పింది గాడిద.

"నోరు మూసుకుని పడుకో. అనవసరమైన సలహాలు ఇవ్వకు" కుక్క కోపంగా చెప్పింది.

"సరే... నువ్వు మొరగకు. నేను గట్టిగా అరచి యజమానిని నిద్రలేపుతాను. కుక్క కంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను" అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.

లోపల గాఢనిద్రలో ఉన్న చాకలివాడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారంలాంటి నిద్ర చెడగొట్టినందుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డు కర్ర తీసుకువచ్చి "ఏం పోయేకాలమే నీకు. అర్థరాత్రి రచ్చ చేస్తున్నావు" అంటూ గాడిదను రెండు బాది, తిరిగి వెళ్ళి నిద్రపోయాడు.

రహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తువులను చక్కగా మూటకట్టుకుని పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన చాకలివాడు ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్కచిక్కిపోయి నీరసంగా పడున్న కుక్కని చూశాకగాని అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న చాకలివాడు ఆ రోజునుండి కుక్కకు ఆహారం ఇస్తూ మంచిగా చూసుకోసాగాడు.

కాపాడిన స్నేహం

ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుండే కాకికి, ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం.

ఊరి పక్క నున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది.

ఎప్పటికైన సరేబయటకు రాకుండాపోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చుని ఆలోచించింది. 'ప్రతి రోజు కుందేలు ఆహారం కోసం ఉండలేదు. కచ్చితంగా బయటకు రావాల్సిందే! అప్పుడు దాన్ని పట్టుకుని తినచ్చు .'

ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది గాని ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలడం లేదు. ఇలాగైతే తన మిత్రుడైన కుందేలుకి ఇబ్బంది అని ఆలోచించి, కావు కావు మని అరవడం మొదలు పెట్టింది.

అంతే! ఎక్కడెక్కడి కాకులన్నీ ఆ అరుపులకు వేపచెట్టుపైకి వచ్చి చేరాయి. నక్కకి ఏమీ అర్ధంకాలేదు.

కాకి తోటికాకులకి సంగతంతా చెప్పింది. వెంటనే కాకులన్ని ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. ముక్కులతో పొడిచి పెట్టాయి. కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ వైపు రానేలేదు.

నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియనుండి ఇవతలకు వచ్చింది. "నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ణతలు మిత్రమా!" కాకి చేసిన సాయానికి కృతజ్నలు చెప్పింది కుందేలు.

రెండూ కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి.       

కాగితం పడవలు

రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.

నమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటుపడిన రామయ్యకు రణగొణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు.

భూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్లిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ ఆరవ తరగతి చదువుతున్నాడు. వసుధ నాలుగవ తరగతి. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు.

రమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్లి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకొని వుండడం.. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలోకంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒక్కటే చిక్కు. కాయకష్టానికి అలవాటుపడిన మనిషిని ఖాళీగా వుండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్ధితీ అదే.

ఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాష్టారు రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజారులోని తోటి పిల్లలందర్నీ పోగు చేశారు. వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది.

"వంశీ బాబూ! నీకి కాగితాలతో పడవలు తయారుచేయడం వచ్చా?" అడిగాడు రామయ్య .

"రాదు. ఏం?"

"మేం చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారుచేసి వాన నీళ్లల్లో వదిలేవాళ్లం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్లు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది" చెప్పాడు రామయ్య.

"అయితే త్వరగా వెళ్లి కాగితాలు తీసుకురా తాతా..." అంది వసుధ.

"కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి" వెంటనే అందుకున్నాడు వంశీ.

రామయ్య రాహుల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు. అదే వాడిన కాగితాలు తీసుకున్నా ఫర్వాలేదు ' అనుకున్నాడు రామయ్య రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకొచ్చాడు. వాటితో పడవలు తయారుచేసి, పిల్లలకిచ్చాడు. వాళ్లు వాటిని నీళ్లల్లో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పిల్లలు అన్నం తిని, నిద్రపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చీరాగానే రాహుల్ తన గదిలోకి వెళ్లాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు.

రామయ్యను పిలిచి, "టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను. అవేమైనా చూశావా?" అని అడిగాడు రాహుల్.

"నల్ల సిరాతో ఏదో రాసి ఉంది. అవేనా బాబుగారూ?" అడిగాడు రామయ్య.

"అవును. అవే...ఎక్కడ పెట్టావు?" ఆతృతగా అడిగాడు రాహుల్.

"అవి పనికిరాని కాగితాలు అనుకొని..."

"అనుకొని... నీళ్లు నమలడం మాని ఏం చేశావో చెప్పు" కోపంగా అన్నాడు రాహుల్.

"ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను" భయం భయంగా చెప్పాడు రామయ్య.

"అసలు వాటి జోలికెందుకువెళ్లావు? పక్కన అన్ని తెల్లకాగితాలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చెయ్యోచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు?" ఆవేశంగా అన్నాడు రాహుల్.

రామయ్య దిగాలుగా ముఖం పెట్టి. "అయ్యా! నాకు చదువురాదు. అందుకే వాటి మీద ఏం రాసి వుందో తెలీలేదు. తెలిస్తే... వాటితో పడవలు చేసేవాణ్ణే కాదు. క్షమించండి" అన్నాడు.

"ఎలా క్షమించమంటావు? అవేమైనా పాతిక రూపాయలు పెడ్తే వచ్చే కాగితాలనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు" అరిచాడు రాహుల్. రాహుల్ అరుపుల విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది.

విషయాన్ని గ్రహించి, "ఊరుకో రాహుల్. అంత ముఖ్యమైన కాగితాలను నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్లిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకొని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది" అంటూ సర్ధిచెప్పింది.

రామయ్యవైపు తిరిగి, "రామయ్య... నువ్వు వెళ్లి భోం చేసి పడుకో" అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు.

మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య.

"ఇవి నీ కోసమే రామయ్య రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతోపాటు నీక్కూడా ట్యూషన్ మాష్టారే చదువు చెప్తారు. మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ" అంది రమ్య.

రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇకమీదట అలాంటి తప్పు చేయకుండా వుండాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాడు.       

కష్టే ఫలి

కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తన ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన మంత్రితో సంప్రదించి, బాగా రద్దీగా ఉండే దారి మధ్యలో రాత్రికి రాత్రే ఒక బండరాయిని పాతించాడు. ఆ దారిలో వెళ్లేవాళ్లందరూ దానిని దాటి వెళ్ళే ప్రయత్నం చెసేవారు. కానీ ఎవరూ ఆ రాయిని తొలగించే ప్రయత్నం మాత్రం చెసేవాళ్లు కాదు.

రాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి ఆ దారిని గమనిస్తూ ఉండేవాళ్లు. ఎంతటివారు అయినా కష్టపడి పక్కనుండి వెళ్ళేవారే తప్ప, ఆ రాయిని మాత్రం కదిల్చే ప్రయత్నం చేయలేదు. తమ ప్రజల ప్రవర్తన రాజుని ఆశ్చర్యపరిచింది. ఒక రోజు ఒక రైతు, పక్క ఊరి నుండి కూరగాయల సంచి మోస్తూ ఆ ఊరిలోకి వచ్చాడు. దారిలో అడ్డంగా రాయి కనిపించడంతో ఆ రైతు తన సంచిని పక్కన పెట్టి, ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు కష్టపడ్డాక ఆ రాయిని పక్కకి దొర్లించ గలిగాడు. దానితో ఆ ప్రదేశం విశాలమై అందరికీ సౌకర్యంగా మారింది.

రాయిని దొర్లించి వెన్నక్కి తిరుగుతుంటే, రైతుకు ఆ రాయి ఉండిన స్థలంలో ఒక సంచి కనిపించింది. ఏమై ఉంటుంది అని చూస్తే, అందులో కొన్ని బంగారు నాణాలూ, ఒక ఉత్తరమూ కనిపించాయి. ఆ ఉత్తరం రాజు రాసినది. దానిలో - "అందరికీ ఉపయోగపడేలా రాయిని తొలగించినవారికి ఈ బంగారం" అని రాసి ఉంది. రైతు సంతోషిస్తూ, తన కూరగాయల సంచిని తీసుకుని వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న రాజు, మంత్రితో -"చూశారా మంత్రిగారూ, అందరూ అడ్దంకిని తప్పించుకునే ప్రయత్నమే చేశారు గానీ, ఈ రైతు దానిని ఎదుర్కొన్నాడు. అందుకే దానిని తీసేయగలిగాడు. మన జీవితాల్లో అడ్డంకులు కూడా మనకి మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాల్లాంటివి" అన్నాడు. మంత్రి అవునంటూ తల ఊపాడు.

కల్తీ నెయ్యి

"రాఘవయ్యా! పోయిన వారం బంధువులొస్తే మీ దుకాణంలో స్వీట్స్ కొనుక్కెళ్లాను. అవి ఇంతకుముందులా రుచిగా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కోని, సరిచేసుకో" అన్న మిత్రుడు సీతారామయ్య మాటలే తలచుకుంటూ పడుకున్నాడు రాఘవయ్య.

తను పదేళ్లుగా స్వీట్ షాప్ నడుపుతున్నాడు. వంటలకు వాడే సరుకుల నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేవాడు కాదు. కాబట్టే ఇన్నేళ్లల్లో కొత్త దుకాణాలు ఎన్ని వెలిసినా రాఘవయ్య స్వీట్ షాప్‌లో రద్దీ తగ్గలేదు. అలాంటిది ఇవాళ మిత్రుడు సీతారామయ్య అన్న మాటలు రాఘవయ్యను ఆలోచనలో పడేశాయి. మొదట వంటవాళ్ల పనితనం మీద అనుమానమొచ్చింది. కానీ అదంతా తన భ్రమ అని కొద్దిరోజుల్లోనే రూఢీ అయ్యింది. మరి సరుకు విషయంలో ఏమైనా లోపముందా? గత పదేళ్లుగా ఒకే దుకాణంలో సరుకులు కొంటున్నాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా తేడా రాలేదు. అలాంటిది ఇప్పుడు వస్తుందంటే నమ్మబుద్ధికాలేదు.

ఈ మధ్య తమకు సరఫరా అవుతున్న నెయ్యి కాస్త తేడాగా అనిపిస్తోందని భార్య సుభద్ర రెండు, మూడుసార్లు అంది. తానే పెద్దగా పట్టించుకోలేదు. ' ఒకవేళ నెయ్యిలో ఏమైనా కల్తీ జరుగుతోందా?' అని రాఘవయ్యకు అనుమానమొచ్చింది.

అసలు కల్తీ జరిగిందో? లేదో? ఎవరికి తెలుసు? జరిగితే దుకాణం యజమాని రంగారావును గద్దించవచ్చు. లేకపోతే....అనవసరంగా అనుమానించినట్లవుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అని ఆలోచించసాగాడు రాఘవయ్య అదే విషయం మాటల సందర్భంలో పెద్ద మనవడు శ్రీధర్‌తో చెప్పాడు.

పదవ తరగతి పాసైన శ్రీధర్‌కి సైన్స్ అంటే మహా ఇష్టం. ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినా తప్పకుండా వెళతాడు. అలా ఓ ఎగ్జిబిషన్‌లో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీని గుర్తించడమెలాగో వివరించారు. అక్కడ చూపించిన పదార్ధాల్లో నెయ్యి కూడా ఉంది. 'చిన్న ప్రయోగం చేసి చూస్తే కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది' కదా అనుకున్నాడు శ్రీధర్. తన దగ్గర వున్న కొన్ని రసాయనాలను తీసుకొచ్చాడు.

మనవణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న రాఘవయ్యతో, "తాతయ్యా! ఇది బయట కొన్న నెయ్యి, ఈ గిన్నెలోది మన ఇంట్లో వెన్న కరగబెట్టిన నెయ్యి ఇవేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్. ఈ రెండింటితోనే ఏది స్వచ్ఛమైన నెయ్యో తెలిసిపోతుంది" అన్నాడు శ్రీధర్.

"అదెలా?!" ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య.

"ముందు మన ఇంట్లో కాచిన నెయ్యితో ప్రయోగం చేద్దాం. ఎంత నెయ్యి వుందో అంతే పరిమాణంలో మొదట హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్ ద్రావణాన్ని దీనికి చేర్చాలి. కాసేపట్లో నెయ్యి రంగు మారితే నకిలీది. లేకపోతే స్వచ్ఛమైనది" అన్నాడు శ్రీధర్. రెండు గిన్నెల్లోనూ ద్రావణాలు కలిపాడు. ఇంట్లో చేసిన నెయ్యిలో ఏ మార్పూలేదు. కానీ బయట కొన్న నెయ్యి గులాబీ రంగులోకి మారింది.

"చూశారుగా తాతయ్యా! మనం బయట కొన్న నెయ్యిలో డాల్డా కలిసింది. అందువల్లే నెయ్యి రంగు మారింది. ఇన్నాళ్లూ ఆ దుకాణం యజమాని మనల్ని మోసం చేశాడు" ఒకింత ఆవేశంగా అన్నాడు శ్రీధర్. రాఘవయ్యకు అసలు విషయం అర్ధమైంది.

మర్నాడు శ్రీధర్‌ని తీసుకొని రంగారావు దుకాణానికి వెళ్లాడు. వీళ్ల మాటలు విన్న రంగారావు మొదట దబాయించాడు. కానీ ప్రయోగాత్మకంగా నిరూపించిన మీదట తన తప్పు ఒప్పుకున్నాడు. ఇకమీదట నిజాయితీగా వ్యాపారం చేస్తానని, ఈ ఒక్కసారికి క్షమించమని వేడుకున్నాడు.

"రంగారావ్! ఏ వ్యాపారానికైనా నమ్మకమే పునాది. దాన్ని పోగొట్టుకుంటే నష్టాలపాలయ్యేది నువ్వే. ఇకమీదట ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నలుగుర్నీ పిలిచి నీ గుట్టు రట్టు చేస్తాను. అప్పుడు నువ్వు ఈ ఊళ్లోనే కాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా దుకాణం నడపలేవు" అని తీవ్రంగా మందలించాడు రాఘవయ్య. చిన్న ప్రయోగం ద్వారా పెద్ద మేలు చేసిన శ్రీధర్‌ను మెచ్చుకున్నాడు.       

కలిసి ఉంటే కలదు సుఖం

అనగనగా ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ నాలుగు ఆవులు కలిసే వెళ్ళేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెడుతూ ఉండేవి. వాటి యజమాని కూడా వాటి ఐకమత్యానికి ఎంతో ఆనందించేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ నాలుగు ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి.

అంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. "ఆహా! ఈరోజు నాకువిందు భోజనం దొరికిందన్న మాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను" అని సింహం అనుకుంది.

సింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి. కానీ అవి ఏమాత్రం భయపడలేదు. "చూడండి సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరుభయపడద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చెయ్యలేదు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమికొడదాం" అని చెప్పింది ఆ నాలుగు ఆవులలో ఒక ఆవు. "నీఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దం" అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి.

అంతే సింహం తమ మీద దూకేలోపునే నాలుగు ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. అంతే సింహంవాటి దాడికి ఎదురు నిల్వలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి.

అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించచ్చు అని దానికి తెలుసు. అందుకే మంచి సమయం చూసి ఆ నాలుగు ఆవులను విడి విడిగా కలిసింది.

ఆ రోజు మీరంతా కలిసి నామీద పోట్లాడినప్పుడు "నీ కొమ్ముల వాడితనం ఉందే అబ్బో నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికి రాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని నేనునీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి. కాబట్టి మిగతా మూడు నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అదే నాకు బాధగా ఉంది" అని చెప్పింది. ఆ ఆవు ఆలోచనలో పడింది.

ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. దాంతో నాలుగు ఆవులు మిగతావాటి కన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అట్లా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదైయింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ నాలుగు ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్ళడంలేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది. వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది. ఇంకే ముంది అదునుచూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది.

చూశారా! ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలూ వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.       

కలిసి ఉంటే...

రంగాపురం గ్రామం లో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు.

పట్టణానికి వెళ్ళి చౌకగా సరుకుల్ని కొని తేవడం లో మొదటివాడు దిట్ట. రెండో వాడు ఆ సరుకులను చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలను అమ్మగల సమర్ధుడు. ఇక మూడో వాడు లాభనష్టాలను అంచనా వేస్తూ అన్నలకి సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలైంది.

ముగ్గురికి వివాహాలు చేశాడు చలపతి. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్ళు గడిచాక ఆ కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.

'నావల్లే వ్యాపారం పెద్దదైంది' అని ఒకరంటే 'కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు.. ఇలా ముగ్గురు కొడుకులూ వాదులాడుకోవటం ప్రారంభించారు.

ఈ పరిస్ధితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకీ పంచేశాడు.ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకే కొనేవాడు, కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బందిపడ్డాడు.

రెండో వాడికి పట్టణం వెళ్ళి సరుకులు ఎలా కొనాలో తెలియదు. ఇక ఎప్పుడు సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడోవాడికి సరుకులు కొనాలన్నా, అమ్మాలన్నా కష్టంగానే తోచింది.

కొద్దిరోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పులపాలయ్యారు. సిగ్గుతో తల వంచుకొని తండ్రి వద్దకు వచ్చారు. 'చూశారుగా ఏంజరిగిందో. ముగ్గురూ కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా వుండేది. విడిపోయి ఎవరికివారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండీ' అన్నాడు చలపతి.

తమవల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములూ మళ్ళీ ఒకటయ్యారు. ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు.

కప్పరాజు సాయం...కష్టాలన్నీ మాయం

అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు ఇద్దరూ మంచి వాళ్ళుకారు. చిన్నవాడు మంచివాడేకానీ, పాపం అమాయకుడు. వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి, ముగ్గుర్నీ పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు. ముగ్గుర్నీ మైదానంలోకి తీసుకువెళ్ళి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి అని కోటలోకి వెళ్ళిపోయాడు. వాటిలో ఒక ఈక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు. ఇంకోటి పడమరకేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళతానన్నాడు. మూడో ఈక పైకంటా ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడోవానిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. పాపం మూడోవాడు దిగులుగా కూర్చొని ఆ ఈకని తీస్తుంటే అక్కడ నేలమీద ఒక తలుపు కనిపించింది. దాన్ని తీసేసరికి కిందికి మెట్లు కనిపించాయి. దిగి వెళితే ఒక గది కనిపించింది. గదిలోపలి నుండి కప్పల రాజును నేను. కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది. మూడో వాడు లోపలికి వెళ్ళి చూస్తే, ఒక పెద్దకప్ప కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చొని వున్నాయి.

కప్పల రాజు ఎవరు నువ్వు అని అడిగితే మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు. వెంటనే ఆ కప్ప నా మాయల పెట్టి తెండి! అది నా మహిమల దుట్టి! అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకువచ్చాయి. కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది. ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? మూడోవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమ పడటం ఎందుకనుకొని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు. రాజు మూడో వాడు తెచ్చిన బంగారు శాలువా చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు రెండో పరీక్ష. ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి. అంటూ మూడు ఈకల్ని ఎగరేశాడు. అవి మళ్ళీ అలాగే పడ్డాయి. పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే, మూడోవాడు మళ్ళీ నేలమీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కప్ప రాజు పెట్టెలోంచి వజ్రపుటుంగరం తీసి ఇచ్చాడు.

ఈ సారి కూడా రాజు మూడో వాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు ఆఖరి పరీక్ష. ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలి. అంటూ మళ్ళీ ఈకలు ఎగరేశాడు. ఈ సారి కూడా పెద్దవాళ్ళిద్దరూ చెరోదిక్కు వెళితే మూడో ఈక కిందనే పడడంతో మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు. అందులో తన కూతురైన ఈ ఆడకప్పను కూర్చోమన్నాడు. ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి. చేసేదిలేక మూడోవాడు వాటి వెనుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి, మూడోవాడికేసి తిరిగి నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది? అన్నాడు. ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది. సభలోని వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకు గెంతింది. అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు.

రాజు మళ్ళీ 'శభాష్' అని మూడో వాడిని రాజుగా ప్రకటించాడు. కానీ పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళుకదా? తండ్రి మీదకే కత్తులు దూసి 'ఇక మేమే రాజులం. మీరంతా రాజ్యం విడిచి పొండి' అన్నారు. అప్పుడో చిత్రం జరిగింది. పల్లకిని మోసుకువచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి, పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి. ఆయన పెద్దకొడుకులను దేశం నుండి తరిమేసి మూడోవాడిని రాజును చేశాడు.       

కప్ప రాకుమారుడు

ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది.

"అయ్యో నా అందమైన బంతి", అంటూ ఏడ్చిందా యువరాణి. "ఏమయింది యువరాణి?" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది.

"నా బంతి బావిలో పడిపోయింది" ఏడుస్తూ చెప్పింది యువరాణి.

"ఏడవకు", అంది కప్ప. "నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?" అని అడిగింది. "నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?" అని అడిగింది యువరాణి.

"అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను". అంది కప్ప. "సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.

అంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. "ఆగు, ఆగు", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.

మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది.

"ఏమయింది, తల్లీ?" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి.

"ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు" అన్నాడు రాజు.

యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. "నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది.

"నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.

అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు.

కనువిప్పు

ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.

వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.

అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.

బాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. 'ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.

కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.       

కట్టెలు కొట్టువాడు - బంగారు గొడ్డలి

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.

అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

వాడు ఇంటికి వెళ్ళి ఊరంతట ఈ సంగతి చెప్పెను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్భుద్ది పుట్టెను. మరుసటి దినము తాను ఒక ఇనుపగొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలని గొడ్డలిని నీటిలో పడవేసెను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలు పెట్టెను. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయెనని చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పెను. దేవతకు కోపం వచ్చి, వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా, తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలికూడా దక్కలేదు.       

ఒంటికన్ను దుప్పి

ఒక అడవిలో ఒక ఒంటికన్ను దుప్పి ఉండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని గడ్డివైపు, కన్నులేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది. సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు అని అనుకునేది ఆ దుప్పి.

కాని ఒక రోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. దుప్పిని చూసిన వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు. బాణం దుప్పి కాలిలో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడిపోతూ దుప్పి అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోగలిగింది.

'నేను గడ్డి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను. కాని అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం అన్ని వైపుల నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి' అని అనుకుంది.

ఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలు పెట్టింది.

ఐకమత్యమే బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. "ఐకమత్యమేబలం" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. నలుగురూ తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు.

ఏడుమల్లెల రాకుమారి

ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు.

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.

ఏడు కూజాల కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.

ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.

రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.

రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకాక్ ఊజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు.       

ఏ గుళ్ళో పెళ్ళి

పరంధామయ్య గారికి ఏడుగురు కుమార్తెలు. ఆరుగురికి వివాహాలు పూర్తి చేశాడు. కాని ఏడవకుమార్తె వివాహము గురించి సంబంధాల కోసము తెగ ప్రయత్నము చేశాడు. ఎక్కడా సరియైన సంబంధము దొరకలేదు. ఒక రోజున పరంధామయ్య పట్నంలో ఉన్న చిన్నప్పటి బాల్యస్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయనకు, పరంధామయ్యగారికి దూరపు చుట్టరికం కూడా వుంది. ఆయనే ఒక సంబంధం గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ సంబంధము పరంధామయ్య గారికి నచ్చింది. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. పిల్లనచ్చిందన్నారు. కట్నం అక్కరలేదన్నారు. కాని పెళ్ళి గుళ్ళో చెయాలని ఇంటిలోని వారు అన్నారు. ఏ గుడిలో చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం కలగలేదు. పరంధామయ్యగారి పెద్దల్లుడు వేంకటేశ్వర స్వామి గుడి అని, పరంధామయ్య హనుమంతుడి గుడి అని, రెండవ అల్లుడు రామాలయం అని, మూడవ అల్లుడు ఆది దేవుడైన వినాయకుని గుడి అని రకరకాలుగా చెప్పసాగారు.

వీళ్ళ మాటలకి పెళ్ళి కూతురు ఏం చెప్తే ఎలా వుంటుందోనని ఆలోచించి 'పెళ్ళి ముహూర్తము పెట్టే జ్యోతిష్కుణ్ణే అడగండి. ఏ గుళ్ళో చేయమంటారో తెలుసుకోండి. ఆయన ఇష్ట ప్రకారము చేయండి' అని చెప్పింది. జ్యోతిష్కుడు అందరి అభిప్రాయాలు తెలుసుకొని పెళ్ళి ఏ గుడిలోను జరగడం అంతమంచిదికాదు. వేంకటేశ్వరునికి ఇద్దరు భార్యలు. హనుమంతుడు బ్రహ్మచారి. వినాయకుడు బ్రహ్మచారి అనీ, కొందరు ఇద్దరు భార్యలు కలరని అంటారు. ఇహపోతే శ్రీరాముడు అన్ని విధాల యోగ్యుడే అయినా అతన్ని వివాహమాడిన సీతాదేవి ఎన్ని ఇబ్బందులు పడిందో మనకు తెలుసుకదా. నిక్షేపంగా ఆలోచించకుండా మీ స్వగృహములోనే వివాహము చేయండి. ఇంకేమీ ఆలోచించకండి. అనగానే వారు అంగీకరించి పెళ్ళి ఇంటివద్దనే చేశారు.

ఎవరు గొప్ప? - 2

ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది.

మొట్టమొదట ఎక్కడలేని అహంకారంతో మనస్సు ప్రారంభించింది. "నేను మీ అందరికీ రాజును. మీరంతా నా అధీనంలో ఉన్నారు. నేను నా ఇష్టం వచ్చినట్లు మిమ్మలను నడిపిస్తున్నాను. నేని లేకపోతే మీలో ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ మిమ్మల్ని గొప్ప అనుకోరు" అంది. మనస్సు చెప్పిన దానికి కోపంతో ఉద్రేకించిపోయి కన్ను" నేనే ఈ శరీరంలో ముఖ్యమైన దానిని. నేను లేకుండా కాళ్ళూ, చేతులూ తమ పనులు సక్రమంగా నెరవేర్చలేవు. నేను లేకపోతే చదువు ఉండదు, వ్రాతలు ఉండవు" అంది. వెంటనే ప్రగల్భంతో చెవి ప్రారంభించింది. "నీవు గొప్ప అంటే ఎవరు ఒప్పుకుంటారు. నేను లేకపోతే ఏమీ వినపడదు. ఏదీ వినిపించకుండా ఎవరు ఏంచేయగలరు? నేనే అందరికంటే గొప్పదానిని" అంది. వెంటనే ముక్కు లేచింది. "నేను లేకపోతే అసలు వాసనే తెలియదు. శ్వాస నావల్లే జరుగుతూంది. శ్వాసించకుండా ఎవరు జీవించగలరు? నేను మీఅందరికంటే గొప్పదానిని" అంది. అంతవరకు మాట్లాడకుండా నోటిలో ఊరుకున్న నాలుక తన గొప్ప చెప్పుకోవడం ప్రారంభించింది. "అసలు నేనే లేకపోతే మీ ప్రగల్భాలు మీరు ఇలా చెప్పుకోగలరా? మీ అందరికీ లేని మాట్లాడే శక్తి నాకుంది. నేను లేకపోతే తినే ఆహారంలో ఉప్పు, పులుపు, తీపి రుచుల వైవిధ్యం తెలియదు. రుచి తెలీనప్పుడు జీవితం విలువ ఏముంది? నేనే అందరికంటే గొప్పదాన్ని" అంది.

"ఇలా మనలో ప్రతివారూ ఎవరికి వారే గొప్ప అని, ఇతరులందరూ ఎందుకూ పనికిరానివారని అనుకుంటున్నాం. ఈ తగవు తీరేది కాదు. కాబట్టి ఒక పోటీ పెట్టి ఎవరు గొప్పో నిర్ణయించుకుందాం. మనం ఒక సంవత్సరంపాటు ఒకరి తరువాత ఒకరు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరు లేకపోతే దేహంలో అన్ని పనులు, క్రియలు నిలిచిపోతాయో వారే గొప్పవారుగా పరిగణించబడతారు. ఈ తీర్పుకు అన్నీ ఒప్పుకున్నాయి. మొట్టమొదట మనసు ఒక సంవత్సరంపాటు విడిచి వెళ్ళిపోయింది. తరువాత వచ్చి చూస్తే ఏ అంగానికా అంగం తమ పనులు చేసుకుంటున్నాయి. మనసు ఆశ్చర్యం వెలుబుచ్చింది. అప్పుడు అంగాలన్నీ "ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? నీవు లేకపోయినా మేమంతా సుఖంగా ఉన్నాం. మాకు ఏ విచారమూ లేదు" అన్నాయి. తరువాత కన్ను బయలుదేరింది. అదికూడా తిరిగివచ్చి వివిధాంగాలు తమ పనులు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గ్రహించింది. కన్ను తరువాత చెవి బయల్దేరింది. దారిలో ఓ బధిరుడు ఎదురయ్యాడు. అతడు సంకేతాలతో అన్ని విషయాలూ చెప్పాడు. శరీరం అంతా ఇతర అంగాలతో చైతన్యవంతంగా ఉంది. దాంతో తన గడువు పూర్తికాకుండానే తిరిగివచ్చింది. తరువాత ముక్కు బయల్దేరింది. ముక్కుకి దారిలో ఓ ముక్కిడి తటస్థపడ్డాడు. వెంటనే ముక్కు తిరిగి వచ్చేసింది. తరువాత నాలుక లేచి వెళ్ళడానికి ప్రారంభించింది. ఒక మూగవాడిని చూసీచూట్టంతోనే తిరిగివచ్చేసింది.

అన్ని అవయవాలు వచ్చాక ఆత్మ తన ఉపన్యాసం ప్రారంభించింది, "ఇప్పుడైనా గ్రహిస్తారా నేనే గొప్పదాన్నని?" అని ఋజువు చేయడానికి శరీరం నుంచి బయటకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యింది. కొంచెం కదిలిందో లేదో శరీరావయవాలన్నీ చైతన్యరహితం కాసాగాయి. కంటి గుడ్లు తేలిపోయాయి, నాలుక బైటికొచ్చేసింది, శరీరం మొద్దుబారసాగింది. దాంతో అవయవాలన్నీ "ఓ ఆత్మా, మమ్మల్ని క్షమించు. నువ్వుమాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు" అని ప్రాధేయపడ్డాయి. అప్పుడు ఆత్మ "మనలో ఏ ఒక్కరు లేకపోయినా మన శరీరం బాధపడుతుంది. మనం అందరం పొందికగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా, సుఖంగా ఉంటుంది. రండి. మనం అందరం చేదోడువాదోడుగా సంఘీభావంతో కలసి మన పనులు చేసుకుందాం" అనడంతో అవయవాలన్నీ తమ తమ ప్రాధాన్యలతోపాటు ఇతర అవయవాల ప్రాధాన్యతను కూడా గుర్తించాయి. శరీరంలోని వివిధ అంగాల మాదిరిగానే ఒక కుటుంబంలో, సమాజంలో, దేశంలో వివిధ సుఖ సంతోషాలు, శాంతి భద్రతలు ఐకమత్యం మీదే ఆధారపడి ఉంటాయి.       

ఎవరు గొప్ప - 1

ఒకప్పుడు అదృష్టానికి, తెలివితేటలకు మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని రెండూ వాదించుకున్నాయి. వారిరువురూ వారివారి వాదనలను ప్రొయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అదృష్టం తన సామర్ధ్యాన్ని నిరూపించడానికి ఒక పేదరైతును ఎంచుకుంది. అతని గోధుమ పంటని ముత్యాలుగా మార్చింది. కానీ ఆ రైతు మాత్రం తన గోధుమ పంటంతా గులకరాళ్ళుగా మారిపోయాయని చింతించింది. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దు:ఖానికి కారణమేంటని అడిగాడు. రైతు అంతా వివరించాడు. ముత్యాలపంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి, పక్కనే ఉన్న మంత్రితో "ఇతనెవరో కానీ చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువరైతుకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను" అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనడంతో "నీ పంటనంతా రాజమహల్‌కు తీసుకురా. నీకు నేను మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్ళి జరిపిస్తాను" అని రైతుతో అన్నాడు రాజు.

రాజు మాటకు రైతు ఎగిరిగంతేసి తన అంగీకారం తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్ధులు అతడిని ఆట పట్టించారు.

రైతు రాజమహలుకు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య (రాకుమార్తె) నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్ళికూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం కధ గుర్తుకు వచ్చింది. రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు.

రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుతీసి అతన్ని కాపాడి, తీసుకువచ్చారు. రాజు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు.

విజ్ణానం అదృష్టంతో ఇలా అంది. "చూసావా, నీవు ఆ పేదరైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చి పెట్టావో? నేను అతడిని కాపాడతాను".

విజ్ణానం రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు. "రాజా! ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ, కాపాడమని చేసిన హాహాకారాలు నేను విన్నాను. పెళ్ళి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్ళికూతురికి అశుభసూచకం కదా అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసినదంతా మీ కూతురి క్షేమం కోసమే".

ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకుని ఆలింగనం చేసుకున్నాడు.       

ఎవరు గుడ్డి?

"మన నగరంలో ఎంతమంది గుడ్డివారున్నారు" అని ఒకరోజు అక్బరు దర్బారులో ప్రశ్నించాడు. ఎవరు జవాబు చెప్పలేకపోయారు. అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. ఏదో ఒక సమాధానం బీర్బల్ కు చెప్పక తప్పుతుందా!

"ప్రభూ చాలమంది గుడ్డి వారు ఉంటారు. ఇప్పుడిప్పుడే లెక్క చెప్పమంటే వీలు కాదు. మీరు నాకు ఒకరోజు సమయం ఇస్తే జాబితా తయారు చేసి ఇవ్వగలను." అని చెప్పాడు బీర్బల్. అందుకు అక్బర్ ఒప్పుకున్నాడు.

ఆ మరునాడు బీర్బల్ చక్రవర్తి కోటకు దగ్గరలో జనసంచారం ఎక్కువగా ఉన్నచోట చిన్న చొప్పుల దుకాణం పెట్టి అందులో ఒక చొప్పుల జత కుడుతూ కూర్చున్నాడు. కొద్ది దూరంలో బీర్బల్ నియమించిన పనివారు కాగితం, కలం పట్టుకుని నిలబడి ఉన్నారు.

"ఆయన చేస్తున్న పనిని చూసి చాలామంది బీర్బల్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అడగసాగారు. అలా అడిగిన వారి పేర్లను బీర్బల్ సేవకులు కాగితంలో వ్రాసుకుంటున్నారు.

సాయంకాలం చక్రవర్తి విహారానికి బయలుదేరాడు. బీర్బల్ కూర్చున్న చోటు వైపు వచ్చారు. బీర్బల్ ను చూసి అక్బర్ కూడా అందరిలాగే అదే ప్రశ్న వేశాడు. "చెప్పులు కుడుతున్నాను ప్రభూ" అని బీర్బల్ సమాధానం చెప్తుండగానే, సేవకులు రాస్తున్న జాబితాలో అక్బర్ చక్రవర్తి పేరు కూడా చేరింది .

మరునాడు బీర్బల్ దర్బారులో చక్రవర్తికి.

గుడ్డి వారి జాబితాను సమర్పించాడు. ఆ జాబితా తీసుకుని ఆసక్తిగా పరీశీలించాడు చక్రవర్తి. అందులో చివరన తన పేరు చూడగానే ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి బీర్బల్? ఇందులో నా పేరు కూడా ఉంది. నేను గుడ్డివాడినా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బరు.

బీర్బల్ చేతులు జోడించి "ప్రభువులవారు నన్ను మన్నించాలి. కొందరు పుట్టుకతో గుడ్డివారయితే, మరి కొందరు చూపు ఉండి కూడా గుడ్డివారే. నిన్న నేను చేస్తున్న పని స్పష్టంగా కనబడుతోంది అయినా 'ఏం చేస్తున్నారని'? అందరూ నన్ను ప్రశ్నించారు. చివరకు ప్రభువులవారు కూడా. మరి ఇలాంటి వారు గుడ్డివారే కదా ప్రభూ!" అన్నాడు బీర్బల్.

తను అడిగిన ప్రశ్నకు జవాబు మరొక కోణంలో సరదాగా చూపించిన బీర్బల్ యుక్తికి ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బరు చక్రవర్తి.

ఎప్పుడో చదువుకున్న చందమామ కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది.

ఒకరోజు దూరపు బంధువు ఒకతను ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి మన సౌరభూడి ఇంటిలో దిగాడు. సౌరభూడి కవిత్వం గురించి విని మద్యాహ్నం తనుకూడా తీరిక చేసుకొని విన్నాడు. విని బాగుంది అని చెప్పి, ఊరకుండకుండా ఇలా అప్పుడప్పుడూ కవిత్వం చెప్పకపోతే ఏదన్నా పుస్తకం వ్రాయరాదు అని ఓ ఉచిత సలహా ఇస్తాడు.

దానికి సమాధానంగా సౌరభుడు తను ఎంతోకాలం నుండి వ్రాస్తూ పూర్తికావచ్చిన 'దేవపరిణయం' అనే పుస్తకాన్ని ఇంటికి వెళ్ళాక చూపిస్తాడు. దాన్ని చదివిన పెద్దాయన చాలా సంతోషించి రాజాశ్రయం పొందితే కవిత్వం ఇంకా రాణిస్తుందని చెప్పి ఒకసారి తనతో పాటు రమ్మని తన ప్రక్కింటిలోనే రాజకవి ఉంటాడని పిల్చినాడు.

ఇంటిలోని వారు, పొరుగువారు కూడా వచ్చినాయనకే వంతపాడేసరికి సౌరభుడు అతనితో పాటు బయలుదేరి రాజధాని చేరతాడు.

పక్కింటాయనే కాకుండా రాజకవి మన సౌరభుడి చుట్టానికి మంచి మిత్రుడు కూడా! అతన్ని కలుసుకొని తన పుస్తకం చూపిస్తాడు. మొత్తం ఓపిగ్గా చదివిన రాజకవి కొన్ని మార్పులూ, చేర్పులూ సూచిస్తాడు. అవి అన్నీ చేసి రాజుగారికి వినిపించి మంచి బహుమతి మెచ్చుకోళ్ళు పొందుతాడు.

తరువాత అందరూ అక్కడనే ఉండి మంచి మంచి కవిత్వం వ్రాయమని అడుగుతారు, కానీ వినకుండా ఇంటికి వెళ్ళి తన పుస్తకాన్నీ, బహుమతులను ముందేసుకొని బావురుమంటాడు. తను వ్రాయాలనుకున్నది ఒకటి చివరికి మార్పులూ, చేర్పులు తరువాత ఆత్మలేని శరీరంలా తయారవుతుంది. ముగింపు కూడా తను అనుకున్నది ఒకటి అక్కడ వ్రాసినది మరొకటి.       

ఎద్దు పాలు

ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు త్రాగాలని అనిపించింది. 'ఎద్దుపాలా!?' అదేమంత పెద్ద కోరిక ఎవరైనా భటులకు చెప్తే వాళ్ళుతీసుకుని వస్తారు కదా! అని మీరు అనవచ్చు. నిజమే కాని ఎద్దులు పాలు ఇవ్వవు కదా! ఆ విషయం రాజుగారికి తెలుసు అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడోనని బీర్బల్‌ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే! వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పాడు.

అక్బర్ చక్రవర్తి ఆ మాట చెప్పగానే బీర్బల్‌కు రాజుగారు తనను పరీక్షించేందుకు ఇలాంటి కోరిక కోరారని అర్ధం అయ్యింది. వెంటనే అనుమానం కూడా వచ్చింది రాజుగారు చెప్పింది ఒక వేళ తను పొరపాటుగా విన్నానేమోనని మళ్ళీ అడిగాడు "మహారాజా! మీరు అడిగింది ఆవు పాలే కదా! తప్పకుండా తెప్పిస్తాను" అన్నాడు. ఆ మాటకు అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. "బీర్బల్! నేను చెప్పింది నువ్వు సరిగా వినలేదనుకుంటాను నేను అడిగింది ఆవు పాలు కాదు ఎద్దు పాలు ఆవు పాలైతే నిన్ను అడగడం ఎందుకు? ఎవరైనా భటులను పంపించి నేను తెప్పించుకుంటాను కదా!" అన్నాడు అక్బర్ చక్రవర్తి. "అది కాదు మహారాజా! ఎద్దులు పాలు ఇవ్వవు కదా!" అన్నాడు బీర్బల్.

"ఆ విషయం అందరకూ తెలిసిందే కదా! అయినా కూడా నాకు ఎద్దు పాలు త్రాగాలని ఎంతో కోరికగా ఉంది. నా కోరికను నువ్వు తీర్చాలి తప్పదు" పట్టుదలగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తి పట్టుదల ముందు బీర్బల్ తలవంచక తప్పలేదు. "సరే మహారాజా! మీరు అడిగినట్టుగానే మీకు ఎద్దు పాలు తెప్పిస్తాను" అని ఒప్పుకున్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానం విని అక్బర్ చక్రవర్తి మాత్రమే కాదు, సబలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈసారైనా బీర్బల్ తన ఓటమిని ఒప్పుకుంటాడని, ఎద్దు పాలు తీసుకురావడం అసాధ్యం మహారాజా! ఈ పని నావల్ల కాదు అని అంటాడని అక్బర్ చక్రవర్తి అనుకున్నాడు. కానీ అట్లా అనకుండా సరే మహారాజా! ఎద్దుపాలు తీసుకుని వస్తాను అని బీర్బల్ అనేసరికి అక్బర్ చక్రవర్తితో పాటు సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు.

"బాగా అలోచించే చెప్తున్నావా?" అని అడిగాడు అక్బర్. "అవును మహారాజా! మీ కోరికను మన్నించాలి కదా! మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా ఎద్దు పాలు తీసుకుని వస్తాను." అని చెప్పాడు బీర్బల్. "సరే! ఓ వారం రోజులు సమయం ఇవ్వండి మహారాజా!" అన్నాడు బీర్బల్. "అలాగే కానీ వారం రోజుల తర్వాత నువ్వు ఎద్దు పాలు తీసుకుని రాకపోతే మాత్రం నిన్ను శిక్షించాల్సి వస్తుంది. బాగా గుర్తుంచుకో" హెచ్చరికగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. అందుకు బీర్బల్ సమ్మతించాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక బీర్బల్ చాలాసేపు అలోచించాడు. ఎలా రాజుగారి కోరిక తీర్చేది? ఎద్దులు ఎక్కడా పాలు ఇవ్వవని రాజుగారికి తెలుసు అయినా కూడా రాజు గారు ఎద్దు పాలు అడుగుతున్నాడంటే రాజుగారు తనను పరీక్షించడంకోసమే....

ఎలా రాజుగారికి ఎద్దుపాలు తీసుకుని వచ్చేది? ఈ విధంగా చాలాసేపు అలోచించగా బీర్బల్‌కు ఓ ఉపాయం తట్టింది. వెంటనే తన కూతురిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. బీర్బల్ కూతురు తండ్రి చెప్పినట్టుగానే బట్టలమోపు తీసుకుని రాజుగారి కోట వెనుకన ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళింది. అప్పటికి సమయం అర్ధరాత్రి దాటి ఉంటుంది. అక్బర్ చక్రవర్తితో సహా అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో బీర్బల్ కూతురు గట్టిగా చప్పుడు చేస్తూ బండ కేసి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతున్న శబ్ధానికి మహారాజుకు నిద్రాభంగం అయ్యింది. మంచి నిద్ర పాడయ్యేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే భటులను పంపించి ఈ సమయంలో బట్టలు ఎవరు ఉతుకుతున్నారో కనుక్కుని రమ్మనాడు. అక్బర్ చక్రవర్తి భటులు వెళ్ళి బీర్బల్ కూతురిని వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుని వచ్చారు.

"ఏమమ్మాయ్! ఎవరు నువ్వు? ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నా వేమిటి?" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. రాజుగారిని చూసి ఆ అమ్మాయి కొంచెం భయపడింది. "చెప్పమ్మాయ్! ఈ సమయంలో బట్టలు ఉతుకుతున్నావేమిటి? మరోసారి అడిగాడు అక్బర్ చక్రవర్తి. "ఇంట్లో చాలా పని ఉండటం వలన వీలు కాలేదు మహారాజా! అందుకే ఈ సమయంలో బట్టలు ఉతుక్కుంటున్నాను." అని చెప్పింది ఆ అమ్మాయి. "చాలా ఆశ్చర్యంగా ఉందే" అన్నాడు మహారాజు. "అవును మహారాజా! మా నాన్నగారు ప్రసవించడం వలన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మా నాన్నగారి ప్రసవం సంగతి వినగానే మా బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చూడటం వలన బట్టలు ఉతుక్కోవడానికి సమయం దొరకలేదు. మా నాన్నగారు చంటిబిడ్డ ఇంతకుముందే నిద్రపోయారు. అందుకని ఈ సమయంలో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చాను." అని చెప్పింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని అక్బర్ ఆశ్చర్యపోయాడు. "ఏంటి మీనాన్నగారు ప్రసవించారా!?" అని అడిగాడు. "అవును మహారాజా!" అంది ఆ అమ్మాయి. "మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా!? నువ్వు చెప్పేదంతా చాలా విడ్డూరంగా ఉంది. నిజం చెప్పు అసలు ఎవ్వరునువ్వు?" కొంచెం కోపంగా అడిగాడు రాజుగారు. "నేను నిజమే చెప్తున్నాను మహారాజా! నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు." అని చెప్పింది ఆ అమ్మాయి. "ఇదిగో అమ్మాయి! చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అబద్దం చెప్తున్నావు. నిజం చెప్పు ఎవరు నువ్వు?" అని అడిగాడు అక్బర్ చక్రవర్తి "మహారాజా! నేను నిజమే చెప్తున్నాను నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు. అయినా మహారాజా! ఎద్దులు పాలు ఇవ్వగా లేనిది మానాన్నగారు ప్రసవించడంలో ఆశ్చర్యం ఏముంది?" ఎంతో అమాయకంగా ముఖంపెట్టి అడిగింది. అంతే అక్బర్ చక్రవర్తికి నవ్వు వచ్చింది. అంతేకాదు ఆ అమ్మాయి ఎవరో కూడా రాజుగారికి అర్ధం అయ్యింది.

"నువ్వు బీర్బల్ కూతురివి కదూ?" అని అడిగాడు మహారాజు "అవును మహారాజా!" అంది ఆ అమ్మాయి. అంతే మరోసారి బీర్బల్ తెలివి తేటలకు ప్రశంసలు బహుమానాలు లభించాయి. తర్వాత... తర్వాత ఏముంది? మరునాడు అక్బర్ చక్రవర్తి సభలో జరిగినదంతా చెప్పాడు. బీర్బల్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడు. బోలెడన్ని బహుమతులు కూడా ఇచ్చాడు. తెలివితేటలు ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎంత సులభంగా పరిష్కరించుకోవచ్చో.       

ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవంచనలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. "వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.

రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.

మా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి "పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.

ఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత "కథ అంతా పుక్కిటి పురాణం" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు.       

ఎడారి విచిత్రం

పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు.

వ్యాపారి "నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి" అనుకున్నాడు.

కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. "నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. "ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం "స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు" అన్నాడు.

అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, "ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు" అని ఉత్సాహపరిచాడు.

ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు.

అక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు.       

ఊరికోసం బావి

వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము.

ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది.

ఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.       

ఉపాయం

మిన్నూ బయటికి వెళ్తుండగా దారిలో ఒక చిన్న మూతి గల జాడి కనిపించింది. జాడీలో ఏముందో తెలుసుకుందామని మిన్నూ దాని దగ్గరకు వెళ్లాడు. 'అబ్బ! నాకిష్టమైన పల్లెలున్నాయే' సంతోషంగా అనుకున్నాడు.

మిన్నూ జాడీ లోపల చేయి పెట్టాడు. పిడికిలి నిండా పల్లీలు పట్టుకున్నాడు. ఆ తరువాత చేయి బయటికి తీయడానికి ప్రయత్నించాడు. మిన్నూ పిడికిలి బిగించడంతో చిన్నదైన జాడీ మూతిలోంచి ఎంత ప్రయత్నించినా చేయి బయటకు రాలేదు.

దాంతో ఏడవటం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న ఒక పెద్దాయన మిన్నూ దగ్గరకు వచ్చాడు. "కంగారు పడకు బాబు, ఊరుకో! నేను చెప్పినట్టు చేస్తే నీ చేయి బయటకు వస్తుంది. అలాగే పల్లీలు కూడా వస్తాయి" అన్నాడు.

"అవునా? అయితే వెంటనే చెప్పండి" అని అడిగాడు మిన్నూ.

"చూడు బాబూ! నువ్వు ఒకేసారి మొత్తం కావాలనుకుంటే నీకు దొరకవు. కొంచెం కొంచెం పట్టుకుని తీస్తే నీకు నెమ్మదిగా అన్నీ దొరుకుతాయి. ఒకసారి ప్రయత్నించు!" అన్నాడాయన.

వెంటనే మిన్నూ పిడికిలి నిండా ఉన్న పల్లీలను వదిలేసి కొన్నింటిని పట్టుకున్నాడు. ఈసారి చేయి తేలికగా బయటకు వచ్చింది. ఆ విధంగానే పల్లీలు బయటికి తీయడం మొదలెట్టాడు. కొంత సమయం పట్టినప్పటికీ పల్లీలన్ని బయటికొచ్చేస్తాయి. పెద్దాయనకు ధన్యవాదాలు తెలిపి మిన్నూ సంతోషంగా పల్లీలు తింటూ వెళ్లిపోయాడు.

ఉపదేశం

కోసంగిపురం అనే ఊరి పరిసరాలలో ఒక నల్లత్రాచు ఉండేది. ఎంతోమంది దాని కాటుకు బలై ప్రాణాలు విడిచారు.

పాము భయంతో చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు ఈ ఊరును వదిలి వెళ్ళిపోయారు. నల్లత్రాచువల్ల ఆ ఊరిలో అభద్రతాభావం పెరిగిపోయింది.

ఒకరోజు ఒక సాధువు కోసంగిపురం వచ్చాడు. ప్రజలలో ఉన్న నల్లత్రాచు భయాన్ని తెలుసుకుని జాలిపడ్డాడు. వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

సాధువు పామును వెతుకుతూ దాని పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే పాము... కోపంగా బుసకొడుతూ పుట్ట నుండి బయటకు వచ్చింది. కాటువేయడానికి పడగ ఎత్తిన పాము ఆ సాధువు కళ్ళలో కనిపిస్తున్న మహిమకు చప్పున పడగ దించేసుకుని చలనం లేనట్టు నిలబడిపోయింది.

'నిష్కారణంగా మానవులను చంపడం పద్ధతి కాదని, దానివల్ల అది చాలా పాపం మూట కట్టుకుంటోదని...' బోధించాడు.

సాధువు చెప్పిన మాటలతో పాములో చాలా మార్పు వచ్చింది. 'ఇకముందు ఎవ్వరినీ కాటువేయననీ ఆయనకు మాటిచ్చింది పాము.

ఇక పాముతో భయం లేదని ఆ ఊరి ప్రజలతో చెప్పి అక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాడు సాధువు. నెల తర్వాత తిరిగి సాధువు ఆ ఊరికి రావడం జరిగింది. ఊరిలోకి అడుగుపెట్టగానే ఆయనకి ఒక దారుణమైన దృశ్యం కనబడింది. ఒకప్పుడు అందరిని భయపెట్టి నిద్రలేకుండా చేసిన నల్లత్రాచుని యువకులు రాళ్ళతో కొడుతుంటే... ఆ పాము నిశ్శబ్దంగా ఆ దెబ్బలను భరిస్తోంది.

సాధువు వాళ్ళని వారించి ఇళ్ళకు పంపేసాడు.

గాయాలతో రక్తసిక్తమైన నల్లత్రాచు సాధువు వైపు దీనంగా చూస్తూ... "స్వామీ... ఎవరినీ ఇబ్బంది పెట్టరాదని మీరు చెప్పారు. ఆ రోజు నుండి మీ ఆజ్ణను పాలిస్తూ వచ్చాను. కాటువేయడం మానేసాను. మనుషుల జోలికి వెళ్ళకుండా కప్పలను... చిన్న చిన్న పక్షులను భుజిస్తూ నా మానాన నేను బతుకుతున్నాను. కాని ఎప్పుడైతే నావల్ల ప్రమాదం లేదని తెలిసిందో... అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. నిష్కారణంగా నా దగ్గరకు వచ్చి నా మీద రాళ్ళు విసురుతున్నారు. మీరే చెప్పండయ్యా ఒకప్పటి నా మార్గం సరైనదే కదా?".

సాధువు ప్రేమగా దానివైపు చూస్తూ... "మనుషులను కాటు వేసినప్పుడు నీది సరైన మార్గం కాదు. అలాని వాళ్ళ హింసను నిశ్శబ్దంగా భరించే ఈ మార్గం కుడా సరైనది కాదు. నిన్ను కాటు వేయకూడదని చెప్పానేగాని ఆత్మరక్షణ కోసం బుసకొట్టకూడదని చెప్పలేదు. హింస నుండి నిన్ను నువ్వు రక్షించుకునే హక్కు నీకు వుంది" అని చెప్పాడు.       

ఉంగరం దొంగ ఎవరు?

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.

ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు "నామనసు బాగాలేదు" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.

"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. "మీమనసు ఎందుకు బావుండ లేదు?" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. "మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.

"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది." అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. "ఊఁ ఏమైనా అర్థం అయిందా!" అడిగాడు అక్బర్ చక్రవర్తి. "అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది" అన్నాడు. "అయితే చెప్పు మా సమస్య?" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. "అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు."అన్నాడు అక్బర్. "ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!"

"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది." అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. "ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది." "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి." అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు." అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అక్బర్ "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. "చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి." అడిగాడు బీర్బల్. "బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి." చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు." మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి." అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. "ఇదిగో ఇక్కడే పెట్టాను" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. "ఆహఁ! అలాగా! సరే... సరే..." అన్నాడు.

బీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. "ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!" అన్నాడు. "చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి." అన్నాడు.

"మహారాజా" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి." అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. "మహారాజా! దొంగ దొరికాడు" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు." అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.        

ఇది నిజం

ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. అప్పుడే ఆ సంసారం రచ్చకెక్కకుండా ఉంటుంది. 'స్నేహితం' కూడా ఇలానే ఉండాలి తెలుసా" అని సలహా ఇచ్చాడట.

విన్న ఆ ఇద్దరూ పక్కున ఓ నవ్వు నవ్వారటా. పైపెచ్చు ఆ వ్యక్తి వంక పిచ్చివాడివన్నట్లు చూస్తూ, "చూడూ ఒక్క మనిషి తన వంద తరాల బాగుకై పరితపిస్తున్నప్పుడు, ఇద్దరం మనుషులం కలిస్తే గొడవకాక ఏమవుతుంది. ఒక్కడి ఆలోచనైతే అది పాపమైనా, పుణ్యమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఇది తప్పు అనిచెప్పే దిక్కులేక చేసుకుపోతూనే ఉంటాడు కానీ, మంచీ చెడు అని రెండు పదాలు ఉన్నట్లు మేమిద్దరం ఉన్నాము. కాబట్టే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి చేసే విషయంలోనే మేము కీచులాడుకుంటామే కానీ, మరొకటికాదు" అన్నారట.

విన్న ఆపెద్ద మనిషి "మీరు చెప్పేది నాకు అర్ధం కావటంలేదు. కొంచం విపులంగా చెప్పండి" అని అడగగా, "ఇందులో అర్ధమైయ్యేలా చెప్పేదేముంది బాబుగారూ నంగిలా నిమ్మనంగా ఉండి గోతులు త్రవ్వే వారి వలన సమాజానికి హానికానీ కల్మషం లేకుండా గలగలా సెలయేరులా గోలచేసే మావల్ల ఎవరికీ హాని ఉండదు ఏమంటారు" అని అడిగారట. ఆ విషయం నిజమేననిపించిన ఆ ఆసామి తనదారిన తాను వెళ్ళిపోయాడు.

ఇది ధిక్కారం కాదు

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్ధానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో "రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో!" అని ఆదేశించాడు. మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు.

మరునాడు, కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో - "రాజా! మీరు తెనాలి రామలింగడిని ఈ రోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా, మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు" అని చెప్పాడు.

అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతు, "నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు" అన్నాడు. "అవును రాజా! మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు" అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి.

కోపంతో చిర్రెత్తు కొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు. చూసేందుకు వీలుగా రెండు కళ్ల దగ్గర రెండు రంధ్రాలున్నాయి. రామలింగడి గడుసుతనాన్ని అర్ధం చేసుకున్న రాజు "ఏంటి రామలింగా! ఈ వెకిలి వేషాలు? నీవు నా ఆదేశాలను ధిక్కరించావు" అన్నాడు. దానికి రామలింగడు "లేదు మహాప్రభూ! నా ముఖం మీకు చూపెట్ట వద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది" అని బదులిచ్చాడు.

"రామలింగా! నీ తెలివికి జోహార్లు. ఇంక ఆ కుండను తొలిగించి, నీ స్ధానంలో నీవు కుర్చుంటావా?" అన్నాడు మహారాజు. తెనాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసి వేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు.

ఆత్రపడ్డ నక్క

ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలసి మెలసి తిరిగేవి. మోసానికి, జిత్తులకు, ఆశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలసి మెలసి తిరుగుతున్నాయి గాని, హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్స. ఒక రోజు అవి రెండూ కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి. అవి చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి. కాని, తినడానికి ఏ జంతు మాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి. వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్లు మూసుకుని కునుకు తీశాయి. ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్ధం వినిపించింది. ఏమిటో అనుకొని, తన పక్కనే ఉన్న నక్క వైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతోందని గ్రహించి గబుక్కిన లేచి ఆ చెట్టు కిందపడ్డ దాని దగ్గరకి పరిగెత్తింది.

అదృష్టం. ఏదో కాని ఒక మాంసపు ఎముకను కొమ్మ మీదికి తెచ్చుకొని తింటున్నది. పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసము చూడగానే పోయేప్రాణం లేచి వచ్చింది. ఆ ఎంత అదృషం ఆకలికి మాంసమున్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది. దూరంగా వున్న మరోనక్క లేచి పరుగు పరుగున తన దగ్గరకి రావడం చూసింది. అది వస్తే నన్నిక ఈ ఎముకను కొరక నివ్వదని గబుక్కున ఆ ఎముకను మింగింది. మింగేటప్పుడు ఆ ఎముక నక్కనోటికి అడ్డంగా పడింది. ఎముక అటు నోట్లోకి ఇటు బయటికి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేలమీద పడి గిజగిజ తన్నుకోవడం రెండో నక్క చూసింది. రెండో నక్కకు ఏంచేయాలో తోచలేదు. ఎముక మింగుడు పడక ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది. తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది.       

ఆత్మవిశ్వాసము

కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.

సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం" అని వెండి నాణెము తీసి చూపించి "నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.

నేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు.       

ఆటో డ్రైవర్ నిజాయితీ

ఏలూరు పట్టణములో నరేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సంపాదన చాలక అవస్థలు పడుతుండేవారు. తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే. అయినా నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున ఇద్దరు దంపతులు అతని ఆటోలో అశోక్‌నగర్‌కి స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంటిలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ వూడదీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు వున్నాయి. వెంటనే తల్లిదండ్రులకి చెప్పింది.

నరేష్ వెంటనే భోజనము ముగించుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి బ్యాగ్ విషయము చెప్పి, వారి ఇంటి గుర్తులు చెప్పాడు. పోలీస్ వారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళి విషయము చెప్పగా, వారు బ్యాగ్ తమదేనని ప్రయాణ బడలికలో గమనించలేదని చెప్పి, ఆటో డ్రైవర్ నిజాయితీకి సంతసించి పదివేల రూపాయలు ఇచ్చి, తమ పిల్లల్ని రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకొని వెళితే నెలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేసి తన సంపాదన పెంచుకున్నాడు. అంతేగాక ఆ వీధిలోని పిల్లల్ని తీసుకెళ్ళి తన సంపాదన పెంచుకొని తన తల్లి ఆరోగ్యము బాగు చేయించుకొని సుఖముగా ఉన్నాడు.

అసూయ

ఒక ఆసుపత్రి గదిలో ఇద్దరు రోగులు వుండేవారు. ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండేది. రెండవ రోగి మంచం కిటికీకి దూరంగా వుండేది. కిటికీ దగ్గర వున్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యం ఎంత అందంగా వుంది. ఎంత పెద్ద మైదానం. ఎంత పచ్చని పచ్చిక. ఎంత చక్కని తోట. ఆ చక్కని తోటలో ఎన్నెన్ని రంగుల సువాసనల పూవులు. ఈ చల్లని సాయంకాలంలో ఎంత చల్లని గాలి వీస్తోంది. ఈ గాలిలో ఆ పచ్చిక అటూ ఇటూ కదులుతూ మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఆ తోట మధ్య ఎంత పెద్ద చెరువు, ఎన్ని బాతులు, ఎన్ని కలువ పూలు అని మంచం మీది రోగికి వర్ణించి చెబుతుండేవాడు. ఇది వింటున్న మంచం మీది రోగికి "నేనూ హాయిగా కిటికీ దగ్గర వుంటే బాగుండేది. బయట దృశ్యాలన్నింటినీ చూసేవాడ్ని" అని అనుకున్నాడు. ఆ రాత్రి కిటికీ దగ్గర రోగికి దగ్గుతో చాలా సీరియస్ అయింది. ప్రక్క మంచం మీద రోగి బటన్ నొక్క గలిగే స్థితిలో వున్నా నొక్క లేదు దుష్టబుద్దితో.

కిటికీ దగ్గర రోగి రాత్రి మరణించాడు. మరునాడు ఉదయం పక్క మంచం మీద ఉన్న రోగి కోరికపై అతన్ని అతి కష్టం మీద కిటికీ దగ్గర మంచం మీద పడుకోపెట్టారు. అతను అతి కష్టం మీద లేచి కూర్చుని బైటకు చూస్తే, బైట ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప ఏమీలేవు. "ఇన్ని రోజులూ నా తోటి రోగి నన్ను సంతోషపెట్టడానికే ఇన్ని దృశ్యాలూ కల్పించి చెప్పేవాడు. అతను నా మిత్రుడు" అని రెండవ రోగి బాధపడ్డాడు.

అసలుకి ఎసరు

ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమయిపోయినాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయ్యింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్లకాలువ, దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం వుండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలూ రెండు వైపుల నుండీ ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్ళటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమయిపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితేకాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి, ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలివైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలివైపుకు వచ్చి చేరింది.

ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తలవంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ మీ బలా బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఏ ఒక్కటీ, సమాధానపడక రెండవ దానికి దారివ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్దపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి, అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి, రెండూ తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లలద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి, తమలో తాము కలహించుకొనేటట్టుచేసి, తనపబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగయినా బుద్ది చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈ సారి కూడా చెట్టు క్రింద తిష్ట వేసి దుప్పి పిల్లలు జింకపిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈ సారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది యివతలకి వచ్చి చేరాయ

ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయ్యింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి, మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది. దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు వున్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచొని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో వుండగా తమ తలల్ని గట్టిగా ఢీ కొన్నాయి. అంతే ఆ దెబ్బతో నుజ్జు నుజ్జయిన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తువేసి, చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి.

అసమర్ధునికి బాధ్యత

ప్రతాపవర్మ అనే రాజుకు వేట అంటే అమితమైన నినోదం. రాజ్య వ్యవహారాలకంటే వేటకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తరచుగా అడవికి వెళ్లి కొద్ది రోజుల పాటు వేటాడి ఆ వినోదం తీరాక రాజ్యానికి వచ్చేవాడు. అలాగే ఒకసారి అడవికి వెళ్తూ భద్రయ్య అనే పనివాడికి అంత:పురం బాధ్యతను అప్పగించాడు. అంత:పురాన్ని భద్రంగా చూసుకుంటానని మాటంచ్చాడు భద్రయ్య.

కొద్ది రోజులకు రాజు వేట సరదా తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. భద్రయ్య రాజుకు స్వాగతం పలికాడు. పరిచారికలు రాజుకు హారతి ఇచ్చి పాటలు పాడి ఆహ్వానించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటూ సంతోషించిన రాజు భద్రయ్యతో "భద్రయ్యా! అంతా క్షేమమేనా?" అని అడిగాడు. భద్రయ్య భద్రంగా తలూపుతూ "అంతా భద్రంగా ఉంది ప్రభూ" అని బదులిచ్చాడు.

"రాణిగారెక్కడ?" అని అడిగాడు తన వేట ముచ్చట్లను అడిగి తెలుకోవడానికి. రాణి కనిపించలేదేమిటా! అని కలయచూస్తూ.

"యువరాజు గారిని చూడడానికి ఆస్దాన వైద్యుడి విడిదికి వెళ్లారు" అన్నాడు భద్రయ్య.

"యువరాజు అక్కడ ఎందుకు ఉన్నారు? వారికి ఏమైది?" అన్నాడు రాజు.

"పొరుగు రాజ్యం యువరాజుతో తలపడినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రభూ" అన్నాడు భద్రయ్య.

రాజు మనసు కీడు శంకించింది. "పొరుగు రాజ్యం యువరాజుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది? ఏ ప్రమాదం మంచుకొచ్చింది" అన్నాడు ఆందోళనగా.

"మన యువరాణి గారిని అపహరించుకుని వెళ్లడానికి వచ్చారు ప్రభూ, అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మన యువరాజు గారు గాయపడ్డారు" అన్నాడు.

"ఏమిటీ? మన యువరాణిని అపహరిద్దామని వచ్చారా? ఇంతకీ యువరాణిగారు ఎలా ఉన్నారు?" కంగారుగా అడిగాడు రాజు.

"అపహరించుకుని వెళ్లిపోయారు ప్రభూ! బహుశా రాక్షసంగా వివాహమాడి ఉండవచ్చు" వినయంగా సమాధానమిచ్చాడు భద్రయ్య. అంత:పురం అంతా భద్రంగానే ఉందన్నట్లు.

రాజు వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాజ్యవ్యవహారాలను పక్కన పెట్టాడు. ఆ పరిణామం రాజ్యానికే కాకుండా అంత:పురంలోని మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్దితికి దారితీసింది. తన బాధ్యతను తాను నిర్వర్తించక పోవడం ఒక్కటే కాకుండా అసమర్ధుడికి అంతటి ప్రధాన బాధ్యతను అప్పగించడం వల్ల ఎంతటి అనర్ధం ముంచుకు వచ్చిందో అర్ధం చే్సుకున్నాడు. సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిన తర్వాత కానీ ఆ రాజుకు తన బాధ్యత తెలిసి రాలేదు.       

అమూల్యమైన బహుమతి - 1

ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరిని ఇలా అడిగాడు - "ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.

"నేను మీలో ఒకరికి ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను" అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టాడు. రెండు నిమిషాల తరువాత మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?". అయినా చేతులు లేపడం ఆగలేదు.

"సరే!" అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తరువాత దాన్ని చేతిలోకి తీసుకుని "ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?" అని అడిగాడు. నలిగిపోయి, మాసిపోయినా ఆ నోటు కోసం చేతులు లేపడం ఆపలేదు సభికులు.

"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా, దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాని వారమని,

మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం.కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే" అని వివరించాడు ఉపన్యాసకుడు.

మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగి పోయింది.

అభిమాని

అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.

పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.

అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.

ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు.

సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.

మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.

"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.

ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.       

అభిప్రాయం

తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను వినిపించాలని వచ్చాడు. తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని ఆయన కోరిక. అసలు తీరికలేని రామలింగడు "పండితావర్యా! మీరు మీ పద్యాలను మా వద్ద ఉంచి వెళ్ళండి. మేము తరువాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు చెబుతామ" అని చెప్పాడు. రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుబట్టాడు.

పండితుడు మొండి వైఖరి రామలింగడికి కోపం తెప్పించినా "సరే! మొదలెట్టండి" అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు. పండితుడు పద్యాలు చదవడం మొదలెట్టాడు. మొదటి రెండు మూడు పద్యాలకు "ఊ" కొట్టిన రామలింగడు ఆ తర్వాత ఎంచక్కా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పండితుడు. పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు.

రామలింగడు కాస్సేపటి తర్వాత నిద్రలేచాడు.

"అయ్యా! నా పద్యాలను మరోసారి వినిపించాలా?" అడిగాడు పండితుడు. "ఎందుకు? నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా!" అన్నాడు రామలింగడు. "మీరా..... అభిప్రాయమా? లేదే! మీరు జోరునిద్రలోకి జారుకున్నారు" అని ఆశ్చర్యంగా అన్నాడా పందితుడు. "అవును నిజమే! నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను" అని ముక్తసరిగా బదులిచ్చాడు రామలింగడు.

రామలింగడి వ్యంగ్య సమాధానానికి, అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధ్పడాలో అర్ధంకాక అక్కడి నుండి జారుకున్నాడు ఆ పండితుడు.

అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు. తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ను షాపు యజమానికి ఇచ్చాడు. ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని బాబూ! నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్‌కు చూపించుకో అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి ఏంటిరా! కాలికి ఏమి అయింది? ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.

చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది. అని మరలా అబద్దం చెప్పాడు వాసు. నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు. చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు. ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది. అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు. ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది అందుకే పెద్దలు అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో. ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు. బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది.        

అపూర్వ స్నేహం

అనగనగా ఒక ఊళ్లో ఓ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఉన్నచోటనే బక్కచిక్కిన కుక్క ఒకటి ఉండేది. ఏనుగుకు తెలియకుండా చడీచప్పుడు కాకుండా డేరాలోకి వచ్చి ఏనుగు తినేటప్పుడు పడిపోయిన ఆహారపదార్ధాలను ఆ కుక్క తింటుండేది. ఆ ఏనుగు కుక్క రాకపోకలు గమనించింది. తరచూ అలా వస్తూపోతుండటంతో కుక్కతో ఏనుగుకు క్రమేపీ స్నేహం కుదిరింది.

ఆ ఏనుగు, కుక్క మంచి స్నేహితులయ్యయి. ఒకరు లేకుండా మరొకరు తినేవారు కాదు. రెండూ ఎంతో ఆనందంగా, ఆటలతో గడిపేవి.

ఒకరోజు ఓ గ్రామస్తుడు నగరానికి వచ్చి, ఈ ఏనుగు డేరావైపు వచ్చాడు. అతను ఎవరూ గమనించకుండా కుక్కను తన గ్రామానికి తీసుకెళ్లాడు.

తన స్నేహితుడు లేకపోయేసరికి ఏనుగుకు దిగులు పట్టుకుంది. ఏమీ చేయబుద్ది కావడం లేదు. తినడానికి, స్నానం చేయడానికి మనస్కరించడం లేదు. మాలి ఈ సంగతిని రాజుకు తెలిపాడు.

రాజు దగ్గరున్న మంత్రికి జంతువులను అర్ధం చెసుకునే తెలివితేటలు ఉన్నాయి. మంత్రిని పిలిచి ఆ ఏనుగు పరిస్ధితి కంక్కోమని చెప్పాడు రాజు. ఆ మంత్రి ఏనుగు డేరా దగ్గరికి వెళ్లాడు. ఏనుగు చాలా దిగులుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే వున్న సేవకులను పిలిచి, "ఏనుగుతో ఎవరైనా స్నేహంగా ఉండడం మీలో ఎవరైనా గమనించారా?" అని అడిగాడు మంత్రి.

వెంటనే వాళ్లు కుక్కతో ఏనుగు స్నేహంగా ఉండేదని, అవి రెండూ మంచి మిత్రులని చెప్పారు. "ఆ కుక్కను ఎవరో తీసుకెళ్ల్లారు" అని చెప్పారు.

మంత్రి రాజు దగ్గరికి వచ్చి, జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు. "రాజా్, మీ ఏనుగుతో స్నేహం కట్టిన ఆ కుక్కను ఎవరు బంధించి ఉంచారో వారికి జరిమానా వేస్తానని ఓ ప్రకటన చేయండి" అని సూచించాడు.

రాజు ప్రకటన జారీచేశాడు. కుక్కను తీసుకెళ్లిన ఆ గ్రామస్తుడు ఆ ప్రకటన తెలుసుకుని కుక్కను వదిలేశాడు. అది పరుగు పరుగున ఏనుగు డేరాను చేరింది.

ఏనుగు ఆనందానికి అంతేలేదు. తన స్నేహితుడిని తొండంతో పట్టి లేపి తన తలపై కూర్చోబెట్టి ఆడించింది. తోకను ఆడిస్తూ కుక్క కూడా ఎంతో ఆనందంతో ఆడుకుంది. అప్పట్నుంచీ ఆ రెండూ సంతోషంగా కలిసే ఉన్నాయి.