Pages

Wednesday, July 18, 2012

అబద్ధమాడితే అపాయం

రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్యా పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే పదేళ్ళ కొడుకు, భాగ్య అనే ఐదేళ్ళ కూతురు అంటే పంచ ప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య, చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు.

ఒకరోజు పొలంపని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ... పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్ళాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలంపనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు.


నాయనా రామూ...! నేను పక్కనే కూలీలతో పొలంపని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కానీ... ఇక్కడకు అప్పుడప్పుడు పెద్దపులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి, కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య.

అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా... "నాన్నా...! నాన్నా...! పెద్దపులి వచ్చింది" అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య... కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు, గడపారలతో పరుగు పరుగున వచ్చాడు.

ఇది చూసిన రాము నాన్నా...! పులి లేదు ఏమీ లేదు... ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటిపని ఇంకెప్పుడూ చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు.



మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్ళీ "నాన్నా...! నాన్నా...! పెద్దపులి వచ్చింది" అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు, గడపారలతో ఉరికి వచ్చాడు. అయితే... ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు.

రాము బాధతో ఏడుస్తూ కూర్చొని గొర్రెలవైపు చూస్తుంటే... నిజంగానే పులి వచ్చింది. "నాన్నా...! నాన్నా...! ఈసారి నిజంగానే పెద్దపులి వచ్చింది" అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్ళు ఎవరూ కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు.

ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు.

ఏదో వేళాకోళానికి, నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే, అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడూ వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి పిల్లలూ...! హాస్యానికైనా అబద్దం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం 

మృగరాజునే హడలెత్తించిన మేకపోతు

నాగలంక అనే ఊర్లో శీనయ్య అనే మేకలకాపరి ఉండేవాడు. అతడికి ఉన్న మేకలలో ఒక మేకపోతు అంటే చాలా ఇష్టం.దానికి అతడు ప్రేమగా గోపయ్య అనే పేరు పెట్టుకున్నాడు. మిగతా మేకలన్నింటితో కలిపి గోపయ్యను కూడా శీనయ్య ఒకరోజు అడవికి మేతకు తీసుకెళ్లాడు.

మేకల మందతో కలిసి గోపయ్య అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకు అలములు తింది. ఎంతో ఆనందంగా ఉన్న గోపయ్య అడవంతా ఉరుకులు పరుగులు పెడుతూ... అందరికంటే ముందే వెళ్లాలన్న ఉత్సాహంలో మందనుండి తప్పిపోయింది. ఎంతసేపు తిరిగినా గోపయ్య మేకల మందను చేరుకోలేక పోయింది. అప్పటికే చీకటి పడటంతో ఎటూ పాలుబోక దగ్గర్లో ఒక గుహ కనబడితే అందులోకెళ్లి పడుకుంది.

ఏదో అలికిడి వినిపించగానే గోపయ్యకు మెలకువ వచ్చింది. ఆ గుహలో నివాసం ఉంటోన్న సింహం తన వేటను ముగించి సుష్టుగా భోంచేసి త్రేన్చుకుంటూ లోపలికి వచ్చింది. సింహం గురించి అప్పుడెప్పుడో వినడం తప్ప ఎప్పుడూ దానిని చూడలేదు గోపయ్య. అలాంటిది ఒక్కసారిగా తన ముందు సింహం కనిపించగానే బిక్కచచ్చిపోయింది. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు గనుక తాను భయపడుతూ కనిపిస్తే సింహం వదిలిపెట్టదు కాబట్టి భయపడకూదని నిర్ణయించుకుంది.


అయితే విచిత్రం ఏమిటంటే... సింహం కూడా గోపయ్యను చూసి భయపడింది. చీకట్లో మిలమిలా మెరిసిపోతూ పెద్ద గడ్డము, కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహం కూడా జడుసుకుని, తనను చంపేందుకే తన గుహలోకి వచ్చి ఎదురుచూస్తోందని అర్థం చేసుకుంది.

ఇదంతా గమనిస్తోన్న మేకపోతు గోపయ్యకు కాస్తంత ధైర్యం వచ్చింది. సింహం తనను చూసి ఇలాగే భయపడుతుండగానే ఇంకా భయపెట్టాలని, భయపెడుతూనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలని పథకం వేసుకుంది. కానీ ఈ చీకట్లో ఎలా తప్పించుకోవాలి? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా... చీకట్లో, అడవిలో ఎక్కడకీ వెళ్లలేనని... ఒకవేళ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మంచిది కాదని ఆలోచించిన గోపయ్య ఎలాగోలా తెల్లవారుఝాముదాకా నెట్టుకురావాలని అనుకుంది.

మరోవైపు సింహం కూడా ఇలాగే ఆలోచిస్తోంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకుని, ఒకవేళ అది తనకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చనీ, తనకన్నా బలహీనురాలైతే దాన్ని చంపి తినవచ్చునని పథకం వేసుకుంది. ఏదైనా తెల్లారే దాకా కాస్తంత మౌనంగా ఉండటం మంచిదని మనసులో అనుకుంది.



మేకపోతు గోపయ్య, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకుని, అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అంటూ గద్దించింది. సింహం కూడా అంతే ధైర్యంగా "నేను సింహాన్ని, మృగరాజును. ఈ అడవికి రాజును నేనే." అంది ఓ వైపు భయపడుతూనే.

"నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉందే. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట అంది గోపయ్య. ఏది ఏమైనా తన అదృష్టం మాత్రం పండిందని, తాను ఇప్పటిదాకా లెక్కలేనన్ని పులులను, వెయ్యి ఏనుగులను చంపానని గొప్పగా చెప్పుకుంది మేకపోతు.

అయితే తన వాడి కొమ్ములతో వాటినన్నింటినీ కుమ్మి కుమ్మి చంపేశాననీ, ఒక్క సింహాన్ని మాత్రం చంపలేకపోయానని... ఆ సింహాన్ని కూడా చంపితే తన దీక్ష పూర్తి అవుతుందని భయపెడుతూ చెప్పింది మేకపోతు గోపయ్య. సింహం భయపడుతుండటాన్ని చూసిన మేకపోతు మరింత రెచ్చిపోతూ... సింహాన్ని చంపేదాకా ఈ గడ్డం తీయనని ప్రతిఙ్ఞ పూనాననీ, ఈనాటితో తన దీక్ష పూర్తయినట్లేననీ... ఒక్కసారిగా సింహం మీదికురికింది.

అంతే... సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగులు పెట్టింది. హమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ... మేకపోతు గోపయ్య తెల్లారేదాకా అక్కడే ఉండి ఆ తరువాత అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పటికే దాని యజమాని శీనయ్య వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. యజమానిని చూసిన గోపయ్య పరిగెత్తుకుంటూ అతడిముందు నిలిచింది.

గోపయ్యను చూసి సంబరపడ్డ శీనయ్య "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని కంగారు పడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా! నాకంతే చాలు" అంటూ గోపయ్యను దగ్గరకు తీసుకున్నాడు.

తర్వాత మేకపోతు గోపయ్య, యజమాని శీనయ్య సంతోషంగా మేకల మందతో కలిసి ఇంటికెళ్లారు. పిల్లలూ... మీకు మేకపోతు గాంభీర్యం గురించి తెలిసే ఉంటుంది. అలాంటి ఓ మేకపోతు తన ప్రాణంమీదికి వచ్చినప్పటికీ ధైర్యంగా ఉంటూ, సింహాన్నే బెదరగొట్టి తనను తాను ఎలా కాపాడుకుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదూ...!

అపాయంలో ఉపాయం

ల్లలూ...! ఈరోజు మనం ఆపద సమయాల్లో మెళకువగా ఎలా ఉండాలో తెలియజెప్పే ఓ చిన్న కథను తెలుసుకుందాం...!

సింహాచలం అనే ఊర్లో ఒక పెద్దావిడ ఉండేది. ఆమెకు నలుగురు కూతుళ్ళు. ఉన్నంతలో నలుగురి కూతుళ్ళకు బాగానే పెళ్లి జరిపించింది. తాను సంపాదించిన మొత్తాన్ని నలుగురు కూతుళ్ళకు సమానంగా పంచింది పెద్దావిడ. అయితే ఆమె ఎలా బ్రతకాలి అన్న సమస్య రావడంతో నలుగురు కూతుళ్ళ వద్దా మూడు నెలలపాటు ఉండాలని నిర్ణయించుకుంటుంది.

మొదటగా పెద్దకూతురు ఇంట్లో మూడు నెలలపాటు గడిపిన పెద్దావిడ, రెండో కూతురు ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ అడవి గుండా ఆమె నడచి వెళ్తుంటుంది. ఆ అడవిలోనే పులి ఒకటి తిరుగుతూ ఉండేది. నరవాసనను గుర్తుపట్టిన ఆ పులి పెద్దావిడ దగ్గరకు వచ్చేసింది.


పెద్దావిడను తినేసేందుకు మీదపడింది. అయితే మంచి యుక్తి, వయసుకు తగిన తెలివితేటలు కలిగిన పెద్దావిడ నేర్పుగా పులితో ఇలా అంది. "పెద్ద పులీ...! పెద్ద పులీ...! నేను బాగా ముసలిదాన్నయిపోయాను, బాగా చిక్కిపోయాను, ఆరోగ్యం కూడా బాగలేదు... ఇప్పుడు నేను రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ పది రోజులు ఉంటాను. బాగా తినేసి ఒళ్ళుచేసి వస్తాను. అప్పుడు నన్ను తిందువుగానీ..." అని చెప్పింది.

పెద్దావిడ మాటలను నమ్మిన పులి అప్పటికి వదిలి పెట్టింది. కానీ పెద్దావిడ రెండో కూతురు ఇంటికి వెళ్ళి పదిరోజులు, పదిహేనురోజులు గడిచి, నెల కూడా పూర్తవుతుంది. అయినా ఆమె రాదు. ఎలాగైనా రాకపోతుందా, వెళ్ళేందుకు ఇదే దారి కదా.... అప్పుడు ఆమె పని పడతానని బీష్మించుకు కూర్చుంది పెద్దపులి.

రెండో కూతురు ఇంట్లో మూడు నెలలపాటు గడిపిన పెద్దావిడ మూడో కూతురి ఇంటికి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయలు దేరే రోజు దగ్గర పడుతుండగా తనకు పులితో తనకు ఎదురైన పరిస్థితి గురించి రెండో కూతురితో పూసగుచ్చినట్లు చెప్పింది.



పెద్దావిడ రెండో కూతురు కూడా తెలివైనదే కావడంతో ఓ ఉపాయం ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చి అందులో పెద్దావిడను కూర్చోబెట్టి, మూత పెట్టి, మూతకు గుడ్డ కట్టి దొర్లించి వదిలిపెట్టింది. బాన దొర్లుకుంటూ అడవిలో పోతూ ఉంటుంది. బానలో ఉన్న ముసలమ్మ పులి ఇక తనను ఏమీచేయలేదనుకుంటూ హుషారుగా పాడుకుంటూ వెళుతుంటుంది.

ఇంతలో బాన పులికి దగ్గరగా వస్తుంది. అసలే కోపంతో ఉడికిపోతోన్న పెద్దపులి బానను కాలితో ఆపి, పంజాతో గట్టిగా దెబ్బ కొట్టింది. అంతే బాన ఢాం అని పగిలిపోయి పెద్దావిడ బయటపడింది. ఓసీ ముసల్దానా నన్ను ఇంత మోసం చేస్తావా... నిన్ను ఇప్పుడే తినేస్తానంటూ మీదపడింది.

పెద్దావిడకు వెన్నులో వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుని, మళ్ళీ కాస్త ఆలోచించి "పెద్ద పులీ...! పెద్దపులీ...! ప్రయాణంలో బాగా అలసిపోయాను ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. కాబట్టి, పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువుగానీ" అంటూ బ్రతిమలాడింది. పెద్దావిడ మాటలను మళ్ళీ నమ్మిన పులి "సరే" అని వదిలి పెట్టింది.

చెరువులోకి దిగిన పెద్దావిడ గంట, రెండు గంటలు సేపు గడిచినప్పటికీ బయటికి రాలేదు. అసలే ఆకలితో ఉన్న పెద్దపులి కోపంతో ఊగిపోతూ... గట్టుమీద నుండి పెద్దావిడను పిలిచింది. పులిమాటలు విన్నప్పటికీ పెద్దావిడ పట్టించుకోలేదు. దీంతో పులి ఎలాగైనా సరే ఆమెని తినేయాలని చెరువులోకి దూకి ఆమెకు దగ్గరగా వెళ్ళింది. అంతే ఒక్కసారిగా పెద్దావిడ తన రెండు చేతుల్లో ఉన్న ఇసుకను పులి కళ్ళలోకి కొట్టింది.

ఇంకేముంది... ఇసుక కళ్ళనిండా పడటంతో పెద్దపులికి కళ్ళు కనబడలేదు. కేకలు పెడుతూ... చెరువులోనే గిలగిల తన్నుకుంటూ ఉండిపోయింది. ఈలోపు పెద్దావిడ ఒడ్డుకు చేరుకుని మూడో కూతురు ఇంటికి వెళ్లిపోయింది. కాబట్టి పిల్లలూ...! ఆపద సమయాల్లో ఉపాయంతో, తెలివితో మసలడం అందరూ నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే జీవితం ఆనందమయమవుతుంది.

తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు

ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్క. "అరే... మంచి విందు భోజనం దొరికిందే" అని సంతోషపడుతూ, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది. అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క...

"పుంజు తమ్ముడూ...! నీకో శుభవార్త" అంటూ పలకరించింది.

శుభవార్తా...? నాకా? ఏంటది? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు.

స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. ఇక నుంచి పక్షులు, జంతువులు అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోకూడదని, ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క.

కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిందికి దిగివస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క.



అరె... ఇది చాలా మంచి విషయమే. అందుకేనేమో నీ స్నేహితులు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు.

నా స్నేహితులా...!? ఎక్కడ...? ఎవరబ్బా..!? అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క.

అమ్మో...! వేటకుక్కలు. అవి తనవైపే వస్తుండటాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది. అది చూసిన కోడిపుంజు...

అదేంటి నక్క బావా, అంతగా భయపడుతున్నావు. ఇప్పుడు అందరం స్నేహితులమే కదా...!? అంటూ నవ్వింది.

నిజమే... కానీ ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా...! అని కోడిపుంజుకు బదులిచ్చి... బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క. కాబట్టి, పిల్లలూ... తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...! రేపు మళ్ళీ మనం బోలెడు కథలు చెప్పుకుందాం. శెలవా మరి...!

సాధనమున పనులు సమకూరు ధరలోన...

పూర్వకాలంలో ఉత్తానపాదుడు అనే రాజుకు సునీతి, సురుచి పేర్లతో ఇద్దరు భార్యలుండేవారు. రాజుగారికి చిన్న భార్య సురుచి అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆమెకు పుట్టిన కుమారుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకునేవాడు. ఒకరోజు పెద్ద భార్య కుమారుడైన ధృవుడు తనను కూడా ఒడిలో కూర్చోబెట్టుకోమని తండ్రిపై మారాం చేశాడు.

దీన్ని గమనించిన సవతితల్లి సురుచి, ధృవుడితో "నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోవాలంటే తపస్సు చేయాల్సిందే!" అంటూ హేళన చేసింది. దాంతో ధృవుడు తపస్సు చేసేందుకు బయల్దేరుతుండగా, అతడి తల్లి సునీతి "నాయనా...! నువ్వు పసివాడివి, తపస్సు చేయడం ఎంతో కష్టమైన పని, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను. వెళ్ళవద్దు" అంటూ ఎంతగానో బ్రతిమలాడింది.

తల్లి ఎంతగా వారించినప్పటికీ వినకుండా పట్టుదలతో ధృవుడు తల్లిని ఒప్పించి ఆశీర్వాదం పొంది, అరణ్యాలకు బయలుదేరాడు. దారిలో నారద మహాముని ధృవుడికి ఎదురై, అతడి గురించి తెలుసుకుని నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ, గాలినే ఆహారంగా తీసుకుంటూ ధృవుడు కఠోరంగా తపస్సు చేశాడు.

ధృవుడి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై, అతడి పట్టుదలకు మెచ్చుకుని ప్రేమతో చెక్కిలి నిమిరి... ఆకాశంలో ధృవతారగా వెలుగొందుతావని వరం ప్రసాదించాడు. ఆకాశంలో స్థానచలనం లేకుండా నిలబడే నక్షత్రం ధృవనక్షత్రం మాత్రమే. కాబట్టి పిల్లలూ... భక్తితోపాటు పట్టుదల అనేది ఉంటే సాధించలేనిదేమీ లేదనే నీతి మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది.

పరోపకారం నిధనం శ్రేయం

అనగనగా ఒక అడవి. ఆ అడవి మధ్యలో ఉన్న నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉంది. ఆ మర్రిచెట్టుపై ఒక పావురం నివసిస్తుండేది. చాలా మంచిదైన ఆ పావురం ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది.

ఇంకో విశేషం ఏమిటంటే... ఆ పావురానికి పాటలు పాడటం అంటే మహా సరదా. తన పనంతా అయిపోయిన తరువాత చెట్టుపై చేరి పాటలు పాడుతూ గడిపేసేది. అలా పావురం ఒకరోజు పాటలు పాడుతూ నదిలో నీరు తాగేందుకు రాగా, అక్కడ దానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమ ఒకటి కనిపించింది.

ఆ చీమను ఎలాగైనా కాపాడాలనుకున్న పావురానికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకునొకదానిని తీసుకొచ్చి చీమ పక్కన పడేసి... "ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణాన్ని కాపాడుకో" అంటూ గట్టిగా అరిచింది. అంతే, చీమ చటుక్కున ఆ ఆకుమీదికి వెళ్ళగా, ఆకు అలా నీటిపై తేలుతూ నది ఒడ్డుకు చేరడంతో తన ప్రాణాలను కాపాడుకుంది.

గట్టుమీదికి చేరిన చీమ పావురంతో మాట్లాడుతూ... "నా ప్రాణాలు కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను" అంటూ పావురానికి కృతఙ్ఞతలు చెప్పింది. తరువాత తన ప్రాంతానికి బయలుదేరిన చీమ కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాణ్ణి, అతడు పక్షుల కోసం నాలుగు వైపులా గాలిస్తున్న వైనాన్ని గమనించింది. అంతేగాకుండా, తనని కాపాడిన పావురం ఉంటున్న చెట్టువైపుకు ఆ వేటగాడు వెళ్ళడాన్ని చీమ పసిగట్టింది.



రెప్పపాటు క్షణంలలోనే ఆ వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కు పెట్టి పావురానికి గురి పెట్టాడు. దీన్ని చూసిన చీమ కోపంతో వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి కసిగా కుట్టేసింది. బాణం గురితప్పిన వేటగాడు చీమకాటుతో బాధతో విలవిలలాడాడు. బాణం గురితప్పడంతో పావురం మరో చోటికి ఎగిరిపోయింది. తను ఎలా రక్షింపబడ్డానో పావురానికి తెలియలేదు.

అయినప్పటికీ చీమ తన ప్రాణాలను కాపాడిన పావురం ప్రాణాలను కాపాడినందుకు చాలా సంతోషపడింది. తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమ ఆనందంగా తన ప్రాంతానికి తరలిపోయింది. కాబట్టి పిల్లలూ...! మంచి చేసినవారికి, వారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుందని ఈ చీమ-పావురం కథ ద్వారా అర్థమైంది కదూ...!

అసూయ వద్దు - స్నేహమే ముద్దు

ఒక ఊర్లోని ధర్మాసుపత్రి గదిలో ఇద్దరు రోగులు ఉండేవారు. వారిలో ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండగా, మరో రోగి మంచం కిటికీకి దూరంగా ఉండేది. కిటికీ దగ్గర వున్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యాలు చాలా బాగున్నాయంటూ రెండో రోగికి వర్ణించి చెప్పేవాడు.

అబ్బా... ఎంత పెద్ద మైదానం, పచ్చని గడ్డి, చూడ చక్కని తోట, ఆ తోటలోని రంగు రంగుల పూవులు అంటూ కిటికీ పక్కన ఉండే రోగి రెండో రోగికి ప్రతిరోజూ చెప్పేవాడు. చల్లని సాయంకాలంలో చల్ల గాలి గురించి, ఆ గాలికి ఊగే పూలచెట్ల గురించి, తోట మధ్యలో ఉన్న పెద్ద చెరువు, అందులోని బాతులు, కలువ పూలు గురించి కూడా చెప్పేవాడు.

ఇవన్నీ ప్రతిరోజూ వింటోన్న రెండో రోగికి రోజు రోజుకీ అసూయ ముదిరిపోయి, "తాను కూడా కిటికీ పక్కన ఉంటే ఎంత బాగుండేది, బయట దృశ్యాల్నన్నీ చూసేవాడిన"ని అనుకుంటుండేవాడు. ఇలా కాలం నడుస్తుండగా ఓరోజు కిటికీ పక్కన ఉండే రోగికి ఓ రాత్రిపూట సీరియస్ అయింది. పక్కనే ఉన్న రోగి డాక్టర్‌ను పిలిచేందుకు ఏర్పాటు చేసిన బటన్‌ను నొక్కగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ అతడు నొక్కలేదు. ఇంకేముంది... కిటికీ పక్కన ఉండే రోగి డాక్టర్ అందుబాటులో లేనందుకు చనిపోయాడు.

ఇన్నాళ్లూ అసూయతో రగిలిపోయి, కిటికీకి దూరంగా ఉన్న రోగి హాస్పిటల్ సిబ్బందిని బ్రతిమలాడి తన మంచాన్ని కిటికీ పక్కకి మార్పించుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నేఅతను అతి కష్టం మీద లేచి కూర్చుని బైటకు చూస్తే... అక్కడ ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప అక్కడ ఇంకేమీ కనిపించలేదు.

దీంతో ఆలోచనలో పడ్డ ఆ రోగి... ఇన్ని రోజులూ తన తోటి రోగి, తనను సంతోషపెట్టేందుకే ఇన్ని దృశ్యాలూ కల్పించి చెప్పేవాడా? అతనే తన నిజమైన స్నేహితుడు. అలాంటివాడికి చివరి దశలో తాను సాయం చేయలేకపోయానే అంటూ ప్రశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కాబట్టి, పిల్లలూ...! దీని నుండి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే... పక్క వాళ్ళకు ఉంది, మనకు లేదు అంటూ ఎప్పుడూ అసూయపడకూడదు.

గొప్ప స్నేహితుడు

పిల్లలూ...! ఈరోజు మనం స్నేహితులలో రకాలు... వారిలో మంచి స్నేహితుడు ఎవరు అన్న విషయాన్ని ఓ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప తెలివితేటలు, మంచి వివేకం కలిగిన ఓ రాజు ఉండేవాడు. ఈ రాజు మంచితనం గురించి ఇతర రాజ్యాలకు కూడా ప్రాకడంతో అనేక కళలలో ఆరి తేరిన కళాకారులు రాజ్యానికి వచ్చేవారు. వారు రాజు మెప్పును పొందటమే గాకుండా, పారితోషికాన్ని కూడా పొందేవారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని కూడా పరీక్షించేవారు.

ఇలా ఉంటే... ఒక రోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. అతడు తాను తయారుచేసిన మూడుబొమ్మలను కూడా తనతోపాటు తీసుకొచ్చాడు. ఏ మాత్రం తేడా లేకుండా ఉన్న ఆ మూడు బొమ్మలను అతడు రాజు ముందు ఉంచుతూ... వీటిని పరిశీలించి వాటిలో తేడాలను చెప్పాల్సిందిగా కోరాడు.

కళాకారుడి మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని తదేకంగా పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకే ఎత్తు, బరువు ఉండటం, అన్నింటి పోలికలూ ఒకేలా ఉండటం లాంటి వాటిని రాజు గమనించాడు. అలా పరిశీలిస్తున్నపుడు ఒకబొమ్మ రెండు చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించగా, సూది మరో చెవి నుండి సునాయాసంగా బయటకు వచ్చింది.

అలాగే మరో బొమ్మ చెవిలో, నోట్లో రంధ్రాలుండటాన్ని గమనించిన రాజు, వెంటనే సూదిని చెవిలో దూర్చగా, సూది నోటిగుండా బయటకు వచ్చేసింది. ఇక, మూడవ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రం లేకపోవడాన్ని రాజు గమనించి సూదిని చెవిలో దూర్చగా అది బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది.



గంభీరంగా ఆలోచించిన రాజు, కాసేపటి తరువాత కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలా తెలివైనవారు" అంటూ మెచ్చుకున్నాడు. ఆ కళాకారుడు మూడు బొమ్మల ఉన్న తేడాలను గురించి మాట్లాడుతూ... అవి మూడు రకాలైన స్నేహితులకు పోలికలని వర్ణించటం మొదలెట్టాడు.

ఇందులో మొదటి బొమ్మ మన కున్న చెడ్డ స్నేహితుడి గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నట్టు నటించి ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు. ఇక రెండోవాడు మన రహస్యాలను చెప్పినప్పుడు సానుభూతిగా వింటాడే గానీ, ఇతరులకు వాటిని చేరవేస్తాడు కాబట్టి ఇతనో ప్రమాదకరమైనవాడు.

మూడో వాడి గురించి చెప్పుకుంటే... మనం చెప్పే మాటలను ఓపికగా వినటమేగాకుండా, రహస్యాలను కూడా తనలోనే భద్రంగా దాచుకుంటాడు. ఎంత కష్టమొచ్చినా సరే వాటిని బట్టబయలు చేయడు. కాబట్టి మూడో బొమ్మ ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం అంటూ కళాకారుడు ముగించాడు.

అంతా తదేకంగా విన్న రాజుగారు కళాకారుడి తెలివితేటలకు మెచ్చుకుని అభినందించడమేగాకుండా, కానుకలు సమర్పించాడు. కాబట్టి పిల్లలూ... మీరు కూడా పైన చెప్పిన మొదటి రెండు రకాల స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు కదూ...!

ఆవేశం అనర్థాలకు మూలం

ఒకానొక ఊర్లో శివాలయం ఒకటి ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో పెద్ద పాము పుట్ట, అందులో రెండు త్రాచుపాములు కూడా ఉండేవి. గుడికి వచ్చిన భక్తులు గుడ్లు, పాలు ఆ పుట్టలోకి జారవిడుస్తుండేవారు. వాటితో కడుపునింపుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పాములు రాత్రుళ్ళు మాత్రం బయట సంచరించేవి.

కాలం ఇలా నడుస్తుండగా ఓ రోజు పెద్ద గాలి, వాన రావడంతో ఆ పుట్టలోకి నీళ్ళు చేరాయి. దీంతో అందులో ఉండలేని ఆ పాములు బయటకు వచ్చి, శివుని గుడిలో ఆ రాత్రికి తలదాచుకున్నాయి. మర్నాడు ఉదయాన్నే పుట్టలోకి వెళదామంటే నీళ్ళు, ఊర్లోకి వెళ్తే జనాలు చంపేస్తారన్న భయంతో పాములు ఆలోచనలో పడ్డాయి. తరువాత అవి శివుడి విగ్రహం వెనకవైపు ఉండటమే క్షేమకరమని భావించి, కదలకుండా మెదలకుండా పడుకుండిపోయాయి.



ఎండ రావడంతో జనాలు నెమ్మదిగా గుడికి రావడం ప్రారంభించారు. ఎప్పటిలాగే శివుడిని దర్శించుకుని పాలు, పళ్ళు పుట్టలో వేసి వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయానికి పూజారి గుడి కట్టేసి వెళ్ళటంతో, అప్పటికే ఆకలితో దహించుకుపోతున్న ఆ పాములు రెండూ మెల్లగా పుట్టవైపు వెళ్లడానికి బయలుదేరాయి.

ఇదే సమయంలో ఓ కోతి పుట్ట దగ్గర కూర్చుని భక్తులు జారవిడిచిన గుడ్లు, పళ్ళను తీసుకుని తింటోంది. అసలే ఆకలితో ఉన్న పాములకు ఆ దృశ్యం కంటబడేసరికి ఎక్కడలేని కోపంతో కోతిపై దండెత్తేందుకు సిద్ధపడ్డాయి. అయితే, దీన్ని గమనించని కోతి తనపని తాను చేసుకుపోతోంది.

కోతిమీదకు విరుచుకుపడ్డ పాములు తమ విషపుకోరలతో బలంగా కాటువేశాయి. దీంతో ఆ కోతి విలవిలా తన్నుకుంటూ చనిపోయింది. అదే క్షణంలో ఆడుకునేందుకు వచ్చిన కొంతమంది పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి, కోతిని పాములు అన్యాయంగా చంపివేశాయని భావించి, వాటిని రాళ్ళతో కొట్టి చంపేశారు.

అనవసరమైన ఆవేశానికి పోయి కోతిని ఉత్తి పుణ్యానికి చంపివేసిన పాములు, చివరికి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాయి. కాబట్టి, పిల్లలూ... ఆవేశం అనర్థానికి మూలం కాబట్టి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నవాడే బలవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అవుతాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు కదూ...!

తేలుకు పెత్తనమిస్తే...

అనగా అనగా ఒక అడవి.. ఆ అడవిలో పాముల పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒక రోజు బాగా బలిసిన ముళ్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చిది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి. ముళ్ల పందిని చూసి ఏంటి కథ అని అడిగాయి.

"ఈ రోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో ఆబగా తినేశా. భుక్తాయాసం ఎక్కువై ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షికూతలు, ఇతర శబ్దాలతో గోల గోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాస్సేపు నిద్రపోయి తిరిగి వస్తాను: అని అడుక్కుంది ముళ్లపంది.

"అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే. ఫరవాలేదు మేం కాస్త ఒదిగి పడుకుంటాం. ఇదిగా ఈ మూల నువ్వు సర్దుకో" అంటూ కొద్దిగా చోటి్చ్చాయి. ముళ్లపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది.

పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీదగల ఒక్కొక్క ముల్లు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. పాములు దాని ముందుకెళ్లి అవతలకు పో అని ఒక్క అరుపు అరిచాయి.

ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది. పైగా బాగా నిద్రవస్తోంది కూడా. నా నిద్ర పాడు చేయకండి. అంతకూ మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్లను ఇంగా బాగా చాపింది. దీంతో ఆ ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి.

పాపం పాములు. ఇంకేం చేస్తాయి. దీన్ని బాగన్నా రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి.

కధలోని నీతి: దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం వస్తుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ కుట్టినట్లుగా అన్నమాట.

ఆకలి రుచెరుగదు...

అనగనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు.
అందరు రాజులకు మల్లే వేట అంటే అతడికి మహాపిచ్చి.
వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసమంటే పిచ్చి పిచ్చి ఆ రాజుకి.
ఒక రోజు కోట దాటి రాజ్యం పొలిమేరల్లో ఉండే మహారణ్యంలోకి వేటకు వెళ్లాడు
బంధుమిత్రులు, సైన్య సపరివార సమేతం రాజుకు తోడు ఉన్నారనుకోండి.
రాజు భయపడాల్సిన పనిలేదు మరి.
ఓపిక ఉన్నంత వరకూ వేటాడారు.
అదేం ఖర్మో గాని ఆరోజు రాజు వేట పారలేదు.
ఎంతదూరం పోయినా జంతువు అలికిడి లేదు. పక్షుల జాడలేదు.
తిరిగారు తిరిగారు తిరిగారు..
తిరిగి అలసిపోయారు.
ఉన్నట్లుండి సింహం అరుపు వినబడింది.
రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది.
కాని రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది.
అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమ్మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందేమో..
ఒక్కసారిగా లంఘించి ముందుకురికింది.
అందరూ చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగయిపోయింది.
రాజభటులు తెప్పరిల్లి వెతికితే..
గుర్రమూ లేదు... రాజూ లేడు...
వేటమాని అడివంతా రాజుకోసం గాలించడం వారి పనయింది.

ఈలోగా మన రాజుగారి కథా కమామిషూ చూద్దాం మరి..
తోవతప్పిన రాజు గుర్రమెటు తిరిగితే అటు పోతున్నాడు.
పాపం. రాజు కదా.. దారి తెలీదు.
దార్లూ గట్రా చూసిపెట్టేందుకు సేవకులూ లేరు కదా..
చేసేదేమీలేక గుర్రం మీద పోయాడు పోయాడు పోయాడు..
ఎలాగైతేనే అడివి మార్గంలో పూటకూళ్ల ఇంటికి చేరుకున్నాడు.
ఆరోజుల్లో అడవిలో కూడా బాటసారులకు తిండి గట్రా చూసేందుకు పూటకూళ్లమ్మలు ఉండేవాళ్లులే..
రాజ్యమంటే శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యం కాదు మరి..
కోట దాని చుట్టూ పది ఊర్లూ, వాటి చుట్టూ పెద్ద అడవి ఉంటే చాలు..
అదీ రాజ్యమే అయిపోయేది మరి.
ఈ గొడవ మనకెందుకు గాని...



రాజు పూటకూళ్లమ్మ ఇంటికి చేరుకున్నాడు.
గుర్రాన్ని దాణాకోసం విడిచి దాని దాణా కోసం కాసులిచ్చాడు.
తానూ కాళ్లూ చేతులూ కడుక్కుని పూటకూళ్ల ఇంట్లో చక్కాలు ముక్కాలు వేసుకుని కూచున్నాడు.
అకలితో కడుపు నకనకలాడిపోతోంది.
పూటకూళ్లమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారుల్లాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది.
వేటకోసం పోయి దారితప్పి డస్సిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.
ఆ పచ్చడిలో ఏం మహత్తు ఉందో..
ఏం వేసి పచ్చడి రుబ్బారో..
వేరు శనక్కాయల పచ్చడి... ఆపై ఆకలి. దహించుకుపోతున్న జిహ్వ..
రాజు ముందూ వెనుకా చూడలేదు.
ఆబగా తినేశాడు. విస్తరిలో ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగల్చలేదు...
మొత్తానికి రాజుకు ఆకలి తీరింది.
నాలుగు వరహాలు పూటకూళ్లమ్మకిచ్చి బయలుదేరాడు.
పోగా పోగా పోగా... ఎట్టకేలకు కోటదారి పట్టుకున్నాడు.
వేటకు వెళ్లి తప్పిపోయిన రాజసేవకులూ, సైన్యమూ, సవరివారసమేతమూ తిరిగి వచ్చేసింది.
2
పాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచి పోలేదు.
కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు.
ఒరేయ్ రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగగింజలతో ఊరుమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు.
తలా తోకా లేకుండా రాజు జారీజేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది.
పంచభక్ష్యపరమాన్నాలను ఆరగించే రాజు..
మాంసం ముక్క చప్పరించనిదే ముద్ద దిగని రాజు..
ఎక్కడెక్కడినుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్షసారా సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు...
ఊరుమిండి చేసి పెట్టమంటాడేమిటీ..
అయినా.. రాజంటే రాజే..
రాజు మాటంటే మాటే మరి..
రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా మరి..

వంటవాళ్లు రంగంలోకి దిగారు..
రాజ్యంలో పండగా రాజభటులు సేకరించిన మేలు రకం వేరుశనగ్గింజలను తెప్పించుకున్నారు.
ఊరుమిండికి కావలసిన పదార్ధాలకు అదనంగా మరికొన్నింటిని కలిపారు.
ఎంతైనా రాజు వంటవాళ్లు కదా..
ఊరుమిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు.
రాజు మెచ్చితే నాలుగు వరహాలు రాలకపోతాయా అనుకున్నారు.



ఆరోజు గడిచింది..
తెల్లవారింది..
రాజుకూ, వంటవాళ్లకు కూడా..
రాజు ఎప్పటిలాగే సభకు వెళ్లాడు.
వంటవాళ్లు తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఊరుమిండిని తయారు చేశారు.
దాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏ పోపులు పెట్టారో..
ఏ మసాలాలు దట్టింటారో..
వంటశాల అంతా ఊరుమిండి వాసనేస్తోంది.
వాళ్ల వంటను చూసి వంటవాళ్లు తమకు తామే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఆహా. ఓహో.. భలే కుదిరింది.. అంటూ లొట్టలేసుకుంటున్నారు.
3
మధ్యాహ్నం దాటింది.
సభ ముగిసినట్లుగా గంట మోగింది.
రాజు బయలుదేరాడు.
అంతఃపురం చేరుకుని శుచిగా తయారయ్యాడు.
భోజనశాలకు చేరుకున్నాడు..
వంటవాళ్లు సిద్ధంగా ఉన్నారు.
రాజు కూర్చున్నాడు.
వంటవాళ్లు ఒక్కటొక్కటిగా వడ్డిస్తున్నారు.
రాజుకోసం ప్రత్యేకంగా వండిన ఊరుమిండి గుండ తీసి రాజు పళ్లెంలో పెట్టారు.
రాజు దైవాంశ సంభూతుడే కావచ్చు.
కానీ భోంచెయ్యాలంటే చేతి వేళ్లు లోపలకు పోవలిసిందే గదా.

ఊరుమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.
కాసేపటి తర్వాత ఒక వంటశాలనుంచి ఒక ఉరుము ఉరిమింది.
ఎవరక్కడ?
ఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరుగెత్తుకొచ్చారు.
చిత్తం ప్రభూ..
ఈ వంటవాళ్లను తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి. ఆజ్ఞాపించాడు..
వంటవాళ్లు లబలబలాడారు. మొత్తుకున్నారు.
తామే పాపం చేయలేదని ప్రాధేయపడ్డారు.
కాని రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే మరి..

పిల్లలూ.. ఈ కథలో నీతి ఏమిటి మరి?
వంటవాళ్లది ఇందులో ఏ తప్పూలేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే.
ఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకూళ్లమ్మ ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు జోడించి చేసిన ఊరుమిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకు లేకుండా ఆబగా తినడానికి....
పంచభక్ష్యపరమాన్నాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి.

అందుకే ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు....

దురాశకు పోతే దుఖ:మే

ఒక ఊరిలో రంగడు, సింగడు అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతి రోజూ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాడు. సింగడు మాత్రం పేదవారికి సాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. కష్టపడకుండా పైకి రావాలని ఆశించే వాడు ఎప్పుడూ.

రోజూ లాగానే ఆ రోజు కూడా రంగడు, సింగడు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసి పోయి చెట్టు క్రింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దెయ్యం అతన్ని చూసింది. రోజూ అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే.

అతని గురించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గిర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణేలు ఉన్న మూటను అతని ప్రక్కనే పెట్టి వెళ్లిపోయింది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. అయినప్పటికీ, తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని దాన్ని ఇంటికి తీసుకెళ్లి తనలాగే కష్టపడే వాళ్లకి పంచిపెట్టాడు.



రంగడు పడుకున్న ఆ మహిమ కలిగిన చెట్టు కింద తను కూడా పడుకుని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. మర్నాడు యథాలాపంగా ఇద్దరూ అడవికి వెళ్లారు. ఆ సమయంలో రంగడిని వేరే మార్గంలో పంపి, ముందు రోజు రంగడు వెళ్లిన వైపే సింగడు వెళ్లి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దాం అనుకుని ఓ చెట్టు కింద పడుకుని నిద్ర నటించసాగాడు.

రంగడు తెచ్చుకున్న సద్దన్నం మూటను బంగారు నాణేలుగా మార్చిందంటే ఆ మహిమ కలిగిన చెట్టు వెండి నాణేలను వజ్ర, వైఢూర్యాలుగా మార్చే అవకాశం ఉందని భావించి మూట నిండా వెండి నాణేలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. వీటిని చూసిన భూతం అతని దురాశను పసిగట్టి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది.

అతని వద్ద ఉన్న అన్నిటినీ తీసుకుని అడవి మధ్యలో దారితెలియని చోటులో వదిలేసి వచ్చింది. కళ్లు తెరచి చూసిన సింగడికి పరిస్థితి అర్థమయ్యి దు:ఖించసాగాడు. దురాశకు లోనై వెండి నాణేల్ని పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డానని పశ్చాత్తాపపడ సాగాడు. అతనిలో పశ్చాత్తాప భావనను చూసిన భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని ఇలా చేశానంది.

తన తప్పు తెలుసుకున్న సింగడు ఊరికి చేర్చమని భూతాన్ని ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచీ కష్టపడి పనిచేస్తూ పేదవారికి దానాలు చేస్తూ సంతోషంగా జీవించాడు. కాబట్టి పిల్లలూ మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దాని కోసం ప్రయత్నించండి విజయం మీదే అవుతుంది.

అందరిలోనూ దేవుడున్నాడు

అనగనగా ఓ పాఠశాలలో రామానంద గురువుగారు పాఠాలకు, నీతి కథలను జోడించి విద్యార్థులకు చదువు చెప్తుండేవారు. విద్యార్థుల్లో ఒకడైన గోపీ గురువుగారు చెప్పే విషయాలను శ్రద్దగా ఆచరిస్తూ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.

ఎప్పటిలాగానే ఓ రోజు పాఠం చెబుతూ దేవుని ఉనికిని చెప్పడం ప్రారంభించారు. ఈ సకలచరాచర సృష్టిలోని జీవులందరిలోనూ దేవుడు ఉంటాడు. తోటి మనిషిలో భగవంతుని చూడాలని రామానంద పిల్లలకు బోధించారు. న్యాయ మార్గాన నడిచే వారిని దేవుడు ఎల్లప్పుడూ కాపాడతాడని తెలిపారు.

గురువు మాటను శిరస్సున దాల్చే మన గోపీ ఒక రోజు పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా అదుపు తప్పిన గుర్రం అతనికి ఎదురుగా వస్తూ కనిపించింది. గుర్రం వస్తున్న తీరు గోపీలో ఎక్కడ లేని భయాన్ని కలిగించింది. గురువు గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి... గుర్రంలో కూడా దేవుడుంటాడు తనను కాపాడతాడని గుర్రం వస్తున్న మార్గంలో అలాగే నిల్చున్నాడు.

దానిపైన స్వారీ చేస్తున్న వాడు పక్కకు తప్పుకోమని అరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ, గోపీ తప్పుకోలేదు. వేగంగా వచ్చి గుర్రం అతనిని ఓ పక్కకు తోసేసి వెళ్లిపోయింది. చేతులు, కాళ్లు కొట్టుకుపోవడంతో ఏడుస్తూ కూర్చున్న గోపీకి తన మాస్టారు వస్తూ కనిపించారు. ఏడుస్తున్న గోపీని చూసి ఆయన పలకరించాడు. జరిగింది తెలుసుకున్న మాస్టారు బాధపడ్డారు.

గోపీ అన్ని ప్రాణులలో దేవుడు ఉన్నాడని చెప్పాను కదా అలాగే ఆ స్వారి చేసే వాడిలో కూడా ఉన్నాడు కనుకనే నిన్ను తప్పుకోమని హెచ్చరించాడు. అందరిలో దేవుడు ఉన్నాడని మనం మన ప్రయత్నం చేయకుండా మానకూడదు. అలాగే దేవుడు కాపాడతాడని ఏమి చేయకుండా కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలని చెప్పాడు. దాంట్లోని విషయాన్ని అర్థం చేసుకున్న గోపీ కళ్లు తుడుచుకుని ఇంటికి బయల్దేరాడు.

జార్జ్ వాషింగ్టన్ నిజాయితీ

ఇది చాల సంవత్సరాల నాటి సంగతి. అప్పుడు జార్జ్ వాషింగ్టన్‌కు ఆరు సంవత్సరాల వయస్సుంటుంది. జార్జ్‌కు తోటల్లో పని చేయడమంటే చెప్పలేనంత ఇష్టం. తోటల్లో తిరిగే సమయంలో తానే స్వయంగా ఒక గొడ్డలిని తయారు చేసుకునేవాడు. ఇంకేముంది పదును తేలిన గొడ్డలితో కలుపు మొక్కలను ఏరి పారేస్తూ ఏపుగా ఎదుగుతున్న మొక్కల ఆలనాపాలనా చూసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తుండేవాడు. ఒకసారి తమ ఇంటి ఆవరణలో గల చెట్ల మధ్య తిరుగుతుండగా జార్జ్‌కి ఒక ఆలోచన వచ్చింది, "నా దగ్గర ఉన్న గొడ్డలితో అమ్మకు ఒక ఊతం కర్ర తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుంది...." సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న చిన్నపాటి చెర్రి చెట్టు మీద అతని దృష్టి పడింది.

ఇంకేముంది ముందూ వెనకా ఆలోచించకుండా గొడ్డలితో చెర్రి చెట్టు మీద ఒక దెబ్బ వేశాడు జార్జ్. అసలే బలహీనంగా ఉందేమో... ఒక్క గొడ్డలి వేటుకే చెట్టు కుప్పకూలిపోయింది. ఆ చెట్టంటే జార్జ్ వాళ్ల నాన్నగారికి ఎంతో ప్రేమ. దానిని ఆయన కంటికి రెప్పలా చూసుకుంటారు. బజారు నుంచి ఇంటికి వచ్చిన జార్జ్ తండ్రికి, తాను ఎంతగానో ప్రేమగా చూసుకునే చెర్రి చెట్టు నేలకూలిపోయి కనిపించింది. దానిని నిలబెడదామని ఆయన చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమైపోయాయి. దాంతో చెట్టును నరికిన వాళ్ల మీద ఆయనకు ఎక్కడ లేని కోపం ముంచుకు వచ్చింది. "చెర్రి చెట్టును నరికెందెవరు?" అంటూ కనపడిన వారందర్నీ అడిగారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.

కొంత సేపయ్యాక తండ్రి గదిలోకి వెళ్లాడు జార్జ్. లోపలికి వచ్చిన జార్జ్‌ను చూసి ఏమిటన్నట్లుగా అడిగాడు తండ్రి. "నాన్నగారు మీరు ప్రేమగా చూసుకుంటున్న చెట్టును నరికిందెవరో నాకు తెలుసు" అన్నాడు జార్జ్. "మీరు అందరితో అన్నట్లుగా విషయం చెప్పినందుకు బహుమతిలేమీ నేను కోరుకోవడంలేదు", చెప్పడం ఆపాడు. అతనికి ముఖంలోకి తండ్రి ఉత్కంఠభరితంగా చూస్తున్నాడు. అతి కష్టం మీద ధైర్యం కూడగట్టుకున్నాడు జార్జ్. పెద్దగా ఏడుస్తూ తండ్రి పాదాల మీద వాలిపోయాడు జార్జ్. "నాన్నగారు ఒక్కనాటికీ మీ ఎదుట అసత్యమాడను... ఎట్టి పరిస్థితుల్లో మీకు అసత్యం చెప్పను... చెర్రి చెట్టును నరికింది నేనే నాన్నగారు...", అలా ఏడుస్తూనే సంగతంతా తండ్రికి వివరించాడు. తండ్రిలోని ఆగ్రహం మంచులా కరిగిపోయింది. జార్జిని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. "చూడు జార్జ్ నిజం చెప్పడానికి నువ్వు భయపడవలసిన పనిలేదు, ఎందుకంటే నీ నిజాయితీ వెయ్యి చెట్ల కన్నా విలువైనది".

ఆలీబాబా నలభై దొంగలు

ఒకానొకప్పుడు పర్షియా పట్టణంలో ఖాసీమ్, ఆలీబాబా అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. ఖాసీమ్ ధనవంతురాలిని వివాహం చేసుకోగా, పాపం పేదవాడైన ఆలీబాబా అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని మూడు గాడిదలపై వేసుకుని వచ్చి పట్టణంలో ప్రజలకు అమ్ముకుని బతుకుతుండేవాడు. ఒకసారి అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన ఆలీబాబాకు గుర్రాలపై వెళుతున్న నలభై మంది దొంగలు తారసపడతారు. వారి కంటపడకుండా ఒక చెట్టు పైన ఎక్కి దాక్కుంటాడు మన ఆలీబాబా. అలా ముందుకు వెళ్లిన దొంగలు ఒక గుహ ముందు నిలబడి 'తెరుచుకో సెసెమ్' అన్నారో లేదో గుహ ద్వారం తెరుచుకుంటుంది. తమతో పాటు తెచ్చిన మూటలను తీసుకుని గుహలో పడేసి వెలుపలకు వస్తారు దొంగలు. ఈ సారి దొంగలనాయకుడు 'మూసుకో సెసెమ్' అనగానే గుహ ద్వారం మూసుకుపోతుంది. వాళ్లు వెళ్లిపోగానే ఆలీబాబా గుహ ముందు నిలిచి తెరుచుకో సెసెమ్ అనగానే ద్వారం తెరుచుకుంటుంది. గుహ లోపల ఉన్న ధనరాశులను చూసిన ఆలీబాబాకు కళ్లు తిరుగుతాయి. అందినంత బంగారు నాణేలను సంచుల్లో నింపుకుని గాడిదలపై వేసుకుని ఇంటికి వెళతాడు.

బంగారు నాణెలను కొలుద్దామని ఖాసీమ్ భార్యను కొలత పాత్రను ఇమ్మని అడిగుతుంది ఆలీబాబా భార్య. సందేహించిన ఖాసీమ్ భార్య కొలపాత్ర లోపలి వైపు అడుగున చింతపండును అతికించి ఇస్తుంది. నాణేలను కొలిచిన తర్వాత పాత్రను తీసుకున్న ఖాసీమ్ భార్య, పాత్ర అడుగున అంటుకొని ఉన్న బంగారు నాణేన్ని చూసి భర్తకు చెప్తుంది. అన్న పోరు భరించలేక అసలు విషయం బయటపెడతాడు ఆలీబాబా. తమ్ముడు చెప్పిన మార్గంలో గుహ లోపలకి వెళ్లిన ఖాసీమ్ తరువాత వచ్చిన దొంగల చేతిలో మరణిస్తాడు. గుహలోని అన్న శవాన్ని తీసుకువెళతాడు ఆలీబాబా. శవం మాయమైపోవడంతో తమ గుట్టు బయటపడిన వైనాన్ని దొంగల నాయకుడు గుర్తిస్తాడు. గుట్టు రట్టుకావడంలో సూత్రధారి ఆలీబాబా నివాసాన్ని కనుగొన్న దొంగల నాయకుడు నలభై చమురు పీపాలను కొనుగోలు చేసి అందులో 39 పీపాలలో తన అనుచరులను ఉంచి, ఒక పీపాను చమురుతో నింపి, బహు దూరం నుంచి వచ్చిన చమురు వ్యాపారి వలె ఆలీబాబా ఇంటికి వెళతాడు. దొంగల నాయకుని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిస్తాడు ఆలీబాబా.



అర్థరాత్రి వేళ ఇంటిలో చమురు లేకపోవడంతో పీపాల దగ్గరకు వెళ్లిన ఆలీబాబా సేవకురాలు మోర్జియానా పీపాలలోని దొంగలను గమనించి, పీపాలపై నూనెను పోసి నిప్పు అంటిస్తుంది. దాంతో 39 మంది దొంగలు మరణిస్తారు. మిగిలిన దొంగల నాయకుడు పారిపోతాడు. సంగతి తెలుసుకున్న ఆలీబాబా మోర్జియానాను మెచ్చుకుంటాడు. అనుచరులను కోల్పోయిన దొంగల నాయకుడు ఆలీబాబాపై ఆగ్రహంతో రగిలిపోతాడు. ఆలీబాబాను మట్టుపెట్టాలని ప్రతిన బూనుతాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు వస్త్ర వ్యాపారి అవతారంలో మారు వేషంలో వచ్చి ఆలీబాబా కుమారుని అభిమానాన్ని పొందుతాడు. కుమారుని స్నేహితుడైన దొంగల నాయకుని విందుకు ఆహ్వానిస్తాడు. విందు సమయంలో వస్త్ర వ్యాపారి ఉప్పును తీసుకోకపోవడాన్ని మోర్జియానా గమనిస్తుంది. పర్షియా ప్రజల సంప్రదాయాన్ని అనుసరించి ఎవరి ఉప్పును అయితే తిన్నారో, తిన్నవారు వారికి హాని తలపెట్టరు. తేరిపారి చూడగా అతడే దొంగలనాయకుడని గుర్తిస్తుంది మోర్జియానా.

విందు అనంతరం ఏర్పాటైన నృత్య కార్యక్రమంలో స్వతహాగా నృత్యకారిణి అయిన మోర్జియానా చురకత్తిని చేబూని ఆలీబాబా, ఆలీబాబా కుమారుడు మరియు మారువేషంలోని దొంగలనాయకుని ఛాతీపై చురకత్తిని తాకిస్తూ నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. కత్తిని అలా తాకించడం నృత్యంలో ఒక భాగమని భావించిన వీక్షకులు ఆటపాటల్లో మునిగి తేలుతుండగా దొంగల నాయకుని గుండెలో చురకత్తిని దించుతుంది మోర్జియానా. దాంతో దొంగల నాయకుడు కిందపడి చస్తాడు. "అయ్యో అతిథి మరణించాడే" అని విలపిస్తున్న ఆలీబాబాకు అతిథి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది మోర్జియానా. తన సేవకురాలి సాహసానికి, స్వామి భక్తికి సంతసించిన ఆలీబాబా, మోర్జియానాను తన కుమారునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపేస్తారు. 

చిన్నారి చేపల వేటగాడు

రాముకు చేపలను వేటాడటమంటే చెప్పలేనంత ఇష్టం. ముఖ్యంగా ఊరి మధ్యలో అమ్మవారి గుడి పక్కన ఉండే దొర గారి చెరువులో చేపలు పట్టడమంటే మన రాముకు మరీ ఇష్టం. చెరువు అంటే మరీ అంత పెద్దదేమీ కాదు. తన కొడుకు మీద ప్రేమతో మూడెకరాల భూమిలో చెరువు తవ్వించాడు కిష్టయ్య దొర. ఆ చెరువులో రంగు రంగుల చేపలు మొప్పలను అల్లర్చుతూ తిరుగుతుంటాయి. అంతేనా... బాతులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే కొంగలు, పెద్ద పెద్ద రెక్కలున్న పక్షులు దొరగారి చెరువు గట్టు మీది చెట్లపై గూళ్ళు కట్టుకుంటాయి.

గూళ్ళలో పొదిగిన గుడ్లు పిల్లలు కాగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అయితే పిల్లలను చేపలు పట్టడానికి దొరగారు ససేమిరా అంగీకరించరు. ఎందుకంటే చెరువు దగ్గరకు వచ్చే పిల్లలు ఒకటే అల్లరి చేస్తారు. చేపలను బెదరగొడతారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలను నీళ్ళలో పడేసి, వాటి కాగితాలను చెరువు గట్టు పారేస్తారు. దీంతో దొరగారు పిల్లలను చెరువు దాపులకు రానివ్వరు. అంతేకాదు... ఆ చెరువును గురించి ఆ వూరి పిల్లలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. చెరువులో పిల్లలను ఎత్తుకుపోయి తినేసే పెద్ద పెద్ద సొర చేపలు, తిమింగలాలు చెరువులో ఉంటాయట. పిల్లలు కనిపిస్తే చాలు... అమాంతం బయటకు వచ్చి గుటుక్కుమనిపిస్తాయట...

ఇదిలా ఉండగా ఒక రోజు దొరగారు పనిమీద పట్నానికి వెళ్ళారు. ఇంకేముంది. రాముకు చెప్పలేని హుషారు వచ్చేసింది. తన దగ్గరున్న గాలం తీసుకుని దొరగారి చెరువులో చేపలు పట్టడానికి బయలుదేరాడు. చెరువు దగ్గరకు వెళ్ళొద్దంటూ రాము స్నేహితులు అతనికి చెప్పి చూశారు. మన రాము వింటే కదా... ఒక్కటే చెరువు గట్టు మీదకు వెళ్ళాడు గాలం పట్టుకుని. గట్టు మీద కూర్చుని గాలాన్ని చెరువులోకి వదిలాడు రాము. చెరువుపై నుంచి వచ్చే చల్లని గాలులకు రాముకు నిద్ర ముంచుకొచ్చింది. హఠాత్తుగా రాముకు మెళకువ వచ్చింది. గాలం తనను లాగుతోంది.



ఏదో బరువైనది గాలానికి చిక్కుంది. బలమంతా ఉపయోగించి గాలాన్ని లాగాడు. తాటి చెట్టంత ఎత్తున్న సొర చేప గాలంతో పాటు పైకి లేచింది. రాము కాళ్ళు చల్లబడ్డాయి. ఎక్కడ లేని భయం ముంచుకొచ్చింది. అయినా ధైర్యం చేసి మరింత గట్టిగా లాగాడు. సొర చేప కాస్త తిమింగలంగా మారి రామును మింగేయ్యడానికి ముందుకు రాసాగింది. వచ్చేసింది... దగ్గరకు వచ్చేసింది. ఇల్లంత పెద్దది చేసి తన నోరును తిమింగలం తెరిచింది... ఇక రామును స్వాహా చేయడమే ఆలస్యం...
పెద్దగా కేక పెట్టి నిద్ర లేచాడు రాము. అంతా కల... గాలానికి చిన్న చేప ఒకటి చిక్కుకుని ఉంది. ఆ పళంగా ఊర్లోకి తారాజువ్వలా పరుగుతీసాడు రాము. తనకు వచ్చిన కలను స్నేహితులకు చెప్పలేదు. చెపితే పిరికివాడనుకుంటారని భయం. అంతటితో చేపలను వేటాడే ఇష్టానికి స్వస్తి చెప్పాడు రాము. చదువు మీద శ్రద్ధ పెట్టి క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించి, అందరితో శభాష్ అనిపించుకున్నాడు. 

తెలివైన వాడికే రాజ్యం

రాజుగారికి మరణం సమీపించింది. తనకు గల ముగ్గురు కుమారుల్లో ఎవరికి రాజ్యాన్ని అప్పగించాలనే ఉద్దేశంతో తెలివైన కుమారుడు ఎవరని తెలుసుకోవాలని రాజుగారు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు ముగ్గురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నాడు. ఒకరోజు వాళ్ల ముగ్గురిని పిలిచి నాయనలారా! నేను మీకో పరీక్ష పెడతున్నాను. నెగ్గిన వారికే రాజ్యాధికారం అన్నాడు. అలాగే నాన్నగారూ అన్నారు. ముగ్గురు.

మరైతే ఈ గదిని ఏ వస్తువుతోనైనా పూర్తిగా నింపితే వారే గెలిచినట్టు అన్నాడు రాజు. మరైతే ఈ గదిని ఏ వస్తువుతోనైనా నింపితే సరి అన్నాడు రాజు. వీరి ముగ్గురిలో పెద్ద కొడుకు గబగబా బయటికెళ్లి వజ్రాలతో గదిని నింపడానికి యత్నిస్తాడు. అయితే వజ్రాలతో గది నిండలేదు. దీనిని గమనించిన రెండవ కుమారుడు దూదితో గదిని నింపేందుకు ప్రయత్నించి గదిని దూదితో నింపుతాడు.

అయితే గదిలో ఎక్కడైనా ఓ చోట ఖాళీ కనిపిస్తుండటంతో విఫలమయ్యాడు. ఇద్దరి చర్యలను గమనించిన మూడో వాడు ఆ గదిలో ఒక దీపం ముట్టించాడు. దీనితో ఆ గది నిండా వెలుతురు వ్యాపించింది. ఏ మూలలో చూసినా వెలుతురే. వెలుతురుతో గదంతా నిండిపోయింది. మూడో వాడి తెలివిని రాజుగారు మెచ్చుకుని రాజ్యాధికారాన్ని అతడికి అప్పగిస్తాడు.

నీతి: అన్నీ సమస్యలను తెలివితో చాకచక్యంగా సాధించాలి. 

తుంటరి తోడేలు-అమాయకపు నత్త

హాయ్ బాలలూ.... జరిగిన సంఘటనలను కథలుగా చెప్పుకుంటుంటాం కదా. అయితే ఈ కథను మాత్రం గజరాజు కోతిబావతో చెపుతున్నాడు. చదువుదామా మరి....
అనగనగా దట్టమైన ఒక అడవిలో తోడేలు ఒకటి ఉండేది. వయస్సు మీద పడటంతో ముసలిదై పోయిన తోడేలు తనకు రక్షణ ఇచ్చే చోటు కోసం వెదకడం మొదలు పెట్టింది. అలా కొండలు, కోనలు దాటుకుంటూ ఒక అందమైన లోయలోకి మన తోడేలు అడుగు పెట్టింది. అక్కడ దానికి అతిపెద్దదైన చెట్టు ఒకటి కనిపించింది. చాలా సేపటి నుంచి తిరుగుతుండటంతో తోడేలు బాగా అలసిపోయింది. ఇప్పుడు దానికి రక్షణను ఇచ్చే విశ్రాంతి మందిరం కావాలి. చెట్టు ఎదురుగా నిలిచిన తోడేలు ఇలా పలికింది, "చెట్టు మహాశయా! దయచేసి నేను సురక్షితంగా తలదాచుకునే స్థలాన్ని ప్రసాదించవూ".

ఆశ్చర్యంగా తోడెలు లోపలికి వెళ్ళేందుకు వీలుగా చెట్టు తెరుచుకుంది. తోడెలు లోపలికి వెళ్ళగానే దానికి రక్షణ ఇచ్చేందుకు చెట్టు మూసుకుపోయి ఎప్పటిలాగానే ఉండిపోయింది. చెట్టు లోపల తోడేలు వెచ్చగా గుర్రు పెట్టి నిద్రపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో చెప్పడం కష్టమే!

అలసట తీర్చుకున్న తోడేలు ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచింది. చెట్టు తెరుచుకోవడానికి అడిగే పద్దతిని తోడేలు మర్చిపోయింది. "ఏయ్ చెట్టు నన్ను బయటకు పంపించు" కేక పెట్టింది తోడేలు. ఏం జరగలేదు. "చెట్టు మహాశయా! దయచేసి నన్ను బయటకు పంపించు" బ్రతిమాలుకుంది తోడేలు. చెట్టు కొంచం కూడా కదలలేదు. తోడేలు చెట్టును తట్టింది. పిసరంత కూడా తెరుచుకోలేదు. ఉన్న విషయం చెప్పాలంటే... తోడేలుపై చెట్టు అలగింది. ఎందుకంటే మొదటిసారి బయటకు పంపమని అడిగినపుడు తోడేలు మరి మర్యాద మరిచిపోయింది కదా! అలా ఏమీ చేయలేని పరిస్థితిలో తోడేలు చాలా సేపు చెట్టు లోపలే ఉండిపోయింది.

తోడేలు కేకలు విని దానికి సహాయం చేద్దామని చెట్టు పైన ఉంటున్న కొన్ని పక్షులు కిందకు వచ్చాయి. కానీ అంత పెద్ద చెట్టును చిట్టి చిట్టి పక్షులు ఏం చేయగలవు! చివరగా ఇదిగో నేనున్నాను అంటూ పొడుగు ముక్కు వడ్రంగి పిట్ట ముందుకు వచ్చింది. తన పదునైన ముక్కుతో చెట్టుకు పెద్ద రంధ్రం చేసి తోడేలును బయటకు తెద్దామని ప్రయత్నించింది. కానీ పని మొదలు పెట్టిన కాసేపటికే దాని ముక్కు విరిగిపోయింది. అయితేనేం... వడ్రంగి పిట్ట శ్రమ వృధా పోలేదు. చెట్టుకు చిన్న రంధ్రం ఏర్పడింది. ఇక చెట్లకు రంధ్రాలు చేసేందుకు వడ్రంగి పిట్ట ముక్కు పనికి రాకుండా పోయింది. 



రంధ్రంలోకి ఒక చెయ్యి పెట్టి బయట పడదామనుకుంది మన తోడేలు. కానీ కుదరలేదు. కాలు పెట్టి చూసింది... ఊహూ... ఏం లాభం లేదు. వడ్రంగిపిట్ట పని మొదలు పెట్టగానే ఇంక హాయిగా బయటకు వెళ్ళవచ్చునని తోడేలు ఆశపడింది. కానీ మధ్యలోనే పిట్ట పొడువాటి ముక్కు కాస్త విరిగిపోయిందే! తోడేలుకు తిక్క రేగింది. ఏం చేయాలి?1 "అయ్యో, నన్ను బయటకు పంపు ముసలి చెట్టూ" వలవలా ఏడ్చింది తోడేలు. "నన్ను వదిలిపెట్టరాదా!" ఏం జరగలేదు, తోడేలుకు తోడుగా అంతులేని నిశ్శబ్ధం మాత్రమే మిగిలింది.

చిన్నరంధ్రం ద్వారా ఏకకాలంలో భుజాలను తీసి బయటకు పడేసింది. అనంతరం తన కాళ్ళను బయట పడేసింది. తన దేహాన్ని బయట పడేసింది. "ఇదేదో బాగుందే. హలో చెట్టూ చూస్తున్నావా! నన్నెంతో సేపు నీ అదుపులో ఉంచుకోలేవు సమా! " ఆనందంతో మురిసిపోతూ మనసులో అనుకుంది తోడేలు.

ఇక మిగిలిన తలను బయటకు చేరిస్తే సరి.... కానీ తోడేలు తల చాలా పెద్దది. చిన్న రంధ్రం దానికి సరిపోదు. పైగా చేటంత చెవులు కూడా ఉన్నాయి కదా! అందుకే ముందు చెవులు తీసి రంధ్రంలో నుంచి బయట పడేసింది. మరో సారి ప్రయత్నించింది. కానీ దాని కళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి మరి. ఇంకేముంది తన కళ్ళను తీసి రంధ్రం ద్వారా బయట పడేసింది.

అదేసమయంలో ఆకాశంలో ఎగురుతున్న నల్లపక్షి ఒకదానికి చెట్టు దాపున పడి ఉన్న తోడేలు కళ్ళు కనిపించాయి. ఇంకేముంది... రివ్వున కిందకు దూసుకుంటూ వచ్చి తన కాళ్ళతో ఒక్కసారిగా తోడేలు కళ్ళను ఎత్తుకుని ఆకాశం వైపు ఎగిరిపోయింది. ఆకాశపు నీలి రంగుతో అందంగా కనిపిస్తున్న తోడేలు కళ్ళు... నల్లపక్షిని అంతలా ఆకట్టుకున్నాయన్నమాట...అలా అందంగా కనిపించే వాటిని అన్నింటిని ఎత్తుకెళ్ళే నల్లపక్షి ఎవ్వరికి తెలియని చోట దాచి పెడుతుంది.



ఏమైతేనేం... చివరకు తన తలను కూడా రంధ్రంలో నుంచి బయటకు తీసుకు వచ్చింది. చెట్టు దాపున విడి విడిగా పడి ఉన్న శరీర భాగాలన్నింటిని మరలా అమర్చుకుంది. పూర్తి తోడేలు సిద్దమైంది. కానీ తలను అమర్చుకోగానే కళ్ళు ఎక్కడ ఉన్నదీ కనుక్కోలేక పోయింది. మిగతా శరీరం అంతా బాగానే ఉంది. చెవులు చక్కగా వినపడుతున్నాయి, కానీ చేతులతో తడుముకుంటే కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు లేవు.

తనకు కళ్ళు లేవని తెలిస్తే మిగిలిన జంతువులు చులకనగా చూస్తాయి... ఏం చేయాలి? ఆలోచించసాగింది తోడేలు. అలా తడుముకుంటూ వెళ్తుండగా తోడేలుకు రోజా పుష్పాల పొద తగిలింది. పొదలో నుంచి గులాబీ రేకులను తీసుకుని కళ్ళు ఉండాల్సిన స్థానంలో అమర్చుకుంది. దీంతో తనకు కళ్ళు లేవని ఎవరూ అనుకోరు. కానీ కళ్ళు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాయి... ఆశగా అనుకుంది తోడేలు.

తోడేలు ఇలా అనుకుంటుండగా అటుగా వచ్చిన నత్త తోడేలుకు కళ్ళ స్థానంలో గులాబీ రేకులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. "నీ కళ్ళలో గులాబీ పువ్వు రేకులు ఎందుకు పెట్టుకున్నావ్?" తోడేలు దగ్గరకు వెళ్ళిన నత్త ఆసక్తిగా అడిగింది. "ఎందుకంటే అవి రంగురంగులుగా అందంగా కనిపిస్తాయి కాబట్టి. కావాలంటే నువ్వు కూడా పెట్టుకో. నీ కళ్ళను నేను పట్టుకుంటానులే" నత్తను ఉత్సాహపరిచింది తోడేలు.

తోడేలు మాటలను నమ్మిన నత్త తన కళ్ళను తీసి తోడేలు చేతులలో పెట్టి గులాబీ రేకులను కళ్ళ స్థానంలో అమర్చుకోవడానికి ప్రయత్నించింది. అదే అదనుగా నత్త కళ్ళను తన తలకు అమర్చుకున్న తోడేలు పొడవాటి తన తోకను ఊపుకుంటూ కనపడనంత దూరం పరుగు తీసింది.

ఆ రోజు మొదలు తన కళ్ళు దొరుకుతాయేమోనన్న ఆశతో తన తలను నేలకు రాపాడిస్తూ వెదుకుతున్నట్లుగా నత్త నడవడం ప్రారంభించింది. అంతే కాక అది మొదలు తోడేళ్ళన్నీ కూడా నీలి రంగు కళ్ళ స్థానంలో గోధుమ రంగు కళ్ళతో కనపడసాగాయి. తోడేలు, నత్త కళ్ళను పెట్టుకోవడంతో తోడేళ్ళనింటికి అవే కళ్ళు స్థిరపడిపోయాయన్నమాట.

తెనాలి రామలింగడి తెలివి అలాంటిది

తెనాలి రామలింగుని కథలు.. ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా! వీటిలో ఓ చిట్టికథ మీ కోసం... ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.

పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది.

అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు.

మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు. కదా...

నీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేథాశక్తితో జయించాలి. 

మేలుచేసిన గోపాలం పొదుపు

గోపాలం మాట కూడా పొదుపే. తాను పొదుపరినని కూడా అతను ఎవరితోనూ చెప్పుకోడు. అయితే ఆ పల్లెలో చాలామంది మాత్రం అతణ్ని పిసినారి అంటుంటారు. గోపాలానిది మాత్రం వారి మాటల్ని పట్టించుకునే రకం కూడా కాదు. తప్పో ఒప్పో తన దారి తనది అనుకునే రకం. అలాగని మొండి మనిషి కూడా కాదు. అతని వ్యవహారం ఎలా ఉంటుందంటే ఏటా జరిగే గ్రామదేవత వేడుకలు ఘనంగా నిర్వహించడానికి విరాళాలు ఇవ్వమంటే ఎన్నడూ పది రూపాయల కంటె ఎక్కువ ఇవ్వడు. విరాళాల కోసం వచ్చిన వారు దేవత ఉత్సవాలకు ఇంత తక్కువ ఇస్తున్నావేమిటీ? అంటే- ఉత్సవాలు నిరాడంబరంగా చేసినా దేవత కోప్పడదు లేవోయ్‌.. ఎందుకు ఆర్భాటాలు అనేవాడు. అలాంటి గోపాలం, ఆ గ్రామదేవత గుడిలోనే ఓసారి నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు మాత్రం గ్రామంలోనే అందరికంటె ఎక్కువగా పదివేల రూపాయలు ఇచ్చాడు. అలాగని అతనిది ధనవంతుల కుటుంబం కూడా కాదు. గ్రామమంతా ముక్కున వేలేసుకుంది. అయినా అతనికున్న పిసినారి అన్న పేరు మాత్రం పోలేదు.

గోపాలం కొడుకు వినోద్‌. ఆరోతరగతి చదివేవాడు. అతను చదువులో చురుకు. డబ్బు ఖర్చు చేసే విషయంలో తండ్రి మొండిగా వ్యవహరించడం వినోద్‌కు నచ్చేది కాదు. స్కూలు ఫీజు కట్టాలన్నా, పుస్తకాలు కొనుక్కోవాలన్నా ఎప్పుడు అడిగినా సరే.. కచ్చితంగా అందుకు సరిపోయేంత డబ్బు ఇచ్చేవాడు. సాయంత్రం మళ్లీ రసీదులు తెచ్చి చూపమనేవాడు. ఏ రోజైనా తోటి పిల్లల మాదిరిగా సరదాగా గడపాలంటే చేతిలో డబ్బు వెసులుబాటు ఉండేది కాదు. తన చేతిమీదుగా ఏం ఖర్చు చేయాల్సి వచ్చినా చిల్లర మిగిలేలా ఇచ్చేవాడూ కాదు. తినడానికి ఏమైనా కొనుక్కుందామని తండ్రిని డబ్బు అడిగితే ఇచ్చేవాడు కాదు గానీ, ఇంట్లో బోల్డన్ని తినుబండారాలు తెచ్చిపెట్టేవాడు. వారానికోసారి సినిమాకు వెళ్లడానికి ఒప్పుకునే వాడు కాదు గానీ, మంచి సినిమా ఏదైనా వస్తే తండ్రి తనే వెంటబెట్టుకుని తీసుకెళ్లేవాడు. రోజులిలా గడుస్తుండగా వినోద్‌లో తండ్రి పట్ల ఒక వ్యతిరేక భావం ఏర్పడిపోయింది. తను ఎప్పుడు డబ్బు అడిగినా తండ్రి ఇవ్వడనే అనుకుంటుండేవాడు. ఇంతలో వినోద్‌ పదో తరగతి కూడా పూర్తయింది. అయితే కాలేజీ ఎక్కడ చేరాలనే మీమాంస మొదలయింది.



వినోద్‌ను మంచి కాలేజీలో చేర్పించేందుకు గోపాలం యాభై వేల రూపాయలు సిద్ధం చేసి ఉంచిన సంగతి ఇంట్లో అందరికీ తెలుసు! అయితే ఆ కాలేజీలో అర్హతగా నిర్ణయించిన దానికంటె వినోద్‌కు కొద్దిగా మార్కులు తక్కువ వచ్చాయి. అతడికి మాత్రం ఆ కాలేజీలోనే చేరాలని ఉంది. అదే కాలేజీలో సీటు కావాలంటే ఇంకో ఇరవై వేల రూపాయలు డొనేషన్‌ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఎన్నడూ పది రూపాయలు కూడా ఇవ్వని తండ్రి ఎంత బతిమాలినా సరే.. ఆ సొమ్ము చెల్లించి తనను కాలేజీలో చేర్పించడని వినోద్‌కు అర్థమైపోయింది.

కాలేజీలో చేరాల్సిన రోజు దగ్గరపడింది. ముందురోజు రాత్రి గోపాలం వినోద్‌ను పిలిచి- రేపు కాలేజీలో జాయిన్‌ కావాలి కదా.. దానికి కావ్సాలినవి అన్నీ సిద్ధం చేసుకో- అన్నాడు! నాన్నా మరి ఇరవై వేల రూపాయలు తక్కువయ్యాయి కదా!- అడిగాడు వినోద్‌. సర్దుబాటు అయ్యాయి లేరా.. వినోద్‌కు అనుమానం కలిగింది - అప్పు చేశారా నాన్నా?- అడిగాడు. లేదులేరా. అవి నీ డబ్బులే- చెప్పాడు గోపాలం. నా డబ్బులా? ఇరవై వేల రూపాయలా? ఆశ్చర్యంగా అడిగాడు వినోద్‌ నమ్మలేనట్లుగా. అవున్రా! చిన్నప్పటినుంచి నువ్వు తినుబండారాలకని, సినిమాలకని, షికార్లకని అప్పుడప్పుడూ పది ఇరవై రూపాయలు అడుగుతుండేవాడివి. ప్రతిసారీ నేను ఇవ్వకుండా లేవని చెప్పేవాణ్ని. అయితే అలా ప్రతిసారీ నువ్వు అడిగినంత సొమ్మును విడిగా కూడబెడుతూ వచ్చాను. ఇన్నాళ్లలో అవి ఇరవై వేలకంటే ఎక్కువే అయ్యాయి. ఇప్పుడు అవసరమయ్యాయి కదా అని ఆ డబ్బులోంచి ఇరవై వేలు తీసుకున్నాను. - చెప్పాడు గోపాలం.

వినోద్‌కు కళ్లలో నీళ్లు చిప్పిలాయి. ఇన్నాళ్లూ తను తండ్రి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో గుర్తుకు వచ్చి బాధ కలిగింది. తాను దుబారా చేయకుండా చూడడమే కాకుండా తను అడిగినంత డబ్బునూ తనకోసమే పొదుపు చేస్తూ వచ్చిన తండ్రి అంటే గొప్ప గౌరవం ఏర్పడింది.

గొంతులో దుఃఖం ధ్వనిస్తుండగా - థాంక్యూ నాన్నా!- అన్నాడు.

థాంక్యూ ఎందుకురా? ముందు నువ్వు రేపు కాలేజీలో చేరడానికి తయారవ్వు- అన్నాడు గోపాలం కొడుకును దగ్గరకు తీసుకుని భుజం తడుతూ.

కుందేలు తెలివి హర్షించిన కొదమసింహం

కొండపల్లి అడవికి కొదమ సింహం రాజుగా ఎన్నికయింది. కొదమసింహం సింహాసనం అధిష్టించగానే పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ముందుగా కొలువులో ఉన్న చిన్న చితక జంతువుల స్థానంలో బలమైన జంతువులను నియమించి బలమైన రాజ్యంగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగిన సన్నాహాలను ప్రారంభించింది. ‘ఇది మంచిపని కాదు. బలవంతులతో పాటు తెలివైన వారు రాజ్యానికి ఎంతో అవసరం, కేవలం శరీర దారుఢ్యంతో అన్ని పనులూ జరగవు’ అని మంత్రి నక్కగారు ఎంత చ్పెపినా వినలేదు. మొండి పట్టుదలతో కొదమ సింహం తన పంతం నెగ్గించుకుంది. ఇప్పుడు కొలువులో మంచి శరీర దారుఢ్యంగల జంతువులు పనిచేయడం ప్రారంభించాయి.

ఓ అర్ధరాత్రి పెనుగాలులతో తుఫాను ప్రారంభం అయింది. కొండ్లపలి అడవి అంతా సర్వనాశనం అయింది. ఎడతెరిపి లేని వర్షం, ఈదురుగాలుల వల్ల చెట్లు పడిపోయాయి. ఓ పెద్దకొండరాయి అత్యంత ప్రధానమైన రహదారికి అడ్డుగా పడిపోయింది. మూడురోజుల తరువాత తుఫాను తగ్గింది. చెల్లాచెదరైన జంతువులు తమతమ నివాసాలకు వచ్చి జరిగిన నష్టం చూసి కన్నీరుకార్చాయి. అన్నింటికంటే రహదారిపై పడి ఉన్న కొండరాయి వలన తమకు చాలా ఇబ్బంది అని గ్రహించాయి.

ఈ విషయం రాజుగారికి వివరించాయి. రాజుగారు తన కొలువులో ఉన్న బలమైన సిబ్బందితో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. నిజంగానే ఆ కొండరాయి వలన జంతువుల రాకపోకలకు విపరీతమైన అంతరాయం కలుగుతుందని గ్రహించి తన అనుచరుడైన ఏనుగువైపు చూశారు. ఏనుగు ఇదెంత పని తొండంతో ఒక్కటిస్తే జరజరా జారిపోతుందని అందరూ నా శక్తిని చూసి ఆశ్చర్యపోతారు’ అనుకుంటూ వెళ్ళి తన తొండంతో రాయిని పైకి లేపబోయింది. ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదల్లేదు.
రాయిని తొండంతో పట్టుకోవడానికి పట్టుదొరకలేదు. ఏనుగు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత అత్యంత బలశాలి ఖడ్గమృగం చిందులు వేస్తూ వచ్చి బలమైన కొమ్ముతో రాయిని కదపాలని ప్రయత్నించింది. కొమ్ము విరిగింది. కానీ రాయి కదలలేదు. ఆ తరువాత నీటి ఏనుగు, ఎలుగుబంటి ఇలా బలమైన జంతువులన్నీ ప్రయత్నించి చతికిలపడ్డాయి. రాజుగారు కోపంతో చిందులు తొక్కారు. మంత్రి నక్క ముసిముసి నవ్వులు చూసి సింహం మరింత కోపంతో ‘అలా నవ్వుతూ చూడకపోతే పరిష్కారం సూచించలేరా?’ అంటూ ప్రశ్నించింది. ‘మహారాజా! మీకారోజే చెప్పాను. అన్ని పనులు శరీరదారుఢ్యంతో జరగవని, బుద్ధిబలం, కండబలం కంటే గొప్పదని, ఇప్పుడు చూడండి’ అంటూ చిన్న జంతువులన్నింటినీ పిలిచి ‘మీ బుద్ధిబలంతో ఈ రాయిని కదల్చటానికి ప్రయత్నించండి’ అని చెప్పింది.

ఓ కుంటి కుందేలు మెల్లగా కొదమసింహం దగ్గరకొచ్చి వినయంగా నమస్కరించి ‘మహారాజా! నేను ఈ రాయిని కదిలిస్తాను’ అనగానే రాజుతో సహా జంతువులన్నీ ఆశ్చర్యంగా చూశాయి. రాజు ‘సరే కానీ’ అన్నాడు. కుందేలు కుంటుతూ చిన్న పలుగు తీసుకొచ్చి రాయి చుట్టూ తిరిగి పల్లంగా ఉన్న ప్రాంతంలో గునపంతో మట్టిని తవ్వింది. ఆ తరువాత జిరాఫీ మామ దగ్గరకెళ్ళి ఓ పెద్ద చెట్టుకొమ్మను విరగదీసి ఇవ్వమంది. జిరాఫీ తన పొడవైన మెడను సారించి ఓ పెద్ద కొమ్మను విరిచింది. ఆ కొమ్మను కుందేలు దగ్గరకు కోతి ఈడ్చుకొచ్చింది. కుందేలు పక్కనున్న ఎలుగుబంటిని పిలిచి కొమ్మను చేతికిచ్చి తాను చూపిన చోట ఉంచమంది. ఎలుగబంటి కుందేలు చెప్పినట్లుగా రాయికిందకు కొమ్మ ఉంచింది. తాబేలు బావవచ్చి ఆ కొమ్మకింద, చిన్న రాయిని ఉంచింది. కుందేలు అంతా సరి చూసుకుని ‘రడీ అనగానే కొమ్మను కిందకు వంచమంది. జంతువులన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి.

కుందేలు ‘రెడీ’ అంది. ఎలుగుబంటి కొమ్మను కిందకు నొక్కింది. అంతే. ధనధనా అంటూ పెద్ద శబ్దంతో రాయి పల్లంకోకి జారిపోయింది. కళ్ళముందు జరిగిన సంఘటనకు జంతువులన్నీ హర్షధ్వానాలు చేశాయి. రాజుగారు కండబలం కంటే బుద్ధిబలం గొప్పదని గ్రహించి తిరిగి కొలువులో తెలివిగల వాళ్ళకి సముచిత ఉద్యోగాలిచ్చి అందరినీ సంతోషపెట్టారు.

పరమానంద పరోపకారం

చాలాకాలం క్రితం ధర్మపురి రాజ్యంలో పరమానంద అనే ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు పరమ పిసినారి. ఒకరోజు అతను రోడ్డుపై నడుసుండగా, జిలేబీ అంగడిని చూశాడు. అతనికి వాటిని తినాలనే కోరిక కలిగింది. కాని వాటిని కొనడానికి డబ్బు అవసరం. పైగా, అంగడి వద్దే తింటే పక్కన ఉన్న వారికి కూడా పెట్టాల్సి వస్తుంది. అది ఇష్టం లేని పరమానంద ఒక పధకం పన్నాడు. దాని ప్రకారం వెంటనే అతను ఇంటికి చేరుకొని, పనివాడిని పిలిచాడు. వాడికి డబ్బు ఇచ్చి అంగడి నుంచి జిలేబి తీసుకొని ఇంటికి కాకుండా ఊరు చివర కొలను వద్ద గల పొదల వద్దకు తీసుకు రమ్మని చెప్పాడు.

ఈ పరిస్ధితులలో ఒకవైపు పరమానంద జిలేబిలను తినేందుకు ప్రయత్నిస్తూంటే, మరోవైపు అచ్చం అతనిలానే ఉన్న మరో నకిలీ వ్యక్తి రాజుగారుతో ‘నేను నా సంపదలో సగభాగాన్ని పేదలకు దానం చేయాలని నిశ్చయించుకున్నాను, కనుక దయఉంచి మీరు ఇందుకు అనుమతించాలి‘ అని కోరాడు. దానికి రాజు సంతోషంగా సమ్మతించి, అతడిని అభినందించాడు.

పరమానందలో వచ్చినఈ మార్పునకు సభలో ఉన్న వారందరూ ఆశ్చరపడటమే కాక, ఈ హఠాత్తు పరిణామానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని ఆలోచించసాగారు. అప్పుడు నకిలీ పరమానంద సభ నుంచి నేరుగా, అసలు పరమానంద ఇంటికి నెళ్ళి, పనివాడితో ‘అచ్చు తనలాగే ఉన్న మరో మనిషి గ్రామంలో తిరుగుతున్నాడని, అతను కనుక ఇంటికి నస్తే నిర్ధాక్ష ణ్యంగా కొట్టి, బంధించమని‘ ఆజ్ఞాపించాడు.



ఇంటికి చేరుకొన్న నకిలీ పరమానంద, శుభ్రత లేని దుస్తులు ధరించినఅసలు పరమానంద భార్యను చూసి, సంతకి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కోమని చెప్పాడు. తన భర్తలో వచ్చిన ఈ మార్పునకు నివ్వెర పోయినపరమానంద భార్య కారణం ఏమిటని ప్రశ్నించింది. దానికి అతడు నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని సమాధానం చెప్పాడు.

కొంతసేపటికి రాజ్యంలోని ప్రజలంతా పరమానంద ఇంటికి చేరుకున్నారు. నకిలీ పరమానంద వారితో ‘మీకు నచ్చిన వస్తువులు, సరమజామా, ఏది అవసరమైతే వాటిని తీసుకు వెళ్ళమని‘ కోరాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా వారికి అవసరమైన వాటిని తీసుకోపోవడం ప్రారంభించారు. ఒక గ్రామస్థుడు తెలివిగా, ముందుగా ఇంటి వెలుపల ఉన్న బండిని తీసుకొని దాని నిండా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో నింపుకొని, పరమానంద ఉదారతను పాట రూపంలో పాడుకుంటూ, అసలైన పరమానంద ఉన్న మార్గం గుండా తన ఇంటికి ప్రయాణమయ్యాడు.

అప్పుడు ఆ పాట విన్న అసలు పరమానంద ఆశ్చరపడి, ఎవరు పాడుతున్నారో తెలుసుకొనేందుకు ఆ దారిలోకి వచ్చాడు. ఎదురుగా విలువైన వస్తువులతో బండి మీద తన గొప్పతనాన్ని పాడూతూ వస్తూన్న అతను చూచి, ఆ ఎడ్ల బండి, అందులోని వస్తువులను తనివిగా గుర్తు పట్టి ‘దొంగ.....దొంగ....‘ అని అరవడం ప్రారంభించాడు. దానికి సమాధానంగా ఆ బండివాడు నవ్వి..ఇవి నాకు పరమానంద గారే ఇచ్చారని చెప్పాడు. దానికి ఆశ్చరంతో ‘నేనే పరమానంద‘ అన్నాడు. దానికి ఆ బండివాడు నవ్వి, వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.



వెంటనే పరమానంద తన ఇంటికి బయలదేరి వెళుతూ, దారిలో తన వస్తువులను తీసుకొపోతున్న కొంతమందిని అడ్డగించగా వారు అతనిని తీవ్రంగా గాయపరిచారు. అప్పుడు పరమానంద రాజుకు ఫిర్యాదు చేశాడు. దానికి రాజు ‘మరి నీ ఆస్తిని పేదలకు దానం చేయుటకు నా వద్ద అనుమతిని ఎందుకు తీసుకున్నావు‘ అని ప్రశ్నించాడు.

అప్పుడు పరమానంద ఆ అనుమతిని అడిగినది తాను కాదని, తన రూపంలో ఉన్న ఒక మొసగాడని అతనిని శిక్షించమని కోరాడు. అప్పుడు రాజు వెంటనే నకిలీ పరమానందను బంధించి తీసుకొని రమ్మని తన భటులను ఆజ్ఞాపించగా, వారు అతనిని సభలో రాజు ముందు హాజరు పరిచారు. అప్పుడు రాజుతో సహా ప్రజలందరూ వారిరువరూ అచ్చం ఒకేలా ఉండండతో ఆశ్చరపోయారు.

చివరికి పరమానంద భార్య కూడా వారిద్దిరిలో అసలు పరమానందను గుర్తించ లేకపోవడంతో, అతను తన పరిస్దితికి మూర్ఛపోయాడు. కొంచెంసేపు తరువాత తేరుకొన్న అసలు పరమానంద వద్దకు నకిలీ పరమానంద వచ్చి, ‘నేను నీ తండ్రిని. నేను నీలాగే పిసినారిగా బ్రతకడంతో ఇప్పుడు నేను నరకంలో కష్టాలనుభవిస్తున్నాను. నీలో మార్పు కోసం ఈ నాటకం ఆడాను. ఇక పైన ధానధర్మాలను చేసి బుద్దిగా బ్రతకమని‘ చెప్పి అదృశ్యమైనాడు. అప్పటి నుంచి ధనరామ్‌ చివరివరకూ, దానధర్మాలు చేస్తూ, మంచి పేరు తెచ్చికొని, మరణాంతరం స్వర్గాన్ని చేరుకోన్నాడు.

అందుకని పిల్లలూ! మీరు కూడా ధానధర్మాలు చేసి మంచిపేరు తెచ్చుకొంటారు కదూ.

నీతి : ఎల్లప్పుడు పరులకు సహయపడవలెను

అడ్డదారి విజయం.. భవిష్యత్ అంధకారానికి మార్గం

ప్రముఖ వ్యాపారి రాజారావు కుమారుడు నరేష్‌, రాజారావు దగ్గర కూలిపని చేసే రంగయ్య కుమారుడు సోము పదవ తరగతి ఊర్మిళానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రాజారావుకు ఆ స్కూల్లో మంచి పలుకుబడి ఉంది. అందువలన నరేష్‌ సరిగ్గా స్కూలుకు రాకపోయినా పరీక్షల్లో అసలు ఏమీ రాయకపోయినా కోపగించకుండా హాజరు వేస్తూ మార్కులు కూడా అవకాశాన్ని బట్టి వేస్తూ పాస్‌ చేసే వారు. అందువలన నరేష్‌ అందరితో తగవులు పెట్టుకొని అల్లరిగా తిరిగేవాడు.

సోము స్కూలు వదలగానే తండ్రి దగ్గరకు వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళవలసిన సరుకులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళేవాడు. ఇంటి దగ్గర సోమూ పాఠాలు అన్నీ చక్కగా చదువుకొని, నోట్సులు రాసుకొని రాని ప్రశ్నలను మరింత శ్రద్ధగా చదివి ఏ రోజు వర్క్‌ ఆ రోజుకే పూర్తిచేసేవాడు. పదవ తరగతి పరీక్షలంటే భయంతో మరింత శ్రద్ధగా చదివేవాడు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ‘ప్రతి విద్యార్ధి జీవితానికీ చక్కని మలుపునిచ్చేది ఈ పదవ తరగతి పరీక్షలే’. అందువలన సోము రాత్రంతా మేల్కొని ప్రతి పాఠాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తన మెదడులో నిక్షిప్తం చేసుకునేవాడు. కొడుకు కృషిని చూసి తల్లి, తండ్రి కూడా నిద్రపోకుండా అతనితోపాటు మేల్కొని తోడుగా ఉండేవారు.



రాజారావు తన కుమారుడు ‘స్టేట్‌ ఫస్ట్ క్లాస్’ రావాలని, దానికోసం రకరకాల దారులు అన్వేషించి, లంచం ఇచ్చి చివరకు ప్రశ్నాపత్రాలు సంపాదించాడు. నరేష్‌ ఆ ప్రశ్నల జవాబులు చదువుకొని పరీక్షలు చక్కగా రాశాడు. సోము కూడా స్వయంకృషితో అన్ని పరీక్షలూ మంచిగానే రాశాడు. రెండునెలల అనంతరం ఫలితాలు వచ్చాయి. ప్రశ్నాపత్రాలు ముందుగా సంపాదించి రాసిన నరేష్‌ స్కూల్‌ ఫస్ట్ వచ్చాడు. సోము మాత్రం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. నరేష్‌ను స్కూలువారు అభినందించారు. నరేష్‌, సోము, ‘శారదా కాలేజీ’లో చేరారు. అప్పటినుండీ నరేష్‌కు కష్టాలు మొదలయ్యాయి.

లెక్చరర్‌ చెప్పే పాఠాలు అర్థం కావడంలేదు. రోజురోజుకూ కాలేజీ అంటే భయం ఎక్కువయింది. ఆ భయంతో కాలేజీకి వెళ్ళటం, జులాయిగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. సోము బాగా చదివినవాడు కాబట్టి అన్నీ అర్థం చేసుకుని మంచి మార్కులు పొందాడు. నరేష్‌ తండ్రితో కాలేజీకి వెళ్ళనని చెప్పేశాడు. అతన్ని బలవంతం చేస్తే ఏమవుతాడో అని తన వ్యాపారంలోనే చేరమన్నాడు. అంతటితో అతని చదువు ఆగిపోయింది. కొడుకును ఉన్నత శిఖరాలు చేర్చాలన్న రాజారావు కలలు కరిగిపోయాయి.



సోము అంచెలంచెలుగా ఎదిగాడు. కంప్యూటర్స్‌ నేర్చుకున్నాడు. పోటీ పరీక్షలు రాశాడు. అన్నిటిలో సులభంగా పాసయ్యాడు. అతనికి విదేశాలలో అవకాశం వచ్చినా వెళ్ళకుండా భారతదేశంలోనే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. ఆ విషయం ఆనందంగా చెబుతున్నాడు రంగయ్యను హృదయపూర్వకంగా అభినందించాడు రాజారావు. చేతులారా తాను తన కుమారుడి భవిష్యత్తును పాడు చేశానని గుర్తించాడు. ‘బాల్యంనుండీ చదువుని డబ్బుతో కొనడం అలవాటు చేశాను. ఆ అలవాటే నాకుమారుడి జీవితాన్ని చీకటి చేసింది. తప్పునాదే, తప్పు నాదే!’ అనుకున్నాడు.

నీతి : స్వయంకృషితో చదవకుండా అడ్డదారుల్లో పాస్‌ అయితే విద్యార్థి భవిషత్తు అంధకారం అవుతుంది. 

బాల్యం నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి

ఏకలవ్యనగర్‌లో రామనాధరెడ్డి స్కూల్‌లో శివ, రవి 7వ తరగతి చదువుతున్నారు. శివ ప్రతిరోజూ స్కూల్‌కు పాకెట్‌మనీ పదిరూపాయలు పైగానే తెస్తాడు. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు శివచుట్టూ నలుగురైదుగురు స్నేహితులు ఉంటారు. చిరుతిళ్ళు తింటూ, అద్దె సైకిల్స్‌ తీసుకుని చక్కర్లు కొట్టడం, చ దువు కంటే ఆటలకే ఎక్కువ సమయం వృధా చేసే వారు. రవి ఇంట్లో ఇచ్చిన పాకెట్‌మనీని జాగ్రత్తగా హుండీలో వేసి దాచేవాడు. నోట్సులను చివరిపేజీ వరకూ ఉపయోగించేవాడు. పాఠ్యపుస్తకాలను పాతవి కొని, వాటికి చక్కగా అట్టలు వేసి రంగురంగుల నేమ్‌స్లిప్స్ అంటించి నీట్‌గా ఉంచేవాడు. ఉపాధ్యాయులు ఎంతగానో అభిమానించేవారు.

కానీ విద్యార్ధులు మాత్రం ‘పిసినారి రవి’ అని ఏడిపించేవారు. అయినా కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ తలదించుకుని వెళ్ళేవాడు. శివ ఇంట్లో ఏ పని చెప్పినా చేసేవాడుకాదు, మార్కెట్‌నుండి ఏవైనా సరుకులు తీసుకురమ్మంటే సమయానుకూలంగా కమీషన్‌ కొట్టేవాడు. ఆ డబ్బును తను పొగిడే వారికోసం ఖర్చు పెట్టేవాడు. రవి ఉదయం ఇంటికి కావలసిన పాలు, పాలబూత్‌ దగ్గరకు వెళ్ళి తీసుకువచ్చేవాడు. కాలనీలో ఉన్న కొందరు ఉదయానే లేవలేక రవితో పాలపేకేట్స్‌ తెప్పించుకునేవారు. అలా తెచ్చినందుకు నెలకు 15 రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఆ డబ్బును రవి జాగ్రత్తగా కూడబెట్టేవాడు. వాళ్ళ నాన్నగారు ప్రతినెలా సినిమాకు వెళ్ళమని డబ్బులిచ్చినా, అవి కూడా దాచుకునేవాడు.



ఉపాధ్యాయ దినోత్సవానికి క్లాసులో అందరూ కలసి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చేయాలని అనుకున్నారు. అందుకు తలా పదిరూపాయలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే అందరూ లీడర్‌కు డబ్బులిచ్చారు. శివ మాత్రం ఇంట్లో 25 రూపాయలు గురుపూజ పేరు చెప్పి తీసుకొని, క్లాస్‌లో ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఆ డబ్బు ఖర్చు చేశాడు. గురుపూజరోజు రవి అన్ని పనులూ తానే చేశాడు. వసూలయిన డబ్బులు చాలక పిల్లలు ఆందోళన పడుతుంటే రవి వాళ్ళను గాబరాపడవద్దని తన సొంత డబ్బులు వందరూపాయలు ఇచ్చాడు. పిల్లలు ఆశ్చర్యపోయారు. పిసినారి రవి వందరూపాయలు ఇవ్వడం అందరూ చ ర్చించుకోవడం, శివకు ఎంతో బాధ కలిగింది.

ఆ బాధకోపంగా మారింది. స్కూలు వదిలిన తరువాత దారికాచి రవిని కొట్టడానికి ప్రయత్నించాడు. రవి భయపడకుండా “శివా! నేనంటే నీకెందుకు కోపం? నేనెప్పుడూ నీ గురించి వేరుగా అనుకోలేదు. మనం చదువుకోవడానికి వచ్చాము, ఇలా కక్షలు పెంచుకుంటే చదువు కుంటుపడుతుంది. అలా జరిగితే నీ జీవితం, నిన్ను గొప్పగా చదివించాలనుకున్న నీ తల్లిదండ్రుల ఆశలు చెదిరిపోతాయి. నువ్వు ఖర్చు చేయకపోతే ఈ చుట్టూ తిరిగే స్నేహితులు నీ దగ్గరకే రారు. నన్నుకొడితే నీకు ఆనందం కలిగితే కొట్టు” అని ధైర్యంగా నిల్చున్నాడు. అనుకోని సంఘటనకు శివ ఖంగుతిన్నాడు. ఆలోచనలోపడ్డాడు, తలదించుకుని వెళ్ళిపోయాడు.



ఆరోజు నుండి శివలో మార్పు వచ్చింది. ఆ మార్పు శివ స్నేహితులకు బాధ కలిగించింది. శివను తమ దారికి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు. శివ వారి దారికి రాలేదు. పూర్తిగా చదువుపైనే మనసు లగ్నం చేశాడు. పాత స్నేహితులు దూరం అయ్యారు. తనను మార్చిన రవిపై అభిమానం పెరిగింది. ఇంతకాలం రాయని నోట్సులు రవి దగ్గర తీసుకుని రాసుకున్నాడు. చిల్లరఖర్చులు, తిరుగుళ్ళు మానివేశాడు. బుద్ధిగా చదివి, పరీక్ష ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఏకలవ్యనగర్‌లో 7వ తరగతి వరకే అవకాశం ఉంది. పై తరగతి చదవాలంటే పక్క ఊరు బస్సులో వెళ్ళాలి. ఏంచెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు శివ. తండ్రిని సైకిల్‌ కొనివ్వమన్నాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండునెలల తరువాత కొంటానన్నాడు.

ఆ రెండు నెలలు బస్సులో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ‘ట్రింగ్‌, ట్రింగ్‌’మన్న సైకిల్‌ శబ్దానికి శివ వెనక్కు తిరిగి చూశాడు. సైకిల్‌పై రవి, శివ ఆశ్చర్యంగా చూసి “కొత్త సైకిల్‌ ఎప్పుడు కొన్నావురా? మీ న్నాగారు కొన్నారా? ఎంతయింది?” అంటూ అడిగాడు. “మా నాన్నగారు కొనలేదు. నా స్వంత డబ్బుతో కొన్నా. పదహారు వందలయింది. రా!వెనక కూర్చో. ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్దాం” అన్నాడు రవి. శివ కూర్చుని “అంత డబ్బు ఎక్కడిదిరా” ఆశ్చర్యంగా అడిగాడు.

రవి నవ్వుతూ “అనవసర ఖర్చులు చేయకుండా ఒక్కో రూపాయి జమ చేస్తే సైకిల్‌ ఏం ఖర్మ, లూనానే కొనుక్కోవచ్చు. డబ్బు ఖర్చుపెడితే దగ్గరకు చేరేవారు స్నేహితులు కారు, తెలుసుకో” అన్నాడు. శివ ఆ మాటలకు ఎంతో సిగ్గుపడ్డాడు, “రవీ! నువ్వేనా నిజమైన మిత్రుడివి. ఇక నుంచి నీ సలహాలతో మంచి దారిలో ప్రయాణం చేస్తాను..’ అన్నాడు.

నీతి : పొదుపు బాల్యం నుండీ అలవాటు చేసుకుంటే రేపటి మంచి పనులకు ఎంతో ఉపయోగపడుతుంది.

దొంగతన తాత్కాలిక సుఖం ఇస్తుంది

ఊర్మిళా నగరంలో పురాతనమైన వేప, మర్రి కలిసిన మహావృక్షం గ్రామప్రజల పూజలు అందుకుంటోంది. ఆ చ్టెటుపై ఎంతోకాలంగా కాకులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ, గ్రామప్రజలు చెట్టుకు నైవేద్యం పెట్టే వడపప్పు వంటివి తింటూ హాయిగా జీవిస్తున్నాయి.

ఓ రోజు ముసలికాకి ఒకటి ఎక్కడనుంచో వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. చెట్టుపైన ఉన్న కాకులు దాన్ని చూసి ఎగిరివచ్చి చెట్టు దగ్గరకు చేర్చి సేవలు చేసి తెలివి తెప్పించాయి. పాపం ఆ ముసలికాకి కుంటిది. మెల్లగా లేచి తన చుట్టూ ఉన్న కాకులను చూసి ఆనందపడింది. అక్కడే ఉంటూ కొద్దిరోజులకు అది కోలుకుంది. తన గత అనుభవాలను ఇతర కాకులకు కథలుగా చెప్పేది. కాలం గడుస్తోంది. అయితే రోజూ వడపప్పు తింటూ అలా గడపడం ముసలికాకికి నచ్చలేదు.

ఓ రోజు ముసలికాకి చెట్టుపైన ఉన్న కాకులన్నింటినీ సమావేశపరిచి పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. ‘నాతోటి కాకుల్లారా! ఎంతకాలం ఇలా జీవనం. మీకు, ఈ చెట్టు - చెట్టుకు పెట్టే నైవేద్యం తప్ప మరొకటి తెలీదు. ఒకసారి ప్రపంచాన్ని చూడండి. తెలివి ఉపయోగిస్తే ఎన్నో రుచులను చవిచూడవచ్చు’ అని చెప్పింది. కాకులు అంతా విని మొహమాటం లేకుండా మాకు వేరే రుచులు వద్దు. ఈ జీవితమే హాయిగా ఉంది. రుచుల కోసం దొంగతనం చేయం’ అన్నాయి. ముసలికాకి మూతి ముడుచుకుని వంటరిగా మిగిలిపోయింది.



అయినా ఊరుకోకుండా సమయం చూసి ఓ బక్కకాకికి మళ్ళీ తన ఉపన్యాసం వినిపించి ‘ ఇలా బక్కగా ఉండటానికి కారణం సరైన తిండిలేకపోవడమే. నేను చెప్పినట్లు చేస్తే నెలరోజుల్లో కండలు పెరుగుతాయి’ అని చెప్పింది. పాపం బక్కకాకి ఆశపడి సరేనంది. ముసలికాకి ఆలస్యం చేయకుండా బక్కకాకిని వెంటపెట్టుకుని గ్రామంలోకి వచ్చింది. ముందు మాంసం కొట్టు దగ్గర పారేసిన మాంసం రుచిచూపించింది. మరోచోట చేపల రుచి.. ఇలా ఊరంతా తిప్పింది. కొత్త రుచులకు బక్కకాకి మురిసిపోయింది.

కొద్దిరోజులు గడిచాయి. ముసలికాకి ఇళ్ళల్లోకి చొరబడి గారెలు, బూరెలు, వేపుళ్ళు తెచ్చుకుంటే బాగంటుందని సలహా ఇచ్చింది. ఆ రోజు నుంచి బక్కకాకి ఇళ్ళలో ఆహారం దొంగిలించడం మొదలు పెట్టింది. ఈ పని మంచిదికాదని తోటి కాకులు ఎంత చెప్పినా వినలేదు. రోజురోజుకూ దొంగతనం ఎక్కువయిపోయింది. ముసలికాకి హాయిగా కూర్చొని తెచ్చిన ఆహారాన్ని లొట్టలు వేసుకుని తింటూ బాగా బలిసింది. బక్కకాకి కూడా పహిల్వాన్‌లా తయారయింది. బక్కకాకి కుటుంబం కూడా దొంగతనాలు మొదలు పెట్టింది. రోజురోజుకూ కాకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. ప్రజలు జాగ్రత్త పడక తప్పలేదు. రానురాను దొంగకాకులకు ఆహారం దొరకడం కష్టం అయింది. రుచులకు అలవాటుపడిన నాలుక మామూలు ఆహారం తినడానికి మొరాయించింది.



ఓరోజు ఎలా అయినా మంచి ఆహారం దొంగిలించాలని ముసలికాకి, బక్కకాకి బయలుదేరి రెడ్డిగారి ఇంటిపై వాలాయి. పెరట్లో మార్కెట్‌ నుంచి తెచ్చిన చేపల సంచి చూసి మెల్లగా సంచి దగ్గరకు వచ్చాయి. ముసలికాకి తన ముక్కుతో ఓ చేపను పట్టింది. బక్కకాకి రెండు చేపలు పట్టింది. తొందరగా వెళ్ళిపోవాలని ఎగరడానికి రెక్కలు ఆడించాయి. అంతలో రెడ్డిగారు అదిచూశారు. ఇంతకాలం కాకుల బాధ అనుభవించిన రెడ్డిగారు కోపంతో చేతిలో ఉన్న కర్ర విసిరారు. కర్ర రివ్వున ఎగిరివచ్చి ముసలికాకిని తాకింది. దాంతో అది మరణించింది. బక్కకాకి భయంతో పరుగులు తీసింది. రెడ్డిగారు కోపంతో దాని వెంటపడ్డారు.

కాకి తన గూడు చేరుకుంది. ఆయన ఆ గూడును వెదురుకర్రతో చిందరవందర చేశారు. ఆ గూడు కదిలిపోయింది. ఆగూట్లో స్టీలు చెంచాలు, ప్లేట్లు, చిన్నచిన్న గిన్నెలు ఎన్నో కింద పడ్డాయి. బక్కకాకి కుటుంబం నిలువనీడ లేకుండా పోయింది. ఎంత ప్రాధేయపడినా ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వలేదు. ఇక నుంచి దొంగతనం చేయనని మొరపెట్టుకున్నా ఎవ్వరూ దగ్గరకు రానివ్వలేదు. కాకులు దాన్ని వెలివేశాయి. చేసేదిలేక ఏడ్చుకుంటూ బక్కకాకి తన కుటుంబంతో మరో ఊరు వె ళ్ళిపోవలసి వచ్చింది.

నీతి : దొంగతనం తాత్కాలిక సుఖం ఇస్తుంది. కానీ నిజం తెలిసిన తరువాత నిలువ నీడ కూడా దొరకదు.