Pages

Wednesday, April 22, 2015

వేరుశనగ దొంగ

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.
అలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.
రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.
చదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు. 
ళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది. 
లేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.
“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది.

వేరుశనగ దొంగ


ఒక రాజు, యేడుగురు కొడుకులు

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”
రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”
ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…

నోరు జారిన మాటలు

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.

ప్రేమలో పడ్డ పులి

అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా వుండేది. ఒక రోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై యెగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడకి వచ్చింది.
ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది.

కొంచం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడనుంచి వెళ్ళిపోయింది.
ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటునుంచి బయిటికి వచ్చింది.
పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాల భయపడి పోయాడు. పారిపోయే క్షణంలో పులి, “నన్ను చూశి భయపడకండి – నేను మిమ్మల్ని యేమి చేయను. నాకు మీ అమ్మయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకొవాలనుకుంటున్నాను” అంది.
అతను భయంలో కూడా చాల చురుకుగా ఆలోచించాడు.
“నాకు ఇష్టమే, కాని మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో – పెళ్ళికి ఒప్పుకోక పోతే?” అన్నాడు.
పులి ఆలోచించకుండా, “మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు, గోళ్ళు తీయించేస్తాను” అంది.
ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు, దంతాలు కోసేసాడు. దంతాలు, గొళ్ళు లేని పులి అంటే భయం వుండదు కదా! కట్టెలతో, రాళ్ళతో, చేతికి అందిన ప్రతీ దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు.
దెబ్బకి మళ్ళి ఆ పులి యే మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు.

అద్దం లో మనిషి

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆటను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు.
అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు.
వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.
ఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతనే అందమే అతని అహంకారం. ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి ఆటను సిద్ధ పడ్డాడు.
ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దేగ్గిరకు వెళ్లి ఉపాయమదిగాదు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. “రోజు ఈ అద్దం చూసుకో. నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు యెప్పుడు ఇలాగే ఉండిపోతావు” అన్నాడు. “కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది.” అని హెచ్చరించాడు.
అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.
ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాన్కారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధ పడ్డ ఆటను చేసే పనులు, అతని నడవడిక మార్చుకోలేదు.
కొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తె భరించలేనంత అసహ్యంగా తయ్యరాయ్యింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది. అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.
ఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది.
తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది. ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ ఎజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.
ఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప.

అత్యాశగల కుక్క

అననగానగా ఒక కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది.ఈ రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను
నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుద్యారింది.
దారిలో ఒక నది వుంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది.
కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది.
ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క వుంది, అది కోడా నాకే దొరికితే బాగుంటుంది అనుకుంది.నీటిలో వున్నా కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది.
నోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి  నీటిపాలయ్యింది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధ పడింది.

అత్తారింటికి దారేది

ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.
యమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.
మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.
సభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.
బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.
అక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.
రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు.
విషయమర్ధమయ్యింది.
“మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు.
సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.

నాణాల సంచి

ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాల పెద్ద గొడవ ఐపోయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.
తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.
“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు.
అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”
వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు.
బీర్బల్ యెన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప సాగారు.
ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.
ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.
ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.
బీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

అఙ్నానం, మూర్ఖత్వం

అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది.
ఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వూ నా మాట విను” అంది.
పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది. “అనుమతిని అడిగితే ఇలాగే వుంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి” అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దెగ్గిరకి వెళ్ళిపోయింది.
ఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్ల కప్ప అదే మొదటి సారి ఒక మనిషి ని చూడటం. ఆ ఎత్తూ ఆకారం చూసి చాలా జడుసుకుంది. ఖంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్పింది.
తల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదు గా, అందుకే, “ఎంత లావున్నాడు?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వున్నాడా?”
“ఊహూ” అని అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.
“ఊహూ” అని మళ్ళి అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అంటూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప.

అలవాటు

ఒక వూళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సుబ్బమ్మ పూలు అమ్ముకునేది. సూరమ్మ చేపలు అమ్ముకునేది. వేరే వాళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది.

ఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ.

సూరమ్మ పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.

పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది.

మీకేమైన తెలిసిందా?

సూరమ్మ పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.

అన్నా గోపాలా

ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.

ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు.

ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, “అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”

“నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.

ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.

ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.

సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు. “ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు.

పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు. కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడ అందరి లాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు.

పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించ మన్నారు.

చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు.

ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి పెరుగు నిండిపోయింది.

ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు.

వేరే వాళ్ళంతా, “యేది, మాకు వడ్డించండి, మేమూ చూస్తాము”, అన్నారు.

అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా, అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.

వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ “యేది, అన్నా! గోపాలా! అని పిలూ, మేమూ చూస్తాము!” అన్నారు.

అయ్యవారు అందరిని మందలించారు. “మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.

అందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా నల్ల కృశ్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనబడింది.

ఈగ పేరు

ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది. ఎంతాలోచించినా పేరు గుర్తు రాలేదు.


ఇంట్లో వున్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది.

“పెద్దమ్మా, నా పేరేంటి?” అంది.

“నాకేమి తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే వుంటాను, అడవిలో వున్న నా కొడుకునడుగు” అంది పెద్దమ్మ.
ఈగ అడవిలోకి వెళ్ళింది.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకా, నా పేరేంటి?” అంది.

“నాకేంతెలుసు, నేను నరుకుతున్న చెట్టునడుగు, నాకన్నా బలంగా వుంది” అన్నాడు పెద్దమ్మ కొడుకు.



“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి?” అంది ఈగ.



“నాకు తెలీదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు”, అంది చెట్టు.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, నా పేరేంటి?” అంది ఈగ.



“నాకన్నా పెద్దది, ఈ నదినడుగు” అంది గొడ్డలి.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నా పేరేంటి?” అంది ఈగ.


“నా నీళ్ళన్నీ తాగేస్తున్న ఈ రాజుగారి గుఱ్ఱముంది కద, దీనిని అడుగు” అంది నది.

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నది నీళ్ళు తాగే గుఱ్ఱం, నా పేరేంటి?” అంది ఈగ.

“నాకు తెలీదు, నా కడుపులోని బిడ్డనడుగు” అంది గుఱ్ఱం

“పెద్దమ్మా; పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలీ, గొడ్డలి పక్క నది, నది నీళ్ళు తాగే గుఱ్ఱం, గుఱ్ఱం కడుపులో బిడ్డా, నా పేరేంటి?” అంది ఈగ.

గుఱ్ఱం పిల్ల, “ఇహి ఇహి ఇహి ఇహి ఇహి ఈగ!” అంటూ నవ్వింది!

అయోమొహం పెట్టుకుంది మన మతిమరుపు ఈగ.

పందెం

ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య సరిహద్దు తగాదాలుండేవి. ఆ సరిహద్దు ప్రాంత వాసులు ఎవరికి పన్నులు కట్టాలో తెలీక కట్టడం మానేశారు. ఆదాయాం తగ్గిపోవడంతో సామంతరాజులు ఇద్దరూ మహారాజుని ఆశ్రయించారు. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు నా దాకు తీసుకురాకండి, మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి అని మహారాజుగారు తేల్చేశారు.
పెద్దల సహకారంలో ఇద్దరు సామంత రాజులు ఒక అంగీకారానికి వచ్చేరు.
ఇరువైపు రాజ్యాలనుంచి ఇద్దరు బలశాలురు కోడి కూతతో బయలుదేరి సూర్యాస్తమం దాక ఎంత దూరం పరిగెడతారో అంత ప్రాంతం వాళ్ళది అని నిర్ణయించుకున్నారు. మంచి రోజు నిర్ధారించుకున్నారు. రెండు రాజ్యాల వళ్ళూ తమ తమ బలశాలులని యెంచుకున్నారు.
పందెం ముందు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండొవ రాజ్యం కోడిని బాగా మేపేరు. తిని, తినీ ఆ కోడి బద్దకంతో బాగా నిద్రపోయి పొద్దున్న లేవలేదు, కూత పెట్టలేదు. ఆ రాజ్యం వాళ్ళు నిద్రలేచి, కోడిని లేపి, కూత పెట్టించే లోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేసాడు. పొరుగు రాజ్యం పొలిమేరల దాక పరిగెట్టాడు.
అతన్ని బ్రతిమాలుకుంటే, నన్ను ఎత్తుకుని ఎంత దూరం పరిగెడితే ఆ ప్రాంతం నీకే అన్నాడు. ఈ రాజ్యం బలశాలి అతన్ని ఎత్తుకుని నడవడం మొదలెత్తాడు కానీ ఎంతో దూరం వెళ్ళకుండానే తెల్లారిపోయింది.
రెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలయ్యింది. విషయం తెలిసిన పెద్దలు పందెం రద్దు చేసారు.
ఆ ప్రాంతం ఎవరిదో ఇప్పతికి తేలలేదు. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ “పందెం పాలెం” అంటారు.