Pages

Sunday, June 1, 2014

సౌందర్యవతి

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడంవల్ల మేలు కలగవచ్చు. నాగరాజు లాంటి పట్టుదలగల యువకుడు, ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు.

నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం వున్నది. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు. అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే, ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్ళి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత వూరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో "పనిలో పనిగా రత్నాన్ని పెళ్ళి చేసుకొని వెంటబెట్టుకుపో" అన్నారు.నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారు వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంతదూరం పరిగెత్తి, ఒకపెంకుటింటి అరుగుమీద తలదాచుకున్నాడు. అయితే ఆ సరికే అతను బాగా తడిసిపోయాడు. "అయ్యో, బాగా తడిసిపోయావు. లోపలికిరా, బాబూ" అంటూ కిటికీలోంచి అతణ్ణి చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది.
నాగరాజు మొహమాటపడుతూనే లోపలికి వెళ్ళాడు. "సంధ్యా, పొడిగుడ్డ తీసుకు రామ్మా. ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు" అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది.  "అందమైన పేరు!" అనుకున్నాడు నాగరాజు. ఇంతలో కాళ్ళ గజ్జెల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మందాకా వెళ్ళి, బట్ట అందుకున్నది.నాగరాజు తడిసిన తల తుడుచుకుంటుండగా "కాసిని వేడిపాలు పట్టుకురా సంధ్యా" అని మళ్ళీ కేకపెట్టింది ముసలావిడ.తరవాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది; తమను గురించి చెప్పింది; వాళ్ళు ఆ వూరుకు కొత్తగా వచ్చారు. సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది. కాని, పాలు కూడా గుమ్మందాకా వెళ్ళి ముసలావిడే అందుకోవడంతో, అతడికి ఆ అవకాశం చిక్కలేదు. మర్నాడు పని గట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్ళాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, "మా సంధ్య తోచనప్పుడు యిలా తెరలూ అవీ అల్లుతూ వుంటుంది" అన్నది.ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమయిన ఫలహారం అందింది కాని, ఆమె దర్శనం మాత్రం కాలేదు.
ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన రెండు దానిమ్మపళ్ళు తీసుకొని, నాగరాజు, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపలినుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడినుంచి వచ్చిన ముసలావిడను అతడు గమనించలేదు.ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ "ఇప్పుడే వచ్చావా బాబూ? మా సంధ్య పాట మొదలుపెడితే, పరిసరాలు మరచిపోతుంది" అన్నది.లోపలి గదిలో వున్న సంధ్య, నాగరాజుకు కనపడలేదు. అతడు దానిమ్మపళ్ళను ముసలావిడ చేతిలో పెట్టి, కాసేపు కబుర్లు చెప్పి, ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా,ఆమెనే పెళ్ళాడాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు. మర్నాడు ఎలాగయినా సంధ్యను చూడాలనీ, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలనీ నిశ్చయించుకున్నాడు.
నాగరాజు ఆ మరుసటిరోజున సంధ్యవాళ్ళ ఇంటిని సమీపిస్తుండగా, హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దొకటి, అతణ్ణి పొడిచి పారిపోయింది. నాగరాజు కిందపడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లొంచి బయిటికి వచ్చింది. ఆమె నాగరాజును చూసి "అయ్యో ఏం జరిగింది? చేతినుంచి రక్తం కారుతున్నది, లోపలికి రా" అని ఆందోళనపడుతూ వచ్చి, గాయపడిన నాగరాజు చేయి పట్టుకున్నది.

"మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందులోనుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు" అన్నాడు నాగరాజు. ముసలావిడ నాగరాజును ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, "సంధ్యా, చెంబుతో నీళ్ళు పట్టుకురా" అని గట్టిగా కేకపెట్టింది. గది కిటికీవద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది. ఆమె ముఖకవళికల్లో జాలి, ఆదుర్దాలాంటి లక్షణాలే లేవు. తీరా తల్లి కేక వేసాక ఆమె కిటికీ దగ్గరనుంచి కదలి, కొంచెం సేపట్లో నీళ్ళ చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది. ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్ళతో, నాగరాజు గాయం కడిగింది. ఆ తరవాత పసుపూ, శుభ్రమైన గుడ్డా తెమ్మని చెప్పింది.
సంధ్య పసుపూ, గుడ్డా తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, "ఇప్పుడు చెప్పు బాబూ! నువు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి?" అని అడిగింది.వెంటనే నాగరాజు " మా మేనమామ కూతురితో నా పెళ్ళి జరగబోతున్నది. మీరూ, సంధ్య తప్పకుండా రావాలి" అని చెప్పి ఇంటికి వచ్చేశాడుబేతాళుడు యీ కథ చెప్పి "రాజా నాకొక సందేహం! నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆఖరిక్షణంలొ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగులుతుంది" అన్నాడు. 
దానికి విక్రమార్కుడు "నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ప్రతిమనిషికీ కనీసమైన కొన్ని మంచి లక్షణాలుండాలి. అవి లోపించినపుడు, ఇతర అర్హతలు ఎన్ని వున్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికుండవలసిన కనీస లక్షణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి లక్షణాలు తప్పకుండా వుండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదు. సంధ్య నాగరాజు గాయాన్నీ, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏ మాత్రం చలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని  యీ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాలరాశిని కాక, కనీసార్హతలయిన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతురిని పెళ్ళాడడానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు" అన్నాడు..రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

జిత్తులమారి తోడేలు

అనగనగా ఒక అడవి ఉంది.  ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది.  అది బాగా జిత్తులమారిది.  అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది.  పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి.  అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు.  తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి.  “ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది.  ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది.  ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది.  ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు.  నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం” అని అంది.  ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది.  ఈ తోడేలు చాలా జిత్తులమారింది.  ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది.  దీని మాటలు అసలు నమ్మకూడదు.  ఇది నన్ను కూడా మోసం చేస్తుంది.  అందుకని దీని వలలో పడకూడదు.  కాని పైకి ఇలా అంది “నేను నమ్మను.  నీది బాగా చెడు బుద్ది.  చాలా జంతువులను మోసం చేశావు.  అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు” అంది.
 అది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, “మామా! నేను ఇపుడు చాలా మారాను.  అసలు మాంసాహారము ముట్టడం లేదు.  నేను శాకాహారమునే తీసుకుంటున్నాను.  నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను.  నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు.  నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు.  నన్ను నమ్ము.  నువ్వు ఎలా చెబితే అలా వుంటాను.  అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు.  మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను.  అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును.  ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది.  ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది.  “నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను”.
అందుకే తోడేలు “నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను.  మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం.  కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి.  ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది.  ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది.  ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది.  వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.
 ఒకరోజు తోడేలు ఒంటెతో “మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది.  నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి,  చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!” అని అంది. ఒంటె ఒప్పుకుంది.  తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది.  ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది.  ఒంటెకు నోరు ఊరింది.  చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి.  మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది.  ఒంటెకు ఉత్సాహంగా ఉంది.  దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి “నీవు నా వీపు మీద కూర్చో”అంది.  తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది.  రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి.  చెఱకు తోటలోకి నడిచినాయి.
 ఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి “మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది.  నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు”అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు.  ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది.  తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది.  తోట యజమానికి వినపడేలా అరిచింది.  ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.
 తోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు.  చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు.  అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు.  కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది.  వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది.  అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది.  “మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు.  నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు.  ఇంటికి చేరగానే మందు రాస్తాను పద” అంది.  ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది.  దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది.

ఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది.  తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది.  ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె,  నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది.  నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. “అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో” అంది.  తోడేలుకు అప్పుడు అర్దమైంది.  దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది.  ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది.

ఉత్తమజ్ఞానం

పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.

తిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.

రైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.

ఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు.

ఎద్దు పాలు

ఓ సారి అక్బర్ చక్రవర్తి- బీర్బల్‌ను ‘‘నాకొక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి’’అని అడిగాడు. చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా వున్నా బీర్బల్ పైకి ఏమీ అనకుండా, ‘‘అలాగే సంపాదిస్తా ప్రభూ. కానీ నాకొక వారం రోజులు సమయమివ్వండి’’అని అడిగాడు. అలాగే  అన్నాడు అక్బర్.సాయంత్రం అయ్యాక ఇంటికెళ్ళాడు బీర్బల్. చక్రవర్తిగారు ఎద్దు పాలు తెమ్మని వారం రోజుల గడువుయిచ్చారు. కానీ అది అసాధ్యమైన పని. ఏం చెయ్యాలా?’ అని నిర్వేదంలో పడిపోయాడు.

అతని భార్య అది గమనించి, ‘‘ఏం జరిగింది?’’అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతయింది. ‘‘అదేమంత అసాధ్యం కాదు. ఏం చెయ్యాలో నేను చెబుతా, కానీ మీరు ఆరురోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు’’ అందామె. ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం వున్న బీర్బల్ ‘‘అలాగే’’అని ఇంటి పట్టునే వుండిపోయాడు. అయిదురోజులు గడిచాయి. ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డలమోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే వున్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డనీ ఉతకటం మొదలుపెట్టింది.

ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడ మీది వరండాలోకి వెళ్ళి ‘ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా?’అని చూసాడు. అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు భటులను పంపించాడు. ‘‘ఏమ్మా.. యింత రాత్రి పూట బట్టలు ఉతుకుతున్నావెందుకు?-’’అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్. ‘‘ప్రభూ, ఆరురోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పనిమనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకునేసరికి చీకటి పడింది. అందుకే యింత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నా’’అని జవాబిచ్చిందామె వినయంగా.


 ‘‘ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం?’’అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా.ఆమె చిరునవ్వు నవ్వి, ‘‘ఇందులో ఆశ్చర్యపడేదేముంది? మీరు ఎద్దు పాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు?’’ అంది. ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల వూపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో, అలాగే ఎద్దుకూడా పాలను యివ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్‌ను తాను అసాధ్యమైన కార్యం చెయ్యమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి, తెలివి తేటలకు మెచ్చుకున్న అక్బర్- ఆమెకు అనేక విలువయిన కానుకలిచ్చి పంపించాడు.

రెండు గాడిదల బరువు

ఒకరోజు ఉదయాన అక్బర్ యువరాజు సలీం మరియు బీర్బల్‌తో కలిసి వాహ్యాళికి వెళ్లాడు. అలా వారు నది ఒడ్డుకు వచ్చారు. అది ఎండాకాలం కావడంతో ఒక చెట్టునీడన కూర్చున్నారు.



కొద్దిసేపయ్యాక అక్బర్, ‘నదిలో స్నానం చేద్దామా?’ అన్నాడు. బీర్బల్ నీళ్లలో చెయ్యిపెట్టి చూసి, ‘అమ్మో, చాలా చల్లగా ఉన్నాయి. నేను మాత్రం చెయ్యను ప్రభూ’ అన్నాడు. అక్బర్, ‘సరే మంచిది. సలీం, నేనూ స్నానం చేస్తాము. నువ్వు ఇక్కడే ఉండి మా దుస్తులు పట్టుకో’’ అన్నాడు.




అలా అని అక్బర్, సలీం తమ తమ దుస్తులు విప్పి బీర్బల్‌కు ఇచ్చి నదిలో దిగి స్నానం చెయ్యసాగారు. అక్బర్, సలీంతో ‘‘బీర్బల్ ఒక మూర్ఖుడు. ఎండలో నిల్చుని మన బట్టలు మోస్తున్నాడు. నా కంటికి చాకలివాని గాడిదలా కనిపిస్తున్నాడు. 



ఇప్పుడొక తమాషా చేస్తా చూడు’’ అని‘‘ఏయ్! బీర్బల్, నువ్వొక గాడిద బరువు మోస్తున్నావు’’ అన్నాడు వ్యంగ్యంగా వెంటనే బీర్బల్, ‘‘కాదు ప్రభూ, రెండు గాడిదల బరువు మోస్తున్నా’’ అన్నాడు. అక్బర్ ముఖం మాడిపోయిoది

పరమ గయ్యాళి భార్య

అక్బర్ చక్రవర్తి భార్యలలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద అక్బర్‌కు చాలా ఫిర్యాదులు అందాయి.ఒకనాడైతే ఆమె అక్బర్‌తోనే చాలా మొరటుగా మాట్లాడింది. దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ‘‘నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో’’ అని ఆజ్ఞాపించాడు. ఆవేశంలో ఏదో అంది కానీ, ఆయన వెళ్ళిపొమ్మనే సరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది. ‘‘నా మాటలకు, చేతలకు సిగ్గు పడుతున్నా. దయచేసి నన్ను క్షమించి మా పుట్టింటికి పంపొద్దు’’ అని వేడుకుందామె.


అక్బర్‌కు కూడా జాలి కలిగింది. కానీ, ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే, ‘‘నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నిటికంటే ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళొచ్చు’’ అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనని క్షమించాడని తనకి అర్థమైంది. కానీ, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలనుకుంది. కానీ, ఆమె అతణ్ణి కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకుని అడుగగలదు? ఏది ఏమైనప్పటికీ ఆమె అతనికి కబురు పంపించగానే వచ్చాడు.



‘‘బీర్బల్! నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి. కానీ, నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నా’’ అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. ‘‘బేగం సాహెబా! గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి’’ అన్నాడు బీర్బల్ సహృదయంతో. ఆమె జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరించింది. బీర్బల్ అంతా విని కొంచెం సేపు ఆలోచించి ‘‘....ఇలా చేయండి’’ అని ఆమెకు గుసగుసగా చెప్పాడు. ఆ బేగం ఆ సలహాతో ఎంతో సంతోషించింది. తర్వాత ఆమె ఆ సాయంకాలం ‘తాను ఈ రాత్రికే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిథ్యం స్వీకరించమని’ అక్బర్‌కు కబురు పంపింది.

ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్. ‘‘నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. దయచేసి తాగండి’’ అని అడిగింది బేగమ్. బేగమ్ తన ఆజ ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్ ఆమె ఇచ్చిన షర్బత్ తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లై, మత్తుగా నిద్రపోయాడు.



అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న బేగమ్ నిద్రపోతున్న అక్బర్‌నూ పల్లకీలోకి చేర్చింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చొని పుట్టింటికి ప్రయాణమైంది. మరునాడు పొద్దున మెలకువ వచ్చిన అక్బర్‌కు పరిసరాలన్నీ కొత్తగా కనిపించటంతో ‘‘ఏంటిది? నేను ఎక్కడున్నాను?’’ అన్నాడు ఆశ్చర్యంగా. అతణ్ణి కనిపెట్టుకుని ఉన్న బేగం ‘‘మందిరంలోనే ఉన్నారు ప్రభూ!’’ అంది. ‘‘కానీ, ఇది మా మందిరం కాదే?’’ అన్నాడు అక్బర్ సందేహంగా కిటికీలోంచి బయటికి చూస్తూ. ‘‘ప్రభూ! మీరు నన్ను మా పుట్టింటికి నాకత్యంత ప్రీతిపావూతమైన దాన్ని తీసుకుని పొమ్మన్నారు కదా. నా కత్యంతం ఇష్టమైంది మీరే కాబట్టి, మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను’’ అంది. ఆ మాటలకు ఆయన కోపం పోయింది.బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవరూ ఇచ్చి ఉండరని గ్రహించిన ఆయన నవ్వుకున్నాడు.

ఏ వృత్తీ చెడ్డది కాదు

అక్బర్‌కు అనేకమంది మంత్రులు ఉన్నారు. వారిలో ముల్లా దో పైజా అనే మంత్రి ఒకడు. ఒకరోజు అందరి ముందు బీర్బల్‌ను అవమానించాలని నిర్ణయించు కున్నాడు. ఆ రోజు వారిమధ్య సంభాషణ ఇలా జరిగింది.
'బీర్బల్‌ మీరు మంత్రిగాకముందు ఏం చేసేవారు? వ్యవసాయం, మా తండ్రి కూడా రైతే ! అయితే ఆయనెలా మరణించాడు? చలికాలంలో పొలం వెళ్లి అక్కడే మరణించారు. మరి మీ తాత? ఆయనా పొలంలోనే మరణించారు. నీరుందా లేదా అని చూస్తూ కాలుజారి బావిలో పడ్డారు. అందుకేనయ్యా నే చెబుతా వ్యవసాయం చాలా చెడ్డది.
అయితే ముల్లాజీ మీ కుటుంబ సాంప్రదాయ వృత్తేమిటి? మాది తరతరాలుగా సైనికుల కుటుంబం. అలాగా! అయితే మీ తండ్రి ఎలా మరణించారు? ఆయనో సైనికుడు. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. మరి మీతాత? ఆయనా యుద్ధంలోనే మరణించారు. అందుకే నేను చెబుతున్నా సైనిక జీవితం మీ కుటుంబానికి చెడ్డది. కనుక వేరే వృత్తి చూసుకోవటం మంచిది అన్నాడు బీర్బల్‌.
అప్పుడు ఏ వృత్తీ చెడ్డది కాదని ముల్లాకు అర్ధమైంది..

దొంగకు రామలింగడు చేసిన మోసం

తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.

ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...

"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు" అని అన్నాడు. దీనికి ఆమె "ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను" అంది.

"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను" అన్నాడు రామలింగడు. "ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.

జరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.


ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... "మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు.

తెనాలి రామలింగడి కథలు

ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.



పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. 

అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. 


 మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు.

పేదరాశి పెద్దమ్మ కధ

అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉండేది. ఆ ఈగ  ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందట. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి "పెద్దమ్మా పెద్దమ్మా నా పేరేమిటి?మర్చిపోయాను" అని అడిగిండట. అప్పుడు పెద్దమ్మ "నీ పేరు నాకేం తెలుసు. నా కొడుకు నడుగు " అందట. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళి, "పేదరాసి పెద్దమ్మ కొడుకా నా పేరు నీకు తెలుసాఅన్నదట. అప్పుడతను "నీ పేరు నాకేం తెలుసునా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడట.
అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మపెద్దమ్మ కొడుకా,కొడుకు చేతిలో గొడ్దలా నా పేరేమిటి?"అనడిగిండట. అప్పుడు గొడ్డలి, "నీ పేరు నాకేం తెలుసునేను నరికే ఈ చెట్టునడుగు" అందట. ఈగ చెటు దగ్గరకు వెళ్ళి "పేదరాశి పెద్దమ్మాపెద్దమ్మ కొడుకాకొడుకు చేతిలో గొడ్డలాగొడ్దలి నరికే చెట్టానా పేరేమిటి?" అనడిగిండట.

అప్పుడా చెట్టు "నీ పేరు నాకేం తెలుసుచెట్టుకట్టేసిన గుర్రాన్నడుగు" అందట. అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మపెద్దమ్మ కొడుకాకొడుకు చేతిలో గొడ్డలాగొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమా నా పేరేమిటో తెలుసా?" అనడిగిందట. అప్పుడా గుర్రం " నీ పేరు నాకేం తెలుసునా పొట్టలో ఉన్న పిల్లనడుగు" అందట. అప్పుడు ఈగ, "పేదరాశి పెద్దమ్మపెద్దమ్మ కొడుకాకొడుకు చేతిలో గొడ్డలాగొడ్డలి నరికే చెట్టా,చెట్టుకట్టేసిన గుర్రమాగుర్రం పొట్తలోని పిల్లా నా పేరేమిటో తెలుసా?" అనిఅడిగిండట. అప్పుడు గుర్రం పొట్టలోంచి గుర్రపిల్ల "ఇహిహి , నీ పేరు ఈగ కాదా అని నవ్వింది. అప్పుడు పేరు గుర్తొచ్చిన ఈగ సంతోషంగా ఎగిరిపోయిందట.

అమ్మ కథ

అనగనగా ఒక ఊళ్ళో సన్నగా ఉన్న ఒక అబ్బయి ఉండేవాడు. వాడిని అందరూ లొట్టాయి అని పిలిచేవారుట. వాడికి ఆ పిలుపు నచ్చేది కాదట. ఎవరన్నా అలా పిలిస్తే బోలెడు కోపం వచ్చేసేదట. ఒకరోజు నడుచుకు వెళ్తూంటే దారి పక్కగా ఉనా తోటకూర మొక్కలు "రివ్వు రివ్వు లొట్టాయ్..రివ్వు రివ్వు లొట్టాయ్.." అని ఊగాయట. వాడికి కోపం వచ్చి ఆ తోటకూర మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి  కూర వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట.
ఆ తోటకూర ఉడుకుతూ ఉడుకుతూ "కుతకుత లొట్టాయ్..కుతకుత లొట్టాయ్..."అందట. వాడికి ఇంకా కోపం వచ్చి కూరoతా తీసుకెళ్ళి పెరట్లో పారబోసాడుట. ఆ  తోటకూర  తిన్న ఆవు పాలు ఇస్తూ "చుయ్ చుయ్ లొట్టాయ్..చుయ్ చుయ్ లొట్టాయ్..." అందట. అప్పుడు లొట్టాయ్ కి ఇంకా కోపం వచ్చి ఆ ఆవును చంపివేసి చెప్పులు కుట్టించుకున్నాడట. నడుస్తూంటే ఆ చెప్పులు కూడా "కిర్రు కిర్రు లొట్టాయ్..కిర్రు కిర్రు లొట్టాయ్ .." అని అనటం మొదలెట్టాయిట. అప్పుడు వాడు  ఆ చెప్పులని దూరంగా విసిరేసాడట.

ఆ చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి "భౌ భౌ లొట్టయ్..భౌ భౌ లొట్టాయ్.." అని అరవటం మొదలెట్టిండట. ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేసాడట. బావిలోంచి "బుడుగు బుడుగు లొట్టాయ్..బుడుగు బుడుగు లొట్టాయ్.." అని శబ్దo రాసాగిందట. ఇక వాడు ఊరుకోలేక మితిమీరిన కోపంతో బావి లోకి దూకాడుట..."బుడుంగు లొట్టాయ్.." అని మునిగిపోయాడట.

యువరాజు అభిమన్యుడు

అనగనగా ఒక రాజు గారు వుండేవారు. ఆ రాజు గారికి పిల్లలు పుట్టలేదంట. దానితో తన తరవాత ఆ రాజ్యం ఎవరు పాలించాలా అని దిగులు పడుతూవుండేవారు. ఒక రోజు బాగా ఆలోచించి తన రాజ్యం లోని పిల్లలందరినీ ఒకచోటకి రమ్మని చాటింపు వేయించాడు. పిల్లలందరూ రాగానే వాళ్ళందరికీతలా కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక మాసం లోపు ఎవరి విత్తనాలయితే బాగామొలుస్తాయో వారిని యువరాజు గా చేస్తానని చెప్పాడు.

అదే రాజ్యం లో అభిమన్యుడు అని ఒక చిన్న పిల్లవాడు వుండేవాడు. అభిమన్యుడు చాలా అమాయకుడు, మంచివాడు. అభిమన్యుడు కూడా రాజు గారి దగ్గర విత్తనాలుతీసుకొని ఇంటికి వచ్చేసాడు.ఒక మాసం తర్వాత అందరు మళ్లీ రాజు గారి దగ్గరకు వెళ్లారు. అందరి దగ్గరమంచి మొక్కలు వున్నాయి. రాజు గారు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి వాళ్ళమొక్కలని చూస్తున్నారు. అలా వస్తూ చివరకు అభిమన్యుడు దగ్గరకి వచ్చిమొక్కను చూపించమన్నారు. కానీ అభిమన్యుడు తనకిచ్చిన విత్తనాలు మొక్కమొలవలేదని చెప్పాడు.

రాజు గారు సంతోషించి అందరితో "నేను ఇచ్చిన విత్తనాలకు అసలుమొక్కలు మొలవవు. కానీ అందరు రాజ్యం కోసం మొక్కలు తెచ్చారు.అభిమన్యుడు ఒక్కడే నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడు. కాబట్టి అభిమన్యుడు ఈరాజ్యానికి కాబోయే యువరాజు." అని చెప్పారు. అందరు తప్పు తెలుసుకొని అభిమన్యుడు ని యువరాజుగా అంగీకరించారు.

వ్యాపారి ధైర్యo

పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు. దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు. ఎండవేడిమికి ఇసుక కాలుతోంది. అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం. అందరూ దిగాలు పడ్డారు. అరికాళ్లు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతోంది. ఎడ్లయినా, ఒంటెలైనా నడవడం చాలా కష్టం. అందునా వాళ్ల దగ్గర తగినన్ని మంచినీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు. 

వ్యాపారి "నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్ధితుల్లో ఇలా వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేకుంటే సరుకులు, ఇంత శ్రమా వృధా అయిపోతుంది. వీళ్లని రక్షించే మార్గమేదైనా ఆలోచించాలి" అనుకున్నాడు.  కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. "నీరు లేకుండా ఏ మొక్కా ఎడారిలోనైనా పెరగదుగదా" అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసిగెత్తి నాయికుడిని తిట్టుకున్నారు. "ఇదంతా వృధాశ్రమ, సమయాన్ని వృధా చేస్తున్నాం!!" అన్నారు. కానీ వ్యాపారి మాత్రం "స్నేహితులారా, అలా నిరుత్సాహపడద్దు ప్రయత్నించండి. కాదంటే మనం, మన ఎడ్లు ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు" అన్నాడు. 

అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంట ఏర్పడింది. దానిపై వొంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, "ఆగిపోకు, అందరూ ఇబ్బంది పడతాం... ఇదుగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలకొట్టు" అని ఉత్సాహపరిచాడు.  ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు. అది పగిలింది. వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు. 



అక్కడి నుంచి వాళ్లంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. సుదూర ప్రాంతాట నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండతో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి వూట వుందన్నది తెలిసేలా చేశారు. వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు.

మృధుస్వభావురాలైన రాణి

ఇంద్రసేన భూపతి విశాలపురి రాజ్యానికి రాజు. అతడు ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేవాడు. వారికి కావలసినవన్నీ అడగకుండానే సమకూరుస్తూ ఉండేవాడు. అతని భార్య మాలినీదేవి. ఆమెకు తన భర్తంటే అపారమైన గౌరవం, భక్తి. కానీ ప్రజలు తప్పు చేసినప్పుడు రాజు విధించే దండనలు ఎంతో కఠినంగా ఉండేవి. అలా విధిస్తే ప్రజలు మరొకసారి తప్పుచేయరని రాజు ఆలోచన. మృధుస్వభావురాలైన రాణిమాత్రం ఈ విషయమై ఎంతో బాధపడుతూ ఉండేది. ఆమె గర్భవతి. ఆమె ఒకరోజు కొలువులో వున్నప్పుడు దొంగతనం చేసినందుకు బాలనేరస్థుల చేతులు, కాళ్లు నరికించి వేశాడు. ఆసంఘట నను కనులారా చూచిన ఆమె తట్టుకోలేకపోయింది. ఎంతో విచారంలో మునిగి, ఎవరితో నవ్ఞ్వతూ మాట్లాడకుండా ఏకాంతంగా జీవితం గడుపుతూ  ఉండేది.

 కొన్నినెలల తర్వాత ఒక ఆడపిల్లను ప్రసవించి మరణించింది. ఆమె మరణ వార్త విని రాజు ఎంతో కృంగిపోయాడు. ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచసాగాడు. ఆమె పేరు కళ్యాణి. ఆమె చిన్న విషయానికి కూడా ఎంతో బాధపడుతూ  ఉండేది. ఆమె పుట్టినప్పుడు ఏడిస్తే ఆమె పడుకొని ఉన్న పాన్పు మొత్తం తడిసిముద్దయిపోయేది. కొంచెం పెరిగినపుడు ఏడిస్తే ఆగది నిండిపోయేది. ఈవిధంగా ఆమె వయసు పెరిగేకొలది ఆమె కన్నీరు కాలువలుగా పారేది. ఆమె ఏడుపును ఆపడం ఎవరివల్లా సాధ్యం అయ్యేది కాదు. రాజుగారి సలహాదారులు, మంత్రులు, అందరూ కలిసి రాకుమారి వయసు పెరిగే కొలది ఆమె కన్నీటితో నగరం కొట్టుకుపోగలదనే భయంతో పరిష్కారమార్గం ఆలోచించారు. రాజుతో కలిసి చర్చించి ఎవరైతే రాకుమారి ఏడ్చినపుడు ఆమె దుఃఖాన్ని ఆపగలుగుతారో వారికి రాకుమారినిచ్చి వివాహం చేసి, రాజ్యాభిషేకం చేస్తామని దండోరా వేయించారు.
ప్రక్క రాజ్యంలో వ్ఞన్న వీరేంద్రవర్మ అనే యువకుడు ఈదండోరా విని, ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకో వడానికి బయలుదేరాడు. అతనికి పక్షుల భాష కూడా తెలుసు.  మార్గమధ్యలో ఒక వృద్ధుడు నడవలేక బాధపడు తుంటే తన భుజాలపై మెసుకొని నడచి అతని గమ్య స్థానానికి చేర్చాడు. ప్రతిఫలంగా ఆ వృద్ధుడు నాలుగువైపుల అద్దాలతో తయారు చేయబడిన ఒక పెట్టెను బహు కరించాడు. ఆచిన్న పెట్టెతో అతను విశాలపురి రాజ్యాన్ని చేరాడు. 

    పోటీ ప్రారంభమైంది. ఎంతోమంది ఎనోన్నకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. వీరేంద్రవర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో అక్కడ పంజరంలో ఉన్న పక్షులు తమ భాషలో ఈవిధంగా అనుకుంటున్నాయి ..'ఈ యువకుడు చాలా తెలివైనవాడు. ఈ అద్దాల పెట్టెను రాకుమారి కళ్లముందు ఉంచితే దానిమీద పడే ఎండకాంతి వల్ల రాకుమారి కళ్లు మూస్తుంది అని అనుకున్నాయి. వాటి మాటలను అర్థం చేసుకున్న యువకుడు ఆ విధంగానే చేశాడు. ఆకాంతి వల్ల రాకుమారి కళ్లు మూసేసింది. దాంతో ఏడుపు ఆగిపోయింది. అది చూసిన సభికులు, రాజుగారు అందరూ వీరేంద్రవర్మను ప్రశంసించారు, కల్యాణినిచ్చి వివాహం చేసి, పట్టాభిషిక్తుడ్ని చేశారు. వారిరువ్ఞరూ ఎంతో ఆనందంగా జీవితం గడిపారు.

తలతిక్క రాజు

అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు: "రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!"ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు.

ఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది.



అయితే సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరిపనులు వాళ్ళు చకచకా చేసుకోవటం మొదలుపెట్టారు! గురుశిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది.చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు గనక, వెళ్ళి ఏమైనా భోజన సామగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారిద్దరూ. చూస్తే ఆశ్చర్యం- అన్ని సామాన్లదీ ఒకే రేటు! ఒక్కోటీ ఒక్కో 'దుడ్డు'- అంతే. సోలెడు బియ్యమూ అంతే, డజను అరటి పళ్లూ అంతే. శిష్యుడు భోజన ప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది దుడ్లు కూడా ఖర్చవ్వలేదు మరి!

"ఇది పిచ్చివాళ్ల రాజ్యం నాయనా. ఇలాంటి చోట ఉండటం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా. పోదాం పద, ఇక్కడ ఉండకూడదు" అన్నారు గురువుగారు శిష్యుడితో, మెల్లగా. శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు. "ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం,ఇది! ఇక్కడే ఉండిపోదాం మనం" అన్నాడు వాడు. "ఇది ఎక్కువకాలం నడవదు నాయనా. అదీగాక వీళ్ళు నిన్ను -ఎప్పుడు- ఏం-చేస్తారో ఎవ్వరికీ‌-తెలీదు- నా మాట విని, నాతో వచ్చేయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం" అని నచ్చ చెప్ప చూశారు గురువుగారు. కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచిమాటలు తెలవెలబోయాయి. "ఏమైనా సరే! తను ఈ స్వర్గాన్ని వదిలి రాను" అన్నాడు శిష్యుడు. చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, "నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను" అని చెప్పి వెళ్ళారు.


శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజూ అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమరొట్టెలు- ఇట్లా ఏవిపడితే అవి మెక్కి, అచ్చోసిన ఆంబోతు మాదిరి- గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు.
ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జొరబడ్డాడు. మామూలుగా కాదు; వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి, ఆ కన్నంలోంచి లోనికి దూరాడు. లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మూటగట్టుకొని, ఇక బయటపడదామనుకునేలోపల, వాడు కన్నం వేసిన గోడ నిలువునా కూలింది! వాడు తను త్రవ్విన గోడ క్రింద తానే పడి చచ్చిపోయాడు.


అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు-"ప్రభూ! మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతనిమీద కూలి అతని ప్రాణాల్ని నిలువునా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారే. అతను గోడను బలంగా, దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు. తమరు ధర్మమూర్తులు- దోషిని కఠినంగా శిక్షించి, మా అన్న కుటుంబానికి న్యాయం చెయ్యాలి" అని.రాజుగారు వాడికి "న్యాయమే గెలుస్తుంది" అని భరోసా ఇచ్చి, వ్యాపారిని పిలువనంపాడు.


వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలైంది: "నీ పేరు?" "వరహాల శెట్టి, ప్రభూ!" "చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?" "మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా! వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. గోడ బలహీనంగా ఉంది. అది వాడి మీదనే కూలింది." "దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది. దీనికి పూర్తి బాధ్యత దోషిదే. మేం నీకు తగిన దండన విధిస్తాం, వరహాల శెట్టీ!" "కానీ మహారాజా.." అన్నాడు వరహాల శెట్టి, "కథ ఇలా అడ్డం తిరిగిందేమి?" అని ఆశ్చర్యపోతూ. "కానీ-గీనీ ఏమీ లేదు. నేరం చేసినవాడికి శిక్ష పడవలసిందే" అన్నాడు రాజు, గంభీరంగా.


తన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తర్వాత వరహాల శెట్టి మెదడు చురుకుగా పని చేసింది. "ఒక్క క్షణం ఆగండి మహారాజా! నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు. గోడను కట్టిన మేస్త్రీదే అసలు తప్పు. అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది; అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు అతన్ని శిక్షించాలి, మహా ప్రభూ!" అన్నాడు శెట్టి."గోడను కట్టిన మేస్త్రీ ఎవరు?" అడిగారు రాజుగారు. "ప్రభూ!‌ ఆ యింటిని మా నాన్నగారి హయాములో కట్టారు. అప్పుడు మా యింటి గోడ కట్టిన మేస్త్రీ ఇప్పుడు ముసలివాడయ్యాడు. నాకు బాగా తెలుసు అతను. ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు" అన్నాడు వరహాల శెట్టి, ఊపిరి పీల్చుకుంటూ.


మేస్త్రీని పిలుచుకురమ్మని సేవకులను పంపారు రాజుగారు, వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ. కొద్ది సేపటికి మేస్త్రీ వచ్చి నిలబడ్డాడు."ఏమయ్యా, వరహాల శెట్టి తండ్రి బ్రతికున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు- నిజమేనా?" "అవును ప్రభూ!""ఇట్లాంటి గోడనా, కట్టేది? అది ఒక పేద దొంగ మీద కూలి, వాడి ప్రాణాలనే హరించింది. నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువైంది గనక, మేం నీకు మరణ దండన విధించాలి ఇప్పుడు!"రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రీ తెలివి మేల్కొన్నది. అతను గట్టిగా వాదించాడు-"ప్రభూ! నన్ను శిక్షించేముందు నా మొరను ఒకసారి ఆలకించండి. నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం. అది బాగా కట్టలేదన్నదీ వాస్తవమే. అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసు మనసులో‌లేదు. నాకు ఇంకా గుర్తున్నది- నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి, తన కాలి అందెల్ని, చేతి గాజుల్నీ గలగలలాడించుకుంటూ అటూ-ఇటూ తిరుగుతూనే ఉన్నది, రోజంతా. దాంతో‌నా మనసు వశం తప్పింది. నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు తెలుసు, నాకు" అన్నాడు మేస్త్రీ.


"ఊఁ, నాకు తెలుసు.. కథ లోతు పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీలు లేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకు రండి- ఆమె ఎక్కడున్నా సరే" అన్నారు రాజుగారు.ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది- ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది. "పాపం, ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు, నువ్వు గాజులు, అందెలు గలగలలాడించుకుంటూ వీధిలో అటూ-ఇటూ తిరిగావా- నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒకరోజున?" అడిగారు రాజుగారు."నిజమే మహారాజా, తిరిగాను" ఒప్పుకున్నదామె."అయితే నువ్వే దోషివన్నమాట. గాజులు, అందెలు గలగలలాడిం, నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బ తీసావు. దాంతో వాడు కట్టే గోడ పాడైంది. అది ఒక పేదవాడి మీద కూలి, వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలైంది- నీకు శిక్ష తప్పదు."


ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది- "మహారాజా! ఆగండి. నేను ఆరోజున అట్లా రోడ్డు మీద అటూ ఇటూ ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆ కంసాలి చేసిన పని! నేనూ అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులిచ్చాను. అతను వాటిని 'ఇప్పుడిస్తాను-ఇప్పుడిస్తాను' అంటూ ఆ రోజంతా త్రిప్పుతూనే ఉన్నాడు. అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజనుసార్లు అటూ ఇటూ తిరిగి ఉంటాను. అది నా తప్పు కాదు ప్రభూ! అదంతా ఆ నీచుడు, కంసాలి చేసిన తప్పు!" అని. "పాపం, నిజంగానే ఈమెది ఏ తప్పూలేదు" అనుకున్నాడు రాజుగారు, అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ. "అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు- పోండి! పోయి ఆ కంసాలిని ఇటు ఈడ్చుకొని రండి!" అని సైనికులను ఆజ్ఞాపించాడు.సైనికులు పరుగున వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే,అతను కూడా తన కథ వినిపించాడు.
"ప్రభూ! నేనొక పేద కంసాలిని. ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు తిప్పించుకున్న మాట నిజమే. అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పటానికి ఒక కారణం ఉంది- నామీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ ధనిక వర్తకుడి ఇంట్లో పెండ్లి ఉండింది, ఆ సమయంలో. ఆయన తన నగల్నే ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు. ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు గదా! ఆయన వల్లనే, నేను ఈమెకు నగల్ని అందివ్వటంలో జాప్యం అయ్యింది.

""ఎవడా ధనిక వర్తకుడు?! ధనబలంతో, తన నగల్ని ముందు చేయించుకొని, ఈ పేద నర్తకిని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరకు వాడెవ్వడు? వాడి మూలంగానే మేస్త్రీ మనసు వశం తప్పింది. అతని వల్లనే గోడ సరిగ్గా కట్టబడలేదు. అతని వల్లనే ఆ గోడ విరిగి, ఒక మామూలు దొంగమీదికి విరిగి పడి, వాడి ప్రాణం తీసింది. దీనికంతకూ కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవ్వడు?" అని అడిగాడు రాజుగారు, ఆవేశంగా. 
"ఆ పని చేసింది ఈ వరహాల శెట్టిగారి తండ్రే ప్రభూ!" అన్నాడు కంసాలి చల్లగా. "ఓహో! న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట! పిలిపించండి, వాడిని!" ఆజ్ఞాపించారు రాజుగారు. "మానాన్నగారిని ఇప్పుడు పిలిపించలేము ప్రభూ! అయన చనిపోయి చాలా కాలమే అయ్యింది" అన్నాడు వరహాల శెట్టి. "అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు" అన్నారు రాజుగారు, మంత్రిని సంప్రతించి."నీ తండ్రి హంతకుడు అని రుజువైంది. అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అతను చనిపోయాడంటున్నావు. నిజమే కావచ్చు. అయినా, అతని బదులు వేరే ఎవరో ఒకరు శిక్షను అనుభవించకపోతే ఎలాగ?హంతకుడైన నీ తండ్రినుండి నీకు ఆస్తిపాస్తులన్నీ సంక్రమించాయి- వాటితోబాటు అతని నేరాలు కూడానూ! నువ్వు ఆ నేరాలనుండి ఊరికే తప్పించుకొని పోలేవు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను- ఈ ఘోరనేరం వెనక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయిఉంటావని. నా ఊహ నిజమైంది- నీకిక జీవించే అర్హత లేదు. మేం నీకు మరణ దండన విధిస్తున్నాం!!"

వర్తకుడిని వధించటం కోసం కొత్త వధ్యశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు. ఒకవైపున కటికవాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధంచేసి, శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుకుంటుండగా, మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది- "ఈ శిల పెద్దది. దీని నిడివి ఎక్కువ. చూడగా వ్యాపారి మెడ సన్నం! ఇంత సన్నగా ఉండే మెడ, వధ్యశిలలో సరిగ్గా ఇమడదు గదా, మరెట్లా?" అని. మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు.


"తను ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు?" అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది. "మరేం చేద్దాం?" అని అయన మంత్రినే అడిగారు, మంత్రిగారి ముందుచూపును ప్రశంసిస్తూ. అయితే అదే సమయంలో‌ఆయనకు ఒక ఉపాయం తోచింది- "ఇతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టం ఏముంది? శిక్షను ఎలాగైనా అమలు చేయవలసిందే. వీడి బదులు, లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది!"అని. 

మంత్రిగారికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే సైనికులు ఊరంతా వెతకటం మొదలుపెట్టారు- వధ్యశిలలో పట్టేంత పెద్ద మెడ ఉన్న, లావుపాటి మనుషులకోసం. అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటూ ఇటూ తిరుగుతున్న శిష్యుడిమీద పడింది- అతను నెలల తరబడి అరటిపళ్లు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు తినీ తినీ‌ బాగా క్రొవ్వు పట్టి ఉన్నాడు మరి! సైనికులు తన మీదికి దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు.


నేనేం తప్పు చేశాను? నేను నిరపరాధిని. సన్యాసిని!" అని మొత్తుకున్నాడతను."కావచ్చు- కానీ, వధ్య శిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకు రమ్మని రాజాజ్ఞ" అని, సైనికులు శిష్యుడిని శిరచ్ఛేదం కోసం తీసుకుపోయారు! అప్పటికి గానీ తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి. " 'ఇది పిచ్చోళ్ళ రాజ్యం. ఇలాంటి చోట ఉండటం ప్రమాదం' అని తనకి చిలక్కి చెప్పినట్లు చెప్పారే, అయినా తను వినలేదు. దీన్నే స్వర్గం అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో‌చూడు!" అని అతనికి ఏడుపు వచ్చింది."ఇక వేరే దారేదీ లేదు, దేవుడా! ఈ ఒక్కసారీ‌ అవకాశం ఇవ్వు. మరెప్పుడూ గురువుగారి మాటను జవదాటను" అని అతను మౌనంగా ప్రార్థన మొదలుపెట్టుకున్నాడు.

దేవుడు ఆ ప్రార్థనను నేరుగా గురువుగారికే చేర్చాడు- అద్భుత శక్తులున్న ఆయన, తక్షణం శిష్యుడిముందు ప్రత్యక్షమయ్యాడు. శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చీవాట్లు పెట్టి, ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు. ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి, ధైర్యంగా అడిగాడు- " రాజా! గురువు ఎక్కువా? శిష్యుడు ఎక్కువా?" అని.


"గురువే ఎక్కువ. సందేహం లేదు. అయినా నన్నెందుకు అడుగుతున్నారు?" అన్నారు రాజుగారు."అయితే నా శిష్యుడికంటే ముందు నాకు శిరచ్ఛేదం చెయ్యండి. నా తర్వాతగానీ వాడి తల తీసేందుకు వీలు లేదు" అన్నాడు గురువు.సంగతి అర్థమై శిష్యుడు అక్కడినుండే అరవటం మొదలుపెట్టాడు- "నేను ముందు! మీరు ముందు నన్ను కదా, ఇక్కడికి తెచ్చింది? నా మెడే కదా, వధ్యశిలలో పట్టేది? అందుకని ముందు నన్నే వధించాలి. ఆయన్ని కాదు. ఆయనకు చెప్పండి, ఇక్కడినుండి వెళ్ళిపొమ్మనండి ముందు!" అని. రాజుగారు, మంత్రిగారు నోళ్లప్పగించి చూస్తుండగానే గురు-శిష్యులమధ్య పోట్లాట మొదలైంది. "నేను ముందు!‌ నేను ముందు!" అని. రాజుగారికి, మంత్రిగారికీ వాళ్ల ఈ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.
రాజుగారు గురువుని అడిగారు- "మీరెందుకు, చనిపోవాలని తొందరపడుతున్నారు? వధ్యశిలకు సరిపోయేంత మెడ ఉన్నది గనక మేం అతనిని ఎంపిక చేసుకున్నాం" అని. "మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలూ అడక్కండి. ముందుగా నన్ను వధించాలి- అంతే" అన్నాడు గురువు, మొండిగా. "ఎందుకు? ఇందులో ఏదో రహస్యం ఉంది. మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా మీకు తెలిసినదానిని మాబోటి వాళ్ళకు వివరించటం మీ బాధ్యత. చెప్పండి" అన్నారు రాజుగారు. "నేను చెబితే మీరు నన్నే వధించాలి ముందు- మాట ఇస్తారా?" అడిగాడు గురువు.రాజుగారు సరేనన్న మీదట, ఆయన రాజును దూరంగా తీసుకెళ్లి, సేవకులెవ్వరికీ వినబడకుండా, గుసగుసగా చెప్పాడు. 


"మేమిద్దరమూ ఇప్పుడే, ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా, మీకు? మేమిద్దరమూ అనేక దేశాలు తిరిగాం. ఈ భూమిమీద నిజానికి మేం చూడని ప్రదేశమే లేదు- కానీ ఇంతవరకూ మాకు మీ రాజ్యంలాంటి రాజ్యంగాని, మీలాంటి రాజుగారు గానీ ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు మీ ముందున్న వధ్యశిల మామూలుది కాదు- సాక్షాత్తూ ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది. పైగా కొత్తది! దానిమీద ఇంతవరకూ‌ఎలాంటి నేరమూ మోపబడి లేదు! అలాంటి ఈ శిల మీద మొదట మరణించే వాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈ‌రాజ్యానికి రాజుగా పునర్జన్మనొందుతాడు. దీనిమీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది. కొంతకాలంపాటు రాజుగాను, మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ మాటను నిలబెట్టుకోండి మహారాజా! మమ్మల్ని వధించండి! నేనుముందు! గుర్తుంచుకోండి!"


రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు. 'నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా?' అని ఆయనకు చింత పట్టుకున్నది. "ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకునేందుకు లేదు" అని, ఆయన వెంటనే శిష్యుడి శిక్షను వాయిదా వేసేశాడు. ఆపైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు-"వచ్చే జన్మలోకూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. వీళ్ల బదులు మనమే వధ్యశిలనెక్కితే ఎలా ఉంటుందంటావు, -వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది?" అని. మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది. "శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది. మనల్ని వధించేందుకు వాళ్ళకు చేతులు రావు. అందుకని, మనం ఈ‌ గురుశిష్యుల్నిద్దరినీ వదిలేసి, వాళ్ల మాదిరే బట్టలు వేసుకొని పోయి కూర్చుందాం. ఏమంటారు, ప్రభువులు?" అన్నాడు మంత్రి. 


ఇద్దరూ కూడ బలుక్కొని, తలారులను పిలిచి, "రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి. ముందుగా వచ్చిన వాడిని ముందు, తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి- తప్పు చేస్తే, జాగ్రత్త. మాకోసం ఎదురు చూడకండి" అని చెప్పేశారు. ఆపైన గురుశిష్యులిద్దర్నీ వదిలేసి, వాళ్ల స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి తెలీని తలార్లు పాపం, వాళ్ల పని వాళ్ళు కానిచ్చేసారు. తర్వాత చూస్తే ఏముంది? నేరస్తుల శరీరాలకు బదులు, తమ రాజు, మంత్రుల శరీరాలు కనబడ్డాయి!


ఇక రాజ్యం అంతా అల్లకల్లోలమైంది. పెద్దలంతా కూర్చొని "రాజ్యం నడిచేదెలాగ? కొత్తరాజు ఎవ్వరు? కొత్తమంత్రి ఎవ్వరు?" అని చర్చలు జరిపారు. చివరికి, ఎవ్వరికీ తెలీకుండా రాజ్యం దాటి పోతున్న గురుశిష్యులిద్దర్నీ పట్టుకొని, "మీరే మా రాజు, మంత్రీ" అన్నారు వాళ్లంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు గానీ, గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి, "పాత చట్టాలన్నిటినీ తొలగించచ్చు. పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయచ్చు" అని హామీ‌ ఇచ్చాక, ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆపైన రాజ్యంలో పగలు పగలూ, రాత్రి రాత్రీ అయిపోయాయి. కొంత కాలానికి ఆ రాజ్యానికీ, ఇతర రాజ్యాలకూ తేడా లేకుండా అయ్యింది!