Pages

Sunday, August 12, 2012

తెలివైన ఎలుగుబంట్లు

ఒక వేటగాడు వేటకోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలా దూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు, దానిమీద కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ఒకేసారి ప్రయాణించలేరు.

వంతెనకు ఒకపక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు అటుగా వచ్చే ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.

కాస్సేపు గడిచాక నేరేడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతడికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని ఊహించాడు.

వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కింద కూర్చుని చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి.

వేటగాడు ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని గ్రహించాడు.

దేశ సేవ

శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.

శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.

నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి.

దేశభక్తి

మన ప్రధమ స్వాతంత్రోద్యమ రోజులు. 1857 వ సంవత్సరంలో మహారాష్ట్రుల పీష్వా నానా సాహెబ్ స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకత్వం వహించిన ఆయనను పట్టి ఇచ్చిన వారికి బ్రిటీషు ప్రభుత్వం అర్థలక్షరూపాయలు బహుమతి ప్రకటించింది. నానాసాహెబ్ ఎవరికీ అందకుండా రహస్యంగా తిరుగుతుండేవారు. ఓ రోజు ఆయనకు ఆకలిగా ఉంది. ఆయనకు తెలిసిన దేశభక్తురాలి ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్‌కు ఆమె భోజనం పెట్టింది. నానాసాహెబ్ అంటే ఆమెకు చాలా గౌరవం. ఆ సమయంలో తలుపు చప్పుడయింది. ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా ఆమె భర్త. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్. భయంతో దిక్కులు చూస్తున్న భార్యతో మనింటివైపు నానాసాహెబ్ వచ్చినట్లు సూచన అందింది. నానాసాహెబ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? అరెస్టు చేసి ప్రభుత్వానికి అప్పజెబితే యాభైవేలు మన స్వంతమవుతాయి. అంటూ ఇంటిలోనికి నడవబోయాడు ఇన్‌స్పెక్టర్. ఆమె భయంతో వణికిపోతూ కోపంగా భర్త వైపు చూసి మీరు నానాసాహెబ్ గారిని పట్టిస్తారా? దేశం కోసం పోరాడుతున్న ఆయనను పట్టిస్తే మీకు పాపం చుట్టుకుంటుంది. ఇదే దేశ ద్రోహం ఆ పాపపు డబ్బు మనకొద్దు అంది ఆ దేశభక్తురాలు.

పిచ్చిదానా! యాభైవేలరూపాయలు ఊరకే వస్తూంటే వదులుకోవటం మూర్ఖత్వం. నానాసాహెబ్‌ను అరెస్ట్ చేసి ఆ బహుమతి డబ్బు సంపాదిస్తా అన్నాడు. భార్యా, భర్తల మధ్య వాగ్వివాదము మొదలైంది. వీరి మాటలు వింటున్న నానాసాహెబ్ తాను దాగివున్న గది నుండి బయటకి వచ్చాడు. నా కారణంగా మీ కుటుంబంలో కలతలు రావటం నాకిష్టంలేదు. చేతనైతే అరెస్ట్ చేయండి అన్నాడు. తనకందిన సూచన ప్రకారం నానాసాహెబ్ తన ఇంట్లోనే దాగి వుండటం చూసి ఆ ఇన్‌స్పెక్టర్ కు చాలా సంతోషం కలిగింది. వెంటనే పిస్తోలు గురిపెట్టి హేండ్సప్ అన్నాడు. ఆయన మహనీయుడు, దేశభక్తుడు, ఆయన్ని అరెస్ట్ చేస్తావా? అంటూ ఆమె భర్త మీదకు వచ్చింది.

ఆమెను దూరంగా త్రోయడంతో పిస్తోలు జారి క్రిందపడింది. వెంటనే ఆ వీరనారీమణి పిస్తోలుతో తన చాతిలో పేల్చుకుంది. మీకు యాభైవేల రూపాయల పాపపు సొమ్ము కావాలి. ఆ పాపపు సొమ్ములో నేను భాగం పంచుకోలేను. నీలాంటి దేశద్రోహితో జీవించలేను. అంటూ ఆమె ప్రాణం వదిలింది. అమ్మా! సోదరీ! ఏంటమ్మా ఇలా నీ ప్రాణాలు తీసుకున్నావు. అంటూ పరుగున వచ్చాడు నానాసాహెబ్. ఆమెరక్తంతో తిలకం దిద్దుకున్నాడు. నన్ను అరెస్టుచేసి, నీ వృత్తి ధర్మాన్ని నిర్వహించు ఇన్‌స్పెక్టర్ అన్నారు నానాసాహెబ్. నానాజీ! నేను ద్రోహిని. నన్ను క్షమించండి. నా కర్తవ్యం ఏమిటో నాకు బోధపడింది. నా జీవితాన్ని ఇప్పుడు దేశం కోసం ధారపోస్తాను. మీరు ఇక్కడి నుండి వెంటనే పారిపోండి. ఈ భారతభూమి మీ కోసం ఎదురుచూస్తోంది. అంటూ ఆయనను పంపించివేసాడు ఇన్‌స్పెక్టర్. ఇలా ఎందరో దేశభక్తుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం.

దేవుడికి ఉత్తరం

ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బోజనానికి మిగతా అవసరాలకు ఇరుగుపొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది.

ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 'నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని' ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు.

దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. 'దేవుడా! నాకెవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నామీద జాలి చూపి పుస్తకాలు కొనుకునేందుకు 100 రూపాయలు పంపించు' ... చిరునామా రాయాల్సిన చోటులో 'దేవుడు, స్వర్గం' అని రాసి పోస్ట్‌బాక్స్‌లో ఆ ఉత్తరం వేశాడు.

పోస్ట్‌మాన్‌ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీసుకు తీసుకెళ్ళాడు. అక్కడి పోస్టుక్లర్కు ఆ ఉత్తరంపైన ఉన్న అడ్రసు చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్టుమాస్టర్‌కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్టుమాస్టర్‌ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయలు మనియార్డరు పంపించాడు.

నాలుగురోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో... దేవుడా! నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రుపాయలు పంపించి ఉంటావు. కాని పోస్టుమాన్‌ అందులోంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు పరవాలేదు. అది నీ తప్పు కాదుగా... మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానూ అని ఉంది. అది చదివిన పో్స్టుమాస్టర్‌ సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు.

దురాశ దుఖమునకు చేటు

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ గర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి "ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ అడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది" అని చెప్పాడు.ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండలవైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలోనుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగిరిలో ఒకడు తనకు కావలసింది తీసుకుని దానో తృప్తిపడి వెనకకు మరలిపోయాడు. మిగిలిన ముగ్గురూ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ త్రవ్విచూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరూ ఇంకా ఉత్తమోత్తమమైనది దొరుకుతుందేమోనని బయల్దేరి నడక ప్రారంభించారు.

మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంతదూరం వచ్చేటప్పటికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిర తిరుగుతూవుంటే అక్కడ ఆగి "ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతూంది?: అని అడిగాడు. ఆ పెద్ద మనిషి "మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో. తరువాత కథ చెబుతాను" అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. "నేనూ నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకూ వచ్చాను. నేనూ ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తిపడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూంది. నీలాగే నేనూ ఈ చక్రంలో తల దూర్చాను. ఇటివంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.

దశరధ రాముడు

పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాజయ్యకు ఇప్పుడు ఒక తోడు దొరికింది. ఓ రోజున ఊరి శివారులో ఓ బుల్లి కుక్కపిల్ల తోక ఊపుకుంటూ అతడిని వెంబడించింది. అదిలిస్తే ఆగిపొతుంది. నడుస్తుంటే అతడిని వెంబడిస్తుంది. "నేను వెతుకుతున్నది నిన్నే" అన్నట్లుగా చూస్తున్నది. అదిలించడం మానేసి, మిన్నకుండిపోయాడు రాజయ్య. అతడిని వదిలిపోలేదు అది. చూపు మరల్చుకోకుండా గునగునమంటూ ఇంటి దాకా వచ్చేసింది. ఆ క్షణం నుండి ఆ ఇల్లే దానికి ఆవాసమైపోయింది. అతను, ఆ కుక్కపిల్లా - ఇద్దరే ఆ ఇంట్లో!

వయసు పైబడిన రాజయ్య ఓపిగ్గా తన పనులు తానే చేసుకుంటాడు. నెల నెలా వెళ్లి పింఛను తీసుకుంటాడు. అవసరమైనప్పుడు బజారుకు వెళ్లి వస్తాడు. చారెడు బియ్యం ఉడుకేసుకుంటే రోజు గడిచిపోతుంది. పట్టెడన్నం తాను తిని, మిగిలింది కుక్కకు పెడతాడు. రాజయ్య కన్ను అయితే, తాను కంటిరెప్ప అన్నట్లుగా సందడి చేస్తుంటుంది కుక్కపిల్ల. అతను ఎక్కడుంటే, అదీ అక్కడే!

ఇంటికి వచ్చిన రోజునే దానికి "ఒరే దశరధ రాముడూ" అని పేరు పెట్టుకున్నాడు రాజయ్య. "ఒరే దశరధ రాముడూ!" అని రోజుకి ఎన్నిసార్లు పిలుచుకుంటాడో! దాని ఒళ్లు నిమురుతూ ఎన్ని మురిపాలు పోతాడో! కాలం గడుస్తున్నది. కుక్కపిల్ల పెద్దదైంది. రాజయ్యకు అదే తోడూ నీడా అయింది. అతను క్రమంగా కృశించి పోతున్నాడు. దశరధ రాముడి కళ్ళలో దిగులు గూడు కట్టుకుంటున్నది. పగలు రాత్రి అది అతడి కాళ్ల వద్దే పడి ఉంటోంది.

ఆఖరికి రాజయ్య కన్నుమూశాడు. కుక్కకు కన్నీళ్లు ఆగలేదు. దూరాభారం కదా, మర్నాటికి గానీ రాలేకపోయాడు కొడుకు 'దశరధ రామయ్య.' పన్నేండేళ్ల తరువాత మళ్లీ ఇదే రావడం! అతనితో బాటే అతని భార్య, పిల్లలు!

తల కొరివి పెట్టి తిరుగు ప్రయాణం కట్టాడు కొడుకు. కుక్క వీధిన పడింది. అది వీలు చూసుకుని రోజుకొకసారైనా శ్మశానానికి వెళుతుంది. రాజయ్యను పాతిపెట్టిన మట్టిదిబ్బ మీద కాసేపు మౌనంగా కూచుని లేచి వస్తుంటుంది. ఆ వీధిలోని వాళ్లు ఇప్పటికీ దాన్ని "దశరధ రాముడూ" అనే పిలుస్తుంటారు.

తోడేలు సాకు

ఒక తోడేలు పారుతున్న సెలయేటి ఎగువన నీరు తాగుతుండగా దిగువన కాళ్ళు కడుక్కుంటున్న గొర్రె పిల్లను చూసింది.

తోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది. అందుకోసం ఒక సాకు ఉంటే బావుంటుందని అనుకుంది.

గొర్రెపిల్లను చూస్తూ తోడేలు - "నేను ఈ సెలయేట్లో నీరు తాగుతుండగా నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం?" అని అంది.

తోడేలుకు గొర్రెపిల్ల బదులిస్తూ "నీవు ఉన్నచోటి నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి. అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను?" అంది.

తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది. గొర్రెపిల్లపై అరుస్తూ, "నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు" అంది.

తోడేలు మాటలకు "నేనింకా అప్పటికి పుట్టనే లేదు", అని ప్రశాంతంగా బదులిచ్చింది గొర్రెపిల్ల.

"కావచ్చు. అప్పుడు నీ తండ్రి కావచ్చు. అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది.

తోడేలు - ఒంటె

అనగా అనగా ఒక అడవి ఉంది. ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది. అది బాగా జిత్తులమారిది. అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది. పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి. అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు. తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి. "ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది. ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది. ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది. ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు. నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం" అని అంది. ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది. ఈ తోడేలు చాలా జిత్తులమారింది. ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది. దీని మాటలు అసలు నమ్మకూడదు. ఇది నన్ను కూడా మోసం చేస్తుంది. అందుకని దీని వలలో పడకూడదు. కాని పైకి ఇలా అంది "నేను నమ్మను. నీది బాగా చెడు బుద్ది. చాలా జంతువులను మోసం చేశావు. అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు" అంది.

అది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, "మామా! నేను ఇపుడు చాలా మారాను. అసలు మాంసాహారము ముట్టడం లేదు. నేను శాకాహారమునే తీసుకుంటున్నాను. నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు. నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు. నన్ను నమ్ము. నువ్వు ఎలా చెబితే అలా వుంటాను. అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు. మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను. అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును. ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది. ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది. "నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను".

అందుకే తోడేలు "నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను. మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం. కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది. ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది. ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది. వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.

ఒకరోజు తోడేలు ఒంటెతో "మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది. నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి, చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!" అని అంది. ఒంటె ఒప్పుకుంది. తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది. ఒంటెకు నోరు ఊరింది. చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి. మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది. ఒంటెకు ఉత్సాహంగా ఉంది. దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి "నీవు నా వీపు మీద కూర్చో"అంది. తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది. రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి. చెఱకు తోటలోకి నడిచినాయి.

ఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి "మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది. నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు"అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు. ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది. తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది. తోట యజమానికి వినపడేలా అరిచింది. ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.

తోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు. చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు. అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు. కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది. వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది. అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది. "మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు. ఇంటికి చేరగానే మందు రాస్తాను పద" అంది. ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది. దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది

ఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది. తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది. ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె, నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది. నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. "అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో" అంది. తోడేలుకు అప్పుడు అర్దమైంది. దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది. ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది.        

తొందరపాటు

ఒక వర్తకుడు జాతరలో తన సరుకునంతా అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. సంచులన్నీ డబ్బులతో బరువెక్కిపోయాయి. జాతర ముగిసిన తర్వాత చీకటి పడకముందే ఇల్లు చేరాలని నిశ్చయించుకున్నాడు.

మధ్యాహ్నమంతా ఒక పట్టణంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతనింక బయల్దేరాలనుకునే సమయానికి అతని పనివాడు వర్తకుడి గుర్రాన్ని వెంటబెట్టుకు వచ్చి "అయ్యా! గుర్రం ఎడమ గిట్టలో ఒక మేకు ఉండిపోయింది. ఇప్పుడేం చేద్దాం! అని అడిగాడు. దానికా వర్తకుడు "ఉండనివ్వరా, ఏం కాదులే!" అని జవాబిచ్చి ఊరుకోకుండా "నేను ఇంకా ఆరుమైళ్ళ దూరం వెళ్ళాలి, నేను కొంచెం తొందరగా ఉన్నాను. నాగుర్రానికి నన్ను సవ్యంగా ఇల్లు చేర్చే సత్తా ఉంది" అన్నాడు.

సాయంత్రం వేళ అతను ఒక సత్రం దగ్గర మళ్ళీవచ్చి "అయ్యా! గుర్రం ఎడమ గిట్టకున్న నాడా ఊడిపోయింది. నేను దాన్ని కంసాలి వద్దకు తీసుకెళ్ళాలా?" అని అడిగాడు.

"దాన్నలాగే ఉండనివ్వరా బాబూ! నా గుర్రం మరో రెండు మైళ్ళు నన్ను మోయ లేదా? నేను కాస్త తొందరలో ఉన్నాను కదా?" అని బదులిచ్చాడు వర్తకుడు.

అలాగే వర్తకుడు ప్రయాణం సాగించాడు. కాని కొద్ది దూరం ప్రయాణించాక గుర్రం కుంటడం మొదలెట్టింది. మెల్లిగా కుంటడం మొదలెట్టి ఒక దగ్గర కూలబడిపోయింది. హఠాత్తుగా కూలబడిపోవడం వల్ల గుర్రం కాలు విరిగిపోయింది. అంతే! వర్తకుడు బిత్తరపోయాడు. గుర్రాన్ని అక్కడే వదిలేసి, సంచులన్నీ మోసుకుంటూ, రొప్పుతూ నడుస్తూ ఇల్లు చేరాడు.

వర్తకుడు తన పనివాడి మాట విని గుర్రానికి గిట్టలకు నాడాలు వేయించినట్లయితే వర్తకుడికి బాధలు తప్పేవి కదా! సమయస్పూర్తితో మెలుగుతూ, చెయాల్సిన పనిని తగిన సమయంలో పూర్తిచేస్తే ఎలాంటి ఆపదలూ, ఇబ్బందులూ ఉండవు.

మీ పనిపై మనసు లగ్నం చేయండి. అలా చేయడం వల్ల అన్ని పనులూ అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఇలా చేయడం వలన అద్భుతాలు చేయడం ఏమంత కష్టంకాదు.

తెలివైన రైతు

రాజా విజయేంద్రవర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక రోజు రాజ్యంలో పర్యటిస్తున్నాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును "నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా?" అని అడిగాడు. "సంతోషంగా ఉన్నాను రాజా! నేను రోజుకు ఒక రూపాయి మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను. మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను. మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను. మిగిలిన 25 పైసలు పడవేస్తాను" అని చెప్పాడు రైతు.

"అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు?" అడిగాడు రాజు. "రాజా! నా మొదటి 25 పైసలు నా కుటుంబ సభ్యులు ఆహారానికి, రెండో 25 పైసలు నేను పిల్లలపై ఖర్చ చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను. వారి రుణం తీర్చుకోవడానికంటే సంతోషం ఏముంటుంది. చివరి 25 పైసలు నేను బీదవారికి దానం చేస్తాను.

రైతు చెప్పిన దానిని విని రాజు సంతోషించాడు. అతనికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చి, "నా మొహం వందసార్లు చూసే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పవద్దు" అని రాజు దర్బారుకు చేరుకున్నాడు.

రైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. జవాబు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దగ్గరకెళ్ళి అతనికి బంగారు నాణాల మూట ఇచ్చి తిరిగి నగరానికి చేరుకున్నాడు.

మర్నాడు ఉదయం ఆ రైతు కూడా దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నలకు జవాబును వివరించాడు. అంతే, కోపంతో ఊగిపోతు రాజు "నీకెంత ధైర్యం! నా మొహం వందసార్లు చూపిన తరువాత గాని జవాబు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పానుగా! అని రైతు మీద ఆగ్రహించాడు.

"రాజా! మీ మాటలను నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు వంద బంగారు నాణాలు ఉన్న ఒక మూటను ఇచ్చారు. నాణాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది. కాబట్టి నేను వందసార్లు మీ మొహం చూసిన తరువాత గాని ఈ జవాబు అధికారికి చెప్పలేదు" అని వివరించాడు రైతు.

రాజు తన అధికారి తెలివికి, రైతు మేధస్సుకు సంతోషించి వారిద్దరినీ సత్కరించాడు.       

తెలివైన గాడిద

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు.

అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు రైతు.

ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని గాడిద మొదట ఏడుపులు, పెడబొబ్బలు పెట్టసాగింది. తరువాత అరవకుండా ఉండిపోయింది.

కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది. రైతుకు, పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది. గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

తెలివిగల బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు.

చాలా బాగుంది. చాలా పాతది. బాగా తాగమని బాలుడికి చెప్పాడు. ఆనందంగా తాగమన్నాడు. ఆ పేద బాలుడికి ఆకలి అవుతున్నది. కనీసం తాగటానికి నీరు కూడా లేదు. నవాబు మోసం గ్రహించాడు. బుద్ది చెప్పాలనుకున్నాడు. తాను తూగుతున్నట్లు లేచాడు. ముసలి నవాబును తన్నాడు, తిట్టాడు. దానికి నవాబుకు కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు? తెలుసా? అని అరిచాడు. మీరిచ్చిన మత్తు పానీయంతో నాకు మత్తెక్కింది. నాకేం తెలియటంలా అన్నాడు. మళ్ళీ నవాబును కొట్టబోయాడు. నవాబుకు దానితో తప్పు తెలిసింది. ఆ పేద బాలుడి తెలివికి మెచ్చుకున్నాడు. మంచి భోజనం పెట్టించాడు. ఆనాటి నుంచి ఇతరులను హింసించడం మానుకున్నాడు. దాన ధర్మాలు చేయసాగాడు.        

తెలివిగల పావురాలు

ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ అవి ఐకమత్యంగా ఉండేవికావు. అవి ఒక్కొక్కటీ వేరుపడి ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పావురాలను తినేది.

రోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాలలో కంగారు, భయాన్ని నింపింది. అవన్నీ ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి.

"మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం" అంది ఒక పావురం.

ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కూడా కష్టమైంది.

ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. "నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. మీతో స్నేహం చేయడానికి వచ్చ్హాను" అంది.

ముందు పావురాలు నమ్మకపోయినా, రెండు రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. మూడవ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, "మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది. కాని మీకో నాయకుదు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బాగా ఉండవచ్చు" అంది.

పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికి అర్ధం కాలేదు. అంతలో గ్రద్ద, "మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను" అంది. "అలాగే" అన్నాయి పావురాలు. "అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మేరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు భోజనంగా రావాలి" అంది గ్రద్ద.

పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్ధమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి.

తెలివి లేని స్నేహం

అదొక చిట్టడివి. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మానులో రెండు తొర్రలు. ఒక తొర్రలో పావురం, రెండో తొర్రలో చిట్టెలుక వుంటున్నాయి. అడవిలో తిరిగి, పళ్ళు కాయలూ ఏరుకొచ్చి పావురము, ఎలుక కలసి వాటిని తింటూ హాయిగా బతుకుతున్నాయి. అవి రెండూ మంచి స్నేహంగా వుంటూ ఒకదానిని విడిచి, మరొకటి వుండేవికావు. పావురము, ఎలుక కలసివుండటం ఓ తోడేలు కనిపెట్టింది. పళ్ళూ, కాయలు తిని బాగా బలసి వున్న వాటిని తినాలని ఆశ పడింది. వాటిని పట్టుకొనే అవకాశం కోసం తోడేలు కనిపెట్టుకొని వున్నది.

ఒకరోజు దూరంగా ఉన్న చెట్టుకు మగ్గిన పళ్ళు వేలాడుతూ వుండడం ఎలుక చూసింది. వాటిని తినాలని సరదా పడినది. అయితే ఆ పళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే మధ్యలో వున్న యేరును దాటి వెళ్ళాలి. పావురం ఎగిరి వెళ్ళగలదు. వేగంగా పారుతున్న ఏటిలో దిగితే కొట్టుకు పోతానని ఎలుక భయపడింది. ఎలాగా? అని బాగా ఆలోచించి, ఓ తాడుతో పావురం కాలుకూ, ఎలుక కాలుకూ కట్టుకుంటే, పావురం ఎగిరి ఆ పళ్ళచెట్టు మీద వాలుతుంది! తాడు కట్టుకుంది కనుక, పావురంతో పాటు ఎలుక కూడా ఆ చెట్టు మీదకు వెళుతుంది అని బాగా ఆలోచించి,తమ ఆలోచన బాగా వున్నదని తాడు కట్టుకున్నాయి. పావురం రివ్వున ఎగిరింది. కాలి తాడుతో వేలాడుతూ ఎలుక కూడా గాలిలో ఎగురుతూ, పళ్ళ చెట్టు మీద వాలాయి రెండూనూ! వాటిని తోడేలు గమనిస్తూనే వుంది. మెల్లగా ఏరు దాటి ఆవలి వొడ్డుకు చేరి చెట్టు మొదట్లో కూర్చుంది. తోడేలును చూసిన ఎలుక కంగారుపడి అటూ ఇటు పరిగెత్తింది. కాలుజారింది. పావురం కాలితో, తన కాలు తాడుతో కట్టి వుండటం వల్ల గాలిలో వేలాడుతూ పైకి ప్రాకాలని ప్రయత్నిస్తోంది ఎలుక!

ఆ స్థితిలో ఆ ఎలుక కింద పడుతుందేమో నని తోడేలు తల పైకి ఎత్తి ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో ఓ డేగ బాణంలా దూసుకు వచ్చి, ఎలుకను తన్నుకుపోయింది. తాడు కట్టివుండటం వల్ల పావురం కూడా ఎలుకతో పాటే డేగకు ఆహారమై పోయినది! తోడేలు ఆకాశంలోని చిత్రాన్ని చూస్తూ చతికిలపడింది.

"స్నేహం వుండటం మంచిదే! కాని, బతికే పద్దతుల్లో తేడా వున్నప్పుడు స్నేహం చేయడం అంత మంచిదికాదు" అంటారు పెద్దలు.       

తెలివి తక్కువ రాజు

ఒక అరణ్యంలో రకకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడంటూ ఉంటే బావుంటుందని భావించిన జంతువులు ఒక రోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్ని కడుపుబ్బ నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి.

ఇదంతా నక్కకు నచ్చలేదు "రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్దిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతే కాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు" అని అనుకుంది.

ఒక రోజు ఆ నక్క ఆహరం కోసం సంచరిస్తుండగా ఒక చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనబడ్డాయి, ఆ జిత్తులమారి నక్క చాలా ఆకలిగా ఉన్నా ఆహారం జోలికి వెళ్ళకుండా గబగబా కోతి రాజు దగ్గరికి పరిగెత్తింది.

"రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికేచోటు చూపిస్తాను" అని చెప్పింది నక్క.

కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరకు తీసుకెళ్ళింది.

"ఇదుగో రాజా... ఈ రొట్టె ముక్క మీది. అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు" వినయంగా అంది నక్క.

వెనకా ముందూ ఆలోచించకుండా కోతి ఒక గెంతులో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయింది.

"రాజనే వాడికి కొంచెం తెలివితేటలు ఉండాలి" అని నక్క కోతిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది.

తెలివి

పూర్వం ఒకప్పుడు ఒక నక్క గబ్బిలాన్ని పట్టుకుంది. దానిని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు గబ్బిలం దీనాలాపంతో తనను చంపకుండా విడిచిపెడితే ఎంతైనా పుణ్యం ఉంటుందని వేడుకుంది. నక్క పట్టిన పట్టు వీడకుండా "పక్షులంటే నాకు ఎంతో ఇష్టం. నేను పక్షులను అస్సలు విడిచిపెట్టను" అంది. అప్పుడు గబ్బిలం "నక్క బావా! నేను పక్షిని కాదు. కావాలంటే నా వంటి మీద ఒక్క ఈక కూడా లేదు చూదు" అని తన శరీరం చూపించింది. నిజమేననుకుని నక్క గబ్బిలాన్ని వదిలివేసింది. గబ్బిలం బ్రతుకు జీవుడా అని చెట్టుపైకి వెళ్ళి చెట్టు కొమ్మను పట్టుకుని వ్రేలాడుతూంది.

తిరిగి ఇంకో రోజున మరో నక్క ఈ గబ్బిలాన్ని పట్టుకుని చంపడానికి ప్రయత్నించింది. గబ్బిలం ప్రణభిక్ష పెట్టమని వేడుకుంది. దానికి నక్క "నేను ఎలుకలను కనికరం చూపను, నిన్ను విడిచిపెట్టక మానను, చంపే తీరతాను" అంది. వెంటనే గబ్బిలం "అయ్యో పిచ్చిదానా! నేను అసలు ఎలుకనే కాదు, నేను పక్షిని. కావాలంటే నా రెక్కలు చూడు" అని తన రెక్కలను టపటపా విదిల్చి చూపించింది. ఆ నక్క నిజమేననుకుని గబ్బిలాన్ని విడిచిపెట్టింది.గబ్బిలం చెంగున చెట్టు మీదికి వెళ్ళిపోయింది.

గబ్బిలం తను పక్షిగానీ, ఎలుకగానీ కాకపోవడంచేత రెండుసార్లు నిజమే చెప్పి మరణోపాయం నుంచి తప్పించుకుంది. రెండువైపులా వాడిగా ఉండడం ఎంతో మంచిది.        

తెచ్చిపెట్టుకొన్న తిప్పలు

గోవిందప్ప కోనేట్లో కోటి రకాల కప్పలు ఉన్నాయి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి. ఎండా, వానా తేడా లేకుండా ఎరపొరుపులు రాకుండా ఎల్లకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూచింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.

కోనేటికి నాలుగు వైపులా రాతిమెట్లున్నాయి. సాయంత్రమయ్యే సరికి నగరంలో వాళ్ళంతా మెట్ల మీదకి చేరుకునేవాళ్ళు వెన్నెల రాత్రిళ్ళలో ఆ మెట్ల మీదే గడిపేవాళ్ళు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలు కప్పలు వింటూ వుండేవి. రానురాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు అంటుకున్నాయి. కొంత కాలానికి కప్పలు సరికొత్త విషయం ఒకటి తెలిసింది. మనుషులు తమను పాలించడానికి ఒక 'రాజు' ని ఎన్నుకున్నారట! ఈ వార్త విన్నాక మనుషులకే రాజు అవసమైనప్పుడు తమకు మాత్రం ఎందుకవసరం లేదు? తమకూ ఓ రాజు కావాలి! అనే ఆలోచన రేకేత్తింది కప్పలకు. సూర్యుణ్ణి ప్రార్థించాయి కప్పలు. సూర్యుడు వచ్చాడు. 'ఏం కవాలి?' అనడిగాడు.

'మాకో రాజుని ఇవ్వు దేవా!' అనడిగాయి కప్పలు. 'ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా! ఇంకా రాజెందుకు?' మనుషులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా? అన్నాయి కప్పలు. 'పోనీ, మీలోనే ఒకరిని ఎంచుకోరాదూ?' అన్నాడు సూర్యుడు. 'ఉహు, మాకు కొత్త రాజే కావాలి!' అన్నాయి కప్పలు.

వాటి అమాయకత్వానికి సూర్యుడికి జాలి పుట్టింది. వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ పెద్ద జీలగబెండును కోనేట్లో వేశాడు. ఒకటి రెండు రోజులు జీలగబెండుకి దూరంగా వున్నాయి కప్పలు. బెదురు తీరాక బెండు మీదకి గెంతాయి. ఎలా గెంతినా బెండు ఉలుకూ పలుకూ లేదు. తనివితీరా గెంతి గెంతి 'ఇస్! రాజంటే ఇంతేనా?' అని అనుకున్నాయి. వాటికి నచ్చలేదు. మళ్ళా సూర్యుణ్ణి వేడుకున్నాయి వచ్చాడు. 'దేవా! మాకీ చచ్చురాజు పనికిరాడు. మరో కొత్త రాజుని ఇవ్వు అన్నాయి కప్పలు. 'మీది అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలీకుండా వుంది. పోనీ, హాయిగా ఆడుకుంటారు కదా అని బెండుని ఇస్తే, కాదు కూడదంటున్నారు. అన్నాడు మందలింపుగా సూర్యుడు.

'ఇంతకన్నా మంచి రాజుని ఇవ్వు దేవా!' అన్నాయి కప్పలు. సూర్యుడు చాలా ఆలోచించాడు. కప్పల మీదనున్న జాలి వల్ల సూర్యుడు చంద్రుణ్ణి ఇచ్చాడు. కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు. ఆడుకొనేవాడు. కలిసిమెలసి తిరిగేవాడు. చల్లగా పండువెన్నెల ఇచ్చేవాడు. తినగా తినగా గారెలు చేదైనట్టుగా హాయిగా చల్లగా వున్న చంద్రుడంటే కప్పలకు అట్టే సంతృప్తి కలగలేదు. గొణుక్కుని మళ్ళా సూర్యుడిని ప్రార్థించాయి.

'ఎందుకు?' అనడిగాడు సూర్యుడు. 'ఎంతసేపూ పనికిమాలిన వాళ్ళనే రాజుగా యిస్తున్నావు దేవా! కాస్త కరుకైన వాళ్ళని యివ్వు అన్నాయి కప్పలు. 'మీరు మూర్ఖులు' రాజుని ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని యిచ్చాను. ఐనా ఏం లాభం? వాళ్ళ మంచి చేదయిందీ అన్నాడు సూర్యుడు. 'ఏమైనా సరే, మాకు రాజు కావాలి! అని ఉబలాట పడ్డాయి కప్పలు. సూర్యుడికి విసుగెత్తింది. అనుభవిస్తే కాని తెలియదు అని అనుకున్నాడు. కొల్లేటి కొంగని రాజుగా యిచ్చి వెళ్ళిపోయాడు. జీలగబెండు, చంద్రుడులాగా కాకుండా నిబ్బరంగా గట్టుమీద కూచుంది. కొల్లేటి కొంగ బెట్టుగా ఉంది. ఇదంతా కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది.

ఓహొ కొంగరాజా! నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకు ముందున్న రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు. నీ ఠీవి, గంబీరత అద్భుతం! మాకు అన్ని విధాలా నచ్చావు. చంద్రాయుధంలాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్ముల్ని పరిపాలించడానికి అన్నాయి కప్పలు. కొంగ ఏమీ మాట్లాడలేదు. కోనేటివైపు చూస్తూ కూచుంది. కప్పల పొగడ్త విని ఆనందించినట్టు తోచింది. ఆ మర్నాటినించి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలు పెట్టింది. కొద్దిరోజుల్లో కప్పలకు విషయం అర్థమయ్యింది. ఏ ముక్కును పొగిడాయే ఆ ముక్కే మృత్యువయింది. రోజురోజుకి కప్పల కుటుంబాలు నశించిపోయాయి. 'ఓ సూర్యుడా! మాకు రాజు వద్దూ, గీజూవద్దు! ఈ బాధల్ని తప్పించు' అని ఏడ్చాయి కప్పలు. కాని సూర్యుడు మళ్ళా కనబడలేదు. కొల్లేటి కొంగ రాజరికం పోనూలేదు.       

తాలూకా బహుమానం


బీర్బల్‌ తెలివి తేటలు, చతురత పట్ల అత్యంత సంతుష్టులైన అక్బర్‌, ఒకరోజు అనుకోకుండా 50 గ్రామాలు గల ఒక తాలూకాను బీర్బల్‌కు బహుమానంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. కాని ఎన్ని రోజులు గడిచినా తన వాగ్దానాన్ని మాత్రం నిలబెట్టుకోలేదు. ఒకరోజు అక్బర్‌తో మాట్లాడుతుండగా, బీర్బల్‌ తన 'తాలూకా బహుమతి' విషయం ఆయనకు పరోక్షంగా గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కాని బీర్బల్‌ ఉద్దేశాన్ని గ్రహించి, అతని మాటను విననట్టు మొహం పక్కకు తిప్పుకున్నాడు అక్బర్‌. తనకు తాలూకాను బహుమతిగా ఇవ్వడం అక్బర్‌కు ఇష్టం లేదని బీర్బల్‌కు అర్ధమయ్యింది. బీర్బల్‌ మనస్తాపం చెందాడు. అవమానంగా భావించాడు. కాని ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. మరుసటి రోజు, బీర్బల్‌ అక్బర్‌తో ఉదయం పూట విహారానికి చక్రవర్తిగారి తోటలోకి బయలుదేరాడు. అక్కడ ఒంటెను చూసిన అక్బర్‌కు వింత సందేహం కలిగింది. వెంటనే బీర్బల్‌తో "బీర్బల్‌! అన్ని జంతువుల మాదిరిగా ఒంటె మెడ సరిగా ఎందుకుండదు? అది అసాధారణంగా వంగి వుంటుంది. ఈ లోపం వెనుక ఏదో కధ దాగే ఉంటుంది కదా!" అన్నాడు. నిన్నటి సంఘటన మరిచిపోని బీర్బల్‌, అక్బర్‌ సందేహాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని "మహరాజా! ఒంటె మెడ ఇలా వంగి ఉండటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఒంటె తన తాలూకాను బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేసింది. కొంతకాలం గడిచేసరికి అది ఆ సంగతి మరిచిపోయింది. వాగ్దానం గ్రహించిన వ్యక్తి ఒంటెను అడగగానే అది తన మొహాన్ని పక్కకు తిప్పుకుంది. అందుకే మరుజన్మలో మెడకు ఇలా లోపం సంభవించింది" అన్నాడు.

బీర్బల్‌ చురకతో అక్బర్‌కు అసలు విషయం అర్ధమైంది. మరుసటి రోజే బీర్బల్‌ను పిలిచి ఒక తాలూకాను బహుకరించాడు.       

తాబేలు తెలివి


ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు.

వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు.

"ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో.

"చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ్! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.

వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు. " మీకు నా గానం నచ్చిందా?" "నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదామ" అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో.

పిల్లలు తాబేలుని బయటకి తీశారు. తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరకి అలసిపోయి, చెమటతో తడిసి్పోయారు ఆ పిల్లలు. "చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం? అని అన్నది తాబేలు తన పధకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చ్హారు. "ఇవి నాకు సరిపోవు. పదండి నదిలో స్నానం చేద్దామ" అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.

నీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం.

తల్లి ప్రేమ సాటిలేనిది

తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.

ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు. తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు. అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది. జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది. ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు. ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.

పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది. అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు. ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.

అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను. ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు " మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు!        

తల్లి ప్రేమ

గర్భవతిగా వున్న సీతమ్మ భర్త పొరుగూరు వెళ్ళి వస్తూ మార్గమధ్యమంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికి సాయపడుతూ కుమారునికి ఏ లోటూ లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు-కోడలు వద్ద వుండి జీవితాన్ని వెళ్ళదీసుకొంటుంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతియై మగ శిశువును కన్నది. అత్తా-కోడలు అన్యోన్యముగా వుండసాగారు. కొంతకాలము గడిచే సరికి చెప్పుడు మాటలకు లోనై భర్త వూళ్ళోలేని సమయంలో అత్తగారిని నిర్ధాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు.

సీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూరప్రాంతానికి వెళ్ళి కొడుకు-కోడలు క్షేమమే తన సంతోషముగా తలచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరి సంతోషంగా వుంటోంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారి పై లేనిపోని చాడీలు చెప్పి, తనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కాని కొడుకు నమ్మక ఉద్యోగము చెయ్యక మంచం పట్టాడు. సుఖశాంతులతో చల్లగా సాగే సంసారము తిండి లేక కష్టపడసాగారు. తల్లి ప్రేమకి కరువయి మానసికముగా క్రుంగిన భర్తకి తను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరింది. తల్లి కోసము ఎంత వెదికినా కనిపించలేదు.

కొంతకాలము గడిచింది. భర్త-భార్య కలసి సీతమ్మని వెదకటానికి బయలుదేరారు. తిండిమాని శుష్కించిపోయి సీతమ్మ ఉండే గ్రామము మీదుగా వెళ్తున్న కొడుకు-కోడల్ని చూసి తల్లి ప్రేమని ఆపుకోలేక దుఃఖిస్తూ వారి వద్దకు వెళ్ళింది. సీతమ్మ కాళ్ళపై పడి క్షమించమని కోరారు కొడుకు-కోడలు. తను సుఖంగానే ఉన్నానని, మీ సుఖసంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. మీరు సుఖంగా ఉండమని కోరింది.

ఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయము గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్ళని కూడా అక్కడే వుండమని చెప్పాడు. రైతుకు అన్ని విధాల సాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలు తీసుకుని, పొలము, ఇల్లు కొనుక్కొని సుఖసంతోషాలతో కాలము గడిపారు. రైతు కొడుకు-కోడలు విదేశాలలో వుండటం వలన వారినే సొంత వాళ్ళుగా చూడడం వలన ఆ రైతు కూడా ఆనందించాడు.

సీతమ్మతో రైతు "అమ్మా! నీ ఓర్పు, సహనమే నీకు శ్రీరామ రక్ష. నా కోడుకు నా కోసమే తపించిపోయాడు. కోడలు ధన సంపాదనలో మునిగి కనీసము మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు. నీవు చాల అదృష్టవంతురాలివి" అని కన్నీరు కార్చాడు.       

తలపాగా ఖరీదు?

ఒకరోజు నస్రుద్దీన్‌ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.

"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను" అన్నాడు.

"అలాగా! దీని ఖరీదు ఎంత?" అన్నాడు రాజు.

"వెయ్యి వరహాలు రాజా" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు "రాజా! ఈ నస్రుద్దీన్‌ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు." అని చెవిలో చెప్పాడు.

మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, "నస్రుద్దీన్‌! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?" అని అడిగాడు.

"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!" అన్నాడు నస్రు.

నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.

వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

తప్పింపతరమా

సింగడి పేరు చెబితే పసిపిల్లలు కూడా ఏడుపు మానేస్తారు. సింగడి పేరు చెబితే పాములు కూడా పడగలు వాలుస్తాయి. సింగడి పేరు చెబితే సింహాలు కూడా తోకలు ముడుస్తాయి. సిరిపురం సింగడంటే గజదొంగలు కూడా తలలూపుతూ కిటికీలతో సహా మూసుకుంటారు. సింగడికి సిబ్బంది లేదు. తోటి దొంగలు లేరు. అతని సైన్యం అంతా అతనొక్కడే. చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేస్తాడు. వేషాలు మార్చడం, భాషలు మార్చడంలో సింగడికి సింగడే సాటి. పగలంతా సందుకో వేషంలో తిరుగుతూ తను దొంగతనం చేయ్యాలనుకున్న యింట అనుపాన్లు, గుట్లు గ్రహిస్తాడు. నాలుగయిదు రోజులు ఆ ఇంటి వాళ్ళు తన వేషాన్ని మర్చిపోయేంత వరకూ మౌనంగా ఉండిపోతాడు.

ఆ తరువాత ఓ రాత్రి విజృంబించి తన చాకచక్యం చూపి మూడోకంటివాడికి కూడా తెలియకుండా ఆయింటిని దోచేస్తాడు. ఫలానా వారి ఇల్లు దోచుకుంటానని ముందు చెబుతాడు. అందరూ అప్పటికే బహు హెచ్చరికగా ఉంటారు. అయితే అర్థరాత్రి దాటాక ఓ కుంటివాడుగానో, గుడ్డివాడుగానో హెచ్చరికవున్న వారి దగ్గరికొచ్చి మీరంతా ఇక్కడున్నారు, అవతల మీ ఇల్లు కాలిపోతున్నది అని చెప్పేవాడు. దాంతో వాళ్ళు ఆదుర్థాగా అక్కడకు పరుగెడతారు. ఆ ప్రదేశం నిర్మానుష్యం అయిన తరువాత రెండూ మూడిళ్ళు దోచుకొని దొరికిన సొమ్ము మూట కట్టుకొని వెళతాడు. మళ్ళీ ఆ ఇళ్ళవాళ్ళు మోసగింపబడ్డామని తెలుసుకొని తిరిగి వచ్చేలోగా కలసిపోతాడు.

అయితే ప్రతిసారి అదే ఎత్తుగడ ఉపయోగించక కొత్త ఎత్తులు ఆలోచిస్తుంటాడు. ఇలా ఊళ్ళకి ఊళ్ళు దోచి చాలా డబ్బు కూడబెట్టాడు సింగడు. కోటి రూపాయలు సంపాదించిన తర్వాత అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొని హాయిగా బ్రతకాలని వాడి ఆశ. ఆ ఊరు చేరి అది రెండో రోజు. ఆ వేషంలో తిరిగి, ఈ వేషంలో తిరిగి మాణిక్యంశెట్టి కొట్లకి పడగలెత్తాడని విని ఆ యింటి అనుపాసులు వెతుకుతున్నాడు. మాణిక్యంశెట్టి ఇంటికి ఆ ఉదయం ఒక సాధువు వచ్చాడు. శెట్టిగారు తమకి తమ కుటుంబానికి ఉన్న రకరకాల వ్యాధుల్ని గురించి చెప్పాడు. సాధువు కొంచెం తెల్లపొడిని ఇచ్చి ఈ రోజు ఈ పొడి వేసి వంటకాలు చెయ్యండి. అది తింటే మీ వ్యాధులు తగ్గిపోతాయి అని చెప్పాడు.

అలాగే ఆ పొడి వేసి వంటకాలు వండి తిన్న మాణిక్యంశెట్టి కుటుంబసభ్యులంతా మత్తుగా నిద్రపోయారు. సింగడు తన తెలివితేటలతో దొడ్డి తలుపు తెరచి యింట్లో ప్రవేశించాడు. నగదు, నగలు మూట కట్టుకుంటుండగా ఓ పక్క అద్దాల బీరువాలో అందంగా చేసి పెట్టిన లడ్డూలు కనిపించాయి. లడ్డూలు సింగడి బలహీనత. అందువల్ల ఆ బీరువా తెరచి అయిదారు లడ్డూలు గబగబా తిన్నాడు. అంతవరకే అతనికి తెలుసు. కళ్ళు తెరచి చూస్తే మంచానికి కట్టివేయబడి ఉన్నాడు సింగడు. నువ్వు యిచ్చింది మత్తుమందు అని తెలియక మేందాన్ని నేతిలో వేసి దాంతో అన్ని వంటకాలూ చేశాం. అయితే మత్తు ఆవరించకుంటుండగా నాకు అర్థమయింది. నేనేం చెయ్యలేకపోయాను. నువ్వు వస్తావని తెలిసి అతి కష్టం మీద ఆ నేతితో చేసిన లడ్డూలు ఈ అద్దాల బీరువాలో పెట్టి పారిపోయాను. అవి తిని నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డావు. తాడి తన్నే వాడి తల తన్నేవాడుంటాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కాసేపటిలోగా రక్షకభటులు వస్తారు. అంతవరకూ మరో లడ్డూ ఇవ్వనా అని శెట్టిగారు, అతని కుటుంబ సభ్యులు హేళనగా నవ్వారు. తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయాడు గజదొంగ సింగడు.        

తగిన శాస్తి

అనగనగా ఒక పెద్ద అడవి వుండేది. ఆ అడవిలో ఒక గుర్రం, గేదె వుండేవి. అవి పక్క పక్కనే మేస్తుండేవి. ఒకే సెలయేటిలో నీళ్ళూ కూడా తాగేవి. కానీ వాటికి ఏనాడు పడేదికాదు. ఎప్పుడూ పోట్లాడుకునేవి. . నేను గొప్పంటే నేను గొప్పని బడాయిలు పోయేవి. ఎప్పటిలానే ఒక రోజు ఆ రెండూ పోట్లాడుకున్నాయి. కోపం ఆపుకోలేని గేదె తన కొమ్ములతో గుర్రాన్ని బాగా పొడిచింది. దాంతో గాయాలయ్యాయి. రక్తం కూడా ఎక్కువగానే కారింది. గుర్రం ఇది మనసులో పెట్టుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకే పక్కనే వున్న గ్రామానికి వెళ్ళింది. రామయ్య అనే రైతును కలిసి గేదెకు జరిగినదంతా చెప్పింది.

అంతా విని అయితే నేనేం చేయాలి? అని అడిగాడు రామయ్య. ఏమీ లేదు నువ్వు నామీద కూర్చొని ఆ గేదెను కర్రతో బాగా బాదాలి. అప్పుడు అది ఓడిపోతుంది. అంది గుర్రం కసిగా పళ్ళు నూరుతూ. మరి నాకేంటి లాభం అన్నాడు రామయ్య. లాభం లేకపోవటమేంటి! గేదెను కొట్టినప్పుడు పడిపోయి అది ఓడిపోతుంది కదా. అప్పుడు అది మన ఆధీనంలోనే వుంటుంది. నువ్వు ఎంచక్కా దాని పాలు తాగొచ్చు. పైగా దాన్ని వ్యవసాయానికి కూడా ఉపయోగించుకోవచ్చు అంది గుర్రం.

సరేనన్నాడు రామయ్య. అతను ఆ మరునాడే వెళ్ళి గేదెను బాగా బాదాడు. దాంతో గేదె గాయపడి చేతికి చిక్కింది. గేదె నీ దగ్గరకు వచ్చిందికదా ఇక నా కళ్ళెం వదిలేయ్ అంది గుర్రం.

అమ్మా! నేనెలా వదులుతాను? నీ వల్ల కూడా నాకు ఉపయోగమే కదా. ఎంచక్కా నీ మీద ఎక్కి స్వారీ చేయొచ్చు. వేరే వూళ్ళకు వెళ్ళొచ్చు. అంటూ తన ఇంటికి పట్టుకెళ్ళాడు రామయ్య. తను చేసిన పనికి గుర్రం సిగ్గుపడింది. తాము తాము చూసుకోక మధ్యలో స్వార్థపరుడైన మనిషిని తెచ్చినందుకు సిగ్గుపడింది. తగినశాస్తి జరిగిందని బాధపడింది.       

తగని సలహా


అనగా అనగా ఓ అడవి. అడవి అనగానే మీకు పులులూ, సింహాలు, పాములు, తోడేళ్ళు, పొడుగాటి చెట్లూ, ఎత్తైన గట్లూ గుర్తుకు రావొచ్చు. ఇవన్నీ ఉండే మాట నిజమే కాని, ఆ అడవిలోని కోతుల మందని గురించి చెప్పుకుందాం.

ఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి. కడుపునిండా నిద్రపోయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇలా ఉండగా ఈ శీతాకాలంలో ఈ రోజున ఏం జరిగిందనుకున్నారూ! ఆ వేళ మరీ చలివేస్తోంది. బారెడు పొద్దుండగానే మంచు గడ్డల్లే అయిపోయింది! జిమ్ముమంటూ ఒళ్ళు బిగుసుకు పోతోంది. మనకంటే దుప్పట్లు ఉంటాయి. కోతులకేం ఉంటాయ్? 'ఏంచేద్దాం? ఏంచేద్దాం' అన్నాయి కోతులు. ఒక ముసలికోతి' చలి మంట వేసుకుందాం అని అంది. భేష్! భేష్! అన్నాయి. మంద మందంతా ఇంకేం తలో మూలకి వెళ్ళాయి. తలా ఒక గుప్పెడు ఎండు టాకులు, పుల్లలూ తెచ్చాయి. ఓ చెట్టు కింద పోగేశాయి. పెద్ద గుట్టయింది. ఓ మహా చక్కగా రాత్రి తెల్లార్లూ చలికాగొచ్చు అని అంది ఓ పండు ముసలి కోతి.

"ఊ చప్పున మంట వెయ్యండి" ఓ పడుచు కోతి అంది. మంట వెయ్యడానికి నిప్పేది?

  • ఆకులున్నాయ్
  • అగ్గి లేదోయ్
  • అగ్గి లేందే
  • మంట రాదోయ్
  • మంట లేందే
  • చలి వదలదోయ్
అని పాడింది ఒక ఆడ కోతి. అయితే అగ్గి నిప్పు తెండి ఎక్కడుందీ వెతకండి, వెతకండీ! నిప్పు కోసం తలో మూలకి బయల్దేరాయి. ఇంతలోకే పొద్దు గూకింది. అడవిలో మరింత చీకటి కదూ? ఆ చీకట్లో ఒక పొదమీదనుంచి మిణుగురు పురుగులు ఎగురుతున్నాయి. నల్లని చీకట్లో పచ్చని వెలుతురూ మిలమిలా తళతళా మిణుగురులు మెరిసెను నల్లని చీకట్లు తెల్లబడి పోయెను, మిణుగురుల్ని కోతులు చూశాయి. అదుగో నిప్పురవ్వ! 'ఊ పదండి తలో నిప్పురవ్వా తెద్దాం' అన్నాయి కోతులు. చప్పునపోయి తలో మిణుగురిని పట్టుకున్నాయి. గుట్ట దగ్గరకు వచ్చాయి. ఆకులు గుట్టలో మిణుగురుల్నికుక్కి మంట వెలిగించడానికి ప్రయత్నించాయి. కొన్ని ఊహూ అంటూ ఊదుతున్నాయి. మరికొన్ని కోతులు టేకు ఆకులు మన విసనకర్రలల్లే ఉంటాయి. వాటిని తెచ్చి విసురుతున్నాయి. ఉహు ఎంత శ్రమ పడినా ఆకులు గుట్ట రాజుకోలేదు. ఊదీ ఊదీ విసుగెత్తుతోంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పుకోగలరా చెట్టు కొమ్మమీద కూచున్న పాలపిట్ట చూస్తోంది. పాలపిట్ట చాలా మంచిది. కోతుల తెలివి తక్కువతనం చూసి జాలిపడి ఇలా అంది.

  • అక్కలారా! అక్కలారా!
  • నిప్పుకాది మిణుగురమ్మా
  • మిణుగు రెప్పుడు మండదమ్మా
  • మిణుగు రెప్పుడు వెలుగునంతే!
పాలపిట్ట పాటవిని కోతులు మండిపడ్డాయి. మాకు తెలియదట. ఈ పిట్టకు తెలుసట! అని కోపగించాయి. పాలపిట్టను గద్దిస్తూ కోతులు - నోరు ముయ్యవే పాలపిట్టా తెలిసినట్టు మహా చెప్పవచ్చావ్! నిప్పు సంగతి నీటి సంగతి నీకు తెలుసా? మాకు తెలుసా? అని అన్నాయి. పాపం, పాలపిట్ట మాత్రం తన గొడవ మానుకోలేదు. మళ్ళా అంది కదా

  • నా మాట వినుడక్కలారా!
  • అగ్గిగాదిది మిణుగురమ్మా!
  • వెలుతురిచ్చే మిణుగురమ్మా!
  • మిణుగు రెప్పుడు మండదమ్మా!!
కోతులికి పట్టరాని కోపం వచ్చింది. కూస్తంత పిట్ట తమని ఎగతాళి చేస్తోందని భావించాయి. ఏయ్ జాగ్రత్త అని బెదిరించాయి. కాని పాలపిట్ట మాత్రం పాడుతూనే ఉంది;

  • నామాట విను డక్కలారా!
  • అగ్గికాదిది మిణుగురమ్మా!"
కోతులు పిచ్చి కోపంతో పాలపిట్టను పట్టుకున్నాయి. తోక పీకేశాయి. చివరికి పీక నులిమి చెట్టుకేసి బాదాయి. పాల పిట్ట చచ్చిపోయింది. కోతులు ఎంత తన్నుకున్న ఆకులు గుట్ట మండలేదు. వాటికి చలి తీరలేదు. పాలపిట్ట మాట నిజమని గ్రహించనూ లేదు. తెలివి తక్కువ కోతిమందకు తగని సలహా చెప్పి ప్రాణము కోల్పోయిన పిట్టకథ ఇది.

తగని గర్వం

చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి. వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.

సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు. కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద - మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది. అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి. సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి. సింహం ఎద్దు వేపు చూసి 'ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ' అని అంది. ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది. ఎద్దు చచ్చిపోయింది. నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.

సింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది. నక్క తెలివిగలది. చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది. 'సరే! నేనే పంచుతాను' అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :

'నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!' అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి, 'దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!' అని అంది. కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది? ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి. ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.

సింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది. కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు. 'బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా' ననేది. గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.

ఓ రోజున గాడిద వచ్చింది.'నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?' అని గ్రుడ్లురిమి చూసింది సింహం. 'ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా! చింత చచ్చినా పులుపు చావలేదే!' అంది గాడిద. సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది. గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది. సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది. దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.

'ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది. అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?' అని ఏడ్చింది సింహం. కాని ఎవరికి జాలి?       

డాబుసరి వేషాలు

తుంగభద్ర వొడ్డున పెద్ద అడవి. అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు. వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి! ఇంతా అంతా అనికాదు ఎంతో అందం! అంతకుమించిన ఆనందంతొ పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి. ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకొనేవి. ఆ పండగలోనే తమ కొక 'పెద్ద' ని యెంచుకొనేవి. ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి. మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం యెక్కి వరుణుడు వచ్చాడు. మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్ళు పురివిప్పి నృత్యం చేస్తాయి. ఆ నృత్యం కళ్ళారా చూడవలసిందే!

పక్షులు ఆ ఏటికి తమ పెద్దగా నెమలిని యెంచుకొన్నాయి. వరుణుడు చాలా సంతోషించాడు. 'నెమలిని యెందుకు యెన్నుకొన్నారు? ' అనడిగింది బొంతకాకి. 'అందచందాలున్నవి కనుక' అని జవాబిచ్చాయి పక్షులు. మరుసటేడు పండుగకు సూర్యుడు అతిథిగా వచ్చాడు. ఆ ఏడాది పెద్దగా పక్షులు కోకిలను యెంచుకున్నాయి. కోకిలపాట యెంత తియ్యగా ఉంటుందో ఎవరికి తెలియదు? సూర్యుడు సంతోషించాడు. కాని, బొంతకాకి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టు అయింది. గురగుర లాడింది నిరుడంటే నెమలి అందగత్తె అన్నారు. మరి కోకిల? తనకన్న అందగత్తె కాదు కదా? తనలో తాను గొణుక్కున్నది.

"ఏం చూసి కోకిలను యెంచుకొన్నారు?" ఉక్రోషం కక్కుతూ అడిగింది బొంతకాకి. పక్షులు నవ్వాయి. 'దాని కంఠం ఎంత కమ్మగా ఉందో చూడు! అందుకనే పెద్దగా యెంచుకొన్నాం' అని జవాబిచ్చాయి. బొంతకాకి తెగ గొణిగింది. వచ్చే వసంత ఋతువు నాటికి యేమైనా సరే, తనే పెద్ద కావాలని నిశ్చయించుకొంది. సరే! వసంత ఋతువు రానేవచ్చింది. ఈసారి పక్షులు తమ అతిధిగా చంద్రుణ్ణి పిలిచాయి. నక్షత్రాల రథం ఎక్కి చంద్రుడు వచ్చాడు. పండగ మంచి జోరుగా ఉంది. అందరూ ఒక చోటుకు చేరారు. పెద్దని యెంచుకోవలసిన సమయం.

ఇంతలో ఒక వేపునించి ఒక చిత్రమైన పక్షి సభలో ప్రవేశించింది. వింత వేషం! పొడుగాటి తోక, రెక్కల నిండా తెల్లని మెత్తటి యీకలు, నెత్తిమీద వింత జుట్టు. కాని అది నెమలీ కాదు, హంసా కాదూ, కోడి కాదు. పక్షులన్నీ యీ వింత పక్షిని చూసి నోరు తెరిచాయి. అది పెద్దను యెంచుకోవలసిన సమయం మరి. 'నెమలికన్నా అందమైన పక్షిని. అందుకని నేనే పెద్దను!' అంది కొత్త పక్షి. నెమళ్ళు తల వంచాయి. మిగతా పక్షులు నోరు మెదపలేదు.

'కోయిలలకన్నా చక్కగా పాడగలను. అందుకని నేనే పెద్దను!' అంది కొత్త పక్షి. కోయిలలు తలలు వంచాయి పక్షులు మాత్రం ఏమంటాయి. ' ఒక పాట పాడి వినిపించు ' అని అడిగే దైర్యంకూడా లేదు. 'ఊఁ... ఏకగ్రీవంగ నన్నే పెద్దగా యెంచుకోండి! ' అంది కొత్త పక్షి మంచి డాబుసరిచేసి. పక్షులు నోరెత్తకుండ రెక్కలు విప్పి అంగీకారం తెలియచేయడానికి సిద్దమయ్యాయి. ఇంతలో హంస ముందుకువచ్చింది. ఇంతసేపు అది చంద్రుడితో ఆడుకుంటోంది. కొత్తపక్షి డాబు దర్పాలు చూసి అనుమానించింది. హంస అసాద్యురాలు, వింతని కనిపెట్టింది.

' అయ్యా! ఈ కొత్తపక్షిగారిని పెద్దగా యెంచుకొవడానికి అభ్యంతరంలేదు. మాంచి డాబుసరిగా ఉన్నరు. ఇంత దర్జా గలవారు మనకు పెద్ద కావడం చాలా సంతోషం. కాని, చిన్న మనవి!... అంటూ హంస కొత్తపక్షి దగ్గరకంటా వెళ్ళింది. కొత్తపక్షి తోకని పట్టి గుంజింది. చిత్రం... ఎక్కడ ితోక అక్కడ రాలిపోయింది! కొత్త పక్షి తల నేలకు వంచింది. కొత్తపక్షి రెక్కల్ని దువ్వింది పెట్టుడు ఈకలు జారి పోయాయి. నెత్తిమీంచి జుట్టులాగేసింది. తీరాచూస్తే... అది బొంతకాకి!

బొంతకాకి ఎలాగో పెద్దరికం సంపాదించాలని అడవిలో అక్కడక్కడా రాలిపడిన ఈకలన్నీ తగిలించుకుంది. డాబుసరి వేషం వేసుకుని వచ్చింది. కాని, హంస తెలివితేటల వల్ల అసలురంగు బయటపడింది. తర్వాత పక్షులు బొంతకాకిని అడవినుంచి తరిమేశాయి. హంసను ఆ ఏటికి తమ పెద్దగా ఎంచుకున్నాయి. చంద్రుడు చాలా సంతోషించాడు. నాటికి నేటికి ఆ బొంతకాకి జాడ ఎవరికీ తెలియలేదు.       

జ్ఞానోదయం 1

ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.

'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది. 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు' అనుకుంది. కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. 'ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, అనుకుని అక్కడి నుండి కదలలేదు.

శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు." ఆ(! పోతే పోయాడు" అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది. "అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.

జ్ఞానోదయం

వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు.

అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి నీలాంటి బడి మానేసిన పిల్లలకు పాఠాలు చెప్పడం మేలే అయ్యింది. తిరిగి పాఠశాల తెరవగానే వారి వారి స్టాండర్డ్‌ను అనుసరించి పాఠశాలలో చేరుతున్నారు. నువ్వు అందుకేగా వచ్చింది అన్నాడు. మాష్టారు! నా సంగతేమో గాని, నా చిట్టి తమ్ముణ్ణి ఆశీర్వదించండి, వీడి పుట్టిన రోజు ఈ రోజే! అన్నాడు స్వీట్స్ తమ్ముడి చేత ఇప్పించి. మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లు బాబూ! అన్నాడు సత్యం మాస్టారు. అంతే! అనిల్ ఆ మరుక్షణం తన తమ్ముడిని ఒకటో తరగతిలో కూర్చుండబెట్టి ఇంటి ముఖం పట్టాడు. తన అంచనా తప్పవడంతో సత్యం మాస్టారు, అనిల్‌ని వెనక్కి పిలిచి అనిల్ నిన్ను - నీ వాలకాన్ని చూసి తిరిగి పాఠశాలలో చేరి బాగా చదువుకోవడానికి వచ్చావనుకొన్నానే! బడిలోచేరి చదువుకోవా? అన్నాడు.

నాకూ చదువుకోవాలనే ఉంది మాష్టారు. కాని కుటుంబ పరిస్థితులు సహకరించడంలేదు. యాక్సిండెంట్‌లో నాన్న పోగానే అమ్మ ఏకాకి అయ్యింది. బంధువుల సాయం అంతంతమాత్రమే! నోటికింత ముద్దపెట్టే పొలాన్ని, పాడి గెదెలను చూసుకుంటూ అమ్మకి సాయంగా ఇంటి పట్టునే ఉంటున్నాను. అన్నాడు అనిల్. దాంతో అనిల్‌ని అర్థం చేసుకొన్న సత్యం మాస్టారు బాబూ! అనిల్ నీకు నేను చదువు చెబుతాను. రాత్రి పాఠశాలకు రా! ఈ రోజుల్లో చదువు ఎంతో అవసరం! పట్టాల కోసం, ఉద్యోగాల కోసం అనుకోవడం పొరపాటు. విద్య మన జీవితాలకో వెలుగు! అన్నాడు. ఆ మాటలతో జ్ఞానోదయం కలిగిన అనిల్ రాత్రి పాఠశాలకెళ్ళి చక్కగా చదువుకొని, సత్యం మాస్టారి సలహా సంప్రదింపులతో ఎన్నో పరీక్షలు రాసి పాసై ఒక ఉద్యోగస్తుడయ్యాడు.       

జీవిత సత్యం

ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు. "నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్‌లో కుడా నాకు మార్కులు తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు.

అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.

"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.

మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి. నీకూ ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి" అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ.

జీతము ఇవ్వని యజమాని

పూర్వము ఒక పట్టణములో వినాయకరావు అనే వ్యాపారి వుండేవాడు. ఆయన పనివాళ్ళను పెట్టుకోవటం వారికి జీతము ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పి పంపేవాడు. ఆయన జీవితంలో ఎవ్వరికీ జీతం ఇవ్వలేదు. ఒకసారి వినాయకరావు వద్దకు చిరంజీవి అనే కుర్రవాడు వచ్చాడు. పని కావాలంటూ అడిగాడు. పనివాడులేక ఇబ్బందిగానే వుంది వినాయకరావుకి. తాను చెప్పిన పని చెయ్యాలనీ, చెయ్యకపోతే జీతం ఇవ్వననీ ముందే చెప్పాడు వినాయకరావు. చిరంజీవి చెప్పిన పని సవ్యముగానే పూర్తి చేసేవాడు. నెలరోజులు పూర్తి కావటానికి ఒకరోజే మిగిలింది. వినాయకరావుకి ఏంచెయ్యాలో ఎలా చెప్పి జీతం తీసుకోవాలని ఎదురు చూస్తున్నాడు.

ఆ రోజున అక్కడికి ధనవంతులు వచ్చారు. వచ్చిన వాళ్ళు బాగానే కొనుగోలు చేశారు. ఆ ఆనందములో వినాయకరావు చిరంజీవితో అందరికీ డ్రింక్ తీసుకురా అన్నాడు. యజమాని మాట ప్రకారము అందరికీ డ్రింక్‌లు తెచ్చి ఇచ్చాడు. అందరూ త్రాగివెళ్ళారు. ఇంకా రెండు డ్రింక్‌లు ఉన్నాయి. ఈ రెండు డ్రింక్‌లు ఎవరికి? నిన్ను డ్రింక్‌లు తెమ్మన్నానుకానీ వాళ్ళకి ఇవ్వమన్నానా అంటూ నీకు ఈ నెల జీతం ఇవ్వను అన్నాడు వినాయకరావు. ఇంతలో వెనక్కి వెళ్ళిన ధనవంతులు రావటం ఆ సంభాషణ వినడం వలన చిరంజీవి నెల జీతం తాము ఇస్తామనిచెప్పి, అతని వద్ద కొనుగోలు చేసిన కొన్ని వస్తువులు బాగాలేవని చెప్పి తిరిగి ఇచ్చివేశారు. వినాయకరావు గురించి ఆ ధనవంతులు అందరివద్దా చెప్పటం వల్ల అతని వ్యాపారము పూర్తిగా దెబ్బతినింది.

చేతకాని పని హాని

అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న కోతి పల్లె కారులు వలలు విసరడం చూసింది. పల్లెకారులు వలలను విసురుతూ వుంటే, చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ళ మీద పడుతూ వుండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది. తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది. చెట్టు దిగి, అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్ళకే చుట్టుకుంది. వలను విసరడం చేతకాక కాళ్ళకు చుట్టుకొన్న వలను తీసుకోవడానికి ప్రయత్నిచడంవలన, ఆ కోతి ఎంతో జంజాటన పడిపోయింది. ఆ జంజాటనతో వల అంతా దాని ఒంటి నిండా చుట్టుకొని పోయింది. కాళ్ళు చేతులు కట్టివేసినట్లు అయిపోయి కేరు కేరుమని అరుస్తూ గిలగిల కొట్టుకోసాగింది. ఇంతలో పల్లె కారులు అక్కడకి వచ్చారు. కోతి అవస్థ చూసి, జాలి కలిగి మెల్లిగా వలను వూడదీశారు.

అంతసేపు పడిన జంజాటనతో కోతి అలిసి పోయి, ఆ పక్కనే వాలిపోయింది! పల్లెకారులు కోతిని చూసి ఇలా అనుకున్నారు "ఏ పని అయినా తెలియకుండా చేయకూడదు, పని నేర్చుకోకుండా చేయడానికి పూనుకోకూడదు" పిచ్చికోతి మనషులు చేసినట్లు చేయబోయి, వలలో చిక్కుకుంది. ఇలాంటి వాటినే 'కోతిచేష్టలు' అంటారు, అని మెల్లిగా కోతిని లేవదీసి చెట్టు దగ్గరకు చేర్చారు.       

చెరపకురా... చెడేవు!

ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు.

సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరలకు పంచి పస్తులుండేవాడు.

ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు, ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు. ఆమె ఒక దుర్మార్గపు పన్నగం పన్నింది.

వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, "అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాస్సేపు కూర్చుని వెళ్ళు" అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటినుంచి జీవితాంతం మంచి తనంతో మెలిగింది.       

చెడ్డ బేరం

పూర్వకాలంలో గుర్రాలు మిగతా జంతువులతోపాటు కలిసి అడవుల్లోనే జీవించేవి. ఒక రోజు ఒక గుర్రం ఒక మనిషి దగ్గరకు వెళ్ళి. "దయచేసి నన్ను కాపాడండి. అడవిలో ఒక సిణం నన్ను చంపాలనుకుంటోంది" అంటూ ప్రాభేయపడింది.

"భయపడకు మిత్రమా! నేను నిన్ను రక్షిస్తాను. సిణం నిన్ను ఏమి చేయదు" అన్నాడు మానవుడు.

దానితో గుర్రం ఎంతో సంతోషించింది. కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. తిరిగి మానవుడు ఇలా చెప్పాడు, "మరి నువ్వు ఏం చెప్పినా వినాలి."

"నువ్వేం చెప్పినా చేస్తాను. నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు" అంది గుర్రం. "సరే మరి నువ్వు నీ మీద నన్ను స్వారీ చేసుకోనివ్వాలి," అన్నాడు.

ప్రాణభయంతో ఉన్న ఆ గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకుంది. మానవుడు దానిమీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు. అక్కడ పశువుల కొట్టంలో దాన్ని ఉంచి "ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చింతగా ఉండచ్చు. నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమి ఉండదు. నేను నిన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడల్లా నీ వీపు మీద స్వారీ చేస్తుంటాను. నేను నీతో ఉంటే ఆ సిణం నిన్ను ఏం చేయలేదు" అన్నాడు. ఆ తరువాత తలుపులు వేసి వెళ్ళిపోయాడు.

గుర్రం ఒంటరిగా మిగిలిపోయింది. "నేనిక్కడ జాగ్రత్తగా ఉండగలను. కాని స్వేచ్చలేదు. నా రక్షణను కోరుకున్నాను కాని స్వేచ్చను కోల్పోయాను. ఇది చలా చెడ్డ బేరం," అనుకుని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం.

ఇక ఆరోజు నుండి మానవుని అదుపాజ్ఞలో బ్రతకసాగింది.

చెడుస్నేహం


ఒకసారి నీటిలో సరిగా ఈదలేని తేలు నదిని దాటాలన్న తన ముచ్చటను తీర్చుకోవాలనుకుని ఒక తాబేలు దగ్గరకు వచ్చి "నేను నీ వీపు మీద ఎక్కుతాను. నన్ను నది దాటిస్తావా?" అని అడిగింది. బదులుగా తాబేలు, "నేను నది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నీ కొండితో కుట్టావంటే నేను మునిగిపోతాను కదా!" తన సందేహం వెలిబుచ్చింది.

"మిత్రమా! నేను నిన్ను కుడితే నీవు మునిగిపోతావు. నీతో పాటు నేను కూడా మునిగిపోతాను కదా! మరి నిన్ను నేనెందుకు కుడతాను" అని తాబేలు సందేహం నివృత్తి చేసింది తేలు. "అవును. నువ్వన్నదీ నిజమే! సరే ఎక్కు" అని తేలును తన వీపు మీద ఎక్కించుకుంది తాబేలు.

దర్జాగా తాబేలు వీపుపైకెక్కిన తేలు, నది మధ్యభాగంలో ఉండగా తాబేలును తన పదునైనకొండితో కరవడంతో నొప్పికి విలవిల్లాడిన తాబేలు నది మట్టానికి చేరుకుంది. దానితోపాటే తేలు కుడా నది మట్టానికి చేరువైంది.

ఆ సమయంలో తాబేలు... తేలును "నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను కుట్టవని చెప్పావు కదా! మరి ఎందుకు కుట్టావు?" అని అడిగింది. "నేను ఎవరినైనా కుట్టే సమయంలో నేనేం చేస్తానో నాకే తెలియకుండా జరిగిపోతుంది. అది నా స్వాభావిక లక్షణం. దానికి నేనేమీ చేయలేను." చెప్పింది తేలు మునిగిపోతూ.

చెడు స్నేహం

కొన్ని కాకులు అదే పనిగా పంటచేలలో పడి ధాన్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఒక పావురం చాలా రోజులుగా తిండి లేక బాధపడుతూ ఉంది. తన యజమానేమో తనకు ఆహరం పెట్టడం లేదు కాని కాకులు మాత్రం చాలా స్వతంత్రంగా ధాన్యాన్ని దోచుకుంటున్నాయని పావురం అనుకుంటూ ఉంది.

ఒక రోజు పావురం కాకుల నాయకుడిని అడిగింది ప్రతి రోజు మీకు చాలా ఆహరం లభిస్తుంది కదా! నన్ను కూడా మీగుంపులోకి చేర్చుకోండి. నేను కూడా మీతో పాటే ఎగరగలను, మీతో పాటే పొలంలో ధాన్యం తింటాను అందుకు కాకులన్నీ సరే అన్నాయి. ఆ రోజు నుండి కాకులన్నీ పావురాన్ని తమతో తీసుకునివెళ్తూ కలిసి ధాన్యాన్ని తింటున్నాయి. అలా కొంతకాలం హయిగా గడిచిపోయింది. పావురం తన యజమానిని పూర్తిగా మరిచిపోయింది.

ఒక రోజున రోజులాగే కాకులన్నీ పొలంలో ధాన్యం కొల్లగొట్టి తినడానికి నిర్ణయించుకున్నాయి. అన్నీ కలసి ఎగిరి పొలంలో గుంపులుగా వాలాయి. కాని, పాపం ఒక్క కాకి కూడా మళ్ళీ పైకి ఎగరలేక చతికిలబడిపోయాయి. పొలం యజమాని తన పొలం మీద ఒక వలను పరిచాడు. అతను పరిచిన వలలో కాకులన్నీ ఇరుక్కుపోయాయి. వాటితో పాటే పావురమూ ఆ వలలో చిక్కి రైతుకు ఆ రాత్రి భోజనమయింది.

చీమ - రాజు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది.

చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.

చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

కండ చీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ, పప్పు బద్దలను నోటకరచుకొని, తొండకు దొరకకుండా అవి కండ చీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి, గుంపుగా!ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్క సారిగా తినెయ్యవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరకొట్టడం మొదలు పెట్టింది.

కలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి, తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయం భయంగా చూస్తూ వున్న చీమలకు ధైర్యం వచ్చి, కండ చీమ చుట్టూ చేరాయి. కండ చీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి!

'మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకొంటున్న తొండను దిగమింగింది పాము' అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ! తన ఎత్తు ఫలించినందుకు

ఎంతో ఆనందించింది. అందుకే "ఉపాయం వుంటే అపాయం తప్పించు కోవచ్చును" అంటారు పెద్దలు.       

చిలుక తెలివి

వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి.

అప్పుడు మూడవ నిజంచెబుతాను. అదికూడా నచ్చితే నాకు స్వేచ్చను ప్రసాదించాలి. సరేనా! అని, వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి వప్పుకొన్నాడు. చిలక మొదటినిజం ఇలాచెప్పినది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చినది. చిలుకను డాబా మీదుకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పినది. ఏదయినా సరే నీకళ్ళతో నీవు చూచేదాకా నీవు నమ్మద్దు, వ్యాపారికి ఈ సలహా కూడా నచ్చింది. చిలుక కొబ్బరిచెట్టు కొసన కూర్చుంది. మూడవ సలహా చెప్పమని వ్యాపారి అడిగాడు. అప్పుడు చిలుక నాకడుపులో రెండు వైఢూర్యాలున్నాయి. నా కడుపు కోస్తే అవి లభ్యమవుతాయి అంది.

దాంతో వ్యాపారికి కలవరం పట్టుకొంది. అయ్యయ్యో! చిలుకను పట్టుకోలేనే! అనవసరంగా రెండు వైఢూర్యాలూ చెయ్యిజారిపోయే! అని బాధపడ్డాడు. చిలుక అందనంత ఎత్తులో ఉంది. ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకొన్నాడు. అప్పటికే వ్యాపారి ధోరణిని గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది. నీకు రెండు సలహాలు ఇచ్చాను. అయినా నీవు పాటించలేదు. ప్రాణంతో సమానమైనది పోయిన బాధపడకూడదని చెప్పాను. వైఢూర్యాలు పోగొట్టుకుంటున్నానే అని బాధ పడిపోతున్నావు. అలాగే నీకళ్ళతో నీవు చూచే వరకు నమ్మవద్దని చెప్పాను. కానీ నీవు అలా చేయడం లేదు. నా కడుపులో వైఢూర్యాలున్నా యని చెప్పడంతోటే ఒకటే కలవర పడుతున్నావు. నాకడుపులో వైఢూర్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే నేనెలా బ్రతుకుతాను? సలహాలు పాటించనివారికి సలహాలివ్వకూడదని పెద్దలిచ్చిన సలహాను నేను మరచిపోలేను. ఇ ది నా మూడవ సలహా, వస్తాను అంటూ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. వ్యాపారి మొహం సిగ్గుతో చిన్నపోయింది.       

చిలక పలుకులు

అక్బర్ చక్రవర్తికి వేటాడ్డం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‌ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్‌ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు అక్బర్‌ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్‌ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్‌ బీర్బల్‌తో "బీర్బల్‌! నువ్వు పక్షుల భాషను అర్ధం చేసుకుంటానని చెప్పావుగా, ఆ చిలకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా?" అని అడిగాడు.

బీర్బల్‌ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, "రాజా! ఈ చిలకలు పెళ్ళి పద్ధతులు గురించి మట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ, పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు" అని చెప్పాడు.

ఇంకా ఏం మట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్‌, "మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?" అని అడిగాడు.

బదులుగా బీర్బల్‌ "మహారాజా! పెళ్లికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవని పెళ్లికూతురు తండ్రిని అడగగా, పెళ్లికూతురు తండ్రి అయిన ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడటం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నింటిని కూడా పక్షులు, జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు" అన్నాడు. చిలుకల సహాయంతో బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటలను తెలివిగా అక్భర్‌కు చెప్పేశాడు. తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకువచ్చిందో గ్రహించిన అక్బర్ వెంటనే దానికి కళ్ళెం వేశాడు.       

చల్లటి ఎండాకాలం

అది ఎండ మండుతున్న వేసవి కాలం. వేడి వాతావరణం. శ్రీకృష్ణదేవరాయలతో సహా సభికులందరినీ ఆసహనానికి గురి చేసింది. ఆస్ధాన పూజారి మరింత అసహనంతో "ప్రభూ! ఉద్యానవనంలో తెల్లవారు ఝామున ఉండే స్వచ్చమైన గాలి ఎంత చల్లగా, మధురంగా ఉంటుంది. ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా?" అని అడిగాడు రాయలవారిని.

"ఆహా! చలా మంచి ఉపాయం. ఎవరైనా తోటలోని స్వచ్చమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే, వారికి ఐదు వందల వరహాలు బహుమతిగా ఇస్తాను" అని ప్రకటించాడు రాజు. ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగో తెలియని సభికులంతా మొఖాలు వేలాడేసుకున్నారు. రాజుగారికి, ఆస్ధాన పూజారికి పిచ్చి పట్టిందని లోలోపల నవ్వుకున్నారు.

మరునాడు ఉదయం సభ సమావేశంలో సభికులంతా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమోనని, కానీ అది అసాధ్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే రామలింగడు లేచి "రాజా! మీరు చెప్పిన విధంగానే నేను తోటలోని స్వచ్చమైన, సువాసనలు వెదజల్లే గాలిని సభలోకి తీసుకొచ్చాను" అన్నాడు "అవునా? ఏది?" అని ఆతృతగా, సంతోషంగా అడిగాడు రాజు.

రామలింగడు సైగ చేసి, నలుగురు సైనికులను పిలిచాడు. వారు నేరుగా రాజు గారి పక్కకు వెళ్ళి నిలుచున్నారు. వారి చేతిలో పచ్చి వెదురు బొంగులతో, తయారు చేసిన విసనకర్రలు, గులాబి, మల్లెపూవులతొఈ అలంకరింపబడి ఉన్నాయి. ఆ విసనకర్రలు అతారు పూయబడి, నీటిలో తడపబడి ఉన్నాయి.

రామలింగడి ఆజ్ఞ మేరకు ఆ సైనుకులు రాజుగారికి విసరటం మొదలెట్టారు. దానితో సభ మొత్తం సువాసనతో నిండిపోయింది.

ఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతిని ఇచ్చింది. "తెనాలిరామా! నీ తెలివి అమోఘం, నీ మేధస్సు అమోఘం అంటూ కాస్సేపు రామలింగడిని పొగిడిన రాజు "నీవు నా కోరికను నెరవేర్చావు. నీకు ఐదు వందల వరహాల బదులుగా పదిహేను వందల వరహాలు బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు ఈ సదుపాయం శాశ్వతంగా ఉండేలా వ్యవహారాల మంత్రిని ఆదేశిస్తున్నాను" అంటూ సభను ముగించారు రాయలవారు. రామలింగడి తెలివిని సభికులంతaాచప్పట్లతో మెచ్చుకున్నారు.

గొప్ప గుణం

మొగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో ధర్మయ్య తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు ధర్మయ్య అంటే చాలా ఇష్టం. కాని రంగయ్య మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో ధర్మయ్యకున్న గొప్ప పేరును చూసి రంగయ్య అసూయపడేవాడు. ఎలాగైనా ధర్మయ్యను దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన ధర్మయ్యకే అప్పగించారు. అది చూసి ఓర్వలేని రంగయ్య మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. ధర్మయ్య ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు. ధర్మయ్య గుడి తాళాలను పెట్టెలో పెట్టి భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

ఒక రోజు ధర్మయ్య భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి రంగయ్య ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు ధర్మయ్య వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్ద భీమన్న ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు ధర్మయ్య, రంగయ్యలు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద భీమన్న, ధర్మయ్యా! తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. ధర్మయ్య గ్రామ పెద్ద వంక చూసి "అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు" అని బదులిచ్చాడు. "ఈ ధర్మయ్య మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని రంగయ్య చెప్పాడు.

గ్రామ పెద్ద భీమన్నకు రంగయ్య మాటలపై నమ్మకం కలుగలేదు. ధర్మయ్య నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద ధర్మయ్య ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను భీమన్నకు అందజేసారు. భీమన్న ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే "రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు భీమన్న "రంగయ్య నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన ధర్మయ్యపై నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను" అన్నాడు. అప్పుడు ధర్మయ్య రంగయ్యను క్షమించి వదిలివేయమని గ్రామపెద్దను వేడుకున్నాడు. భీమన్న ధర్మయ్య మాట కాదనలేక రంగయ్యను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే ధర్మయ్య గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. రంగయ్య, ధర్మయ్య చేతులుపట్టుకొని "అసూయతో చేసిన నేరానికి క్షమించమని" అడిగాడు. ధర్మయ్య "ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడు. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు.

గెలుపు గర్వం

ఒక గడ్డి మైదానంలో రెండు కోడిపుంజులు నివాసముండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి.

రెండు పుంజులూ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధనికి సన్నద్ధమయ్యాయి. ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది. పోరు మొదలైంది. ఆ రెండు పుంజులలో ఒకటి అత్యంత బలమైనది. కాగా మరోటి కొంత బలహీనమైనది.

కొద్దిసేపటి తరువాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది.

అంతే గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. "చూసావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును. నువ్వు నా బానిసవు. ఈ రోజునుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి" అని పకపకా నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలనీ, ఓటమిపాలైన పుంజు అవమానపడాలనీ గంతులేస్తూ గట్టిగా అరవసాగింది. ఓడిపోయిన కోడిపుంజు తలవంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది.

ఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి. గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసికట్టలేక పోయిందా కోడిపుంజు. ఇంకేముంది గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి తినేసింది. ఓడిపోయిన కోడిపుంజే ఆ మైదానానికి యజమాని అయింది.       

గురువును మించిన శిష్యుడు

ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. సూరిబాబు వంతు వచ్చింది. ఇంతలో బడి గంట మోగటంతో వారంతా బడిలోకి గబగబ అడుగులు వేయసాగారు. గదుల నుంచి బయటకు వచ్చారు. అప్పుడే పాఠశాల ఆవరణలో ఆగిన కారు వంక అందరూ తదేకంగా చూడసాగారు. కారులోంచి ఓ వ్యక్తి దిగడం, ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్ళడం గమనించిన విద్యార్థులు అతడు ఎవరై ఉంటాడోనని గుసగుసలాడసాగారు. మధ్యాహ్నాం చివరి పీరియడ్ "నీతిబోధన" తరగతికి తెలుగు మాష్టారు వచ్చారు. మాష్టారు చెప్పే నీతి కథలంటే పిల్లలకెంతో ఇష్టం. ఆ రోజు మాష్టారు చెప్పబోయే కథకోసం పిల్లలెంతో ఆత్రుతతో ఎదురు చూడసాగారు. కానీ మాష్టారు తాను చెప్పిన నీతికథలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు.

తెలుగు మాష్టారు విద్యార్థులను తాము ఇతరులకు సాయపడిన సందర్భాల గురించి అడగడంతో వారు అవాక్కయ్యారు. మాష్టారు చెప్పిన కథలు వినడం వాటిని తమ స్నేహితులకు చెప్పడం తప్ప ఆ కథల్లోని నీతిని తమ జీవితంలోని వివిధ సందర్భాలలో ఎలా అన్వయించుకోవాలో తెలియక, బొత్తిగా ఆచరించని ఆ విద్యార్థులు మాష్టారు వేసిన ప్రశ్నకు బిక్కముఖం వేశారు. తాను ఇన్నాళ్ళు చెప్పిన నీతికథలు బాలల ఆలోచనల్లో ఏ మాత్రం కదలిక తేలేకపోయినందుకు మాష్టారు బాధపడ్డారు. మాష్టారి మనస్సును సరిగ్గా చదవగలిగిన సూరిబాబు, తాను ఆచరించిన పనులను మాష్టారి ముందుంచేందుకు తనకెందుకు ధైర్యం చాలడంలేదోనని కలవరపడ్డాడు. ఎలాగైనా సరే, మాష్టారి బోధనల వల్ల తాను చేసిన ఒక మంచి పనిని మాష్టారికి చెప్పి అతడి వేదన పోగొట్టాలని తలచిన సూరిబాబు "మాష్టారూ! నేను చెబుతా!" అని మనసులోనే అనుకుంటూ పైకి లేవబోయాడు. ఇంతలో తెలుగు మాషార్ని ప్రధానోపాధ్యాయుడు పిలుస్తున్నారని కబురు రావడంతో మాష్టారు వెళ్ళిపోయారు. సూరిబాబుకు తాను చేసిన పని మాష్టారికి చెప్పే అవకాశం చేజారిపోయింది. కొంత సేపటికి లాంగ్‌బెల్ కొట్టడంతో పిల్లలంతా బడి వదిలిపెట్టారు.

మరుసటి రోజు ఉదయం ప్రార్థనా సమావేశం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుడు ఓ కొత్త వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు. క్రితం రోజు పాఠశాలకు కారులో వచ్చిన ఆ వ్యక్తిని కొందరు గుర్తించారు. అతడు వృద్దాశ్రమానికి చెందిన ఆఫీసరు. తర్వాత తెలుగు మాష్టార్ని వేదికపైకి ఆహ్వానించారు. మాష్టారి నీతికథల వల్ల ఓ విద్యార్థి ఆలోచనల్లో వచ్చిన మంచి మార్పే నేడు మన పాఠశాలకు ఎంతో గర్వకారణమయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతుండగా, అందరూ ఆ విధ్యార్థి ఎవరో? అని ఎదురు చూడసాగారు. తెలుగు మష్టారి ముఖంలో ఆనందం చూసి సంబరపడుతున్న సూరిబాబు తనను వేదికపైకి పిలవడాన్ని పట్టించుకోలేకపోయాడు. తమ తోటి విద్యార్థులు తనను వేదికపైకి వెళ్ళమని చెప్పడం, అందరూ తన వంకే చూస్తూ ఉండటం, ఏమి జరుగుతుందో ఏమీ అర్థంకాని సూరిబాబు తడబడుతూ వేదికపైకి వెళ్ళాడు. ఆదివారం నాడు నడిరోడ్డుపై అడ్డంగా వెళుతున్న ఓ అంధ వృద్ధుణ్ణి బస్సు ప్రమాదం నుండి కాపాడడమేకాక అతణ్ణి వృద్ధాశ్రమంలో చేర్చిన సూరిబాబుకు వృద్ధాశ్రమ ఆఫీసర్ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

విద్యార్థులు, టీచర్లు తమ కరతాళ ధ్వవనులతో సూరిబాబును అభినందించసాగారు. సూరిబాబుని మాట్లాడమని వృద్ధాశ్రమ ఆఫీసరు కోరారు. "తాను ఆచరించడమే కాక, నీతికథల ద్వారా మాలో మానవతా దృక్పథాన్ని పెంపొదిస్తున్న మా తెలుగు మాష్టారే నాకు ఆదర్శం" అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు సూరిబాబును అభినందిస్తూ, గురువుని మించిన శిష్యుడని అభివర్ణించారు.       

గురువుగారి సేవ

ఒక గురువుగారు, ఆయనకిద్దరు శిష్యులు. శిష్యులు స్వతహాగా మంచివారే కానీ కొంచెం అమాయకులు, మరి కొంచెం తెలివితక్కువ వారు. ఒకడి పేరు రామ, మరోకడి పేరు సుధామ. వారి ప్రవర్తన గురువుకు అప్పుడప్పుడు చాలా తలనొప్పిగా తయారయ్యేది. అయినా సరే ఆయన వాటన్నింటిని సహిస్తూ వారికి కొంతైనా విద్య ఒంటబట్టాలనే ఉద్దేశ్యంతో తన దగ్గరే ఉంచుకున్నాడు.

ఒకరోజు గురువుకి కాస్త ఒంట్లో నలతగా ఉండి కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. శిష్యులను పిలిచి, "రామా, సుధామా! నాకు ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి. మీరిద్దరు నా కాళ్ళు నొక్కాలి నేను కొంచెంసేపు నిద్రపోతాను." అన్నాడు.

గురువుగారికి సేవ చేసే అవకాశం రావడంతో శిష్యులకు చాలా సంతోషం కలిగింది. "తప్పకుండా గురువుగారు!" ఎంతో ఉత్సాహంగా అన్నారు.

రామ, సుధామ గురువు చెరో కాలు తమ ఒళ్ళో పెట్టుకుని ఎంతో ప్రేమతో కాళ్ళు నొక్కసాగారు. కొంచెంసేపు తరువాత నిద్రలో గురువు రెండు కాళ్ళు దగ్గరకు తీసుకోవడంతో రామ ఒత్తుతున్న కాలు సుధామ దగ్గరున్న కాలికి తగిలింది.

"ఏయ్‌ రామా, నీ కాలును దూరంగా ఉంచు. లేకపోతే బాగోదు." అన్నాడు సుధామ కోపంగా.

"పోవోయ్‌, నీదేమైనా గొప్పకాలా? ఛండాలమైన కాలు. నువ్వే నీ కాలును దూరంగా ఉంచుకో" అని జవాబిచ్చాడు రామ.

సుధామ ఇంకోమాటన్నాడు. దానికి రామ ఇంకోలా జవాబిచ్చాడు. ఈ విధంగా వాదన కాస్త పోట్లాటలోకి మారిపోయింది. ఒకడు కాలిని నరికేస్తానంటే మరొకడు నిప్పుతో తగలెడతానని అన్నాడు. అంతే రామ కోపంగా వంటింటి వైపు పరిగెత్తి మండుతున్న కట్టెను తీసుకుని వచ్చాడు. సుధామ బయటకు పరిగెత్తి గొడ్డలి పట్టుకుని వచ్చాడు.

ఈ గందరగోళానికి గురువుకు మెలుకవ వచ్చి చూస్తే ఏముంది? ఆయన్ని తగలబెట్టడానికి, నరకడానికి ఇద్దరు శిష్యులు యమదూతల్లా నిలబడి ఉన్నారు.

"ఒరేయ్‌ నాయనల్లారా ఏమిటిరా ఇది!" కంగారుగా పైకి లేచాడు గురువు. జరిగింది తెలుసుకుని ఇద్దరిని బాగా చివాట్లు వేసాడు.       

గురువా! మజాకా!

ముల్లా నస్రుద్దీన్‌ తన పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి. చాలామంది తాము కూడా నస్రూలా చతురత, మేధాశక్తి కలిగివుండాలని కోరుకునేవారు. ఒకరోజు కొందరు విద్యార్ధులు నస్రును కలిసి ఇలా అడిగారు, "గురువుగారూ! మేము మీ గురించి చాలా విన్నాం. మీకు ప్రతి ప్రశ్నకూ జవాబు తెలుసని అంతా అనుకుంటారు. మీ చతురత, మేధాశక్తిలో మేము కొంతభాగం సంపాదించుకోగలిగినా చాలు, మమ్మల్ని మీ శిష్యులుగా అంగీకరించండి."

మొదట నస్రు తిరస్కరించాడు. అతనికి చాలా సిగ్గు, అతనొక గురువుగా ఉండటానికి ఇష్టపడలేదు. కాని విద్యార్ధులు ప్రాద్ధేయపడడంవల్ల అతను ఒప్పుకోక తప్పలేదు. నస్రు విద్యార్ధులతో "సరే! నేను మిమ్మల్ని నా శిష్యులుగా అంగీకరిస్తున్నాను, కాని కొన్ని రోజుల వరకే. మీరు ఏమి చేస్తున్నారో చూసి కొన్నిసార్లు ప్రజలు నవ్వుతారు, కాని ప్రతీ పని వెనుక ఒక కచ్చితమైన ఉద్దేశ్యం వుంటుంది." అని చెప్పడంతో విద్యార్ధులు సంతోషించారు.

వారిలో ఒక విద్యార్ధి ఇలా అన్నాడు, "ముల్లాగారూ! ప్రజలు మీలా గొప్ప శక్తులను పొందాలని కోరుకుంటారు. మీరేమైనా శక్తులను పొందారా?

నస్రు నవ్వుతూ, "హా! అవును! నేను చీకటిలో కూడా చూడగలిగే శక్తిని సంపాదించాను", అన్నాడు. విద్యార్ధులు ఆశ్చర్యపోయారు. మరో విద్యార్ధి "గురువుగారూ! మీరు చీకటిలో లాంతరు పట్టుకుని నడవడం నేను చూశాను. మీకు చీకటిలో కనిపించినట్లైతే మీరు అలా ఎందుకు చేస్తారు?" అన్నాడు.

నస్రు నవ్వుతూ, "ఆహ్‌ ఎందుకంటే ఇతరులు చీకట్లో చూడలేరు కదా! లాంతరు నన్ను ఇతరులు ఢీకొట్టకుండా కాపాడుతుంది" అని చెప్పాడు.

విద్యార్ధులు నవ్వుతూ నస్రు మేథోశక్తి, చతురతను పొగిడారు. కొంత సమయం తర్వాత నస్రు విద్యార్ధులతో "పదండి మిత్రులారా! ఇంటికి వెళ్ళిపోదాం. మీకు ఇంటికెళ్ళడానికి గుర్రాలున్నాయా?" అని ప్రశ్నించాడు.

విద్యార్ధులు, "లేవు గురువుగారూ!" అని బదులిచ్చారు.

దాంతో నస్రు గుర్రం మీదకు ఎక్కి మెల్లగా స్వారీచేస్తుండగా, విద్యార్ధులు నడుస్తూ అతన్ని అనుసరించారు.

కానీ నస్రు తన గుర్రం మీద తల వెనుకకు, వీపు ముందుకు చేసి కూర్చోవడంతో విద్యార్ధులంతా ఆశ్చర్యపోయారు. వీధుల్లో వెళ్తున్న ప్రజలు నస్రును చూసి పగలబడి నవ్వడం మొదలెట్టారు.

ఒక విద్యార్ధి ఉండబట్టలేక కుతూహలంతో "గురువుగారూ! మీరు గుర్రంపై ఎందుకిలా వెనుదిరిగి కూర్చున్నారో కాస్త చెప్తారా? ప్రజలంతా మనల్ని చూసి నవ్వుతున్నారు", అని అడిగాడు. నస్రు, "కూర్చోవడంవల్ల మీకు ఒక పాఠం అబ్బుతుంది. మీరు ఇతరుల పరిహాసాన్ని పరిగణలోకి తీసుకోరాదు మిత్రులారా!" అని బదులిచ్చాడు.

తర్వాత అతనిలా అన్నాడు. "నేను వెనుదిరిగి ఎందుకు కూర్చున్నానంటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను కాబట్టి. మీరు నా ముందు నడుస్తూ, నేను మిమ్మల్ని అనుసరిస్తే అది నాకు అగౌరవం. అదే నేను ముందు వెళ్తూ, మీరు నన్ను అనుసరిస్తే అది మీకు అమర్యాద. వెనుదిరిగి స్వారీచెయడమే మనందరికీ గౌరవప్రదమైన పద్ధతి". అది విన్న విద్యార్ధులు చప్పట్లు చరుస్తూ. తమ కొత్త గురువు నస్రుతో నవ్వుతూ ప్రయాణం కొనసాగించారు.

గుణపాఠం

ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి రెండు తలలు, రెండు ముక్కులు, రెండు మెడలు ఉన్నాయి. కాని ఒక్కటే కడుపు ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతుండగా దానికొక దేవతాఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, "ఆహా! ఎంత రుచిగల పండు. ఎన్నో పండ్లు తిన్నాను కాని దీనంత రుచిగల పండు తినలేదు" అనసాగింది మొదటినోరు.

"నాక్కుడా సగం ఫలం ఇవ్వవా? నేను కూడా రుచి చూస్తాను" అని రెండోనోరు. "నేను తిన్నా నువ్వు తిన్నా ఒక కడుపులోకే కదాపోయేది" అంటూ మిగతా పండునంతా తినేసింది మొదటినోరు. ఎలాగైనా మొదటినోటికి గుణపాఠం చెప్పాలనుకున్నది రెండోనోరు.

ఆ రోజు నుండి మొదటినోటితో మాట్లాడటం మానేసింది రెండోనోరు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెండోనోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విష్పు ఫలం కనబడింది.

"అది విషపుఫలం. నీవు దానిని తింటే నువ్వు, నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఒకే పొట్ట కదా!" అని మొదటి నోరు రెండో నోటిని ఆ విషపు ఫలం తిన వద్దని వారించసాగింది.

విషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండోనోరు మొదటినోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటినోరు అనుకుంటున్న తరుణంలో, "చుశావా? నేనీ విషఫలం తింటే నువ్వు, నేను ఇద్దరం చచ్చే వాళ్లం. మనకిద్దరికీ ఒకే పొట్ట ఉన్నా మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ, సజావుగా, సఖ్యతగా ఉంటే సమస్యలే రావు" చెప్పింది రెండోనోరు.

అవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న మొదటినోరు ఆ రోజు నుండి రెండోనోటితో సజావుగా, సఖ్యతగా ఉండసాగింది.

గుడ్డి రాబందు - జిత్తులమారి పిల్లి

ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది.

ఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు "ఎవరు, ఎవరక్కడా?" అని అరిచింది.

రాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, " నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది.

"నేను పిల్లిని" అని జవాబిచ్చింది పిల్లి.

"వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి "గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే" అని ప్రాధేయపడింది.

"మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు?" అని రాబందు పిల్లిని నిలదీసింది.

"నీవు ఎంతో బుద్ధి, తెలివితేటలు గలవాడివని విని, నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను. కాని నీవు ఈ బక్క పిల్లిని చంపాలనుకుంటున్నావు. "నన్ను అతిధిలా ఆదరించాలి" అని చెప్పింది పిల్లి. పిల్లి మాటలకు రాబందు "కాని నువ్వు మాంసాహారివి. నిన్ను నేనెలా నమ్మగలను?" అంది. బదులుగా పిల్లి "నేను జీవహింస చేయడం పాపమని తెలుసుకుని శాకాహారిలా మారిపోయాను" అని చెప్పింది. గుడ్డి రాబందు పిల్లిని నమ్మింది. చెట్టుపైన ఉన్న తన గూట్లో ఉండనిచ్చింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి, జిత్తులమారి పిల్లి పక్షి కూనలను ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా తినడం మొదలు పెట్టింది. గుడ్డి రాబందుకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.

కాని పక్షులు మాత్రం తమ పక్షి కూనలు కనబడకపోతుండడం గమనించాయి. ఎప్పుడైతే తన పని ముగిసిందో, పిల్లి మెల్లగా్ జారుకుంది. కొన్ని రొజుల తర్వాత, పక్షులు తమ పక్షి కూనల ఎముకలను గుడ్డి రాబందు గూటిలో కనిపెట్టాయి.

"ఈ గుడ్డి రాబందు మన పిల్లల్ని తినేసింది" అనుకుని, పక్షులన్నీ కలిసి ఆ గుడ్డి రాబందును పొడిచి చంపేశాయి.

గాడిద గర్వం...

ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద, కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా, దిట్టంగా ఉండేది. రెండు జంతువులూ చాలా స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దానిని చంపి,తినాలని అనుకుంది.

సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి, గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని "కొక్కొరోకో....కొక్కొరో" మని అరవసాగింది. కోడి పుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని, తనను తాను మృగరాజులా ఊహించుకుని సింహం వెంటబడడం ప్రారంభించింది.

సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చింది అనుకుని ఒకేఒక్క గెంతులో గాడిద మీద పడింది. తన పని ముగించి బ్రేవుమంది.

గాండ్రించిన కప్ప

పుట్టలు, గుట్టలు దాటుకొంటూ సింహం హడిలి పోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క, గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం, ఆయాసంతో వొణుకుతూ చెప్పింది.

"మామూలుగా కొలనులో మంచి నీళ్ళు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్, గుర్...పువ్వాం పువ్వాం... బెకా బెకా మంటూ హొరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది, అటూ ఇటూ చూశాను...ఎవ్వరూ కనపడలేదు సరిగదా! ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి వుంటుంది!నన్ను చంపడానికి ఏ దెయ్యమో వచ్చి, అరుస్తుందని నాకు భయం వేసింది. పరుగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. కౄరమృగమో, దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్తిమితం కలగదు" అంటూ ముందు కాళ్ళపై తల పెట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టింది సింహం...! నక్కకు విషయం అంతా అర్ధమైయింది. ఆ అరుపులు, ఇది వరకు ఎన్నోసార్లు విన్నది నక్క! అందుచేత దానికి భయం కల్గలేదు. ఏమీ భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకు వచ్చింది. బిగ్గరగా అరవమంది, ఆ అరుపులు, విని శత్రుమృగం బైటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చెప్పింది నక్క . సింహం, కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది. అడవి దద్దరిల్లి పోయేలా అరుపులు మీద అరుపులుగా అరిచింది.

వెంటనే, అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులోంచి, ఓ బోదురుకప్ప గభాలున ఎగిరి సింహం దగ్గరకు ఒక్క దూకు దూకింది. అసలే భయంతో వున్న సింహం, మరింత కంగారు పడుతూ అటూ ఇటూ ఎగరడంతో ఆ బోదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి చచ్చింది.

'హమ్మయ్య' అనుకొంటూ సింహం చతికిలపడి కూర్చుంటే నక్క అన్నది.

'ఏవో అరుపులు విని, ఎవరో శత్రువులు అనుకొని గాబరా పడ్డావు గాని, కప్ప అల్పమైన జంతువు; దాని గొంతు మాత్రం పెద్దది! కర్ణ కఠోరంగా అరుస్తుంది... బలం లేని వాడు ఇలాగే అరుస్తాడు' అందుకే "బూకరింపులు బలహీనుని ఆయుధాలు" అంటారు పెద్దలు! అని హితవు చెప్పింది నక్క!

తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం.       

గతిలేని గబ్బిలం

ఒకప్పుడు పక్షులు, పెద్ద జంతువులు తమ మధ్య ఆధిపత్యం కోసం యుద్దం చేయాలని భావించాయి. పక్షిలా ఎగరగలిగే లక్షణమున్న జంతువు గబ్బిలం. దానికి పక్షులు, జంతువుల రెండింటి లక్షణం ఉండడం వలన అది ఏ గ్రూపులోనూ చేరక ఒంటరిగా మిగిలిపోయింది. పక్షులు దానిని తమవైపు రావలసిందిగా కోరినా... "నేను జంతువును" అని గర్వంగా చెప్పుకుంది. తరువాత కొన్ని జంతువులు దానిని తమవైపు రావల్సిందిగా కోరగా "నేను పక్షిని" అని వాటితో చెప్పింది.

కొన్ని రోజుల తరువాత యుద్దం ఆగిపోయి శాంతియుత వాతవరణం ఏర్పడింది. ఇప్పుడు గబ్బిలం వెళ్ళి పక్షులతో కలిసుండాలని వాటి వద్దకు వెళ్తే అవి దానిని తిరస్కరించాయి. తరువాత అది జంతువులతో జతకూడాలని అనుకుంది. అక్కడ కూడా దానికి అవమానం ఎదురైంది. అప్పటి నుండి గబ్బిలం చిన్న చిన్న పాడుబడ్డ బొయ్యారాలలో నివసిస్తూ, రాత్రి అయ్యే వరకు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా జీవిస్తోంది.

గంగ మంగ

ఒక ఊళ్ళో గంగ, మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటున్నారు. గంగ తనకున్న రెండు గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉండేది. మంగ తన ఎనిమిది గేదెలతో, పాలు అమ్ముకుని బతుకుతూ ఉంది.

ఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పుగా తీసుకుంది. ఎన్ని రోజులైనా నెయ్యిని తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాళిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగాలా? అని ఆలోచించిన గంగ ఒకనాడు, "మంగక్కా! నువ్వు నా దగ్గర ఆరు నెలల క్రితం కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు నా దగ్గర లేదు, చుట్టాలొచ్చ్హారు కాస్త ఆ నెయ్యి బాకీ తీరుస్తావా?" అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి "నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? ఎనిమిది గేదెలున్న నేనెక్కడ, ముష్టి రెండు గేదెలతో బతుకీడుస్తున్న నువ్వెక్కడ?" అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకి కన్నీళ్లు జలజలా రాలాయి. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది.

మరునాడు న్యాయసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ "అయ్యా! ఇదేమి న్యాయం? ఎనిమిది గేదెలున్న నేను రెండు గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం" అని విరుచుకుపడింది.

మంగ మాటలను గమనించిన న్యాయాధి కారి ఆమె మాటలలో ఉన్న కపటబుద్దిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు.

ఆ రోజు తన న్యాయస్ధానం ముందు దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగ మంగ ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ లోపలికి వచ్చ్హారు. భటులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్ళు ఇచ్చ్హారు. గంగ కేవలం సగం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగకి మూడు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో "ఏమ్మా! మూడు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ల బురదను వదిలించుకోలేక పోయావు. గంగ మాత్రం సగం చెంబెడు నీటితో శుభ్రం చేసుకుంది. ఎనిమిది గేదెలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు. దుబారా చేయటం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే గంగకు ఇవ్వవలసిన కిలో నెయ్యితో బాటు మరో నాలుగు కిలోల నెయ్యి కలిపి మొత్తం ఐదు కిలోల నెయ్యి ఇచ్చేయి. లేకపోతే నీకు కఠినశిక్ష వేస్తాను" అన్నాడు.