Pages

Friday, September 7, 2012

గొప్ప ఇంటి విందు


ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ…యన గొప్ప ధనికుడూ, అంతకన్న గొప్ప అహంకారీనూ. ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులూ, కాపులూనూ. జమీందారుకు వాళ్ళ పొడ ఏమాత్రమూ గిట్టేది కాదు.
 
ఒక రోజు పొలాల్లో రైతులు, ‘‘ఇవాళ నేను జమీందారుగారిని అంత దూరంలో చూశాను,'' ‘‘ఇంత దూరంలో చూశాను,'' అని గొప్పగా చెప్పుకుంటూంటే, ఒక పేదకాపు విరగబడి నవ్వి, ‘‘ఏ చెట్టు చాటునుంచో, పుట్ట చాటు నుంచో జమీందారుగారిని చూడటం గొప్పా ఏమిటి? తలుచుకుంటే నేను జమీందారుగారింట విందుభోజనం తినగలను,'' అన్నాడు.
 
ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ‘‘ఈ మొహమేనా జమీందారుగారింట విందు కుడిచేది? నిన్ను జమీందారుగారి గడపదాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు. ప్రగల్భాలాడకు,'' అంటూ నలుగురూ నాలుగు మాటలూ అన్నారు.
 
‘‘ప్రగల్భాలాడే దాకా నాకేం పని? ఉన్న మాటే చెబుతున్నాను. నేను తలుచుకుంటే ఏ పూటైనా జమీందారుగారింటికి వెళ్ళి, భోజనం చేసి రాగలను,'' అన్నాడు పేదకాపు.
 
‘‘నువ్వు ఆ పని చేస్తే నీకు మూడు గరిసెల ధాన్యమూ, జత ఎద్దులూ ఇస్తాం. నువ్వు జమీందారుగారింటి భోజనం చెయ్యి లేకపోతే మేం చెప్పిన పనిఅల్లా చెయ్యాలి,'' అన్నారు రైతులు. ‘‘నాకేమీ అభ్యంతరం లేదు,'' అన్నాడు పేదకాపు. ఆ పూటే వాడు జమీందారుగారింటికి వెళ్ళాడు. తలవాకిట కావలివాళ్ళు వాణ్ణి తరిమికొట్టబోయారు.
 
‘‘కొంచెం ఆగండి. నేను ప్రభువువారి కొక శుభవార్త చెప్పాలి,'' అన్నాడు కాపు. ‘‘ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు. మేం ఏలిన వారితో చెబుతాం,'' అన్నారు కాపలావాళ్ళు. ‘‘ఈ శుభవార్త ప్రభువుగారితో స్వయంగా చెప్పాలి. అది మీతో చెప్పేది కాదు,'' అన్నాడు కాపు.

జమీందారుతో నౌకర్లు కాపువాడన్న మాట చెప్పారు. వాడు తనతో చెబుతానన్న శుభవార్త ఏమిటో తెలుసుకోవాలని జమీందారుకు కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పటానికి వచ్చాడు. అందుచేత ఆయన వాణ్ణి లోపలికి రానిమ్మని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందు ఉంచారు.
 
‘‘నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగే వున్నావు! ఏమిటి నువ్వు చెప్పదలచిన వార్త?'' అని జమీందారు కాపును అడిగాడు.
 
కాపువాడు రహస్యంగా, ‘‘గుర్రం తల కాయంత బంగారం ధర ఏపాటి ఉంటుందంటారు?'' అని జమీందారును అడిగాడు.
 
‘‘ఎందుకలా అడుగుతున్నావు?'' అన్నాడు జమీందారు. ‘‘ఒక కారణం ఉండి అడుగుతున్నాను, ప్రభూ. తమకు తెలిస్తే చెప్పండి,'' అన్నాడు పేదకాపు. ‘‘ఆ కారణం చెప్పమంటున్నాను,'' అన్నాడు జమీందారు.
 
కాపువాడు నిట్టూర్చి, ‘‘తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చెయ్యగలను? తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను. కడుపులో మండిపోతున్నది,'' అన్నాడు. జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధికాలేదు. గుర్రం తలకాయంత బంగారం చెయిజారి పోనివ్వటం ఇష్టంలేక ఆయన తన నౌకర్లను పిలిచి, ‘‘వీణ్ణి తీసుకుపోయి, వెంటనే సుష్టుగా భోజనం పెట్టండి,'' అన్నాడు. కాపువాడు రాజోపచారంగా కడుపునిండా తిండి తిని వచ్చాక, జమీందారు వాడితో, ‘‘నువ్వు ఆ బంగార మేదో పట్టుకురా! దాని గొడవ నీ కన్న నాకు బాగా తెలుసు. నీకు బహుమానం కూడా ఉంటుందిలే !'' అన్నాడు.
 
‘‘బంగారమా? నా దగ్గిర బంగారం ఎక్కడున్నది? రెండు గరిసెల ధాన్యమూ, జత ఎద్దులూ కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం అవునో కాదో తమరినడిగితే తెలుస్తుంది గదా అనుకున్నాను,'' అన్నాడు కాపు.
 
జమీందారుకు మండిపోయింది. ‘‘ఛీ, వెధవా! ఇంకో క్షణం ఇక్కడున్నావంటే నిన్ను చంపేస్తాను. మారు మాట్టాడకుండా పో!'' అన్నాడు కాపుతో. కాపు వెళ్ళిపోయి, రైతుల దగ్గిర పందెం గెలుచుకున్నాడు.

పట్టుదల!


రంగనాథుడికి పన్నెండేళ్ళ వయసువచ్చినా, వాడికి గురుకులంలో ఏమాత్రం చదువు అబ్బడంలేదు. ఆమధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా వాడు తప్పికూర్చున్నాడు. దానితో వాడికి బాధలు మొదల…య్యాయి.
 
తండ్రి, వాడిని ఎందుకూ పనికిరాని వెధవా అని తిట్టాడు. ఇదివరకు తను ఏదికోరితే అదివండిపెట్టే తల్లి, ఇప్పుడు వేళకు అన్నంకూడా సరిగా పెట్టడంలేదు. ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది. కానీ, తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు, విసుగుకలుగుతున్నది.
 
ఒక రోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. క్రితంరోజు మిత్రులతో కలిసి ఆడుతూంటే రాయితగిలి, వాడి కుడికాలుబొటన వేలికి చిన్నగాయమైంది. దాని మీద ఈగ ఒకటి వాలి బాధ కలిగిస్తున్నది. దాన్ని ఎంత తోలినా పోయినట్లేపోయి, తిరిగివస్తున్నది. దానితో వాడుపట్టరానికోపంతో, ‘‘ఛీ, ముదనష్టపుదానా!'' అంటూ అరిచాడు.
 
ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు, రంగనాథుడి అరుపువిని, వాణ్ణి అడిగి సంగతి తెలుసుకుని, ‘‘చూడు, రంగా! అల్పజీవి అయిన ఒక చిన్న ఈగకే తనకు కావలసినదానిపై అంతపట్టుదలవుంటే, అన్ని జీవులకంటే తెలివైన, శక్తికలిగిన మనిషికెంత పట్టుదల వుండాలో చెప్పు?'' అన్నాడు.
 
ఆ మాటలువింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు. అంతే! ఆరోజు నుంచీ మనసులగ్నం చేసి, పట్టుదలతో చదివాడు. నెలరోజుల తర్వాత పరీక్షకువెళ్ళి ప్రశ్నలన్నింటికీ తగు జవాబులు రాసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

వింతస్వార్థం


వెదిరేశ్వరం అనే గ్రామంలో, ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది. నెలలు నిండి కాన్పువచ్చే సమయంలో, ఆ చుట్టు పక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవారు. తల్లీ, బిడ్డలపాలిట మంచి హస్తవాసిగల రక్షణదేవతగా, ఆమె పేరు పొందింది.
 
ఒక రోజు ఆమె ఏదో గ్రామంలో పురుడు పోసివస్తున్నది. వెదిరేశ్వరం పొలిమేరలలో ఒక చెట్టు కింద కొందరు ఆడవాళ్ళు, ఒక మేనా చుట్టూ మూగివున్నారు. ఆడవాళ్ళలో ఒకామె ఎల్లాయమ్మను గుర్తించి, ‘‘ఎల్లాయమ్మా! మన జమీందారుగారి కోడలు మన గ్రామంలోని విదురాశ్రమం చూడడానికి వచ్చారు. ఆవిడ ఇప్పుడు ఏడో నెల గర్భిణీ మాత్రమే. కాని, పరిస్థితి చూస్తూంటే కాన్పు లక్షణాలు కన్పిస్తున్నాయి,'' అన్నది.
 
ఎల్లాయమ్మ మేనాలో వున్న జమీందారు కోడల్ని పరీక్షించి, ‘‘కచ్చితంగా ఇవి కాన్పులక్షణాలే, త్వరగా మా ఇంటికి తీసుకుపోదాం,'' అని బోయీలను తొందరపెట్టి, పరిచారికల సహాయంతో తనింటికి తీసుకు వెళ్ళింది. కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు. ఈ వార్త తెలిసి జమీందారు, కొడుకు, ఇంకా ఇతరపరివారం ఎల్లాయమ్మ వుంటున్న చిన్న పెంకుటింటికి చేరుకున్నారు.
 
ఎల్లాయమ్మ, జమీందారుతో, ‘‘ప్రభూ! నెలలు నిండకపోయినా ఏడవ నెలలో కాన్పు ప్రమాదకరమైనది కాదు. క్షమించండి. మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లుకాదు నాది,'' అన్నది.
 
జమీందారు తృప్తిగా తలాడించి, ‘‘నీ హస్తవాసి గురించి వినడమేకాదు, ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. నీకిక్కడ సమస్త సదుపాయాలూ చేస్తాను. రాజవైద్యులిక్కడికే వచ్చి, నా మనవడినీ, కోడలినీ చూస్తారు,'' అన్నాడు.

ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది. ఆమె ఇంటికి అన్ని సదుపాయూలూ ఏర్పడ్డాయి. వారం గడిచాక జమీందారు, ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి, అప్పటికప్పుడు నాలుగెకరాల పొలం బహూకరించాడు.
 
జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్ళి పోయే రోజున ఎల్లాయమ్మతో, ‘‘నువ్వు, నన్నూ, నా బిడ్డనూ కాపాడిన దేవతవు. నీకు గనక కూతురు పుడితే, నా కోడలిని చేసుకుంటాను,'' అన్నది. ఎల్లాయమ్మ చేతులు జోడించి, ‘‘నేను చేసింది నా వృత్తి ధర్మం. ఇప్పటికే జమీందారుగారు నా పేద స్థితిని మార్చేశారు. ఈ అదృష్టం చాలు. మీ పేరు చెప్పుకుని సుఖంగా బ్రతుకుతూ వుంటాము. నాకు ఏమాత్రం దురాశ లేదు,'' అన్నది.
 
ఎల్లాయమ్మకిప్పుడు పేరు ప్రతిష్ఠలతోపాటు మంచి భవంతి, పొలం ఏర్పడడంతో జీవితం చాలా సుఖంగా సాగిపోతున్నది. నాలుగు సంవత్సరాల తర్వాత ఆమెకొక కూతురు పుట్టింది. ఎల్లాయమ్మ, ఆమెకు రాగిణి అని పేరు పెట్టింది.
 
కాలం చాలా వేగంగా గడిచిపోయింది. జమీందారు వృద్ధుడయ్యాడు. ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు. మనవడు కళ్యాణవర్మ ఇరవై ఏళ్ళ యువకుడయ్యాడు. ఎల్లాయమ్మ కూతురు రాగిణి మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది. ఆ సంవత్సరం విదురేశ్వరాలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబం ఎల్లాయమ్మను, రాగిణిని చూడడం తటస్థించింది. కళ్యాణవర్మ తల్లి, ఎల్లాయమ్మను ఆప్యాయంగా పలకరించింది. రాగిణిని చూడగానే ఆమెకు కోడల్ని చేసుకుంటానన్న మాట గుర్తుకొచ్చింది.
 
‘‘నీ కూతురు చాలా అందగత్తె. నాకు స్వతంత్రం గనక వుంటే, నీ కూతుర్ని తప్పక నా కోడల్ని చేసుకునేదాన్ని,'' అన్నది, కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో.
 
ఎల్లాయమ్మ నవ్వి ఊరుకుంది. అయితే, కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయమేమిటని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో అతడు, రాగిణిని కలుసుకుని, తన తల్లి ఆశపడుతున్నట్లుగా, రాగిణిని వివాహం చేసుకుని, తల్లికి ఆనందం కలిగించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు.

కాని రాగిణి, ‘‘వంశ ప్రతిష్ఠతో ముడిపడిన జమీందారీ వంశము మీది. మంత్రసానితో వియ్యం లోకం మెచ్చదు. అన్నిటికన్నా, మీ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలను ఎదుర్కునే శక్తి మీకుగాని, మా కుటుంబ సభ్యులకుగాని లేదు,'' అన్నది.
 
ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయూడు.
 
ఎలాగో ఈ విషయం వృద్ధ జమీందారు చెవిలో పడింది. ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి, రహస్యంగా జ్యోతిష్కుల చేత పరిశీలింప జేశాడు. ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు, రాజమాత యోగం కూడా వున్నదని తెలియడంతో ఉలిక్కి పడ్డాడు. ఈ విషమ పరిస్థితిని మొగ్గలోనే తుంచేయూలంటే కళ్యాణవర్మకు వెంటనే తగిన సంబంధం చూసి పెళ్ళి చేసెయ్యాలని అందుకు ఆయత్తం కాసాగాడు.
 
కానీ, అంతలో ఎవరూ ఉహించని ఒక దుర్ఘటన జరిగింది. ఒక రోజున కళ్యాణవర్మ వాహ్యాళికి బయటకు వెళ్ళాడు.
 
ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకువచ్చి, ఉరుములు, మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది. కళ్యాణవర్మకొక అడుగు దూరంలో పిడుగు పడడంతో, అతడు గుర్రం మీది నుంచి జారి పడి స్పృహ కోల్పోయాడు. అతన్ని ఇంటికి చేర్చారు. అయితే, పిడుగు పాటుకు అతడికి చూపు పోయింది. వైద్యులు పరీక్ష చేసి-మళ్ళీ ఒకసారి అలాంటి అనుకోని సంఘటన జరిగి చూపురావాలి తప్ప, వైద్య సహాయంతో ఇప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు.
 
జమీందారు కుటుంబమంతా విచారంలో మునిగిపోయింది. ఆ మర్నాడు వృద్ధ జమీందారు, కళ్యాణవర్మతో, ‘‘మీ అమ్మ ఏముహూర్తాన అన్నదో కాని, ఆ మంత్రసాని కూతురు, నీకు భార్య కావాలని విధిరాశాడేమోననిపిస్తున్నది. నువ్వా రాగిణిని వివాహ మాడేందుకు ఇష్ట పడ్డావని తెలుసుకున్నాను. అసహాయ స్థితిలో వున్న నిన్ను కనిపెట్టుకుని వుంటూ సేవలు చేసే మనిషి అవసరంవుంది. ఆమె నీకు భార్యగా రావడానికి మేము అభ్యంతర పెట్టం,'' అన్నాడు.
 
ఇందుకు కళ్యాణవర్మ కొద్దిసేపు ఆలోచించి, ‘‘అంతా మీ ఇష్టం,'' అనేశాడు. ఎల్లాయమ్మకు వార్త చేరింది. ఆమె రాగిణితో, ‘‘వాళ్ళెంత జమీందారులైనా, ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేను. ఈ పెళ్ళికి నువ్వొప్పుకోకు,'' అన్నది.

తల్లి మాటలకు రాగిణి అడ్డంగా తలాడించి, ‘‘మనం బలహీనులం. జమీందారును కాదంటే మనం చాలా చిక్కుల్లో పడతాం. నేనీ పెళ్ళికి మనసారా ఒప్పుకుంటున్నాను,'' అన్నది.
 
ఈ సంగతి విని జమీందారు కుటుంబం అట్టహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు. ప్రధానం చీర, నగలు తీసుకుని రాగిణి ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది. రాగిణి కళ్ళకు గంతలు కట్టుకుని వుంది. ఆమె, కళ్యాణవర్మ తల్లితో, ‘‘నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలచుకోలేదు. ఒక జమీందారీ వంశంలోకి అడుగు పెడుతున్న నేను, గాంధారీ దేవిని ఆదర్శంగా తీసుకున్నాను,'' అన్నది తొణక్కుండా.
 
వచ్చిన వాళ్ళందరూ రాగిణి చేసిన పని, జమీందారీ వంశపు స్థాయికి దగినట్లు వుందని మెచ్చుకోసాగారు. అయితే, ఒక్క వృద్ధ జమీందారుకు మాత్రం రాగిణి ఆంతర్యం అర్థమైంది. ఆయన ఆశీస్సులిచ్చే నెపంతో ఏకాంతంలో పిలిపించి, ఆమెతో, ‘‘రాగిణీ! నువ్వు చాలా తెలివైనదానివి. నువ్వు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి. గుడ్డివాడై పోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పనిమనిషిగా చేయాలనుకున్నాను. కాని, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని లోకం దృష్టిలో పతివ్రత స్థాయికి ఎదిగిపోయి, భర్తతో సమానంగా జమీందారీ వంశపు సేవలందుకునే, నీ ఆలోచనను నేను పసిగట్టాను. నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి! అయినా లోకం దృష్టిలో పతివ్రతగా వున్న, నీ వింత స్వార్థాన్ని లోకం ఏనాడూ తప్పుపట్టకుండా, నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను,'' అన్నాడు.

అందుకు రాగిణి, ‘‘ఎవరిది వింత స్వార్థమో మునుముందు మీకే తెలుస్తుంది. అయినా, నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకుంటున్నందుకు సర్వదా కృతజ్ఞురాలిని,'' అన్నది.
 
రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకు ఉరుములు, మెరుపులతో తొలకరి వానలు ప్రారంభమయినై. ఒకనాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడ పైఅంతస్థులోని నడవాలో పెద్ద ఆననంపై కూర్చుని వుండగా, దాపులనున్న మామిడి చెట్టు మీద ఉరుముతో పాటు పెద్ద పిడుగు పడింది. పిడుగు పాటుకు బెంబేలు పడిపోయిన అతడు చిన్నగా అరిచి, ఆసనంలో ఓ పక్కకు ఒరిగి పోయి కొంతసేపు చలనం లేకుండా వుండిపోయూడు.
 
సంగతి తెలిసిన జమీందారు కుటుంబమంతా ఆదుర్దాగా అక్కడికి వచ్చారు. కొంత సేపు తర్వాత కళ్యాణవర్మ కళ్ళు తెరిచి, ఎదురుగా వున్న రాగిణి కేసి ఆశ్చర్య పడుతూ చూసి, ‘‘ఆహా, నాకు తిరిగి చూపు వచ్చింది! ఒక పిడుగు హరించిన చూపును, మరొక పిడుగు ప్రసాదించింది. అదిసరే, రాగిణీ! ఆనాటికన్న, ఈ నాటి నీ అందం, నాకు మరింత ఆనందం కలిగిస్తున్నది,'' అన్నాడు.
 
అందుకు రాగిణి చిన్నగా నవ్వుతూ, ‘‘నా అందం సంగతేమోగాని, మీ హృదయ సౌందర్యం మాత్రం ఎప్పుడూ అద్భుతమైనదే. నన్ను చూసిన నాటి నుంచి మీరు నాపట్ల చూపుతూన్న ప్రేమ, నన్ను పెళ్ళాడడానికి మీరు చేసిన అపూర్వ ప్రయత్నం అంతా మొదటి నుంచీ గమనిస్తూనే ఉన్నాను కదా?'' అన్నది. కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
 
రాగిణి పతివ్రతాధర్మం వల్లనే, కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తిరావడంతో, జమీందారీ కుటుంబంలో గౌరవించదగిన గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలూ పొందింది.

బద్ధకస్థుడు


సోమశర్మ కలిగినవారింట పుట్టాడు. విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచీ, అతడికి కావ్యాలు చదివి, వాటిలోని కథలను ఇతరులకు చెప్పడం ఎంతో ఇష్టం. కావ్యాల్లో చదివినప్పటికంటే, అతడు చెప్పిన తర్వాతే, ఆ కథ లెక్కువ బాగున్నాయని మిత్రులు అతడికి మహాకవి అని బిరుదిచ్చి, ‘‘నువ్వు కూడా ఓ మహాకావ్యం రాసి మేము గర్వపడేలా చేయాలి,'' అన్నారు.
 
‘‘నాకెంతో ఇష్టమైన పాండవుల అజ్ఞాత వాసం కథను కావ్యంగా రాస్తాను. కానీ ఇప్పుడు కాదు. చదువు పూర్తయ్యాక,'' అన్నాడు సోమశర్మ.
 
కొన్నాళ్ళకు సోమశర్మ చదువు పూర్తయింది. మిత్రులతణ్ణి కావ్యరచనకు పూనుకోమన్నారు. అతడు వారితో, ‘‘నాకు తాళ పత్రాల మీద రాసింది చదవడమంటే ఉత్సాహమే. కానీ నేనే ఘంటం చేతపట్టి అక్షరాలు రాయాలంటే మహా బద్ధకం. కాబట్టి నేను కవిత్వం చెబుతూంటే, మీరెవరైనా రాసి పెట్టండి,'' అన్నాడు.
 
సోమశర్మ ఇలా అనగానే మిత్రులిద్దరు సరేనని ముందుకొచ్చారు. సోమశర్మవారితో, ‘‘నేను మనసులో ఉత్సాహం పుట్టినప్పుడే తప్ప, ఎప్పుడంటే అప్పుడు కవిత్వం చెప్పలేను. కాబట్టి మీరిద్దరూ మా ఇంటికి మకాం మార్చి, ఎల్లప్పుడూ నాతోనే వుంటూ, నేను చెప్పినప్పుడల్లా రాస్తూండండి,'' అన్నాడు.
 
‘‘అలా మాకు కుదరదు. నువ్వు బద్ధకం విడిచిపెట్టి స్వయంగా రాయడం అలవాటు చేసుకో; లేదూ త్వరగా పెళ్ళి చేసుకో. నీ భార్య ఎల్లప్పుడూ నీతోనే వుంటుంది కాబట్టి, ఉత్సాహం పుట్టినప్పుడల్లా నువ్వు చెబుతూంటే, ఆమె రాసేస్తుంది,'' అన్నారు మిత్రులు.
 
కొన్నాళ్ళకు సోమశర్మకు, సుచల అనే యువతితో పెళ్ళయింది. అతడి మిత్రులామెను కలుసుకుని, ‘‘నీ భర్త మహాకవి.

అతడ చేత కావ్యరచన చేయించే బాధ్యత నీదే!'' అన్నారు. అందుకు ఆమె సరేనంది. కానీ కలవారి కోడలైనందున పగలంతా ఇంటి బాధ్యతలుండేవి. చీకటి పడ్డాక సోమశర్మకు నిద్రపైన ఎక్కువా, కవిత్వంపై తక్కువా దృష్టి వుండేది. ఐనా అడపాదడపా ఒకటీ అరా పద్యాలు చెప్పగా, అతికష్టం మీద ఏడాదిలో ఇరవై పద్యాలు అయ్యాయి.
 
వాటిని విన్న మిత్రులు, ‘‘నీ కవిత్వం చాలా గొప్పగా వుంది. బద్ధకాన్ని వదిలి త్వరగా కావ్యాన్ని పూర్తి చేయి,'' అన్నారు. వారి పొగడ్తలు సోమశర్మ ఉత్సాహాన్ని పెంచగా కావ్యాన్ని త్వరగా పూర్తి చేయాలను కున్నాడు. కానీ ఆ రోజే సుచలను పురిటికి పుట్టినింటికి తీసుకెళ్ళడానికి అత్తమామలొచ్చారు. సోమశర్మ దిగులుగా సుచలతో, ‘‘నువ్వు తిరిగొచ్చేదాకా, నా కావ్యాన్నెవరు రాస్తారు?'' అన్నాడు.
 
అందుకు సుచల నవ్వి, ‘‘తిరిగి వచ్చాక కూడా నాకు పగలూ రాత్రీ చంటిబిడ్డతోనే సరిపోతుంది. కాబట్టి, బద్ధకం విడిచి మీ కావ్యాన్ని మీరే రాసుకోండి,'' అన్నది.
 
ఆమె పుట్టినింటికి వెళ్ళి పండంటి బిడ్డతో తిరిగొచ్చింది. కానీ సోమశర్మ కావ్యం ఇరవై పద్యాల దగ్గరే ఆగిపోయింది. అందుకామె నొచ్చుకున్నా భర్తకు కావ్యం రాసి పెట్టేందుకు తీరుబడి చేసుకోలేకపోయింది.
 
ఈ సంగతి తెలిసిన మిత్రులు, సోమ శర్మతో, ‘‘కావాలన్నా అందరూ కవిత్వం చెప్పలేరు. నువ్వు మామాటవిని బద్ధకాన్ని విడిచి పెట్టి కావ్యాన్ని త్వరగా పూర్తిచేయి,'' అంటూ మందలించారు. ‘‘మీరు నా మిత్రులు. నామీది అభిమానం కొద్దీ నా కవిత్వం గొప్పగా వున్నదని మీరంటే చాలదు. ఎవరైనా పేరు మోసిన గొప్ప కవి ఆ మాటనేదాకా నాలో ఉత్సాహం పుట్టదు,'' అన్నాడు సోమశర్మ.
 
అప్పుడు అతడి మిత్రులు, రాజసన్మానం పొందిన సారస్వతుడనే కవిని ఆహ్వానించి సోమశర్మ ఇంటికి తీసుకువచ్చారు. ఆయన సోమశర్మ రాసిన పద్యాలు చదివి, ‘‘నీవు సరస్వతీ ప్రసన్నుడివి. త్వరగా కావ్యం పూర్తి చేయి, నీకు రాజసన్మానం జరిపించే పూచీ నాది,'' అని చెప్పివెళ్ళాడు.
 
సోమశర్మ, మిత్రులతో, ‘‘నాకు సరస్వతీ ప్రసన్నతవుంటే, సమయం వచ్చినప్పుడు ఆమెయే నా బద్ధకం పోగొట్టి, నా చేత కవిత్వం రాయిస్తుంది! అంతవరకూ వేచివుంటాను,'' అన్నాడు.

ఈలోగా ఆఊరికి చురుకుడనే యోగి వచ్చి, ఆ ఊరి గుడిలో మకాం పెట్టాడు. మనిషికి బద్ధకమూ, మందకొడితనమూ శాపాలంటాడాయన. వాటిని పోగొట్టి, ఆ స్థానంలో చురుకుతనం ప్రవేశపెట్టే ఉపాయాలు ఎన్నో ఆయనకు తెలుసని ఊళ్ళో బాగా ప్రచారమైంది. సోమశర్మ మిత్రులు అతణ్ణి బలవంతం చేసి చురుకుడి వద్దకు తీసుకువెళ్ళారు.
 
చురుకుడు, సోమశర్మను పలువిధాల ప్రశ్నించి, బద్ధకం పోయేందుకు రకరకాల చిట్కాలు చెప్పాడు.
 
అవన్నీ అంతకు ముందే ప్రయత్నించాననీ, ఒక్కటీ పనిచేయలేదనీ ఆయనకు చెప్పాడు, సోమశర్మ.
 
అది విని చురుకుడు పెదవి విరిచి, ‘‘నాయనా! ఇంతకాలం నేను గొప్ప యోగిననీ, నాకసాధ్యమన్నది లేదనీ గర్వపడేవాణ్ణి. ఈ రోజు నా గర్వం అణిగింది. నీ బద్ధకం పోగొట్టడం, నావల్లకాదు,'' అన్నాడు.
 
సోమశర్మ మందహాసం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. సోమశర్మ మిత్రులు అతడితో వెళ్ళక చురుకుడితో, ‘‘స్వామీ! తమరింత సులభంగా ఓటమిని ఒప్పుకోవడం ఆశ్చర్యంగా వుంది,'' అన్నారు.
 
చురుకుడు చిరునవ్వు నవ్వి, ‘‘నాయనలారా! తమ బద్ధకానికి బాగా సిగ్గుపడి దాన్ని పోగొట్టుకోవాలనుకునే వారికి, నా చిట్కాలు బాగా పనిచేశాయి. సోమశర్మ తన బద్ధకానికి సిగ్గు పడడు సరికదా, గర్వపడుతున్నాడు. అతడికి కవిత్వం చెప్పడంకంటే బద్ధకస్థుడనిపించుకోవడమే ఎక్కువ ఇష్టం. అందుకే నా చిట్కాలు ఒక్కటీ అతడికి పనికిరాలేదు,'' అన్నాడు.
 
‘‘కానీ, మా సోమశర్మ మహాకవి. అతడి చేత కావ్యం రాయించాలన్న మా కోరిక, ఈ జన్మకు తీరదంటారా, స్వామీ?'' అని అడిగారు సోమ శర్మ మిత్రులు.
 
దానికి చురుకుడు, ‘‘నిజమైన కవులు కావ్య రచనకు బద్ధకించరు. సోమశర్మకు కవిననిపించుకోవాలన్న కోరిక వున్నది కానీ, కావ్యం రాయగల సత్తాలేదు. అందుకని బద్ధకం వంక పెట్టి తప్పించుకుంటున్నాడు. కొందరు గొప్ప కవులు ప్రోత్సహించినా కావ్యం రాయని సోమశర్మ మహాకవి ఎలా ఔతాడు?

ఇకమీదట మీరతణ్ణి మహాకవి అనడం మాని బద్ధకస్థుడనడమే న్యాయం. ఈ రోజే నేను తీర్థయూత్రకు బయల్దేరుతున్నాను. మూడు నాలుగు నెలల్లో మీ ఊరుకు తిరిగి వస్తాను,'' అన్నాడు.
 
చురుకుడు, సోమశర్మను గురించి అన్న మాటలు ఊరంతా ప్రచారమైంది. ఆ రోజు నుంచి అందరూ సోమశర్మను కవి అనడం మాని, బద్ధకస్థుడని మాత్రమే చెప్పుకోసాగారు. ఇది విన్న సోమశర్మ అవమానంతో కృంగిపోయాడు. ఎక్కడి మహాకవి అన్న పేరు; ఎక్కడి బద్ధకస్థుడన్న ఈసడింపు!
 
సోమశర్మలో భావోద్వేగం పెల్లుబికింది. నిజంగానే తాను మహాకవినన్న గుర్తింపు రావాలన్న పట్టుదల కలిగింది. అతడు స్వయంగా ఘంటం పట్టి కొన్నాళ్ళపాటు రాత్రింబవళ్ళు ఏకాగ్రతతో కృషి చేసి మూడు మాసాల్లోనే తన కావ్యాన్ని పూర్తి చేశాడు. దానికి రాజాదరణ లభించి, అతడికి రాజసన్మానం కూడా జరిగింది. దాంతో అతడికి ప్రజల మధ్య మహాకవి అన్న గుర్తింపు లభించి, బద్ధకస్థుడన్న పేరు మటుమాయమైంది.
 
తిరిగి నాలుగు మాసాల తర్వాత చురుకుడు, ఆ ఊరు వచ్చాడు. సోమశర్మ మిత్రులు చురుకుడి వద్దకు వెళ్ళి అతన్ని గురించి చెప్పి, ‘‘స్వామీ! తమ చిట్కాలు చేయలేని పని, మా సోమశర్మ పట్టుదల చేసింది,'' అన్నారు గర్వంగా.
 
చురుకుడు, ‘‘అలాగా!'' అంటూ నవ్వి, ‘‘నాయనలారా! పట్టుదలతో మనిషి సాధించ లేనిది వుండదు. పట్టుదల లేకుండా సాధించ గలిగేదీ వుండదు. నా చిట్కాలు మనిషిలో పట్టుదల పుట్టించడానికే ఉపయోగపడతాయి. మీరంతా కృషిలేకుండానే సోమ శర్మను మహాకవిని చేశారు. నేనతడికి మహా కవి అన్న పేరు పోగొట్టి, బద్ధకస్థుడన్న పేరు మీ ద్వారా ప్రచారం చేశాను. దాంతో అతడి ఆత్మాభిమానం దెబ్బతిని అతడు తీవ్రమైన ఆవేదనకూ, భావోద్వేగానికీ లోనయ్యాడు. పర్యవసానంగా అతనిలోని కవితా ప్రతిభ పెల్లుబికి పట్టుదలతో కావ్యరచనకు పురి కొల్పింది. నా ఉపాయమే అతడి బద్ధకాన్ని పోగొట్టి అతడి చేత చక్కటి కావ్యం రాయించింది,'' అన్నాడు. 

దేవసేన కథ


అవంతీ దేశపు రాజధానీ నగరంలో, ప్రసిద్ధి చెందిన ఒక విష్ణాలయం వుండేది. ఆ ఆలయానికి విష్ణుశర్మ ప్రధాన పూజారి. ఆయన సంగీత, నాట్య శాస్ర్తాలను అధ్యయనం చేసి, ఆ కళలలో గొప్ప ప్రవీణుడనిపించుకున్నాడు. రాజాస్థానంలో పలుకుబడి గల ఉద్యోగుల పిల్లలు, ఆయన వద్ద నాట్యం, సంగీతం నేర్చుకునేందుకు వచ్చేవారు.
 
విష్ణుశర్మకు, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన దేవసేన ఒక్కతే కుమార్తె. ఆమె యవ్వనవతి అయ్యేసరికి, ఆమె అందచందాల గురించీ, నాట్యగాన కౌశలం గురించీ అందరూ గొప్పగా చెప్పుకోసాగారు. ఆమె నృత్యం చూడడం కోసం మామూలు ప్రజలూ, పురప్రముఖులూ ఎగబడివచ్చేవారు.
 
దేవసేన గురించి విన్న రాజు విక్రమసేనుడు, మారువేషంలో వచ్చి, ఆమె నాట్య విన్యాసాన్నీ, గానమాధుర్యాన్నీ, రూపాన్నీ చూసి ముగ్థుడై, రాజనర్తకిగా తన కొలువులో అవకాశం కల్పిస్తున్నట్టుగా, దేవసేన తండ్రి విష్ణుశర్మకు వర్తమానం పంపాడు.
 
అందుకు దేవసేన; కళలకు అంకితమైన తాను, రసికులైన ప్రజలా, పండితులా ఎదుట మాత్రమే నృత్యగానాలు ప్రదర్శిచగలననీ; రాజనర్తకిగా కొలువులో చేరి, అక్కడి నియమాలకు కట్టుబడివుండలేననీ జవాబు పంపింది. ఈ జరిగింది రాజ్యమంతటా క్షణాల మీద గుప్పుమన్నది. రాజంతవాడు వివాహమాడతానన్నా, దేవసేన నిరాకరించిం దంటూ కొందరు జరిగిన వాస్తవానికి చిలవలూ పలవలూ అల్లారు.
 
‘‘ఓహో, దేవసేన నృత్యగాన కోవిదురాలు గనక, ఆమె మరొక గొప్ప కళాకారుణ్ణి వివాహ మాడాలనుకుంటున్నది,'' అని ఒక శిల్పి, దేవసేన రూపురేఖల్ని ఒకరాతిలో అద్భుతంగా మలచి, ఆ ప్రతిమను ఆమెకు కానుకగా పంపుతూ, తను ఆమెను వివాహమాడదలచినట్టు తెలియబరిచాడు. అలాగే ఒక కవి ఆమెను కావ్యనాయికగా చేసి కావ్యం రాసీ, ఒక చిత్రకారుడు, ఆమె సోయగాన్ని ఓ కళాఖండంగా చిత్రించీ, తాము ఆమెను వివాహ మాడగోరుతున్నట్టు లేఖలు రాశారు.

ఈ విధంగా మరికొందరి నుంచి కానుకలూ, లేఖలూ రావడంతో దేవసేన బెంబేలు పడి, తన బాల్యమిత్రురాలైన రాజవైద్యుడి కుమార్తె సుభాషిణిని సలహా అడిగింది.
 
సుభాషిణి చాలా వివేకవతి. ఆమె, దేవసేనను, ‘‘నువ్వు బ్రహ్మచారిణిగా వుండిపోదల చావాలేక నీకు అన్ని విధాలా నచ్చిన ఎవరినైనా వివాహమాడదలచావా?'' అని సూటిగా ప్రశ్నించింది.
 
అందుకు దేవసేన ఏమాత్రం తడువుకోకుండా, ‘‘నా నృత్యగానాలనూ, అందచందాలనూ మెచ్చికాక, నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని వివాహమాడదలచాను,'' అన్నది.
 
ఆ జవాబుకు సుభాషిణి సంతోషించి, ‘‘అలా అయితే, మానాన్న చికిత్సకోసం వాడే మూలికల గురించి నాకు బాగా తెలుసు. వాటిలో రెండు మూలికలను తెచ్చియిస్తాను. అందులో ఒకటి, తిన్న తర్వాత వారం రోజుల్లో నీ రూపం కారునలుపుగా అయిపోతుంది. రెండవది విరుగుడుగా తింటే, రెండు వారాల్లో తిరిగి నీ రూపం యథాస్థితికి వస్తుంది,'' అని చెప్పి, ఆ మూలికలను తెచ్చి ఇచ్చింది.
 
తన రూపాన్ని కారునలుపుగా మార్చే మూలికను, ఆ రోజే దేవసేన తిన్నది. గంట కాలం గడిచీ గడవకుండానే, ఆమె రూపం నల్లగా మారిపోయింది. ఆ మర్నాడు ఆమె తనను పెళ్ళాడగోరిన శిల్పి, కవి, చిత్రకారులకు కబురు చేసింది. వాళ్ళు పరమానందభరితులైపోయి వచ్చి, దేవసేన రూపాన్ని చూస్తూనే నిశ్చేష్టులై పోయూరు.
 
‘‘దురదృష్టవశాత్తూ, నా రూపం ఇలా మారింది. మీలో నన్నీ రూపంలో పెళ్ళాడగోరుతున్నవారెవరో, ఒక్కడుగు ముందుకు వేయండి!'' అన్నది దేవసేన.
 
అంతే! వచ్చిన వాళ్ళు ముఖాలు చిట్లించుకుని మారుమాట్లాడకుండా వెళ్ళిపోయూరు. బాహ్య సౌందర్యాన్ని చూసి మనిషి ఎంతగా భ్రమించిపోతాడో, అనుభవ పూర్వకంగా చూసిన దేవసేన చిన్నగా నవ్వుకున్నది.
 
ఆసమయంలో, దేవసేన తండ్రి విష్ణుశర్మ వార్థక్యభారానికితోడు, అనారోగ్యానికి గురై రెండు నెలలుగా మంచంపట్టి వున్నాడు. ఆయన తన కుమార్తె వికార రూపాన్ని చూసి భరించలేక కన్నుమూశాడు.

దానితో ఏకాకి అయిపోయిన దేవసేన ఎక్కడలేని మానసిక వేదనకు లోనై, ఒకనాటి రాత్రివేళ ఇల్లొదిలి బయల్దేరి, మరొక ఊరి సమీపానగల మామిడి తోపులో ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయింది.
 
ఆ తర్వాత కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన దేవసేన, తానొక పూరిగుడిసెలో నులక మంచం మీద వున్నట్టు తెలుసుకున్నది. ఆమె ఆశ్చర్యపోతూ తల తిప్పి చూసేసరికి, మంచం పక్కన ఒక రైతుయువకుడు, ఆమెకేసి జాలిగా చూస్తూ నిలబడివున్నాడు.
 
దేవసేన ఏదో అడగబోయేంతలో రైతు యువకుడు, ‘‘నా పేరు ముకుందుడు. నేను ఈ రోజు తెల్లవారు జామున పొలం వెళుతూ, చెట్టుకింద సొమ్మసిల్లి పడివున్న నిన్ను చూసి, నా ఇంటికి తీసుకువచ్చాను. ఏం జరిగింది? నీ దేవూరు?'' అని అడిగాడు.
 
ఆ ప్రశ్నకు దేవసేన కొద్దిసేపు తటపటాయించి, ‘‘నేనో ఒంటరి జీవిని. జీవితం మీద విసుగు చెంది ఎటయినా వెళ్ళిపోదామని బయల్దేరాను. దారిలో స్పృహ తప్పాను. నన్ను నీ నివాసానికి చేర్చినందుకు కృతజ్ఞురాలిని,'' అన్నది.
 
‘‘మీరు ఒంటిరివారంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాతో పాటు ఇక్కడే వుండి పోవచ్చుగదా!'' అన్నాడు ముకుందుడు.
 
‘‘నీ కెవరూలేరా?'' అని అడిగింది దేవసేన.
 
‘‘ఎవరూ లేరు. తల్లిదండ్రులు వదిలి పోయిన రెండెకరాల పొలం సాగుచేసుకుని, పొదుపుగా కాలం గడుపుతున్నాను. మీరు ఇక్కడే వుండిపొండి. ఒకరికొకరం తోడుగా వుండవచ్చు,'' అన్నాడు ముకుందుడు.
 
కొద్దిసేపు ఆలోచించి, అందుకు సరేనన్నది దేవసేన. ఆ తర్వాత ముకుందుడి వెంట పొలానికి వెళ్ళి, అతడికి పొలం పనుల్లో, తన చేతనైన సాయం చేయసాగింది.
 
ఈ విధంగా ఒక నెల రోజులు గడిచాయి. దేవసేనకు, ముకుందుడి ప్రవర్తనా, తన పట్ల అతడు చూపుతున్న ఆప్యాయతా చాలా సంతోషం కలిగించాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దేవసేన, పొలంలో పనులు ముగించి ఇంటికి బయల్దేరుతున్న సమయంలో, ‘‘ముకుందా! కొద్ది కాలంగా మనం ఒకరికి ఒకరం తోడుగా వుంటున్నాం. నా గురించి నీవేమనుకుంటున్నావో అడగదలిచాను,'' అన్నది.

అందుకు ముకుందుడు వెంటనే, ‘‘నువ్వు చక్కగా మాట్లాడతావు. మంచితనం, ఎంతో లోకజ్ఞానం వున్నదానిలా కనబడతావు,'' అన్నాడు.
 
ఆ జవాబుకు దేవసేన నవ్వి, ‘‘అలా అయితే, నేనెవరైనదీ, నా గత జీవితం ఎలా నడిచిందో నీకు చెప్పదలిచాను,'' అంటూ, ఆమె ముకుందుడికి తనను గురించి వివరంగా చెప్పింది.
 
అది విన్న ముకుందుడు అబ్బురపడి పోతూ, ‘‘అంత సుఖం అనుభవించినదానివి, కోరి అందమైన రూపాన్ని వికృతంగా చేసుకుని, నాతోపాటు పొలం పనులు చేస్తున్నావన్నమాట!'' అన్నాడు.
 
‘‘పొలం పనులేకాదు, నీకు భార్యగా జీవించాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ కారునలుపు పోయి, ఒకనాటి అందచందాలు తిరిగి వచ్చేందుకు విరుగుడు మూలిక మింగుతాను,'' అంటూ, దేవసేన భుజానికి వేలాడుతున్న సంచీలో చేయి పెట్టబోయింది.
 
మరుక్షణం ముకుందుడు, ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, సంచీలో వున్న మూలిక పొట్లాన్ని దూరంగా విసిరివేస్తూ, ‘‘దేవసేనా! నాక్కావలసింది అందగత్తెకాదు; నీలాంటి సద్గుణాలూ, కలుపుగోలుతనం వున్న భార్య!'' అన్నాడు.
 
ముకుందుడన్న ఆ మాటలకు దేవసేన కళ్ళు చెమ్మగిల్లాయి.
 
రెండు వారాల తరవాత ఆ ఊరి రామాలయంలో జరిగిన దేవసేన-ముకుందుల వివాహానికి, దేవసేనకు మూలికలిచ్చి సాయపడిన సుభాషిణి కూడా వచ్చింది. పెళ్ళి పీటలపై నుంచి లేచిన నూతన వధూవరులను సమీపించి, ‘‘ఎలాగైతేనేం, నీ కోరిక నెరవేరింది,'' అన్నది సుభాషిణి దేవసేనను అభినందిస్తూ.
 
‘‘అవును, సుభాషిణీ! నిజంగానే నేను ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నాను. నా బాహ్య సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై, నన్ను వివాహ మాడడానికి వచ్చిన సంపన్నులకన్నా, అంద విహీనురాలైనప్పటికీ, నా మనసును చూసి, నన్ను నన్నుగా ప్రేమించిన ఈ మంచి మనిషిని పెళ్ళాడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన పేదరైతే అయినప్పటికీ గొప్ప సంపన్నుడిగా నేను భావిస్తున్నాను,'' అన్నది దేవసేన ఆనందబాష్పాలు రాలుస్తూ.

అత్తిమాను దయాగుణం - అపూర్వ కృతజ్ఞత!


నాగాలు చాలాకాలం క్రితం చేసిన వాగ్దానం కారణంగా, ఈనాటికీ అత్తిచెట్టును నరికి పడగొట్టరు. దానికి సంబంధించిన ఒక విచిత్ర కథ ప్రాచుర్యంలో ఉంది:
 
ఒకానొకప్పుడు ఒక నాగాయువకుడు, దూరప్రాంతానికి వెళ్ళి కొండలూ, కోనలూ నిండిన భీకర అరణ్య ప్రాంతం గుండా స్వగ్రామానికి తిరిగివస్తున్నాడు. ఆ కీకారణ్య ప్రాంతంలో దయ్యాలూ, భయానకమైన నల్లటి ప్రాణులూ తిరుగాడుతూ ఉండేవి. రాత్రివేళల్లో వీటి అపాయం మరీ ఎక్కువ. ఆ ప్రాణులకు పదునైన కత్తులూ, కఠారులు అంటే భయం గనక, అవి మనుషుల మీదికి వెనకనుంచే దాడిచేస్తాయని ఆ యువకుడికి తెలుసు. అయితే, ఆ కౄరప్రాణులు ఒక్కసారి పట్టుకుంటే, ఏమాత్రం కనికరం లేకుండా మనుషుల్ని అమాంతం మింగకుండా వదిలిపెట్టవని కూడా ఆ యువకుడికి తెలుసు.
 
పొద్దువాలుతూండగా పెద్దపెద్ద కోరలూ, భయంకరమైన కళ్ళూ గల ఒక పొట్టిదయ్యం వెనకనుంచి వచ్చి ఆ యువకుణ్ణి పట్టుకోబోయింది. దానిని గ్రహించిన ఆ …యువకుడు మెరుపులా వెనుదిరిగి క్షణంలో దాన్ని తన కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు.
 
చీకటి పడుతూన్న కొద్దీ ఆయుకుడిలో రకరకాల ఆలోచనలు తలెత్తసాగాయి. రాత్రయ్యే కొద్దీ దయ్యాలు బలం పుంజుకుని పెట్రేగిపోతాయి. వాటన్నిటినీ ఒంటరిగా ఎదుర్కొని హతమార్చడం అంత సులభం కాదు. కాబట్టి ఈరాత్రికి ఎక్కడైనా తలదాచుకోవడమే వివేకం అనిపించింది.
 
ఎదురుగా తెల్లటిపువ్వులు, నల్లటి కాండంగల కొండతుమికి చెట్టు కనిపించింది. గుబురుగా ఉన్న ఆ చెట్టు మీద సులభంగా దాక్కోవచ్చన్న ఉద్దేశంతో అతడు దాన్ని సమీపించి, ‘‘నా మీద కరుణించి ఈ రాత్రికి నీ కొమ్మల మధ్య నన్ను దాక్కోనివ్వు.

నువ్వు ఆశ్రయం ఇవ్వలేదంటే, ఆ నల్లటి దయ్యాలు వచ్చి నన్ను చంపేస్తాయి,'' అన్నాడు.
 
కొండతుమికిచెట్టు కొమ్మలనూ రెమ్మలనూ అటు ఇటూ ఊపుతూ, ‘‘క్షమించు. నేనాపని చేయలేను. నేను నీకు ఆశ్రయమిచ్చిన సంగతి ఆ దయ్యాలకు తెలిస్తే, నా కొమ్మలనూ, రెమ్మలనూ విరిచి ఛిన్నాభిన్నం చే…యగలవు. ఆ తరవాత నా గతేమవుతుంది? నువ్వు మరేచోటైనా చూసుకో,'' అన్నది భయం భయంగా.
 
చీకటి దట్టమవుతోంది. యువకుడు వేరెక్కడైనా చోటు చూసుకోవాలన్న ఆతృతతో, మరొక చెట్టువద్దకు వెళ్ళి, ‘‘దయతలచి రాత్రికి తలదాచుకోవడానికి చోటిస్తావా? దయ్యాల కంటబడితే నన్ను హతమార్చకుండా వదిలిపెట్టవు,'' అని వేడుకున్నాడు. ‘‘క్షమించు మిత్రమా! నాకేమో నీకు సాయపడాలనేవుంది. అయినా ఆ శక్తి నాకు లేదు. మా జాతి వృక్షాలు మనుషులకు ఆశ్రయమివ్వకూడదు.
 
మరెక్కడికైనా వెళ్ళు,'' అన్నది ఇనుములా చేవబారిన ఆ చెట్టు, కత్తులలాంటి తన ఆకులను ఆడిస్తూ. దాపులనే ఒక బ్రహ్మాండమైన అత్తిమాను కనిపించింది. ఆ యుకుడు చెట్టు చెట్టుకూ వెళ్ళి మొరపెట్టుకోవడం అది చూసింది. వాడిపై జాలిపడి, ‘‘ఇలా, రా నాయనా,'' అని పిలిచింది.
 
యువకుడు ఆశ్చర్యంతో దానికేసి చూశాడు. ‘‘పెద్ద పెద్ద నా కొమ్మలు చాలా దృఢమైనవి. గుబురుగా ఉన్న కొమ్మలు నిన్ను ఈ రాత్రికి ఆ చీకటి దయ్యాలనుంచి కాపాడగలవు. ఆ దయ్యాల్లో ఒకదాన్ని నువ్వు చంపావు గనక, అవి పగబట్టి నీ కోసం తప్పక వెతుక్కుంటూ వస్తాయి. అయితే, నువ్వు మాత్రం ఏమాత్రం చప్పుడు చేయకుండా కొమ్మలమాటున దాక్కో. తక్కిన వ్యవహారం నేను చూసుకుంటాను అన్నది,'' అత్తిమాను.
 
వెంటనే …యువకుడు చక చకా చెట్టెక్కి, గుబురు కొమ్మల చాటున గుట్టు చప్పుడు కాకుండా దాక్కున్నాడు. మెల్లమెల్లగా అరణ్యమంతా గాఢాంధకారం అలముకున్నది. అక్కడక్కడ కీటకాల కీచుధ్వనులు తప్ప భయానకమైన నిశ్శబ్దం ఆవరించింది.
 
మరికొంతసేపటికి కొన్ని పొట్టిదయ్యాలు వింత వింత ధ్వనులు చేస్తూ తమ సోదరుణ్ణి చంపిన ఆ యువకుణ్ణి వెతుక్కుంటూ వచ్చాయి.

‘‘ఎక్కడ ఆ దుర్మార్గుడు? ఎక్కడ దాక్కున్నాడు పిరికివెధవ?'' అని కేకలు పెడుతూ ప్రతి చెట్టునూ చుట్టివచ్చాయి.
 
‘‘మా సోదరుణ్ణి హతమార్చిన ఆ నీచుడు ఎక్కడున్నాడో చెప్పండి? వాణ్ణి ఇప్పుడే ఖండ తుండాలుగా నరకాలి,'' అన్నది ఆవేశంగా ఒక దయ్యం.
 
‘‘వాణ్ణేకాదు. వాణ్ణి దాచిన వాళ్ళను కూడా ముక్కలు ముక్కలుగా నరికి పోగులుపెడతాం. ఎక్కడ వాడు? ఎక్కడ వాడు?'' అంటూ పైకీకిందికీ గెంతసాగింది ఇంకొక దయ్యం.
 
ఎంతకూ సమాధానం రాకపోయేసరికి దయ్యాలన్నీ కలిసి భీకరంగా కేకలు పెట్టాయి. నానా గొడవ చేశాయి. ‘‘ఎక్కడ వాడు?''అని అరిచాయి ఒక్కసారిగా. ‘‘మాకు తెలియదు,'' అన్నాయి చెట్లు భయంతో వణుకుతూ. ఆఖరికి అవి …యువకుడు దాగివున్న అత్తిమాను వద్దకు వచ్చి, ‘‘ఆ దుర్మార్గుడెక్కడున్నాడో నీకు తెలుసా?'' అని అడిగాయి. ‘‘వాడిక్కడలేడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలి…యదు. బహుశా ఆవలివైపు అరణ్యంలో ఉన్నాడో, ఏమో. అక్కడికి వెళ్ళి వెతికిచూడండి,'' అన్నది అత్తిమాను ఏమాత్రం తడబాటు లేకుండా.
 
దయ్యాలు పగసాధించాలన్న ఆవేశంతో కేకలు పెడుతూ అక్కడినుంచి వేగంగా వెళ్ళి పో…ూయి.
 
తూరుపు దిక్కున అరుణోదయం అవుతూండగా యువకుడు, చెట్టుకొమ్మలపై నుంచి కిందికి దిగి వచ్చి, అత్తిచెట్టును కృతజ్ఞతతో కౌగిలించుకుని, ‘‘నువ్వు చేసిన ఈ మహోపకారం నా జీవితాంతం మరిచిపోను,'' అన్నాడు.
 
ఆ తరవాత అతడు స్వగ్రామం చేరి, అరణ్యంలో తను ఎదుర్కొన్న ఆపదగురించీ, అత్తిమాను చేసిన మహోపకారం గురించీ, దాని దయాగుణం గురించీ గ్రామస్థులందరికీ చెప్పాడు.
 
ఆ రోజు సాయంకాలం ఆ యువకుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆ యువకుడు అత్తిమానుకిచ్చిన మాటను ప్రతి ఒక్కరూ పాటించాలని నిర్ణయించారు. దానిపట్ల కృతజ్ఞతతో, అత్తిచెట్టును ఎప్పటికీ నరకరాదని ఒక నియమం ఏర్పాటు చేశారు.
 
అందుకే, ఈనాటికీ అత్తిచెట్టు పొలం మధ్య ఉన్నప్పటికీ, నాగాలు దానిని పడగొట్టరు!

కేతిగాడి మందుల సంచి


వాడపల్లి అనే గ్రామంలో, గోవిందరాజు అనే గాయకుడుండేవాడు. అతడు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి కోవెలలో పర్వదినాలలో, తన భక్తి పాటలతో భక్తులకు వీనులవిందు చేసేవాడు. అతడి గానాన్ని విన్న జనం, ‘‘ఇంత చక్కగా పాడే గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే, మన గ్రామానికే గొప్పపేరు తెస్తాడు!'' అనేవారు.
 
కానీ, గోవిందరాజు మాత్రం ఎంతోవినయంగా, ‘‘అయ్యా, వేంకటేశ్వరునికి కింకరుడిలా వుండిపోవాలని, స్వామివారు భావిస్తే, నాకు రాజాశ్రయం ఎలా లభిస్తుంది? ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతున్నది. నాకు నేనై రాజాశ్రయాన్ని కోరను,'' అనేవాడు.
 
ఇలావుండగా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు వచ్చింది. ఆ సందర్భంగా, గ్రామంలో వీధి నాటకాలు, భజనలు, తోలుబొమ్మలాటలు మొదలైన వాటితో, రోజుకొక కార్యక్రమం పెట్టి, తొమ్మిది రోజులపాటు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో గోవిందరాజుకు, గడ్డిపాడు నుంచి వచ్చిన కేతిగాడి పగటి వేషంవేసే భూషణం అనేవాడితో పరిచయం అయింది.
 
ఈ కేతిగాడి వేషం చాలా తమాషాగావుండేది. చేతిలో వంకరకర్ర పట్టుకుని, గొంగళి కప్పుకుని తిరిగేవాడు. తలమీద కాకి ఈకలకుచ్చు టోపీ పెట్టుకునే వాడు. వాడు హాస్యపు మాటలు మాట్లాడుతూ, ఎవరికీ అర్థంకాని వేదాంత విషయాలు కూడా చెప్పేవాడు. వాడి ముఖం మీదవున్న పసువు, సున్నం బొట్లు చూసి అందరూ నవ్వేవారు.
 
భూషణం, గోవిందరాజుతో, ‘‘నీపాట చాలా అద్భుతంగావుంటుంది. నీ పాట విని జనం ఆనందించినట్టే, మాగడ్డిపాడు పగటివేషగాళ్ళ వేషాలు చూసి కూడా వాళ్ళు విరగబడి నవ్వుతారు. ఈ పగటి వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్న కూడా, మా గ్రామానికి పేరు తేవడమే, మాకు ముఖ్యం.

అందుకే ఇలా ఊరూరూ తిరుగుతూంటాం. నువ్వేమిటిలా మారుమూల గ్రామంలో పాటలు పాడుతూ వుండి పోయావు?'' అని అడిగాడు కళ్యాణోత్సవాలు ముగింపు రోజున.
 
అందుకు గోవిందరాజు, ‘‘నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేం రావు. సంగీత పరిజ్ఞానం కొంతవున్న మాట నిజమే అయినా, కృషి చేసింది మాత్రం తక్కువ. రాజాస్థానమంటే మాటలు కాదు. నావల్ల మా గ్రామానికి పేరు రావాలంటే, ఆ వేంకటేశ్వరుడి దయకావాలి,'' అన్నాడు.
 
ఈ జవాబుకు, భూషణం నవ్వి, ‘‘నోరుతెరుచుకుని కూర్చుంటే, సింహం నోట్లోకి జంతువులు రావు. నువ్వు, వీరభద్రపురం అంగాలమ్మతీర్థం గురించి వినేవుంటావు! అక్కడ తీర్థోత్సవాలు ఘనంగా నెలరోజులు సాగుతాయి. ఇక్కడికి రెండు క్రోసులకన్న, ఆ వీరభద్రపురం ఎక్కువ దూర ముండదు. అక్కడికి నేనివ్వాళే బయలుదేరి పోతున్నాను. నువ్వు కావాలంటే రెండురోజులాగి బయల్దేరిరా. ఆ తీర్థానికి జమీందారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడుగా గుర్తింపు వచ్చే అవకాశముంది!'' అన్నాడు బసచేసిన సత్రంగదిలో సామానులు సర్దుకుంటూ.
 
గోవిందరాజు ఏదో గుర్తు తెచ్చుకుంటున్నవాడిలా ఒక క్షణం ఆగి, ‘‘ఆ అంగాలమ్మవారి గురించి విన్నాను. ఆమె శివుడి అనుచరుడైన వీరభద్రుడి భార్య. చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలిగించమనీ, భూతప్రేతపిశాచాలు పీడించకుండా తరిమెయ్యమనీ, ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు. ఆ అమ్మవారి చేతిలో ఎప్పుడూ కొరడా వుంటుంది. అప్పుడెప్పుడో రెండుమూడు సార్లు వెళ్ళాను. కానీ, పాడే అవకాశం రాలేదు,'' అన్నాడు.
 
‘‘ఈసారి తప్పక వస్తుందిలే!'' అంటూ భూషణం, పెట్టెలో ఒక తోలు సంచీ పెడుతూంటే, ‘‘అదేమిటి?'' అని అడిగాడు గోవిందరాజు.
 
భూషణం ఉత్సాహంగా తోలుసంచీలోంచి కొన్ని మందులు బయటికి తీసి, ‘‘ఈ అగ్నితుండు కడుపు నొప్పికి, ఈ లేహ్యం వాంతులు కట్టడానికి, ఇది గుండెదడ తగ్గడానికి - అలా ఎప్పుడేరోగం వస్తుందో తెలియదు కదా. అందుకని ప్రయాణంలో అన్నీ దగ్గరుంచుకుంటాను,'' అని, గోవిందరాజుకు చూపించి,వాటిని తోలుసంచీలో వేశాడు కానీ, దాన్ని పెట్టెలో పెట్టుకోవడం మరిచిపోయాడు.

ఆతర్వాత, కేతిగాడి పగటివేషాల భూషణం, హడావిడిగా సత్రం నుంచి బయటికి వచ్చి, తనలాగే వెళ్ళిపోతున్న కళాకారులలో కలిసిపోయాడు.
 
వాడలా వెళ్ళిన కొంతసేపటికి, సత్రం నుంచి బయటికి వస్తున్న గోవిందరాజుకు, ఆ మందుల తోలుసంచీ కంటబడింది. దాన్ని తీసుకుని వీధిలోకి వచ్చిన గోవిందరాజుకు, భూషణం కనిపించలేదు. ఎలాగూ అంగాలమ్మ తీర్థానికి వెళుతున్నాను గదా, అక్కడ ఆ కేతిగాడికి సంచీ ఇవ్వవచ్చుననుకున్నాడు, గోవిందరాజు.
 
మర్నాడు గోవిందరాజు, బాడుగ బండిలో, అంగాలమ్మతీర్థం జరిగే వీరభద్రపురానికి బయల్దేరాడు. అతడు అక్కడికి చేరేసరికి, ఒక చోట చాలా హడావిడిగావుంది. జమీందారు ఠీవిగా గ్రామప్రజలు వేసిన ఆసనం మీద కూర్చుని నవ్వుతున్నాడు. చుట్టూవున్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు. మధ్యలో కేతిగాడి వేషంలో వున్న భూషణం, నిప్పుతొక్కిన కోతిలా అటూఇటూ గెంతుతూ, ‘‘అయ్యా, కడుపు నొప్పి! బాబోయ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నవి! అగ్నితుండు గుళికలెక్కడ? గుండెదడ మాత్రలెక్కడ? అసలు నా తోలుసంచీ ఎక్కడ? అమ్మతల్లీ అంగాలమ్మ! కరుణించి నన్నేలు, తల్లో,'' అంటూ అరుస్తున్నాడు.
 
ఐతే, జమీందారూ, జనం మాత్రం ఇదంతా కేతిగాడి నటన, హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు.
 
భూషణం తోలుసంచీ పేరు చెప్పగానే, గోవిందరాజుకు ఇది హాస్యంకాదనీ, నిజంగానే వాడు కడుపునొప్పితో బాధపడుతున్నాడనీ గ్రహించాడు. ఆయన వెంటనే వాణ్ణి సమీపించి, ‘‘ఇదిగో నీతోలు సంచీ! ఆ మందులేవో నాకు తెలియవు, నువ్వే చూసుకో,'' అంటూ సంచీని అందించాడు.
 
ఆ సరికి జమీందారూ, జనం కూడా కేతిగాడిది నటన కాదనీ, వాడు కడుపునొప్పితో బాధపడుతున్నాడనీ తెలుసుకున్నారు. భూషణం తోలు సంచీలోంచి తనక్కావలసిన మందు తీసుకుని మింగి, మంచి నీళ్ళు కావాలన్నట్టు సైగ చేశాడు. జనంలోంచి ఒకడు చిన్నపాత్రలో నీళ్ళు తెచ్చి ఇవ్వగానే తాగి నేలమీద చతికిలబడ్డాడు.

గాజుల మల్లయ్య


రామాపురం అనే గ్రామంలో మల్లయ్య గాజులమ్ముకుని పొట్టపోసుకునేవాడు. తెల్లవారగానే ఇంత గంజితాగి, గాజుల మలారాన్ని భుజాన తగిలించుకుని బయలుదేరేవాడు. ఇరుగు పొరుగు గ్రామాలు తిరిగి వ్యాపారం ముగించుకుని సాయంకాలానికి తిరిగివచ్చేవాడు.
 
మల్లయ్య దగ్గర నాణ్యమైన గాజులు న్యాయమైన ధరకే లభించడంవల్ల, ఆడవాళ్ళందరూ అతని వద్దే గాజులు తొడిగించుకునేవాళ్ళు.
 
గాజుల మల్లయ్య రోజూ ఉదయం బయలు దేరి వెళ్ళేప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకు మొక్కుకుని వెళ్ళేవాడు. అదేవిధంగా సాయంకాలం తిరిగి వచ్చేప్పుడు గుడి ముందు మలారం దించి, కొంతసేపు కూర్చుని దేవతకు మొక్కుకుని ఇంటికి వెళ్ళేవాడు.
 
రోజూలాగే ఒక రోజు మల్లయ్య తన వ్యాపారం ముగించుకుని ఇంటికివచ్చి, భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడయింది. మల్లయ్య గాఢనిద్రలో ఉండడం వల్ల, తలుపు చప్పుడు వినిపించలేదు. అయినా తలుపు చప్పుడవుతూనే ఉంది. కొద్దిసేపటికి మల్లయ్యకు మెలకువ వచ్చి, తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. రెండు చేతులు మాత్రం గాలిలో కనిపిస్తూ, ‘‘మల్లయ్యా, నాకు గాజులు తొడగవూ?'' అన్న స్త్రీకంఠం వినిపించింది.

 మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి గాజులు తెచ్చి రెండు చేతులకూ తొడిగాడు. వెంటనే రెండు చేతులూ మాయమైపోయాయి. మళ్ళీ మరుసటి రోజు రాత్రి తలుపు చప్పుడు కావడం, మల్లయ్య తలుపు తెరవడం జరిగింది. ఈ సారి అదే గొంతు, ‘‘మల్లయ్యా, నా గాజులు బావున్నాయా?'' అని అడిగింది గాలి లోకి గాజుల చేతులను గలగలలాడిస్తూ. ‘‘ఆ! నీ చేతులకు ఈ గాజులు చాలా బావున్నాయి,'' అంటూ మల్లయ్య వెళ్ళి పడుకున్నాడు.
 
మూడో రోజు రాత్రి గాలిలోని గాజుల చేతులగొంతు మల్లయ్య తలుపు తట్టి అతన్ని నిద్ర లేపింది. మల్లయ్య కళ్ళు నులుముకుంటూ వెలు పలికి వచ్చి, ‘‘అమ్మా, నువ్వు నాకు కనిపించవు. ఇంతకూ నువ్వెవరు? నన్నెందుకు నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నావు?'' అని అడిగాడు.
 
‘‘మల్లయ్యా, నేను ఎవరైతేనేంగాని, నా చేతులకు గాజులు తొడిగిన నీకు ఏమైనా ప్రతిఫలం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో,'' అన్నది ఆ స్ర్తీ కంఠస్వరం.
 
‘‘ఏం కోరుకుంటాను తల్లీ! నాలుగు ఊళ్ళు తిరిగి వ్యాపారం చేసుకునే సత్తువ నా కాళ్ళకు ఉంటే చాలు. కష్టపడి నా భార్యాబిడ్డలను పోషించుకుంటాను. మనసెరిగి నడుచుకునే భార్యా, నా మాట జవదాటని పిల్లలూ ఉన్నారు. ఇంతకు మించి నాకేంకావాలి. వాళ్ళకు ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకో. అదే పదివేలు!'' అన్నాడు మల్లయ్య.
 
‘‘మల్లయ్యా! నీ మంచి మనసే నీకు రక్ష. పిల్లాపాపలతో నువ్వు చిరకాలం శాంతి సుఖాలతో వర్థిల్లగలవు,'' అంటూ గ్రామదేవత రూపం లీలగా కనిపించి అదృశ్యమయింది.

నీలాంటివాడే


రామేశం, కామేశం ఇరుగుపొరుగునేవున్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆటపట్టించి, తను అతణ్ణి మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. ఐతే, అందుకు ప్రయత్నించినప్పుడల్లా, భంగపడడమే రివాజయింది.
 
ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో, ఊరి పెద్దలందరూ సమావేశమై, శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ, భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలివ్వడం మానేశాడు.
 
అక్కడే వున్న కామేశం బాధ నటిస్తూ, ‘‘రామేశం! సూచనలివ్వడం మానేశావేం?'' అన్నాడు.
 
‘‘అనువుకాని చోట అధికులమనరాదు,'' అన్నాడు రామేశం.
 
‘‘నీ మాట నెగ్గడం లేదని కోపమొచ్చిందా?'' అన్నాడు కామేశం, ఆయన్ను రెచ్చగొట్టాలని.
 
‘‘పేదవాడి కోపం పెదవికి చేటు,'' అన్నాడు రామేశం. ‘‘అర్థమైంది.
 
నీకు పెద్దరికం లేదని, సీతారాముల కళ్యాణానిక్కూడా రావా ఏమిటి?'' అన్నాడు కామేశం. ‘‘దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా!'' అన్నాడు రామేశం.
 
‘‘అందరూ పెద్దలే అంటున్నావు! మరి అందరూ అందల మెక్కేవాళ్ళయితే, మోసే వాళ్ళెవరుట?'' అంటూ కామేశం, తనూ ఓ సామెత ప్రయోగించి మెప్పుకోసం అందరి వంకా చూశాడు. రామేశం చటుక్కున, ‘‘ఆ, ఎవడో నీలాంటివాడు దొరక్కపోడు!'' అన్నాడు. అక్కడున్న వారంతా ఘొల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలపోయింది.

ఉత్తమ రాజలక్షణం!


సువర్ణపురి రాజు సుబలదేవుడు పరాక్రమశాలి; రాజ్య కాంక్షాపరుడు. పొరుగున ఉన్న వ్రతశిలా రాజ్యంతో సువర్ణపురికి తరతరాలుగా పగ కొనసాగుతున్నది. ప్రస్తుత వ్రతశిలా రాజు సుధర్ముడు శాంతి ప్రియుడు. అయితే, మునుముందు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగగలదనే నమ్మకం సుబలదేవుడికి లేదు.
 
ఇప్పుడు తనవద్ద శక్తివంతమైన సేనలు ఉన్నాయి గనక, పొరుగురాజ్యంపై దండెత్తి వెళ్ళి శత్రుశేషం లేకుండా చే…యాలని ఆలోచించసాగాడు. ఇది సుబలదేవుడి రాణికి ఏమాత్రం నచ్చలేదు. ‘‘ప్రభూ! శాంతి వర్థిల్లుతున్నప్పుడు మనంగా దండెత్తి వెళ్ళడం భావ్యమవుతుందా? పైగా, వ్రతశిలారాజు ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టూ, ఆ…యన మనమీద దాడి చేసే అవకాశం లవలేశం లేదనీ మన చారుల ద్వారా తెలియవచ్చింది కదా. మైత్రి పెంపొందించుకోవలసిన సమయంలో కయ్యానికి కాలుదువ్వడం సబబేనా? ప్రభువులు మరొక్కసారి ఆలోచించండి,'' అని తన అభ్యంతరాన్ని సున్నితంగా తెలియజేసింది.
 
రాణిగారి అభిప్రాయంతో ఏకీభవించిన మహామంత్రి, ‘‘అవును ప్రభూ. మునుపటి రాజు శత్రుభావంతో మనమీద కత్తికట్టిన మాట వాస్తవమే. అయితే, ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఈనాటి రాజు సత్వ సంపన్నుడు; శాంతి ప్రియుడు. పైగా యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేము. రాజు వ్యాధిగ్రస్తుడైవున్న మాట నిజమే. అయితే, ప్రజలు ఆయన పట్ల అపార గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నారు. ఇంకా పసివాడైన యువరాజు సుశాంతుడంటే దేశ ప్రజలకు పంచప్రాణాలు. కాబట్టి ఒక వేళ మనం వాళ్ళ సేనలను ఓడించినప్పటికీ ప్రజలు తిరుగుబాటుచేయ గలరు.

అప్పుడు రాజ్యంలో శాంతి కరువవుతుంది,'' అన్నాడు. ‘‘ఇప్పటి రాజు మరణించాక, అంతగా ప్రజాభిమానం చూరగొన్నయువరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తే, మునుముందు మనమీదికి దండెత్తి రాడన్న నమ్మకం ఏమిటి? మనం బలంగా వున్నప్పుడే శత్రుశేషం లేకుండా చేయడం క్షాత్రధర్మం. ఇక ప్రజల తిరుగుబాటు అంటారా? ఉక్కుపాదంతో అణచివేద్దాం. అంతే!'' అన్నాడు రాజు.
 
ఆ తరవాత సువర్ణపురి సైన్యం, వ్రతశిలా రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వ్రతశిలారాజ్య రాజు సుధర్ముడు, స్వయంగా సైన్యాన్ని నడుపుతూ శత్రుసేనలను ఎదుర్కొన్నాడు.
 
సుబలదేవుణ్ణి తీవ్రంగా గాయపరచి, అతడితో పోరాడుతూ వీరమరణం పొందాడు. సుబలదేవుడు వాంఛించిన విధంగానే యుద్ధంలో విజ…యం సాధించాడు. సువర్ణపురితో వ్రతశిలా రాజ్యాన్ని కలుపుకున్నాడు. అయినా, తాను సాధించిన విజయం ఆయనకు ఆనందం కలిగించలేదు. యుద్ధంలో సుధర్ముడి ద్వారా కలిగిన గాయం ఎన్నివైద్యాలు చేసినా మానలేదు. దాంతో ఒకసంవత్సరం బాధపడి మరణించాడు. సుబలదేవుడికి ఉన్నది ఒక్కగానొక్కకుమార్తె. మగ సంతానం లేదు. సద్గుణ సంపన్నుడైన ఒక యువకుణ్ణి దత్తత తీసుకోవాలని మహారాణి ఆశించింది. అలాంటి…యువకుడి కోసం, మంత్రి ఆయన పరివారం, అన్వేషణ ప్రారంభించారు.
 
ఒకవారం గడిచింది. సుప్రసిద్ధ గురువు హేమచంద్రులు నడుపుతూన్న గురుకులాశ్రమానికి వెళ్ళి, అక్కడ విద్యనభ్యసిస్తూన్న యువకులను చూడడానికి మంత్రి, ఇద్దరు అనుచరులతో బయలుదేరాడు. ముగ్గురూ బాటసారుల్లా మారువేషాలు ధరించారు. వాళ్ళు గురుకులాశ్రమాన్ని సమీపించే సరికి సూర్యుడు పడమటి దిశకు చేరుకున్నాడు. బంగారం లాంటి లేతపసువు ఎండలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. దాపులనున్న చిన్న గుట్ట మీదికి ఎక్కి మంత్రీ, ఆయన అనుచరులూ ఆడుకుంటూన్న విద్యార్థులను జాగ్రత్తగా పరిశీలించసాగారు.
 
ఆ విద్యార్థుల బృందంలో ఒకడు చూడడానికి చాలా ముచ్చటగా ఎంతో హుందాగా ఉన్నాడు. సహవిద్యార్థులు అతడి పట్ల ప్రేమాభిమానాలు కనబరుస్తున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటూండగా, హఠాత్తుగా ఎక్కడినుంచో ఒకరాయి రివ్వునవచ్చి, అతడి నుదుటికి తగిలింది. బొటబొటా రక్తం కారసాగింది. వెంటనే కొందరువెళ్ళి ఏవో ఆకులు కోసుకువచ్చి, వాటి పసరును గాయంపై పిండి కట్టుగట్టారు. మరి కొందరు మిత్రులు, ఆ రాయి వచ్చిన దిశగా వెళ్ళి, పొదకు ఆవలినుంచి దాన్ని విసిరినవాణ్ణి పట్టుకు వచ్చి తమ మిత్రుడి ఎదుట నిలబెట్టారు.
 
‘‘ఇతన్ని తప్పక శిక్షంచాలి,'' అన్నాడు ఒక విద్యార్థి.

‘‘అవును. మనమూ రాళ్ళు విసిరి, అతని తలను గాయపరచాలి,'' అన్నాడు మరొక విద్యార్థి ఆవేశంగా.
 
అయితే, గాయపడిన వాళ్ళ నాయకుడు మాత్రం, అతనికేసి ప్రశాంతంగా చూస్తూ, ‘‘నువ్వు రాయిని ఎందుకు విసిరావు?'' అని అడిగాడు.
 
‘‘మరీ ఆకలి వేసింది. ఆ చెట్టుకొమ్మలో మాగిన జామపండు ఒకటి కనిపించింది. దానిని కొట్టడానికి రాయి విసిరాను,'' అన్నాడు వచ్చిన మనిషి.
 
‘‘జామపండు పడిందా?'' అని అడిగాడా విద్యార్థి నాయకుడు.
 
‘‘పడింది. దాన్ని అప్పుడే తినేశాను,'' అన్నాడా మనిషి.
 
‘‘ఆకలి తీరిందనుకుంటాను, అవునా,'' అని అడిగాడు విద్యార్థి.
 
ఆ పెద్దమనిషి కాస్సేపు అటూ ఇటూ చూసి, ‘‘ఎలా తీరుతుంది? ఎలాగైనా అడవికి దాపుల నున్న గ్రామాన్ని చేరుకుని గుడిప్రసాదం తిని ఆకలి తీర్చుకుంటాను. ఆ జామపండే గనక తినలేదనుకుంటే మాత్రం, ఇక్కడే శోషవచ్చి పడి పోయేవాణ్ణి,'' అన్నాడు.
 
‘‘మాతో రా, మా గురుకులాశ్రమంలో భోజనం పెడతాం. చీకటి పడుతోంది. అడివి మార్గంలో ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడం క్షేమంకాదు. తెల్లవారాక వెళ్ళవచ్చు,'' అంటూ ఆ విద్యార్థి నాయకుడు ఆపెద్ద మనిషిని వెంట పెట్టుకుని గురుకులం వైపు నడవసాగాడు.
 
‘‘ఏమిటి మిత్రమా! నీ తలను గాయపరచిన వాడికి సాయపడడమా?'' అన్నాడు ఒక మిత్రుడు.
 
‘‘అవును మిత్రమా. అతడు చెట్టు మీదికి రాయి విసిరినప్పుడు చెట్టు ఏం చేసింది? తన ఫలాన్ని ఇచ్చింది కదా! ఒక చెట్టే అలా చేయగలిగినప్పుడు, మనిషినైన నేను అంతకన్నా మంచి పని చేయాలి కదా? చెట్టు పండునిచ్చింది. నేను భోజనం పెట్టి తీరాలి!'' అన్నాడు వాళ్ళ నాయకుడు మందహాసం చేస్తూ.
 
‘‘అద్భుతం! ఇదీ ఉత్తమమైన రాజలక్షణం! ఆ …యువకుడు ఎవరై ఉంటాడు?'' అని అడిగాడు వాళ్ళ సంభాషణ విన్న మంత్రి తన అనుచరులను. ఆ తరవాత మంత్రి గురుకులాశ్రమానికి వెళ్ళి గురువుకు తానెవరైనదీ చెప్పి ఆ యువకుడి వివరాలడిగాడు. అతడు వ్రతశిలా రాజ కుమారుడు సుశాంతుడని గురువు తెలియజేశాడు.
 
ఆ తరవాత మంత్రి, మహారాణి కోరిక ప్రకారం, వ్రతశిలా రాణిని దర్శించి సంగతి చెప్పాడు. ఇద్దరు రాణులూ కలుసుకున్నారు. సువర్ణపురి…యువరాణి సువర్చలాదేవిని వ్రతశిలా రాజకుమారుడు సుశాంతుడికిచ్చి ఘనంగా వివాహం జరిపారు. ఉభయ రాజ్యాలకూ రాజై, సుశాంతుడు ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసి ఆదర్శ ప్రభువుగా కీర్తిగాంచాడు.

వింత యాదృచ్ఛికాలు!


దాదాపు యాభై సంవత్సరాలకు పూర్వం అమెరికా దేశం నెబ్రాస్కాలోని బియాట్రిస్‌ అనే చిన్న పట్టణంలో ఒక అందమైన చిన్న చర్చ్ ఉండేది. రోజూ అక్కడ ‘క్వాయర్‌' సంగీత బృందకళాకారులు నిర్ణీత సమయానికి వచ్చి పాటలుపాడి ప్రాక్టీస్‌ చేస్తూండేవాళ్ళు. సంగీత కళాకారులందరూ సమయపాలన పట్ల చాలా జాగ్రత్తవహించేవాళ్ళు.
 
అయితే, 1950 మార్చ్ 1వ తేదీ అక్కడొక ఘోరసంఘటన జరిగింది. మతాధికారి వాల్టర్‌ క్లెంపెల్‌, ఎప్పటిలాగే ఆరోజు మధ్యాహ్నం చర్చ్‌కి వచ్చి సాయంకాలం క్వాయర్‌ సంగీత సాధనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళాడు. సాయంకాలం 7.15 గం.లకు సంగీత కళాకారులు వచ్చేసరికి బాగా చలిగా వుంటుంది గనక, చలిమంటను రగిలించి, భోజనానికి వెళ్ళాడు.
 
ఆయనసాయంకాలం 7.10 గం.లకు భార్యా, కూతుళ్ళతో కలిసి చర్చ్‌కి తిరిగి రావడానికి బయలుదేరాడుగాని, రాలేక పోయాడు. బయలుదేరే సమయంలో, బట్టలు నలిగిపోయి ఉన్నాయి. వాటిని ఇస్ర్తీ చేస్తే తప్ప చర్‌‌చకి రానని ఆయన భార్య చెప్పడంతో వాళ్ళు బయలుదేరడంలో ఆలస్యమయింది. వాళ్ళు ఇంటి వద్ద ఉన్న సమయంలోనే ఆ అసాధారణ సంఘటన సంభవించింది!
 
మెషినిస్టుగా పనిచేసే హార్వీ ఆల్‌, భార్య దగ్గర లేకపోవడంతో తన ఇద్దరు కొడుకుల బాధ్యతను తనే చూసుకుంటున్నాడు. అయితే, ఆరోజు అతడు అనుకోకుండా తన మిత్రుడితో ఆసక్తికరంగా మాటల్లో పడి సమయం గడిచిపోవడం గమనించలేదు. తీరా గడియారం చూసేసరికి అప్పటికే 7.15 దాటి పోయింది.
 
పియానిస్ట్ మేరీలిన్‌ పాల్‌, నిజానికి ఆరోజు అరగంట ముందే ప్రాక్టీసుకు వెళ్ళాలనుకుంది. అయితే, సాయంకాలం భోజనం చేశాక, చిన్న కునుకు తీద్దామనుకుని అలాగే నిద్రపోయింది.

ఆమె తల్లి వచ్చి నిద్రలేపే సరికి ఏడుంబావు అయింది. అప్పటికే ఆలస్యం. ఆపైన హడావుడిగా వెళ్ళినా అక్కడికి సమయానికి చేరుకోలేమనుకున్నది.
 
క్వాయర్‌ డైరెక్టర్‌ మిస్సస్‌ ఎస్‌.ఇ. పాల్‌, పియానిస్ట్ తల్లి. ఎంతసేపు లేపినా కూతురు నిద్ర లేవలేకపోవడంతో, ఆమె కూడా బయలుదేరలేక పోయింది. అసాధారణమైన ఆ దుర్ఘటన జరిగినప్పుడు, ఆ తల్లీకూతుళ్ళు ఇంటిపట్టునే ఉన్నారు!
 
ఆ సాయంకాలం చలి మరీ ఎక్కువగా ఉండడంతో, స్టెనోగ్రాఫర్‌ జాయిస్‌ బ్లాక్‌ బద్ధకంగా చివరి నిమిషం వరకు ఇంట్లోని చలిమంట ముందు వెచ్చగా కూర్చున్నది. అయితే ఆమె క్వాయర్‌కు బయలుదేరే సమయంలోనే అనూహ్యమైన ఆ దుర్ఘటన జరిగిపోయింది!
 
హైస్కూల్లో చదువుతున్న లడోనా వ్యాండ్‌ గ్రిఫ్‌‌ట అనే అమ్నాయి లెక్కలు వేయడంలో లీనమై పోయింది. క్వాయర్‌ ప్రాక్టీస్‌ ఠంచనుగా 7.15 గం.లకు ఆరంభమవుతుందని ఆమెకు తెలుసు. అందువల్ల ఎప్పుడూ పది నిమిషాలు ముందే ఆమె అక్కడవుంటుంది. అయితే, ఆరోజు మాత్రం లెక్కల్లో మునిగిపోయి సమయం గడవడం చూసుకోలేదు.
 
శాడీ, రొయూనా ఎస్ట్స్ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అయితే, వాళ్ళ కారు స్టార్ట్ కాలేదు. అందువల్ల వాళ్ళు,తన కారులో తమను కూడా తీసుకువెళ్ళమని లడోనా వ్యాండీ గ్రిఫ్‌‌టను అడిగారు. అయితే, లడోనా లెక్కలు వేయడంలో తలమునకలుగావుంది. అందువల్ల వాళ్ళు కూడా ఆమెకోసం వేచివుండవలసి వచ్చింది. వాళ్ళు లడోనా రాక కోసం కాచుకుని ఉన్నప్పుడే పట్టణంలో ఆ అసాధారణ దుర్ఘటన జరిగింది!
 
లూసిలీ జోన్‌‌స, డోరొతీవూడ్‌ సహాధ్యాయులు, ఇరుగుపొరుగులు. వాళ్ళు మామూలుగా క్వాయర్‌ ప్రాక్టీస్‌కు కలిసే వెళ్ళేవాళ్ళు. అయితే ఆరోజు లూసిలీ 7 నుంచి 7.30 వరకు ఏదో ఆసక్తికరమైన రేడియో కార్యక్రమం వింటూ వుండిపోయింది. ఆ కార్యక్రమాన్ని చివరిదాకా వినాలన్న కుతూహలంతో ఆమె సమయానికి బ…యలుదేరలేక పోయింది. డోరొతీ తన స్నేహితురాలి కోసం కాచుక్కూర్చున్నప్పుడే బియాట్రిస్‌ పట్టణంలో అమితాశ్చర్యకరమైన ఆ సంఘటన జరిగింది!

మిసస్‌ లియొనార్డ్ స్కుస్టర్‌, ఆమె చిన్నారి కూతురూ సమయానికి క్వాయర్‌కు చేరుకుని ఉండేవారే. అయితే ఆరోజు సాయంకాలం ఆమె తన తల్లిని చూడడానికి వెళ్ళింది. అందువల్ల అక్కడ ఆలస్యమై పోయింది. ఆ తల్లీ కూతుళ్ళు చర్చ్‌ని సమీపించడానికి ముందే ఆ భీకర దుర్ఘటన జరిగిపోయింది!
 
లేథ్‌ ఆపరేటర్‌ హెర్బర్ట్ కిఫ్‌ మామూలుగా అందరికన్నా అరగంట ముందే చర్చ్‌కి వచ్చేవాడు. అయితే, ఆ రోజు బ…యలుదేరే ముందు అసంపూర్తిగా ఉన్న ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు. అతడు తన ఇంట్లో ఉత్తరం రాస్తున్నప్పుడే ఆ వింత సంఘటన జరిగింది!
 
ఇంతకూ ఆ రోజు, అంటే 1950 మార్చ్ 1 సాయంకాలం ఏం జరిగిందో తెలుసా? మామూలుగా క్వా…యర్‌ పాట కచేరీ ఒద్దిక సరిగ్గా సాయంకాలం 7.15 గం.లకు ఆరంభమయ్యింది. ఆరోజు ఆ సమయానికి పది నిమిషాలు తరవాత అంటే సరిగ్గా 7.25 గంటలకు, బియాట్రిస్‌ పట్టణమంతా మారుమోగిన పేలుడు సంభవించింది. సాయంసంధ్య ఆకాశంలో అగ్ని ఖండాలు సుడులు తిరిగాయి. క్వాయర్‌ పాటకచేరీ ప్రాక్టీస్‌ చేసే చర్చ్ గోడలు నేల కూలాయి. కలపతో నిర్మించిన పైకప్పు భీకర శబ్దంతో నేలకు ఒరిగింది!
 
అదృష్టవశాత్తు చర్చ్ ఖాళీగా ఉంది. సమయపాలనకు పేరుగాంచిన క్వాయర్‌ బృంద సభ్యులు ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం విశేషం. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో సమయానికి అక్కడికి చేరుకోలేకపోయారు. రేడియో కార్యక్రమం వినడం, నలిగిన బట్టలు ఇస్ర్తీచేయడం, అసంపూర్తిగా ఉన్న ఉత్తరం పూర్తిచేయడం, లెక్కలు వేయ.డంలో నిమగ్నమవడం, కునుకు తీయడం, కారుస్టార్ట్ కాకపోవడం వంటి అతిసాధారణమైన కారణాలవల్ల వాళ్ళు సమయానికి బయలుదేరలేక పోయారు. ఇది ఎలా జరిగింది? కేవలం అన్నీ యాదృచ్ఛికాలేనా? లేక వీటన్నిటికీ వెనక ఏదైనా అదృశ్యశక్తి పనిచేసిందా? అన్నది నిగూఢ రహస్యంగానే మిగిలిపోయింది! అదిసరే. మరి చర్చ్ పేలిపోవడానికి కారణం ఏమిటి? కారణం ఇదమిత్థంగా నిర్ధారించబడలేదు.
 
అయితే, అగ్నిమాపకదళం మాత్రం - వెలుపలవున్న విరిగిన పైపు నుంచి సహజవాయువు వెలువడి చర్చ్ లోకి వెళ్ళివుంటుంది. లోపల రగులుతూన్న చలిమంట కొలిమి నుంచి నిప్పంటుకుని భారీపేలుడు సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడింది.
 
ఆ రోజు సాయంకాలం తమకు జరిగిన సంఘటనలను తలుచుకున్నప్పుడు క్వా…యర్‌ బృంద సభ్యుల హృద…యాలు దేవుడి పట్ల కృతజ్ఞ తతో పొంగిపొర్లాయి. దేవుడి అద్భుతమే తమ ప్రాణాలను రక్షించిందని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించారు!
 
మీరూ అలాగే అనుకుంటున్నారా?

దొరలు-దొంగలు


ఒక ఊళ్ళో భూషయ్య అనే భూస్వామికి విరూపుడనే పెళ్ళీడు వచ్చిన కొడుకు ఉండేవాడు. అతను రాత్రివేళ తమ ఇంటి వెనక రావిచెట్టు కింద నిద్రపోయేవాడు. తెల్లవారి లేస్తూనే చెట్టు మీది పక్షులను చూసి ఆనందించేవాడు. ఒకరోజు ఉదయం విరూపుడు నిద్ర లేస్తూనే చెట్టుకేసి చూసి, కెవ్వున అరిచి, స్పృహ తప్పి పడిపోయాడు. ఆ కేకకు భూషయ్య ఇంట్లో నుంచి వచ్చి, కట్టెలా పడిఉన్న కొడుకును నౌకర్ల చేత ఇంట్లోకి చేర్పించాడు.
 
కొద్దిసేపటికి విరూపుడికి స్పృహ వచ్చింది గాని అతను పిచ్చిచూపులు చూస్తూ, మతితప్పినవాడిలా మాట్లాడ సాగాడు. విరూపుడి స్థితిచూసి భూషయ్య కంగారుపడటానికి మరో కారణం ఏమంటే, ఆ రోజే ఎవరో అతన్ని పెళ్ళిచూపులు చూడవస్తున్నారు. భూషయ్య వాళ్ళకు ఒకవారం తరవాత రమ్మని కబురు చేసి, పక్కింటి వైద్యుడు కరటయ్యను పిలిపించాడు. కరటయ్య పిల్లవాణ్ణి పరీక్షించి, ‘‘అనారోగ్యం ఏమీలేదు, ఏ పిశాచమన్నా పట్టుకున్నదేమో? లేక ఏ దయ్యాన్నో, భూతాన్నో చూసి దడుచుకున్నాడో? మఠంలోకి కొత్తగా వచ్చిన సాధువును చూద్దాం పదండి,'' అన్నాడు భూషయ్యతో.
 
ఇద్దరూ మఠానికి వెళ్ళారు. ఆ సమయూనికి దయ్యంపట్టినవాడొకడు సాధువు చుట్టూ గిరికీలు కొడుతున్నాడు. సాధువు వాణ్ణి తన చేతిబెత్తంతో తల మీద మూడు సార్లు తాటించాడు. వెంటనే దయ్యం దిగిపోయింది. భూషయ్యకు సాధువు మీద గురి కుదిరి, ఆయనకు తాను వచ్చినపని చెప్పాడు.
 
సాధువు అంతావిని కళ్ళుమూసుకుని తెరిచి, ‘‘నీ కొడుక్కు ఏ దయ్యమూ, భూతమూ పట్టలేదు. ఎవరో గిట్టనివాళ్ళు చేతబడి చేయించారు. మీ ఊళ్ళో ఎంత మంది మంత్రగాళ్ళున్నారు?'' అని అడిగాడు.
 
‘‘ఇద్దరే, స్వామీ! శరభయ్యా, సాంబయ్యా!'' అన్నాడు భూషయ్య.

‘‘వారిలో ఒకరు ఈ పని చేసి ఉండాలి. నీ కొడుక్కు చికిత్స చెయ్యమని ఇద్దర్నీ అడుగు. ఎవరు వైద్యం చెయ్యటానికి ఒప్పుకుంటే వాడి పేరు నాకు వచ్చి చెప్పు,'' అన్నాడు సాధువు.
 
భూషయ్యా, కరటయ్యా ఇంటికి తిరిగి వచ్చి, భూతవైద్యులిద్దరినీ పిలిపించారు. శరభయ్య విరూపుణ్ణి చూడగానే పెదవి విరిచి, ‘‘ఈ చికిత్స నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు,'' అన్నాడు. అతను వెళ్ళాక సాంబయ్య, ‘‘నేను చికిత్స చేస్తాను. ఇది ఎవడి పనో, ఈ రాత్రి అంజనం వేసి నేను కనుక్కుంటాను.
 
శరభయ్య డబ్బుకు గడ్డి తింటాడు. ఈ పాడుపని వాడిదే అని నా అనుమానం. అందుకే తన వల్ల కాదని చెప్పి, చల్లగా జారుకున్నాడు. ఈ దెబ్బతో వాడి అంతు తేల్చుతాను,'' అన్నాడు. సాంబయ్యను పంపించి, భూషయ్య సాధువు వద్దకువెళ్ళి, చికిత్స చెయ్యటానికి సాంబయ్య ఒప్పుకోవటమే గాక, ఇది శరభయ్య పనే అని శంకిస్తున్నట్టు కూడా తెలిపాడు. సాధువు తల అడ్డంగాతిప్పి, ‘‘నువ్వూ శరభయ్యనే శంకిస్తున్నావు. కాని నా దివ్య దృష్టితో చూస్తే నీ కొడుక్కు చేతబడి చేసినది సాంబయ్యే అని తెలిసిపోతున్నది. ఈ రాత్రికి అంజనం వేసే సాకుతో నీ కొడుకు ప్రాణాలు తీసే ప్రయత్నం చెయ్యబోతాడు. నా మాట విని, నీ కొడుకును దక్కించుకో!'' అన్నాడు.
 
అందుకు ఏం చెయ్యాలో భూషయ్య సాధువు వల్ల తెలుసుకున్నాడు. ఆ రాత్రి భూషయ్యా, పక్కింటి వైద్యుడు కరటయ్యా, మరో ఇద్దరు మనుషులూ సాంబయ్య ఇంటి వైపువెళ్ళి, సమీపంలో మాటువేశారు.
 
అర్ధరాత్రి దాటాక సాంబయ్య నట్టింట ముగ్గులు వేసి, ముగ్గుల మధ్య చచ్చిన పామును తెచ్చి చుట్టగా చుట్టిపెట్టి, దాని మీద ఒక పుర్రెను ఉంచి, పుర్రె పైన ఒక నిమ్మకాయను నిలబెట్టాడు. తరవాత ఇల్లంతా కమ్ముకునేటట్టు ధూపంవేసి, తన వేలు, కోసుకుని, తన రక్తంతో పుర్రెకు బొట్లు పెట్టాడు. ఇది పూర్తి అయ్యాక సాంబయ్య ముగ్గు ముందు కూర్చోబోతూండగా, దాగి ఉన్న నలుగురు మనుషులూ లోపలికి జొరబడి, సాంబయ్యను కట్టేసి, చావబాది, సాధువు దగ్గిరికి లాక్కువెళ్ళారు.
 
చేసిన తప్పు ఒప్పుకోమని వాళ్ళు నిర్బంధించేసరికి సాంబయ్య, ‘‘మహా ప్రభో! దేవుడి తోడు, నే నేమీ చెయ్యలేదు.

ఈ పాపిష్ఠి ప్రయోగం ఎవరు చేశారో కూడా నాకు తెలీదు. అది తెలుసుకునేందుకే అంజనం వెయ్యబోతూండగా వీళ్ళు నన్ను చావగొట్టి లాక్కొచ్చారు,'' అని ఏడ్చాడు.
 
భూషయ్య మనుషులు సాంబయ్యను మళ్ళీ కొట్టబోతూండగా, ‘‘ఆగండి!'' అంటూ శరభయ్య విరూపుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి, ‘‘కొట్టవలసింది సాంబయ్యను కాదు, నిజంగా చేతబడి చేసి, సాధువు వేషంలో ఉన్న ఈ పొరుగూరి మంత్రగాణ్ణి! దుర్మార్గం చేసింది చాలక, అందులో నన్నూ, సాంబయ్యనూ ఇరికించాలని చూశాడు,'' అన్నాడు.
 
సాధువు మెల్లిగా జారుకోబోయాడు. కాని శరభయ్యా, విరూపుడూ వాణ్ణి పట్టుకుని, నాలుగు తగిలించారు. వాడు మొర్రోమంటూ, ‘‘అయ్యూ, బుద్ధి గడ్డితిని ఆ పాడుపని చేసింది నేనే గాని, నా చేత ఆ పని చేయించిన పెద్దమనిషి ఇక్కడే ఉన్నాడు,'' అని కరటయ్యను చూపించాడు. కరటయ్య మొహం నల్లగా అయింది. భూషయ్య అతని కేసి అసహ్యంగా చూస్తూ, ‘‘ఇదంతా చివరకు నీ పనా? ఎందుకు చేయించావీ ముదనష్టపు పని?'' అని అడిగాడు. ఆ ప్రశ్నకు విరూపుడు సమాధానం చెబుతూ ఇలా అన్నాడు:
 
‘‘కరటయ్య పిసినిగొట్టుతనం అందరికీ తెలిసినదే. తన ఒక్క కూతురినీ నా కియ్యూలనుకున్నాడు. పెళ్ళి అన్నాక చాలా ఖర్చు అవుతుంది. దమ్మిడీ ఖర్చు కాకుండా నన్ను అల్లుణ్ణి చేసుకోవటానికి ఈ సాధువు చేత ప్రయోగం చేయించాడు. నేను పిచ్చివాణ్ణి అంటే సంబంధాలు రావు. దమ్మిడీ ఖర్చుకాకుండా నాకూ, తన కూతురికీ పెళ్ళి చేసేసి, తరవాత నన్ను మామూలు మనిషి చేసుకుందామని కరటయ్య దురాశపడ్డాడు. నాకు మతిపోయింది చెట్టు మీద కనిపించిన దిష్టి బొమ్మను చూసి! శరభయ్య ధర్మమా అంటూ నేను మళ్ళీ మామూలుమనిషిని అయ్యూను.''
 
కరటయ్య తాను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ అవమానంతో అతనికి బుద్ధి వచ్చింది. తరవాత పెట్టవలసిన ఖర్చేదోపెట్టి కరటయ్య తన కూతుర్ని విరూపుడికే ఇచ్చి వైభవంగా పెళ్ళిచేశాడు.

తిరిగి వచ్చిన రాజు


చోళదేశంలోని మంగళాపురం రాజ్యాన్ని రాజశేఖరుడు అనే సామంతరాజు పాలించేవాడు. ఆయన చక్రవర్తికి క్రమం తప్పకుండా కప్పం చెల్లిస్తూ, ప్రశాంతంగా రాజ్యపాలన చేయసాగాడు. సారవంతమైన భూములతో పాటు, సకాలంలో వర్షాలు కురవడంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది. దాంతో పాటు రాజు సామాన్య ప్రజలు-ధని కులు, రైతులు-వ్యాపారులు, కవులు-కళాకారులు అన్న తారతమ్యం పాటించకుండా ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం కలిగినా వెంటనే ఆదుకునేవాడు. కళాభిమాని కావడంతో కళలను ఆదరిస్తూ, కళాకారులనూ, కవులనూ ప్రత్యేకంగా పోషించేవాడు.
 
ఇది రాజు తమ్ముడైన మణిశేఖరుడికి అసలు గిట్టలేదు. అనవసరమైన వాటికి వృథాగా ఖర్చు చేస్తూ, అన్న ఖజానాను ఖాళీ చేస్తున్నాడని అతడు భావించాడు. అన్న తదనంతరం తను రాజ్య పాలనకు వచ్చేలోపల బొక్కసం పూర్తిగా తుడిచిపెట్టుకు పోగలదని అనుమానిం చాడు. దానికితోడు అతనిలో అధికార దాహం రోజురోజుకూ ప్రబలసాగింది. తను త్వరగా అధికారాన్ని చేపట్టాలి! అడ్డంకుగా ఉన్న అన్నను ఎలాగైనా తొలగించి, ఆఖరికి హతమార్చయినా సరే సింహాసనాన్ని అధిష్ఠించాలని కలలు గనసాగాడు. అయితే, అన్నను తుదముట్టించే పని తను స్వయంగా చేయకుండా అందుకు వేరెవరినైనా నియోగించాలని పథకం వేశాడు. అన్నతో సన్నిహితంగా మసలే వారికి ధనాశ చూపి గుట్టు చప్పుడు కాకుండా తన కార్యం సాధించుకోవాలని మొదట రాజుగారి వంటవాడితో ఆ ప్రస్తావన తెచ్చాడు.
 
‘‘మహారాజు ఎప్పుడూ అతిథులతో కలిసే భోజనం చేస్తారు. నేను వంటలో విషం కలిపితే, ఆ విషయం సులభంగా బయటపడి నేను పట్టు బడిపోగలను. గనక, ఆ పని నేను చేయలేను, నన్ను క్షమించండి,'' అని వంటవాడు మంచిగా జారుకున్నాడు.
 
మణిశేఖరుడు మరి కొందరివద్దకు వెళ్ళాడు. అయినా, ఏ ఒక్కరూ అందుకు సరేనని ముందుకు రాలేదు.

ఆఖరికి అతని కోరికకు రాజుగారి క్షురకుడు అంగీకరించినట్టు కనిపించాడు. అయితే, పనిముగించాకే డబ్బు పుచ్చు కోగలనని చెప్పాడు వాడు. మరునాడు ఉదయం రాజుకు క్షవరం చేస్తూ, యువరాజు దుష్ట ప్రయత్నం గురించి ఆయనకు చెప్పాడు.
 
ఆ మాట విని రాజు ఒక్కక్షణం దిగ్భ్ఱాంతి చెందాడు. క్షురకుడికి కృతజ్ఞత తెలియచేసి పంపాక, తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజు అప్పటికప్పుడే సభ ఏర్పాటు చేశాడు. యువరాజు దుష్టపథకం ఎరిగిన వారందరూ, రాజుగారు ఏం చెబుతారో ఏమో అని ఆతృతతో ఎదురు చూడసాగారు. రాజు సింహాసనంనుంచి లేచి నిలబడి, ‘‘నేనింతకాలం రాజ్య పాలన చేసి అలిసి పోయాను. పాలన పట్ల విసుగు కలుగుతోంది. ఇకపై అడవికి వెళ్ళి శేషజీవితాన్ని దైవచింతనతో గడపాలని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి నా సోదరుడు మణి శేఖరుడు రాజ్యపాలనా బాధ్యత వహించగలడు,'' అన్నాడు గంభీరంగా.
 
రాజు నిర్ణయాన్ని పునః పరిశీలించమని సభికులు వేడుకున్నారు. అయినా, రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తమ్ముణ్ణి పిలిపించి సభాసదుల సమక్షంలో తన కిరీటాన్ని తీసి అతని తలపై ఉంచాడు. మరునాడు తెల్లవారక ముందే రాజ శేఖరుడు అడవికి వెళ్ళిపోయూడు.
 
ధర్మాత్ముడైన అన్నకు ద్రోహం తలపెట్టిన తమ్ముడు తమకు రాజు కావడం చూసి ప్రజలు బాధపడ్డారు. రాజోద్యోగుల ముఖాల్లో ఏమాత్రం సంతోషం కనిపించకపోయినప్పటికీ, ఆశించిన విధంగా అధికారం చేజిక్కిందన్న గర్వంతో మణిశేఖరుడు కొన్ని రోజులు సంతోషంగానే గడిపాడు. రాజోద్యోగులు కూడా అతడు చెప్పిన పనులు సక్రమంగా చేయసాగారు. అయినా తన చుట్టూ వున్న ఉద్యో గులు ముభావంగా ప్రవర్తిస్తూ ఎల్లవేళలా తీరని విచారంతో కనిపించడంతో, మణిశేఖరుడి మనసులో ఎన్నెన్నో అనుమానాలు తలెత్త సాగాయి. వారందరూ కలిసి, తనను హత మార్చి, అడవిలోని అన్నను తీసుకువచ్చి మళ్ళీ ఆయనకు అధికారం కట్టబెట్టడానికి పథకం వేస్తున్నారో ఏమో అని భయం భయంగా ఆలోచించసాగాడు. అడవిలో ఉన్న అన్నను హతమార్చినప్పుడే తను నిశ్చింతంగా ఉండగలనని భావించాడు. అన్నను చంపినవారికి అర్ధ రాజ్యం ఇస్తానని మళ్ళీ కొందరితో మంతనాలు జరపసాగాడు.

అయినా ఎవరూ అందుకు సిద్ధంగా లేరు. ఒకనాడు మణిశేఖరుడు కొలువుతీరి ఉండగా అక్కడికి ఒక పేదకవి వచ్చాడు. రాజశేఖరుడు అడవికి వెళ్ళాక రాజసభలో కవితాగానం వినే అవకాశం ఎవరికీ కలగలేదు. అయితే, ఈ కవి మాత్రం పట్టుదలతో ఆస్థానానికి వచ్చి, తన కవిత్వాన్ని వినిపించే అవకాశం కల్పించమని రాజును అర్థించాడు. రాజు మొదట అందుకు అంగీకరించాడు. కవి చదవబోయే కవిత్వం మంగళాపురరాజ్య చరిత్ర ప్రాశస్త్యాన్ని తెలిపేదనీ, తనను కీర్తిస్తూ అందులో ఒక్క మాటా లేదనీ తెలియగానే, ‘‘నీ కవిత్వం నేను వినదలుచుకోలేదు. దానికి బదులు నువ్వు అడవికి వెళ్ళి, మా అన్నను చంపి, ఆయన తల తీసుకువచ్చావంటే, నా రాజ్యంలో సగం నీదవు తుంది,'' అన్నాడు.
 
ఆ మాటవిన్న కవి ఆ తరవాత ఒక్క క్షణం కూడా సభలో నిలబడలేక వెలుపలికి వచ్చాడు. కొత్తరాజు దుర్మార్గాన్ని తలుచుకుని ఆవేదన చెందాడు. ఆందోళనతో అడవి కేసి నడిచాడు. అడవిలో పాత రాజు రాజశేఖరుడున్న చోటును కనుగొని ఆయన్ను చూసి నమస్కరించి, ‘‘మహారాజా, నేనొక పేద కవిని. తమ పాలనలోని మంగళాపుర రాజ్య చరిత్రను కీర్తిస్తూ ఒక కావ్యం రచించాను. నేనూ, నా భార్యాపిల్లలూ ఆకలితో అలమటిస్తున్నాము. నా కావ్యాన్ని రాజుకు చదివి వినిపిస్తే, ఆయన కానుకలతో సత్కరించగలడనీ, దాంతో మా కష్టాలు తొలగిపోగలవన్న గంపెడాశతో రాజసభకు వెళ్ళాను.
 
అయితే, ఆ కావ్యాన్ని వినడానికి కూడా కొత్తరాజు సంసిద్ధంగా లేరు. కళలకు నిలయమైన మంగళాపుర రాజ్యంలో ప్రస్తుతం కవులకూ, కళాకారులకూ నిలువ నీడ లేకుండా పోయింది. పైగా, మీ తల తెస్తే అర్ధ రాజ్యం ఇస్తానంటున్నాడా దుర్మార్గుడు. మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికే ఇంత దూరం వచ్చాను,'' అన్నాడు. ఆ మాట విన్న రాజు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి, దీర్ఘంగా నిట్టూర్చి, ‘‘ఇప్పుడున్న స్థితిలో నేను నీ కెలాంటి సాయమూ చేయలేను. అయినా, ఒక పని చేయవచ్చు. ఇదిగో నా ఖడ్గం. దీంతో నా తలను ఖండించి, దాన్ని తీసుకుపోయి కొత్త రాజుకు ఇచ్చి, అర్ధ రాజ్యాన్ని పుచ్చుకో,'' అంటూ తన ఖడ్గాన్ని కవి ముందుంచాడు.
 
‘‘ఎంత మాట అన్నారు ప్రభూ! నేనూ, నా కుటుంబం ఆకలితో మలమల మాడి చచ్చినా, నేనీ ఘోరకృత్యానికి పాల్పడను.

నన్ను క్షమించండి,'' అంటూ కవి కన్నీళ్ళతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంటికి చేరగానే కవి, తాను పాతరాజు రాజశేఖరుణ్ణి అడవిలో కలుసుకున్న ఉదంతాన్ని ఒక పద్యంగా రాసి కొత్త రాజు మణి శేఖరుడికి పంపాడు. ఆ పద్యం ముగింపు రెండు పాదాల భావం ఇది: తలలేని మంగళాపురం అమూల్యమైన తలకు మూల్యం ప్రకటించింది! ప్రజల క్షేమం కోసం అడవికి చేరిన ఆ త్యాగదీపం-పేదకవిని కాపాడడానికి తన తలను సమర్పించడానికి సిద్ధపడింది!!
 
ఆ పద్యాన్ని చదివిన రాజు మణిశేఖరుడు ఉలిక్కిపడ్డాడు. ఆ తరవాత మెల్లగా పశ్చాత్తాపంతో ఆలోచించసాగాడు. అధికారం కోసం అన్నను హతమార్చాలనుకున్న ఆశాపాతకుడైన తనెక్కడ? నిరుపేదకవి ఆకలి తీర్చడం కోసం తన తలనే సమర్పించడానికి సిద్ధపడిన త్యాగధనుడైన తన అన్న ఎక్కడ? అందుకే ప్రజలందరి హృదయాల్లో అన్న ఇంకా రాజుగా కొలువున్నాడు!
 
మణిశేఖరుడు వెంటనే గుర్రం మీద నిరాయుధపాణిగా అడవికేసి బయలుదేరాడు. అడవిలో, గడ్డం పెంచుకుని సాధువులా కనిపించిన అన్న పాదాలపై బడి, ‘‘ఆ పేద కవి నా కళ్ళు తెరిపించాడు. అధికార దాహంతో నేరాలకు పాల్పడ్డాను. మొదట మిమ్మల్నే హతమార్చాలనుకున్నాను. ఇప్పుడేమో మీరిచ్చిన రాజ్యంలో సగభాగం మీ తలను తెచ్చిన వారికి ఇస్తానని ప్రకటించి మరో పాతక చర్యకు ఒడిగట్టాను.
 
తమరు ధర్మపాలన సాగించిన మంగళాపుర రాజ్యంలో సామాన్య పౌరుడిగా బతకడానికి సైతం అర్హత కోల్పోయిన దౌర్భా గ్యుణ్ణి. నన్ను క్షమించి రాజధానికివచ్చి పాలనా బాధ్యతలు స్వీకరించండి,'' అని కన్నీళ్ళతో వేడుకున్నాడు. అన్నను గుర్రాన్ని అధిరోహించమని చెప్పి, మణిశేఖరుడు వెనక కూర్చున్నాడు. ఇద్దరూ రాజభవనం చేరారు.
 
రాజశేఖరుడు తిరిగి వచ్చిన వార్త తెలియగానే, ప్రజలు ఆనందోత్సాహాలతో రాజభవనం వద్ద గుమిగూడారు.
 
మణిశేఖరుడు, ప్రజల సమక్షంలో రాజశేఖరుడి తలపై కిరీటం ఉంచి, సింహాసనంలో ఆసీనుణ్ణి చేయించి, తను ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన సభాసదుల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి!

బాధ ఒక్కటే!


గంగాధరం అనే కూరగా…యల వ్యాపారి దగ్గర, సత్యరాజనే యువకుడు కొత్తగా పనిలోచేరాడు. సత్యరాజు ఎంతోనిజాయితీగా, చురుగ్గా పనిచేస్తూ, అతితక్కువ కాలంలోనే యజమాని మెప్పుపొందాడు. అయితే, సత్యరాజుకు కాస్తకోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్ళు ఎక్కువగా బేరమాడుతూ విసిగిస్తే, ‘‘వెళ్ళండి, వెళ్ళండి! మీరేంకొంటారు,'' అంటూ కసురుకునేవాడు.
 
ఇందుకు ముఖ్యకారణాల్లో ఒకటి, ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించివుండడం. అయినా, ఈ కసురుకోవడం కోప్పడడంలాంటివి మానుకోమని, గంగాధరం ఎంతగానో చెప్పిచూశాడు. కానీ, సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు.
 
ఒకరోజు, ఆ ఊరిపెద్ద వీరభద్రయ్య ఇంట్లో పనిచేసే మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో, వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలూ అనిపోయాడు. ఇక ఊరుకుని లాభంలేదని గంగాధరం, సత్యరాజును పనిలోంచి తీసివేశాడు.
 
దిగాలుపడిపోయిన సత్యరాజు రెండురోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి, తనను పనిలోకి తీసుకోమని బతిమాలడం మొదలు పెట్టాడు. అయితే, గంగాధరం, అతడు చెప్పేది వినిపించుకోకుండా గొంతుపెద్దది చేసి, ‘‘ఏయ్, చెప్తూంటే మనిషివికాదూ వెళ్ళు, పో!'' అంటూ అరిచాడు.
 
గంగాధరం తనను కుక్కను అదిలించినట్లుగా కరకుగా మాట్లాడడంతో, సత్యరాజు మనసు కలుక్కుమన్నది. అతడు కళ్ళల్లోనీళ్ళు తిరుగుతూండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగాధరం అతణ్ణి, ‘‘ఒరేయ్, ఇలారా!'' అంటూ పిలిచాడు.
 
సత్యరాజు వెనక్కువచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, ‘‘ఇప్పుడు నీకు అర్థమయిందా? ఒక మనిషితో మరొకమనిషి మర్యాదగా, గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే, ఆ మనిషి ఎంతగా బాధపడతాడో!'' అన్నాడు సౌమ్యంగా.
 
నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకివచ్చింది. అతడు వినయంగా చేతులుజోడిస్తూ, ‘‘ఆబాధ ఎలావుంటుందో తెలిసివచ్చింది, బాబూ!'' అన్నాడు.
 
‘‘ఇప్పుడు నేను, నిన్ను నమ్మగలను. వెంటనే పనిలో చేరు,'' అన్నాడు గంగాధరం శాంతంగా. 

ధనపిపాసి


హస్తివరం అనే గ్రామంలో, పోలయ్య అనే వడ్డీ వ్యాపారం చేసే ధనవంతుడు వుండేవాడు. అతడు పెద్ద ధనపిపాసి; పరమపిసినారి.
 
ఒక రోజు పొరుగు ఊళ్ళో పోలయ్యకు బాకీ వసూళ్ళు ఆలస్యం కావడంతో పొద్దుపోయి బాగా చీకటి పడింది. అతడు హడావిడిగా స్వగ్రామానికి తిరుగు ప్రయూణమయ్యాడు. ఆ సమయంలో ఎదురుపడ్డ గురప్రుబండివాడొకడు పోలయ్యను గుర్తు పట్టి, ‘‘అయ్యా, ఒక్క రూపాయి బాడుగ ఇస్తే, మిమ్మల్ని భద్రంగా మీ గ్రామం చేరుస్తాను,'' అన్నాడు.
 
అందుకు పోలయ్య చిరాగ్గా, ‘‘నేను నడక మొదలు పెట్టానంటే, నీ గూని గుర్రం నాతో పోటీ పడలేదు, ఫో!'' అనేశాడు.
 
‘‘ఒక్క రూపాయి ఖర్చుకు వెనకాడుతున్నావు. దారిలో దయ్యాలున్నాయి!'' అంటూ బండివాడు, పోలయ్యను భయపెట్టాలని చూశాడు. కానీ, పోలయ్య ఆ మాటలు పట్టించుకోకుండా నడక సాగించాడు. అది వెన్నెల రాత్రి అయినందున, కాలిబాట స్పష్టంగా కనబడుతున్నది. సగం దారిలో, ఊడలతో విశాలంగావున్న ఒక మర్రి చెట్టు పక్కన, ఏ నాటిదో ఒక పాడుబడిన సత్రం వున్నది.
 
ఆ సత్రం ముందు నిలుచుని వున్న ఒక ముసలివాడు, పోలయ్యను చూస్తూనే ఒకడుగు ముందుకువేసి, ‘‘బాగున్నావా, పోలయ్యా?'' అంటూ పలకరించాడు. పోలయ్య, అతడి కేసి పరీక్షగా చూస్తూ, ‘‘ఇంతకు ముందేనాడూ నిన్ను చూసిన గుర్తు లేదు. ఇంతకీ ఎవరు నువ్వు?'' అని అడిగాడు.
 
‘‘ఉట్టినే కాలం వృథా చేయడం ఎందుకు? నీకు ఏడుతరాల వెనకటివాడిని, అంటే నీముత్తాతకు, ముత్తాతను!'' అన్నాడు ముసలివాడు. ‘‘నా ముత్తాత నేను పుట్టక ముందే పోయాడు. ఆయన ముత్తాత ఇంకా బతికున్నాడంటే ఎవరూ నమ్మరు,'' అని, ఒక క్షణం ఆగి, కాస్త భయంగా, ‘‘నువ్వు ఆ ముత్తాత ముత్తాత దయ్యానివి కాదుగదా?'' అన్నాడు పోలయ్య.

‘‘అవును, బాగా గ్రహించావురా, పోలయ్యా. ఏం భయపడకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే, నేను బతికివున్నప్పుడు గుప్తంగా దాచిన సొమ్మంతా నీకు ఇవ్వడానికి వచ్చాను. అదంతా చెబుతాను విను,'' అంటూ దయ్యం తన గురించి చెప్పుకున్నది.
 
ఆ దయ్యం పేరు వరదయ్య. అతడు పోలయ్యకన్నా పెద్ద ధనవంతుడు; మరింత పిసినారి. ధన సంపాదన తప్పమరేదీ అతడికి పట్టేదికాదు. వరదయ్యకు చివరి దశలో ఒక బెంగ పట్టుకున్నది. అదేమంటే - అతడి కొడుకులూ, మనవళ్ళలో ఏఒక్కరికీ అతడి గుణం రాలేదు. పైగా, వారిది జాలిగుండె. అవకాశం దొరికితే దానధర్మాలు చేసేవాళ్ళు. ఏమాత్రం పొదుపరితనం లేదు. తను ఆర్జించిన ధనమంతా వాళ్ళ చేతుల్లో మంచులా కరిగిపోగలదన్న ఆవేదన కలిగింది అతడికి.
 
బాగా ఆలోచించి వరదయ్య ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందర్నీ ఇంట్లోంచి తరిమేశాడు. మరణించాక దయ్యంగా మారి దానికి కాపలావుంటున్నాడు. ఇప్పుడు పోలయ్య గురించి తెలిసింది. తన వారసుడే కాబట్టి, ఆ సంపదను పోలయ్య చేతుల్లో పెడితే నిక్షేపంగా వుండడమేగాక, మరింత పెంపుకాగలదన్న నమ్మకం కలిగింది.
 
వరదయ్య దయ్యం చెప్పినదంతా శ్రద్ధగా విన్న పోలయ్య ఆనందభరితుడై పోయూడు. ‘‘ఒరే, పోలయ్యా! ఆ నా సంపదనంతా, నీకప్పగిస్తాను. కానీ, ఒక్క షరతు,'' అన్నాడు వరదయ్య. ‘‘ఏమిటది?'' అని అడిగాడు, పోలయ్య ఆత్రంగా.
 
‘‘అదృశ్యంగా ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకుని వుంటాను. ఇంటి పెత్తనమంతా నాకు అప్పగించాలి,'' అన్నాడు వరదయ్య.
 
ధనం మీది ఆశతో పోలయ్య వెనకా ముందూ ఆలోచించకుండా వరదయ్యదయ్యం పెట్టిన షరతును అంగీకరించాడు. తర్వాత వరదయ్య, తను రహస్యంగా దాచివుంచిన ధనాన్ని పోలయ్యకు అప్పగించాడు. పోలయ్య ఇంటి పెత్తనం వరదయ్యదయ్యం చేతిలోకి వచ్చింది. ఆ క్షణం నుంచీ ఆ ఇంటి బతుకు నరక ప్రాయమైంది. ఇంట్లో పోలయ్య తల్లి, భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆరు మందివున్నారు. ప్రతి రోజు వాళ్ళ భోజనానికి సరిపడే బియ్యంలోంచి అద్దెడు పొదువు చెయ్యాలి. ఏమాత్రం రుచిలేని పచ్చడి, నీళ్ళ మజ్జిగతో భోజనం ముగించాలి.

పండగల్లో పిండి వంటలు నిషిద్ధం. వరదయ్య దయ్యం ఇంట్లో చేరక ముందు పోలయ్య ఇంత కఠినంగా వుండేవాడుకాదు. పోలయ్య ఇంత క్రూరంగా ఎందుకు మారాడో ఇంట్లో వాళ్ళకు అర్థంకాలేదు.
 
ఇలా ఉండగా పోలయ్య కూతురు పదేళ్ళ పార్వతికి జబ్బు చేసింది. ‘‘పార్వతిని పక్క ఊరి వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి.
 
ఇనప్పెట్టెలో కొంత డబ్బు తీసుకోవచ్చా?'' అని అడిగాడు పోలయ్య, వరదయ్య దయ్యాన్ని.
 
‘‘వద్దు. ఉపవాసం పరమౌషధం అన్నారు కదా పెద్దలు. పస్తు పెడితే జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది,'' అన్నది వరదయ్య దయ్యం.
 
‘‘తగ్గే సూచన లేదు. ఒకవేళ జరగకూడనిది జరిగితే,'' అన్నాడు పోలయ్య ఆందోళనగా. ‘‘అదీ మనకు లాభమే. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్ళి మాటలా? బోలెడు ఖర్చు. అదంతా మిగిలి పోతుంది,'' అన్నది వరదయ్య దయ్యం వికృతంగా నవ్వుతూ.
 
ఆ మాటకు పోలయ్య దిగ్భ్రాంతి చెందాడు. కూతురి ఆరోగ్యం పట్ల భర్త ఉదాసీనతకు ఆగ్రహం చెందిన పోలయ్య భార్య ఆదిలక్ష్మి, ఇనప్పెట్టెకు దొంగ తాళంచెవి సంపాయించింది. భర్త ఇంట లేని సమయం చూసి ఇనప్పెట్టెను తెరిచి, డబ్బు తీసి కూతురికి రహస్యంగా వైద్యం చేయించింది. కూతురి జ్వరం తగ్గుముఖం పట్టింది.
 
తనకు తెలియకుండా ఆ ఇంట్లో ఏదో జరిగిపోతోందని వరదయ్య దయ్యానికి అనుమానం వచ్చి, ఒక రోజు పోలయ్య వెంట పోకుండా ఇంటి వద్దే కాపు కాసింది. దానికి ఏం జరుగుతున్నదీ తెలిసిపోయింది.
 
ఆ రాత్రి పోలయ్య ఇంటికి తిరిగి రాగానే, వరదయ్య దయ్యం గుండెలు బాదుకుంటూ, ‘‘ఒరే, నట్టింటి భోషాణంలో ఏముందో వెళ్ళి చూడు,'' అన్నది.
 
పోలయ్య వెళ్ళి చూస్తే, అందులో రెండు రకాల భస్మాలు, లేహ్యం, ఒక కషాయం సీసా కనిపించాయి. అంతలో అక్కడికి వచ్చిన భార్య కేసి, ‘‘ఏమిటిదంతా?'' అన్నట్టు చూశాడు పోలయ్య.
 
‘‘ఔను, నేనే ఇనప్పెట్టెను దొంగతనంగా తెరిచి, డబ్బు తీసుకుని బిడ్డకు వైద్యం చేయించాను. అది తప్పా? బిడ్డ వైద్యానికి కూడా ఉపయోగపడని డబ్బు మనకెందుకు? నీకు డబ్బేగనక అంత ముఖ్యమను కుంటే చెప్పు.
 
నీతో ఉంటూ కడుపులు మాడ్చుకుని కొద్ది కొద్దిగా చావడంకన్నా, అందరం కట్ట కట్టుకుని ఒక్కసారిగా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం,'' అన్నది భార్య కన్నీళ్ళతో.

పోలయ్య మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయూడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇనప్పెట్టె తెరిచి, కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ, ‘‘నన్ను క్షమించు లక్ష్మీ. సరైన సమయంలో బిడ్డకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడావు. చాలా సంతోషం. ఈ డబ్బుతో ఇంటికి కావలసినవాటినన్నిటినీ కొనుక్కుని, పిల్లలకు ఏ కొరతా లేకుండా చూసుకో,'' అన్నాడు.
 
ఇది చూస్తూనే వరదయ్య దయ్యం పోలయ్యను పెరట్లోకి తీసుకుపోయి, ‘‘ఒరే పోలయ్యా! నువ్వునాకిచ్చిన మాట తప్పావు,'' అన్నది కోపంగా. ‘‘నేను వ్యాపారస్థుణ్ణి. మాట తప్పడం నాకు అలవాటే,'' అన్నాడు పోలయ్య తాపీగా.
 
‘‘మన వంశం వాళ్ళు తరతరాలుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఇదంతా చేశాను. మాట తప్పితే అధోగతి పాలవుతావు,'' అన్నది వరదయ్య దయ్యం.
 
‘‘నా అధోగతి సంగతి కాలమే నిర్ణయిస్తుంది. ఐనా ఐశ్వర్యం ఉన్నది ఎందుకు? మనమూ అనుభవించక, ఎదుటి వారికీ ఇవ్వక ఇనప్పెట్టెలో దాచి కాపలా కాయడానికా? ఇంట్లో వాళ్ళ కడుపులు మాడ్చి, చివరికి కన్న బిడ్డకు వైద్యం కూడా చేయించలేని ధనం ఎందుకు? నువ్వు డబ్బు మీది పేరాశతోనే బంధువులందరినీ వదులుకున్నావు. అమూల్యమైన ప్రేమానురాగాలకు దూరమై, చచ్చినా ధనపిపాసను చంపుకోలేక దయ్యంలా అశాంతితో తిరుగుతున్నావు. నీకు ఎప్పుడో పట్టిన దుర్గతి నాకు మునుముందు పట్టకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను,'' అన్నాడు పోలయ్య.
 
‘‘ఔరా, పోలయ్యా! ఇన్నాళ్ళకు నా కళ్ళు తెరిపించావు. నీ మాట అక్షరాలా నిజం. నా ధనం కూడా నీవద్దే ఉంచుకుని, నీ భార్యా పిల్లలకే కాక, నిన్ను ఆశ్రయించినవారికీ సాయపడుతూ, సంతోషంగా జీవించు,'' అంటూ వరదయ్యదయ్యం మాయమయింది.

గోవిందయ్య తెలివి


కైకవరం అనే గ్రామంలో వుండే గోవిందయ్య ఒక సన్నకారు రైతు. అతడికి ఒక జత ఎడ్లువుండేవి. ఒకనాటి చీకటిపడేవేళ గోవిందయ్య పొలం పనులు ముగించి, ఇంటికి వచ్చి, ఎడ్లకు కుడితి పెట్టి, పచ్చిగడ్డి వేసి కొట్టంలో కట్టివేశాడు. ఐతే, ఉదయం అతడు కొట్టంలోకి వెళ్ళి చూస్తే, అక్కడ ఒక ఎద్దు మాత్రమే వున్నది. రెండవది ఎటు పోయిందో అని ఆందోళనపడుతూ, గోవిందయ్య ఎక్కడెక్కడో వెతికి చూశాడు. కాని, ఎద్దు జాడ లేదు.
 
అది తొలకరివానలు ప్రారంభమైన సమయం. ఒక ఎద్దుతో భూమిదున్నడం సాధ్యపడదు కనక, సంతకు పోయి మరొక ఎద్దును కొనుక్కురావాలనుకున్నాడు. జరిగిందేమంటే-గోవిందయ్య కొట్టంలో వున్న ఎద్దును ఒక దొంగ దొంగిలించుకు పోయూడు. దాన్ని అమ్మితే కనీసం వెయ్యి రూపాయలైనా రావచ్చన్న ఆశతో, వాడు ఎద్దును సంతకు తోలుకువచ్చాడు.
 
గోవిందయ్య ఎద్దు పోయినందుకు ఎంతగానో విచార పడుతూ, సంతకు పోయి, తన దగ్గరవున్న ఎద్దుకు తగిన ఉజ్జీ అయిన దానికోసం సంతలో గాలించసాగాడు.
 
అతడికి ఒక చోట తెల్లగా ఎత్తుగా బలంగా వున్న ఒక ఎద్దు కనబడింది. గోవిందయ్య ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి చూస్తే, అది తన ఎద్దని తెలిసిపోయింది. అతడు, ఎద్దును అమ్మవచ్చినవాడితో, ‘‘మోసం! ఎవరు నువ్వు? ఇది నా ఎద్దు. దీనితో నాలుగేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను,'' అన్నాడు కోపంగా.
 
గోవిందయ్య ఇలా అనగానే, మొదట ఉలిక్కిపడిన దొంగ అంతలోనే సర్దుకుని బింకంగా, ‘‘పట్టపగలే అబద్ధాలా! పోవయ్యా, ఈ ఎద్దుతో నువ్వు నాలుగేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నావా? ఐతే, నేను ఐదేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను. పిల్లపెళ్ళికి డబ్బు అవసరపడి సంతకు అమ్మతెచ్చాను,'' అన్నాడు విసురుగా.

ఇప్పుడేం చేయడమా అని గోవిందయ్య ఆలోచిస్తున్నంతలో, సంతకొచ్చినవాళ్ళు కొందరు వాళ్ళ చుట్టూ చేరి సంగతేమిటో అడిగి తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళలో ఒకడు, గోవిందయ్యతో, ‘‘ఈ వాదులాటా గొడవా ఎందుకు. ఎద్దు నీదనేందుకేమైనా రుజువున్నదా?'' అని అడిగాడు.
 
‘‘రుజువా?'' అంటూ గోవిందయ్య మొలకు చుట్టుకున్న తువ్వాలును లాగి, దానితో ఎద్దు రెండు కళ్ళూ కప్పి, దొంగతో, ‘‘సరే, ఈ ఎద్దు నీదంటున్నావు. నీ ఎద్దుకు ఒక కన్ను గుడ్డి. ఏ కన్ను గుడ్డో చెప్పు?'' అన్నాడు ధీమాగా.
 
ఈ ప్రశ్నవింటూనే దొంగ తికమక పడ్డాడు. తను తప్పు చెబితే నలుగురు తనను దొంగ అంటారు. తన గుడ్డి పెంపుడు కుక్క గుర్తు కొచ్చింది. దానికి ఎడమ కన్ను గుడ్డి. వాడు వెంటనే, ‘‘నా ఎద్దుకు ఎడమ కన్ను గుడ్డి!'' అనేశాడు.
 
గోవిందయ్య, ఆ జవాబుకు పెద్దగా నవ్వి, తువ్వాలును ఎద్దు ఎడమకంటిపై నుంచి లాగి, అక్కడి వాళ్ళతో, ‘‘చూడండి! ఈ ఎద్దు ఎడమ కన్ను బంగారంలా వుంది,'' అన్నాడు.
 
దొంగ పారిపోయేందుకు చుట్టూ చూస్తూ, ‘‘ఔను, నేను పొరబాటున తప్పు చెప్పాను. నా ఎద్దుకు కుడికన్ను గుడ్డి!'' అన్నాడు. ‘‘ఎడమ కన్నో, కుడికన్నో నీ ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అన్నది మాత్రం నిజం. అవునా?'' అని అడిగాడు గోవిందయ్య.
 
‘‘అవును. అందులో సందేహం ఏముంది? నా ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అని ఒప్పుకుంటున్నాను,'' అన్నాడు దొంగ.
 
వెంటనే గోవిందయ్య, ఎద్దు కళ్ళ మీది నుంచి తువ్వాలు తీసి భుజాన వేసుకుని, దొంగతో, ‘‘ఒరే అబ్బీ! అసలు నా ఎద్దు గుడ్డి కాదు. చూడండి దాని కళ్ళు ఎలా మిలమిలా మెరుస్తున్నాయో!'' అన్నాడు ఉత్సాహంగా.
 
ఆ వెంటనే జనం, దొంగను ఒడిసి పట్టుకున్నారు. వాడు విడిపించుకునేందుకు గింజుకుంటూండగా, సంగతి విన్న జమీందారు నౌకర్లు వాడి రెండు చేతులకూ తాడు కట్టి, దివాను దగ్గరకు లాక్కుపోయారు.
 
తన ఎద్దును తిరిగి సంపాయించుకోవడమే గాక, దొంగను పట్టిచ్చిన గోవిందయ్య తెలివితేటల్ని, జనం ఎంతగానో మెచ్చుకున్నారు.

తోకముడిచిన పొట్టిదయ్యం!


ఆఫ్రికాలోని ఒక దట్టమైన అడవి మధ్య ఉన్న గ్రామంలో మబూటో భార్య న్జీలీ, చురుకైన కొడుకు అడీన్‌తో కలిసి నివసిస్తూండేవాడు. గ్రామానికి కొద్ది దూరంలో కొంతనేలను చదునుచేసి మబూటో కసావా దుంపలను నాటాడు.
 
కసావా దుంపలతో చేసిన వంటలంటే మబూటో కుటుంబానికి చాలా ఇష్టం. కసావా బాగా పెరిగి దుంపలు తవ్వడానికి పక్వానికి వచ్చాయి. ఒకరోజు మబూటో, న్జీలీ పొలం దగ్గరికి వెళ్ళారు. దానిని చూడగానే, ‘‘మనం రేపు బుష్‌కూరతో పాటు కసావాగంజి తాగాలి,'' అన్నాడు మబూటో.
 
‘‘దుంపలు తవ్వాలి, వాటి తొక్క ఒలవాలి. ఆ తరవాత దంచి పిండి చేయాలి. అప్పుడే గంజి తయారవుతుంది. ఇవన్నీ రేపటికే ఎలా సాధ్యం. ఇంకొక్క రోజు ఆగండి,'' అన్నది భార్య న్జీలీ. అయితే, మరునాడు తెల్లవారగానే పొలం దగ్గరికి వెళ్ళిన భార్యాభర్తలు అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యారు. మొక్కలన్నీ నాశనమయ్యాయి. ఒక్క కసావాదుంప కూడా లేదు. ‘‘అంతా పోయింది,'' అంటూ ఏడ్వసాగింది న్జీలీ.
 
‘‘ఇది అడవి జంతువులపనే అయివుంటుంది. మిగిలివున్న ఒకటీ అరా మొక్కలు నాశనం కాక ముందే మనం ఆ జంతువులను మట్టుపెట్టాలి,'' అన్నాడు మబూటో కోపం, బాధా నిండిన కంఠస్వరంతో. ఆ తరవాత తీవ్రంగా ఆలోచిస్తూ భార్యాభర్తలు తమ గుడిసెకు చేరారు. అమ్మా, నాన్న విచారంగా ఉండడం గమనించిన అడీన్‌ కారణం అడిగాడు. మబూటో జరిగింది చెప్పాడు. వెంటనే అడీన్‌ ఒక తెలివైన సలహా ఇచ్చాడు:
 
‘‘అవును, నాన్నా. నువ్వన్నది నిజం. జంతువులను పట్టుకోడానికి లోతైన గోతిని తవ్వడమే సరైన మార్గం. ఒకసారి వచ్చి రుచి మరిగిన జంతువులు మళ్ళీ మళ్ళీ వస్తాయి. వాటిని రాకుండా అరికడితేనే ఉన్న పంటనైనా కాపాడుకోగలం. పైగా మనకు జంతుమాంసం కూడా దొరుకుతుంది,'' అంటూ న్జీలీ కొడుకు సలహాను మెచ్చుకున్నది. మబూటోకు కూడా కొడుకు సలహా బాగానచ్చింది. వెంటనే పారా, పలుగూ తీసుకుని పొలం దగ్గరికివెళ్ళి గోతిని తవ్వడం ప్రారంభించాడు.

మబూటో గోతిని తవ్వడంలో నిమగ్నుడైవుండగా, ‘‘ఎవడ్రా నువ్వు. నా అడవిలో ఏం చేస్తున్నావు?'' అన్న కఠిన కంఠస్వరం వినిపించింది. తలెత్తి చూసిన మబూటో ఉలిక్కి పడ్డాడు. పక్కనే పొట్టిదయ్యాన్ని చూడడంతో హడలి పోయాడు. అంతకు పూర్వం ఆ అల్లరి దయ్యాలను గురించి వినడమే తప్ప వాటినెప్పుడూ అతడు ఇంత దగ్గరినుంచి చూడలేదు.
 
‘‘నా కసావా పొలాన్ని ధ్వంసం చే…యడానికి వచ్చే జంతువులను పట్టుకోవడానికి గోతిని తవ్వుతున్నాను,'' అన్నాడు మబూటో.
 
‘‘నా అడవిలో, నా అనుమతి లేకుండా గోతిని తవ్వుతున్నావా? ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త!'' అని హుంకరించింది పొట్టిదయ్యం. మబూటో భ…యంతో గడగడ వణుకుతూ, ‘‘నన్ను క్షమించు. పిల్లలు గలవాణ్ణి!'' అన్నాడు. పొట్టిద…య్యం ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కొంతసేపు పైకీ కిందికీ చూసి, తల ఊపి, ‘‘సరి సరి, ఈసారికి వదిలిపెడతాను. అయితే, ఒక నిబంధన. నువ్వు తవ్వే గోతిలో మగ జంతువు పడితే నువ్వే తీసుకో. ఆడజంతువు పడిందో అది నాకే సొంతం. సరేనా?'' అన్నది.
 
‘‘చిత్తం, అలాగే!'' అన్నాడు మబూటో. పొట్టిదయ్యం వెళ్ళిపోయింది. ఆ తరవాత మబూటో లోతుగా గోతిని తవ్వి, అది కనిపించకుండా ఆకులూ, రెమ్మలూ దానిపైన మూసి ఇంటికి తిరిగివెళ్ళాడు. మరునాడు తెల్లవారాక మబూటో గోతి దగ్గరికి వచ్చాడు. అతని వెనకే పొట్టిదయ్యం కూడా వచ్చింది. గోతిలోపలికి తొంగిచూస్తే అక్కడొక కోతి కనిపించింది. ‘‘అది మగది!'' అన్నాడు మబూటో సంతోషంగా. పొట్టిద…య్యం వెళ్ళిపోయింది.
 
మరునాడు పొద్దున వచ్చి చూస్తే గోతిలో దుప్పిపిల్ల పడివుంది. వాడెంతో సంతోషించాడు. పొట్టిదయ్యం వెళ్ళిపోయింది. ఇలా రోజూ వెళ్ళినప్పుడల్లా హై…నా, అడివిపిల్లి, ఎలుగుబంటి అంటూ రకరకాల జంతువులు పట్టుబడసాగాయి. అవన్నీ కూడా మగ జంతువులే కావడం విశేషం.
 
‘‘కసావా అంటే మగజంతువులకే ఇష్టం లాగుంది,'' అన్నాడు మబూటో. పొట్టిద…య్యం మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
 
ఒకనెల గడిచింది. పొలానికి వెళ్ళి మళ్ళీ అందులో కసావా నాటుదామనుకుని న్జీలీ అక్కడికి వెళ్ళింది. తలనొప్పిగా ఉండడం వల్ల మబూటో ఇంటిదగ్గరే ఉండిపో…యాడు. వెళ్ళిన న్జీలీ మధ్యాహ్నానికి కూడా రాలేదు. అడీన్‌, ‘‘ఆకలిగా వుంది. అమ్మ కావాలి,'' అంటున్నాడు. పడుకున్న మబూటో లేచి చూశాడు.

సా…యంకాలం కాబోతోంది. న్జీలీకి ఏమయింది? అని మబూటో ఆలోచించసాగాడు.
 
‘‘నాన్నా, మనం పొలం వెళ్ళి అమ్మను పిలుచుకువద్దాం,'' అన్నాడు అడీన్‌. తండ్రీకొడుకులిద్దరూ పొలం కేసి బయలుదేరారు. వాళ్ళు గోతిని సమీపించారు. అది తెరుచుకుని వుంది. ఏ జంతువు పడిందా అనిలోపలికి తొంగి చూశారు. అక్కడ న్జీలీ కనిపించింది. ఆమె గోతి వుందన్న సంగతి మరిచిపోయి, దాని మీద కాలువేసి లోపలికి జారిపడిపోయిందన్నమాట!
 
‘‘ఆహా! ఆడజంతువు దొరికింది. అది నాకే సొంతం!'' అని వికారంగా అరుస్తూ పొట్టిదయ్యం అక్కడికి వచ్చింది. ఆ మాటకు గతుక్కుమన్న మబూటో, ‘‘వీలుకాదు, ఆమె నా భార్య. నువ్వు తీసుకుపోకూడదు,'' అన్నాడు. ‘‘ఆడ జంతువులను మాత్రమే నువ్వు తీసుకోవాలి. ఆమె జంతువు కాదు. మనిషి!'' అన్నాడు అడీన్‌.
 
అయితే, పొట్టిదయ్యం, ‘‘మనుషులు కూడా జంతువులే. ఈరోజు నుంచి ఈమె నాకే సొంతం,'' అన్నది కీచుగొంతుతో.
 
మబూటోకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. నేలపై చతికిల పడి, చేతులతో ముఖం, నెత్తీ మొత్తుకుంటూ విలపించసాగాడు. అయితే, అడీన్‌ తల్లిని వదులుకోకూడదనుకున్నాడు. ‘‘నా తల్లిని ఇది ఎలా అపహరిస్తుందో నేను చూస్తాను,'' అని ధైర్యంతో ఆలోచించి పొట్టిదయ్యంతో, ‘‘సరే, ఆమె నీకే సొంతం. వెళ్ళి తెచ్చుకో,'' అన్నాడు.
 
‘‘వద్దు. నేను దాన్ని కళ్ళతో చూడలేను. అడీన్‌ ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది?'' అంటూ మబూటో రోదించసాగాడు. అయితే, పొట్టిద…య్యం ఆనందంతో భుజాలు ఎగురవేస్తూ, కిచ కిచమని నవ్వుతూ, ‘‘ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను,'' అంటూ దభీమని గోతిలోకి దూకింది.
 
‘‘నాన్నా, గోతిలో మగజంతువు పడింది. రా పట్టుకుందాం!'' అన్నాడు అడీన్‌. మబూటో ఒక్క గెంతున లేచి నిలబడ్డాడు. తన కొడుకు తెలివికి పొంగిపోయాడు. గోతిలోకి తొంగిచూస్తూ, ‘‘గోతిలో పడ్డ మగజంతువు నాకు కట్టుబానిస. నాకు సేవలు చే…యడమే దానిపని!'' అన్నాడు. పొట్టిద…య్యం ఒక్కక్షణం తటపటాయించింది. తరవాత తాను చిక్కులో పడ్డట్టు గ్రహించింది. అది జీవితాంతం మబూటోకు బానిసగా బతకదలచలేదు. ‘‘సరే, నువ్వామెను, పైకి తీసుకో, మన ఒప్పందం రద్దు చేసుకుందాం!'' అని మెల్లగా అంటూ, గోతినుంచి జాగ్రత్తగా పైకి ఎగబ్రాకి వచ్చి, అడవిలోకి జారుకున్నది.
 
న్జీలీ గోతి నుంచి పైకి రావడానికి మబూటో, అడీన్‌ సాయపడ్డారు. ముగ్గురూ ఆనంద పారవశ్యంతో ఆడుతూ పాడుతూ ఇల్లు చేరారు. పొట్టిద…య్యం మరెప్పుడూ వాళ్ళ జోలికి రాలేదు!

ఉత్తమ గురువు


విశాలపురాన్నేలే రామభద్రమహారాజు వృద్ధుడయ్యాడు. ఆయన రాజ్యభారాన్ని తన కుమారుడైన వీరభద్రుడికి అప్పగిస్తూ, ‘‘నాయనా! నేను రాజునయ్యేనాటికి, మన పౌరుల్లో అధిక శాతం విద్యావిహీనులు కావడంవల్ల మూఢ నమ్మకాలతో, మూఢాచారాలతో తాము ఇబ్బంది పడుతూ, సమాజానికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకని నేను రాజధానిలో ఒక విద్యాలయాన్ని నెలకొల్పాను. కానీ సరైన గురువు లేక ఆ విద్యాలయం, నేనాశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేక పోయింది. ముందుగా నీవు, ఆ విద్యాల…యానికి సరైన గురువును ని…యమించు,'' అని చెప్పాడు.
 
తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వీరభద్రుడు వెంటనే మంత్రులతో ఆ విష…యం గురించి సమాలోచన జరిపాడు.
 
మంత్రులందరూ ముఖముఖాలు చూసుకుంటూంటే, వారిలో వృద్ధుడూ, వివేకవంతుడూ అయిన వాచస్పతి విన…యంగా, ‘‘రాజా! విద్యపట్ల ఆసక్తివున్నవారికి తల్లిదండ్రులు, చుట్టూవున్న ప్రకృతి అంతా గురువులే. అలాంటి వారిని ఒక సక్రమ పద్ధతిలో మరింత ప్రభావితం చేసేందుకు, మీ తండ్రిగారు రాజధానిలో విద్యాల…యాన్ని స్థాపించారు. అక్కడ శిక్షణ పొందినవారు దేశమంతటా వ్యాపించి, మన పౌరులందరిలోనూ విద్యపట్ల ఆసక్తిని పెంచుతారని ఆయన ఆశించారు. కానీ, మనం నియమించిన గురువులు అనుకున్నది సాధించలేకపోయారు,'' అంటూ పరిస్థితిని వివరించాడు.
 
‘‘అందుకు కారణమేమిటి?'' అన్నాడు వీరభద్రుడు. ‘‘పాండిత్యమున్నవారు గొప్ప పండితులుగా మాత్రమే చలామణీ కాగలరు. వారందరూ గొప్ప గురువులు కాలేరు. మనం గొప్ప పండితులను విద్యాలయానికి గురువులుగా ని…యమించాం. వారు గొప్ప గురువులు కాలేక పోయారు.

అయినా, గురువుల గొప్పతనాన్ని కూడా పరీక్షంచవలసివుంటుందని, ఇప్పుడిప్పుడే నాకూ స్ఫురిస్తున్నది,'' అన్నాడు వాచస్పతి. ఈ మాటలు వీరభద్రుడికి వాస్తవం అనిపించాయి. అతడు చారులను పంపి విచారించగా, దండకారణ్యంలో ప్రశాంతుడు, ప్రసేనుడు అనే ఇద్దరు ఉద్దండ పండితులున్నారనీ, వారి శిక్షణలో ఎందరో ఆరితేరిన విద్యావంతులు తయారయ్యారనీ తెలిసింది.
 
వీరభద్రుడు, వాచస్పతికి ఈ విషయం చెప్పి, వారిద్దరిలో ఒకరిని వెంటనే రాజధానిలోని విద్యాలయానికి ఆహ్వానించవలసిందిగా కోరాడు. వాచస్పతి కాసేపాలోచించి, ‘‘రాజా! మన విద్యాల…యంలో చేరి విద్యావంతులు కాలేకపోయిన ఇరవైమంది…యువకులను ఎన్నుకుని, వారిలో పదిమందిని ప్రశాంతుడికీ, మరొక పదిమందిని ప్రసేనుడికీ అప్పగిద్దాం.
 
ఆరుమాసాల గడువులో ఎవరు సత్ఫలితాలు సాధిస్తే, వారిని మన విద్యాల…యంలో గురువుగా ని…యమిద్దాం!'' అని సూచించాడు. రాజు వీరభద్రుడు ఇందుకు సంతోషంగా సరేనన్నాడు.
 
అనుకున్న ప్రకారం వాచస్పతి పదిమందిని ప్రశాంతుడి వద్దకూ, మరొక పదిమంది విద్యార్థులను ప్రసేనుడి వద్దకూ పంపాడు. ఆరుమాసాలు గడిచే సరికి ప్రశాంతుడి వద్ద చేరినవారిలో ముగ్గురు శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించితే, ప్రసేనుడి వద్ద చేరినవారిలో ఏడుగురు నైపుణ్యం సంపాయించారు. అప్పుడు వాచస్పతి ముందుగా ప్రసేనుణ్ణి, ‘‘మరి మిగతాముగ్గురి మాట ఏమిటి?'' అని అడిగాడు.
 
‘‘నాదగ్గర మిగిలిన ఆ ముగ్గురూ జడులు, జన్మతః మందమతులు! వాళ్ళను ఎవరూ విద్యావంతుల్ని చే…యలేరు,'' అన్నాడు ప్రసేనుడు.
 
ఆతర్వాత వాచస్పతి, ప్రశాంతుణ్ణి కలుసుకుని, ‘‘మీవద్ద మిగిలిన ఆ ఏడుగురు విద్యార్థుల మాటేమిటి?'' అని అడిగాడు.
 
దానికి ప్రశాంతుడు, ‘‘మంత్రివర్యా! నావద్ద చేరిన విద్యార్థుల్లో ముగ్గురు చురుకైనవారు. అందువల్ల త్వరత్వరగా వారికి విద్యాగంధం సోకింది. విగిలిన ఏడుగురూ అంత చురుకుకాదు. ఆరు మాసాల్లో వారిని విద్యావంతుల్ని చేయగల సమర్థత నాకు లేదు. మరికొంత గడువిస్తే, వారినీ ఆ ముగ్గురు విద్యార్థుల స్థాయికి తీసుకురాగలను,'' అన్నాడు.

వాచస్పతి, రాజుకు ఈ విష…యం చెప్పి, రాజధానిలోని విద్యాల…యానికి ప్రశాంతుణ్ణి గురువుగా ని…యమించమని సలహాయిచ్చాడు.
 
ఇందుకు రాజు ఆశ్చర్యపోయి, ‘‘గురువర్యా! ఆరు మాసాలలో ఏడుగురిని విద్యావంతుల్ని చేసిన ప్రసేనుణ్ణి కాదని, ముగ్గుర్ని మాత్రమే విద్యావంతుల్ని చే…యగలిగిన ప్రశాంతుడికి పదవి ఇవ్వడం విజ్ఞత అవుతుందా?'' అని అడిగాడు.
 
అందుకు వాచస్పతి చిరునవ్వు నవ్వి, ‘‘రాజా! మన విద్యాలయంలో ఎందుకూ కొరగాని వారనుకున్నవారిని ప్రశాంతుడూ, ప్రసేనుడూ కూడా విద్యావంతుల్ని చేయగలిగారు. అంటే, నిస్సందేహంగా ఇద్దరికిద్దరూ గొప్ప గురువులు. ప్రసేనుడు ఏడుగురినీ, ప్రశాంతుడు ముగ్గుర్నీ విద్యావంతులుగా చేయగలిగారంటే - అది వారి ప్రతిభకు కొలబద్దగా తీసుకోకూడదు! ప్రసేనుడి వద్ద చురుకైనవారు ఎక్కువమంది చేరినట్లు భావించాలి. ఎందుకంటే, చురుకుతనం లేనివారి నా…యన, జడులు అంటూ ఈసడించాడు. ఇకపోతే, ప్రశాంతుడు తన శిష్యులెవరినీ జడులు అనుకోలేదు. ఇక్కడ మనం విష్ణుశర్మా, మూర్ఖులైన ముగ్గురు రాజకుమారుల కథా జ్ఞప్తికి తెచ్చుకోవలసిన అవసరం వుంటుంది!'' అంటూ ఆగాడు.
 
రాజు, ‘‘అవునవును!'' అంటూ తల ఊపి, ‘‘చెప్పండి, గురువర్యా!'' అన్నాడు.
 
‘‘రాజా! మనం ఒకటి గమనించాలి. ప్రశాంతుడు మిగిలిన ఏడుగురు శిష్యులనూ విద్యావంతులను చే…యడానికి మరికొంత వ్యవధి కావాలన్నాడే తప్ప శిష్యుల నా…యన తప్పుపట్ట లేదు. శిష్యులను జడులనుకునే వాడు ఉత్తమ గురువు కానేరడు. అందువల్ల, నేను ప్రశాంతుణ్ణి ఉత్తమ గురువుగా ఎన్నికచేశాను,'' అన్నాడు వాచస్పతి.
 
రాజు వీరభద్రుడు, వాచస్పతిని మెచ్చుకుని, ప్రశాంతుణ్ణి రాజధానివిద్యాల…యంలో గురువుగా ని…యమించాడు. అతడి శిక్షణలో ఎందరో …యువకులు విద్యావంతులై విశాలపురంలో విద్యావ్యాప్తికి తోడ్పడి, దేశ పౌరుల మానసిక వికాసానికి సా…యపడ్డారు.

గురువు-బరువు


విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో, భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరిజనం అందరూ వారం రోజులుగా శాస్ర్తిగారి గీతోపన్యాసాలు విని పరవశించి పోతున్నారు. ఆ దినం ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్ర్తిగారు ఇలా చెప్పారు:
 
‘‘మహాజనులారా! ఈసారికి దైవం నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమంవుంది. మోక్షసాధనకై నిరంతరం ప్రయత్నిస్తూవున్నప్పుడే, మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.''
 
ఊరిజనం బరువెక్కిన హృదయాలతో, శాస్ర్తిగారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు.
 
భగవద్గీత సప్తాహం శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే భూస్వామ్య మిత్రులు ఇంటికి తిరిగిరాగానే, వీర్రాజు పరవశంతో, ‘‘అమ్మమ్మా! ఆ శాస్ర్తిగారు ఎంతటి మహాపండితులో గదా! జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా!'' అన్నాడు పేర్రాజుతో.
 
‘‘అవునవును, ఆయన సరస్వతీ పుత్రులు!'' అన్నాడు పేర్రాజు.
 
వీర్రాజు ఒక క్షణం ఆగి, ‘‘శాస్ర్తిగారి మాటలు విన్నప్పటి నుంచీ, నాలో ఒక ఆవేదన బయలుదేరిందయ్యా, పేర్రాజూ. సద్గురువును వెతికి పట్టుకుని, ఆయన పాదాల దగ్గర ఈ జీవితాన్ని సమర్పణ చేసుకుని తరించాలనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్ళపాటు నా వ్యవసాయాన్నీ, ఇంటి పనులనూ చూసి పెడతానంటే, నేను ఆ పనిమీద వెళతాను, ఏమంటావ్‌?'' అని అడిగాడు.
 
‘‘నీ వ్యవహారాలు చూసి పెట్టడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ, ఒక్క మాట.

గురువును వెతికి పట్టుకుని పరీక్షించి, మనకు తగినవాడో కాడో నిర్ణయించుకునే స్థితిలోనే కనుకమనంవుంటే, మనకు అసలు గురువుతో పనేముంటుంది? ఆలోచించుకో,'' అన్నాడు పేర్రాజు.
 
‘‘నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయూనికి వచ్చానయ్యా. శ్రీశైలం దగ్గర ఎవరో ఒక మహానుభావుడున్నాడట. గాలిలో అలా తేలుతున్నాడనీ, నీళ్ళపై నడుస్తాడనీ, నిప్పుల్లో నర్తిస్తున్నాడనీ చెప్పుకుంటున్నారు. పగలు పరమకరుణతో భక్తులను అనుగ్రహిస్తూ, రాత్రి సమయాల్లో మాయమై, హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారట. నేను వెళ్ళి ఆ సాధువు సంగతేమిటో తెలుసుకుని వస్తాను,'' అన్నాడు.
 
వీర్రాజులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న పేర్రాజు, ‘‘నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. శీఘ్రకాలంలో నీకు మంచి గురువు దొరికి ఆత్మ తృప్తితో తిరిగిరావాలని దైవాన్ని ప్రార్థిస్తూవుంటాను,'' అన్నాడు.
 
వీర్రాజు ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్ళే సరికి, నిత్యానంద స్వామి ఆశ్రమం దగ్గర పెద్ద తీర్థంలావుంది. ఆ జనసందోహాన్ని చూసే సరికి వీర్రాజుకు మహానందం కలిగింది. శిష్యులు అతని సమాచారాన్ని వివరంగా తెలుసుకుని, స్వామీజీకి నివేదించారు. స్వామీజీ అనుగ్రహించాడు. శిష్యులతో వీర్రాజు, స్వామీజీ వుండే ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. స్వామీజీని చూస్తూవే వీర్రాజు, ‘‘ఆహా, ఏమి తేజస్సు! ఏమి వర్చస్సు!'' అనుకుంటూ, అమితమైన భక్తితో ఆయన పాదాల ముందు వాలిపోయూడు. ‘‘లే, వీర్రాజూ! నీకు కొన్ని భవబంధాలు వున్నాయి. అవన్నీ వదిలిపోవాలంటే కొంత కాలం సాధన చెయ్యక తప్పదు.
 
ఆ తర్వాత నువ్వు కోరుకున్న పరమార్థం లభిస్తుంది. హరిః ఓం తత్సత్‌!'' అని ఆశీర్వదించారు గురువుగారు.
 
‘‘ఆహా! నా గురించి సర్వజ్ఞులైన మీకు అంతా తెలిసిపోయింది. ఈ జన్మతో నాకు మోక్షాన్ని ప్రసాదించండి,'' అంటూ వేడుకున్నాడు వీర్రాజు.
 
గురువు మందహాసం చేసి, ‘‘అంతా నీ చేతుల్లోనే వుంది, వీర్రాజూ. నీలో వైరాగ్యం పెరగాలి. ఇదుగో, ఈ ప్రసాదం భక్తితో కళ్ళకద్దుకుని ఆరగించు,'' అంటూ స్వామీజీ గాలిలోకి చేయిచాపి, ఒక సీతాఫలం అందుకుని, వీర్రాజు చేతుల్లో ఉంచాడు.

వీర్రాజు ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. అనుగ్రహ ఫలం ఆరగిస్తుంటే అతడిలో ఎన్నెన్నో సంకల్పాలు.
 
ఈ విధంగా-వీర్రాజు ఇల్లొదిలి, నిత్యానంద స్వామి ఆశ్రమం చేరి ఆరు నెలలు దాటింది. ఏవిధమైన సమాచారం తెలియక ఊరిజనం, అతణ్ణి గురించి తలా ఒకరకంగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడని కొందరూ, సన్యాసుల్లో కలిసిపోయాడని మరికొందరూ చెప్పుకోసాగారు. వీర్రాజు భార్యా, కొడుకూ, కూతురూ, ఆ గాలికబుర్లు వింటూ, లబోదిబోమని గోలపెడుతూ ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నారు. పేర్రాజు ఆ కుటుంబానికి అండగా నిలబడి, వాళ్ళకు ధైర్యం చెబుతూ, ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
 
పులిమీద పుట్రలా ఒకరోజున వీర్రాజు నుండి రెండు ఉత్తరాలు వచ్చాయి. ఒకటి అతడి భార్యకు, మరొకటి పేర్రాజుకు: ‘నేను శ్రీ శ్రీ శ్రీ నిత్యానంద స్వామివారి ఆశ్రమంలో వుంటున్నాను. పరమ పూజ్య గురుదేవులు భవబంధాలను తెంచుకోమని ఉపదేశించారు. ఇక్కడే పరమ ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. నా భార్యా పిల్లలకు భుక్తికిలోటు లేకుండా ముగ్గురికీ మూడెకరాలూ, ఇల్లూ వుంచి తక్కిన భూమి, తోట అమ్మేసి, ఆ సొమ్ముతో ఇక్కడ స్థిరపడి భక్తిసాధన చేసుకుంటాను. తగిన బేరం చూసి అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తే, నేను వచ్చి, భూమిని స్వాధీనం చేసి, తక్కిన వ్యవహారాలన్నీ చక్కబరిచి, తిరిగి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నాకు, నా గురువుగారే తప్ప ఎవరు ఏ విధంగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం వుండదని గ్రహించగలరు!' అని వీర్రాజు ఆ ఉత్తరాల్లో రాశాడు.
 
ఉత్తరం చూసిన వీర్రాజు భార్యాపిల్లలు గోలగోల చేస్తూ పేర్రాజు ఇంటికి వెళ్ళారు. పేర్రాజు వాళ్ళను ఓదార్చి; నేను చెప్పినట్టుగా చెయ్యండి. మీ సమస్య పరిష్కారమవుతుందని నచ్చ చెప్పాడు. తర్వాత పేర్రాజు రెండు ఉత్తరాలూ తీసుకుని, గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు పేర్రాజు ఇదివరకే, వీర్రాజు విషయమంతా చెప్పివుంచాడు. ఇప్పుడు ఈ రెండు ఉత్తరాలూ చూసి గ్రామాధికారి, పేర్రాజుతో కాస్సేపు చర్చించాడు.

నెల తిరక్కుండా వీర్రాజు ఉరుకులు పరుగుల మీద గ్రామానికి తిరిగి వచ్చాడు. తిన్నగా గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి, ‘‘అయ్యా! ఇంతటి అన్యాయం, మిత్రద్రోహం లోకంలో ఎక్కడా వుండదు. నమ్మి నా ఆస్తిపాస్తులను, భార్యాబిడ్డలను తనకు అప్పగించి వెళితే, ఈ మిత్రద్రోహి పేర్రాజు ఇంత పని చేస్తాడా? నా ఆస్తినంతా సొంతం చేసుకుని, నా భార్యాపిల్లల్ని దిక్కులేని వారిని చేసి, ఇంట్లోంచి గెంటేసి వీధిపాలు చేస్తాడా? వెంటనే వాడిని పిలిచి విచారణ చెయ్యండి. తగిన విధంగా వాణ్ణి శిక్షించి, నాకు న్యాయం జరిపించండి,'' అంటూ గొడవ చేశాడు.
 
గ్రామాధికారి చాలా ప్రశాంతంగా వీర్రాజు మొహంలోకి చూస్తూ, ‘‘ఇంతకూ నీకు జరిగిన అన్యాయమేమిటి? పేర్రాజు మీద నీ అభియోగాలేమిటి?'' అని అడిగాడు.
 
‘‘ఇంతకు ముందే పేర్రాజు చేసిన ద్రోహం గురించి విన్నవించుకున్నాను. నేను గురువును అన్వేషించడానికి బయలుదేరుతూ, నా ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొంత కాలం చూసి పెట్టమని అడిగాను. ఇప్పుడా ద్రోహి నా ఆస్తిపాస్తులన్నిటినీ తన సొంతం చేసుకున్నాడు. మరి ఇది అన్యాయం కాదా?'' అన్నాడు వీర్రాజు ఆవేశంగా.
 
‘‘అది సరే. ఇంతకూ మీ గురువుగారు, నీకు చేసిన ఉపదేశమేమిటి?'' అని అడిగాడు గ్రామాధికారి. ‘‘భవబంధాలన్నీ పూర్తిగా వదిలించుకువస్తే, తిరుగు లేని మోక్ష సాధన మార్గం ఉపదేశిస్తామన్నారు,'' అని చెప్పాడు వీర్రాజు. ‘‘అయితే, నీకున్న అసలు భవబంధాలేమిటి?'' అని ప్రశ్నించాడు గ్రామాధికారి నెమ్మదిగా.
 
‘‘భవబంధాలంటే-భార్యాపిల్లలూ, బంధుమిత్రులూ. ఆస్తులూ అప్పులూ, ఇలాంటివన్నీ,'' అన్నాడు నసుగుతూ వీర్రాజు.
 
‘‘నీలో వైరాగ్యం బలపడిందనీ, భవబంధాలను వదిలించుకుంటున్నాననీ, నీ ఉత్తరాల్లో రాశావుకదటయ్యా. ఇక నీకు, ‘నాది, నాకు' అంటూ ఏముంటుంది చెప్పు? కనుక నువ్వు నీ గురువుగారి దగ్గరకు తిరిగిపోయి, ఆయన చెప్పినట్లుగా భాగవతసేవ చేసుకుంటూ చక్కగా తరించు. మరింక వెళ్ళిరా!''
 
అన్నాడు గ్రామాధికారి. ‘‘పని పూర్తికాకుండా తిరిగి రావద్దని మా గురువుగారు మరీమరీ చెప్పారు.

నా ఆస్తి నాకు దక్కకుండా, ఇక్కడ నుంచి కదలను,'' మొండిగా చెప్పాడు వీర్రాజు. ఆ మాటలకు గ్రామాధికారి పెద్దగా నవ్వి, ‘‘నువ్వనే ఆ ఆస్తిపాస్తులు తనవేనంటూ పేర్రాజు దగ్గర పక్కాగా పత్రాలున్నాయి.
 
అతడికి ఇప్పుడే కబురు పెడతాను, సరా!'' అన్నాడు. ‘‘ఆ పత్రాలన్నీ అతడు సృష్టించివుంటాడు,'' అన్నాడు వీర్రాజు కోపంతో ఊగిపోతూ. ‘‘నువ్వు అన్నీ వద్దనుకుంటున్నావు. నీకెందుకీ గొడవలన్నీ?''
 
అన్నాడు గ్రామాధికారి గంభీరంగా. ‘‘వద్దను కోవటమేమిటి? కావాలనే కదా వచ్చాను,'' అన్నాడు వీర్రాజు. ‘‘ఏం కావాలని వచ్చావయ్యా, వీర్రాజూ? ఆస్తిపాస్తులూ, భార్యాబిడ్డలా? లేక నీ గురువూ, ఆయన చెప్పిన భాగవతసేవా? నీలో పిసరంత వైరాగ్యం కూడా కనిపించడంలేదు,'' అన్నాడు గ్రామాధికారి కాస్తకటువుగా. అది వింటూనే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. గ్రామాధికారి అడిగినదాంట్లో తిరకాసు అతడికి అర్థమైంది.
 
‘‘మహాప్రభూ! నేను చేసిన పొరబాటు, నాకిప్పుడు అర్థమయింది. నన్ను మన్నించండి. నాకళ్ళు తెరుచుకున్నాయి!'' అంటూ గ్రామాధికారి కాళ్ళమీద పడ్డాడు. గ్రామాధికారి ప్రేమగా వీర్రాజును లేవదీసి, ‘‘సంతోషం, వీర్రాజూ!
 
నీలో ఇలాంటి మార్పురావడం కోసమే నేనూ, పేర్రాజూ ఈ నాటకమాడాం. నీ ఆస్తికీ, నీ కుటుంబానికీ చిన్నమెత్తు నష్టం కూడా లేదు, చూడు!'' అంటూ అతణ్ణి లోపలి గదిలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ పేర్రాజూ, వీర్రాజు భార్యాపిల్లలూ ఆతృతగా అతడికోసం ఎదురు చూస్తూ నిలబడివున్నారు.
 
పేర్రాజు, వీర్రాజును కౌగలించుకుని, ‘‘నీకు అప్పుడే చెప్పబోయాను; కానీ వినేస్థితిలో లేవని వూరుకున్నాను. నీకు కావలసింది ఇచ్చేవాడు, నీకు గురువు అవుతాడుగానీ, నీ నుంచి ఆశించేవాడు బరువు అవుతాడు తప్ప, గురువు ఎలా అవుతాడు?'' అన్నాడు చిన్నగా నవ్వుతూ.
 
వీర్రాజు సిగ్గుతో తలదించుకుని చేతులు జోడించాడు. 

జీవితం అంటే...


స్వామినాథుడికి, తన ఇరవయ్యేళ్ళ వయసులో అనుకోకుండా, తల్లిదండ్రులిరువురూ అకాల మరణానికి గురవ్వడంతో, వాళ్ళు సంపాదించిన ఆస్తికి అతడు ఏకైక వారసుడయ్యాడు.
 
స్వామినాథుణ్ణి చిన్నప్పటి నుంచీ అతని తల్లిదండ్రులు ఏ కష్టమూ తెలి…యకుండా గారాబంగా, ప్రేమగా పెంచడం వలన, అతనికి కష్టపడి పని చేసి డబ్బు సంపాదించడం అంటే ఏమిటో తెలి…యదు.
 
అయితే, స్వామినాథుడు బుద్ధిమంతుడు, సాధుహృదయం కలవాడు. ఎవరేమి అన్నా అతిగా చలించి బాధపడే అతి సున్నితమైన మనసు అతనిది. నిజానికి అతను, తన తల్లిదండ్రులను అమితంగా ప్రేమించాడు. అందుకే వాళ్ళ మరణాన్ని భరించలేకపోయాడు.
 
క్రమంగా నిద్రాహారాలను మానివేసి పగలూ రేయీ వాళ్ళను తలచుకుంటూ కుమిలిపోతూ కాలం గడపసాగాడు. అతడి బంధువులు, స్నేహితులు అతనికి ఎన్నో విధాలుగా నచ్చజెప్ప చూశారు. జీవితం చాలా విలువైందనీ, పొద్దస్తమానం పోయినవాళ్ళ కోసం దుఃఖిస్తూ కూర్చున్నంత మాత్రాన వాళ్ళు తిరిగిరారనీ, వాళ్ళ ఆత్మలకు సంతృప్తి కలగాలంటే, జీవితంలో పైకి వచ్చి చక్కగా సంసార జీవితం గడపాలనీ వాళ్ళు బోధించారు.
 
కానీ, స్వామినాథుడు ఎవరి మాటా వినలేదు. అలాంటి సమయంలో, కొందరు స్వార్థపరులూ, అవకాశవాదులైన …యువకులు అతనికి కల్లబొల్లి మాటలు చెప్తూ దగ్గరై అతన్ని మభ్యపెట్టి, అతని ద్వారా తమ అవసరాలకు డబ్బు విపరీతంగా ఖర్చుచేయించసాగారు.
 
ఇలా వుండగా, రామదాసు అనే ఒకాయన స్వామినాథుడి ఇంటికి ఒక రోజున వచ్చాడు. స్వామినాథుడాయన్ను ఎగాదిగా చూసి, ‘‘మీరెవరు? ఏం పని మీద వచ్చారు?'' అని అడిగాడు.

ఆ ప్రశ్నకు రామదాసు చిరునవ్వు నవ్వి, ‘‘నేను నీకు దూరపుబంధువును, వరసకు బాబాయినవుతాను, నా…యనా! మాది రామనగరం. నీ పరిస్థితి తెలిసి, చూసిపోదామని వచ్చాను,'' అన్నాడు.
 
ఆ జవాబు వింటూనే స్వామినాథుడు, తన తల్లిదండ్రుల గురించి చెప్పి, ఏడవనారంభించాడు.
 
‘‘ఊరుకో నాయనా! నీ దుఃఖం తీరే మార్గం నేచెబుతాను, నా మాట వింటావా మరి?'' అన్నాడు రామదాసు.
 
స్వామినాథుడు కళ్ళు తుడుచుకుంటూ, ‘‘అలాగే చెప్పండి!'' అన్నాడు.
 
‘‘ఇక్కడ ఉంటే నీకు పాతజ్ఞాపకాలతో మనశ్శాంతి వుండదు. నాతో పాటు మా ఊరికి రా! అక్కడ ఒక పెద్ద భవంతి అమ్మకానికి వచ్చింది. ఎంతో హాయిగా ఉండవచ్చు,'' అన్నాడు రామదాసు.
 
మర్నాడు ఇద్దరూ రామదాసు ఊరైన రామనగరానికి బ…యల్దేరారు. భవనం చౌకగా వస్తుందనీ, వెంటనే కొనడం బావుంటుందనీ రామదాసు చెప్పడంతో, స్వామినాథుడు చాలా పెద్దమొత్తం డబ్బుతో బయల్దేరాడు.
 
వాళ్ళెక్కిన గురప్రు బండి, ఇంకా రామనగరానికి కోసెడు దూరంలో వుందనగా, హఠాత్తుగా నలుగురు దొంగలు బండిని అటకాయించి, కత్తులతో రామదాసునూ, స్వామినాథుణ్ణీ బెదిరించి డబ్బు దోచుకుని పారిపోయారు.
 
స్వామినాథుడు నెత్తీ నోరూ బాదుకుంటూ కళ్ళనీళ్ళతో, ‘‘ఏమిటి, బాబాయ్, ఈ ఘోరం!'' అంటూ వున్నచోటునే కూలబడ్డాడు. రామదాసు, అతణ్ణి లేవనెత్తి ధైర్యం చెబుతూ, ‘‘అంతగా విచారించకు!'' అని బండిని తిరిగి స్వామినాథుడి ఊరికి ప్రయాణం కట్టించాడు.
 
ఇప్పుడు స్వామినాథుడికి ఆస్తిపాస్తులంటూ ఒక ఇల్లు తప్ప మరేం లేదు. ఆ ఇల్లు అమ్మాలన్న ఆలోచన అతడికి రాలేదు.
ఇల్లు అమ్ముకుంటే, తనకు నిలవ నీడ ఉండదని, అతనికి తెలుసు. ఇప్పుడు అతనికి పట్టిన దిగులు ఎలా బ్రతకాలి? ఎలా డబ్బు సంపాదించాలన్నదే! రామదాసు, అతడికి అంతగా విచారపడవద్దని చెప్పి, ‘‘స్వామినాథా! నేను మా ఊరికి పోయి కొంత డబ్బు తెస్తాను.

దానితో కొంత వ్యవసాయయోగ్యమైన పొలం నీ కోసం కొంటాను. అలా వ్యవసాయం చేసుకుంటూ నువ్వు బ్రతకవచ్చు. కొంత కాలం పాటు నేనూ, నీకు తోడుగా ఇక్కడే ఉంటాను,'' అన్నాడు.
 
అన్న మాట ప్రకారం, రామదాసు డబ్బు తెచ్చాడు. అమ్మకానికి ఊరు దగ్గర్లో వున్న పొలాన్ని గ్రామాధికారి సా…యంతో కొన్నాడు. అందులో, రామదాసుతో పాటు స్వామినాథుడు కూడా పగలూ, రాత్రీ అని చూడకుండా కష్టపడి పని చేయసాగాడు. వంటపనులూ, ఇతరత్రా ఇంటిపనుల్లో కూడా, ఇద్దరూ శ్రమిస్తూండేవాళ్ళు.
 
ఒకనాటి సాయంకాలం వేళ, వాళ్ళిద్దరూ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా, గ్రామాధికారి కూతురు పదిహేడేళ్ళ గౌరి అక్కడికి వచ్చి, వాళ్ళను చూస్తూనే ఆశ్చర్యంగా, ‘‘అయ్యో! ఈ వంటా వార్పుల్లో, మగవాళ్ళు మీరు చేయి కాల్చుకుంటున్నారా? ఎవరో చెప్పగా, మా నాన్న పంపాడు. రేపటి నుంచీ మా వంటమనిషి చెల్లెల్ని మీ వంట పనులూ అవీ చేసేందుకు పంపుతాను,'' అని ఇంటిలోని అన్ని గదులూ తిరిగి చూసి వెళ్ళిపోయింది.
 
సంవత్సరం గడవకుండానే పొలాల్లో వరి బాగా పండింది. స్వామినాథుడూ, రామదాసూ ధాన్యాన్ని బస్తాల్లో నింపి, బళ్ళమీద ఇంటికి చేర్పించారు. స్వామినాథుడి ఆనందానికి అవధుల్లేవు. అది గమనించిన రామదాసు, ఆప్యాయంగా అతడి భుజం తట్టి, ‘‘స్వామినాథా! నీలో వచ్చిన మార్పు నువ్వు గమనించావనుకుంటాను. ఆరేడు నెలల కాలంగా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి విచారపడుతూండడం మానేశావు. పోయిన డబ్బు గురించీ, నీ భావిజీవితం గురించే ఆందోళన పడ్డావు,'' అన్నాడు.
 
‘‘అవును, నిజమే!'' అన్నాడు స్వామినాథుడు ఆశ్చర్యపోతూ. దానికి రామదాసు తృప్తిగా తలాడించి, ‘‘ఇదే జీవితమంటే! మనిషికి అన్నింటికంటే ముఖ్యమైన అవసరం ఆకలి తీరడం. కడుపు నిండా తిని, అన్నీ అమరినప్పుడు అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వ్యర్థం చేసుకుంటాము. అందుకే, మనిషి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూండాలి. డబ్బు సంపాదిస్తుండాలి. తను బాగుపడి ఇతరులకు సాయపడాలి.

అప్పుడు ఏ దుఃఖమూ దరిచేరదు,'' అన్నాడు. ‘‘అవును బాబాయ్!'' అన్న స్వామినాథుడితో మళ్ళీ, ‘‘ఇప్పుడు నీకు విడమరచి చెప్పవలసిన చిన్న రహస్యం ఉన్నది. నేను నీకు దూరపు బంధువైనట్టే, గ్రామాధికారి గంగరాజు కూడా నాకు దూరపు బంధువే. మీ నాన్న అంటే ఆయనకు చాలా అభిమానం. నువ్వు తల్లిదండ్రులు పోయారన్న దుఃఖంతో పాటు స్వార్థపరుల గుప్పిట్లో చిక్కుకున్నావని తెలిసిన గంగరాజు, నాకు, నీ గురించిన అన్ని విషయాలు మనిషి ద్వారా కబురంపాడు. నేను వెంటనే బయలుదేరి వచ్చాను. మనం మా ఊరుకు వెళుతున్నప్పుడు బండినాపి డబ్బు దోచుకుపోయినవాళ్ళు దొంగలు కాదు, ఆయన నియమించిన మనుషులు. ఆ డబ్బు ఆయన దగ్గర నిక్షేపంలా ఉన్నది.
 
ఆయన కూతురు గౌరిని చూశావు గదా, వంట మనిషిని పంపి, మనకు చాలా సా…యం చే…యడమేగాక, ఆ వంటకాలెలా ఉన్నాయి అని అప్పుడప్పుడూ వచ్చి చూసిపోతున్నది కూడా!'' అంటూ ఓ క్షణం ఆగి, ‘‘తెలియకడుగుతాను, ఇంతకీ ఆ గౌరిని గురించి నీవేమనుకుంటున్నావు?'' అని అడిగాడు రామదాసు.
 
‘‘చక్కని అమ్మాయి, చురుకైన అమ్మాయి, చాలా కలుపుగోలున్న పిల్ల,'' అన్నాడు స్వామినాథుడు, ఆ మాటలనేందుకు మొహమాటపడుతున్నట్టు.
 
ఆ జవాబుకు రామదాసు పెద్దగా నవ్వి, ‘‘గంగరాజు తన కూతురు గౌరి గురించి నీ అభిప్రా…యం ఏమిటో తెలసుకునేందుకు చాలా కుతూహలపడుతున్నాడు, ఇప్పుడు తెలిసింది! నీకు గౌరి నచ్చింది. గౌరికి నీవు నచ్చావు. ఈ సంగతి గంగరాజుకు చెబుతాను. సాధ్యమైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి గౌరితో నీ వివాహం జరుగుతుంది!'' అన్నాడు.
 
ఆ తర్వాత కొద్ది రోజులకు గౌరీ, స్వామినాథుల వివాహం ఘనంగా జరిగింది. రామదాసు తరచుగా వచ్చి చూసి పోతానని స్వామినాథుడికి చెప్పి, సంతోషంగా తన ఊరు వెళ్ళిపో…యాడు.