Pages

Sunday, May 18, 2014

తెలివిగల చేప

ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది. ప్రతిరోజూ మూడుపూట్లా హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజూ తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామేవ్వరమూ మిగలమని తెలుసుకొని, ఒకరాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకొనే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది, కాని దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి.

      చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమైఉంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోయింది. ఈలోగా ఒక పెద్దచేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి.

బాతు-బంగారు గుడ్డు

ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచాసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చోపున ప్రతి రోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజూ బంగారం లభించడంతో ఆనందంతో వళ్ళు మరచిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒక రోజు పేరయ్య దంపతులు "ఈ బాతు ప్రతిరోజూ ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా! దీని పొట్టలో చాల బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతి రోజూ ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి, దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది" అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదువారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరూ కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి క్రుశించిపోయారు.

జింక అందం

ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోడానికి కాలువ దగ్గరకి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. 'ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకొంటూ... అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని మొఖం దిగులుగా మారిపోయింది. 'కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా! ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు'? అని ఎంతో దిగులుపడింది.

       అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. 'ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా!' అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం, చెంగుచెంగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చేవరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, "హమ్మయ్య! ఎంత గండం గడిచింది?" అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంది.

రైతు త్యాగబుద్ది

ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. నాలుగు రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది.

ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందున్నా భూముల్ని ముంచేస్తుందని తెలుసుకున్నాడు. కింద పొలాల్లో వందలమంది కూలీలు పనిచేస్తున్నారు. వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు.

       వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందూ వెనుక ఆలోచించకుండా వెంటనే తన వరికుప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందర్నీ పిలిచాడు. కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పని చేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు. వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అపుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథంను అభినందించారు.
 

దొంగను పట్టే మసికుండ

విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా వున్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్ళకు అపజయం అనేది కలగదు అని చెప్పాడు. అప్పడినుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొనేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్బ్రాంతికి లోనయ్యాడు.

       వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజ మందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండని తాకి రావాలనీ, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు.

అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికిమాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేసారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి, తగిన శిక్ష విధించి చేరసాలలో బంధించాడు.

తీరని కోరిక

సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి, ఆరబెట్టి తిరిగి వచ్చేటపుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్టజెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తి పడే రకం కాదు. ఆ గాడిద పని చేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏ మాత్రం ఇష్టం లేదు.

       ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్ధించి,"ఓ దేవుడా! దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చేయి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తోంది. ఈ రామన్న నాచేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు" అంటూ ప్రార్దించింది. గాడిద ప్రార్ధనకు దేవుడు ప్రత్యక్షమై "నాకు నువ్వు చేసే చాకిరి గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను" అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్లి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగుపుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్దించింది. "దేవుడా! కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గానీ చాకలి దగ్గర పనికీ, కుమ్మరి దగ్గర పనికీ తేడా కనిపించటం లేదు. దయ చేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు" అన్నది.

       రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి, ఒక చెప్పులు కుట్టే వాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. "ఇక్కడ కూడా నాకు బాగోలేదు' నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు" అని ఆలోచించింది గాడిద.

       గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్ధించింది. కానీ ఈ సారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. "నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధ దండగ. నీకసలు ఏపనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏపని చేసినా విసుగు పుట్టదు" అని గాడిదను గట్టిగా మందలించాడు.

ప్రతిఫలం

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువమంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారుచేసుకొనే వారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయలనుకోనేవారు. ఎవరికి వారు మనకెందుకులే! అనుకొనేవారు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు.

     మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ నాల్గు రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. "బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించక పోయావా?" అన్నాడు మిత్రుడు. "నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి" అని సమాధానం చెప్పాడు వ్యాపారి.

     ఇంతలో ఒక గుఱ్ఱపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుఱ్ఱం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుఱ్ఱాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు.

    కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు"నేను గురువును. కూలి పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగానీ భుజబలం చూపించను" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు.

      ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో "రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి" అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరిపని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్ళకు తెలిసింది.
 

తగిన శాస్తి

 పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు. విజయ నగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు, కొనేవాడు. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు. ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతుంది. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారున్నీ, గుర్రాన్నీ చూశాడు. దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి.

     "ఇంత విలివైన గురాన్ని అంత తక్కువకు అడగటం నిజంగా మోసం చెయ్యటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను సరేనా?" అన్నాడు మంత్రి కొడుకు. గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. "ఏమీలేదు. మూడు కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు యిస్తా"నన్నాడు.

    వ్యాపారికి కోపం వచ్చింది. అయినా పేరాశకు లొంగిపోయాడు. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి 'చెళ్' మని కొట్టాడు. "అబ్బా"... అని మూల్గి "ఇంకా రెండు... కానీ..." మళ్ళీ కొరడా 'చెళ్' మంది.
"ఆ! తర్వాత మూడోది కూడా కానీ" అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను మడిచి "మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో" అంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంభరపడ్డారు.

గర్వం పనికిరాదు

ఒక తూనీగ చెట్టుకొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. రెండు మిణుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్చగా తిరుగుతూ తూనీగను చూచి, గర్వంతో "ఓహో నీవా! తూనీగా! దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము. ఆ వేలుగులో వెళతావా?" అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ "మిత్రమా! నేను వెలుగు లేకపోయినా, ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసేముందు మీరు ఏమిటో తెలుసుకోండి!" అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ "నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు. ఎదుటవారిని కించపరచకూడదు.

     మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మన కన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశం లోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు". ఎవరి విలువ వారికుంటుంది అన్నది తూనీగ. అప్పుడు మిణుగురు పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమించమని కోరాయి.

చివరి కోరిక

 ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయస్సులో చాలా పెద్దవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు ముగ్గురు కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలు పెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో ముగ్గురు కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడికి సగం, రెండోవాడికి మూడో వంతు, మూడో వాడికి తొమ్మిదో వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు.

       అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తి అయింది. ఆవుల పంపకంలో వారు తండ్రి చెప్పినట్లు పంచుకోడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవులలో సగం ఎలా పంచుకోవాలి? అని సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్దిమంతుడు. ముగ్గురన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రి గారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెళుకువ అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కట్టిన తాడు ముడి తీసి "ఈ ఆవుని తీసుకెళ్ళి, మీ ఆవుల మందలో కలపండి. తరువాత బాగాలు పంచుకోండి" అని అన్నాడు.

     పెద్దవాడు "అయ్యా! రంగాచారి గారు మీ ఆవును మేము తీసుకోలేము" అన్నాడు.
"పరవాలేదు తీసుకెళ్ళండి! మీ వాటాలు పంచుకోండి ఆ తరువాత ఏమైనా మిగిలితే నా ఆవుని నాకు ఇవ్వండి" అని వారికి ఆవునిచ్చి పంపించాడు.
ముగ్గురన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రి గారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు.

సమయస్పూర్తి

 ఒక ఊరిలో రామాలయం నిర్మించాలని విరాళాల సేకరణ చేయడం ప్రారంభించారు. గోవిందరావు అనే భక్తుడు తన వంతు సేవ నిమిత్తం పొరుగు ఊరిలో ఉన్న పెద్ద పెద్ద ఆసాముల వద్దకు వెళ్లి విరాళాలు వసూలు చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరడానికి మధ్యలో అడవి దాటాలి, చీకటి పడసాగింది. గోవిందరావు తొందర తొందరగా అడవిలో నడుస్తున్నాడు. చేతిలో డబ్బు సంచి ఉంది. ఇంతలో ఒక బందిపోటు దొంగ తుపాకీ గురి పెట్టి గోవిందరావును ఆపి చేతిలో సంచిని ఇమ్మని బెదిరించాడు. చేసేది లేక ఎదురు చెబితే కాలుస్తాడని "నాయనా! ఇది నా డబ్బు కాదు. గ్రామస్తుల నుండి విరాళాలు వసూలు చేశాను. ఈ ధనంతో దేవాలయం నిర్మించాలని తీసుకెళ్తున్నాను. నా దారిన నన్ను పోనీ" అని బ్రతిమలాడాడు.

      "ఎక్కువగా మాట్లాడకుండా ముందు డబ్బు ఇవ్వు!" అంటూ చేతిలోని డబ్బు సంచిని లాక్కున్నాడు.
"ఈ డబ్బుని నువ్వు లాక్కున్నావు. డబ్బిచ్చిన వారికి నేను ఏం సమాధానం చెప్పాలి! నాకో చిన్న సహాయం చేసి పెట్టు" అని గోవిందరావు అన్నాడు. "ఏంటది?" అన్నాడు బందిపోటుదొంగ. "ఏం లేదు... నీ చేతిలో తుపాకీ ఉంది. కాబట్టి నేను నీ మాట వినక తప్పదు... నేను ఏమి చెప్పినా మావాళ్ళు నమ్మరు. అందుకని... తుపాకీతో నాపై కండువాను కాల్చు. అది చూసి నీ దగ్గర తుపాకీ ఉందని మా ఊరి వారందరూ నమ్ముతారు" అని చెప్పాడు. దొంగ 'సరే' అని తుపాకీతో కాల్చాడు. కానీ కండువాకి చిల్లి పడలేదు. "ఇదేంటి తూటా తగిలినా చిల్లు పడలేదు" అని అడిగాడు గోవిందరావు.

     "నా తుపాకీలో తూటాలుండవు. తుపాకీ మందు కూరుతాను. శబ్దం వస్తుందే తప్ప దెబ్బ తగలదు. ఇది కేవలం భయపెట్టడానికే చంపటానికి కాదు" అని విరగబడి నవ్వసాగాడు దొంగ. అదును చూచి గోవిందరావు దొంగను అదిమి పట్టి చెట్టుకు కట్టి సంచి తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు.
 

అత్యాశ-ప్రాణ సంకటం

   రామాపురం జమిందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసు మనిషి ఒకడు ఉన్నాడు. తాగాడంటే వాడు నోటికొచ్చింది వాగుతూ, అందరిని కూడగల్పుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. మాటలు కోటలు దాటుతాయి.
ఒకనాడు చంద్రయ్య "నాకేగనుక జమిందారుకి ఉన్నంత భూమి ఉంటే... చూస్కో... నాసామిరంగ... అదరగొట్టేస్తాను... ఒక్కొక్కరి కూలి రెట్టింపు చేస్తా..."నంటూ కల్లుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ మాటలు జమిందారు గారికి తెలిశాయి. వెంటనే జమిందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. "ఇదిగో చంద్రయ్య! నీకు ఎంత భూమి కావాలో తీసుకో. ఇప్పుడు సూర్యోదయం కావస్తుంది.
నీవు ఇక్కడినుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తాను. అయితే ఒక షరతు సూర్యాస్తమయం వేళకు మళ్ళీ ఇక్కడకు రావాలి సుమా!" అని అన్నాడు. చంద్రయ్య సంతోషంతో 'సరే'నని పరుగు లాంటి నడకతో బయలుదేరాడు. ఆకలిదప్పులు లేవు. ఆశ... అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి... తనదేనని నడుస్తున్నాడు. నడచినకొద్దీ సారవంతమైన భూములు కనబడుతున్నాయి. మధ్యాహ్నం అయ్యింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కాని అత్యాశ ముందుకే లాక్కుపోతుంది.

     మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. వెనక్కు తిరుగుదాం అనుకున్నాడు. మనసు అంగీకరించలేదు. ఆ కనపడే పొలాలను చుట్టి వెళదాం అనుకున్నాడు. సాయంకాలం కావస్తుంది. మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనుకకు మరలాడు. నడుస్తున్నాడు. కాళ్ళు మారాం చేస్తున్నాయి, ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చలాయించింది. ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరిగెడుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగి పోయింది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ప్రాణం బిగపట్టి పరిగెడుతున్నాడు. నవనాడులు కుంగి పోతున్నాయి. అడుగులు పడుతున్నాయో లేదో! గమనించే శక్తి కోల్పోయాడు. జమిందారు ఇంకా పది గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సూర్యుడు అస్తమించాడు. ఒక్కసారిగా చంద్రయ్య నేలమీద బోర్లాపడ్డాడు. అంతే! మళ్ళీ లేవలేదు.

ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. చివరకు చంద్రయ్య శవానికి ఆరడుగుల నేలే సరిపోయింది.

పొగరుబోతు మేకలు

ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉంది. అది చాలా నిటారుగా ఉంది. ఆ కొండ మీదకు వెళ్ళటానికి గానీ, రావటానికి గానీ ఒకటే దారి. ఆ దారి వెంట మేకలు, గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేతమేసి తిరిగి వస్తూ ఉండేవి. ఒకరోజు రెండు మేకలు ఒకటి పైనుండి కిందకు, రెండవది కిందనుండి పైకి వస్తూ అవి కొండ మధ్యకు చేరాయి. రెండింటికీ తప్పుకోవడానికి దారి లేదు. ఏదో ఒకటి వెనక్కి నడవటం తప్ప వేరే మార్గం లేదు. ఒక మేక రెండోదాంతో "తన దారికి అడ్డం తప్పుకో"మన్నది. "ఈ సన్నటి దారిలో వెనకకు వెళితే లోయలో పడిపోతానని నీకు తెలియదా! నువ్వే వెనుకకు వెళ్ళటం తేలిక. నన్నే ముందు పోనివ్వు!" అన్నది రెండవది.

      "అది జరగని పని నీకు కిందకు వెళ్ళటం ఎంత ప్రమాదమో నాకు వెనుకకు, పైకి పోవటం కూడా అంతే ప్రమాదం" అన్నది మొదటి మేక. "ఒక పని చెయ్యి. ఈ దారిలో నువ్వు నేలకు వదిగి పడుకో నేను నీ మీద నుంచి దాటి వెళతాను. ఇంతకు తప్ప వేరే మార్గం లేదు" అన్నది రెండవ మేక. "నేను చస్తే ఆ పని చెయ్యను. నువ్వు నా మీదనుంచి దాటి వెళితే, నా శవం మీద నుంచి దాటి వెళ్ళినట్లే... "అన్నది ఆవేశంగా మొదటి మేక. ఆ విధంగా ఆ రెండింటికి మాటా మాటా పెరిగింది.
అంతే పోట్లాట మొదలైంది. ఒకదాన్నొకటి నెట్టుకున్నాయి. చివరకు రెండు మేకలు కొండపైనుండి కిందకు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి.

పావురాల తెలివి

ఒక అడవిలో చెట్టుపైన చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ ఒకటితో ఒకటి గొడవపడి ఐకమత్యంగా ఉండేవి కావు. అవి ఒక్కొక్కటీ వేరువేరుగా ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉంది. అది తరుచూ పావురాలను పట్టి తినేది. రోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాల్లో కంగారు భయం పట్టుకుంది. అవన్నీ కలిసి ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిక్ష్కరించుకోవాలో ఆలోచించసాగాయి.

      "మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తుంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం" అన్నది ఒక పావురం. ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరకు వెళ్లి "నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికే వచ్చాను" అంది.

    ముందు పావురాలు నమ్మకపోయినా, రెండు రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. మూడవరోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరకి వచ్చి, "మీ గుంపుని చూస్తుంటే ముచ్చటేస్తుంది. కాని, మీకో నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బలంగా ఉండవచ్చు" అంది. పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికీ అర్ధం కాలేదు. అంతలో గ్రద్ద 'మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకునిగా ఉంటాను" అంది. "అలాగే" అన్నాయి పావురాలు. "అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు ఆహారంగా రావాలి" అంది గ్రద్ద. పావురాలకు గ్రద్ద దుర్భుద్ది అర్ధమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి. ఆనాటి నుండి అవి కలిసి మెలిసి జీవించసాగాయి.

ధర్మమే జయిస్తుంది

అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలించుచున్నాడు. ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకొనేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి ప్రక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముల్లు గుచ్చుకొని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ సృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్లి దొంగిలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకొన్నారు. భోజనం చేసి పంచుకొందాం అనుకొని మూడోవాడిని ఊర్లోకి వెళ్లి భోజనం తెమ్మని పంపించారు.

ఇద్దరు దొంగలు మూడోవాడుంటే మనకు వాటా తగ్గుతుంది. వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది, అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళినవాడు ఇద్దర్నీ చంపితే మొత్తం నాకే గదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుహలో దాక్కుని మూడో వాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే.

తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుకుటకు ప్రయాణమయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే సృహ తప్పిన తమ తండ్రినీ, గుర్రాన్నీ గుర్తించారు. చుట్టు పక్కలా ఎవరైనా ఉన్నారేమో అని వెతగగా గుహముందు దొంగలు చచ్చి పడి ఉన్నారు. వారి పక్కనే తన తండ్రిగారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నవి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. చివరికి ఎవరి కష్టార్జితం వారి వద్దకే చేరింది.

ధ్రువనక్షత్రం

 ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది.

ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా "ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది" అన్నది పినతల్లి సురుచి.

జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి "నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది" అన్నది తల్లి.

     తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ "నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో" అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు "మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను" అని చెప్పాడు. "పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి" అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.

     అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి "ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి.

నిజమైన తెలివి

రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి "ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి" అని వారితో చెప్పాడు.

పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళంగా మార్కెట్టు వైపు వేగంగా వెళ్లి, మార్కెట్టులో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు.

రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివి తేటలతో పూర్తి చేయాలి అని అనుకుని దాన్ని గురించి బాగా ఆలోచించి, తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయితో క్రొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి, గదిలో క్రొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ క్రొవ్వొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది.

రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్దకొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు.

మాట్లాడే గుహ

ఒక అడివిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది. చీకటి పడుతుండటంతో ఎక్కడైనా తల దాచుకుని ఉదయాన్నే దారి వెతకవచ్చు అని నిర్ణయించుకుంది. అక్కడకి దగ్గరలోనే ఒక గుహ కన్పించింది. ఆ రాత్రి ఆ గుహలోనే పడుకుంది. ఉదయాన్నే అడవి నుండి బయటకు వెళ్ళే దారి కోసం ప్రయత్నించింది. కానీ దారి కనిపించలేదు. నిరాశతో ఆ గుహలోకే వెళ్ళి నిద్రపోయింది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది.

     ఈ విషయం గమనించిన ఒక పులి పొట్టేలు ఎలాగూ రాత్రి ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడే దాన్ని తినేయొచ్చు. అనవసరంగా వేటాడటం ఎందుకు అనుకుని, ఆ గుహలోకి వెళ్లి దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నీరసపడి, గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్లబోయేముందు పెద్దపెద్ద అడుగుజాడలు చూసింది. లోపలేదో జంతువు ఉంది అనుకుని, ఒక ఉపాయం పన్నింది.

"ఓ గుహ మిత్రమా! నిద్రపోతున్నావా? ఏమిటి నన్ను చూసి లోపలి ఆహ్వానించలేదు" అని అరిచింది. గుహనుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. "అదేంటి గుహా! నువ్వు రమ్మనందే నేను లోపలి రానని తెలుసు కదా నీకు! నువ్వు పిలవడం లేదు, కాబట్టి నేను లోపలి రాను వెళ్ళిపోతున్నాను" అంది. గుహ లోపలున్న పులి, రోజూ గుహ పోట్టేలుని పిలుస్తుంది కాబోలు అనుకుని "రా మిత్రమా రా" అంది. ఆ శబ్దం విన్న పొట్టేలు, లోపల పులి దాక్కుందని గ్రహించి అక్కడినుండి వేరే చోటికి పరుగు తీసింది.

ఆశపోతు ఎలుక


      ఒక ఎలుక రెండు రోజులనుండి ఆహారం దొరకక దాని కోసం వెతుకుతూ ఒక పండితుని ఇంట్లోకి వచ్చింది. ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండటం గమనించింది. ఎంతో ఆకలిగా ఉన్న ఆ ఎలుక వాటిని చూడగానే దానికి నోట్లో నీరూరింది. వెంటనే బుట్టపైకి ఎక్కింది. కానీ ఆ ఇంటి వారు దాని పైన గట్టిగా ఒక మూత పెట్టారు. నిరాశగా కిందకి దిగి, ఆ బుట్ట చుట్టూ తిరిగింది. ఈలోగా దానికో ఆలోచన వచ్చింది. వెంటనే చకచకా అది పట్టేంత రంధ్రాన్ని బుట్టకు చేసింది. చకచక లోపలి ప్రవేశించింది. ఎన్నో జొన్న గింజలు... ఆనందంతో వాటిని తినడం ప్రారంభించింది. అలా ఆపకుండా ఆ బుట్టలోని గింజలన్నింటినీ తినేసింది. నిండి బాగా లావేక్కింది. ఇక బయటపడటమే అనుకుంది. వెంటనే రంధ్రంలోంచి బయటకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప, పొట్ట పట్టడం లేదు. పోనీ ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినడంతో ఆయాసం, దానితో లోపలే కూలబడి అరవడం ప్రారంభించింది.

      ఈ లోగా అటువైపు వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి, బుట్టలో ఉన్న ఎలుకను చూచి ఏం జరిగింది? అని అడిగింది. ఎలుక జరిగిందంతా చెప్పింది. అంతా విని పందికొక్కు "నువ్వు నాలుగు రోజులు ఉపవాసం ఉండు. అప్పుడుగాని ఈ రంద్రంలోంచి బయటకు రావచ్చు. అయినా తేరగా దొరికింది కదా అని మితి మీరి తింటే ఇలాగే జరుగుతుంది" అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. ముందూ, వెనుక ఆలోచించనందుకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చుండిపోయింది.

ధనవంతుడు-బంగారం

ఒక ఊరిలో గురునాథం అనే ధనవంతుడు ఉన్నాడు. అతనికి బంగారమన్నా, తన కుమార్తె అన్నా ఎంతో ఇష్టము. ధనవంతుడు ఇంకా ఎంతో బంగారం సంపాదించి సుఖ పడాలని అతని కోరిక. ఒకనాటి రాత్రి అదృష్ట దేవత అతనికి ప్రత్యక్షమై "నీకు ఏమి కావాలో కోరుకో"మన్నది. అత్యాశగల గురునాథం "నేను ఏది తాకినా అది బంగారం కావాలి" అని కోరుకున్నాడు. తధాస్తు అని దేవత మాయమైనది. తెల్లవారిన తర్వాత ఆ ధనవంతుడు ఆ ఇంటి వెనుక తోటలోనికి పోయి అక్కడ కొన్ని వస్తువులను తాకాడు. అవి అన్నీ బంగారముగా మారినవి. ధనవంతుని ఆనందానికి అవధుల్లేవు.

     ధనవంతునికి ఆకలి వేసి ఫలహారము చేయుటకు కూర్చొని పళ్ళెములోని ఫలహారాలను చేతితో తాకాడు. అవి బంగారముగా మారినవి. ఏది తాకినాను అది బంగారముగా మారుచున్నది. ధనవంతుడైన గురునాథం ఆకలితో ఉండి కూడా ఏమీ తినలేకపోయాడు. ఇంతలో ముద్దుల కూతురు పరుగున వచ్చినది. సంతోషంతో ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. ఆమె కూడా బంగారు ప్రతిమగా మారినది.

      అప్పుడు గురునాథం తన తప్పేమిటో తెలిసినదని ఎంతో దుఃఖించాడు. బాధతో దేవతను ప్రార్ధించాడు. ఆమె ప్రత్యక్షమైనది. తనను క్షమించమని ఇచ్చిన వరముని తిరిగి తీసుకొమ్మని వేడుకున్నాడు. గురునాథం కోరికను మన్నించి దేవత ఒక కూజాతో కొంత నీరు ఇచ్చి "దీనిని బంగారముగా మారిన వస్తువులమీద చల్లితే అవి మళ్ళీ యదాస్థితికి వచ్చును" అని చెప్పి ఆ దేవత అదృశ్యమైనది. గురునాథం సంతోషించి బంగారు ప్రతిమగా మారిన తన కుమార్తె మీద ఆ నీళ్ళు చల్లాడు. ఆమె మాములు మనిషిగా మారింది. ఆమెను ఎత్తుకొని ముద్దాడి, నిజమైన ఆనందం సంపదలో లేదని తెలుసుకున్నాడు.

చద్దన్నం

 పూర్వం కోసల గ్రామంలో గంగమ్మ అనే వృద్దురాలికి సోమయ్య అనే కొడుకు ఉండేవాడు అతడు సోమరిపోతు. ఏపని చేసేవాడు కాదు. అతనికి ఒక భార్య ఉండేది. చాలా సౌమ్యురాలు.

      సోమయ్య ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఊరిమీదకి వెళ్లి పనిపాట లేనివారితో తిరిగి మళ్ళి మధ్యాహ్నం భోజన వేళకి వచ్చి తిని మళ్లి వెళ్లి తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. గంగమ్మ మరియు అతని భార్య ఏనాటికైనా పరిస్థితులు అర్ధంచేసుకుని మారక పోతాడా ఎదురుచుసేవారు.

      నిత్యం అన్నం వడ్డించే సమయంలో సోమ్మయ్య తల్లి "బాబు ఈ సద్దన్నం తినయ్యా" అంటూ ఉండేది. సోమయ్య రోజు నేను తినను వేడన్నమే పెట్టు అని గొడవచేసేవాడు. గంగమ్మ ఒకనాడు ఏదో పనిమీద బయటికి వెళుతూ కోడలితో "అమ్మా! మీ ఆయనతో నేను చెప్పినట్టు మర్చిపోకుండా సద్దన్నం తినమని చెప్పు" అని చెప్పి వెళ్ళింది. మధ్యాహ్నం భోజన వేళకి భోజనం తినడానికి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చి భోజనం వడ్డించమని పీట వేసుకుని కూర్చున్నాడు. భార్య కంచం కడికి భర్త ముందు పెట్టి !సద్దన్నం తినండి" అని పెట్టబోయింది. సోమయ్యకి కోపం వచ్చి నువ్వు కూడా అమ్మలాగా "సద్దన్నం తినమంటావేంటి?" అంటూ అరిచాడు. అత్తయ్యగారు మీకు ఇలా చెప్పమని మరీ మరీ చెప్పి వెళ్ళారండి. అని వేడన్నం వడ్డించి, అత్తగారు వచ్చాక జరిగిన విషయం చెప్పింది.

      సోమయ్య సాయంత్రం వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చోగానే గంగమ్మ " నాయనా! సద్దన్నం తినమని కోడలు చెప్తే అరిచావంట కదా!" అనగా సోమయ్య! అవునమ్మా అరిచాను. నువ్వు చెప్పావని చెప్పింది. నాకు చద్దన్నం అంటే గిట్టదు. అన్నాడు. గంగమ్మ నవ్వి

       నీకు చద్దన్నం అంటే గిట్టదంటున్నావు. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించే ఈ ఆస్థి, తినే తిండి చద్దివే కదా! నీ నాన్న, తాతలు సంపాదించినదే కదా బాబు. ఇవి ఎందుకు అనుభవిస్తున్నావు. తప్పు కదా. తండ్రి, తాతల ఆస్తుల మీద పిల్లలకి హక్కు ఉండవచ్చు. కాని ఆస్థి ఉందికదా అని కన్నూ మిన్నూ గానక ప్రవర్తిస్తే మొదటికే మోసం కలుగుతుంది. మీతండ్రి మీకోసం సంపాదించాడు. దానిని మంచి ధర్మకార్యాల కోసం ఉపయోగించు. నీవు సంపాదించే సంపాదన కుటుంబ పోషణ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించు. అంతేకాని ఉన్న ఆస్థిని ఇలా జల్సాల కోసం వాడుకుంటే నీ తరువాత వారికి ఏమిస్తావ్? నీ చెడు వ్యసనాల భాగస్వామ్యమా? నువ్వు చేసే పాపాలలో భాగమా? ఏమిస్తావ్? అని ప్రశ్నించగానే బదులు చెప్పలేక సిగ్గుతో తల దించుకున్నాడు. నేను ఏదో అన్నానని తల దించుకోవడం కాదు రా. నేను, నీ భార్య మా బాధ్యతగా సర్దుకుపోతాం. కాని నీ వ్యసనాల వలన ఆస్తితో బాటు పరువు హరించుకుపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. బుద్దిమందబారుతుంది. శరీరం ఏ పనిచేయాలన్నా సహకరించదు. మనస్సు అదుపులో ఉండదు. అన్ని విధాల చేటు కలుగుతుంది. ఇకనైనా తెలివి తెచ్చుకుని బ్రతుకరా అంటూ హితభోద చేసింది. ఆ మాటలకి సిగ్గుపడి ఆనాటి నుండి పూర్తిగా మారిపోయి ఇంటి భాధ్యతలు తీసుకుని ఊరంతా మంచిపేరు సంపాదించి అందరికి తలలో నాలుకయ్యాడు. ఆ ఊరికే పెద్ద అయ్యాడు.

సింహము-ఎలుక

అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను! అని ప్రాధేయపడింది. నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలా సేపు కష్ట పడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది. సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది. చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు!” అనుకుని తన దారిని వెళ్ళింది.

చాణక్యుని గ్యానోదయం

చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాల కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు. ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్యారాడు. దారి లో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు.

ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “యేమైంది బాబు!” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా వుంది, చేయి కాలిందమ్మ” అన్నాడు. అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే వున్నావు,” అంది అవ్వ. “యెవరైన అన్నం మధ్యలో చేయి పెడతార? పక్కలనుంచి చిన్నగా తింటూ రవాలికాని?  ఇదంతా అరుగుమీంచి వింటున్న చాణక్యుడికి గ్యానొదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.

ఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది.
 

శ్రీ కృష్ణదేవరాయుల కల

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.

ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు. నా దగ్గర నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు అని రాయులు ప్రోత్సహించారు. నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.

రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

బ్రాహ్మడి మేక

అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.

కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు. అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…

నక్కా, పీతలు

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి. అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి? అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క.

పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది. రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి. కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి.

పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

పులి ప్రేమ

అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా వుండేది. ఒక రోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై యెగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడకి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది.కొంచం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటునుంచి బయిటికి వచ్చింది. పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాల భయపడి పోయాడు. పారిపోయే క్షణంలో పులి, “నన్ను చూశి భయపడకండి – నేను మిమ్మల్ని యేమి చేయను. నాకు మీ అమ్మయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకొవాలనుకుంటున్నాను” అంది. అతను భయంలో కూడా చాల చురుకుగా ఆలోచించాడు.“నాకు ఇష్టమే, కాని మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో – పెళ్ళికి ఒప్పుకోక పోతే?” అన్నాడు. పులి ఆలోచించకుండా, “మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు, గోళ్ళు తీయించేస్తాను” అంది. ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు, దంతాలు కోసేసాడు. దంతాలు, గొళ్ళు లేని పులి అంటే భయం వుండదు కదా! కట్టెలతో, రాళ్ళతో, చేతికి అందిన ప్రతీ దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళి ఆ పులి యే మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు

ఓ బక్కచిక్కిన కాకి కథ

ఒక ఊరిలో ఒక బక్కచిక్కిన కాకి ఉండేది అది రోజూ ఏదో దొరికిన ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది. అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ బాగా స్థితి మంతులు ఉన్నారు. వాళ్ళు బాగా బలమైన బలమైన ఆహారం తిని మిగిలింది విదిల్చేవారు. ఆ విదిల్చింది తిని కాకి బాగా బలిసింది. (లావయ్యింది). క్రమేపి బలం పుంజుకుంది. అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది. సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి. కొన్నాళ్ళ పాటు ఈకాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించి హంసలకి తన కోరిక వెల్లడించింది. హంసలు సరేనని ఈకాకిని వాటితో పాటు కలుపుకున్నాయి. చాలా హాయిగా సాగుతుంది కాలం. ఒకనాడు హంసలమీద కాకికి ఈర్ష్య కలిగింది. నేను వాటికంటే బలంగా ఉన్నాను. నాకేంతక్కువ! అందానికి అందం, బలానికి బలం, ఎంత ఎత్తైన ఎగరగలిగే చాకచక్యం నాదగ్గర ఉన్నాయి. లేదంటే నేను కోరగానే నా స్నేహాన్ని ఎలా ఒప్పుకుంటాయి. వీటికి తెల్లగా ఉన్నామని పొగరు. వీటి పొగరుని చిన్న పందెంతో అణిచి వేస్తాను. అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి ఒక హంస దగ్గరికి వెళ్లి మిత్రమా! ఒక్కసారి మన బలాబలాలు చుసుకుందామా! అనగానే హంస ఆశ్చర్యపోయి! మిత్రమా! ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్ధ ధోరణి. వద్దు మిత్రమా అనగానే కాకి పకపకా నవ్వి ఓహో నాతో పోటి పడితే ఓడిపోతానని భయమా? లేదంటే ఇంత బేలతనమేలా!
బేలతనం కాదు మిత్రమా! నిన్ను బాధపెట్టడం ఎందుకా అని!

నాకు బాధ! హహహ ! నన్ను సరిగ్గా చూశావ! సప్త సముద్రలనైన అవలీలగా ఎగరగాలను, భూమండలాన్ని చుట్టి వచ్చేయగలను. ఎంత ఎత్తైన ఎగరగలను. ధైర్యం వుంటే నాతో పందేనికి సిద్దం అవ్వు. చేతకాకపోతే ఓడిపోయానని ఒప్పుకో.
సరే స్నేహితుడి ముచ్చట కాదనడం ఎందుకు! పదా అలా సముద్రం మీద విహారానికి వెళ్లి వద్దాం.
పందెం మొదలైంది.

      కాకి రివ్వు రివ్వుమని ఆకాశంలోకి పైపైకి ఎగురుతూ తన కున్న బలాన్ని ప్రదర్శిస్తుంది. హంస చూసి! మిత్రమా! మరీ బలం అంత ఒకేసారి వాడేయకు రెక్కలు నెప్పులు వస్తాయి. అలసిపోతావు. ఆ తరువాత ఎగరడం కష్టం అవుతుంది. నామాట విని క్రిందికి రా! సూర్యకాంతి ఎక్కువగా ఉంది.

కాకి ఆ మాటలు విని హేళనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది. చూసావా! ఎలా ఎగురుతున్నానో? అనుకుంటూ కొంతదూరం ప్రయాణం చేసేసరికి కాకిగారికి ఎండ వేడిమికి ఆయాసం వచ్చింది. అలాగే ఇంకొంతదూరం వెళ్లేసరికి నీరసం వచ్చి రెక్కలు అడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరకపోతుందా అని చుట్టూ చూసింది. కానీ చుట్టూ నీరు తప్ప మరేమీ కనపడలేదు. అప్పుడు ఏడ్చింది..
అయ్యో! నా మిత్రుడు ముందే చెప్పాడు. అయినా నేను వినలేదు. ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగి చనిపోతాను. అని ఏడుస్తూ రెక్కలాడించలేక ఒరిగిపోతూ ఉండగా హంస ఎంతో ఒడుపుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకి తీసుకొచ్చింది. కాపాడి ఒడ్డుకి చేర్చినందుకు హంసకి కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రదేయపడింది. హంస చిరునవ్వు నవ్వి!

       మిత్రమా! ఎదుటి వారి శక్తి యుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడినా, మంచి చెప్పినపుడు వినకుండా పెడచెవిన పెట్టినా, ''నేను'' అని అహంకారించినా, బలంగా ఉన్నాను కదా (సంపదలో, శరీర ధారుడ్యంలో, తెలివిలో,) అని అహంకరిస్తే ఇలాంటి గతే పడుతుంది.
ఎదుటివారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవలసింది మన జన్మ గురించి, తరువాత బలం గురించి(సంపద కావచ్చు, తెలివిలో కావచ్చు,) తరువాత పెరిగిన స్థానం, స్థానబలం, చూసుకోవాలి. అంతా బాగుంటే ఎదుటివారి లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగాలి. ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చేవరకు వేచి చూడాలి. ఇది మన సమయం అవునా?కదా? అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి. ఆ పరిస్థితులకి తగ్గట్టు నడచుకోవాలి. ఎదుటివాడు ఎదిరించలేని శక్తివంతుడు అయితే, వారివల్ల మన కార్యం పూర్తీ అవుతుందనుకుంటే మొక్కి లోంగిపోవలసిందే. లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి. అంతేకాని గుడ్డిగా వెళ్లి గొడవకి దిగితే మేడమీద తలకాయి ఉండదు. వట్టి మొండెం మాత్రం మిగులుతుంది. అంటూ ధర్మసూక్ష్మాలు చెప్పింది హంస. కాకి సిగ్గుతో తలదించుకుని అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి తన అర్హతలు, తన స్థోమత తెలుసుకొని స్నేహంగా మెలిగింది.

పిల్లి - కోడి కథ

   ఒక ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగవులు వస్తే వీరే తీర్చేవారు. ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా, బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. ఐతే ఈకోడిని ఎలాగైనా సేమ్య ఉప్మా లాగా లాగించేయాలని పిల్లి ఎదురుచూస్తూ వుండేది. ఈవిషయం గమనించి రంగయ్యని భార్య "ఈపిల్లిని వదిలేయండి. లేదంటే కోడిని చంపేస్తుంది" అని హెచ్చరించింది.
  
      రంగయ్య భార్యమాట వినకుండా అశ్రద్ధ చేసాడు. ఒకరోజున పిచ్చుక ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేతని వచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీదపడి కోరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది. రంగయ్య చూసి ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు. ఏమైంది?అనగానే "ఆపిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను. దాన్ని ఈ పనికిమాలిన పిల్లి కొరికి చంపింది". అంది. దానికి రంగయ్య నవ్వి! ఒసేయ్ పిచ్చి మొగమా! పుట్టిన ప్రతిజీవి ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే. ఎవరూ శాశ్వతంగా ఉండరు. దీనికేందుకే ఏడుస్తావ్. అనగానే రంగమ్మకి మండిపోయింది. మనసులో "ఏదో ఒకరోజు ఆ పిల్లి సంగతి చుడకపోను" అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

     ఆమరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వేసి పెంచుతుంటే, దిట్టంగా, పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకుని కూర్చున్న పిల్లి; రంగయ్య చూస్తూ ఉండగానే కచక్ మని కొరికింది. అది చూసి రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకొని పిల్లిమీదకి విసిరాడు. అది కాస్త గురితప్పి కొనఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చింది. ఇక చుడండి ఒకటే ఏడుపు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నాకోడి, దానికి పెట్టాను జీడిపప్పు పకోడీ. ఆపిల్లి కోరికేసింది బోడి. అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ దీర్గాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏమి జరిగింది? ఆ దీర్గాలు ఏంటి? అనుకుంటూ అక్కడికి వచ్చింది. రంగయ్య ఏడుస్తూ చూడవే! నాకోడిని ఆదిక్కుమాలిన పిల్లి చంపేసింది. అనగానే రంగమ్మ పకపకా నవ్వి! పోనివ్వండి.. ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు. నిన్న పిచ్చుక చచ్చిపోతే ఎడవలేదే? అంటూ మనసులో సంతోషంతో, పైకి కొంచం బాధగా అడిగింది. అపుడు రంగయ్య! ఆపిచ్చిక నాదా! అందుకే ఏడవలేదు. ఈకోడికి ప్రేమతో ప్రతిరోజు పప్పులు, జీడిపప్పు పకోడీ పెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఈపిల్లి దాన్ని కాస్త పోత్తనబెట్టుకుంది అంటూ దీర్గాలు తీస్తూ ఏడుస్తుంటే రంగమ్మ పగలబడి నవ్వి!

      మమ.. ఇది నాది అనుకుంటే ఏడుపే! నమమ. ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది. కష్టం, సుఖం తో సంభందం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది. మీరు చెప్పినట్టు ఎవరూ శాశ్వతం కాదు. ఇది ఆచరణలో ఉండాలి. మాటలదగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపు వస్తుంది. కాబట్టి నుండి దేనిమీద అతిగా ప్రేమని పెంచుకోవద్దు. మనం దేన్నైనా పెంచుతున్నాం, ఏదైనా పెడుతున్నాం అంటే అది ఋణం, ఋణానుబందం మాత్రమే. ఋణం తీరగానే ఎవరితో ఎవరికీ సంబంధం ఉండదు. ఎక్కడి నుండి వస్తే అక్కడికి వెళ్లిపోవలసిందే. ఇదే జీవిత సత్యం. జీవిత పరమార్ధం. అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రంగయ్య ఏడుపు ఆపి నిజమే కదా ఎందుకీ ప్రేమలు పెంచుకుని బాధ పడటం తప్ప మిగిలేది ఏముంది? అనుకుంటూ ఎప్పటిలాగే తనపనిలో నిమగ్నమైపోయాడు.

మోసపోయిన కోడిపుంజు

  రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులమారి నక్క ఒకటి ఎలాగో పసిగట్టింది. బాగా బలిసి కండ పట్టి ఉన్న కోడిపుంజుని చూడగానే నక్క నోట్లో నీళ్ళూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కాని కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే గాని పట్టుకోడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూడును వెనుకవైపు ఒక కిటికీ ఉంది. అక్కడకు వెళ్లి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క.

     "అబ్బా ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావ! తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం అది నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెపితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా?" అని కళ్ళు విప్పార్చుకొని కోడిపుంజుని పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కాని నక్క స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడం చూసి, ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచీ చెడ్డ మాట్లడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. "నీ శరీరమే కాదు నీ కంఠం కూడా బావుంది నీవు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుష్యులను నిద్ర లేపేది" అని పొగిడింది.

      ఇలా రోజూ నక్క రావటం, కోడిపుంజుని పొగిడి వెళ్ళిపోడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒక రోజు సాయంత్రం "నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చుడాలనుకుంటున్నారు. నీ గురించి చెపితే వాళ్ళెవరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాటలు నిలబెట్టు అని తియ్యగా, కమ్మగా అడిగింది.

       నక్క కుతంత్రం తెలియక కోడిపుంజు సంతోషంతో ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించి, తను దారిన తను పోయింది నక్క. కనుక నక్కలాంటి జిత్తుల మారి మాటలను నమ్మి మనము మోసపోకూడదు.

పిసినారి సోమయ్య

 గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి, తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారమంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్ళపాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏరహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు.

      మరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చుసిన సోమయ్యకు గుండె ఆగినంత పనైంది. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. "ఏదీ నా బంగారం ఏదీ?" నెత్తీ నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. "అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు?" అడిగాడు పెద్దమనిషి. "ఏమీ చేయాలనుకోలేదు. కేవలం దాచుకుందాం అనుకున్నాను" అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య.

      "అలాగా!... అయితే ఈ పెద్ద గులక రాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్దా అనుకొని ఎప్పటిలాగే రోజూ వచ్చి, ఈ గులక రాయిని చూసి నీ బంగారం ఎక్కడికీ పోలేదని వెళ్ళిపో" అంటూ ఓ పెద్ద గులక రాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. చేయునది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు.

నిజాయితీ

 రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డునున్న చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నం చేశాడు. కాని గొడ్డలిని రాలేకపోయాడు. ఎంతో బాధ పడ్డాడు. చేసేది లేక అక్కడే చెట్టుకింద కూలబడి భగవంతుడ్ని ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు. అతని ప్రార్థన విని గంగా దేవి ప్రత్యక్షమైంది. "ఎందుకు విచారించుచున్నావు?" అని అడిగింది. "తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు" అని బాధపడ్డాడు. "సరే ఉండు" అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. "ఇదేనా నీ గొడ్డలి" అని బంగారు గొడ్డలిని చూపించింది. "నాది కాదు తల్లీ!" అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. "ఇదేనా నీ గొడ్డలి?" అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి  అతని గొడ్డలితోనే ప్రత్యక్షమైంది. "ఇదేనా?" అన్నది. రాజయ్య సంతోషంతో "అమ్మా! ఇదే నా గొడ్డలి" అని ఆనందంతో పరవశించాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగా దేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది. నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది.

అందరికన్నా చెడ్డవాడు

ఒకసారి ద్రోణాచర్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ యువరాజులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ది గల యువరాజు దుర్యోధనుడు అతిమంచి మనిషిని వెదకడానికి బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోటా, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటి వారు ఎవరూ అతనికి కనిపించలేదు. కాని తనని గురించి తాను ఆలోచించుకున్నపుడు అతనికి అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి.

వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి "గురూజీ! ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉంది. కాని ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని" అని తెలియజేశాడు. మరొక ప్రక్క సద్గుణాలున్న పాండవ జ్యేష్టుడైన ధర్మరాజు వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి "ధర్మరాజు" మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి, ధర్మరాజు తనలో ఉన్న దోషాలనూ, ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు ద్రోణాచార్యులవారి వద్దకు వచ్చి గురువు గారికి నమస్కరించి "ఈ ప్రపంచంలో అందరికన్న చెడ్డవాణ్ణి నేనే" అని తనకు తను తెలియజేసుకొన్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు.

శిబిచక్రవర్తి

 శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని తిమాలింది. "సరే" అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, "ఈ పావురం నా ఆహారం. దీనిని నేను తరుముతూ వచ్చాడు. ఇది నాది, నాది నాకు ఇచ్చేయ్" అని కోపంగా అడిగింది డేగ. "పక్షిరాజా! ఈ పక్షిరాజుని రక్షిస్తానని మాట ఇచ్చాను. పావురం తప్ప ఇంకేమైనా అడుగు" అన్నాడు శిబిచక్రవర్తి. "మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. అయితే పావురమంత బరువుగల నీ తొడ మాంసం ఇయ్యి" అని అడిగింది డేగ. శిబిచక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి, రెండోవైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంత తినెయ్యమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్ని దేవునిగా మారినవి. వారిద్దరిని చూసి శిబిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్ని దేవుడు ఇలా అన్నారు "శిబిచక్రవర్తీ! మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దాన గుణమూ, గ గుణమూ పది మంది చెప్పుకుంటే విన్నాము కానీ, ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి, సూర్య చంద్రులు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది అని దీవించి వెళ్ళిపోయారు.

శత్రువులు - మిత్రులు

లోకంలో శత్రుత్వం లేదు. శత్రువు లేడు. మరి ఉన్న శత్రువులు ఎక్కడినుండి వచ్చారు?

నీ మనసే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది.

ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమగయ్యాళి. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లువదిలి వెళ్ళిపోయాడు. ఈమె నోటి దురుసు వలన ఊరు ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ "అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడంలేదు. నేనంటే ఎందుకు అందరికి అంత శత్రుత్వం" అని తెగ బాధ పడిపోతుంది.

ఒకరోజు ఒక స్వామిజి ఈవిడ ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవరూ నాతో మాట్లాడడంలేదు. ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ? అని అడిగింది. దానికి సమధానంగా స్వామీజీ;

"బిచ్చం పెట్టవే భొచ్చు మొహమా!" అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకుని "సచ్చినోడా! నువ్వేదో స్వామీజీ వని నా బాధలన్ని నీతో చెప్పుకుంటే నన్నే తిడతవా!" అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ. నవ్వుతూ ఆగమ్మా ఆగు. ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ, నాతొ శత్రుత్వం పెంచుకున్నావు? నేను దూషించాననే కదా! అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన బాష నీకు నచ్చలేదు. కనుకనే శత్రువు అనుకుంటున్నావు.

ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం. అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే. కనుకనే సాదుస్వభావంతో అందరిని ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికి వచ్చినవారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు. అప్పుడు నీకు అందరు మిత్రులుగా మారతారు. అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులు అయ్యారు. ఈవిషయం తెలిసి భార్త కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు. కథ సుఖాంతం అయింది.

భావం: మనం మాట్లాడే తీరును బట్టి శత్రువులు, మిత్రులు ఏర్పడతారు. మనం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అందరూ శత్రువులే ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మిత్రులు ఏర్పడతారు. ఎప్పుడైనా మనం మాట్లాడే తీరే మనకి ముఖ్యం. మన మనస్సే మనకి శత్రువు.